తాను అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ ఫైలు మీదనే తొలి సంతకం చేస్తానని చంద్రబాబు వాగ్దానాలు చేస్తుంటే, రుణమాఫీ చేయడం ఎట్టి పరిస్థితుల్లోకూడా సాద్యం కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుండ బద్దలు కొట్టినటు చెపుతున్నారు. కానీ, చంద్రబాబు ఈ రోజు కూడా తన పాదయాత్రలో రైతులు బ్రతికి బట్టకట్టాలంటే కేవలం రుణమాఫీయే మార్గం అని నొక్కి చెప్పారు. పరిశ్రమలకి, ఇతర రంగాలకి పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నపుడు, వ్యవసాయానికి, రైతులకు ఎందుకు సాయం చేయలేరని ప్రశ్నించారు.   ఈ రోజు డిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం అయి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద మీడియావారు ఈ విషయం ప్రస్తావించగా, ఆయన కొంచెం అసహనంతో రూ.1.16 లక్షల కోట్ల రుణాలను చంద్రబాబు ఏవిధంగా మాఫీ చేయలనుకొంటున్నారో కాస్త వివరిస్తే బాగుంటుందని అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం ఆపేసి ఇస్తారా లేక ఒక్క రూపాయి కేజీ బియ్యం ఆపేసి ఇస్తారా లేక పెన్షన్లు ఈయడం ఆపేసి రుణమాఫీ చేస్తారా చెప్పమంటూ ఎదురు ప్రశ్నించారు.   ప్రస్తుత పరిస్థితుల్లో సాక్షాత్ కేంద్ర ప్రభుత్వం కూడా రుణమాఫీ చేయడం కష్టంగా భావిస్తోందని, అటువంటప్పుడు చంద్రబాబు ఏవిధంగా రైతుల రుణమాఫీ చేసేస్తానని వాగ్దానాలు చేస్తున్నారని ప్రశ్నించారు. అయినా, చంద్రబాబుకి వాగ్దానాలు చేయడం తప్ప వాటిని నిలబెట్టుకోవడం అలవాటు లేదని, అందుకే నోటికి వచ్చిన వాగ్దానాలు చేసేస్తున్నారని ఆయన విమర్శించారు.   దీనికి ప్రతిగా రేపు చంద్రబాబు మరింత ఘాటుగా జావాబు ఈయవచ్చును. కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అడుగుతున్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పగలిగితే ప్రజలలో ఆయన మాటలపై నమ్మకం ఏర్పడుతుంది. కానీ, మన రాజకీయనాయకులలో ఎవరికీ కూడా అంతమంచి అలవాటు లేదు, ఉండదు కూడా.
        చంద్రబాబు నాయుడు 'వస్తున్నా..మీకోసం' పాదయాత్రలో కొన్ని రోజుల క్రితం రెండు వేల కిలోమీటర్ల పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ రోజు అంగలకుదురులో ఎన్టీఆర్ కిషాన్ భవన్‌కు భూమిపూజ చేశారు. తాను వ్యవసాయం దండుగ అని ఎప్పుడు చెప్పలేదని, రైతుల పిల్లలు చదువుకోవాలని మాత్రమే చెప్పానని చంద్రబాబునాయుడు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు బతికి బట్టకట్టాలంటే రుణ మాఫీ మినహా మరే మార్గం లేదన్నారు. పరిశ్రమలకు లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం రైతుల విషయంలో ఎందుకు వెనక్కి తగ్గుతోందని చంద్రబాబు ప్రశ్నించారు.   తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. అల్మట్టి డ్యామ్ కేసులో వైయస్ కారణంగానే ఓడిపోయామన్నారు. అసమర్థుడైన బంధువును వైయస్ లాయర్‌గా పెట్టడం వల్లే అలా జరిగిందన్నారు. కాలువల్లోకి నీళ్లు రావడం లేదు. కానీ రైతుల కళ్లలో మాత్రం కన్నీళ్లొస్తున్నాయన్నారు. గడిచిన తొమ్మిదేళ్ళ కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. వైఎస్ హయాంలో 14,500 మంది ఆత్మహత్య చేసుకుంటే, గత నాలుగేళ్ళలో మరింత ఎక్కువయ్యాయని, వైఎస్ మాటలు నమ్మిన రైతులు ఇబ్బందుల్లో పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  
        ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ మధ్యాహ్నం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఎంఐఎం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్నారు. ఇక్కడ హైదరాబాద్‌లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కస్టడీలో ఉన్న అక్బర్‌కు శుక్రవారం కోర్టు మూడు షరతులతో బెయిల్ మంజూరు చూసిన విషయం తెలిసిందే. ఒకటి రూ. 10 వేలు, ఇద్దరు పూజీకత్తు, రెండోది పాస్‌పోర్టు కోర్టుకు సమర్పించాలని, మూడోది నిర్మల్ రావద్దని, వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశిస్తూ బెయిల్ మంజూరు చేసింది. అక్బర్ ఆదిలాబాద్ నుంచి బుల్లెట్‌ప్రూఫ్ వాహనంలో హైదరాబాద్‌కు రానున్నారు.
        త్రివిక్రమ్ 'జులాయి' సినిమాలో ప్రజల దగ్గర నుంచి 1500కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేస్తాడు విలన్. చివరికి ఆ డబ్బును హీరో ప్రజలు వద్దకు చేరుస్తాడు. ఆ సినిమాను చూసి ఇన్స్ స్పైర్ అయ్యారో లేదో తెలియదు కాని వైజాగ్ లో సేమ్ సీన్ రీపీట్ అయ్యింది. లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే నెలకు పది వేల రూపాయలు వడ్డీ ఇస్తామని ఆశ చూపి ప్రజల నుంచి 600 కోట్ల రూపాయలకుపైగా వసూలు చేసి సిమ్స్ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. అధిక వడ్డీ చెల్లించడంతో మధ్య తరగతి ప్రజలు ఎగబడి తమ వద్ద ఉన్న సొమ్ముని ఈ సంస్థలో దాచుకున్నారు. ఇప్పుడు ఆ సంస్థ యజమానులు పత్తాలేరు. అనకాపల్లి, యలమంచిలిలలోని ఈ సంస్థ కార్యాలయాలపై డిపాజిట్దారులు దాడి చేశారు. ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. డిపాజిట్ చేసివారి వత్తడితో అనకాపల్లిలో ఈ సంస్థ ఏజెంట్ సత్తిబాబు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. చోడవరంలో సిమ్స్ కార్యాలయం వద్ద డిపాజిట్దారులు ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా, సంస్థ యజమాని సురేంద్ర గుప్త పోలీస్ ఉన్నతాధికారుల వద్ద లొంగిపోతారని చెబుతున్నారు. భాదితులకు న్యాయం చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు అంటున్నారు. మరీ ఈ పేద ప్రజలకు ఏ హీరో న్యాయం  చేస్తాడో వేచి చూడాలి. 
  ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ విడుదలను కోర్ట్ నిలిపివేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కస్టడీలో ఉన్న అక్బర్‌కు కోర్టు మూడు షరతులతో బెయిల్ మంజూరు చూసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల ప్రకారం జైలు అధికారికి అన్ని పత్రాలు అందజేయవలసి ఉండగా పాస్‌పోర్టు ఇవ్వకపోవడంతో విడుదలకు బ్రేక్ పడింది. అక్బరుద్దీన్ విడుదల ఆదేశాలను కోర్టు ప్రస్తుతానికి నిలిపివేసింది. అక్బరుద్దీన్ బెయిల్ ఆర్డర్లు తీసుకు రావాల్సిన ఆయన తరఫు లాయర్లు జైలు వద్దకు రావడానికి మరో ఒకటి లేదా రెండు గంటలు పట్టే అవకాశముంది. ఈ రోజు మధ్యాహ్నం ఒకటి గంటల వరకే కోర్టు పని చేస్తుంది. దీంతో అక్బరుద్దీన్ విడుదల ఈ రోజు అవుతుందా? లేదా సోమవారం అవుతుందా? అనేది తెలియరాలేదు.
  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ, ఈ ఏడాదిలో జరగనున్న 9 రాష్ట్రాల ఎన్నికలనీ, వచ్చే ఏడాది జరగనున్నసాధారణ ఎన్నికలను సమర్ధంగా ఎదుర్కొనేందుకు తన పార్టీని బలపరిచే ప్రయత్నంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులతో, పీసీసీ మరియు శాసనసభా పక్ష నాయకులతో నిన్న,ఈరోజు డిల్లీలో సమావేశమవుతున్నారు. పార్టీని పూర్తీ స్థాయిలో ప్రక్షాళించే ప్రయత్నంలో ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొన్నట్లు తెలుస్తోంది.   1. ఇకనుండి పార్టీ అభ్యున్నతికి పాటుపడినవారికి సముచిత పదవులు, పార్టీకి నష్టం కలిగించేవారికి, లేదా పార్టీలో పనిచేయనివారికి శిక్షా విధానం అమలుచేయాలని భావిస్తున్నారు.   2. ఎన్నికలలో పార్టీ టికెట్స్ ఆశించేవారు తాము అందుకు అన్నివిధాల అర్హులమని తప్పనిసరిగా నిరూపించుకొనవలసి ఉంటుంది.   3. పార్టీలో వర్గాలు, ముఠా సంస్కృతిని పోషించేవారిపై క్రమశిక్షణా చర్యలు.   4.పార్టీలో నేతలు మరియు కార్యకర్తలు అందరూ కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పనిచేయడం కాకుండా, పార్టీని పటిష్టపరిచే విదంగా పనిచేయాలి. అందుకు ప్రతీ సభ్యుడు తనకు తానుగా కొన్నిబాధ్యతలను, లక్ష్యాలను నిర్దేశించుకొని తదనుగుణంగా పనిచేయాలి. నిరంతరంగా కొనసాగే ఈ ప్రక్రియను, ప్రతీ మూడు లేదా నాలుగు నెలలకొకసారి పార్టీ పరిశీలించి తమ బాధ్యతలను, లక్ష్యాలను నేరవేర్చినవారికి తదనుగుణంగా పదవులు ఇచ్చి గౌరవిస్తుంది.   5. పార్టీలో నియమ నిబంధనలను ఖచ్చితంగా అమలుజేయాలి. హద్దులు దాటినవారిపై క్రమశిక్షణ చర్యలు తప్పనిసరి.   రాహుల్ గాంధీ ఆలోచనలు, ఆశయాలు వినడానికి చాల బాగున్నాయి. కానీ, క్రమశిక్షణ రాహిత్యానికి, విపరీతమయిన స్వేచ్చకు, ముఠాతత్వానికి అలవాటుపడి ముదిరిపోయున్న కాంగ్రెస్ నేతలను తనకనుగుణంగా మార్చుకోవడం, ఎన్నికలలో పార్టీని గెలిపించుకోవడం కన్నాచాలా కష్టమయిన విషయం అని ఆయన త్వరలోనే గ్రహించవచ్చును. ఈ పరీక్షలో ఆయన నెగ్గితే, జవజీవాలు కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీకి ఒక సమర్దుడయిన యువనాయకుడు దొరికినట్లే భావించవచ్చును. లేదంటే, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు సాగుతున్న దారిలోనే కుంటుకొంటూ ముందుకు సాగవలసి ఉంటుంది.
        కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మంత్రి చిరంజీవి చిన్నల్లుడు శిరీష్ భరద్వాజ భారతీయ జనతా పార్టీలో చేరడం ఆసక్తి కలిగిస్తుంది. చిన్నకుమార్తె శ్రీజను వివాహమాడిన శిరీష్ భరద్వాజ్ భార్యతో విడిపోయిన తరువాత, అతనిపై అతని భార్య శ్రీజ వరకట్నం కోసం వేదిస్తున్నాడని పిర్యాదు చేయడంతో, పోలీసులు అతనిపై కేసు కూడా నమోదు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఆ తరువాత దాదాపు కనుమరుగు అయిపోయాడనుకొన్న శిరీష్, మళ్ళీ చాలా కాలం తరువాత వార్తల్లోకి ఎక్కాడు. శిరీష్ భరద్వాజ్ బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. బహుశా ఇక తన కాపురం చక్కబడే అవకాశం లేదని గ్రహించిన ఆయన, రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగిన మామ చిరంజీవిని డీ కొట్టాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యమ్నాయమైన భారతీయజనతా పార్టీని ఎంచుకొని ఉండవచ్చును. చార్టెడ్ ఎకౌంటెంట్ అయిన శిరీష్ భరద్వాజ్ లెక్క సరైతే రేపు ఎన్నికలలో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగలిగేతే, తానూ మామకు వ్యతిరేఖంగా చక్రం తిప్పవచ్చుననే ఆలోచనతోనే భాజాపాను ఎన్నుకొని ఉండవచ్చునని అంటున్నారు.
        అంతరిక్షం నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశించిన ఓ భారీ ఉల్క ఒక్కసారిగా పేలిపోయి రష్యాలో బీభత్సం సృష్టించింది. ఆకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 3 వేల భవనాలు, అనేక కార్లు దెబ్బతిన్నాయి. సుమారు 1000మందికి పైగా గాయపడ్డారని అధికారిక వర్గాలు తెలిపాయి. క్షతగాత్రుల్లో 200మంది చిన్నారులున్నారు.   "జనావాసాలపై భారీ శిలలు పడనందుకు దేవుడికి కృతజ్ఞతలు'' అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు. నగరంలో అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ముందు జాగ్రత్తగా నగరంలో గ్యాస్ సరఫరాను నిలిపేశారు. దాదాపు 20వేల మందితో కూడిన సహాయక బృందాలు నగరానికి చేరుకున్నాయి.   బాధితులకు సాయం చేస్తూనే మరోపక్క గ్రహశకలాలు భూమిని తాకిన మూడు ప్రదేశాలను గుర్తించాయి. రెండు శిలలు ఇక్కడి చెబార్కుల్ చెరువు సమీపంలో పడిన ఆనవాళ్లు కనిపించాయి. ఇతర ప్రాంతాలను పరిశీలించడానికి మూడు యుద్ధ విమానాలనూ రంగంలోకి దించారు. ఉల్కాపాతం వల్ల రేడియేషన్ ప్రభావం, రసాయనిక చర్యల ముప్పును పరిశీలించడానికి ప్రత్యేక రక్షణ బృందాలను ఇక్కడకి తరలించారు. ఇక ఈ ఉల్కాపాతానికి సంబంధించిన వీడియోలను స్థానికులు కొందరు ఇంటర్‌నెట్‌లో పోస్ట్ చేశారు. ప్రపంచ వినాశనం జరుగనుందేమో అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
  కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మంత్రి అయిన చిరంజీవి చిన్నకుమార్తె శ్రీజను వివాహమాడిన శిరీష్ భరద్వాజ్ భార్యతో విడిపోయిన తరువాత, అతనిపై అతని భార్య శ్రీజ వరకట్నం కోసం వేదిస్తున్నాడని పిర్యాదు చేయడంతో, పోలీసులు అతనిపై కేసు కూడా నమోదు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఆ తరువాత ఆ కేసు గురించి కానీ, మళ్ళీ వారివురూ కలిసే ఆలోచనచేస్తున్నట్లు గానీ ఎక్కడా ప్రస్తావన ఎక్కడా రాలేదు. వారి కుమార్తె ‘నిర్వర్తిత’, శ్రీజ ఇద్దరూ కూడా ప్రస్తుతం చిరంజీవి ఇంట్లోనే ఉంటున్నారు.   దాదాపు కనుమరుగు అయిపోయాడనుకొన్న శిరీష్, మళ్ళీ చాలా కాలం తరువాత వార్తల్లోకి ఎక్కాడు. శిరీష్ భరద్వాజ్ ఈ మద్యనే బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. బహుశః ఇక తన కాపురం చక్కబడే అవకాశం లేదని గ్రహించిన ఆయన, రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగిన మామ చిరంజీవిని డ్డీ కొట్టాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యమ్నాయమయిన భారతీయజనతా పార్టీను ఎంచుకొని ఉండవచ్చును. చార్టెడ్ ఎకౌంటెంట్ అయిన శిరీష్ భరద్వాజ్ లెక్క సరయితే రేపు ఎన్నికలలో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగలిగేతే, తానూ మామకు వ్యతిరేఖంగా చక్రం తిప్పవచ్చుననే ఆలోచనతోనే భాజాపాను ఎన్నుకొని ఉండవచ్చును. ఆయనకి అటువంటి ఆలోచన లేనట్లయితే, చార్టెడ్ ఎకౌంటెంట్ గా చాలా మంచి జీవితమే గడిపే అవకాశమే ఉంది. గానీ, వేరే ఆలోచనలు ఉన్నందునే ఆయన రాజకీయాలలోకి వచ్చిఉండవచ్చును. ఘరానా మొగుడికి ఘరానా అల్లుడు దొరికినట్లే కనిపిస్తోంది.  
  దాదాపు రెండు నెలల క్రితం ఇడుపులపాయలో పాదయాత్ర మొదలుపెట్టిన షర్మిల ఈ 67 రోజుల్లో మొత్తం 972.4 కిమీ దూరం నడిచారు. కనుక, మరో రెండు రోజుల్లో ఆమె కూడా 1000 కిమీ మైలురాయిని నల్గొండ జిల్లాలో దాటనున్నారు. ఆమె ఈ నెల 18న గురజాల వద్ద గుంటూరు జిల్లాలో ప్రవేశిస్తారు. జిల్లలో ఒకరోజు పాదయాత్ర కొనసాగించిన తరువాత, శాసన మండలి ఎన్నికల సందర్భంగా 19 సాయంత్రం నుండి 21 సాయంత్రం వరకు అమలులో ఉండే ఎన్నికల నియమావళి కారణంగా ఆమె తాత్కాలికంగా తన పాదయాత్రను ఆపవలసి ఉంటుంది. గుంటూరు జిల్లాలో దాదాపు 270కిమీ దూరం నడువనున్న ఆమె మొత్తం 13 నియోజక వర్గాలను పర్యటిస్తారు. జగనన్న వదిలిన బాణంగా తనను తానూ అభివర్ణించుకొన్న షర్మిల, ఇప్పుడు 1000కిమీ లక్ష్యం చేదించనున్నది.
