శ్రీరాముడు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే కాదు.. బీజేపీ ఓడిపోతే శ్రీరాముడికి ఏమౌతుంది?

శ్రీరాముడి పేరు చెప్పి బిజెపి రాజకీయాలు చేస్తోందని.. శ్రీరాముడు బీజేపీ ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ కాదు..ఆయన అందరివాడు..బిజెపి ఓడిపోయిన శ్రీరాముడికి ఏం కాదు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్  చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీ మోసం పార్ట్-1 న‌డిచింది.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మోసం పార్ట్-2 సీక్వెల్ న‌డుస్తోంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. పంద్రాగస్టు లోగా రుణ‌మాఫీ చేస్తామ‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం మ‌రోసారి మోసానికి య‌త్నిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు.  చేవెళ్ల ఎంపీ అభ్య‌ర్థి కాసాని జ్ఞానేశ్వ‌ర్ నామినేష‌న్ కార్య‌క్ర‌మంలో కేటీఆర్ పాల్గొన్నారు. 93 కులాల‌ను ఐక్యం చేసిన బాహుబ‌లి కాసాని జ్ఞానేశ్వ‌ర్‌. ఒక బ‌ల‌మైన నాయ‌కుడు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు గొంతుకై నిల‌బ‌డ్డాడు. అలాంటి కాసానిని గెలిపించాలి అని కేటీఆర్ ఈ సంద‌ర్భంగా కోరారు. ర్యాలీలో ఆయ‌న  మాట్లాడుతూ..బిజెపి , కాంగ్రెస్ పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు. రాముడి పేరు చెప్పి ఓట్లు దండుకోవడమే బిజెపికి తెలుసనీ.. మ‌తం పేరుతో రాజ‌కీయం చేస్తున్న బిజెపికి తగిన బుద్ది చెప్పాలని కేటీఆర్ ఈ సంద‌ర్భంగా పిలుపునిచ్చారు. పదే పదే బండి సంజయ్ మోడీ దేవుడంటూ చెప్పుకొస్తాడు..అసలు మోడీ దేవుడు ఎలా అవుతాడు. సిలిండ‌ర్ ధ‌ర పెంచినందుకు అవుతాడా.. ? పెట్రోల్ , డీజిల్ ధరలు పెంచినందుకు అవుతాడా..? నిత్యా అవసర ధరలు పెంచినందుకు అవుతాడా.? తెలంగాణ కు ఎలాంటి హోదాలు ఇవ్వనందుకు అవుతాడా..? ఎలా అవుతాడని కేటీఆర్ ప్రశ్నించారు.  10 ఏళ్లలో కేంద్రంలోని బిజెపి తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమి లేదని కేటీఆర్ అన్నారు.  ఏమ‌న్న అంటే జైశ్రీరాం త‌ప్ప ఇంకోటి లేదు. తెలంగాణ‌కు ఒక్క కాలేజీ, పాఠ‌శాల ఇవ్వ‌లేదు. గుడికి పైస‌లు ఇవ్వ‌లేదు. ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వ‌లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే కాంగ్రెస్ పార్టీపై  కూడా కేటీఆర్ నిప్పులు చెరిగారు.    చేవెళ్ల పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి హేమాహేమీలు త‌ల‌ప‌డుతున్నారు. కాంగ్రెస్ నుంచి ప్ర‌స్తుత ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, బీఆరెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వ‌ర్ ముదిరాజ్‌ బరిలో ఉన్నారు. వీరిలో విశ్వేశ్వ‌ర్ రెడ్డి, జ్ఞానేశ్వ‌ర్ స్థానికులు. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిపై బీఆరెస్ అభ్య‌ర్థిగా రంజిత్ రెడ్డి గెలుపొందారు. ఓట‌మి త‌రువాత విశ్వేశ్వ‌ర్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో రంజిత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. రెండోసారి విజ‌యం సాధించి త‌న అదృష్టాన్ని ప‌రిశీలించుకోవాల‌ని రంజిత్ రెడ్డి ఉన్నారు. త‌న‌కు ఉన్న వ్య‌క్తిగ‌త ప‌రిచ‌యాల‌తో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం ప్రారంభించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రంజిత్ రెడ్డి గెలుపుకోసం వ్యూహ‌ర‌చ‌న చేశారనే అభిప్రాయాలు ఉన్నాయి. కేంద్రంలో న‌రేంద్ర మోదీ స్వ‌చ్ఛ‌మైన పాల‌న‌ను చూసి త‌న‌ను గెలిపించాల‌ని విశ్వేశ్వ‌ర్ రెడ్డి ఓట‌ర్ల‌ను కోరుతున్నారు. ఇక బీఆరెస్ అభ్య‌ర్థి విష‌యానికి వ‌స్తే ఆయ‌న ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. కేసీఆర్‌, కేటీఆర్ అండ‌తో చేవెళ్ళ‌లో భారీ మెజార్టీతో గెలుస్తాన‌ని కాసాని చెబుతున్నారు. త‌ను లోక‌ల్ అభ్య‌ర్థి అని ఆయ‌న చెబుతున్నారు. గ‌తంలో ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ప‌రిష‌త్ చైర్మన్‌గా జిల్లాలో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు పెద్ద‌పీట వేశారు కాసాని. ఎమ్మెల్సీగా జిల్లాకు సేవ చేశారు. ఇవ‌న్ని త‌న‌కు ప్ల‌స్ అవుతాయ‌నే కాసానికి ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. బీఆర్ ఎస్ హ్యాట్రిక్ కొట్ట‌డం ఖాయ‌మంటున్నారు కాసాని. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్నో పరిశ్ర‌మ‌ల్ని బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం తెచ్చింది. చేవెళ్ల‌ను పెద్ద పారిశ్రామిక కేంద్రంగా త‌యారు చేసే ప్ర‌య‌త్నం కేసీఆర్ చేశారు.  షాబాద్‌లో వెల్‌స్ప‌న్ ఫ్యాక్ట‌రీ తెచ్చుకున్నాం. కైటెక్స్ ప‌రిశ్ర‌మ తెచ్చుకున్నాం. చంద‌న్‌వెల్లిలో అమెజాన్, ఈస్ట‌ర్ కంపెనీలు ఏర్పాటు చేసుకున్నాం. సీతారాంపూర్‌లో ఎల‌క్ట్రానిక్ వెహిక‌ల్స్ కంపెనీ ఏర్పాటు చేసుకున్నాం. విక‌రాబాద్, చేవెళ్ల, తాండూరు, ప‌రిగి నియోజ‌క‌వ‌ర్గాల‌కు నీళ్లు తేవ‌డానికి పాల‌మూరు ఎత్తిపోత‌ల పెట్టుకున్నాం. ఉద్ధండ‌పూర్ రిజ‌ర్వాయ‌ర్ మ‌న కోస‌మే నిర్మించుకున్నామ‌ని చెబుతున్న బీఆర్ నేత కాసాని గెలుపుపై ధీమాగా వున్నారు.
Publish Date: Apr 23, 2024 7:21PM

పేద, మధ్యతరగతి వారికి హెచ్చరిక!

