ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే జోన్ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశం మీద త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ చెప్పారు. ఈ విషయం మీద అధ్యయనం జరుపుతున్న కమిటీ కాల పరిమితిని అక్టోబర్ 15 వరకు పెంచామని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటు చేయడం తప్పనిసరి అని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తిలేదని ఆయన తేల్చిచెప్పారు. సదానంద గౌడ శుక్రవారం ఇక్కడ రైల్ నిలయంలో ఆయన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 21,022 కోట్ల రూపాయల పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు 2106 కోట్ల రూపాయల నిధులను కేటాయించామన్నారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో 35 ప్రాజెక్టులు వివిద దశల్లో ఉన్నాయన్నారు. 4,325 కి.మీ పొడవు రైల్వే మార్గం పనులకు 20 వేల కోట్ల రూపాయలు అవసరమన్నారు. 958 కి.మీ పొడువు రైల్వే లైన్ల పనులు పూర్తయ్యాయన్నారు. 29 కొత్త మార్గాల్లో సర్వే పనులు చేపట్టగా, 20 మార్గాల్లో సర్వే వివిధ దశల్లో ఉందన్నారు. ఈ ఏడాది మిగిలిన 9 మార్గాల్లో సర్వే పూర్తవుతుందన్నారు.
  హైదరాబాద్‌లోని సంజీవరెడ్డి నగర్‌లో లతీఫ్ అనే విద్యార్థి ఏటీఎంలోనుంచి రెండు వందలు తీసుకుందామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌ ఏటీఎంకి వెళ్ళాడు. ఏటీఎం‌లో అలా కార్డు పెట్టాడో లేదో ఇలా ఏటీఎం బీరువా తెరుచుకున్నట్టు తెరుచుకుంది. ఆ ఏటీఎంలో వున్న 26 లక్షల రూపాయలు కూడా బయటపడ్డాయి. అంత డబ్బు చూసి లతీఫ్ బిత్తరపోయాడు. ఇంకా ముదరని చిన్నపిల్లాడు కావడంతో అతి తెలివితేటలేవీ ప్రదర్శించకుండా టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు. అధికారులు వచ్చే వరకూ ఏటీఎం‌కి కాపలా వున్నాడు. పోలీసులు, బ్యాంక్ అధికారులు హడావిడిగా వచ్చి, ఏటీఎంలో డబ్బు పెట్టిన సిబ్బంది తాళం వేయలేదని తెలుసుకున్నారు. లతీఫ్‌కి థాంక్స్ చెప్పారు. ఇంకో ట్విస్ట్ ఏమిటంటే, ఆ ఏటీఎంలోగానీ, పరిసరాల్లోగానీ సీసీ కెమెరాలు లేవు. లతీఫ్ బదులు ఆ సమయంలో ఎవరైనా ముదుర్లు వెళ్ళినట్టయితే పావలా కూడా తిరిగి దొరికేది కాదు.
  బంగారం స్మగ్లింగ్ చేసేవారి తెలివితేటలు చూసి కస్టమ్స్ అధికారులకే కళ్ళు తిరుగుతున్నాయి. చెన్నై విమానాశ్రయంలో గురువారం నాడు ఏడుగురు మహిళలు బంగారం బిస్కెట్లు స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ఏడుగురు మహిళలు బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోవడం చైన్నై విమానాశ్రయంలో సంచలనం సృష్టించింది. వీరిలో ఒక మహిళ లో దుస్తులో 14 బంగారం బిస్కెట్లు దొరికాయి. అలాగే ఐదుగురు మహిళల బృందం బంగారు బిస్కెట్లను బిస్కెట్ ప్యాకెట్లలో పెట్టుకుని వస్తూ వుండగా కస్టమ్స్ కళ్ళు పట్టేశాయి. అలాగే సింగపూర్ నుంచి వచ్చిన మహిళ దగ్గర నాలుగు సెల్ ఫోన్స్ వున్నాయి. ఆ నాలుగు సెల్ ఫోన్స్ బ్యాటరీల స్థానంలో బంగారు బిస్కెట్లున్నాయి. మొత్తం ఈ ఏడుగురు మహిళల దగ్గర మూడున్నర కిలోల బంగారం దొరికింది.
  దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకి వెటకారం ఎక్కువైపోయింది. అంతకు ముందు మీడియా ముందుకు వచ్చి లేనిపోని వాడుగు వాగేవాడు. ఇప్పుడు ఈ ట్విట్టర్ పుణ్యమా అని ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టమొచ్చిన కామెంట్లు చేస్తున్నాడు. కేసీఆర్ మీద నోటికొచ్చిన కామెంట్లు చేస్తూ వుంటాడు. మొన్నామధ్య వినాయకుడి మీద కామెంట్లు చేసి నాలుక కరుచుకున్నాడు. ఇప్పుడు మహేష్ నటించిన ‘ఆగడు’ సినిమా మీద ట్విట్టర్లో కామెంట్లు చేశాడు. ఈయనగారు తీసేవన్నీ చెత్త సినిమాలు. నేను నా ఇష్టమొచ్చినట్టు సినిమాలు తీస్తా. చూస్తే చూడండి లేకపోతే లేదు అంటాడు. ఈయన మాత్రం వేరే వాళ్ళ సినిమాలు చూసి వెటకారం కామెట్లు చూస్తూ వుంటాడు. ‘ఆగడు’ సినిమా రామ్‌గోపాల్ వర్మకి నచ్చినట్టులేదు. ఆ విషయాన్ని ట్విట్టర్లో వెటకారంగా వెళ్ళగక్కాడు. ‘ఆగడు’ సినిమాని ప్రత్యేక ఆస్కార్‌కి పంపించాలని వ్యాఖ్యానించాడు. ఈ సినిమాకి డైలాగ్స్, డైలాగ్స్ మాడ్యులేషన్ విభాగంలో ఆస్కార్ వచ్చే అవకాశం వుందన్నట్టు ట్విట్ చేశాడు. ‘ఆగడు’ సినిమాని ఆస్కార్‌కి పంపిస్తే ప్రపంచ సినిమాను ఆస్కార్ నిర్వాహకులు తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు. అంతేకాకుండా తన కెరీర్ లో ఓ ఉత్తమ పాత్రను ‘ఆగడు’ సినిమాలో పోషించే అవకాశాన్ని ప్రకాశ్ రాజ్ కోల్పోయాడని మరో ట్విట్ చేశారు. కోన వెంకట్ అంత అద్బుతమైన డైలాగ్స్ రాస్తారంటే తనకు నమ్మబుద్ది కావడం లేదు. సినిమా టైటిల్స్ తాను చూడలేదు. టైటిల్స్ ను కూడా కోన వెంకట్ రాశారా అంటూ చమత్కరించారు. టోటల్‌గా అసలు విషయం ఏమిటంటే, ‘ఆగడు’ సినిమాలో రామ్‌గోపాల్ వర్మ మీద దర్శకుడు శ్రీను వైట్ల కామెంట్లు చేయించాడట. ఆ కోపం వర్మ మనసులో పెట్టుకున్నాడు. అందుకే ఇలా ‘ఆగడు’ మీద ట్విట్లు చేస్తున్నాడు.
  గల్ఫ్‌లోని ఒమన్‌లో ముగ్గురు సభ్యులన్న భారతీయ కుటుంబం మరణించింది. తమిళనాడుకు చెందిన అనే ఓ వ్యక్తి, తన పదేళ్ళ కూతురుతోపాటు వెళ్తున్న కారును ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరూ మరణించారు. ఈ వార్తను వారి కుటుంబానికి తెలియజేయడానికి మృతుడి దగ్గర దొరికిన ఫోన్‌ ద్వారా ప్రయత్నించగా, ఇంటి దగ్గర ఎవరూ ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పోలీసులు సమాచారం చెప్పడం కోసం ఆ ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళేసరికి అక్కడ మృతుడి భార్య కూడా చనిపోయి కనిపించింది. మృతుడు ఒమన్‌లోని సోహర్ స్టీల్ కంపెనీలో పని చేసేవాడు. ఆయన భార్య ఎల్ అండ్ టి సంస్థలో పనిచేసేది. కుమార్తె నాలుగో తరగతి చదువుతోంది. ఈ కుటుంబం మొత్తం ఒకేసారి చనిపోవడం మిస్టరీగా మారింది. తండ్రీ కూతురున్న వాహనాన్ని ట్యాంకర్ ఢీకొందా... లేక ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో వారే ట్యాంకర్‌కి వాహనాన్ని అడ్డు తెచ్చారా అనేది తేలాల్సి వుంది. మొత్తమ్మీద కుటుంబ తగాదాల వల్ల ఈ మరణాలు సంభవించాయని ఒమన్ పోలీసులు అనుమానిస్తున్నారు.
  హైదరాబాద్‌లో పోలీసులు నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలలో ‘వాంటెడ్’ దర్శకుడు బివిఎస్ రవి అలియాస్ మచ్చ రవి దొరికిపోయాడు. మచ్చ రవి దొరికిపోయిన సమయంలో ఆ కారులో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా వుండటం విశేషం. పోలీసులు నిర్వహించిన పరీక్షలో బీవీఎస్ రవి మోతాదుకు మించి భారీగా మద్యం సేవించినట్టు తేలింది. పోలీసులు రవి మీద కేసు నమోదు చేసి కారు స్వాధీనం చేసుకున్నారు. దాంతో రామ్ గోపాల్ వర్మ ఓ ఆటో ఎక్కి వెళ్ళిపోయినట్టు సమాచారం. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భంగా బీవీఎస్ రవితోపాటు మరో 20 మందిని పోలీసులు పట్టుకున్నారు. వీరందరికీ సోమవారం నాడు కౌన్సిలింగ్ నిర్వహించి, మంగళవారం కోర్టులో హాజరు పరుస్తారు. దర్శకుడు బి.వి.ఎస్.రవి గతంలో  ఒకసారి మందుకొట్టి కారు డ్రైవ్ చేస్తూ దొరికిపోయాడు.అయినా మనిషి మారలేదు.
  భారత పర్యటనలో వున్న చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పేరును తప్పుగా పలికినందుకు దూరదర్శన్ ఓ న్యూస్ రీడర్‌ను ఉద్యోగం నుంచి తాత్కాలికంగా తొలగించారు. జీ జిన్‌పింగ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చి, ప్రధాని నరేంద్ర మోడీతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లో తొలి జీని ఆంగ్లంలో ఎక్స్, ఐ అనే రెండు అక్షరాలతోరాస్తారు. రోమన్ అంకెల్లోని '11' కూడా ఈ రెండు అక్షరాల మాదిరిగానే ఉంటుంది. దీంతో సదరు న్యూస్ రీడర్ చైనా అధ్యక్షుడి పేరును ఎలెవెన్ జిన్ పింగ్‌గా ఉచ్చరించింది. దీంతో ఆమెకు ఉద్వాసన పలికారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని డీడీ డైరెక్టర్ జవహర్ సర్కార్ చెప్పారు. అయితే, ఆమె క్యాజువల్ బేసిస్ ఉద్యోగి అని, ఆమెను కొన్ని నెలల పాటు మాత్రమే ఉద్యోగం నుంచి తొలగించామని మరో అధికారి చెబుతున్నారు.
  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తన ఆస్తులను, తన కుటంబ సభ్యుల ఆస్తులను ప్రకటించారు. గత నాలుగు సంవత్సరాలుగా ఎథిక్స్ కమిటీకి తన ఆస్తుల వివరాలను చంద్రబాబు తెలియజేస్తూ వస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే తన బ్యాంకు బేలన్స్ కొంచెం పెరిగిందని, మిగతా ఆస్తులు అలాగే వున్నాయని చంద్రబాబు చెప్పారు. అలాగే తన భార్య ఆస్తులు కూడా అలాగే వున్నాయని, ఆమె ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో మాత్రం కొంత బేలన్స్ పెరిగిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన కుమారుడు లోకేష్, కోడలు బ్రహ్మణి ఆస్తులను కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి వారి ఆస్తులు వారే ప్రకటించుకుంటారని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా తమ కుటుంబం చేస్తున్న వ్యాపారాల వివరాలను కూడా చంద్రబాబు ప్రకటించారు. తమ కుటుంబానికి ఏదో ఒక జీవనాధారం వుండాలన్న ఉద్దేశంతోనే హెరిటేజ్ సంస్థను ప్రారంభించినట్టు చంద్రబాబు చెప్పారు. తమ నిర్వహణలో వున్న హోల్డింగ్స్ ఆస్తుల విలువ 90 లక్షలు పెరిగిందని ఆయన వెల్లడించారు. ఒక్క చిన్న అవకతవక కూడా లేకుండా తమ ఆస్తులు వుంటాయని ఆయన చెప్పారు.తన ఆస్తుల వివరాలను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పూర్తిగా చదివి వినిపించారు. తన ఆస్తుల వివరాలను వెల్లడించడం తన బాధ్యతగా భావిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు.
  అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన కుమార్తెతో పాటు ఆరుగురు మనవళ్లను కాల్చి చంపాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్లోరిడా బెల్ పట్టణంలో నివసించే డాన్ ఛార్లెస్ స్పిరిట్ (51) అనే వ్యక్తి తన ఇంట్లో ఉన్న ఏడుగురిని తుపాకితో కాల్చి చంపాడు. ఆ తర్వాత అతను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు ఆత్మహత్య చేసుకునే ముందే అత్యవసర సేవల విభాగానికి ఫోన్ చేసి ఇంటికి రావాలని చెప్పాడే కానీ.. ఇంటి చిరునామా మాత్రం చెప్పలేదు. ఫోన్ నంబర్ ఆధారంగా ఇంటి చిరునామా కనిపెట్టిన పోలీసులు అక్కడుకు చేరుకునే సమయానికి డాన్ తనను తాను కాల్చుకుని చనిపోయాడు. మొత్తం ఆ ఇంట్లో ఎనిమిది మంది మృతదేహాలు రక్తపు మడుగులో ఉన్నాయి. హత్య చేసిన చిన్నారుల్లో మూడు నెలల బిడ్డతో పాటు.. పదేళ్ల లోపు వారే. డాన్ ఛార్లెస్ మనవళ్లను, కూతుర్నీ చంపడానికి గల కారణాలు తెలియలేదు. కాగా, డాన్ స్పిరిట్ తన ఎనిమిదేళ్ల కొడుకును 2001లో కాల్చి చంపినట్లు స్థానికులు చెప్పారు. ఈ నేరానికి జైలుకు వెళ్లిన డాన్ 2006లో విడుదలయ్యాడు. ఇప్పుడు ఈ దారుణం చేశాడు.
  జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో సంభవించిన వరదల్లో మొత్తం 277 మంది మృతి చెందినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అధికారికంగా ప్రకటించారు. గత 50 యేళ్ళలో ఎన్నడూ లేనివిధంగా జమ్మూకాశ్మీర్‌ను వరదలు ముంచెత్తాయని అన్నారు. అయితే, తొలుత భయపడిన స్థాయిలో మరణాల సంఖ్య లేకపోవడం ఊరటని ఇస్తోందన్నారు. వరదల సమయంలో రాజౌరీ జిల్లాలో ఓ పెళ్లి బస్సు కొట్టుకుపోయి 44 మంది చనిపోయారు. వారితో సహా ఒక్క జమ్మూలోనే 203 మంది మరణించారని వివరించారు. సహాయక చర్యల్లో భాగంగా 74 మృతదేహాలను కాశ్మీర్ వ్యాలీలోని పలు ప్రాంతాల్లో బయటకు తీసినట్లు ఒమర్ వివరించారు. కాగా, కొన్ని మృతదేహాలను జంతువులు తింటున్నాయని, మరికొన్ని దేహాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు కొట్టుకుపోయాయన్న వార్తలను ఆయన తిరస్కరించారు. కాగా, వరద బాధితులను రక్షించేందుకు సైన్యం అందించిన సేవలు ఎంతో గొప్పవన్నారు.
  భారత ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ ముస్లింల ఉదాత్తతను ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. ‘‘భారతీయ ముస్లింలు... దేశం కోసమే జీవిస్తారు. అవసరమైతే దేశం కోసం ప్రాణాలర్పించేందుకూ వెనుకాడరు. భారత్‌కు ఎలాంటి నష్టం కలగకూడదని ప్రగాఢంగా విశ్వసిస్తారు’’ అంటూ శుక్రవారం ఓ అమెరికా టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. ‘‘అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ భారతీయ ముస్లింల గురించి తప్పుగా అర్థం చేసుకుంటోంది. తమ ట్యూన్లకు అనుగుణంగా భారతీయ ముస్లింలు స్టెప్పులేస్తారని అనుకుంటోంది’’ అని కూడా మోడీ వ్యాఖ్యానించారు. ఇస్లాం పేరిట జరుగుతున్న విశ్వవ్యాప్త పోరులో పాలుపంచుకోవాలని భారతీయ ముస్లింలకు పిలుపునిస్తూ, ఇటీవల అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి విడుదల చేసిన వీడియో మీద మోడీ ఈ మేరకు ఘాటుగా స్పందించారు. తన వ్యాఖ్యల ద్వారా భారతీయ ముస్లింల గొప్పదనాన్ని, దేశభక్తిని ప్రపంచానికి తెలియజేశారు.
  ఘజియాబాద్‌లో ఓ టీచరమ్మ కష్టపడి చదువుకుని ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం సంపాదించింది. ఇక పెళ్ళి చేసుకుందామనుకున్ని ఒక మాట్రిమోనీ వెబ్‌సైట్‌‌ని ఆశ్రయించింది. వెబ్‌సైట్ వాళ్ళు చూపించిన ఒక అందగాడిని చూసి ముచ్చటపడి పెళ్ళి చేసుకుంది. ఏడాది నుంచి వారి సంసారం ముద్దు ముచ్చట్లతో సాగుతోంది. అయితే ఈమధ్య ఫేస్‌బుక్ చూస్తున్న ఆమె తన భర్త పేజీ ఒకసారి చూసింది. అంతే ఆమెకి కళ్ళు తిరిగినంత పనైంది. తాను శ్రీరామచంద్రుడని అనుకుంటున్న తన భర్తకి ఆల్రెడీ చాలా ఏళ్ళ క్రితమే ఇంకొకరితో పెళ్ళయిందని, ఓ కూతురు కూడా వుందని తెలుసుకుని షాకైపోయింది. షాక్ నుంచి తేరుకుని పోలీసులకు రిపోర్టు చేసింది. పోలీసులు ఆమెగారి భర్త గారిని అరెస్టు చేసి నాలుగు పీకితే అన్ని విషయాలూ బయటపెట్టాడు. పోలీసులు సదరు దొంగమొగుడు గారిని సగౌరవంగా కటకటాల వెనక్కి నెట్టారు.
  ఆదిలాబాద్ జిల్లాకి చెందిన ఓ యువతికి గత కొద్ది రోజులుగా అసభ్య మాటలు, చిత్రాలతో కూడిన మెసేజ్‌లు రావడం ప్రారంభమైంది. దాంతో ఆమె బెదిరిపోయింది. కొద్దిరోజులు అలా వచ్చి ఆగిపోతాయిలే అనుకుంది. అయితే ఆ మెసేజ్‌ల వరద ఆగలేదు. దాంతో ఆమె తీవ్ర మానసిక క్షోభకు గురైంది. ఎవరికైనా చెబుదామంటే ఆమె ఇబ్బందికరంగా భావించింది. ఆ మెసేజ్‌లు ఎవరు పంపుతున్నారో తెలియక బాధపడింది. అలా నిరంతరం మెసేజ్‌లు వస్తూ వుండే సరికి ఆమె సెల్ ఫోన్ మెసేజ్ సౌండ్ వింటేనే ఉలిక్కిపడే స్థితికి చేరుకుంది. ఎంతకీ అశ్లీల మెసేజ్‌లు ఆగకపోయేసరికి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. దాంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దర్యాప్తు చేసి ఆదిలాబాద్ జిల్లాలోని లక్షణ్ చాందా మండలం వడ్యాల గ్రామం నుంచి ఆ మెసేజ్‌ల వస్తున్నాయని పసిగట్టారు. ఆ మెసేజ్‌లు పంపుతున్న ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. ఇద్దరి మీద నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.
  చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో ఒక లేడీ కిలాడీ భారీ మోసానికి పాల్పడింది. ప్రసిద్ధ కాళహస్తీశ్వరాలయానికి వచ్చిన భక్తులకు ఆ లేడీ కేడీ మత్తుమందు కలిపిన టీ తాగించింది. ఆ టీ తాగిన మహిళా భక్తులు స్పృహతప్పి పడివడంతో లేడీకేడీ వారి దగ్గరున్న నగలను తీసుకుని పోరిపోబోయింది. ఈ విషయాన్ని గమనించిన ఇతర భక్తులు ఆ కిలేడీని పట్టుకుని, దేహశుద్ధి చేసి ఆలయ సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పోలీసులు కిలేడీ దగ్గరున్న బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. మత్తు కలిపిన టీ తాగి స్పృహ తప్పి పడిపోయిన మహిళలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
  హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడాలో దారుణం జరిగింది. కన్నతల్లే కూతుర్చి నడి రోడ్డు మీద హత్య చేసింది. యూసుఫ్‌గూడాలోని లక్ష్మీ నరసింహ నగర్‌లో నివసించే లక్ష్మి (50) తన కుమార్తె కళ్యాణి (25)ని కత్తితో నడిరోడ్డు మీద నరికి చంపింది. కూతుర్ని చంపిన తర్వాత చేతిలో రక్తమోడుతున్న కత్తితో కూతురి శవం పక్కనే భయంకరంగా నిల్చుని వున్న లక్ష్మిని చూసి స్థానికులు బెదిరిపోయారు. లక్ష్మి తన ముగ్గురు కూతుళ్ళతో కలసి లక్ష్మీ నరసింహ నగర్‌లో నివసిస్తోంది. వీళ్ళమధ్య కొంతకాలంగా నెలకొన్న ఆస్తి తగాదాల కారణంగానే ఈ హత్య జరిగిందని తెలుస్తోంది. ఈ హత్య చేయడానికి మిగతా ఇద్దరు కూతుళ్ళు కూడా తల్లికి సహకరించారని సమాచారం. లక్ష్మి తన కన్న కూతుర్ని హత్య చేయడానికి ముందు తన ఇంటి చుట్టూ వున్న క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలను ధ్వంసం  చేసింది. బంజారాహిల్స్‌ పోలీసులు లక్ష్మితోపాటు ఇద్దరు కూతుళ్ళను అదుపులోకి తీసుకున్నారు.
  నటీనటులు: మహేష్‌బాబు, తమన్నా, శ్రుతిహాసన్ (ఐటమ్ సాంగ్), రాజేంద్ర ప్రసాద్ ,నాజర్ , సోనుసూద్, వెన్నెల కిశోర్, పోసాని, ఎమ్మెస్.   సాంకేతికవర్గం: సంగీతం - ఎస్.ఎస్.థమన్ , సినిమాటోగ్రఫీ - కె.వి.గుహన్, నిర్మాతలు - రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం - శ్రీను వైట్ల.   ఘన విజయం సాధించిన ‘దూకుడు’ కాంబినేషన్‌లో రూపొందిన ‘ఆగడు’ సినిమా శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి నుంచీ ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ట్రైలర్లు, సాంగ్స్ ‘ఆగడు’ మీద ఆసక్తిని మరింతగా పెంచాయి.   కథ: అనాథ అయిన శంకర్ (మహేష్‌‌బాబు)ని పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాజారావు (రాజేంద్ర ప్రసాద్) చేరదీస్తాడు. నిన్ను తప్పకుండా పోలీస్ చేస్తానని హామీ ఇస్తాడు. అయితే శంకర్ చేయని నేరానికి బాల నేరస్తుల కారాగారానికి వెళ్ళాడు. అక్కడ బాగా చదువుకుని పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఆ తర్వాత తన వ్యక్తిగత సమస్యకు కారణం కావడంతోపాటు సంఘ వ్యతిరేక శక్తిగా వున్న దామోదర్ (సోనూసూద్)ని హీరో ఎలా ఎదుర్కొన్నాడన్నది ఈ సినిమా కథాంశం.   నటీనటులు: మహేష్‌బాబు ప్రశంసనీయంగా నటించాడు. పంచ్ డైలాగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తమన్నా అందాలు ఆరబోసింది. ఒక్క పాటలో శ్రుతీహాసన్ మెరిసింది.   దర్శకత్వం: శ్రీను వైట్ల సినిమాని మాస్ మసాలతో పూర్తి కమర్షియల్‌గా రూపొందించారు. ‘ఆగడు’ సినిమా మహేష్ అభిమానులకు పండగ చేసుకునేలా వుంది.
  కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడ తనను పెళ్ళి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని కన్నడ హీరోయిన్ మైత్రేయ కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు నేపథ్యంలో కార్తీక్ గౌడ అరెస్టు వరకూ వెళ్ళి బెయిల్ దొరకడంతో జైలు జాతకం తప్పించుకున్నాడు. అయితే మంత్రి కొడుకు మీద కేసు పెట్టిన హీరోయిన్ మైత్రేయని మరో కేసు వేధిస్తోంది. హీరోయిన్ మైత్రేయ తన భార్య అని, తామిద్దరం గతంలో పెళ్ళి చేసుకున్నామని, అయితే మైత్రేయ తనతో కాపురం చేయడం లేదని కన్నడ దర్శకుడు రుషి మొత్తుకుంటూ కేసు పెట్టాడు. ఇప్పుడు రుషి తన భార్య మైత్రేయ తనతో కాపురం చేసేలా ఆదేశించాలని కోరుతూ బెంగుళూరులోని కుటుంబ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