        తాను దర్శకత్వం వహించిన సినిమాకు సెన్సార్ బోర్డు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదనే మనస్తాపంతో డైరెక్టర్ దుర్గాప్రసాద్ సెన్సార్ బోర్డు ఎదుట విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సినీ రంగంలో తీవ్ర కలకలం సృష్టించింది. దుర్గాప్రసాద్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ‘లవ్ పాయిజన్' అనే చిత్రాన్ని నిర్మించారు. చాలా రోజుల క్రితం సినిమాను సెన్సార్ బోర్డ్ కు పంపించిన సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి బోర్డు నిరాకరించిందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన బోర్డు కార్యాలయం ముందు ఈ రోజు విష౦ తీసుకున్నారు. ఈ విషయం గమనించిన కొందరు వెంటనే అతన్ని అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
        ఎట్టకేలకు వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అక్బరుద్దీన్ ఓవైసీకి బెయిల్ మంజూరైంది. గత కొద్ది రోజులుగా బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఓవైసీకి బెయిల్ మంజూరు అవడంతో జైలు నుంచి విడుదల కానున్నారు. నిర్మల్ లలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆయన విద్వేషపూరిత ప్రసంగాలు చేశారన్న అబియోగంపై కేసులు నమోదయ్యాయి. నిర్మల్ పోలీసులు ఆయనను అరెస్టు చేసి జైలులో ఉంచారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కు తొలుత నిజామాబాద్ కోర్టులో బెయిల్ లభించగా, మధ్యాహ్నానికి ఆదిలాబాద్ కోర్టులో బెయిల్ మంజూరైంది. అక్బర్ ఎట్టి పరిస్థితిలోను నిర్మల్ లో అడుగు పెట్టరాదని, పాస్ పోర్టును పోలీసులకు అప్పగించాలని, పూచికత్తులు సమర్పించాలని జడ్జి ఆదేశాలు ఇచ్చారు.   
        విబేధాలు విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహాల్ గాంధీ నేతలకు పిలుపునిచ్చారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో పార్టీ విజయపథంలో నడిపించే దిశగా పనిచేయాలని వారికి సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పరిస్థితి, ప్రత్యేక తెలంగాణ అంశంపై రాహుల్‌కు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ బొత్స సత్యనారాయణ వివరించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులతో రాహుల్ గాంధీ శుక్రవారం ఉదయం జరిపిన తొలి రోజు సమావేశం ముగిసింది. 2014లో లోక్ సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్ ఈ రెండు రోజులు వివిధ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, పార్టీకి ఎదురవుతున్న సమస్యలు, పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠం చేయడం, పార్టీని ఎన్నికల్లో గెలిపించేందుకు తీసుకోవల్సిన చర్యలపై నేతలతో చర్చించి, పలు సూచనలు చేశారు. రేపు కూడా సమావేశం జరగనుంది.
        బ్లేడ్ రన్నర్ అంటే క్రీడా ప్రపంచంలో తెలియని వారుండరు. రెండు కాళ్లూ లేకున్నా కృత్రిమ కాళ్లతో పరుగెత్తి ట్రాక్ పై అనేక రికార్డులు నెలకొల్పిన దక్షిణాఫ్రికా స్ప్రింటర్ ఆస్కార్ పిస్టోరియస్ తన ప్రేయసిని కాల్చి చంపాడన్నది ఆరోపణ. ఐతే అదేమీ అతను కావాలని చేయలేదు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం కావడంతో ప్రియురాలు రీవా స్టీన్‌కాంప్ తన ప్రియుడు పిస్టోరియస్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తడానికి ఓ మాస్కు వేసుకొని వచ్చింది. ఉదయమే ఆమె ప్రియుడి ఇంటికి చేరుకుంది. కానీ, ఆ విషయం తెలియని పిస్టోరియస్ ఆమెను దొంగగా భావించి కాల్చి చంపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. పోలీసులు పిస్టోరియస్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలో పలుమార్లు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఇప్పుడు తన ప్రియురాలిని అనుకోకుండా కాల్చినప్పటికీ అంతకుముందు అతను జైల్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి. గతంలో ఓ టీనేజ్ అమ్మాయి పైన దాడి చేశాడు. దీనికి 2009లో ఒకరోజు జైలు శిక్ష అనుభవించాడు. పిస్టోరియస్ అందరూ అనుకునేలాంటివాడేమీ కాదని అతని మాజీ ప్రియురాలు ఓ సందర్భంగా చెప్పింది. పిస్టోరియస్ తన ప్రియురాలిని షూట్ చేసినందుకు హత్యానేరం ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.
  గోళ్ళూడిన సింహాన్ని చూసి జింకలు, కుందేళ్ళు కూడా భయపడవు. పదవీ, అధికారం కోల్పోయిన రాజకీయనాయకుడి పరిస్థితీ ఇంచుమించుగా అదేవిధంగా ఉంటుంది. పార్టీ పట్టించుకోదు, వీధి గుమ్మం దగ్గర తన కోసం పడిగాపులు కాసే అనుచరులు కనబడరు, శిష్యులు గురువులవుతారు, ఓడలు బళ్ళవుతాయి. పూవులమ్మిన చోటే కట్టెలమ్ముకోలేని దుస్థితిలో ఆశ్రయమిచ్చే వేరే పార్టీలకోసం కళ్ళు కాయలు కాస్తాయి. అయినా, చంచల్ గూడా జైలుకు వెళ్ళే (పార్టీ తీర్దం పుచ్చుకొనే) భాగ్యం అందరికీ దక్కదు.   మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒక వెలుగు వెలిగిన కైకలూరు మాజీ ఎమ్మెల్యే యెర్నేని రాజారామచందర్ (రాజబాబు) ప్రస్తుతం ఈ పరిస్థితిలోనే ఉన్నారని చెప్పవచ్చును. మొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ‘కొత్తనీరు వచ్చి పాత నీటిని బయటకు పంపేస్తుందని’ ఎవరిని ఉద్దేశించి అన్నపటికీ, ఆ సూత్రం యెర్నేనికి చక్కగా వర్తిస్తుంది. క్రమంగా తన అనుచరులందరూ వేరే నేతలదగ్గర సర్దుకుపోయి మొహం చూపించడం మానేసిన తరువాత, ఆయన దగ్గర శిష్యరికం చేసిన వారు పైకెదిగి ఆయనను పట్టించుకోక, ఏకులయివచ్చిన స్థానిక నాయకులూ క్రమంగా మేకులయి తన ఓటమికి కారకులయినపుడు, ఇటు రాష్ట్రంలోగానీ, అటు కేంద్రంలోగానీ తన మోర వినే నాధుడు లేకపోవడంతో, వైరాగ్యం కమ్ముకొన్న యెర్నేని గతకొన్ని నెలలుగా రాజకీయాలకు దూరంగా, అజ్ఞాతంలో గడుపుతున్నారు.   నిత్యం సంచలన వ్యాఖ్యలతో మీడియాలో కనిపించే ఆయన ఒక్కసారిగా నిశబ్ధం అయిపోయారు. కనీసం ఇటీవల జరిగిన సహకార ఎన్నికలలో సైతం ఆయన జాడ కనిపించకపోవడంతో ఆయన స్వంత పార్టీవారే ఆశ్చర్యపోయారు.   ఒకనాడు స్వర్గీయ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడని పేరుగాంచిన యెర్నేని కటాక్ష వీక్షణాలకోసం పడిగాపులు కాసినవాళ్ళే, నేడు ఆయనను పరిహసించే సాహసం చేస్తున్నారంటే ఆయన పరిస్థితి అర్ధం అవుతుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్-చార్జ్ గా చక్రం తిప్పిన యెర్నేనిని, ఒకవైపు పిన్నమనేని, మరోవైపు కావూరి వర్గీయులు కలిసి వ్యూహాత్మకంగా ఆయన పరిధిని కుచించివేసి, పార్టీలో జిల్లాలో క్రమంగా ఆయన ప్రాబల్యం తగ్గించడంలో సఫలీకృతం అయ్యారు.   ఇందిరమ్మ గృహాల మంజూరుకు ఇన్చార్జిగా ఉన్న యెర్నేనిని ఆ పదవి నుండి తప్పించగలిగారు. ఆ తరువాత కైకలూరు మార్కెటింగ్ యార్డు చైర్మన్ పదవి కేటాయింపులోను ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. కనీసం మండలాల ఇన్చార్జి బాధ్యతలనయినా తన అధీనంలో ఉంచుకొందామనుకొన్న యెర్నేని చేతిలోంచి అదీ లాక్కొని, మాజీ జడ్పీటీసీ సభ్యులకే ఆయా మండలాల బాధ్యతలు అప్పగించడంతో ఆయన హతాశుడయ్యారు.   ఇవి చాలవన్నట్లు దొంగ మెడికల్ బిల్లులు పెట్టిన పాపానికి కోర్టు కేసులు తలకు చుట్టుకోన్నాయి. ఆయన తప్పయిపోయింది క్షమించందని ప్రాధేయపడినా కోర్టు కనికరించలేదు. ఈ పరిణామాలతో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయిన యెర్నేని రాజకీయాలు చెడిపోయాయి, నమ్మినవారు మోసంచేస్తున్నారు అంటూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.   అయితే, వచ్చే ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ సంపాదించుకొనేందుకు ఆయన ఆ పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తున్నారని, అటువైపు నుండి సరయిన ఆఫర్ వస్తే, అయన కూడా చంచల్ గూడా జైలు బాట పట్టడం ఖాయం అని పార్టీలో ఆయన వ్యతిరేఖ వర్గం వారు జోస్యం చెపుతున్నారు. ఇక, యెర్నేని జైలుకి వెళ్తారా లేక (రాజకీయ) సన్యాసం స్వీకరిస్తారా అనేది త్వరలో తేలిపోవచ్చును.  
      శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ ఇచ్ఛాపురం శాసనసభ్యుడు సాయిరాజ్ జగన్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. చంచల్ గూడ జైలులో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ని ఈ రోజు టిడిపి ఇచ్ఛాపురం ఎమ్మెల్యే సాయిరాజ్ ములాకత్ సమయంలో కలిశారు. సాయిరాజ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే మోహన్ రావు, ఇచ్ఛాపురం టిడిపి ఇంఛార్జ్ వెంకటరమణలు కూడా జగన్ ని కలిశారు. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయలక్ష్మి సమక్షంలో సాయిరాజ్ వైఎస్ఆర్ సీపీలో తీర్థం పుచ్చుకోనున్నారు. ఇచ్చాపురం తెలుగుదేశం ఎమ్మెల్యే సాయిరాజ్ చిత్రమైన కధ చెప్పారు.తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు మరణించిన తర్వాత తాను రాజకీయంగా ఇబ్బందిలో పడ్డానని, పార్టీ పరిస్థితులు మారిపోయి, తాను రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని ఆయన వెల్లడించారు.
  సహకార ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనవిజయం గురించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియాకు, పార్టీ అధిష్టానానికి ఏకరువు పెట్టడం చూసినవారికి, పార్టీలకతీతంగా సాగవలసిన సహకార ఎన్నికలు రాజకీయ నాయకుల కనుసన్నలలో ఏవిధంగా జరిగాయో కళ్ళకు కట్టినట్లు చూపుతుంది.   రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలలో వేలు పెట్టడమే ఒక తప్పనుకొంటే, వాటి మద్య పోరాటాలు, పొత్తులు మరో తప్పు. ఇవి చాలవన్నట్లు, ఒకే పార్టీలో మళ్ళీ రెండుమూడు వర్గాలుగా చీలిపోయి, డీసీసీబీ బోర్డు పదవులు, అధ్యక్షపదవుల కోసం లోపాయికారీ రాజకీయాలు చేసుకుపోతున్నారు. తనకు దక్కకపోయినా పరువలేదు కానీ, పార్టీలో తన ప్రత్యర్ధికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పదవులు దక్కకూడదనే పంతంతో కొందరు కోర్టులకి వెళ్లి స్టేలు తెచ్చుకొంటే, మరి కొంత మంది విపక్షాలతో చేతులు కలిపి తమ పార్టీ అభ్యర్డులకే ఎసరు పెడుతున్నారు.   మొన్న కంచికచర్ల మండలం, గొట్టుముక్కల గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు గుదే వెంకటేశ్వరరావు (బుజ్జి) నివాసంలో జరిగిన వేడుకల్లో, మంత్రి సారధికి, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావుకు మద్య నడిచిన ఈ సంభాషణ ఇటువంటి వాటికి ఒక చిన్నఉదాహరణ మాత్రమే.   మంత్రి సారధి: ఏమన్నా బాగున్నావా?   వసంత: ఆ.. ఏం బాగో.. ఒక పక్క నా ఐతవరం సొసైటీకి స్టే తీసుకువచ్చి, నన్ను ఎన్నికల్లో నిలబడకుండా చేసి, ఇప్పుడు బాగున్నావా అని అడగం వెటకారం కాకపొతే మేరేమిటి?   మంత్రి సారధి: అన్నా, నువ్వలా అనుకోమాకు. స్టే సంగతి నాకు నిజంగా తెలియదు. వేరెవరో తెచ్చి ఉంటారు.   వసంత: పిన్నమనేని వెంకటేశ్వరరావు నాకంతా చెప్పాడు. పోనీ, నీకు తెలియదని తినే ఈ భోజనం మీద ప్రమాణం చేసి చెపుతావా?   మంత్రి పార్ధ సారధి: కొంచెం అసహనంగా కదిలారు గానీ జవాబీయలేదు.   వసంత: అన్నా! మీరు పెద్దవాళ్లు. మమ్మల్ని ఆశీర్వదించాలి, కాని ఇలాగ శపించకూడదు.   ఇదొక చిన్న సొసైటీ కధ మాత్రమమే. ఇటువంటివి రాష్ట్రంలో చాలానే కుమ్ములాటల కధలు, జరిగాయి.
    టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గత ఐదు నెలలుగా ఎండనక వాననక తీవ్ర ఆరోగ్య సమస్యలు బాధిస్తున్నా సరే పార్టీకి పునర్వైభవం తేవాలని పాదయాత్రలు చేస్తుంటే, చంచల్ గూడా జైల్లో కూర్చొన్న జగన్ మోహన్ రెడ్డి, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలను, నాయకులనూ జైలు బాట పట్టిస్తున్నారు.   నిన్న తెదేపా శాసనమండలి సభ్యుడు బొడ్డు భాస్కర రామారావు చంచల్ గూడా జైలులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోగా, ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం తెదేపా శాసనసభ్యుడు సాయి రాజ్, పాతపట్నం మాజీ శాసన సభ్యుడు కలమట మోహన్ రావు, ఆయన కుమారుడు వెంకట రమణ కూడా చంచల్ గూడా జైలుకి వెళ్లనున్నారు. ఈతంతు ముగిసిన తరువాత వారు నేరుగా విజయమ్మ దర్శనం చేసుకొని, పార్టీ కండువా కప్పుకోవాలని బయలుదేరుతున్నారు.   వీరికి జతగా విశాఖ జిల్లా భీమిలిపట్నం తెదేపా ఇన్-చార్జ్ ఆంజనేయులు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జంపింగు ఇచ్చుకొనేందుకు సిద్దంగా ఉన్నారు. ఇక నేతల వెనుక, తోకలవంటి వారి అనుచరులు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జేరుతారని ప్రత్యేకంగా పేర్కొనవలసిన అవసరం లేదు.   తెదేపాకు శ్రీకాకుళం జిల్లాలో పెద్దన్నగా నిలబడిన కింజారపు ఎర్రం నాయుడు ఆకస్మిక మరణంతో ఆ పార్టీకి గట్టి దెబ్బే తగిలింది. రాజకీయాలలోబొత్తిగా అనుభవం లేని ఆయన కుమారుడు రామ్ మోహన్ నాయుడిని ఆయన రాజకీయ వారసుడిగా పార్టీ ప్రకటించడం కూడా, బహుశః జిల్లా నేతలకి రుచించకపోవడం వల్లకూడా ఈ పరిణామాలు కలిగి ఉండవచ్చును.   కానీ, ఇప్పుడే ఇంత జోరుగా సాగుతున్న ఈ వలసలను చూస్తుంటే, రేపు ఎన్నికలు ప్రకటించిన తరువాత వలసలు మరెంత జోరుగా సాగుతాయో ఊహించుకోవచ్చును. అందువల్ల, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు తన పాదయాత్ర మీద మాత్రమే దృష్టి పెట్టి ఒక పద్దతిగా ముందుకు సాగిపోయినట్లయితే, వెనక నుండి ఆయన పార్టీ ఖాళీ అయిపోవడం ఖాయం. కనుక, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం మంచిది.
        త్రిపురలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలికి రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 91.22 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 93 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంతటి భారీ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని ఎన్నికల సంఘం అధికారులు చెపుతున్నారు. త్రిపురలో మొత్తం 23,58,493 మంది ఓటర్లు ఉండగా, 60 మంది సభ్యులు గల అసెంబ్లీకి భారీగా పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో కొన్ని చోట్ల పోలింగ్ ఇంకా ముగియనందున ఓటింగ్ శాతం మరికొంత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.16 పార్టీలకు చెందిన 249 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీపడ్డారు. శాంతిభద్రతల కోసం 250 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించారు. పోలింగ్ భారీగా నమోదు కావడంతో అధికార లెఫ్ట్‌ఫ్రంట్, కాంగ్రెస్ కూటములు విజయంపై ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. వరుసగా ఐదోసారీ తమకే అధికారం దక్కుతుందని లెఫ్ట్‌ఫ్రంట్, ఈ సారి ఓటర్లు తమనే గెలిపిస్తారని కాంగ్రెస్ ధీమాగా ఉన్నాయి.  

