Publish Date:Feb 13, 2019
Publish Date:Feb 11, 2019
Publish Date:Feb 6, 2019
Publish Date:Feb 5, 2019
Publish Date:Feb 2, 2019
Publish Date:Jan 31, 2019

EDITORIAL SPECIAL
  ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమయింది. తీర్మానాన్ని వైసీపీ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ప్రవేశ పెట్టారు. విప్ బూడి ముత్యాలనాయుడు బలపరిచారు. ఇద్దరూ తమ ప్రసంగంలో.. టీడీపీ పాలనపై అనేక విమర్శలు చేశారు. ఆ తర్వాత టీడీపీ తరపున అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఆ సమయంలో పోలవరం ప్రాజెక్ట్‌పై అచ్చెన్నాయుడు వర్సెస్ వైసీపీ ఎమ్మెల్యేలన్నట్లుగా సాగింది.  పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అంచనాలు పెంచి.. టీడీపీ సర్కార్ దోపిడీకి పాల్పడిందని కాంట్రాక్టర్లకు మేలు చేశారని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ విమర్శలపై అచ్చెన్నాయుడు సూటిగా స్పందించారు. అంచనాలు తగ్గించి.. ప్రాజెక్టును పూర్తి చేయాలని సవాల్ చేశారు. అంచనాలు తగ్గించి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే సన్మానం చేస్తామని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలు తీసుకుని చంద్రబాబు తప్పు చేశారన్న వైసీపీ నేతలకూ అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. అడిగారో, ఇచ్చారో ప్రభుత్వం దగ్గర రికార్డులుంటాయన్నారు. పట్టిసీమపైనా వైసీపీ సభ్యులు ఆరోపణలు చేశారు. అవినీతి జరిగిందన్నారు. ఆ ప్రాజెక్ట్ పై పెట్టినంత దృష్టి పోలవరంపై పెడితే.. ఈ పాటికే ప్రారంభమయ్యేదని వైసీపీ నేతలు విమర్శలు చేశారు. దీనిపై అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. పట్టిసీమ వల్ల ఉపయోగం లేదనుకుంటే అ ప్రాజెక్ట్ ను ఉపయోగించడం మానేయాలని సవాల్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ను సీఎం.. కేంద్రానికి వదిలేయాలని నిర్ణయించుకుని.. ఏపీకి తిరిగి వచ్చిన తర్వాత మనసు మార్చుకున్నారని గుర్తు చేశారు.
  గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని పెనుమాక జెడ్పీ పాఠశాలలో ఈరోజు చేపట్టిన ‘రాజన్న బడిబాట' కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులను ఆశీర్వదించిన జగన్ ఓ బాలుడిని ఒళ్లో కూర్చోబెట్టుకుని అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం మరికొందరు చిన్నారుల చేత కూడా పలక, బలపం పట్టించి చిన్నారుల్ని తన ఒడిలో కూర్చొబెట్టుకొని అక్షరాలు దిద్దించారు. పిల్లల భవిష్యత్‌కు భరోసా ఇచ్చేటట్లు విశ్వాసాన్ని కలిగించటానికి ‘ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి’ అనే నినాదంతో ‘రాజన్న బడిబాట' నిర్వహిస్తోంది ఏపీ సర్కార్. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, హోంమంత్రి సుచరిత, ఎంపీ నందిగం సురేష్‌, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. అక్షరాభ్యాసం చేయించిన అనంతరం జగన్ మాట్లాడుతూ.. చిన్నారులతో కలిసి గడపడం, వాళ్లు బాగా చదువుకోవడం తన మనసుకు నచ్చిన విషయమని తెలిపారు. తన మనసుకు నచ్చిన పనిచేస్తున్నాను కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘పిల్లలు బడికి పోవాలి. బడుల నుంచి కాలేజీకి పోవాలి. అక్కడి నుంచి వాళ్లు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్ల వంటి పెద్దపెద్ద చదువులు చదవాలి. ఈ చదువుల కోసం ఏ తల్లీతండ్రి అప్పులపాలు కాకూడదు అన్నదే నా ఆశ' అని జగన్ అన్నారు. 'ప్రతీ తల్లికి, ప్రతీ చెల్లికి నేను మాటిచ్చా.. మీ పిల్లల చదువును ఇకపై నేను చూసుకుంటాను అని మాటిచ్చా. ఈరోజు ఆ మాట నిలబెట్టుకునే రోజు వచ్చింది. అందుకు సంతోషంగా ఉంది. ఇవాళ నేను ప్రతీ తల్లి, చెల్లికి ఇక్కడి నుంచి ఒకేఒక మాట చెబుతున్నా. మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలను మీరు బడికి పంపండి. ఏ స్కూలుకు పంపించినా ఫరవాలేదు. బడికి పంపించినందుకు వచ్చే ఏడాది జనవరి 26 నాటికి ఏపీ పండుగదినం చేస్తాం. జనవరి 26వ తారీఖున పిల్లలను బడికి పంపే ప్రతీ తల్లి చేతిలో రూ.15,000 పెడతాం. ఏ తల్లి కూడా తన బిడ్డను చదివించేందుకు కష్టపడకూడదు అనే తపనతో ఈ కార్యక్రమం చేస్తున్నాం’ అని జగన్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు ఇంత అధ్వానంగా తయారు అయ్యాయి కాబట్టే ఏ తండ్రి, తల్లి అయినా తమ పిల్లలను గవర్నమెంటు పాఠశాలలకు పంపడానికి భయపడుతున్నారని పేర్కొన్నారు. 'అదే సమయంలో ప్రైవేటు స్కూళ్ల ఫీజులు చూస్తేనే షాక్ కొడుతున్నాయి. ఎల్ కేజీలో చేర్పించాలంటే రూ.20,000 అడుగుతున్నారు. మరికొన్ని స్కూళ్లలో అయితే రూ.40,000 తీసుకుంటున్నారు. ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఉన్నప్పుడు మన పిల్లలను చదవించుకోవాలంటే తల్లిదండ్రులు తీవ్రంగా కష్టపడాల్సిన పరిస్థితి. ఇవన్నీ మార్చేస్తామని నేను మీకు మాట ఇస్తున్నా. నేను ప్రజలను 2 సంవత్సరాల సమయం అడుగుతున్నాను. ఈ రెండేళ్లలో స్కూళ్లను అభివృద్ధి చేసి చూపిస్తాను. పాఠశాలల్లో కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్మిస్తాం.’ అని జగన్ భరోసా ఇచ్చారు.
  ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే సంప్రదాయం ప్రకారం.. అధికార, విపక్ష నేతలు స్వయంగా స్పీకర్ ను ఆయన స్థానం వద్దకు తీసుకుని వెళ్లాల్సి వుండగా.. ఆ సమయంలో విపక్ష నేత చంద్రబాబు రాలేదు. దీంతో స్పీకర్ కు ధన్యవాదాలు చెప్పే సమయంలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఇదే విషయమై విమర్శలు గుప్పిస్తుండగా, చంద్రబాబు దీనిపై క్లారిఫికేషన్ ఇఛ్చారు. ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న తమ్మినేనితో తనకు సత్సంబంధాలున్నాయని, ఆయన పేరును చెప్పగానే తనకు సంతోషం వేసిందని బాబు అన్నారు. 2014లో తాము కోడెల శివప్రసాద్ పేరును అనుకున్న సమయంలో విపక్ష నేతకు సైతం విషయం చెప్పి, ఆయన సంతకం తీసుకున్నామన్నారు. అలాగే ప్రస్తుత అధికార పార్టీ తమను అడుగుతారని భావించామని, అయితే ఎవరూ తమను సంప్రదించలేదని చెప్పారు. కనీసం తమలో ఎవరికైనా చెబితే, ప్రపోజ్ చేయాలని అనుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. పోడియం స్పీకర్ అయినా, కనీసం 'విపక్షనేత రండి' అని పిలవలేదని.. ఇష్టమైతే రండి, లేకుంటే లేదన్నట్టుగా ప్రభుత్వ ప్రవర్తన ఉందని అన్నారు. ఈ విషయాలను తాను ప్రజలకు చెప్పేందుకే క్లారిటీ ఇస్తున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది మాత్రమే కాదు.. శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశాక సీఎం జగన్‌ వ్యవహరించిన తీరు కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. సభలో ప్రమాణ స్వీకారం చేశాక సీఎం ప్రతిపక్ష బల్లల వైపు వచ్చి ప్రతిపక్ష నేతను కలిసి వెళ్లడం ఆనవాయితీ. పోయినసారి సభలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశాక నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ వద్దకు వచ్చి కరచాలనం చేసి వెళ్లారు. గతంలో వైఎస్‌ సీఎం అయినప్పుడు కూడా ఇలాగే చంద్రబాబు వద్దకు వచ్చి వెళ్లారు. ఇప్పుడు జగన్‌ అటువంటి ప్రయత్నం చేయలేదు. ప్రమాణ స్వీకారం చేయగానే వెంటనే తన సీటు వద్దకు వెళ్లి కూర్చున్నారు. దీంతో వైసీపీ సభ సంప్రదాయాలను పట్టించుకోవట్లేదంటూ టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.
ALSO ON TELUGUONE N E W S
  మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న `సైరా` ట్రైల‌ర్ రిలీజ్ కు డేట్ ఫిక్స‌యిన‌ట్లు తెలుస్తోంది. ఇది చిరంజీవి హీరోగా న‌టిస్తున్న 151వ చిత్ర‌మ‌ని తెలిసిందే. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి చిత్రంతో `సైరా న‌ర‌సింహారెడ్డి` సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్, న‌య‌న‌తార‌, త‌మన్నా, సుదీప్ , జ‌గ‌ప‌తిబాబు త‌దిత‌రులు ముఖ్య‌తారాగ‌ణం `సైరా` చిత్రం టీజ‌ర్ ను గ‌తంలోనే విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలిసింది. చిరంజీవి పుట్టిన‌రోజు (ఆగ‌ష్టు 22) న ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.  
 `బాహుబ‌లి` తర్వాత రాజ‌మౌళి డైర‌క్ష‌న్ లో వ‌స్తోన్న సినిమా `ఆర్ ఆర్ ఆర్`. ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా,  రామ్ చ‌ర‌ణ్  అల్లూరి సీతారామ‌రాజుగా  న‌టిస్తున్నారు.  ఇప్ప‌టికే ఈ సినిమాపై హై ఎక్స్ పెక్టేష‌న్స్ ఏర్ప‌డ్డాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన త‌మ అభిమాన హీరోల ఫ‌స్ట్ లుక్స్ ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎంతో  క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు అభిమానులతో పాటు తెలుగు ఆడియ‌న్స్. ప్ర‌జంట్ ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తిక‌ర‌మైన న్యూస్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. `ఆర్ ఆర్ ఆర్` సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ స్వాతంత్య్ర దినోత్సం నాడు ఆగ‌స్ట్ 15న రిలీజ్ చేయ‌డానికి రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. భారీ బ‌డ్జెట్ తో నిర్మిత‌మ‌వుతోన్న ఈ సినిమా ను డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. చర‌ణ్ స‌ర‌స‌న అలియా భ‌ట్ న‌టిస్తోంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ కోసం ఇంకా సెర్చింగ్ జ‌రుగుతోంది. ఈ సినిమాను నెక్ట్స్ ఇయ‌ర్ జూలై 30న విడుద‌ల చేయ‌నున్నారు.
ఇటీవ‌ల `జెర్సీ`తో మంచి విజ‌యాన్ని అందుకున్న  నేచుర‌ల్ స్టార్ నాని. ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒక వైపు టాలెంటెడ్ డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ రూపొందిస్తున్న `గ్యాంగ్ లీడ‌ర్` లో న‌టిస్తూనే మ‌రోవైపు సెన్సిబుల్ డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `వి` చిత్రంలో కూడా న‌టిస్తున్నాడు నాని. కాగా ప్ర‌స్తుతం రెండో షెడ్యూల్ జ‌రుపుకుంటున్న `వి` చిత్రానికి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన అంశం టాలీవుడ్ స‌ర్కిల్స్ లో హాల్ చ‌ల్ చేస్తోంది. అదేమిటంటే క్రైమ్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో నాని వ‌రుస హ‌త్య‌లను చేసి క్లూస్ కూడా వ‌దిలేస్తుంటాడ‌ట‌. ఈ నేప‌థ్యంలో ఆ కేసును డీల్ చేయ‌డానికి వ‌చ్చిన స్పెష‌ల్ ఆఫీస‌ర్ సుధీర్ బాబు. ఆ మిస్ట‌రీని ఎలా ఛేదించాడు ? అనే క‌థాంశంతో `వి` సినిమా తెర‌కెక్కుతోంద‌ని టాలీవుడ్ టాక్ . ఈ వార్త‌లో నిజ‌మెంతో తెలియాలంటే  కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. `దిల్` రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అదితిరావ్ హైద‌రి, నివేదా థామ‌స్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఈ సంవ‌త్స‌రంలోనే సినిమాను విడుద‌ల చేయాల‌న్న ప్లాన్ లో ఉన్నారు నిర్మాత‌లు.
