సచిన్ టెండూల్కర్‌ గుంటూరు జిల్లాలో వంద ఎకరాల భూమిని కొన్నట్టు మంగళగిరి పరిసరాల్లో ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఈ ప్రాంతంలో ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వర్గాలు భూముల ధరను పెంచడానికే ఈ ప్రచారం చేస్తున్నట్టుగా పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో అభివృద్ధి అవకాశాలు బాగా వున్నాయని తెలియడం వల్ల సచిన్ భూములు కొన్నాడని కొందరు అంటున్నారు. అయితే సచిన్ కొన్న భూములు ఎక్కడ వున్నాయి, సర్వే నంబర్ ఎంత, ఎప్పడు రిజిస్టర్ చేశారు, భూములు అమ్మినదెవరు అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పేవారెవరూ లేరు. మొత్తమ్మీద ఆ ప్రచారమంతా భూముల ధరలు పెంచడానికి రియల్ ఎస్టేట్ వర్గాలు వేసిన ఎత్తుగడ అని చాలామంది అంటున్నారు.
  అనంతపురం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. గుంతకల్లులోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం వుండే ఐదుగురు వ్యక్తులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం సృష్టించింది. రైల్వేలో పనిచేసే శ్రీనివాసులు తన కుమార్తె, అల్లుడితో కలసి హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం వుంటున్నారు. మంగళవారం ఉదయం శ్రీనివాసులు, ఆయన కుమారుడు క్రాంతికుమార్ ఇంట్లోంచి బయటకి వెళ్ళారు. ఆ సమయంలో శ్రీనివాసులు భార్య జయలక్ష్మి, కుమార్తె రాజేశ్వరి, అల్లుడు బాబు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు చిన్నారులు నవనీత్, యశశ్రీని గొంతు నులిమి హత్య చేసి, ఈ ముగ్గురూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో 28ఏళ్ళ తరువాత భారత్‌ జట్టు టెస్ట్ మ్యాచ్ గెలిచింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో స్టులో 95 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. భారత పేసర్‌ ఇషాంత్‌ శర్మఅత్యుత్తమ గణంకాలు నమోదు చేసి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత్‌ నిర్దేశించిన 319 పరుగుల లక్ష్య చేదనలో ఇంగ్లాండ్‌ ఇశాంత్‌ దెబ్బకు 223 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో రూట్‌(66), ఆలీ(39),కుక్‌(22),బ్యాలెన్స్‌ (27) పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఇశాంత్‌తోపాటు జడేజా, సామీ చెరో విటెక్‌ పడగొట్టారు.దీంతో 28 ఏళ్ల తరువాత లార్డ్‌‌సలో టెస్ట్‌ మ్యాచ్‌ ను గెలిచిన భారత జట్టుగా ధోనీ సేన చరిత్రను తిరగరాసింది.
  ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణ కేసు విచారణను వచ్చేనెల 4వ తేదీకి వాయిదా పడింది. ఆంధ్ర, తెలంగాణ విద్యార్థులకు సమస్యాత్మకంగా పరిణమించిన ఈ కేసును సుప్రీం కోర్టు ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం కౌన్సిలింగ్‌ను అక్టోబర్ నెలాఖరు వరకు వాయిదా వేయాలని భావిస్తోంది. దీన్ని కోరుకుంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ ముఖోపాధ్యాయ, జస్టిస్ బాబ్డేలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం విచారణ జరిపి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాదనను పరిశీలించిన తర్వాత ఈ కేసును ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసును తెలంగాణ తరఫున హరీష్ సాల్వే వాదించగా, ఆంధ్రప్రదేశ్ తరఫున గంగూలీ వాదనలు వినిపించారు. ఈ అంశపై ఆంధ్రప్రదేశ్ కౌంటర్ దాఖలు చేయాలని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది.
  ఆంధ్రప్రదేశ్‌లో రైతుల రుణమాఫీకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఒక్కో రైతు కుటుంబానికి లక్షన్నర రుణ మాఫీ చేయనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. రైతు రుణమాఫీ అంశంపై కోటయ్య కమిటీ నివేదిక తనకు అందిన సందర్భంగా చంద్రబాబు సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. రుణాన్ని తిరిగి చెల్లించిన వారికి, చెల్లించని వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని చంద్రబాబు వెల్లడించారు. రుణమాఫీలో అక్రమాలు జరగకుండా కోటయ్య కమిటీ కొన్ని సూచనలు చేసిందని చంద్రబాబు తెలిపారు. రైతు రుణ మాఫీ కోసం 37,900 కోట్లు అవసరమవుతాయని, ఎఫ్ఆర్‌బిఎం పథకం ద్వారా 25 వేల కోట్ల వరకు నిధులు సమకూర్చుకోవచ్చని చంద్రబాబు చెప్పారు.
  తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడానికి వ్యతిరేకంగా ఉద్యమించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జిని కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీలు మధుయాష్కీ, వివేక్‌, రాజయ్య, పొన్నం ప్రభాకర్ ఖండించారు. విద్యార్ధుల చేస్తున్నది న్యాయమైన పోరాటమని సమర్థించారు. ఇంటికో ఉద్యోగమన్న హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న నిజాన్ని టీఆర్ఎస్ నాయకులు మర్చిపోరాదని అన్నారు. తమకు ఉద్యోగాలు రావన్న విద్యార్ధుల ఆందోళనపై టీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
  హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదిలో గల్లంతైన విఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజీకి చెందిన విద్యార్థులందరి మృతదేహాలు లభ్యమయ్యాయి. సోమవారం నాడు కల్లూరి శ్రీహర్ష అనే విద్యార్థి మృతదేహం నదిలో లభ్యం కావడంతో ఈ ప్రమాదంలో చనిపోయిన విద్యార్థుల మృతదేహాలన్నీ లభించినట్టు అధికారులు ప్రకటించారు. కాగా ఆదివారం నాడు గాలింపు చర్యల సందర్భంగా రెండు మృతదేహాలు బయటపడ్డాయి. ఈ మృతదేహాలు కరీంనగర్ జిల్లా రేకుర్తి గ్రామానికి చెందిన దాసరి శ్రీనిధి, హైదరాబాద్‌లోని తార్నాకకు చెందిన రిషితారెడ్డివిగా అధికారులు గుర్తించారు. కాగా సోమవారం నాడు గాలింపుల సందర్భంగా కల్లూరి శ్రీహర్ష మ‌తదేహం కూడా లభించినట్టు సమాచారం అందింది. ప్రమాదం జరిగిన 42 రోజులకు మృతదేహాల అన్వేషణ పూర్తయింది.
  కాకినాడలోని గ్రీన్ ఫీల్డ్స్ అంధుల పాఠశాలకు కరస్పాండెంట్‌గా ఒక అంధుడైన కేవీ రావు వున్నాడు. సోమవారం నాడు సదరు కరెస్పాండెంట్ స్కూల్‌లో చదివే పిల్లలను అంధుడు కాని ప్రిన్సిపాల్ సహకారంతో బెత్తంతో దారుణంగా చావబాదాడు. తాను స్వయంగా అంధుడు అయినప్పటికీ అంధ బాలలను దారుణంగా కొట్టడం కెమెరా కంటికి దొరికిపోయింది. అల్లరి చేశారన్న నెపంతో ముగ్గురు అంధ బాలలను బెత్తంతో చావబాదాడు. తనకు కనిపించదు కాబట్టి పిల్లలను ప్రిన్సిపాల్ సహకారంతో బెత్తంతో ఒళ్ళు వాచిపోయేలా చావబాదాడు. ఈ అంశం మీద డీఈవో, మండల విద్యాశాఖాధికారి స్పందించారు. కరస్పాండెంటుపై అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెడతామని తెలిపారు. బాలల హక్కుల కమిషన్కు చెందిన అచ్యుతరావు కూడా ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించారు. పిల్లలను చావబాదిన కరెస్పాండెంట్, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది.
  సీపీఎం నాయకులు అధికారంలో వున్నవారికి ఉచిత సలహాలు ఇవ్వడంలో చాలా ముందుంటారు. సీపీఎం నాయకుడు రాఘవులు తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకి కొన్ని ఉచిత సలహాలు ఇచ్చారు.. కొన్ని విమర్శలు చేశారు. ఆ వివరాలు ఇవి...   1. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అలా కురిపించట్లేదేంటి?   2. వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్న తపన అటు చంద్రబాబుకు, ఇటు కేసీఆర్‌కి కనిపించడం లేదు. ఇద్దరూ వివాదాలు కొనసాగాలనే కోరుకుంటున్నారు.   3. రుణమాఫీ చేస్తానని చంద్రబాబు, కేసీఆర్ చెప్పింది ఓట్ల కోసమే తప్ప రైతులకు మేలు చేయాలని కాదు.   4. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఫీజు రీ ఎంబర్స్‌మెంట్, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కృష్ణాజలాల విడుదల వంటివి వివాదాలుగా మారాయి.   5. 1956 ముందు ఉన్న వారికే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందనడం సరికాదు.
  ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ని కోరారు. అసెంబ్లీని సాధ్యమైనంత త్వరలో రద్దు చేయాలని, లేకపోతే భారతీయ జనతాపార్టీ ఢిల్లీలో అధికారంలోకి రావడానికి ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు డబ్బు ఎరగా వేసే అవకాశం వుందని అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్‌తో భేటీ తర్వాత ఆ వివరాలను కేజ్రీవాల్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. తన విజ్ఞప్తికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి సరైన స్పందన లభించలేదని కూడా ఆయన ట్విట్ చేశారు. 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో గత ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ అండతో అధికారాన్ని చేపట్టినా, ఆ అధికారాన్ని నిలుపుకోలేక ప్రభుత్వాన్ని రద్దు చేసింది.
  పదకొండు మంది మంత్రివర్గ సహచరులతో కలసి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేసీఆర్‌తో కలసి ఆయన మంత్రివర్గంలో మొత్తం 12 మంది సభ్యులున్నారు. ఒక వారంలో తన మంత్రివర్గాన్ని విస్తరించడానికి కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి తెలంగాణ మంత్రివర్గం విస్తరణలో ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని, వారిలో ఒక మహిళ కూడా వుండే అవకాశం వుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా ఛాన్స్ పొందేదెవరన్న చర్చ తెలంగాణ రాజకీయవర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. ఆరుగురికే అవకాశం ఉన్నప్పటికీ మంత్రిపదవి ఆశిస్తున్న ఎమ్మెల్యేలందరూ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
  రైతుల రుణమాఫీ అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోటయ్య కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందజేసింది. బ్యాంకుల నుంచి కమిటీకి పూర్తి సమాచారం అందకపోయినప్పటికీ అందుబాటులో వున్న వివరాలతో కోటయ్య కమిటీ నివేదికను పూర్తి చేసి చంద్రబాబు నాయుడికి అందించింది. మంగళవారం నాడు కోటయ్య కమిటీ నివేదిక ప్రభుత్వానికి సమర్పించాల్సి వుంది. ఒకరోజు ముందే సోమవారం నాడు నివేదిక అందజేసింది. నివేదిక సమర్పించడానికి కమిటీ 45 రోజుల సమయాన్ని తీసుకుంది. రైతులు తీసుకున్న రుణాల విలువ రూ.72 వేల కోట్లు కాగా, ఇందులో వ్యవసాయ రుణాలు రూ.62వేల కోట్లు, డ్వాక్రా, చేనేత రుణాలు రూ.12వేల కోట్లు, బంగారంపై రుణాలు రూ.34వేల కోట్లు, పంటరుణాలు రూ. 26వేల కోట్లుగా కోటయ్య కమిటీ తెలిపింది. రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలను కమిటీ ఈ నివేదికలో పొందుపరిచింది. పంట రుణమైతే లక్షన్నర, బంగారం రుణమైతే 50 వేలు మాఫీ చేయాలని, రుణమాఫీ కోసం ఎర్రచందనం నిల్వల అమ్మమ్మకం, బాండ్లు జారీ చేయడం ద్వారా డబ్బు సమకూర్చుకోవాలని కమిటీ సూచించింది. కుటుంబానికి ఒక్క రుణాన్ని మాఫీ చేయాలని కోటయ్య కమిటీ సిఫారసు చేసినట్టు తెలుస్తోంది.
  హైదరాబాద్‌ నగరంలో ఆదివారం నాడు బోనాల ఉత్సవాలు అద్భుతంగా జరిగాయి. పాతబస్తీలోని సింహవాహిని దేవాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అలాగే ప్రభుత్వం తరఫున బంగారు బోనం అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా పలు దేవాలయాలలో అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. దేవాలయాల వల్ల జరిగిన ఊరేగింపులలో భాగంగా పోతరాజు నాట్య విన్యాసాలు, శివసత్తుల నాట్యం, యువత కేరింతలు, విచిత్ర వేషధారణలు భక్తులను ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఒకవైపు బోనాలు, మరోవైపు రంజాన్ ప్రార్థనలు.. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.
  2005-2006 మధ్యకాలంలో పలువురు చిన్నారుల మీద అత్యాచారం చేసి దారుణంగా చంపేసిన నిఠారీ హత్యల కేసులో దోషులుగా నిరూపణ అయిన ఐదుగురికి మరణశిక్ష ఖరారైంది. తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఈ ఐదుగురూ పిటిషన్ పెట్టుకున్నారు. అయితే ఈ పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు. దాంతో వీరికి ఉరి ఖాయమైంది. త్వరలో వీరిని ఉరి తీస్తారు. ఈ కేసులో కోలీతోపాటుగా మహారాష్టక్రు చెందిన అక్కాచెల్లెళ్లు రేణుకాబాయి, సీమా, అదే రాష్ట్రానికి చెందిన రాజేంద్ర ప్రహ్లాద్‌రావు వాస్నిఖ్, మధ్యప్రదేశ్‌కు చెందిన జగదీష్, అసోంకు చెందిన హోలీరామ్ బోర్డోలికి త్వరలో ఉరిశిక్ష అమలు చేయనున్నారు.

అంతర్వేది..ఓ అంతులేని కథ!