జగన్ సర్కార్ కి కొడాలి గండం.. త్వరలో ఏపీలో ప్రభుత్వం మారనుందా?

రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన పార్టీ.. సొంత పార్టీ నేతల కుమ్ములాట వల్లనో, ప్రత్యర్థి పార్టీల ఎత్తుల వల్లనే అనూహ్యంగా అధికారం కోల్పోవచ్చు. లేదా ఇక ఈ పార్టీ పని పనైపోయింది అనుకున్న పార్టీ.. అనూహ్యంగా పుంజుకుని అధికారంలోకి రావొచ్చు. ఇలా రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. ఇలాంటి ఊహించని పరిణామం త్వరలో ఏపీలో చోటుచేసుకోనుందా అంటే.. ఒక సెంటిమెంట్ బట్టి చూస్తే అవుననే అనిపిస్తుంది.   గుడివాడ నుండి గెలిచి మినిస్ట్రీ లో ఎవరున్నా ఆ గవర్నమెంట్ పూర్తి కాలం ఎప్పుడూ లేదు. మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి అదే సెంటిమెంట్ కొనసాగుతూ వస్తుంది. ఆ సెంటిమెంట్ నుండి ఎన్టీఆర్ కూడా తప్పించుకోలేకపోయారు. 1955 లో గుడివాడ నుండి గెలిచిన దళిత ఎమ్మెల్యే వేముల కూర్మయ్యకి ప్రకాశం పంతులు కేబినెట్ లో స్థానం కల్పించారు. కానీ, ఆ గవర్నమెంట్ పూర్తి కాలం లేదు. ఎన్టీఆర్ కూడా 1983 లో గెలిచి ముఖ్యమంత్రి అయినా 1984 లో నాదెండ్ల భాస్కరరావు కారణంగా ముఖ్యమంత్రి పీఠానికి దూరమయ్యారు. ఇక, 1985 లో హిందూపురం, గుడివాడ నుండి పోటీ చేసి రెండు చోట్లా గెలిచిన ఎన్టీఆర్.. సెంటిమెట్ తో గుడివాడని వదిలేసుకున్నారు. 1989 లో గుడివాడ నుండి గెలిచిన కటారి ఈశ్వర్ కుమార్ ని చెన్నారెడ్డి కేబినెట్ లోకి తీసుకున్నారు. అయితే ఆయన ప్రభుత్వం కూడా పూర్తికాలం లేదు. ఇలా గుడివాడ నుండి గెలిచి మినిస్ట్రీ లో ఎవరున్నా ఆ గవర్నమెంట్ పూర్తి కాలం లేదు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.   గుడివాడ నుండి ప్రస్తుతం కొడాలి నాని ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన జగన్ మంత్రివర్గంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే, 151 ఎమ్మెల్యేలతో మాకు తిరుగులేదు అనుకుంటున్న అధికార పార్టీని ఇప్పుడు గుడివాడ సెంటిమెంట్ వెంటాడుతోంది. ముఖ్యంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఆ సెంటిమెంట్ ని మరింత బలపరుస్తున్నాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి హిందూ దేవాలయంపై దాడులు, హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారాలు పెరిగిపోయాయి. దీంతో హిందువుల్లో అసంతృప్తి మొదలైంది. దీనికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్టు.. తిరుమలలో అన్యమతస్తులకు డిక్లరేషన్ అవసరం లేదని అధికార పార్టీ చెప్పటం హిందువుల ఆగ్రహానికి కారణమైంది. ఇది చాలదు అన్నట్టు కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హిందువుల ఆగ్రహాన్ని పదింతలు పెంచారు. ఎక్కడా లేని రూల్ తిరుమలలో ఎందుకు?, దేవుడి బొమ్మ చెయ్యి విరిగితే ఏమన్నా నష్టమా?, రథం కాలిపోతే ఏమైంది ఇంకొకటి చేపిస్తున్నాంగా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారాన్ని రేపాయి. ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని హిందూ సంఘాల నుండి పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ నిరసన సెగలు కొడాలి నాని మంత్రి సీటుకే కాదు, అసలు పార్టీ అధికారానికే ఎసరు పెట్టినా ఆశ్చర్యంలేదు. ఎందుకంటే కొడాలి నాని వ్యాఖ్యల మూలంగా ఆ స్థాయిలో ఆగ్రహావేశాలు భగ్గుమన్నాయి.   తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటికీ వైసీపీని కొన్ని విషయాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అసలే సీఎం జగన్ మెడకి కేసులు కత్తి వేలాడుతూ ఉంటుంది. ఇప్పటికే అవినీతి ఆరోపణల కేసులో 16 నెలలు జైలులో ఉన్న ఆయన.. మరోసారి జైలుకి పోయే అవకాశం లేకపోలేదు. మరోవైపు, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ.. తెలుగు రాష్ట్రాలలో అధికారంపై కన్నేసింది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియాని ఆకర్షించి అధికారం చేపట్టిన బీజేపీ.. ఏపీలోనూ అలాంటి ఎత్తులు వేసే అవకాశం లేకపోలేదు. దానికితోడు బీజేపీపై హిందూ పార్టీగా ముద్ర ఉంది. ఇప్పుడు వైసీపీ హయాంలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులు బీజేపీకి ఎంతోకొంత కలిసొచ్చే అవకాశముంది. ఇప్పటికిప్పుడు బీజేపీ ఏపీలో ఏదైనా ఎత్తు వేసినా.. జగన్ ఎదిరించి నిలబడే సాహసం చేయకపోవొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తలచుకుంటే ఆయనను మళ్ళీ  కృష్ణ జన్మ స్థానానికి పంపడం చిటికెలో పని. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, వైసీపీని వెంటాడుతున్న కేసులు, బీజేపీకి ఉన్న అవకాశాలు.. వీటిని బట్టి చూస్తుంటే ఏపీలో అధికారం మారడం సాధ్యమే అనిపిస్తోంది. మరి ఈ గుడివాడ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఏపీలో అనూహ్య పరిణామాలు ఏమన్నా జరుగుతాయేమో చూడాలి. హిందూ దేవాలయాలపై దాడులు, హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలతో అధికార పార్టీపైనా, కొడాలి నానిపైనా తీవ్ర ఆగ్రహంతో ఉన్న భక్తులు, హిందూ సంఘాలు మాత్రం.. గుడివాడ సెంటిమెంట్ వెంటనే వర్కౌట్ అయితే బాగుండు దేవుడా అని కోరుకుంటున్నారు.

బెంజ్ కారు ఎంతపని చేసింది?.. ఇప్పుడు జగన్ సర్కారు ఏం చేస్తుందో మరి!!

గత ప్రభుత్వ హయాంలో వేలు, లక్షల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించిన వైసీపీ సర్కార్.. చివరికి ఈఎస్ఐ స్కామ్ ను తెరమీదకు తీసుకొచ్చి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసింది. మొదట 150 కోట్ల అవినీతి జరిగింది అన్నారు. తరువాత మూడు కోట్లు అన్నారు. చివరికి అసలు అచ్చెన్నకు డబ్బు అందినట్టు ఎలాంటి ఆధారాలు లేవు అన్నారు. అంటే ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారు. కేవలం ఆయన ఒక కంపెనీని పరిశీలించండని ఇచ్చిన లేఖ ఆధారంగా.. అర్థరాత్రి గోడలు దూకి మరీ అరెస్ట్ చేశారు. శస్త్రచికిత్స జరిగిందని చెప్పినా వినకుండా వందల కిలోమీటర్లు కారులో తిప్పారు. దీంతో అచ్చెన్నకు రెండోసారి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన కరోనా బారిన కూడా పడ్డారు. దాదాపు 80 రోజుల తరువాత అచ్చెన్న బెయిల్ పై విడుదల అయ్యారు. ప్రతిపక్షంలోని బలమైన గొంతుని నొక్కాలన్న ఉద్దేశంతోనే అచ్చెన్నను అక్రమంగా అరెస్ట్ చేసి కక్ష సాధింపులకు దిగుతున్నారని టీడీపీ ఆరోపించింది. ఇదిలా ఉంటే.. అసలు ఆధారాలు లేకుండానే ఈఎస్ఐ స్కామ్ పేరుతో అచ్చెన్నను 80 రోజులు నిర్బంధించిన జగన్ సర్కార్.. ఇప్పుడు సాక్షాత్తు కార్మిక శాఖా మంత్రి మీదే ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇప్పుడేం చేస్తుంది జగన్ సర్కార్?.   ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కుమారుడు ఈశ్వర్‌కు.. పుట్టినరోజు సందర్భంగా ఈఎస్ఐ స్కాములో అరెస్ట్ అయిన ఏ-14 కార్తీక్ ఖరీదైన బెంజ్ కారు గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే, ఇది గిఫ్ట్ కాదని మంత్రికి ఇచ్చిన లంచం అని టీడీపీ ఆరోపిస్తోంది. మంత్రి మాత్రం అబ్బే తన కుమారుడు కారుతో ఫోటో మాత్రమే దిగాడని, తన కుమారుడు చేతుల మీదుగా వాళ్ళు కారు తీసుకున్నారని, ఆ కారు తనదని రుజువు చేస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.    అయితే మంత్రి ఆ కారు తమ పేరు మీద లేదని చెప్తున్నప్పటికీ.. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కారు మంత్రి కుమారుడిది కాకపోతే ఆయన ఆ కారులో ఎందుకు తిరుగుతున్నట్టు?. మంత్రి కుమారుడు ఈశ్వర్ ఆ కారులో తిరుగుతున్న ఫోటోలు, వీడియోలు చాలా సోషల్ మీడియాలో ఉన్నాయి. ఎవరైనా ఒకటి రెండు సార్లు ఫొటోస్ దిగుతారు. అంతేకాని, ఏడాది పొడవునా తమ దగ్గరే కారు ఉంచుకొని ఫొటోస్, వీడియో తీస్తూ తిరుగుతుంటారా. అంటే ఆ కారు ఎవరు పేరు మీదున్నా.. ఆ కారు మాత్రం మంత్రి కుమారుడిదే అని అర్థమవుతుంది.   అసలు ఈఎస్ఐ స్కాములో ఏ-14 ఉన్న కార్తీక్ మంత్రి కుమారుడుకి అంత ఖరీదైన కారు ఎందుకు ఇచ్చాడు. కోట్ల విలువైన గిఫ్ట్ లు ఇచ్చే అంత రిలేషన్ ఏంటి వాళ్ళకి?. అతను ఏ లబ్ది పొందకుండానే అంత ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చాడా?. ఒకసారి మంత్రి ఈ కార్తీక్ ని దత్త పుత్రుడిగా ప్రకటించారట. అంతేకాదు, ఈఎస్ఐ స్కాములో అరెస్ట్ అయిన అచ్చెన్నకు బెయిల్ రావడానికి 80 రోజులు పట్టింది. కానీ, ఏ-14 కార్తీక్ కి మాత్రం వెంటనే బెయిల్ వచ్చింది. అదెలా సాద్యమైంది? మంత్రి అండదండలు లేకుండానే ఇదంతా జరుగుతుందా?.   ఇంకో విషయం ఏంటనే..మంత్రి కుమారుడు వీడియోస్ లో మరి కొన్ని ఖరీదైన కార్లు కూడా కనిపిస్తున్నాయి. అంతంత ఖరీదైన కార్లు ఎక్కడి నుండి వచ్చాయి?. అంతేకాదు మంత్రి కుమారుడి వివాహ వేడుక సినీస్టార్స్ వెడ్డింగ్ అంత రిచ్ గా జరిగింది. ఇన్నిన్ని డబ్బులు ఎక్కడివి?. గత ఎన్నికల అఫిడవిట్ లో మంత్రి ఇచ్చిన ఆస్తుల విలువ ఎంతో తెలుసా?. చరాస్తులు స్థిరాస్తులు మొత్తం కలిపి 80 లక్షలు. కేవలం 80 లక్షల ఆస్తి కలిగిన కుటుంబం అంత ఖర్చు ఎలా పెడుతుంది? కోట్ల ఖరీదైన కార్లు ఎలా వాడుతుంది. అయితే కొని ఉండాలి లేదా ఎవరైనా ఇచ్చి ఉండాలి. ఒకవేళ కొని ఉంటే.. మంత్రి అఫిడవిట్ లో తప్పుడు వివరాలు ఇచ్చినట్టు లెక్క. అంటే అసలు ఆయన ఎన్నికే చెల్లదు. పోనీ గిఫ్ట్ ఇచ్చారనుకుందాం. ఏ లబ్ది పొందకుండా ఎవరైనా ఎందుకు గిఫ్ట్ ఇస్తారు. అది కూడా ఈఎస్ఐ స్కాములో ఏ-14 ఉన్న వ్యక్తి గిఫ్ట్ ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటి?. దీని వెనుకున్న నిజాలు బయటపడాలి. సీఎం అయిన దగ్గర నుండి అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యం అని చెప్తున్న జగన్.. మంత్రిపై చర్యలు తీసుకుంటారా? లేక మా పార్టీలో ఉన్నోళ్లు అంతా కడిగిన ముత్యాలు అంటూ అవినీతి మరకలతోనే ముందుకు సాగుతారో చూడాలి.   మంత్రి జయరాం మీద ఆరోపణలు కొత్తకాదు. ఈ ఏడాది కాలంలోనే ఆయనపైనా, ఆయన సన్నిహితులపైనా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆయన సమీప బంధువు పేకాట స్థావరాలు నిర్వహిస్తూ పట్టుబడ్డారు. ఆయన అనుచరులు అక్రమంగా ఇసుక, మద్యం రవాణా చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఆయనపై భూకబ్జా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా బెంజ్ కార్ల లంచం ఆరోపణలు. అసలు ఒక మంత్రి పై ఇన్ని ఆరోపణలా. కారు తమ పేరు మీద ఉంటే రాజీనామా చేస్తానంటున్న మంత్రి.. తనపై వచ్చిన ఈ ఆరోపణలన్నీ అబద్దమని నిరూపిస్తారా?. నిరూపించలేకపోతే రాజీనామా చేస్తారా?.

అధ్య‌క్షా.. నాకు సెల‌వు కావాలి!

పార్ల‌మెంటు మొద‌లై ప‌ట్టుమ‌ని మూడు రోజులు కూడా కాలేదు. ఆదిలోనే హంస‌పాదు ఎదుర‌వుతున్న‌ది. ఎంపీల్లో చాలామంది పార్ల‌మెంటుకి హాజ‌ర‌య్యేందుకు బొత్తిగా ఇష్ట‌ప‌డ‌టం లేదు. క‌రోనా వైర‌స్ ఏమాత్రం జాలి లేకుండా త‌న మానాన తాను దూకుడుగా ఎగిరి గంతేస్తున్న ఈ త‌రుణంలో ఎవ‌రికి వారు మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తూ పార్ల‌మెంటుకి వ‌స్తున్న‌ట్టు అనిపిస్తున్న‌ది. బుధ‌వారం మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్, మాజీ ఆర్ధిక మంత్రి చిదంబ‌రంతో స‌హా డ‌జ‌నుకు పైగా ఎంపీలు సెల‌వు చీటీలు స‌మ‌ర్పించారు. వ‌యోభారం వ‌ల్ల స‌మావేశాల‌కు రాలేక‌పోతున్నారా అంటే అదేమీ కాదు. క‌రోనా కార‌ణంగా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌తోనే వారీ నిర్ణ‌యానికొచ్చారు. మ‌న్మోహ‌న్ సింగ్ వ‌య‌స్సు 87 ఏళ్లు. అందువ‌ల్ల ఆయ‌న అవ‌స్ధ‌ని అర్ధం చేసుకోవ‌చ్చు. ఎక్కువ వ‌య‌స్సున్న వాళ్ల‌ని క‌రోనా అతి సునాయాసంగా ఆక‌ర్షిస్తున్న‌ద‌న్న వైద్యుల అప్ర‌మ‌త్త‌త నేప‌థ్యంలో మ‌న్మోహ‌న్ సింగ్ సెల‌వు పెట్ట‌డాన్ని పెద్ద‌గా అభ్యంత‌ర‌పెట్ట‌లేము. ఇక చిదంబ‌రం. ఆయ‌నకు 75 ఏళ్లు. కాబ‌ట్టి చిదంబ‌రానికీ మిన‌హాయింపు ఇవ్వొచ్చు. ఇలాంటి పెద్ద‌లు ఈ స‌మావేశాల చివ‌రి దాకా సెల‌వు అడిగారు. వీళ్లే కాదు. వైకాపా త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన పిర‌మ‌ల్ న‌త్వానీ కూడా సెల‌వు పెట్టారు. ఇలా మొత్తంమీద ప‌ద‌మూడు మంది దాకా సెల‌వు బాట‌లో ఉన్నారు. రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య నాయుడు వీరంద‌రికీ సెల‌వు మంజూరు చేశారు. మ‌రి రేప‌ట్నుంచి ఇంకా ఎంత‌మంది ఇదే బాట‌లో ప‌య‌నిస్తారో తెలీదు.    ఇటు రాజ్య‌స‌భ‌, అటు లోక్‌స‌భ ఇలా సెల‌వుల ప‌ర్వంలో ఉంటే స‌మావేశాలు స‌జావుగా సాగుతాయా అన్న సందేహాలున్నాయి. అయితే ప్ర‌స్తుతం ఉభ‌య స‌భ‌లు అటు సంఖ్యాప‌రంగానే కుదించుకున్నాయి. పూర్తి స్ధాయిలో స‌భ్యులు హాజ‌రు కావ‌డం లేదు. అలాగే ప్ర‌శ్నోత్త‌రాలు ఎత్తేశారు. ఇలా కీల‌క‌మైన స‌భా కార్య‌క్ర‌మాల‌నే కుదించాల్సి వ‌చ్చింది. మ‌రి రాజ్యాంగ నియ‌మాల ప్ర‌కారం పార్ల‌మెంటు జ‌ర‌పాలి. పెండింగ్ బిల్లులు ఉంటాయి. వాటిని ఆమోదించి చ‌ట్ట‌రూపం తేవాలి. అవి నిజానికి చాలా ముఖ్యమైన‌విగా ఉంటాయి. కాని అవ‌త‌ల క‌రోనా ప‌రిస్థితి అలా ఉన్న‌ప్పుడు ప్ర‌భుత్వం కూడా మ‌మ అనే ప‌ద్ద‌తిలోనే స‌భ‌ను సాగిస్తున్న‌ది. అందువ‌ల్ల ఎంత‌మంది స‌భ్యులు సెల‌వులు పెట్టినా స‌భ‌లో పూర్తి చేయాల్సిన ప్ర‌భుత్వ‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మాలు పూర్తి చేయ‌డానికి పెద్ద‌గా అడ్డంకులు ఏవీ ఉండ‌క‌పోవ‌చ్చు. ఎటొచ్చీ స‌మావేశాల చివ‌రిదాకా ఎంత‌మంది స‌భ‌లో నిలుస్తార‌న్న‌దే ప్ర‌శ్న‌. తామెవ్వ‌రం లేకుండా బిల్లులు ఆమోదించ‌డానికి వీల్లేద‌ని ఎంత‌మంది అడ‌గ‌గ‌ల‌రు? అడిగితే ప్ర‌భుత్వం మిన్న‌కుంటుందా? అవ్వా కావాలి..బువ్వా కావాలి అంటే కుద‌ర‌దు..అవ‌త‌ల క‌రోనాకి లీవూ మీరే అడుగుతారు..మ‌ళ్లీ బిల్లుల మీద చ‌ర్చ‌లో మీరే ఉండాల‌ని అడుగుతారా అంటూ ఎదురుదాడి చెయ్య‌దా? -రాజా రామ్మోహ‌న్ రాయ్‌

