విద్వేషంలోనూ కలిసుండాలా?
తెలంగాణ యూనివర్శిటీలలో సీమాంధ్ర విధ్యార్ధులెవరికి ప్రవేశాలు కల్పించరాదు- ఇది తెలంగాణలోని కొన్ని విద్యార్ధి సంఘాల హెచ్చరిక. అక్కడితో ఆగలేదు. నిజాం కళాశాలలో వివిధ తెలంగాణ యూనివర్శిటీలకు సంబంధించి ఆయా కోర్సులలో అడ్మిషన్లు కోరుతున్న విద్యార్ధులలో పదిమందిని ఉస్మానియా విద్యార్దులు గుర్తించి మీరు సీమాంధ్ర విద్యార్ధులు కనుక వీటిలో చేరడానికి వీలులేదని బలవంతంగా పంపించివేశారు. ఆంధ్ర పిల్లలకు అడ్మిషన్లు ఇస్తే ఊరుకోబోమని కూడా వారు అధికారులను హెచ్చరించారు. అక్కడ ఉన్న పోలీసులు సైతం ఈ నాన్ లోకల్ విద్యార్దులను సురక్షితంగా బయటకు పంపారట.ఇక విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ చీడపురుగు అని కరీం నగర్ ఎమ్.పి పొన్నం ప్రభాకర్ విమర్శ. అక్కడితో ఆగలేదు.
తెలంగాణ పిల్లలెవరైనా ఆత్మహత్య చేసుకోవద్దంటూ, అలాంటి ఆలోచన కన్నా ముందుగా సీమాంద్ర పెట్టుబడి దారులను చంపండని కూడా గౌరవ పార్లమెంటు సభ్యుడు పిలుపు ఇచ్చారు.ఇక మరో నేత రేవంత్ రెడ్డి సీమాంధ్రులపై ఉమ్మి వేసినా పోవడం లేదని, మా చెప్పులు మోస్తారా అని అడుగుతున్నామని ద్వజమెత్తారు. వేరొక తెలుగుదేశం నేత ఎర్రబెల్లి దయాకరరావు తన తోటి తెలుగుదేశం నాయకుడు పయ్యావుల కేశవ్ ను ఉద్దేశించి చీడపురుగులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అలాగే సమైక్యాంధ్ర కోరుకునే విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ కరీంనగర్ ఎమ్.పి పొన్నం ప్ఱభాకర్ చేస్తున్న ఎమ్.పిల కన్వీనర్ పదవి అటెండర్ వంటిదని విమర్శించారు. పయ్యావుల కేశవ్ సమైక్య రాష్ట్రం కోసం తాను ఆత్మత్యాగం చేయడమే కాదు. అవసరమైతే ఆత్మాహుతి దళంగా మారతాను అని అంటారు. మరో నేత అయ్యన్న పాత్రుడు పిచికుక్కల్లా తెలంగాణ నేతలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.
దమ్ముంటే సమైక్యాంధ్ర రాష్ట్రం కోరుతూ హైదరాబాదులో సభ సెట్టండని నాగం జనార్దనరెడ్డి సవాలు విసిరితే, విజయవాడలో ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక ఆంద్ర కోరుతూ సదస్సు పెట్టబోయిన వారిని అక్కడ సమైక్యాంధ్ర జెఎసి అడ్డుకుంది. ఇక కెసిఆర్ దంచుకొట్టుడు, దామోదరరెడ్డి తుపాకి పట్టుకోవలసి వస్తుందన్న హెచ్చరికలు.. ఇలా రాసుకుంటూ పోతే ఎన్నైనా అయేట్లు ఉన్నాయి. ఇవన్ని మన ప్రజాప్రతినిదులు మాట్లాడవలసిన మాటలేనా?సభ్యమైన భాషేనా అంటే అటు వైపు, ఇటువైపు ఎవరు మాట్లాడినా తప్పేనని అనుకోవడమే కాని, ఎవరూ వెనక్కి తగ్గడంలేదు. అయితే ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. ఒక తెలంగాణ నాయకుడు నోరు పారేసుకున్నా, ఆయనను విమర్శించే నాయకుడు ఎవరు తెలంగాణలో ఉండరు. అయితే తెలంగాణ నాయకుడిని ఎవరైనా సీమాంధ్ర ప్రాంత నాయకుడు విమర్శిస్తే, పోటీలు పడి ప్రాంతాలకు అతీతంగా తెలంగాణ నేతలంతా తిట్టిపోస్తున్నారు.
