ఏపీలో తెలుగుదేశం కూటమిదే హవా!.. తేల్చేసిన మరో జాతీయ సర్వే!

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమిదే అధికారమని మరో జాతీయ సర్వే సంస్థ తేల్చేసింది. ఏపీలో అధికార వైసీపీ ఈ సారి ఎన్నికలలో గణనీయంగా నష్టపోతున్నదని పేర్కొంది. రాష్ట్రంలోని పాతిక లోక్ సభ స్థానాలలో వైసీపీ కేవలం ఎనిమిది స్థానాలలో మాత్రమే విజయం సాధించే అవకాశాలున్నాయని కుండబద్దలు కొట్టింది.అదే విధంగా తెలుగుదేశం కూటమి 18 స్థానాలలో విజయకేతనం ఎగురవేయనున్నట్లు స్పష్టం చేసింది.  ఏపీలో వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది.   ఏపీలో ఈ సారి జరగనున్న ఎన్నికలు అత్యంత కీలకమైనవనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా ఏపీ ఎన్నికలపై ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఇటువంటి తరుణంలో తాజాగా టీవీ-సీఎన్ఎక్స్ నిర్వహించిన సర్వే ఫలితం సంచలనం సృష్టిస్తోంది. ఈ సర్వే   ఏపీలో రాబోయేది తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమేనని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధిస్తుందన్ని సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 17 లోక్ సభ స్థానాలలో విజయకేతనం ఎగురవేస్తుందని అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం పాతిక లోక్ సభ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో తెలుగుదేశం పార్టీ 17 స్థానాలలో పోటీ చేయనుంది. తెలుగుదేశం పార్టీ పోటీ చేసే 17 స్థానాలలో 14 స్థానాలలో విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. అలాగే కూటమిభాగస్వామ్య పార్టీలైన జనసేన, బీజేపీ వరుసగా రెండు, ఆరు స్థానాలలో పోటీ చేయనున్నాయి. జనసేన పోటీ చేసే రెండు స్థానాలలో ఒక స్థానంలో విజయం సాధిస్తుందనీ, ఇక బీజేపీ పోటీ చేసే ఆరు స్థానాలలో రెండింటిలో గెలుస్తుందనీ సర్వే పేర్కొంది. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పాతిక స్థానాలకు గానూ కేవలం ఎనిమిది స్థానాలలోనే విజయం సాధించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.  అంటే కూటమి రాష్ట్రంలోని పాతిక లోక్ సభ స్థానాలలో  17 స్ధానాలను కేవసం చేసుకుంటుంది. అధికార వైసీపీ ఎనిమిది స్థానాలకు పరిమితమౌతుంది.   ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే తెలుగుదేశం 114 స్థానాలలో పోటీ చేస్తుండగా, బీజేపీ పది స్థానాలలో, జనసేన 21 స్థానాలలో అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నాయి.  వైసీపీ 175 నియోజకవర్గాలలోనూ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసింది. రాష్ట్రంలో పోటీ ప్రధానంగా చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, వైఎస్ జనగ్ నేతృత్వంవలోని వైసీపీ మధ్యే ఉంటుందని సర్వే స్పష్టం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కావాలని చూస్తున్నది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టిన షర్మిల ఏపీలో కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు శతధా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు వరకూ రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీ ఆ తరువాత బలహీనపడి ఉనికి మాత్రంగా మిగిలిన సంగతి తెలిసిందే. కాగా రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభావం స్వల్పంగానే ఉంటుందనీ, ఆ పార్టీ గెయిన్ చేసే ఓట్లు వైసీపీకి నష్టం చేస్తాయనీ సర్వే అంచనా వేసింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలలో అధికార కాంగ్రెస్ పార్టీ తొమ్మిది స్థానాలలోనూ, బీజేపీ 5, బీఆర్ఎస్ 2, ఎంఐఎం ఒక స్థానంలోనూ గెలిచే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.  
Publish Date: Mar 19, 2024 10:25AM

 ఆ అధికారులను తొలగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు 

లోకసభ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాధికారులు, సిబ్బంది ఎన్నికల కమిషన్ పరిధిలో పని చేయాల్సి ఉంటుంది. కాదు కుదరదూ అంటే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో అధికారులను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. బీహార్, గుజ‌రాత్, ఉత్త‌ర‌ ప్ర‌దేశ్‌, జార్ఖండ్, ఉత్త‌రాఖండ్, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ హోంశాఖ కార్య‌ద‌ర్శుల‌ను ఈసీ తొల‌గించింది. అలాగే పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్‌ను కూడా ఈసీ తొల‌గించింది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చాక ఈసీ మొదటిసారి ఈ చ‌ర్య‌లు తీసుకుంది. బృహ‌న్ ముంబై కార్పొరేష‌న్ (బీఎంసీ) అధికారుల‌ పైనా ఈసీ వేటు వేసింది. బీఎంసీ క‌మిష‌న‌ర్, అద‌న‌పు, డిప్యూటీ క‌మిషన‌ర్ల‌ను ఈసీ తొల‌గిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.
Publish Date: Mar 18, 2024 4:24PM

గాజువాకలో గుడ్డు మంత్రికి ఎదురీతే!?

గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో  జోష్ కనిపిస్తున్నది. ఎప్పుడైతే జనసేనాని పవన్ కల్యాణ్  గాజువాక నుంచి పోటీ చేయరని తేలిపోయిందో.. ఆ క్షణం నుంచీ తెలుగుదేశం పార్టీ గాజువాక సీటును తమ ఖాతాలో వేసేసుకుంది. కచ్చితంగా గెలిచే స్థానాలలో గాజువాక మొదటి వరుసలో ఉంటుందని తెలుగుదేశం శ్రేణులు ఢంకా బజాయించి చెబుతున్నాయి. 2019 ఎన్నికలలో ఈ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన పల్లా శ్రీనివాసరావు, గత ఐదేళ్లుగా నియోజకవర్గ సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ నియోజకవర్గ ప్రజల తలలో నాలుకగా మారారు. ఎన్ని  అవరోధాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా పార్టీ క్యాడర్ కు అండగా నిలిచారు. నియోజకవర్గ సమస్యలపైనే కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాలకు వ్యతిరేకంగా క్రియాశీలంగా వ్యవహరించారు. ఆందోళనా కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. దీంతో నియోజకవర్గ ప్రజలలో ఆయన పట్ల సానుకూలత వ్యక్తం అవుతోంది. నియోజకవర్గ సమస్యలపై పల్లా శ్రీనివాసరావు పోరాటాలు, నియోజకవర్గ ప్రజలకు ఆయన అండగా నిలిచిన తీరు ప్రజలలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన గళమెత్తిన తీరు నియోజకవర్గ ఓటర్లకు ఆయనను దగ్గర చేసింది. మరీ ముఖ్యంగా నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ఆయన తిరుగులేని నేతగా మారారు.  అందుకు భిన్నంగా అధికార పార్టీ వైసీపీ గాజువాకలో తీవ్ర విభేదాలు ఉన్నాయి. అంతర్గత విభేదాల కారణంగా వైసీపీలో గ్రూపుల పోరు తీవ్రస్థాయిలో ఉంది. మరీ ముఖ్యంగా నియోజవకర్గం నుంచి వైసీపీ అభ్యర్థి విషయంలో పలు మార్పులు, చేర్పులూ జరిగాయి. అలా జరిగిన ప్రతి సారీ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి పీక్స్ కి వెళ్లింది. తొలుత గాజువాక వైసీపీ అభ్యర్థిగా వి. రామచంద్రరావు అలియాస్ చందును జగన్ నిర్ణయించారు. ఆయన అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా నియోజకవర్గ వైసీపీలో  పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమైంది. అసంతృప్తులను బుజ్జగించుకుని చందు  నియోజకవర్గంతో తన ప్రచారం ప్రారంభించారో లేదో అంతలోనూ చందూను కాదని జగన్ మంత్రి అమర్నాథ్ ను అభ్యర్థిగా ప్రకటించారు.   అయితే మంత్రి అమర్నాథ్ అభ్యర్థిత్వం పట్ల నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ కీలక నేతలు అమర్నాథ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అమర్నాథ్ కు సహకరించే ప్రశ్నే లేదని తెగేసి చెబుతున్నారు.  ఈ పరిస్థితుల్లో గాజువాక నుంచి అమర్నాథ్ విజయం నల్లేరు మీద బండి నడక ఎంత మాత్రం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో గాజువాక నుంచి తెలుగుదేశం విజయం పక్కా అని విశ్లేషిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం ఎలా అయితే చంద్రబాబుకు  కంచుకోటగా ఉందో గాజువాక కూడా అలాగే తెలుగుదేశం కంచుకోట అని పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. 
Publish Date: Mar 18, 2024 4:20PM

మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కు షాక్ 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థులను టార్గ్ చేస్తూ పావులు కదుపుతోంది. వారిపై ఉన్న పోలీస్ కేసులను తిరగతోడుతుంది. మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్‌కు తెలంగాణ పోలీసులు షాకిచ్చారు. హిట్ అండ్ రన్ కేసును తిరిగి ఓపెన్ చేశారు. రెండేళ్ల క్రితం... 17 మార్చి 2022న హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో రోడ్డు దాటుతున్న రెండేళ్ల బాలుడిపై నుంచి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో బాలుడు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బాలుడిని ఢీకొట్టిన కారు షకీల్‌కు చెందినదిగా ఆరోపణలు వచ్చాయి. ఈ కారు మీరా ఇన్ఫ్రా పేరుతో రిజిస్టర్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే షకీల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కారుపై ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉన్నట్లుగా కూడా అప్పుడు గుర్తించారు. అయితే ఆ స్టిక్కర్ తనది కాదని... తన స్టిక్కర్‌ను స్నేహితుడికి ఇచ్చినట్లు షకీల్ అప్పుడు చెప్పారు. ఈ ప్రమాదానికి సంబంధించి కారు డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు ఛార్జీషీట్ వేశారు. కానీ ఇప్పుడు పోలీసులు ఈ కేసును రీఓపెన్ చేశారు.
Publish Date: Mar 18, 2024 4:02PM

మల్లారెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన విద్యార్థులు 

అధికారం ఒకరిని అందలం ఎక్కిస్తే మరొకరిని పాతాళంలో తోసేస్తుంది. సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ అయిన మల్లారెడ్డిని  అన్ పాపులర్ చేసింది  ఇప్పటివరకు రాజకీయ ప్రత్యర్థులే. వీరికి  మరికొందరు తోడయ్యారు. ఆయన స్థాపించిన విద్యాసంస్థలకు సంబంధించిన విద్యార్థులు రాజకీయ ప్రత్యర్థులకు బాసటగా నిలుస్తున్నారు.  ఇటీవల మల్లారెడ్డి అల్లుడు ఆక్రమించిన ప్రభుత్వ, ప్రయివేటు భూములను రేవంత్ సర్కార్ స్వాధీనం చేసుకుంది.  మల్లారెడ్డి కబ్జా చేసిన భూములు, మల్లారెడ్డి విద్యాసంస్థలపై కూడా  రేవంత్ సర్కార్  ఉక్కుపాదం మోపింది. మల్లారెడ్డి  తన  విద్యా సంస్థ భవనాన్ని అక్రమంగా కట్టినట్టు తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. జెసీబీలతో తొక్కించి అక్రమ కట్టడాన్ని కూల్చివేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్శిటీ వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్శిటీలో చదువుతున్న విద్యార్థులు ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే... పరీక్షల్లో ఒకటి, రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయిన సుమారు 60 మంది విద్యార్థులను డిటైన్ చేశారు. దీంతో, వీరంతా ధర్మాకు దిగారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. మరోవైపు యూనివర్శిటీలో ధర్నా చేస్తున్న విద్యార్థులకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు మద్దతుగా నిలిచారు
Publish Date: Mar 18, 2024 3:45PM

సుప్రీంను ఆశ్రయించిన కల్వకుంట్ల కవిత

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ తనను అక్రమంగా అరెస్టు చేసిందని పేర్కొంటూ తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీం ను ఆశ్రయించారు. లిక్కర్ కుంభకోణం కేసులో తన ప్రమేయం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలూ లేవని ఆమె తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రతివాదిగా ఈడీ డైరెక్టర్ ను చేర్చారు. ఇలా ఉండగా ఈడీ కస్టడీలో కవిత తొలి రోజు విచారణ పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఈడీ అధికారులు విచారణ తతంగాన్నంతా వీడియో తీశారు. తొలి రోజు విచారణ పూర్తి కాగానే కవితను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావులు కలిశారు. అలాగే కవిత భర్త  అనీల్, న్యాయవాది మోహిత్ రావులు కూడా కవితతో భేటీ అయ్యారు. అంతకు ముందు కవిత తరఫున్యాయవాది సుప్రీం కోర్టులో ఇచ్చిన హామీని ఈడీ ఉల్లంఘించి కవితను అరెస్టు చేసిందని ఆరోపించారు.   ఈడీ డైరెక్టర్‌ను చేర్చనున్నారు. కాగా, ఢిల్లీ ఈడీ కార్యాలయంలో కవిత మొదటి రోజు విచారణ ఆదివారం పూర్తి అయింది. కవిత విచారణను ఈడీ అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. విచారణ తర్వాత కవితను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మాజీ మంత్రి తన్నీరు హరీష్, కవిత భర్త అనిల్, లాయర్ మోహిత్ రావు కలిశారు. 
Publish Date: Mar 18, 2024 3:33PM

వైఎస్ జగన్ కు చెక్.. కడప పార్లమెంటు నుంచి షర్మిల పోటీ? 