అవును.. ఢిల్లీలో వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు!

పురందీశ్వరిని తిట్టినా నోరు మెదపని కమలదళం   వైసీపీపై కమలదళాల మొహమాటం   'ఏపీ పొలిటిక్ గ్రౌండ్' లో ఇదో మ్యాచ్‌ఫిక్సింగ్                    ఆమె పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆమె సేవలు గుర్తించినందుకే నాయకత్వం ఆ పదవి ఇచ్చింది. దానికి విపక్షాల సర్టిఫికెట్ అవసరం లేదు. మరి అలాంటి నాయకురాలిని, ఒక విపక్ష పార్టీ ఎంపీ దారుణంగా, కులం కోణంలో దూషించిన వైనం విస్మయపరిచింది. ఆ లెక్క ప్రకారమయితే రాష్ట్ర నేతలంతా, సదరు విపక్ష పార్టీ ఎంపీపై మూకుమ్మడి దాడి చేయాలి. అటో ఇటో తేల్చుకోవాలి. కానీ ఏపీలో ఆ లెక్క తిరగబడింది. విపక్ష పార్టీపై విరుచుకుపడాల్సిన జాతీయ పార్టీ రాష్ట్ర నేతలు, దుప్పటి ముసుగేసుకుని పడుకున్నారు. విమర్శకులకు గురైన నాయకురాలు, తమ పార్టీకి చెందిన వారు కాదనుకుంటున్నారు. అధికార పార్టీ అగ్రనేతలతో ఉన్న బాదరాయణ సంబంధంతో, తెగ మొహమాటంలో ఉన్నారు. ఇలాంటి మొహమాటం ఇప్పుడే కాదు. పూర్వ అధ్యక్షుడి విషయంలోనూ కనిపించింది. అధికారపార్టీ అంతగా ప్రభావం చూపిస్తున్న ఈ నాయకులు.. అదే టీడీపీలో, ఒక మాజీ మంత్రి తమపై ఏదైనా వ్యాఖ్యలు చేస్తే మాత్రం, అధ్యక్షుడు సహా అంతా గయ్యిన లేచి ఎదురుదాడి చేస్తున్నారు. ‘ఏపీ పొలిటికల్ గ్రౌండ్’లో జరుగుతున్న.. ఇలాంటి ‘మ్యాచ్ ఫిక్సింగ్ యవ్వారం’ యమా రంజుగా కనిపిస్తోంది.   బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయిన పురందీశ్వరిపై, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్య దుమారం రేపుతోంది. కేంద్రంలోని బీజేపీతో సత్సంబంధాలు నెరపుతున్న వైసీపీ నేతలు.. రాష్ట్రంలో మాత్రం అదే బీజేపీ అగ్రనేతలను, దారుణంగా అవమానిస్తున్నారు. అయినా ఢిల్లీ నాయకత్వం మౌనం వహిస్తున్న తీరు, బీజేపీ శ్రేణులలో గందరగోళానికి కారణమవుతోంది. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురదీశ్వరిని,  ‘ఆమె జాతీయ నాయకురాలు కాదు. జాతి నాయకురాలు’అంటూ,  విజయసాయి చేసిన విమర్శపై, బీజేపీ రాష్ట్ర నేతలెవరూ స్పందించకపోవడమే విచిత్రం. చివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా, ఇప్పటిదాకా పెదవి విప్పకపోవడమే ఆశ్చర్యం. ఇది సహజంగా పార్టీ వర్గాల్లో అనుమానాలకు తావిచ్చింది. బహుశా ఆయనకు విజయసాయిని విమర్శించడం, వ్యక్తిగతంగా ఇబ్బందేమోనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు మీద ఒంటికాలితో లేచే సోము వీరత్వం, విజయసాయిపై ఏమయిందన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక చీమ చిటుక్కుమన్నా, వెంటనే సోషల్ మీడియాలో.. అందరికంటే ముందుగానే  కేక వేసే, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి కూడా, ఇంతవరకూ స్పందించకపోవడం మరో విచిత్రం. కరోనాతో ఆయన ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ, పోస్టింగులు వస్తూనే ఉన్నాయి. అయినా పురందీశ్వరిపై.. విజయసాయి చేసిన వ్యాఖ్యలపై ఆయన కూడా స్పందించకపోవడం ఆశ్చర్యమే.   నిజానికి వీరిద్దరూ టీడీపీపై నిరంతరం విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు. కానీ టీడీపీ నేతలెవరూ బీజేపీపై విమర్శలు చేయడం లేదు. అయినా టీడీపీ లక్ష్యంగానే ఈ ఇద్దరు నేతలు విరుచుకుపడుతున్నారు. కానీ, తమ పార్టీ నేతలపై మంత్రులు, వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నా, బీజేపీ నేతలెవరూ ఎదురుదాడి చేయకపోవడమే అనుమానాలకు కారణం.   ఇటీవల జగన్ తిరుమల వెళ్లినప్పుడు.. డిక్లరేషన్ అంశంపై పార్టీ నాయకులెవరూ ధర్నాలు చేయవద్దని, తిరుపతి పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు ఆదే శించారు. అయినా ఆయనను సస్పెండ్ చేయకపోవడం ఆశ్చర్యం. ఒకవేళ సోము అనుమతితోనే ఆయన అలా ఆదే శించి ఉంటే, అది కూడా తప్పేనంటున్నారు. డిక్లరేషన్‌పై బయట మీడియాలో హడావిడి చేసిన తాము.. జగన్ స్వయంగా తిరుమలకు వస్తే ఆయన పర్యటనను అడ్డుకోవద్దని చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది పార్టీ నాయకత్వమే తమ చేతులు కట్టివేసినట్టని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. గతంలో కన్నా లక్ష్మీనారాయణపై.. అదే విజయసాయి దారుణమైన ఆరోపణలు చేసినా, వీరెవరూ స్పందించలేదు. కన్నాపై విజయసాయి చేసిన ఆర్థికపరమైన ఆరోపణలను, ఇన్చార్జి సునీల్ దియోథర్ కూడా నేరుగా ఖండించలేదు. ఇప్పుడు ఇదే దియోథర్.. పార్టీ ప్రధాన కార్యదర్శి పురందీశ్వరిపై, విజయసాయి చేసిన ఆరోపణలను ఖండించడం విశేషం. సునీల్- పాతూరి నాగభూషణం- ఒంగోలు  పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు తప్ప.. రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులెవరూ విజయసాయి ఆరోపణలపై స్పందించకపోవడం ప్రస్తావనార్హం.   దీన్నిబట్టి..తమ పార్టీ నేతలను తిట్టే అధికారాన్ని, బీజేపీ నాయకత్వం  వైసీపీకి దఖలు చేసినట్లు స్పష్టమవుతోంది. రాజ్యసభలో వైసీపీ బలంపై బీజేపీ ఆధారపడింది. అందుకు ప్రతిఫలంగా, ఏపీలో తన పార్టీని బలి చేస్తున్నట్లు.. కన్నా నుంచి పురందీశ్వరి వరకూ జరుగుతున్న ఘటనలు రుజువుచేస్తూనే ఉన్నాయి. మామూలుగా అయితే, బీజేపీ జాతీయ నాయకత్వం దీనిని సీరియస్‌గా తీసుకోవలసి ఉంది. అంతకంటే ముందు.. రాష్ట్ర సంఘటనా కార్యదర్శి మధుకర్‌రెడ్డి, నేతలు సమన్వయ పరిచి, ఎదురుదాడికి మార్గనిర్దేశం చేయాల్సి ఉంది. ఆ అంశంలో ఆయన కూడా విఫలమయ్యారన్న వ్యాఖ్యలు పార్టీలో వినిపిస్తున్నాయి. ఆయన పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని సరైన రాజకీయ పంథాలో నడిపించలేకపోతున్నారన్న అసంతృప్తి పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది.  మొత్తానికి వైసీపీ-బీజేపీ మ్యాచ్‌ఫిక్సింగ్ రాజకీయ క్రీడ సారాంశం, మెడపై తల ఉన్న ఎవరికయినా పెద్ద కష్టపడకుండానే అర్ధమవుతోంది. అదీ అసలు సమస్య! -మార్తి సుబ్రహ్మణ్యం

మండలి పోరులో కమ్యూనిస్టులు.. కేసీఆర్ నయా ప్లాన్! 