ఇది పేద, మధ్య తరగతి జనానికి హెచ్చరిక. ఆ మాటకొస్తే ఓ మోస్తరు ధనవంతులు.. చిన్నసైజు కోటీశ్వరులకు కూడా హెచ్చరికే. ఇక్కడ పేర్కొన్న వర్గాలకు చెందిన వారు ఈ వారం పది రోజులపాటు రాజకీయ నాయకులకు సంబంధించిన అఫిడవిట్లను వివరాలను చూడటం మానేస్తే మంచిది. ఎందుకంటే, రాజకీయ నాయకుల నేరాల చిట్టా చూసి మనసు బాధపడుతుందని కాదు.. వాళ్ళకున్న ఆస్తులను చూసి గుండెలు అవిసిపోతాయి కాబట్టి. ముఖ్యంగా నెల జీతంతో జీవితాలను నెట్టుకొచ్చే వారి హృదయాలు ఎవరో పిడికిలితో పిండేసినట్టు తల్లడిల్లిపోతాయి కనుక. దేశంలో చాలామంది జనం నెలకు 20 వేలు సంపాదించాలంటే అడ్డమైన గడ్డి కరవాల్సి వస్తోంది. అలాంటి రాజకీయ నాయకులకు ఈ ఆస్తులేంటండి బాబు.. గతంలో నాయకుల ఆస్తుల వివరాలు రెండు కోట్లు, మూడుకోట్లు అని చదివి అమ్మో అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడో... వందల కోట్లు, వేల కోట్లు.. పేర్లెందుగానీ, ఒక మనిషికి ఐదువేల కోట్లు, ఆరువేల కోట్లు ఆస్తుంలేంటండీ బాబు! కొంతమంది నాయకులు పెద్దలు సంపాదించిన వందలు, వేల కోట్లకు తాము సంపాదించిన మరిన్ని కోట్లు కలుపుతున్నారు. కొంతమంది సొంతగానే వేలకు వేల కోట్లు సంపాదిస్తున్నారు. స్థిరాస్తుల వివరాల్లో చూపించే అంకెలు కేవలం రిజిస్ట్రేషన్ వాల్యూ మాత్రమే. రిజిస్ట్రేషన్ వాల్యూతో లెక్కేస్తేనే అంతేసి వాల్యూ వుంటున్నాయంటే, ఆయా స్థిరాస్తుల అసలు విలువ ఎంత వుంటుందో ఊహించాలంటే భయం వేస్తుంది.  ఈ వందలు, వేల కోట్ల ఆస్తుల గురించి చూసి ఇన్‌స్పిరేషన్ పొంది బడుగు జీవులు కూడా అన్ని కోట్లు సంపాదించే ఛాన్స్ సినిమాల్లో తప్ప నిజ జీవితంలో ఎలాగూ సాధ్యం కాదు. కాకపోతే ఆ ఆస్తులను చూసి మానసికంగా క్రుంగిపోవడం మాత్రం ఖాయం. అందరూ మనుషులమే కదా.. వాళ్ళకున్న ప్రత్యేకత ఏంటి? మనలో వున్న లోపం ఏంటి అని బాధపడి అల్లాడిపోవడం తథ్యం. అంచేత ఆ ఆస్తుల వివరాలను చూసి మనసు పాడు చేసుకోకుండా వుంటే మంచిది కదా!
Publish Date: Apr 23, 2024 6:43PM

ఖమ్మం లోక్ సభ అభ్యర్థిగా పొంగులేటి వియ్యంకుడి నామినేషన్

ఖమ్మం లోక్ సభ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ కర్ర విరగాకుండా, పాము చావకుండా అన్నట్లు వ్యవహరించిందా? ఈ సీటు తన తమ్ముడికే ఇవ్వాలంటూ మంత్రి పొంగులేటి.. కాదు తన భార్యకే  అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టుబట్టడంతో కాంగ్రెస్ హైకమాండ్ అనూహ్యంగా మూడో వ్యక్తిని తెరమీదకు తీసుకువచ్చిందా? అంటే ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా అధికారికంగా ఇంకా ప్రకటించకుండానే  మంగళవారం ( ఏప్రిల్ 23) రామ సహాయం రఘురాంరెడ్డి నామినేషన్ దాఖలు చేయడాన్ని బట్టి ఔననే భావించాల్సి వస్తున్నది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఖమ్మం బరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రామ సహాయం రఘురాంరెడ్డి స్వయంగా మంత్రి పొంగులేటి వియ్యంకుడు కావడం గమనార్హం. ఇక చివరి నిముషం వరకూ ఈ నియోజకవర్గ అభ్యర్థి రేసులో పొంగులేని సోదరుడు ప్రసాద్ రెడ్డి, భట్టి విక్రమార్క సతీమణి నందిని రేసులో నిలిచారు. ఈ పంచాయతీ హైకమాండ్ వరకూ కూడా వెళ్లింది. ఇరువురి మధ్యా రాజీ కోసం కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగి ఇరువురికీ నచ్చచెప్పారు. అయితే ఎవరికి వారు తమ వారికే టికెట్ ఇవ్వాలంటూ పట్టబట్టడంతో మధ్యే మార్గంగా రామ సహాయం రఘురాంరెడ్డికి ఖమ్మం లోక్ సభ టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు చెబుతున్నారు. రామ సహాయం రఘురాంరెడ్డి సామాన్యుడేం కాదు. ఆయన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారే. ఆయన తండ్రి  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు  రామసహాయం సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డి పలు మార్లు  ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు, పేరు ఉంది. వయోభారం కారణంగా ఇటీవలి కాలంలో ఆయన రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించడం లేదు. ఆయన కుమారుడికే ఇప్పుడు కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ స్థానాన్ని కేటాయించింది. ఇటు పొంగులేటి, అటు భట్టి నొచ్చుకోకుండా కాంగ్రెస్ మధ్యేమార్గంగా రఘురాం రెడ్డిని తెరమీదకు తీసుకువచ్చింది. రామసహాయం రఘురాంరెడ్డికి రాజకీయ, సినీ రంగాలతో మంచి అనుబంధం ఉంది.   హీరో వెంకటేష్ కుమార్తె అశ్రితను ఆయన పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి పెళ్లి చేసుకోగా.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె స్వప్నిరెడ్డిని ఆయన చిన్నకుమారుడు అర్జున్ రెడ్డి వివాహం చేసుకున్నారు. అలా ఇటు వెంకటేష్ కి, అటు పొంగులేటికి రఘురాంరెడ్డి వియ్యంకుడు అయ్యారు. అటువంటి రఘురాంరెడ్డిని ఖమ్మం అభ్యర్థిగా ఖరారు చేయడం ద్వారా పార్టీలో ఎటువంటి అసమ్మతి, అసంతృప్తి తలెత్తకుండా కాంగ్రెస్ హైకమాండ్ అన్ని జాగ్రత్తలూ తీసుకున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలంగాణ కాంగ్రెస్ లో గతంలో ఎన్నడూ కనిపించని ఐక్యత కనిపిస్తోంది. ఆ ఐక్యత ఖమ్మం సీటు కారణంగా చెడకుండా ఉండేలా కాంగ్రెస్ హైకమాండ్ అన్ని  జాగ్రత్తలూ తీసుకుంటోందని ఖమ్మం సీటు విషయంలో వ్యవహరించిన తీరును బట్టి అర్ధం అవుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ వెనుక పొంగులేటి , భట్టి విక్రమార్కల కృషి ఎంతో ఉంది. జిల్లాలో ఇద్దరూ ప్రముఖ నేతలే కావడంతో ఇరువురికీ ఇబ్బంది లేకుండా ఖమ్మం లోక్ సభ అభ్యర్థి ఎంపిక జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఉండగా పెండింగ్ లో ఉన్న కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు కూడా పార్టీ హైకమాండ్ అభ్యర్థులను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ అభ్యర్థిగా సమీర్ ఉల్లాలను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఇహనో ఇప్పుడో అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన రావడానికి ముందే ఖమ్మం నుంచి రామసహాయం రఘురాం రెడ్డి, కరీంనగర్ నుంచి వెలిచార రాజేందర్ రావులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం మీద నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజుల గుడువు ఉండగానే ఎలాంటి ఇబ్బందులూ లేకుండా కాంగ్రెస్ రాష్ట్రంలోని 17 లోక్ సభ స్ధానాలకూ అభ్యర్థులను ఖరారు చేసినట్లైంది. 
Publish Date: Apr 23, 2024 6:25PM

ఏపీలో పొత్తు ధర్మాన్ని పాటించని బీజేపీ!

ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ పాపం ఎంత వుందో, బీజేపీ పాపం కూడా అంతే వుంది. కాంగ్రెస్ పార్టీ అడ్డదిడ్డంగా, అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే, బీజేపీ దానికి మద్దతు ఇచ్చింది. సరే, జరిగిందేదో జరిగిపోయింది, మీరు పార్లమెంటు సాక్షిగా చేసిన ప్రత్యేకహోదా హామీని అయినా నెరవేర్చండయ్యా బాబూ అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఎంత మొత్తుకున్నా బీజేపీ ప్రభుత్వం కరుణించలేదు. ఆ కారణంతోనే బీజేపీ, టీడీపీ మధ్య దూరం పెరిగింది. చివరికి స్నేహం ముగిసింది. కేంద్రంలో మూడోసారి మోడీ ప్రభుత్వం రావాలన్న ధ్యేయంతో వున్న బీజేపీ ఈసారి అనేక ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఏపీలో తెలుగుదేశం, జనసేనలతో పొత్తుకు స్నేహహస్తం చాచింది. మొత్తానికి పొత్తు కుదిరింది. మూడు పార్టీలతో కూటమి ఏర్పడింది. బీజేపీ తన స్థాయికి మించిన విధంగా స్థానాలను పొందింది. బీజేపీతో పొత్తు ధర్మాన్ని పాటిస్తూ తెలుగుదేశం పార్టీ తనకు పట్టున్న అనేక స్థానాలను బీజేపీకి అప్పగించింది.  ఎన్నికల ప్రచారం సందర్భంగా కావచ్చు, అనేక రాజకీయ అంశాల పరంగా కావచ్చు టీడీపీ, జనసేన పాటిస్తున్న పొత్తు ధర్మాన్ని బీజేపీ పాటించడం లేదన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం, జనసేనతో బీజేపీ పొత్తు కుదుర్చుకున్నప్పటికీ, కూటమిది పై చేయి అయితే కూటమితే, వైసీపీది పై చేయి అయితే వైసీపీతో ప్రయాణం చేస్తే ఓ పనైపోతుంది బాబూ అన్న ధోరణిలోనే బీజేపీ వుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కూటమితో వున్నప్పటికీ బీజేపీకీ, వైసీపీకి లోపాయకారీగా ‘ఏదో’ వుందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.  400 వందల సీట్లతో విజయం సాధించాలని కలలు కంటున్న బీజేపీకి, ఈసారి అధికారం దక్కుతుందా లేదా అనే భయం కూడా వుంది. అందుకే అవకాశం వున్న ఏ పార్టీనీ దూరం చేసుకునే ఉద్దేశంలో లేదు. అందుకే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అన్నట్టుగా టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని, వైసీపీతో సీక్రెట్ స్నేహం నడుపుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే, జగన్‌కి గాయం అయిందన్న వార్త ఇలా బయటకి వచ్చిందో లేదో, ఎక్కడో ఢిల్లీలో వున్న ప్రధాని మోడి తల్లడిల్లిపోయి తన రియాక్షన్‌ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇలాంటి నాటకాలు ఆడటంలో జగన్ సిద్దహస్తుడని ఆల్రెడీ గత ఎన్నికల సందర్భంగా ప్రూవ్ అయింది. అలాంటి సంఘటనే మరోసారి జరిగినప్పుడు ఆచితూచి స్పందించాల్సిన బాధ్యత ప్రధాని స్థాయిలో వున్న వ్యక్తికి వుండాలి కాదా. అలాంటిదేమీ పాటించకుండా జగన్ మీద ప్రేమ కురిపించేశారు.  ఈ విషయంలో కొంతమంది బీజేపీ నాయకులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంలో వివరణ ఇస్తున్నారు. జగన్ మీద నిజంగానే హత్యాయత్నం జరిగిందని ప్రధానమంత్రి భావించారని, అందుకే అంత స్పీడుగా స్పందించారని, ఆ తర్వాత ఇదంతా ఒక డ్రామా అని అర్థం చేసుకుని లైట్ తీసుకున్నారని చెబుతున్నారు. ఇదే నిజమైతే, జగన్ ఆడిన డ్రామాని తెలుగుదేశం, జనసేన వర్గాలు నాన్ స్టాప్‌గా విమర్శిస్తూ వస్తున్నాయి. బీజేపీ నుంచి అలాంటి విమర్శలేవీ లేవు. జగన్ ఆడింది డ్రామా అని తెలిసినా, ఇది డ్రామా అని ఒక్క బీజేపీ నాయకుడి నోటి నుంచి రాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కూటమిలో వున్న మూడు పార్టీలు ఒకే మాట మీద వుండటం అనేది పొత్తు ధర్మం. కానీ బీజేపీ ఆ ధర్మాన్ని విస్మరించింది. ‘ధర్మం’ గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పే బీజేపీ పొత్తు ధర్మాన్ని ఎందుకు విస్మరిస్తోందో!
Publish Date: Apr 23, 2024 5:49PM

కడప కోర్టు తీర్పుపై సుప్రీంకు బీటెక్ రవి

ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్య కేసుపై ఎవరూ మాట్లాడొద్దంటూ కడప కోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ పులివెందుల తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి హైకోర్టును ఇశ్రయించారు. ఈ మేరకు బీటెక్ రవి తరఫు న్యాయవాది ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19కి, పత్రికా స్వేచ్ఛకు, భావప్రకటనా స్వేచ్ఛకు భగం వాటిల్లేలా ఉన్నాయని బీటెక్ రవి తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు బుధవారం (ఏప్రిల్ 24)న విచారణ జరపనున్నట్లు తెలిపింది.  అవినాష్ రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్ లో వివేకాహత్యకు సంబంధించి తనపై కేసులు ఉన్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే వైఎస్ వివేకా కుమార్తె సునీత కూడా సీబీఐ చార్జిషీట్ ఆధారంగా అవినాష్ రెడ్డిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. చార్జిషీట్ లోని అంశాలను కూడా ప్రస్తావించకుండా కడప కోర్టు గాగ్ ఆర్డర్ ఇవ్వడంపై న్యాయనిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తారు. కడప కోర్టు ఉత్తర్వులపై సునీత కూడా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఏ నిర్ణయం తీసకోనున్నదన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది.  
Publish Date: Apr 23, 2024 5:33PM

ఇంతకీ తమ్మినేని చదువు కున్నారా?.. చదువు కొన్నారా? ఎన్నికల అఫిడవిట్ లో ఆయన చెప్పిందేమిటి?

