చైనా భారత్ ద్వైపాక్షిక చర్చలకు మహాబలిపురం వేదికగా మారడంతో ఈ పేరు బాగా ప్రముఖంగా మారింది. మోదీ, జిన్ పింగ్ ల భేటీకి మహాబలిపురాన్ని ఎందుకు ఎంచుకున్నట్లు, ఈ ప్రాంత ప్రత్యేకత ఏంటి అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. 2014 సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా ఎన్నికల్లో దిగారు మోదీ. ప్రచారం ఆద్యంతం సహజత్వానికి భిన్నంగా సాగింది. ఈ క్రమం లోనే మోదీ కొన్ని కీలక ప్రకటనలు చేశారు. తాను ప్రధానిగా ఎన్నికైతే విదేశాలతో సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని ఇందు కోసం దేశీయంగా పర్యాటక ప్రదేశాలను వినియోగిస్తానని చెప్పారు మోదీ. సమావేశాలు, కీలక భేటీల నిర్వహణకు ప్రాముఖ్యత పర్యాటక ప్రదేశాలను ఉపయోగించుకుంటామని, తద్వారా ఆ ప్రాంతాలకు మరింత వన్నె తీసుకొస్తామని ప్రకటించారు. మోదీ ప్రధాని అయిన తరువాత చెప్పిన మాట ప్రకారం విదేశీ సంబంధాల పునరుద్ధరణకు ఆయన దేశంలోని పర్యాటక ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. 2017లో కోల్ కతా వేదికగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. పశ్చిమబెంగాల్ తో బంగ్లాదేశ్ సంబంధం విడదీయరానిది. చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ భేటీకి మోదీ కోల్ కతాను ఎంచుకున్నారు. 2017 లో సబర్మతీ నదీ తీరం వేదికగా ఇండియా చైనా శిఖరాగ్ర సమావేశం జరిగింది. సబర్మతీ విశిష్టతా, మహాత్మా గాంధీ ఆశ్రమం ప్రత్యేకతలు ప్రపంచానికి తెలిపేందుకే ఈ భేటీ ఉపయోగపడింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మహాబలిపురం వేదికగా మరోసారి భారత్, చైనా చర్చలు జరపబోతున్నాయి. ఉప్పు, నిప్పులా ఉండే భారత్, చైనా సంబంధాల బలోపేతానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపై ఎప్పుడూ పాక్ కు వంతపాడే చైనాతో చర్చలంటే సహజంగానే ప్రతి ఒక్కరికీ ఆసక్తి. ఈ నేపధ్యంలో భారత ప్రధాని మోదీ జిన్ పింగ్ భేటీకి మహాబలిపురం వేదిక కావడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. మహాబలిపురం విశిష్టతపై చర్చసాగుతోంది. మహాబలిపురంలో ఆకట్టుకునే శిల్పాలూ, ప్రసిద్ధ శిల్పులకు పెట్టింది పేరు, ఇక్కడ అడుగడుగునా శిల్పకళ ఉట్టిపడుతుంది. మహాబలిపురాన్ని ఏడవ శతాబ్దంలో పల్లవ రాజు నరసింహవర్మ నిర్మించాడు, ఇది చెన్నై మహానగరానికి సరిగ్గా యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పల్లవ రాజు నరసింహ వర్మన్ ఇక్కడ ఓడరేవును సైతం నిర్మించాడు. తద్వారా విదేశాలతో వ్యాపారానికి మార్గం సులభతరమైంది. యుద్ధ విద్యలో ఆరితేరిన నరసింహవర్మన్ ను మమల్లన్ గా పిలిచేవారు, అతడి పేరుపైనే ఇక్కడ ఓడరేవుకు మమల్లపురంగా పేరు పెట్టారు. పల్లవరాజులు చైనాతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. తమ రాయబారులను వారు చైనాకు పంపేవారు, రెండో నరసింహవర్మన్ అరబ్స్, టిబెటియన్ల విషయంలో చైనాకు సాయమందించారు. ముఖ్యంగా చైనా, తమిళనాడు మధ్య సిల్క్ వ్యాపారానికీ మహాబలిపురం ఓడరేవు బాగా ఉపయోగపడింది. ఒకటో నరసింహవర్మన్ పాలనను ప్రత్యక్షంగా చూసిన చైనా పర్యాటకుడు హ్యున్ సంగ్ ఇక్కడి అభివృద్ధిని కొనియాడారు. ప్రజలు సుఖ సంతోషాలతో పాటు జీవిస్తున్నారనీ విద్యారంగం బాగుంటుందంటూ కితాబు ఇచ్చారు. ఇలా మహాబలిపురం, చైనా మధ్య చారిత్రక సంబంధాలున్నాయి.
కర్నూ లు జిల్లా రైతుల కన్నుగప్పి పచ్చని పొలాలపై కాలకూటం విరజిమ్మే కుట్ర  జరుగుతోంది. గత నెలలో ఓ కాంట్రాక్టు సంస్థ ప్రతి నిధులు బోర్ల పేరుతో గుట్టుగా తవ్వకాలు జరిపారు. యురేనియం కోసమేనని రైతు లు పసిగట్టి వ్యతిరేకించే వారికి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అండగా నిలిచింది. దీంతో యురేనియం డ్రిల్లింగ్ పనులు నిలిచిపోయాయి.' సేవ్ నల్లమల సేవ్ ఆళ్లగడ్డ' క్యాంపైన్ తో అఖిలప్రియ ప్రభుత్వం పై మరింత ఒత్తి డి తెచ్చారు. కడపులో మాదిరిగా ఆళ్లగడ్డ లో యురేనియం తవ్వకాలు జరపనున్నామని అఖిల పక్షం నేతలు తేల్చి చెప్పారు.నల్లమల్ల ప్రకృతి అందాలు పచ్చని పైర్లు అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలు శిల్ప సంపదకు ఆళ్లగడ్డ నిలయం. అలాంటి ఆళ్లగడ్డ ను సర్వనాశనం చేసేందుకు కుట్ర జరుగుతోంది. ఆళ్లగడ్డ మండలం యాదవాడ గ్రామ పొలిమేరల్లో ఓ కాంట్రాక్టు సంస్థ అడుగుపెట్టింది. గలగల పారే వాగుల పచ్చని పొలాల మధ్య యంత్రాలనూ దింపింది. సంస్థ ప్రతి నిధులు యంత్రా లతో బోర్లు వేస్తునట్టు నటించి యురేనియం తవ్వకాల సర్వే పనులు మొదలు పెట్టారు. ఆరు వందల అడుగుల లోతు వరకు యురేనియం కోసం అన్వేషణ సాగించారు. బోర్లు వేస్తున్నామంటూ చుట్టు పక్కల రైతు లకు సంస్థ ప్రతి నిధులు చెప్పి బోల్తా కొట్టించారు. భూగర్భం లోంచి తీసి ల్యాబ్ కు పంపిన రాళ్ల ను చూసి రైతు లకు అనుమానం వచ్చింది.ఇప్పటికే కడప జిల్లా ప్రజల బతుకుల్లో యురేనియం విషం చిమ్ముతోంది. ఇంతలోనే మరో రాయలసీమ జిల్లా ను కూడా ఈ ముప్పు తాకనుందని రైతులు ఆందోళన చెందారు. సర్వే తవ్వకాల కు వ్యతిరేకంగా రైతు లు రోడ్డెక్కారు.మాజీ మంత్రి భూమా అఖిలప్రియ యురేనియం సర్వే తవ్వకాలు జరుపుతున్న ప్రాంతానికి వచ్చి సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. రెవెన్యూ అధికారులను వివరా లు అడిగి తెలుసుకున్నారు. యురేనియం సర్వే తవ్వకాల అనుమతులపై సంస్థ ప్రతి నిధులు రెవెన్యూ అధికారుల పొంతన లేని సమాధానమిచ్చారు. రైతుల పర్మిషన్ లేకుండా సర్వే తవ్వకాలు ఎలా జరుపుతారని భూమా అఖిలప్రియ సంస్థ ప్రతి నిధులను నిలదీశారు. దీంతో కాంట్రాక్టు సంస్థ ప్రతి నిధులు యురేనియం సర్వే తవ్వకాల పనులు తాత్కాలికం గా నిలిపివేశారు. సర్వే పనులకు అనుమతి ఇవ్వా లని ఆళ్లగడ్డ తహసీల్దార్ కు లేఖ పంపారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం లో దాదాపు ఇరవై గ్రామాల్లో పదిహే ను చోట్ల మళ్లీ యురేనియం సర్వే పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం యురేనియం సర్వే పనులు ఆపెయ్యాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డ ను కాపాడేందుకు 'సేవ్ నల్లమల సేవ్ ఆళ్లగడ్డ' క్యాంపెయిన్ ను ఉధృతం చేశారు.సంస్థ ప్రతి నిధులు డ్రిల్లింగ్ పనులు చేసే యంత్రాలను అక్కడి నుంచి తీసుకెళ్లారు .ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి యురేనియం తవ్వకాల సర్వేపై స్పందించారు. యురేనియం తవ్వకాలకు తాము వ్యతిరేకమన్నారు. రెండు వేల పధ్ధెనిమిది లో చంద్రబాబు యురేనియం తవ్వకాల కు అనుమతులు ఇచ్చారని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణల యురేనియం తవ్వకాల ను సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఏపీ ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదని విపక్షా లు ప్రయత్నిస్తున్నాయి. యురేనియం తవ్వకాల కు వ్యతిరేకం గా అఖిల పక్ష బృందం కడప జిల్లాలో యురేనియం తవ్వకాల ప్రాంతాల్లో పర్యటించింది.ఆళ్లగడ్డ లో అఖిల పక్ష సమావేశం లో పాల్గొన్నారు. రాయలసీమ లో యురేనియం తవ్వకాల పై అఖిల పక్ష నేతలు ముక్త కంఠంతో వ్యతిరే కించారు. పులివెందుల ప్రజలు నరకం చూస్తున్న పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. కడప జిల్లా మాదిరి గా ఆళ్లగడ్డ లో యురేనియం తవ్వకాలు జరగనివ్వమని హెచ్చరించారు. యురేనియం తవ్వకాల పై సీపీఐ రాష్ట్ర కార్య దర్శి రామకృష్ణ సీరియస్ అయ్యారు. సీఎం జగన్ కడప జిల్లా లో యురేనియం బాధిత ప్రాంతాల్లో పర్యటించాలన్నారు. యురేనియం తవ్వకాలు జరపకముందే మేల్కొన్న ఆళ్లగడ్డ ప్రజల ను రామకృష్ణ అభినందించారు. యురేనియం సర్వే తవ్వకాల వల్ల తమ భూముల రేట్లు పడిపోతున్నాయి అని ఆళ్లగడ్డ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని కుట్ర లు చేసినా సర్వే పనులను అడ్డు కుంటామన్నారు. రైతు లు ప్రజా సంఘాలు అన్ని విపక్ష పార్టీ లు ఏకం కావడం తో జగన్ సర్కార్ కు యురేనియం సెగ తగిలింది ఇక జగన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
  తెలంగాణ ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. డెడ్ లైన్ విధించి ఉద్యోగాలు పోతాయని హెచ్చరించి. అయినా ఆర్టీసీ ఉద్యోగులు వెనకడుగు వేయకుండా సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంతో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆరే రంగంలోకి దిగారు. ఆర్టీసీలో ఇక మిగిలింది 12 వందల మంది ఉద్యోగులే అని చెప్పిన కేసీఆర్‌.. సమ్మెలో ఉన్న సుమారు 48 వేల మందిని తొలగిస్తున్నామని పరోక్షంగా హెచ్చరించారు. దీంతో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను మూకుమ్మడిగా తొలగించవచ్చా? అన్ని వేల మందిని ఒకేసారి డిస్మిస్‌ చేయడాన్ని చట్టాలు సమర్థిస్థాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గతంలో తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అధికారంలో ఉన్న సమయంలో మూకుమ్మడిగా దాదాపు 2 లక్షల మందిని తొలగించారు. 2003 లో రెవెన్యూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెకు దిగగా.. మొత్తం 1.70 లక్షల మందిని తొలిగిస్తూ జయలలిత నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, సమ్మె చేస్తున్న 1.70 లక్షల మంది ఉద్యోగులను జయలలిత తొలగిస్తే సుప్రీంకోర్టు మాత్రం ఉద్యోగులకు ఉపశమనం కల్పించింది. వాళ్లను తిరిగి తీసుకోవాలని చెబుతూనే, బేషరతుగా క్షమాపణ చెబుతూ.. భవిష్యత్‌లో సమ్మెలు చేయబోమంటూ ప్రమాణపత్రం ఇవ్వాలని ఉద్యోగులకు సుప్రీం నిర్దేశించింది.  ఆర్టీసీ కార్మికుల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటన కూడా న్యాయసమీక్షకు నిలబడదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం తొలగిస్తే.. వారు కోర్టుకి వెళ్లే అవకాశముంది. అప్పుడు తమిళనాడు ఉద్యోగుల అంశంలో వెలువడిన తీర్పే మళ్లీ వెలువడే అవకాశముందని అంటున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా ప్రభుత్వానికి ఉద్యోగులను తొలగించే అధికారం లేవంటున్నాయి. ‘‘మేము చట్టబద్ధంగా సమ్మె నోటీసులిచ్చాం. మంత్రి ఉన్నా.. చర్చల్లో పాల్గొనలేదు. మాకు న్యాయం చేయడానికి కోర్టులున్నాయి. చట్టాలు మూకుమ్మడి తొలగింపులను అనుమతించవు.’’ అని అంటున్నారు.
  హామీలు ఎన్నోఇస్తుంటారు కానీ రాను రాను వాటి బకాయిలు చెల్లించడంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్షం వహిస్తోంది. ఉపాధి హామీ పథకం బకాయిల క్రింద కేంద్ర ప్రభుత్వ నిధులు ఇచ్చినా వాటిని కూలీలకు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెడుతోందని టిడిపి అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు గురువారం ఆయన లేఖ రాశారు.  కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు మూడు విడతలుగా పధ్ధెనిమిది వందల నలభై ఐదు కోట్లు రాష్ట్రానికి పంపింది. ఈ డబ్బులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు కలిపి మూడు రోజుల్లోగా రాష్ట్ర ఉపాధి హామీ నిధుల బదిలీ చేయాలి. ఇలా చేయకపోతే తదుపరి నిధులు విడుదల నిలిపివేసే అధికారం కేంద్రానికి ఉంటుంది. అలాగే జాప్యం చేసిన కాలానికి రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు శాతం వడ్డీ కూడా చెల్లించాలి. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ఈ నిధులు వినియోగించాలని పాత పెండింగ్ బిల్లులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని కూడా కేంద్రం తన ఆదేశాల్లో సూచించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద చెల్లించాల్సిన బిల్లులను చెల్లించలేదు. ఈ నిధులను ఇతర అవసరాల కోసం మళ్లించిందనే ఆరోపణలు వస్తున్నాయని అందులో పేర్కొన్నారు. నెలల తరబడి బిల్లులూ పేరుకుపోవడంతో అవి రావలసిన వారు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని కొన్ని చోట్ల ఈ పరిణామం ఆత్మహత్యలకు కూడా దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఉపాధి హామీ పథకానికి చెడ్డ పేరు తెస్తుందని బిల్లులు పేరుకుపోవడంతో ఈ పథకంతో జత కలిపి పనులు చేయటానికి ప్రభుత్వ విభాగాలు వెనుకంజ వేస్తున్నాయని తెలిపారు.  ఉపాధి హామీ పథకం గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఈ పరిస్థితి పై పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలిచ్చారని గవర్నర్ ను కూడా కలిసి వివరించారని తెలిపారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలో కొనుసాగితే అతి త్వరలోనే ప్రజలు ఈ పథకం పై విశ్వాసం కోల్పోతారని ఫలితంగా గ్రామీణాభివృద్ధి తీవ్రంగా కుంటుపడుతోందని, దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠ కూడా దెబ్బతింటుందంటున్నారు. ఉపాధి హామీ పథకం అమలులో ఏపీ గత ఐదేళ్లలో దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిందని చంద్రబాబు లేఖలో గుర్తు చేశారు. ఈ పథకం నిధులతో రాష్ట్రంలో ఇరవై ఆరు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, ఆరు వేల అంగన వాడీ భవనాలు, రెండు వేల రెండు వందల గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలు, పదివేల సాలిడ్ వేస్ట్ కేంద్రాలూ, ఏడు లక్షల పంటకుంటలు నిర్మించామని చంద్రబాబు పేర్కొన్నారు. పన్నెండు వేల కిలోమీటర్ల మేర గ్రామాలకు రహదారి సౌకర్యం ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా ఎనభై మూడు ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తే అందులో ముప్పై మూడు ఈ రాష్ట్రం నుంచే ఉన్నాయి. మొదటి పది లో ఏడు కూడా ఈ రాష్ట్రానికి చెందినవే అని తెలియజేశారు. దీనిని పరిశీలించి పెండింగ్ బిల్లుల చెల్లింపునకు కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. ప్రస్తుత ఆర్థిక మాంద్యంలో ఉపాధి హామీ పథకం మాత్రమే ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందని రాష్ట్రం నుంచి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ బకాయిలు చెల్లింపు పై చంద్రబాబు తన దృష్టని పెట్టారని స్పష్టంగా వెల్లడవుతోంది. 
  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ బాట పట్టారు. కేవలం ఒకే ఒక్క రోజు గ్యాప్ లో కేసీఆర్ అండ్ జగన్ హస్తినకు వెళ్తున్నారు. ఒకట్రెండు ఇష్యూస్ మినహా ఇద్దరి అజెండాలు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఇద్దరూ కూడా ప్రధాని మోడీతోపాటు కేంద్ర మంత్రులను కలిసి తమతమ రాష్ట్రాల సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఇరు రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తెచ్చుకోవడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అలాగే విభజన సమస్యలు కూడా ప్రస్తావనకు రానున్నాయి. అయితే, ఎన్నికలకు ముందు మోడీని తిట్టిన తిట్టకుండా ఒంటికాలిపై లేచిన కేసీఆర్... నరేంద్రమోడీ రెండోసారి ప్రధాని పగ్గాలు చేపట్టాక తొలిసారి సమావేశంకాబోతున్నారు. మరోవైపు తెలంగాణలో పొలిటికల్ వార్ ... టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారుతోన్న క్రమంలో.... కేసీఆర్... మోడీని కలవబోతుండటం ప్రాధాన్యత కలిగిస్తోంది. అయితే, రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనే మోడీతో కేసీఆర్ చర్చించనున్నారు. ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో తక్షణమే గ్రాంట్లను రిలీజ్ చేయాలని కోరనున్నారు. అలాగే, ఆయుష్మాన్-భవ పథకం నిధులను ఆరోగ్యశ్రీకి అనుసంధానం చేయాలని, అదేవిధంగా జలశక్తి కేటాయింపులకు మిషన్ భగీరథకు ఇవ్వాలని విజప్తి చేయనున్నారు. ఇక, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు, జోనల్ వ్యవస్థ సవరణ, రిజర్వేషన్ల పెంపు, యురేనియం తవ్వకాల నిలిపివేత, గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం... ఇలా పలు డిమాండ్లను ప్రధాని ముందు పెట్టనున్నారు.  ఇక, ఒక్క రోజు గ్యాప్ తో ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా... రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రధాని మోడీని కోరనున్నారు. రెవెన్యూ లోటు, ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో... ఏపీని ఆర్ధికంగా ఆదుకోవాలంటూ మెమొరాండం ఇవ్వనున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై ప్రధానితో జగన్ చర్చించనున్నారు. అయితే, అక్టోబర్ 15న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న రైతు భరోసా పథకం ప్రారంభానికి ముఖ్యఅతిథిగా రావాలని మోడీని జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించనున్నారు. అయితే, ఇటీవల ప్రగతి భవన్లో సమావేశమైన కేసీఆర్-జగన్... కేంద్ర ప్రభుత్వ తీరుపైనా, మోడీ విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారంటూ పత్రికల్లో కథనాలు రావడం సంచలనం సృష్టించింది. ఇక, ఇఫ్పుడు ఒక్క రోజు గ్యాప్ లో కేసీఆర్, జగన్ లు ఢిల్లీ వెళ్తుండటం... అదే సమయంలో ఇద్దరికీ మోడీ అపాయింట్ మెంట్లు ఇవ్వడం ఆసక్తిరేపుతోంది.
  గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏపీ సర్కార్ ప్రారంభించింది. తూర్పుగోదారి కరపలో జగన్ గ్రామ సచివాలయాల వ్యవస్థను ప్రారంభించారు. ప్రతి రెండు వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతిచోటా పది నుండి పన్నెండు మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులను నియమించింది. దాదాపు ప్రతి ఊరిలో ఒక గ్రామ సచివాలయం, జనాభా అత్యధికంగా ఉన్న గ్రామంలో ఆరు నుంచి ఏడు సచివాలయాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 11,158 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డ్ సచివాలయాలు బుధవారం నుంచి ప్రజలకు అందుబాటులో రానున్నాయి. ఈ సచివాలయాల్లో పని చెయ్యటానికి రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఒకే విడతలో లక్షా ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల పధ్ధెనిమిది లక్షల ఉద్యోగుల నియామక ప్రక్రియను చేపట్టింది. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. పింఛన్ లు, రేషన్ కార్డులు ఇంటి పట్టా వంటి వాటి కోసం పేదల మండల ఆఫీసులు, కలెక్టరేట్ రాజధానిలో ఉండే శాఖాధిపతుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పించారు. ప్రస్తుతం గ్రామ స్థాయిలో కేవలం 19 రకాల సేవలు పంచాయతీల ద్వారా అందజేసే అధికారముంది, ఈ పరిస్థితిని మార్చేస్తూ 500 రకాల ప్రభుత్వ సేవలను గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 2 వ తేదీ నుంచి ప్రతీ నెల కొన్ని సేవల చొప్పున గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందజేస్తారు. జనవరి 1వ తేదీ కల్లా 500 రకాల సేవలను ప్రజలు పూర్తిగా గ్రామ సచివాలయాల్లోనే పొందేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సేవలు అందజేసే విషయంలో నిర్దిష్ట కాల పరిమితి విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 34 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమాచారాన్ని గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. ఆయా శాఖల పరిధిలో జరిగే పనులను గ్రామ సచివాలయం అనుమతితో చేపట్టే అవకాశముందని అధికార వర్గాలు చెప్తున్నాయి. గ్రామ సచివాలయాల పరిధిలో జరిగే ప్రతి అభివృద్ధి పని, ప్రతి సంక్షేమ పథకంలో లబ్ధిదారుల పేర్లను అక్కడి ప్రజలందరి సమక్షంలో చేర్పించి నిర్ణయించాలనీ, ఏడాదిలో తప్పని సరిగా ఎనిమిది సార్లు గ్రామ సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల్లో అవినీతి, అక్రమాలకు ఏమాత్రం తావు లేకుండా పారదర్శకంగా అర్హులకే వాటిని అందించటానికి సన్నాహాలు చేస్తోంది. ప్రతి పథకం లబ్ధిదారుల జాబితాలో అందరికీ తెలిసేలా గ్రామ సచివాలయం నోటీస్ బోర్డులో ఉంచుతారు. ఏ శాఖ ద్వారా ఏ పనికి ఎంత ఖర్చు పెట్టారన్న వివరాలను సైతం సచివాలయంలో అందరికీ అందుబాటులోకి తీసుకొస్తారు.
  ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వగ్రామంలో అలజడి రేగింది. రాజకీయ కారణాలతో గ్రామాన్ని రెండుగా విడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల పంచాయతీ పరిధిలో పెద్ద కౌకుంట్ల, చిన్న కౌకుంట్ల, వై.రాంపురం, రాసిపల్లి, మైలారంపల్లి గ్రామాలు ఉన్నాయి. దాదాపు 5వేలకు పైగా జనాభా ఉన్న పెద్ద కౌకుంట్ల మొదట్నుంచీ మేజర్ పంచాయతీగా కొనసాగుతోంది. అయితే, జగన్మోహన్ ‌‌రెడ్డి అధికారంలోకి వచ్చాక, రాంపురం గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా చేయాలంటూ వైసీపీ వర్గాలు డిమాండ్ రావడంతో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అయితే, గ్రామస్తులు రెండు వర్గాలుగా చీలిపోయారు. పెద్ద కౌకుంట్ల... ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ స్వగ్రామం కావడం... ముందునుంచీ టీడీపీకి పట్టు ఉండటంతో... తెలుగుదేశం వర్గీయులు.... మేజర్ పంచాయతీగానే కొనసాగాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, వైసీపీ వర్గీయులు మాత్రం వై.రాంపురం గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ప్రకటించాలని పట్టుబడుతున్నారు. దాంతో గ్రామస్తులు...పార్టీల వారీగా విడిపోయి రగడకు దిగారు. అయితే, పెద్ద కౌకుంట్ల... టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ సొంత గ్రామం కావడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారులు ప్రజాభిప్రాయసేకరణకు రావడంతో పెద్ద కౌకుంట్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వయంగా రంగంలోకి దిగి, తెలుగుదేశం శ్రేణులకు అండగా నిలిచారు. అయితే, గ్రామస్తులు... పార్టీల వైజ్‌... రెండు వర్గాలుగా విడిపోయి... వాదోపవాదాలకు దిగడంతో... ఉద్రిక్తత మధ్యే అధికారులు ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ప్రజాభిప్రాయ సేకరణలో... మొత్తం 1672మంది పాల్గొంటే, వై.రాంపురం గ్రామాన్ని... పెద్ద కౌకుంట్ల పంచాయతీలోనే కొనసాగించాలని 1522మంది కోరగా, కేవలం 150మంది మాత్రమే ప్రత్యేక పంచాయతీగా ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. దాంతో, గ్రామస్తుల అభిప్రాయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఉరవకొండ ఎంపీడీవో తెలిపారు. ఇదిలాఉంటే, వైసీపీ అధికారంలోకి వచ్చాక, పచ్చని గ్రామాల్లో చిచ్చు పెడుతున్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. వైసీపీ నేత విశ్వేశ్వర్ రెడ్డి పనిగట్టుకుని... తమ గ్రామాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కేవీపీ రామచంద్రరావు... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డికి ఆత్మ... ఇప్పుడదే ఆత్మ రెండు రాష్ట్రాల్లోనూ, తెర వెనకుండి నడిపిస్తోందన్న వాదన, రాజకీయ వర్గాల్లో హాట్‌హాట్‌‌గా సాగుతోంది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టుల విషయంలో కేవీపీ మాటే చెల్లుబాటు అవుతోందని అంటున్నారు. తెలంగాణ కాళేశ్వరం... ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టుల కాంట్రాక్టులను మేఘా సంస్థ దక్కించుకోవడం వెనుక కేవీపీనే ఉన్నారనే మాట వినిపిస్తోంది. అంతేకాదు, కేసీఆర్-జగన్ ఫ్రెండ్షిప్ వెనుకా కేవీపీయే ఉన్నారని పొలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తోంది మేఘా సంస్థే... అయితే, మేఘాకి ఈ ప్రాజెక్టు దక్కడం వెనుక కేవీపీ కీలక పాత్ర పోషించారన్న వాదన ఉంది. ఎందుకంటే, ప్రత్యక్షంగా కనిపించకపోయినా, కేసీఆర్‌కు కేవీపీకి మంచి సంబంధాలున్నాయని అంటున్నారు. ఇద్దరి సామాజికవర్గం కూడా ఒక్కటే కావడమూ కారణమంటున్నారు. ఇక, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తోన్న కంపెనీయే ఇప్పుడు రివర్స్ టెండరింగ్ లో పోలవరం కాంట్రాక్టును దక్కించుకుంది. అయితే, మేఘా సంస్థ... పోలవరం కాంట్రాక్టు దక్కించుకోవడం వెనుక కూడా కేవీపీయే ఉన్నారని మాట్లాడుకుంటున్నారు. వందల కోట్ల రూపాయల నష్టం వస్తుందని తెలిసినప్పటికీ, 12.6 శాతం తక్కువకు కోట్ చేస్తూ, మేఘా సంస్థ బిడ్ దాఖలు చేయడం వెనుక కేవీపీ వ్యూహం ఉందని మాట్లాడుకుంటున్నారు. మేఘా కంపెనీ ఇంత తక్కువకు బిడ్ దాఖలు చేయడం వెనుక, కేవీపీతోపాటు జగన్ కూడా ఉన్నారనే మాట కూడా వినిపిస్తోంది. అందుకే, మేఘాకి పోలవరం కాంట్రాక్టు దక్కడంతో వైసీపీ నేతలు ఖుషీ అవుతున్నారట. మరోవైపు, మేఘా సంస్థలో కేవీపీకి భారీగా షేర్లు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. అందుకే మేఘా కంపెనీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ కాంట్రాక్టులు దక్కేలా చేస్తున్నారని అంటున్నారు.
  జీవితంలో అనుభవం నేర్పిన పాఠాలు ఎవరూ నేర్పలేరంటారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తన అనుభవంతో మిగతా స్టార్ హీరోలకు పాఠాలు చెబుతున్నారు. ఆ పాఠాలు సినిమాలకు సంబంధించినవి అనుకుంటే పొరపాటే, రాజకీయాలకు సంబంధించినవి. చిరంజీవి సినిమాల్లో మెగాస్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న టైంలో 2008 లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. 2009 ఎన్నికల్లో బరిలోకి దిగారు. అయితే ఆ ఎన్నికల్లో చిరంజీవి ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన చిరంజీవి.. తన సొంత నియోజకవర్గం పాలకొల్లులో ఓడిపోయారు. ఇక పార్టీ కూడా 18 స్థానాలతో సరిపెట్టుకుంది. తర్వాత కొందరి సలహాతో 2011 లో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు. రాజ్యసభకు ఎంపికై కేంద్ర కేబినెట్ లో పనిచేసారు. ఓ రకంగా చిరంజీవి రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేదనే చెప్పాలి. దీంతో చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నారు. ఇక చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా 2014 లో జనసేన పార్టీని స్థాపించారు. అయితే 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్డీయే కూటమికి మద్దతు తెలిపారు. 2019 ఎన్నికల్లో మాత్రం ప్రత్యక్ష పోరుకి దిగారు. కానీ చిరంజీవి కంటే దారుణమైన ఫలితాన్ని చవిచూశారు. పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. పార్టీ కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ స్థానంతో సరిపెట్టుకుంది. అయినా పవన్ తన పోరాటం ఆగదంటున్నారు. అయితే చిరంజీవి మాత్రం ప్రజారాజ్యం, జనసేన పార్టీలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా, మరియు రాజకీయాల్లో తనకున్న ప్రత్యక్ష అనుభవంతో.. సినిమా స్టార్లు రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచింది అంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా త‌మిళ మేగ‌జైన్ ఆనంద విక‌ట‌న్‌కు ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో చిరంజీవి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్యలు చేసారు. ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌లను రాజ‌కీయాల్లోకి రావ‌ద్దంటూ స‌ల‌హా ఇచ్చారు.  "నేను సినిమాల్లో నెంబ‌ర్ వ‌న్ స్టార్‌గా రాణిస్తున్న స‌మ‌యంలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. అయితే ప్ర‌త్య‌ర్థులు కోట్లు కుమ్మ‌రించ‌డంతో సొంత నియోజ‌క వ‌ర్గంలోనే ఓడిపోయాను. నా సోద‌రుడు ప‌వ‌న్‌ కళ్యాణ్ విష‌యంలోనూ అదే జ‌రిగింది" అని అన్నారు. ప్ర‌స్తుతం రాజకీయాలు పూర్తిగా డ‌బ్బుమ‌య‌మైయ్యాయ‌ని, సౌమ్యుల‌కు రాజ‌కీయాలు అంత సుల‌భ‌మైతే కాదని, నిజాయ‌తీగా ప్ర‌జ‌ల‌కు ఏదైనా చేయాల‌నుకున్నా ఏమీ చేయ‌లేర‌ని ఆయ‌న తెలిపారు. న‌న్న‌డిగితే ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌లు రాజ‌కీయాల్లోకి రావొద్ద‌నే స‌ల‌హా ఇస్తాను అని చిరంజీవి స్పష్టం చేసారు. మొత్తానికి చిరంజీవికి అనుభవంతో తత్త్వం బోధ పడింది. రాజకీయాలకు దూరం పాటించాలని సలహాలు ఇస్తున్నారు. మరి ఇప్ప‌టికే మ‌క్క‌ల్ నీది మ‌య్యం పార్టీతో క‌మ‌ల్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసారు. ర‌జ‌నీ కూడా త్వ‌ర‌లోనే రాజ‌కీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. మరి వీరిద్దరూ చిరంజీవి సలహాతో ఆలోచనలో పడతారో, లేక అనుభవమే పాఠాలు నేర్పుతుంది అంటూ ముందుకి సాగుతారో చూడాలి.
  భారత్ లో ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి కుట్ర పన్నారు, దేశ వ్యాప్తంగా ముప్పై చోట్ల పేలుళ్లకు ప్లాన్ చేశారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చేసిన ఈ కుట్రను ఇంటెలిజెన్స్ బ్యూరో పసిగట్టింది. జైషే మహమ్మద్ విడుదల చేసిన లేఖను ఐబీ కనిపెట్టింది. పాక్ భూభాగం లోని బాలాకోట్ లో ఉగ్రవాద శిబిరాలు మళ్లీ వెలిశాయని, మరోసారి దాడులకు సిద్ధంగా ఉన్నామని ఆర్మీ చీఫ్ ప్రకటించిన రెండు రోజుల్లోనే జైషే మహమ్మద్ కుట్ర బయటకు రావడంతో అందరూ అలర్ట్ అయ్యారు. కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్ తీవ్రమైన కడుపు మంటతో ఉంది. భారత్ ని నేరుగా ఎదుర్కోలేకపోతున్న పాక్ ముష్కరులుని రెచ్చగొట్టి విధ్వంసాలకు కుట్ర చేస్తుందని సమాచారం. భారత్ లో భారీ విధ్వంసాలకు పాల్పడటమే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ని కూడా హిట్ లిస్ట్ లో పెట్టుకున్నామని, వారిని హత్య చేస్తామని జైషే మహమ్మద్ విడుదల చేసిన లేఖతో బయటపడింది. జైషే మహమ్మద్ చేస్తున్న ఈ కుట్రకు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ సహకారం అందిస్తున్నట్టు ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో కనిపెట్టింది. ఆర్టికల్స్ 370 రద్దుతో కాశ్మీర్ లో పాకిస్తాన్ పప్పులుడికేలా పరిస్థితి కనిపించకపోవడంతో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉగ్రమూకల్ని రెచ్చగొడుతోంది. ఇప్పుడు జైషే మహమ్మద్ చేసిన కుట్ర కూడా కాశ్మీర్ పై ఉన్న కడుపుమంటే అని తెలుస్తుంది. ఐబీ కనిపెట్టిన జైషే మహమ్మద్ లేఖలో అనేక ఉగ్ర కుట్రకు సంబంధించిన లింక్స్ ఉన్నాయి. దేశంలో ముప్పై చోట్ల పేలుళ్లకు వేసిన ప్లాన్ లో గాంధీనగర్, కాన్పూర్, లక్నో ఎయిర్ పోర్ట్ లు కూడా ఉన్నాయి. ఈ మూడు ఎయిర్ పోర్ట్ లను పేల్చేయాలని పన్నాగం పన్నింది పాకిస్తాన్. దీంతో ఇండియన్ ఇంటెలిజెన్స్ దేశవ్యాప్తంగా సెక్యూరిటీని అలర్ట్ చేసింది. జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించినా పాకిస్థాన్ మాత్రం తన బుద్ధిని మార్చుకోలేదు. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన తరువాత మసూద్ అజర్ ని అదుపులోకి తీసుకుని జైలులో పెట్టిన పాకిస్తాన్, సరిగ్గా నెల రోజుల క్రితం అతన్ని వదిలేసింది. మసూద్ అజర్ బయటకు రాగానే బాలాకోట్ లో మళ్లీ ఉగ్రక్యాంప్ లు మొదలయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన భారత ఆర్మీ రెండు రోజుల క్రితమే పాకిస్థాన్ కు వార్నింగ్ ఇచ్చింది. బాలాకోట్ లో జరుగుతున్న ఉగ్రవాద శిక్షిణా శిబిరాలపై మళ్లీ దాడులు చేస్తామని హెచ్చరించింది.
