మళ్ళీ ‘టీఆర్ఎస్’గా మార్చాలా? ఎల్లెళ్ళవయ్యా!

కేసీఆర్ తన పార్టీ పేరును ఏ దుర్ముహూర్తంలో ‘టీఆర్ఎస్’ నుంచి ‘బీఆర్ఎస్’ అని మార్చాడో అప్పటి నుంచి ఆయన కుటుంబాన్ని, ఆయన పార్టీని దరిద్రం బబుల్ గమ్ అతుక్కున్నట్టు అతుక్కుంది. ఆ దరిద్రం పుణ్యమా అని అటు అధికారం పోయింది. ఇటు ముద్దుల కూతురు తీహార్ జైల్లో పడింది. పదేళ్ళ కేసీఆర్ హయాంలో జరిగిన కుంభకోణాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. ఇంకా ముందు ముందు ఇంకెంత బ్యాండ్ పడనుందో ఆ భగవంతుడికే తెలియాలి. తెలంగాణ ప్రజల్లో వున్న సెంటిమెంట్‌ని అడ్డం పెట్టుకుని, ఆంధ్ర ప్రజలను తిట్టిపోసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ నుంచి ‘భారత రాష్ట్ర సమితి’ అని మార్చడమే మామూలు విషయం కాదు.. పార్టీ పేరు బీఆర్ఎస్ అని మార్చిన సమయంలో పింక్ పిల్లకాయలంతా కేసీఆర్ ప్రధానమంత్రి కాబోతున్నారని కలలు కన్నారు. కేసీఆర్ కూడా ఆ ఊహల్లో ఊరేగారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పేరుతో హడావిడి చేశారు. ఇంతకాలం తాము తిట్టిపోసిన ఆంధ్రప్రదేశ్‌లో కూడా బిఆర్ఎస్ బ్రాంచ్ ఓపెన్ చేశారంటే వీళ్ళ తెంపరితనానికి, నిస్సిగ్గు వైఖరికి ఇంతకంటే వేరే ఉదాహరణ వుంటుందా? శరీరంలో వున్న సిగ్గుని చివరి బొట్టు వరకూ బయటకి కక్కేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ శాఖ ప్రారంభించాలన్న ఆలోచన రాదు. 2023 ఎన్నికల తర్వాత కేసీఆర్ కొంతకాలం ముఖ్యమంత్రిగా వుంటారు. ఆ తర్వాత 2024 పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో వున్న ఎంపీ సీట్లన్నీ గెలుచుకుని, ఏకంగా మోడీని పక్కకి నెట్టేసి కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారు... ఇదీ బీఆర్ఎస్ వర్గాలు ఆరోజుల్లో కన్న పగటి కల. రేవంత్ రెడ్డి పుణ్యమా అని ఆ కల కల్లగా మారిపోయింది. అప్పటి నుంచి బీఆర్ఎస్ వర్గాల్లో ‘పార్టీ పేరు మారిన తర్వాతే మనం మటాష్ అయిపోవడం ప్రారంభమైంది’ అనే అంతర్మథనం మొదలైంది. పార్టీ పేరు మార్చడం తప్పే అని చాలామంది పార్టీ నాయకులు కేసీఆర్ తిడతాడేమో అనే భయం కూడా లేకుండా బాహాటంగానే చెప్పారు. మరికొంతమంది అయితే, త్వరలో మా పార్టీ పేరు టీఆర్ఎస్‌గా మారబోతోంది అని ప్రకటించేశారు కూడా. పార్టీ వర్గాల ఆకాంక్షలను అర్థం చేసుకోవడంతోపాటు తన మనసులో కూడా వున్న ‘బీఆర్ఎస్’ ప్రభావం ప్రేరేపించడంతో కేసీఆర్ ఎన్నికల సంఘాన్ని సంప్రదించారని తెలుస్తోంది. ఒక్కసారి పార్టీ పేరుని మార్చుకున్న తర్వాత పాత పేరును ఎన్నికల కమిషన్ ఐదేళ్ళపాటు ఫ్రీజ్ చేస్తుంది. ఐదేళ్ళపాటు ఆ పేరుని ఎవరికీ కేటాయించదు. మీరు మళ్ళీ మాకు టీఆర్ఎస్ పేరు కావాలంటే ఎలా సార్? ఇంత చిన్న లాజిక్ మీరు ఎలా మిస్సయ్యారు సార్... అనే అర్థం వచ్చేలా ఎన్నికల సంఘం అధికారుల నుంచి రియాక్షన్ వచ్చిందట. దాంతో బీఆర్ఎస్ అనే పేరును టీఆర్ఎస్‌గా మార్చాలనే ప్రయత్నాలు మానేశారట. ఇప్పటికిలా సర్దుకుపోయి పేరు మార్పు సంగతి ఐదేళ్ళ తర్వాత ఆలోచిద్దామని డిసైడ్ అయ్యారట.
Publish Date: Apr 24, 2024 4:39PM

పెమ్మసాని ఆస్తులు, అర్హతలు చూసి కుళ్ళుకుని చస్తున్న వైసీపీ!

వైసీపీలో ఇప్పుడు కొత్త ఏడుపు మొదలైంది. తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్‌కి వేల కోట్లలో వున్న ఆస్తులను చూసి వైసీపీ వర్గాలు కుళ్ళుకు చస్తున్నాయి. పెమ్మసానికి ఇన్ని ఆస్తులు వున్నాయి.. అన్ని ఆస్తులు వున్నాయి అని వైసీపీ మీడియాలో ఏవేవో కట్టుకథలు వండి వార్చుతున్నారు. అన్ని ఆస్తులు వుండటం వల్లే చంద్రబాబుకు ఎన్నో కోట్లు ఇచ్చి టిక్కెట్ కొనుక్కున్నారనే ప్రచారం మొదలుపెట్టారు. ఈ చెత్త ప్రచారాన్ని పెమ్మసాని చంద్రశేఖర్ విజయవంతంగా తిప్పికొడుతున్నారు. భగవంతుడు తనకు చిన్నతనంలోనే ఎంతో సంపద వచ్చేలా అనుగ్రహించారని, తాను వైసీపీ నాయకుల మాదిరిగా అడ్డదారుల్లో డబ్బు సంపాదించలేదని కౌంటర్ ఇస్తున్నారు. తాను వైసీపీ నాయకుల తరహాలో డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదని, తన మాతృభూమికి సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని వైసీపీ నాయకుల కర్ణభేరులు బద్దలయ్యేలా చాటుతున్నారు.  చంద్రబాబుకు డబ్బిచ్చి టిక్కెట్లు కొనుకున్నారంటే ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులకు కర్రుకాల్చి వాత పెట్టేలాంటి ఫ్లాష్‌బ్యాక్‌ని పెమ్మసాని రివీల్ చేశారు. 2019 ఎన్నికల సందర్భంగా పెమ్మసానిని రాజకీయాల్లోకి రప్పించడానికి జగన్ తీవ్రంగా ప్రయత్నించాడట.. ఎమ్మెల్యే, ఎంపీ ఏ సీటు కావాలంటే ఆ సీటుకి టిక్కెట్ ఇస్తాం.. ఎలక్షన్లో పోటీ చేయడం ఇష్టం లేదంటే ఎమ్మెల్సీగానో, రాజ్యసభ సభ్యుడిగానో ఉంటానన్నా ఓకే... మీరు మా పార్టీలో చేరితే చాలు అంటే భారీ స్థాయిలో రాయబారాలు నడిపారట. వీళ్ళు ఎంత కాళ్ళావేళ్ళఆ పడినప్పటికీ, వైసీపీ విధానాలు, వ్యక్తుల పద్ధతులు నచ్చని పెమ్మసాని వైసీపీకి నో చెప్పారట. అప్పుడు తమ పార్టీలో చేరాలంటూ కాళ్ళావేళ్ళా పడిన వైసీపీ నాయకులు ఇప్పుడు తాను టీడీపీలో చేరితే ఇష్టమొచ్చిన ప్రచారాలు చేయడం వాళ్ళ సంస్కారాన్ని బహిర్గతం చేస్తోందని పెమ్మసాని అంటున్నారు. టీడీపీకి ప్రస్తుత గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఈసారి ఎన్నికలలో పోటీ చేయకుండా తప్పుకున్నారు. ఇక్కడ నుంచి కొత్తగా పోటీకి దిగిన టీడీపి అభ్యర్థిని ఒక ఆట ఆడుకోవాలని అనుకున్న వైసీపీ నాయకులు పెమ్మసాని దూకుడు చూసి బిత్తరపోతున్నారు. పెమ్మసాని ఆడించేవాడే తప్ప, వేరేవాళ్ళు ఆడుకునేవారు కాదని అర్థమై నీళ్ళు నములుతున్నారు. ఎన్నారై కదా, ఏసీ కార్లో వచ్చి, జనానికి చేతులు ఊపి వెళ్ళిపోతాళ్ళే అనుకుంటే, నియోజగకవర్గంలోని గడపగడపనూ పెమ్మసాని సందర్శిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి విడదల రజిని కంటే ప్రచారంలో చాలా ముందున్నారు. పెమ్మసానికి పోటీగా నిలపడానికి వైసీపీ నాయకత్వం వంద రకాలుగా ఆలోచించి పరమ డమ్మీ అభ్యర్థిని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వున్న అభ్యర్థిని నిలపడం వారి నిస్సహాయతను సూచిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ అనేది  డిసైట్ అయిపోయిందని భావిస్తున్నారు.
Publish Date: Apr 24, 2024 4:02PM