రాజకీయాల్లో రాణించడానికి చదువు అవసరం లేదు. పంచాయతీ  బోర్డు మెంబెర్ మొదలు ప్రధాని పదవి వరకు, ఏ పదవికి విధ్యార్హతలు అక్కరలేదు. ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేయవచ్చును. ప్రజలు గెలిపిస్తే చాలు,  ఎమ్మెల్ల్యే, ఎంపీ , మంత్రి,  ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి  ఏదైనా కావచ్చును. ఏ పదవికీ చదవు సంధ్యలు అవసరం లేదు, డిగ్రీలు అక్కరలేదు. అయినా,  రాజకీయ నాయకుల విధ్యార్హతలు, డిగ్రీలు తరచూ వివాదం అవుతూనే ఉంటాయి.  ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీలపై వివాదం నడిచిన సంగతి తెలిసిందే. మోదీ విద్యార్హతలు, డిగ్రీలకు సంబంధించిన సమాచారం కోసం సమాచార హక్కు చట్టం కింద తెలుసుకునేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్  చేసిన ప్రయత్నాలు ఫలిచలేదు.   అలాగే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ..మరి కొందరు ముఖ్య నేతలకు సంబందించిన  డిగ్రీ  విషయంలోనూ వివాదాలు, విచారణలు జరిగాయి. జరుగుతున్నాయి. ఇప్పడు ఆ జాబితాలో  ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని  సీతారం పేరు కూడా చేరింది.  ఆయన డిగ్రీ చదువు కోలేదనీ, చదువు కొన్నారనీ తెలుగుదేశం గతంలో ఆరోపించింది.  సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ కూడా చేసింది. అదలా ఉంచితే ఇప్పుడు స్వయంగా తమ్మినేని సీతారాం తాను డిగ్రీ చదువు కోలేదని అంగీకరించారు. అంగీకరించడమంటే మౌఖికంగా చెప్పడం కాదు.. ఆముదాలవలస వైసీపీ అభ్యర్థిగా పోటీకి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఆ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో ఆయన విద్యార్హతకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. తమ్మినేని ఎన్నికల అఫిడవిట్ లో డిగ్రీ డిస్ కంటిన్యూ అని ఉంది. మరి డిగ్రీ పూర్తి కాకుండా తమ్మినేని లా ఎలా చేశారు.    తాను డిగ్రీ పూర్తి చేశానని చెప్పి హైదరాబాద్ లో ఓ లా కాలేజీలో అడ్మిషన్ పొందారు. డిగ్రీ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. గత ఏడాది ఈ అంశంపై పెద్ద దుమారం కూడా రేగింది. అదలా ఉండగానే ఇప్పుడు ఆయన తన ఎన్నికల అఫిడవిట్ లో  డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని స్పీకర్ నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ పెట్టి లా కోర్సులో చేరారని గత కొంత కాలం కిందట తెలుగుదేశం బయట పెట్టింది.  దీనిపై కిమ్మనని తమ్మినేని ఇప్పుడు తాను డిగ్రీ పూర్తి చేయలేదంటూ ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇక ఇప్పుడు ఆయనకు లా కాలేజీలో అడ్మిషన్ ఎలా లభించింది. ఆయన నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ సమర్పించి ఉంటే చట్టపరంగా చర్యలకు రెడీ అవ్వాల్సిందే అని పరిశీలకులు అంటున్నారు. 
Publish Date: Apr 23, 2024 4:13PM

కేసీఆర్ కట్టడం మరోటి కూలింది!

కేసీఆర్ కట్టడం కూలిందంటే, ఆయన ఫామ్‌హౌస్‌లో వున్న కట్టడం కూలిందనో, హైదరాబాద్ నంది నగర్లో ఆయనకు చెందిన 5 వందల గజాల్లో కట్టుకున్న  పేద కుటీరం కూలిందనో అనుకోవద్దు. ఆయన ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టిన మరో కట్టడం కూలిపోయింది. కేసీఆర్ తన ఇంజినీరింగ్ ప్రతిభతో, మెదడుని, రక్తాన్ని రంగరించి డిజైన్ చేసిన మేడిగడ్డ రిజర్వాయిర్ మేడిపండును తలపిస్తూ ముక్కలు చెక్కలు అయిపోయింది. ఇప్పుడు ఆ అదృష్టం ఓ బ్రిడ్జికి పట్టింది. పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగు మీద నిర్మాణంలో వున్న వంతెన సోమవారం రాత్రి కూలిపోయింది. 2016లో ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమైంది. దీని నిర్మాణంలో కూడా ఇంజనీర్లకే ఇంజనీర్ కేసీఆర్ ప్లానుందేమో తెలియదు. 2016 నుంచి ఇప్పటి వరకు అంటే, ఎనిమిదేళ్ళపాటు ఈ బ్రిడ్జిని కడుతూనే వున్నారు. ఇంతవరకు నిర్మాణం పూర్తి కాలేదు. జనం ఈ బ్రిడ్జిని నమ్ముకోకుండా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి బ్రిడ్జి కూలిపోయింది. పోన్లే.. ఎవరికీ ఏమీ కాలేదు!
Publish Date: Apr 23, 2024 4:08PM

కల్వకుంట కవితమ్మకి చాలా టాలెంట్ ఉందండోయ్!

తిమ్మిని బమ్మిని చేసి, మాటలతో మాయ చేసే తండ్రి సపోర్టు బాగా వుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం మాట్లాడినా నడిచింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడింది ఆట, పాడింది పాట. మరి ఇలాంటి  పరిస్థితిలో వున్న వారికి తెలివితేటలు సహజంగానే బాగా పెరిగిపోతాయి. ప్రస్తుతం తీహార్ జైల్లో రెస్టు తీసుకుంటున్న కల్వకుంట్ల కవితకి కూడా అలాగే తెలివితేటలు పెరిగిపోయాయి. అందుకే, ఓ ఇంటర్వ్యూలో తాను ముఖ్యమంత్రి అయితే లిక్కర్ని బంద్ చేస్తానని చెప్పిన ఈమె ఆ తర్వాత చక్కగా లిక్కర్ వ్యాపారంలోకే దిగారు. ఆ లిక్కర్ వ్యాపారం ఇక్కడా అక్కడా కాకుండా ఏకంగా ఢిల్లీలో చేయాలని అనుకున్నారు. వందకోట్లు పెట్టుబడి పెట్టి, వెయ్యికోట్లు సంపాదించాలని అనుకున్నారు. అయితే ఆప్లాన్స్ అన్నీ బెడిసికొట్టి ప్రస్తుతం శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరుకున్నారు.  జైలుకు వెళ్ళక ముందు నుంచి దర్యాప్తు సంస్థలకు సహకరించే విషయంలో చాలా తెలివితేటలు ప్రదర్శించిన కల్వకుంట్ల కవిత, ఓ సందర్భంలో తనకు సంబంధించిన 10 సెల్ ఫోన్లను దర్యాప్తు అధికారులకు అందించారు. తాను చాలా పారదర్శకంగా వున్నానని, అందుకే సెల్ ఫోన్లు దర్యాప్తు సంస్థలకు ఇచ్చానని ప్రచారం చేసుకున్నారు. తాను తాను సంప్రదాయినీ, సుప్పినీ, సుద్దపూసనీ కాబట్టే భయం లేకుండా సెల్ ఫోన్లు ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఒక మనిషికి పది సెల్ ఫోన్లేంట్రా బాబూ అని చాలామంది అనుకున్నప్పటికీ, ఏమోలే డబ్బున్నవాళ్ళు కదా అనుకుని ఊరుకున్నారు. ప్రస్తుతం తీహార్ జైల్లో వున్న కవిత బెయిల్ కోసం చేయని ప్రయత్నాలు లేవు. తన కొడుకు టెన్త్ పరీక్షలు రాస్తున్నాడు కాబట్టి నేను తల్లిగా పక్కనే వుండాలనే పాయింట్ పైకి తెచ్చారు. వర్కవుట్ కాలేదు. ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి, తన పార్టీలో తాను స్టార్ కాంపైనర్ కాబట్టి, తాను ప్రచారం చేస్తే జనం కళ్ళు మూసుకుని తమ పార్టీకి ఓటేస్తారు కాబట్టి బెయిల్ ఇవ్వాలని కోరారు.. ఇదీ వర్కవుట్ కాలేదు.. కవితకి చాలా పెద్ద నెట్ వర్క్ వుందని, ఆమెకి బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తును ప్రభావితం చేసే ప్రమాదం వుందని దర్యాప్తు సంస్థలు కోర్టు ముందు వాదిస్తున్నాయి. సోమవారం నాడు ఢిల్లీ కోర్టులో ఇదే తరహా వాదన జరిగింది. ఈ వాదన సందర్భంగా, ఇప్పటి వరకు కల్వకుంట్ల కవితమ్మ సెల్‌ఫోన్లకు సంబంధించిన ఒక రహస్యం బయటపడింది.  కల్వకుంట్ల కవితమ్మ తన పది సెల్ ఫోన్లను దర్యాప్తు సంస్థలకు ఇచ్చారు కాబట్టి, ఆమె చాలా పారదర్శకంగా వుందని అనుకుంటూ వస్తున్నాం కదా.. అంత సీన్ లేదు.. కవితమ్మ తన ఫోన్లను దర్యాప్తు సంస్థలకు ఇచ్చేముందు ఆ ఫోన్లన యాసిడ్ వేసి క్లీన్ చేసినంత నీట్‌గా ఫార్మాట్ చేసి ఇచ్చారట. సెల్ ఫోన్లు ఎవరైనా ఎందుకు అడుగుతారు? వాటిలో వుండే డేటా ఆధారంగా కేసును దర్యాప్తు చేయడానికి. మరి, సెల్ ఫోన్లని చక్కగా ఫార్మాట్ చేస్తే అందులో ఇంకేం వుంటుంది బూడిద? ఏ తప్పూ చేయకపోతే ఆ ఫోన్లను ఎందుకు ఫార్మాట్ చేసినట్టు? ఈ విషయాన్నే దర్యాప్తు సంస్థలు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా కవిత అండ్ కో తన తెలివితేటల ప్రదర్శన చేసింది. కవితగారు తన ఫోన్లను ఫార్మాట్ చేయలేదని, ఆమె తన 10 ఫోన్లను తన దగ్గర పనిచేసేవారికి ఇచ్చారని, వారు ఫార్మాట్ చేసి ఉపయోగించుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అబద్ధం చెప్పినా అతికినట్టు వుండాలన్న విషయం కవిత అండ్ కో మర్చిపోయినట్టుంది. ఫోన్ల విషయంలోనే ఇంత టాలెంట్ చూపించిన కవిత, ఇంకా ఎన్నెన్ని విషయాల్లో తన టాలెంట్ చూపించారో.. ముందు ముందు ఇంకెన్ని బయటపడనున్నాయో!
Publish Date: Apr 23, 2024 3:54PM

శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు హైకోర్టులో దక్కని ఊరట

శిరోముండనం కేసులో విశాఖ కోర్టు తనకు విధించిన శిక్షను నిలుపుదల చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ విచారణను మే 1కి వాయిదా వేసింది. వైసీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ మండపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అయిన తోట త్రిమూర్తులుకు విశాఖ కోర్టు శిరోముండనం కేసులో 18 నెలల జైలు శిక్ష, రెండు లక్షల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.  అసలింతకీ ఈ శిరోముండనం కేసు ఏమిటి? ఎప్పుడు జరిగింది అన్న వివరాలలోకి వెడితే..  1982 ఎన్టీఆర్  తెలుగుదేశం పార్టీని  స్థాపించినప్పుడు   తోట త్రిమూర్తులు ఆ పార్టీలో చేరారు. అసెంబ్లీకి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే అప్పట్లో ఎన్టీఆర్ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. దీంతో తోట త్రిమూర్తులు 1994లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పుడు ఆయనకు ఎన్నికల సంఘం గంట గుర్తు కేటాయించింది. అప్పట్లో రామచంద్రపురం నియోజకవర్గంలో త్రిముఖ పోటీ జరిగింది. తెలుగుదేశం, బీఎస్పీ అభ్యర్థులకు తోట త్రిమూర్తులు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా మూడు వేల ఓట్లపైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. అయితే పోలింగ్ సమయంలో తోట త్రిమూర్తులు రిగ్గింగుకు పాల్పడుతున్నారంటూ ఐదుగురు యువకులు (వీరు బీఎస్సీ బూత్ ఏజెంట్లు) అభ్యంతరం తెలిపారు.  అప్పట్లో పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది.  పోలింగ్ ముగిసింది. తోటత్రిమూర్తులు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  రిగ్గింగ్ అంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన యువకులపై మాత్రం తోట త్రిమూర్తులు ఆగ్రహం పెంచుకున్నారు.  వారిపై వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 1996 డిసెంబర్ 29న ఆ ఐదుగురు యువకులనూ తోట త్రిమూర్తులు అనుచరులు పట్టుకుని ఈవ్ టీజింగ్, ఫెన్సింగ్ ధ్వంసం వంటి ఆరోపణలతో వారిని ఊళ్లో ఊరోగించారు. ఆనంతరం వారిలో ఇరువురికి శిరోముండనం చేయించి, కనుబొమ్మలు కూడా గీయించారు. ఈ సంఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. శిరోముండనం బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ద్రాక్షారామం కేసులో 1997 జనవరి 1న తోట త్రిమూర్తులుపై శిరోముండనం కేసు నమోదైంది. అప్పట్లో ఈ కేసులో అరెస్టైన తోట త్రిమూర్తులు మూడు నెలల పాటు జైలులో కూడా ఉన్నారు.   ఐదుగురు దళితయువకులను ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మనుషులు పట్టుకున్నారు. పొలం చుట్టూ ఫెన్సింగ్ ధ్వంసం, ఈవ్ టీజింగ్ కారణాలు చెప్పి ఆ ఐదుగురు కుర్రాళ్లను ఊళ్లో అవమానిస్తూ ఊరేగించారు. అంతటితో ఆగకుండా అందులో ఇద్దరు కుర్రాళ్లకు గుండు కొట్టించి కనుబొమ్మలు గీయించారు. ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు చేయించిన ఈ పని అప్పట్లో సంచలనంగా మారిపోయింది. ఆ బాధితులైన కుర్రాళ్లు పోలీసులను ఆశ్రయించారు. 1997 జనవరి 1న ద్రాక్షారామం పోలీస్ స్టేషన్ లో మొదటికేసుగా దళితుల శిరోముండనం కేసు నమోదైంది. ఆ తరువాత కేసు దర్యాప్తును పక్కన పెట్టేశారు. అయితే బాధితులు మాత్రం తమకు న్యాయం చేయాలంటూ పోరాటాన్ని కొనసాగించారు. శిరోముండనానికి గురైన ఇద్దరిలో ఒకరు మరణించారు. అయితే మిగిలిన వారు మాత్రం న్యాయపోరాటాన్ని కొనసాగించారు. ఈ కేసుకు సంబంధించి 24 మంది సాక్ష్యులలో 11 మంది మరణించారు. బాధితులు న్యాయం కోసం హైకోర్టును ఇశ్రయించారు. హైకోర్టు కేసును విశాఖ ఎస్సీఎస్టీ కోర్టుకు బదలాయించింది.   ఇలా ఉండగా త్రిమూర్తులు ఆ యువకులు దళితులు కాదంటూ ఎస్సీఎస్టీ కేసులో వాదించారు. వారు దళితులు కానందున కేసు విచారణ ఎస్సీఎస్టీ కోరులో జరగడం సరికాదని చెప్పారు. అయితే కోర్టు మాత్రం యువకుల వాదనతో ఏకీభవించి ఇటీవల సంచలన తీర్పు ఇచ్చింది. తోట త్రిమూర్తులకు 18 నెలలు జైలు, రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.  ఈ నేపథ్యంలోనే శిక్ష నిలుపుదల కోరుతూ తోట త్రిమూర్తులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే శిక్ష నిలుపుదల చేయాలన్న తోట త్రిమూర్తులు అభ్యర్థనను కోర్టు తిరస్కరించి కేసు విచారణను మే 1కి వాయిదా వేసింది. 
Publish Date: Apr 23, 2024 3:25PM