తెలంగాణ అసెంబ్లీలో ఆదివారం ముఖ్యమంత్రి కె.సి.ఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా రెండు స్కీములు ఉన్నాయని, అవి పెడితే మీ పని ఖతమేనని, అవి అమలైతే గతంలో చెప్పినట్లుగా రెండు మూడు సార్లు గెలుస్తాం అంటూ ధీమాతో కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. ఇప్పుడు ఆయన దాచిన ఆ రెండు అద్భుత పథకాలు ఏంటి, వాటిని అమలు చేస్తే కేసీఆర్ కు అధికారం మళ్లీ వస్తుందా, ఇంతకీ కేసీఆర్ దాచిన పథకాలు ఏంటని తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ విమర్శల వర్షం గుప్పించారు. అమావాస్య, పౌర్ణానికి వచ్చి లొల్లిచేసే బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవన్నారు. కాంగ్రెస్ అసలు తమకు పోటీనే కాదంటూ గడిచిన ఎన్నికలకు, ఈ ఎన్నికలకు ఎవరి బలం తగ్గిందో తెలుసుకోండని లెక్కలు చెప్పారు. కేసీఆర్ అంత ధీమాగా ఆ రెండు పథకాల గురించి చెప్పడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేసీఆర్ అమ్ముల పొదలోని అస్త్రాలు తెలంగాణ అంతటా ఉచిత వైద్యం, యువతకు ఉద్యోగాల కల్పన అనే చర్చ గులాబీ ముఖ్యుల వర్గాల్లో సాగుతోందని సమాచారం. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 3.5 కోట్ల మంది మొత్తం జనాభాకు అందరికీ ఉచిత వైద్యం అందిస్తే ఎంత లెక్క అవుతుందని కె.సి.ఆర్ ఆరా తీశారట. పేదలకు ఉచితంగా ఉన్నత వర్గాలకు కొంత మొత్తం వసూలు చేసి హెల్త్ కార్డులు ఇచ్చి తెలంగాణ వ్యాప్తంగా ఉచిత వైద్యం అందించేందుకు కేసీఆర్ ఇప్పటికే దీనిపై నివేదికలు, అంచనాలూ, ఖర్చు లెక్కను తెప్పించుకున్నారట. వచ్చే 2024 ఎన్నికల ముందర ఈ అద్భుత పథకాన్ని ప్రవేశ పెట్టి మళ్లీ అధికారంలోకి వచ్చే స్కెచ్ గీసినట్టు తెలిసింది. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన, తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగుల లెక్కలు తీసి పరిశ్రమలతో కలిసి ప్రభుత్వం నడిపించే అన్నిట్లోనూ, ప్రైవేటు పరిశ్రమల్లోనూ ప్రభుత్వమే రిక్రూట్ చేసే కొత్త పథకాన్ని కేసీఆర్ రూపొందించారట. వైన్ షాపులు, రేషన్ షాపులు ఇతర ప్రభుత్వ సేవలన్నింటినీ యువతకు అప్పగించేందుకు ప్లాన్ చేశారట. ఖాళీగా ఉండే వారికి నెలకు నిరుద్యోగ భృతి ఇస్తారట. ఈ రెండు పథకాలకు బడ్జెట్ కొరతతో కేసీఆర్ ప్రస్తుతానికి పక్కన పెట్టినప్పటికీ భవిష్యత్లో అధికారంలోకి రావటానికి ఇవే సోపానాలని భావిస్తున్నారట. కేసీఆర్ దాచిన రెండు సీక్రెట్ పథకాలు ఇవేనంటూ ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
  అమీర్ పేట మెట్రో స్టేషన్ దగ్గర నిన్నరాత్రి విషాదం చోటు చేసుకుంది. అమీర్ పేట మెట్రో స్టేషన్ దగ్గర జోరుగా వర్షం కురుస్తుండటంతో, అప్పుడే తన సోదరితో కలిసి మెట్రో రైలు దిగిన ఓ యువతి తడవకుండా ఉండేందుకు మెట్రో పిల్లర్ కిందకు వెళ్లింది. కొద్ది సేపటికే పైనుంచి పెచ్చులు ఊడి నేరుగా ఆమె తలపై పడ్డాయి, అంతెత్తు నుంచి పడ్డ పెచ్చుల ధాటికి ఆమె తల పగిలిపోయింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.  వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆమె ప్రాణాలు విడిచింది. అమీర్ పేట మెట్రో స్టేషన్ కింద చోటు చేసుకున్న ఈ ఘటన హైదరాబాదీలను భయపెడుతోంది. మృతురాలిని కూకట్ పల్లిలో నివాసముంటున్న మౌనికగా గుర్తించారు. మౌనికా స్వస్థలం మంచిర్యాల జిల్లా శ్రీరాం పూర్, భర్త కంతాల హరికాంత్ రెడ్డి, ఏడాది క్రితమే వీరికి వివాహమైంది. హరికాంత్ కు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఉద్యోగం రావటంతో ఆరు నెలల క్రితమే ఈ దంపతులు నగరానికొచ్చి కూకట్ పల్లి ఫేస్ త్రి ఎస్సార్ హోమ్స్ లో నివాసముంటున్నారు. తన చిన్నాన్న కూతురు నికితను అమీర్ పేటలో ని ఓ ప్రైవేట్ హాస్టల్లో చేర్పించేందుకు మౌనిక ఆదివారం మధ్యాహ్నం కూకట్ పల్లిలో మెట్రో రైలు ఎక్కింది. ఇద్దరూ కలిసి అమీర్ పేటలో దిగారు, వర్షం కురుస్తుండటంతో సారధీ స్టూడియో వైపు ఉన్న మెట్ల ద్వారా కిందకు దిగారు. ఇద్దరు ఏ 1053 మెట్రో పిల్లర్ కింద నిలుచున్నారు, అనుకోకుండా మూడో అంతస్థులోని గోడకు చెందిన పెచ్చులు ఒక్క సారిగా ఊడి మౌనిక తలపై పడ్డాయి. తొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి పెచ్చులు పడటంతో ఆమె తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆమె సోదరి, స్థానికుల్లో కొందరు కలిసి బాధితురాల్ని ఓ ఆటోలో హుటాహుటిన దగ్గర్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మౌనిక మృతి చెందినట్టు నిర్ధారించారు. సోదరిని హాస్టల్లో చేర్పించి గంటలో తిరిగి వస్తారని తనతో చెప్పి వెళ్లిన భార్య కొద్ది సేపటికే తిరిగి రాని లోకాలకు వెళ్లిందని తెలిసి మౌనిక భర్త హరికాంత్ రెడ్డి షాక్ కు గురయ్యాడు, మృతదేహం వద్ద బోరున విలపించాడు. పెళ్లైన సంవత్సరానికే తనను వీడి వెళ్లిపోయావా అంటూ అతడు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది. సర్ఫేస్ వాల్ నుంచి చిన్న ప్లాస్టర్ ముక్క పడిందనీ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. తొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి పడటంతో ఆమె తీవ్రంగా గాయపడి చనిపోయిందని చెప్పారు. ఇలాంటి ఘటన దురదృష్టకరమన్నారు, మౌనిక కుటుంబానికి పరిహారమివ్వాలని ఎల్ అండ్ టీ మెట్రో సంస్థకు ఎన్వీఎస్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ కే తలమానికంగా ఉన్న మెట్రో రైలుకు సంబంధించి జరిగిన ఈ దుర్ఘటన నగర వాసులను భయపెడుతోంది. హైదరాబాదీల జీవితంలో భాగమైన మెట్రో రైల్లో ప్రమాదం జరగటం ప్రజలల్ని ఆందోళనకు గురిచేస్తోంది. మెట్రో నిర్మాణంలో లోపాలకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. హడావుడిగా మెట్రో నిర్మాణాన్ని ముగించటం, ప్రీ కాస్ట్ విధానంలో నిర్మించిన పిల్లర్లు, వాటిపైన ఏర్పాటు చేపట్టిన వడయాక్ట్ సిగ్మెంట్ల మధ్య ఖాళీ ప్రదేశాన్ని పటిష్ఠంగా మూసివేయకపోవడం, ఇప్పటికీ రవాణా కొనసాగుతున్న స్టేషన్ల దగ్గర ఇంకా నిర్మాణ పనులు కొనసాగిస్తూనే ఉండడం, మెట్రో రైళ్లు పరిగెత్తే సమయంలో పిల్లర్ల వణకడం, ప్రీ కాస్ట్ కాంక్రీటు నిర్మాణానికి దానిపైన చేసిన సిమెంట్ బాండింగ్ కి మధ్య పటిష్టంగా లేకపోవడం ఈ పెచ్చులూడటానికి కారణంగా తెలుస్తోంది.
  వైసీపీ అధికారంలోకి రాగానే అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం అంటూ శంఖారావం మోగించింది. అందులో భాగంగా ఏకంగా 'ప్రజావేదిక' నే కూల్చి వేసింది. ప్రజాధనాన్ని వృథా చేసిందని విమర్శలు కూడా ఎదుర్కొంది అది వేరే విషయం. ఆ కూల్చివేత ప్రజావేదిక తో ఆగిపోలేదు. పలువురు ప్రతిపక్ష టీడీపీ నేతలకు నోటీసులు వచ్చాయి. కొన్ని భవనాలు నేలమట్టమయ్యాయి కూడా. అయితే ఇక్కడ ముఖ్యంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు గురించి మాట్లాడుకోవాలి. ఉండవల్లిలో నివాసం ఉంటున్న ఇంటికి ఇప్పటికే సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇంటిని ఖాళీ చేయాలనీ చెప్పారు. మరోవైపు అధికార పార్టీ నేతలు ఆ ఇల్లు అక్రమ నిర్మాణం, దాన్ని కూల్చివేయాల్సిందే అని చెప్పుకొచ్చారు. అయితే ఈ అంశం కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నట్టుండి మళ్లీ తెరమీదకు వచ్చింది. చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటికి సీఆర్డీఏ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఆయన ఇంటి గోడకు అధికారులు నోటీసులు అంటించారు. లింగమనేని రమేష్‌ పేరుతో సీఆర్డీఏ నోటీసులు అంటించింది. వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన నోటీసులనూ ప్రస్తుత నోటీసులో సీఆర్డీఏ అధికారులు పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన సీఆర్డీఏ నోటీసులకు ఇంటి యజమాని రమేష్ వివరణ ఇచ్చారు. అయితే రమేష్‌ వివరణ సంతృప్తికరంగా లేదని సీఆర్డీఏ నోటీసులో పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, స్విమ్మింగ్ పూల్ లను నిర్మించారని తెలిపారు. కాగా, ఈ నోటీసుల వ్యవహారంపై లింగమనేని రమేష్ స్పందించారు. ఇంటి నిర్మాణ సమయానికి సీఆర్డీఏ లేదని పేర్కొన్నారు. ఉండవల్లి పంచాయతీ అనుమతి తీసుకుని ఇంటిని నిర్మించామని తెలిపారు. స్విమ్మింగ్‌పూల్‌కి రివర్‌ కన్సర్వేటర్‌ అనుమతి ఉందని రమేష్‌ వెల్లడించారు. మరి ఈ నోటీసుపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరోవైపు.. గతంలో రమేష్ వివరణతో సంతృప్తి చెందని అధికారులు.. ఈసారి మాత్రం సంతృప్తి చెబుతారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే చంద్రబాబు వారం రోజుల్లో ఇంటిని ఖాళీ చేయక తప్పేలా లేదు. అదే జరిగితే అధికార పార్టీ పంతం నెగ్గినట్టే. ఎందుకంటే అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైసీపీ.. చంద్రబాబుని ఆ ఇంటి నుండి ఖాళీ చేయించాలని పట్టుదలతో ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
    హుజూర్‌నగర్ ఉపఎన్నిక... ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలను ఏకంచేసింది. హుజూర్‌‌నగర్ ఉపఎన్నిక అభ్యర్ధిత్వంపై తలెత్తిన వివాదంతో నల్గొండ కాంగ్రెస్‌ నేతలంతా ఏకమయ్యారు. హుజూర్‌‌నగర్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్ధిగా తన భార్య పద్మావతిని ఉత్తమ్ ప్రకటించడాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకించడంతో సీనియర్లంతా ఏకమవుతున్నారు. అసలు నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో వేలు పెట్టడానికి రేవంత్ ఎవరంటూ ఏకతాటిపైకి వస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడూ ఉప్పూనిప్పులా ఉండే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి-ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మధ్య స్నేహం చిగురించింది. పార్టీలో రేవంత్ ఆధిపత్యం, ప్రాబల్యం పెరుగుతోందని భావిస్తోన్న సీనియర్లు ఏకమవుతున్నారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ తోపాటు  నల్గొండ కాంగ్రెస్‌ నేతలంతా రేవంత్‌‌పై మండిపడుతున్నారు. తాను రాజీనామాచేసిన తన సొంత నియోజకవర్గంలో నా భార్యను అభ్యర్ధిగా ప్రకటిస్తే తప్పేటంటూ ఉత్తమ్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అసలు మా జిల్లాలో వేలు పెట్టడానికి రేవంత్ ఎవరంటూ నల్గొండ కాంగ్రెస్ లీడర్లు ఫైరవుతున్నారు. తమ జిల్లా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం తమకుందని, ఇతరులు... తమ జిల్లా రాజకీయాల్లో వేలుపెడితే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. అయితే, ఎప్పుడూ ఉత్తమ్ పై విమర్శలుచేసే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.... హుజూర్‌నగర్ ఉపఎన్నికలో పద్మావతిని గెలిపించుకుని తీరతామని ప్రకటించడంతో... ఉత్తమ్-కోమటిరెడ్డి మధ్య స్నేహం చిగురించింది. ఇన్ని రోజులూ పక్కలో బల్లెంలా ఉన్న కోమటిరెడ్డి... మద్దతివ్వడంతో ఊపిరిపీల్చుకున్న ఉత్తమ్‌.... మిగతా నేతలతో కలిసి రేవంత్‌ను టార్గెట్‌ చేయడం మొదలుపెట్టారు. ఇక కోమటిరెడ్డి అయితే, రేవంత్ పై సెటైర్లు వేశారు. కొత్తగా వచ్చినోళ్ల సలహాలు తమకు అవసరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో విభేదాలున్నా, తాను, ఉత్తమ్, జానారెడ్డి ఒక్కటిగా పనిచేస్తున్నామంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు పీసీసీ రేసులో తాను ఒక్కడిని మాత్రమే ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి రేవంత్‌రెడ్డి మూలంగా నల్గొండ కాంగ్రెస్‌లో ఐక్యతారాగం వినిపిస్తోంది. ఇప్పటివరకు తిట్టుకున్న లీడర్ల మధ్య సరికొత్త స్నేహం చిగురించేలా చేసింది. ఒకరు ఔనంటే... మరొకరు కాదనే నేతలు ఇప్పుడు... తమ అందరిదీ ఒకే మాట అంటున్నారు. మరి ఇది ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి.
  గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లకుంటలో 1947 మే 2న జన్మించిన కోడెల... గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్.. వారణాసిలో ఎంస్ పూర్తి చేశారు. అసలు ఆరోజుల్లో వైద్య విద్యను అభ్యసించడమే గొప్ప అయితే, ఎంఎస్ పూర్తి చేయడం మరో సంచలనం. అంతేకాదు నర్సరావుపేటలో సొంతంగా ఆస్పత్రిని నెలకొల్పి రూపాయికే వైద్యం అందించడంతో పల్నాడులో కోడెల పేరు మోరుమోగిపోయింది. రూపాయి డాక్టర్ గా పేరు తెచ్చుకున్న కోడెలను ప్రజలు ఎంతో అభిమానించేవారు. అందుకే ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కోడెలను రాజకీయాల్లోకి రావాలని స్వయంగా కోరారు. ఎన్టీఆర్ స్వయంగా కోరడంతోనే అతి చిన్న వయసులో వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు కోడెల. అయితే, రాజకీయాల్లో వచ్చినా, ఎమ్మెల్యేగా గెలిచినా, మంత్రిగా పనిచేసినప్పటికీ, కొద్దిరోజులు ప్రజలకు వైద్యసేవలు అందించారు. అందుకే కోడెల అంటే పల్నాడు ప్రజలకు అంత అభిమానం. కోడెలపై పల్నాడు ప్రజలకున్న అభిమానమే ఆయన్ను వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేసింది. 1983లో మొదటిసారి నర్సరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల శివప్రసాద్... అప్పట్నుంచి 1999వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి పల్నాడు ప్రాంతంలో తిరుగులేని, ఎదురులేని నేతగా ఎదిగారు. ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. 1987-88 మధ్య హోంమంత్రిగా, అలాగే, భారీ మధ్యతరహా నీటిపారుదల శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే, 2004, 2019 ఎన్నికల్లో కోడెల ఓటమి చెందారు. 2014లో మళ్లీ సత్తెనపల్లి నుంచి విజయం సాధించి నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి స్పీకర్ గా సేవలందించారు. అయితే, కోడెలది తలదించని వ్యక్తిత్వం.... తలవంచని మనస్తత్వం... అంతేకాదు అత్యంత సున్నిత మనస్కుడు... స్నేహశీలి... పరువు కోసం ప్రాణాలిచ్చే మనిషి... అదే ఇప్పుడు ఆయన ప్రాణాలను బలిగొంది. చిన్న ఆరోపణను కూడా తట్టుకోలేని మనస్తత్వం కోడెలది... అలాంటిది వైసీపీ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే  ఒక్క కోడెలపైనే 19 కేసులు పెట్టింది. ఇక ఆయన కుమారుడు, కూతురుపై పెట్టిన కేసులకు లెక్కే లేదు. పైగా కోడెలపై దొంగతనం కేసు మోపడం... ఆ కేసుల్లో జీవితఖైదు పడే సెక్షన్లను పెట్టడం ఆయనకు తీవ్ర మనస్తాపం కలిగించింది. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి వంద రోజుల్లో వంద రకాలుగా వేధించడంతో కోడెల తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. రాజకీయాల్లో రాటుతేలిన నేత అయినప్పటికీ, చివరి రోజుల్లో అలాంటి అపనిందలను తట్టుకోలేకపోయారు. ముఖ్యంగా తనపై మోపిన అసెంబ్లీ ఫర్నిచర్ దొంగతనం అభియోగం నుంచి బయటపడేందుకు కోడెల తీవ్రంగా ప్రయత్నించారు. ఇందులో తన తప్పేమీ లేదని నిరూపించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ముందుగా అసెంబ్లీ సెక్రటరీకి లేఖ రాశారు... ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్, ప్రభుత్వానికి లేఖ రాశారు... తనను మానసికంగా క్షోభపెట్టొద్దంటూ వేడుకున్నారు... అసెంబ్లీ ఫర్నిచల్ తరలింపులో తన తప్పులేదని, హైదరాబాద్ నుంచి ఫర్నిచర్ ను తీసుకొచ్చే క్రమంలో అధికారులే తన క్యాంప్ కార్యాలయానికి తెచ్చిపెట్టారని, తన పదవీ కాలం పూర్తయిన తర్వాత  వెంటనే ఫర్నిచర్ ను తీసుకెళ్లమని కోరానని, లేదా వెల కడితే డబ్బు చెల్లిస్తానని జూన్ ఏడునే లేఖ రాశానని, కానీ అధికారులు స్పందించలేదని, ఆ తర్వాత అసెంబ్లీ కార్యదర్శికి, స్పీకర్ కి లేఖలు రాశానని, అయినా స్పందించకుండా, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కోడెల ఆవేదన వ్యక్తంచేశారు. అయితే, ఇప్పటికే తన కార్యాలయం నుంచి ఫర్నిచర్ ను తీసుకెళ్లారని, ఇంకా ఏమైనా ఉంటే తీసుకెళ్లొచ్చని, కానీ తనను ఇబ్బంది పెట్టొద్దంటూ ప్రభుత్వానికి కోడెల విజ్ఞప్తి చేశారు. 37ఏళ్లుగా నిబద్ధతతో రాజకీయాల్లో ఉన్నానని, అనవసరంగా తనపై తప్పుడు ఆరోపణలుచేస్తూ, దొంగతనం కేసు మోపి, తనను మానసిక క్షోభకు గురిచేయవద్దని కోరారు. కానీ జగన్ ప్రభుత్వం కనికరించలేదు... కోడెలపై వేధింపులకు పాల్పడింది. 90రోజుల్లో 19 కేసులు పెట్టి క్షోభకు గురిచేసింది. కోడెలకున్న మంచి పేరును చెడగొట్టేందుకు కుట్ర చేసింది. ముఖ్యంగా అసెంబ్లీ ఫర్నిచర్ విషయంలో వైసీపీ నాయకులు, వైసీపీ మీడియా చేసిన రచ్చను కోడెల తట్టుకోలేకపోయారు. చివరి ఆ మనోవేదనతోనే బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.
  'బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి' అనడానికి కోడెల జీవితాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చేమో. గుంటూరు జిల్లాలో ప్రజలకు సుపరిచితుడైన వైద్యుడిగా ముద్ర వేసుకున్న కోడెల.. రాజకీయాల్లోకి ప్రవేశించి చెరగని ముద్ర వేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి సీనియర్ నేతగా రాష్ట్రవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్ గా విశేష సేవలందించారు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. గత కొంత కాలంగా వరుస ఆరోపణలతో సతమతమవుతున్న కోడెల.. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని తుదిశ్వాస విడిచారు. 2014 లో టీడీపీ విజయం తరువాత స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన కోడెల.. 2019 ఎన్నికలకు ముందు వరకు తన బాధ్యతను నిర్వర్తించారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమితో ఆయనను సమస్యలు చుట్టుముట్టాయి. వరుస ఆరోపణలతో ఆయన ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కోడెల ఫ్యామిలీ సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో కోడెల టాక్స్ పేరుతో.. ప్రజలను ఇబ్బంది పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా కోడెల కుమారుడు, కూతురిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇద్దరు పలువురి వద్ద డబ్బులు వసూలు చేసారని, కొందరికి డబ్బులు ఎగ్గొట్టారని ఇలా రకరకాలు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు కోడెల కుటుంబం మీద ఇంకా ఆరోపణలు వచ్చాయి. కోడెల అసెంబ్లీ ఫర్నీచర్ మాయం చేసారని అధికార పార్టీ ఆరోపించింది. అయితే కోడెల మాత్రం తాను చెప్పే ఫర్నీచర్ తీసుకెళ్లానని, తిరిగి అప్పగించడానికి లేఖలు కూడా రాసానని చెప్పుకొచ్చారు. ఈ అసెంబ్లీ ఫర్నీచర్ అంశంలో కోడెల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వీటికితోడు ఆయన అద్దె పేరుతో ప్రభుత్వ సొమ్ముని దోచేస్తున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఆయన గుంటూరులోని తన భవనాన్ని, వైద్య శాఖకు అద్దెకిచ్చి.. సరైన వసతులు లేకపోయినా అధికమొత్తంలో అద్దె వసూలు చేసారని వార్తలొచ్చాయి. అంతేకాదు ఆసుపత్రులకు సరఫరా చేసే దూది విషయంలో కూడా కోడెల కుటుంబం అవినీతికి పాల్పడిందని ఆరోపణలు వినిపించాయి. ఆసుప్రతులకు దూది సరఫరా చేసే కాంట్రాక్టు తీసుకున్న కోడెల ఫ్యామిలీ.. నాసిరకం దూదిని తెప్పించి సరఫరా చేసారని ప్రచారం జరిగింది.   వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కోడెల మీద ఇలా వరుస ఆరోపణలు వచ్చాయి. అయితే ఇదంతా కక్ష సాధింపేనని కోడెల పదేపదే ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ గా ఉన్న సమయంలో తన బాధ్యతను నిర్వర్తిస్తూ.. వైసీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసానని.. కానీ వైసీపీ అధికారంలో వచ్చిన తరువాత దాన్ని మనసులో పెట్టుకొని తనను రాజకీయ వేధింపులకు గురి చేస్తుందని కోడెల ఫీలయ్యారు. అంతేకాదు ఈ వరుస ఆరోపణలతో కోడెల గుండెపోటుతో ఆసుపత్రిలో కూడా చేరారు. అయినా ఆయన మీద ఆరోపణలు ఆగలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల ఆత్మహత్య చేసుకుని లోకాన్ని విడిచారు. తెలుగు రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నేతగా పేరు తెచ్చుకున్న కోడెల.. ఆరోపణలు, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం నిజంగా దురదృష్టకరం.
  ఏపీ సీఎంగా వైఎస్ జగన్ వంద రోజుల పాలనను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. జగన్ 100 రోజుల పాలనపై టీడీపీ, బీజేపీ నేతలు ఇప్పటికే విమర్శలు గుప్పించగా.. తాజాగా జనసేన నివేదికను విడుదల చేసింది. 9 అంశాలతో కూడిన 33 పేజీల నివేదికను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. వైసీపీ పాలనలో పారదర్శక, దార్శనికత లోపించిందని నివేదికలో పేర్కొంది. వైసీపీ 100రోజుల పాలన ప్రణాళికాబద్ధంగా లేదని.. డెంగీ, మలేరియా వంటి సీజనల్‌ వ్యాధుల నివారణలో ప్రభుత్వంలో సన్నద్ధత లోపించిందని చెప్పుకొచ్చింది. వరదల సమయంలో ప్రభుత్వం.. పునరావాస చర్యలు కూడా వేగంగా చేపట్టలేదని జనసేన తన నివేదికలో తెలిపింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. వైసీపీ 100 రోజుల పాలన ప్రణాళికాబద్ధంగా లేదని విమర్శించారు. పాలనలో దార్శనికత, పారదర్శకత లోపించిందని అన్నారు. ఎన్నికల్లో 150కి పైగా సీట్లను గెలుచుకున్న వైసీపీ పాలనపై కనీసం ఒక సంవత్సరం వరకు తాము మాట్లాడాల్సిన అవసరం ఉండదని అనుకున్నామని.. కానీ, మూడు వారాల్లోపే వారు తీసుకున్న ఆందోళనకర నిర్ణయాలు ప్రజలు ఆక్షేపించేలా ఉన్నాయని విమర్శించారు. ‘సీజనల్‌ వ్యాధుల నివారణ చర్యలు తీసుకోవడం విఫలం చెందింది. ఇసుక విధానాన్ని ఇంతవరకు ప్రకటించకపోవడం చేతగానితనం. ఇసుక పాలసీని ప్రకటించకపోవడం పట్ల ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ఇసుక విధానం ప్రకటించకపోవడం వల్ల లక్షమంది నష్టపోయారు. ఇది పూడ్చుకోలేని నష్టం’ అని పవన్ చెప్పుకొచ్చారు.   ‘ఏపీ ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయింది. వైసీపీ జనరంజక పథకాలు అమలు చేయాలంటే రూ.50వేల కోట్లు అవసరం, ఎక్కడ నుంచి తెస్తారు?. టీడీపీ హయాంలో అవకతవకలు జరిగితే సరిచేయండి. వైసీపీ తీరు వల్ల పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోతున్నారు.. కొత్త పరిశ్రమలు రావడంలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సొంత ప్రయోజనాల కోసం నడపొద్దు. ప్రభుత్వ విధానాలు రాజధాని భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేశాయి’ అని పవన్ వ్యాఖ్యానించారు. ఏషియా పల్స్ అండ్ పేపర్ మిల్స్ పరిశ్రమ రూ.24 వేల కోట్ల పెట్టుబడితో ప్రకాశం జిల్లాలో ప్లాంట్ పెట్టేందుకు ప్రయత్నించినప్పుడు.. రాష్ట్రంలో పరిస్థితులను చూసి ఆ కంపెనీ మహారాష్ట్రకు తరలిపోయిందని పవన్ గుర్తు చేశారు. రాష్ట్రానికి రూ. 2.58 లక్షల కోట్ల అప్పులున్నాయని.. దీనికి తోడు జగన్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే రూ.50 వేల కోట్లు కావాలని పవన్ తెలిపారు. ఇప్పటికే తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూ మళ్లీ కొత్త పథకాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని పవన్ ప్రశ్నించారు. ‘ఏపీ ప్రజలకు పోలవరం జీవనాడి. పోలవరంలో అవకతవకలు జరిగితే విచారణ జరిపించాలి. పోలవరం ఆపేస్తే రైతాంగానికి, విశాఖ తాగునీటికి ఇబ్బంది. కృష్ణా వరదల సమయంలో సీఎం జగన్‌ అమెరికాలో ఉన్నారు. ఇక్కడున్న వైసీపీ పెద్దలు బిజీగా ఉండి వరదల నిర్వహణను పట్టించుకోలేదు. వరదల సమయంలో వైసీపీ మంత్రులు సరిగా నడుచుకోలేదు. వైసీపీ తీరు వల్ల వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. రాయలసీమకు వరద నీటిని తీసుకెళ్లలేకపోయారు.కృష్ణా వరదలతో ఓ ప్రాంతంలోని ఇళ్లు మునిగిపోతుంటే.. మంత్రులంతా మాజీ సీఎం ఇంటి ముంపుపై దృష్టిపెట్టారు’ అని పవన్ విమర్శించారు.
మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశాన్ని నిలువునా ముంచేసిన వాటిలో ఇసుకదే అతిపెద్ద పాత్ర. ఇసుక మాఫియాతో కలిసి సామాన్య ప్రజలకు టీడీపీ నేతలు చుక్కలు చూపించడంతో, ఆ ఎఫెక్ట్ పార్టీపై తీవ్రంగా పడింది. అందుకే, ఎవ్వరూ ఊహించనివిధంగా టీడీపీ నెంబర్ 23కి పడిపోయింది. ఇదే మాట చెబుతూ జనసేనాని పవన్ కల్యాణ్... వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత ఎన్నికల్లో టీడీపీని ముంచేసింది ఇసుకేనని.... ఇప్పుడు అదే ఇసుకతో జగన్ సర్కారు గేమ్స్ ఆడుతోందని, ఇలాగైతే, టీడీపీకి పట్టిన గతే... వైసీపీకి పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. పవన్ విశ్లేషణలో నిజంగా వాస్తవముంది. టీడీపీని ముంచేసిన వాటిలో ఇసుకది అతిపెద్ద పాత్రేనని అంగీకరించాల్సి ఉంటుంది. గల్లీ లీడర్ నుంచి చోటామోట నేత వరకు దొరికినకాడికి దొరికినట్లు ఇసుకను దోచేసి... అధిక ధరలతో సామాన్యులకు చుక్కలు చూపించారు. పేరుకు ఉచితం అంటూ బాబు ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కాకపోవడంతో చెడ్డపేరు మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులే జగన్ కు ఎదురవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వంద రోజుల వరకు ఇసుక తవ్వకాలను నిలిపివేసి వైసీపీ ప్రభుత్వం... ఇటీవలే కొత్త పాలసీని ప్రకటించి, ఇసుక సరఫరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంట్లో కూర్చొని ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తేచాలు చౌకధరకే ఇంటికి ఇసుక సరఫరా చేస్తామంటూ జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, శాండ్ పాలసీ ప్రకటించి, ఇసుక సప్లైకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, జగన్ ప్రభుత్వంపై మాత్రం ఇంకా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇసుక కొరతపై ఆరోపణలు వస్తున్నాయి. డిమాండ్ కి తగినట్టుగా ఇసుక సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించిన సీఎం జగన్.... ఇసుక పాలసీ అమలు జరుగుతున్న తీరు... ఇసుక సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఎక్కడికక్కడ ఇసుక రీచ్ లు, అలాగే స్టాక్ యార్డులు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఇసుక కొరత ఉంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే ఇసుక అక్రమ రవాణా, మాఫియాను, అవినీతిని అరికట్టడానికి చెక్ పోస్టుల దగ్గర సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం 25 రీచ్ లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, భారీ వర్షాలు వరదల కారణంగా కొత్త రీచ్ లను ఏర్పాటు చేయలేకపోతున్నట్లు అధికారులు వివరించారు. అయితే, ఇసుక విషయంలో రాళ్లేయడానికి చాలామంది చూస్తున్నారన్న జగన్మోహన్‌రెడ్డి.... ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
  'ఛలో ఆత్మకూరు' కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదన్న చంద్రబాబు.. అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆయనను అడ్డుకునేందకు ఉండవల్లిలోని ఆయన ఇంటి బయట పోలీసులు భారీగా మోహరించారు. చంద్రబాబు కారుని బయటకు రాకుండా అడ్డుకున్న పోలీసులు చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన బయటకు రాకుండా గేట్లు వేసి.. గేటు తెరిచేందుకు వీలు లేకుండా బయట నుంచి లావైన తాళ్లతో కట్టారు. గేటు బయట భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. గేటు లోపల కారులో కూర్చొని బయటకు వెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దీంతో చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. టీడీపీ కార్యకర్తలు, నేతలు.. పోలీసులకు, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తనను ఇంట్లో పెట్టి ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని ఆపలేరని అన్నారు. మరికాసేపట్లో ఛలో ఆత్మకూరుకు బయల్దేరుతామని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా ‘ఛలో ఆత్మకూరు’ ఆగదన్నారు. ఎన్నిరోజులు తనను హౌస్ అరెస్ట్ చేస్తారు? అంటూ ప్రభుత్వ వైఖరిని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వ అణిచివేత వైఖరిని ప్రజా సంఘాలు, మేధావులు అందరూ ముక్తకంఠంతో ఖండించాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోరాడుతున్న టీడీపీని అణిచేయాలని చూస్తున్నారన్నారు. ఆత్మకూరు బాధితులను తానే గ్రామానికి తీసుకెళ్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రబాబుతో సహా పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ సర్కార్ భయంతోనే అరెస్ట్ లు చేసి 'ఛలో ఆత్మకూరు' ను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ దౌర్జన్యాలు బయటపడతాయని భయంతోనే ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రూ. 97 కోట్ల ప్రాప‌ర్టీ కొన్న హృతిక్‌!

