మేడిగడ్డ బ్యారేజి రిపేర్ పై  కెటీఆర్ తీరు ఉల్టా చోర్ కొత్వాల్

పదేళ్ల కెసీఆర్ ప్రభుత్వం కుప్పకూలడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి అని చిన్న పిల్లాడైనా ఠక్కున చెప్పేస్తాడు.  కాళేశ్వరం ప్రాజెక్టు కల్దకుంట్ల ఫ్యామిలీకి ఎటిఎం మాదిరిగా మారిందని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ప్రజలు నమ్మారు. 10 ఏళ్ల విరామం తర్వాత ఆ పార్టీకి పట్టం కట్టారు. కానీ కల్దకుంట్ల వారసుడైన కెటీఆర్ మాత్రం ఇందులో తప్పేమి లేదన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. దీన్నే ఉర్దూలో ఉల్టా చోర్ కొత్వాల్ అంటారు.  అహో ధార్ష్ట్య మసాధూనాం నిందతా మనఘాః స్త్రియః మృష్ణతా మివ చోరాణాం తిష్ఠ చోరేతి జల్పతాం పవిత్రలూ, శీలవతులూ అయిన స్త్రీలను నిందించే దుర్మార్గులైన పురుషుల ధార్ష్ట్యాన్ని ఏమనవచ్చు దొంగతనం చేసిన వాడే దొంగా దొంగా అన్నట్టుగా ఉంది కెటీఆర్ మాటల తీరు. తెలంగాణలో కరువు పరిస్థితులు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అయితే, ఇది కాలం తెచ్చిన కరువు కాది, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని చెప్పారు. గత ఏడాది ఇదే కాలంలో రైతులకు పుష్కలంగా సాగు నీటిని అందించామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ మీద కోపంతో మేడిగడ్డ ప్రాజెక్టును రిపేర్ చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీకి, హైదరాబాద్ కి మధ్య తిరగడం తప్ప.. రైతులను పరామర్శించేందుకు సీఎం రేవంత్ కు సమయం లేదని అన్నారు.  ఇప్పటి వరకు సుమారు 200 మంది రైతులు చనిపోయారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాలని... ఎండిపోయిన పంటకు నష్ట పరిహారం అందించాలని చెప్పారు. ఎకరానికి రూ. 10 వేలు ఇస్తారో, రూ. 25 వేలు ఇస్తారో ఇవ్వండని అన్నారు. రైతులకు ఇస్తామన్న బోనస్, కౌలు రైతులకు ఇస్తామన్న రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  రైతుబంధు కోసం కేసీఆర్ రూ. 7 వేల కోట్లు పెట్టిపోతే... ఆ డబ్బులు రైతులకు ఇవ్వకుండా... కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రైతుల దీన పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు కేటీఆర్ పర్యటించారు. తంగళ్లపల్లి మండలం సారంపల్లి వద్ద పంట నష్టాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.  
Publish Date: Mar 28, 2024 4:51PM

బండి సంజయ్ పై కేసు నమోదు 

ఒక వర్గానికి చెందిన వారు మరో వర్గానికి చెందిన మ హిళలపై  దాడి చేసిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బిజెపి  జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్ పై కేసు నమోదైంది.   కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేశారని నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు. బండి సంజయ్‌తో పాటు ఘట్‌కేసర్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మరికొందరిపై కేసు నమోదయింది. చెంగిచెర్లలో  ఓ వర్గం దాడిలో గాయపడిన మహిళలను పరామర్శించేందుకు బండి సంజయ్ నిన్న చెంగిచెర్లలోని పిట్టలబస్తీకి వెళ్లారు.బండి సంజయ్ అక్కడకు రావడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్కడకు రావడానికి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. ఎవరినీ లోనికి అనుమతించకుండా బారీకేడ్లను ఏర్పాటు చేశారు. అక్కడకు చేరుకున్న బండి సంజయ్, కార్యకర్తలు బారీకేడ్లను తోసుకొని లోనికి వెళ్లారు. ఘటనలో గాయపడిన మహిళలను పరామర్శించారు. వారికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.మహిళలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు, కబేళా నిర్వాహకులు కక్షతో పేద గిరిజన మహిళలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. బస్తీకి వచ్చి మరీ మహిళలు, పిల్లలపై దాడులు చేశారని, ఇందుకు కారకులైన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో తన విధులకు ఆటంకం కలిగించారని, తనపై దాడి చేశారని నాచారం సీఐ ఫిర్యాదు చేశారు.
Publish Date: Mar 28, 2024 4:14PM

భూమా అఖిలప్రియ అరెస్ట్ 

ఎపిలో వైఎస్ ఆర్ అరాచకపాలనను ప్రశ్నిస్తే నేరుగా కటకటాలకు పంపే స్కీం అమలవుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి అసెంబ్లీలో లేదా వెలుపల లేవనెత్తేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ  అధి కార వైసీపీ ప్రజా స్వామ్య విలువలకు  ప్రాధాన్యత నివ్వడం లేదు.       ప్రజల జీవితాల్లో   వెలుగులు నింపాలన్న ఉద్దేశ్యంలో టిడిపి నేత భూమా అఖిల ప్రియ జగన్ ప్రభుత్వం దగ్గరకు  వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగానే వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది.  ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నేడు నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నంద్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సభ వద్దకు వెళ్లిన అఖిలప్రియ సాగునీటి విడుదలకు సంబంధించి జగన్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆమె వెంట టీడీపీ శ్రేణులు కూడా భారీగా తరలివెళ్లాయిదీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో సభా ప్రాంగణం వద్ద కలకలం రేగింది. వినతిపత్రం ఇవ్వడానికి వస్తే అరెస్ట్ చేయడం ఏంటని పోలీసులను టీడీపీ నేతలు ప్రశ్నించారు. అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తే సీఎం కార్యాలయం స్పందించలేదని, అందుకనే నేరుగా సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించానని అఖిలప్రియ తెలిపారు.
Publish Date: Mar 28, 2024 3:29PM