ఏపీలో కాంగ్రెస్ ఎందుకు పోటీ చేస్తోందో ఆ దేవుడికే తెలియాలి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత, నవ్యాంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ శవంలా మిగిలింది. అడ్డదిడ్డంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏనాటికీ క్షమించరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇప్పుడున్న దుస్థితికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం. రాష్ట్రం అన్ని రకాలుగా వెనుకబడి పోవడానికి, ఉద్యోగాలు, ఉపాధి లేకుండా పోవడానికి కాంగ్రెస్ పార్టీయే ప్రధాన కారణం. అలా రాష్ట్రంలో సమాధిలోకి చేరిపో్యిన కాంగ్రెస్ పార్టీ అస్థిపంజరం రాష్ట్ర రాజకీయాలను ఏదో ఉద్ధరించాలని, ఊడబొడవాలని ప్రయత్నాలు చేస్తోంది. కానీ అది అసంభవం అని రాష్ట్ర రాజకీయాల మీద ఏమాత్రం అవగాహన ఉన్నవారైనా చెబుతారు. ఈ విషయం కాంగ్రెస్ నాయకత్వానికి కూడా తెలుసు.. కానీ దింపుడు కళ్ళం ఆశకంటే మరింత అడ్వాన్స్ అయిన ఆశతో తన ప్రయత్నాలు చేస్తూనే వుంది. ఈసారి ఎన్నికల సందర్భంగా సరికొత్త తురుఫుముక్క వై.ఎస్.షర్మిలతో రంగంలోకి దిగింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో తన బలం ఎలాంటిదో తెలిసికూడా అన్ని పార్లమెంట్, అన్ని లోక్‌సభ స్థానాల నుంచి అభ్యర్థులను బరిలోకి దించే వ్యూహంలో ముందుకు వెళ్తోంది. రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలలో ఇప్పటికే దాదాపుగా చాలావాటికి అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, ఈసారి తాను రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలకం అవుతానని కలలు కంటోంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వై.ఎస్.షర్మిల తనను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా భావించకుండా, కేవలం అన్నని వ్యతిరేకిస్తున్న చెల్లెలిలా మాత్రమే రాజకీయాలు చేస్తున్నారు. తాను పోటీ చేస్తున్న కడప పార్లమెంట్ స్థానం గురించి తప్ప మరే స్థానం గురించి ఆమె ఆలోచించడం లేదు.  ఇక పార్లమెంటు బరిలో వున్నావారిలో షర్మిల, కొప్పుల రాజు, పల్లంరాజు, గిడుగు రుద్రరాజు, జేడీ శీలం, చింతా మోహన్ తప్ప మిగతా స్థానాల నుంచి పోటీ చేస్తున్న వారికి ఎలాంటి బలం, బలగం లేదు. ఏదో ఆటలో అరటిపండులా వున్నారే తప్ప బలమైన అభ్యర్థులుగా లేరు. ఆమాటకొస్తే పైన పేర్కొన్న బలం, బలగం వున్నవారు కూడా గెలిచే అవకాశాలు లేవు. ఒక్క షర్మిల అయినా గెలిచే అవకాశం వుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయిగానీ, అదికూడా డౌటే.  ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేయడానికి పనికిరాని దారిన పోయే దానయ్యలకి కూడా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు పంచేసి చేతులు దులుపుకుంది. ఫలానా నియోజకవర్గానికి కంటెస్ట్ ఎమ్మెల్యే అని చెప్పుకుని తిరిగే ఉబలాటం వున్నవాళ్ళు కూడా అభ్యర్థులుగా నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థులను రంగంలో నిలబెడితే, వాళ్ళు వైసీపీ ఓట్లలో చీలిక తెచ్చి తెలుగుదేశం కూటమికి మేలు జరిగేలా చేస్తారన్న అభిప్రాయం మొదట్లో రాజకీయ పరిశీలకులకు కలిగింది. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే అలాంటి అవకాశాలేవీ లేనట్టు అర్థమవుతోంది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏదో ఉన్నాం అంటే ఉన్నాం అన్నట్టే తప్ప ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
Publish Date: Apr 23, 2024 1:41PM

గాలిలో హెలికాప్టర్ల ఢీ.. 10 మంది మృతి

మలేసియా రాజధాని కౌలా లంపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మలేసియా నావికాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు ఆకాశంలోనే ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. రెండు హెలికాప్టర్లూ సైనిక విన్యాసాలు చేస్తూ వుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈనెల 26వ తేదీన మలేసియాలో రాయల్ మలేసియన్ నేవీ దినోత్సవం జరగనుంది. దీనికోసం కౌలా లంపూర్‌లోని పెరక్ లుమల్ ప్రాంతంలో రిహార్సల్స్ నిర్వహించారు. ఈ విన్యాసాల కోసం పదిమంది సైనిక సిబ్బందితో సహా గాల్లోకి ఎగిరిన రెండు హెలికాప్టర్లు కాసేపట్లోనే ఒకదానితో మరొకటి ఢీకొని కిందపడిపోయాయి. ఈ ప్రమాదంలో రెండు హెలికాప్టర్లలో వున్న పదిమంది మరణించారు. వీరందరూ ఆర్మీ ఉన్నతాధికారులే. హెలికాప్టర్లు కూలుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. 
Publish Date: Apr 23, 2024 12:40PM

జగన్ పై మాటల తూటాలు.. ఓ రేంజ్ లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి రివెంజ్!