బీజేపీ స్ట్రాటజీ వ‌ర్క్ అవుట్ అవుతుందా? మోదీ గ్యారెంటీ ప్ర‌భావం ఎలా ఉంది?

మొద‌టి ద‌శ పోలింగ్ త‌రువాత బీజేపీలో ఎందుకు టెన్ష‌న్ పెరిగింది. మ‌రో వైపు యూపీపై ఆ పార్టీ ఎందుకు ప‌ట్టు కోల్పోతోంది. యూపీ బీహార్ వంటి పెద్ద స్టేట్స్ లో రాజకీయంగా అత్యంత కీలకమైన భూమిక పోషించే జాట్లు, బీజేపీ పట్ల వ్యతిరేకంగా మారిపోయారు. గ‌తంలో ఈ సామాజిక వర్గం అండ‌తోనే బీజేపీ రికార్డు స్థాయి విజయాలను సొంతం చేసుకుంది.  వాస్త‌వానికి బీజేపీ బలం అంతా ఉత్తరాదిలోనే ఉంది. బీజేపీ అధికారంలోకి రావ‌డానికి ప్ర‌ధాన కారణం ఉత్తరాది రాష్ట్రాలే అని ఖ‌చ్చితంగా చెప్ప‌వ‌చ్చు. మొత్తం 542 ఎంపీ సీట్లలో సగానికి పైగా ఉత్తరాదిలో రాష్ట్రాల్లోనే  ఉన్నాయి. దాంతో బీజేపీకి ఎపుడు విజయం ఉత్తరాది నుంచే దక్కుతూ వ‌చ్చింది. అయితే  ఇప్పటికే రెండు ఎన్నికల్లో బీజేపీని గెల‌పించిన ఉత్తరాది ప్ర‌జ‌లు ఈసారి మార్పు కోరుకుంటున్నారు. గతంలో వచ్చిన దాని కంటే సీట్లు తగ్గుతాయని బీజేపీ నేత‌లే అంటున్నారు.  2019లో బీజేపీ ఉత్తరాదిన గెలుచుకున్న సీట్లు 260. అయితే ఈ సీట్ల‌లో ఈ సారి యాభై సీట్లు త‌గ్గ‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. అంటే అపుడు 210 ఎంపీ సీట్లు మాత్రమే బీజేపీకి వస్తాయి. ఇది నిజంగా బీజేపీకి చాలా ఇబ్బంది పెట్టే అంశం. ఎందుకంటే మెజారిటీ కి మ్యాజిక్ ఫిగర్ 273 గా ఉంది. దానికి అరవై సీట్ల దూరంలో బీజేపీ నిలిచిపోతే ఆదుకోవాల్సింది కచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలే. లేకపోతే బీజేపీ సొంతంగా మెజారిటీని సాధించి అధికారంలోకి రావడం అన్నది సాధ్యపడదు. 2019 ఎన్నికల్లో చూసుకుంటే రాజస్థాన్ లో మొత్తం పాతికకు పాతిక సీట్లు గెలుచుకున్న బీజేపీకి ఈసారి 10 సీట్లు త‌గ్గ‌వ‌చ్చ‌ట‌. అలాగే బీహార్ లో మొత్తం 40 ఎంపీ సీట్లు ఉంటే 38 గెలుచుకుంది. ఈసారి అలా కుదరదు అంటున్నారు. ఎందుకంటే అక్కడ ఆర్జేడీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు పుంజుకున్నాయి. దాంతో పది సీట్లు నష్టపోతుందనే అంచ‌నా. అదే విధంగా చూస్తే కనుక గుజరాత్ మొత్తం 26 ఎంపీ సీట్లనూ స్వీప్ చేసింది బీజేపీ. ఈసారి కనీసంగా రెండు ఎంపీ సీట్లు అయినా బీజేపీ నష్టపోతుంద‌ట‌. అలాగే హర్యానాలో నాలుగు సీట్లు బీజేపీ ఓడిపోతుందట‌. ఢిల్లీలో ఏడు ఎంపీ సీట్లు ఉంటే అందులో ఏడింటికి ఏడూ 2019లో బీజేపీ ఖాతాలో పడ్డాయి. కానీ ఈసారి చూస్తే కనుక బీజేపీకి అయిదు దాకా వస్తాయని అంటున్నారు. అంటే రెండు ఎంపీ సీట్లు నష్టపోక తప్పదు. కర్నాటకలో 28 ఎంపీ సీట్లలో పాతిక దాకా బీజేపీ గెలుచుకుంది. ఈసారి పది ఎంపీ సీట్లు బీజేపీ నష్టపోతుందని అంచనాలు ఉన్నాయి. కర్నాటలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. దాంతో కాంగ్రెస్ కూడా గట్టిగా పోరాడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి ఏకపక్ష విజయాలు ద‌క్క‌వు. ఉత్తర భారతాన బీజేపీ యాభైకి పైగా ఎంపీ సీట్లు నష్టపోవడానికి కారణాలు చూస్తే కనుక అక్కడ చాలా రాష్ట్రాలలో బలంగా ఉన్న రాజ్ పుట్ లు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీకి ఒకనాడు రాజ్ పుట్ లు బలంగా మద్దతు ఇస్తూ ఉండేవారు. ఈసారి వారు మనసు మార్చుకున్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలను వారు వ్యతిరేకిస్తున్నారు. రాముడు రాముడే.. రాజకీయం రాజకీయమే... ఓటు ఓటే... అంటున్న 3 కోట్ల మంది రాజపుత్రులు బిజెపి మోడీ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ అరాచకాలపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్య‌క్తం అవుతుంది.  మొదటి దశ ఎన్నికల అనంతరం నిర్వహించిన లోక్ పోల్ సర్వేలో ఉత్తర భారతం నుంచి బీజేపీకి చెప్పుకోదగ్గ ఆధిక్యం ఏమీ లేదని తేలింది. బీజేపీ హయాంలో ప్రభుత్వం రైతులపై కాల్పులు జరిపిన తీరు, నల్లచట్టాలు తీసుకొచ్చి దౌర్జన్యాలకు పాల్పడిన తీరు, రెజ్లర్ కూతుళ్లను రోడ్డున పడేసిన తీరుపై హర్యానా, రాజస్థాన్, పశ్చిమ ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తోన్న జాట్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ సీనియర్ నేత కిరోడిలాల్ మీనా  సామాజికవర్గం మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయబోతోందని అంతర్గతంగా వార్తలు వస్తున్నాయి.   అలాగే బీజేపీ ప్రభుత్వం, రాజ్‌పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడిని లాగి, తలపాగా విసిరి, పోలీసులు అదుపులోకి తీసుకున్న తీరు, అప్పటి నుంచి రాజ్‌పుత్ సమాజం మొత్తం బీజేపీకి ఓటు వేయబోమని ప్రమాణం చేసింది.  దీని వల్ల మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌లలో బీజేపీకి భారీ నష్టం వాటిల్లనుంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో దాదాపు అన్ని స్థానాల్లో నిర్ణయాత్మక స్థానంలో ఉన్నప్పటికీ, త్యాగి మరియు సైనీ వర్గాలకు చెందిన అభ్యర్థులను బిజెపి టికెట్లు ఇచ్చి నిలబెట్టలేదు. దీంతో అస‌హ‌నంతో వున్న ఆ రెండు వర్గాల వారు  బిజెపికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో వివిధ చోట్ల పంచాయితీలు చేస్తున్నారు. అంతే కాదు  గుర్జర్ సామాజికవర్గ ప్రతినిధులను టిక్కెట్ ఇవ్వ‌కుండా దూరంగా ఉంచింది, దీంతో చాలా మంది గుర్జర్ నాయకులు బిజెపికి వ్యతిరేకంగా గళం విప్పారు. వరుసగా 10 సంవత్సరాలుగా గుర్జర్ సామాజికవర్గ ప్రజలకు తగిన వాటా లభించలేదు.  దీని ప్రభావం రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్‌లో స్ప‌ష్టంగా కనిపిస్తుంది. ఈసారి కాశ్మీర్‌లో కూడా అనేక ప్రజా సంఘాలు మరియు కాశ్మీరీ పండిట్ల సంస్థలు బిజెపిపై తమ ఆగ్రహాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నాయి.  ఇది జమ్మూ,  కాశ్మీర్‌లో బిజెపికి ఓట్లను తగ్గిస్తుంది. గ‌త రెండు ఎన్నిక‌ల‌తో పోల్చితే, ఈ ఎన్నికల్లో బీజేపీపై పలు వర్గాల ఆగ్రహావేశాలకు లోనుకావాల్సి వస్తోందని తాజా సర్వేలో తేలింది.  ఈ కారణంగానే బీజేపీ ఓటర్లు ఫ‌స్ట్ ఫేజ్‌లో ఓటు వేసేందుకు బయటకు రాలేదు.  తదుపరి దశ పోలింగ్‌లో బీజేపీ మద్దతుదారుల ఆగ్రహం తగ్గుతుందా? ఇదే బీజేపీ అధిష్టానానికి వేధిస్తున్న ప్ర‌శ్న‌.  - ఎం.కె. ఫ‌జ‌ల్‌  
Publish Date: Apr 24, 2024 3:58PM

