Read more!

చావడానికైనా సిద్ధం.. వీహెచ్ సంచలనం

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కోసం చావడానికైనా తాను సిద్ధమని ప్రకటించారు. గోషామహల్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న అంబేడ్కర్ విగ్రహాన్ని తక్షణమే తమకు ఇవ్వాలంటూ సోమవారం తన ఇంట్లోనే ఆయన ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పోలీసులు, కేసీఆర్ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు వీహెచ్. 

అంబేద్కర్ విగ్రహం విషయంలో రెండేళ్లుగా పోరాడుతున్నారు హనుమంతరావు. చాలా సార్లు అరెస్ట్ కూడా అయ్యారు. 2019 ఏప్రిల్ 12న పంజాగుట్టలో తాను అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించానని.. ఏప్రిల్ 13న విగ్రహాన్ని కూల్చేశారని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి నుంచి అంబేడ్కర్ విగ్రహాన్ని గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారని, అప్పటి నుంచి అక్కడే ఉందన్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని పోలీస్ స్టేషన్‌లో పెడతారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంత జరిగినా ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరు మాట్లాడటం లేదని వాపోయారు. షర్మిల రాజన్న రాజ్యమంటుందని, కానీ అది కాంగ్రెస్ రాజ్యమన్నారు. రాజ్యాంగ అధినేతకు తెలంగాణలో దిక్కు లేదని, విగ్రహం ఇచ్చే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందన్నారు.