రాజకీయ వ్యూహాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ దిట్ట అంటుంటారు. పరిస్థితులు బాగున్నప్పుడు ఒకలా,,, తనకు అనుకూలంగా లేనప్పుడు మరోలా ఆయన అడుగులు వేస్తుంటారు. అవసరమైతే పూర్తి భిన్నమైన వైఖరులు కూడా తీసుకుంటారు. ఎంతకైనా తెగిస్తారు. అందుకే కేసీఆర్ కు మాటమీద నిలబడరనే ఆరోపణలున్నాయి. అవేమి పట్టించుకోని కేసీఆర్.. తాను అనుకున్నది సాధించేందుకు వెనక్కి తగ్గరనే అభిప్రాయం ఉంది. తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లోనూ కేసీఆర్ ఇదే తరహా కొత్త ఎత్తులు వేస్తున్నారు.    కేసీఆర్ సర్కార్ పై ఉద్యోగులు, నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. టీఆర్ఎస్ నేతలే ఈ విషయాన్ని బహిరంగంగా చెబుతున్నారు. త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ ఓటర్లు వీరే. అందుకే మండలి ఎన్నికలు కారు పార్టీని టెన్షన్ పెట్టిస్తున్నాయి. అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా ముందుకు రాని పరిస్థితి ఉంది. పార్టీ పరిస్థితిని అంచనా వేసిన గులాబీ బాస్ మండలి ఎన్నికల్లో గెలుపు కోసం మరో స్కెచ్ వేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకవైపు వెళ్లకుండా, చీలిపోయేలా ఆయన ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. వీలైనంత ఎక్కువ మంది అభ్యర్థులు మండలి బరిలో ఉండేలా పావులు కదుపుతున్నారు. కేసీఆర్ ప్లాన్ లో భాగంగానే మండలి ఎన్నికల్లో కమ్యూనిస్టులు పోటీ చేయాలని నిర్ణయించారనే ప్రచారం జరుగుతోంది. అందుకే టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కు వామపక్షాలు మద్దతు ఇవ్వడం లేదని తెలుస్తోంది.   గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ తో కలిసి కమ్యూనిస్టులు పోటీ చేశారు. ఎన్నికల తర్వాత కూడా కోదండరామ్ తో కలిసి పలు ఉద్యమాలు చేశారు. వామపక్ష పోరాట కార్యక్రమాలకు కోదండరామ్ తప్పనిసరిగా హాజరవుతూ వస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడే యూటర్న్ తీసుకుంటున్నారు కమ్యూనిస్టు నేతలు. టీజేఏసీ చైర్మెన్ గా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన, ఇంతకాలం తమ ఉద్యమాలకు మద్దతుగా  కోదండరామ్ ఎమ్మెల్సీ బరిలో ఉంటుంటే మాత్రం ఆయనకు సపోర్ట్ చేయడం లేదు. కోదండరామ్ కు మద్దతు ఇవ్వాలని టీజేఎస్ అధికారికంగా లేఖలు రాసినా కమ్యూనిస్టు పార్టీలు స్పందించలేదని సమాచారం.    శాసనమండలి ఎన్నికలో పోటీ చేయబోతున్న కోదండరామ్ కు వామపక్షాలు సపోర్ట్ చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వామపక్షాల తీరుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. గత పట్టభద్రుల మండలి ఎన్నికల్లో కమ్యూనిస్టులు పోటీ చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఎందుకు పోటీలో ఉంటున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. కేసీఆర్ చెప్పడం వల్లే మండలి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్, బీజేపీ, కోదండరామ్ తో పాటు వామపక్ష అభ్యర్థి, పోటీలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి పోతుందని, అంతిమంగా అది అధికార పార్టీకి లాభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే కేసీఆర్ డైరెక్టుగా వారితో పొత్తు పెట్టుకోకుండా.. మండలి ఎన్నికల్లో మరో దారిలో వస్తున్నారని చెబుతున్నారు.    అసెంబ్లీ సమావేశం సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డితో కలిసి కేసీఆర్ లంచ్ చేశారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు మండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మాట్లాడటానికే చాడాను కేసీఆర్ పిలిపించినట్లు అప్పుడే ప్రచారం జరిగింది. కాని సీపీఐ నేతలు మాత్రం ఖండించారు. కొత్త రెవిన్యూ చట్టం గురించే చాడాతో ముఖ్యమంత్రి మాట్లాడారని వివరణ ఇచ్చారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఎన్నికల గురించే కేసీఆర్ సీపీఐ నేతతో మాట్లాడినట్లు అంతా అభిప్రాయపడుతున్నారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికపైనా కమ్యూనిస్టులు ఇంకా తమ వైఖరిని ప్రకటించకపోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. దుబ్బాకలోనూ అధికార పార్టీకి వామపక్ష పార్టీలు మద్దతు ఇవ్వొచ్చని చెబుతున్నారు.

సీనియర్ల దక్కని చోటు.. జీవీఎల్ కు అదే మైనసా! 

భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కమిటిలో తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి చోటు దక్కగా.. గతంలో కమిటీలో పనిచేసిన ముగ్గురు సీనియర్లను తప్పించారు. ఇప్పటివరకు బీజేపీ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న రాంమాధవ్‌, మురళీధర్‌రావులను తప్పించారు. జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీఎల్ నరసింహరావును ఈసారి జాతీయ కమిటీలోకి తీసుకోలేదు. ఈ ముగ్గురు సీనియర్ నేతలకు జేపీ నడ్డా టీమ్ వో  చోటు దక్కకపోవడంపై ఆసక్తి కర చర్చ జరుగుతోంది. బీజేపీలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.                      రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జీవీఎల్‌ నరసింహారావు ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల్లో తలదూర్చి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. అన్ని అంశాల్లోనూ జీవీఎల్ వైఖరి వైసీపీకి అనుకూలంగా, టీడీపీకి వ్యతిరేకంగా ఉంటుందనే గతంలోనే హైకమాండ్ కు కొందరు నేతలు ఫిర్యాదులు చేశారు. అమరావతి విషయంలోనూ రాష్ట్ర నేతల అభిప్రాయానికి భిన్నంగా జీవీఎల్ ప్రకటనలు ఇచ్చేవారనే విమర్శలు బీజేపీలోనే ఉన్నాయి. జగన్ ప్రభుత్వంపై వచ్చే అవినీతి ఆరోపణల విషయంలోనూ జీవీఎల్ ప్రకటనలు రాష్ట్ర పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో పోరాడాలని భావించిన రాష్ట్ర నేతలకు జీవీఎల్ ప్రకటనలు చాలా సార్లు అడ్డంకులు కల్పించాయి. దీంతో రాష్ట్ర నేతల నుంచి వచ్చిన అభిప్రాయాలు.. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలించాకే జీవీఎల్ ను అధికార ప్రతినిధి బాధ్యతల నుంచి హైకమాండ్ తప్పించిందని  బీజేపీ వర్గాల్లో  ప్రచారం జరుగుతోంది.    జాతీయ కమిటీలో స్థానం కోల్పోయిన తెలంగాణకు చెందిన సీనియర్ నేత మురళీధర్‌రావుపైనా ఇదే రకమైన చర్చ జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మురళీధర్ సన్నిహితంగా ఉంటారనే ఆరోపణలున్నాయి. తెలంగాణ ప్రభుత్వంపై పోరాటంలో ఆయన ఎప్పడూ యాక్టివ్ గా లేరని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ కారణంగానే ఆయనను తప్పించారని సమాచారం. కరీంనగర్ కు చెందిన బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నందున.. అదే జిల్లాకు చెందిన మురళీధర్ రావును జాతీయ కమిటి నుంచి తప్పించారనే చర్చ కూడా జరుగుతోంది. ఉత్తర తెలంగాణ వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినందున..దక్షిణ తెలంగాణకు చెందిన డీకే అరుణకు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కట్టబెట్టారని భావిస్తున్నారు.    పార్టీ సినియర్ నేత రాంమాధవ్ ను జాతీయ కమిటి నుంచి తప్పిస్తారని చాలా  కాలంగా ప్రచారం జరుగుతోంది. రాంమాధవ్‌ను గత కొంతకాలంగా పార్టీ వివిధ బాధ్యతల నుంచి తప్పిస్తూ వస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ త్వరలో తన కేబినెట్‌ను విస్తరించనున్నట్లు, అందులో రాంమాధవ్ కు అవకాశం కల్పిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే రాంమాధవ్ కు జాతీయ కమిటీలో చోటు దక్కలేదంటున్నారు.    భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కమిటీలో తెలుగు రాష్ట్రాలకు సముచిత ప్రాధాన్యత దక్కింది. ఏపీ నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ఇద్దరు నేతలతు జేపీ నడ్డా టీమ్ లో చోటు దక్కింది. తెలంగాణకు చెందిన మాజీ మంత్రి డీకే అరుణకు వైస్ ప్రెసిడెంట్  ఏపీ నుంచి  దగ్గుబాటి పురందేశ్వరికి  జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్‌ను అదే పదవిలో కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమించారు.

బ్రేకింగ్‌.. అక్టోబ‌ర్ 15 నుంచి తెరుచుకోనున్న సినిమా హాళ్లు, మ‌ల్టీప్లెక్స్‌లు!

  సినీ ప్రియుల‌కు శుభ‌వార్త‌. ఎప్పుడెప్పుడు థియేట‌ర్లు తెరుచుకుంటాయా, త‌మ అభిమాన హీరోల సినిమాల‌ను బిగ్ స్క్రీన్‌పై చూస్తూ, చిందులు వేద్దామా అని ఎదురుచూస్తోన్న అభిమానుల‌కు సంబరం చేకూరుస్తూ అక్టోబ‌ర్ 15 నుంచి దేశంలో సినిమా థియేట‌ర్లు తెరుచుకోనున్నాయి. ఈ మేర‌కు కేంద్ర హోంమ‌త్రిత్వ శాఖ తాజా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను వెలువ‌రించింది. అక్టోబ‌ర్ 15 నుంచి సినిమా హాళ్లు, థియేట‌ర్లు, మ‌ల్టీప్లెక్స్‌ల‌ను 50 శాతం సీటింగ్ కెపాసిటీతో న‌డుపుకోవ‌డానికి అనుమ‌తినిచ్చింది. డోర్లు మూసివేసి ఉంచే హాళ్ల‌లో 50 శాతం కెపాసిటీతో న‌డుపుకోవ‌చ్చ‌ని చెబుతూనే, 200 మందికి మించి ప్రేక్ష‌కులు ఉండ‌రాద‌ని ప్ర‌భుత్వం నిబంధ‌న విధించింది. ప్రేక్ష‌కులంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా ఫేస్ మాస్క్‌లు ధరించాలి, సోష‌ల్ డిస్టాన్సింగ్ పాటించాలి. థ‌ర్మ‌ల్ స్కానింగ్ త‌ర్వాతే ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల లోప‌ల‌కు అనుమ‌తించాలి. ఏదేమైనా కేంద్ర ప్ర‌భుత్వ తాజా మార్గ‌ద‌ర్శ‌కాల‌తో థియేట‌ర్ల య‌జ‌మానులే కాకుండా మొత్తం సినీ ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేస్తున్నారు. అదే స‌మ‌యంలో అశ్ర‌ద్ధ వ‌హించ‌రాద‌నీ, క‌రోనా మ‌హ‌మ్మారి ద‌రి చేర‌కుండా అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లూ పాటించాల‌నీ ప్రేక్షకుల‌ను కోరుతున్నారు. ఇప్ప‌టికే షూటింగ్‌ల‌కు నిబంధ‌న‌ల‌తో అనుమ‌తులిచ్చిన కేంద్రం ఇప్పుడు థియేట‌ర్ల‌కూ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఫిల్మ్ ఇండ‌స్ట్రీ క్ర‌మంగా గాడిలో ప‌డుతుంద‌నీ, కార్మికుల‌కు తిరిగి ఉపాధి ల‌భిస్తుంద‌నీ అంద‌రూ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

అనుష్క‌పై అన‌వ‌స‌ర నింద‌లు! నిజ‌మేమిటంటే...

  అనుష్క అస‌లు పేరు స్వీటీ శెట్టి. సార్థ‌క నాయ‌ధేయురాలు అని అంద‌రూ అంటుంటారు. ఆమె చిత్ర‌సీమ‌లోకి అడుగుపెట్టి 15 సంవ‌త్స‌రాలు పూర్త‌యిన సంద‌ర్భంగా ఏర్పాటుచేసిన కార్య‌క్ర‌మంలో న‌టిగా ఆమె ఎంత ప్ర‌తిభావంతురాలో చెబుతూ, వ్య‌క్తిగా ఆమెది ఎంత గొప్ప హృద‌య‌మో కూడా ఆ రోజు ఆమె శ్రేయోభిలాషులైన నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు తెలిపారు. హోదాతో, స్థాయితో నిమిత్తం లేకుండా త‌ను ప‌నిచేసే యూనిట్‌లోని అంద‌రినీ న‌వ్వుతూ ప‌ల‌కరించే మంచి మ‌నిషిగా అనుష్క‌ను పేర్కొంటూ ఉంటారు. ఎవ‌రినీ క‌ష్ట‌పెట్ట‌కూడ‌ద‌నే మ‌న‌స్త‌త్వం ఆమెది. అలాంటి ఆమె 'నిశ్శ‌బ్దం' సినిమా నిర్మాత‌కు ఎందుకు స‌హ‌క‌రించ‌డం లేదు? ఈ ప్ర‌శ్న చూడ‌గానే ఎవ‌రికైనా నిజ‌మా.. అనుష్క అలా చేస్తోందా? అనే సందేహాలు రావ‌డం స‌హ‌జం. నిజానికి ఇది నిజం కాదు. అలా అని మీడియాలోని కొంత‌మంది ప్ర‌చారం మొద‌లుపెట్టారు. 'నిశ్శ‌బ్దం' మూవీని నిర్మాత‌లు అక్టోబ‌ర్ 2న నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. థియేట‌ర్ల‌లో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేయ‌డం ఆమెకు ఇష్టం లేదంట‌. అందుక‌ని ఆ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన‌డానికి ఆమె ఇష్టం చూప‌డం లేదంట‌. ఆఖ‌రుకి మీడియా ఇంట‌రాక్ష‌న్‌ల‌కు రావ‌డానికి కూడా ఆమె విముఖ‌త చూపిస్తోంద‌ట‌... అని ఆ వ‌దంతుల‌ ప్ర‌చార‌క‌ర్త‌లు ఒక వివాదాన్ని లేవ‌నెత్త‌డానికి య‌త్నించారు. కానీ అనుష్క సంగ‌తి, ఆమె మంచి మ‌న‌సు తెలిసిన‌వాళ్లెవ‌రూ ఆ ప్ర‌చారాన్ని న‌మ్మ‌లేద‌నుకోండి. 'నిశ్శ‌బ్దం' సినిమా గురించి త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆమె షేర్ చేసిన పిక్చ‌ర్లు, వీడియోలు దీనికి నిద‌ర్శ‌న‌మ‌ని మ‌న‌కు తెలుసు. నిర్మాత‌లు ఎప్పుడంటే అప్పుడు త‌న వంతు ప్ర‌చారానికి సిద్ధ‌మ‌ని ఆమె చాలా రోజుల క్రిత‌మే చెప్పింద‌ని యూనిట్ స‌భ్యులు తెలిపారు. వాళ్ల కోరిక మేర‌కే మంగ‌ళ‌వారం మీడియాకు ఇంట‌ర్వ్యూ సైతం ఇచ్చారు. నెగ‌టివ్ ప్ర‌చార‌క‌ర్త‌ల ప్ర‌చారం మొద‌ల‌వ‌క‌ముందే ఆమె ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌డానికి టైమ్ ఇచ్చారు. డైరెక్ట‌ర్ హేమంత్ మ‌ధుక‌ర్‌ని అడిగినా, నిర్మాత‌ల్లో ఒక‌రైన కోన వెంక‌ట్‌ని అడిగినా ఆమె ఎంత‌టి స్నేహ‌పాత్రురాలో చెబుతారు. అనుష్క గురించి అలాంటి ప్ర‌చారం చెయ్యాల‌ని వాళ్ల‌కు ఎలా అనిపించింద‌ని వాళ్లు ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు. ద‌టీజ్ అనుష్క‌.