బాలు మ‌ర‌ణ‌వార్త‌ను ప్ర‌క‌టించిన త‌న‌యుడు చ‌ర‌ణ్‌

  గురువారం సాయంత్రం గాన‌గంధ‌ర్వుడు ఎస్పీ బాలు తిరిగి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌నీ, ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌నీ ఎంజీఎం ఆస్ప‌త్రి వ‌ర్గాలు అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌రించ‌డంతో అశేష బాలు అభిమానులు ఆందోళ‌న‌లో మునిగిపోయారు. అప్ప‌ట్నుంచే అంద‌రిలోనూ ఆయ‌న తిరిగి మ‌న మ‌ధ్యకు వ‌స్తారా, రారా.. అనే సందేహాలు మొద‌ల‌య్యాయి. ఆ ముందు రోజు ఆయ‌న‌కు జ్వ‌రం వ‌చ్చి, శ్వాస తీసుకోవ‌డానికి ఇబ్బంది ప‌డ్డార‌నీ బాలు కుటుంబ స‌న్నిహితులు తెలిపారు. యాభై రోజుల పాటు క‌రోనాతో పోరాడి అల‌సిపోయిన బాలు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం శాశ్వ‌తంగా సెల‌వుతీసుకున్నారు. ఆయ‌న గొంతు శాశ్వ‌తంగా మూగ‌బోయింది. బాలు మృతివార్త‌ను స్వ‌యంగా ఆయ‌న త‌న‌యుడు చ‌ర‌ణ్ ప్ర‌క‌టించారు. ఎంజీఎం హాస్పిట‌ల్ ముందు కిక్కిరిసిన మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడుతూ చ‌ర‌ణ్‌, "నాన్న‌గారు ఈ రోజు మ‌ధ్యాహ్నం 1.04 గంట‌ల‌కు స్వ‌ర్గీయుల‌య్యారు. ఆయ‌న కోసం ప్రార్థించిన అంద‌రికీ, ఎంజీఎం హాస్పిట‌ల్‌లోని డాక్ట‌ర్లు, న‌ర్సులు, ఇత‌ర సిబ్బంది అంద‌రికీ మా కుటుంబం ఎప్ప‌టికీ కృత‌జ్ఞులం. అభిమానులున్నంత వ‌ర‌కూ మా నాన్న‌గారు మాకుంటారు. మీరంద‌రూ ఉన్నంత‌వ‌ర‌కూ మా నాన్న‌గారి పాట ఉంటుంది." అని ప్ర‌క‌టించారు. తెలుగుతో పాటు త‌మిళ‌, ఇంగ్లీష్ భాష‌ల్లోనూ బాలు మ‌ర‌ణ వార్త‌ను ఆయ‌న తెలిపారు. ఈ విష‌యం ప్ర‌క‌టించేట‌ప్పుడు దుఃఖంతో ఆయ‌న గొంతు పూడుకుపోయింది.

నా హృద‌యంలో బాలు ఎప్పుడూ ఉంటారు.. మోహ‌న్‌బాబు భావోద్వేగం

  "నాకు అత్యంత ఆత్మీయుడు, ఆప్తమిత్రుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మణ్యంగారు. మేమిద్ద‌రం క‌లిసి శ్రీ‌కాళ‌హ‌స్తిలో కొన్నాళ్లు చ‌దువుకున్నాం. ఆ కాలంలో ఆయ‌న‌ను స‌లాడ‌మ్ అని పిలిచేవాడ్ని. హాఫ్ ప్యాంట్ వేసుకొనేవాళ్ల‌ను చిత్తూరు యాస‌లో స‌లాడ‌మ్ అనేవాళ్లు. అప్ప‌ట్నుంచే మేం మంచి ఫ్రెండ్స్‌మి. చాలా క‌లివిడిగా ఉండేవాళ్లం. కాల‌క్ర‌మంలో ఇద్ద‌రం సినీ రంగంలో అడుగుపెట్టాం. ఆయ‌న గాయ‌కుడైతే, నేను న‌టుడ్న‌య్యాను. శ్రీ‌కాళ‌హ‌స్తిలో మొద‌లైన మా స్నేహం, ఆత్మీయ‌త చెన్నైలోనూ కొన‌సాగింది. శ్రీ‌విద్యా నికేత‌న్‌లో ఏ కార్య‌క్ర‌మం జ‌రిగినా బాలు రావాల్సిందే. గ‌త మార్చి 19 నా పుట్టిన‌రోజున శ్రీవిద్యా నికేత‌న్‌ వార్షికోత్స‌వానికి కూడా ఆయ‌న హాజ‌రు కావాల్సింది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఆ కార్యక్రమం కేన్సిల్ కావడంతో రాలేక‌పోయారు. ఈమ‌ధ్య కూడా ఫోన్‌లో ఇద్ద‌రం కొద్దిసేపు ముచ్చ‌టించుకున్నాం. ఆయ‌న ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత గాయ‌కుడు. అన్ని దేవుళ్ల పాట‌లు పాడి ఆ దేవుళ్లనందరినీ మెప్పించిన గాన గంధర్వుడు. ఏ దేవుడి పాట పాడితే ఆ దేవుడు మ‌న ముందు ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్లే ఉంటుంది. అలాంటి దిగ్గ‌జ గాయ‌కుడిని కోల్పోవ‌డం యావ‌త్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకే కాదు, యావ‌ద్దేశానికీ ఎంతో బాధాక‌రం. నాకు వ్య‌క్తిగ‌తంగా ఎంతో లోటు. నా సినిమాల్లో ఎన్నో అద్భుత‌మైన పాట‌లు పాడారు. నా చెవుల్లో ఆయ‌న పాట ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. నా హృద‌యంలో ఆయ‌న ఎప్పుడూ ఉంటారు. ఈ సంద‌ర్భంగా ఓ విష‌యం చెప్పాల‌నిపిస్తోంది. నేను అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసే కాలంలో ఆర్థికంగా క‌ష్టాల్లో ఉన్నాను. అప్పుడు బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ద‌గ్గ‌ర‌కు వెళ్లి వంద రూపాయ‌లు అడిగి తీసుకున్నాను. మేం క‌లుసుకున్న‌ప్పుడ‌ల్లా ఇప్ప‌టికీ ఆ వంద రూపాయ‌ల విష‌యం ప్ర‌స్తావించి, 'వ‌డ్డీతో క‌లిపి ఇప్పుడ‌ది ఎంత‌వుతుందో తెలుసా! వ‌డ్డీతో స‌హా నా డ‌బ్బులు నాకు ఇచ్చేయ్.' అని స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించేవారు. మా మ‌ధ్య అంతటి స్నేహం, స‌న్నిహిత‌త్వం ఉంది. అలాంటి మంచి స్నేహితుడ్ని కోల్పోయాను. మ‌నిష‌నేవాడికి ఎప్పుడు, ఎక్క‌డ‌, ఎలా అవుతుంద‌నే తెలీదు. బాలు మ‌ర‌ణం న‌న్నెంతో బాధించింది. ఆయ‌న ఆత్మకు శాంతి చేకూరాల‌ని ఆశిస్తూ, ఆయ‌న కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను."

సింగింగ్ లెజెండ్ ఎస్పీబీ ఇక‌లేరు.. యావ‌త్ దేశం క‌న్నీరుమున్నీరు!

  లెజెండ‌రీ సింగ‌ర్ ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం అలియాస్ బాలు ఇక‌లేరు. దాదాపు ఐదున్న‌ర ద‌శాబ్దాల పాటు త‌న గాన ప్ర‌వాహంలో మ‌న‌ల్ని ఓల‌లాడించిన ఆ గాన‌గంధ‌ర్వుడు ఇక సెల‌వంటూ మ‌నల్ని వీడి వెళ్లిపోయారు. అవిశ్రాంతంగా, అలుప‌నేది లేకుండా న‌ల‌భై వేల‌కు పైగా పాట‌లు పాడిన ఆ మ‌హాగాయ‌కుడు ఈ భౌతిక ప్ర‌పంచాన్ని వీడి శాశ్వ‌తంగా క‌న్నుమూశారు. త‌న జీవితంలో ఎవ‌రికీ త‌ల‌వంచ‌ని ఆయ‌న యాభై రోజులుగా క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాడుతూ శుక్ర‌వారం దానికి త‌ల‌వొగ్గారు. బాలు లేర‌నే వాస్త‌వాన్ని జీర్ణించుకోలేక అశేష అభిమానులు త‌ల్ల‌డిల్లుతూ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్నారు. ఆయ‌న మృతితో యావ‌త్ సంగీత ప్ర‌పంచం చిన్న‌బోయింది. తెలుగు సినీ సంగ‌త రంగంలో ఒక శ‌కం ముగిసింది. ఒక ధ్రువ‌తార నింగికెగ‌సింది. ఆయ‌న వ‌య‌సు 74 సంవ‌త్స‌రాలు. ఆయ‌న‌కు భార్య సావిత్రి, కుమారుడు చ‌ర‌ణ్‌, కుమార్తె ప‌ల్ల‌వి ఉన్నారు. బాలు కొవిడ్ 19 పాజిటివ్ అని తేలి ఎంజీఎం హాస్పిట‌ల్‌లో చేరిన కొద్ది రోజులుగా ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి క్షీణించింద‌నే వార్త‌లు రావ‌డంతో ఆయ‌న ఆరోగ్యం కుదుట‌ప‌డాల‌ని ఆశిస్తూ టాలీవుడ్‌లోని సంగీత‌కారులు, కోలీవుడ్ వ‌ర్గాలు సామూహిక ప్రార్థ‌న‌లు చేయ‌డం ఒక అసాధార‌ణ విష‌యం. ఒక క‌ళాకారుడికి సంబంధించి ఇలాంటి ఘ‌ట్టం ఇదివ‌ర‌కు మ‌నం చూడ‌లేదు. అంతేకాదు, ఇళ‌య‌రాజా, ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌, చిరంజీవి, బాల‌కృష్ణ‌, మోహ‌న్‌బాబు లాంటి దిగ్గ‌జాలు స‌హా వంద‌లాది మంది సెల‌బ్రిటీలు ఆయ‌న క్షేమంగా హాస్పిట‌ల్ నుంచి బ‌య‌ట‌కు రావాలంటూ ప్ర‌క‌ట‌న‌లు జారీచేయ‌డం, ఆయ‌న‌తో త‌మ అనుబంధం పంచుకోవ‌డం కూడా బాలు మ‌హోన్న‌త స్థాయిని తెలియ‌జేసే విష‌యం. బాలు కుమారుడు చ‌ర‌ణ్ ఎప్ప‌టిక‌ప్పుడు తండ్రి ఆరోగ్య స్థితిగ‌తుల గురించి పంచుకుంటూ రావ‌డం, కొద్ది రోజులుగా ఆయ‌న ఆరోగ్యం మెరుగ‌వుతూ వ‌స్తోంద‌నీ, వ్యాయామం కూడా చేస్తున్నార‌ని తెల‌ప‌డంతో అశేష అభిమానులు ఎంతో సంబ‌ర‌ప‌డ్డారు. ఆయ‌న మ‌ళ్లీ మ‌న‌ముందుకు వ‌చ్చి, పాట‌లు పాడ‌తార‌ని ఆశ‌లు పెట్టుకున్నారు. అలాంటిది హ‌ఠాత్తుగా ఆయ‌న కొన ఊపిరితో మృత్యువుతో యుద్ధం చేస్తున్నార‌ని తెలియ‌డంతో గుండెలు ఉగ్గ‌బ‌ట్టుకొని ఏ క్ష‌ణం ఎలాంటి వార్త వినాల్సి వ‌స్తుందోన‌ని ఆందోళ‌న చెందారు. చివ‌ర‌కు తండ్రి క‌న్నుమూశార‌నే వార్త‌ను క‌న్నీటి ప‌ర్యంత‌మ‌వుతూ చ‌ర‌ణ్ స్వ‌యంగా చెప్ప‌డంతో వారి గుండెలు బ‌ద్ద‌ల‌య్యాయి. అసాధార‌ణ ప్ర‌జ్ఞావంతునిగా, అనిత‌ర‌సాధ్యునిగా సంగీత రంగంలో రాణించిన బాలసుబ్రహ్మణ్యం పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయ‌న‌ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, మ‌ల‌యాళం, హిందీ త‌దిత‌ర 11 భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడారు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుచుకుంటారు. ఆయన నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో 1946 జూన్ 4న జన్మించారు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరారు. చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడుతూ పాల్గొంటూ బహుమతులు సంపాదించారు. 1966 లో ప్ర‌ముఖ హాస్య‌న‌టుడు పద్మనాభం నిర్మించిన 'శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న' చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. 'శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న' చిత్రానికి ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకులు. తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు "కోదండపాణి ఆడియో ల్యాబ్స్" అని ఆయ‌న‌ పేరే పెట్టుకున్నారు బాలు. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడారు బాలు. అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచారు. పదాల మాదుర్యాన్ని గమనించి చేసే ఉచ్చారణ ఆయ‌న‌ పాటను పండిత పామరులకు చేరువ చేసింది. 'శంకరాభరణం', 'సాగరసంగమం' లాంటి తెలుగు చిత్రాలే కాకుండా 'ఏక్ దూజే కేలియే' లాంటి హిందీ చిత్రాలకు ఆయ‌న‌ పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. 54 ఏళ్ళ సినీప్రస్థానంలో 11 భాషలలో 40 వేల పాటలు  పాడి, 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించారు బాలు. 1969లో 'పెళ్ళంటే నూరేళ్ళ పంట' చిత్రంలో మొదటిసారిగా నటుడిగా కనిపించిన ఆయ‌న‌ తర్వాత అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించారు. ప‌క్కింటి అమ్మాయి (1981),  ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) మొదలైనవి ఆయన నటించిన కొన్ని సినిమాలు. బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేకమంది న‌టుల‌కు గాత్రదానం చేశారు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్ళకి డ‌బ్బింగ్ సినిమాల్లో వాయిస్ ఇచ్చారు. టీవీ రంగంలోనూ త‌న‌దైన బ‌ల‌మైన ముద్ర‌వేసిన‌ ఆయన 'పాడుతా తీయగా', 'పాడాలని ఉంది' లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయనీ గాయకులను పరిచయం చేశారు. ఇవి కాకుండా ఈటీవీలో ప్రసారమైన 'స్వరాభిషేకం' లాంటి కార్యక్రమాల్లో తన గానాన్ని వినిపించారు. సినీ రంగానికీ, సంగీత రంగానికీ చేసిన విశేష సేవ‌ల‌కు గాను కేంద్రప్రభుత్వం నుండి 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011లో పద్మభూషణ్ పురస్కారాన్ని బాలు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నారు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు అవార్డులు అందుకున్నారు. 2012లో  'మిథునం' సినిమాలో చేసిన ప్ర‌ధాన పాత్రకు గాను నంది ప్రత్యేక బహుమతి లభించింది. 2016 నవంబరులో గోవాలో జరిగిన 47వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ఆయ‌న "సెంటినరీ అవార్డ్‌ ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2016" అవార్డ్ అందుకున్నారు.

విజయ్ దేవరకొండ ఇంటికెళ్లిన రష్మిక... ఎందుకంటే?

  విజయ్ దేవరకొండ తల్లి మాధవి హాఫ్ సెంచరీ కొట్టారు. ఆమె క్రికెట్ ఆడలేదులెండి‌‌. హాఫ్ సెంచరీ కొట్టింది వయసులో! నిన్న (గురువారం) మాధవి పుట్టినరోజు. పైగా 50వ పుట్టిన రోజు కావడంతో కుటుంబ సభ్యుల మధ్య స్పెషల్ గా సెలబ్రేట్ చేశారు విజయ్ దేవరకొండ. ఆ పార్టీకి హీరోయిన్ రష్మిక వెళ్లారు. రెండు సినిమాలలో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించారు. 'గీత గోవిందం' భారీ విజయం సాధించగా... 'డియర్ కామ్రేడ్' మంచి పేరు తెచ్చుకుంది. రెండు సినిమాల్లోనూ ఇద్దరి మధ్య లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ...  ప్రేమలో పడ్డారంటూ పుకార్లు వచ్చాయి. తాము మంచి స్నేహితులం మాత్రమేనని, తాను ఎవరినీ ప్రేమించడం లేదని రష్మిక పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు కూడా చేశారు. అదే వాళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ... ఆఫ్ స్క్రీన్ రిలేషన్షిప్ చూసిన చాలామంది మాత్రం ఆమె మాటలు నమ్మశక్యంగా లేవని కామెంట్లు చేస్తున్నారు. ఫ్యామిలీ పార్టీకి సినిమా ఇండస్ట్రీకి చెందిన ఇతరులను ఆహ్వానించకుండా... కేవలం రష్మికను మాత్రమే విజయ్ దేవరకొండ ఆహ్వానించడం వెనక ఏదో ఉందనుకుంటున్నారు జనాలు. వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని పుకారు మరోసారి మొదలవుతుంది ఏమో!?

వరస్ట్ ఫర్ఫార్మెన్స్ తో జైలుపాలైన కెప్టెన్‌ నోయల్.. గంగవ్వతో ఫైట్ చేసిన మోనాల్!

