కోర్టు మొట్టికాయలతో దిగొచ్చిన జగన్ సర్కార్!

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కూడా జగన్ సర్కార్ విపక్ష నేతలపై ఉన్న కేసుల వివరాలను అందజేయకుండా వేధిస్తున్న నేపథ్యంలో వారు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నామినేషన్‌ పత్రాల దాఖలు సమయంలో తమపై ఉన్న కేసుల వివరాలను కూడా అభ్యర్థులు అందజేయాల్సి ఉంది. వారిచ్చే సమాచారంలో ఏ ఒక్కటి మిస్‌ అయినా వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ  మార్చి ఒకటో తేదీన డీజీపీకి లేఖ రాసినప్పటికీ డీజీపీ స్పందించకపోవడంతో చంద్రబాబు తదితరులు కోర్టును ఆశ్రయించారు.  ఏపీ సర్కార్ విపక్ష నేతలపై వేధింపులలో భాగంగా ఆ కేసుల వివరాలను కోరినా కూడా విపక్ష నేతలకు అందజేయడంలేదంటూ వారు హైకోర్టును ఆశ్రయించారు.  తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, రాష్ట్ర అధ్యక్షుడుఅచ్చెన్నాయుడు, మాజీ మంత్రి నారాయణ, అయ్యన్నపాత్రుడు తదితరులు కోర్టును ఆశ్రయించిన వారిలో ఉన్నారు. వారి పిటిషన్ ను విచారించిన హైకోర్టు ప్రజాప్రతినిథులపై ఉన్న కేసుల వివరాలను వారికి అందజేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఈ నెల 16లోగా కేసుల వివరాలను ఇవ్వాలని డీజీపీని హైకోర్టు ఆదేశిస్తూ కేసులు సోమవారం (ఏప్రిల్ 16)కు వాయిదా వేసిన సంగతి తెలసిందే.   కోర్టు ఆదేశాలతో దిగివచ్చిన ప్రభుత్వం నేతలపై ఉన్న కేసుల వివరాలను వారి ఈమెయిల్ కు పంపినట్లు సోమవారం (ఏప్రిల్ 16) కోర్టుకు తెలిపింది.  దీంతో కోర్టు  ఒకసారి మెయిల్ చెక్ చేసుకుని ఈ మధ్యాహ్నంలోగా ఆ వివరాలు వచ్చాయో లేదో చెప్పాలని పిటిషనర్‍ లు తరపున న్యాయవాదులను ఆదేశించింది. 
Publish Date: Apr 16, 2024 1:56PM

గ్లాస్ గుర్తు జనసేనకే.. ఏపీ హైకోర్టు తీర్పు

జనసేన పార్టీకి హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆ పార్టీకే గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గ్లాసు గుర్తును కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజాకాంగ్రెస్ సెక్యులర్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఇటీవల తీర్పు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తీర్పును ఈ రోజు తీర్పును వెలువరించింది. జనసేన పార్టీకి గ్లాస్ గుర్తును కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజాకాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది.  దీంతో జనసేనకు బిగ్ రిలీఫ్ దక్కినట్లైంది. ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తున్న బకెట్ గుర్తుతో జనసేన ఒకింత ఇబ్బందులు పడుతోంది. బకెట్ గుర్తు గ్లాసును పోలి ఉండటంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ పరిస్థితుల్లో గ్లాసు గుర్తుపై పిటిషన్ దాఖలు కావడంతో  ఏం జరగబోతోందన్న ఉత్కంఠ జనసైనికుల్లో ఏర్పడింది. అయితే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో జనసేనకు భారీ ఊరట లభించినట్లైంది.  పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పవన్ కల్యాణ్ అన్న పేరు ఉన్న వ్యక్తి రంగంలోకి దిగారు. దీంతో పేర్ల విషయంలో ఓటర్లలో కన్ఫ్యూజన్ నెలకొనే అవకాశం ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే బకెట్ గుర్తుతో కూడా తలనొప్పులు వచ్చే అవకాశం ఉన్నాయని అంటున్నారు. అయితే అటువంటి ఇబ్బంది పిఠాపురం నియోజకవర్గంలో తలెత్తే అవకాశం లేదని జనసైనికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పేరుతో నవరంగ్ కాంగ్రెస్ అభ్యర్థిని రంగంలోకి దిగినా పవన్ కల్యాణ్ ను గుర్తుపట్టని  ఓటరు ఉండరనీ, అందువల్ల పేరు విషయంలో ఎటువంటి కన్ఫ్యూజ్ ఉండదనీ, అలాగే గుర్తు విషయంలో కూడా ఓటర్లు గందరగోళంలో పడే అవకాశం లేదనీ, ఈవీఎంలో జనసేన అభ్యర్థిగా పవన్ కల్యాణ్ పొటో చూసి ఓటువేస్తారని అంటున్నారు. 
Publish Date: Apr 16, 2024 1:32PM

తెలుగు రాష్ట్రాల్లో ఎల్లుండి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం 

లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ జూన్ 1న ముగుస్తుంది. తొలి దశ ఎన్నికల్లో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది. మే 13న పోలింగ్ జరుగుతుంది. ఎల్లుండి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను దాదాపుగా ప్రకటించేశాయి. అయితే, బీఫామ్ చేతికి వచ్చేంత వరకు కొందరు అభ్యర్థులకు టెన్షన్ తప్పని పరిస్థితి ఉంది. తెలంగాణలో బిఆర్ఎస్ నుంచి  చాలామంది ముఖ్య నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికార వైసీపీ నుంచి నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికలలో త్రి కూటమి సక్సెస్ అవుతుందని  న్యూస్ ఎక్స్ సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో చేరికలు కాంగ్రెస్ వైపు ఉంటే ఎపిలో మాత్రం త్రి కూటమిలో చేరుతున్న వారు ఎక్కువగా ఉన్నారు.  ఏపీ, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్: .ఏప్రిల్ 18 – నామినేషన్ల స్వీకరణ .ఏప్రిల్ 25 – నామినేషన్లకు చివరి తేదీ .ఏప్రిల్ 26 – నామినేషన్ల పరిశీలన .ఏప్రిల్ 29 – నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ .మే 13 – పోలింగ్ .జూన్ 4 – ఎన్నికల ఫలితాలు.
Publish Date: Apr 16, 2024 12:55PM

పొంగులేటిదే పై‘చేయి’.. ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి పొగులేటి ప్రసాద్ రెడ్డి?

గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలో ఒక్క స్థానం మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ స్థానాలలోనూ కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. ఆ తరువాత ఇటీవల బీఆర్ఎస్ తరఫున జిల్లా నుంచి గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బ్రహ్మాండంగా పెర్మార్మ్ చేసిన క్రెడిట్ అంతా పొంగులేటికే చెందుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయన ఖమ్మం జిల్లా మొత్తం కాంగ్రెస్ స్వీప్ ఖాయమనీ, ఆ బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు మరో నెల రోజులలో జరగనున్న లోక్ సభ ఎన్నికలలో రాష్ట్రంలో వందకు వంద శాతం కాంగ్రెస్ గెలుచుకుంటుందన్న ధీమా ఇన్న సీటు ఏదైనా ఉందంటే అది ఖమ్మం లోక్ సభ నియోజకవర్గమే. ఆ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. జిల్లా నుంచి  రేవంత్ కేబినెట్ లో ముగ్గురు మంత్రులు ఉన్నారు. దీంతో ఖమ్మం లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద బండి నడకే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. దీంతో ఖమ్మం స్థానం సీటు విషయంలో కాంగ్రెస్ లో విపరీతమైన పోటీ ఏర్పడింది.   ప్రస్తుతం ఖమ్మం ఎంపీ టికెట్ రేసు కాంగ్రెస్ లో  తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అయితే అధిష్ఠానం కూడా ఖమ్మం టికెట్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నది. పోటీలో ఉన్న సీనియర్ నేతలను ఒక్కరొక్కరినే ఫిల్టర్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ప్రధానంగా ఈ టికెట్ కోసం పోటీ పడుతున్న వారిలో  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేర్లు మాత్రమే మిగిలాయి. రాష్ట్ర కాంగ్రెస్ లో ఇద్దరూ కీలక నేతలే. ఈ నేపథ్యంలోనే ఖమ్మం సీటు విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇప్పటి వరకూ ఏ నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. అయితే విశ్వసనీయంగా అందుతున్నే సమాచారం మేరకు మల్లు నందిని, పొంగులేటి ప్రసాద్ రెడ్డిలలో హైకమాండ్ పొంగులేటి ప్రసాద్ రెడ్డి వైపే మొగ్గు చూపుతోంది.   కాంగ్రెస్ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలలో పొంగులేటి ప్రసాద్ రెడ్డికే ఎక్కువ మద్దతు ఉందని తేలడం ఇందుకు ఒక కారణంగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక అన్నిటి కంటే ప్రధాన కారణం ఏమిటంటే.. అసెంబ్లీ ఎన్నికలలో జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ముందుగానే ప్రకటించి ఆ బాధ్యత తీసుకున్న పొంగులేటికి క్రెడిట్ ఇవ్వడం సమంజసమని కాంగ్రెస్ హైకమాండ్ భావించడమేనని చెబుతున్నారు.  కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం ఖమ్మం టికెట్ మంత్రి పొగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఖరారైపోయిందనీ, ఇహనో, ఇప్పుడో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 
Publish Date: Apr 16, 2024 12:41PM

మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు కేసుకు, కేసీఆర్‌కు ఉన్న లింక్ యేంటి?

రెండేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకుని జూబ్లీ హిల్స్ పోలీసులు నిందితుడిగా చేర్చారు.  బెలూన్లు అమ్ముతూ రోడ్డు దాటుతున్న కాజోల్ చౌహాన్ అనే మహిళను కారు డీకొట్టింది. ఈ ప్రమాదంలో కాజోల్ రెండు నెలల కొడుకు రన్వీర్ మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. మార్చి 17 2022 లో రోడ్ నెంబర్ 45లో ప్రమాదం చోటుచేసుకుంది.   ఆ కారు ప్రమాదంలో డ్రైవ్ చేసిన వ్యక్తిని కాకుండా మరొకరిపై జూబ్లీహిల్స్ పోలీసులు ఛార్జ్ షీట్ వేయడంతో ఈ వార్త అప్పట్లో సంచలనంగా మారింది. కారుపై MLA షకీల్ పేరుతో స్టిక్కర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అది తన కారు కాదని MLA స్టిక్కర్ ను తన స్నేహితుడికి ఇచ్చినట్లు అప్పట్టి ఎమ్మెల్యే షకీల్ వాదించాడు.  పోలీసులు షకీల్ కుమారుడి పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  ప్రమాద సమయంలో కారులో ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహైల్, స్నేహితులు ఆఫ్నాన్, మాజ్ ఉన్నట్లు నిర్ధారించారు. సీసీ ఫుటేజ్ కోసం చూడగా లభ్యం కాని పరిస్థితి. కారు ఎవరు నడిపారు అన్నదానిపై గతంలో స్పష్టత లభించలేదు. అయితే కారు తానే నడిపాను అంటూ ఆఫ్నాన్ అనే యువకుడు పోలీసులకు లొంగిపోయాడు. అకస్మాత్తుగా కాజోల్ రోడ్డు మీదకు రావడంతో కారు ఢీకొట్టిందని, భయంతో కారులో ఉన్న ముగ్గురం పారిపోయినట్లు ఆఫ్నాన్ వాంగ్మూలం ఇచ్చాడు.   దాంతో కేసులో ఆఫ్నాన్‌ను నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఛార్జ్‌షీట్‌ను కూడా జూబ్లీహిల్స్ పోలీసులు దాఖలు చేశారు.  అయితే తాజాగా షకీల్ కొడుకు పాత్రపై అనుమానంతో మరోసారి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు కాజోల్ వాంగ్మూలంతో పాటు లొంగిపోయిన ఆఫ్నాన్ వాంగ్మూలాన్ని పోలీసులు సేకరించారు. కారు నడిపింది షకీల్ కొడుకు సోహైల్ అంటూ వారు చెప్పడంతో 304 పార్ట్ 2గా సెక్షన్లు మార్చారు. ఈ క్రమంలో కేసును మరోసారి జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. మరో సారి ఈ కేసుపై దృష్టి పెట్టిన పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు.  పోలీసులు మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ గ‌త చ‌రిత్ర‌ను కూడా త‌వ్వితీస్తున్నారు. అప్పట్లో మహ్మద్‌ షకీల్‌ ఆమీర్‌ అలియాస్‌ బోధన్‌ షకీల్‌ మోస్ట్‌ వాంటెడ్ గా ఉండి పోలీసుల‌కు ప‌రుగులు పెట్టించాడ‌ట‌.   మీకు గుర్తుందా? అప్ప‌ట్లో మనుషుల అక్రమ రవాణాలో భాగమైన నకిలీ పాస్‌పోర్ట్స్‌ స్కామ్‌ 2007లో వెలుగులోకి వచ్చింది. అమెరికా సహా కొన్ని దేశాల్లో గుజరాతీయులకు ఎంట్రీ ఉండేది కాదు. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన వాళ్ళను అక్రమంగా దేశం దాటించడానికి దేశ వ్యాప్తంగా ముఠాలు ఏర్పడ్డాయి. వీరు కొందరు ప్రజాప్రతినిధులతో ఒప్పందాలు చేసుకుని గుజరాతీయులను వాళ్ళ కుటుంబీకులుగా మార్చారు. ఆయా ప్రతినిధుల సిఫారసుల ఆధారంగా మారు పేర్లతో గుజరాతీయులకు పాస్‌పోర్టులు అందించారు. సుదీర్ఘకాలం జరిగిన ఈ స్కామ్‌లో ఢిల్లీలో ఎంపీ బాబూ భాయ్‌ కటారా అరెస్టుతో వెలుగులోకి వచ్చింది. స‌మైక్య రాష్ట్రంలో వున్న ఎంపీలు కూడా ఈ స్కామ్‌లో వున్నార‌నే ఆరోప‌ణ‌లు అప్ప‌ట్లో వ‌చ్చాయి. అయితే హైద‌రాబాద్ నగరంలో నమోదైన కేసులో బోధన్‌ షకీల్‌ నిందితుడు. అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో షకీల్‌ కోసం హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) పోలీసులు ముమ్మరంగా గాలించి పట్టుకున్నారు. బోధ‌న్ ష‌కీల్‌కు కేసీఆర్‌తో చాలా మంచి సంబంధాలుండేవి.  ఆ త‌రువాత ఆయ‌న్ని అప్ప‌ట్టి టీ ఆర్ ఎస్ అధ్య‌క్షుడు కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అప్పుడు ష‌కీల్‌, ఇప్పుడు అత‌ని కొడుకు సాహిల్ ఇద్ద‌ర్ని కేసీఆర్ కాపాడుకున్నా కాజోల్ చౌహాన్ కేసు ఇప్ప‌ట్టికీ ష‌కీల్‌ను వెంటాడుతూనే వుంది.  రేవంత్‌రెడ్డి సి.ఎం.గా అయినా త‌రువాత ఏ విష‌యాన్ని వ‌ద‌ల‌డం లేదు. చాలా లోతైన ప‌రిశోధ‌న చేయిస్తున్నారు. ష‌కీల్ గ‌త చ‌రిత్ర‌, కేసీఆర్‌తో క‌లిసి ఆయ‌న చేసిన వ్యాపారాలు, విదేశాల‌కు మ‌నుషుల్ని పంపిన ముఠాలో రాజ‌కీయ నాయ‌కుల పాత్ర త‌దిత‌ర అంశాల‌పై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ కేసులోనూ సి.ఎం. రేవంత్ టార్గెట్ కేసీఆర్ యేన‌ని గాంధీభ‌వ‌న్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
Publish Date: Apr 16, 2024 12:34PM