జగన్ వ్యూహ వైఫల్యం.. ఆ రెండు స్థానాల్లో వైసీపీ ఓటమి ఖాయం!

గత ఎన్నికల సమయంలో అన్నీ అలా కలిసి వచ్చిన జగన్ కు ఈ సారి మాత్రం ఏదీ కలిసిరావడం లేదు. గత ఎన్నికలలో తనకు సానుభూతి సంపాదించి పెట్టిన కోడి కత్తి దాడి, బాబాయ్ హత్య ఇప్పుడు ఎదురు తిరిగి ఓటమి భయాన్ని రుచి చూపిస్తున్నాయి. పోనీ కొత్తగా సానుభూతి కోసం రాయి దాడి అంటూ హడావుడి చేస్తే అది కాస్తా సానుభూతి మాట అటుంచి నవ్వుల పాలు చేసింది. ఏపీలో ఇప్పుడు జగన్ తరహాలో కంటిపై బ్యాండేజీ పెట్టుకుని తిరగడం యూత్ లో ఒక కొత్త ట్రెండీ ఫ్యాషన్ గా మారిపోయింది. గోదారోళ్ల ఎటకారాన్ని మించిపోయింది.  ఇవన్నీ ఒకెత్తయితే.. వ్యూహాత్మకంగా ఆయన సిట్టింగులను మార్చిన తీరు ఇప్పుడు  పలు నియోజక వర్గాలలో  వైసీపీని విజయానికి దూరం చేయడం ఖాయంగా మారింది. అలాంటి నియోజకవర్గాలలో ఇప్పుడు మాడుగుల అసెంబ్లీ, అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గాలు చేరాయి. పోలింగ్ కు ముందే ఈ రెండు నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థుల ఓటమి ఖరారైపోయిందని ఆ పార్టీ శ్రేణులే చెబుతూ చేతులెత్తేశాయి.  ముందుగా అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం విషయానికి వస్తే.. ఈ నియోజకవర్గం నుంచి కూటమి మద్దతుతో బీజేపీ అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఆయనకు దీటైన అభ్యర్థి అని భావించి సీఎం జగన్  మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి బూడి ముత్యాల నాయుడిని అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థిగా రంగంలోకి దింపారు. నియోజకవర్గం మార్పునకు బూడి ముత్యాల నాయుడిని ఒప్పించడంలో భాగంగా మాడుగుల టికెట్ ను ఆయన కుమార్తె అనూరాథకు మాడుగుల అసెంబ్లీ టికెట్ ఇచ్చారు.  ఫలితం ఇప్పడు ఈ రెండు నియోజకవర్గాలలోనూ కూడా వైసీపీ ఓటమి ఖాయమని ఆయన పార్టీ వర్గాలే బాహాటంగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. మాడుగుల నుంచి బూడిని అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీకి దింపడానికి జగన్ సామాజిక సమీకరణాలను ఆధారంగా తీసుకున్నారు. అనకాపల్లి నుంచి బరిలోకి దిగిన సీఎం రమేష్ కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందిన వారు. అనకాపల్లి లోక్ సభ పురిధిలో ఆ సామాజిక వర్గ ఓటర్లు నాలుగు లక్షల పై చిలుకు ఉన్నారు. దీంతో జగన్ అదే సమాజికవర్గానికి చెందిన బూడిని ఇక్కడ నుంచి బరిలోకి దింపారు.  బూడి స్థానికత ప్లస్ అవుతుందనీ, విజయానికి దోహదపడుతుందనీ జగన్ భావించారు. అయితే అనకాపల్లిలో కాపు సామాజిక ఓటర్లు  కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. ఆ సామాజికవర్గ ఓటర్లు 5 లక్షల పై చిలుకు ఉన్నారు. జనసేన కూటమి భాగస్వామ్య పార్టీయే కావడం సీఎం రమేష్ కు కలిసి వచ్చింది. అంతే కాకుండా సీఎం రమేష్ కు మెగా స్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గ ఓట్లన్నీ గంపగుత్తగా ఆయనకే వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక జగన్ సర్కార్ పట్ల వ్యతిరేకత కారణంగా కొప్పుల వెలమ సామాజిక వర్గంలో  మెజారిటీ సీఎం రమేష్ కు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో  జగన్ ఎత్తుగడ ఘోరంగా విఫలమైంది. అనకాపల్లి నుంచి సీఎం రమేష్ విజయం నల్లేరు మీద బండి నడకే అని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇప్పుడిక మాడుగుల విషయానికి వస్తే ఈ నియోజకవర్గం నుంచి బూడి ముత్యాలనాయుడు రెండు సార్లు విజయం సాధించారు. ఆయనకు నియోజకవర్గంపై గట్టి పట్టు కూడా ఉంది. అయితే  జగన్ బూడిని మార్చి ఆయన కుమార్తె అనూరాథను ఇక్కడ నుంచి పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారు. ఈ నిర్ణయం బూడి కుటుంబంలో చిచ్చుకు కారణమైంది. తన తండ్రి స్థానం నుంచి తానే పోటీ చేస్తానంటూ బూడి కుమారుడు రవి ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగారు. పోటీ నుంచి వైదొలగడానికి ససేమిరా అంటున్నారు. ఈ పరిణామం ఇక్కడ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండారు సత్యనారాయణ మూర్తికి ఆయాచిత లబ్ధిగా మారింది. పెందుర్తి సీటు ఆశించిన బండారు సత్యనారాయణమూర్తి  ఆ సీటు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో చివరి నిముషంలో మాడుగుల బరిలో టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణ మూర్తికి లాభం చేకూరుతుంది. పెందుర్తి సీటును జనసేనకు ఇవ్వడంతో బండారు చొవరి నిముషంలో మాడుగులకు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ బండారుకు వైసీపీయే విజయాన్ని పువ్వుల్లో పెట్టి అప్పగించినట్లైంది.  జగన్ వ్యూహ వైఫల్యం అనకాపల్లి లోక్ సభ, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీ పరాజయాన్ని ఖరారు చేసినట్లైందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.  
Publish Date: Apr 24, 2024 3:46PM

ఇసుకేస్తే రాలనంత జనం.. నామినేషన్ రోజే ఖరారైన యార్లగడ్డ విజయం!