  ముంబైలోని సంప‌న్నులు అధికంగా నివాసం ఉండే జుహు-వెర్సోవా లింక్ రోడ్‌లో ఉన్న ఓ కొత్త ఆస్తిని బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ హృతిక్ రోష‌న్ కొనుగోలు చేశాడ‌నీ,  దాని విలువ రూ. 97.50 కోట్లనీ ఆదివారం ఓ న్యూస్ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఈ న్యూస్‌ను హృతిక్ తండ్రి రాకేశ్ రోష‌న్ ధ్రువీక‌రించారు. అయితే ఇప్పుడే ఆ ఇంట్లోకి వెళ్లే ఆలోచ‌న హృతిక్‌కు లేద‌ని స‌మాచారం. "త‌ల్లిదండ్రుల‌కు, కుటుంబానికి హృతిక్ బాగా ఎటాచ్డ్‌గా ఉంటాడు. అందుక‌ని ఇప్పుడు కొత్త చోటుకు వెళ్లే ఆలోచ‌న అత‌ను చేయ‌డు. అత‌ను కొన్న రెండు అపార్ట్‌మెంట్ ఫ్లాట్స్ కూడా భ‌విష్య‌త్తులో త‌న ఇద్ద‌రు కొడుకులకు ఇవ్వ‌డం కోసం" అని అతని ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక‌రు చెప్పారు. ఒక‌వేళ త‌ల్లిదండ్రులు క‌నుక త‌న‌తో పాటు వ‌చ్చేట్ల‌యితే కొత్త‌చోటుకు వెళ్లవ‌చ్చని ఆయ‌న తెలిపారు.