రాజకీయంగా చిరు యాక్టివ్.. జగన్ తీరే కారణమా?

చిరంజీవి మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారా? ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత కొంత ఇన్ యాక్టివ్ గా కనిపించిన ఆయన రాష్ట్ర విభజన తరువాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చారు. మధ్యమధ్యలో ఏదో సినిమా డైలాగుల్లో మాత్రమే ఆయన రాజకీయంపై వ్యాఖ్యలు చేశారు తప్ప క్రియాశీలంగా పొలిటికల్ యాక్టివిటీలో పాల్గొన్నది లేదు. పలు సందర్భాలలో ఆయన తాను రాజకీయంగా తటస్థంగా ఉంటానని స్వయంగా చెప్పారు కూడా.  అందుకు అనుగుణంగానే తన సోదరుడు పవన్ కల్యాణ్ 2014లో జనసేన పార్టీ స్థాపించిన సమయంలో కానీ,   2019 ఎన్నికలలో  జనసేన పోటీ చేసిన సమయంలో కానీ ఎన్నడూ పవన్ కల్యాణ్ కుమద్దతుగా మాట్లాడింది లేదు. ఆయన పార్టీ కోసం ప్రచారం చేసిందీ లేదు.  అయితే ఆశ్చర్యకరంగా ఇటీవల ఆయన రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. అలాగే అనకాపల్లి నియోజకవర్గం నుంచి కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ తరఫున లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు మద్దతు పలికారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.  అయితే చిరంజీవి ఇప్పుడు రాజకీయంగా వార్తలలో నిలవడానికి, ఆసక్తిని దాచుకోకుండా బహిర్గతం చేయడానికి ఏపీ సీఎం జగనే కారణమా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చిరంజీవి సన్నిహితులు అలాగే పరిశీలకులు సైతం ఏపీలోని జగన్ సర్కార్ కారణంగా తెలుగుసినీ పరిశ్రమ ఇబ్బందుల్లో పడటమే కాకుండా స్వయంగా చిరంజీవి స్థాయిని తగ్గించేలా సీఎం వ్యవహరించిన తీరే చిరు మళ్లీ రాజకీయంగా యాక్టివ్ కావడానికి కారణమని అంటున్నారు.   చిరంజీవి నేతృత్వంలో పరిశ్రమకు చెందిన ప్రముఖులు జగన్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసిన నాటి ఘటనను గుర్తు చేస్తూ ఇప్పుడు చిరంజీవి పొలిటికల్ యాక్టవిటీకి లింకు పెట్టి విశ్లేషణలు చేస్తున్నారు.  అప్పట్లో జగన్ క్యాంపు కార్యాలయానికి కొద్ది దూరంలోనే తన  కారును నిలిపివేసి నడిపించడం, ఆ తర్వాత సమావేశంలో కూడా జ  జోడించిన సమయంలో జగన్ ప్రత్యభివాదం చేయకపోవడం గుర్తు చేస్తూ.. ఆ అవమానాన్ని ఇంత వరకూ పంటి బిగువున భరించిన చిరంజీవి ఇప్పుడు మరో సారి జగన్ అధికారంలోకి రాకూడదన్న బలమైన ఆకాంక్షతోనే   చిరు రాజకీయ కార్యకలాపాల ద్వారా తన మద్దతు ఎవరికో సంకేతాలు ఇస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: Apr 16, 2024 11:52AM

వైసీపీ బరితెగించేసింది.. తెలుగుదేశం కూటమి అప్రమత్తంగా ఉండాల్సిందే!