ఇసుకేస్తే రాలనంత జనం. నామినేషన్ ర్యాలీయే విజయోత్సవాన్ని తలపించిన వైనం. ప్రత్యర్థి ఓటమిని ఖారారు చేసిన సందర్భం. ఇదీ గవన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా బుధవారం (ఏప్రిల్ 24) యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ సందర్భంగా కనిపించిన దృశ్యం.  గన్నవరం.. తెలుగుదేశం కంచుకోట. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా వల్లభనేని వంశీ వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. ముచ్చటగా మూడో సారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలని కలలు కంటున్నారు. అయితే  ఆయన 2019లో పార్టీ పరాజయం తరువాత తెలుగుదేశం వీడి వైసీపీ గూటికి చేరారు. అప్పటికి కానీ ఆయనకు అర్ధం కాలేదు. వరుసగా తన రెండు విజయాలు తెలుగుదేశం బలం కానీ తన బలం కాదని. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తరువాత.. ప్రచారం హోరెత్తుతున్న వేళ.. తాను ఎంత నిస్సహాయంగా మిగిలాడో వంశీకి తెలిసివచ్చినట్లైంది.  ఈ సారి గన్నవరంలో పోటీ పడుతున్నది పాత ప్రత్యర్థులే. అయితే పార్టీలు  మారాయి. గత ఎన్నికలలో  వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావు ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థిగా, తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అయితే యార్లగడ్డకు తెలుగుదేశం నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుండగా, వంశీ మాత్రం వైసీపీలో తన వ్యతిరేక గ్రూపుల సహాయనిరాకరణతో  డీలా పడ్డారు. ఇక ఇప్పుడు నామినేషన్ల ఘట్టం దగ్గరకు వచ్చేసరికి యార్లగడ్డ వెంకట్రావు బుధవారం (ఏప్రిల్ 24)న  తన  నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తరలి వచ్చిన భారీ జనసందోహం చూస్తే గన్నవరంలో  యార్లగడ్డ విజయం ఖారారైపోయిందనిపించక మానదు.  రాజకీయ సన్యాసం గురించి గతంలోనే ఆలోచించిన వంశీ ఆ ఆలోచన ఎందుకు విరమించుకున్నానా అని మథనపడుతూ ఉంటారని తెలుగుదేశం శ్రేణులు సెటైర్లు వేస్తున్నాయి.  యార్లగడ్డ నామినేషన్ సందర్భంగా కూటమి ఐక్యత ఎంత పటిష్టంగా ఉందో మరో సారి రుజువైంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో  రాలీలో పాల్గొన్నారు. మరో వైపు ఇప్పటికే  వంశీకి సహకారం అందించే ప్రశక్తే లేదని పలువురు వైసీపీ నేతలు కుండబద్దలు కొట్టేశాయి. దీంతో వంశీ నామినేషన్ ర్యాలీ వెలవెలపోవడం ఖాయమని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇది ఊహించే యార్లగడ్డతో   పాటే గురువారం ( ఏప్రిల్ 25)న నామినేషన్ దాఖలు చేయాలని, తద్వారా పోటీపోటీ ర్యాలీల పేరుతో గందరగోళం సృష్టించాలన్న వంశీ వ్యూహం బెడిసికొట్టింది. ఒకే రోజు ఇద్దరికీ నామినేషన్ దాఖలుకు రిటర్నింగ్ అధికారి  అనుమతి ఇవ్వలేదు. దీంతో యార్లగడ్డ ఒక రోజు ముందే నామినేషన్ కు ముహూర్తం ఖరారు చేసుకున్నారు.  దీంతో గురువారం (ఏప్రిల్ 25) వంశీ నామినేషన్ సందర్భంగా ర్యాలీ తీసే సాహసం చేయకపోవచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
Publish Date: Apr 24, 2024 3:19PM

బీఆర్ఎస్ లో కేసీఆర్ వర్సెస్ కేటీఆర్?

తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక వ్యక్తుల మధ్య విభేదాలు పొడసూపాయా? తండ్రీ కొడుకుల మధ్యే గ్యాప్ వచ్చిందా?   ఈ ప్రశ్నలు ఇప్పుడే కాదు రెండేళ్ల కిందట కూడా తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించాయి. అసలు బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) రెండో సారి గెలిచిన తరువాత నుంచే తండ్రీ కొడుకుల మధ్య కనిపించని గ్యాప్ ఏర్పడిందని అప్పటి నుంచీ వార్తలు వస్తూనే ఉన్నాయి.  జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించి టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన సంగతి తెలిసిందే. అయితే అంతకు ముందే తాను జాతీయ రాజకీయాలపై పూర్తి దృష్టి కేంద్రీకరించడానికి కేటీఆర్ ను తన స్థానంలో ముఖ్యమంత్రిగా కూర్చో పెట్టాలని కేసీఆర్ భావించారు. అందుకోసమే కేటీఆర్ ను పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చారు. అయితే కేటీఆర్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించడమన్నది మాత్రం జరగలేదు. ఇందుకు చాలా చాలా కారణాలున్నాయి. పార్టీలో కేటీఆర్ కు పూర్తి ఆమోదం లేకపోవడం, తిరుగుబాటు వస్తుందన్న బెదురు, అన్నిటికీ మించి కుటుంబంలోనే అందుకు వ్యతిరేకత వచ్చిందన్న వార్తలు వీటిలో కారణమేదైతేనేం ముఖ్యమంత్రిగా కేసీఆర్ స్థానంలో కేటీఆర్ కు పట్టాభిషేకం అయితే జరగలేదు. ఈ విషయంలో అప్పట్లోనే కేటీఆర్ తండ్రితో విభేదించారనీ, కొంత కాలం పాటు ముభావంగా కూడా ఉన్నారనీ అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. మొత్తానికి ఏమైతేనేం కేటీఆర్ మాత్రం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగానే ఉండిపోయారు. సీఎం పీఠం అయితే దక్కలేదు. ముచ్చటగా మూడో సారి గెలిచి బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఇంకే అడ్డంకులూ లేకుండా కుమారుడికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించేసి జాతీయ రాజకీయాలలోకి దూకేద్దామన్న కేసీఆర్ ఎత్తుగడ గత ఎడిది జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలు కావడంతో ఘోరంగా దెబ్బతింది.  అదిగో ఆ క్షణం నుంచీ కేటీఆర్ పార్టీ పేరు మార్పు కారణంగానే ఓటమి ఎదురైందంటూ.. పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలంటూ చెబుతున్నారు. ఇందులో దాపరికం ఏమీ లేదు ఆయన ఈ విషయాన్ని పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. పార్టీ పేరు మార్పుపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని కూడా సెలవిచ్చారు.  అయితే పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్ గా మార్చే ఉద్దేశమే అధినేత కేసీఆర్ కు లేదని ఆయన తాజాగా ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేలిపోయింది. బీఆర్ఎస్ పేరుకు ఏమోచ్చింది? పేరు మార్చే అవసరమే లేదని ఆయన తెగేసి చెప్పారు.  ఒక వైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చడంపై ఆలోచన చేస్తున్నామని చెబుతుంటే... కేసీఆర్ మాత్రం పార్టీ పేరు మార్చే ఉద్దేశం లేదని చెప్పడంతో తండ్రీ కొడుకుల మధ్య మళ్లీ విభేదాలు తలెత్తాయా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లోనే కాకుండా బీఆర్ఎస్ వర్గాల్లో కూడా వ్యక్తమౌతున్నాయి.   
Publish Date: Apr 24, 2024 2:02PM