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుజనుల సెగ

బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరి లోక్ సభ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుజనుల సెగ గట్టిగా తగిలింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బీఎస్పీ అభ్యర్థిగా సిర్పూర్ నియోజకర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఆ తరువాత బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరారు. అలా చేరడానికి ముందు లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు పెట్టుకుంటున్నట్లు ఏకపక్షంగా ప్రకటించారు. అయితే బీఎస్పీ అధినేత్రి మాయావతి పోత్తును గుర్తించలేదు. ఏ పార్టీతోనూ బీఎస్పీకి పొత్తు లేదని విస్పష్టంగా ప్రకటించారు. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేసి కారెక్కేశారు. ఇలా కారెక్కారో లేదో అలా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయనను నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించి టికెట్ ఇచ్చేశారు. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పోటీ చేసిన సిర్పూర్ నియోజకవర్గ పరిధిలో బహుజనులు ప్రవీణ్ కుమార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనను బహుజన ద్రోహిగా అభివర్ణిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో  సిర్పూరు నియోజ‌కవ‌ర్గంలో బీఆర్ఎస్ కార్యక‌ర్తల స‌మావేశంలో పాల్గొనేందుకు ప్రవీణ్ కుమార్ హాజరు కానున్న తరుణంలో ఆయనకు వ్యతిరేకంగా కొమురం భీం జిల్లా కౌటలలో పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి.  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీని వీడి బీఆర్ఎస్ లో చేరడంనూ  బహుజనుల వ్యతిరేత ఆయన పోటీ చేస్తున్న నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గంలో ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. 
Publish Date: Mar 28, 2024 1:57PM

వైసీపీ సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ కు స్మగ్లర్లతో సంబంధాలు...హవ్వా 

స్వాతంత్ర సమరయోధులు, నిస్వార్థ సేవకుల స్తూపాలను ఏర్పాటు చేయడం వాటిని ప్రజాప్రతినిధులు ఆవిష్కరించడం సర్వసాధారణం. అయితే అడవి దొంగగా, గంధపు చెక్కల స్మగ్లర్​గా పేరుగాంచిన వీరప్పన్ స్మారక స్థూపాన్ని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఆవిష్కరించడం ఇటీవల  చర్చనీయాంశంగా మారింది. ఈ వార్త మరువకముందే తాజాగా వైసీపీ ఎంపీ ఒకరు స్మగ్లర్లతో సంబంధాలు అనే వార్త ఎపి ప్రజలను కలవరపెడుతోంది .వైసీపీ ఎంపీ మార్గాని భరత్ పై రాజమండ్రి సిటీ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మార్గాని భరత్ కు స్మగ్లింగ్ బ్యాచ్ లతో సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులకు రూ. 2 కోట్ల విలువైన బంగారంతో పట్టుబడ్డ నరేశ్ కుమార్ జైన్ తో భరత్ కు సంబంధాలు ఉన్నాయని చెప్పారు. నరేశ్ జైన్ తో మార్గాని భరత్ కలిసి ఉన్న ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ తో భరత్ కు సంబంధాలు ఉన్నాయని అన్నారు. మార్వాడీలను, ఒడిశా బ్రాహ్మణులను గుద్ది చంపుతానని వైసీపీ నేత ఒకరు ఫోన్ లో బెదిరించారని.. దీనిపై జిల్లా ఎస్సీకి ఫిర్యాదు చేశానని చెప్పారు.   ప్రస్తుతం వైసీపీ ఎంపీగా ఉన్న మార్గాని భరత్ ఇప్పుడు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. భరత్ తో వాసు పోటీ పడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున ఆదిరెడ్డి భవానీ గెలుపొందారు. ఈసారి ఆమె భర్త ఆదిరెడ్డి వాసు బరిలోకి దిగారు.  గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ స్మారక స్థూపాన్ని  వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌  ఆవిష్కరించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికీ హల్‌చల్‌ చేస్తున్నాయి.  గత నెల చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కాకర్లవంకలో వీరప్పన్ స్మారక స్థూపాన్ని స్థానికులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే కాకర్లవంకలో పర్యటించిన ఎమ్మెల్సీ భరత్‌ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి స్థానికులు ఏర్పాటు చేసుకున్న వీరప్పన్‌ స్మారక స్థూపాన్ని ఆయన ఆవిష్కరించారు. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో  ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి. స్మగ్లర్లతో వైసీపీ నేత మార్గాని భరత్ కు సంబంధాలు ఉండటం ఎన్నికల ముంగిట్లో ఉన్న ఎపి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.   
Publish Date: Mar 28, 2024 1:08PM

