షాపింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

  షాపింగ్‌పై నియంత్రణ కోల్పోయి అవసరం లేని వస్తువులు కూడా కొనేసి, ఇంటికి వచ్చాక లెక్కలు కట్టి బాధపడేవారు చాలామందే ఉంటారు. ఇలా అవసరాన్ని మించి హ్యాండ్ బ్యాగ్‌లో లేదా ATM లో ఉన్న డబ్బంతా ఖర్చుచేస్తే ఆ నెలంతా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. * ఈ విషయంలో సెల్ఫ్ కంట్రోల్, ముందుచూపు చాలా అవసరం. అందుకే షాపింగ్‌కు వెళ్ళేముందు కావాల్సినంత డబ్బు మాత్రమే తీసుకువెళ్ళండి. ATM కార్డులో పుష్కలంగా బ్యాలెన్సు ఉంది కదా అని ఎడా, పెడా ఉపయోగించకండి. ఈ కార్డులు హ్యాండ్ బ్యాగులో ఉంటే అవసరానికి మించి కొనడానికి ఉత్సాహపడతారు. కాబట్టి వీలయినంతవరకూ వాటిని బైటకు తీయవద్దు. * షాపింగ్‌కు వెళ్ళే ముందే ఇంటి దగ్గర ఒక చిన్న స్లిప్‌మీద ఏమేమి కొనాలి, ఎక్కడ కొనాలి, ఎంత డబ్బు వాటికి అవసరం అవుతుంది అని చిన్న జాబితా తయారుచేసుకోండి. జాబితా తయారుచేసుకున్నాకా మీ వద్ద ఉన్న డబ్బుకు మించి జాబితా తయారైతే అవసరం లేని వస్తువులేమైనా ఉన్నాయో చూసుకుని వాటిని తొలగించండి. ఇంకా వీలైతే అత్యవసరం ఉన్న వాటినే లెక్కలో ఉంచుకోవాలి. షాపింగ్ కు వెళ్ళాక తయారుచేసుకున్న జాబితాలో నుంచే కొనుగోళ్ళు ప్రారంభించాలి. *  వ్యాపార ప్రకటనలు చూసి మోసపోవద్దు. చాలామంది కూడా ప్రకటనలపైనా, ఫ్రీ గిఫ్ట్‌లపైనా దృష్టి పెడుతుంటారు. వీటిని దృష్టిలో పెట్టుకోకుండా కొనుగోళ్ళు చేస్తే తగిన నియంత్రణలో ఉన్నట్లు లెక్క. * కొంతమంది బోర్‌గా ఉందని, ఏం తోచక షాపింగులు చేస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. బోర్ కొట్టేవాళ్ళు కాలక్షేపానికి మరేదైనా పనిమీద మనసు లగ్నం చేస్తే బాగుంటుంది. అంతేకాని షాపింగు చేయడాన్ని ఎంచుకోవద్దు. * నెలంతా అవసరమయ్యే అన్ని ఖర్చులు రాసుకుని ఆ తర్వాతే షాపింగు ఖర్చు తీసి పక్కన పెట్టాలి. ఎందుకంటే వచ్చిన డబ్బంతా షాపింగ్‌కు ఖర్చుపెట్టి ఆ తర్వాత అప్పులు చేయవద్దు. * హైక్లాస్ అయినా మిడిల్, లోయర్ క్లాసుల వాళ్ళయినా షాపింగ్‌లో నియంత్రణ కలిగి ఉండటం చాలా మంచిది.
Publish Date: Mar 28, 2024 3:54PM

ప్రతి మనిషిలోనూ ఓ వేటగాడు!