కార్తికేయతో సమంత... మాటలయ్యాయి!

  యువ కథానాయకుడు, 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయతో అగ్ర కథానాయిక సమంత నటిస్తుందా? అంటే... 'నటించవచ్చు' అని సమాధానం చెప్పాలి. 'వైల్డ్ డాగ్' చిత్రీకరణ నిమిత్తం కింగ్ అక్కినేని నాగార్జున మనాలి వెళ్లడంతో... ఆదివారం బిగ్ బాస్ ఎపిసోడ్ హోస్ట్ గా ఆయన కోడలు సమంత వచ్చారు. ఇదే షోలో కార్తికేయ కూడా సందడి చేశారు. ఆయన ఓ పాటకు డాన్స్ చేశారు. ఆ తరువాత కార్తికేయ, సమంత మధ్య సినిమాకు సంబంధించిన చర్చ జరిగింది. షో నుండి 'మహర్షి' ఫేమ్ దేవి ఆదివారం ఎలిమినేట్ అయింది. ఆ సమయంలో కార్తికేయ స్టేజి మీద ఉన్నాడు. "దేవికి నీ సినిమాలో ఛాన్స్ ఇవ్వాలి" అని కార్తికేయను సమంత రిక్వెస్ట్ చేశారు. "మహేష్ గారి సినిమాలో ఆ అమ్మాయి నటించింది" అని గుర్తు చేస్తూనే... తన సినిమాలో అవకాశం తప్పకుండా ఇస్తానని మాటిచ్చాడు. పనిలో పనిగా తనతో ఓ సినిమాలో నటించాల్సిందిగా సమంతను రిక్వెస్ట్ చేశాడు. వెంటనే సమంత ఓకే చెప్పేశారు. మనం ముగ్గురం కలిసి ఓ సినిమాలో నటిద్దామని మాటిచ్చేశారు. మాటలు అయితే పూర్తయ్యాయి... దర్శక నిర్మాతలు ఎవరైనా మంచి కథతో వెళ్తే సినిమా కూడా పట్టాలు ఎక్కుతుందని ఆశించవచ్చు. ‌

