Read more!

బూతు పదాలే పదవులకు సోపానం!  తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పతనం?  

పాలకులు హుందాగా ఉండాలి. శత్రుభావన లేకుండా ప్రేమపూర్వక, స్నేహపూర్వక రాజకీయాలుండాలి. పాలకపక్షం ప్రతిపక్షం పట్ల ప్రేమగా ఉండాలి. గతంలో మన  నాయకులు అలాంటి ఆదర్శ రాజకీయాలు చేసేవారు. హుందాతనంతో చట్టసభ్యలకు గౌరవం తెచ్చేవారు.  ప్రజా సమస్యలపై చక్కగా చర్చించేవారు. ముఖ్యమైన అంశాల్లో ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకునేవారు. రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నా  గౌరవ మర్యాదలు పాటించేవారు. విపక్ష నేతల వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లే వారు కారు. పొరపాటున ఎవరినైనా ఏకవచనంతో సంబోంధించినా వెంటనే క్షమాపణలు కోరేవారు. మరోసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకునేవారు మన పాత తరం నాయకులు. కాని ఇప్పుడు బూతు పదాలే పదవులకు సోపానంగా మారినట్లుగా కనిపిస్తున్నాయి. పాలకులే ''వాడు-వీడు'' అంటూ రెచ్చగొట్టేలా  మాట్లాడుతున్నారు. ప్రజల మధ్య శతృత్వం పెంచేలా అసహ్య రాజకీయాలు చేస్తున్నారు. సంస్కార హీనంతో చిల్లర మాటలు మాట్లాడుతూ రాజకీయాలంటేనే  రోత పుట్టిస్తున్నారు.   

 ప్రస్తుతం రాజకీయ విలువలు పూర్తిగా పతనమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో అయితే మరీ దిగజారిపోయాయి. వాడు.. వీడు అనే పదం లేకుండా మాట్లాడటం లేదు కొందరు నాయకులు. ముఖ్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు  బరి తెగిస్తున్నారు. ఎక్కడైనా అధికారంలో ఉన్నవారు కొంత సంయమనంతో ఉంటారు. ప్రజా సమస్యలపై పోరాడుతారు కాబట్టి విపక్ష సభ్యులు కొంత ఆవేశంగా మాట్లాడుతుంటారు. కాని ఏపీలో మాత్రం అధికార వైసీపీ నేతలే దిగజారి ప్రవర్తిస్తున్నారు. నరుకుతా.. చంపుతా.. అమ్మ మెగుడు , వెధవ లాంటి పదాలే మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ , వెల్లంపల్లి శ్రీనివాస్ లాంటి వారికి ఊతపదాలయ్యాయి. మంత్రులు మాట్లాడగా తమకేంటని అనుకుంటున్నారో ఏమో రోజారెడ్డి, అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి వారు మరింతగా  రెచ్చిపోతున్నారు. మాజీ ముఖ్యమంత్రులు. మంత్రులతో  సీనియర్ నేతలను కూడా ఏకవచనంతో సంభోదిస్తూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. నీచంగా మాట్లాడే నేతలకు పదవులు, పార్టీ పెద్దల నుంచి ప్రశంసలు వస్తుండటంతో మరింతగా బూతు సాహిత్యం వినిపిస్తున్నారు ఫ్యాన్ పార్టీ ప్రజా ప్రతినిధులు. 

ఏపీ వైసీపీ నేతలను చూసి తామేమి తక్కువ కాదనుకున్నారో ఏమో తెలంగాణ ప్రజా ప్రతినిధులు కూడా తమ నోటికి పని చెబుతున్నారు. వ్యక్తిగత దూషణలకు దిగుతూ కుటుంబ సభ్యులను గొడవలోకి లాగుతున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ పగ్గాలు చేపట్టాకా తెలంగాణ రాజకీయాల్లో మాటల తీవ్రత పెరిగింది. కేసీఆర్ కుటుంబ సభ్యులపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండగా.. టీఆర్ఎస్ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటరిస్తున్నారు. దీంతో తాగుబోతు, బడా చోర్, దగుల్బాజీ, చిప్పకూడు, బట్టలూడదీసి కొడతా, నాలుక చీరేస్తా , నరికేస్తా వంటి పదాలు కామన్ గా మారిపోయాయి.  తెలుగు రాష్ట్రాల్లోని కొందరు నేతల ప్రకటనలు వింటుంటే..  వీరు ప్రజలు ఎన్నుకొన్న వారేనా? అన్న అనుమానం వస్తోంది.  ఇంత సంస్కారహీనంగా మాట్లాడే వారిని ప్రజలు ఎలా ఎన్నుకోగలిగారు?  అన్న ఆందోళన వస్తోంది. రాజకీయ వ్యవస్థ  ఇంతగా దిగజారిపోయిందా అన్న ఆవేదన కూడా కల్గుతోంది. 