జగన్ నిర్వాకం.. త్రిశంకు స్వర్గంలో హైదరాబాద్ లోని ఏపీ ప్రభుత్వ కార్యాలయాలు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ మహానగరాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకూ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హైదరాబాద్‌  పదేళ్లపాటు   ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. అయితే ఆ గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగిసిపోతుంది. అంటే ఆ తేదీ నాటికి హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భవనాలన్నిటినీ ఖాళీ చేసి ఏపీకి తరలించేయాలి. అయితే ఏపీకి రాజధానే లేని పరిస్థితి. కార్యాలయాలను ఎక్కడికి తరలించాలో అర్ధంకాని అయోమయ స్థితి. అయితే  ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసిపోతుండటంతో  ఏపీ ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ తెలంగాణకు అప్పగించేసి అక్కడి ఫర్నీచర్, సిబ్బందిని ఏపీకి తరలించేసి తీరాలి.  అలా చేయలేకపోతే.. ఆ భవనాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్దెలు చెల్లించాల్సి ఉంటుంది.  ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ జూన్ రెండు వరకూ మాత్రమే. ఆ తరువాత హైదరాబాద్ మహానగరం పూర్తిగా తెలంగాణకు చెందుతుంది.   ఐదేళ్ల పదవీ కాలంలో అమరావతిని నిర్వీర్యం చేసి మూడు రాజధానులంటూ హడావుడి చేసిన జగన్ సర్కార్ మూడు రాజధానులలో ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా పేర్చిన పాపాన పోలేదు. దీంతో  హైదరాబాద్ లోని ప్రభుత్వ కార్యాలయాలను ఇక్కడకు తరలించినా వాటిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంలో స్పష్టత లేని స్థితి. దీంతో హైదరాబాద్ ను మరో ఏడాది పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని  జగన్ సర్కార్ అభ్యర్థించింది. అయితే ఆ అభ్యర్థనను సహజంగానే తెలంగాణ సర్కార్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.  అయితే, రెండు ప్రభుత్వ కార్యాలయాలు మరియు లేక్ వ్యూ అతిథి గృహాన్ని ఉపయోగించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.   ఆదర్శ్ నగర్‌లోని హెర్మిటేజ్ భవనం, లక్డీకాపూల్‌లోని సీఐడీ భవనం, లేక్ వ్యూ అతిథి గృహాలను అద్దె చెల్లించైనా సరే వినియోగించుకునేందుకు జగన్ సర్కార్ రెడీగా ఉన్నట్లు తెలుస్తున్నది.   ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను పదేళ్లపాటు పంచుకునే హక్కు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నప్పటికీ.. సొంత రాజధాని నిర్మాణం వేగవంతంగా జరగాలంటే ప్రభుత్వ కార్యాలయాలు ఏపీలోనే ఉండాలన్న ఉద్దేశంతో విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు   2017లో నే చాలా వరకూ ప్రభుత్వ కార్యాలయాలను అమరావతికి తరలించారు. ఆ తరువాత 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన జగన్ మాత్రం అమరావతిని నిర్వీర్యం చేసి ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని రాష్ట్రంగా మార్చేయడమే కాకుండా హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెలు చెల్లిస్తాం అక్కడే కొనసాగించుకునేందు అనుమతించండి మహప్రభో అని వేడుకుంటున్నారు.  
Publish Date: Mar 28, 2024 12:41PM

పాపం స్పీకర్ తమ్మినేని.. నిద్రపడితే ఒట్టు!

స్పీకర్ తమ్మినేని ఇప్పుడు నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైసీపీ క్యాడరే చెబుతున్నారు. ఆయన ఆముదాల వలస నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉన్న సెంటిమెంట్ ప్రకారం అసెంబ్లీ స్పీకర్ గా పని చేసిన ఎవరూ కూడా ఆ తరువాతి ఎన్నికలలో విజయం సాధించలేరు. అయితే తమ్మినేనికి ఆ సెంటిమెంట్ బెంగే కాకుండా నియోజకవర్గ వైసీపీలో గ్రూపు తగాదాలూ కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. స్పీకర్ గా తమ్మినేని వ్యవహార శైలిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుండటం అటుంచితే.. నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో ఆముదాలవలసలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది.   వైసీపీ సీనియర్ నాయకుడు సువ్వారి  గాంధీ ఇప్పటికే పార్టీ వీడి  ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు. వాస్తవానికి గత ఎన్నికలలో సువ్వారి గాంధీ ఆముదాలవలసలో తమ్మినేని విజయం కోసం అంతా తానై పని చేశారు. అందుకు అప్పట్లో జగన్ వచ్చే ఎన్నికలలో అంటే 2024 ఎన్నికలలో పార్టీ టికెట్ సువ్వారి గాంధీకి ఇస్తానని ఇచ్చిన హామీయే కారణమని చెబుతారు. అయతే జగన్ ఆ హామీ నిలబెట్టుకోకపోవడంతో సువ్వారి గాంధీ వైసీపీకి రాజీనామా చేశారు. అంతే కాదు ఆయన సోదరుడి సతీమణి  కూడా తన నామినేటెడ్ పోస్టుకు రాజీనామా చేశారు. గాంధీ ఆముదాలవలస నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలవనున్నారు. వైసీపీ అధిష్ఠానం అంటే జగన్ తనను మోసం చేశారని గాంధీ ఆరోపిస్తున్నారు. సువ్వారీ గాంధీ పార్టీకి రాజీనామా చేసి, స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతుంటే.. తమ్మినేని సీతారాంకు ఖంగారెందుకు అంటే గాంధీ నియోజకవర్గంలో బలమైన కళింగ సామాజిక వర్గానికి చెుందిన వ్యక్తి. పైగా ఆ సామాజిక వర్గంలో గట్టి పట్టున్న నేత. దీంతోనే తమ్మినేని సీతారాం తన విజయంపై ధీమా కోల్పోయారు. అలాగే వైసీపీలో కూడా ఖంగారు మొదలైంది. దీంతో గాంధీని బుజ్జగించడానికి జగన్ దూతగా వైవీ సుబ్బారెడ్డి శతధా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది.  అదీగాక చాలా కాలంగా సువ్వారి గాంధీ నియోజకవర్గంలో తనదంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తమ్మినేని సీతారాం చేపట్టే అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటూ.. పార్టీలోనే తన వర్గాన్ని ఏర్పాటు చేసుకుని సమాంతరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ విషయం పార్టీ అధినేత జగన్ కు తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు.   ఇక ఆముదాలవలస నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయనున్న కూన రవికుమార్ తమ్మినేనికి సమీప బంధువు కూడా కావడంతో దానినే సువ్వారి గాంధీ తన ప్రచారానికి అనుకూలంగా మార్చుకుంటున్నారు.  తమ్మినేతి, కూన రవికుమార్ లు డబుల్ గేమ్ ఆడుతున్నారనీ, వారి రాజకీయ నాటకానికి తెరదించేందుకు తనకు ఓటు వేయాలంటూ ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించేశారు.  అంతే కాకుండా స్థానిక వైసీపీ క్యాడర్ లో కూడా తమ్మినేని పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో ఆముదాలవలసలో వైసీపీ క్యాడర్ చాలా వరకూ  తమ్మినేనికి మద్దతుగా ఆయన వెంటే నడుస్తున్నారు.  దీంతో తమ్మినేని నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారన్న సెటైర్లు పార్టీ వర్గాల నుంచే వస్తున్నాయి.  మొత్తం మీద ఆముదాలవలస నుంచి తమ్మినేని ఓటమి ఇప్పటికే ఖరారైపోయిందంటూ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. 
Publish Date: Mar 28, 2024 12:24PM