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ రైట‌ర్‌గా మారాడ‌ని టాలీవుడ్ టాక్‌. అతను రైట‌ర్‌గా మారింది సినిమాకు కథలు రాయాలని కాదు, సినిమాలో క్యారెక్టర్ కోసం! క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అందులో అతనిది రైటర్ రోల్ అని టాక్. అతను రాసిన మూడు కథలు తెరపై వస్తాయి. ప్రతి కథలోనూ హీరోగా అతనే కనిపిస్తాడు. కానీ, హీరోయిన్ మాత్రం మారుతూ ఉంటుంది. ఇందులో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇసాబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఇది కాకుండా విజయ్ దేవరకొండ నటించిన మరో సినిమా 'డియర్ కామ్రేడ్' జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'గీత గోవిందం' తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన చిత్రమిది.
'96' రీమేక్ కోసం స్కై డైవింగ్ ప్రాక్టీస్‌ చేస్తుండగా శర్వానంద్ భుజాలకు తీవ్ర గాయమైంది. కాలికి చిన్న ప్రాక్చర్ అయింది. ఆయన కోలుకోవడానికి మూడు నెలలు పడుతుందని టాక్. అప్పటివరకూ శర్వానంద్ చేస్తున్న సినిమాల షూటింగులు వాయిదా వేయక తప్పదు. 'తెనాలి రామకృష్ణ' షూటింగులో సందీప్ కిషన్‌కి గాయమైంది. బాంబ్ బ్లాస్ట్ సీన్ చేస్తుండగా గాజు ముక్కలు కంటికింద గట్టిగా గుచ్చుకున్నాయి. వెంటనే షూటింగుకు ప్యాకప్ చెప్పి హైదరాబాద్ వచ్చారు. మళ్ళీ ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేస్తారో తెలియదు. సందీప్ మాత్రం త్వరగా కోలుకుని 'నిను వీడని నీడను నేనే' ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటానని ట్వీట్ చేశాడు. వీళ్లిద్దరి కంటే ముందు విశాఖలో నాగశౌర్య గాయపడ్డాడు. ఒక నెల విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో షూటింగుకు బ్రేక్ పడింది. యువ హీరోలు గాయాల పాలుకావడం తెలుగు చిత్ర పరిశ్రమను కలవరపెట్టే అంశమే. షూటింగుల్లో జరిగిన ప్రమాదాల్లో ప్రాణాంతక ఘటనలు జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నప్పటికీ, ప్రమాదాలకు కారణాలు విశ్లేషిస్తే తప్పంతా హీరోలదే అనిపిస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. రిస్కులు తీసుకుని షూటింగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ, యువ హీరోలు రిస్కులు తీసుకుని ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఫైట్‌లో పదిహేను అడుగులు ఎత్తున్న బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకే సీన్‌ని డూప్ లేకుండా స్వయంగా ఫైట్ చేయాలనుకున్నాడు నాగశౌర్య. అంతవరకూ ఓకే. కనీసం రోప్ అయినా కట్టుకోవాలి కదా. అదీ చేయలేదు. అందువల్ల, బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకగానే అదుపుతప్పి కాలికి ప్రాక్చర్ అయింది. సందీప్ కిషన్ కూడా రిస్క్ షాట్ అని తెలిసీ చేయడానికి ముందడుగు వేశాడు. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. స్వయంగా సందీప్ కిషనే యాక్షన్ కొరియోగ్రాఫర్ తప్పు లేదని ట్వీట్ చేశాడు. శర్వానంద్ స్కై డైవింగ్ ప్రాక్టీస్‌లో గాయపడ్డాడు. ఈ వరుస ప్రమాదాల తరవాత అయినా హీరోలు జాగ్రత్తలు తీసుకోవాలని సినిమా పెద్దలు హితవు పలుకుతున్నారు.
  "పేరు గొప్ప.. ఊరు దిబ్బ" అనే సామెత వినే ఉంటారు. ఏపీ రాజధాని విషయంలో చంద్రబాబు ఇలాంటి విమర్శలే ఎదుర్కొన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన బాబు.. ప్రపంచంలోని గొప్ప రాజధానుల్లో ఒకటిగా అమరావతి నిలుస్తుందని.. అమరావతిని ఓ సింగపూర్, ఓ జపాన్ చేసి చూపిస్తానని చెప్పారు. దీంతో రాజధానిపై ఏపీ ప్రజలు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ బాబు ఆ అంచనాలు అందుకోలేకపోయారు. దీంతో టీడీపీ ఓటమిలో రాజధాని కూడా ఓ కారణంగా మిగిలిపోయింది. తాత్కాలిక భవనాలు పేరిట పలు భవనాలు నిర్మించారు. అయితే వాటి నిర్మాణం కూడా నాసిరకంగా ఉన్నాయంటూ విమర్శలు ఎదుర్కొన్నారు. మన దేశంలో ఎంతో ప్రతిభ ఉన్న ఇంజినీర్లని కాదని విదేశాల నుండి ఇంజినీర్లను తెప్పించారు. పోనీ వారితో అయినా పూర్తిగా డిజైన్లు చేయించారా అంటే అదీ లేదు. వాస్తు నిపుణులను, సినీ దర్శకులను రాజధాని డిజైన్లలో భాగమయ్యేలా చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. సినిమాలో సెట్లు బాగున్నాయి కదా అని రాజధానికి డిజైన్లు గీయండి అని అడిగేసరి.. బాబుపై సెటైర్లు వచ్చాయి. దానికి తోడు వాస్తు ఒకటి. అసలు రాజధాని నిర్మాణంలో వాస్తు ఏంటి?. ఇంజినీర్లు అక్కడి పరిస్థితులను బట్టి డిజైన్ చేస్తారు. అంతేకాని వాస్తు పేరిట ఎవరో వచ్చి అక్కడ ఇది, ఇక్కడ అది అని ఏదేదో చెప్తుంటే ఇక ఇంజినీర్లు డిజైన్లు ఏం చేస్తారు?. ఒకవేళ బాబు రెండోసారి అధికారంలోకి వచ్చి ఉంటే.. అమరావతిని ఎంతలా అభివృద్ధి చేసేవారో తెలీదు కానీ.. మొదటి టర్మ్ లో మాత్రం డిజైన్ పేరిట కాలయాపన చేసారని, గ్రాఫిక్స్ రాజధాని అని.. అసలు అది అమరావతి కాదు భ్రమరావతి అని విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాదు రాజధాని భూములు విషయంలో కూడా అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. వీటిని తిప్పి కొట్టడంలో బాబు & కో విఫలమయ్యారు. మరోవైపు విపక్షాలు.. అమరావతి అంతా భ్రమరావతి అని, అసలు ఒక్క ఇటుక కూడా పడలేదని పదేపదే విమర్శలు చేసాయి. ఈ విమర్శలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. మొత్తానికి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తానన్న బాబు.. ఏమీ చేయలేదన్న పేరు మూటగట్టుకొని పరాజయం పాలయ్యారు.