ఓటమి కళ్ల ముందు కనిపిస్తుంటే.. ఏం చేసైనా గెలుపు సొంతం చేసుకోవడమే లక్ష్యం అంటూ వైసీపీ బరితెగించేసింది.   తన అస్తిత్వం, ఉనికి ప్రమాదంలో పడిందని భావించినప్పుడు సామాన్యులు కూ ఎంతో కొంత తెగిస్తాడు. అయితే  పరిమితులు, హద్దులు చెరిపేసి మరీ చేసే అరాచక విన్యాసాన్ని బరితెగింపు అంటాం. ఇప్పుడు గెలుపు తలుపులు అన్నీ మూసుకు పోయాయి అని అర్ధమైన తరువాత వైసీపీ అధినేత జగన్, ఆయన కోటరీ బరితెగించేశారు.   ఏదో సినిమాలో ఓ డైలాగు ఉంటుంది. పది మంది మంచి కోసం చావడానికైనా చంపడానికైనా రెడీ అని.. ఇప్పుడు వైసీపీ మంచి కోసం కాదు, తన ఉనికి కోసం అలాంటి బరితెగింపును ఆశ్రయించింది. దానినే ప్రదర్శిస్తున్నది.   ధర్మాధర్మాలూ నీతినియమొలూ ఉచితానుచితాలూ పెద్దాచిన్నా స్వపరభేదాలూ సమయాసమయాలూ ఏమీ లెక్కచేయడం లేదు. రాష్ట్రం, జనం ఏమైపోయినా, ఏమనుకున్న ఫరవాలేదు.. గెలస్తే చాలు అన్నట్లుగా బరితెగించి వ్యవహరిస్తున్నది.   జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రవేశం, ఆ తరువాత సొంత పార్టీ ఏర్పాటు, అధికారపగ్గాలు అందుకోవడం ఇలా అన్ని విషయాలలోనూ బరితెగింపునే ఆశ్రయించారని చెప్పాలి.    తన తండ్రి హఠాన్మరణం తరువాత ఆయన కుమారుడిగా ముఖ్యమంత్రి పీఠం సహజంగా తనదే అవుతుందని భావించారు. దానిని అందుకోవడానికి బరితెగించి ఆయన పార్ధివదేహం  పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ ఆరంభిచారు. సానుభూతి పవనాల పల్లకీ మరొకరు ఎక్కకుండా ముందే విజ్ఞులు ఛీ అంటారని కూడా లెక్కచేయకుండా ముందుకు దూకి పార్టీ అధిష్టానంపై ఒత్తిడికి ప్రయత్నించారు. అయితే అధిష్ఠానం ఆ ఒత్తిడికి తలొగ్గకపోవడంతో కాంగ్రెస్ ను వీడి సొంత కుంపటి వైసీపీని ఆరంభించేశారు.   అదీ ఒక విధంగా బరితెగింపే.  సరే  ఆ క్షణం నుంచి ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి   అడుగులు వేశారు.  తండ్రి కాలధర్మం చెందిన తరువాత ఓదార్పుయాత్ర పేరుతో ఆయన చేసిన విచిత్రం కూడా బరితెగింపే.   రాజశేఖర రెడ్డి గారి ళమరణాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో వేలాదిమంది లక్షలాది మంది మరణించారు అని ప్రచారం చేసి వాళ్ళందరినీ ఓదార్చడం కోసం సుదీర్ఘయాత్ర చేసారు.  మహాత్మాగాంధీ హత్యానంతరం కూడా దేశంలో వేలాది గుండెలు ఆగిపోలేదు. కాని రాజశేఖర రెడ్డి   మరణం వలన వేలాది గుండెలు ఆగాయంటూ, సహజ మరణాలను కూడా  ఆ జాబితాలో వేసుకోవడానికి  జగన్ ఇసుమంతైనా వెనుకాడలేదు.  తండ్రి మరణం తరువాత రాష్ట్ర విభజన జరగడం, ఆ తరువాత ఎన్నికలలో జగన్ రెడ్డికి ఓదార్పు యాత్ర ఫలం దక్కలేదు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం విజయం సాధించి విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు పగ్గాలు అందుకున్నారు. ఆ తరువాత నుంచే జగన్  తనదైన మార్క్  రాజకీయాలకు తెరలేపారు. ప్రజల ఎమోషన్స్ రెచ్చగొట్టడం, వారి సానుభూతి కోసం ఏం చేయడానికైనా వెనుకాడకపోవడం కనిపించింది.  గత ఎన్నికల ముందు కోడి కత్తి దాడి, సొంత బాబాయ్ వివేకా హత్య సంఘటనలను తనకు అనుకూలంగా మలచుకుని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. అధికారపగ్గాలు అయితే అందుకున్నారు కానీ జగన్ అనుభవరాహిత్యం, అవగాహన లోపంతో ఆయన పాలన అంతా అస్తవ్యస్తంగా మారింది.  ఆయన సర్కార్ జారీ చేసిన దాదాపు ప్రతి జీవోనూ కోర్టులు తప్పుపట్టాయి. ప్రతి నిర్ణయాన్నీ తప్పుపట్టాయి. ఇలా న్యాయస్థానాలలో ఇన్ని మొట్టికాయలు తిన్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో మరొకటి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. జగన్ పాలన అంతా   ప్రతిపక్షాలను సాధించడం, ఆ ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం, ప్రతి ప్రాజెక్టునూ నిర్వీర్యం చేయడంతోనే సరిపోయింది. ప్రజల ఆంకాంక్షల గురించిన పట్టింపు లేదు. మళ్లీ ఎన్నికలు వచ్చేశాయి. ఇప్పుడు మళ్లీ గెలవడం తప్ప మరో లక్ష్యం లేదు జగన్ కు.  తన పాలన చూసి ఎవరూ ఓటు వేయరన్న విషయాన్ని ముందే గ్రహించిన జగన్ జనాలను బెదరించి ఓట్లు వేయించే లక్ష్యంతో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. ప్రజల డేటా మొత్తం వారి గుప్పెట్లో పెట్టి బెదరించో, బెల్లించో ఓట్లు దండుకునేందుకు వ్యూహం పన్నారు. ప్రజాప్రతినిథ్య వ్యవస్థలో అసలు చోటే లేని వ్యవస్థ ను తీసుకువచ్చి పార్టీ కార్యకర్తలకు వాలంటీర్లని పేరుపెట్టి ప్రభుత్వం గౌరవ వేతనాలు ప్రజాధనం నుండి ఎలా చెల్లిస్తారు? వాళ్ళు ఎన్నకైన ప్రజాప్రతినిధులనూ లెక్కచేయనంత పెత్తనం ఎలా చెలాయిస్తారు. ఇదంతా బరి తెగింపే కదా? ఈవాలంటీర్లసైన్యం వెనుక ఉన్ఞ లక్ష్యం ప్రభుత్వ వ్యవస్థలనూ ప్రతిపక్షాలనూ ఫ్రజలనూ భయోత్పాతానికీ అభద్రతకూ గురిచేయటం. తన అధికారాన్ని తిరుగులేకుండా చేసుకోవడానికే.    అయితే జగన్ బరితెగింపునకు ఎన్నికల సంఘం స్పీడ్ బ్రేకర్ గా నిలిచింది. జగన్ ఎన్నో ఆశలు పెట్టుకుని ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ల వ్యవస్థను ఎన్నికల సంఘం ఎన్నికల విధులకు దూరం చేసింది. దీంతో ఇక జగన్ ఎన్నికలలో విజయం కోసం ఇంకెంత బరితెగిస్తారో అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.  వచ్చే ఎన్నికలలో జనం స్వేచ్ఛగా, నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితులు లేకుండా చేసే అవకాశాలున్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఇప్పటికే ఓట్ల జాబితాలో ప్రతిపక్షానికి చెందిన వారి ఓట్లు వేల సంఖ్యలో మాయ మయ్యాయని, అలాగే పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు నమోదయ్యాయనీ అంటున్నారు. జగన్ తన కోసం తన చేత తానే ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ల వ్యవస్థ ద్వారానే ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారన్న విమర్శలు ఉన్నాయి. సరే ఓటర్ల జాబితాల సవరణలు, అవకతవకలకు పాల్పడిన, అందుకు దోహదపడిన అధికారులపై చర్యలు అంటూ ఏదో ఓ తంతు జరిగినా ఇప్పటికీ ఓటర్ల జాబితాలో అవకతవకలను పూర్తిగా సరిదిద్దలేదన్నదే పరిశీలకుల విశ్లేషణ. ఇంత ఆలస్యంగా వలంటీర్లను ఎన్నికల విధులకు దూరం చేయడం దొంగలు ఇంట్లో పడ్డాకా తలుపులు మూసిన తంతులా ఉందని అంటున్నారు. అసలు జగన్ వై నాట్ 175 అనడంలోనే బరితెగింపు  ఉందని పరిశీలకులు అంటున్నారు. నోరెత్తే మనిషి లేకుండా చేసి, వ్యతిరేకించే వారి గొంతు నొక్కేసి , జనాల స్వేచ్ఛను హరించేసి, తన పార్టీకి ఓటు వేసే వాళ్లు మాత్రమే పోలింగ్ బూత్ వద్దకు చేరేందుకు వీలుగా శాంతి భద్రతల పరిస్థితిని నియంత్రించేందుకు కూడా జగన్ వెనుకాడరని పరిశీలకులు విశ్లేషిన్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన ఇన్ని రోజుల తరువాత కూడా రాష్ట్రంలో విపక్షాలపై దాడులు యథేచ్ఛగా జరుగుతుండటం ఇందుకు ఉదాహరణలుగా పరిశీలకులు చూపుతున్నారు. ఇటువంటి తరుణంలో  సర్వేల ఫలితాలు, తమ సభలకు వస్తున్న జన స్పందన చూసి విజయంపై ధీమాతో ప్రమత్తంగా ఉండకుండా తెలుగుదేశం కూటమి అప్రమత్తంగా వ్యవహరించకుంటే భారీ మూల్యం చెల్లించుకోవలసిన ప్రమాదం ఏర్పడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: Apr 16, 2024 11:04AM