ప్రాపర్టీ రిజిస్టరుకు రెక్కలొచ్చాయట   రథ నిర్మాణంలో అగ్నికుల క్షత్రియులకు అన్యాయం   ఆలయ కమిటీలో కొప్పనాటి వంశీయులకు చోటేదీ?   చర్చిల పాలవుతున్న ఆలయ భూములు   టీడీపీ-వైసీపీ-బీజేపీ మూడుస్తంభాలాట   అంతులేని ‘అంతర్వేది’ రాజకీయాలు   ఓ జమిందారు గారు తన సొమ్ముతో ఆలయ నిర్మాణం చేసి, దాని బాగోగులకు వందల ఎకరాలు దానం చేశారనుకోండి. అప్పుడు ఆ ఆలయానికి ఆ జమిందారు.. ఆయన వారసులు వ్యవస్థాపకులవుతారు కదా? ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా అలాంటి వంశ పారంపర్య హక్కును కొనసాగిస్తూ, అన్ని దేవాలయాలకూ భూములిచ్చి, సొంత నిధులతో గుడి నిర్మించిన వారి వారసులనే వ్యవస్థాపక అధ్యక్షులు, ట్రస్టీలుగా గుర్తిస్తోంది కదా? మరి ఈ నిబంధన.. ఒక్క అంతర్వేదిలోనే ఎందుకు అమలు కావడం లేదు? రాజకీయ ‘క్షత్రియుల’ చేతుల్లో ఆలయం ఎందుకు బందీగా మారింది? రక్షించాల్సిన క్షత్రియులు ఆలయ భూముల భక్షకులుగా ఎందుకు మారారు? ర థం తగులబడిపోతే దానిని తయారుచేయించి..  సంప్రదాయం ప్రకారం స్వామి వారికి ఇచ్చే అగ్నికుల క్షత్రియులకు కాకుండా, టెండర్లు కూడా లేకుండా ఇతరుల చేతికి ఎలా అప్పగిస్తారు? పది లక్షలకే తాము రథాన్ని తయారుచేసి ఇస్తామన్న అగ్నికుల క్షత్రియులకు కాకుండా, తెలంగాణలో ఉన్న ఆసామికి 14 లక్షలు పోసి ఆ కాంట్రాక్టు ఇవ్వడంలో మతలబేమిటి? ఆలయ భూముల్లో క్త్రైస్తవ ప్రార్ధనా మందిరాలు వెలుస్తున్నా, భూములు అన్యాక్రాంతమవుతున్నా,  అధికారులు ఎందుకు నిలువరించలేకపోతున్నారు? ఇవీ.. దుండగుల చేతిలో దహనమయిన, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ‘అంతులేని కథ’!   ‘బ్రిటిషర్ల జమానాలో రాజులు శిస్తు కట్టకపోతే వారి భూములు వేలం వేశారు. దానిని అడ్డుకుని తానే సొమ్ము చెల్లించిన గొప్పవాడు కృష్ణమ్మ.  అంత వదాన్యుడు భూములిచ్చి, నిర్మించినదే ఈ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయం’- ఇది ప్రతిఏటా జరిగే అంతుర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఉత్సవాల్లో,  దేవదాయ శాఖ నిర్వహించే సాంస్కృతిక ప్రదర్శనలో కళాకారులు వినిపించే కథ. కానీ, అంత గొప్ప వదాన్యుడైన కొప్పనాటి కృష్ణమ్మ వారసులను.. ఇప్పుడు అక్కడ జరిగే ఉత్సవాలకు రానీయకుండా అడ్డుకుంటారు. లోపల స్థలం లేదు పొమ్మంటారు. అసలు ఆలయ కమిటీలో వారికే స్థానమే ఇవ్వరు. కృష్ణమ్మ వారసుడైన కొప్పనాటి శ్రీనివాసరావుకు ఇటీవల జరిగిన అవమానం. ఇదీ దాతల పట్ల దయచూపే పాలకుల తీరు. అది కాంగ్రెసయినా, తెలుగుదేశమయినా, బీజేపీ అయినా, వైసీపీ అయినా! అందరూ ఆ తాను ముక్కలే!!   అగ్నికుల క్షత్రియ కులానికి చెందిన,  కొప్పనాటి కృష్ణమ్మ అనే మహానుభావుడు బ్రిటీషు కాలంలోనే నౌకాయాన వ్యాపారి. రాజులు శిస్తు చెల్లించకపోతే వారి తరఫున ఆయనే డబ్బు చెల్లించేవారు. అలాంటాయన కష్టాల్లో ఉన్నప్పుడు.. లక్ష్మీనరసింహస్వామి కలలో కనిపించి, నీ బాధలు తీరతాయని అభయమిచ్చారట. దానితో కొట్టుకుపోయిన ఆయన ఓడలన్నీ ఒడ్డుకు చేరాయట. అందుకు ఆయన భక్తితో ఆలయానికి 1800 ఎకరాలు దానం చేసి, సొంత సొమ్ముతో ఆలయం, అందులో ఒక రథం నిర్మించారట. ఇదీ.. క్లుప్తంగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయకథ. ఆ మేరకు శాసననాలు కూడా ఉన్నాయి. ప్రాపర్టీ రిజిస్టరులో వాటి వివరాలూ ఉన్నాయి అయినా, ఆ వంశానికి చెందిన వారసులకు ఇప్పటివరకూ ఏ ప్రభుత్వమూ ఆలయ కమిటీలో స్థానం కల్పించలేదు. కృష్ణమ్మ వారసులకు ఆలయ బాధ్యత అప్పగించాలని, దశాబ్దాల నుంచి పోరాడుతున్న అగ్నికుల క్షత్రియులకు ఇప్పటివరకూ మిగిలింది కంఠశేష మాత్రమే.   టీడీపీ అధికారంలో ఉన్నప్పడయితే.. అగ్నికుల క్షత్రియుల కొత్త తరం నేతలు, అంతర్వేది ఆలయ పరిరక్షణ సమితి పేరుతో ఆందోళనలు నిర్వహించారు. విజయవాడలో 48 గంటల దీక్ష నిర్వహించారు. దానికి ఇప్పటి ‘గుళ్ల మంత్రి’ వెల్లంపల్లి శ్రీనివాస్, ఇప్పటి ఎంపీ మోపిదేవి వెంకట రమణ హాజరయ్యారు. తాము అధికారంలోకి వస్తే, కృష్ణమ్మ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది వారి పార్టీనే. నాడు ధర్నాలో పాల్గొన్న వెల్లంపల్లి ఇప్పుడు గుళ్లకు మంత్రయితే, మోపిదేవి రమణ ఎంపీ. అయినా ఫలితం శూన్యం.   అంతర్వేదిలో రథం తగులబడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాని స్థానంలో కొత్త రథం నిర్మిస్తామని వైసీపీ  సర్కారు చెప్పింది. దాని ఖరీదు 90 లక్షలుగా అధికారులు అంచనా వేశారు. రథాన్ని తయారుచేసి, స్వామికి సమర్పించడం అగ్నికుల క్షత్రియుల ఆచారం. కానీ పాలకులు హైదరాబాద్‌లో ఉన్న గణపతి ఆచారి అనే వ్యక్తికి ఆ కాంట్రాక్టు ఇచ్చారట. తాము కేవలం 10 లక్షలకే రథం తయారు చేసి ఇస్తామని ముందుకొచ్చినా..  హైదరాబాద్‌లో ఉన్న వ్యక్తికి 14 లక్షలు, కలపకు మరో 80 లక్షలు ఖర్చు చేస్తామంటున్న సర్కారు తీరుపై, అగ్ని కుల క్షత్రియులు అగ్గిరాముళ్లలవుతున్నారు.   ఇప్పుడు రథ నిర్మాణానికి కలప కూడా కొనేశారు. పనులు మాత్రం హైదరాబాద్‌లో ఉన్న కాంట్రాక్టరుతో చేయిస్తున్నారు. అగ్నికుల క్షత్రియుల ఆందోళనకు అదీ ఓ కారణమే. ఆ రథ నిర్మాణ బాధ్యత మాకే ఇవ్వాలని, తమలోనూ నిపుణులున్నారన్నది వారి వాదన. కానీ వారికి ఆ బాధ్యత అప్పగిస్తే, ‘కమిషన’్ల కథమేటి? అందుకే అధికారులు అందుకు ససేమిరా అంటున్నారు. అన్నట్లు.. విశాఖ సర్కారీ స్వామి వారు,  రథాన్ని కలపతో నిర్మించాలని ఉచిత సలహా కూడా ఇచ్చారు.   కృష్ణమ్మ కుటుంబానికి స్థానం కల్పించాలని... ఎంత ఒత్తిడి చేసినా పట్టించుకోని టీడీపీ సర్కారు, ఇప్పుడు రథనిర్మాణంపై గొంతెత్తడమే ఆశ్చర్యం. ఆ బాధ్యతను అగ్నికుల క్షత్రియులకే ఇవ్వాలని, టీడీపీ నేత లోకేష్ ట్వీట్ చేయడం వింత. తాము అధికారంలో ఉన్నప్పుడు గాలికొదిలిన అంతర్వేది సమస్యలపై, ఇప్పుడు విపక్షంలోకి వచ్చిన అదే టీడీపీ ఆగ్రహించడం వింతల్లోవింత. మొన్నామధ్య అంతర్వేదికి వెళ్లి, హడావిడి చేసిన బీజేపీ కూడా తక్కువ తినలేదు. కృష్ణమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని నాటి బీజేపీ మంత్రి మాణిక్యాలరావును కోరినా, పట్టించుకున్న పాపాన పోలేదు. హిందూకార్డుతో రాజకీయాలు చేస్తున్చ బీజేపీ, ఇప్పుడు చిలకపలుకులు పలకడమే ఆశ్చర్యం.   అసలు అంతర్వేది భూముల్లో ఎన్ని తమ అధీనంలో ఉన్నాయి? ఎన్ని పరాధీనంలో ఉన్నాయో ప్రభుత్వాలకే తెలియకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం. ఆలయ భూముల్లో క్రైస్తవ చర్చిలు కూడా నిర్మించారంటే, అధికారులు భూమల రక్షణ కోసం ఎంత బాగా పనిచేస్తున్నారో అర్ధమవుతుంది. ఇక స్థానికంగా ఓ ‘క్షత్రియ’ నాయకుడు..  నిర్వహకులను ముందుపెట్టి, ఆలయాన్ని శాసిస్తున్నారట. చాలావరకూ ఆలయ భూములన్నీ, సదరు క్షత్రియ నాయకుడి కుటుంబ బినామీల ఏలుబడిలోనే ఉన్నాయట. ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీలో చేరే సదరు నేత.. ఆ అధికార ముసుగులో, ఆక్రమించుకున్న భూములను కాపాడుకుంటున్నారట. అంతర్వేది కథలో ఇదో రకం కుట్ర కోణం! ప్రస్తుతం అంతర్వేది ఆలయం రాజకీయుల చేతిలో బందీగా మారింది. ఆలయంలో నగలు, దాతలిచ్చిన వస్తువుల వివరాలను.. ప్రాపర్టీ రిజస్టరులో నమోదు చేస్తుంటారు. కానీ, ఇప్పుడా ప్రాపర్టీ రిజిస్టరుకు రెక్కలొచ్చాయంటున్నారు. దానిని చూపించాలని ఎంతమంది డిమాండ్ చేస్తున్నా, అదిగో ఇదిగో అంటూ అధికారులు తాత్సారం చేస్తున్నారు. దీన్నిబట్టి..  అసలు ప్రాపర్టీ రిజిస్టరు ఉందా? లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేనా ఆలయంలో కృష్ణమ్మకు సంబంధించిన శిలాశాసనాలు కూడా, సమాధి  చేసే కుట్ర జరుగుతోందన్నది అగ్నికుల క్షత్రియుల ఆరోపణ. మరి లక్ష్మీపార్వతి చెప్పినట్లు.. పక్కా హిందువయిన జగన్మోహన్‌రెడ్డి, అంతర్వేదిలో జరుగుతున్న అంతులేని కథకు ముగింపు ఎందుకు పలకడం లేదన్నది ప్రశ్న. -మార్తి సుబ్రహ్మణ్యం

అవును.. ఢిల్లీలో వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు!

పురందీశ్వరిని తిట్టినా నోరు మెదపని కమలదళం   వైసీపీపై కమలదళాల మొహమాటం   'ఏపీ పొలిటిక్ గ్రౌండ్' లో ఇదో మ్యాచ్‌ఫిక్సింగ్                    ఆమె పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆమె సేవలు గుర్తించినందుకే నాయకత్వం ఆ పదవి ఇచ్చింది. దానికి విపక్షాల సర్టిఫికెట్ అవసరం లేదు. మరి అలాంటి నాయకురాలిని, ఒక విపక్ష పార్టీ ఎంపీ దారుణంగా, కులం కోణంలో దూషించిన వైనం విస్మయపరిచింది. ఆ లెక్క ప్రకారమయితే రాష్ట్ర నేతలంతా, సదరు విపక్ష పార్టీ ఎంపీపై మూకుమ్మడి దాడి చేయాలి. అటో ఇటో తేల్చుకోవాలి. కానీ ఏపీలో ఆ లెక్క తిరగబడింది. విపక్ష పార్టీపై విరుచుకుపడాల్సిన జాతీయ పార్టీ రాష్ట్ర నేతలు, దుప్పటి ముసుగేసుకుని పడుకున్నారు. విమర్శకులకు గురైన నాయకురాలు, తమ పార్టీకి చెందిన వారు కాదనుకుంటున్నారు. అధికార పార్టీ అగ్రనేతలతో ఉన్న బాదరాయణ సంబంధంతో, తెగ మొహమాటంలో ఉన్నారు. ఇలాంటి మొహమాటం ఇప్పుడే కాదు. పూర్వ అధ్యక్షుడి విషయంలోనూ కనిపించింది. అధికారపార్టీ అంతగా ప్రభావం చూపిస్తున్న ఈ నాయకులు.. అదే టీడీపీలో, ఒక మాజీ మంత్రి తమపై ఏదైనా వ్యాఖ్యలు చేస్తే మాత్రం, అధ్యక్షుడు సహా అంతా గయ్యిన లేచి ఎదురుదాడి చేస్తున్నారు. ‘ఏపీ పొలిటికల్ గ్రౌండ్’లో జరుగుతున్న.. ఇలాంటి ‘మ్యాచ్ ఫిక్సింగ్ యవ్వారం’ యమా రంజుగా కనిపిస్తోంది.   బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయిన పురందీశ్వరిపై, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్య దుమారం రేపుతోంది. కేంద్రంలోని బీజేపీతో సత్సంబంధాలు నెరపుతున్న వైసీపీ నేతలు.. రాష్ట్రంలో మాత్రం అదే బీజేపీ అగ్రనేతలను, దారుణంగా అవమానిస్తున్నారు. అయినా ఢిల్లీ నాయకత్వం మౌనం వహిస్తున్న తీరు, బీజేపీ శ్రేణులలో గందరగోళానికి కారణమవుతోంది. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురదీశ్వరిని,  ‘ఆమె జాతీయ నాయకురాలు కాదు. జాతి నాయకురాలు’అంటూ,  విజయసాయి చేసిన విమర్శపై, బీజేపీ రాష్ట్ర నేతలెవరూ స్పందించకపోవడమే విచిత్రం. చివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా, ఇప్పటిదాకా పెదవి విప్పకపోవడమే ఆశ్చర్యం. ఇది సహజంగా పార్టీ వర్గాల్లో అనుమానాలకు తావిచ్చింది. బహుశా ఆయనకు విజయసాయిని విమర్శించడం, వ్యక్తిగతంగా ఇబ్బందేమోనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు మీద ఒంటికాలితో లేచే సోము వీరత్వం, విజయసాయిపై ఏమయిందన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక చీమ చిటుక్కుమన్నా, వెంటనే సోషల్ మీడియాలో.. అందరికంటే ముందుగానే  కేక వేసే, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి కూడా, ఇంతవరకూ స్పందించకపోవడం మరో విచిత్రం. కరోనాతో ఆయన ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ, పోస్టింగులు వస్తూనే ఉన్నాయి. అయినా పురందీశ్వరిపై.. విజయసాయి చేసిన వ్యాఖ్యలపై ఆయన కూడా స్పందించకపోవడం ఆశ్చర్యమే.   నిజానికి వీరిద్దరూ టీడీపీపై నిరంతరం విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు. కానీ టీడీపీ నేతలెవరూ బీజేపీపై విమర్శలు చేయడం లేదు. అయినా టీడీపీ లక్ష్యంగానే ఈ ఇద్దరు నేతలు విరుచుకుపడుతున్నారు. కానీ, తమ పార్టీ నేతలపై మంత్రులు, వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నా, బీజేపీ నేతలెవరూ ఎదురుదాడి చేయకపోవడమే అనుమానాలకు కారణం.   ఇటీవల జగన్ తిరుమల వెళ్లినప్పుడు.. డిక్లరేషన్ అంశంపై పార్టీ నాయకులెవరూ ధర్నాలు చేయవద్దని, తిరుపతి పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు ఆదే శించారు. అయినా ఆయనను సస్పెండ్ చేయకపోవడం ఆశ్చర్యం. ఒకవేళ సోము అనుమతితోనే ఆయన అలా ఆదే శించి ఉంటే, అది కూడా తప్పేనంటున్నారు. డిక్లరేషన్‌పై బయట మీడియాలో హడావిడి చేసిన తాము.. జగన్ స్వయంగా తిరుమలకు వస్తే ఆయన పర్యటనను అడ్డుకోవద్దని చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది పార్టీ నాయకత్వమే తమ చేతులు కట్టివేసినట్టని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. గతంలో కన్నా లక్ష్మీనారాయణపై.. అదే విజయసాయి దారుణమైన ఆరోపణలు చేసినా, వీరెవరూ స్పందించలేదు. కన్నాపై విజయసాయి చేసిన ఆర్థికపరమైన ఆరోపణలను, ఇన్చార్జి సునీల్ దియోథర్ కూడా నేరుగా ఖండించలేదు. ఇప్పుడు ఇదే దియోథర్.. పార్టీ ప్రధాన కార్యదర్శి పురందీశ్వరిపై, విజయసాయి చేసిన ఆరోపణలను ఖండించడం విశేషం. సునీల్- పాతూరి నాగభూషణం- ఒంగోలు  పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు తప్ప.. రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులెవరూ విజయసాయి ఆరోపణలపై స్పందించకపోవడం ప్రస్తావనార్హం.   దీన్నిబట్టి..తమ పార్టీ నేతలను తిట్టే అధికారాన్ని, బీజేపీ నాయకత్వం  వైసీపీకి దఖలు చేసినట్లు స్పష్టమవుతోంది. రాజ్యసభలో వైసీపీ బలంపై బీజేపీ ఆధారపడింది. అందుకు ప్రతిఫలంగా, ఏపీలో తన పార్టీని బలి చేస్తున్నట్లు.. కన్నా నుంచి పురందీశ్వరి వరకూ జరుగుతున్న ఘటనలు రుజువుచేస్తూనే ఉన్నాయి. మామూలుగా అయితే, బీజేపీ జాతీయ నాయకత్వం దీనిని సీరియస్‌గా తీసుకోవలసి ఉంది. అంతకంటే ముందు.. రాష్ట్ర సంఘటనా కార్యదర్శి మధుకర్‌రెడ్డి, నేతలు సమన్వయ పరిచి, ఎదురుదాడికి మార్గనిర్దేశం చేయాల్సి ఉంది. ఆ అంశంలో ఆయన కూడా విఫలమయ్యారన్న వ్యాఖ్యలు పార్టీలో వినిపిస్తున్నాయి. ఆయన పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని సరైన రాజకీయ పంథాలో నడిపించలేకపోతున్నారన్న అసంతృప్తి పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది.  మొత్తానికి వైసీపీ-బీజేపీ మ్యాచ్‌ఫిక్సింగ్ రాజకీయ క్రీడ సారాంశం, మెడపై తల ఉన్న ఎవరికయినా పెద్ద కష్టపడకుండానే అర్ధమవుతోంది. అదీ అసలు సమస్య! -మార్తి సుబ్రహ్మణ్యం

