Read more!

ఏపీలో  ఏం జరగబోతోంది? రాజ్యాంగ సంక్షోభం తప్పదా? 

స్థానిక సంస్థల ఎన్నిక అంశం ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం రేపుతోంది. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం.. తన పని తాను చేసుకుపోతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ స్థానిక సంస్థల ఎన్నికలకూ సహకరించేది లేదని చెబుతోంది వైసీపీ ప్రభుత్వం. రాజ్యాంగ బద్ద ఎన్నికల సంఘానికి రాష్ట్ర సర్కార్ సహకరించకపోతే  తీవ్ర పరిణామాలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో ఎన్నికల కమిషనర్, ఏపీ సర్కార్ వివాదం ఎటు వైపు దారి తీస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

షెడ్యూల్‌ విడుదలయ్యాక ఎన్నికలను వాయిదా వేసిన సందర్భా లు మన రాష్ట్రంలో తప్ప దేశంగా ఇంతవరకు ఎక్కడా జరగలేదని చెబుతున్నారు. కరోనా కారణంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గత మార్చిలో వాయిదా వేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ  జగన్ రెడ్డి సర్కార్ కోర్టుకెళ్లినా.. ఎస్‌ఈసీ నిర్ణయాన్నే సుప్రీంకోర్టు సమర్థించింది. షెడ్యూల్‌ విడుదల చేసిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగమంతా ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుంది. ఎన్నికలు వాయిదా వేయాలన్నా, నిలిపివేయాలన్నా.. ఎస్‌ఈసీ చేతిలోనే ఉంది. రెండేళ్ల కింద పశ్చిమ బెంగాల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని ఎస్‌ఈసీకి వ్యతిరేకంగా ఆ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టు కు వెళ్లింది. అయితే రాజ్యాంగంలోని 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక ఎన్నికలు సకాలంలో జరగాల్సిందేనని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇటీవల కేరళ స్థానిక ఎన్నికల విషయంలోనూ జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.  

 ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ  షెడ్యూల్‌ విడుదల చేయడంతో  ఈ నెల 9వ తేదీ నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. దీంతో రాష్ట్రప్రభుత్వ యంత్రాంగమంతా ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చినట్లయింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 23న పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. అయితే జగన్ ప్రభుత్వం  ఇందుకు సహకరించే పరిస్థితి  కనిపించడం లేదు. ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దని అధికార యంత్రాంగాన్ని కూడా వారు ఆదేశించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అదే జరిగితే రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా రాజ్యాంగ సంక్షోభ పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ. కేంద్ర ఎన్నికల కమిషన్‌తో సమాన అధికారాలు కలిగి ఉంది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఎన్నికల ప్రక్రియకు సహకరించని ఉద్యోగులు, అధికారులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ చర్యలు తీసుకోవచ్చని రాజ్యాంగ  నిపుణులు చెబుతున్నారు. 

ఏపీ సర్కార్ తీరుతో  రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దూకుడుగా వెళ్లే అవకాశాలే కన్పిస్తున్నాయి. గత ఏడాది ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో విఫలమయ్యారంటూ  గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేయాలని, ఓ సీఐను సస్పెండ్‌ చేయాలని అప్పట్లో ప్రభుత్వాన్ని ఎస్‌ఈసీ ఆదేశించింది. అయితే రాష్ట్రప్రభుత్వం పట్టించుకోలేదు. గుంటూరు రూరల్‌ ఎస్సీని మాత్రం  ఇటీవల బదిలీ చేశారు. దీంతో  కమిషనర్‌ నిమ్మగడ్డ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు తాజాగా లేఖ రాశారు. ఎస్‌ఈసీ ఆదేశాలను అమలు చేయాలని, ఆ అధికారులను బదిలీ చేయాలని మరోసారి గుర్తుచేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించే తీరును బట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు ఉంటాయని అంటున్నారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు కొందరు ఎస్‌ఈసీపై విమర్శలు చేశారు. . ఎన్నికలకు సహకరించబోమని కొంత మంది ఉద్యోగ నేతలు  ప్రకటించారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎస్‌ఈసీ వారిపై చర్యలు తీసుకునే అవకాశముందంటున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఉద్యోగులంతా తన పరిధిలోకి వచ్చినందున.. గీత దాటిన ఉద్యోగ సంఘాల నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఎస్‌ఈసీ పరిశీలిస్తోందని తెలుస్తోంది.  

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీకి  రాష్ట్ర యంత్రాంగం సహకరించకపోతే ఏం జరగబోతుందన్న చర్చ ఏపీలో  జోరుగా జరుగుతోంది. ఎస్‌ఈసీ తనకున్న అధికారాలను వినియోగించి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందని.. ఈ ఆదేశాలను అమలు చేయకుంటే గవర్నర్‌కు, రాష్ట్రపతికి ఎన్నికల సంఘం ఫిర్యాదు చేసే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అదే జరిగితే రాజ్యాంగ బద్ధ విధుల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైనట్లు అవుతుందని.. రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందని చెబుతున్నారు.