  బిగ్ బాస్ సీజన్ 4లో 16వ రోజు ఇంటి సభ్యులకు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయడానికి  చాలా టైమ్ తీసుకున్నారు బిగ్ బాస్. ఒక రాత్రంతా మనుషుల టీమ్ సభ్యులు ఇంటిబయటే ఉండాల్సి వచ్చింది. ఉదయమే వేకప్ సాంగ్ గా  బైండ్ బ్లాక్ బైండ్ బ్లాక్ సాంగ్ కు స్టెప్పులేశారు. అయితే టీమ్ గా విడిపోయిన రాత్రంతా టాక్స్ పూర్తి చేయడానికి కష్టపడ్డ ఇంటిసభ్యులు ఉదయమే చాలా డల్ గా కనిపించారు. అవినాష్ అమ్మ రాజశేఖర్ ను మాటల్లో పెట్టి అతనికి తెలీకుండానే అత‌ని చార్జింగ్ పెట్టుకున్నాడు. దాంతో అవినాష్ చార్జింగ్ అవుతున్నట్లుగా బీప్ సౌండ్ వచ్చింది. అది గ‌మ‌నించిన‌ దివి "మాస్టర్ మీ చార్జింగ్ పెట్టుకుంటున్నాడు" అని అరిచింది దివి. "చార్జింగ్ పెట్టుకున్నా సోయి లేదు" అంటూ సోహైల్ రాజశేఖర్ ను విమర్శించాడు. దివి అవినాష్‌ను కొట్టింది. అయితే అభిజిత్ న‌మ్మ‌క‌ద్రోహంతో బాగా హ‌ర్ట్ అయిన‌ రాజశేఖర్, ఇప్పుడు అవినాష్ కూడా అలాగే ప్రవర్తించడంతో "లైఫ్‌లో నాశనం అయిపోతావు" అంటూ తిడుతూ,  త‌న‌తో మాట్లాడ‌వద్దు అంటూ అవినాష్‌కు వార్నింగ్ ఇచ్చాడు. కూల్ చేసేందుకు అవినాష్ నానా తంటాలు ప‌డినా అమ్మ రాజశేఖర్ తమ పట్టు వదలలేదు. త‌ర్వాత‌ మోనాల్ గంగవ్వ రోబో డ్రెస్‌ను తీసి విసిరేసింది. దాంతో మోనాల్‌పై సివంగిలా లేచింది గంగవ్వ. మోనాల్ పై కుర్చీ ఎత్తేసింది.  దాంతో ఆమె డ్రస్ మోనాల్ ఇచ్చేసింది. మ‌రోవైపు  రోబోల‌కు ఎలాంటి చార్జింగ్ ఇవ్వ‌కుండానే మనుషులు వాష్‌రూమ్ వాడేసుకున్నారు. అడ్డువచ్చిన లాస్యను మోనాల్ తోసేయడంతో ఇద్దరూ కింద పడ్డారు. వాటర్, గ్యాస్ వంటి కనెక్షన్స్ ను మోనాల్ కట్ చేసింది. వారించిన అరియానాతో ఫైట్ చేసింది. చార్జింగ్ లేకపోవడంతో అరియానా, కుమార్ సాయి, హారిక, లాస్య, అవినాష్ చచ్చిపోయారు. టాస్క్ పూర్తి అయ్యిందని బజర్ మోగే సమయానికి అభిజిత్, గంగవ్వ బతికే ఉన్నారు. మొత్తానికి ఎత్తులకు పై ఎత్తులు, వాదనలు, మోసాలు, అరుపులు, కేకలతో ఉక్కు మనిషి టాస్క్ 17వ రోజు పూర్తి చేశారు. టాస్క్ పూర్తి అయ్యే సమయానికి గంగవ్వ, అభిజిత్ బతికే ఉండటంతో రోబో టీమ్ గెలిచినట్లుగా బిగ్ బాస్ ప్రకటించారు. అయితే రాత్రంతా ఇంటి బయట ఉండి, తిండి, నిద్ర లేకుండా గడిపిన తమ శ్రమ అంతా వేస్ట్ అయ్యిందని మనుషుల టీమ్ సభ్యులు బాధ పడ్డారు. టాస్క్ లో బెస్ట్ ప‌ర్ఫార్మెన్స్ చూపించిన సభ్యులుగా అభిజిత్, గంగవ్వ, అవినాష్, హారిక బిగ్ బాస్ మెప్పు పొందారు. వారి నలుగురి పేర్లను హౌస్ కెప్టెన్ గా పోటీ చేసే అర్హత ఉందని బిగ్ బాస్ చెప్పాడు. ఓడిపోయిన మనుషుల టీమ్ సభ్యుల నుంచి వరస్ట్ ప‌ర్ఫార్మెన్స్‌ ప్రదర్శించిన వ్యక్తిని గుర్తించమని ఇంటిసభ్యులకు బిగ్ బాస్ సూచించగా  నోయల్ దివిని హౌస్ లోకి పంపించాను కాబట్టి నేనే బిగ్ బాస్ అన్నాడు. ఇంటి సభ్యుల్లో కొందరు దివి, సుజాత పేరు చెప్పారు. అయితే చివరికి అందరూ కలిసి నోయల్ పేరు చెప్పడంతో అతనికి జైలు శిక్ష విధించాడు బిగ్ బాస్. ఇంటి ఆవరణలో ఉన్న జైలులోకి నోయల్ వెళ్లాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ఇంటి సభ్యులు అతనికి ఎలాంటి ఆహారం ఇవ్వవద్దని, రాగులు అతనే విసిరి పిండి చేయాలని, ఆ పిండితో మాత్రమే జావ చేసి అతనికి ఇవ్వాలని బిగ్ బాస్ సూచించాడు. ఉండాలనిపిస్తలేదు.. ఉక్కు మనిషి టాస్క్ లో బుద్ధిబలంతో దివిని హౌస్ లోకి తీసుకువచ్చిన అభిజిత్ టాస్క్ గెలిచినప్పటికీ చాలా షేమ్ గా ఫీల్ అవుతున్నాడు. టాస్క్ గెలవడానికి తాను చేసిన ప్రయత్నాన్ని చీటింగ్ అంటూ మరో టీమ్ వాళ్లు దూషించడం బాధగా ఉన్నదని హారికతో తన ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాడు. "నువ్వు చాలాబాగా టాస్క్ ను పూర్తి చేశావు. నీ వల్లే మన టీమ్ గెలిచింది" అంటూ హారిక అభిని మెచ్చుకుంది. బందీని కాను నేను.. సంధించి వస్తాను "బందీని కాను నేను.. సంధించి వస్తాను, చెరసాలలో వేసినా చరిత్ర రాస్తాను" అంటూ సాంగ్ పాడుతూ తనకు తాను ధైర్యం తెచ్చుకునే ప్రయత్నం చేశాడు నోయల్. ఇంటి సభ్యులతో హుషారు నింపేలా నోయల్ జైలులో ఉండటంతో దిగులుగా గంగవ్వ, దివి, అమ్మ రాజశేఖర్ జైలు బయట కూర్చున్నారు. ఇంతలో ఇంటి తలుపులు తెరుచుకున్నాయి.  ముఖానికి మాస్క్ పెట్టుకున్న అమ్మాయి హౌస్ లోకి అడుగుపెట్టింది. రేప‌టి ఎపిసోడ్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన ఆమెను ఆహ్వానిస్తూ స్టెప్పులు వేసే సీన్ ను ప్రోమోగా వేశారు. మరి ఆ అమ్మాయి ఎవరు అన్నది తెలుసుకోవాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ చూడాల్సిందే..

రాజకీయాలకు బలౌతున్న ఐఏఎస్ అధికారులు

ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు. తండ్రి చేతిలో ఎత్తులు చుసిన వారు తనయుడి చేతిలో లోతులు చూస్తున్నారు. వారిద్దరూ సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఒకరినైతే మెడపట్టుకుని బయటకు గెంటేశారు. మరొకరిని కులం పేరుతో కుళ్లపొడుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరు అధికారులూ కూడా చంద్రబాబు అంటే గిట్టనివారే. ఇద్దరు అధికారులు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చూపుకు గురి అయిన వారే. ఒకరు బలయ్యారు.. మరొకరు అవుతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే ఒకరు ఎల్‌వి సుబ్రహ్మణ్యం. రెండో వారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యంకు జగన్ కేసుల్లో సహా ముద్దాయిగా ఉన్నారని ప్రాధాన్య పోస్టులు ఇవ్వలేదు. ఒక సందర్భంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పోస్టు ఇచ్చినా మళ్ళీ ఆయనను అక్కడ నుంచి తీసి అత్యంత చిన్నదైన యువజన శాఖకు మార్చారు. ఇక రమేష్ కుమార్ పరిష్తితి కూడా దాదాపుగా అంతే. చంద్రబాబు హయాంలో ఆయనకు ఏ కీలక శాఖ లభించలేదు. ఈ ఇద్దరూ వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిభకు తగిన గుర్తింపు పొందారు. ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఇద్దరూ ఆర్ధిక శాఖను నిర్వహించిన వారే. ఆర్ధిక శాఖలో ఈ ఇద్దరిదీ ప్రత్యేకమైన శైలి అని వారితో సాన్నిహిత్యం ఉన్న అధికారులు అంటారు. రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడంలో బిల్లుల చెల్లింపు తదితర విషయాలలో ఎలాంటి వివాదాలు రాకుండా చూసిన వారన్న విషయాన్ని మర్చిపోలేం అని చెప్తున్నారు. ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడం, జవాబుదారీతనం, దుబారా తగ్గించడం వంటి విషయాల్లో ఈ ఇద్దరూ అనేక చర్యలు తీసుకున్నారు.వీరికి ఇంకో పోలిక కూడా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఇద్దరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా పని చేశారు. ఈ ఇద్దరి హయాంలో తిరుమల పవిత్రత రెండింతలు పెరగడమే కాకుండా క్రమ శిక్షణ ఉండేదన్న విషయం మర్చిపోరాదు. భక్తుల సౌకర్యార్ధం ఈ ఇద్దరి హయాంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతో సీనియర్ రాజకీయ నాయకులు ట్రస్టు బోర్డు చైర్మన్లుగా ఉన్నా కూడా ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఈవోలుగా ఉన్నప్పుడు వీరు చెప్పినట్లే నడచుకునేవారన్న పేరుండేది. వృత్తి పట్ల అంతటి నిబద్ధతతో ఈ ఇద్దరు అధికారులు పని చేశారు. అత్యంత సీనియర్ అయిన ఎల్‌వి సుబ్రహ్మణ్యం ను పక్కన పెట్టి ఆయన కన్నా జూనియర్లకు చంద్రబాబునాయుడు చీఫ్ సెక్రటరీ పదవిని అప్పగించారు. అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యని విషయం మనం చూసాం. సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేటాను పక్కన పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఎల్‌వి సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఎన్నికల కమీషన్ ప్రధాన కార్యదర్శిగా నియమించాక సహ ముద్దాయిని సిఎస్ గా ఎలా నియమిస్తారని విమర్శించారు కూడా.   ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ ఎల్‌వీ ని కొనసాగించగా జగన్ ను అందరూ మెచ్చుకున్నారు కూడా. అయితే ఏమైందో ఏమూ కానీ కొద్ది కాలంలోనే ఎల్‌వి ని అత్యంత అవమానకరంగా పదవి నుంచి జగన్ తొలగించిన విధానం కూడా తెలిసిందే. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా దాదాపుగా అలానే జరిగింది. ఆయనను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించడం చంద్రబాబుకు అస్సలు ఇష్టం లేదు. చంద్రబాబు దగ్గర పని చేయడం రమేష్ కుమార్ కూ ఇష్టం లేదని అంటారు. అయితే తన కార్యదర్శిగా పని చేసిన రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నియమించాలని అప్పటి గవర్నర్ ఇ ఎస్ ఎల్ నర్సింహన్ చంద్రబాబుపై వత్తిడి తెచ్చారనీ. గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అప్పగించారనీ అంటున్నారు. రమేష్ కుమార్ పేరు బదులు వేరే అధికారి పేరు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశామని చంద్రబాబు కూడా చెప్పారు. అటువంటి రమేష్ కుమార్ ఇప్పుడు చంద్రబాబు ఏజెంటుగా జగన్ చేతిలో ముద్ర వేయించుకోవడం దురదృష్టం. ఈ ఇద్దరూ ముక్కుసూటిగా మాట్లాడే అధికారులు. ఎలాంటి మొహమాటం లేకుండా విధులు నిర్వర్తించే వారన్న పేరుంది. అలాంటి ఈ ఇద్దరూ కూడా అత్యంత ఘోరమైన అవమానాన్ని పొందారు. ఈ అవమానాలకు వీరు అర్హులు కాదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చని అధికార వర్గాలు అనుకుంటున్నారు. నాయకులు తమ స్వంత ప్రయోజనాల కోసం అఖిల భారత సర్వీసు అధికారులకు కులాలు, ప్రాంతాలు అంటగట్టడం ఏంటని కొందరు ఆవేదన చెందుతున్నారు.

ఆంధ్ర లో బీజేపీ 'పంచ్' తంత్రం...

  * దిగుమతి నాయకులు, బిజినెస్ లీడర్లు, లాబీయిస్టులు కలిసి బీ జె పి ని ఎటు నడిపిస్తారో....  * ఇంతకీ స్థానిక సమరం లో సత్తా చూపించే ట్యాలెంట్ ఆ పార్టీకి ఉన్నట్టా, లేనట్టా....  * జి వి ఎల్ ఋతుపవనాల్లాంటి వారు... ఇలావచ్చి అలా పలకరించి, అటు నుంచి ఆటే మాయమైపోతారు  * సి ఎం రమేష్ లాబీ మాస్టర్ గా ఢిల్లీ లో ప్రసిద్ధులు.. నోకియా మాదిరి ఈయన కూడా కనెక్టింగ్ పీపుల్ నినాదాన్ని బలంగా నమ్మిన వారు  * సుజనా చౌదరి... గత్యంతరం లేని పరిస్థితుల్లో అమరావతి నినాదాన్ని భుజాన వేసుకుని చందమామ కథలో విక్రమార్కుడి మాదిరి ... వై ఎస్ ఆర్ సి పి లోని బేతాళుడి తో జగడమాడుతుంటారు  * టీ జీ వెంకటేష్.. అవసరార్ధ రాజకీయాల కు కేరాఫ్ అడ్రెస్ .... రాయలసీమ అనేది ఈయనకు ట్యాగ్ లైన్ ...దురదపుట్టినప్పుడు గోక్కోవటానికి ఉపయోగపడే ఆరో వేలుగా ఆయన ఆ నినాదాన్ని బాగా వాడేస్తారు..  * అంగ వంగ కళింగ రాజ్యాలను అవలీలగా గెలిచిన చక్రవర్తి, చివరకు ఆముదాలవలస లో ఓడిపోయినట్టు, రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ , చివరకు పవన్ కళ్యాణ్ తో కలిసి స్థానిక సమరం లో బీజేపీకి కాస్తో కూస్తో ఉన్న ఇమేజ్ ని పణం గాపెట్టే సాహసానికి ఒడిగట్టారు  ఆ ఐదుగురూ ఇంతకీ ఏమి చేస్తున్నట్టు..భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్ , కాంగ్రెస్ లో నుంచి బీ జె పి లోకి షిఫ్ట్ అయిన  బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ  నారాయణ కలిసి ఈ స్థానిక సమరం లో రాష్ట్రం మొత్తం మీద కనీసం ఒక్కొక్కరికి 50 చొప్పున 250 మంది ఎం పి టి సి లు, జెడ్ పీ టి సి లను  గెలిపించుకురాగలరా అనేది చాలా పెద్ద సందేహం గా కనిపిస్తోంది. ఎందుకంటే, నిన్ననే విజన్ డాక్యుమెంట్ ని కలిసి ఆవిష్కరించిన బీ జె పి , జన సేన కంబైన్ నేతలు , చాలా పెద్ద  దృశ్యాన్నే జనం ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వై ఎస్ ఆర్ సి పి, తెలుగుదేశం పార్టీ లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు గా ప్రకటించుకున్న ఈ ఐదుగురిదీ  వాస్తవానికి తలో దారీ.. ఎవరు , ఎప్పుడు, ఎందుకు, ఎలా మాట్లాడతారో తెలీని గందర గోళం ....  జి వి ఎల్ నరసింహ రావు ది అయితే సొంత రాజ్యాంగం, పూర్తిగా పార్టీ రాష్ట్ర శాఖ తో  గానీ, లేదా బీ జె పి లో ఉన్నతెలుగుదేశం మాజీ లతో  కానీ ఈయనకు ఎలాంటి సంబంధాలు ఉండవు.  రాష్ట్రాన్ని ఎప్పుడైనా పలకరించడానికి రుతు పవనాల మాదిరి అలా చుట్టపు చూపు గా వచ్చేసి ,  ఇలా మాయమైపోయే  జి వి ఎల్ వ్యవస్థ ల గురించి రాష్ట్ర బీ జె పి లో ఎవరికీ ఎలాంటి క్లూలు ఉండవు. ఈయన దారి రహదారి. ఈయన వ్యవస్థ ఇలాఉంటే, బీ జె పి లో ఉంటూ కూడా ఇంకాతెలుగు దేశం ఎజెండా , జెండా రెండూ మోస్తున్నట్టు కనిపించే సుజనా చౌదరి ఒక్క అమరావతి అంశం మీద తప్పించి, ఇతరత్రా ఏదీ మాట్లాడటానికి ఎక్కువగాఇష్టపడరు. జీ వీ ఎల్ కు, సుజనా కూ క్షణం పడదు. ఆయన ఎడ్డెం అంటే ఈయన తెడ్డెం అనే రకం.. ఏ మాత్రం పొసగని,పొంతన లేని పరస్పర భిన్నమైన అభిప్రాయాలు గల వీరిద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం మాదిరి ఒకే పార్టీ లో ఉంటూ కూడా కామన్  ఎజెండా తో పని చేసిన దాఖలాలు ఇప్పటివరకూ అయితే లేవు.   ఇహ, సి ఎం రమేష్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయన తన బిజినెస్ వ్యవహారాలను బీ జె పి తో ముడి కట్టేసి, ఏ పార్టీ లో ప్రయాణిస్తున్నాడో కూడా మర్చే పోయి, మొన్నటికి మొన్న పరిమళ్ నత్వాని ని జగన్ మోహన్ రెడ్డి దగ్గర ప్రవేశ పెట్టడం లో కీలక పాత్ర పోషించిన  ఘనుడు. గుర్తు చేస్తే కానీ తానూ బీ జె పి లో ఉన్నాననే విషయం గుర్తుండని ఈయన కు  బీ జె పి, జన సేన కలిసి పోటీ  చేస్తున్న విషయం తెలుసో లేదో అని కూడాపార్టీ శ్రేణులు గుసగుస లాడుకుంటున్నాయి.  ఇహ వీరందరినీ సమన్వయము చేసుకుని  ముందుకెళ్తున్నట్టు భావిస్తూ , బాహ్య ప్రపంచం ముందు ఆవిష్కృతమయ్యే  వ్యక్తి మరెవరో కాదు... సాక్షాత్తూ  రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. ఈయన, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణించటానికి అంతగాసుముఖం గా లేదు...కారణమేమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి యోధులతో పోరాడిన తన రాజకీయం , చివరకు ఇలా ఏ పూట ఎక్కడ ఉంటారో కూడా తెలీని పవన్ కళ్యాణ్ పార్టీతో కలిసి పని చేయాల్సిన దుస్థితికి దిగజారటమేమిటని  తరచూ తనలో తానె కుమిలి పోతున్నట్టు సమాచారం.  ఇహ, టీ జీ వెంకటేష్ అయితే మరీను..... రాయలసీమ నినాదాన్ని తన ట్యాగ్ లైన్ గాచేసుకుని కాలక్షేపం చేసేస్తూ... ప్రస్తుతానికి బీ జె పి లో నివసిస్తూ ....ఈ స్థానిక ఎన్నికల సమరం లో తన పాత్ర ఏమిటో కూడాతెలీకుండా జీవనం వెళ్లదీస్తున్నారు. మొత్తానికి ఈ పంచ పాండవులు స్థానిక సమరం లో తమ 'పంచ్ ' పవర్ ఏమిటో ఈ నెలాఖరు లోగా చుపిస్తారేమోననే బోలెడు , ఇంకా గంపెడాశతో బీ జె పి అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