మండలి పోరులో కమ్యూనిస్టులు.. కేసీఆర్ నయా ప్లాన్! 

రాజకీయ వ్యూహాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ దిట్ట అంటుంటారు. పరిస్థితులు బాగున్నప్పుడు ఒకలా,,, తనకు అనుకూలంగా లేనప్పుడు మరోలా ఆయన అడుగులు వేస్తుంటారు. అవసరమైతే పూర్తి భిన్నమైన వైఖరులు కూడా తీసుకుంటారు. ఎంతకైనా తెగిస్తారు. అందుకే కేసీఆర్ కు మాటమీద నిలబడరనే ఆరోపణలున్నాయి. అవేమి పట్టించుకోని కేసీఆర్.. తాను అనుకున్నది సాధించేందుకు వెనక్కి తగ్గరనే అభిప్రాయం ఉంది. తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లోనూ కేసీఆర్ ఇదే తరహా కొత్త ఎత్తులు వేస్తున్నారు.    కేసీఆర్ సర్కార్ పై ఉద్యోగులు, నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. టీఆర్ఎస్ నేతలే ఈ విషయాన్ని బహిరంగంగా చెబుతున్నారు. త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ ఓటర్లు వీరే. అందుకే మండలి ఎన్నికలు కారు పార్టీని టెన్షన్ పెట్టిస్తున్నాయి. అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా ముందుకు రాని పరిస్థితి ఉంది. పార్టీ పరిస్థితిని అంచనా వేసిన గులాబీ బాస్ మండలి ఎన్నికల్లో గెలుపు కోసం మరో స్కెచ్ వేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకవైపు వెళ్లకుండా, చీలిపోయేలా ఆయన ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. వీలైనంత ఎక్కువ మంది అభ్యర్థులు మండలి బరిలో ఉండేలా పావులు కదుపుతున్నారు. కేసీఆర్ ప్లాన్ లో భాగంగానే మండలి ఎన్నికల్లో కమ్యూనిస్టులు పోటీ చేయాలని నిర్ణయించారనే ప్రచారం జరుగుతోంది. అందుకే టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కు వామపక్షాలు మద్దతు ఇవ్వడం లేదని తెలుస్తోంది.   గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ తో కలిసి కమ్యూనిస్టులు పోటీ చేశారు. ఎన్నికల తర్వాత కూడా కోదండరామ్ తో కలిసి పలు ఉద్యమాలు చేశారు. వామపక్ష పోరాట కార్యక్రమాలకు కోదండరామ్ తప్పనిసరిగా హాజరవుతూ వస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడే యూటర్న్ తీసుకుంటున్నారు కమ్యూనిస్టు నేతలు. టీజేఏసీ చైర్మెన్ గా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన, ఇంతకాలం తమ ఉద్యమాలకు మద్దతుగా  కోదండరామ్ ఎమ్మెల్సీ బరిలో ఉంటుంటే మాత్రం ఆయనకు సపోర్ట్ చేయడం లేదు. కోదండరామ్ కు మద్దతు ఇవ్వాలని టీజేఎస్ అధికారికంగా లేఖలు రాసినా కమ్యూనిస్టు పార్టీలు స్పందించలేదని సమాచారం.    శాసనమండలి ఎన్నికలో పోటీ చేయబోతున్న కోదండరామ్ కు వామపక్షాలు సపోర్ట్ చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వామపక్షాల తీరుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. గత పట్టభద్రుల మండలి ఎన్నికల్లో కమ్యూనిస్టులు పోటీ చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఎందుకు పోటీలో ఉంటున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. కేసీఆర్ చెప్పడం వల్లే మండలి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్, బీజేపీ, కోదండరామ్ తో పాటు వామపక్ష అభ్యర్థి, పోటీలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి పోతుందని, అంతిమంగా అది అధికార పార్టీకి లాభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే కేసీఆర్ డైరెక్టుగా వారితో పొత్తు పెట్టుకోకుండా.. మండలి ఎన్నికల్లో మరో దారిలో వస్తున్నారని చెబుతున్నారు.    అసెంబ్లీ సమావేశం సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డితో కలిసి కేసీఆర్ లంచ్ చేశారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు మండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మాట్లాడటానికే చాడాను కేసీఆర్ పిలిపించినట్లు అప్పుడే ప్రచారం జరిగింది. కాని సీపీఐ నేతలు మాత్రం ఖండించారు. కొత్త రెవిన్యూ చట్టం గురించే చాడాతో ముఖ్యమంత్రి మాట్లాడారని వివరణ ఇచ్చారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఎన్నికల గురించే కేసీఆర్ సీపీఐ నేతతో మాట్లాడినట్లు అంతా అభిప్రాయపడుతున్నారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికపైనా కమ్యూనిస్టులు ఇంకా తమ వైఖరిని ప్రకటించకపోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. దుబ్బాకలోనూ అధికార పార్టీకి వామపక్ష పార్టీలు మద్దతు ఇవ్వొచ్చని చెబుతున్నారు.

ఇట‌లీకి ప‌య‌న‌మైన ప్ర‌భాస్ టీమ్‌

  ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టిస్తోన్న 'రాధే శ్యామ్' మూవీ లాక్‌డౌన్ త‌ర్వాత షూటింగ్‌ను కొన‌సాగించ‌డానికి సిద్ధ‌మైంది. ఇట‌లీలో ఓ 15 రోజుల‌ షెడ్యూల్‌ను జ‌రిపేందుకు చిత్ర బృందం ప్లాన్ చేసింది. అందుకు అనుగుణంగా నేడు ఇటలీకి యూనిట్ బ‌య‌లుదేరింది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాడు ప్ర‌భాస్‌. ఇంకేముంది.. జ‌నాలు కెమెరాల‌కు ప‌ని క‌ల్పించారు. ప్ర‌భాస్‌ను ఫొటోలు తీసి, సోష‌ల్ మీడియాలో తెగ ప్ర‌చారం చేస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని యు.వి. క్రియేష‌న్స్‌తో పాటు కృష్ణంరాజు సొంత నిర్మాణ నిర్మాణ సంస్థ గోపీకృష్ణా మూవీస్ క‌లిసి నిర్మిస్తున్నాయి. ప్ర‌భాస్ త‌ల్లిగా ఈ చిత్రంలో అల‌నాటి అందాల తార భాగ్య‌శ్రీ న‌టిస్తుండ‌టం విశేషం. 'మిర్చి' మూవీతో న‌దియాను టాలీవుడ్‌కు అనేక సంవ‌త్స‌రాల తిరిగి తీసుకొచ్చిన ప్ర‌భాస్‌, ఇప్పుడు అదే త‌ర‌హాలో భాగ్య‌శ్రీ‌ని చాలా కాలం త‌ర్వాత టాలీవుడ్‌లోకి తీసుకొస్తున్నాడు. అంద‌మైన ల‌వ్ స్టోరీతో రూపొందుతోన్న 'రాధే శ్యామ్' సినిమాపై అంచ‌నాలు ఎప్ప‌టిలాగే అంబ‌రాన్ని చుంబిస్తున్నాయి.

వెబ్ సిరీస్ ప్రొడక్షన్‌లోకి ధోనీ

  టీమిండియాకి రెండుసార్లు  వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వెబ్ సిరీస్ ప్రొడక్షన్‌లోకి అడుగు పెడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి కెప్టెన్‌గా బాధ్య‌త‌ల‌ను కొన‌సాగిస్తున్నాడు. ధోని ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన మాజీ టీమిండియా కెప్టెన్ త్వరలో ఒక వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేయనున్నాడు. గతేడాది 'రోర్ ఆఫ్ లయన్' అని ధోని ఒక డాక్యుమెంటరీ సిరీస్ ప్రొడ్యూస్ చేశాడు. కొత్త రైటర్ రాసిన బుక్ ఆధారంగా వెబ్ సిరీస్ రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా ఆ బుక్ పబ్లిష్ కాలేదట. అది అఘోరా నేపథ్యంలో మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ స్టోరీ. సినిమాగా కంటే సిరీస్ చేస్తే బావుంటుందని తాము నిర్ణయం తీసుకున్నట్టు ధోని భార్య సాక్షి తెలిపారు. ప్రొడక్షన్ హౌస్ కి ఆమె మేనేజింగ్ డైరెక్టర్. ఇంకా నటీనటులు, లొకేషన్లు ఫైనలైజ్ చేయలేదట.

థియేటర్లలో విడుదలయ్యే తొలి తెలుగు సినిమా వర్మదే!

  అక్టోబర్ 15 నుండి థియేటర్లు తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం పట్ల సంచలన దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ సంతోషం వ్యక్తం చేశారు. తమ సినిమాను విడుదల చేయనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. కరోనా నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ 'కరోనా వైరస్' సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ మే నెలల్లో, ప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్న సమయంలో ఆ సినిమా చిత్రీకరణ పూర్తి చేశారు వర్మ. ఎక్కడ ఎప్పుడు ఎలా చిత్రీకరణ చేశాం అనేది చెప్పలేదు కానీ కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ చిత్రీకరణ చేశానని వర్మ పేర్కొన్నారు. ఇప్పుడు ఆ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. "ఫైనల్లీ... అక్టోబర్ 15 నుండి థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. లాక్ డౌన్ తర్వాత విడుదల అయ్యే తొలి సినిమా 'కరోనా వైరస్' అని ప్రకటించడానికి సంతోషపడుతున్నాను" అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. అగ‌స్త్య మంజు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో శ్రీ‌కాంత్ అయ్యంగార్ ప్ర‌ధాన పాత్ర‌ధారి.

బిగ్ బాస్ 4 గేమ్స్‌.. నేరాలు, ఘోరాలు!