ఈమధ్య కాలంలో ఎక్కడ చూసినా జనం ‘పోకెమాన్‌ గో’ ఆటని ఆడుతూ కనిపిస్తున్నారు. ఇది వేలంవెర్రిగా మారిందని పెద్దలు తిట్టుకుంటున్నా, దీని పర్యవసానాల గురించి పరిశోధనలు జరుగుతున్నా... ఆటలు ఆడేవారు మాత్రం పోకెమాన్ల వెంట పడుతూనే ఉన్నారు. ‘ఇంతకీ మనిషి ఈ ఆటకి ఎందుకింతగా వ్యసనపరుడయ్యాడు?’ అన్న ప్రశ్నకి ఓ స్పష్టమైన జవాబు లభిస్తోంది. తన జీవితమే ఒక పరిశోధన రష్యాలో పుట్టి పెరిగిన ‘వ్లాదిమిర్‌ డినెట్స్’ అనే ఆయన, ప్రస్తుతం అమెరికాలో మనస్తత్వ శాస్త్రంలో ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన పోకెమాన్‌గో పిచ్చి గురించి వ్లాదిమిర్‌కి కూడా కొన్ని సందేహాలు వచ్చాయి. మనిషిలో స్వతహాగా ఉండే వేటగాడి మనస్తత్వం వల్లే మనం ఈ ఆటని ఇష్టపడుతున్నామా అన్న అనుమానం కలిగింది. దాంతో ఒక్కసారి తన జీవితంలో జరిగిన విషయాలనే ఒక్కొక్కటిగా నెమరువేసుకుంటూ ‘మనిషిలో వేటగాడు’ అనే ఆలోచనకు ఓ రూపం ఇచ్చేందుకు ప్రయత్నించారు. వేటే ఆధారం ఇప్పుడంటే తాజా ఆకుకూరలు, షడ్రసోపేతమైన ఆహారాలు లాగిస్తున్నాం కానీ, ఆదిమానవులుగా ఉన్నప్పుడు మనం వేట మీదే కదా ఆధారపడింది. ఆ వేటతోనే కదా వారి ఆకలి తీరింది. కాబట్టి మిగతా జంతువులలాగానే మనిషిలో ఇంకా ఆ వేట తాలూకు ఛాయలు పోలేదంటారు వ్లాదిమిర్‌. అందుకు తన జీవితమే ఒక ఉదాహరణగా చెప్పుకొస్తున్నారు. వ్లాదిమిర్‌ చిన్నప్పుడు తన తండ్రి సీతాకోక చిలుకల వెంటపడటాన్ని గమనించేవాడు. ఆయన సీతాకోక చిలుకల్ని గమనిస్తూ, వాటి వెంటపడుతూ, వాటిలో అరుదైనవాటిని సేకరిస్తూ ఉండేవారట. వ్లాదిమిర్‌కు ఐదేళ్లు వచ్చేసరికి దగ్గరలో ఉన్న అడవులకు వెళ్లి అక్కడ ఉండే జంతువులని గమనించే అలవాటు మొదలైంది. తరువాత కాలంలో వ్లాదిమిర్‌, మాస్కో మహానగరంలో అడుగుపెట్టాడు. అక్కడ అతను పార్కుల్లో పక్షులనీ, పెరట్లో పురుగులనీ గమనించడం మొదలుపెట్టాడు. ఆ తరువాత అరుదైన జంతువులని గమనించడాన్నే వ్యాపకంగా పెట్టుకొన్నాడు. చివరికి జంతువుల స్వభావాల మీదే డాక్టరేటు పుచ్చుకున్నాడు. అన్నీ వేటగాడి సూచనలే సీతాకోక చిలుకల వెంటపడటం, పక్షులను గమనించడం, జంతువులని పరిశీలించడం, పురుగులను పట్టుకోవడం... ఇవన్నీ మనలో దాగి ఉన్న వేటగాడి చర్యలే అంటారు వ్లాదిమిర్‌. అంతేకాదు పోకెమాన్‌గోలో లేని జంతువులను ఊహించుకుంటూ వాటి వెంటపడటం కూడా మనలోని వేటగాడిని తృప్తి పరుస్తోందని విశ్లేషిస్తున్నారు. అయితే ఈ ‘వేటగాడి’లో ఉండే పోరాటపటిమని లక్ష్యసాధన కోసం ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలనిస్తుందని సూచిస్తున్నారు.   -నిర్జర.
Publish Date: Mar 27, 2024 9:30PM

మనిషిలో ఉండాల్సిన గొప్ప గుణం ఇదే!