పార్టీ టికెట్ దక్కలేదని సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్య

ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ దక్కలేదన్న మనస్తాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమిళనాడుకు రాష్ట్రానికి చెందిన సిట్టింగ్ ఎంపీ గణేష్ మూర్తి ఎన్నికలలో పోటీ చేసే అవకాశం పార్టీ ఇవ్వలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈడోర్ నియోజకవర్గ ఎండీఎంకే ఎంపీ గురుమూర్తికి పార్టీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వలేదు. దీంతో  ఆయన మూడు రోజుల కిందట ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ( మార్చి 28) ఉదయం కన్నుమూశారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో మరణించారని ఆస్పత్రివర్గాలు తెలిపాయి.   ఎండీఎంకే పార్టీ అభ్యర్థిగా  గణేశమూర్తి 2019 పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోడ్ నుండి భారీ మెజార్టీతో  విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు.  ఎన్నికలలో పోటీకి అవకాశం లేదన్న మనస్తాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యకు పాల్పడటం తమిళనాట మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 
Publish Date: Mar 28, 2024 11:59AM

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు మహిళలు సహా ఆరుగురు మావోలు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మావోలు, పోలీసుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. మృతులలో ఇద్దరు మహిళా మావోలు ఉన్నారు.   బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాల్పేరు నది సమీపంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది.  యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో భాగంగా సీఆర్పీఎఫ్ జవాన్లు   డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, కోబ్రా సిబ్బంది కూంబింగ్ జరుపుతుండగా తొలుత నక్సల్స్‌ కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపినట్లు చెబుతున్నారు.   ఘటనా స్థలం నుంచి భారీ పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పుల్లో మరి కొందరు నక్సల్స్ గాయపడి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. 
Publish Date: Mar 28, 2024 11:42AM

జ‌గ‌న్‌..! ఇక ఏడ్చేస్తాడేమో?!