  కాంగ్రెస్‌ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. "రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే!’’ అంటూ రాజగోపాల్‌రెడ్డి శనివారం చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా రాజగోపాల్‌రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలుసుకునేందుకు వెళ్లిన రాజగోపాల్ రెడ్డికి.. ఆ పార్టీ పెద్దలు బంపరాఫర్ ను ఇచ్చినట్టు తెలుస్తోంది. మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని, బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తామని బీజేపీ పెద్దలు చెప్పినట్లు సమాచారం. 2024 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ.. రాష్ట్రం నుంచి పార్లమెంట్ లో ప్రాతినిధ్యాన్ని పెంచితే, ప్రజల్లోకి మంచి సంకేతాలు వెళ్లి, తదుపరి ఎన్నికల్లో లాభం కలుగుతుందని రాజగోపాల్‌రెడ్డికి రాజ్యసభ సభ్యుడి పదవిని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్న పక్షంలో ఆయన సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంట్‌రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న చర్చ మొదలైంది. అయితే వెంట్‌రెడ్డి మాత్రం తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని చెబుతున్నారు. మీ సోదరుడు పార్టీ మారాలనుకుంటున్నారు మీ సంగతేమిటి అనే ప్రశ్నకు వెంకట్ రెడ్డి ఏది ఎమైనా తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, రాబోయే రోజుల్లో అధికారం కాంగ్రెస్ పార్టీదే అన్నారు. పార్టీ మార్పుపై తుది నిర్ణయం సోదరుడిదేనని, అయినా ఒక కుటుంబంలోని వ్యక్తులు వేరు వేరు పార్టీల్లో ఉండటం సహజమేనని వెంట్‌రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా కోమటిరెడ్డి సోదరులు వారి భవిష్యత్తు కోసం వేసిన ప్లాన్ అని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో ద్వితీయ స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ పోటీపడుతున్నాయి. ఎవరైనా సరే భవిష్యత్తులో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాగలరు. అందుకే రెండు పార్టీల్లోనూ తమ కుటుంబం ఉంటే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని కొమటిరెడ్డి సోదరులే ఈ ప్లాన్ వేశారని.. ఒక్కసారి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఎవరిది పైచేయి అనేది తేలగానే ఇరువురు అదే పార్టీలో ఉండిపోవాలనేది వారి ప్లాన్ అయ్యుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
  ప్రత్యేకహోదా విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే మాట మార్చడం కూడా టీడీపీ ఘోర ఓటమికి కారణాల్లో ఒకటిగా చెప్పవచ్చు. విభజన గాయం మానాలంటే ప్రత్యేకహోదానే ఔషదమని ఏపీ ప్రజలు భావించారు. విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందని, ఏపీకి న్యాయం జరగాలంటే హోదా కావాల్సిందేనని ఏపీ ప్రజలు బలంగా కోరుకున్నారు. మొదట్లో బీజేపీతో దోస్తీ సమయంలో ప్రజలతో పాటు బాబు కూడా హోదా కావాలన్నారు. బీజేపీ కూడా పార్లమెంట్ సాక్షిగా, తిరుపతి వెంకన్న సాక్షిగా హోదా ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన కొంతకాలానికి మాట మార్చి.. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నది. దీన్ని వ్యతిరేకించి హోదా కోసం పట్టుపట్టాల్సిన బాబు.. బీజేపీ నిర్ణయానికి తలొగ్గి ప్యాకేజీకి ఒప్పుకున్నారు. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీతో పాటు, ఉద్యమ సంఘ నేతలు, విద్యార్థులు.. ప్యాకేజీని వ్యతిరేకిస్తూ.. హోదా గళాన్ని బలంగా వినిపించారు. అయితే బాబు మాత్రం హోదా ఏమన్నా సంజీవనీనా అంటూ వారి మీద విరుచుకుపడ్డారు. ఇక కొందరు టీడీపీ నేతలైతే హద్దుదాటి చులకన వ్యాఖ్యలు కూడా చేశారు. అంతేనా.. హోదా కోసం పోరాడిన వారిని బాబు అరెస్ట్ లు కూడా చేయించారు. మరోవైపు అద్భుతమైన ప్యాకేజీ ఇచ్చారంటూ బీజేపీ నేతలను ఆకాశానికెత్తడాలు, సన్మానాలు చేయడాలు సరేసరి. ఈ చర్యలతో.. హోదా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏపీ ప్రజలకు.. బాబు మీద, టీడీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది. రోజులు గడిచాయి. హోదా మీద ఏపీ ప్రజలకు ఆశ మాత్రం చావలేదు. ఇంతలో కొన్నాళ్ళకు ఎన్డీయే నుంచి టీడీపీ బయటికి వచ్చింది. అప్పటి నుంచి చంద్రబాబు స్వరం పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు బీజేపీ నేతలను పొగుడుతూ, సన్మానాలు చేసిన బాబు.. బీజేపీ మోసం చేసిందని, రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ పోరాటం మొదలు పెట్టారు. హోదా ఏమన్నా సంజీవనీనా అని అడిగిన బాబు.. బీజేపీకి దూరమైన తరువాత హోదా కావాల్సిందే అంటూ అడగడం మొదలు పెట్టారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బీజేపీ ఏమో తాము ఏపీకి ఎంతో చేసామని, లెక్కలు అడిగేసరికి బాబు మాట మర్చి మా మీద విమర్శలు చేస్తున్నారని చెప్పుకొచ్చింది. మరోవైపు విపక్ష నేతలు కూడా యూ-టర్న్ బాబు అంటూ పదేపదే విమర్శలు చేశారు. దీంతో బాబు మాటలు మారుస్తున్నారన్న విషయం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అదీగాక గతంలో హోదా అడిగిన వారి మీద ఆగ్రహం వ్యక్తం చేసి, వారిని అరెస్ట్ లు చేయించిన బాబు.. తరువాత హోదా కావాలని అడిగితే ప్రజలకు నమ్మకం కలగలేదు. అదే బాబు బీజేపీ ప్యాకేజీ ఇస్తామని చెప్పినప్పుడే.. దాన్ని వ్యతిరేకించి కచ్చితంగా హోదానే కావాలని పట్టుబట్టి పోరాడి ఉంటే.. ప్రజలను నిజమైన నాయకుడిలా కనిపించేవాడు. ఇలా యూటర్న్ బాబు అని పేరు తెచ్చుకునేవాడు కాదు.  