రాజేశ్ ట‌చ్‌రివ‌ర్ 'సైనైడ్' మూవీలో ప్రియ‌మ‌ణి

  జాతీయ, అంతర్జాతీయ అవార్డు గ్రహీత రాజేష్ టచ్‌రివర్ దర్శకత్వంలో జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి నటించనున్న చిత్రం 'సైనైడ్'.  మిడిల్ ఈస్ట్ సినిమా ప్రై లిమిటెడ్ పతాకంపై ఎన్నారై పారిశ్రామికవేత్త ప్రదీప్ నారాయణన్ నిర్మిస్తున్నారు. దేశంలోనే సంచలనం సృష్టించిన 'సైనైడ్' మోహన్ కేసు ఆధారంగా క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషలలో సినిమాను రూపొందిస్తున్నారు. దక్షిణాది భాషల్లో ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తుండగా... హిందీలో ప్ర‌ధాన‌ పాత్రలో యశ్‌పాల్ శర్మ నటిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజేష్ టచ్‌రివర్ మాట్లాడుతూ "సైనైడ్ ఇచ్చి 20మంది యువతులను కిరాతకంగా హత్య చేసిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మోహన్ కేసును అత్యంత అరుదైన కేసుగా కోర్టు తీర్మానించింది. ఈ సంచలనాత్మక కేసు ప్రేరణగా తీసుకొని 'సైనైడ్' చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాం. జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి పవర్ ఫుల్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు" అని అన్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి నిర్మాత ప్రదీప్ నారాయణన్ మాట్లాడుతూ "ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా వున్న ప్రియమణి ఇందులో లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ చిత్రం కథాంశం విషయానికి వస్తే... దాదాపు 20 మంది యువతుల్లో ప్రేమను ప్రేరేపించి కర్ణాటకలోని వివిధ హోటల్ గదులలో వారితో శారీరక సుఖాలు అనుభవించి, ఆ తర్వాత గర్భనిరోదక మాత్రల పేరిట సైనైడ్ ఇవ్వడం ద్వారా హత్య చేసి బంగారు ఆభరణాలతో బయటపడిన మోహన్ కథే ఈ సినిమా. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 20 మంది అమ్మాయిలను అతను కనికరం లేకుండా హత్య చేశాడు. ఈ కేసులో కోర్టు అతనికి 6 మరణశిక్షలు, 14 జీవిత ఖైదులను విధించింది. ఈ కేసు తుది తీర్పు కూడా వెలువడింది" అని అన్నారు. ఇంకా నిర్మాత మాట్లాడుతూ "జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. బెంగళూరు, మంగళూరు, కూర్గ్, మడిక్కెరి, గోవా, హైదరాబాద్, కాసరగోడ్ కీలకమైన షూటింగ్ ప్రదేశాలలో షూటింగ్ కొనసాగుతుంది" అని అన్నారు. ప్రియమణి, యశ్ పాల్ శర్మ, చిత్రంజన్ గిరి, తణికెళ్ల భరణి, రాంగోపాల్ బజాజ్, సిజ్జు, శ్రీమాన్, సమీర్, రోహిణి, సంజు శివరామ్, షాజు ముకుందన్, రిజు బజాజ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు 'విశ్వరూపం', 'ఉత్తమ విలన్' వంటి చిత్రాలకు కమల్ హాసన్ తో కలిసి పనిచేసిన షాంద‌త్ సైనూద్దీన్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. అంతర్జాతీయ అవార్డు గెలుచుకున్న బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జార్జ్ జోసెఫ్ సంగీతం అందిస్తున్నారు. అనేక హిందీ, తమిళ, తెలుగు, కన్నడ చిత్రాలకు ఎడిటింగ్ చేసిన శశి కుమార్ ఎడిటింగ్. రాష్ట్ర అవార్డు గ్రహీత గోకుల్ దాస్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. పలు అవార్డులు అందుకొని, ఇటీవల ‘వి’ సినిమాకు మేకప్ లో స్పెషల్ ఎఫెక్ట్స్ తో ప్రశంసలుపొందిన స్పెషల్ ఎఫెక్ట్ మేకప్ మెన్ గా ఎన్.జి. రోషన్,  రాజేష్ టచ్ రివర్ పలు చిత్రాలకు మాటలు రాసిన రవి పున్నం మాటల రచయితగా వ్యవహరిస్తున్నారు.

నిన్న బాలు, మొన్న సుశాంత్.. మృతుల చుట్టూ సంచ‌ల‌నాలు.. మ‌నం ఎటుపోతున్నాం!

  సెప్టెంబ‌ర్ 25న భౌతిక ప్ర‌పంచాన్ని వీడి దిగంతాల‌కు త‌ర‌లిపోయారు గాన‌గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం. ఐదు ద‌శాబ్దాలకు మించి రోజూ ఆయ‌న పాట‌లు వింటూ, వాటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ వ‌స్తున్న మ‌నం, ఇక ఆయ‌న మ‌న‌మ‌ధ్య భౌతికంగా ఉండ‌ర‌నే నిజాన్ని న‌మ్మ‌డానికి క‌ష్ట‌ప‌డుతూ ఉన్నాం. ఇలాంటి స‌మ‌యంలోనూ కొంత‌మంది అన‌స‌వ‌ర వ‌దంతులు, వాదాలు లేవ‌దీస్తూ బాలు కుటుంబానికి మ‌రింత బాధ‌ను క‌లిగిస్తున్నారు. సెల‌బ్రిటీలు మృతి చెందిన‌ప్పుడు సంచ‌ల‌న వార్త‌లు, వివాదాలు రావ‌డం కొత్తేమీ కాదు కానీ, ఇవాళ వాటిలో ఏమాత్రం సున్నిత‌త్వం లేక‌పోవ‌డం, మృతుల‌కు గౌర‌వాన్ని ఇవ్వాల‌నే క‌నీస ఆలోచ‌న చేయ‌క‌పోవ‌డం బాధాక‌రం. బాలు మ‌ర‌ణించార‌నే ప్ర‌క‌ట‌న వెలువ‌డ్డాక హాస్పిట‌ల్స్ బిల్లుల‌ను కుటుంబం స‌కాలంలో చెల్లించ‌క‌పోవ‌డం వ‌ల్లే, ఆయ‌న పార్థివ‌దేహాన్ని హాస్పిట‌ల్ వాళ్లు వెంట‌నే ఇవ్వ‌లేద‌నీ, అందుకే ఆయ‌న మృతి వార్త‌ను చాలా ఆల‌స్యంగా ప్ర‌క‌టించార‌నీ కొన్ని మీడియా సంస్థ‌లు ప్ర‌చారంలోకి తెచ్చాయి. అంతే కాదు, తెలుగువాడైన బాలును క‌డ‌సారి చూడ్డానికి టాలీవుడ్ ప‌రిశ్ర‌మ నుంచి ఒక్క సెల‌బ్రిటీ కూడా వెళ్ల‌లేద‌ని విమ‌ర్శిస్తూ దాన్ని సంచ‌ల‌నం చేయ‌డానికి ప్ర‌య‌త్నించాయి. కోలీవుడ్‌లోనూ బాలును హీరో విజ‌య్ సంద‌ర్శించుకుంటే, అజిత్ రాలేద‌నే విమ‌ర్శ‌ల‌ను పుట్టించారు. వీటిపై బాలు త‌న‌యుడు చ‌ర‌ణ్ స్పందించారు. పెద్ద‌దిక్కును కోల్పోయిన బాధ‌లో ఉన్న త‌మ కుటుంబానికి అలాంటి వ‌దంతులు, విమ‌ర్శ‌లు మ‌రింత బాధ‌ను క‌లిగిస్తాయ‌ని, ద‌య‌చేసి వాటిని ప్ర‌చారం చేయొద్ద‌ని ఆయ‌న అర్థించారు. బాలు మృతి విష‌యంలోనే కాదు, సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి విష‌యంలోనూ ఒక వ‌ర్గం మీడియా అనుస‌రిస్తోన్న ధోర‌ణి జుగుప్ప‌ క‌లిగించ‌క మాన‌దు. మాన‌వ‌త్వం అనేది మ‌చ్చుకైనా లేకుండా ఎన్ని ర‌కాల వాదాలు, వివాదాలు పుట్టిస్తున్నారో చూస్తున్నాం. సోష‌ల్ మీడియా దీనికి ఆజ్యం పోస్తోంద‌నేది నిజం. అభిమానుల‌ను దృష్టిలో పెట్టుకొని సెల‌బ్రిటీలు త‌మ జీవితానికి సంబంధించిన ప‌లు విష‌యాల‌ను రెగ్యుల‌ర్‌గా సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పంచుకుంటూ వ‌స్తున్నారు. ఇదివ‌ర‌కు గుట్టుగా ఉండే అనేకానేక విష‌యాలు ఇప్పుడు బ‌హిరంగ‌మైపోతున్నాయి. దాంతో ఇంకా ఇంకా తెలుసుకోవాల‌ని జ‌నం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆ క్ర‌మంలో వాళ్లు ఇన్‌సెన్సిటివ్‌గా మారిపోతున్నారు. కొన్ని సంద‌ర్భాల్లో విన‌కూడ‌ని, రాయ‌కూడ‌ని భాష‌లో తిట్టుకుంటూ, విమ‌ర్శించుకుంటూ తాము మ‌నుషుల‌మ‌ని కూడా మర్చిపోయి ఎట్లా గొడ‌వ‌లు ప‌డుతున్నారో చూస్తున్నాం. మ‌ర‌ణించిన‌వారిని గౌర‌వించాల‌నేది మ‌న సంస్కృతి మ‌న‌కు చెప్పే నీతి. కానీ జ‌రుగుతున్న‌దేమిటి? టీఆర్పీల కోసం ప‌లు చాన‌ళ్లు వ్య‌క్తిత్వ హ‌న‌నానికి పాల్ప‌డ‌టానికి ఏమాత్రం వెనుదీయ‌డం లేదు. సుశాంత్‌సింగ్ మృతి కేసును ఫాలో అవుతున్న వాళ్ల‌కు ఆ కేసు విష‌యంలో ఆ చాన‌ళ్లు ఏం చేస్తున్నాయో తెలుస్తూనే ఉంది. అంతిమంగా వ్యాపారం కోస‌మే ఇదంతా చేస్తున్న‌ప్ప‌టికీ, ప్ర‌జ‌ల‌కు అది ఎలాంటి సంకేతాలు ఇస్తోంద‌నేదే ప్ర‌శ్న‌. టాలీవుడ్ సెల‌బ్రిటీలతో కానీ, అజిత్‌తో కానీ బాలు కుటుంబానికి ఎలాంటి స‌మ‌స్యా లేదు. ఇంకా చెప్పాలంటే ఆ కుటుంబంతో వాళ్లు బాగానే ఉంటూ వ‌స్తున్నారు. కానీ వాళ్లెందుకు బాలు అంతిమ సంస్కారానికి వెళ్ల‌లేద‌నే ప్ర‌శ్నను బాలు త‌న‌యుడికే వేయ‌డం, ఆయ‌న దానికి స‌మాధానం చెప్పుకోవాల్సి రావ‌డం ఏమిటి?  టాప్ సెల‌బ్రిటీల చుట్టూ ఉండే క్యూరియాసిటీని అర్థం చేసుకోగ‌లం. కానీ దాంతో పాటు సున్నిత‌త్వం, మ‌ర్యాద అనేవి కూడా ఉంటాయ‌ని మ‌నం మ‌ర్చిపోతున్నాం. వార్త‌లను వార్త‌లుగా ఇస్తుంటే జ‌నం ప‌ట్టించుకోర‌ని, ప్ర‌తి దానికీ సెన్సేష‌న‌లిజంను జోడించి ఇస్తూ పోతే.. ఇక వార్త‌కు అర్థం లేకుండా పోతుంది. ఈ విష‌యంపై అంద‌రూ కాస్త ఆలోచిస్తే మంచిది...

చ‌లంను 'ఆంధ్రా దిలీప్' అని తొలిసారి పిలిచిందెవ‌రో తెలుసా?

  పినిశెట్టి శ్రీ‌రామ‌మూర్తి ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంలో పాల‌కొల్లు క‌ళాకారులు పాల్గొన్న 'ప‌ల్లె ప‌డుచు' నాట‌కం 1950-52 ప్రాంతాల్లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ఉర్రూత‌లూగించింది. ఓసారి ఆ నాట‌క ప్ర‌ద‌ర్శ‌న చూసిన హిందీ అగ్ర‌న‌టుడు పృథ్వీరాజ్ క‌పూర్.. అందులో హీరోగా న‌టించిన చ‌లంను చూసి ఆంధ్రా దిలీప్ అని మెచ్చుకున్నారు. 'ప‌ల్లె ప‌డుచు'ను సినిమాగా తీస్తే, అందులోనూ హీరోగా న‌టించిన చ‌లం అంద‌రి దృష్టినీ ఆక‌ట్టుకున్నారు. వెంట‌వెంట‌నే నా చెల్లెలు, వ‌దిన‌గారి గాజులు, ఇల‌వేల్పు లాంటి చిత్రాల్లో ప్ర‌ముఖ న‌టుల‌తో గుర్తింపు క‌లిగిన పాత్ర‌లు పోషించిన శ‌భాష్ అనిపించుకున్నారు. అమాయక‌త్వం ఉట్టిప‌డే క‌థానాయ‌కుడుగానూ, హాస్య‌న‌టుడుగానూ రాణించి స‌వ్య‌సాచి అనిపించుకున్నారు చ‌లం. ఆయ‌న అస‌లు పేరు ర‌మ‌ణా చ‌లం. స్వ‌యంగా ర‌మ‌ణ చిత్ర అనే నిర్మాణ సంస్థ‌ను స్థాపించి మ‌ట్టిలో మాణిక్యం, బుల్లెమ్మ బుల్లోడు, తోటరాముడు, స‌న్నాయి అప్ప‌న్న లాంటి మ్యూజిక‌ల్ హిట్స్‌ను నిర్మించారు చ‌లం.