మంత్రి టిజి వెంకటేష్ ఆత్మరక్షణకోసం సైన్యాన్ని ఏర్పాటు చేయాలని అన్నాడు. ఆ మరుసటి రోజు కాంగ్రెస్, టిడిపి, టిఆర్ఎస్ పార్టీల నేతలంగా వెంకటేష్ పై విరుచుకుపడ్డారు. అలాగే కేశవ్ ఆత్మాహుతి దాడి అనగానే తెలంగాణ నేతలంతా మండిపడ్డారు. కాని అదే తెలంగాణ నేతలు లగడపాటిని, కావూరిని, పయ్యావుల కేశవ్ను, ఎర్రన్నాయుడు ఇలా ఎవరిని విమర్శించినా, దూషించినా ఒక్క సీమాంధ్ర నాయకుడు కూడా వారి రక్షణకు వెళ్లడానికి ప్రయత్నించినట్లు కనబడదు. అంటే ఇక్కడ ఒక తేడా కనిపిస్తుంది. తెలంగాణ బలమైన ఆకాంక్ష గా మారిపోయాక, ఈ ప్రాంతంలో నాయకులంతా పార్టీలకు అతీతంగా ఒక్కటయ్యారు. అదే సీమాంద్రలో ఆ పరిస్థితి లేదు. ఏ పార్టీకి ఆ పార్టీ మీటింగులు పెట్టుకున్నా అదంతా కేవలం తమ రాజకీయ విన్యాసం కోసమేనన్న భావన కలుగుతుంది.

నాయకుల మధ్య ఇంత ద్వేష భావన రగిలిపోయాక, చివరికి విద్యార్ధులు కూడా మంచి,చెడు విచక్షణ వదలివేసి ఇతర ప్రాంతాల విద్యార్ధులపట్ల అంత ద్వేష భావనతో చూశాక, వాటిని అరికట్టగల, లేక సరిదిద్దగల నాయకుడు అంటూ మనకు లేకపోయాక ఇంకా ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారో అర్ధమే కాదు.నిజమే ఈ ద్వేషాలు పెరగడానికి ఎవరు కారణం అన్నది ఇప్పుడు చర్చించే సమయం కాదు.కాని దీనివల్ల జరగవలసిన అనర్ధం జరిగిపోయింది. విరిగిన మనసులు కలవడం చాలా కష్టం . కాలం అన్ని గాయాలను మాన్పుతుందన్న భావన ఉన్నప్పటికీ, ఇంత ప్రాంతీయ విద్వేషాలు ఏళ్లతరబడి నడుస్తున్నప్పుడు అవి తరాలుగా పెరుగుతాయి కాని తగ్గే పరిస్థితి కనబడడం లేదు. రేవంత్ రెడ్డిగాని, మరొకరు కాని శృతి మించి సభ్యత కాదని తెలిసినా ఎందుకంత తీవ్రం గా మాట్లాడుతున్నారంటే, వారు ఒకటే చెబుతున్నారు. సీమాంధ్రులను తాము ఎంతగా దూషి్‌స్తే, తెలంగాణలోని వివిధ ప్రాంతాల ప్రజలలో అంత ఆదరణ పెరుగుతోందట.
కొంతకాలం క్రితం వరకు తెలుగుదేశం తెలంగాణ నేతలకు తెలంగాణలో తిరగడమే కష్టంగా ఉండేది. టిఆర్ఎస్ వారో, మరెవరో ఒకరు అడ్డం తగలడం , వారితో తగదా పడడం నిత్యకృత్యంగా ఉండేది. రాజీనామాల వ్యూహం తర్వాత వారు దాదాపుగా ఇబ్బంది లే కుండా బస్ యాత్ర చేసి తెలంగాణ అంతటా తిరిగి వచ్చారు. ఇక రేవంత్ విషయాన్ని తీసుకుంటే ఆయన గవర్నర్ కుర్చీని తోసినప్పుడు తెలంగాణ జిల్లాలలో ఆయనకు ఎంతో సానుకూలత కనిపించింది. ఆ తర్వాత టిడిపి రణభేరి సభలు పెట్టినప్పుడు రేవంత్ తుపాకి చూపాడన్న పాయింటుపై విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. మళ్లీ బస్ యాత్ర తర్వాత సీమాంధ్రులను నోటికొచ్చినట్లు దూషించినప్పుడు మళ్లీ రేవంత్ కు ప్రజలలో సానుకూలత కనిపించిందట.అది మంచో, చెడో, ముందుగా రాజకీయంగా తాము నిలబడాలంటే ఇలా చేయక తప్పడం లేదని తెలంగాణ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. వీటన్నికి కారణం కాని, తప్పు ఎవరిది అని కాని పరిశీలన చేస్తే కచ్చితంగా సీమాంధ్ర నేతలదేనని చెప్పక తప్పదు.
రెండువేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై టిఆర్ఎస్ తో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు సీమాంధ్ర నేతలు ఎవరూ బహిరంగంగా వ్యతిరేకించలేదు.అధికారంలోకి వస్తే చాలని వారంతా సంతోషించారు. అందువల్ల ఇప్పుడు సీమాంద్రలో సమైక్య ఉద్యమం చేయడం కాదు. ఆనాడు ఎందుకు వ్యతిరేకించలేదని ఇప్పుడు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని డిమాండు చేస్తున్న లగడపాటి రాజగోపాల్ ను నిలదీయాలి. కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు , మేకపాటి రాజమోహన్ రెడ్డి..ఇలా ప్రతి ఒక్కరిని ప్రజలు నిలదీయాలి?అలాగే తెలుగుదేశం పార్టీ అభిప్రాయ సేకరణ పేరుతో డ్రామా నడిపి తెలంగాణకు అనుకూలంగా ఎందుకు తీర్మానం చేశారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిని నిలదీయాలి.
టిడిపి తీర్మానం చేసినప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదని పయ్యావుల కేశవ్ ను ప్రశ్నించాలి. అలాగే తెలంగాణపై టిడిపి కమిటీలో సభ్యులుగా ఉండి తెలంగాణ కు అనుకూలంగా తీర్మానం చేసిన సీనియర్ నేతలు ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడులను ప్రశ్నించాలి.రెండు వేల తొమ్మిది డిసెంబరు ఏడున తెలుగుదేశం పక్షాన అఖిల పక్ష సమావేశానికి వెళ్లి తెలంగాణ ఇస్తే మద్దతు ఇస్తామని చెప్పిన అశోక్ గజపతిరాజును, గాలి ముద్దుకృష్ణమనాయుడును ఎందుకు మద్దతు ఇచ్చి, ఇప్పుడు మళ్లీ సమైక్య నినాదం ఎత్తుకున్నారని నిలదీయాలి. అలాగే చెప్పులు మోయడానికి సిద్దమేనని ఆత్మ గౌరవం వదులుకోవడానికి సిద్దమన్నట్లు గా మాట్లాడుతున్న మంత్రి శైలజానాద్ ను, ఆ రోజు అభ్యంతర పెట్టకుండా ఆ తర్వాత హక్కుల వేదిక అనో ఇంకోటనో మాట్లాడుతున్న మంత్రి టిజి వెంకటేష్ ను ప్రశ్నించాలి. మరో సీనియర్ నాయకుడు జెసి దివాకరరెడ్డి కూడా ఆరోజులలో టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న్పపుడు ఎందుకు బహిరంగంగా వ్యతిరేకించ లేదో చెప్పాలి.
అలాగే 1967 నుంచి సమైక్యవాదిగానే ఉంటున్న సీనియర్ నాయకుడు గాదె వెంకటరెడ్డి టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నప్పట్టికి వారు జనరల్ ఎన్నికలలో చాలా తక్కువ సీట్లు గెలుచుకున్నారని వాదిస్తుంటారు. అది నిజమే కావచ్చు. కాని రెండువేల తొమ్మిది డిసెంబరు తొమ్మిది నాటి చిదంబరం ప్రకటన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్న సంగతిని అలాంటి నేతలు కూడా గుర్తించాలి. విచిత్రం ఏమిటంటే తెలంగాణలో ప్రజలలో చాలామంది తెలంగాణ కోరుకోవడం లేదని, ఇదంతా నేతలు తమ పదవులకోసం చేస్తున్న ఉద్యమం అని సమైక్యాంద్ర నేతలు విమర్శిస్తుంటారు. అలాగే సమైక్య ఉద్యమం కృత్రిమమైనదని, అక్కడ ఎన్నో అభివృద్ది అవకాశాలు ఉన్నాయని,విడిపోతేనే ఆంద్రకు ఎక్కువ ఉపయోగాలని, కాని కొందరు పెట్టుబడుదారులు, రాజకీయనాయకులు తమ స్వార్ధం కోసం సీమాంధ్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలంగాణ నేతలు విమర్శిస్తున్నారు. ఒక్కటి మాత్రం వాస్తవం. గత పదేళ్లుగా ఒక పద్దతి ప్రకారం అది ద్వేష బీజం అనండి, విష బీజం అనండి, లేక భిన్నాభిప్రాయాల వ్యాప్తి అనండి,. ఏదైనా కాని తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా ఒక వాదాన్ని కూడగట్టడంలో కెసిఆర్ సఫలం అయ్యారు.