  టీడీపీ ఘోర పరాజయానికి కారణమైన వంద తప్పుల్లో.. అభ్యర్థులను మార్చకపోవడం కూడా ఒకటని చెప్పవచ్చు. ఎంతసేపూ చంద్రబాబు 175 నియోజకవర్గాల్లో నేనే అభ్యర్థిని.. నేను కష్టపడ్డాను, నన్ను చూసి ఓటేయండి అన్నారు. అంటే బాబు చెప్పాడుగా అని నియోజకవర్గంలో ఎలాంటి అభ్యర్థిని నిలబెట్టినా ప్రజలు ఓటేస్తారా?. వారికి స్థానికంగా అందుబాటులో ఉండాల్సింది బాబా? ఎమ్మెల్యేనా?. వివాదాలు, అవినీతి ఆరోపణలు, దందాలు, ఎన్నికలు వచ్చినప్పుడే కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులోకి రావడం. ఇలాంటి వారు అభ్యర్థులైతే బాబు చెప్పారుగా అని ప్రజలు ఎందుకు ఓటేస్తారు?. ఈ మాత్రం ఆలోచన 40 ఏళ్ళ అనుభవం ఉన్న బాబుకి రాలేదా?. గత ఐదేళ్లల్లో ఎందరో ఎమ్మెల్యేలు వివాదాల్లో ఇరుక్కున్నారు. ఎందరి మీదనో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇలా రకరకాల కారణాలతో దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నారు. వారికి టికెట్లు ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతారని కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కానీ బాబు ఇవన్నీ పట్టించుకుంటేనే కదా. ప్రజలు నన్ను చూసి ఓటేస్తారు అంటూ అతి నమ్మకంతో అభ్యర్థులను మార్చకుండా ఎన్నికల పోరులోకి దిగారు. ప్రజాతీర్పు చూసి డీలా పడిపోయారు. బాబు.. ముందే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత గుర్తించి అభ్యర్థులను మార్చి ఉంటే టీడీపీకి ఘోర ఓటమి ఎదురయ్యేది కాదుగా. ముందు నుండి పార్టీలో ఉంటూ, పార్టీ కోసం కష్టపడుతూ, స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండేవారిని అభ్యర్థులగా నిలబెడితే.. ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. అలా కాకుండా ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారిపోయి తన మీద విమర్శలు చేస్తాడేమో అన్న భయంతో కొందరికి, ఇతనైతేనే ఆర్థికంగా బలవంతుడు అని మరికొందరికి టికెట్లు ఇచ్చారు. అలాంటి వారి కోసం కార్యకర్తలు మనస్ఫూర్తిగా పని చేయగలరా? ప్రజలకు వారికి ఓటేయాలని అనిపిస్తుందా?. ఖచ్చితంగా అనిపించదు. పార్టీ కోసం ముందు నుంచి కష్టపడుతూ.. కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటే.. అలాంటివారి కోసం కార్యకర్తలు నిజాయితీగా కష్టపడతారు. అలా కాకుండా పార్టీలు జంప్ చేసేవారిని, కేవలం డబ్బే ఉన్న వారిని తీసుకొస్తే.. వీళ్ళు గెలిచినా పార్టీలో ఉంటారో లేదో తెలీదు. ప్రజలకూ అందుబాటులో ఉండరు అని కార్యకర్తలు పని చేయడం మానేస్తారు. ఆ అభ్యర్థులను కార్యకర్తలే నమ్మకపోతే ఇక సాధారణ ప్రజలు ఎలా నమ్ముతారు?. అందుకే బాబు అన్ని నియోజకవర్గాల్లో తానే అభ్యర్థినని చెప్పినా.. ప్రజలు మాత్రం వారి నియోజకవర్గాల్లోని అభ్యర్థులనే చూసారు. టీడీపీకి ఘోర ఓటమి రుచి చూపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. క్రికెట్ లో కోహ్లీ ఒక్కడే బాగా ఆడినంత మాత్రాన ప్రతిసారి మ్యాచ్ గెలుస్తామా? మిగతా బ్యాట్స్ మెన్, బౌలర్ల సపోర్ట్ కూడా ఉండాలి. టీం ఎఫర్ట్ ఉండాలి. మరి వీక్ టీం ని పెట్టుకొని బాబు 'నేను కష్టపడ్డ, నన్ను చూసి ఓటేయండి' అంటే ప్రజలు పార్టీని ఎలా గెలిపిస్తారు?. ఇది చంద్రబాబు ఆలోచించలేకపోయారు. అందుకే ఓడిపోయారు.  