ఏపీలో వంద కోట్ల దందా.. రియల్ క్రైమ్ స్టోరీ

సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన.. ఆ రియల్ స్టోరీ టైటిల్ వచ్చేసి.. "ఓ కిడ్నాప్, వంద కోట్ల స్కాం". 'నేనే రాజు నేనే మంత్రి' మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. మీరు ఏ పార్టీకి ఓటేసినా మేమే అధికారంలో ఉంటామని. అవును.. కొందరు రాజకీయ నాయకులు.. ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తే.. ఆ పార్టీలోకి జంప్ చేస్తారు. అలాగే అధికారులు కూడా.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలని కాకాపడుతూ వారి ఆటలు సాగిస్తుంటారు. ఈ రియల్ స్టోరీ వింటే అది నిజమని మీకే అర్ధమవుతుంది. కాకినాడలోని సర్పవరంకి చెందిన ఆకుల గోవిందరాజు అనే వ్యక్తికి భోగాపురంలో వంద కోట్ల విలువైన 18 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ ఒక్క విషయం చాలదా.. మాఫియా కన్ను ఆయన మీద పడటానికి. ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్న గద్దకి కింద ఉన్న కోడిపిల్ల కనిపించినట్టు.. మాఫియా వాళ్ళకి ఎక్కడున్నా విలువైన ల్యాండ్స్ కనిపిస్తాయి కదా. అలాగే, బలగ ప్రకాష్ అనే మాఫియా లీడర్ కి.. ఆకుల గోవిందరాజుకి చెందిన ల్యాండ్ పై కన్నుపడింది. ఇంకేముంది ఏకంగా పోలీసులనే రంగంలోకి దింపాడు. ఇక పోలీసులైతే ఓ అడుగు ముందుకేసి ఏకంగా కిడ్నాప్ కే తెరలేపారు. 2017.. సెప్టెంబర్ 19 .... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. మధ్యాహ్నానికి- సాయంత్రానికి నడుమ సూర్యుడు మండిపోతున్న సమయం... అబ్బా ఏమన్నా ముహూర్తమా... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. ఇదే కిడ్నాప్ కి సరైన ముహూర్తం అనుకున్నారేమో పోలీసులు... AP 30 AB 6655 నెంబర్ గల ఇన్నోవా కార్ లో.. పోలీసులు ఆకుల గోవిందరాజు ఇంటికి వచ్చారు. కారు నెంబర్ ఫ్యాన్సీగా ఉన్నా, ఆ ఖాకీలు చేసే పని మాత్రం ఏ మాత్రం పద్దతిగా లేదు. వాళ్ళు చేసే పనేంటో ఆ చుట్టుపక్కల ఉన్నవారికి తెలియదు. కొత్త మొహాలు కావడంతో.. చుట్టుపక్కల వారు కొందరు ఆశ్చర్యంతో, కొందరు అనుమానంతో చూస్తున్నారు. వాళ్ళు అలా చూస్తుండగానే.. దొంగల రూపంలో వచ్చిన పోలీసులు.. గోవిందరాజుని ఇన్నోవాలో పడేసి.. జెట్ స్పీడ్ లో హైవే ఎక్కారు. పోలీసుల భాషలో చెప్పాలంటే దీనినే కిడ్నాప్ అంటారు. కారు హైవే మీద దూసుకెళ్తుంది. ఆ స్పీడ్ చూస్తే.. అంబులెన్స్ డ్రైవర్ కావాల్సిన వ్యక్తి ఇన్నోవా డ్రైవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. డ్రైవర్ స్టీరింగ్ పట్టుకుంటే.. మనం ఖాళీగా ఉండి ఏం చేస్తాం అనుకున్నారేమో.. మిగతా పోలీసులు గోవిందరాజు పనిపెట్టారు. కారు.. కాకినాడ నుంచి భోగాపురం చేరేవరకు.. అంటే దాదాపు నాలుగు గంటల పాటు... గోవిందరాజుని భయపెట్టారు.. బెదిరించారు.. చిత్రహింసలు పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే నరకం చూపించారు. కారు సాయంత్రం 6 గంటలకు భోగాపురం సబ్ రిజిస్టార్ ఆఫీస్ కి చేరుకుంది. ఖాకీలకు భయపడ్డాడో, కాసులకు కక్కుర్తి పడ్డాడో తెలియదు కానీ.. సబ్ రిజిస్టార్ పందిళ్లపల్లి రామకృష్ణ.. సాయంత్రం 4:30 కే రిజిస్ట్రేషన్ కాగితాలు సిద్ధం చేసి.. పదేళ్ల తర్వాత ఫారెన్ నుంచి రిటర్న్ వస్తున్న ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నట్టు.. గుమ్మం వైపు చూస్తూ పోలీసుల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో పోలీసులు గోవిందరాజుని తీసుకొని గుమ్మంలోకి అడుగు పెట్టనే పెట్టారు. గుమ్మంలో వాళ్ళ అడుగు పడిందో లేదో.. సబ్ రిజిస్టార్ మోహంలో వెలుగు వచ్చింది. గోవిందరాజు మోహంలో భయం పెరిగింది. భయంతో చూస్తుండగా ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్న మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనిపించాడు. జర్నీలో పోలీసుల చిత్రహింసలతో భయపడిపోయిన గోవిందరాజు.. బలగ ప్రకాష్ ని చూసి మరింత భయపడ్డాడు. బలగ ప్రకాష్.. పోలీసుల మాదిరి సాగదియ్యలేదు.. కమర్షియల్ సినిమాల్లో విలన్ లాగా ఒక్కటే డైలాగ్ కొట్టాడు.. "సంతకం పెడతావా? సమాధిలో పడుకుంటావా?".... ఆ ఒక్క డైలాగ్ తో గోవిందరాజు భయం చావుభయంగా మారిపోయింది. ఎదురుగా మాఫియా లీడర్.. చుట్టూ భోగాపురం సీఐ నర్సింహారావు, ఎస్సైలు తారక్, మహేష్.. హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు.. ఉన్నారు. ఎస్సైల పేర్లు తారక్, మహేష్ అని హీరోల పేర్లు ఉన్నాయి కానీ.. వాళ్ళ బిహేవియర్ మాత్రం పెద్ద విలన్ల పక్కన ఉండే చెంచా విలన్లు లాగా ఉంది. అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులే.. మాఫియా లీడర్ తో కలిసిపోయి.. చిత్రహింసలు చేసి బెదిరిస్తుంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో, వంద కోట్లు కంటే విలువైన ప్రాణం కోసం, అన్యాయం ముందు తలవంచి గోవిందరాజు సంతకం పెట్టాడు. ఆ ఒక్క సంతకంతో.. గోవిందరాజు మొహంలో తప్ప.. అక్కడున్న అందరి మొహాల్లో లక్ష్మీకళ ఉట్టిపడింది. అన్నట్టు ఇంత జరుగుతున్నా అక్కడ ఇతరులు ఎవరూ లేరా? అని మీకు అనుమానం రావొచ్చు. అక్కడ నిజంగానే ఎవరూ లేరు.. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ముహూర్తం అలాంటిది మరి. శూన్యమాసం-అమావాస్య.. బుద్ధి ఉన్నోడు ఎవడైనా రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాడా? వీళ్లంటే.. వంద కోట్ల కబ్జా ల్యాండ్ కాబట్టి.. బుద్ధిని పక్కనపెట్టి.. బెదిరించి.. రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. ఇప్పుడు అర్థమైందా వాళ్ళ శూన్యమాసం-అమావాస్య కాన్సెప్ట్ ఏంటో?!!.. ఈ కిడ్నాప్- కబ్జా వ్యవహారంపై.. సర్పవరం పోలీస్ స్టేషన్ లో 330/217 నెంబర్ తో కేస్ రిజిస్టర్ అయింది. అదేంటో.. FIR కూడా అయిన తరువాత.. చార్జిషీట్ దాఖలు చేయడానికి.. రాజమౌళి RRR చేయడానికి తీసుకునే టైం కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు సర్పవరం పోలీసులు. రెండున్నరేళ్లుగా నాన్చుతూనే ఉన్నారు. ఈ విషయం గురించి.. ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కాకినాడ పోలీసులు రిపోర్ట్ కూడా పంపారు. కానీ చార్జిషీట్ దాఖలు చేసే విషయంలో సర్పవరం సీఐ డిలే చేస్తూనే ఉన్నాడు. ఏంటి ఆ సీఐ ధైర్యం?.. భయపడితే భయపడటానికి ఆయన పోస్ట్ మ్యాన్ కాదు.. పోలీసోడు.. దానికితోడు పొలిటిషీయన్స్ సపోర్ట్ ఉన్నోడు. అవును.. ఈ వ్యవహారంలో.. బడా పొలిటిషీయన్స్ సపోర్ట్ కూడా ఉంది. అదే పోలీసుల ధైర్యం... శ్రీకాకుళం జిల్లాకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత.. అలాగే గత ప్రభుత్వ హయాంలో విప్ గా పనిచేసిన నేత.. వీరిద్దరి సాయంతో సర్పవరం పోలీస్ స్టేషన్ ని ఫుల్ గా influence చేసే ప్రయత్నం బలంగా నడుస్తుంది. అందుకే చార్జిషీట్ కి మోక్షం కలగట్లేదు. ఇంత పెద్ద కిడ్నాప్- కబ్జా జరిగితే అస్సలు చర్యలే తీసుకోకుండా ఎలా ఉన్నారని అనుకుంటున్నారేమో... అబ్బో చాలా పెద్ద చర్య తీసుకున్నారు. భోగాపురం ఇన్స్పెక్టర్ ని బదిలీ చేసారు. అదేంటి!!.. అంత జరిగితే కేవలం బదిలీనా అనుకోవద్దు.. రాజకీయ ఒత్తిళ్లు అలాంటివి మరి.. అర్థంచేసుకోవాలి... ఇంకో విషయం ఏంటంటే.. ఈ వ్యవహారం డీజీపీ ఆఫీస్ కి కూడా చేరింది. మరి ఇంకేంటి.. వెంటనే అందరి మీద చర్యలు తీసుకొని ఉంటారుగా అంటారా? అబ్బో.. మీరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాలు చూసి బాగా మోసపోయారు... అలాంటి పప్పులు ఇక్కడ ఉడకవు. వాస్తవానికైతే... CRPC 41A కింద డీజీపీ నియమించే ఓ సీనియర్ అధికారి.. విచారణ జరిపి.. తదుపరి చర్యల వరకు.. ఆ సీఐని సస్పెండ్ చేసే అవకాశముంది. కానీ ఇక్కడ అలాంటిదేం జరగలేదు. ఏదో ఫార్మాలిటీకి బదిలీతో సరిపెట్టారు. గోవిందరాజు ని బెదిరించి వంద కోట్ల విలువైన ల్యాండ్ అన్యాయంగా లాక్కున్నారు. అయినా తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. పైగా గోవిందరాజునే ఇంకా టార్చర్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లలో భాగంగా.. ప్రస్తుత సర్పవరం సీఐ మరియు అర్బన్ డీఎస్పీ.. గోవిందరాజుని పదేపదే తిప్పించుకుంటున్నారు. ఇక కాకినాడలో ఉద్యోగం వెలగపెడుతున్న.. ఇప్పటి ఓ మంత్రిగారి బావమరిది.. రంగంలోకి దిగడంతో ఈ కేసు మరింత డైల్యూట్ అయింది. అసలే భోగాపురంలో ఎయిర్ పోర్ట్ అంటున్నారు. రెక్కలున్న విమానాలు వస్తున్నాయి అంటే.. ఆటోమేటిక్ గా భూముల ధరలకు రెక్కలొస్తాయి కదా.. అందుకే పోలీసులు- పొలిటీషియన్స్ అండతో మాఫియా ఇంతలా రెచ్చిపోతుంది. అంతేకాదు.. ఈ వ్యవహారం వెనుక.. 2017 ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనిచేసిన ఓ కలెక్టర్ మరియు ఎస్పీ పాత్ర ఉన్నట్టు.. సెక్రటేరియట్ వర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. టీడీపీ పెద్దతలకాయలకు సన్నిహితులైన ఈ ఐఏఎస్, ఐపీఎస్ లు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా తమ హవా కొనసాగించడం... అందరినీ ముక్కు, మూతి ఇలా అన్నింటి మీదా వేలేసుకునేలా చేస్తుంది. ఇంతకీ ఆ ఐఏఎస్ & ఐపీఎస్ ఎవరు? * ఒకరు.. పరుల అవినీతి మీద కాంతివంతంగా దండెత్తే ఐఏఎస్... * ఇంకొకరు.. పొద్దునలేస్తే సుభాషితాలు చెప్పే పాలమీగడ లాంటి ఐపీఎస్.. ఈయనకి టెక్నాలజీ మీద గ్రిప్ బాగా ఎక్కువ. ఈ వ్యవహారంలో వీరిద్దరి పాత్ర కూడా ప్రముఖంగా ఉంది. 'వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కూలిపోతుంది' అన్నట్టు.. ఈ అవినీతి రాబందులను భయపెట్టే గాలివాన ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనుసన్నల్లో.. ఐఏఎస్, ఐపీఎస్లు, పోలీసులు, పొలిటీషియన్స్ అండతో జరిగిన ఈ అన్యాయంపై.. గోవిందరాజు కొద్ది నెలలుగా పోరాడుతూనే ఉన్నాడు. న్యాయం కోసం ఆయన ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదు. సన్నిహితుల సాయంతో న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఆ పోరాడంతో కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి అప్పుడు జరిగింది తప్పుడు రిజిస్ట్రేషన్ అని పేర్కొంటూ... భోగాపురం రిజిస్టార్ డాక్యుమెంట్ రైటర్.. 2019 అక్టోబర్ 19 తేదీన.. 164 CRPC స్టేట్మెంట్ ని.. కాకినాడ ఫస్ట్ అడిషనల్ జ్యూడిషల్ సివిల్ జడ్జ్.. ముందట ఇచ్చాడు. అంతేకాదు.. సీసీ కెమెరాలతో దొంగలని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల పుణ్యమా అని అడ్డంగా బుక్ అయ్యారు. సర్పవరం లో కిడ్నాప్ చేసి.. భోగాపురం తీసుకెళ్లిన.. నాలుగు గంటల తతంగమంతా.. పలు చోట్ల సీసీ కెమెరాలలో రికార్డు అయింది. క్షవరం అయితే కానీ ఇవరం రాదని.. సీసీ కెమెరాలు చూసి దోషులని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల సంగతి మర్చిపోయి ఇలా దొరికిపోవడం కామెడీగా ఉంది. మొత్తానికి కొద్దికొద్దిగా కదులుతున్న తీగతో.. దందా చేసి ఇన్నాళ్లు డొంకలో దాక్కున్నవారు.. ఇప్పుడిప్పుడే భయంతో వణుకుతున్నారు. ముఖ్యంగా డీజీపీకి కంప్లైంట్ వెళ్లడంతో ఐఏఎస్, ఐపీఎస్ ఒణికిపోతున్నారట. మరి ముఖ్యంగా ఆ ఐపీఎస్ అయితే.. డైపర్ వేసుకొని తిరుగుతున్నాడని టాక్... ఇప్పటికే ఆ ఐపీఎస్ గడిచిన రెండు నెలల్లో.. బలగ ప్రకాష్ టీం తో.. ఒకే హోటల్ లో 17 సార్లు సిట్టింగ్ వేశాడు. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు ఆ ఐపీఎస్ ఎంతలా వణికిపోతున్నాడో!! తప్పుని సరిదిద్దాల్సిన పోలీసులే.. ఇంత పెద్ద తప్పు చేశారు. ఈ విషయం డీజీపీ దృష్టికి కూడా వెళ్ళింది. మరి ఆయన ఈ కిడ్నాప్-కబ్జా వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?.. బాధితుడికి ఎప్పుడు న్యాయం చేస్తారు? ఆయన ఇలాగే మౌనంగా ఉంటే ప్రజలకు పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది. ఇక ఈ విషయంలో సర్కార్ కూడా అడుగు ముందుకేసి బాధితుడికి న్యాయం చేయాల్సిన అవసరముంది. అవినీతి రహిత పాలనే అందించడమే తమ లక్ష్యమని చెప్పుకునే అధికారపార్టీ.. అవినీతి-అన్యాయం చేసిన వారికి.. పరోక్షంగా అండగా ఉండటం ఎంత వరకు కరెక్ట్? గత ప్రభుత్వం మీద, అప్పుడు వారికి సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులపైనా.. ఇప్పటి అధికారపార్టీ నేతలు పదేపదే అవినీతి ఆరోపణలు చేస్తుంటారు. మరి ఈ వ్యవహారం మీద ఎందుకు నోరు మెదపడం లేదు? ఇందులో తమ పార్టీ నేతలు కూడా ఉన్నారా? లేక పార్టీ సీనియర్ నేతైన మంత్రి గారి బావమరిది ఇన్వాల్వ్ అయ్యాడని వెనకడుగు వేస్తున్నారా? ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ఈ భోగాపురం భాగోతం వెనుకున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి.. బాధితుడికి న్యాయం చేయాలి. లేదంటే ప్రభుత్వం మీద కూడా నమ్మకం పోతుంది.  