రాజకీయాలకు బలౌతున్న ఐఏఎస్ అధికారులు

ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు. తండ్రి చేతిలో ఎత్తులు చుసిన వారు తనయుడి చేతిలో లోతులు చూస్తున్నారు. వారిద్దరూ సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఒకరినైతే మెడపట్టుకుని బయటకు గెంటేశారు. మరొకరిని కులం పేరుతో కుళ్లపొడుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరు అధికారులూ కూడా చంద్రబాబు అంటే గిట్టనివారే. ఇద్దరు అధికారులు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చూపుకు గురి అయిన వారే. ఒకరు బలయ్యారు.. మరొకరు అవుతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే ఒకరు ఎల్‌వి సుబ్రహ్మణ్యం. రెండో వారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యంకు జగన్ కేసుల్లో సహా ముద్దాయిగా ఉన్నారని ప్రాధాన్య పోస్టులు ఇవ్వలేదు. ఒక సందర్భంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పోస్టు ఇచ్చినా మళ్ళీ ఆయనను అక్కడ నుంచి తీసి అత్యంత చిన్నదైన యువజన శాఖకు మార్చారు. ఇక రమేష్ కుమార్ పరిష్తితి కూడా దాదాపుగా అంతే. చంద్రబాబు హయాంలో ఆయనకు ఏ కీలక శాఖ లభించలేదు. ఈ ఇద్దరూ వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిభకు తగిన గుర్తింపు పొందారు. ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఇద్దరూ ఆర్ధిక శాఖను నిర్వహించిన వారే. ఆర్ధిక శాఖలో ఈ ఇద్దరిదీ ప్రత్యేకమైన శైలి అని వారితో సాన్నిహిత్యం ఉన్న అధికారులు అంటారు. రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడంలో బిల్లుల చెల్లింపు తదితర విషయాలలో ఎలాంటి వివాదాలు రాకుండా చూసిన వారన్న విషయాన్ని మర్చిపోలేం అని చెప్తున్నారు. ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడం, జవాబుదారీతనం, దుబారా తగ్గించడం వంటి విషయాల్లో ఈ ఇద్దరూ అనేక చర్యలు తీసుకున్నారు.వీరికి ఇంకో పోలిక కూడా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఇద్దరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా పని చేశారు. ఈ ఇద్దరి హయాంలో తిరుమల పవిత్రత రెండింతలు పెరగడమే కాకుండా క్రమ శిక్షణ ఉండేదన్న విషయం మర్చిపోరాదు. భక్తుల సౌకర్యార్ధం ఈ ఇద్దరి హయాంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతో సీనియర్ రాజకీయ నాయకులు ట్రస్టు బోర్డు చైర్మన్లుగా ఉన్నా కూడా ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఈవోలుగా ఉన్నప్పుడు వీరు చెప్పినట్లే నడచుకునేవారన్న పేరుండేది. వృత్తి పట్ల అంతటి నిబద్ధతతో ఈ ఇద్దరు అధికారులు పని చేశారు. అత్యంత సీనియర్ అయిన ఎల్‌వి సుబ్రహ్మణ్యం ను పక్కన పెట్టి ఆయన కన్నా జూనియర్లకు చంద్రబాబునాయుడు చీఫ్ సెక్రటరీ పదవిని అప్పగించారు. అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యని విషయం మనం చూసాం. సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేటాను పక్కన పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఎల్‌వి సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఎన్నికల కమీషన్ ప్రధాన కార్యదర్శిగా నియమించాక సహ ముద్దాయిని సిఎస్ గా ఎలా నియమిస్తారని విమర్శించారు కూడా.   ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ ఎల్‌వీ ని కొనసాగించగా జగన్ ను అందరూ మెచ్చుకున్నారు కూడా. అయితే ఏమైందో ఏమూ కానీ కొద్ది కాలంలోనే ఎల్‌వి ని అత్యంత అవమానకరంగా పదవి నుంచి జగన్ తొలగించిన విధానం కూడా తెలిసిందే. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా దాదాపుగా అలానే జరిగింది. ఆయనను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించడం చంద్రబాబుకు అస్సలు ఇష్టం లేదు. చంద్రబాబు దగ్గర పని చేయడం రమేష్ కుమార్ కూ ఇష్టం లేదని అంటారు. అయితే తన కార్యదర్శిగా పని చేసిన రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నియమించాలని అప్పటి గవర్నర్ ఇ ఎస్ ఎల్ నర్సింహన్ చంద్రబాబుపై వత్తిడి తెచ్చారనీ. గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అప్పగించారనీ అంటున్నారు. రమేష్ కుమార్ పేరు బదులు వేరే అధికారి పేరు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశామని చంద్రబాబు కూడా చెప్పారు. అటువంటి రమేష్ కుమార్ ఇప్పుడు చంద్రబాబు ఏజెంటుగా జగన్ చేతిలో ముద్ర వేయించుకోవడం దురదృష్టం. ఈ ఇద్దరూ ముక్కుసూటిగా మాట్లాడే అధికారులు. ఎలాంటి మొహమాటం లేకుండా విధులు నిర్వర్తించే వారన్న పేరుంది. అలాంటి ఈ ఇద్దరూ కూడా అత్యంత ఘోరమైన అవమానాన్ని పొందారు. ఈ అవమానాలకు వీరు అర్హులు కాదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చని అధికార వర్గాలు అనుకుంటున్నారు. నాయకులు తమ స్వంత ప్రయోజనాల కోసం అఖిల భారత సర్వీసు అధికారులకు కులాలు, ప్రాంతాలు అంటగట్టడం ఏంటని కొందరు ఆవేదన చెందుతున్నారు.

ఆంధ్ర లో బీజేపీ 'పంచ్' తంత్రం...

  * దిగుమతి నాయకులు, బిజినెస్ లీడర్లు, లాబీయిస్టులు కలిసి బీ జె పి ని ఎటు నడిపిస్తారో....  * ఇంతకీ స్థానిక సమరం లో సత్తా చూపించే ట్యాలెంట్ ఆ పార్టీకి ఉన్నట్టా, లేనట్టా....  * జి వి ఎల్ ఋతుపవనాల్లాంటి వారు... ఇలావచ్చి అలా పలకరించి, అటు నుంచి ఆటే మాయమైపోతారు  * సి ఎం రమేష్ లాబీ మాస్టర్ గా ఢిల్లీ లో ప్రసిద్ధులు.. నోకియా మాదిరి ఈయన కూడా కనెక్టింగ్ పీపుల్ నినాదాన్ని బలంగా నమ్మిన వారు  * సుజనా చౌదరి... గత్యంతరం లేని పరిస్థితుల్లో అమరావతి నినాదాన్ని భుజాన వేసుకుని చందమామ కథలో విక్రమార్కుడి మాదిరి ... వై ఎస్ ఆర్ సి పి లోని బేతాళుడి తో జగడమాడుతుంటారు  * టీ జీ వెంకటేష్.. అవసరార్ధ రాజకీయాల కు కేరాఫ్ అడ్రెస్ .... రాయలసీమ అనేది ఈయనకు ట్యాగ్ లైన్ ...దురదపుట్టినప్పుడు గోక్కోవటానికి ఉపయోగపడే ఆరో వేలుగా ఆయన ఆ నినాదాన్ని బాగా వాడేస్తారు..  * అంగ వంగ కళింగ రాజ్యాలను అవలీలగా గెలిచిన చక్రవర్తి, చివరకు ఆముదాలవలస లో ఓడిపోయినట్టు, రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ , చివరకు పవన్ కళ్యాణ్ తో కలిసి స్థానిక సమరం లో బీజేపీకి కాస్తో కూస్తో ఉన్న ఇమేజ్ ని పణం గాపెట్టే సాహసానికి ఒడిగట్టారు  ఆ ఐదుగురూ ఇంతకీ ఏమి చేస్తున్నట్టు..భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్ , కాంగ్రెస్ లో నుంచి బీ జె పి లోకి షిఫ్ట్ అయిన  బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ  నారాయణ కలిసి ఈ స్థానిక సమరం లో రాష్ట్రం మొత్తం మీద కనీసం ఒక్కొక్కరికి 50 చొప్పున 250 మంది ఎం పి టి సి లు, జెడ్ పీ టి సి లను  గెలిపించుకురాగలరా అనేది చాలా పెద్ద సందేహం గా కనిపిస్తోంది. ఎందుకంటే, నిన్ననే విజన్ డాక్యుమెంట్ ని కలిసి ఆవిష్కరించిన బీ జె పి , జన సేన కంబైన్ నేతలు , చాలా పెద్ద  దృశ్యాన్నే జనం ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వై ఎస్ ఆర్ సి పి, తెలుగుదేశం పార్టీ లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు గా ప్రకటించుకున్న ఈ ఐదుగురిదీ  వాస్తవానికి తలో దారీ.. ఎవరు , ఎప్పుడు, ఎందుకు, ఎలా మాట్లాడతారో తెలీని గందర గోళం ....  జి వి ఎల్ నరసింహ రావు ది అయితే సొంత రాజ్యాంగం, పూర్తిగా పార్టీ రాష్ట్ర శాఖ తో  గానీ, లేదా బీ జె పి లో ఉన్నతెలుగుదేశం మాజీ లతో  కానీ ఈయనకు ఎలాంటి సంబంధాలు ఉండవు.  రాష్ట్రాన్ని ఎప్పుడైనా పలకరించడానికి రుతు పవనాల మాదిరి అలా చుట్టపు చూపు గా వచ్చేసి ,  ఇలా మాయమైపోయే  జి వి ఎల్ వ్యవస్థ ల గురించి రాష్ట్ర బీ జె పి లో ఎవరికీ ఎలాంటి క్లూలు ఉండవు. ఈయన దారి రహదారి. ఈయన వ్యవస్థ ఇలాఉంటే, బీ జె పి లో ఉంటూ కూడా ఇంకాతెలుగు దేశం ఎజెండా , జెండా రెండూ మోస్తున్నట్టు కనిపించే సుజనా చౌదరి ఒక్క అమరావతి అంశం మీద తప్పించి, ఇతరత్రా ఏదీ మాట్లాడటానికి ఎక్కువగాఇష్టపడరు. జీ వీ ఎల్ కు, సుజనా కూ క్షణం పడదు. ఆయన ఎడ్డెం అంటే ఈయన తెడ్డెం అనే రకం.. ఏ మాత్రం పొసగని,పొంతన లేని పరస్పర భిన్నమైన అభిప్రాయాలు గల వీరిద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం మాదిరి ఒకే పార్టీ లో ఉంటూ కూడా కామన్  ఎజెండా తో పని చేసిన దాఖలాలు ఇప్పటివరకూ అయితే లేవు.   ఇహ, సి ఎం రమేష్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయన తన బిజినెస్ వ్యవహారాలను బీ జె పి తో ముడి కట్టేసి, ఏ పార్టీ లో ప్రయాణిస్తున్నాడో కూడా మర్చే పోయి, మొన్నటికి మొన్న పరిమళ్ నత్వాని ని జగన్ మోహన్ రెడ్డి దగ్గర ప్రవేశ పెట్టడం లో కీలక పాత్ర పోషించిన  ఘనుడు. గుర్తు చేస్తే కానీ తానూ బీ జె పి లో ఉన్నాననే విషయం గుర్తుండని ఈయన కు  బీ జె పి, జన సేన కలిసి పోటీ  చేస్తున్న విషయం తెలుసో లేదో అని కూడాపార్టీ శ్రేణులు గుసగుస లాడుకుంటున్నాయి.  ఇహ వీరందరినీ సమన్వయము చేసుకుని  ముందుకెళ్తున్నట్టు భావిస్తూ , బాహ్య ప్రపంచం ముందు ఆవిష్కృతమయ్యే  వ్యక్తి మరెవరో కాదు... సాక్షాత్తూ  రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. ఈయన, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణించటానికి అంతగాసుముఖం గా లేదు...కారణమేమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి యోధులతో పోరాడిన తన రాజకీయం , చివరకు ఇలా ఏ పూట ఎక్కడ ఉంటారో కూడా తెలీని పవన్ కళ్యాణ్ పార్టీతో కలిసి పని చేయాల్సిన దుస్థితికి దిగజారటమేమిటని  తరచూ తనలో తానె కుమిలి పోతున్నట్టు సమాచారం.  ఇహ, టీ జీ వెంకటేష్ అయితే మరీను..... రాయలసీమ నినాదాన్ని తన ట్యాగ్ లైన్ గాచేసుకుని కాలక్షేపం చేసేస్తూ... ప్రస్తుతానికి బీ జె పి లో నివసిస్తూ ....ఈ స్థానిక ఎన్నికల సమరం లో తన పాత్ర ఏమిటో కూడాతెలీకుండా జీవనం వెళ్లదీస్తున్నారు. మొత్తానికి ఈ పంచ పాండవులు స్థానిక సమరం లో తమ 'పంచ్ ' పవర్ ఏమిటో ఈ నెలాఖరు లోగా చుపిస్తారేమోననే బోలెడు , ఇంకా గంపెడాశతో బీ జె పి అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