ఈ మధ్యకాలంలో జెఎసి పేరుతో కాని, మరో పేరుతో కాని సమాజంలోని ప్రతివర్గాన్ని తమవైపు ఉన్నారనే విదంగా అందరిని తెలంగాణ ఉద్యమంలోకి తీసుకువస్తున్న భావన కలిగించడంలో కెసిఆర్, కోదండరామ్ లు సఫలం అయ్యారు. తెలంగాణ లోని కాంగ్రెస్ , టిడిపి నేతలు పైకి ఎన్ని విమర్శలు చేసినా, వారు కెసిఆర్, కోదండరామ్ లను అనుసరించక తప్పని నిస్సహాయ స్థితిలో పడ్డారు.ఈ క్రమంలో కొందరు కెసిఆర్ ఉచ్చులో పడి ఉండవచ్చు. మరికొందరు ఆయనకు ఏజెంట్లుగా మారి ఉండవచ్చు. ఇంకొందరు ఆయనకు ప్రత్యర్ధులుగా మారి ఉండవచ్చు. ఏదైనా రాజకీయం మొత్తం కెసిఆర్ చుట్టూరానే తిరిగింది.
ఇప్పుడు ఆయన ప్రభావాన్ని తగ్గించి, తమ ఆధిక్యతను చాటుకోవడం కోసం తెలంగాణ కాంగ్రెస, టిడిపి నేతలు తంటాలు పడుతున్నారు.ఈ క్రమంలోనే తాము చేస్తున్నది రైటా, తప్పా అని కూడా ఆలోచించడం లేదు. ఎపి భవన్ లో సైతం తెలంగాణ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. ఇక తెలుగుదేశం తెలంగాణ నేతలు సైతం సొంతంగా ఒక పార్టీ జెండాను పెట్టుకున్నారు.ఇక ఈ నెల పదిహేడు నుంచి సకల జనుల సమ్మె పేరుతో అన్ని వర్గాల వారిని సమ్మెలో భాగస్వాములు చేసి, ప్రభుత్వాన్ని స్తంభింప చేయాలని నిర్ణయించారు. నిజానికి తెలంగాణ మంత్రులు ఇప్పటికి అధికారికంగా విధులు నిర్వర్తించడం లేదు.
సచివాలయానికే వెళ్లడం లేదు . ప్రతినెల జరగవలసిన క్యాబినెట్ ఇంతవరకు జరగలేదంటే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితిలో తెలంగాణకు ఒక బంగారం ప్యాకేజీ ఇచ్చినా, తమకు న్యాయం జరగలేదనే అంటారు. తెలంగాణ నేతలు తప్పు చేయలేదని, మాట మార్చలేదని కాదు. వారి విషయాలు వారికి ఉన్నాయి. వారు ఓట్ల కోసం పైకి ఒకటి, లోపల ఒకటి చెబుతుంటారు. అయినప్పటికీ స్థూలంగా చూస్తే మొత్తం మీద సీమాంధ్ర నేతలదే తప్పుగా కనిపిస్తుంది. హైదరాబాద్ గురించి అడిగినా, నదీ జలాల గురించి ప్రశ్నించినా, ప్రపంచ బ్యాంకు అప్పుల గురించి అడిగినా, ఇవన్ని ముందుగా ఆ యా పార్టీలలో తీర్మానాలు చేసినప్పుడు మహానాడులలోనో, కాంగ్రెస్ పార్టీ సమావేశాలలో ను చర్చించుకుని ఉన్నట్లయితే , రాజకీయాల కోసం రాష్ట్ర ప్రజలను బలి చేయకూడదన్న నిజాయితీ ఉండి ఉంటే ఇప్పుడు ఇన్ని గొడవలు, ఇన్ని దూషణలు ఉండేవి కావు. కనుక సీమాంద్ర నేతలు తాము చేసిన తప్పులకు చెంపలేసుకుని ,ఇప్పటికైనా తమ ప్రజలకు ఎలా న్యాయం చేయవచ్చో ఆలోచించాలి. ఇంకెంతకాలం ఈ విద్వేషాలు. మీ ఓట్ల యజ్ఞంలో ప్రజలను సమిధలను చేయవద్దన్నదే మనవి .