  వినోదం, మనుషుల మధ్య బాండింగ్, ఎమోషన్స్  ప్రధాన పాత్రగా రూపుదిద్దుకున్న బిగ్ బాస్ హౌస్ లో క్రైమ్ రేట్ పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఫిజికల్ టాస్క్ లోనూ, ఎలిమినేషన్ నామినేషన్స్ లోనూ సభ్యుల మధ్య నేరాలను ప్రేరేపించేలా టాస్క్ లు ఉండటం, అవి రెండుమూడు ఎపిసోడ్స్ వరకు సాగదీయడం ప్రేక్షకుల్లో చికాకు తెప్పిస్తోంది. ఎలిమినేషన్స్ లో ఉన్న సభ్యులు ఎలాగైనా గెలవాలన్న ఆలోచనతో బిగ్ బాగ్ హెచ్చరికలను కూడా ఖాతరు చేయడం లేదు. రాత్రంతా జాగరణ చేస్తూ ఇంటిసభ్యులందరి కాయిన్స్ దొంగిలించడంతో మెహబూబ్, సోహైల్ బిజీ దొంగలుగా మారారు. ఫిజికల్ టాస్క్ లో రెండోదశలో కాలుబెణికి ఆసుపత్రికి వెళ్లిన అవినాష్., క్లిలర్ కాయిన్ కు బలైన మోనాల్ బాత్ రూమ్ లో దూరి పెద్దగా ఏడ్వడం మొదలైన అనేక సంగతుల సమాహారంగా బిగ్ బాస్ ఎపిసోడ్ 25 కొనసాగింది. బిగ్ హౌస్ కెప్టెన్సీ కోసం ఇచ్చిన కాయిన్స్ కలెక్షన్ టాస్క్ 24వ రోజు కూడా కొనసాగింది. బెల్ మోగినప్పుడల్లా గార్డెన్ ఎరియాలో పడిన కాయిన్స్ తీసుకోవడానికి ఉరుగులు, పరుగులు పెట్టిన ఇంటిసభ్యులకు వాటిని దాచుకోవడం పెద్ద సమస్యగా మారింది. దివి, హారికలకు కాయిన్స్ దాచుకోవడంలో అమ్మ రాజశేఖర్ సహాయం చేశారు. తన దగ్గర ఉన్న కాయిన్స్ లో కొన్ని కుమార్ సాయి నుంచి తీసుకున్నవి కావడంతో అతని కాయిన్స్ అతనికి ఇచ్చేశారు. మరోసారి గార్డెన్ ఏరియాలో కాయిన్స్ పడ్డాయి. ఈ సారి స్విచ్ కాయిన్ పడగా దాన్ని చేతిలోకి తీసుకున్న మెహబూబ్ అదేంటో అర్థం కాక కిందపడేశాడు. వెంటనే దాన్ని సుజాత అందుకుంది. స్విచ్ కాయిన్ ప్రత్యేకమని, ఈ టాస్క్ లో ఆ కాయిన్ ఉన్నవారికి ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయని  బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. దాంతో మెహబూబ్‌పై సోహైల్ కోప్పడ్డాడు. అనౌన్స్ మెంట్ వినేవరకు అయినా నీతో ఉంచుకోవల్సింది అన్నాడు సోహైల్. తనకు దొరికిన కాయిన్ స్పెషల్ కావడంతో దాన్ని దాచుకోవడానికి సుజాత చాలా తిప్పలు పడింది. చివరికి డ్రస్ లోపల దాచుకుని టవల్ లో కవర్ చేసింది. బెంచ్ పై పడుకున్న నోయల్ పక్కనే కూర్చీలో కూర్చోని నిద్రపోయింది. తన దగ్గర ఉన్న మొత్తం కాయిన్స్ ను బెడ్ కింద బాక్స్ లో పెట్టి అక్కడే పడుకున్నారు అమ్మ రాజశేఖర్. అయితే అర్ధ‌రాత్రి కాయిన్స్ కొట్టేయడానికి వచ్చిన సోహైల్ కు లాస్య, అరియానా సహాయం చేశారు. బెడ్ ను అమాంతం పైకి లేపి కాయిన్స్ కొట్టేసి ముగ్గురు పంచుకున్నారు. ఇంట్లో సేఫ్ కాదని గార్డెన్ ఏరియాలో కుర్చీలు కుప్పగా వేసి వాటి మధ్యలో తమ కాయిన్స్ దాచుకున్నారు మెహబూబ్, సోహైల్. వాటిపై బ్లాంకెట్స్ వేయడంతో వాటిని తీయాలని తర్వాత బిగ్ బాస్ ఆదేశించినా లెక్కచేయలేదు. సొహైల్‌ను తిట్టిన సుజాత‌ అమ్మ రాజశేఖర్ వద్ద కాయిన్స్ కొట్టేసిన తర్వాత ఆనందంతో తీన్మార్‌ డాన్స్ చేశాడు సోహైల్. ఆ తర్వాత  కుమార్ సాయి వద్ద దొంగతనం చేసే ప్రయత్నం చేసి దొరికిపోయాడు. అయితే అవినాష్ వద్ద కొన్ని కాయిన్స్ కొట్టేశాడు. అరియానా బిన్ బ్యాగ్ లో దాచుకున్న కాయిన్స్, నిద్రపోతున్న నోయల్ వద్ద మరి కొన్ని కాయిన్స్ మెహబూబ్ కొట్టేశాడు. సోహైల్ కూడా నోయల్ వద్ద కాయిన్స్ తీయడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో సుజాతకు మెలుకువ వచ్చి సోహైల్ ను చెడామడా తిట్టేసింది.  సోహైల్, మెహబూబ్ తాము దొంగతనం చేసిన  కాయిన్స్ ను పంచుకుంటూ ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అర్థమ‌వుతోంది. మ‌న‌స్సాక్షి ఉండాలి! "ఇట్టాగే రెచ్చిపోనా" అంటూ సాగిన వేకప్ సాంగ్ లోనూ ఫుల్ జోష్ సోహైల్, మోహబూబ్ స్టెప్పులేశారు. నిద్రలేచిన అమ్మ రాజశేఖర్ కాయిన్స్ మాయం అవడం గమనించి సొహైల్, మెహబూబ్ ల పనే అని డిసైడ్ అయి వారి వద్దకు వచ్చాడు. "ఇది గేమ్  మాస్టర్ తర్వాత మాట్లాడదాం" అని సోహైల్ అన్నాడు. "గెలుద్దామనే తీశారా" అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. "మనస్సాక్షి ఉండాలి. ఆడండి.. గెలవండి.. కప్పు తీసుకోండి" అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అభిని నిలదీసిన హారిక ఇంటిసభ్యుల మధ్య ఏర్పడిన బాండిగ్స్ ఈ టాస్క్ లో కనిపించాయి. తన కాయిన్స్ ను నచ్చిన వారికి ఇవ్వడానికి కొందరు సిద్ధమయ్యారు. అలాగే అభిజిత్ కూడా తన కాయిన్స్ లో కొన్ని స్వాతికి ఇచ్చాడు. "హౌస్ లోకి కొత్తగా వచ్చిన  స్వాతికి ఎందుకు కాయిన్స్ ఇస్తున్నావు?" అంటూ హారిక అభిజిత్ ను నిలదీసింది. "ఆమె హౌస్ లో ఏ బాధ్యత తీసుకోవడం లేదు. ఆట ముందే చూసి ఎవరితో ఎలా ఉండాలో ప్లాన్ తో వచ్చింది. నువ్వు ఎందుకు నీ కాయిన్స్ ఆమెకు ఇస్తున్నావు?" అని ప్రశ్నించింది. "మూడు వారాల నుంచి కలిసి ఉంటున్నాం. నేను కూడా నామినేషన్ లో ఉన్నా. ఫ్రెండ్ గా నాకు సహాయం చేయి. అంతేకాని రెండురోజుల కిందట వచ్చిన స్వాతికి కాదు" అంది హారిక.  దాంతో "అలాంటిది ఏమీ లేదు. నేను కాయిన్స్ ఏమి ఇవ్వలేదు. ఎవరి టాస్క్ వారిదే" అంటూ అభి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని కూల్ చేసే ప్రయత్నం చేశాడు. గంగవ్వ జీరో.. మెహబూబ్ హీరో కెప్టెన్సీ కోసం జరుగుతున్న ఈ ఫిజికల్ టాస్క్ కు  గంగవ్వ దూరంగా ఉంది. ఆమె ఇప్పటికే కెప్టెన్ హోదాలో ఉన్నారు. దాంతో మరోసారి కెప్టెన్ కోసం పరుగులు తీయలేక ఇంటిసభ్యుల ఆట గమనిస్తోంది. ఫిజికల్ టాస్క్ లో ఫస్ట్ లెవల్ కాయిన్స్ కలెక్షన్ పూర్తి అయ్యిందని, మరి కొన్ని లెవల్స్ ఉన్నాయని బిగి బాస్ చెప్పారు. ఎవరి వద్ద ఎన్ని కాయిన్స్ ఉన్నాయో లెక్కచెప్పమని సూచించాడు. దాంతో ఇంటిసభ్యులు తమతో ఉన్న కాయిన్స్ లెక్క చెప్పారు. అవినాష్ - 3160, అమ్మ రాజశేఖర్ - 320, స్వాతి - 1930, లాస్య - 1560, అభిజిత్ - 1770, నోయల్ - 900, హారిక - 1450, సొహైల్ - 3620, మెహబూబ్ - 4360, మోనాల్ - 610, అఖిల్ - 2570, అరియానా - 1850, దివి - 110, కుమార్ - 1570 కాయిన్స్ లెక్క చెప్పారు.  సుజాత 340 కాయిన్స్ తో పాటు స్విచ్ కాయిన్ తనతో ఉందని చెప్పింది. గంగవ్వ ఈ టాస్క్ కు దూరంగా ఉంది. కిల్లర్ కాయిన్ తో.. ఇంటిసభ్యులంతా రెండో దశకు చేరుకున్నారు. ఈ దశలోమొత్తం ఎనిమిది రౌండ్స్ ఉంటాయి.  ముందుగా ఇంటిసభ్యులందరూ స్టోర్ రూంలో ఉన్న స్పెషల్ జాకెట్స్ ధరించాలి. గార్టెన్ ఏరియాలో ఉన్న కిల్లర్ కాయిన్ ను  బజర్ మోగే సమయానికి ఎవరి జాకెట్ పై  ఉంటే వారి పాయింట్స్ లో సగం తగ్గిపోతాయి. ముందుగా తక్కువ పాయింట్స్ వచ్చిన వారు కిల్లర్ కాయిన్ తీసుకోవాలని, బిగ్‌ బాస్ పంపించిన వివరాలను లాస్య చదివి వినిపించింది. బజర్ మోగగానే దివి కిల్లర్ కాయిన్ తీసుకుని సోహైల్  వెంటపడింది. మెహబూబ్, అఖిల్ లివింగ్ రూంలోనే ఉండిపోయారు. వారిద్దరినీ కూడా బయటకు రావాలని ఇంటిసభ్యులు కోరారు. ఇంటిసభ్యులందరి వద్ద కాయిన్స్ కొట్టేసిన సోహైల్ ను చాలామంది టార్గెట్ చేశారు. దాంతో ఉక్రోషానికి వచ్చిన సోహైల్ ఒక్కడినే టార్గెట్ చేస్తున్నారు బిగ్ బాస్ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక‌రినే టార్గెట్ చేస్తే క‌థ వేరే ఉంట‌ద‌ని సోహైల్ హెచ్చ‌రించడంతో అమ్మ రాజశేఖర్ ఏం వేరేగా ఉంటది అంటూ ముందుకు వచ్చాడు. దాంతో సోహైల్, అమ్మ రాజశేఖర్ మధ్య గొడవ జరిగింది. మెహబూబ్, అఖిల్ గార్డెన్ లోకి వచ్చి వారిద్దరినీ సమాధానపరిచారు. బజర్ మోగేసరికి కిల్లర్ కాయిన్ చివరికి మోనాల్ జాకెట్ పై ఉంది. దాంతో మోనాల్ పాయింట్స్ తగ్గిపోయాయి. ఇంతలో కాలు స్లిప్ అయి అవినాష్ కింద పడ్డాడు. అతనిని మెహబూబ్, నోయల్, అఖిల్, సోహైల్ ఎత్తుకుని బిగ్ హౌస్ లోని హాస్పిటల్ కు తీసుకువెళ్ళారు. బాత్ రూమ్ లో వెక్కివెక్కి ఏడ్చిన మోనాల్ బిగ్ హౌస్ లో డే వన్ నుంచి కన్నీటి ప్రవాహంతో చివరికి నాగార్జున చేత నర్మదా నదిగా పిలిపించుకున్న మోనాల్ బాత్ రూమ్ లో దూరి బిగ్గరగా ఏడ్చేసింది. కాయిన్స్ కొట్టేసి తనను అనుమానించడం ఆమె తట్టుకోలేకపోయింది. తన బాధనంతా అద్దం ముందు కూర్చోని ఇంగ్లీష్‌, హిందీలో వెల్లబోసుకుంది. ఇంతలో మోనాల్ ను తెలుగులో మాట్లాడాలని బిగ్‌ బాస్ ఆదేశించాడు. తన నుంచి సాధ్యం కాదని, మనసులోని బాధ తెలుగులో చెప్పలేక బాత్ రూమ్ లో దూరి బిగ్గరగా ఏడ్చేసింది. ఎనిమిది రౌండ్ల రెండో దశ క్లిలర్ కాయిన్ టాస్క్ లో ఎవరెవ్వరి పాయింట్స్ సగమవుతాయో.. స్పెషల్ కాయిన్ తో సుజాత ఎవరి పాయింట్స్ ను తీసుకుంటుందో నెక్ట్స్ ఎపిసోడ్ లో చూడాల్సిందే...

యాంక‌ర్‌గా అవ‌తార‌మెత్తిన వితిక‌!

  వితికా శేరు న‌టిగా ఆశించిన రీతిలో పేరు సంపాదించుకోలేక పోయింది. తెలుగ‌మ్మాయి కావ‌డం వ‌ల్లో, మ‌రో కార‌ణం వ‌ల్లో ఆమెకు త‌గిన‌న్ని అవ‌కాశాలు రాలేదు. ఆ త‌ర్వాత తెర‌పై త‌న స‌ర‌స‌న హీరోగా న‌టించిన వ‌రుణ్ సందేశ్‌ను పెళ్లి చేసుకొని జీవితంలో స్థిర‌ప‌డింది. అయిన‌ప్ప‌టికీ ఆమెలోని సృజ‌నాత్మ‌క శ‌క్తి కుదురుగా ఉండ‌నివ్వ‌లేదు. భ‌ర్త‌తో క‌లిసి బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసింది. ఇప్పుడు త‌న కెరీర్‌లో మ‌రో అంకానికి ఆమె తెర‌తీసింది. అతి త్వ‌ర‌లోనే ఆమె టీవీ రంగంలో యాంక‌ర్‌గా కొత్త అవ‌తారంలో కనిపించ‌నుంది. "యాంక‌ర్‌గా ప‌రిచ‌యం అవుతున్నందుకు చాలా ఉద్వేగ‌భ‌రితంగా ఫీల‌వుతున్నా. టీవీలో న‌న్ను నేను చేసుకోవ‌డానికి ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నా. ప్ర‌తి ఆదివారం రాత్రి 7 గంట‌ల‌కు ఈటీవీ తెలుగులో సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న షో చూడండి." అని త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది వితిక‌. యాంకర్‌గా ఆమెను వీక్ష‌కులు ఎలా ఆద‌రిస్తారో చూడాల్సిందే.

రాజకీయాలకు బలౌతున్న ఐఏఎస్ అధికారులు

ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు. తండ్రి చేతిలో ఎత్తులు చుసిన వారు తనయుడి చేతిలో లోతులు చూస్తున్నారు. వారిద్దరూ సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఒకరినైతే మెడపట్టుకుని బయటకు గెంటేశారు. మరొకరిని కులం పేరుతో కుళ్లపొడుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరు అధికారులూ కూడా చంద్రబాబు అంటే గిట్టనివారే. ఇద్దరు అధికారులు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చూపుకు గురి అయిన వారే. ఒకరు బలయ్యారు.. మరొకరు అవుతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే ఒకరు ఎల్‌వి సుబ్రహ్మణ్యం. రెండో వారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యంకు జగన్ కేసుల్లో సహా ముద్దాయిగా ఉన్నారని ప్రాధాన్య పోస్టులు ఇవ్వలేదు. ఒక సందర్భంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పోస్టు ఇచ్చినా మళ్ళీ ఆయనను అక్కడ నుంచి తీసి అత్యంత చిన్నదైన యువజన శాఖకు మార్చారు. ఇక రమేష్ కుమార్ పరిష్తితి కూడా దాదాపుగా అంతే. చంద్రబాబు హయాంలో ఆయనకు ఏ కీలక శాఖ లభించలేదు. ఈ ఇద్దరూ వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిభకు తగిన గుర్తింపు పొందారు. ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఇద్దరూ ఆర్ధిక శాఖను నిర్వహించిన వారే. ఆర్ధిక శాఖలో ఈ ఇద్దరిదీ ప్రత్యేకమైన శైలి అని వారితో సాన్నిహిత్యం ఉన్న అధికారులు అంటారు. రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడంలో బిల్లుల చెల్లింపు తదితర విషయాలలో ఎలాంటి వివాదాలు రాకుండా చూసిన వారన్న విషయాన్ని మర్చిపోలేం అని చెప్తున్నారు. ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడం, జవాబుదారీతనం, దుబారా తగ్గించడం వంటి విషయాల్లో ఈ ఇద్దరూ అనేక చర్యలు తీసుకున్నారు.వీరికి ఇంకో పోలిక కూడా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఇద్దరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా పని చేశారు. ఈ ఇద్దరి హయాంలో తిరుమల పవిత్రత రెండింతలు పెరగడమే కాకుండా క్రమ శిక్షణ ఉండేదన్న విషయం మర్చిపోరాదు. భక్తుల సౌకర్యార్ధం ఈ ఇద్దరి హయాంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతో సీనియర్ రాజకీయ నాయకులు ట్రస్టు బోర్డు చైర్మన్లుగా ఉన్నా కూడా ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఈవోలుగా ఉన్నప్పుడు వీరు చెప్పినట్లే నడచుకునేవారన్న పేరుండేది. వృత్తి పట్ల అంతటి నిబద్ధతతో ఈ ఇద్దరు అధికారులు పని చేశారు. అత్యంత సీనియర్ అయిన ఎల్‌వి సుబ్రహ్మణ్యం ను పక్కన పెట్టి ఆయన కన్నా జూనియర్లకు చంద్రబాబునాయుడు చీఫ్ సెక్రటరీ పదవిని అప్పగించారు. అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యని విషయం మనం చూసాం. సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేటాను పక్కన పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఎల్‌వి సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఎన్నికల కమీషన్ ప్రధాన కార్యదర్శిగా నియమించాక సహ ముద్దాయిని సిఎస్ గా ఎలా నియమిస్తారని విమర్శించారు కూడా.   ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ ఎల్‌వీ ని కొనసాగించగా జగన్ ను అందరూ మెచ్చుకున్నారు కూడా. అయితే ఏమైందో ఏమూ కానీ కొద్ది కాలంలోనే ఎల్‌వి ని అత్యంత అవమానకరంగా పదవి నుంచి జగన్ తొలగించిన విధానం కూడా తెలిసిందే. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా దాదాపుగా అలానే జరిగింది. ఆయనను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించడం చంద్రబాబుకు అస్సలు ఇష్టం లేదు. చంద్రబాబు దగ్గర పని చేయడం రమేష్ కుమార్ కూ ఇష్టం లేదని అంటారు. అయితే తన కార్యదర్శిగా పని చేసిన రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నియమించాలని అప్పటి గవర్నర్ ఇ ఎస్ ఎల్ నర్సింహన్ చంద్రబాబుపై వత్తిడి తెచ్చారనీ. గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అప్పగించారనీ అంటున్నారు. రమేష్ కుమార్ పేరు బదులు వేరే అధికారి పేరు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశామని చంద్రబాబు కూడా చెప్పారు. అటువంటి రమేష్ కుమార్ ఇప్పుడు చంద్రబాబు ఏజెంటుగా జగన్ చేతిలో ముద్ర వేయించుకోవడం దురదృష్టం. ఈ ఇద్దరూ ముక్కుసూటిగా మాట్లాడే అధికారులు. ఎలాంటి మొహమాటం లేకుండా విధులు నిర్వర్తించే వారన్న పేరుంది. అలాంటి ఈ ఇద్దరూ కూడా అత్యంత ఘోరమైన అవమానాన్ని పొందారు. ఈ అవమానాలకు వీరు అర్హులు కాదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చని అధికార వర్గాలు అనుకుంటున్నారు. నాయకులు తమ స్వంత ప్రయోజనాల కోసం అఖిల భారత సర్వీసు అధికారులకు కులాలు, ప్రాంతాలు అంటగట్టడం ఏంటని కొందరు ఆవేదన చెందుతున్నారు.