క‌విత‌, ష‌ర్మిలా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?

తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్‌లో పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్‌ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.  సామాజిక కోణంలో తమకు అవకాశం దక్కుతుందని పలువురు సీనియర్లు భావిస్తుండగా, ఇప్పటివరకు పార్టీ తరఫున రాజ్యసభ పదవులు దక్కని వర్గాల వారూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవితను ఈసారి పార్టీ తరఫున రాజ్యసభకు పంపిస్తార‌నే ప్ర‌చారం విస్తృతంగా జరుగుతోంది. అయితే సి.ఎం. కేసీఆర్ ఆలోచ‌నే ఎలా వుందో ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. కెటిఆర్ సి.ఎం. అవుతారా? క‌వితా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?  అయితే హ‌రిష్‌రావు ఈ ప‌రిణామాల‌పై ఎలా స్పందిస్తారు? అనే అంశంపై టిఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్‌ తన తరఫున ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రయత్నాలకు నమ్మకమైన వారి కోసం అన్వేషిస్తున్నారు.  రాజ్యసభ సీటు భర్తీ సామాజిక కోణంలోనే ఉంటుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు భావిస్తున్నారు. ఏపీ కోటాలో పదవీ విరమణ చేస్తున్న టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు వయసు రీత్యా ఈసారి అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. రెడ్లకు అవకాశం లభిస్తే, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, మాజీీ స్పీకర్‌ కె.ఆర్‌.సురే్‌షరెడ్డి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి మధ్య పోటీ ఉంటుందని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మండవ వెంకటేశ్వరావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని అంటున్నారు. బీసీలకు అవకాశం ఇస్తే సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య పేర్లు పరిశీలిస్తారని చెబుతున్నారు. ఎస్సీ కోటాలో భర్తీ చేయాలని భావిస్తే కడియం శ్రీహరి, మాజీ ఎంపీ మంద జగన్నాథం పేర్లు పరిశీలిస్తారని అంటున్నారు. ఎస్సీల్లోనే మాలలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే, టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ గాదరి బాలమల్లు, ఎస్టీ అయితే సీతారాంనాయక్‌ పేరు ఉండొచ్చని అంటున్నారు. అనూహ్యంగా ఒక పారిశ్రామికవేత్తను టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభకు పంపాలని అనుకుంటే హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి పేరు పరిశీలించవచ్చని చెబుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ స్థానాలు ఎవరికీ కేటాయించాలని ఇన్నాళ్లు చర్చించిన అధికార పార్టీ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారి జాబితా సిద్ధమైనట్టు సమాచారం.  కీలకమైన పదవులు కావడంతో పార్టీ నమ్ముకున్నోళ్లు.. తమకు అండగా నిలబడిన వ్యక్తులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది.  మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి - సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీమంత్రి - ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితా ఫైనలైనట్టు తెలుస్తోంది.  షర్మిల ఆపద సమయంలో జ‌గ‌న్‌కు తోడుగా నిలిచారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేశారు. కష్టకాలంలో పార్టీకి షర్మిల పెద్ద దిక్కుగా నిలిచారు. తన సొంత మీడియా సాక్షి ప్రారంభించినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ తో ఉన్నారు. సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ గా కొనసాగుతూనే జగన్ కు రాజకీయాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత సజ్జలను పార్టీలోకి ఆహ్వానించి పెద్ద పదవే ఇచ్చారు. విజయ సాయిరెడ్డి తర్వాత జగన్ కు అత్యంత నమ్మకస్తుడు సజ్జలనే. ఆయన పార్టీలో జగన్ రాజకీయ సలహాదారుడిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో పని చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ తన తోడు ఉండడంతో ఆయనను రాజ్యసభకు జగన్ పంపించనున్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. గతంలో ప్రకాశం ఎంపీగా సుబ్బారెడ్డి పని చేశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సుబ్బారెడ్డి పోటీ చేయలేదు. అప్పుడు ఆయన పదవులు ఆశించకపోవడంతో ఇప్పుడు రాజ్యసభకు పంపించాలని నిర్ణయానికి వచ్చారు. పార్టీలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపితే న్యాయం జరుగుతుందనే భావనలో జగన్ ఉన్నారంట. అనూహ్యంగా రాజ్యసభకు పంపే జాబితాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి ఉండడం గమనార్హం. అనంతపురము జిల్లాకు చెందిన రఘువీరారెడ్డికి పిలిచి మరి రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. యాదవ సామాజికి వర్గానికి చెందిన రఘువీరారెడ్డి జగన్ తండ్రి వైఎస్సార్ తో మంచి అనుబంధం ఉంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే మరొకరిని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిగా పని చేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారంట.  కృష్ణాజిల్లా యాదవ సామాజిక వర్గానికి చెందిన చలమేశ్వర్ సేవలను వినియోగించుకునేలా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందంట. ఎందుకంటే తరచూ జగన్ న్యాయస్థానాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నారు. చలమేశ్వర్ సేవలు వినియోగించుకుంటే జగన్ సేఫ్ గా ఉండడంతో పాటు న్యాయ కోవిదుడికి గౌరవంగా రాజ్యసభను ఇద్దామనే ఆలోచనలో ఉన్నారంట.

అధికారంలో ఉంటే ఒకలా... ప్రతిపక్షంలో ఉంటే మరోలా... వైజాగ్ ఎపిసోడ్ నీతి ఏంటి?

రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా, అనామకులుగా మారిపోయారు. దశాబ్దాల తరబడి రాజ్యాన్ని ఏలినవారు, ఇప్పుడు సైడైపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఉద్దండుల పరిస్థితి ఇప్పుడలాగే కనిపిస్తోంది. ఎంతోమంది ముఖ్యనేతలు తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మళ్లీ వాళ్లకు మంచి రోజులు వస్తాయని మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ ఊహించని రాజకీయ మార్పులు జరగడంతో ఓడలు బళ్లు... బళ్లు ఓడలయ్యాయి.  అయితే, అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలా ఉంటే మరోలా వ్యవహరించడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. విపక్ష నేతగా ఉన్న సందర్భాల్లో నేతలు వ్యవహరించే తీరు ఒక్కోసారి సాధారణ ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది. నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ క్రితం విపక్ష నేతగా ఉన్నారు. అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా కోసం పట్టుదలతో ఉన్నారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు వైజాగ్ పర్యటనకు వెళ్లారు. అప్పటికే అక్కడ సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరుగుతోంది. ఆ నేపథ్యంలో క్యాండిల్ ర్యాలీకి అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. అయినా కూడా జగన్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి నగరంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక, ఇప్పడు ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. అందులో భాగంగా చంద్రబాబు చేపట్టిన వైజాగ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందులో పోలీసులను తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అయితే, ఇలాంటి సమయంలో విపక్ష నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా పోలీసు వలయాన్ని ఛేదించుకోవాలని తాము అనుకున్నది చేయాలని చూస్తుంటారు. పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తుంటారు. చంద్రబాబు వైజాగ్ టూర్లోనూ అదే జరిగిందనే మాట వినిపిస్తోంది. నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. కాకపోతే...ఆ ప్రయత్నాలు సమాజంలో ఉద్రిక్తతలు పెంచేవిగా మాత్రం ఉండకూడదంటున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్న నాయకులు ప్రజాస్వామ్యంలో విపక్షాలకు ఉండే ప్రాధాన్యాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. అధికారపక్షం, విపక్షం....రెండూ ప్రజాస్వామ్యానికి రెండు చక్రాల్లాంటివని, ఏ ఒక్కటి సరిగా లేకున్నా ప్రజాస్వామ్యం కుంటుపడుతుందని గుర్తుచేస్తున్నారు.

రాజీవ్ గాంధీ మరణించాక ఆ సీక్రెట్ బయటపెట్టిన వాజపేయి!!

అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు హద్దు మీరి విమర్శలు చేసుకోవడమే తప్ప.. విలువైన రాజకీయాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజుల్లో. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నేతల మీద కక్ష తీచుకోవాలన్న ధోరణే తప్ప.. ప్రజల కోసం ఒకరి సూచనలను ఒకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేసేవారు ఎక్కడున్నారు?. ఈతరం రాజకీయ నాయకులు ముందుతరం వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ- వాజపేయి మధ్య జరిగిన ఓ సంఘటన తెలిస్తే.. ఈ తరం రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటారు. అది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయం. అప్పుడు వాజపేయి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారి మధ్య జరిగిన ఓ అపురూప సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  " సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట ".. ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.." ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి "మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం.. ఏర్పాట్లు చూడండి" అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు అటల్జీ ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి. " సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా?" నసిగాడు కార్యదర్శి వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ "నిక్షేపంగా" అన్నారు. ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ, అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు. "సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి?" అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా.. అదీ ఆయన మాటల్లోనే.. "1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా.1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది. డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు. ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా రమ్మని ఫోన్ లో కోరారు. కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ.. 'అటల్ జీ.. ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి' అని చెప్పారు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే. నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే" అని వాజపేయి అన్నారు. అది విలువలతో కూడిన రాజకీయమంటే. రాజీవ్ గాంధీ, వాజపేయి రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేశారు. వారిని చూసి ఈ తరం రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలి. పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అధికార-ప్రతిపక్ష పార్టీల నాయకులు.. రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం.. ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు..!

ఎలా స్పందిస్తారో మీ ఇష్టం!

అనగనగా ఓ అమ్మాయి. ఆ అమ్మాయికి చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి నిబ్బరంగా సంసారాన్ని నెట్టుకొస్తూ ఉంది. కానీ కూతురు మాత్రం ప్రతి చిన్న కష్టానికీ కంగారుపడిపోయేది. ఏం చేయాలో పాలుపోక తెగ బాధపడిపోయేది. ‘ఇక ఈ కష్టాలను భరించడం నా వల్ల కాదమ్మా!’ అని ఓ రోజు తన తల్లితో తెగేసి చెప్పింది కూతురు. తల్లి, కూతరి వంక ఒక్క నిమిషం చూసింది. ఆ తరువాత మారుమాట్లాడకుండా ఆమెను వంటింట్లోకి తీసుకువెళ్లింది. తల్లి తనకేం చెప్పాలనుకుందో తెలియని అయోమయంలో కూతురు ఆమెను అనుసరించింది.   వంటింట్లోకి వెళ్లిన తల్లి ఒక మూడు పాత్రలు తీసుకుంది. ఒకదానిలో బంగాళదుంప, మరోదానిలో కోడిగుడ్డు, ఇంకోదానిలో కాఫీ గింజలు వేసి వాటిని పొయ్యి మీద పెట్టింది. తల్లి చేస్తున్న పని చాలా అసంబద్ధంగా తోచింది కూతురికి. అయినా మారు మాటాడకుండా చూస్తూ నిల్చొంది. ఒక పది నిమిషాలు అయిన తరువాత... ‘ఒకో గిన్నెలో ఏం జరిగిందో గమనించు’ అంటూ అడిగింది తల్లి. ‘గమనించడానికి ఏముంది! బంగాళదుంప వేడి నీటికి మెత్తబడిపోతుంది. కోడిగుడ్డు గట్టిపడిపోతుంది. కాఫీ గింజలతో కాఫీ తయారవుతుంది’ అంది కూతురు ఎగతాళిగా. ‘కదా! పైకి గట్టిగా కనిపించే బంగాళదుంప కాస్త వేడినీరు తగలగానే ఇట్టే మెత్తబడిపోయింది. చేయి తగిలితే చాలు చితికిపోయే కోడిగుడ్డేమో వేడినీటికి గట్టిపడిపోయింది. ఇక కాఫీ గింజలు మాత్రం తన చుట్టూ ఉన్న నీటిని తన ఉనికితో నింపేశాయి,’ అని చెప్పుకొచ్చింది తల్లి. తల్లి చేసిన వింత చేష్ట వెనుక ఏదో మంచిమాట దాగి ఉంటుందని అప్పటికి అర్థమైంది కూతురికి.   ‘మనం కూడా ఇంతే! అప్పటివరకూ ధైర్యంగా ఉన్నవారు కూడా కష్టాలు రాగానే ఇట్టే డీలా పడిపోతారు.. ఆ బంగాళదుంపలా. మరికొందరేమో కష్టాలు ఎదురయ్యేసరికి మొద్దుబారిపోతారు. అప్పటివరకూ సున్నితంగా ఉన్నవారు కూడా రాయిలా మారిపోతారు- కోడిగుడ్డులా. కానీ చాలా కొద్ది మంది మాత్రమే కష్టాలకు ఎదురీదుతారు. ఆ కష్టాలను సైతం తనకు అనుకూలంగా మార్చుకుంటారు. వాళ్ల స్వభావంతో, వారి చుట్టూ ఉన్న వాతావరణమే పూర్తిగా మారిపోతుంది... కాఫీ గింజల్లాగా! ఇప్పుడు చెప్పు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు?’ అని అడిగింది తల్లి. కూతురు మారు మాట్లాడకుండా చిరునవ్వుతో కాఫీని ఒక రెండు కప్పుల్లోకి సర్ది, ఒకదాన్ని తన తల్లికి అందించింది. మరోదాన్ని తను ఆస్వాదించేందుకు సిద్ధపడింది... జీవితాంతం!   - నిర్జర.

మంచి పాస్‌వర్డ్‌ కోసం 10 చిట్కాలు

ఇవాళ రేపట్లో కంప్యూటర్లో ఏదో ఒక అకౌంట్‌ లేకుండా పూట గడవడం లేదు. అది ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ కావచ్చు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ కావచ్చు... ఏదీ కాకపోయినా కనీసం ఈ-మెయిల్‌ అకౌంటన్నా కావచ్చు. వీటన్నింటికీ మంచి పాస్‌వర్డుని ఎంచుకోవడం ఒక సమస్యే! ఆ మన దగ్గరే ఏముందిలే నష్టపోయేందుకు అనుకోవడానికి కూడా లేదు. మన వ్యక్తిగత సమాచారాన్నీ, ఫైళ్లని తస్కరించడం దగ్గర్నుంచీ... మన కాంటాక్ట్‌ లిస్టులో ఉండేవారి మెయిల్స్‌కు తప్పుడు మెయిల్స్‌ పంపడం వరకూ హ్యాకర్లు దేనికైనా తెగించగలరు. ఎవరిపడితే వారి పాస్‌వర్డులను ఛేదించేందుకు ప్రత్యేకమైన సాఫ్టవేర్లు అందుబాటులో ఉన్నాయంటే నమ్మగలరా! అందుకే అలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ఈ చిట్కాలు-   1- చిన్నపాటి పాస్‌వర్డులకు కాలం చెల్లిపోయింది. మీ పాస్‌వర్డు కనీసం 10 అక్షరాలకు పైనే ఉండాలంటున్నారు నిపుణులు. ఇక మరీ జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భాలలో కనీసం 12 నుంచి 14 అక్షరాలు ఉండాలని సూచిస్తున్నారు.   2- పాస్‌వర్డులో కేవలం అక్షరాలే ఉంటే సరిపోదన్నది అందరికీ తెలిసిందే! అంకెలు, అంకెల దిగువున ఉండే సింబల్స్, క్యాపిటల్‌ లెటర్స్‌, స్మాల్‌ లెటర్స్ ఇలా కీబోర్డు మీద టైప్‌ చేయదగిన అన్ని రకాల సంకేతాలనీ వాడాల్సిందే!   3- మీకు సంబంధించిన వ్యక్తిగతమైన వివరాలని (ఉదా॥ పుట్టినరోజు, భార్యపేరు) పాస్‌వర్డులో ఉంచితే పాస్‌వర్డుని ఛేదించడం సులువైపోతుంది. అందుకే మీకు బాగా గుర్తుండి, మీ చుట్టుపక్కల వారికి ఏమాత్రం అవగాహన లేని (ఉదా॥ తల్లి తరఫు ఇంటి పేరు, పిల్లలకి పురుడు పోసిన డాక్టరు పేరు) పాస్‌వర్డులను ఎంచుకోవాలి.       4- నిఘంటువులో కనిపించే పదాలను (ఉదా॥ house, system, daughter) ఎట్టిపరిస్థితుల్లోనూ పాస్‌వర్డుగా ఉంచకూడదు. వీటిని పాస్‌వర్డు తస్కరించే సాఫ్టవేర్లు పసిగట్టేస్తాయి. My wife, happy home వంటి రోజువారీ వాక్యాలను కూడా ఇవి పట్టేస్తాయి.   5- చాలామంది బలమైన పాస్‌వర్డునే ఎంచుకొంటారు. కానీ పాస్‌వర్డు మర్చిపోయినప్పుడు కంప్యూటర్‌ అడిగే ప్రశ్నలకు గాను చాలా తేలికైనవి ఎంచుకొంటారు. ఫలితంగా ఎవరైనా సదరు ప్రశ్నలకు జవాబు చెప్పి మీ అకౌంటులోకి ప్రవేశించే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.       6- మనసులో ఏదో ఒక వాక్యాన్ని అనుకొని అందులోని పదాల తొలి అక్షరాలతో పాస్‌వర్డుని ఏర్పాటు చేసుకోవడం ఒక మంచి పద్ధతి. ఉదా॥ My Son was born on 14th January 2000 అన్న వాక్యాన్ని గుర్తుంచుకోవడం చాలా తేలిక. దీని ఆధారంగా MSWBO1422000 అన్న పాస్‌వర్డుని సృష్టించుకోవచ్చు.   7- వేర్వేరు అకౌంట్లకి ఒకటే పాస్‌వర్డుని ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదన్నది నిపుణులు హెచ్చరిక. ఒకవేళ అలా వాడాల్సి వచ్చినా, తప్పనిసరిగా అందులో ఎంతో కొంత మార్పు చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు పైన ఎంచుకొన్న MSWBO1422000 పాస్‌వర్డుని AMAZONకి కూడా వాడాలనుకుంటే MSWBO-amaze-1422000 అంటూ పాస్‌వర్డుకి తగిన మార్పు చేయవచ్చు.       8- బ్యాంకింగ్‌ వంటి ఆర్థికపరమైన, గోప్యమైన లావాదేవీలు జరిపే ఖాతాలకి చెందిన పాస్‌వర్డుల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. వీటిని తరచూ మారుస్తూ ఉండటం, మరే ఇతర పాస్‌వర్డులతో సంబంధం లేకుండా ఉంచడం అవసరం. ఇందుకోసం ఎలాంటి అనుమానం రాని పాస్‌వర్డులు కావాలనుకుంటే ఆన్‌లైన్లో http://passwordsgenerator.net/ వంటి సైట్లు ఉచితంగా క్లిష్టమైన పాస్‌వర్డులను అందిస్తాయి.   9- ఎట్టి పరిస్థితులలోనూ పాస్‌వర్డుని బయటవారితో పంచుకోకూడదు. ఇవాళ ఉన్న బంధం రేపు ఉంటుందని చెప్పలేం కదా! ఒకవేళ అలా ఎవరితోనన్నా పాస్‌వర్డుని పంచుకోవల్సిన సందర్భం వచ్చినా, ఎవరికన్నా పాస్‌వర్డు తెలిసిపోయిందన్న అనుమానం కలిగినా... వెంటనే దానిని మార్చివేయడం మంచింది.    10- ఈ రోజుల్లో పది రకాల ఖాతాలకు పది రకాల పాస్‌వర్డులు కావాల్సి వస్తోంది. పైగా అవి క్లిష్టంగా ఉండాలన్న నియమం ఎలాగూ ఉంది. దీంతో తరచూ ఏదో ఒక పాస్‌వర్డుని మర్చిపోవడం అతి సహజం. ఇందుకోసం వీటిని వీటిని ఎక్కడన్నా భద్రమైన చోట రాసి ఉంచుకోవడంలో తప్పులేదు. అయితే అలా రాసి ఉంచుకున్న కాగితాన్ని నిర్లక్ష్యంగా ఉంచితే మాత్రం అసలుకే ఎసరు తప్పదు! - నిర్జర.