నేను ఒక్క‌ చెడ్డ‌ప‌ని కూడా చెయ్య‌లేదు..! అన్నీ మంచి ప‌నులే చేశా..!! నేను నిజాయితీ ప‌రుడ్ని. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబే అన్నీ దుర్మార్గ‌పు ప‌నులు చేస్తున్నాడు.. నా చెల్లెళ్ల‌ను నాపై ఉసిగొల్పుతున్నాడు.. ఇవీ.. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆర్తనాదాలు. తాను క‌లియుగ హ‌రిశ్చంద్రుడిని   అని చెప్ప‌డం మిన‌హా,    ప్ర‌జ‌ల ముందు ప‌డాల్సిన క‌థ‌ల‌న్నీ ప‌డేశాడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఐదేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది.   స‌ర్వేల‌న్నీ బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ కూట‌మికే జై కొడుతుండ‌టంతో జ‌గ‌న్ శిబిరం కంగారెత్తిపోతున్నది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో అధికారంలోకి వ‌చ్చేందుకు జ‌గ‌న్, ఆయ‌న వ‌ర్గీయులు చేసిన పాపాలు అన్నీఇన్నీకావు.. ఏకంగా బాబాయ్ హ‌త్య‌, కోడి క‌త్తి  దాడి.. ఇలా చాలానే ఉన్నాయి. పోనీ ఇన్ని చేసి అధికారం దక్కించుకున్న తరువాత పాలన అయినా సక్రమంగా  సాగించారా అంటే అదీలేదు.. అమ‌రావ‌తి రాజ‌ధాని రైతుల‌ను రోడ్డున ప‌డేశారు. అంతెందుకు ఉన్న కంపెనీల‌ను పంపించేసి నిరుద్యోగుల‌కు ఉపాధి లేకుండా చేశారు. ఫ‌లితంగా చిన్న‌చిన్న ప‌నుల‌కోసం సైతం ఏపీ ప్ర‌జ‌లు హైద‌రాబాద్ బాట ప‌డుతున్నారంటే ఏపీలో   ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. చంద్రబాబు హయాంలో అమరావతి నిర్మాణం జరుగుతున్న సమయంలో హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉండేవి. ఇప్పుడా పరిస్థితి రివర్స్ అయ్యింది.  వీట‌న్నింటిని వ‌దిలేసిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. అన్నీ వేదాల్లోనే ఉన్నాయష.. అన్నట్లుగా అన్నిటికీ  చంద్రబాబే కారణమని జనం ముందు ప్రసంగాలు ఇస్తున్నారు.   వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలో ఉన్న‌న్నిరోజులు బ‌య‌ట‌కు రావాలంటే ప‌ర‌దాలు కట్టుకుని జనానికి ముఖం చూపకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవలసిన పరిస్థితి. అయితే ఇప్పుడు  ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డంతో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని జ‌గ‌న్‌ ప్రారంభించాడు. మేమంతా సిద్ధం పేరుతో బ‌స్సు యాత్ర చేప‌ట్టిన జ‌గ‌న్.. ప్రొద్దుటూరులో ప్ర‌జ‌ల‌నుద్దేశించి మాట్లాడారు. జ‌గ‌న్ ప్ర‌సంగం మొత్తం.. క‌లియుగ స‌త్య హ‌రిశ్చంద్రుడిని నేనే అని డ‌బ్బాకొట్టుకోవ‌డానికి పరిమితమైంది.  ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధిని చెప్ప‌కుండా.. నేను మీ బిడ్డ‌ను.. అంద‌రూక‌లిసి నాపై దండ‌యాత్ర చేస్తున్నారు.. మీరే న‌న్ను కాపాడాలి అంటూ ప్ర‌జ‌ల‌ను  దీనంగా జ‌గ‌న్ అభ్య‌ర్ధించారు. ఐదేళ్ల పాల‌న‌పై ఆగ్రహంతో ఉన్న ప్ర‌జ‌ల‌ను సానుభూతి అస్త్రంతో త‌న‌వైపుకు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేశారు. బాబాయ్ హ‌త్య‌కేసు విష‌యంపై మాట్లాడిన జ‌గ‌న్‌.. తన వాళ్ల‌నే చంద్ర‌బాబు తన మీద ఉసిగొల్పుతున్నారంటూ ప్ర‌జ‌ల ముందు క‌న్నీరు పెట్టుకునంత ప‌నిచేశాడు. వివేకానందను అన్యాయంగా, అతిదారుణంగా చంపారు.. ఆ హంత‌కులెవ‌రో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్ర‌జ‌ల‌కు తెలుసు.. అని చెప్పిన జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి.. వారి పేర్ల‌ను మాత్రం చెప్ప‌లేదు.  గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో బాబాయ్ హ‌త్య‌కు కార‌ణం చంద్ర‌బాబే అంటూ మొత్తుకున్న జ‌గ‌న్‌.. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత బాబాయ్ హ‌త్య‌కేసును ఎందుకు సీరియ‌స్ గా తీసుకోలేద‌నే విష‌యాన్ని మాత్రం జ‌గ‌న్ త‌న ప్ర‌సంగంలో  ఎక్కడా పొరపాటున కూడా ప్ర‌స్తావించ‌లేదు. త‌న ఇద్ద‌రు చెల్లెళ్లు, సీబీఐ అధికారులు వివేకా హ‌త్య‌కేసులో కీల‌క ముద్దాయి వైసీపీ ఎంపీ అవినాశ్  రెడ్డి అని బ‌హిరంగంగానే చెబుతున్నారు.  సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు   క‌డ‌ప వెళ్లారు.. బాబాయ్ పై జ‌గ‌న్ కు నిజంగా ప్రేముంటే అవినాశ్ అరెస్టును ఎందుకు అడ్డుకోవాల్సి వ‌చ్చింద‌నే విష‌యంపై ప్ర‌జ‌లకు చెప్పేందుకు జ‌గ‌న్ సాహ‌సించ‌లేదు. కేవ‌లం అభాండాలు వేయ‌డమే తన పని అన్నట్లుగా జగన్ తీరు ఉందని జనం బాహాటంగానే అంటున్నారు త‌న ఇద్ద‌రు చెల్లెళ్ల‌ను చంద్ర‌బాబు త‌న‌పై ఉసిగొల్పుతున్నాడ‌ని జ‌గ‌న్ పేర్కొనడం విడ్డూరంగా ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. ష‌ర్మిల‌, సునీత‌లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక వారిని కూడా చంద్ర‌బాబు మ‌నుషులుగా వైసీపీ నేత‌లు చిత్రీక‌రించే ప్ర‌య‌త్న చేస్తూ వ‌చ్చారు. తాజాగా జ‌గ‌న్ కూడా త‌న ప్రంస‌గంలో అదే విష‌యాన్ని ప్ర‌స్తావించ‌డం జ‌గ‌న్ లో ఓట‌మి భ‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. ఇన్నాళ్లు చెల్లెళ్లు రోడ్డెక్కి మొత్తుకుంటున్నా క‌నీసం మాట‌ కూడా మాట్లాడ‌ని జ‌గ‌న్‌  ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల ఓట్లు కావాలి కాబ‌ట్టి సానుభూతికో సం అంతా చంద్ర‌బాబే చేస్తున్నారని చెప్ప‌డం వైసీపీ నేత‌ల‌ను సైతం ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. జ‌గ‌న్ చెల్లెళ్లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు ముందు స‌మాధానం చెప్పిన త‌రువాత చంద్ర‌బాబు పేరు ఎత్తితే బాగుంటుంద‌ని   విశ్లేష‌కులు సూచిస్తున్నారు.   ఇటీవ‌ల విశాఖ తీరంలో దొరికిన డ్ర‌గ్స్ కేసుపైనా జ‌గ‌న్‌ స్పందించాడు. డ్ర‌గ్స్ తో ఉన్న కంటైన‌ర్ లో పేర్కొన్న అడ్ర‌స్సు చంద్ర‌బాబు వ‌దిన చుట్టం కంపెనీది అంటూ జ‌గ‌న్ అన్నాడు. అయితే, ఆ కంపెనీ వాళ్లు వైసీపీ నేత‌ల‌ని, ఇటీవ‌ల సంక్రాంతి పండుగ‌కు వాళ్లు జ‌గ‌న్ ఫొటోతో కూడిన ఫ్లెక్సీల‌ను ఎందుకు వేయించార‌నే విష‌యంపై మాత్రం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నోరువిప్ప‌క పోవ‌టం గ‌మ‌నార్హం. త‌న‌పై, త‌న వ‌ర్గీయుల‌పై వ‌చ్చే ప్ర‌తీ ఆరోప‌ణ‌ను చంద్ర‌బాబు చేసేదే అని చెప్ప‌డం మిన‌హా బ‌స్సు యాత్ర ప్ర‌సంగంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాట్లాడింది పెద్ద‌గా ఏమీలేద‌నే చెప్పొచ్చు. ఎన్నిక‌ల స‌మ‌యంలో కేవ‌లం ప్ర‌జల సానుభూతికోసం  జ‌గ‌న్ పాకులాడిన‌ట్లు క‌నిపించింది. మొత్తంగా చెప్పాలంటే.. క‌న్నీళ్లు పెట్ట‌డం త‌ప్పితే అన్ని విన్యాసాలు ప్ర‌జ‌ల ముందు జ‌గ‌న్ చేశాడ‌ని చెప్పొచ్చు.
Publish Date: Mar 28, 2024 11:04AM

ఉప్పల్ స్టేడియంలో రాత్రి సన్ రైజ్! ముంబై బౌలర్లకు సిక్సర్ల వడదెబ్బ!