ఆంధ్ర లో బీజేపీ 'పంచ్' తంత్రం...

  * దిగుమతి నాయకులు, బిజినెస్ లీడర్లు, లాబీయిస్టులు కలిసి బీ జె పి ని ఎటు నడిపిస్తారో....  * ఇంతకీ స్థానిక సమరం లో సత్తా చూపించే ట్యాలెంట్ ఆ పార్టీకి ఉన్నట్టా, లేనట్టా....  * జి వి ఎల్ ఋతుపవనాల్లాంటి వారు... ఇలావచ్చి అలా పలకరించి, అటు నుంచి ఆటే మాయమైపోతారు  * సి ఎం రమేష్ లాబీ మాస్టర్ గా ఢిల్లీ లో ప్రసిద్ధులు.. నోకియా మాదిరి ఈయన కూడా కనెక్టింగ్ పీపుల్ నినాదాన్ని బలంగా నమ్మిన వారు  * సుజనా చౌదరి... గత్యంతరం లేని పరిస్థితుల్లో అమరావతి నినాదాన్ని భుజాన వేసుకుని చందమామ కథలో విక్రమార్కుడి మాదిరి ... వై ఎస్ ఆర్ సి పి లోని బేతాళుడి తో జగడమాడుతుంటారు  * టీ జీ వెంకటేష్.. అవసరార్ధ రాజకీయాల కు కేరాఫ్ అడ్రెస్ .... రాయలసీమ అనేది ఈయనకు ట్యాగ్ లైన్ ...దురదపుట్టినప్పుడు గోక్కోవటానికి ఉపయోగపడే ఆరో వేలుగా ఆయన ఆ నినాదాన్ని బాగా వాడేస్తారు..  * అంగ వంగ కళింగ రాజ్యాలను అవలీలగా గెలిచిన చక్రవర్తి, చివరకు ఆముదాలవలస లో ఓడిపోయినట్టు, రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ , చివరకు పవన్ కళ్యాణ్ తో కలిసి స్థానిక సమరం లో బీజేపీకి కాస్తో కూస్తో ఉన్న ఇమేజ్ ని పణం గాపెట్టే సాహసానికి ఒడిగట్టారు  ఆ ఐదుగురూ ఇంతకీ ఏమి చేస్తున్నట్టు..భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్ , కాంగ్రెస్ లో నుంచి బీ జె పి లోకి షిఫ్ట్ అయిన  బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ  నారాయణ కలిసి ఈ స్థానిక సమరం లో రాష్ట్రం మొత్తం మీద కనీసం ఒక్కొక్కరికి 50 చొప్పున 250 మంది ఎం పి టి సి లు, జెడ్ పీ టి సి లను  గెలిపించుకురాగలరా అనేది చాలా పెద్ద సందేహం గా కనిపిస్తోంది. ఎందుకంటే, నిన్ననే విజన్ డాక్యుమెంట్ ని కలిసి ఆవిష్కరించిన బీ జె పి , జన సేన కంబైన్ నేతలు , చాలా పెద్ద  దృశ్యాన్నే జనం ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వై ఎస్ ఆర్ సి పి, తెలుగుదేశం పార్టీ లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు గా ప్రకటించుకున్న ఈ ఐదుగురిదీ  వాస్తవానికి తలో దారీ.. ఎవరు , ఎప్పుడు, ఎందుకు, ఎలా మాట్లాడతారో తెలీని గందర గోళం ....  జి వి ఎల్ నరసింహ రావు ది అయితే సొంత రాజ్యాంగం, పూర్తిగా పార్టీ రాష్ట్ర శాఖ తో  గానీ, లేదా బీ జె పి లో ఉన్నతెలుగుదేశం మాజీ లతో  కానీ ఈయనకు ఎలాంటి సంబంధాలు ఉండవు.  రాష్ట్రాన్ని ఎప్పుడైనా పలకరించడానికి రుతు పవనాల మాదిరి అలా చుట్టపు చూపు గా వచ్చేసి ,  ఇలా మాయమైపోయే  జి వి ఎల్ వ్యవస్థ ల గురించి రాష్ట్ర బీ జె పి లో ఎవరికీ ఎలాంటి క్లూలు ఉండవు. ఈయన దారి రహదారి. ఈయన వ్యవస్థ ఇలాఉంటే, బీ జె పి లో ఉంటూ కూడా ఇంకాతెలుగు దేశం ఎజెండా , జెండా రెండూ మోస్తున్నట్టు కనిపించే సుజనా చౌదరి ఒక్క అమరావతి అంశం మీద తప్పించి, ఇతరత్రా ఏదీ మాట్లాడటానికి ఎక్కువగాఇష్టపడరు. జీ వీ ఎల్ కు, సుజనా కూ క్షణం పడదు. ఆయన ఎడ్డెం అంటే ఈయన తెడ్డెం అనే రకం.. ఏ మాత్రం పొసగని,పొంతన లేని పరస్పర భిన్నమైన అభిప్రాయాలు గల వీరిద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం మాదిరి ఒకే పార్టీ లో ఉంటూ కూడా కామన్  ఎజెండా తో పని చేసిన దాఖలాలు ఇప్పటివరకూ అయితే లేవు.   ఇహ, సి ఎం రమేష్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయన తన బిజినెస్ వ్యవహారాలను బీ జె పి తో ముడి కట్టేసి, ఏ పార్టీ లో ప్రయాణిస్తున్నాడో కూడా మర్చే పోయి, మొన్నటికి మొన్న పరిమళ్ నత్వాని ని జగన్ మోహన్ రెడ్డి దగ్గర ప్రవేశ పెట్టడం లో కీలక పాత్ర పోషించిన  ఘనుడు. గుర్తు చేస్తే కానీ తానూ బీ జె పి లో ఉన్నాననే విషయం గుర్తుండని ఈయన కు  బీ జె పి, జన సేన కలిసి పోటీ  చేస్తున్న విషయం తెలుసో లేదో అని కూడాపార్టీ శ్రేణులు గుసగుస లాడుకుంటున్నాయి.  ఇహ వీరందరినీ సమన్వయము చేసుకుని  ముందుకెళ్తున్నట్టు భావిస్తూ , బాహ్య ప్రపంచం ముందు ఆవిష్కృతమయ్యే  వ్యక్తి మరెవరో కాదు... సాక్షాత్తూ  రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. ఈయన, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణించటానికి అంతగాసుముఖం గా లేదు...కారణమేమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి యోధులతో పోరాడిన తన రాజకీయం , చివరకు ఇలా ఏ పూట ఎక్కడ ఉంటారో కూడా తెలీని పవన్ కళ్యాణ్ పార్టీతో కలిసి పని చేయాల్సిన దుస్థితికి దిగజారటమేమిటని  తరచూ తనలో తానె కుమిలి పోతున్నట్టు సమాచారం.  ఇహ, టీ జీ వెంకటేష్ అయితే మరీను..... రాయలసీమ నినాదాన్ని తన ట్యాగ్ లైన్ గాచేసుకుని కాలక్షేపం చేసేస్తూ... ప్రస్తుతానికి బీ జె పి లో నివసిస్తూ ....ఈ స్థానిక ఎన్నికల సమరం లో తన పాత్ర ఏమిటో కూడాతెలీకుండా జీవనం వెళ్లదీస్తున్నారు. మొత్తానికి ఈ పంచ పాండవులు స్థానిక సమరం లో తమ 'పంచ్ ' పవర్ ఏమిటో ఈ నెలాఖరు లోగా చుపిస్తారేమోననే బోలెడు , ఇంకా గంపెడాశతో బీ జె పి అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