అందుకే స్నేహితుడు కావాలి!

అదో పెద్ద అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులు. వాటిలో సహజంగానే ఓ సింహమూ, ఓ జింకా ఉన్నాయి. ఒక రోజు ఆ సింహం జింకని చూడనే చూసింది. వెంటనే దాన్ని వేటాడేందుకు వెంటపడింది. సింహం నుంచి తప్పించుకోవడానికి జింక చాలా ప్రయత్నమే చేసింది. దాని నుంచి పరిగెడుతూ పరిగెడుతూ పొరపాటున ఒక చెరువులోకి పడిపోయింది. దాన్ని తరుముతూ సింహం కూడా చెరువులోకి దూకేసింది. ఆ చెరువు నిండా నీళ్లున్నా బాగుండేది. కానీ కరువుతో చెరువు సగానికి ఎండిపోయింది. బురదతో నిండిపోయింది. ఆ బురదలో ఒక పక్క జింక, మరోపక్క సింహం మోకాళ్ల లోతు వరకు కూరుకుపోయాయి. ‘‘హహ్హా! ఇంక నేను నీ వెనుక పరిగెత్తాల్సిన పని లేదు. ఈ బురదలో చిక్కుకున్న నీ ఎముకలు విరిచి, నీ లేత మాంసాన్ని రుచిచూస్తాను,’’ అంటూ నవ్వింది సింహం.   ‘‘నా మాంసపు రుచి తర్వాత. ముందు నువ్వు ఇక్కడి నుంచి ఎలా బయటపడగలవో ఆలోచించు,’’ అంటూ వెక్కిరించింది జింక. జింక మాటలకి కోపంగా సింహం ముందుకు కదలబోయింది. కానీ అది ఎంతగా కదులుతుంటే అంతగా బురదలో దిగబడిపోతోంది. ‘‘నిజమే నేను కదల్లేకపోతున్నాను. ఇప్పుడెలా!’’ అని బిక్కమొగం వేసింది సింహం. ‘‘నీకు ఎవరన్నా స్నేహితులు ఉన్నారా?’’ అని తాపీగా అడిగింది జింక.   ‘‘నేను ఈ అడవికి రాజుని. అంతా నన్ను చూసి భయపడేవాళ్లే కానీ స్నేహితులు ఎక్కడ ఉంటారు. నాకు బానిసలు, శత్రువులే కానీ స్నేహితులు ఉండరు,’’ అని గర్వంగా చెప్పింది సింహం. ‘‘కానీ నాకైతే చాలామంది స్నేహితులు ఉన్నారు. మేమంతా కలిసిమెలిసి ఉంటాం. నేను కనిపించకపోయేసరికి వాళ్లంతా నన్ను వెతుక్కుంటూ వస్తారు. ఎలాగైనా నన్ను రక్షిస్తారు,’’ అని నమ్మకంగా చెప్పింది జింక. ‘‘సరే! అదీ చూద్దాం... ’’ అని ధీమాగా అంది సింహం. ఆ బురద చెరువులో కాలం చాలా భారంగా గడిచింది. ఒకో గంటా గడిచెకొద్దీ సింహంలో అసహనం పెరిగిపోయింది. కానీ జింక మాత్రం నిశ్చింతగానే ఉంది. తన స్నేహితులు వస్తారనే నమ్మకం తనలో ఇసుమంతైనా తగ్గలేదు.   సాయంత్రం అయ్యింది. నిదానంగా చీకటి పడింది. అసలే ఆకలితో ఉన్న సింహం డీలాపడిపోయింది. కానీ తన స్నేహితుల మీద ఉన్న నమ్మకంతో జింక మాత్రం నిబ్బరంగా నిలబడి ఉంది. ఇంతలో.... చెట్ల చాటు నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. ముందు ఓ జింక పిల్ల చెరువువైపు తొంగిచూసింది. ఆ తర్వాత మరో జింక, దాని వెనుక ఇంకో జింక.... వరుస పెట్టి ఓ జింకల మంద చెరువుగట్టుకి చేరింది. వాటికి అక్కడి పరిస్థితి చిటికెలో అర్థమైపోయింది. ఎలాగొలా తన నేస్తాన్ని రక్షించుకోవాలని అనుకున్నాయి. తాళ్లే పడేశాయో, చేతులే చాచాయో... మొత్తానికి ఎలాగొలా బురదలో చిక్కుకున్న జింకని ఒడ్డుకి తెచ్చాయి. దాన్ని తీసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ తిరిగి వెళ్లిపోయాయి.   తన కళ్ల ముందే జరుగుతున్నది చూసిన సింహానికి మతిచెడిపోయింది. కచ్చగా తను కూడా బురదలోంచి బయటపడాలని ఒకసారి విదిలించుకుంది. అంతే! అది మరింత లోతుకి జారిపోయింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

ఆత్మబంధువులా నిలిస్తే ఆత్మహత్యలే వుండవు...

సంవత్సరానికి 1,35,445 మంది... ప్రతిరోజూ సగటున 242 మంది మగవారు, 129 ఆడవారు జీవితాన్ని వద్దనుకుని బలవంతంగా ప్రాణాలు వదులుతున్నారు మన భారతదేశంలో. అందులోనూ 15 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉన్నవారే ఎక్కువట. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా పాటిస్తున్న ఈరోజున ఆత్మహత్యలని నివారించడానికి మనంగా ఏం చేయాలని ఆలోచించి తీరాలి. సమాజం, సామాజిక సంస్థలు, ప్రభుత్వం బాధ్యత ఎంతవుందో.. వ్యక్తులుగా, మన బాధ్యత కూడా అంతే వుందన్నది నిజం. అందుకే పెద్ద పెద్ద సిద్ధాంతాలని పక్కనపెట్టి సగటు మనిషిగా ఆలోచిస్తే మనతోపాటు మసలే మన కుటుంబంలోని వ్యక్తి లేదా స్నేహితుడు, బంధువు, సహోద్యోగి లేదా పక్కింటివారు... ఇలా మన పరిధుల్లో మనకి పరిచయం వున్నవారు, నిన్నటిదాకా మనతో వున్నవారు హఠాత్తుగా చడీచప్పుడు లేకుండా బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారంటే అందులో మన పాత్ర ఏం లేదా? మనం చేయగలిగింది ఏం లేదా? వీటిని ఆపడం సాధ్యం కాదా? చిన్న విషయమే.. అందరికీ తెలిసిన విషయమే.. మనందరి అనుభవంలోనిదే. మనసుకి బాధ కలిగితే పంచుకోవడానికి ఒక వ్యక్తి కావలసి వుంటుంది. ఎలాంటి ఆక్షేపణలు లేకుండా కేవలం మనసుపెట్టి వినే ఒక్క వ్యక్తి చాలు ఆ నిమిషానికి దేవుడిలా కనిపిస్తాడు. అందుకే వినటం నేర్చుకుందాం. ఎదుటి వ్యక్తికి మాట్లాడే అవకాశమిద్దాం. మనసులోని బాధనంతా వెళ్ళగక్కేందుకు కొంచెం సమయం ఇద్దాం. సత్సంబంధాలు, సాన్నిహిత్యం మనుషుల్లో భరోసాని, ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగిస్తాయి. ఆపద రాగానే పరిగెట్టుకు రాగలరు. బాధని పంచుకోగలరు. దీనికి చేయాల్సిందల్లా ఒక్కటే.. కొంచెం మానవ సంబంధాలపై దృష్టి పెడదాం. ఉదయం లేచి మనకి ఎదురుపడే ప్రతి ఒక్కరిని చిన్న చిరునవ్వుతో పలకరిద్దాం. ఇంట్లోని పనిమనిషి నుంచి ఆఫీసులోని ప్యూను దాకా అందరినీ కుశలం అడుగుదాం. నాలుగు కబుర్లు చెబుదాం. మన జీవితంలోని విశేషాలని పంచుకుందాం. వాళ్ళ జీవితంలోని విశేషాలని అడుగుదాం. బలమైన మానవ సంబంధాలు ఎప్పుడూ ధైర్యాన్నిస్తాయి. ఆత్మహత్య అనే భూతం ఎప్పుడు ఎవర్ని నిశ్శబ్దంగా కబళిస్తుందో తెలీదు. బతుకు పోరాటంలో ఎత్తుపల్లాలు సహజమని తెలిసీ ఆ క్షణానికి నైరాశ్యానికి లొంగిపోయే వారెందరో! సహాయం చేయగలమా, వారి సమస్యలని తీర్చగలమా అన్నది పక్కన పెడితే, తన బాధలనయితే వినగలం కదా! నాలుగు ధైర్య వచనాలు పలకగలం కదా! ఏదో ఒక దారినైతే చూపించగలం కదా! ఇలా జరగాలంటే ముందు మనం నలుగురికి అందుబాటులో వుండాలి. ఒంటరితనపు కంచుకోటని బద్దలు కొట్టుకుని బయటకి రావాలి. ఈరోజున ఆ నిర్ణయం తీసుకుందాం. ‘‘ఆత్మహత్యల నివారణకి వ్యక్తిగా నేనేం చేయగలను’’ అన్న ఒక చిన్న ఆలోచన చేద్దాం. నలుగురితో ఆ ఆలోచని పంచుకుందాం. నిస్సహాయంగా, నిర్వేదంగా జీవితానికి వీడ్కోలు పలికే దుస్థితి ఎవరికీ రావద్దు అంటే కొంచెం మానవత్వంతో ఆలోచిద్దాం. మానవ సంబంధాలని బలపర్చుకుందాం. -రమ  

ట్రావెలర్స్ డయేరియా గురించి విన్నారా!

కుటుంబసమేతంగా హాయిగా గడిపేందుకు ఏదో పుణ్యక్షేత్రానికని బయల్దేరతాం లేదా పండుగ రోజుల్లో ఓ నాలుగు ఊళ్లు తిరిగిరావాలని గడపదాటతాం. ఊరు దాటాక ఏదో ఒకటి తినక మానదు. జిహ్వచాపల్యం అణచుకోలేకో, ఆకలికి తట్టుకోలేకో ఎక్కడో అక్కడ కాస్త ఆహారం తీసుకుంటాం. అంతే! మన విహారయాత్రలో నిప్పులు పోస్తూ అజీర్ణం మొదలవుతుంది. కడుపులో నొప్పి, గ్యాస్, విరేచనాలతో మన సంబరం కాస్తా సద్దుమణిగిపోతుంది. ఇలాంటి పరిస్థితికి ఓ పేరు ఉంది... అదే ట్రావెలర్స్ డయేరియా! అపరిశుభ్రతే అసలు కారణం నలుగురూ తిరిగే చోట పరిస్థితులు ఏమంత పరిశుభ్రంగా ఉండవు. హోటల్లో వంట చేసేవారి దగ్గర్నుంచీ వడ్డించేవారి వరకూ ఎవరో ఒకరు అపరిశుభ్రమైన చేతులతో ఆహార పదార్థాలను ముట్టుకోవచ్చు. ఇలాంటి సమయంలో వారి చేతికి అంటుకుని ఉన్న E.coli వంటి సూక్ష్మక్రిముల ద్వారా ట్రావెలర్స్ డయేరియా (TD) సోకే ప్రమాదం ఉంది. ఇవీ లక్షణాలు అకస్మాత్తుగా విరేచనాలు మొదలవ్వడం, జ్వరం, వాంతులు వికారం, ఆకలి వేయకపోవడం, కడుపులో పోట్లు, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ లక్షణాల నుంచి ఉపశమనం లభించేందుకు మందులు ఎలాగూ అందుబాటులో ఉంటాయి. వాటితో పాటుగా పుష్కలంగా నీరు తాగుతూ ఉండాలి. నీళ్ల విరేచనాలు అవుతుంటే ORS పొడి నీళ్లలో కలుపుకుని తాగాలి. ఒకవేళ విరేచనాలలో రక్తం పోతున్నా, జ్వరం ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించడమే మంచిది. పసిపిల్లలు, గర్భవతులలో TD లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా అందుబాటులోని వైద్యుడిని సంప్రదించాల్సిందే! ఇవీ జాగ్రత్తలు TD వ్యాధి సాధారణంగా 3 నుంచి 7 రోజులల లోపు తగ్గిపోతుంది. చాలా అరుదైన సందర్భాలలో తప్ప ఇది ప్రాణాంతకం కాదు. కాబట్టి అట్టే కంగారుపడాల్సిన పని లేదు. అయితే బయట తిరిగే నాలుగు రోజులూ రోగంతో గడిచిపోతే అంతకు మించిన విషాదం ఏముంటుంది. TD సోకిన తరువాత కంగారుపడి మందులు వాడుతూ తిప్పలు పడేకంటే అసలు అది రాకుండా చూసుకోవడం మేలు కదా! అందుకోసం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి... - అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలలో ఆహారం తీసుకోకూడదు. దారి పొడుగూతా అలాంటి హోటళ్లే కనిపిస్తుంటే ఓ నాలుగు పళ్లు తిని ఆకలి చల్లార్చుకోవడం మంచిది. - పచ్చి కూరలు, ఉడకని పదార్థాలు ముట్టుకోకపోవడమే మేలు. - అపరిశుభ్రమైన నీటితో తయారయ్యే ఐస్తో చేసే జ్యూస్ల జోలికి పోకూడదు. - బయట తాగే నీటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మినరల్ వాటర్ కానీ, కాచి చల్లార్చిన నీరు కానీ తాగాలి. అలా కుదరకపోతే క్లోరిన్ లేదా అయోడిన్ బిళ్లలు కలుపుకొని తాగాలి. - నీరు అస్సలు బాగోలేదు అని అనుమానం ఉన్న చోట, ఆ నీటిని పుక్కిలించినా కూడా ప్రమాదమే! - ప్రయాణాలలో ఎక్కడపడితే అక్కడ మాంసాహారం ముట్టకూడదు. ఎందుకంటే మాంసంలో ఏమాత్రం అపరిశుభ్రత ఉన్నా, అది ఒకోసారి ప్రాణాంతకంగా మారవచ్చు. ముఖ్యంగా చేపల జోలికి అసలు పోవద్దని హెచ్చరిస్తూ ఉంటారు. ఇన్ని కబుర్లు చెబుతున్నారు. మరి నిత్యం అక్కడే ఉండిపోయే వారి పరిస్థితి ఏమిటి అన్న అనుమానం వచ్చిందా! నిజమే! అపరిశుభ్రమైన ప్రదేశాలలో నిరంతరం నివసించేవారికి కూడా మొదట్లో TD సోకి తీరుతుంది. కాకపోతే ఓ ఏడెనిమిదేళ్ల తరువాత వారి శరీరం ఆ సూక్ష్మక్రిములని తట్టుకునేందుకు అలవాటుపడిపోతుంది. కానీ మనకి అంత సమయం ఉండదు కదా! అందుకనే బయట తిరిగే నాలుగు రోజులు కాస్త జాగ్రత్తగా మెలగాల్సిందే! - నిర్జర.  

విటమిని ఇ ఎక్కువగా ఉండే కొబ్బరిపాలు

శరీరానికి కావల్సిన సూక్ష్మ పోషకాలు ఎక్కువగా లభించే పదార్థాల్లో కొబ్బరి పాలు ఒకటి. ఇందులో సోడియం, క్యాల్షియం, ఫాస్ప‌ర‌స్‌, ప్రోటీన్స్‌, పొటాషియం వంటి పోష‌కాలు స‌మృద్దిగా ఉంటాయి. అంతేకాదు క‌రోనాను అరిక‌ట్టే జింక్‌, బీ12 వంటి న్యూట్రియంట్స్ కూడా పుష్క‌లంగా లభిస్తాయి. ఇప్పుడు కొబ్బరిపాలు మార్కెట్ లో కూడా లభిస్తున్నాయి. అయితే ఇంట్లో తయారుచేసుకోవడం మంచిది. పచ్చి కొబ్బరిని తురిమి లేదా మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. పలుచటి క్లాత్ తీసుకుని అందులో ఈ కొబ్బరి ముద్దను వేసి గట్టిగా పిండాలి. ఈ పాలను సన్నని మంటమీద ఐదు నిమిషాలు వేడి చేయాలి. ఆ తర్వాత చల్లారనివ్వాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే పోషకాలు శరీరానికి అందుతాయి. సహజసిద్ధంగా లభించే కొబ్బరిపాలలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా కొబ్బరిపాలు ఎంతో మేలు చేస్తాయి. చుండ్రు సమస్యతో బాధపడేవారు కొబ్బరిపాలను తలకు పట్టించి బాగా మసాజ్ చేస్తే చుండ్రు సమస్య తొలగిపోతుంది. జుట్టు పట్టులా మెరుస్తుంది.
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.