మసాలా పౌడర్లలో ఇథిలీన్ ఆక్సైడ్... క్యాన్సర్ ప‌క్కా అంటున్న న్యూట్రీష‌న్లు

భారతీయ మసాలా పౌడర్లపై సింగపూర్ బ్యాన్ విధించింది. గ‌తంలోనూ అమెరికా భార‌తీయ మ‌సాలా బ్రాండ్ల‌ను మార్కెట్ నుంచి ఉప‌సంహ‌రించుకోవాల‌ని  అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ ఆదేశించింది.  నెస్లే, సెరెలాక్  ఉత్పత్తులలో అదనపు చక్కెర ఉన్నట్లు బెల్జియన్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. దేశంలోని అన్ని మసాలా తయారీ కంపెనీల నుండి నమూనాలను సేక‌రిస్తున్న‌ట్లు స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎబి రెమ శ్రీ తెలిపారు. మరో 20 రోజుల్లో ల్యాబ్ నుండి నివేదిక వస్తుంది. అనంతరం ఆయా బ్రాండ్లపై క‌ఠిన చర్యలు తీసుకుంటామ‌ని స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా తెలిపింది.  ఎవరెస్ట్, ఎండీహెచ్‌ తయారు చేసిన మసాలాలు వాడొద్దని సింగపూర్, హాంకాంగ్‌ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఆ దేశ ప్రజలకు సూచించింది. ఈ కంపెనీల‌ ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలను నిలిపి వేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే....ఎండీహెచ్ మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా మిక్స్డ్ పౌడర్, కర్రీ ఫౌడర్ మిక్స్డ్ మసాలా, ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలలో పెస్టిసైడ్, ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు గుర్తించామని హాంకాంగ్ ఆహార భద్రతా విభాగమైన 'సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ' సీఎఫ్ఎస్ చెప్పింది.  ఫెస్టిసైడ్ అవశేషాలున్న ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరం. ఇథిలీన్ ఆక్సైడ్ వంటి క్రిమిసంహారక మందుల అవశేషాలు ఉంటే హాంకాంగ్ చ‌ట్టాల ప్ర‌కారం గరిష్టంగా 50వేల డాలర్ల జరిమానా విధిస్తారు. నేరం రుజువైతే జరిమానాతో పాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. గ‌తంలోనూ అదే....2023లో ఎవరెస్ట్ సాంబార్ మసాలా, గరం మసాలాను మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ ఆదేశించింది. వాళ్ళు చెప్పిందేమిటంటే ఈ సుగంధ ద్రవ్యాలలో సాల్మొనెల్లా ఉన్నట్లు అప్పట్లో గుర్తించారట‌. ఈ బ్యాక్టీరియా వల్ల అతిసారం, కడుపు నొప్పి, జ్వరం, తల తిరగడం, వాంతులు అవుతాయి.  అలాగే నెస్లే, సెరెలాక్  ఉత్పత్తులలో అదనపు చక్కెర ఉన్నట్లు కనుగొన్నారు. శిశువులకు అంత చక్కెర ఇవ్వడం మంచిది కాదని బెల్జియన్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది.  ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్‌వర్క్ సహకారంతో ఈ రిపోర్టు రూపొందించారు.   “ప్రతి ప్రోడక్టు ఎగుమతి చేయడానికి ముందు, వాటిని స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా పరీక్షిస్తుంది.  అయితే  సింగపూర్, హాంకాంగ్‌ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ నాణ్య‌తా ప‌రీక్ష‌ల‌కు, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ నాణ్య‌తా ప‌రీక్ష‌ల‌కు, బెల్జియన్ ల్యాబ్ నివేదికల‌కు, మ‌న‌ స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా టెస్ట్‌ల‌కు తేడా ఎందుకు వ‌చ్చింది? ఇదే చ‌ర్చ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతోంది. ఇండియాలో చేసే నాణ్య‌తా ప‌రీక్ష‌ల్లో నాణ్య‌త క‌నిపించి, విదేశాల్లో జ‌రిపిన నాణ్య‌తా ప‌రీక్ష‌ల్లో నాణ్య‌త లేక‌పోవ‌డానికి కార‌ణం ఏమిట‌ని దేశ ప్ర‌జ‌లు మాట్లాడుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది.  దేశంలోని అన్ని తయారీ యూనిట్ల నుండి సుగంధ ద్రవ్యాల నమూనాలను సేకరించాలని ఫుడ్ కమిషనర్‌లను ఆదేశించింది. మసాలా దినుసుల నమూనాల సేకరణ ప్రక్రియ ఇప్ప‌ట్టికే ప్రారంభమైంది.  మూడు నాలుగు రోజుల్లో దేశంలోని అన్ని సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ల నుంచి నమూనాలను సేకరిస్తామ‌ని కేంద్ర‌ ప్రభుత్వ ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.  భారతదేశంలోనూ ఆహార పదార్థాలలో ఇథిలీన్ ఆక్సైడ్ వాడకంపై నిషేధం ఉంది.  ఒక వేళ మసాలా దినుసుల్లో హానికరమైన పదార్థాలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. తాము ఉత్ప‌త్తి చేసే ఉత్పత్తులకు, హానికరమైన అంశాలు జోడించరాదని అవగాహన కల్పించాలని వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సుగంధ ద్రవ్యాల బోర్డుకు భార‌త ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.  భారతీయ బ్రాండ్‌లకు చెందిన నాలుగు సుగంధ ద్రవ్యాలు-మిక్స్ ఉత్పత్తుల అమ్మకాలపై హాంకాంగ్ మరియు సింగపూర్ విధించిన నిషేధాన్ని పరిశీలిస్తున్నట్లు  స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎబి రెమ శ్రీ తెలిపారు. ఇథిలీన్ ఆక్సైడ్ ఆరోగ్యంపై తీవ్ర‌ ప్రభావం చూపుతుందని  ఎబి రెమ శ్రీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇథిలీన్ ఆక్సైడ్‌ను 'గ్రూప్ 1 కార్సినోజెన్'గా వర్గీకరించిందని ఆమె చెప్పారు. అంటే "ఇది మానవులలో క్యాన్సర్‌కు కారణమవుతుంది.  మానవ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కళ్ళు, చర్మం, ముక్కు, గొంతు మరియు ఊపిరితిత్తులు చికాకు కలిగించ‌డంతో పాటు మెదడు,  నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. దేశంలోని అన్ని మసాలా తయారీ కంపెనీల నుండి నమూనాలను తీసుకుంటామని స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎబి రెమ శ్రీ తెలిపారు. మరో 20 రోజుల్లో ల్యాబ్ నుండి నివేదిక వస్తుంది. అనంతరం ఆయా బ్రాండ్లపై చర్యలను ఖరారు చేయనున్నారు.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌
Publish Date: Apr 24, 2024 12:58PM

‘గులకరాయి’పై ఏపీ యూత్ వెటకారాలు!

పాపం జగన్ అండ్ కో ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి గులకరాయి డ్రామా ఆడి జనంలో సానుభూతి సంపాదించుకోవాలని అనుకున్నారు. కానీ, ఆ సానుభూతి డ్రామా వికటించి వెటకారాలకీ, ట్రోలింగ్‌కి దారితీసింది. గులకరాయి డ్రామాని ‘కంటి’న్యూ చేస్తూ జగన్ కంటిమీద ఒక ప్లాస్టర్‌తో తిరుగుతున్నారు. నేను మాత్రం యాక్టింగ్‌తో తక్కువా అన్నట్టు వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి పెద్ద కట్టు కట్టుకుని తిరుగుతున్నారు. వీళ్ళ కట్లు, వ్యవహారం చూసి జనం నవ్వుకుంటున్నారు. ఈ కట్లను ఏపీ యూత్ చాలా కామెడీగా తీసుకుని వెటకారాలు చేస్తున్నారు. కొంతమంది జగన్, వెల్లంపల్లి తరహాలో బ్యాండేజీలు కట్టుకుని కనిపిస్తున్నారు. ఇదేంట్రా బాబూ అంటే, కొత్త ఫ్యాషన్ అని వెటకారంగా అంటున్నారు. మొత్తానికి జగన్ అండ్ కో ఏదో చేయాలనుకుంటే ఇంకేదో జరిగింది.
Publish Date: Apr 24, 2024 12:33PM

కుడితి తొట్టెలో బల్లి కేసీఆర్!

అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడిందట. పాపం బల్లికి బయటి వాళ్ళ భవిష్యత్తు చెప్పడం తెలుసుగానీ, తన భవిష్యత్తే తనకు తెలియదు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిస్థితి కూడా కుడితి తొట్టెలో పడ్డ బల్లి తరహాలోనే వుంది. తన అధికారం ఊడిపోయే వరకు తనకు తెలియలేదుగానీ, ఏపీ ఎన్నికలలో వైసీపీ గెలుస్తుందని ఈయనగారు జోస్యం చెబుతున్నారు. వైసీపీ గెలుస్తుందన్న సమాచారం తన దగ్గర వుందట. కేసీఆర్‌కి ఆ సమాచారం ఏ తల మాసినవాడు ఇచ్చాడో! ‘నా దగ్గర సమాచారం వుంది’, ‘సరైన సమయంలో బయటపెడతా’ లాంటి పడికట్టు పదాలు ఇక కేసీఆర్ మానుకుంటే మంచింది. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ దారుణంగా ఓడిపోవడం ఖాయమని ఏపీలో జనాలు చెబుతున్నారు. నేషనల్ మీడియా చేసిన సర్వేలో కూడా వైపీపీ పని ఖతం అని తేలిపోయింది. మరి ఫామ్ హౌస్‌లో పడుకునే కేసీఆర్‌కి అంత గొప్ప సమాచారం ఇచ్చిందెవరో! ఈయన ఒక సిద్ధాంతి.. ఈయనకి సమాచారం ఇచ్చినాయన ఒక వేదాంతి. సాధారణంగా బల్లి కుడితి తొట్టెలో పడకముందు శకునాలు చెబుతుంది. కుడితి తొట్టెలో పడిన తర్వాత శకునాలు చెప్పడాలేవీ వుండవు. కేసీఆర్ మాత్రం కుడితి తొట్టెలో పడిన తర్వాత కూడా శకునాలు  చెప్పడమే ఇక్కడ వింత. కేసీఆర్‌కి మొదటి నుంచీ ఏపీ అన్నా, చంద్రబాబు అన్నా ద్వేషం. ఏపీ సర్వనాశనం అయిపోతే కేసీఆర్ కళ్ళు చల్లగా వుంటాయి. గత ఐదేళ్ళలో జగన్‌తో కలసి తన కళ్ళను చల్లగా చేసుకున్న కేసీఆర్, మరో ఐదేళ్ళు ఆ చల్లదనాన్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు. ఇక తమరి పప్పులు ఉడకవు కేసీఆర్.. ఈ ఎన్నికల తర్వాత మీరు, జగన్ కలసి భజన చేసుకుంటూ కూర్చోవాల్సిందే.
Publish Date: Apr 24, 2024 12:14PM

ఓటమి తరువాత నెల రోజులకే వైసీపీ ఖాళీ.. సీఎం రమేష్ జోస్యం

తెలుగు రాష్ట్రాలలో రాజకీయ స్నేహం గురించి చెప్పుకోవలసి వస్తే ముందుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ గురించే చెప్పుకోవాలి. 2018లోనే అంటే నిర్దిష్ట గడువు కంటే ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. 2019లో ఏపీలో జరిగిన ఎన్నికలలో తన మిత్రుడు జగన్ విజయం కోసం తెలంగాణ నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. సరే ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని కేసీఆర్ వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టారని పరిశీలకులు అప్పట్లో విశ్లేషణలు చేశారు. హైదరాబాద్ లో స్థిరపడ్డ ఆంధ్రుల నుంచి ఇక్కడి తెలుగుదేశం పార్టీకి ఏ రకంగానూ సహకారం అందకుండా నిలువరించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారనీ, ఇందు కోసం తెలంగాణలోని ఆంధ్రులపై ఆయన సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించారనీ కూడా అప్పట్లో చెప్పుకున్నారు. సరే అది పక్కన పెడితే.. జగన్ సైతం తన మిత్రుడికి 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఇతోధిక సహకారం అందించారు. లేని సెంటిమెంటును రెచ్చగొట్టైనా మిత్రుడు కేసీఆర్ ను గట్టెక్కించాలని జగన్ ప్రయత్నించారు. ఎన్నికల రోజుకు సరిగ్గా ముందు రోజు అర్ధరాత్రి సాగర్ వద్ద ఏపీ పోలీసులతో హంగామా చేయించారు. అయితే అవేమీ ఫలించలేదు. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే బీఆర్ఎస్ పరాజయం తరువాత ఆ పార్టీ రోజు రోజుకూ బక్కచిక్కిపోతున్న పరిస్థితి. పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నుంచి కాంగ్రెస్, బీజేపీలలోకి వలసలు పెరిగిపోయాయి. పోతే పోనీ అని బీఆర్ఎస్ అధినేత డాంబికంగా చెబుతున్నప్పటికీ.. వలసల ఉధృతి చూస్తుంటే లోక్ సభ ఎన్నికల తరువాత ఆ పార్టీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయమే పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది. సిట్టింగులు, మాజీలే కాదు, ద్వితీయ శ్రేణి నేతలూ, చివరాఖరికి పార్టీ క్యాడరూ కూడా కారు దిగిపోవడానికి తహతహలాడుతున్న పరిస్థితి తెలంగాణలో కనిపిస్తోంది.  ఇదే విషయాన్ని బీజేపీ నేత, ఆ పార్టీ అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి సీఎం రమేష్ ఎత్తి చూపుతూ.. ఏపీలో జగన్  ఓటమి తరువాత వైసీపీకీ అదే గతి పడుతుందన్నారు. అంతే కాదు బీఆర్ఎస్ కంటే వేగంగా వైసీపీయే ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. ఒక చానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీఎం రమేష్ జగన్ అధికారం కోల్పోయిన తరువాత కనీసం నెల రోులు కూడా ఆ పార్టీ మనుగడ సాగించ లేదనీ, చాలా వేగంగా జారుడుబండ మీద నుంచి జారినట్లు ఆ పార్టీ నుంచి నేతలు జారిపోతారని రమేష్ అన్నారు. కనీసం బీఆర్ఎస్ నేతలు వలసల విషయంలో కొంత సమయం తీసుకున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం అంత టైమ్ జగన్ కు ఇవ్వరన్నారు.    నిజమే.. పేరుకే ఎమ్మెల్యే సొంత నియోజకవర్గంలో మాత్రం పెత్తనమంతా వాలంటీర్లదే. ఆ పరిస్థితుల్లో ఎన్నో అవమానాలకు గురైన ఎమ్మెల్యేలకు జగన్ పట్ల విధేయత, విశ్వసనీయత ఉండే అవకాశం లేదని పరిశీలకులు సైతం అంటున్నారు. ఇప్పటికే జగన్ పట్ల పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తోందనీ, ఓటమి తరువాత అది తిరుగుబాటు స్థాయికి చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదనీ అంటున్నారు. 
Publish Date: Apr 24, 2024 12:05PM

కేసీఆర్ మారడు.. మరోసారి క్లారిటీ వచ్చింది!

పుట్టుకతో వచ్చిన బుద్ధి... అంటారు చూశారా.. ఆ మాట తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి సరిగ్గా సూటవుతుంది. పదేళ్ళపాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా అహంకారపూరితమైన అధికారాన్ని చెలాయించిన కేసీఆర్‌ని, ఆయన పార్టీని నిన్నటి ఎన్నికలలో తెలంగాణ ప్రజలు ఇంటికి సాగనంపారు. దారుణమైన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, ఆత్మ విమర్శ చేసుకుని, పద్ధతులలో మార్పులు చేసుకుంటే వచ్చే ఎన్నికలలో కేసీఆర్‌కి మళ్ళీ ప్రజాదరణ లభిస్తే లభించవచ్చు. కానీ, కేసీఆర్‌గానీ, ఆయన పార్టీలోని వ్యక్తులుగానీ తమ పాత ధోరణిలోనే వున్నారు తప్ప మారే ధోరణిలో ఎంతమాత్రం లేరు. ఈ విషయం కేసీఆర్ తాజాగా ఒక ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన తీరు చూస్తూ అర్థమవుతోంది. తమను ఇంటికి పంపించి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని కేసీఆర్ అంటున్నారంటే, ఇంతకంటే అమాయకత్వం, అహంకారం మరొకటి వుంటుందా? 1989లో ఎన్టీఆర్‌ని కూడా ప్రజలు ఓడించారు. తనకు తిరుగేలేదని అప్పటి వరకూ భావిస్తూ వచ్చిన ఎన్టీఆర్ ప్రజలు ఇచ్చిన తీర్పుతో షాకయ్యారు. అయినప్పటికీ, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, తనను తాను మార్చుకున్నారు. అంతే తప్ప ప్రజలను ఏనాడూ నిందించలేదు. ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లో రాణించిన కేసీఆర్ ఎన్టీఆర్ నుంచి ఈ గుణాన్ని నేర్చుకోలేదు. పదేళ్ళ కేసీఆర్ అధికారాన్ని పీకి అవతల పారేసిన రేవంత్ రెడ్డి ఇప్పటికీ కేసీఆర్‌కి అంగుష్టమాత్రుడిగానే కనిపిస్తున్నారు. కేసీఆర్ ఇప్పటికీ తనను తాను హిమాలయాలంత ఎత్తున ఉన్నట్టుగానే ఊహించుకుంటున్నారు. తాను పదేళ్ళపాటు అద్భుతమైన పరిపాలన అందించినట్టే భావిస్తున్నారు. తాను తీసుకున్న నిర్ణయాలన్నీ చాలా గొప్పవనే భావిస్తున్నారు. మేడిగడ్డ కుంగిపోవడం చాలా చిన్న విషయంగానే భావిస్తున్నారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. తాను చాలా గొప్ప పరిపాలన అందించినట్టే ఆయన భావిస్తున్నారు.  బీఆర్ఎస్ పార్టీ క్రమంగా ఖాళీ అవుతోంది. భవిష్యత్తులో కేసీఆర్ కుటుంబం, ఆయన కుటుంబానికి విధేయంగా పడివుండేవారు తప్ప మరెవరూ ఆ పార్టీలో వుండే అవకాశాలు కనిపించడం లేదు. ఇలాంటి వాస్తవ పరిస్థితులకు భిన్నమైన విధంగా కేసీఆర్ వాదన వుంది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన నాయకులు తనకు ఫోన్ చేసి, అనవసరంగా బీఆర్ఎస్‌ని వదిలి వెళ్ళామని బాధపడుతున్నారట. కేసీఆర్ అధికారంలో వున్నప్పుడు పార్టీలో వున్న ఎమ్మెల్యేలు, ఎంపీలకే కేసీఆర్‌కి ఫోన్ చేసే సీన్ లేదు.. ఇప్పుడు బయటకి వెళ్ళిన వాళ్ళు ఫోన్ చేయడం, ఈయన మాట్లాడ్డం... బాగుందండి కల్పన. కేసీఆర్ అక్కడితో ఆగలేదు. కాంగ్రెస్ పార్టీలో వున్న 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు తనకు టచ్‌లో వున్నారట. వాళ్ళంతా బీఆర్ఎస్‌కి మద్దతు ఇస్తున్నారట, కాంగ్రెస్ నుంచి  బయటకి వచ్చి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. 
Publish Date: Apr 24, 2024 11:55AM