టాలీవుడ్ సైలెన్స్.. కారణమేంటో తెలుసా?

తెలుగు సినీ పరిశ్రమకు అందిరకీ తెలిసిన కారణాలతోనే ఏపీలోని జగన్ సర్కార్ పట్ల ఒకింత అయిష్టత ఉంది. సినీమాల విడుదల, సినీమా టికెట్ల ధరల విషయంలో జగన్ సర్కార్ ఒకింత దుర్మార్గంగా వ్యవహరించిందన్న విషయంలో సినీ పరిశ్రమ జగన్ సర్కార్ విషయంలో కినుకతో ఉందనడంలో సందేహం లేదు. అయితే సినీ పరిశ్రమలో దిగ్గజాలనదగ్గ ఎవరూ కూడా బాహాటంగా జగన్ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా పన్నెత్తు మాట అనలేదు. పైపెచ్చు అలీ, పోసాని వంటి కమేడియన్ల మధ్యవర్తిత్వంతో టికెట్ల విషయంలో జగన్ తో బార్గెయినింగ్ కు ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యారు. ఆ సందర్భంగా తెలుగుసినీ హీరోలకు ఒకింత అవమానం జరిగిందని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయాలను పరిశ్రమకు చెందిన ఎవరూ కూడా బాహాటంగా విమర్శించింది లేదు.  అలాగే స్కిల్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసినప్పుడు కూడా సినీ పరిశ్రమకు చెందిన ఒకరిద్దరు మినహా ఎవరూ స్పందించిన దాఖలాలు లేవు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వంటి వారు తప్ప చంద్రబాబు అరెస్టుపై స్పందించలేదు.  సరే అదలా ఉంచితే.. ఇటీవల మనమంతా సిద్ధం పేరుతో జగన్ చేపట్టిన ఎన్నికల ప్రచార బస్సు యాత్రలో ఏపీ సీఎంపై గులకరాయి దాడి జరిగింది. ఈ దాడిలో జగన్ స్వల్పంగా గాయపడ్డారు. దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  అయితే టాలీవుడ్ సెలబ్రిటీలు,  సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చాలా యాక్టివ్‌గా ఉండే తెలుగు హీరోలు, దర్శకులు ఎవరూ కూడా ఈ ఘటనపై  స్పందించలేదు. ఖండించలేదు. పూర్తిగా సైలెంట్ అయిపోయారు. రాష్ట్రంలో  ఎన్నికలకు కేవలం నాలుగు వారాల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి (అఫ్ కోర్స్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రే అనుకోండి)పై దాడి జరిగితే సినీ పరిశ్రమ నుంచి ఎవరూ స్పందించకపోవడం ఆశ్చర్యం. అయితే  వైఎస్ జగన్ వ్యవహరించిన విధంగా తెలుగు ఇండస్ట్రీ పట్ల ఇంత కక్ష పూరితంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి ఎవరూ ఇంత వరకూ లేరనీ, అందుకే జగన్ కు సంబంధించిన మంచి, చెడ్డల విషయంలో పరిశ్రమ మౌనంగానే ఉంటున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   కొత్త సినిమా రిలీజ్ సందర్భంగా  టిక్కెట్ల ధరల పెంపు కోసం, బెనిఫిట్ షోల కోసం పరిశ్రమలో దిగ్గజ హీరోలు తన దగ్గరకు వచ్చి వేడుకునేలా చేసుకున్న జగన్ పట్ల ఇండస్ట్రీ లో ఓ విధమైన వ్యతిరేక భావన ఉందని అంటున్నారు. అయినా ఎన్నికల ముందు జరిగిన ఈ సంఘటనను ఖండిస్తూనో, మరోలాగానో స్పందించడం కంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ వేచి చూడడమే బెటర్ అన్నట్లుగా ఇండ తెలుగు సినీ పరిశ్రమ వ్యవహరిస్తోందని విశ్లేషిస్తున్నారు.  జగన్ పై దాడికి ఖండిచి ఆయనకు అనవసర మైలేజీ ఇవ్వడమెందుకన్నట్లుగా మౌనంగా ఉండిపోయారంటున్నారు. జగన్ పార్టీలో ఉన్న అలీ కూడా స్పందించిన దాఖలాలు లేవు. పార్టీ టికెట్ కోసం గత ఐదేళ్లుగా కళ్లు కాయలు కాచేలా వేచి చూసిన అలీకి చివరకు జగన్ రిక్తహస్తమే చూపడంతో ఆయన పార్టీ వ్యవహారాలకు ఇటీవల కాలంలో దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. మొత్తం మీద టాలీవుడ్ ప్రముఖులు, హీరోలు జగన్ విషయంలో స్పందించకపోవడం  వారు జగన్ పట్ల సానుకూలంగా లేరన్న సంకేతాలను పంపినట్లేనని అంటున్నారు.  
Publish Date: Apr 16, 2024 10:40AM

న్యూస్ ఎక్స్ సర్వే సైతం అదే చెప్పింది.. చంద్రబాబే సీఎం!