క్రికెట్ మజా అంటే ఏమిటో బుధవారం రాత్రి హైదారబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై  ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూపించింది. పరుగుల వరద అంటే ఏమిటో స్టేడియంలో మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించిన ప్రేక్షకులతో పాటు కోట్లది మంది టీవీ వీక్షకులకు కళ్లకు కట్టినట్లు కనిపించింది. 40 ఓవర్లలో ఏకంగా 523 పరుగులు నమోదయ్యాయి. సిక్సర్లు మోత మోగిపోయాయి. స్టేడియంలోని ప్రేక్షకులు, టీవీ వీక్షకులే కాదు.. గ్రౌండ్ లో ఫీల్డింగ్ చేస్తున్న ప్రేక్షకులు సైతం గుడ్లప్పగించి చూడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. పరుగుల తుపాన్ లో అంతా తడిసి ముద్దయ్యారు. ఈ మ్యాచ్ చాలా కాలం గుర్తుండిపోతుంది. ఐపీఎల్ చరిత్రలోనే  ఒక మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డు సృష్టించింది. ఇక ఛేజింగ్ లో ముంబై ఇండియన్స్ కూడా దీటుగానే బదులిచ్చినా లక్ష్యానికి 31 పరుగుల దూరంలో నిలిచిపోయారు. మొత్తం మీద ఈ మ్యాచ్ క్రికెట్ ను, క్రికెట్ మజాను గెలిపించింది.   టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 277 పరుగుల భారీ స్కోరు చేసింది. సన్ రైజర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు.   ఇప్పటివరకు జరిగిన 17 ఐపీఎల్ ట్రోఫీలలో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (263) నిలువగా, తాజాగా హైదరాబాద్ ఆ రికార్డును బద్దలు కొట్టింది.  ఓపెనర్ హెడ్ (62),   అభిషేక్ శర్మ (63) విధ్వంసం సృష్టించగా, ఆ తరువాత ఆ విధ్వంసాన్ని  క్లాసేన్ (80 నాటౌట్) మరో లెవెల్ కు తీసుకువెళ్లాడు. మార్కరం (42 నాటౌట్) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.  సన్ రైజర్స్ బ్యాటర్ల విధ్వంసంతో ముంబై ఇండియన్స్ బౌలింగ్ లైనప్ గల్లీ క్రికెటర్ల మాదిరిగా కనిపించింది.     ఇక 278 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ కూడా ధాటిగానే పరుగుల వేట మొదలు పెట్టింది. అయితే క్రమం తప్పకుండా వికెట్లు పడుతుండటంతో లక్ష్యానికి 31 పరుగుల దూరంలో నిలిచిపోయింది. దీంతో ఈ సీజన్ లో సన్ రైజర్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. 
Publish Date: Mar 28, 2024 10:56AM

ఐదేళ్ల తరువాత దేనికి ‘సిద్ధం’ జగన్?