మనిషి జీవితంలో ఒకదాని తరువాత ఇంకోటి కావాలని అనుకుంటూనే ఉంటాడు. అంటే మనిషికి తృప్తి ఉండటం లేదు. ఇంకా ఇంకా కావాలనే అత్యాశ మనిషిని నిలువనీయదు. కానీ ఈ ప్రపంచంలో తృప్తి మించిన సంపద లేదన్నది అందరూ నమ్మాల్సిన వాస్తవం. అది పెద్దలు, యువత అందరూ గుర్తించాలి. ముఖ్యంగా యువతరం తృప్తి గురించి తెలుసుకుని  దాన్ని గుర్తించాలి.   ఈ సమాజంలో అందరికీ కూడా తృప్తి అనేది కరవు అయ్యింది. ఎందుకు అంటే మనిషిలో ఇంకా కావాలి అనే అత్యాశ వల్ల తృప్తి అనేది లేకుండా అందరూ స్వార్థంతో జీవిస్తున్నారు. దాని వలన మనశ్శాంతి కోల్పోవడం తప్ప వేరే ప్రయోజనం ఏదీ లేదు. ఈ సమాజానికి మేథావులు, శక్తివంతులు, ఆదర్శవ్యక్తులు ఎంత అవసరమో అంతకంటే గుణవంతులు ఎక్కువ అవసరం. అటువంటి గుణసంపద యువతీ యువకులు కలిగి ఉండాలి. సంస్కారం, సమగ్ర వ్యక్తిత్వం, సేవాగుణం ఈ కాలంలో ఉన్న యువతలో ఉండటం చాలా అవసరం.  మనిషి దిగజారితే పతనం అంటారు. ఈ పతనావస్థ స్థాయికి జారడం  చాలా సులభం. పతనావస్థకు జరినంత సులువు కాదు విజయం సాధించడమంటే. విజయం గురించి ఆలోచించటం మంచిదే కాని పతనం చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం కూడా చాలా అవసరం. గొప్పపేరు సంపాదించడం కంటే మంచితనం సంపాదించటం చాలా మేలు. వినయ విధేయతలతో కూడిన క్రమశిక్షణ అనేది ఈ కాలంలో యువతకు చాలా ముఖ్యం. తాము ఈ సమాజానికి ఎలా ఉపయోగపడతాం అనే ఆలోచన యువతలో ఉండాలి తప్ప ఈకాలంలో మనకు తీసుకోగలిగినంత స్వేచ్ఛ ఉంది కాబట్టి మనకు సమాజంతో పని ఏంటి?? అనే ఆలోచనతో అసలు ఉండకూడదు.   ఈ దేశ భవిష్యత్తు అనేది యువతీ యువకులపై ఆధారపడి వుంది. అందుకే యువతకు ఓ బాధ్యత ఉందని,  యువత తాను చెయ్యవలసిన పనిని సక్రమంగా ఒక క్రమపద్ధతితో చేయాలని పెద్దలు చెబుతారు. ఏ పనిని అయినా సక్రమంగా చేయగలిగినట్లయితే తాను అభివృద్ధి చెందగలడు. అట్లాగే దేశాన్ని అభివృద్ధి చేయగలడు. ఇదీ యువతలో దాగున్న శక్తి. వ్యక్తిగత అభివృద్ధిపై దేశాభివృద్ధి ఆధారపడి వుంటుంది. దేశాభివృద్ధి అనేది ఆ దేశంలో నివసించే ప్రజల ఆర్థికాభివృద్ధిని బట్టి చెప్పవచ్చు. ఇకపోతే ఈ దేశానికి మూలస్థంబాలు అయిన యువత భవిష్యత్తు అంతా వారు విద్యావంతులు అవ్వడంలోనే ఉంటుంది. ఎంత కష్టపడి చదివితే అంత గొప్ప స్థాయికి చేరుకొగలరు అనే విషయాన్ని యువత ఎప్పుడూ మనసులో పెట్టుకోవాలి. యువత కష్టపడి ఇష్టంతో చదవాలి. ఇవి చెప్పటం చాలా సులభం కాని చెయ్యటం కష్టం. కానీ ఆర్థిక స్థోమత పెంచుకోవాలంటే కష్టపడటం అవసరమే అవుతుంది. సవాళ్ళను అధిగమించి అనుకున్నది సాధించాలి. అనుకున్నది సాధించగలిగినట్లయితే సంతృప్తి అనేది దానంతట అదే వస్తుంది. తృప్తికి మించిన సంపద ఇంకొకటి లేదు.  అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. మనిషి జీవితంలో ఉండాల్సిన గొప్ప గుణం ఏదైనా ఉందంటే అది తృప్తిపడటమే అని.                                         ◆నిశ్శబ్ద.
Publish Date: Mar 26, 2024 5:30PM

హోళీ ఆడే తీరు...ఒక్కో చోట ఒక్కోలా!