లోక్ సభ ఎన్నికల బరిలో ఏపీ నుంచి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.  ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ , గారాల పట్టి షర్మిల గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు.  ఆమె స్థాపించిన వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తన పార్టీ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లుతుందన్న కారణంతో పోటీ నుంచి విరమించుకున్నట్లు షర్మిల చెప్పుకున్నారు. తాను స్థాపించిన పార్టీ పేరులో తండ్రి పేరు వచ్చే విధంగా జాగ్రత్త పడింది. తన అన్న వైఎస్ జగన్ స్థాపించిన పార్టీ పేరులో కూడా తండ్రి పేరు వచ్చే విధంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. గత ఎపి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్  సక్సెస్ అయ్యారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నాడని స్వయాన సోదరి షర్మిల ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్ ఆశయాలు, ఆదర్శాలను వైఎస్ జగన్ గాలికొదిలేశారని ఆమె బాహాటంగానే ఆరోపిస్తున్నారు. తెలంగాణలో తాను స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున ఆమె పాడేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆమెను తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆమె వెనకడుగు వేసారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. బిఆర్ ఎస్ ను గద్దెదించడానికి షర్మిల ఆపన్న హస్తం అందించారు. తెలంగాణ ఫలితాల ద్వారా  కెసీఆర్ ప్రభుత్వం గద్దెదిగింది. తెలంగాణ ఫలితాల తర్వాత వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీని షర్మిల  కాంగ్రెస్ లో విలీనం చేశారు. . ప్రస్తుతం ఆమె ఎపిసిసి అధ్యక్ష పదవిలో ఉండి రాష్ట్ర వ్యాప్తంగా కలియతిరుగుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న తన చిరకాలస్వప్నాని నెరవేర్చుకోవడానికి ఆమె  కడప  పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని సమాచారం. 1978లో తొలిసారిగా పులివెందుల శాసనసభ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన వైఎస్  రాజశేఖరరెడ్డి మొత్తం ఆరు సార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా, నాలుగు సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు. జనతాపార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని విజయం సాధించిన తొలి ఎన్నికల  వెంటనే వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రిపదవి పొందారు. ఆ తరువాత వెనువెంటనే ముగ్గురు ముఖ్యమంత్రులు మారిననూ ఆ మూడు మంత్రిమండళ్లలో స్థానం సంపాదించారు. తండ్రి  ప్రాతినిద్యం వహించిన కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని షర్మిల  కూడా అభిలషిస్తున్నారు.  పార్టీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల నిలబడనున్నారు. ఖ్యమంత్రి జగన్ ను ఇరకాటంలోకి నెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు ఈ ఆలోచన చేసినట్లు సమాచారం. ఏఐసీసీ వర్గాలు ఈమేరకు షర్మిలపై ఒత్తిడి తెచ్చాయని తెలుస్తోంది. జగన్ ను ఆయన సొంత ఇలాఖాలోనే దెబ్బ కొట్టాలని, అందుకు షర్మిలను పోటీలో నిలబెట్టడమే మార్గమని పలువురు నేతలు అభిప్రాయపడ్డారట. ఏఐసీసీ నేతల ఒత్తిడి నేపథ్యంలో కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు షర్మిల అంగీకరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.మంగళవారం కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ మీటింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ మీటింగ్ తర్వాత ఏపీ, తెలంగాణ నుంచి లోక్ సభ బరిలో నిలిచే పార్టీ అభ్యర్థుల పేర్లపై స్పష్టత వస్తుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 25న లోక్ సభ అభ్యర్థుల జాబితాను ఏపీసీసీ విడుదల చేయనుందని, అందులో తొలి పేరు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలదేనని చెప్పాయి. కాగా, కడప నుంచి వైసీపీ అభ్యర్థిగా వైఎస్ అవినాశ్ రెడ్డికి జగన్ టికెట్ ఇచ్చారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు అవినాశ్ రెడ్డిపై వ్యతిరేకత పెంచి ఓటర్లు కాంగ్రెస్ ను ఆదరిస్తారని హైకమాండ్ భావిస్తోందని సమాచారం. మరోవైపు, వైఎస్ షర్మిల వైజాగ్ నుంచి లోక్ సభకు పోటీ చేస్తారని ఇటీవల ప్రచారం జరిగింది. తాజాగా ఆమె కడప ఎన్నికల బరిలో నిలుస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయంపై కాంగ్రెస్ స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.
Publish Date: Mar 18, 2024 2:27PM

విమానంలో సాంకేతిక లోపం.. గంటకు పైగా ఫ్లైట్ లోనే సీఎం రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆయన దాదాపు గంటకు పైగా విమానంలోనే చిక్కుపడిపోయారు. దీంతో ముంబైలో కీలక సమావేశానికి హాజరు కాలేకపోయారు. అలాగే ముంబైలో రాహుల్ గాంధీ న్యాయ సంకల్ప  సభకు కూడా హాజరు కాలేకపోయారు. ఇంతకీ జరిగిందేమిటంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షిలు ముంబైలో  రాహుల్ గాంధీ  న్యయ సంకల్ప యాత్ర సభకు హాజరు కాలేకపోయారు.  షెడ్యూల్ ప్రకారం వారు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానంలొ ఆదివారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు హస్తినకు బయలుదేరాల్సి ఉంది. తీరా వీరంతా విమానంలోకి ఎక్కి కూర్చున్న తరువాత సరిగ్గా టేకాఫ్ సమయంలో విమానంలో సాంకేతిక లోపం తెలెత్తింది. దీంతో ఆ విమానం కదలకుండా మెరాయించింది. ఆ లోపం సరి చేసి విమానం బయలు దేరడానికి గంటకు పైగా సమయం పట్టింది. అంత సేపూ రేవంత్ రెడ్డి తదితరులు విమానంలోనే చిక్కుపడిపోయారు. ఈ జాప్యం కారణంగా రాహుల్ గాంధీ న్యాయ జోడో యాత్ర ముగింపు సందర్భంగా ముంబైలో ఏర్పాటు చేసిన కీలక సభకు వీరు హాజరు కాలేకపోయారు.  
Publish Date: Mar 18, 2024 1:30PM

గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా.. ఎన్నికల బరిలోకి

సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణ గవర్నర్ తమిళిసై తన పదవికి రాజీనామా చేశారు. ఆమె ఎన్నికల బరిలో దిగనున్నట్లు గట్టిగా వినిపిస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వంతో విభేదాల కారణంగా నిత్యం వార్తలలో నిలిచిన తమిళి సై అప్పట్లోనే రాజకీయాలలోకి ప్రవేశించే అవకాశాలున్నాయన్న వార్తలు వినిపించాయి.  కేసీఆర్ హయాంలో తనకు రాష్ట్రప్రభుత్వం కనీసం ప్రొటోకాల్ కూడా ఇవ్వలేందంటూ చేసిన విమర్శలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.  అప్పట్లో రాజభవన్, ప్రగతి భవన్ మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలూ రాజకీయ పార్టీల మధ్య విభేదాలను తలపించేవనడంలో సందేహం లేదు. సరే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ ప్రభుత్వం స్థానంలో రేవంత్ సర్కార్ కొలువుదీరిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం, రాజ్ భవన్ మధ్య సయోధ్య కొనసాగుతున్నది. అయితే అనూహ్యంగా ఎన్నికల వేళ తమిళిసై తన పదవికి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. తమిళిసై తన రాజీనామాల లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సోమవారం(మార్చి 18)న సమర్పించారు. తెలంగాణ గవర్నర్ పదవితో పాటు, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా తమిళి సై రాజీనామా చేశారు. ఇలా ఉండగా ఆమె వచ్చే ఎన్నికలలో పోటీ చేయనున్నారని గట్టిగా ప్రచారం అవుతున్నది. తన సొంత రాష్ట్రమైన తమిళనాడు నుంచి ఆమె ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉందని తెలుస్తున్నది.  తన పోటీ విషయంపై తమిళిసై ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. తెలంగాణ గవర్నర్ గా నియమితురాలు కావడానికి ముందు తమిళిసై తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పని చేశారు.     2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని తుత్తుకుడి నియోజకవర్గం నుంచి పోటీ చేసి  డీఎంకే అభ్యర్థి కనిమొళి చేతిలో  పరాజయం పాలయ్యారు. ఇప్పుడు మరో సారి ఎన్నికల బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ఆమె ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారన్న విషయంపై స్పష్టత లేదు. 
Publish Date: Mar 18, 2024 12:54PM

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో వైసీసీ చిత్తుచిత్తు!?