నెక్స్ట్ ఎవరు.. సీఎస్, డీజీపీయేనా? ఏపీ అధికారుల్లో చర్చ!

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అదే కోడ్ అమలులోకి వచ్చింది. దేశ మంతా కోడ్ అమలు అవుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అసలు ఎన్నికల కోడ్ అమలులో ఉందా అన్న అనమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. కోడ్ లెక్క చేయకుండా అధికార యంత్రాంగం అధికార పార్టీ సేవలో తరించిపోతుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందన్న విమర్శలూ వెల్లువెత్తాయి. పశ్చిమబెంగాల్ లో అయితే ఇలా కోడ్ అమలులోకి వచ్చిందో లేదో అలా ఆ రాష్ట్ర పోలీస్ చీఫ్ కు స్థాన భ్రంశమైంది. అక్కడి కంటే అడ్డగోలుగా ఇక్కడ అధికార యంత్రాంగం జగన్ ప్రభుత్వ సేవలో  తరిస్తుంటే ఎన్నికల సంఘం ఉదాశీనంగా వ్యవహరిస్తుండటంపై పలు అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.  అయితే ఆలస్యంగానైనా కేంద్ర ఎన్నికల సంఘం ఏపీపై దృష్టి సారించింది. అధికార పార్టీకి అనుకూలంగా అంటకాగుతున్న అధికారులపై వేటు వేస్తోంది. తాజాగా ఇంటలిజన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా తాతాపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.  ఎన్నికల ప్రక్రియతో సంబంధం లేని పోస్టింగ్ ఇవ్వాలని విస్పష్టంగా ఆదేశించింది.   ఎన్డీఏ కూటమి చాలా రోజుల నుంచి  రాష్ట్ర ఇన్చార్జి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్‌రెడ్డి, సీఎస్ జవహర్‌రెడ్డి, ఇంటలిజన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణా తాతా సహా.. ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్న ముగ్గురు డీఎస్పీలు, మరికొందరు పోలీసు అధికారులను, ఎన్నికల వరకూ ఆ బాధ్యతల నుంచి తప్పించాలని ఈసీకి ఫిర్యాదు చేసింది. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అయితే.. అధికారపార్టీ అడుగులకు మడుగులొత్తుతున్నట్లుగా వ్యవహరిస్తున్న అధికారుల జాబితాతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.   ముఖ్యంగా సీఎస్ జవహర్‌రెడ్డి పెన్షన్ల విషయంలో  ఈసీ ఆదేశాలు ఉల్లంఘించి జగన్ పార్టీకి మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఇక ఇంటలిజన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఫిర్యాదు చేసింది. అయితే విచిత్రంగా కీలకమైన నిర్ణయాలు తీసుకునే స్థానాల్లో ఉన్న సీఎస్ జవహర్‌రెడ్డి, ఇన్చార్జి డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డిని తొలగించకుండా..  ఇంటలిజన్స్ చీఫ్‌ను తప్పించడం ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయమే. దేశంలో ఇఫ్పటివరకూ ఇన్ చార్జ్ డీజీపీ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగిన సందర్భం లేదు. పశ్చిమ బెంగాల్ లో పూర్తి స్థాయి డీజీపీనే కోడ్ అమలులోకి వచ్చీరాగానే తప్పించిన ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇన్ చార్జ్ డీజీపీని ఇంత వరకూ ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలంటూ ఆదేశాలు ఇవ్వకపోవడంపై రాజకీయ పరిశీలకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నా ఇన్ చార్జి డీజీపీ విషయంలో  ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఎన్నికల సంఘం పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే సీఎస్ గా కాకుండా, అధికార పార్టీ నేతగా వ్యవహరిస్తున్నారంటూ జవహర్ రెడ్డిపై కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇన్ చార్జ్ డీజీపీ కంటే ముందు ఆయనపై ఎన్నికల సంఘం వేటు వేసే అవకాశం ఉందనీ, ఆ తరువాత కొత్తగా వచ్చే సీఎస్ డీజీపీ విషయంలో నిర్ణయం తీసుకుంటారన్న వాదన అధికారవర్గాల్లో వినవస్తోంది. సీఎస్, ఇన్ చార్జ్ డీజీపీల మార్పు అయితే ఖాయమని అంటున్నారు.  ఇహనో, ఇప్పుడో లేదా నేడో రేపో అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయని అంచనా వేస్తున్నారు. అది పక్కన పెడితే తాజాగా ఇద్దరు కీలక ఐపిఎస్ అధికారులపై బదిలీ వేటుతో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులలో ఆందోళన మొదలైంది.  ఇప్పటికే ఎన్డీఏ నేతల ఫిర్యాదులు ఎదుర్కొంటున్న ఈ స్థాయి అధికారులలో కంగారు మొదలైంది. అధికార పార్టీకి అనుకూలంగా ఎంతగా సేవ చేసినా ఎన్నికల సమయంలో ఈసీ కొరడా ఝుళిపించకుండా తమను అధికార పార్టీ నేతలు కానీ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కానీ కాపాడలేరన్న విషయం ఇప్పుడు వారికి అర్థమైనట్లు కనిపిస్తోంది. ఇక నుంచి తటస్థంగా ఉండాలని వారు భావించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.  ఉల్లంఘనులపై ఈసీ విడతల వారీ వేటు వెనుక కూడా ఇదే ఉద్దేశధం ఉండి ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మొత్తం మీద ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీపై ఎన్నికల సంఘం వేటు ఏపీ అధికార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తరువాత వంతు ఎవరిదో అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.  
Publish Date: Apr 24, 2024 11:54AM

గురువింద గింజ సామెతలా వైసీపీ తీరు!