'మిర్జాపూర్ 1'కి 12 కోట్లు.. 'మిర్జాపూర్ 2'కి 60 కోట్లు!

ఇప్పుడు ఎవ‌రైనా ఈజీగా ఊహించేయ‌వ‌చ్చు.. 'మిర్జాపూర్' సిరీస్‌కు మూడో సీజ‌న్ కూడా వ‌స్తుంద‌ని. ఎందుకంటే 'మిర్జాపూర్' సిరీస్‌ ఇండియాలోని వెబ్ సిరీస్‌ల‌కు సంబంధించిన అన్ని రికార్డుల‌నూ బ్రేక్‌చేసి, ఇండియ‌న్ డిజిట‌ల్ సిరీస్‌ల‌లో అత్య‌ధికులు వీక్షించిన సిరీస్‌గా స‌రికొత్త చ‌రిత్ర‌ను సృష్టించింది! ఒక రాజ‌కీయ హంత‌కుల కుంటుంబంలోని పెద్ద‌గా న‌టించిన పంక‌జ్ త్రిపాఠి ఇంత‌కు ముందెప్పుడూ త‌ను న‌టించిన సినిమాలు లేదా సీరియ‌ల్స్‌లో ఈ త‌ర‌హా క్రేజ్ చూడ‌లేద‌ని చెప్పారు. "మిర్జాపూర్ సీక్వెల్‌కు వ్య‌క్త‌మైన కుతూహ‌లం, ఉత్సాహం నేను ఇంత‌దాకా చూసిన దేనికైనా మించిపోయింది. నేనెక్క‌డికి వెళ్లినా 'మిర్జాపూర్ 2'లో నేను పోషించిన క‌లీన్ భ‌య్యా క్యారెక్ట‌ర్ గురించే అడుగుతున్నారు. నేనింత దాకా పోషించిన ఏ క్యారెక్ట‌ర్‌కూ ఇలాంటి స్పంద‌న‌ను చూడ‌లేదు" అని ఆయ‌న తెలిపారు. 'మిర్జాపూర్‌'లో ఇత‌ర క్యారెక్ట‌ర్ల‌కు వ‌చ్చిన క్రేజ్ కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఇంత‌దాకా మ‌నం చూసి ఉండ‌లేద‌నేది నిజం. ఫ‌స్ట్ సీజ‌న్‌తో పోలిస్తే 'మిర్జాపూర్ 2' బ‌డ్జెట్ ఐదు రెట్లు ఎక్కువ అని అమెజాన్ ప్రైమ్‌కు చెందిన వ‌ర్గాలు వెల్ల‌డించాయి. "ఫ‌స్ట్ సీజ‌న్‌కు చెల్లించిన దానికంటే రెట్టింపు పారితోషికాన్ని ప్ర‌తి ప్ర‌ధాన యాక్ట‌ర్‌కూ చెల్లించారు. క‌లీన్ భ‌య్యా (పంక‌జ్ త్రిపాఠి), గుడ్డు (అలీ ఫ‌జ‌ల్‌), మున్నా (దివ్యేందు త్రిపాఠి) క్యారెక్ట‌ర్లు భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ సినిమాల్లో న‌టించే వెండితెర హీరోల‌కు మించి పాపులారిటీ తెచ్చుకున్నాయి" అని ఆ వ‌ర్గాలు చెప్పాయి. 'మిర్జాపూర్' ఫ‌స్ట్ సీజ‌న్‌కు కేవ‌లం రూ. 12 కోట్లు ఖ‌ర్చ‌వ‌గా, 'మిర్జాపూర్ 2'ను దాదాపు రూ. 60 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. ఇక సీజ‌న్ బ‌డ్జెట్‌ను మ‌రో 30 శాతం దాకా పెంచ‌నున్నార‌ని స‌మాచారం.

అయ్యయ్యో... ఆలియా ఫాలోయర్లు మళ్ళీ తగ్గెనే!

  పాపం ఆలియా భట్! తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 50 మిలియన్ (5 కోట్ల మంది) ఫాలోయర్లు వచ్చారని సంతోషపడుతూ శనివారం నాడు ఒక పోస్ట్ పెట్టారు. అయితే, ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టా ఫాలోయర్లు 49.9 మిలియనే. అంటే... పోస్ట్ పెట్టిన తరువాత సుమారు లక్ష మంది తగ్గారు అన్నమాట. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత అలియాపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆమె నటించిన 'సడక్ 2'కి విపరీతంగా డిస్ లైకులు కొట్టారు. ఆలీయాను ట్రోల్ చేశారు. ఇవన్నీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. 50 మిలియన్ ఫాలోయర్లు వచ్చిన సందర్భంగా పెట్టిన పోస్టులోనూ లైకులు లేదా డిస్ లైకులు, ఫాలో లేదా అన్ ఫాలో, ట్రోల్ లేదా పోల్ మన నుండి మనల్ని వేరు చేయలేవని అలియా పేర్కొన్నారు.

పవన్ సినిమాకి చిరు-మోహన్ బాబు సినిమా టైటిల్?!

  పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నట్టు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అనుబంధ సంస్థ సితార ఎంటెర్టైనెంట్స్ నుండి ప్రకటన వచ్చింది. మలయాళ సినిమా 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కి ఇది రీమేక్ అనే సంగతి తెలిసిందే. మలయాళంలో బిజూ మీనన్ పోషించిన పోలీస్ పాత్రను పవన్ చేయనున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో రానా దగ్గుబాటి నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నిర్మాతలు ఆ సంగతి అధికారికంగా ప్రకటించలేదు. విజయ దశమి సందర్భంగా పవన్ హీరోగా సినిమా నిర్మిస్తున్నట్టు మాత్రమే ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ టీజర్‌లో తమన్ నేపథ్య సంగీతాన్ని నిశితంగా గమనిస్తే... 'బిల్లా - రంగా' సౌండ్ వినబడుతుంది. 'అయ్యప్ప‌నుమ్ కోషియుమ్' రీమేక్ కి 'బిల్లా - రంగా' టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. దాంతో సినిమాలో బిల్లా ఎవరు? రంగా ఎవరు? అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. గతంలో చిరంజీవి, మోహన్ బాబు హీరోలుగా 'బిల్లా రంగా' అని ఓ సినిమా వచ్చింది. అందులో బిల్లా పాత్రలో చిరు, రంగా పాత్రలో మోహన్ బాబు నటించారు. సో... బిల్లా పాత్రలో పవన్ కనిపిస్తారని ఊహించవచ్చు.

మాటే మంత్రం

అనగనగా ఓ అందమైన రాజ్యం. ఆ రాజ్యానికి ఓసారి పెద్ద ఆపద వచ్చింది. శత్రుదేశం వారు తమ రాజుని బంధించి తీసుకుపోయారు. ఆ శత్రుదేశపు కోటలోకి అడుగుపెట్టి, రాజుగారిని విడిపించుకుంటే కానీ... తమ రాజ్యానికి భవిష్యత్తు ఉండదు. కానీ ఎలా ఆ శత్రుదేశం సాధారణమైనది కాదు. ఆ దేశానికి ఉన్న కోటగోడలు ఆకాశాన్ని తాకేంత పెద్దవి. ఆ కోటగోడలను దూకి ఎలాగైనా లోపలకి ప్రవేశించేందుకు ఓ వందమంది యోధులు బయల్దేరారు. అంత పెద్ద కోట గోడని ఎవ్వరూ ఎక్కి రాలేరులే అన్న ధీమాతో శత్రుసైనికులు కోట లోపలే ఏదో పండుగ సంబరాలలో మునిగిపోయి ఉన్నారు. కోటగోడను చేరుకున్న తర్వాత తల పైకెత్తి చూసిన యోధులకు కళ్లు తిరిగిపోయాయి. ‘అబ్బే ఈ గోడని ఎక్కడం మన వల్ల కాదెహే!’ అంటూ ఓ యోధుడు ముందుగానే కూలబడిపోయాడు. మరికొందరు ఓ నాలుగడుగులు పైకెక్కి.... ‘అబ్బే ఈ గోడ నున్నగా జారిపోతోంది. దీన్ని ఎక్కడం అసాధ్యం,’ అంటూ చెట్ల కిందకి చేరుకున్నారు. అలా ఒకొక్కరే కోటగోడను ఎక్కే ప్రయత్నాన్ని విరమించుకోసాగారు. పైగా ఎక్కుతున్నవారితో కూడా ‘ఆ కోటని ఎక్కడం మానవమాత్రులకు సాధ్యం కాదు. ఇంత ఎత్తైన కోట గోడల వల్లే, ఈ రాజ్యం ఇంత గొప్పదయ్యింది,’ అని అరుస్తూ నిరుత్సాహపరచసాగారు.   ఒకవేళ ఆ మాటలు వినిపించుకోకుండా ఎవరన్నా మరికాస్త పైకి ఎక్కే ప్రయత్నం చేస్తే- ‘చెబుతోంది నీకే! బతికుంటే మరో రాజుని ఎన్నుకోవచ్చు. అనవసరంగా ఈ గోడని ఎక్కి నీ ప్రాణాలు కోల్పోవద్దు,’ అంటూ అరిచి గీపెట్టారు. కానీ అదేం విచిత్రమో కానీ, ఒక వ్యక్తి మాత్రం తనకి వినిపించే మాటలను ఏమాత్రం ఖాతరు చేయకుండా క్రమంగా పైకి ఎక్కసాగాడు. అలా ఎక్కే ప్రయత్నంలో, నాలుగడుగులు పైకి ఎక్కితే పది అడుగులు కిందకి జారిపోతున్నాడు. కాళ్లూ చేతులూ దోక్కుపోయి రక్తం ఓడుతున్నాడు. అయినా పట్టువిడవకుండా గోడ ఎక్కుతూనే ఉన్నాడు. అతను మూర్ఖుడనీ, చావుకి సిద్ధపడుతున్నాడనీ కింద ఉన్నవాళ్లు అరుస్తూనే ఉన్నారు. ఎట్టకేళకు ఓ అయిదు గంటలు గడిచిన తర్వాత... ఆ వ్యక్తి కోట గోడను చేరుకున్నాడు. శత్రువుల కంట పడకుండా కోట తలుపులు తీసి తన తోటివారిని లోపలకి తీసుకువెళ్లాడు.   వందమంది యోధులూ కలిసి శత్రుసైనికులను తుదముట్టించారు. తమ రాజుగారిని విడిపించుకుని విజయంతో తమ రాజ్యానికి చేరుకున్నారు. ‘ఎవరు ఎంతగా నిరుత్సాహపరిచినా కూడా ఇతగాడు వెనక్కి తగ్గలేదు ప్రభూ! కోట గోడని ఎక్కేదాకి తన ప్రయత్నాన్ని విరమించలేదు,’ అంటూ ఆ ఒక్క వీరుడినీ రాజుగారికి పరిచయం చేశాడు సేనాధిపతి. తన ముందు నిలబడిన ఆ వీరుని చూసిన రాజుగారు తెగ ఆశ్చర్యపోయారు. కారణం... అతను చెవిటివాడు. ‘ఒకోసారి మనల్ని నిరుత్సాహపరిచే మాటలు చెవిన పడకపోవడమే మంచిది మహారాజా! కోటగోడను ఎవ్వరూ ఎక్కలేరంటూ తోటివారంతా అరిచిన అరుపులు ఇతనికి వినపడకపోవడం వల్లే, తన లక్ష్యాన్ని చేరుకోగలిగాడు. ఒకోసారి మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇలా చెవిటివాడిలాగా ఇతరుల మాటలను వినిపించుకోకపోవడమే మంచిదేమో!’ అన్నాడు సేనాధిపతి. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

నిబ్బరంగా ఉండకపోతే

అది ఓ పెద్ద పడవ. ఆ పడవలో వందమందికి పైగా ప్రయాణికులు పయనిస్తున్నారు. అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమైపోయింది. చూస్తూ చూస్తుండగానే చిరుజల్లు మొదలైంది. ఆ చిరుజల్లు కాస్తా క్షణాల్లో పెనుతుపానుగా మారిపోయింది. పడవలోని ప్రయాణికులంతా బిక్కుబిక్కుమంటూ ఆ పరిస్థితిని గమనిస్తున్నారు. తాము ఎలాగైనా సురక్షితంగా బయటపడితే బాగుండురా భగవంతుడా! అని ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థిస్తున్నారు. కానీ ఒక ప్రయాణికుడు మాత్రం ఈ పరిస్థితిని తట్టుకోలేకపోయాడు. అరుపులు, ఏడుపులు, శాపనార్థాలతో గోల పెట్టడం మొదలుపెట్టాడు. అతను అలా అటూ ఇటూ కదలడం వల్ల పడవకి మరింత ప్రమాదం అని ఎందరు చెప్పినా ఊరుకోలేదు. తన పెడబొబ్బలకి పసిపిల్లలు భయపడతారని వారించినా వెనక్కి తగ్గలేదు.   పడవ యజమానికి ఏం చేయాలో తోచలేదు. ఆ ఒక్క ప్రయాణికుడు స్థిమితంగా లేకపోవడం వల్ల ప్రయాణికులంతా భయంలో, ప్రమాదంలో పడుతున్నారని అతనికి తెలుసు. కానీ ఏం చేయడం? నయానా భయానా ఎంతగా వారించేందుకు ప్రయత్నించినా ఆ కంగారు ప్రయాణికుడు మాత్రం తన గొంతుని తగ్గించడంలేదు.   ఇదంతా గమనిస్తున్న ఓ స్వామిజీ నిదానంగా పడవ యజమాని దగ్గరకు వెళ్లాడు. ‘మీరు కనుక అనుమతిస్తే, నేను ఆ ప్రయాణికుడిని శాంతింపచేయగలను,’ అని సూచించాడు. యజమాని సరే అనగానే పడవ నడిపేవారి వద్దకు వెళ్లి, వారి చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే పడవ నడిపేవారంతా కలసి.... గగ్గోల పెడుతున్న ప్రయాణికుడిని ఒక్కసారిగా నీటిలో పడేశారు. దాంతో ఆ ప్రయాణికుడు చేతులు కాళ్లు కొట్టుకుంటూ, నడిసముద్రంలో ప్రాణాల కోసం అర్తనాదాలు చేయడం మొదలుపెట్టాడు. జరుగుతున్న తంతుని తోటి ప్రయాణికులంతా దిగ్భ్రాంతితో గమనించసాగారు. ఇలా ఓ రెండు నిమిషాలు గడిచిన తరువాత, ఆ ప్రయాణికుడిని పడవలోకి చేర్చమని అడిగారు స్వామీజీ.   ప్రయాణికుడిని తిరిగి పడవలోకి చేర్చగానే అతను ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాడు. అప్పటివరకూ కేకలు వేసినవాడల్లా నిస్తేజంగా ఉండిపోయాడు. అతడిని చూస్తూ స్వామిజీ చిరునవ్వుతో ‘మనం ఉన్న పరిస్థితి ఎంత సురక్షితంగా ఉందో అన్న విషయం, అంతకంటే దారుణమైన ప్రమాదంలోకి చేరుకుంటే కానీ తెలియదు. కాస్తంత మబ్బులు కమ్ముకోగానే నువ్వు భయపడిపోయావు. కానీ ఇంత నడిసముద్రంలో నీకంటూ నీడగా ఓ పడవ ఉందనీ, నిన్ను కాపాడేందుకు వందల మంది మనుషులు ఉన్నారనీ మర్చిపోయావు. ఒక్క గంట గడిస్తే చాలు తీరాన్ని చేరుకుంటానని కూడా నీకు తట్టలేదు. నీటిలో పడగానే, ఈ నావే నీకు ఆధారం అన్న విషయం నీకు గుర్తుకువచ్చింది. ఇంతకుముందు ఆ విచక్షణ లేకపోవడం వల్ల నీతోపాటు తోటి ప్రయాణికులను కూడా భయపెట్టేశావు. పడవ మునిగిపోయే పరిస్థితులు కల్పించావు. నీ పట్ల నమ్మకం, నువ్వున్న పరిస్థితుల మీద కృతజ్ఞత లేకపోతే... నువ్వు ఏ తీరాన్నీ చేరుకోలేవు,’ అంటూ చెప్పుకొచ్చారు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

అందమైన డ్రాయింగ్ రూం కోసం

  ఇంట్లోకి అడుగుపెట్టినవారు ఒక్క నిమిషం మీ డ్రాయింగ్‌ రూంని చూస్తూ ఉండిపోవాలనీ, వారి కళ్లో మీ అభిరుచి పట్ల అభినందన కనిపించాలనీ ఎవరికి మాత్రం అనిపించదు. అతిథుల సంగతి పక్కన పెడితే మనది అనుకునే ఇల్లు అందంగా కనిపించాలన్న ఆశ ఎవరికి మాత్రం ఉండదు. కాకపోతే ఇందుకు చాలానే అవాంతరాలు కనిపిస్తాయి. ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టడం ఇష్టం లేకపోవడం, ఇరుకైన గదులు, అద్దె ఇల్లులాంటి సమస్యలతో అనుకున్నా ఇంటిని అలంకరించుకోలేకపోతుంటారు. అందుకోసమే ఈ చిన్న చిట్కాలు...     మామూలు వస్తువులతోనే అలంకరణకు ఎక్కువ అవకాశం లేనప్పుడు నిత్యం వాడుకునే వస్తువులనే మరింత కళాత్మకంగా కనిపించేవి ఎన్నుకొంటే సరి. బట్టలు తగించే కొక్కేలు, కర్టెన్ రాడ్స్, పెన్‌స్టాండులు, గడియారాలు, నైట్‌ ల్యాంప్స్ వంటివి కొంచెం విభిన్నమైనవి ఎంచుకొని చూడండి.     వాల్‌ స్టికర్స్‌ ఆన్‌లైన్‌ షాపింగ్ పుణ్యమా అని ఇప్పుడు వాల్‌స్టికర్స్‌ అందరికీ అందుబాటులోనే దొరుకుతున్నాయి. వీటి ధరలు కూడా మరీ అంత ఎక్కువగా ఉండవు. కాకపోతే ఎలాంటి బొమ్మని ఎంచుకోవాలి? అది ఎంత పరిమాణంలో ఉండాలి? అన్న విషయాలను ఒకటికి రెండుసార్లు తరచి చూసుకోవాలి. గోడ రంగుని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మనం ఆర్డర్‌ చేసిన వాల్ స్టికర్‌ ఒకే షీట్‌ మీద వస్తోందా లేకపోతే వేర్వేరు స్టికర్స్‌ని అసెంబుల్‌ చేసుకోవాలా అన్న విషయాన్ని కూడా గమనించుకోవాలి.     చిన్న చిన్న బొమ్మలతో ఇంట్లో చిన్న బొమ్మలు చాలానే పేరుకుంటాయి. చాక్లెట్లతో పాటుగా వచ్చినవో, చైనా బజార్లలో కొనుక్కున్నవో, కీచెయిన్లు ఊడిపోయినవో మిగిలిపోయిన బొమ్మలను అక్కడక్కడా అతికించవచ్చు. ఫ్రిజ్‌ తలుపులకీ, కిటికీ చెక్కలకీ, స్విచ్‌ బోర్డులకీ డబల్ స్టికర్‌తో అంటించి ఎప్పుడు కావాలంటే అప్పుడు తొలగించవచ్చు.     పోస్టర్స్‌ గృహాలంకరణకు సంబంధించి అతి చవకగా లభించేవి వాల్‌ పోస్టర్లే. కాకపోతే చవగ్గా దొరుకుతోంది కదా అని ఇల్లంతా నింపితే మాత్రం వీటితో అసలుకే మోసం వస్తుంది. మరీ భారీ పరిమాణంలో ఉండే పోస్టర్లు ఒకోసారి ఇల్లు ఇరుకుగా ఉన్న భావన కలిగిస్తాయి. కాబట్టి కంటికి నదురుగా, మరీ ఆడంబరంగా తోచని పోస్టర్లని ఎన్నుకోవాలి. వీటిని సెలోఫిన్‌ టేప్‌తో అతికిస్తే త్వరగా ఊడిపోవడమే కాకుండా, గోడ మీద కూడా మరకని మిగులుస్తాయి. ఇలాంటి సందర్భాలలో మెడికల్‌ షాపుల్లో దొరికే తెల్లటి సర్జికల్‌ టేపుని ఉపయోగిస్తే, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇటు గోడకీ, అటు పోస్టరుకీ నష్టం కలగకుండా తీసివేయవచ్చు.     ఉపాయం ఉంటే ఇల్లు మనది కాకపోవచ్చు, మేకులు కొట్టడం ఇష్టం లేకపోవచ్చు, గోడకి ఏదన్నా అంటించడానికీ మనస్కరించకపోవచ్చు... అయినా కూడా కాస్త శ్రద్ధ పెడితే గదిని అలంకరించేందుకు చాలా ఉపాయాలు తడతాయి. ఫ్రిజ్‌ మీద ఒక బొమ్మల కొలువు తీరుతుంది, బెడ్‌ల్యాంప్‌ నుంచి ఒక అందమైన బొమ్మ వేళ్లాడుతుంది, టీవీ కింద ఉన్న కేబుల్ బాక్స్‌ మీద ఒక టెడ్డీ బేర్‌ కూర్చుంటుంది... కాస్తంత ఉపాయం ఉంటే గది మొత్తం అందంగా మారిపోతుంది. కావాలంటే ఒక్కసారి మీ డ్రాయింగ్ రూమ్‌ని పరిశీలించి చూడండి. - నిర్జర.