జగన్ పేరు చెప్పగానే ఎవరికైనా ఎం గుర్తుకు వస్తుంది. ముఖ్యమంత్రి హోదా. తననూ తన అధికారాన్ని, తన ప్రభుత్వ విధానాలనూ వ్యతిరేకించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం, అరెస్టు చేయించడం, ఇంకా కోపం తగ్గకపోతే రఘురామరాజుపై జరిగినట్లు థర్డ్ డిగ్రీ ప్రయోగించేలా పోలీసులను ఆదేశించడం. కానీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ కు మాత్రం జగన్ పేరు చెప్పగానే కోడి కత్తి, గొడ్డలి గుర్తుకు వస్తాయి. ఇంతకీ ఈ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎవరనుకుంటున్నారా... థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పాపులర్ కమేడియన్ గా సినిమాలలో ఓ వెలుగు వెలిగారు. ఆ తరువాత రాజకీయాలవైపు గాలి మళ్లడంతో రాజకీయ వేత్త అవతారమెత్తి వైసీపీ గూటికి చేరి.. 2019 ఎన్నికలకు ముందు  ఆ పార్టీ క్యాంపెయినర్ గా ప్రత్యర్థులపై నోరు పారేసుకున్నారు. రాజకీయ విమర్శకు ఉండే మర్యాద హద్దు దాటి మరీ విమర్శలు గుప్పించారు.  పార్టీ ప్రచారం అంటూ  తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు.  నోరున్నది ఎందుకు అంటే రాజకీయ ప్రత్యర్ధులను విమర్శించడానికే  అన్నట్లు పృధ్వివిరుచుకు పడ్డారు. జగన్ మెప్పు పొందడానికీ, ఆయన దృష్టిలో పడటానికీ అదే మార్గం అనుకున్నారు. మొత్తం మీద పృధ్వీ ప్రచారమే పని చేసిందో..  రాష్ట్ర ప్రజల దురదృష్టమో   ఆ ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది. జగన్మోహన్  రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.   సహజంగానే, పార్టీ కోసం అంతగా కష్టపడిన పృధ్విని జగనన్న తనను అందలం ఎక్కిస్తారని ఆశపడ్డారు. అయితే ఆయన ఏమి ఆశ పడ్డారో, ఏమి ఆశించారో ఏమో  తెలియదు కానీ   పృధ్వీ పడిన కష్టానికి తగినదో కాదో  మొత్తం జగన్ మాత్రం పృధ్వికి మొండి చేయి చూపించకుండా ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవి  ఇచ్చారు. అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయిందనుకోండి అది వేరే సంగతి.   ఒక మహిళా ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడిన వాయిస్ రికార్డులు బయటకు రావటంతో ఎస్వీబీసీ ఛైర్మన్‌ బాధ్యతల నుండి  జగన్ పృధ్విని తప్పించారు.   ఎస్వీబీసీ నుంచి  గెంటేసిన తర్వాత  వైసీపీలో ఆయ న్ని పట్టించుకున్నవారు లేరు. మరో వంక నడమంత్రపు సిరి శాశ్వతం నుకుని రెచ్చి పోయి వెనకా ముందు చూసుకోకుండా, చిందులేసిన పాపానికి  ఇండస్ట్రీ కూడా పృధ్విని దాదాపు వదిలేసింది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిందేమిటంటే..  ఫృధ్వి ఎదుర్కొన్న లాంటి విమర్శలే ఎదుర్కొన్న అంబటి రాంబాబు మంత్రిగా పదోన్నతి పొంది కొనసాగుతున్నారు.  అది పక్కన పెడితే  వైసీపీ వదిలిం చేసుకున్న తరువాత థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి తత్త్వం బోధపడినట్లుంది.   ఈ ఎన్నికల ముందు ఆయన వైసీపీ లక్ష్యంగా జనసేన తరఫున ప్రచారం చేస్తున్నారు. ఆ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ ను ఓ ఆటాడేసుకుంటున్నారు.  జగన్ లక్ష్యంగా కొన్ని ఆయన సంధిస్తున్న వ్యంగ్యాస్త్రాలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.  ఇటీవల జగన్ పై జరిగిన రాయిదాడి ఘటన అనంతరం పృధ్వి చేసిన వ్యాఖ్యలు వైసీపీని నవ్వుల పాలు చేశాయి.  జగన్ అంటే ఎవరికైనా కోడి కత్తి, గొడ్డలి, కత్తి గుర్తుకు వస్తాయి కానీ గులకరాళ్లు గుర్తుకురావు అంటూ సెటైర్లు వేశారు.   మొత్తం మీద జనసేన తరఫున ఫృద్వి చేస్తున్న ప్రచారానికి జనం నుంచి స్పందన అయితే వస్తున్నది. పృధ్వీయే నటించిన ఓటుతో జగన్ ను ఇంటికి పంపడం మాత్రమే రాష్ట్ర ప్రజల కష్టాలు తీరడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం అంటూ జనసేన రిలీజ్ చేసిన టీజర్ కు కూడా విశేష స్పందన లభించింది. మొత్తం మీద పృధ్వీ జగన్ పై ఓ రేంజ్ లో రివెంజ్ తీర్చుకుం టున్నారంటూ నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. 
Publish Date: Apr 23, 2024 12:20PM

పాపం రోజా..నామినేషన్ ర్యాలీ వెలవెల!

రోజా.. రాజకీయ నాయకురాలిగా మారిన నటి.  ఏపీ పర్యాటకశాఖ మంత్రి. రెండు సార్లు ఎమ్మెల్యే. ఒకసారి ఏపీఐఐసీ చైర్ పర్సన్. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. ఆమె తెలుగుదేశంలో ఉన్నా.. వైసీపీలో ఉన్నా.. ప్రత్యర్థులపై విరుచుకుపడడంలో దిట్ట.  విశాఖ విమానాశ్రయంలో   మధ్య వేలు చూపించి జనసైనికులను రెచ్చగొట్టగలరు. అలాంటి రోజాకు ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే  సీన్ సితార అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ విషయాన్ని గతంలో రోజాయే స్వయంగా అంగీకరించారు. మంత్రినైన తనను నియోజకవర్గంలో బలహీనపరిచే విధంగా ప్రతిపక్షాల వాళ్లు నవ్వుకునేలా సొంత పార్టీ వారే వ్యవహరిస్తున్నారని రోజా దాదాపు ఏడాదిన్నర కిందటే కళ్లనీళ్లు పెట్టుకుని మరీ మీడియా ముందు చెప్పారు.   సొంత నియోజకవర్గంలోనే రోజాకు సొంత పార్టీ నుంచే మద్దతు కరవైందని అప్పట్లోనే  అందరికీ అవగతమైపోయింది.  దీంతో రోజా వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ అభించే అవకాశాలు లేవని కూడా అప్పట్లో బాగా  ప్రచారం అయ్యింది. అయితే ఈమె నగరి నుంచి పోటీ చేస్తున్నారు. పార్టీ టికెట్ దక్కించుకున్నారు. అంత వరకూ ఓకే కానీ తన విజయం కోసం నియోజకవర్గ నేతలు పని చేసేలా సమాయత్తం చేసుకోవడంలో  మాత్రం విఫలమయ్యారని ఆమె నామినేషన్ సందర్భంగా జరిగిన ర్యాలీని చూస్తే అవకగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు.  వాస్తవానికి ఆమె గెలిచిన రెండు సార్లూ కూడా నగరిలో రోజాకు స్వల్ప మెజారిటీయే వచ్చింది. 2014 ఎన్నికలలో రోజా తెలుగుదేశం సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడిపై 871 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఆ తరువాత 2019 ఎన్నికలలో గాలి ముద్దుకృష్ణమ తనయుడు గాలి భాను ప్రకాష్ పై 2,007 ఓట్లు తేడాతో గెలుపొందారు. జగన్ హవా నడిచిన ఆ ఎన్నికలలో ఆ మెజారిటీ స్వల్పమనే చెప్పాలి.   ఈసారి ఎన్నికల్లో  కూడా రోజాకు భాను ప్రకాశ్  ప్రత్యర్థి. గత ఎన్నికలలో  ఓడిపోయిన భాను ప్రకాశ్ పై నియోజకవర్గం ఓటర్లలో సానుభూతి కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  దీనికి తోడు నగరి నియోజకవర్గంలో రోజాకు సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.  ఈ నేపథ్యంలో ఆమె నగరి నుంచి హ్యాట్రిక్ సాధించాలన్న ఆశలు ఆవిరయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే రోజాను వ్యతిరేకించే వైసీపీలోని బలమైన వర్గం.. తెలుగుదేశం గూటికి చేరిపోయారు. అలా చేరకుండా వైసీపీలోనే ఉన్నవారు ఆమెకు సహాయ నిరాకరణ చేస్తూ లోపాయికారీగా తెలుగుదేశంకు సహకరిస్తున్నారని వైసీపీ వర్గాలే అంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రోజా విజయం కోసం సహకరించే ప్రశక్తే లేదని నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. రోజాకు నియోజకవర్గ పార్టీ నేతలతో ఉన్న విభేదాలకు ఆమె నామినేషన్ ర్యాలీ అద్దం పట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సొంత నియోజకవర్గం నుంచి పార్టీకి చెందిన నేతలు ఎవరూ రోజా నామినేషన్ ర్యాలీలో పాల్గొనకపోవడంతో ఆమె బైరెడ్డి సిద్ధార్థరెడ్డి  ముఖ్య అహ్వానించి నామినేషన్  దాఖలు చేయాల్సి వచ్చింది.  గత ఎన్నికలలో రోజా విజయం కోసం కృషి చేసిన రెడ్డివారి చక్రపాణిరెడ్డి,   మురళీనాథరెడ్డి వంటి వారు రోజా ను గెలిపించడం కోసం పని చేసే ప్రశక్తే లేదని ప్రకటించి మరీ  పరోక్షంగా తెలుగుదేశం అభ్యర్థి గాలి భాను ప్రకాష్ కు సహకారం అందిస్తున్నారు. రోజా విషయంలో పార్టీ హైకమాండ్ కూడా లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. అసమ్మతిని బుజ్జగించే పని కూడా చేయడం లేదు. దీంతో రోజా హ్యాట్రిక్ డ్రీమ్ నెరవేరే అవకాశాలు అంతంత మాత్రమేనని అంటున్నారు. 
Publish Date: Apr 23, 2024 11:29AM

ఇరాన్ అధ్యక్షుడు పాకిస్తాన్‌కి ఎందుకు వెళ్ళినట్టో...!