సుద్దులు చెప్పడంలో వైసీపీ ఎప్పుడూ ముందుంటుంది. గురివింద గింజ సామెత ఆ పార్టీ చెప్పే నీతి వాక్యాలు చూస్తే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎన్నికల ముంగిట అన్ని దారులూ మూసుకుపోయిన తరువాత.. ఓటమి వాకిలి మాత్రమే తెరిచి ఉన్న తరుణంలో వైసీపీకి ముస్లిం మైనారిటీలు గుర్తుకు వచ్చారు. ఇప్పుడు వారి ఓట్లు రాబట్టుకుని గట్టెక్కే ప్రయత్నాలకు తెరతీసింది. ప్రధాని నరేంద్రమోడీ రాజస్థాన్ లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రసంగాన్ని పట్టుకుని చంద్రబాబును ముస్లింలకు బూచిగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నది.  నిజానికి వైసీపీ ఇప్పటి వరకూ అన్ని విషయాలలోనూ బీజేపీకి మద్దతుగా నిలబడింది. ఇప్పుడు మోడీనీ, ఆయనతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబును ముస్లిం వ్యతిరేకులుగా ముద్రవేయడానికి ప్రయత్నిస్తున్న వైసీపీ వివాదాస్పద ట్రిపుల్ తలాక్, సీఏఏ విషయంలో కోరకుండానే బీజేపీకి మద్దతు ఇచ్చిన విషయాన్ని కన్వీనియెంట్ గా మరిచిపోతోంది. జనాలకు ఆ విషయం గుర్తుండదని నమ్ముతోంది.  అయితే ఇక్కడ కూడా ఆ పార్టీ అధినేత తన ఎన్నికల ప్రచారంలో మోడీని కానీ, బీజేపీని కానీ పన్నెత్తు మాట అనడం లేదు. అయితే చంద్రబాబుతో బంధుత్వం ఉందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. అయితే వైసీపీ సోషల్ మీడియా మాత్రం రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారంలో  భాగంగా మోడీ ప్రసంగాన్ని వైరల్ చేస్తున్నది. ఆ ప్రసంగంలో ఆయన కాంగ్రెస్ ప్రజల ఆస్తులను ముస్లింలకు పంచాలని చూస్తోందని ఆరోపించిన సంగతి తెలిసిందే. మోడీ వ్యాఖ్యలను చంద్రబాబుకు ఆపాదిస్తూ చంద్రబాబు అధికారంలోకి వస్తే ముస్లింలకు నష్టం చేకూరుతుందంటూ ఊదరగొడుతోంది. అయితే నెటిజనులు వైసీపీ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నారు.  సీఏఏ, ట్రిపుల్ తలాక్ ల విషయంలో  వైసీపీ మోడీకి బేషరతు మద్దతు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ నెటిజనులు గురువింద గింజ సామెతను గుర్తు చేస్తున్నారు. 
Publish Date: Apr 24, 2024 10:47AM

ఏపీలో ఫ్యాన్ కు గాలాడటం లేదా?

ఏపీలో వైసీపీకి గాలాడటం లేదు. ఆ పార్టీ శ్రేణుల్లోనే వైసీపీ ఓటమి ఖాయమన్న భావన వ్యక్తం అవుతోంది. చివరాఖరికి ఐప్యాక్ తాజాగా జగన్ కు సమర్పించిన నివేదికలో కూడా అదే విషయాన్ని పేర్కొంది.  ఇంత కాలం ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న జగన్ సొంత సామాజిక వర్గం కూడా అధికార పార్టీకి దూరమైపోయింది.  దాదాపు అన్ని వర్గాలలోనూ పార్టీ పట్ల, జగన్ ప్రభుత్వం పట్ల వ్యక్తమౌతున్న వ్యతిరేకతతో ఫ్యాన్ కు గాలాడని పరిస్థితి ఏర్పడిందని వైసీపీ వర్గాలు అంటున్నాయి.  ముఖ్యంగా వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులలో అధికార పార్టీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2014 నుంచి పార్టీ కోసం కష్టనష్టాలకోర్చి పని చేసిన తమను పక్కన పెట్టేసిన జగన్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వలంటీర్లను నమ్ముకుని తమను నిర్లక్ష్యం చేశారన్న కోపం వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా పార్టీ శ్రేణులలో ఈ తీరు కనిపిస్తున్నా వాలంటీర్లు ఉండగా భయమేల? చింతేల? అనుకున్న జగన్ కు ఇప్పుడు వాలంటీర్లు కూడా మొండి చేయి చూపడానికి రెడీ అయిపోయారని పరిశీలకులు అంటున్నారు.  చంద్రబాబు ప్రకటించిన పదివేల రూపాయల హామీ, వారిని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మార్చేసిందా? ప్రభుత్వం చెప్పినట్లల్లా చేయకుండా తటస్థంగా ఉండటమే మేలన్న నిర్ణయానికి వచ్చేశారా? అంటే రాజీనామాలు చేసేది లేదని భీష్మిస్తున్న వారిని చూస్తే అదే నిజమని అనిపించకమానదు. వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖాయమని వాళ్లూ వీళ్లూ కాదు.. ఏకంగా  ఐ ప్యాక్ తేల్చేసిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఐ ప్యాక్ తన తాజా నివేదికను వైసీపీకి అందించిందని అంటున్నారు. ఆ నివేదిక తరువాత వైసీపీలో ఇంకా దింపుడు కళ్లెం ఆశ మిగిలిందని అంటున్నారు. ఎందుకంటే మహిళల్లో అత్యధిక శాతం వైసీపీ పట్లే మొగ్గు చూపుతున్నారనీ, అదే సమయంలో మిగిలిన అన్ని వర్గాలూ తెలుగుదేశం కూటమికి మద్దతు ప్రకటిస్తున్నారనీ ఐప్యాక్ పేర్కొంది. మహిళల మద్దతు ఉంటే చాలు గెలుపు తధ్యమని వైసీపీ అగ్రనాయకత్వం భావిస్తోందని  పార్టీ  వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం మొత్తం వైసీపీ పని అయిపోయిందన్న నివేదిక ఇస్తే జగన్ ఆగ్రహానికి గురౌతామన్న జంకుతోనే ఐప్యాక్ మహిళల మద్దతు అంటూ నివేదికలు ఇచ్చిందనీ, వాస్తవానికి మహిళల్లోనే జగన్ పాలన పట్ల ఆగ్రహం ఎక్కువగా కనిపిస్తోందని అంటున్నాయి. ఐప్యాక్ కంటే తామే ఎక్కువగా క్షేత్ర స్థాయిలో ఉంటామనీ, తమకు కనిపించిన ఆగ్రహం ఐప్యాక్ కు ఎందుకు కనిపించలేదో అర్ధం కావడం లేదనీ చెబుతున్నాయి. అంతే కాదు..  క్రైస్తవ సమాజంలోనూ జగన్ పట్ల వ్యతిరేకత కానవస్తోందని చెబుతున్నాయి. ఐప్యాక్ తన నివేదికలో క్రైస్తవుల ఓట్లన్నీ గంపగుత్తగా వైసీపీవైపే ఉన్నాయని పేర్కొందనీ, అయితే వాస్తవం అందుకు భిన్నంగా ఉందనీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఒక్క బీజేపీ పోటీ చేసే స్థానాలలో మాత్రమే కూటమికి ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే కూటమి వ్యతిరేక ఓట్లు గంపగుత్తగా వైసీపీ వైపు మళ్లే అవకాశం లేదనీ, ఆయా స్థానాలలో వారు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారనీ అంటున్నారు.  ఇక ముస్లిం మైనారిటీల విషయంలో వారిలో అధికార వైసీపీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ ముస్లిం మైనారిటీలంతా కూటమికే మద్దతుగా నిలిచారనీ, అయితే గత రెండు రోజులుగా సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్ లో ప్రధాని మోడీ ఏపీ పేరు ప్రస్తావిస్తూ ముస్లిం రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు వారిలో కూటమి పట్ల విముఖతకు కారణమయ్యాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.   కడప, గుంటూరు, కర్నూలు, నంద్యాల వంటి ముస్లిం ప్రభావిత నియోజకర్గాల్లో సైతం అధికారపార్టీ పట్ల స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తోంది.   బీజేపీ పోటీ చేసే నియోజకవర్గాల్లో  కూడా మైనారిటీలు వైసీపీ వైపు కాకుండా కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నారు. అయితే తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాలలో మాత్రం ముస్లింల మద్దతు కూటమి అభ్యర్థులకే ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద రాష్ట్రంలోని అన్ని వర్గాలలోనూ అధికార వైసీపీపై వ్యతిరేకత వ్యక్తమౌతోందని ఐప్యాక్ నివేదిక సహా ఇప్పటి వరకూ వెలువడిన సర్వేల ఫలితాలన్నీ తేల్చేయడంతో మానసికంగా వైసీపీ నేతలు కూడా ఓటమి తప్పదన్న నిర్ణయానికి వచ్చేశారనీ, అది వారి ప్రచార సరళిలో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: Apr 24, 2024 10:16AM