ఏ నోట విన్నా ఒకటే మాట.. ఏ సర్వే చూసినా ఒకటే ఫలితం. ఏపీలో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే. తాజాగా మరో జాతీయ సంస్థ నిర్వహించిన సర్వే కూడా అదే ఫలితాన్ని వెలువరించింది. ఏపీలో తెలుగుదేశం కూటమి విజయం ఖాయమని పేర్కొంది. వైసీపీ భారీగా నష్టపోతున్నదని తేల్చేసింది.  రాష్ట్రంలోని పాతిక లోక్ సభ స్థానాలలో వైసీపీ కేవలం ఎనిమిది స్థానాలలో మాత్రమే విజయం సాధించే అవకాశాలున్నాయని కుండబద్దలు కొట్టింది.అదే విధంగా తెలుగుదేశం కూటమి 18 స్థానాలలో విజయకేతనం ఎగురవేయనున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్రంలో వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది.   ఏపీలో ఈ సారి జరగనున్న ఎన్నికలు అత్యంత కీలకమైనవనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా ఏపీ ఎన్నికలపై ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఇటువంటి తరుణంలో తాజాగా న్యూస్ ఎక్స్ నిర్వహించిన సర్వే ఫలితం కూడా రాష్ట్రంలో అధికారం చేపట్టబోయేది తెలుగుదేశం కూటమేనని నిర్ద్వంద్వంగా పేర్కొంది.  ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధిస్తుందని వెల్లడించింది. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 18 లోక్ సభ స్థానాలలో విజయకేతనం ఎగురవేస్తుందని అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం పాతిక లోక్ సభ స్థానాలలో  తెలుగుదేశం పార్టీ 17 స్థానాలలో పోటీ చేస్తున్నది.  కూటమిభాగస్వామ్య పార్టీలైన జనసేన, బీజేపీ వరుసగా రెండు, ఆరు స్థానాలలో పోటీ చేయనున్నాయి.  ఇక న్యూస్ ఎక్స్ సర్వే ఫలితం మేరకు తెలుగుదేశం పోటీ చేస్తున్న 17 లోక్ సభ స్థానాలలో 14 స్థానాలలో విజయం సాధిస్తుంది. బీజేపీ పోటీ చేస్తున్న 6 స్థానాలలో రెండింటిలో విజయకేతనం ఎగుర వేస్తుంది. ఇక జనసేన అయితే పోటీ చేస్తున్న రెండు స్థానాలలోనూ గెలపు తథ్యం.  అంటే తెలుగుదేశం కూటమి 18 స్థానాలలో విజయం సాధిస్తుంది. అధికార వైసీపీ కేవలం ఏడు స్థానాలలో మాత్రమే గెలుపొందే అవకాశాలున్నాయి.  దాదాపుగా ఇవే ఫలితాలు అసెంబ్లీ నియోజకవర్గాలలోనే ప్రతిఫలించనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం కూటమి 126 స్థానాలలో విజయం సాధిస్తుంది. అధికార వైసీపీ 49 స్థానాలతో సరిపెట్టుకుంటుంది. అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, చంద్రబాబు సీఎంగా పదవీ పగ్గాలు చేపట్టడం ఖాయమని సర్వే తేల్చింది.  తెలుగుదేశం 144 అసెంబ్లీ నియోజకవర్గాలలో, జనసేన 21, బీజేపీ పది స్థానాలలో అభ్యర్థులను నిలుపుతోంది. లోక్ సభ నియోజకవర్గాల ఫలితాలను బట్టి చూస్తే తెలుగుదేశం కనీసం 98 స్థానాలలో విజయం సాధిస్తుంది.  అయితే పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో వైసీపీ గ్రాఫ్ మరింతగా పడిపోయే అవకాశాలున్నాయనీ, ఎన్నికల సమయానికి తెలుగుదేశం కూటమి సాధించే స్థానాల సంఖ్య పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ రాష్ట్రంలో పుంజుకోవడం వైసీపీకి భారీ నష్టం చేకూర్చే అవకాశాలున్నాయని అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ మేరకు పుంజుకుంటే ఆ మేరకు వైసీపీ మరింతగా నష్టపోవడం ఖాయమని చెబుతున్నారు.  
Publish Date: Apr 16, 2024 10:03AM

‘జై తెలంగాణ’ను దురుపయోగం చేస్తున్న కవిత!

కొన్నికొన్ని సందర్భాలను చూస్తే దేశంలో ఇంకా న్యాయం బతికే వుందన్న నమ్మకం కలుగుతూ వుంటుంది. లిక్కర్ కేసులో పూర్తిగా మునిగిపోయిన కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో జపం చేసుకుంటున్నారు. అయితే ఆమెను కోర్టుకు విచారణకు తెచ్చిన ప్రతిసారీ టూమచ్ చేస్తున్నారు. కోర్టు ఆవరణలోనే మీడియాతో మాట్లాడటం, ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ.. కడిగిన ముత్యంలా, తోమిన ఇత్తడి చెంబులా బయటకి వస్తాను... లాంటి చిన్నపిల్ల చేష్టలు చేస్తూ వస్తున్నారు. ఇది చాలాకాలంగా గమనిస్తున్న వారికి చిరాకు కలిగిస్తున్న అంశం. అధికారం పోయినా, పాతాళానికి పడిపోయినా వీళ్ళ తీరు మారదా అన్న ఏహ్యభావం కలుగుతోంది. ఈరోజు కోర్టుకు హాజరైన కవిత తన పాత ధోరణిలోనే ‘ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ’ అనడాన్ని కోర్టు చాలా సీరియస్‌గా తీసుకుంది. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడ్డం, ఇష్టం వచ్చిన స్టేట్‌మెంట్లు ఇవ్వడం మీద హెచ్చరించింది. కోర్టు హెచ్చరించిన నేపథ్యంలో కవిత ఇకముందు అలాంటి వ్యాఖ్యలు చేయడం, మీడియాతో మాట్లాడ్డం చేయకపోవచ్చు.  ఒక విషయంలో కోర్టు పుణ్యమా అని కవిత కంట్రోల్లోకి వచ్చేశారు. అయితే కవితను మరో విషయంలో కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం వుంది. అది మాటమాటకీ ‘జై తెలంగాణ’ అని నినాదాలు చేయడం.  ‘జై తెలంగాణ’ అనే పదం చాలా పవిత్రమైన పదం. తెలంగాణ ఉద్యమ సమయంలో కోట్ల గొంతుకలు నినదించిన పదం. ఆ పదాన్ని అదేదో తమ కుటుంబం ఆస్తిలాగా కవిత వినియోగిస్తున్నారు. లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్న కవిత ‘జై తెలంగాణ’ పదాన్ని వినియోగించడం ఎంతమాత్రం బాగాలేదు.  తమ సొంత సమస్యని మొత్తం తెలంగాణకు ఆపాదించడానికి కవిత ఈ పదాన్ని మాటమాటకీ ఉపయోగిస్తున్నారన్నది స్పష్టం. ‘జై తెలంగాణ’ పదం తెలంగాణలోని ప్రతి ఒక్కరిది. లిక్కర్ స్కామ్ మాత్రం కేవలం కల్వకుంట కవితది. కవిత ఈ పదాన్ని ఉపయోగించకుండా చేసేదెవరో! కవిత నోరు మూత పడేదెన్నడో!  
Publish Date: Apr 15, 2024 7:28PM