ఏపీలో వంద కోట్ల దందా.. రియల్ క్రైమ్ స్టోరీ

సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన.. ఆ రియల్ స్టోరీ టైటిల్ వచ్చేసి.. "ఓ కిడ్నాప్, వంద కోట్ల స్కాం". 'నేనే రాజు నేనే మంత్రి' మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. మీరు ఏ పార్టీకి ఓటేసినా మేమే అధికారంలో ఉంటామని. అవును.. కొందరు రాజకీయ నాయకులు.. ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తే.. ఆ పార్టీలోకి జంప్ చేస్తారు. అలాగే అధికారులు కూడా.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలని కాకాపడుతూ వారి ఆటలు సాగిస్తుంటారు. ఈ రియల్ స్టోరీ వింటే అది నిజమని మీకే అర్ధమవుతుంది. కాకినాడలోని సర్పవరంకి చెందిన ఆకుల గోవిందరాజు అనే వ్యక్తికి భోగాపురంలో వంద కోట్ల విలువైన 18 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ ఒక్క విషయం చాలదా.. మాఫియా కన్ను ఆయన మీద పడటానికి. ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్న గద్దకి కింద ఉన్న కోడిపిల్ల కనిపించినట్టు.. మాఫియా వాళ్ళకి ఎక్కడున్నా విలువైన ల్యాండ్స్ కనిపిస్తాయి కదా. అలాగే, బలగ ప్రకాష్ అనే మాఫియా లీడర్ కి.. ఆకుల గోవిందరాజుకి చెందిన ల్యాండ్ పై కన్నుపడింది. ఇంకేముంది ఏకంగా పోలీసులనే రంగంలోకి దింపాడు. ఇక పోలీసులైతే ఓ అడుగు ముందుకేసి ఏకంగా కిడ్నాప్ కే తెరలేపారు. 2017.. సెప్టెంబర్ 19 .... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. మధ్యాహ్నానికి- సాయంత్రానికి నడుమ సూర్యుడు మండిపోతున్న సమయం... అబ్బా ఏమన్నా ముహూర్తమా... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. ఇదే కిడ్నాప్ కి సరైన ముహూర్తం అనుకున్నారేమో పోలీసులు... AP 30 AB 6655 నెంబర్ గల ఇన్నోవా కార్ లో.. పోలీసులు ఆకుల గోవిందరాజు ఇంటికి వచ్చారు. కారు నెంబర్ ఫ్యాన్సీగా ఉన్నా, ఆ ఖాకీలు చేసే పని మాత్రం ఏ మాత్రం పద్దతిగా లేదు. వాళ్ళు చేసే పనేంటో ఆ చుట్టుపక్కల ఉన్నవారికి తెలియదు. కొత్త మొహాలు కావడంతో.. చుట్టుపక్కల వారు కొందరు ఆశ్చర్యంతో, కొందరు అనుమానంతో చూస్తున్నారు. వాళ్ళు అలా చూస్తుండగానే.. దొంగల రూపంలో వచ్చిన పోలీసులు.. గోవిందరాజుని ఇన్నోవాలో పడేసి.. జెట్ స్పీడ్ లో హైవే ఎక్కారు. పోలీసుల భాషలో చెప్పాలంటే దీనినే కిడ్నాప్ అంటారు. కారు హైవే మీద దూసుకెళ్తుంది. ఆ స్పీడ్ చూస్తే.. అంబులెన్స్ డ్రైవర్ కావాల్సిన వ్యక్తి ఇన్నోవా డ్రైవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. డ్రైవర్ స్టీరింగ్ పట్టుకుంటే.. మనం ఖాళీగా ఉండి ఏం చేస్తాం అనుకున్నారేమో.. మిగతా పోలీసులు గోవిందరాజు పనిపెట్టారు. కారు.. కాకినాడ నుంచి భోగాపురం చేరేవరకు.. అంటే దాదాపు నాలుగు గంటల పాటు... గోవిందరాజుని భయపెట్టారు.. బెదిరించారు.. చిత్రహింసలు పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే నరకం చూపించారు. కారు సాయంత్రం 6 గంటలకు భోగాపురం సబ్ రిజిస్టార్ ఆఫీస్ కి చేరుకుంది. ఖాకీలకు భయపడ్డాడో, కాసులకు కక్కుర్తి పడ్డాడో తెలియదు కానీ.. సబ్ రిజిస్టార్ పందిళ్లపల్లి రామకృష్ణ.. సాయంత్రం 4:30 కే రిజిస్ట్రేషన్ కాగితాలు సిద్ధం చేసి.. పదేళ్ల తర్వాత ఫారెన్ నుంచి రిటర్న్ వస్తున్న ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నట్టు.. గుమ్మం వైపు చూస్తూ పోలీసుల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో పోలీసులు గోవిందరాజుని తీసుకొని గుమ్మంలోకి అడుగు పెట్టనే పెట్టారు. గుమ్మంలో వాళ్ళ అడుగు పడిందో లేదో.. సబ్ రిజిస్టార్ మోహంలో వెలుగు వచ్చింది. గోవిందరాజు మోహంలో భయం పెరిగింది. భయంతో చూస్తుండగా ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్న మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనిపించాడు. జర్నీలో పోలీసుల చిత్రహింసలతో భయపడిపోయిన గోవిందరాజు.. బలగ ప్రకాష్ ని చూసి మరింత భయపడ్డాడు. బలగ ప్రకాష్.. పోలీసుల మాదిరి సాగదియ్యలేదు.. కమర్షియల్ సినిమాల్లో విలన్ లాగా ఒక్కటే డైలాగ్ కొట్టాడు.. "సంతకం పెడతావా? సమాధిలో పడుకుంటావా?".... ఆ ఒక్క డైలాగ్ తో గోవిందరాజు భయం చావుభయంగా మారిపోయింది. ఎదురుగా మాఫియా లీడర్.. చుట్టూ భోగాపురం సీఐ నర్సింహారావు, ఎస్సైలు తారక్, మహేష్.. హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు.. ఉన్నారు. ఎస్సైల పేర్లు తారక్, మహేష్ అని హీరోల పేర్లు ఉన్నాయి కానీ.. వాళ్ళ బిహేవియర్ మాత్రం పెద్ద విలన్ల పక్కన ఉండే చెంచా విలన్లు లాగా ఉంది. అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులే.. మాఫియా లీడర్ తో కలిసిపోయి.. చిత్రహింసలు చేసి బెదిరిస్తుంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో, వంద కోట్లు కంటే విలువైన ప్రాణం కోసం, అన్యాయం ముందు తలవంచి గోవిందరాజు సంతకం పెట్టాడు. ఆ ఒక్క సంతకంతో.. గోవిందరాజు మొహంలో తప్ప.. అక్కడున్న అందరి మొహాల్లో లక్ష్మీకళ ఉట్టిపడింది. అన్నట్టు ఇంత జరుగుతున్నా అక్కడ ఇతరులు ఎవరూ లేరా? అని మీకు అనుమానం రావొచ్చు. అక్కడ నిజంగానే ఎవరూ లేరు.. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ముహూర్తం అలాంటిది మరి. శూన్యమాసం-అమావాస్య.. బుద్ధి ఉన్నోడు ఎవడైనా రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాడా? వీళ్లంటే.. వంద కోట్ల కబ్జా ల్యాండ్ కాబట్టి.. బుద్ధిని పక్కనపెట్టి.. బెదిరించి.. రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. ఇప్పుడు అర్థమైందా వాళ్ళ శూన్యమాసం-అమావాస్య కాన్సెప్ట్ ఏంటో?!!.. ఈ కిడ్నాప్- కబ్జా వ్యవహారంపై.. సర్పవరం పోలీస్ స్టేషన్ లో 330/217 నెంబర్ తో కేస్ రిజిస్టర్ అయింది. అదేంటో.. FIR కూడా అయిన తరువాత.. చార్జిషీట్ దాఖలు చేయడానికి.. రాజమౌళి RRR చేయడానికి తీసుకునే టైం కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు సర్పవరం పోలీసులు. రెండున్నరేళ్లుగా నాన్చుతూనే ఉన్నారు. ఈ విషయం గురించి.. ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కాకినాడ పోలీసులు రిపోర్ట్ కూడా పంపారు. కానీ చార్జిషీట్ దాఖలు చేసే విషయంలో సర్పవరం సీఐ డిలే చేస్తూనే ఉన్నాడు. ఏంటి ఆ సీఐ ధైర్యం?.. భయపడితే భయపడటానికి ఆయన పోస్ట్ మ్యాన్ కాదు.. పోలీసోడు.. దానికితోడు పొలిటిషీయన్స్ సపోర్ట్ ఉన్నోడు. అవును.. ఈ వ్యవహారంలో.. బడా పొలిటిషీయన్స్ సపోర్ట్ కూడా ఉంది. అదే పోలీసుల ధైర్యం... శ్రీకాకుళం జిల్లాకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత.. అలాగే గత ప్రభుత్వ హయాంలో విప్ గా పనిచేసిన నేత.. వీరిద్దరి సాయంతో సర్పవరం పోలీస్ స్టేషన్ ని ఫుల్ గా influence చేసే ప్రయత్నం బలంగా నడుస్తుంది. అందుకే చార్జిషీట్ కి మోక్షం కలగట్లేదు. ఇంత పెద్ద కిడ్నాప్- కబ్జా జరిగితే అస్సలు చర్యలే తీసుకోకుండా ఎలా ఉన్నారని అనుకుంటున్నారేమో... అబ్బో చాలా పెద్ద చర్య తీసుకున్నారు. భోగాపురం ఇన్స్పెక్టర్ ని బదిలీ చేసారు. అదేంటి!!.. అంత జరిగితే కేవలం బదిలీనా అనుకోవద్దు.. రాజకీయ ఒత్తిళ్లు అలాంటివి మరి.. అర్థంచేసుకోవాలి... ఇంకో విషయం ఏంటంటే.. ఈ వ్యవహారం డీజీపీ ఆఫీస్ కి కూడా చేరింది. మరి ఇంకేంటి.. వెంటనే అందరి మీద చర్యలు తీసుకొని ఉంటారుగా అంటారా? అబ్బో.. మీరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాలు చూసి బాగా మోసపోయారు... అలాంటి పప్పులు ఇక్కడ ఉడకవు. వాస్తవానికైతే... CRPC 41A కింద డీజీపీ నియమించే ఓ సీనియర్ అధికారి.. విచారణ జరిపి.. తదుపరి చర్యల వరకు.. ఆ సీఐని సస్పెండ్ చేసే అవకాశముంది. కానీ ఇక్కడ అలాంటిదేం జరగలేదు. ఏదో ఫార్మాలిటీకి బదిలీతో సరిపెట్టారు. గోవిందరాజు ని బెదిరించి వంద కోట్ల విలువైన ల్యాండ్ అన్యాయంగా లాక్కున్నారు. అయినా తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. పైగా గోవిందరాజునే ఇంకా టార్చర్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లలో భాగంగా.. ప్రస్తుత సర్పవరం సీఐ మరియు అర్బన్ డీఎస్పీ.. గోవిందరాజుని పదేపదే తిప్పించుకుంటున్నారు. ఇక కాకినాడలో ఉద్యోగం వెలగపెడుతున్న.. ఇప్పటి ఓ మంత్రిగారి బావమరిది.. రంగంలోకి దిగడంతో ఈ కేసు మరింత డైల్యూట్ అయింది. అసలే భోగాపురంలో ఎయిర్ పోర్ట్ అంటున్నారు. రెక్కలున్న విమానాలు వస్తున్నాయి అంటే.. ఆటోమేటిక్ గా భూముల ధరలకు రెక్కలొస్తాయి కదా.. అందుకే పోలీసులు- పొలిటీషియన్స్ అండతో మాఫియా ఇంతలా రెచ్చిపోతుంది. అంతేకాదు.. ఈ వ్యవహారం వెనుక.. 2017 ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనిచేసిన ఓ కలెక్టర్ మరియు ఎస్పీ పాత్ర ఉన్నట్టు.. సెక్రటేరియట్ వర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. టీడీపీ పెద్దతలకాయలకు సన్నిహితులైన ఈ ఐఏఎస్, ఐపీఎస్ లు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా తమ హవా కొనసాగించడం... అందరినీ ముక్కు, మూతి ఇలా అన్నింటి మీదా వేలేసుకునేలా చేస్తుంది. ఇంతకీ ఆ ఐఏఎస్ & ఐపీఎస్ ఎవరు? * ఒకరు.. పరుల అవినీతి మీద కాంతివంతంగా దండెత్తే ఐఏఎస్... * ఇంకొకరు.. పొద్దునలేస్తే సుభాషితాలు చెప్పే పాలమీగడ లాంటి ఐపీఎస్.. ఈయనకి టెక్నాలజీ మీద గ్రిప్ బాగా ఎక్కువ. ఈ వ్యవహారంలో వీరిద్దరి పాత్ర కూడా ప్రముఖంగా ఉంది. 'వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కూలిపోతుంది' అన్నట్టు.. ఈ అవినీతి రాబందులను భయపెట్టే గాలివాన ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనుసన్నల్లో.. ఐఏఎస్, ఐపీఎస్లు, పోలీసులు, పొలిటీషియన్స్ అండతో జరిగిన ఈ అన్యాయంపై.. గోవిందరాజు కొద్ది నెలలుగా పోరాడుతూనే ఉన్నాడు. న్యాయం కోసం ఆయన ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదు. సన్నిహితుల సాయంతో న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఆ పోరాడంతో కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి అప్పుడు జరిగింది తప్పుడు రిజిస్ట్రేషన్ అని పేర్కొంటూ... భోగాపురం రిజిస్టార్ డాక్యుమెంట్ రైటర్.. 2019 అక్టోబర్ 19 తేదీన.. 164 CRPC స్టేట్మెంట్ ని.. కాకినాడ ఫస్ట్ అడిషనల్ జ్యూడిషల్ సివిల్ జడ్జ్.. ముందట ఇచ్చాడు. అంతేకాదు.. సీసీ కెమెరాలతో దొంగలని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల పుణ్యమా అని అడ్డంగా బుక్ అయ్యారు. సర్పవరం లో కిడ్నాప్ చేసి.. భోగాపురం తీసుకెళ్లిన.. నాలుగు గంటల తతంగమంతా.. పలు చోట్ల సీసీ కెమెరాలలో రికార్డు అయింది. క్షవరం అయితే కానీ ఇవరం రాదని.. సీసీ కెమెరాలు చూసి దోషులని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల సంగతి మర్చిపోయి ఇలా దొరికిపోవడం కామెడీగా ఉంది. మొత్తానికి కొద్దికొద్దిగా కదులుతున్న తీగతో.. దందా చేసి ఇన్నాళ్లు డొంకలో దాక్కున్నవారు.. ఇప్పుడిప్పుడే భయంతో వణుకుతున్నారు. ముఖ్యంగా డీజీపీకి కంప్లైంట్ వెళ్లడంతో ఐఏఎస్, ఐపీఎస్ ఒణికిపోతున్నారట. మరి ముఖ్యంగా ఆ ఐపీఎస్ అయితే.. డైపర్ వేసుకొని తిరుగుతున్నాడని టాక్... ఇప్పటికే ఆ ఐపీఎస్ గడిచిన రెండు నెలల్లో.. బలగ ప్రకాష్ టీం తో.. ఒకే హోటల్ లో 17 సార్లు సిట్టింగ్ వేశాడు. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు ఆ ఐపీఎస్ ఎంతలా వణికిపోతున్నాడో!! తప్పుని సరిదిద్దాల్సిన పోలీసులే.. ఇంత పెద్ద తప్పు చేశారు. ఈ విషయం డీజీపీ దృష్టికి కూడా వెళ్ళింది. మరి ఆయన ఈ కిడ్నాప్-కబ్జా వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?.. బాధితుడికి ఎప్పుడు న్యాయం చేస్తారు? ఆయన ఇలాగే మౌనంగా ఉంటే ప్రజలకు పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది. ఇక ఈ విషయంలో సర్కార్ కూడా అడుగు ముందుకేసి బాధితుడికి న్యాయం చేయాల్సిన అవసరముంది. అవినీతి రహిత పాలనే అందించడమే తమ లక్ష్యమని చెప్పుకునే అధికారపార్టీ.. అవినీతి-అన్యాయం చేసిన వారికి.. పరోక్షంగా అండగా ఉండటం ఎంత వరకు కరెక్ట్? గత ప్రభుత్వం మీద, అప్పుడు వారికి సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులపైనా.. ఇప్పటి అధికారపార్టీ నేతలు పదేపదే అవినీతి ఆరోపణలు చేస్తుంటారు. మరి ఈ వ్యవహారం మీద ఎందుకు నోరు మెదపడం లేదు? ఇందులో తమ పార్టీ నేతలు కూడా ఉన్నారా? లేక పార్టీ సీనియర్ నేతైన మంత్రి గారి బావమరిది ఇన్వాల్వ్ అయ్యాడని వెనకడుగు వేస్తున్నారా? ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ఈ భోగాపురం భాగోతం వెనుకున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి.. బాధితుడికి న్యాయం చేయాలి. లేదంటే ప్రభుత్వం మీద కూడా నమ్మకం పోతుంది.  

క‌విత‌, ష‌ర్మిలా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?

తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్‌లో పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్‌ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.  సామాజిక కోణంలో తమకు అవకాశం దక్కుతుందని పలువురు సీనియర్లు భావిస్తుండగా, ఇప్పటివరకు పార్టీ తరఫున రాజ్యసభ పదవులు దక్కని వర్గాల వారూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవితను ఈసారి పార్టీ తరఫున రాజ్యసభకు పంపిస్తార‌నే ప్ర‌చారం విస్తృతంగా జరుగుతోంది. అయితే సి.ఎం. కేసీఆర్ ఆలోచ‌నే ఎలా వుందో ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. కెటిఆర్ సి.ఎం. అవుతారా? క‌వితా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?  అయితే హ‌రిష్‌రావు ఈ ప‌రిణామాల‌పై ఎలా స్పందిస్తారు? అనే అంశంపై టిఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్‌ తన తరఫున ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రయత్నాలకు నమ్మకమైన వారి కోసం అన్వేషిస్తున్నారు.  రాజ్యసభ సీటు భర్తీ సామాజిక కోణంలోనే ఉంటుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు భావిస్తున్నారు. ఏపీ కోటాలో పదవీ విరమణ చేస్తున్న టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు వయసు రీత్యా ఈసారి అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. రెడ్లకు అవకాశం లభిస్తే, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, మాజీీ స్పీకర్‌ కె.ఆర్‌.సురే్‌షరెడ్డి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి మధ్య పోటీ ఉంటుందని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మండవ వెంకటేశ్వరావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని అంటున్నారు. బీసీలకు అవకాశం ఇస్తే సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య పేర్లు పరిశీలిస్తారని చెబుతున్నారు. ఎస్సీ కోటాలో భర్తీ చేయాలని భావిస్తే కడియం శ్రీహరి, మాజీ ఎంపీ మంద జగన్నాథం పేర్లు పరిశీలిస్తారని అంటున్నారు. ఎస్సీల్లోనే మాలలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే, టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ గాదరి బాలమల్లు, ఎస్టీ అయితే సీతారాంనాయక్‌ పేరు ఉండొచ్చని అంటున్నారు. అనూహ్యంగా ఒక పారిశ్రామికవేత్తను టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభకు పంపాలని అనుకుంటే హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి పేరు పరిశీలించవచ్చని చెబుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ స్థానాలు ఎవరికీ కేటాయించాలని ఇన్నాళ్లు చర్చించిన అధికార పార్టీ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారి జాబితా సిద్ధమైనట్టు సమాచారం.  కీలకమైన పదవులు కావడంతో పార్టీ నమ్ముకున్నోళ్లు.. తమకు అండగా నిలబడిన వ్యక్తులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది.  మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి - సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీమంత్రి - ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితా ఫైనలైనట్టు తెలుస్తోంది.  షర్మిల ఆపద సమయంలో జ‌గ‌న్‌కు తోడుగా నిలిచారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేశారు. కష్టకాలంలో పార్టీకి షర్మిల పెద్ద దిక్కుగా నిలిచారు. తన సొంత మీడియా సాక్షి ప్రారంభించినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ తో ఉన్నారు. సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ గా కొనసాగుతూనే జగన్ కు రాజకీయాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత సజ్జలను పార్టీలోకి ఆహ్వానించి పెద్ద పదవే ఇచ్చారు. విజయ సాయిరెడ్డి తర్వాత జగన్ కు అత్యంత నమ్మకస్తుడు సజ్జలనే. ఆయన పార్టీలో జగన్ రాజకీయ సలహాదారుడిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో పని చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ తన తోడు ఉండడంతో ఆయనను రాజ్యసభకు జగన్ పంపించనున్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. గతంలో ప్రకాశం ఎంపీగా సుబ్బారెడ్డి పని చేశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సుబ్బారెడ్డి పోటీ చేయలేదు. అప్పుడు ఆయన పదవులు ఆశించకపోవడంతో ఇప్పుడు రాజ్యసభకు పంపించాలని నిర్ణయానికి వచ్చారు. పార్టీలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపితే న్యాయం జరుగుతుందనే భావనలో జగన్ ఉన్నారంట. అనూహ్యంగా రాజ్యసభకు పంపే జాబితాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి ఉండడం గమనార్హం. అనంతపురము జిల్లాకు చెందిన రఘువీరారెడ్డికి పిలిచి మరి రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. యాదవ సామాజికి వర్గానికి చెందిన రఘువీరారెడ్డి జగన్ తండ్రి వైఎస్సార్ తో మంచి అనుబంధం ఉంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే మరొకరిని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిగా పని చేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారంట.  కృష్ణాజిల్లా యాదవ సామాజిక వర్గానికి చెందిన చలమేశ్వర్ సేవలను వినియోగించుకునేలా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందంట. ఎందుకంటే తరచూ జగన్ న్యాయస్థానాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నారు. చలమేశ్వర్ సేవలు వినియోగించుకుంటే జగన్ సేఫ్ గా ఉండడంతో పాటు న్యాయ కోవిదుడికి గౌరవంగా రాజ్యసభను ఇద్దామనే ఆలోచనలో ఉన్నారంట.