  టీడీపీ పరాజయానికి కారణమైన వంద తప్పుల్లో సీబీఎన్ ఆర్మీ కూడా ఒకటని చెప్పొచ్చు. ఆర్మీ అంటే యుద్ధం చేసి రక్షణగా ఉండాలి. కానీ ఈ ఆర్మీ అతి చేసి పార్టీ నాశనానికి కారణమైంది. అసలు ఈ ఆర్మీ వల్ల పార్టీకి ఒరిగిందేంటి?. ఎన్నికల ముందు సోషల్ మీడియాలోనూ, బయటా తెగ హడావుడి చేశారు. కానీ ఏం లాభం పట్టుమని పది ఓట్లు కూడా తీసుకురాలేకపోయారు. ఇంకా చెప్పాలంటే ఉన్న ఓట్లనే పార్టీకి దూరం చేశారు. చంద్రబాబు మీటింగ్ జరిగితే చాలు సీబీఎన్ ఆర్మీ పేరిట కొందరు టీ షర్టులు వేసుకొని వచ్చి హడావుడి చేసేవారు. దాని వాళ్ళ ఏం లాభం పార్టీకి? టీ షర్టులు వేసుకొని గోల చేస్తేనో, బైక్ ర్యాలీలు చేస్తేనో ప్రజలకు మంచి జరుగుతుందా? పార్టీకి ఓట్లు పడతాయా?. ఇవేమి పట్టించుకోకుండా చంద్రబాబు సీబీఎన్ ఆర్మీకి అండగా ఉంటూ వారిని నెత్తిన ఎక్కించుకున్నారు. ఇంకా ఈ సీబీఎన్ ఆర్మీలో ఒక సామజిక వర్గానికి చెందిన కొందరి అత్యుత్సహం కూడా పార్టీ కొంపముంచింది. బాబు, లోకేష్ లతో చనువుగా ఉంటూ.. పార్టీ మాకే సొంతం అన్నట్టుగా వ్యవహరించడం. మిగతా కార్యకర్తలను చిన్న చూపు చూడటం, కొందరు నేతలను బెదిరించడం చేసేవారు. వీరి వల్ల ఎప్పటినుంచో పార్టీనే నమ్ముకొని నిజాయితీగా పనిచేసిన వారు పార్టీకి దూరం కావాల్సి వచ్చింది. అంతేకాదు ఈ సీబీఎన్ ఆర్మీ మూలంగా తెలుగు యువత, తెలుగు మహిళ, తెలుగు రైతు వంటి టీడీపీ అనుబంధ సంస్థలు మనుగడ కోల్పోయాయి. దీంతో నిజాయితీగా పార్టీ కోసం కష్టపడే వారు, ప్రజా సమస్యల మీద పోరాడేవారు పార్టీకి దూరమై.. టీ షర్టులు వేసుకొని హడావుడి చేసేవారే పార్టీలో ఎక్కువయ్యారు. ఇప్పుడు పార్టీ ఈ పరిస్థితికి రావడానికి కారణమయ్యారు. పోనీ పార్టీ ఓడిపోయాక అయినా తప్పు తెలుసుకొని పార్టీకి పునర్వవైభవం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా అంటే అది లేదు. మాకేం సంబంధం లేదంటూ టీ షర్టులు విప్పేసి సైడ్ అయిపోయారు. ఇకనైనా చంద్రబాబు ఇలా హడావుడి చేసే వారిని కాకుండా.. నిజాయితీగా పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తిస్తే మంచిది.  
  టీడీపీ ఘోర పరాజయానికి కారణమైన 100 తప్పుల్లో జన్మభూమి కమిటీలు కూడా ఒకటి. ప్రభుత్వ పథకాలను అర్హులైన అందరికీ చేర్చాలనే ఉద్దేశంతో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసారు. ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. సరైన అవగాహన లేకపోవడం, కమిటీ సభ్యులుగా అర్హత లేని వారిని నియమించడం వంటివి టీడీపీ కొంపముంచాయి. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా ఉండాల్సిన కమిటీ సభ్యులు.. మా పార్టీ, మా వర్గం అంటూ ప్రభుత్వ పథకాలను కొందరికే పరిమితం అయ్యేలా చేశారు. వారి ప్రవర్తన పుణ్యమా అని టీడీపీ ప్రభుత్వం కొందరి ప్రభుత్వం అనే ముద్ర పడిపోయింది. అంతేకాదు ఈ కమిటీ సభ్యుల వైఖరి వల్ల ఎన్నో ఏళ్లుగా టీడీపీని నమ్ముకొని ఉన్నవారు కూడా టీడీపీకి వ్యతిరేకమయ్యారు. ఇలా ఈ జన్మ భూమి కమిటీ సభ్యుల మూలంగా.. గ్రౌండ్ లెవెల్ లో టీడీపీ మీద బాగా వ్యతిరేకత ఏర్పడింది. ఈ వ్యతిరేకతను గుర్తించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. అసలు పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల.. కార్యకర్తల్లో, సాధారణ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందని.. బాబు గ్రౌండ్ లెవెల్ లో తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు. ఎంతసేపు తన చుట్టూ చేరి భజన చేసే నాయకుల మాటలే నమ్మారు. కొందరు నేతలు.. బాబు, లోకేష్ ల మెప్పు పొందడం కోసం వారి చుట్టూ చేరి.. మీరు సూపర్, మన పార్టీ బంపర్ అంటూ డప్పు కొట్టారు. మెప్పు కోసం అలా డప్పు కొట్టారు కానీ పార్టీకి ఇలా ముప్పు వస్తుందని వారు కూడా ఊహించి ఉండరు. అదే ఆ నాయకులు.. వారి వారి నియోజకవర్గాల్లో, జిల్లాల్లో.. పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇప్పుడు వారి పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. కొందరు నేతలకు జన్మభూమి కమిటీల మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని తెలిసినప్పటికీ.. ఆ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుపోకపోగా.. కమిటీ సభ్యులకే అండగా ఉంటూ వారు మరింత రెచ్చిపోయేలా చేశారు. అందుకే ప్రజలు వారికి ఓట్లతో బుద్ధి చెప్పారు. ఒకవేళ బాబు గ్రౌండ్ లెవెల్ అసలు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసుంటే.. ఇప్పుడిలా బాధపడాల్సిన అవసరం వచ్చేది కాదుగా. ఇకనైనా బాబు తన చుట్టూ డప్పు కొట్టే నేతల్ని కాకుండా.. పార్టీ కోసం నిజాయితీగా కష్టపడుతూ, తప్పుఒప్పులని కరెక్ట్ గా చెప్పేవారిని, పొగడ్తతో పాటు విమర్శ కూడా చేసే వారిని పక్కన పెట్టుకుంటే మంచిది. అలా కాకుండా ఇప్పటిలాగానే ఉంటే.. వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు కాస్తా మూడుకి పడిపోయినా ఆశ్చర్యం లేదు.    
    విజయవాడలో ఈరోజు శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్ర సరస్వతి నియామక కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. శారదాపీఠం ఉత్తరాధికారిగా స్వామి స్వరూపానందేంద్ర శిష్యుడు కిరణ్ కుమార్ శర్మకు బాధ్యతలు అప్పగించే ఈ కార్యక్రమానికి తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ మరియు భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి స్వరూపానందేంద్ర మాట్లాడుతూ అగ్నిసాక్షిగా చెబుతున్నాను, నా హృదయంలో ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి జగన్ అంటూ ఏపీ సీఎంపై తన ఆప్యాయతాను చాటుకున్నారు. తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి కేసీఆర్ అని స్వామీజీ పేర్కొన్నారు. కేసీఆర్ మంచి మనసున్న వ్యక్తి అలాగే గొప్ప మేధావి అని అలాగే మహాభారతాన్ని రెండుసార్లు చదివిన వ్యక్తి మా కేసీఆర్ అంటూ స్వామీజీ వ్యాఖ్యానించారు. జగన్, కేసీఆర్ ఇద్దరూ తనకు ప్రాణసమానులని పేర్కొన్న శారదా పీఠాధిపతి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ వచ్చి ఉత్తరాధికారి దీక్షా స్వీకరణ కార్యక్రమాన్ని ఆస్వాదించడం శుభపరిణామం అని పేర్కొన్నారు. తెలుగునాట అధర్మం ఓడి ధర్మం గెలిచింది అని చెప్పడానికి ఈ ఇద్దరు రాజులే నిదర్శనం అని జగన్, కేసీఆర్ లను ఉద్దేశించి స్వామీజీ వ్యాఖ్యానించారు. వీళ్లిద్దరూ 15 ఏళ్లు దిగ్విజయంగా రెండు తెలుగు  రాష్ట్రాలను పరిపాలించాలని స్వరూపానందేంద్ర సరస్వతి ఆకాంక్షించారు.  