బీజేపీలో వ్యాక్సిన్ సెగ! దిద్దుబాటు చర్యల్లో మోడీ, షా

ఉచిత కరోనా వ్యాక్సిన్  హామీ కమలంలో కలకలం రేపుతుందా? బీహార్ ఎన్నికల మేనిఫెస్టో పై బీజేపీలోనే విభేదాలొస్తున్నాయా?. అంటే అవుననే చెప్పాల్సి వస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో  కరోనా వ్యాక్సిన్ ను వాడుకోవడంపై బీజేపీలోని కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. బీహార్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఇచ్చిన ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీతో  ఇతర రాష్ట్రాల్లో బీజేపీకి ఇబ్బంది వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇది విపక్షాలకు వరంగా మారిందని కొందరు కమలనాధులుచెబుతున్నారు. బీహార్ నేతల తీరు, మేనిఫెస్టో కూర్పుపై వారు మండిపడుతున్నారని సమాచారం.    ఫ్రీ కరోనా వ్యాక్సిన్ హామీ తో తమకు డ్యామేజీ కల్గిందని బీజేపీ పెద్దలు గుర్తించినట్లు కనిపిస్తోంది. నరేంద్ర మోడీ సర్కార్ దిద్దుబాటు చర్యలకు కూడా దిగింది. దేశ ప్రజలందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్ ను ఇస్తామని కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి చెప్పారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారని తెలిపారు. ఒక్కో వ్యాక్సిన్ కు రూ. 500 వరకు ఖర్చవుతుందని... ఈ మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ పై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని సారంగి ఆరోపించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం కరోనాను వాడుకోవాల్సిన అవరసం తమకు లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.    దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా ఉంది. కరోనా బాధితుల సంఖ్య 80 లక్షలకు చేరింది. అయితే గత నెల రోజులతో పోలిస్తే.. ప్రస్తుతం రోజువారి కేసుల సంఖ్య కాస్త తగ్గింది. అయినా జనాల్లో మాత్రం వైరస్ భయం పోలేదు. ఇప్పటికి చాలా కంపెనీలు తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోం చేపిస్తున్నాయి. వ్యాక్సిన్ వచ్చేవరకు  ఈ పరిస్థితి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ ప్రజలంతా  కరోనా నివారణ టీకా ఎప్పుడొస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రజా జీవితంలో కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు అత్యంత కీలక అంశంగా మారింది. ఇలాంటి తరుణంలో కరోనా వ్యాక్సిన్ పై బీజేపీ చేసిన ప్రకటన ఇప్పుడా పార్టీని ఇబ్బందుల్లో పడేసినట్లు భావిస్తున్నారు.    బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కరోనా వ్యాక్సిన్ ను బీజేపీ తన మేనిఫెస్టోలో చేర్చడం దుమారం రేపుతోంది. కరోనా వ్యాక్సిన్  హామీ ఇచ్చిన బీజేపీపై దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామని బీజేపీ చెప్పడంపై.. విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇతర రాష్ట్రాల ప్రజలు ఏం పాపం చేశారని ప్రశ్నిస్తున్నాయి, ఎన్నికలు ఉంటే తప్ప ప్రజలకు ఏమీ చేయరా? అంటూ విరుచుకుపడుతున్నారు ప్రతిపక్షాల నేతలు. కరోనా మహమ్మారిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని దుయ్యబడుతున్నారు. ఇతర రాష్ట్రాల ప్రజలు బంగ్లాదేశ్ నుంచి వచ్చారా? అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నిలదీశారు.    కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందన్న దానిపై ఆరోగ్య సంస్థల దగ్గర క్లారిటీ లేదు. ప్రపంచ వ్యాప్తంగా టీకా కోసం ముమ్మరంగా పరిశోధనలు జరుగుతున్నా.. వ్యాక్సిన్ కచ్చితంగా ఎప్పుడు వస్తుందన్న దానిపై క్లారిటీగా చెప్పడం లేదు. మరోవైపు కొన్ని సంస్థలు మాత్రం రెండేళ్ల వరకు వ్యాక్సిన్ రాకపోవచ్చని చెబుతున్నాయి. మనదేశంలోని ప్రతిష్టాత్మక సంస్థ అయిన సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఐసీఎంఆర్ కూడా వ్యాక్సిన్ పై పూర్తి క్లారిటీ ఇవ్వడం లేదు. వ్యాక్సిన్ పై ఫార్మా సంస్థలకే క్లారిటీ లేని సమయంలో వ్యాక్సిన్ ను అందరికి ఉచితంగా ఇస్తామని చెప్పడం తీవ్ర విమర్శల పాలైంది. కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కమలనాధులను కడిగి పారేస్తున్నారు.    మొత్తం బీహార్ అసెంబ్లీ మేనిఫెస్టోలో ఫ్రీ కరోనా వ్యాక్సిన్ హామీ ఇచ్చిన బీజేపీ.. జనాల్లో చులకన అయ్యిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కొందరు నేతల అత్యాత్సాహం వల్లే తాము ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చిందని బీజేపీలోనూ చర్చ జరుగుతుందట. వ్యాక్సిన్ హామీతో విపక్షాలకు అనవసరంగా అస్త్రం ఇచ్చినట్లైందని కొందరు కమలనాధులు ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు.

శ్రీశైలంలో పవర్ జనరేషన్ ఎప్పుడు! అసలు జరిగిన నష్టమెంత? 

కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే వందలాది టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి. శ్రీశైలం నుంచి ఇంకా నీటిని దిగువకు వదులుతూనే ఉన్నారు. అయితే వరద భారీగా వస్తున్న శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రంలో పవర్ జనరేషన్ చేయలేకపోతోంది తెలంగాణ సర్కార్. ప్లాంట్ లో ఆగస్టు 20న భారీ ప్రమాదం జరిగింది. అయితే రెండు నెలలు కావస్తున్నా పవర్ ప్లాంట్ లో మరమ్మత్తులు మాత్రం పూర్తి కాలేదు. దీంతో పవర్ జనరేషన్ సాధ్యం కావడం లేదు. పవర్ ప్లాంట్ లో ప్రమాదంపై గప్ చుప్ గా వ్యవహరిస్తున్న తెలంగాణ సర్కార్.. ప్రమాద తీవ్రత ఎంతన్నది ఇప్పటికి చెప్పడం లేదు.    ప్రమాదం తర్వాత ప్లాంట్ ను పరిశీలించిన జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీలు.. నెలరోజుల్లోపే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని చెప్పారు. మరమత్తులు జరుగుతున్నాయంటూ ఎవరిని లోపలికి అనుమతించ లేదు. పవర్ ప్లాంట్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన  విపక్ష నేతలను అడ్డుకున్నారు. ఇప్పుడు ప్రమాదం జరిగి రెండు నెలలు పూర్తయ్యాయి. కాని  పవర్ జనరేషన్ మాత్రం మొదలు కాలేదు. దీంతో ప్రమాదంలో పవర్ ప్లాంట్ లో భారీగానే నష్టం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవర్ ప్లాంట్ ప్రమాదంపై ప్రభుత్వం నియమించిన కమిటీలు, సీఐడీ నివేదికలు ఇంకా రాకపోవడం ఈ అనుమానాలకు బలాన్నిస్తున్నాయి.    ఆగస్టు 20 అర్ధరాత్రి శ్రీశైలం ఎడమ గట్టు పవర్‌‌ ప్లాంట్‌‌లో ప్రమాదం జరిగింది. ప్లాంట్‌‌లో 150 మెగావాట్‌‌ల కెపాసిటీ ఉన్న ఆరు యూనిట్లలో నాలుగు యూనిట్లు భారీగా దెబ్బతిన్నాయి. రెండు యూనిట్లు బాగానే ఉన్నాయని అధికారులు చెప్పినా.. వాటిలోనూ విద్యుత్ ఉత్పత్తి ఇంకా షురూ కాలేదు. గత రెండు నెలలుగా నీళ్లు తోడడానికి, క్లీన్‌‌ చేయడానికే ఎక్కువ సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఓసారి స్టార్ట్ చేయాలని ప్రయత్నించినా... మళ్లీ షార్ట్‌‌ సర్క్యూట్‌‌ అయినట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం దాన్ని మాక్‌‌ డ్రిల్‌‌ అని చెప్పి కప్పి పుచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.  రెండు యూనిట్లను ఈ నెల15న స్టార్ట్‌‌ చేయాలని భావించారు. కానీ లోడ్‌‌ తీసుకోవడం లేదని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిసింది.     పవర్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంపై దర్యాప్తును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.  జెన్ కో ,  టీఎస్‌‌ఎస్‌‌పీడీసీఎల్‌‌ సీఎండీలు, ట్రాన్స్‌‌కో జెఎండీ శ్రీనివాస్‌‌రావుతో పాటు మరో ముగ్గురు డైరెక్టర్లతో ప్రత్యేక టెక్నికల్‌‌ కమిటీనీ కూడా వేసింది. ఈ సంఘటన ప్రమాదమా? ఏదైనా కుట్రకోణమా? అనేది తేల్చేందుకు సీఐడీ టీమ్‌‌ ప్రయత్నం చేసినట్లు తెలిసింది. కుట్రకోణం లేదని ప్రమాదమనే సీఐడీ నివేదిక రూపొందించినట్లు సమాచారం.  ప్రమాదం ఎలా జరిగిందనేది తేల్చేది మాత్రం ఎక్స్‌‌పర్ట్‌‌ కమిటీనే. గత నెలలో రెండు రోజుల పాటు శ్రీశైలంలో తిష్టవేసి ఎక్స్‌‌పర్ట్‌‌ కమిటీ దర్యాప్తు చేపట్టింది. టెక్నికల్ కమిటీ శ్రీశైలం వెళ్లి కూడా ఇప్పటికే నెల కావస్తోంది. అయినా రిపోర్టు అందించలేదు. సీఎండీకీ, ఇద్దరు డైరెక్టర్లకు కరోనా రావడంతో నివేదిక రూపొందించడంలో జాప్యం జరిగినట్లు మంత్రి జగదీష్‌‌రెడ్డి కౌన్సిల్‌‌ సమావేశంలో వెల్లడించారు. అయితే రెండు రిపోర్టులు వేర్వేరుగా వస్తే సమస్య అని రెండింటినీ పరిశీలించి నివేదిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే రిపోర్టులు ఇవ్వడానికి ఇంకా టైమ్ పడుతుందని సమాచారం. మొత్తంగా శ్రీశైలం ప్రమాదాన్ని టెక్నికల్‌‌ ప్రాబ్లమ్‌‌గా తేల్చే పనిలో ఉన్నట్లు తెలిసింది.   శ్రీశైలం పవర్‌‌ప్లాంట్ ప్రమాదంపై విద్యుత్‌‌ వర్గాలు మొదటినుంచీ రహస్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రమాదం ఘటన బయటపడకుండా ప్రయత్నం చేసినట్లు తెలిసింది. వీడియోలు బయటికి రాకపోతే అసలు విషయాన్నే బయటికి రాకుండా చూసేవాళ్లన్న అనుమానాలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే.. రెస్క్యూ బృందాలను పంపకుండా మంత్రి, సీఎండీ స్వయంగా వెళ్లడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. వీరిద్దరూ తెల్లవారుజామునే ప్లాంటుకు చేరుకోగా, రెస్క్యూ బృందాలు మాత్రం మరునాడు మధ్యాహ్నం అక్కడికి చేరుకున్నాయి. ఆ తర్వాత ప్రైవేట్ సిబ్బంది ఉన్న టైంలో షార్ట్ సర్క్యూట్ జరిగితే దాన్ని మాక్ డ్రిల్ అని కప్పిపుచ్చారన్న విమర్శలు వచ్చాయి. సొంత సిబ్బంది ఉన్నప్పడు చేయాల్సిన మాక్‌‌ డ్రిల్‌‌ ప్రైవేటు సిబ్బంది ఉన్నప్పుడు ఎలా చేస్తారన్న అనుమానాలు తలెత్తాయి. మొత్తంగా రెండు నెలలైనా  పవర్ ప్లాంట్ ఘటనపై మిస్టరీ అలాగే ఉండిపోవడంతో ప్రజల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి.

హోదా లేదు.. నిధులివ్వరు! ఏపీపై ఎందుకింత కక్ష?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంటే ఆ పార్టీలకు పడనట్లుంది. అందుకే కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్ర ప్రజలను మోసం చేస్తున్నాయి. రాష్ట్ర భవిష్యత్తునే అంధకారంలోకి నెడుతున్నాయి. ఇది ప్రస్తుతం సగటు ఆంధ్రప్రదేశ్ వాసి మదిలో తొలస్తున్న ప్రశ్న. కేంద్రంలో అధికారం అనుభవించిన కాంగ్రెస్, బీజేపీలు ఏపీతో ఆటలాడుకుంటున్నాయనే ఆగ్రహం ఏపీ జనాల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ నట్టేట ముంచితే... గత అరేండ్లుగా బీజేపీ తమను దగా చేస్తుందనే ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి. రాష్ట్ర విభజన నుంచి తాజాగా పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం తగ్గింపు వరకు ఈ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్ కు మోసం చేస్తూనే ఉన్నాయని జనాలు ఫైరవుతున్నారు.         ప్రత్యేక హోదా విషయంలో ఈ రెండు పార్టీలు పాపం మూటగట్టుకున్నాయి. విభజన సమయంలో  ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన అప్పటి  కాంగ్రెస్ ప్రభుత్వం.. విభజన చట్టంలో మాత్రం పెట్టలేదు.ఇక హోదా సంగతి ఎవరికి పెద్దగా తెలియనప్పుడే.. ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పింది బీజేపీ. అధికారంలోకి వచ్చాకా ప్లేటు ఫిరాయించింది . విభజన చట్టంలో పెట్టలేదంటూ కాంగ్రెస్ పై నెపం వేస్తూ.. హోదా ఇవ్వడం కుదరదని చెప్పింది. హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామని ప్రకటించి దాన్ని కూడా పక్కనపట్టేసింది పువ్వు పార్టీ. నీతి ఆయోగ్ పేరుతో రూల్స్ మార్చి.. ప్యాకేజీ కాదు  స్పెషల్ పర్పస్ వెహికల్ కింద  అప్పులాగా  తీసుకోవాలని మాట మార్చింది.ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారం మోపుతోంది.     2014 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ఢిల్లీని తలదన్నే రాజధానిని ఇస్తామని హామీ ఇచ్చారు బీజేపీ పెద్దలు. అమరావతి  శంకుస్థాపనకు వచ్చిన కేంద్ర పాలకులు అదే మాట చెప్పారు. తర్వాత కేపిటల్ ఊసే మర్చిపోయారు. ఇప్పుడు అమరావతిని మూడు ముక్కలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నా కాషాయ పార్టీ నేతలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఏపీ రాజధాని  విషయంలో బీజేపీ తీరు మరీ దారుణంగా ఉంటోంది. ఏపీ బీజేపీ నేతలు అమరావతికి మద్దతుగా మాట్లాడుతుండగా.. కేంద్రం మాత్రం తమ పరిధిలోనిది కాదని, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని కోర్టులో ఏకంగా అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో అసలు రాజధాని విషయంలో బీజేపీ స్టాండో ఏంటో చెప్పాలనే డిమాండ్లు వస్తున్నాయి. ద్వంద్వ విధానాలతో ఏపీ జనాలను మోసం చేయవద్దని కొందరు హెచ్చరిస్తున్నారు. ఇక  అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఏపీకి అండగా ఉంటామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఇప్పుడు కనీసం స్పందించకపోవడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.    జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం నిర్మాణం పూర్తికి  అన్ని విధాలా సహకరిస్తామన్న మోడీ సర్కార్.. ఇప్పుడు దాని నిధుల్లో కోతలు పెట్టడం కలకలం రేపుతోంది. ఏపీకి జీవనాడిని చెప్పుకునే పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్లక్ష్యం చేయడంపై ఏపీ ప్రజలు ఫైరవుతున్నారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి .. కేంద్ర సంస్థల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చేసి.. చాలా ఇచ్చేశామని చెప్పుకున్నారే గాని.. ఇవ్వాల్సినవి ఇవ్వలేదనే చర్చ జరుగుతోంది.  కేంద్ర మంత్రిగా వెంకయ్య నాయుడు ఉన్నప్పుడు కొద్దొ గొప్పో నిధులు వచ్చాయని .. ఆయన కేంద్ర కేబినెట్ నుంచి వెళ్లాక ఏపీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురయిందని ఏపీ ప్రజలు చెబుతున్నారు. జాతీయ రహదారులు, రైళ్లకు జనరల్ గా ఏటా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఏపీకి ఇచ్చిన డబ్బులను  లెక్కేసి..  ఇంతిచ్చాం అంతిచ్చామని ప్రచారం చేసుకుంటున్నారు కాని ఏపీకి ప్రత్యేకంగా   మోడీ  సర్కార్ ఏమిచ్చిందో చెప్పాలనే డిమాండ్లు జనాల నుంచి వస్తున్నాయి.    అంతర్వేది, దుర్గగుడి లాంటి మతపరమైన అంశాలొచ్చినప్పుడు రాజకీయంగా లాభపడటానికి చూసుకున్నారని... తెర వెనక మంతనాలతో వాటిని ముగించేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో రోజు ఒక్కో స్ట్రాటజీ తీసుకుంటూ బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఆటలాడుతుందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. రాజకీయంగా తెలుగుదేశాన్ని దెబ్బకొట్టాలనుకున్నప్పుడు వైసీపీకి కోఆపరేట్ చేయడం.. వైసీపీకి కూడా చెక్ పెట్టాలనుకుంటే మరోలా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.దీంతో బీజేపీ తీరుపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ కు ఎందుకిలా అన్యాయం చేస్తున్నారోనని సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. ఏపీ అంటే ఎందుకంత కసే తమకు అర్ధం కావడం లేదని ప్రజలు ఆందోళన పడుతున్నారు.