కసబ్‌తో పోల్చుకున్న కేటీఆర్

తాను చాలా మంచోణ్ణని ప్రూవ్ చేసుకోవడానికి మాజీ రాజకుమారుడు కేటీఆర్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వకపోగా, ఆయన అహంకార పూరిత లూజ్ టాక్ కారణంగా ఆయన ఇమేజ్‌ మరింత డ్యామేజ్ అవుతూ, కెరర్ మొత్తం గ్యారేజ్‌కి పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈమధ్య ఆయన ఒక ప్రముఖ టీవీ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఛానల్లో ఆయన మాట్లాడిన మాటల్లోంచి తవ్వేకొద్దీ అనేక ఆణిముత్యాలు దొరుకుతున్నాయి. మీమీద ఫోన్ ట్యాపింగ్ కేసులు చుట్టుముట్టే అవకాశం కనిపిస్తున్నాయి కదా.. ఇప్పుడెలా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ చాలా గొప్పగా సమాధానం చెప్పాననుకుని చాలా చెత్తగా సమాధానం చెప్పారు. ‘‘కేసులు ఏం చేస్తాయి.. ఇప్పుడు కసబ్‌ని చూడండి.. ఎంతోమందిని షూట్ చేసి చంపేశాడు. సాక్ష్యాధారాలు వున్నా పదేళ్ళు మన చట్టాలు ఏమీ చేయలేకపోయాయి. పదేళ్ళపాడు కసబ్‌ని జైల్లో పెట్టి బిర్యానీతో మేపాం’’ అంటూ, ఎంత నేరం చేసినా భారత న్యాయ వ్యవస్థగానీ, చట్టాలు గానీ ఏమీ చేయలేవన్నట్టు మాట్లాడారు. అంటే, కసబ్‌ని చూసిన ధైర్యంతోనే, ఏ తప్పు చేసినా అంత ఈజీగా తేలదన్న ఉద్దేశంతోనే కేసీఆర్ కుటుంబం నేరాలు చేసిందా? మేం నేరాలు చేసినా ఏం కాదు.. అవి తేలినప్పుడు సంగతి.. కసబ్ లాంటి నేరస్థుడికే ఏమీ కాలేదు.. మాకేం అవుతుందన్నట్టుగా కేటీఆర్ మాటతీరు వుంది. 
Publish Date: Apr 15, 2024 6:37PM

షర్మిలపై దుష్ప్రచారం.. ఇక విమలమ్మ వంతు?