    ప్రజా జీవితంలో ఉన్న లీడర్లు మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనుక చూసుకుని మాట్లాడకపోతే వచ్ఛే సమస్యలేమిటో  నారా లోకేశ్ ను చూస్తే మనకు  అర్ధం అవుతుంది. ఒక పదం అటు ఇటు అయినా నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేయడం మనకు తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్‌లోకి ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి చేరారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆమె సొంత జిల్లా విజయనగరం కు వఛ్చిన  ఆమె మీడియాతో మాట్లాడుతూ తడబడ్డారు. ముఖ్యమంత్రి ఒకటే లైన్‌తో వెళుతున్నారు.. అవినీతి పరిపాలన అందించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని శ్రీవాణి వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని గమనించిన పక్కనున్న పార్టీ  నేతలు ఆమెను అప్రమత్తం చేయడంతో ఆమె ఆ తర్వాత ఆ తప్పును సరిదిద్దుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆమెపై  ట్రోలింగ్ మొదలెట్టేసింది. ‘‘మీ లక్ష్యం ఏంటో స్వయంగా సెలవిచ్చినందుకు ధన్యవాదాలు మేడం.."  మీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నామంటూ ట్వీట్ చేసింది.  
    ఉగ్రవాదానికి ప్రాంతం మతం అనే తేడా లేని విషయం తెలిసిందే. తాజాగా నైజీరియాలో ఓ ఫుట్ బాల్ మ్యాచ్ లో  నరమేధం జరిగింది. బోకోహరాం ఉగ్రవాదులు ఫుట్ బాల్ మ్యాచ్ ను చూస్తున్న క్రీడాభిమానులపై ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 30 మంది ఫుట్ బాల్ ప్రేమికులు ప్రాణాలు కోల్పోగా, మరో 40 మంది గాయాలపాలయ్యారు. నైజీరియాలోని బోర్నో రాష్ట్ర ముఖ్యనగరం మైదుగురి సమీపంలో ఈ దారుణం జరిగింది. కొండుగ అనే ప్రాంతంలో కొందరు ఫుట్ బాల్ అభిమానులు వీడియో థియేటర్ లో లైవ్ మ్యాచ్ చూస్తుండగా, ఓ వ్యక్తి అక్కడి వీడియో ఆపరేటర్ తో గొడవపెట్టుకుని తనను తాను పేల్చుకున్నాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులు మ్యాచ్ ను చూస్తున్న ప్రేక్షకుల మధ్యకు వెళ్లి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మొదట 9 మంది ఘటనస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, అంబులెన్స్ లు రాక  ఆలస్యం కావడంతో మరో 21 మంది కన్ను మూశారు . ఈ దారుణం బోకోహరాం ఉగ్రవాదుల పనేనని నైజీరియా ప్రభుత్వం ప్రకటించింది.
  రాత్రి నిద్రకు ముందు యాలకులు తిని వేడి నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలకు ఆశ్చర్యపోతారు! సుగంధ ద్రవ్యాల్లో యాలుకులు ప్రధానమైనవి.. బ్రిటీషర్లు మన దేశంపై దండెత్తి తొలి రోజుల్లో ఇక్కడ తిష్ట వేసిన ప్రధాన కారణాల్లో సుగంధ ద్రవ్యాలు మన దేశంలో దొరకడమే. అవి ఆరోగ్యానికి, అందానికి, ఆనందానికి, రుచికి.. బహుళ ప్రయోజనాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా యాలకులు మన . ఆరోగ్యానికి చేసే మేలు ఏంటో తెలిస్తే ఆశర్య పోతారు. అయితే రాత్రి పడుకోపోయే ముందు ఒక్క యాలుక్కాయను తిని గోరు వెచ్చని నీళ్ళను తాగితే ఏమవుతుందో తెలుసుకుందాం. ప్రతిరోజూ యాలుక్కాయను తిని గోరు వెచ్చని నీళ్ళను తాగడం వల్ల మన శరీరానికి ఎలాంటి మెడిసిన్ తో అవసరం ఉండదు. ఈ మద్య కాలంలో బరువు తగ్గించుకోవడాని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు చాలా మంది. సింపుల్ గా బరువును తగ్గించాలనుకునే వారు రోజూ రాత్రి ఒక యాలుక్కాయను తిని, ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగడం వల్ల శరీరం లో ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఫలితంగా అధిక బరువును, చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. ఇంకా చెప్పాలంటే..   నిత్యం ఒక యాలుక్కాయను తిని వేడి నీళ్ళు తాగడం వల్ల శరీరం లో హానికరమైన మలినాలు, చెడు పదార్దాలు తొలగిపోతాయి. అంతేకాదు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అన్ని అవయవాలాను శుద్ధి చేసి ఆరోగ్యం కాపాడుతుంది. మనం తీసుకునే ఆహారంలో చాలా పదార్దాలు జీర్ణం కాక ఎసిడిటి, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ కారణంగా అనేక మంది మలబద్దకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాటి వారు ఈ నియమాలను ఫాలో అవ్వడం వల్ల మలబద్దకం సమస్య నుండి విముక్తి అవుతారు.   తిన్న ఆహారం కూడా బాగా జీర్ణమవుతుంది. మరీ ముఖ్యంగా.. చాలా మంది రాత్రి నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారు రాత్రి పడుకోబోయే ముందు ఒక యాలుక్కాయను తిని ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే నిద్రలేమీ సమస్య తొలగిపోయి హాయిగా పడుకోగానే నిద్రలోకి జారుకుంటారు. అలాగే నిద్రలో గురక శబ్ధం చేసేవారు కూడా ప్రతిరోజూ రాత్రి ఒక యలక్కయను తిని వేడి నీళ్ళు తాగడం వల్ల ఒక మెడిసిన్ లా పని చేసి నిధానంగా నిద్రలో గురక తగ్గుతుంది. రోజూ ఇలా చేస్తే ఎముకలను బలంగా మార్చుతుంది. అంతేకాదు ఇది చర్మాన్ని ఎలాంటి ఇన్ఫెక్షన్ భారిన పడకుండా ఆరోగ్యంగా కాపాడుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఒత్తుగా పెంచేందుకు సహాయపడుతుంది.  