అధికారంలో ఉంటే ఒకలా... ప్రతిపక్షంలో ఉంటే మరోలా... వైజాగ్ ఎపిసోడ్ నీతి ఏంటి?

రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా, అనామకులుగా మారిపోయారు. దశాబ్దాల తరబడి రాజ్యాన్ని ఏలినవారు, ఇప్పుడు సైడైపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఉద్దండుల పరిస్థితి ఇప్పుడలాగే కనిపిస్తోంది. ఎంతోమంది ముఖ్యనేతలు తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మళ్లీ వాళ్లకు మంచి రోజులు వస్తాయని మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ ఊహించని రాజకీయ మార్పులు జరగడంతో ఓడలు బళ్లు... బళ్లు ఓడలయ్యాయి.  అయితే, అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలా ఉంటే మరోలా వ్యవహరించడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. విపక్ష నేతగా ఉన్న సందర్భాల్లో నేతలు వ్యవహరించే తీరు ఒక్కోసారి సాధారణ ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది. నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ క్రితం విపక్ష నేతగా ఉన్నారు. అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా కోసం పట్టుదలతో ఉన్నారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు వైజాగ్ పర్యటనకు వెళ్లారు. అప్పటికే అక్కడ సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరుగుతోంది. ఆ నేపథ్యంలో క్యాండిల్ ర్యాలీకి అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. అయినా కూడా జగన్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి నగరంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక, ఇప్పడు ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. అందులో భాగంగా చంద్రబాబు చేపట్టిన వైజాగ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందులో పోలీసులను తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అయితే, ఇలాంటి సమయంలో విపక్ష నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా పోలీసు వలయాన్ని ఛేదించుకోవాలని తాము అనుకున్నది చేయాలని చూస్తుంటారు. పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తుంటారు. చంద్రబాబు వైజాగ్ టూర్లోనూ అదే జరిగిందనే మాట వినిపిస్తోంది. నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. కాకపోతే...ఆ ప్రయత్నాలు సమాజంలో ఉద్రిక్తతలు పెంచేవిగా మాత్రం ఉండకూడదంటున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్న నాయకులు ప్రజాస్వామ్యంలో విపక్షాలకు ఉండే ప్రాధాన్యాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. అధికారపక్షం, విపక్షం....రెండూ ప్రజాస్వామ్యానికి రెండు చక్రాల్లాంటివని, ఏ ఒక్కటి సరిగా లేకున్నా ప్రజాస్వామ్యం కుంటుపడుతుందని గుర్తుచేస్తున్నారు.

రాజీవ్ గాంధీ మరణించాక ఆ సీక్రెట్ బయటపెట్టిన వాజపేయి!!

అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు హద్దు మీరి విమర్శలు చేసుకోవడమే తప్ప.. విలువైన రాజకీయాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజుల్లో. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నేతల మీద కక్ష తీచుకోవాలన్న ధోరణే తప్ప.. ప్రజల కోసం ఒకరి సూచనలను ఒకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేసేవారు ఎక్కడున్నారు?. ఈతరం రాజకీయ నాయకులు ముందుతరం వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ- వాజపేయి మధ్య జరిగిన ఓ సంఘటన తెలిస్తే.. ఈ తరం రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటారు. అది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయం. అప్పుడు వాజపేయి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారి మధ్య జరిగిన ఓ అపురూప సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  " సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట ".. ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.." ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి "మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం.. ఏర్పాట్లు చూడండి" అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు అటల్జీ ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి. " సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా?" నసిగాడు కార్యదర్శి వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ "నిక్షేపంగా" అన్నారు. ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ, అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు. "సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి?" అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా.. అదీ ఆయన మాటల్లోనే.. "1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా.1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది. డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు. ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా రమ్మని ఫోన్ లో కోరారు. కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ.. 'అటల్ జీ.. ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి' అని చెప్పారు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే. నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే" అని వాజపేయి అన్నారు. అది విలువలతో కూడిన రాజకీయమంటే. రాజీవ్ గాంధీ, వాజపేయి రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేశారు. వారిని చూసి ఈ తరం రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలి. పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అధికార-ప్రతిపక్ష పార్టీల నాయకులు.. రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం.. ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు..!

ఎలా స్పందిస్తారో మీ ఇష్టం!

అనగనగా ఓ అమ్మాయి. ఆ అమ్మాయికి చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి నిబ్బరంగా సంసారాన్ని నెట్టుకొస్తూ ఉంది. కానీ కూతురు మాత్రం ప్రతి చిన్న కష్టానికీ కంగారుపడిపోయేది. ఏం చేయాలో పాలుపోక తెగ బాధపడిపోయేది. ‘ఇక ఈ కష్టాలను భరించడం నా వల్ల కాదమ్మా!’ అని ఓ రోజు తన తల్లితో తెగేసి చెప్పింది కూతురు. తల్లి, కూతరి వంక ఒక్క నిమిషం చూసింది. ఆ తరువాత మారుమాట్లాడకుండా ఆమెను వంటింట్లోకి తీసుకువెళ్లింది. తల్లి తనకేం చెప్పాలనుకుందో తెలియని అయోమయంలో కూతురు ఆమెను అనుసరించింది.   వంటింట్లోకి వెళ్లిన తల్లి ఒక మూడు పాత్రలు తీసుకుంది. ఒకదానిలో బంగాళదుంప, మరోదానిలో కోడిగుడ్డు, ఇంకోదానిలో కాఫీ గింజలు వేసి వాటిని పొయ్యి మీద పెట్టింది. తల్లి చేస్తున్న పని చాలా అసంబద్ధంగా తోచింది కూతురికి. అయినా మారు మాటాడకుండా చూస్తూ నిల్చొంది. ఒక పది నిమిషాలు అయిన తరువాత... ‘ఒకో గిన్నెలో ఏం జరిగిందో గమనించు’ అంటూ అడిగింది తల్లి. ‘గమనించడానికి ఏముంది! బంగాళదుంప వేడి నీటికి మెత్తబడిపోతుంది. కోడిగుడ్డు గట్టిపడిపోతుంది. కాఫీ గింజలతో కాఫీ తయారవుతుంది’ అంది కూతురు ఎగతాళిగా. ‘కదా! పైకి గట్టిగా కనిపించే బంగాళదుంప కాస్త వేడినీరు తగలగానే ఇట్టే మెత్తబడిపోయింది. చేయి తగిలితే చాలు చితికిపోయే కోడిగుడ్డేమో వేడినీటికి గట్టిపడిపోయింది. ఇక కాఫీ గింజలు మాత్రం తన చుట్టూ ఉన్న నీటిని తన ఉనికితో నింపేశాయి,’ అని చెప్పుకొచ్చింది తల్లి. తల్లి చేసిన వింత చేష్ట వెనుక ఏదో మంచిమాట దాగి ఉంటుందని అప్పటికి అర్థమైంది కూతురికి.   ‘మనం కూడా ఇంతే! అప్పటివరకూ ధైర్యంగా ఉన్నవారు కూడా కష్టాలు రాగానే ఇట్టే డీలా పడిపోతారు.. ఆ బంగాళదుంపలా. మరికొందరేమో కష్టాలు ఎదురయ్యేసరికి మొద్దుబారిపోతారు. అప్పటివరకూ సున్నితంగా ఉన్నవారు కూడా రాయిలా మారిపోతారు- కోడిగుడ్డులా. కానీ చాలా కొద్ది మంది మాత్రమే కష్టాలకు ఎదురీదుతారు. ఆ కష్టాలను సైతం తనకు అనుకూలంగా మార్చుకుంటారు. వాళ్ల స్వభావంతో, వారి చుట్టూ ఉన్న వాతావరణమే పూర్తిగా మారిపోతుంది... కాఫీ గింజల్లాగా! ఇప్పుడు చెప్పు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు?’ అని అడిగింది తల్లి. కూతురు మారు మాట్లాడకుండా చిరునవ్వుతో కాఫీని ఒక రెండు కప్పుల్లోకి సర్ది, ఒకదాన్ని తన తల్లికి అందించింది. మరోదాన్ని తను ఆస్వాదించేందుకు సిద్ధపడింది... జీవితాంతం!   - నిర్జర.

మంచి పాస్‌వర్డ్‌ కోసం 10 చిట్కాలు

ఇవాళ రేపట్లో కంప్యూటర్లో ఏదో ఒక అకౌంట్‌ లేకుండా పూట గడవడం లేదు. అది ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ కావచ్చు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ కావచ్చు... ఏదీ కాకపోయినా కనీసం ఈ-మెయిల్‌ అకౌంటన్నా కావచ్చు. వీటన్నింటికీ మంచి పాస్‌వర్డుని ఎంచుకోవడం ఒక సమస్యే! ఆ మన దగ్గరే ఏముందిలే నష్టపోయేందుకు అనుకోవడానికి కూడా లేదు. మన వ్యక్తిగత సమాచారాన్నీ, ఫైళ్లని తస్కరించడం దగ్గర్నుంచీ... మన కాంటాక్ట్‌ లిస్టులో ఉండేవారి మెయిల్స్‌కు తప్పుడు మెయిల్స్‌ పంపడం వరకూ హ్యాకర్లు దేనికైనా తెగించగలరు. ఎవరిపడితే వారి పాస్‌వర్డులను ఛేదించేందుకు ప్రత్యేకమైన సాఫ్టవేర్లు అందుబాటులో ఉన్నాయంటే నమ్మగలరా! అందుకే అలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ఈ చిట్కాలు-   1- చిన్నపాటి పాస్‌వర్డులకు కాలం చెల్లిపోయింది. మీ పాస్‌వర్డు కనీసం 10 అక్షరాలకు పైనే ఉండాలంటున్నారు నిపుణులు. ఇక మరీ జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భాలలో కనీసం 12 నుంచి 14 అక్షరాలు ఉండాలని సూచిస్తున్నారు.   2- పాస్‌వర్డులో కేవలం అక్షరాలే ఉంటే సరిపోదన్నది అందరికీ తెలిసిందే! అంకెలు, అంకెల దిగువున ఉండే సింబల్స్, క్యాపిటల్‌ లెటర్స్‌, స్మాల్‌ లెటర్స్ ఇలా కీబోర్డు మీద టైప్‌ చేయదగిన అన్ని రకాల సంకేతాలనీ వాడాల్సిందే!   3- మీకు సంబంధించిన వ్యక్తిగతమైన వివరాలని (ఉదా॥ పుట్టినరోజు, భార్యపేరు) పాస్‌వర్డులో ఉంచితే పాస్‌వర్డుని ఛేదించడం సులువైపోతుంది. అందుకే మీకు బాగా గుర్తుండి, మీ చుట్టుపక్కల వారికి ఏమాత్రం అవగాహన లేని (ఉదా॥ తల్లి తరఫు ఇంటి పేరు, పిల్లలకి పురుడు పోసిన డాక్టరు పేరు) పాస్‌వర్డులను ఎంచుకోవాలి.       4- నిఘంటువులో కనిపించే పదాలను (ఉదా॥ house, system, daughter) ఎట్టిపరిస్థితుల్లోనూ పాస్‌వర్డుగా ఉంచకూడదు. వీటిని పాస్‌వర్డు తస్కరించే సాఫ్టవేర్లు పసిగట్టేస్తాయి. My wife, happy home వంటి రోజువారీ వాక్యాలను కూడా ఇవి పట్టేస్తాయి.   5- చాలామంది బలమైన పాస్‌వర్డునే ఎంచుకొంటారు. కానీ పాస్‌వర్డు మర్చిపోయినప్పుడు కంప్యూటర్‌ అడిగే ప్రశ్నలకు గాను చాలా తేలికైనవి ఎంచుకొంటారు. ఫలితంగా ఎవరైనా సదరు ప్రశ్నలకు జవాబు చెప్పి మీ అకౌంటులోకి ప్రవేశించే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.       6- మనసులో ఏదో ఒక వాక్యాన్ని అనుకొని అందులోని పదాల తొలి అక్షరాలతో పాస్‌వర్డుని ఏర్పాటు చేసుకోవడం ఒక మంచి పద్ధతి. ఉదా॥ My Son was born on 14th January 2000 అన్న వాక్యాన్ని గుర్తుంచుకోవడం చాలా తేలిక. దీని ఆధారంగా MSWBO1422000 అన్న పాస్‌వర్డుని సృష్టించుకోవచ్చు.   7- వేర్వేరు అకౌంట్లకి ఒకటే పాస్‌వర్డుని ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదన్నది నిపుణులు హెచ్చరిక. ఒకవేళ అలా వాడాల్సి వచ్చినా, తప్పనిసరిగా అందులో ఎంతో కొంత మార్పు చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు పైన ఎంచుకొన్న MSWBO1422000 పాస్‌వర్డుని AMAZONకి కూడా వాడాలనుకుంటే MSWBO-amaze-1422000 అంటూ పాస్‌వర్డుకి తగిన మార్పు చేయవచ్చు.       8- బ్యాంకింగ్‌ వంటి ఆర్థికపరమైన, గోప్యమైన లావాదేవీలు జరిపే ఖాతాలకి చెందిన పాస్‌వర్డుల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. వీటిని తరచూ మారుస్తూ ఉండటం, మరే ఇతర పాస్‌వర్డులతో సంబంధం లేకుండా ఉంచడం అవసరం. ఇందుకోసం ఎలాంటి అనుమానం రాని పాస్‌వర్డులు కావాలనుకుంటే ఆన్‌లైన్లో http://passwordsgenerator.net/ వంటి సైట్లు ఉచితంగా క్లిష్టమైన పాస్‌వర్డులను అందిస్తాయి.   9- ఎట్టి పరిస్థితులలోనూ పాస్‌వర్డుని బయటవారితో పంచుకోకూడదు. ఇవాళ ఉన్న బంధం రేపు ఉంటుందని చెప్పలేం కదా! ఒకవేళ అలా ఎవరితోనన్నా పాస్‌వర్డుని పంచుకోవల్సిన సందర్భం వచ్చినా, ఎవరికన్నా పాస్‌వర్డు తెలిసిపోయిందన్న అనుమానం కలిగినా... వెంటనే దానిని మార్చివేయడం మంచింది.    10- ఈ రోజుల్లో పది రకాల ఖాతాలకు పది రకాల పాస్‌వర్డులు కావాల్సి వస్తోంది. పైగా అవి క్లిష్టంగా ఉండాలన్న నియమం ఎలాగూ ఉంది. దీంతో తరచూ ఏదో ఒక పాస్‌వర్డుని మర్చిపోవడం అతి సహజం. ఇందుకోసం వీటిని వీటిని ఎక్కడన్నా భద్రమైన చోట రాసి ఉంచుకోవడంలో తప్పులేదు. అయితే అలా రాసి ఉంచుకున్న కాగితాన్ని నిర్లక్ష్యంగా ఉంచితే మాత్రం అసలుకే ఎసరు తప్పదు! - నిర్జర.

అందుకే స్నేహితుడు కావాలి!