ప్రపంచ రాజకీయాల్లో తాజాగా ఎవరూ ఊహించని ఒక సంఘటన జరిగింది... అదే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీమ్ రైసీ పాకిస్తాన్ దేశాన్ని సందర్శించడం. నిన్న అంటే, సోమవారం నాడు ఇబ్రహీమ్ రైసీ ఇస్లామాబాద్‌కి వచ్చారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ని  కలిశారు. ఒక దేశ అధ్యక్షుడు మరో దేశ ప్రధానమంత్రిని స్నేహపూర్వకంగా కలిస్తే తప్పేంటన్న సందేహాలు ఎవరికైనా కలగొచ్చు. అయితే పాకిస్తాన్, ఇరాన్ మధ్య స్నేహసంబంధాలు లేవు. మొదట్నుంచీ ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా గత జనవరిలో రెండు దేశాల సరిహద్దులో పరస్పరం వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పాకిస్తాన్‌కి చెందిన ఇద్దరు చిన్నారులు చనిపోయారు. ‘మేమేం పాకిస్తాన్ మీద దాడి చేయలేదు. పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్న జైష్ అల్ అద్ల్ అనే అతివాద గ్రూపు మీద దాడి చేశాం’ అని ఇరాన్ చాలా తెలివిగా చెప్పినప్పటికీ, పాకిస్థాన్‌కి ఆ సంఘటన ఆగ్రహాన్ని తెప్పించింది. నేను మాత్రం తక్కువా అన్నట్టుగా, ఇరాన్ భూభాగంలోకి ఒక క్షిపణిని ప్రయోగించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో వున్న తన రాయబారిని వెనక్కి పిలిపించింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య స్నేహసంబంధాలు పూర్తిగా అడుగంటిపోయాయి. మరి, ఇంతకాలం ఉప్పు, నిప్పులా వున్న ఈ రెండు దేశాల నాయకులు ఇంత అకస్మాత్తుగా ‘స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం’ అంటూ స్నేహగీతాన్నిఆలాపించడం వెనుక కారణాలను అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్దంలోకి ఈమధ్య ఇరాన్ కూడా ఎంటరైంది. కొద్ది రో్జుల క్రితమే ఇజ్రాయిల్ మీద ఆయుధాలతో దాడులు కూడా చేసింది. ఇజ్రాయిల్ కూడా తక్కువదేం కాదు కదా.. ఇరాన్‌ని అదను చూసి దెబ్బ తీయడానికి ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో తనకు మద్దతు ఇవ్వడానికి గానీ, ఇంధనం తదితర అవసరాల కోసం గానీ ఇరాన్‌కి పాకిస్తాన్‌తో అవసరం వుంది. అలాగే పాకిస్తాన్ పరిస్థితి కూడా అలాగే వుంది. ఇటువైపు ఇండియాతో గొడవ, అటువైపు ఆఫ్ఘనిస్తాన్‌తో కయ్యం. దానికి తోడు దేశంలో తాండవిస్తున్న కరవు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్‌కి కూడా అంతర్జాతీయంగా అండ కావలసి వుంది. దాంతో ‘నీకు నీ వారు లేరు.. నాకు నా వారులేరు’ అన్నట్టుగా ఈ రెండు దేశాలు కౌగిలించుకున్నాయి. అయితే ఈ కౌగిలి కాలం గడిచేకొద్దీ మరింత బలంగా మారుతుందా, లేక ధృతరాష్ట్ర కౌగిలిగా మారుతుందా అనేది వేచి చూడాల్సిన విషయం. ఈ పరిణామాలను భారత విదేశాంగ శాఖ గమనిస్తోంది. 
Publish Date: Apr 23, 2024 11:18AM

ఖమ్మం కన్ఫ్యూజన్.. కాంగ్రెస్ క్యాడర్ లో ఆందోళన!

పూర్తిగా సానుకూలంగా ఉన్న పరిస్థితులను కూడా అత్యంత సంక్షిష్టంగా మార్చుకుని ఇబ్బందులు పడటం కాంగ్రెస్ కు పరిపాటి.  గతంలో రాజకీయ పండితులు ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ గురించి  కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థులు ఓడించలేరు. కానీ ఆ పార్టీయే తనను తాను ఓడించుకుంటుంది అని చెప్పేవారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న తరువాత కూడా ఆ పార్టీలో ఆ విషయంలో ఎలాంటి మార్పూ రాలేదనడానికి తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో  పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో పడుతున్న మల్లగుల్లాలే నిదర్శనం. రానున్న లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో  కాంగ్రెస్ కచ్చితంగా గెలిచే స్థానం ఏదైనా ఉందంటే అది ఖమ్మం లోక్ సభ స్థానమే అనడంలో సందేహం లేదు . గత ఏడాది డిసెంబర్ లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. ఒక్క స్థానం వినా జిల్లాలోని అన్ని స్థానాలనూ కైవశం చేసుకుంది. ఒక్క స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించినా... ఆయనా కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. అటువంటి జిల్లాకు కేంద్రమైన ఖమ్మం లోక్ సభ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. పలు దఫాలు హైకమాండ్ రాష్ట్ర నేతలతో చర్చలు జరిపినా అభ్యర్థి విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోయింది. మరో రెండు రోజుల్లో అంటే ఏప్రిల్ 25 నామినేషన్ గడువు ముగుస్తుంది. అయినా ఇప్పటికీ కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి ఎవరన్నది తేల్చుకోలేని అయోమయ స్థితిలో ఉంది.  తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకూ బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని ప్రారంభించినప్పటికీ, ఏప్రిల్ 18న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా కాంగ్రెస్ మాత్రం ఇంకా  మూడు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయలేక ఆపసోపాలు పడుతోంది.  ఈ జాప్యం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయానికి గురి చేస్తున్నది.   కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను పక్కన పెడితే.. ఖమ్మం లోక్ సభ అభ్యర్థి ఎంపిక వ్యవహారం మాత్రం పార్టీ హైకమాండ్ కు సైతం తలనొప్పిగా మారింది. ఈ నియోజకవర్గ పార్టీ అభ్యర్థిత్వం  తమ వారికే ఇవ్వాలంటూ రేవంత్ కేబినెట్ లోని ఇద్దరు కీలక మంత్రులు గట్టిగా పట్టుబట్టడంతో ఇక్కడ అభ్యర్థి ఎంపిక    వివాదాస్పదంగా మారింది.    ఖమ్మం టికెట్ తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఇవ్వాలని మంత్రి పొంగులేటి, కాదు కాదు తన సతీమణి నిందినికే అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గట్టిగా పట్టుబడుతుండటంతో ఎంపికలో జాప్యం జరుగుతోంది.  ఈ విషయంలో ఇహనో ఇప్పుడో హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుని అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నప్పటికీ ఈ జాప్యం పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందా అన్న ఆందోళన కేడర్ లో వ్యక్తం అవుతోంది. 
Publish Date: Apr 23, 2024 10:37AM