  ప్రస్తుత పరిస్థితుల్లో ఎండ తీవ్రత విపరీతముగా ఉన్నది. వడగాలులు కూడా ఎక్కువుగా ఉన్నాయి . ఇటువంటి సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది.  ఉద్యోగరీత్యా మరియు వ్యక్తిగత పనులనిమిత్తం బయట తిరిగేవారు ఎండ తీవ్రతకు గురి అయ్యి అనారోగ్యానికి గురవ్వడం జరుగును.   ఇప్పుడు నేను చెప్పబోయే వడదెబ్బ నివారణా యోగాలు పాటించి వడదెబ్బ నుంచి విముక్తిపొందగలరు.    *  ఉల్లిపాయ రసమును శరీరానికి పట్టించిన వడదెబ్బ నివారణ అగును.      * వేసవి ఎండలో బయటకి వెళ్లవలసి వచ్చినపుడు తలకు టోపీ ధరించి టోపి లోపల ఉల్లిగడ్డను ఉంచుకొనవలెను. లేదా రుమాలలో ఉల్లిగడ్డని ఉంచి తలకు కట్టుకుని వెళ్లవలెను .   *  నీరుల్లిపాయ రసమును రెండు కణతలకు , గుండెలకు పూసిన వడదెబ్బ వలన కలిగిన బాధ తగ్గును.      *  వడదెబ్బ తగిలినచో ముఖము పైన , శరీరంపైన నీళ్లు చల్లుచూ తలపై ఐస్ గడ్డలను ఉంచి తాగుటకు నిమ్మరసంలో ఉప్పు కలిపి ఇవ్వవలెను.    *  కుమ్మున ఉడికించిన మామిడికాయ రసములో ఉప్పు , జీలకర్ర కలిపి భోజనంతో కలిపి తాగుచున్న వడదెబ్బ తగలదు.    * వడదెబ్బ తగిలిన వ్యక్తికి విశ్రాంతిగా పడుకోబెట్టి కాఫీ తాగుటకు ఇచ్చుచున్న వడదెబ్బ నుంచి తట్టుకొనును.    *  48 గ్రాముల చన్నీరు తీసుకుని ఒక తులం తేనె వేసి కలిపి ఇచ్చిన వడదెబ్బ తగ్గును.      * వడగండ్లు పడినపుడు వాటిని సేకరించి విబూదిలో వేసి ఉంచి వడదెబ్బ తగిలినప్పుడు వారికి మూడువేళ్లకు వచ్చినంత తీసుకుని ఒక గ్లాసు మంచినీటితో కలిపి తాగించవలెను .    *  నువ్వులనూనెలో చనుబాలు రంగరించి చెవులలో వేసి గోరువెచ్చని నీటిలో నెయ్యి వేసి ఇచ్చిన వడదెబ్బ బాధలు తగ్గును.    *  తరవాణి తేటలో ఉప్పు కలిపి ఇవ్వవలెను .    *  తాటిముంజలు పంచదారతో కలిపి ఇవ్వవలెను.    *  నాలుకకు పాత ఉశిరిక పచ్చడి రాసి పుల్లని ఆవుమజ్జిగలో ఉప్పు వేసి అన్నములో పోసి పిసికి పిప్పిని పారవేసి ఆ రసమును తాగించవలెను .      *  చన్నీటితో స్నానం చేయవలెను . వేడివేడి పలచని గంజిలో ఉప్పు కలిపి తాగవలెను .    *  నిమ్మ ఉప్పును నోటిలో వేసుకొనిన నాలుకకు ఊట ఊరి వడదెబ్బ నివారణ అగును. పైన చెప్పిన యోగాలలో మీకు ఏది సులభముగా అనిపిస్తే దానిని పాటించి వడదెబ్బ నుంచి విముక్తిపొందగలరు.
జూన్లో దొరికే చింత చిగురును మిస్ చేసుకోకండి… దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి… చింత చచ్చినా పులుపు చావలేదు… అన్న సామెతను మీరు వినే ఉంటారు. ఆయా సందర్భాల్లో దీన్ని మనం పోలిక కోసం ఉపయోగిస్తుంటాం. అయితే పులుపు సంగతి ఎలా ఉన్నా చింతను తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలే కలుగుతాయి. ప్ర ధానంగా ఈ కాలంలో విరివిగా లభ్యమయ్యే చింత చిగురుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. రుచికరమైన ఆహారంగానే కాక దీన్ని తినడం వల్ల మనకు ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఈ క్ర మంలో చింత చిగురును నిత్యం తీసుకోవడం వల్ల కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్గా పనిచేసి విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. మలబద్దకం సమస్య తొలగిపోతుంది. పైల్స్ ఉన్న వారికి కూడా చింత చిగురు బాగానే పనిచేస్తుంది. 2. ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చింత చిగురు చెడు కొలెస్ట రాల్ను తగ్గించి అదే క్రమంలో మంచి కొలెస్ట రాల్ను పెంచుతుంది. 3. వణుకుతూ వచ్చే జ్వరం తగ్గాలంటే చింత చిగురును వాడాలి. ఎందుకంటే ఇందులోని ఔషధ కారకాలు వైరస్ ఇన్ఫెక్షన్లపై పోరాడుతాయి. 4. చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు చింత చిగురులో ఉన్నాయి. 5. వేడి వేడి మసాలా పదార్థాలు తినడం వల్ల నోటిలో వచ్చే పగుళ్లు, పూతలను చింత చిగురు తగ్గిస్తుంది.   6. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. 7. కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది. 8. జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది. 9. చింత చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధి లభిస్తాయి. ఇందు వల్ల ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్ గుణాలు దీంట్లో ఉన్నాయి. 10. పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు చింత చిగురులో ఉన్నాయి.   11. తరచూ చింత చిగురును తింటే ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. 12. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు చింత చిగురును తమ ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 13. డయాబెటిస్ ఉన్న వారు కూడా చింత చిగురును వాడవచ్చు. ఇది వారి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. 14. ఆల్కహాల్ను ఎక్కువగా సేవించడం వల్ల కలిగే హ్యాంగోవర్ నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.   15. చింత చిగురును పేస్ట్లా చేసి దాన్ని కీళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ సమస్యతో బాధ పడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది. 16. శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. ఇది యాస్ట్రిజెంట్లా పనిచేస్తుంది. 17. నేత్ర సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్లు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే ఉపశమనం కలుగుతుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.