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో  మే13న జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూట‌మి అభ్య‌ర్థుల హ‌వా ఖాయ‌మ‌ని సర్వేలు చెబుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఈ జిల్లాలో ఒక్క కుప్పం నియోజ‌క‌వ‌ర్గం మిన‌హా మిగిలిన అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే ఐదేళ్లు గిర్రున తిరిగేసరికి ఈ జిల్లాలో సీన్ రివర్స్ అయ్యింది. జగన్ పాలనపై ప్రజాగ్రహం నిప్పులు చెరుగుతున్న పరిస్థితి. అన్నిటికీ మించి చిత్తూరు జిల్లాలో జగన్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరించడం, తెలుగుదేశం క్యాడర్, మద్దతు దారులపై దాష్టీకాలు, అదే సమయంలో అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో జిల్లాలో వైసీపీపై వ్యతిరేకత మరో రేంజ్ లో ఉంది.  ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో వైసీపీ హ‌యాంలో చెప్పుకొద‌గ్గ  ఒక్క అభివృద్ధి కార్య‌క్ర‌మంకూడా జ‌ర‌గ‌లేదు. వైసీపీ ప్ర‌భుత్వ  ప్ర‌జా వ్య‌తిరేక‌ పాల‌న‌పై ఉమ్మ‌డి జిల్లా వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.   వైసీపీ నేత‌ల అవినీతి, అక్ర‌మాలు పెచ్చురెల్లిపోయాయ‌న్న విమ‌ర్శ‌లూ వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్ర‌జ‌లు కూట‌మి అభ్య‌ర్థులను గెలిపించేందుకు ఎన్నికల తేదీ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇటీవల వెలువడిన పలు సర్వేలు  కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం క్లీన్ స్వీప్ ఖాయం అని పేర్కొన్నాయి. జిల్లాలో  నియోజకవర్గాల వారీగా  పరిస్థితి ఇలా ఉంది.  సత్యవేడు నియోజ‌క‌వ‌ర్గం  స‌త్య‌వేడు నియోజ‌క‌వ‌ర్గంలో 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా కోనేటి ఆదిమూలం పోటీచేసి విజ‌యం సాధించారు.  అయ‌తే, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అసమర్థ పాలన, వేధింపు రాజకీయాలతో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి అడుగంటిన తీరు కారణంగా ఆయన ఇప్పటికే వైసీపీని వీడి  తెలుగుదేశంలో చేరారు. రానున్న ఎన్నికలలో   కోనేటి ఆదిమూలం  తెలుగుదేశం అభ్య‌ర్థిగా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ బ‌రిలో  దిగుతున్నారు. ఆయన ప్రత్యర్థిగా అంటే  వైసీపీ అభ్య‌ర్థిగా నూక‌తోటి రాజేష్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ  ప‌ట్ల ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుంది. ఐదేళ్ల కాలంలో సీఎం జ‌గ‌న్ ప్ర‌జావ్య‌తిరేక పాల‌న‌పై ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు. దీనికితోడు నియోజ‌క‌వ‌ర్గంలోని వైసీపీలోవ‌ర్గ విబేధాలు తార స్థాయికి చేరాయి. తెలుగుదేశం అభ్య‌ర్థి కోనేటి ఆదిమూలం విజ‌యం ఖాయ‌మ‌ని ఇప్ప‌టికే ప‌లు స‌ర్వేలు స్ప‌ష్టం చేశాయి.  గంగాధర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గం  గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గంలో 2014, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి కె. నారాయ‌ణ స్వామి విజ‌యం సాధించారు. ప్రస్తుతం జ‌గ‌న్ కేబినెట్ లో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.  అయితే, గ‌త ఐదేళ్ల‌లో ఆయన పని తీరుపై   ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. సొంత పార్టీ నేత‌ల నుంచి కూడా నారాయ‌ణ స్వామిపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.   దీనికితోడు జ‌గ‌న్ నిర్వ‌హించిన స‌ర్వేల్లో నారాయ‌ణ స్వామికి టికెట్ ఇస్తే ఓడిపోతారని తేల‌డంతో ఆయ‌న్ను త‌ప్పించి ఆయ‌న పెద్ద‌ కుమార్తె కృపా లక్ష్మీకి  జ‌గ‌న్ టికెట్ కేటాయించారు. కృపా ల‌క్ష్మీకి టికెట్ ఇవ్వ‌డం ప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలోని పార్టీ నేత‌ల్లో కొంద‌రు వైసీపీ అధిష్టానంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి  టీడీపీ అభ్య‌ర్థి  డాక్టర్ వి. ఎమ్ . థామ‌స్ బ‌రిలోకి దిగ‌ుతున్నారు. వైసీపీ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేత‌కుతోడు, నారాయ‌ణ స్వామి కుటుంబంపై వ్య‌తిరేక‌త టీడీపీ అభ్య‌ర్థి విజ‌యానికి దోహదపడుతుందని ని ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు.  పూతలపట్టు నియోజ‌క‌వ‌ర్గం పూత‌ల‌ప‌ట్టు నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం ఇప్ప‌టి వ‌ర‌కు విజ‌యం సాధించ‌లేదు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా ఎంఎస్ బాబు విజ‌యం సాధించాడు. అయితే, ఐదేళ్ల కాలంలో నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో ఎంఎస్ బాబుపై వ్య‌తిరేక‌త రావ‌డంతో ఆయ‌న్ను త‌ప్పించిన‌ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. డాక్ట‌ర్‌ సునీల్ కుమార్ కు టికెట్ కేటాయించారు. టీడీపీ అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ క‌లికిరి ముర‌ళి మోహ‌న్ బ‌రిలోకి దిగుతున్నారు. వైసీపీలో వ‌ర్గ‌ విబేధాల‌తోపాటు, వైసీపీ ఐదేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త, అదే సమయంలో  జ‌న‌సేన‌, బీజేపీలు టీడీపీతో కలిసి నడుస్తుండటంతో  ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఈసారి పూతలపట్టులో తెలుగుదేశం విజయం సానాయాసమేనని పార్టీ క్యాడర్ ధీమా వ్యక్తం చేస్తున్నది.   నగరి నియోజ‌క‌వ‌ర్గం న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థిగా ఆర్కే రోజా మ‌రోసారి పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నిక‌ల్లో ఆమె విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లో రోజాపై ఓట‌మిపాలైన తెలుగుదేశం అభ్య‌ర్థి గాలి భానుప్ర‌కాశ్ ఈ సారి కూడా రోజాకు ప్రత్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు.  ఏపీలో వైసీపీ ఖ‌చ్చితంగా ఓడిపోయే సీట్ల‌లో న‌గ‌రి ఒక‌టి అని పరిశీలకులే కాదు, నియోజకవర్గ ప్రజలు కూడా గట్టిగా చెబుతున్నారు. నగరి ఎమ్మెల్యేగా గత ప‌దేళ్ల కాలంలో  రోజా నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేయడమే కాకుండా, ఆమె, ఆమె కుటుంబ సభ్యుల అవినీతి తారస్థాయికి చేరడంతో  ఆమెపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నది.  దీనికి తోడు నియోజ‌క‌వ‌ర్గంలోని దాదాపు అన్ని మండ‌లాల వైసీపీ నేత‌లు రోజాకు ఈసారి టికెట్ ఇవ్వ‌ద్ద‌ని వైసీపీ అధిష్టానానికి  విన్న‌వించుకున్నారు. అయినా జ‌గ‌న్ రోజాకు టికెట్ ఇచ్చారు. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల నుంచి ,  సొంత పార్టీ నేత‌ల నుంచి వ్య‌తిరేక‌త, అవినీతి ఆరోపణలు, అదే విధంగా సొంత జిల్లాలోనే  వైసీపీలోని ఒక బలమైన వర్గం రోజాకు వ్యతిరేకంగా పని చేయడం కారణంగా ఆమె విజయం కష్టమేనని పరిశీలకులు అంటున్నారు.  తెలుగుదేశం అభ్య‌ర్థి గాలి భానుప్ర‌కాశ్ విజయం నల్లేరు మీద బండి నడకేనని అంటున్నారు.  శ్రీకాళహస్తి నియోజ‌క‌వ‌ర్గం శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి బియ్య‌పు మ‌ధు సూద‌న్ రెడ్డి విజ‌యం సాధించాడు. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం అభ్య‌ర్థిగా బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి ఐదుసార్లు విజ‌యం సాధించాడు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న కుమారుడు బొజ్జ‌ల వెంక‌ట సుధీర్‌రెడ్డి తెలుగుదేశంఅభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి స్వ‌ల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లోనూ ఆ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ధు సూద‌న్ రెడ్డి, సుధీర్‌ రెడ్డిలే త‌ల‌ప‌డుతున్నారు. ఈసారి  వెంక‌ట సుధీర్ రెడ్డి విజ‌యం ఖాయ‌మ‌ని ప‌లు స‌ర్వేలు చెబుతున్నాయి. చిత్తూరు నియోజ‌క‌వ‌ర్గం చిత్తూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి  తెలుగుదేశం అభ్య‌ర్థి గుర‌జాల జ‌గ‌న్మోహ‌న్, వైసీపీ అభ్య‌ర్థిగా ఎం. విజ‌యానంద‌రెడ్డి బ‌రిలోకి దిగుతున్నాడు. విజ‌యానంద్ రెడ్డిపై అనేక అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఎర్రచందనాన్ని కొల్లగొట్టి కోట్లు సంపాదిస్తున్నారన్న విమ‌ర్శ‌లు, ఆరోపణలు ఉన్నాయి. గ‌త ఐదేళ్ల వైసీపీ ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న‌పై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. దీనికితోడు జ‌న‌సేన‌, బీజేపీ, టీడీపీ కూట‌మిగా పోటీచేస్తుండ‌టంతో టీడీపీ అభ్య‌ర్థి విజ‌యం ఖాయ‌మ‌ని ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు.   చంద్రగిరి నియోజ‌క‌వ‌ర్గం చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త రెండు ద‌పాలుగా చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి విజ‌యం సాధించారు. ఈసారి ఆయ‌న్ను నెల్లూరు ఎంపీ అభ్య‌ర్థిగా వైసీపీ అధిష్టానం పంపించింది. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న కుమారుడు  చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతున్నాడు. మ‌రోవైపు తెలుగుదేశం అభ్య‌ర్థిగా పులివ‌ర్తి వెంక‌ట‌మ‌ణిప్ర‌సాద్ (నాని) పోటీ చేస్తున్నాడు.  ఈ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో వైసీపీ ఐదేళ్ల ప్ర‌జావ్య‌తిరేక పాల‌న‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికితోడు మూడు పార్టీలు కూట‌మిగా పోటీచేస్తుండ‌టంతో నియోజ‌క‌వ‌ర్గంలోతెలుగుదేశం విజ‌యం ఖాయ‌మ‌ని ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు.   పలమనేరు నియోజ‌క‌వ‌ర్గం 2019 ఎన్నికలలో పలమనేరు  నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ అభ్య‌ర్థి నల్లప్పగారి వెంకటేగౌడ్ తెలుగుదేశం అభ్య‌ర్థి ఎన్‌. అమ‌ర్నాథ్ రెడ్డిపై విజ‌యం సాధించారు. ఈసారి ఎన్నిక‌ల్లోనూ వీరిద్ద‌రే ప్రత్యర్థులుగా  త‌మ‌త‌మ పార్టీల త‌ర‌పున పోటీ చేస్తున్నారు. అయితే, ఈసారి తెలుగుదేశం అభ్య‌ర్థి విజ‌యానికి ఎక్కువ అవ‌కాశాలు ఉన్న‌ట్లు   స‌ర్వేలు చెబుతున్నాయి. కుప్పం నియోజ‌క‌వ‌ర్గం కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రోసారి టీడీపీ అధినేత‌ నారా చంద్ర‌బాబు నాయుడు పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్య‌ర్థిగా కేజే భ‌ర‌త్ పోటీచేస్తున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చంద్ర‌బాబు విజ‌యం న‌ల్లేరు మీద బండి న‌డ‌క అని చెప్పొచ్చు.  పుంగనూరు నియోజ‌క‌వ‌ర్గం పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ అభ్య‌ర్థి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి గ‌త మూడు ద‌ఫాలుగా విజ‌యం సాధిస్తూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేయ‌బోతున్నారు. అయితే ఈ సారి తెలుగుదేశం అభ్య‌ర్థిగా బరిలోకి దిగుతున్న చ‌ల్లా రామ‌చంద్రారెడ్డి నుంచి పెద్దిరెడ్డి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. గత ఐదేళ్ల కాలంలో పెద్దిరెడ్డి క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌పై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్నది. అంతే కాకుండా తీవ్రమైన అవినీతి అక్ర‌మాల ఆరోప‌ణ‌ఎదుర్కొంటున్న ఆయనకు నియోజకవర్గంలో సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది.  నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల్లో పెద్దిరెడ్డిపై వ్య‌తిరేక‌తకుతోడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తుండటం కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కలిసి వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   పీలేరు నియోజ‌క‌వ‌ర్గం  ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 2014, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి చింత‌ల రాంమ‌చంద్రారెడ్డి టీడీపీ అభ్య‌ర్థి  న‌ల్లారి కిశోర్ కుమార్ రెడ్డిపై విజ‌యం సాధించాడు.  2024 ఎన్నిక‌ల్లోనూ వీరిద్ద‌రే తమ తమ పార్టీల అభ్యర్థులుగా రంగంలోకి దిగి పరస్పరం తలపడనున్నారు. గ‌త ఐదేళ్లలో రాంచంద్రారెడ్డి తీరు ఆయనపై తీవ్ర ప్రజా వ్యతిరేకతను ప్రోది చేసింది.  వైసీపీలో వ‌ర్గ‌ విబేధాలు కూడా ఆయనకు వ్యతిరేకంగా చాప‌కింద నీరులా పని చేస్తున్నాయి. దీంతో ఈ సారి న‌ల్లారి కిశోర్ కుమార్ రెడ్డి విజ‌యం సునాయాసమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   మదనపల్లె  నియోజ‌క‌వ‌ర్గం 2019 ఎన్నిక‌ల్లో మదనపల్లె నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్య‌ర్థి షాజ‌హాన్ బాషా విజ‌యం సాధించారు.  గ‌తేడాది ఆయ‌న వైసీపీని వీడి నారా లోకేశ్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో తెలుగుదేశం గూటికి చేరారు.   ఈ సారి తెలుగుదేశం అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.  వైసీపీ అభ్య‌ర్థిగా నిస్సార్ అహ్మ‌ద్ పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో వైసీపీకి ఉన్న ప్రతికూలత, తెలుగుదేశం పార్టీకి ఉన్న సానుకూలత షాజహాన్ విజయాన్ని ఖరారు చేసేశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   తంబళ్లపల్లె నియోజ‌క‌వ‌ర్గం 2019 ఎన్నిక‌ల్లో  ఇక్కడి నుంచి వైసీపీ అభ్య‌ర్థి పెద్దిరెడ్డి ద్వార‌కానాధ్ రెడ్డి విజ‌యం సాధించారు. మ‌రోసారి ఆయ‌నే  వైసీపీ అభ్యర్థిగా బ‌రిలోకి దిగుతున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా తెలుగుదేశం తరఫున  జ‌య‌చంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. జగన్ ప్రజావ్యతిరేక పాలనకు తోడు స్వయంగా ద్వారకానథ్ రెడ్డి వ్యవహారశైలి కూడా తంబళ్లపల్లెలో  జయచంద్రారెడ్డికి సానుకూలత ఏర్పడటానికి కారణమైంది. అలాగే ద్వాకానాథ్ రెడ్డిపై  అవినీతి ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈద‌ఫా జ‌య‌చంద్రారెడ్డికి నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌యావ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని తెలుగుదేశం వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. తిరుపతి నియోజ‌క‌వ‌ర్గం  తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి భూమన కరుణాకర్ రెడ్డి విజ‌యం సాధించాడు. ఈసారి ఆయ‌న కుమారుడు భూమ‌న అభిన‌య్ రెడ్డి వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్నాడు. కూట‌మి నుంచి జ‌నసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు బ‌రిలోకి దిగుతున్న‌ట్లు స‌మాచారం. అయితే, వైసీపీ ఐదేళ్ల క‌క్ష‌పూరిత రాజ‌కీయాలు,  ప్ర‌జావ్య‌తిరేక‌ విధానాలపై ప్రజలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దీనికి తోడు తిరుమల తిరుపతి పవిత్రత దెబ్బతినే విధంగా టీటీడీ చైర్మన్ గా భూమన తీసుకున్న నిర్ణయాలు కూడా వైసీపీ పట్ల, ఆ పార్టీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి పట్ల ప్రజాగ్రహం వ్యక్తం అవుతోంది.  దీనికితోడు నియోజ‌క‌వ‌ర్గంలోని వైసీపీ నేత‌ల మ‌ధ్య‌ అంతర్గ‌త విబేధాలు కూట‌మి అభ్య‌ర్థి విజ‌యానికి దోహ‌దం చేస్తాయ‌ని ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు.
Publish Date: Mar 18, 2024 12:22PM