ఏపీలో వంద కోట్ల దందా.. రియల్ క్రైమ్ స్టోరీ

సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన.. ఆ రియల్ స్టోరీ టైటిల్ వచ్చేసి.. "ఓ కిడ్నాప్, వంద కోట్ల స్కాం". 'నేనే రాజు నేనే మంత్రి' మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. మీరు ఏ పార్టీకి ఓటేసినా మేమే అధికారంలో ఉంటామని. అవును.. కొందరు రాజకీయ నాయకులు.. ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తే.. ఆ పార్టీలోకి జంప్ చేస్తారు. అలాగే అధికారులు కూడా.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలని కాకాపడుతూ వారి ఆటలు సాగిస్తుంటారు. ఈ రియల్ స్టోరీ వింటే అది నిజమని మీకే అర్ధమవుతుంది. కాకినాడలోని సర్పవరంకి చెందిన ఆకుల గోవిందరాజు అనే వ్యక్తికి భోగాపురంలో వంద కోట్ల విలువైన 18 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ ఒక్క విషయం చాలదా.. మాఫియా కన్ను ఆయన మీద పడటానికి. ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్న గద్దకి కింద ఉన్న కోడిపిల్ల కనిపించినట్టు.. మాఫియా వాళ్ళకి ఎక్కడున్నా విలువైన ల్యాండ్స్ కనిపిస్తాయి కదా. అలాగే, బలగ ప్రకాష్ అనే మాఫియా లీడర్ కి.. ఆకుల గోవిందరాజుకి చెందిన ల్యాండ్ పై కన్నుపడింది. ఇంకేముంది ఏకంగా పోలీసులనే రంగంలోకి దింపాడు. ఇక పోలీసులైతే ఓ అడుగు ముందుకేసి ఏకంగా కిడ్నాప్ కే తెరలేపారు. 2017.. సెప్టెంబర్ 19 .... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. మధ్యాహ్నానికి- సాయంత్రానికి నడుమ సూర్యుడు మండిపోతున్న సమయం... అబ్బా ఏమన్నా ముహూర్తమా... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. ఇదే కిడ్నాప్ కి సరైన ముహూర్తం అనుకున్నారేమో పోలీసులు... AP 30 AB 6655 నెంబర్ గల ఇన్నోవా కార్ లో.. పోలీసులు ఆకుల గోవిందరాజు ఇంటికి వచ్చారు. కారు నెంబర్ ఫ్యాన్సీగా ఉన్నా, ఆ ఖాకీలు చేసే పని మాత్రం ఏ మాత్రం పద్దతిగా లేదు. వాళ్ళు చేసే పనేంటో ఆ చుట్టుపక్కల ఉన్నవారికి తెలియదు. కొత్త మొహాలు కావడంతో.. చుట్టుపక్కల వారు కొందరు ఆశ్చర్యంతో, కొందరు అనుమానంతో చూస్తున్నారు. వాళ్ళు అలా చూస్తుండగానే.. దొంగల రూపంలో వచ్చిన పోలీసులు.. గోవిందరాజుని ఇన్నోవాలో పడేసి.. జెట్ స్పీడ్ లో హైవే ఎక్కారు. పోలీసుల భాషలో చెప్పాలంటే దీనినే కిడ్నాప్ అంటారు. కారు హైవే మీద దూసుకెళ్తుంది. ఆ స్పీడ్ చూస్తే.. అంబులెన్స్ డ్రైవర్ కావాల్సిన వ్యక్తి ఇన్నోవా డ్రైవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. డ్రైవర్ స్టీరింగ్ పట్టుకుంటే.. మనం ఖాళీగా ఉండి ఏం చేస్తాం అనుకున్నారేమో.. మిగతా పోలీసులు గోవిందరాజు పనిపెట్టారు. కారు.. కాకినాడ నుంచి భోగాపురం చేరేవరకు.. అంటే దాదాపు నాలుగు గంటల పాటు... గోవిందరాజుని భయపెట్టారు.. బెదిరించారు.. చిత్రహింసలు పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే నరకం చూపించారు. కారు సాయంత్రం 6 గంటలకు భోగాపురం సబ్ రిజిస్టార్ ఆఫీస్ కి చేరుకుంది. ఖాకీలకు భయపడ్డాడో, కాసులకు కక్కుర్తి పడ్డాడో తెలియదు కానీ.. సబ్ రిజిస్టార్ పందిళ్లపల్లి రామకృష్ణ.. సాయంత్రం 4:30 కే రిజిస్ట్రేషన్ కాగితాలు సిద్ధం చేసి.. పదేళ్ల తర్వాత ఫారెన్ నుంచి రిటర్న్ వస్తున్న ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నట్టు.. గుమ్మం వైపు చూస్తూ పోలీసుల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో పోలీసులు గోవిందరాజుని తీసుకొని గుమ్మంలోకి అడుగు పెట్టనే పెట్టారు. గుమ్మంలో వాళ్ళ అడుగు పడిందో లేదో.. సబ్ రిజిస్టార్ మోహంలో వెలుగు వచ్చింది. గోవిందరాజు మోహంలో భయం పెరిగింది. భయంతో చూస్తుండగా ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్న మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనిపించాడు. జర్నీలో పోలీసుల చిత్రహింసలతో భయపడిపోయిన గోవిందరాజు.. బలగ ప్రకాష్ ని చూసి మరింత భయపడ్డాడు. బలగ ప్రకాష్.. పోలీసుల మాదిరి సాగదియ్యలేదు.. కమర్షియల్ సినిమాల్లో విలన్ లాగా ఒక్కటే డైలాగ్ కొట్టాడు.. "సంతకం పెడతావా? సమాధిలో పడుకుంటావా?".... ఆ ఒక్క డైలాగ్ తో గోవిందరాజు భయం చావుభయంగా మారిపోయింది. ఎదురుగా మాఫియా లీడర్.. చుట్టూ భోగాపురం సీఐ నర్సింహారావు, ఎస్సైలు తారక్, మహేష్.. హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు.. ఉన్నారు. ఎస్సైల పేర్లు తారక్, మహేష్ అని హీరోల పేర్లు ఉన్నాయి కానీ.. వాళ్ళ బిహేవియర్ మాత్రం పెద్ద విలన్ల పక్కన ఉండే చెంచా విలన్లు లాగా ఉంది. అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులే.. మాఫియా లీడర్ తో కలిసిపోయి.. చిత్రహింసలు చేసి బెదిరిస్తుంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో, వంద కోట్లు కంటే విలువైన ప్రాణం కోసం, అన్యాయం ముందు తలవంచి గోవిందరాజు సంతకం పెట్టాడు. ఆ ఒక్క సంతకంతో.. గోవిందరాజు మొహంలో తప్ప.. అక్కడున్న అందరి మొహాల్లో లక్ష్మీకళ ఉట్టిపడింది. అన్నట్టు ఇంత జరుగుతున్నా అక్కడ ఇతరులు ఎవరూ లేరా? అని మీకు అనుమానం రావొచ్చు. అక్కడ నిజంగానే ఎవరూ లేరు.. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ముహూర్తం అలాంటిది మరి. శూన్యమాసం-అమావాస్య.. బుద్ధి ఉన్నోడు ఎవడైనా రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాడా? వీళ్లంటే.. వంద కోట్ల కబ్జా ల్యాండ్ కాబట్టి.. బుద్ధిని పక్కనపెట్టి.. బెదిరించి.. రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. ఇప్పుడు అర్థమైందా వాళ్ళ శూన్యమాసం-అమావాస్య కాన్సెప్ట్ ఏంటో?!!.. ఈ కిడ్నాప్- కబ్జా వ్యవహారంపై.. సర్పవరం పోలీస్ స్టేషన్ లో 330/217 నెంబర్ తో కేస్ రిజిస్టర్ అయింది. అదేంటో.. FIR కూడా అయిన తరువాత.. చార్జిషీట్ దాఖలు చేయడానికి.. రాజమౌళి RRR చేయడానికి తీసుకునే టైం కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు సర్పవరం పోలీసులు. రెండున్నరేళ్లుగా నాన్చుతూనే ఉన్నారు. ఈ విషయం గురించి.. ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కాకినాడ పోలీసులు రిపోర్ట్ కూడా పంపారు. కానీ చార్జిషీట్ దాఖలు చేసే విషయంలో సర్పవరం సీఐ డిలే చేస్తూనే ఉన్నాడు. ఏంటి ఆ సీఐ ధైర్యం?.. భయపడితే భయపడటానికి ఆయన పోస్ట్ మ్యాన్ కాదు.. పోలీసోడు.. దానికితోడు పొలిటిషీయన్స్ సపోర్ట్ ఉన్నోడు. అవును.. ఈ వ్యవహారంలో.. బడా పొలిటిషీయన్స్ సపోర్ట్ కూడా ఉంది. అదే పోలీసుల ధైర్యం... శ్రీకాకుళం జిల్లాకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత.. అలాగే గత ప్రభుత్వ హయాంలో విప్ గా పనిచేసిన నేత.. వీరిద్దరి సాయంతో సర్పవరం పోలీస్ స్టేషన్ ని ఫుల్ గా influence చేసే ప్రయత్నం బలంగా నడుస్తుంది. అందుకే చార్జిషీట్ కి మోక్షం కలగట్లేదు. ఇంత పెద్ద కిడ్నాప్- కబ్జా జరిగితే అస్సలు చర్యలే తీసుకోకుండా ఎలా ఉన్నారని అనుకుంటున్నారేమో... అబ్బో చాలా పెద్ద చర్య తీసుకున్నారు. భోగాపురం ఇన్స్పెక్టర్ ని బదిలీ చేసారు. అదేంటి!!.. అంత జరిగితే కేవలం బదిలీనా అనుకోవద్దు.. రాజకీయ ఒత్తిళ్లు అలాంటివి మరి.. అర్థంచేసుకోవాలి... ఇంకో విషయం ఏంటంటే.. ఈ వ్యవహారం డీజీపీ ఆఫీస్ కి కూడా చేరింది. మరి ఇంకేంటి.. వెంటనే అందరి మీద చర్యలు తీసుకొని ఉంటారుగా అంటారా? అబ్బో.. మీరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాలు చూసి బాగా మోసపోయారు... అలాంటి పప్పులు ఇక్కడ ఉడకవు. వాస్తవానికైతే... CRPC 41A కింద డీజీపీ నియమించే ఓ సీనియర్ అధికారి.. విచారణ జరిపి.. తదుపరి చర్యల వరకు.. ఆ సీఐని సస్పెండ్ చేసే అవకాశముంది. కానీ ఇక్కడ అలాంటిదేం జరగలేదు. ఏదో ఫార్మాలిటీకి బదిలీతో సరిపెట్టారు. గోవిందరాజు ని బెదిరించి వంద కోట్ల విలువైన ల్యాండ్ అన్యాయంగా లాక్కున్నారు. అయినా తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. పైగా గోవిందరాజునే ఇంకా టార్చర్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లలో భాగంగా.. ప్రస్తుత సర్పవరం సీఐ మరియు అర్బన్ డీఎస్పీ.. గోవిందరాజుని పదేపదే తిప్పించుకుంటున్నారు. ఇక కాకినాడలో ఉద్యోగం వెలగపెడుతున్న.. ఇప్పటి ఓ మంత్రిగారి బావమరిది.. రంగంలోకి దిగడంతో ఈ కేసు మరింత డైల్యూట్ అయింది. అసలే భోగాపురంలో ఎయిర్ పోర్ట్ అంటున్నారు. రెక్కలున్న విమానాలు వస్తున్నాయి అంటే.. ఆటోమేటిక్ గా భూముల ధరలకు రెక్కలొస్తాయి కదా.. అందుకే పోలీసులు- పొలిటీషియన్స్ అండతో మాఫియా ఇంతలా రెచ్చిపోతుంది. అంతేకాదు.. ఈ వ్యవహారం వెనుక.. 2017 ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనిచేసిన ఓ కలెక్టర్ మరియు ఎస్పీ పాత్ర ఉన్నట్టు.. సెక్రటేరియట్ వర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. టీడీపీ పెద్దతలకాయలకు సన్నిహితులైన ఈ ఐఏఎస్, ఐపీఎస్ లు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా తమ హవా కొనసాగించడం... అందరినీ ముక్కు, మూతి ఇలా అన్నింటి మీదా వేలేసుకునేలా చేస్తుంది. ఇంతకీ ఆ ఐఏఎస్ & ఐపీఎస్ ఎవరు? * ఒకరు.. పరుల అవినీతి మీద కాంతివంతంగా దండెత్తే ఐఏఎస్... * ఇంకొకరు.. పొద్దునలేస్తే సుభాషితాలు చెప్పే పాలమీగడ లాంటి ఐపీఎస్.. ఈయనకి టెక్నాలజీ మీద గ్రిప్ బాగా ఎక్కువ. ఈ వ్యవహారంలో వీరిద్దరి పాత్ర కూడా ప్రముఖంగా ఉంది. 'వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కూలిపోతుంది' అన్నట్టు.. ఈ అవినీతి రాబందులను భయపెట్టే గాలివాన ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనుసన్నల్లో.. ఐఏఎస్, ఐపీఎస్లు, పోలీసులు, పొలిటీషియన్స్ అండతో జరిగిన ఈ అన్యాయంపై.. గోవిందరాజు కొద్ది నెలలుగా పోరాడుతూనే ఉన్నాడు. న్యాయం కోసం ఆయన ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదు. సన్నిహితుల సాయంతో న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఆ పోరాడంతో కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి అప్పుడు జరిగింది తప్పుడు రిజిస్ట్రేషన్ అని పేర్కొంటూ... భోగాపురం రిజిస్టార్ డాక్యుమెంట్ రైటర్.. 2019 అక్టోబర్ 19 తేదీన.. 164 CRPC స్టేట్మెంట్ ని.. కాకినాడ ఫస్ట్ అడిషనల్ జ్యూడిషల్ సివిల్ జడ్జ్.. ముందట ఇచ్చాడు. అంతేకాదు.. సీసీ కెమెరాలతో దొంగలని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల పుణ్యమా అని అడ్డంగా బుక్ అయ్యారు. సర్పవరం లో కిడ్నాప్ చేసి.. భోగాపురం తీసుకెళ్లిన.. నాలుగు గంటల తతంగమంతా.. పలు చోట్ల సీసీ కెమెరాలలో రికార్డు అయింది. క్షవరం అయితే కానీ ఇవరం రాదని.. సీసీ కెమెరాలు చూసి దోషులని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల సంగతి మర్చిపోయి ఇలా దొరికిపోవడం కామెడీగా ఉంది. మొత్తానికి కొద్దికొద్దిగా కదులుతున్న తీగతో.. దందా చేసి ఇన్నాళ్లు డొంకలో దాక్కున్నవారు.. ఇప్పుడిప్పుడే భయంతో వణుకుతున్నారు. ముఖ్యంగా డీజీపీకి కంప్లైంట్ వెళ్లడంతో ఐఏఎస్, ఐపీఎస్ ఒణికిపోతున్నారట. మరి ముఖ్యంగా ఆ ఐపీఎస్ అయితే.. డైపర్ వేసుకొని తిరుగుతున్నాడని టాక్... ఇప్పటికే ఆ ఐపీఎస్ గడిచిన రెండు నెలల్లో.. బలగ ప్రకాష్ టీం తో.. ఒకే హోటల్ లో 17 సార్లు సిట్టింగ్ వేశాడు. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు ఆ ఐపీఎస్ ఎంతలా వణికిపోతున్నాడో!! తప్పుని సరిదిద్దాల్సిన పోలీసులే.. ఇంత పెద్ద తప్పు చేశారు. ఈ విషయం డీజీపీ దృష్టికి కూడా వెళ్ళింది. మరి ఆయన ఈ కిడ్నాప్-కబ్జా వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?.. బాధితుడికి ఎప్పుడు న్యాయం చేస్తారు? ఆయన ఇలాగే మౌనంగా ఉంటే ప్రజలకు పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది. ఇక ఈ విషయంలో సర్కార్ కూడా అడుగు ముందుకేసి బాధితుడికి న్యాయం చేయాల్సిన అవసరముంది. అవినీతి రహిత పాలనే అందించడమే తమ లక్ష్యమని చెప్పుకునే అధికారపార్టీ.. అవినీతి-అన్యాయం చేసిన వారికి.. పరోక్షంగా అండగా ఉండటం ఎంత వరకు కరెక్ట్? గత ప్రభుత్వం మీద, అప్పుడు వారికి సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులపైనా.. ఇప్పటి అధికారపార్టీ నేతలు పదేపదే అవినీతి ఆరోపణలు చేస్తుంటారు. మరి ఈ వ్యవహారం మీద ఎందుకు నోరు మెదపడం లేదు? ఇందులో తమ పార్టీ నేతలు కూడా ఉన్నారా? లేక పార్టీ సీనియర్ నేతైన మంత్రి గారి బావమరిది ఇన్వాల్వ్ అయ్యాడని వెనకడుగు వేస్తున్నారా? ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ఈ భోగాపురం భాగోతం వెనుకున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి.. బాధితుడికి న్యాయం చేయాలి. లేదంటే ప్రభుత్వం మీద కూడా నమ్మకం పోతుంది.  

క‌విత‌, ష‌ర్మిలా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?

తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్‌లో పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్‌ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.  సామాజిక కోణంలో తమకు అవకాశం దక్కుతుందని పలువురు సీనియర్లు భావిస్తుండగా, ఇప్పటివరకు పార్టీ తరఫున రాజ్యసభ పదవులు దక్కని వర్గాల వారూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవితను ఈసారి పార్టీ తరఫున రాజ్యసభకు పంపిస్తార‌నే ప్ర‌చారం విస్తృతంగా జరుగుతోంది. అయితే సి.ఎం. కేసీఆర్ ఆలోచ‌నే ఎలా వుందో ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. కెటిఆర్ సి.ఎం. అవుతారా? క‌వితా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?  అయితే హ‌రిష్‌రావు ఈ ప‌రిణామాల‌పై ఎలా స్పందిస్తారు? అనే అంశంపై టిఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్‌ తన తరఫున ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రయత్నాలకు నమ్మకమైన వారి కోసం అన్వేషిస్తున్నారు.  రాజ్యసభ సీటు భర్తీ సామాజిక కోణంలోనే ఉంటుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు భావిస్తున్నారు. ఏపీ కోటాలో పదవీ విరమణ చేస్తున్న టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు వయసు రీత్యా ఈసారి అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. రెడ్లకు అవకాశం లభిస్తే, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, మాజీీ స్పీకర్‌ కె.ఆర్‌.సురే్‌షరెడ్డి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి మధ్య పోటీ ఉంటుందని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మండవ వెంకటేశ్వరావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని అంటున్నారు. బీసీలకు అవకాశం ఇస్తే సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య పేర్లు పరిశీలిస్తారని చెబుతున్నారు. ఎస్సీ కోటాలో భర్తీ చేయాలని భావిస్తే కడియం శ్రీహరి, మాజీ ఎంపీ మంద జగన్నాథం పేర్లు పరిశీలిస్తారని అంటున్నారు. ఎస్సీల్లోనే మాలలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే, టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ గాదరి బాలమల్లు, ఎస్టీ అయితే సీతారాంనాయక్‌ పేరు ఉండొచ్చని అంటున్నారు. అనూహ్యంగా ఒక పారిశ్రామికవేత్తను టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభకు పంపాలని అనుకుంటే హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి పేరు పరిశీలించవచ్చని చెబుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ స్థానాలు ఎవరికీ కేటాయించాలని ఇన్నాళ్లు చర్చించిన అధికార పార్టీ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారి జాబితా సిద్ధమైనట్టు సమాచారం.  కీలకమైన పదవులు కావడంతో పార్టీ నమ్ముకున్నోళ్లు.. తమకు అండగా నిలబడిన వ్యక్తులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది.  మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి - సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీమంత్రి - ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితా ఫైనలైనట్టు తెలుస్తోంది.  షర్మిల ఆపద సమయంలో జ‌గ‌న్‌కు తోడుగా నిలిచారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేశారు. కష్టకాలంలో పార్టీకి షర్మిల పెద్ద దిక్కుగా నిలిచారు. తన సొంత మీడియా సాక్షి ప్రారంభించినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ తో ఉన్నారు. సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ గా కొనసాగుతూనే జగన్ కు రాజకీయాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత సజ్జలను పార్టీలోకి ఆహ్వానించి పెద్ద పదవే ఇచ్చారు. విజయ సాయిరెడ్డి తర్వాత జగన్ కు అత్యంత నమ్మకస్తుడు సజ్జలనే. ఆయన పార్టీలో జగన్ రాజకీయ సలహాదారుడిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో పని చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ తన తోడు ఉండడంతో ఆయనను రాజ్యసభకు జగన్ పంపించనున్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. గతంలో ప్రకాశం ఎంపీగా సుబ్బారెడ్డి పని చేశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సుబ్బారెడ్డి పోటీ చేయలేదు. అప్పుడు ఆయన పదవులు ఆశించకపోవడంతో ఇప్పుడు రాజ్యసభకు పంపించాలని నిర్ణయానికి వచ్చారు. పార్టీలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపితే న్యాయం జరుగుతుందనే భావనలో జగన్ ఉన్నారంట. అనూహ్యంగా రాజ్యసభకు పంపే జాబితాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి ఉండడం గమనార్హం. అనంతపురము జిల్లాకు చెందిన రఘువీరారెడ్డికి పిలిచి మరి రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. యాదవ సామాజికి వర్గానికి చెందిన రఘువీరారెడ్డి జగన్ తండ్రి వైఎస్సార్ తో మంచి అనుబంధం ఉంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే మరొకరిని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిగా పని చేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారంట.  కృష్ణాజిల్లా యాదవ సామాజిక వర్గానికి చెందిన చలమేశ్వర్ సేవలను వినియోగించుకునేలా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందంట. ఎందుకంటే తరచూ జగన్ న్యాయస్థానాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నారు. చలమేశ్వర్ సేవలు వినియోగించుకుంటే జగన్ సేఫ్ గా ఉండడంతో పాటు న్యాయ కోవిదుడికి గౌరవంగా రాజ్యసభను ఇద్దామనే ఆలోచనలో ఉన్నారంట.