జగన్ ధైర్యంగా జనంలోకి వచ్చి ఐదేళ్లయ్యింది. గత ఎన్నికలకు ముందు పాదయాత్ర తరువాత ఆయన జనం ముఖం చూడటం మానేశారు. తన అధికారాన్ని ప్రత్యర్థులు, వ్యతిరేకులపై కక్ష సాధించుకోవడానికీ, సంక్షేమ పథకాల పేర లబ్ధిదారులకు అరకొరగా సొమ్ముల పందేరానికి అప్పుల వేటకీ పరిమితమైపోయారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని నిర్వీర్యం చేయడానికీ, ఆ ప్రభుత్వాన్ని నమ్మి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు స్థాపించడానికి వచ్చిన పారిశ్రామిక వేత్తలను రాష్ట్రం నుంచి తరిమేయడానికీ ఉపయోగించడానికే పరిమితమైన జగన్ జనం కష్టాలు, సమస్యలను అసలు పట్టించుకోనే లేదు. ఇంత చేశాను, అంత చేశాను అని చెప్పుకోవడానికి ఏమీ లేక జనాలకు ముఖం చాటేశారు. అయితే ఐదేళ్లు గిర్రున తిరిగిన తరువాత ఓట్లు అభ్యర్థించడానికి జనం ముందుకు రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. దాంతో గత్యంతరం లేక మేమంతా సిద్ధం అంటూ రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆ యాత్రను పులివెందులలో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధిని సందర్శించి బస్సు యాత్ర ప్రారంభించారు. మేము సిద్ధం తొలి సభ  ప్రొద్దుటూరులో  జరిగింది.  ఇంత కాలం జనం ముఖం చూడడానికి ఇష్టపడకుండా బారికేడ్లు, పరదాలు కట్టుకుని మరీ బయటకు వచ్చిన జగన్ ఇప్పుడు తన ఓట్ల అవసరం కోసం అవేమీ లేకుండా బయటకు వస్తే జనం ఆయన ముఖం చూడడానికి ఇష్టపడటం లేదా అన్న అనుమానం కలిగేలా ప్రొద్దుటూరు సభ జరిగింది.  నానా కష్టాలూ పడి సభకు జనాలను తరలించినా.. జగన్ ప్రసంగానికి వారిలో ఇసుమంతైనా స్పందన కనిపించలేదు.  ప్రొద్దుటూరులో జగన్ కు ఇలాంటి స్వాగతమే లభిస్తుందని పరిశీలకులు మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు.  ప్రొద్దుటూరులో వైసీపీలో అంతర్గత కుమ్ములాటల గురించి తెలిసి కూడా జగన్ తన ప్రచారాన్ని ప్రారంభించడానికి ప్రొద్దుటూరునే ఎన్నుకోవడం రాంగ్ ఛాయిస్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తొలి సభ ప్లాప్ ప్రభావం ఆయన  యాత్ర మొత్తం రిఫ్లెక్ట్ అవుతుందని రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది.  నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ధీమాగా ఉంది. కడప లోక్‌సభ సెగ్మెంట్‌లోని ప్రొద్దుటూరు జగన్ అడ్డాగా నిన్నటి వరకూ ఉండేది. అందులో సందేహం లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ చివరిసారిగా గెలిచింది 2009లో మాత్రమే. 2014, 2019 ఎన్నికలలో ఈ స్థానంలో తెలుగుదేశం పరాజయం పాలైంది.  సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇక్కడ నుంచి గత రెండు ఎన్నికలలో కూడా సునాయాసంగా విజయం సాధించారు. అయితే 2024లో మాత్రం పరిస్థితులు ఆయనకు పూర్తి ప్రతికూలంగా ఉన్నాయి. జగన్ రెడ్డి పాలన పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకతకు తోడు  సిట్టింగ్ ఎమ్మెల్యే   ప్రజలతో పాటు వైసీపీ క్యాడర్‌లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్త మౌతోంది.  దీంతో క్యాడర్ ముందుకు వచ్చి పని చేయడానికి సిద్ధంగా లేదు. అలాగే యాదవ సామాజిక వర్గం కూడా రాచమల్లుకు దూరమైంది.  కౌన్సిలర్లు కూడా రాచమల్లుకు సహాయ నిరాకరణ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి  వరదరాజులు రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టింది. వరదరాజులు రెడ్డికి తెలుగుదేశం శ్రేణుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తోంది. దీనికి జనసేన, బీజేపీ క్యాడర్ కూడా కలవడంతో రాచమల్లు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక గత కొద్ది కాలంగా వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు జోరందుకున్నాయి. ఆ వలసల జోరు చూస్తుంటే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అయిపోతోందా అన్న అనుమానం కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు.   ఈ పరిస్థితులను బట్టి చూస్తుంటే ప్రొద్దుటూరులో జగన్ మనమంతా సిద్ధం ప్రొద్దుటూరు సభ పార్టీలో జోష్ నింపే అవకాశం లేదని అంటున్నారు.  మనమంతా సిద్ధం అంటున్న జగన్ దేనికి సిద్ధమో  ఈ సభతో రుజువు అయ్యిందని చెబుతున్నారు. ప్రొద్దుటూరు   బహిరంగసభలో  జగన్ సుదీర్ఘ ప్రసంగం సభకు వచ్చిన వారి సహనానికి పరీక్షగా మారింది.  ఈ సభలో ఆయన తనపై వస్తున్న ఆరోపణలు ఖండించే ప్రయత్నం చేశారు. విశేషం ఏమిటంటే వివేకా హత్య విషయంలో ఇంకా చంద్రబాబునే నిందించే ప్రయత్నం చేశారు. వివేకాను తాము చంపలేదని .. చంపించలేదని మాత్రం ఎక్కడా చెప్పలేదు. అంతా దేవుడికి తెలుసు, అలాగే జిల్లా ప్రజలకూ తెలుసు అంటూ అతి తెలివితేటలు ప్రదర్శించే ప్రయత్నం చేశారు.  చిన్నాన్నను అన్యాయంగా చంపి.. నన్ను దెబ్బ తీసే రాజకీయం చేస్తున్నారు.  ఇంత కన్నా అన్యాయం ఉంటుందా?  అంటూ బేలగా ప్రజలను ప్రశ్నించారు.   చిన్నాన్నను  దారుణంగా చంపి  బహిరంగంగా ఆ హంతకుడు తిరుగుతున్నాడని ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారని జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. వివేకాను చంపిన వారిని నెత్తిన పెట్టుకుని చంద్రబాబు మద్దతు ఇస్తుంటే..  ఆ చంద్రబాబుకు  రాజకీయ లబ్ధి చేకూ ర్చేందుకు  తపించి పోతున్న ఒకరిద్దరు తన వాళ్లు ఆయనకు వంత పాడుతున్నారని జగన్ చెప్పారు. అయితే జగన్ ఎంతగా చెప్పినా జనం నుంచి స్పందన కనిపించలేదు. వివేకా హంతకులకు చంద్ర బాబు  మద్దతుగా ఉన్నారని జగన్ చెప్పినప్పుడు సభకు వచ్చిన జనం కనీసం చప్పట్లు కొట్టలేదు. జగన్ చెబుతున్నదంతా అబద్ధమని తమకు తెలుసునన్నట్లు మౌనంగా ఉండిపోయారు.   ఇక డ్రగ్స్ కేసుపైనా సీఎం జగన్ స్పందించారు. చంద్రబాబు వదినగారి చుట్టం తన కంపెనీకి డ్రై ఈస్ట్‌ పేరుతో డ్రగ్స్‌ దిగుమతి చేస్తుంటే సీబీఐ వాళ్లు రెయిడ్‌ చేశారు. ఈ రెయిడ్‌ జరిగిందని తెలిసిన వెంటనే.. వైసీపీపై ఆరోపణలు చేయడం మొదలెట్టేశారని పేర్కొన్నారు.  విపక్షాల పొత్తులపైనా జగన్ అసహనం వ్యక్తం చేశారు. ఒక్కడి మీదకు అందరూ కలిసి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు కళ్ల నీళ్లు పెట్టుకున్నంత పని చేశారు.   తన చెల్లెళ్లను కూడా తన మీదకు యుద్దానికి తెస్తున్నారన్నాని బాధపడ్డారు. అయితే చెల్లెళ్లు జగన్ కు వ్యతిరేకంగా నిలబడడానికి కారణాలేమిటో రాష్ట్రంలో అందరికీ తెలుసు దాంతో జగన్ మెలో డ్రామా జనానికి పట్టలేదు. వారి నుంచి ఎటువంటి స్పందనా కనిపించలేదు. మొత్తంగా మనమంతా సిద్ధం పేరుతో యాత్ర ప్రారంభించిన జగన్ తొలి సభ చప్పగా ముగిసింది. జనం నుంచి స్పందన లేకపోగా, పార్టీ శ్రేణులను కూడా ఉస్సూరుమనిపించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: Mar 28, 2024 10:17AM

తాము అధికారంలో రాగానే 25 లక్షల ఉద్యోగాలు: పలమనేరులో చంద్రబాబు 

తాము అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ప్రజాగళం యాత్రలో భాగంగా ఆయన పలమనేరులో మాట్లాడుతూ యువతరం ఆశలను జగన్ వమ్ము చేశారని విమర్శించారు. రాయలసీమ అభివృద్ధి కోసం జగన్ చేసింది శూన్యమన్నారు. అనంతపురంలో కియా పరిశ్రమ ఏర్పాటుకు తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని చెప్పారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని, ఆ ప్రాజెక్టులను తాము అభివృద్ధి చేశామని చంద్రబాబు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ రాయలసీమ ద్రోహి అని చంద్రబాబు అభివర్ణించారు. మే 13తో రాష్ట్రానికి పట్టిన జగన్ శని వదిలిపోతుందన్నారు.పలమనేరు ప్రజాగళం సభ జరుగుతున్నప్పుడు టిడిపి కార్యకర్తలు ఒక్కసారిగా సభాప్రాంగణం వద్దకు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో తోపులాట జరిగింది. త్రి కూటమి జెండాలతో సభాప్రాంగణం కళ కళలాడింది. 
Publish Date: Mar 27, 2024 7:12PM

ఇడుపులపాయలో విజయమ్మ .. జగన్ ను క్షమించేశారా?