బీజేపీ, కాంగ్రెస్.. బలోపేతం అయ్యాయా? బలహీనపడ్డాయా?

ఇండియా కూటమి బలహీనపడుతూ కాంగ్రెస్ బలోపేతమౌతోందా? ఎన్డీయే బలోపేతం చేస్తామనడం వెనుక బీజేపీ బలహీనపడిందన్న సంకేతాలు ఉన్నాయా? ప్రస్తుతం రాజకీయ సర్కిల్స్ లో ఇదే చర్చ విస్తృతంగా సాగుతోంది. ముందుగా బీజేపీ విషయానికి వస్తే నిన్న మొన్నటి వరకూ ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పక్షాలను ఒక్కటొక్కటిగా వదుల్చుకున్న కమలం పార్టీ ఇప్పుడు పెద్ద ఎత్తున భాగస్వామ్యపక్షాలను చేర్చుకునేందుకు తహతహలాడుతోంది. ఇందుకు కారణం వచ్చే సార్వత్రిక ఎన్నికలలో నాలుగోందలకు పైచిలుకు స్థానాలలో విజయమే లక్ష్యమని చెబుతున్నది. అందు కోసం ఎన్డీయే కూటమి బలోపేతం పేరిట నిన్న మొన్నటి దాకా కారాలూ, మిరియాలూ నూరిన పార్టీలను సైతం కూటమిలోకి రావాల్సిందిగా ఆహ్వానాల మీద ఆహ్వానాలు పంపించేస్తొంది. పొత్తు కోసం ఒక అడుగు వెనక్కు తగ్గడానికి సైతం సిద్ధ పడిపోతోంది.   రామ మందిర నిర్మాణం, ట్రిబుల్ తలాక్, సీఏఏ వంటి బీజేపీ సర్కార్ నిర్ణయాలు కమలం పార్టీకి అనుకున్నంత మైలేజ్ ఇవ్వలేదా అన్న అనుమానాలు కూడా పొడసూపుతున్నాయి. అభివృద్ధి, ప్రపంచ దేశాలలో గుర్తింపు, ఆర్థిక ప్రగతి  అన్ని వర్గాలకూ న్యాయం వంటి నినాదాలు, ఆర్భాటంగా ప్రచారాలు ఇవేవీ బీజేపీని గతం కన్నా బలోపేతం చేయాలేదా అన్న అనుమానాలకు ఎన్డీయే బలో పేతం కోసం ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు తావిస్తున్నాయి.  పరిశీలకులు అయితే వాజ్ పేయి హయాంలో భారత్ వెలిగిపోతున్నది అంటూ ఆర్భాటంగా ప్రచారం చేసుకుని మరీ ముందస్తు ఎన్నికలకు వెళ్లి బొక్కబోర్లా పడిన సంగతిని గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు కూడా బీజేపీది ఆర్భాట ప్రచార పటాటోపమేనా, క్షేత్ర స్థాయిలో ప్రజాసమస్యల పరిష్కారంలో ఆ పార్టీ వైఫల్యం రానున్న సార్వత్రిక ఎన్నికలలో విజయంపై కమలనాథుల్లో అనుమాలు ఉన్నాయా అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి.  ఇక బీజేపీ యేతర పార్టీలు కేంద్రంలోని మోడీ సర్కార్ ను గద్దె దించడమే లక్ష్యంగా ఏకతాటిపైకి వచ్చి ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమి తొలి అడుగులోనే తడబడింది. బీజేపీయేతర పార్టీల ఐక్యతకు పౌరోహిత్యం వహించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాజకీయ లభనష్టాలను బేరీజు వేసుకుని ముందుగానే గోడ దూకేశారు. ఆయన ఎన్డీయే కూటమిలో చేరి తన పదవిని కాపాడుకుని, తన స్థాయి, పరిధి బీహార్ కే పరిమితమని చాటుకున్నారు. ఇక అక్కడి నుంచి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నుంచి ఒక్కొక్క పక్షం జారిపోవడం మొదలైంది. పూర్తిగా రూపుదిద్దుకోకుండానే ఇండియా కూటమి ఇప్పుడు ఉందా? లేదా అన్న అనుమానాలు సామాన్యులలో సైతం వ్యక్తం అవుతున్న పరిస్థితి.  ఇప్పటికే కొన్ని పార్టీలు కాంగ్రెస్‌ తో తెగతెంపులు చేసుకుని, ఇండియా కూటమి నుంచి వైదొలగి, సొంతగా పోటీ చేయడానికి లేదా బీజేపీకి మద్దతునివ్వడానికి సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీతో ఇప్పటికే తెగతెంపులు చేసుకున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ పశ్చిమ బెంగాల్‌ లోని మొత్తం 42 స్థానాల్లోనూ ఒంటరి పోటీకి రెడీ అయిపోయింది.  మహారాష్ట్రలో ఉద్ధవ్‌ థాకరేకు చెందిన శివసేన తమ మిత్రపక్షాలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ః పార్టీ (శరద్‌ పవార్‌), కాంగ్రెస్‌ పార్టీలను సంప్రదించకుండానే ఏకపక్షంగా   అభ్యర్థులను ప్రకటించేసి తన ఉద్దేశమేమిటన్నది స్పష్టం చేసింది.జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమికి రెండు ప్రధాన స్తంభాలుగా నిలబడిన కాంగ్రెస్‌ పార్టీ, వామపక్షాలు కేరళలో  పరస్పరం ఢీ కొంటున్నాయి.   ఈ పరిస్థితుల్లో మామూలుగా అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో 2019 ఎన్నికల నాటి ఫలితాలే పునరావృతమౌతాయని అందరూ భావిస్తారు. అయితే దక్షిణాది రాష్ట్రాలలో కాంగ్రెస్ రోజు రోజుకూ బలపడుతుండటం, అదే సమయంలో బీజేపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి ఎన్డీయే కూటమిలోకి సాధ్యమైనన్ని పార్టీలను చేర్చుకోవడానికి తహతహలాడటం చూస్తుంటే.. బీజేపీ బలహీనపడిందా, లేక కాంగ్రెస్ బలోపేతమైందన్న ఆందోళనలో ఉందా అన్న చర్చ విస్తృతంగా జరిగింది. ఈ సందర్బంగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పట్లో కాంగ్రెస్ బలంగా పుంజుకుంటోంది జాగ్రత్త వహించాలనంటూ స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సంగతిని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య హోరాహోరీ తప్పదని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు. 
Publish Date: Mar 18, 2024 11:40AM

ఫ్యామిలీ ప్యాకేజీలతో నిండిపోయిన వైసీపీ అభ్యర్థుల జాబితా!