అధికారంలో ఉంటే ఒకలా... ప్రతిపక్షంలో ఉంటే మరోలా... వైజాగ్ ఎపిసోడ్ నీతి ఏంటి?

రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా, అనామకులుగా మారిపోయారు. దశాబ్దాల తరబడి రాజ్యాన్ని ఏలినవారు, ఇప్పుడు సైడైపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఉద్దండుల పరిస్థితి ఇప్పుడలాగే కనిపిస్తోంది. ఎంతోమంది ముఖ్యనేతలు తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మళ్లీ వాళ్లకు మంచి రోజులు వస్తాయని మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ ఊహించని రాజకీయ మార్పులు జరగడంతో ఓడలు బళ్లు... బళ్లు ఓడలయ్యాయి.  అయితే, అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలా ఉంటే మరోలా వ్యవహరించడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. విపక్ష నేతగా ఉన్న సందర్భాల్లో నేతలు వ్యవహరించే తీరు ఒక్కోసారి సాధారణ ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది. నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ క్రితం విపక్ష నేతగా ఉన్నారు. అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా కోసం పట్టుదలతో ఉన్నారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు వైజాగ్ పర్యటనకు వెళ్లారు. అప్పటికే అక్కడ సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరుగుతోంది. ఆ నేపథ్యంలో క్యాండిల్ ర్యాలీకి అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. అయినా కూడా జగన్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి నగరంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక, ఇప్పడు ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. అందులో భాగంగా చంద్రబాబు చేపట్టిన వైజాగ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందులో పోలీసులను తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అయితే, ఇలాంటి సమయంలో విపక్ష నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా పోలీసు వలయాన్ని ఛేదించుకోవాలని తాము అనుకున్నది చేయాలని చూస్తుంటారు. పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తుంటారు. చంద్రబాబు వైజాగ్ టూర్లోనూ అదే జరిగిందనే మాట వినిపిస్తోంది. నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. కాకపోతే...ఆ ప్రయత్నాలు సమాజంలో ఉద్రిక్తతలు పెంచేవిగా మాత్రం ఉండకూడదంటున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్న నాయకులు ప్రజాస్వామ్యంలో విపక్షాలకు ఉండే ప్రాధాన్యాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. అధికారపక్షం, విపక్షం....రెండూ ప్రజాస్వామ్యానికి రెండు చక్రాల్లాంటివని, ఏ ఒక్కటి సరిగా లేకున్నా ప్రజాస్వామ్యం కుంటుపడుతుందని గుర్తుచేస్తున్నారు.

రాజీవ్ గాంధీ మరణించాక ఆ సీక్రెట్ బయటపెట్టిన వాజపేయి!!

అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు హద్దు మీరి విమర్శలు చేసుకోవడమే తప్ప.. విలువైన రాజకీయాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజుల్లో. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నేతల మీద కక్ష తీచుకోవాలన్న ధోరణే తప్ప.. ప్రజల కోసం ఒకరి సూచనలను ఒకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేసేవారు ఎక్కడున్నారు?. ఈతరం రాజకీయ నాయకులు ముందుతరం వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ- వాజపేయి మధ్య జరిగిన ఓ సంఘటన తెలిస్తే.. ఈ తరం రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటారు. అది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయం. అప్పుడు వాజపేయి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారి మధ్య జరిగిన ఓ అపురూప సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  " సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట ".. ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.." ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి "మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం.. ఏర్పాట్లు చూడండి" అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు అటల్జీ ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి. " సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా?" నసిగాడు కార్యదర్శి వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ "నిక్షేపంగా" అన్నారు. ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ, అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు. "సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి?" అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా.. అదీ ఆయన మాటల్లోనే.. "1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా.1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది. డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు. ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా రమ్మని ఫోన్ లో కోరారు. కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ.. 'అటల్ జీ.. ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి' అని చెప్పారు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే. నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే" అని వాజపేయి అన్నారు. అది విలువలతో కూడిన రాజకీయమంటే. రాజీవ్ గాంధీ, వాజపేయి రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేశారు. వారిని చూసి ఈ తరం రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలి. పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అధికార-ప్రతిపక్ష పార్టీల నాయకులు.. రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం.. ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు..!

ఎలా స్పందిస్తారో మీ ఇష్టం!

అనగనగా ఓ అమ్మాయి. ఆ అమ్మాయికి చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి నిబ్బరంగా సంసారాన్ని నెట్టుకొస్తూ ఉంది. కానీ కూతురు మాత్రం ప్రతి చిన్న కష్టానికీ కంగారుపడిపోయేది. ఏం చేయాలో పాలుపోక తెగ బాధపడిపోయేది. ‘ఇక ఈ కష్టాలను భరించడం నా వల్ల కాదమ్మా!’ అని ఓ రోజు తన తల్లితో తెగేసి చెప్పింది కూతురు. తల్లి, కూతరి వంక ఒక్క నిమిషం చూసింది. ఆ తరువాత మారుమాట్లాడకుండా ఆమెను వంటింట్లోకి తీసుకువెళ్లింది. తల్లి తనకేం చెప్పాలనుకుందో తెలియని అయోమయంలో కూతురు ఆమెను అనుసరించింది.   వంటింట్లోకి వెళ్లిన తల్లి ఒక మూడు పాత్రలు తీసుకుంది. ఒకదానిలో బంగాళదుంప, మరోదానిలో కోడిగుడ్డు, ఇంకోదానిలో కాఫీ గింజలు వేసి వాటిని పొయ్యి మీద పెట్టింది. తల్లి చేస్తున్న పని చాలా అసంబద్ధంగా తోచింది కూతురికి. అయినా మారు మాటాడకుండా చూస్తూ నిల్చొంది. ఒక పది నిమిషాలు అయిన తరువాత... ‘ఒకో గిన్నెలో ఏం జరిగిందో గమనించు’ అంటూ అడిగింది తల్లి. ‘గమనించడానికి ఏముంది! బంగాళదుంప వేడి నీటికి మెత్తబడిపోతుంది. కోడిగుడ్డు గట్టిపడిపోతుంది. కాఫీ గింజలతో కాఫీ తయారవుతుంది’ అంది కూతురు ఎగతాళిగా. ‘కదా! పైకి గట్టిగా కనిపించే బంగాళదుంప కాస్త వేడినీరు తగలగానే ఇట్టే మెత్తబడిపోయింది. చేయి తగిలితే చాలు చితికిపోయే కోడిగుడ్డేమో వేడినీటికి గట్టిపడిపోయింది. ఇక కాఫీ గింజలు మాత్రం తన చుట్టూ ఉన్న నీటిని తన ఉనికితో నింపేశాయి,’ అని చెప్పుకొచ్చింది తల్లి. తల్లి చేసిన వింత చేష్ట వెనుక ఏదో మంచిమాట దాగి ఉంటుందని అప్పటికి అర్థమైంది కూతురికి.   ‘మనం కూడా ఇంతే! అప్పటివరకూ ధైర్యంగా ఉన్నవారు కూడా కష్టాలు రాగానే ఇట్టే డీలా పడిపోతారు.. ఆ బంగాళదుంపలా. మరికొందరేమో కష్టాలు ఎదురయ్యేసరికి మొద్దుబారిపోతారు. అప్పటివరకూ సున్నితంగా ఉన్నవారు కూడా రాయిలా మారిపోతారు- కోడిగుడ్డులా. కానీ చాలా కొద్ది మంది మాత్రమే కష్టాలకు ఎదురీదుతారు. ఆ కష్టాలను సైతం తనకు అనుకూలంగా మార్చుకుంటారు. వాళ్ల స్వభావంతో, వారి చుట్టూ ఉన్న వాతావరణమే పూర్తిగా మారిపోతుంది... కాఫీ గింజల్లాగా! ఇప్పుడు చెప్పు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు?’ అని అడిగింది తల్లి. కూతురు మారు మాట్లాడకుండా చిరునవ్వుతో కాఫీని ఒక రెండు కప్పుల్లోకి సర్ది, ఒకదాన్ని తన తల్లికి అందించింది. మరోదాన్ని తను ఆస్వాదించేందుకు సిద్ధపడింది... జీవితాంతం!   - నిర్జర.

మంచి పాస్‌వర్డ్‌ కోసం 10 చిట్కాలు

ఇవాళ రేపట్లో కంప్యూటర్లో ఏదో ఒక అకౌంట్‌ లేకుండా పూట గడవడం లేదు. అది ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ కావచ్చు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ కావచ్చు... ఏదీ కాకపోయినా కనీసం ఈ-మెయిల్‌ అకౌంటన్నా కావచ్చు. వీటన్నింటికీ మంచి పాస్‌వర్డుని ఎంచుకోవడం ఒక సమస్యే! ఆ మన దగ్గరే ఏముందిలే నష్టపోయేందుకు అనుకోవడానికి కూడా లేదు. మన వ్యక్తిగత సమాచారాన్నీ, ఫైళ్లని తస్కరించడం దగ్గర్నుంచీ... మన కాంటాక్ట్‌ లిస్టులో ఉండేవారి మెయిల్స్‌కు తప్పుడు మెయిల్స్‌ పంపడం వరకూ హ్యాకర్లు దేనికైనా తెగించగలరు. ఎవరిపడితే వారి పాస్‌వర్డులను ఛేదించేందుకు ప్రత్యేకమైన సాఫ్టవేర్లు అందుబాటులో ఉన్నాయంటే నమ్మగలరా! అందుకే అలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ఈ చిట్కాలు-   1- చిన్నపాటి పాస్‌వర్డులకు కాలం చెల్లిపోయింది. మీ పాస్‌వర్డు కనీసం 10 అక్షరాలకు పైనే ఉండాలంటున్నారు నిపుణులు. ఇక మరీ జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భాలలో కనీసం 12 నుంచి 14 అక్షరాలు ఉండాలని సూచిస్తున్నారు.   2- పాస్‌వర్డులో కేవలం అక్షరాలే ఉంటే సరిపోదన్నది అందరికీ తెలిసిందే! అంకెలు, అంకెల దిగువున ఉండే సింబల్స్, క్యాపిటల్‌ లెటర్స్‌, స్మాల్‌ లెటర్స్ ఇలా కీబోర్డు మీద టైప్‌ చేయదగిన అన్ని రకాల సంకేతాలనీ వాడాల్సిందే!   3- మీకు సంబంధించిన వ్యక్తిగతమైన వివరాలని (ఉదా॥ పుట్టినరోజు, భార్యపేరు) పాస్‌వర్డులో ఉంచితే పాస్‌వర్డుని ఛేదించడం సులువైపోతుంది. అందుకే మీకు బాగా గుర్తుండి, మీ చుట్టుపక్కల వారికి ఏమాత్రం అవగాహన లేని (ఉదా॥ తల్లి తరఫు ఇంటి పేరు, పిల్లలకి పురుడు పోసిన డాక్టరు పేరు) పాస్‌వర్డులను ఎంచుకోవాలి.       4- నిఘంటువులో కనిపించే పదాలను (ఉదా॥ house, system, daughter) ఎట్టిపరిస్థితుల్లోనూ పాస్‌వర్డుగా ఉంచకూడదు. వీటిని పాస్‌వర్డు తస్కరించే సాఫ్టవేర్లు పసిగట్టేస్తాయి. My wife, happy home వంటి రోజువారీ వాక్యాలను కూడా ఇవి పట్టేస్తాయి.   5- చాలామంది బలమైన పాస్‌వర్డునే ఎంచుకొంటారు. కానీ పాస్‌వర్డు మర్చిపోయినప్పుడు కంప్యూటర్‌ అడిగే ప్రశ్నలకు గాను చాలా తేలికైనవి ఎంచుకొంటారు. ఫలితంగా ఎవరైనా సదరు ప్రశ్నలకు జవాబు చెప్పి మీ అకౌంటులోకి ప్రవేశించే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.       6- మనసులో ఏదో ఒక వాక్యాన్ని అనుకొని అందులోని పదాల తొలి అక్షరాలతో పాస్‌వర్డుని ఏర్పాటు చేసుకోవడం ఒక మంచి పద్ధతి. ఉదా॥ My Son was born on 14th January 2000 అన్న వాక్యాన్ని గుర్తుంచుకోవడం చాలా తేలిక. దీని ఆధారంగా MSWBO1422000 అన్న పాస్‌వర్డుని సృష్టించుకోవచ్చు.   7- వేర్వేరు అకౌంట్లకి ఒకటే పాస్‌వర్డుని ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదన్నది నిపుణులు హెచ్చరిక. ఒకవేళ అలా వాడాల్సి వచ్చినా, తప్పనిసరిగా అందులో ఎంతో కొంత మార్పు చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు పైన ఎంచుకొన్న MSWBO1422000 పాస్‌వర్డుని AMAZONకి కూడా వాడాలనుకుంటే MSWBO-amaze-1422000 అంటూ పాస్‌వర్డుకి తగిన మార్పు చేయవచ్చు.       8- బ్యాంకింగ్‌ వంటి ఆర్థికపరమైన, గోప్యమైన లావాదేవీలు జరిపే ఖాతాలకి చెందిన పాస్‌వర్డుల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. వీటిని తరచూ మారుస్తూ ఉండటం, మరే ఇతర పాస్‌వర్డులతో సంబంధం లేకుండా ఉంచడం అవసరం. ఇందుకోసం ఎలాంటి అనుమానం రాని పాస్‌వర్డులు కావాలనుకుంటే ఆన్‌లైన్లో http://passwordsgenerator.net/ వంటి సైట్లు ఉచితంగా క్లిష్టమైన పాస్‌వర్డులను అందిస్తాయి.   9- ఎట్టి పరిస్థితులలోనూ పాస్‌వర్డుని బయటవారితో పంచుకోకూడదు. ఇవాళ ఉన్న బంధం రేపు ఉంటుందని చెప్పలేం కదా! ఒకవేళ అలా ఎవరితోనన్నా పాస్‌వర్డుని పంచుకోవల్సిన సందర్భం వచ్చినా, ఎవరికన్నా పాస్‌వర్డు తెలిసిపోయిందన్న అనుమానం కలిగినా... వెంటనే దానిని మార్చివేయడం మంచింది.    10- ఈ రోజుల్లో పది రకాల ఖాతాలకు పది రకాల పాస్‌వర్డులు కావాల్సి వస్తోంది. పైగా అవి క్లిష్టంగా ఉండాలన్న నియమం ఎలాగూ ఉంది. దీంతో తరచూ ఏదో ఒక పాస్‌వర్డుని మర్చిపోవడం అతి సహజం. ఇందుకోసం వీటిని వీటిని ఎక్కడన్నా భద్రమైన చోట రాసి ఉంచుకోవడంలో తప్పులేదు. అయితే అలా రాసి ఉంచుకున్న కాగితాన్ని నిర్లక్ష్యంగా ఉంచితే మాత్రం అసలుకే ఎసరు తప్పదు! - నిర్జర.

అందుకే స్నేహితుడు కావాలి!