 గతంలో  దేశ రాజకీయాలు, మన చట్టసభలు ప్రజాస్వామ్య స్పూర్తికి సాక్ష్యంగా నిలిచేవి. రాజీవ్ గాంధీ హయాంలో 1988లో  దేశాన్ని కుదిపేసిన బోఫోర్స్ కుంభకోణంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ నియమించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పుడు బీజేపీ బలం లోక్ సభలో కేవలం ఇద్దరు సభ్యులే. అందులో ఒకరు తెలుగుదేశం మద్దతుతో హన్మకొండ నుండి గెలిచిన చందుపట్ల జంగారెడ్డి. అయినా విపక్షాన్ని గౌరవించింది అప్పటి పాలకపక్షం. రాజ్యసభలో వాజపేయి ప్రధాని రాజీవ్ గాంధీని బోఫోర్స్ అవినీతిపై తూర్పారపట్టేవారు. అలాంటి వాజపేయి కిడ్నీ చెడిపోయిందని తెలుసుకొన్న రాజీవ్ గాంధీ..  అమెరికాలో జరిగే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనే భారతీయ బృందంతో పాటు తన వెంట వాజపేయిని కూడా తీసుకు వెళ్ళి అక్కడ ప్రభుత్వ ఖర్చులతో చికిత్స చేయించారు.  తాను జీవించి ఉన్నానంటే దానికి రాజీవ్ గాంధీయే కారణమని వాజపేయి బహిరంగంగానే వెల్లడించారు. అయినా వాజపేయి రాజకీయంగా చివరి క్షణం వరకూ రాజీవ్‌తో విభేదించారు. ఇవన్ని పాత తరం రాజకీయ నాయకుల హుందాతనానికి, గొప్పతనానికి ప్రతీకలు.

 ఉమ్మడి అంధ్రప్రదేశ్ లోనూ ఎంతో మంది ఆదర్శ రాజకీయ నాయకులు చట్టసభలకు ఎన్నికయ్యారు. నిరాండబర జీవితంతో ప్రజా సంక్షేమం కోసం పాటు పడ్డారు. పుచ్చలపల్లి సుందరయ్య, గౌతు లచ్చన్న, ఆచార్య, ఎన్జీ రంగా, గరిమెల్ల నాగిరెడ్డి, చెన్నమనేని రాజేశ్వరరావు, వెంకయ్య నాయుడు, ఓంకార్, నర్రా రాఘవరెడ్డి  లాంటి నాయకుడు చట్టసభలకు మరింత వన్నె తెచ్చారు. తమ అద్బుత ప్రసంగాలతో ప్రజల్లో అభిమానం చూరగొన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ హయాంలో చట్ట సభ ఎంతో హుందాగా సాగేది.  ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేసినా ఎన్టీఆర్ శ్రద్దగా వినేవారు. అంతేకాదు మద్దికాయల ఓంకార్, నర్రా రాఘవరెడ్డి, సిహెచ్ విద్యాసాగర్ రావు చేసే అభ్యర్థనలను ఎన్టీఆర్‌ కాదనకుండా మన్నించేవారు. అందుకే ఎన్టీఆర్ హయాం వరకు రాజకీయాలంటే ఓ గౌరవం ఉండేది. ప్రజలు ప్రజాప్రతినిధులను ఆదరించేవారు. చంద్రబాబు పాలనలో కొంత రాజకీయ వేడి పెరిగినా.. మరీ దిగజారి పోలేదు. తెలంగాణ ఉద్యమం నుంచి తిట్లు రాజకీయాల్లో భాగంగా కాగా.. ఇప్పుడు పీక్ స్టేజీకి చేరాయి. 

 బహిరంగంగా ''వాడు'' ''వీడు'' అనటం... ''నరుకుతాను'' ''చంపుతాను'' అనటం రాజకీయ సంస్కారానికి నిదర్శనమా? పతనమౌతున్న విలువలకు నిదర్శనమా? ఏమి మాట్లాడుతున్నారో, ఎంతగా తెగిస్తున్నారో ఇప్పటి నేతలు. వాళ్ల మాటల పర్యవసానాలేమిటో, సమాజం తమ మాటలను ఎలా స్వీకరిస్తుందో ఒక్కసారైనా వీరు ఆలోచిస్తున్నారా? సమాజానికి  మార్గదర్శకులుగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు  ప్రజల దారిలో తమ మాటల ద్వారా ముళ్లు.. రాళ్లు పరుస్తున్నారు. సంస్కార హీన మాటలన్నీ భయానికి నిదర్శనంగా చెబుతారు.  వీరుడు ఎప్పుడూ విమర్శలకు అసహనానికి గురికాడు. నవ్వుతూ స్వీకరిస్తాడు. పదవి పోతుందనే భయంతో.. మాట్లాడటం. అసహనానికి గురికావటం, అసహనం నియంతృత్వానికి దారితీస్తాయి. నియంతృత్వం వ్యక్తి పతనానికి దారితీస్తుంది. విమర్శలను నవ్వుతూ... సహృదయతతో స్వీకరించినవాడే రాజకీయాలలో ఓటమి ఎరుగనివాడు.