ఇవి తింటే క్యాన్సర్‌ని ఆహ్వానించినట్టే!

చిన్నా పెద్దా ధనిక పేదా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ కనికరం లేకుండా కబళిస్తోన్న వ్యాధి క్యాన్సర్. దీన్ని అరికట్టడం చేతకాక ప్రపంచం దేశాలన్నీ పరిశోధనల్లో మునిగి తేలుతున్నాయి. ఎందుకు వస్తుందో ఎవరికి వస్తుందో ఎలా వస్తుందో అర్థం కాని మహమ్మారి క్యాన్సర్. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాల జోకిలి పోకుండా ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చు అన్నది మాత్రం సత్యం.    బిస్కట్లు, కేకులు వంటి వాటి దగ్గర్నుంచి బొబ్బట్లు వంటి సంప్రదాయ వంటకాలన్నిటికీ ప్రధాన దినుసు మైదాపిండి. ఇది పాంక్రియాస్ మీద తీవ్ర ఒత్తిడి కలిగించి ఇన్సులిన్ లెవెల్స్ ని అస్తవ్యస్తం చేస్తుంది. అదే విధంగా చక్కెర కూడా ఎక్కువ తీసుకోకూడదు. స్థూలకాయం, మధుమేహాలకు కారణమయ్యే చక్కెర పాంక్రియాస్, కాలేయాలతో పాటు జీర్ణవ్యవస్థను కూడా పాడు చేస్తుంది. అందుకే పండ్లు, తేనె వంటి వాటి ద్వారా అందే సహజ చక్కెర తప్ప నేరుగా చక్కెరను తీసుకోవడం మంచిది కాదు.    పాలు తాగితే ఎముకలు గట్టి పడతాయని అందరూ అంటారు. అయితే వయసు పెరిగేకొద్దీ పాలలో ఉండే ల్యాక్టోజ్ ను అరాయించుకునే శక్తి తగ్గిపోతుంది. కాబట్టి వయసు పెరిగేకొద్దీ పాలు మోతాదు దాటి తాగడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ప్యాట్రిక్ హాఫార్డ్.    వీటితో పాటు సరిగ్గా ఉడికించకుండా క్షణాల్లో తయారుచేసే జంక్ ఫుడ్... చక్కెరతో పాటు కెమికల్స్ ఎక్కువగా ఉండే సోడాలు...  మైదా, పాలు, చక్కెర కలిపి తయారు చేసే డోనట్స్ కూడా  ఎంతో కీడు చేస్తాయి. ఒకేసారి పది చెంచాల చక్కెరని కడుపులోకి పంపించే ఏ ఆహార పదార్థమైనా ప్రమాదకరమేనంటారు న్యూయార్క్ టైమ్స్ సృష్టికర్త, ప్రముఖ వైద్యులు అయిన డాక్టర్ జోసెఫ్ మెర్కోలా.   ఇక సోడియం, నైట్రేట్ ఎక్కువగా ఉండే మాంస పదార్థాలని ముట్టవద్దనేది అమెరికన్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ సూచన. ఉప్పు ఎక్కువ వేసి, నూనెలో వేయించే బంగాళాదుంప చిప్స్ జోలికి పోవద్దంటున్నారు మసాచుసెట్స్ లోని క్లార్క్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ డేల్ హ్యాటిస్. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం తరచుగా తీసుకుంటే ఉదర క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని 2005లొ క్యాన్సర్ సైన్స్ మ్యాగజైన్ చేసిన పరిశోధనలో సైతం వెల్లడైంది. అదే విధంగా క్యాన్స్ లో నిల్వ చేసి అమ్మే ఆహార పదార్థాలు,  మార్గరీన్ చీజ్ వంటివి కూడా ఎక్కువ తీసుకోకూడదనేది నిపుణుల సూచన.   కాబట్టి వీలైనంత వరకూ వీటి జోలికి పోకుండా జాగ్రత్తపడండి. క్యాన్సర్ ని మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా చూసుకోండి.  - sameeranj

కడుపులో మంటగా ఉంటే....?

చాలామంది ఉన్నట్లుండి కడుపులో మంట పుడుతోందంటూ కుర్చీలో అలాగే వాలిపోతుంటారు. దీనికి అసిడిటీయే కారణం. అసిడిటీ రావడానికి కారణాలు ఏమిటి అని చూస్తే... 1. సరిగా నిద్ర లేకపోవడం. 2. ఆహారాన్ని త్వరగా భుజించడం. సరిగా నమిలి తినకపోవడం. 3. ఆహారంలో మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం ఉండటం. 4. ధూమపానం, మద్యపానం సేవిస్తుండటం. 5. ఉండాల్సిన బరువుకన్నా ఎక్కువ బరువు ఉండటం. రుచిగా ఉందని ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవటం మూలాన జీర్ణక్రియ సరిగా జరుగదు. దీంతో ఉదరం, గుండెల్లో మంట ప్రారంభమౌతుంది. 6. సమయానికి భోజనం చేయకపోవడం వంటివి ప్రధాన కారణాలు. అసిడిటీ మరియు గుండెల్లో మంటను అదుపు చేసేందుకు కొన్ని చిట్కాలు : 1. అసిడిటీతో బాధపడే వారికి అరటిపండు అత్యుత్తమమైన ఔషధం. ప్రతిరోజు అరటిపండును ఆహారంగా తీసుకుంటుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. 2. ఆహారంలో వీలైనంత మేరకు వేపుడు పదార్థాలను తగ్గించాలి. దీంతోపాటు ఊరగాయ, మసాలా దినుసులతో కూడిన ఆహారం, చాక్లెట్లను తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. 3. యాపిల్ పండు రసం, వెనిగర్, తేనెను తగినంత నీటిలో కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని భోజనానికి ముందు సేవించి భోజనం తీసుకుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది 4. పచ్చి కూరగాయలతో తయారుచేసిన సలాడ్‌ను తగు మోతాదులో తీసుకోండి. 5. తీసుకునే ఆహారంలో భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండకండి. దీంతో పొట్టలో గ్యాస్ పేరుకుపోయే ప్రమాదం ఉంది. 6. ప్రతిరోజు ఎనిమిది గ్లాసుల నీటిని సేవిచేందుకు ప్రయత్నించండి. భోజనం తీసుకున్న వెంటనే నిద్రకు ఉపక్రమించకండి. 7. మద్యపానం, ధూమపానం అలవాటుంటే వాటిని మానేసేందుకు ప్రయత్నించండి. 8. తులసి ఆకులను ఉదయంపూట తీసుకుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది.

కోకాకోలా మాత్రమే తాగితే?

కూల్ డ్రింక్స్ లో కోకాకోలా పేరు తెలియనివారు బహుశ ఉండరేమో. ఎందుకంటే ప్రపంచంలోని ఏ మూలనైనా ఇది దొరుకుంది. రీప్రెష్ ది వరల్డ్ అన్న ట్యాగ్ తో ఇది వరల్డ్ మొత్తం ఆక్రమించేసింది. మొట్టమొదటి కోకాకోలాను అట్లాంటాలో 1886 లో డాక్టర్ జాన్ పెంబర్టన్ ప్రారంభించారు.  ఐదువందలకు పైగా బ్రాండ్లతో అన్ని దేశాల్లో లభిస్తోంది. ఈ కంపెనీలో దాదాపు ఏడులక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రపంచజనాభాలో అత్యధికమంది తాగే కూల్ డ్రింక్ఇదేనేమో..!  సరదాగా అప్పడప్పుడు కాకుండా రోజూ కోకాకోలానే తాగితే ఏం జరుగుతుంది...! కోకాకోలా రుచికోసం, నిల్వ కోసం దాని ఎన్నో పదార్థాలను కలుపుతారు. ఇది తాగిన తర్వాత రీప్రెష్ అనిపించడానికి కారణం వాటిలో ఉండే పదార్థాలే. మరి రోజూ కోకాకోలానే జీవితాంతం తాగితే ఏం అవుతుంది. .? కోకాకోలా  శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?  దంతాలను ఏమి చేస్తుంది..?  నీళ్ళకి బదులుగా కోకాకోలాను తాగితే శరీరానికి కావల్సిన పోషకాలను అది ఎలా భర్తీచేస్తుంది.? ఇలా అనేక అనుమానాలు వస్తాయి కదా....! వాటిని తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నించారు. మోనాకోలో ఒక మహిళ 16 ఏండ్లుగా నీళ్లకు బదులుగా నేరుగా కోకాకోలానే తాగింది. మరీ ఆమె ఆరోగ్యం ఏం అయ్యింది, వాటి నుంచి సర్వైవ్ అయిందా.? ఒక వేళ మనం కూడా ఇలానే చేస్తే ఏమవుతుంది..? ... డాక్టర్లు ఎక్కడైనా, ఎప్పుడైనా చెప్పేది ఒక్కటే. శరీరజీవక్రియలు సక్రమంగాజరగాలంటే  ప్రతి మనిషి రోజూ తప్పకుండా 3 నుండి నాలుగు లీటర్ల వాటర్ నుతీసుకోవాలని. కానీ దానికి బదులుగా కొకాకోలా ను మాత్రమే తీసుకుంటే... ప్రతి రోజు తీసుకునే ఒక సింగిల్ కోక్ లో 39 గ్రాముల చక్కెర ఉంటుంది. ఒక వేళ 8 కోక్ లను ప్రతి  రోజు తాగితే అది 312 గ్రాముల చక్కెర తో సమానం. అది 6 చాక్కెట్ బార్లను ఒకే సారి తిన్నదానితో సమానం. సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తి  రోజులో 40 గ్రాముల కంటే తక్కువ షుగర్ ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా కాకుండా ఎనిమిది కోక్ లు తాగితే దాదాపు 312 గ్రాముల చక్కెర తీసుకున్నట్టే.  కేవలం కోక్ ను తీసుకోవడం వల్లనే వారానికి 8000 అదనపు కాలరీల తీసుకున్నట్లు అవుతుంది. ఇలా ఎక్కువ మొత్తంలో షుగర్ ను తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. అధిక కాలరీలు తీసుకోవడం అధిక బరువు సమస్యకు దారితీస్తుంది. అలాగే దంత క్షయానికి హానిచేయడమే కాకుండా, కోక్ ను తీసుకున్న ప్రతి సారి దంతాలు, నాలుక చిగుళ్ళులపై పేరుకొనిపోయి గంటలు కొద్ది ఉంటుంది. సరిగ్గా బ్రష్ చేయకపోయే పంటి మీద ఉన్న ఎనిమల్ పోవడమే కాకుండా శాశ్వతంగా పళ్లను తీసివేయాల్సి వస్తుంది. రోజంతా ఇలానే తీసుకుంటూ ఉంటే వాష్ రూమ్ కి పదేపదే పరిగెత్తాల్సి ఉంటుంది. కోక్ లోని కెఫిన్ అనే పదార్థం అధిక మూత్ర విసర్జనకు కారణం అవుతుంది. కాబట్టి పదే పదే వాష్ రూమ్ కి వెళ్లాల్సి ఉంటుంది. కెఫిన్ గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు కానీ అందులోని ముఖ్య ఇంగ్రీడీన్ అయిన ఫ్రక్టోస్ కార్న్ సిరప్ గురించి మాత్రం ఆందోళన చెందాలసిందే.  ఎందుకంటే ఫ్యాట్లీ లీవర్ సమస్యకు దారితీస్తుంది. దాని లక్షణాలు అలసటగా ఉండటం, పై కడుపులో నొప్పి. అయినా అలాగే కోక్ తాగడం కొనసాగిస్తే ఇంకా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తరచుగా మూర్చ పోవడం, పొటాషియం నిల్వలు తగ్గిపోవడం కూడా జరుగుతుంది. అధిక మోతాదులో షుగర్, కెఫిన్ తీసుకుంటారు కాబట్టి హృదయ స్పందనలో కూడా మార్పులు వస్తుంటాయి. ఈ అనారోగ్య సమస్యలు అక్కడితో ఆగవు.  టైప్ -2 డయాబెటిస్ కు గురికావడం జరుగుతుంది. శరీరానికి కావల్సిన విటమిన్ లు లోపిస్తాయి. ఫలితంగా కిడ్నీ డ్యామేజి కి దారితీస్తుంది.   అయినా అలాగే కోక్ మాత్రమే తాగుతూ ఉంటే 600 పౌండ్ల వరకు బరువును పెరుగుతారు. అంతేకాదు హార్ట్ అటాక్ తో చనిపోవడం కూడా జరుగుతుంది. 16 ఏండ్లుగా కేవలంకోకాకోలా ను మాత్రమే తాగుతున్న మహిళా కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ప్రాబ్లం వంటి  చాలా సమస్యలు చవి చూసింది. చివరికి కోకాకోలా తాగడం ఆపేసింది. దాంతో చాలా తక్కువ సమయంలోనే ప్రాణాపాయం నుంచి బయట పడింది. వారానికో, నెలకో, ఏడాదికో ఒకసారి తీసుకుంటే ఫర్వాలేదు. కానీ, రోజూ తాగితే మాత్రం ఆరోగ్యానికి హానికరం. అప్పుడు రీప్రెష్ ది వరల్డ్ అన్న ట్యాగ్ కాస్త రెస్ట్ ఇన్ పీస్ గా మారుతుంది. సో.. కోకా కోలా గురించి ఇంత తెలిసాక కూడా మీరు తరచుగా కోకాకోలా తాగుతారా.. అలా కావాలని అనుకుంటారా.. కాదు గా..!
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.