అదో పెద్ద అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులు. వాటిలో సహజంగానే ఓ సింహమూ, ఓ జింకా ఉన్నాయి. ఒక రోజు ఆ సింహం జింకని చూడనే చూసింది. వెంటనే దాన్ని వేటాడేందుకు వెంటపడింది. సింహం నుంచి తప్పించుకోవడానికి జింక చాలా ప్రయత్నమే చేసింది. దాని నుంచి పరిగెడుతూ పరిగెడుతూ పొరపాటున ఒక చెరువులోకి పడిపోయింది. దాన్ని తరుముతూ సింహం కూడా చెరువులోకి దూకేసింది. ఆ చెరువు నిండా నీళ్లున్నా బాగుండేది. కానీ కరువుతో చెరువు సగానికి ఎండిపోయింది. బురదతో నిండిపోయింది. ఆ బురదలో ఒక పక్క జింక, మరోపక్క సింహం మోకాళ్ల లోతు వరకు కూరుకుపోయాయి. ‘‘హహ్హా! ఇంక నేను నీ వెనుక పరిగెత్తాల్సిన పని లేదు. ఈ బురదలో చిక్కుకున్న నీ ఎముకలు విరిచి, నీ లేత మాంసాన్ని రుచిచూస్తాను,’’ అంటూ నవ్వింది సింహం.   ‘‘నా మాంసపు రుచి తర్వాత. ముందు నువ్వు ఇక్కడి నుంచి ఎలా బయటపడగలవో ఆలోచించు,’’ అంటూ వెక్కిరించింది జింక. జింక మాటలకి కోపంగా సింహం ముందుకు కదలబోయింది. కానీ అది ఎంతగా కదులుతుంటే అంతగా బురదలో దిగబడిపోతోంది. ‘‘నిజమే నేను కదల్లేకపోతున్నాను. ఇప్పుడెలా!’’ అని బిక్కమొగం వేసింది సింహం. ‘‘నీకు ఎవరన్నా స్నేహితులు ఉన్నారా?’’ అని తాపీగా అడిగింది జింక.   ‘‘నేను ఈ అడవికి రాజుని. అంతా నన్ను చూసి భయపడేవాళ్లే కానీ స్నేహితులు ఎక్కడ ఉంటారు. నాకు బానిసలు, శత్రువులే కానీ స్నేహితులు ఉండరు,’’ అని గర్వంగా చెప్పింది సింహం. ‘‘కానీ నాకైతే చాలామంది స్నేహితులు ఉన్నారు. మేమంతా కలిసిమెలిసి ఉంటాం. నేను కనిపించకపోయేసరికి వాళ్లంతా నన్ను వెతుక్కుంటూ వస్తారు. ఎలాగైనా నన్ను రక్షిస్తారు,’’ అని నమ్మకంగా చెప్పింది జింక. ‘‘సరే! అదీ చూద్దాం... ’’ అని ధీమాగా అంది సింహం. ఆ బురద చెరువులో కాలం చాలా భారంగా గడిచింది. ఒకో గంటా గడిచెకొద్దీ సింహంలో అసహనం పెరిగిపోయింది. కానీ జింక మాత్రం నిశ్చింతగానే ఉంది. తన స్నేహితులు వస్తారనే నమ్మకం తనలో ఇసుమంతైనా తగ్గలేదు.   సాయంత్రం అయ్యింది. నిదానంగా చీకటి పడింది. అసలే ఆకలితో ఉన్న సింహం డీలాపడిపోయింది. కానీ తన స్నేహితుల మీద ఉన్న నమ్మకంతో జింక మాత్రం నిబ్బరంగా నిలబడి ఉంది. ఇంతలో.... చెట్ల చాటు నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. ముందు ఓ జింక పిల్ల చెరువువైపు తొంగిచూసింది. ఆ తర్వాత మరో జింక, దాని వెనుక ఇంకో జింక.... వరుస పెట్టి ఓ జింకల మంద చెరువుగట్టుకి చేరింది. వాటికి అక్కడి పరిస్థితి చిటికెలో అర్థమైపోయింది. ఎలాగొలా తన నేస్తాన్ని రక్షించుకోవాలని అనుకున్నాయి. తాళ్లే పడేశాయో, చేతులే చాచాయో... మొత్తానికి ఎలాగొలా బురదలో చిక్కుకున్న జింకని ఒడ్డుకి తెచ్చాయి. దాన్ని తీసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ తిరిగి వెళ్లిపోయాయి.   తన కళ్ల ముందే జరుగుతున్నది చూసిన సింహానికి మతిచెడిపోయింది. కచ్చగా తను కూడా బురదలోంచి బయటపడాలని ఒకసారి విదిలించుకుంది. అంతే! అది మరింత లోతుకి జారిపోయింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

ఆత్మబంధువులా నిలిస్తే ఆత్మహత్యలే వుండవు...

సంవత్సరానికి 1,35,445 మంది... ప్రతిరోజూ సగటున 242 మంది మగవారు, 129 ఆడవారు జీవితాన్ని వద్దనుకుని బలవంతంగా ప్రాణాలు వదులుతున్నారు మన భారతదేశంలో. అందులోనూ 15 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉన్నవారే ఎక్కువట. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా పాటిస్తున్న ఈరోజున ఆత్మహత్యలని నివారించడానికి మనంగా ఏం చేయాలని ఆలోచించి తీరాలి. సమాజం, సామాజిక సంస్థలు, ప్రభుత్వం బాధ్యత ఎంతవుందో.. వ్యక్తులుగా, మన బాధ్యత కూడా అంతే వుందన్నది నిజం. అందుకే పెద్ద పెద్ద సిద్ధాంతాలని పక్కనపెట్టి సగటు మనిషిగా ఆలోచిస్తే మనతోపాటు మసలే మన కుటుంబంలోని వ్యక్తి లేదా స్నేహితుడు, బంధువు, సహోద్యోగి లేదా పక్కింటివారు... ఇలా మన పరిధుల్లో మనకి పరిచయం వున్నవారు, నిన్నటిదాకా మనతో వున్నవారు హఠాత్తుగా చడీచప్పుడు లేకుండా బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారంటే అందులో మన పాత్ర ఏం లేదా? మనం చేయగలిగింది ఏం లేదా? వీటిని ఆపడం సాధ్యం కాదా? చిన్న విషయమే.. అందరికీ తెలిసిన విషయమే.. మనందరి అనుభవంలోనిదే. మనసుకి బాధ కలిగితే పంచుకోవడానికి ఒక వ్యక్తి కావలసి వుంటుంది. ఎలాంటి ఆక్షేపణలు లేకుండా కేవలం మనసుపెట్టి వినే ఒక్క వ్యక్తి చాలు ఆ నిమిషానికి దేవుడిలా కనిపిస్తాడు. అందుకే వినటం నేర్చుకుందాం. ఎదుటి వ్యక్తికి మాట్లాడే అవకాశమిద్దాం. మనసులోని బాధనంతా వెళ్ళగక్కేందుకు కొంచెం సమయం ఇద్దాం. సత్సంబంధాలు, సాన్నిహిత్యం మనుషుల్లో భరోసాని, ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగిస్తాయి. ఆపద రాగానే పరిగెట్టుకు రాగలరు. బాధని పంచుకోగలరు. దీనికి చేయాల్సిందల్లా ఒక్కటే.. కొంచెం మానవ సంబంధాలపై దృష్టి పెడదాం. ఉదయం లేచి మనకి ఎదురుపడే ప్రతి ఒక్కరిని చిన్న చిరునవ్వుతో పలకరిద్దాం. ఇంట్లోని పనిమనిషి నుంచి ఆఫీసులోని ప్యూను దాకా అందరినీ కుశలం అడుగుదాం. నాలుగు కబుర్లు చెబుదాం. మన జీవితంలోని విశేషాలని పంచుకుందాం. వాళ్ళ జీవితంలోని విశేషాలని అడుగుదాం. బలమైన మానవ సంబంధాలు ఎప్పుడూ ధైర్యాన్నిస్తాయి. ఆత్మహత్య అనే భూతం ఎప్పుడు ఎవర్ని నిశ్శబ్దంగా కబళిస్తుందో తెలీదు. బతుకు పోరాటంలో ఎత్తుపల్లాలు సహజమని తెలిసీ ఆ క్షణానికి నైరాశ్యానికి లొంగిపోయే వారెందరో! సహాయం చేయగలమా, వారి సమస్యలని తీర్చగలమా అన్నది పక్కన పెడితే, తన బాధలనయితే వినగలం కదా! నాలుగు ధైర్య వచనాలు పలకగలం కదా! ఏదో ఒక దారినైతే చూపించగలం కదా! ఇలా జరగాలంటే ముందు మనం నలుగురికి అందుబాటులో వుండాలి. ఒంటరితనపు కంచుకోటని బద్దలు కొట్టుకుని బయటకి రావాలి. ఈరోజున ఆ నిర్ణయం తీసుకుందాం. ‘‘ఆత్మహత్యల నివారణకి వ్యక్తిగా నేనేం చేయగలను’’ అన్న ఒక చిన్న ఆలోచన చేద్దాం. నలుగురితో ఆ ఆలోచని పంచుకుందాం. నిస్సహాయంగా, నిర్వేదంగా జీవితానికి వీడ్కోలు పలికే దుస్థితి ఎవరికీ రావద్దు అంటే కొంచెం మానవత్వంతో ఆలోచిద్దాం. మానవ సంబంధాలని బలపర్చుకుందాం. -రమ  

ట్రావెలర్స్ డయేరియా గురించి విన్నారా!

కుటుంబసమేతంగా హాయిగా గడిపేందుకు ఏదో పుణ్యక్షేత్రానికని బయల్దేరతాం లేదా పండుగ రోజుల్లో ఓ నాలుగు ఊళ్లు తిరిగిరావాలని గడపదాటతాం. ఊరు దాటాక ఏదో ఒకటి తినక మానదు. జిహ్వచాపల్యం అణచుకోలేకో, ఆకలికి తట్టుకోలేకో ఎక్కడో అక్కడ కాస్త ఆహారం తీసుకుంటాం. అంతే! మన విహారయాత్రలో నిప్పులు పోస్తూ అజీర్ణం మొదలవుతుంది. కడుపులో నొప్పి, గ్యాస్, విరేచనాలతో మన సంబరం కాస్తా సద్దుమణిగిపోతుంది. ఇలాంటి పరిస్థితికి ఓ పేరు ఉంది... అదే ట్రావెలర్స్ డయేరియా! అపరిశుభ్రతే అసలు కారణం నలుగురూ తిరిగే చోట పరిస్థితులు ఏమంత పరిశుభ్రంగా ఉండవు. హోటల్లో వంట చేసేవారి దగ్గర్నుంచీ వడ్డించేవారి వరకూ ఎవరో ఒకరు అపరిశుభ్రమైన చేతులతో ఆహార పదార్థాలను ముట్టుకోవచ్చు. ఇలాంటి సమయంలో వారి చేతికి అంటుకుని ఉన్న E.coli వంటి సూక్ష్మక్రిముల ద్వారా ట్రావెలర్స్ డయేరియా (TD) సోకే ప్రమాదం ఉంది. ఇవీ లక్షణాలు అకస్మాత్తుగా విరేచనాలు మొదలవ్వడం, జ్వరం, వాంతులు వికారం, ఆకలి వేయకపోవడం, కడుపులో పోట్లు, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ లక్షణాల నుంచి ఉపశమనం లభించేందుకు మందులు ఎలాగూ అందుబాటులో ఉంటాయి. వాటితో పాటుగా పుష్కలంగా నీరు తాగుతూ ఉండాలి. నీళ్ల విరేచనాలు అవుతుంటే ORS పొడి నీళ్లలో కలుపుకుని తాగాలి. ఒకవేళ విరేచనాలలో రక్తం పోతున్నా, జ్వరం ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించడమే మంచిది. పసిపిల్లలు, గర్భవతులలో TD లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా అందుబాటులోని వైద్యుడిని సంప్రదించాల్సిందే! ఇవీ జాగ్రత్తలు TD వ్యాధి సాధారణంగా 3 నుంచి 7 రోజులల లోపు తగ్గిపోతుంది. చాలా అరుదైన సందర్భాలలో తప్ప ఇది ప్రాణాంతకం కాదు. కాబట్టి అట్టే కంగారుపడాల్సిన పని లేదు. అయితే బయట తిరిగే నాలుగు రోజులూ రోగంతో గడిచిపోతే అంతకు మించిన విషాదం ఏముంటుంది. TD సోకిన తరువాత కంగారుపడి మందులు వాడుతూ తిప్పలు పడేకంటే అసలు అది రాకుండా చూసుకోవడం మేలు కదా! అందుకోసం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి... - అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలలో ఆహారం తీసుకోకూడదు. దారి పొడుగూతా అలాంటి హోటళ్లే కనిపిస్తుంటే ఓ నాలుగు పళ్లు తిని ఆకలి చల్లార్చుకోవడం మంచిది. - పచ్చి కూరలు, ఉడకని పదార్థాలు ముట్టుకోకపోవడమే మేలు. - అపరిశుభ్రమైన నీటితో తయారయ్యే ఐస్తో చేసే జ్యూస్ల జోలికి పోకూడదు. - బయట తాగే నీటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మినరల్ వాటర్ కానీ, కాచి చల్లార్చిన నీరు కానీ తాగాలి. అలా కుదరకపోతే క్లోరిన్ లేదా అయోడిన్ బిళ్లలు కలుపుకొని తాగాలి. - నీరు అస్సలు బాగోలేదు అని అనుమానం ఉన్న చోట, ఆ నీటిని పుక్కిలించినా కూడా ప్రమాదమే! - ప్రయాణాలలో ఎక్కడపడితే అక్కడ మాంసాహారం ముట్టకూడదు. ఎందుకంటే మాంసంలో ఏమాత్రం అపరిశుభ్రత ఉన్నా, అది ఒకోసారి ప్రాణాంతకంగా మారవచ్చు. ముఖ్యంగా చేపల జోలికి అసలు పోవద్దని హెచ్చరిస్తూ ఉంటారు. ఇన్ని కబుర్లు చెబుతున్నారు. మరి నిత్యం అక్కడే ఉండిపోయే వారి పరిస్థితి ఏమిటి అన్న అనుమానం వచ్చిందా! నిజమే! అపరిశుభ్రమైన ప్రదేశాలలో నిరంతరం నివసించేవారికి కూడా మొదట్లో TD సోకి తీరుతుంది. కాకపోతే ఓ ఏడెనిమిదేళ్ల తరువాత వారి శరీరం ఆ సూక్ష్మక్రిములని తట్టుకునేందుకు అలవాటుపడిపోతుంది. కానీ మనకి అంత సమయం ఉండదు కదా! అందుకనే బయట తిరిగే నాలుగు రోజులు కాస్త జాగ్రత్తగా మెలగాల్సిందే! - నిర్జర.  

విటమిని ఇ ఎక్కువగా ఉండే కొబ్బరిపాలు

శరీరానికి కావల్సిన సూక్ష్మ పోషకాలు ఎక్కువగా లభించే పదార్థాల్లో కొబ్బరి పాలు ఒకటి. ఇందులో సోడియం, క్యాల్షియం, ఫాస్ప‌ర‌స్‌, ప్రోటీన్స్‌, పొటాషియం వంటి పోష‌కాలు స‌మృద్దిగా ఉంటాయి. అంతేకాదు క‌రోనాను అరిక‌ట్టే జింక్‌, బీ12 వంటి న్యూట్రియంట్స్ కూడా పుష్క‌లంగా లభిస్తాయి. ఇప్పుడు కొబ్బరిపాలు మార్కెట్ లో కూడా లభిస్తున్నాయి. అయితే ఇంట్లో తయారుచేసుకోవడం మంచిది. పచ్చి కొబ్బరిని తురిమి లేదా మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. పలుచటి క్లాత్ తీసుకుని అందులో ఈ కొబ్బరి ముద్దను వేసి గట్టిగా పిండాలి. ఈ పాలను సన్నని మంటమీద ఐదు నిమిషాలు వేడి చేయాలి. ఆ తర్వాత చల్లారనివ్వాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే పోషకాలు శరీరానికి అందుతాయి. సహజసిద్ధంగా లభించే కొబ్బరిపాలలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా కొబ్బరిపాలు ఎంతో మేలు చేస్తాయి. చుండ్రు సమస్యతో బాధపడేవారు కొబ్బరిపాలను తలకు పట్టించి బాగా మసాజ్ చేస్తే చుండ్రు సమస్య తొలగిపోతుంది. జుట్టు పట్టులా మెరుస్తుంది.
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.