మేమంతా సిద్ధం అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచార బస్సు యాత్రను ఇడుపుల పాయలోని తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి ప్రారంభించారు. బుధవారం (మార్చి 27)న ఆయన తన ఎన్నికల ప్రచార బస్సు యాత్రకు ఇడుపుల పాయ నుంచి శ్రీకారం చుట్టారు. ఆ సందర్భంగా ఇడుపులు పాయలో జగన్ ను తల్లి  విజయమ్మ ఆశీర్వదించారు. అయితే ఇడుపుల పాయలో విజయమ్మ జగన్ పక్కన కనిపించడంతో రాష్ట్ర రాజకీయవర్గాలలో  పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  ఎందుకంటే.. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తల్లి  వైఎస్ విజయమ్మ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్ష పదవికి.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చాలా కాలం కిందటే రాజీనామా చేశారు. తన రాజీనామా నిర్ణయాన్ని ఆమె పార్టీ ప్లీనరీ వేదికపై నుంచి ప్రకటించారు. వాస్తవానికి పార్టీ  గౌరవాధ్యక్ష పదవి ఏమంత  క్రియాశీల పదవి కాదు.  అయినా విజయమ్మ ఆ పదవికీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. తన కుమార్తె తెలంగాణలో తన భర్త పేరుమీదనే ఏర్పాటు చేసిన పార్టీ కోసం పని చేయడానికి రాష్ట్రం వదిలి వెళ్లిపోయారు. దీంతో వైసీపీ పార్టీకి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డితో ఉన్న రాజకీయ బంధం పుటుక్కుమని తెగిపోయినట్లే అప్పట్లో అంతా భావించారు. ఆ తరువాత జరిగిన పరిణామాలు కూడా అదే విషయాన్ని తేటతెల్లం చేశారు. పార్టీతో బంధం తెంచుకున్న తరువాత విజయమ్మ కూడా జగన్ తో ముభావంగానే ఉన్నారు. కుమార్తె తోడిదే లోకంగా సాగారు.   కాగా అమె వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా వెనుక ప్యాలెస్ కూ ఉందన్న ఆరోపణలు అప్పట్లో గట్టిగా వినిపించాయి. విజయమ్మను పార్టీ గౌరవాధ్యక్ష పదవి నుంచి అగౌరవంగా సాగనంపేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలూ అప్పట్లో వెల్లువెత్తాయి.   వాస్తవానికి వైఎస్ మరణం తరువాత  జగన్ రెడ్డికి రాజకీయంగా అండగా నిలిచింది తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల మాత్రమే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా తల్లి విజయమ్మ జగన్ కు అండగా నిలిచిన కారణంగానే వైఎస్ అభిమానులంతా జగన్ కు మద్దతుగా నిలబడ్డారు. ఇక జగన్ రెడ్డి  జైల్లో ఉన్న రోజుల్లో కానీ, 2019 ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్ర  సాగించిన సమయంలో కానీ, పార్టీ వ్యవహారాలను  నడిపించింది కూడా విజయమ్మ, షర్మిల మాత్రమే.  జగన్ సతీమణి   భారతి వ్యాపార వ్యవహారాలు చూసుకుంటే, అమ్మ, చెల్లి రాజకీయ వ్యహారాలు చక్కపెట్టారు. ఇదే విషయాన్ని విజయమ్మ ప్లీనరీ వేదికనుంచి చేసిన వీడ్కోలు ప్రసంగంలోనూ ప్రస్తావించారు. ముఖ్యంగా, జగనన్న విడిచిన బాణం అంటూ, షర్మిల చేసిన పాదయాత్రను అమె ఆ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తు చేశారు. అయినా అంత చేసినా, జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత  చెల్లిని కష్టాలలోకి నేట్టేశారు, దూరం పెట్టారు అని అర్ధం వచ్చేలా, అందరికీ అర్ధమయ్యేలా తన రాజీనామా సందర్భంగా చేసిన ప్రసంగంలో ఒకింత సున్నితంగానే అయినా స్పష్టంగా చెప్పారు.  ఇప్పుడు జగన్ రెడ్డికి తన అవసరం, చెల్లి అవసరం లేదని అందుకే పార్టీని వీడుతున్నాననీ పరోక్షంగానే అయినా కుండబద్దలు కొట్టేశారు.  ఇక అప్పటి నుంచీ జగన్ రెడ్డికి తల్లి, చెల్లితో సంబంధాలు దాదాపుగా లేవనే చెప్పాలి. అన్నిటికీ మించి  వైఎస్సార్టీపీ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి చెల్లి షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత నేరుగా జగన్ పై విమర్శల బాణాలు సంధిస్తున్నారు. నేరుగా జగన్ కు ఓటు వేయవద్దని ప్రజలకు పిలుపు నిస్తున్నారు. షర్మిల కుమారుడి, సొంత మేనల్లుడి  వివాహానికి కూడా జగన్ రెడ్డి హాజరు కాలేదంటే ఇరువురి మధ్యా సంబంధాలు ఎంతగా బెడిశాయో ఎవరికైనా ఇట్టే అర్ధం అవుతుంది. అయినా కూడా ఇప్పటి వరకూ ఆ విషయంపై ఒక్క మాట కూడా మాట్లాడని తల్లి విజయమ్మ.. జగన్ ఎన్నికల ప్రచార బస్సు యాత్ర ప్రారంభ సమయానికి జగన్ పక్కన కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. జగన్ వేడుకోవడంతోనే విజయమ్మ మొక్కుబడి తంతుగా ఆ కార్యక్రమానికి వచ్చి ఆశీర్వదించి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద ఇడుపుల పాయలో జగన్ పక్కన తల్లి విజయమ్మ కనిపించడంతో మరో సారి జగన్ తల్లికీ, చెల్లికీ చేసిన ద్రోహం, వారి పట్ల వ్యవహరించిన తీరుపే రాష్ట్రంలో విస్తృత చర్చకు తెరలేచింది. 
Publish Date: Mar 27, 2024 6:45PM