కడపలో వైఎస్ కుటుంబ రాజకీయాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో దోషులు ఎవరు? ఆయన హత్య ఎందుకు జరిగింది? అన్న విషయంలో కోర్టులు ఇంకా నిర్దుష్టమైన తీర్పు వెలువరించలేదు. కేసు విచారణ జరుగుతోంది. సీబీఐ దర్యాప్తు కూడా సాగుతోంది. అయితే ఈ ఐదేళ్లలో వివేకా హత్య ఎవరు ఎందుకు చేశారు? చేయించారు? అన్న ప్రశ్నలకు ప్రజలకు మాత్రం స్పష్టమైన సమాధానం లభించేసింది.  అయితే జగన్ శిబిరం మాత్రం ఇంకా వివేకా హత్య విషయంలో అవినాష్ సుద్దపూసే అంటూ వస్తోంది. అక్కడితో ఆగకుండా వివేకా కుమార్తె సునీతపైనే ఆరోపణలు చేస్తున్నది. ఇప్పుడు సునీతకు మద్దతుగా షర్మిల కూడా అవినాష్ కు వివేహా హంతకుడిగా అభివర్ణిస్తూ హంతకుడికి మద్దతుగా నిలుస్తున్న జగన్ కు ఓటే వేయద్దని, నిజమైన వైఎస్ వారసురాలిగా తనను కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలిపించాలని కొంగు జాచి అభ్యర్థిస్తున్నారు. దీంతో జగన్ శిబిరంలో ఆందోళన  మొదలైంది. షర్మిలపైనా వైసీపీ సోషల్ మీడియాలో  ట్రోలింగ్ ఆరంభమైంది. అక్కడితో ఆగకుండా ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏకంగా షర్మిలను పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ విమర్శలు గుప్పించారు. జగన్ కు స్వయానా చెల్లెలు అయిన షర్మిలపై వైసీపీ విమర్శలు మర్యాద గడప దాటేస్తున్నాయి. ఆమె వ్యక్తిగత అంశాలను కూడా ప్రస్తావిస్తూ ప్రతిష్ట మసకబార్చడానికి కూడా వెనుకాడటం లేదు. అయితే వాటన్నిటికీ దీటుగా బదులిస్తూ జగన్ పై పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తూ షర్మిల ముందుకు సాగుతున్నారు.  అయితే షర్మిల కడపలో ప్రచారం ఆరంభించగానే త్రాసు ఆమె వైపు మెగ్గినట్లు స్పష్టంగా తెలిసిపోవడంతో జగన్ తన మేనత్త విమలమ్మను రంగంలోకి దింపారు. దీంతో ఇప్పుడు సొంత మేనత్తే షర్మిలపై దుష్ప్రచారానికి నడుంబిగించినట్లు అయ్యింది. దీంతో వైఎస్ కుటుంబ రాజకీయ పోరు కుటుంబంలోని మహిళల మధ్య మాటల యుద్ధానికి దారి తీసినట్లైంది  షర్మిల, సునీత ఒకవైపు.. జగన్, అవినాష్ రెడ్డి మరో వైపుగా గా ఉన్న కుటుంబ యుద్ధంలోకి   విమలమ్మ ఎంట్రీ ఇచ్చారు.  క్రైస్తవ మత ప్రచారానికే పరిమతమైన విమలమ్మ  జగన్ కు, అవినాష్ కు మద్దతుగా రాజకీయ ప్రచారానికి నడుంబిగించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, వివేకానందరెడ్డిల చెల్లెలైన విమలమ్మ వైఎస్ మరణం తరువాత కుటుంబంలో జగన్ పక్షాన నిలిచిన ఏకైక వ్యక్తిగా చెప్పుకోవచ్చు. షర్మిల చెబుతున్నట్లు విమలమ్మ కుమారుడికి సీఎం జగన్ వర్క్స్ ఇవ్వడం వల్లనే ఆమె ఆర్థికంగా స్థిరపడి ఆ కృతజ్ణతతో జగన్ పక్షాన నిలిచి ఉండొచ్చు కానీ ఇక్కడ విషయం అది కాదు..  సొంత అన్న వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ కు మద్దతుగా విమలమ్మ గళం విప్పడమే ఆమె ప్రతిష్టను కడప వాసులలో మసకబారేలా చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అక్కడితో ఆగకుండా మేనకోడళ్లు షర్మిల, సునీతలను ఆమె నోరు మూసుకోమంటూ గదమాయించేలా మాట్లాడడాన్ని కూడా వైఎస్ కుటుంబాన్ని అభిమానించే వారిలో ఆగ్రహానికి కారణమైందని అంటున్నారు.  అవినాష్ రెడ్డిని ఏమీ తెలియని చిన్న పిల్లాడిగా అభివర్ణిస్తూ ఆమె మీడియా సమావేశంలోఅవినాష్‌రెడ్డిని చిన్నపిల్లాడిగా అభివర్ణించిన విమలమ్మ  షర్మిల, సునీతలు వైఎస్ కుటుంబ ప్రతిష్టను రోడ్డుకీడ్చారు అనడాన్ని తప్పుపడుతున్నారు.   అలాగే షర్మిల, సునీతలు చంద్రబాబు చెప్పినట్లల్లా ఆడుతున్నారంటూ విమర్శించడాన్ని జీర్ణించు కోలేకపోతున్నారు. గత ఎన్నికల సమయంలో అన్న విజయం కోసం కాళ్లరిగేలా తిరిగిన షర్మిలకు అన్న జగన్ ఇచ్చిన మర్యాద, గౌరవం ఏమిటని నిలదీస్తున్నారు.  మేనత్త   వ్యాఖ్యలు,  హెచ్చరికలపై షర్మిల ఘాటు స్పందనను స్వాగతిస్తున్నారు.    ఇప్పుడు జగన్ విమలమ్మను షర్మిల సానుకూల ఓట్లను చీల్చేందుకు ప్రచారానికి ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు కడప రాజకీయ వర్గాల్లో ప్రచారం అవుతోంది.  షర్మిలకు వ్యతిరేకంగా విమలమ్మ ప్రచారానికి పెద్దగా స్పందన లభించే అవకాశం ఉందని పరిశీలకులు భావించడం లేదు.  
Publish Date: Apr 15, 2024 5:44PM

కేజ్రీవాల్ ను పరామర్శించిన  పంజాబ్ సిఎం 

తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ సిఎంను పంజాబ్ సిఎం  ఇవ్వాళ పరామర్శించారు.  ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో అరెస్ట‌యి తీహార్ జైలులో ఉన్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సోమ‌వారం పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్‌సింగ్‌ మాన్ క‌లిశారు. అనంతరం పంజాబ్ సీఎం మీడియాతో మాట్లాడుతూ.. "కరడుగట్టిన నేరగాళ్లకు కూడా అందుబాటులో ఉండే సౌకర్యాలు ఆయనకు అందకపోవడం బాధాకరం. ఆయ‌న తప్పు ఏమిటి? దేశంలోనే అతిపెద్ద టెర్రరిస్టుల్లో ఒకరిని పట్టుకున్నట్లుగా మీరు ఆయ‌న‌తో వ్యవహరిస్తున్న తీరు ఎంతో బాధ‌క‌రం. ప్రధాని మోదీకి ఏం కావాలి? పారదర్శకత రాజకీయాలకు శ్రీకారం చుట్టి, బీజేపీ దిక్కుమాలిన రాజకీయాలకు ముగింపు పలికిన కేజ్రీవాల్‌తో ఇలా వ్యవహరించ‌డంప‌ట్ల బాధ‌గా ఉంది. ఆయ‌న‌ను ఎలా ఉన్నారు అని నేను అడిగితే.. నా విష‌యం వ‌దిలేయ్‌, పంజాబ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పు అని అన్నారు. ఆప్ క్రమశిక్షణ కలిగిన పార్టీ, అందరం సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు అండగా ఉంటాం. జూన్ 4న వ‌చ్చే ఫలితాల త‌ర్వాత‌ ఆప్ పెద్ద రాజకీయ శక్తిగా ఎదుగుతుంది" అని భ‌గ‌వంత్ మాన్ చెప్పుకొచ్చారు.
Publish Date: Apr 15, 2024 5:32PM

జగన్ కు భధ్రత పెంపు 

ఎపిలో అధికారపార్టీ ప్రజల భద్రత కన్నా పాలకుల భద్రత మీద దృష్టి కేంద్రీకరించింది. . ఏపీ సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన నేపథ్యంలో ఆయనకు భద్రతను భారీగా పెంచారు. ప్రస్తుత భద్రతకు అదనంగా సెక్యూరిటీని పెంచారు. బస్సు యాత్ర మార్గాల్లో డీఎస్పీ స్థాయి అధికారులతో భద్రతను కల్పించనున్నారు. సీఎం ప్రయాణించే రోడ్డు మార్గాన్ని సెక్టార్లుగా విభజించారు. ఒక్కో సెక్టార్ లో ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలతో సెక్యూరిటీ కల్పించారు. ఇక నుంచి నిర్దేశించిన మార్గాల్లోనే సీఎం రోడ్ షోలు, సభలు ఉంటాయి. పువ్వులు విసరడం, గజమాలల విషయంలో ఆంక్షలు విధించారు. మరోవైపు జగన్ మేమంతా సిద్ధం యాత్ర గన్నవరం నియోజకవర్గం నుంచి గుడివాడ నియోజకవర్గంలోని ప్రవేశించింది. ఈ సాయంత్రం గుడివాడలో నిర్వహించే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. గాయం కారణంగా వైద్యుల సలహాతో జగన్ ఒక రోజు విశ్రాంతి తీసుకున్నారు. గాయం నుంచి జగన్ త్వరగా కోలుకోవాలని వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు.  
Publish Date: Apr 15, 2024 4:26PM