Read more!

భారత్ లో 63 మిలియన్ల ప్రజలకు చెవిటి సమస్యలు!!

భారత్ లో 63 మిలియన్ల ప్రజలు చెవిటి సమస్యలతో బాధపడుతున్నారు. చెవుడు ప్రధానమైన సమస్య వయస్సు వల్లేనని, అనుకోకుండా రావడం లేదా నెమ్మదిగా వినికిడి శక్తి తగ్గుతూ ఉంటుందని అంచనా. కొందరిలో దీనికి భిన్నంగాను ఉండవచ్చు. అయితే దీనిని నిర్లక్ష్యం చేయరాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇకపై పూర్తిగా చెవిటి వారిగా ఉండకుండా వినికిడి సమస్యనుండి బయటపడవచ్చునని, సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వినికిడి సమస్య  నివారణతో పాటు వినికిడి శక్తిని పెంపొందించుకోవచ్చని అంటున్నారు. వినికిడి సమస్య చాలా తీవ్రమైనదిగా చెప్పవచ్చు. ఇది ఇతర అనారోగ్యసమస్యలకు దారి తీస్తుందని వైద్యులు పేర్కొన్నారు. వినికిడి సమస్యవల్ల చదువుపై శ్రద్ధ తగ్గడం, ఒత్తిడికి గురికావడం, సామాజికంగా వెనుకబడ్డామన్న ఆత్మన్యూనతా భావానికి గురి అయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. తక్కువ వినపడటం, కొన్ని శబ్దాలు వినపడకపోవడం, ఇతరులు మాట్లాడుతున్నప్పుడు అర్ధం కాకపోవడం వల్ల వినికిడి లోపం ఉన్నట్లు గమనించవచ్చు. ఇతరులతో పూర్తిగా చెప్పలేకపోవడం, సంబంధబాంధవ్యాలు తగ్గిపోవడం, ఇతరులతో కలిసేందుకు ఇష్ట పడకపోవడం వంటి అంశాలు వేధిస్తాయి. దీని ప్రభావం నిత్యజీవితంపై చూపిస్తుంది. ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఫ్రస్టేషన్ వంటిసమస్యలు ముఖ్యంగా వృద్ధుల్లో ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని గమనించవచ్చని నిపుణులు పేర్కొన్నారు. వినికిడి సమస్యతో భార్యా భర్తలు  దాంపత్య జీవితానికి సైతం దూరంగా ఉండాల్సి వస్తుందని నిపుణులు పేర్కొన్నారు. వినికిడి సమస్యను నిర్లక్ష్యం చేస్తే మీ చెవికే ప్రమాదం ఏర్పడవచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సకాలంలో వినికిడి సమస్యను గుర్తించండి.. వినికిడి శక్తిని పెంచుకోండి. ఆధునిక వైద్యం అభివృద్ధి చెందిన తరువాత ఎన్నో రకాల శస్త్ర చికిత్సలు అందులోబాటులో ఉన్నాయి. సమస్య ఏదైనా సకాలంలో గుర్తించడం ముఖ్యం. చికిత్స తీసుకోవడం అత్యవసరం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.