వచ్చే ఎన్నికలలో పోటీ చేయనున్న లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఏపీ సీఎం జగన్  ప్రకటించేశారు. ఒకే సారి 175 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించేసిన జగన్, లోక్ సభ స్థానాల విషయంలో మాత్రం ఒక్క అనకాపల్లి నియోజకవర్గాన్ని మినహాయించి మిగిలిన 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశారు. మూడు నెలల ముందునుంచే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించిన జగన్.. సిట్టింగుల మార్పు అంటే తెగ హడావుడి చేశారు. ఆ తరువాత ఎట్టకేలకు ఇడుపులపాయ వేదికగా వైసీపీ తరఫున వచ్చే ఎన్నికలలో పోటీ చేయనున్న అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల జాబితాలను ప్రకటించారు. ఇంత హడావుడి చేసిన తరువాత ఆయన ప్రకటించిన అభ్యర్థుల జాబితాలను చూస్తే.. జగన్ ఎంత ఒత్తిడిలో ఉన్నారో, రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థులు జగన్ ను ఏ స్థాయిలో కంట్రోల్ చేస్తున్నారో ఇట్టే అవగతమైపోతుంది. అంతే కాకుండా కొన్ని కుటుంబాలను కాదని జగన్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారనీ తేటతెల్లమైపోయిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  ముఖ్యంగా జగన్ అభ్యర్థుల ప్రకటన చాలా వరకూ ఫ్యామిలీ ప్యాకేజీని తలపిస్తోందని అంటున్నారు.  ముఖ్యంగా పలువురు పార్టీ సినియర్ల కుటుంబాలు అత్యధిక స్థానాలలో పోటీ చేసేందుకు టికెట్లు సాధించుకున్నారు.  బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలనాగిరెడ్డి కుటుంబాలకు మూడేసి  టికెట్లు లభించాయి. అలాగే  ఆదిమూలపు, ధర్మాన, చెవిరెడ్డి కుటుంబాలకు రెండేసి టికెట్లు లభించాయి.  ఇది ఆయా కుటుంబాలు జగన్ పై ఎంత ప్రభావం చూపుతున్నాయో, ఆయా నాయకులపై జగన్ ఎంతగా ఆధారపడ్డారో తెలియజేస్తున్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ స్వయంగా చీపురుపల్లి నుంచి మరో సారి రంగంలోకి దిగుతున్నారు. ఆయన సతీమణి బొత్స ఝాన్సీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఇక బొత్స సమీప బంధువు బొత్స అప్పల నరసయ్య గజపతి నగరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరో సారి పోటీ చేస్తుండగా, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి  రాజంపేట ఎంపీగా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి తంబల్లపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.   ఇక బాలనాగి రెడ్డి మంత్రాలయం ఎమ్మెల్యేగా మరో సారి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిరెడ్డి గుంతకల్లు, మరో సోదరుడు సాయిప్రసాద్ రెడ్డి అదోని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థులుగా రంగంలోకి దిగుతున్నారు. ఇక శ్రీకాకుళం ఎమ్మెల్యే, మంత్రి ధర్మాన ప్రసాదరావు మరో సారి పోటీ చేయనున్నారు. ఆయన సోదరుడు ధర్మాన కృష్ణ దాస్ కు కూడా నరసన్నపేన నుంచి వైసీపీ టికెట్ దక్కింది. అదే విధంగా కొండెపి ఎమ్మెల్యే మంత్రి ఆదిమూలపు సురేష్ మరో సారి అదే నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. ఆయన సోదరుడు ఆదిమూలపు సతీష్ కు జగన్ కొడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పార్టీ టికెట్ ఇచ్చారు. అదే విధంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఒంగోలు లోక్ సభ స్థానంలో వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు, ఆయన కుమారుడు  చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా నిలబడుతున్నారు. ఇంకా తనుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మరో సారి అదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. ఆయన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ కూ టికెట్ లభించింది. అలాగే మేకపాటి విక్రం రెడ్డి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిలకు జగన్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు టికెట్లు ఇచ్చారు. మొత్తంగా వైసీపీ అభ్యర్థుల జాబితాలలో ఫ్యామిలీ ప్యాకేజీలకే జగన్ పెద్ద పీట వేశారు.  
Publish Date: Mar 18, 2024 10:41AM

ఏపీ ప్రజల నిర్ణయం అదేనా?..మోడీ వరుస ట్వీట్లు చెబుతున్నదేమిటి?

ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ పాలన అంతం కోరుకుంటున్నారా? వచ్చే ఎన్నికలలో వారు అన్ కండీషనల్ గా ఎన్డీయే కూటమికే ఓటు వేయాలన్న నిర్ణయానికి వచ్చేశారా? అంటే చిలకలూరి పేటలో ఆదివారం (మార్చి 17) సాయంత్రం జరిగిన ప్రజాగళం సభ తరువాత మోడీ వరుస ట్వీట్లు చేస్తే ఔననే అనిపిస్తున్నది. నిజం. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని మోడీ ప్రజాగళం సభలో ప్రసంగించిన తరువాత గంటల వ్యవధిలోనే  తన ఎక్స్ ఖాతా వేదికగా వరుస ట్వీట్లు చేశారు. అభివృద్ధి కోసం, అవినీతి రహిత పాలన కోసం ఏపీ జనం ఈ సారి ఎన్నికలలో ఎన్డీయే కూటమికే ఓటు వేయాలన్న నిర్ణయానికి వచ్చేశారని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు ప్రజాగళం సభలో ఆయన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ లతో కలిసి వేదిక పంచుకున్నారు. ఆ సభలో ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల జగన్ పాలన మొత్తం అవినీతి మయం అని విమర్శించారు. ప్రజలు జగన్ పాలనను అంతం చేసి ఎన్డీయేకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. అయితే సభ ముగిసిన తరువాత గంటల వ్యవధిలోనే ఆయన తన ఎక్స్ ఖాతాలో వరుస పోస్టింగులు పెట్టడం విస్తుగొలిపింది. సభకు వచ్చిన ప్రజాస్పందనకు ముగ్ధుడైన మోడీ.. ఏపీ ప్రజలు జగన్ పాలనకు తెరదించడానికి నిర్ణయం తీసేసుకున్నారని ఫిక్స్ అయ్యారని బీజేపీ శ్రేణులే కాదు, ఆయన పోస్టులు చూసిన పరిశీలకులు సైతం చెబుతున్నారు.  ప్రజాగళం సభ ముగిసిన అనంతరం మోడీ చేసిన ట్వీట్లు ఇలా ఉన్నాయి.  మొదటి ట్వీట్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎన్డీయేకు మద్దతుగా నిలవాలని నిర్ణయించేసుకున్నారు. ఎన్డీయే అభివృద్ధి అజెండాకే వచ్చే ఎన్నికలలో ఓటు వేయాలని డిసైడైపోయారు. పల్నాడులో ప్రజాగళం సభ అదే చెప్పిందని పేర్కొన్నారు. ఆ తరువాత కొద్ది సేపటికే మరో ట్వీట్ చేసిన ప్రధాని ఆ ట్వీట్ లో  చిలకలూరి పేట సభ ఘన విజయం ఎన్డీయేకు ప్రజా మద్దతును ఎలుగెత్తి చాటింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీలు మాత్రమే అభివృద్ధి చేయగలవనీ, వైసీపీ అవినీతి, దుష్టపాలనకు వ్యతిరేకంగా జనం ఆ జగన్ ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడాలన్న నిశ్చయంతో ఉన్నారనీ పేర్కొన్నారు.  ఇక ఆ తరువాత చేసిన ట్వీట్ లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రజలు ఎన్డీయే ఎంపీలు, ఎమ్మెల్యేలనూ అధికసంఖ్యలో ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.   ఆ తరువాత కొద్ది సేపటికే తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు నివాళులర్పిస్తూ చేసిన ట్వీట్ లో ఏపీ పురోగతి కోసం ఎన్టీఆర్ దార్శనికతను కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు ఎన్డీయే పని చేస్తుందని హామీ ఇచ్చారు. ఆ తరువాతి ట్వీట్ లో ఆయన ఏపీ ప్రజలు  వైసీపీని ఓడించాలి, ఎన్డీయేకు ఓటు వేయాలన్న విషయాలలో స్పష్టంగా ఉన్నారని పేర్కొన్నారు.  ఆ తరువాత అవే ట్వీట్లను ప్రధాని మోడీ తెలుగులో కూడా పోస్టు చేశారు. మొత్తం మీద చిలకలూరి పేట సభకు వచ్చిన ప్రజాస్పందన సందేహాలకు అతీతంగా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న ప్రజా నిర్ణయాన్ని నిర్ద్వంద్వంగా చాటిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. 
Publish Date: Mar 18, 2024 10:05AM