అదో పెద్ద అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులు. వాటిలో సహజంగానే ఓ సింహమూ, ఓ జింకా ఉన్నాయి. ఒక రోజు ఆ సింహం జింకని చూడనే చూసింది. వెంటనే దాన్ని వేటాడేందుకు వెంటపడింది. సింహం నుంచి తప్పించుకోవడానికి జింక చాలా ప్రయత్నమే చేసింది. దాని నుంచి పరిగెడుతూ పరిగెడుతూ పొరపాటున ఒక చెరువులోకి పడిపోయింది. దాన్ని తరుముతూ సింహం కూడా చెరువులోకి దూకేసింది. ఆ చెరువు నిండా నీళ్లున్నా బాగుండేది. కానీ కరువుతో చెరువు సగానికి ఎండిపోయింది. బురదతో నిండిపోయింది. ఆ బురదలో ఒక పక్క జింక, మరోపక్క సింహం మోకాళ్ల లోతు వరకు కూరుకుపోయాయి. ‘‘హహ్హా! ఇంక నేను నీ వెనుక పరిగెత్తాల్సిన పని లేదు. ఈ బురదలో చిక్కుకున్న నీ ఎముకలు విరిచి, నీ లేత మాంసాన్ని రుచిచూస్తాను,’’ అంటూ నవ్వింది సింహం.   ‘‘నా మాంసపు రుచి తర్వాత. ముందు నువ్వు ఇక్కడి నుంచి ఎలా బయటపడగలవో ఆలోచించు,’’ అంటూ వెక్కిరించింది జింక. జింక మాటలకి కోపంగా సింహం ముందుకు కదలబోయింది. కానీ అది ఎంతగా కదులుతుంటే అంతగా బురదలో దిగబడిపోతోంది. ‘‘నిజమే నేను కదల్లేకపోతున్నాను. ఇప్పుడెలా!’’ అని బిక్కమొగం వేసింది సింహం. ‘‘నీకు ఎవరన్నా స్నేహితులు ఉన్నారా?’’ అని తాపీగా అడిగింది జింక.   ‘‘నేను ఈ అడవికి రాజుని. అంతా నన్ను చూసి భయపడేవాళ్లే కానీ స్నేహితులు ఎక్కడ ఉంటారు. నాకు బానిసలు, శత్రువులే కానీ స్నేహితులు ఉండరు,’’ అని గర్వంగా చెప్పింది సింహం. ‘‘కానీ నాకైతే చాలామంది స్నేహితులు ఉన్నారు. మేమంతా కలిసిమెలిసి ఉంటాం. నేను కనిపించకపోయేసరికి వాళ్లంతా నన్ను వెతుక్కుంటూ వస్తారు. ఎలాగైనా నన్ను రక్షిస్తారు,’’ అని నమ్మకంగా చెప్పింది జింక. ‘‘సరే! అదీ చూద్దాం... ’’ అని ధీమాగా అంది సింహం. ఆ బురద చెరువులో కాలం చాలా భారంగా గడిచింది. ఒకో గంటా గడిచెకొద్దీ సింహంలో అసహనం పెరిగిపోయింది. కానీ జింక మాత్రం నిశ్చింతగానే ఉంది. తన స్నేహితులు వస్తారనే నమ్మకం తనలో ఇసుమంతైనా తగ్గలేదు.   సాయంత్రం అయ్యింది. నిదానంగా చీకటి పడింది. అసలే ఆకలితో ఉన్న సింహం డీలాపడిపోయింది. కానీ తన స్నేహితుల మీద ఉన్న నమ్మకంతో జింక మాత్రం నిబ్బరంగా నిలబడి ఉంది. ఇంతలో.... చెట్ల చాటు నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. ముందు ఓ జింక పిల్ల చెరువువైపు తొంగిచూసింది. ఆ తర్వాత మరో జింక, దాని వెనుక ఇంకో జింక.... వరుస పెట్టి ఓ జింకల మంద చెరువుగట్టుకి చేరింది. వాటికి అక్కడి పరిస్థితి చిటికెలో అర్థమైపోయింది. ఎలాగొలా తన నేస్తాన్ని రక్షించుకోవాలని అనుకున్నాయి. తాళ్లే పడేశాయో, చేతులే చాచాయో... మొత్తానికి ఎలాగొలా బురదలో చిక్కుకున్న జింకని ఒడ్డుకి తెచ్చాయి. దాన్ని తీసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ తిరిగి వెళ్లిపోయాయి.   తన కళ్ల ముందే జరుగుతున్నది చూసిన సింహానికి మతిచెడిపోయింది. కచ్చగా తను కూడా బురదలోంచి బయటపడాలని ఒకసారి విదిలించుకుంది. అంతే! అది మరింత లోతుకి జారిపోయింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

ఆత్మబంధువులా నిలిస్తే ఆత్మహత్యలే వుండవు...

సంవత్సరానికి 1,35,445 మంది... ప్రతిరోజూ సగటున 242 మంది మగవారు, 129 ఆడవారు జీవితాన్ని వద్దనుకుని బలవంతంగా ప్రాణాలు వదులుతున్నారు మన భారతదేశంలో. అందులోనూ 15 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉన్నవారే ఎక్కువట. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా పాటిస్తున్న ఈరోజున ఆత్మహత్యలని నివారించడానికి మనంగా ఏం చేయాలని ఆలోచించి తీరాలి. సమాజం, సామాజిక సంస్థలు, ప్రభుత్వం బాధ్యత ఎంతవుందో.. వ్యక్తులుగా, మన బాధ్యత కూడా అంతే వుందన్నది నిజం. అందుకే పెద్ద పెద్ద సిద్ధాంతాలని పక్కనపెట్టి సగటు మనిషిగా ఆలోచిస్తే మనతోపాటు మసలే మన కుటుంబంలోని వ్యక్తి లేదా స్నేహితుడు, బంధువు, సహోద్యోగి లేదా పక్కింటివారు... ఇలా మన పరిధుల్లో మనకి పరిచయం వున్నవారు, నిన్నటిదాకా మనతో వున్నవారు హఠాత్తుగా చడీచప్పుడు లేకుండా బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారంటే అందులో మన పాత్ర ఏం లేదా? మనం చేయగలిగింది ఏం లేదా? వీటిని ఆపడం సాధ్యం కాదా? చిన్న విషయమే.. అందరికీ తెలిసిన విషయమే.. మనందరి అనుభవంలోనిదే. మనసుకి బాధ కలిగితే పంచుకోవడానికి ఒక వ్యక్తి కావలసి వుంటుంది. ఎలాంటి ఆక్షేపణలు లేకుండా కేవలం మనసుపెట్టి వినే ఒక్క వ్యక్తి చాలు ఆ నిమిషానికి దేవుడిలా కనిపిస్తాడు. అందుకే వినటం నేర్చుకుందాం. ఎదుటి వ్యక్తికి మాట్లాడే అవకాశమిద్దాం. మనసులోని బాధనంతా వెళ్ళగక్కేందుకు కొంచెం సమయం ఇద్దాం. సత్సంబంధాలు, సాన్నిహిత్యం మనుషుల్లో భరోసాని, ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగిస్తాయి. ఆపద రాగానే పరిగెట్టుకు రాగలరు. బాధని పంచుకోగలరు. దీనికి చేయాల్సిందల్లా ఒక్కటే.. కొంచెం మానవ సంబంధాలపై దృష్టి పెడదాం. ఉదయం లేచి మనకి ఎదురుపడే ప్రతి ఒక్కరిని చిన్న చిరునవ్వుతో పలకరిద్దాం. ఇంట్లోని పనిమనిషి నుంచి ఆఫీసులోని ప్యూను దాకా అందరినీ కుశలం అడుగుదాం. నాలుగు కబుర్లు చెబుదాం. మన జీవితంలోని విశేషాలని పంచుకుందాం. వాళ్ళ జీవితంలోని విశేషాలని అడుగుదాం. బలమైన మానవ సంబంధాలు ఎప్పుడూ ధైర్యాన్నిస్తాయి. ఆత్మహత్య అనే భూతం ఎప్పుడు ఎవర్ని నిశ్శబ్దంగా కబళిస్తుందో తెలీదు. బతుకు పోరాటంలో ఎత్తుపల్లాలు సహజమని తెలిసీ ఆ క్షణానికి నైరాశ్యానికి లొంగిపోయే వారెందరో! సహాయం చేయగలమా, వారి సమస్యలని తీర్చగలమా అన్నది పక్కన పెడితే, తన బాధలనయితే వినగలం కదా! నాలుగు ధైర్య వచనాలు పలకగలం కదా! ఏదో ఒక దారినైతే చూపించగలం కదా! ఇలా జరగాలంటే ముందు మనం నలుగురికి అందుబాటులో వుండాలి. ఒంటరితనపు కంచుకోటని బద్దలు కొట్టుకుని బయటకి రావాలి. ఈరోజున ఆ నిర్ణయం తీసుకుందాం. ‘‘ఆత్మహత్యల నివారణకి వ్యక్తిగా నేనేం చేయగలను’’ అన్న ఒక చిన్న ఆలోచన చేద్దాం. నలుగురితో ఆ ఆలోచని పంచుకుందాం. నిస్సహాయంగా, నిర్వేదంగా జీవితానికి వీడ్కోలు పలికే దుస్థితి ఎవరికీ రావద్దు అంటే కొంచెం మానవత్వంతో ఆలోచిద్దాం. మానవ సంబంధాలని బలపర్చుకుందాం. -రమ  

ట్రావెలర్స్ డయేరియా గురించి విన్నారా!

కుటుంబసమేతంగా హాయిగా గడిపేందుకు ఏదో పుణ్యక్షేత్రానికని బయల్దేరతాం లేదా పండుగ రోజుల్లో ఓ నాలుగు ఊళ్లు తిరిగిరావాలని గడపదాటతాం. ఊరు దాటాక ఏదో ఒకటి తినక మానదు. జిహ్వచాపల్యం అణచుకోలేకో, ఆకలికి తట్టుకోలేకో ఎక్కడో అక్కడ కాస్త ఆహారం తీసుకుంటాం. అంతే! మన విహారయాత్రలో నిప్పులు పోస్తూ అజీర్ణం మొదలవుతుంది. కడుపులో నొప్పి, గ్యాస్, విరేచనాలతో మన సంబరం కాస్తా సద్దుమణిగిపోతుంది. ఇలాంటి పరిస్థితికి ఓ పేరు ఉంది... అదే ట్రావెలర్స్ డయేరియా! అపరిశుభ్రతే అసలు కారణం నలుగురూ తిరిగే చోట పరిస్థితులు ఏమంత పరిశుభ్రంగా ఉండవు. హోటల్లో వంట చేసేవారి దగ్గర్నుంచీ వడ్డించేవారి వరకూ ఎవరో ఒకరు అపరిశుభ్రమైన చేతులతో ఆహార పదార్థాలను ముట్టుకోవచ్చు. ఇలాంటి సమయంలో వారి చేతికి అంటుకుని ఉన్న E.coli వంటి సూక్ష్మక్రిముల ద్వారా ట్రావెలర్స్ డయేరియా (TD) సోకే ప్రమాదం ఉంది. ఇవీ లక్షణాలు అకస్మాత్తుగా విరేచనాలు మొదలవ్వడం, జ్వరం, వాంతులు వికారం, ఆకలి వేయకపోవడం, కడుపులో పోట్లు, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ లక్షణాల నుంచి ఉపశమనం లభించేందుకు మందులు ఎలాగూ అందుబాటులో ఉంటాయి. వాటితో పాటుగా పుష్కలంగా నీరు తాగుతూ ఉండాలి. నీళ్ల విరేచనాలు అవుతుంటే ORS పొడి నీళ్లలో కలుపుకుని తాగాలి. ఒకవేళ విరేచనాలలో రక్తం పోతున్నా, జ్వరం ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించడమే మంచిది. పసిపిల్లలు, గర్భవతులలో TD లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా అందుబాటులోని వైద్యుడిని సంప్రదించాల్సిందే! ఇవీ జాగ్రత్తలు TD వ్యాధి సాధారణంగా 3 నుంచి 7 రోజులల లోపు తగ్గిపోతుంది. చాలా అరుదైన సందర్భాలలో తప్ప ఇది ప్రాణాంతకం కాదు. కాబట్టి అట్టే కంగారుపడాల్సిన పని లేదు. అయితే బయట తిరిగే నాలుగు రోజులూ రోగంతో గడిచిపోతే అంతకు మించిన విషాదం ఏముంటుంది. TD సోకిన తరువాత కంగారుపడి మందులు వాడుతూ తిప్పలు పడేకంటే అసలు అది రాకుండా చూసుకోవడం మేలు కదా! అందుకోసం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి... - అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలలో ఆహారం తీసుకోకూడదు. దారి పొడుగూతా అలాంటి హోటళ్లే కనిపిస్తుంటే ఓ నాలుగు పళ్లు తిని ఆకలి చల్లార్చుకోవడం మంచిది. - పచ్చి కూరలు, ఉడకని పదార్థాలు ముట్టుకోకపోవడమే మేలు. - అపరిశుభ్రమైన నీటితో తయారయ్యే ఐస్తో చేసే జ్యూస్ల జోలికి పోకూడదు. - బయట తాగే నీటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మినరల్ వాటర్ కానీ, కాచి చల్లార్చిన నీరు కానీ తాగాలి. అలా కుదరకపోతే క్లోరిన్ లేదా అయోడిన్ బిళ్లలు కలుపుకొని తాగాలి. - నీరు అస్సలు బాగోలేదు అని అనుమానం ఉన్న చోట, ఆ నీటిని పుక్కిలించినా కూడా ప్రమాదమే! - ప్రయాణాలలో ఎక్కడపడితే అక్కడ మాంసాహారం ముట్టకూడదు. ఎందుకంటే మాంసంలో ఏమాత్రం అపరిశుభ్రత ఉన్నా, అది ఒకోసారి ప్రాణాంతకంగా మారవచ్చు. ముఖ్యంగా చేపల జోలికి అసలు పోవద్దని హెచ్చరిస్తూ ఉంటారు. ఇన్ని కబుర్లు చెబుతున్నారు. మరి నిత్యం అక్కడే ఉండిపోయే వారి పరిస్థితి ఏమిటి అన్న అనుమానం వచ్చిందా! నిజమే! అపరిశుభ్రమైన ప్రదేశాలలో నిరంతరం నివసించేవారికి కూడా మొదట్లో TD సోకి తీరుతుంది. కాకపోతే ఓ ఏడెనిమిదేళ్ల తరువాత వారి శరీరం ఆ సూక్ష్మక్రిములని తట్టుకునేందుకు అలవాటుపడిపోతుంది. కానీ మనకి అంత సమయం ఉండదు కదా! అందుకనే బయట తిరిగే నాలుగు రోజులు కాస్త జాగ్రత్తగా మెలగాల్సిందే! - నిర్జర.  

విటమిని ఇ ఎక్కువగా ఉండే కొబ్బరిపాలు

శరీరానికి కావల్సిన సూక్ష్మ పోషకాలు ఎక్కువగా లభించే పదార్థాల్లో కొబ్బరి పాలు ఒకటి. ఇందులో సోడియం, క్యాల్షియం, ఫాస్ప‌ర‌స్‌, ప్రోటీన్స్‌, పొటాషియం వంటి పోష‌కాలు స‌మృద్దిగా ఉంటాయి. అంతేకాదు క‌రోనాను అరిక‌ట్టే జింక్‌, బీ12 వంటి న్యూట్రియంట్స్ కూడా పుష్క‌లంగా లభిస్తాయి. ఇప్పుడు కొబ్బరిపాలు మార్కెట్ లో కూడా లభిస్తున్నాయి. అయితే ఇంట్లో తయారుచేసుకోవడం మంచిది. పచ్చి కొబ్బరిని తురిమి లేదా మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. పలుచటి క్లాత్ తీసుకుని అందులో ఈ కొబ్బరి ముద్దను వేసి గట్టిగా పిండాలి. ఈ పాలను సన్నని మంటమీద ఐదు నిమిషాలు వేడి చేయాలి. ఆ తర్వాత చల్లారనివ్వాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే పోషకాలు శరీరానికి అందుతాయి. సహజసిద్ధంగా లభించే కొబ్బరిపాలలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా కొబ్బరిపాలు ఎంతో మేలు చేస్తాయి. చుండ్రు సమస్యతో బాధపడేవారు కొబ్బరిపాలను తలకు పట్టించి బాగా మసాజ్ చేస్తే చుండ్రు సమస్య తొలగిపోతుంది. జుట్టు పట్టులా మెరుస్తుంది.
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.