హోళీ అంటే ప్రపంచానికి రంగుల పండుగే కావచ్చు. కానీ భారతీయుల దృష్టిలో అంతకంటే ఎక్కువే! ఆధ్మాత్మికంగానూ, భౌతికంగానూ భారతీయుల జీవనవిధానానికి హోళీ ఓ రంగుల ప్రతీక. అందుకనే వారు హోళీని ఇలా మాత్రమే జరుపుకోవాలి అని నిశ్చయించుకోలేదు. ఒకో ప్రాంతంవారు రంగులతో ఆడుకునేందుకు ఒకో తీరున హోళీ ఆచారాన్ని సాగిస్తుంటారు. కావాలంటే చూడండి... లాఠ్మార్ హోళీ ఉత్తర్ప్రదేశ్లో జరిగే హోళీ మిగతా దేశానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుని జీవితంతో ముడిపడిన మధుర, బృందావన్ వంటి ప్రాంతాలన్నింటినీ కలిపి వ్రజభూమిగా పిలుస్తారు. ఈ వ్రజభూమిలో హోళీ లాఠ్మార్ పేరుతో జరుగుతుంది. అలనాడు శ్రీకృష్ణుడు, రాధాదేవితో కలిసి హోళీ ఆడేందుకు ఆమె పుట్టిళ్లయిన బర్సానాకు చేరుకున్నాడట. తనని ఆటపట్టిస్తున్న కృష్ణుని ఎదుర్కొనేందుకు రాధాదేవి లాఠీతో కృష్ణుని వెంటపడిందట. ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ ఈ వ్రజభూమిలో మగవారేమో ఆడవారి మీద రంగులు చల్లే ప్రయత్నం చేయడం, ఆడవారేమో ఆ ఆకతాయితనాన్ని ఎదుర్కొనేందుకు లాఠీలు ఝుళిపించడం చేస్తుంటారు. షిమోగా గోవాలో సంప్రదాయంగా జరుపుకొనే వసంత ఉత్సవం ‘షిమోగా’. హోళీ పౌర్ణమికి ఐదు రోజుల ముందునుంచే మొదలయ్యే ఈ పండుగకు హోళీ ఓ ముగింపునిస్తుంది. ఇందులో భాగంగా ఊరూరా తమ చరిత్రను గుర్తుచేసుకునేలా సంప్రదాయ నృత్యాలు సాగుతాయి. డప్పు వాయించేవాళ్లు ఇంటింటికీ తిరుగుతూ భిక్షమెత్తుకుంటారు. గ్రామదేవతలకు బలులు సాగుతాయి. గుళ్లలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. హోళీనాటికి షిమోగా పండుగ పతాకస్థాయిని చేరుకుంటుంది. స్థానికులతో కలిసి ఈ పండుగను చేసుకునేందుకు వేలమంది విదేశీయులు వస్తారు. ఈ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కూడా పెరేడ్లు నిర్వహిస్తుంటుంది. కుమౌనీ హోళీ ఎక్కడన్నా పండుగ ఒకరోజు జరుగుతుంది, రెండు రోజులు జరుగుతుంది... ఇంకా మాట్లాడితే పదిరోజులు జరుగుతుంది. కానీ కుమౌనీ హోళీని దాదాపు 40 రోజుల పాటు జరుపుకుంటారు. వసంత పంచమి రోజున మొదలవుతుంది వీరి హోళీ పండుగ. అందులో బోలెడు రకాలు, ఆచారాలు ఇమిడి ఉంటాయి. ఉదాహరణకు ‘బైఠకీ హోళీ’లో సంగీతకారులు ఒకచోటకు చేరి కొన్ని ప్రత్యేక రాగాలను ఆలపిస్తారు. వీటిని వినేందుకు జనం గ్రామగ్రామంలోనూ ఒకచోటకి చేరతారు. ఇలా సంగీతాన్ని కూర్చుని వినే అవకాశం కల్పిస్తుంది కాబట్టి దీనికి బైఠకీ హోళీ అని పేరు వచ్చింది. ఇక ఈ హోళీ సమయంలో సంప్రదాయ ఖాదీ వస్త్రాలను ధరిస్తారు కాబట్టి ‘ఖాదీ హోళీ’ అని పిలుచుకుంటారు. ఈ సమయంలోనే మహిళలు ప్రత్యేకించి ఒక చోట చేరి గీతాలను ఆలపిస్తారు. ఆ సందర్భాన్ని ‘మహిళా హోళీ’ అంటారు. ఫాల్గుణ పౌర్ణమి నాటి హోళీ ఘట్టానికి రంగులు చల్లుకునేందుకు ఈ నలభై రోజుల నుంచీ కూడా చెట్టూపుట్టా తిరుగుతారు. అక్కడ వేర్వేరు రంగు పూలను సేకరించి, పొడిచేసి సిద్ధంగా ఉంచుకుంటారు. హోళీ ముందు రోజు... హోళిక అనే రాక్షసి మంటల నుంచి ప్రహ్లాదుడు తప్పించుకోవడాన్ని గుర్తుచేసుకుంటూనే మంటలు వేసుకుంటారు. హోళీకి ముందే ఇంత హడావుడి ఉంటుందంటే, ఇక హోళీనాడు ఎంత సంబరం సాగుతుందో చెప్పేదేముంది! హోళా మొహల్లా పంజాబులో హోళీ మరునాడు జరుపుకొనే ఈ పండుగలో సిక్కులు తమ యుద్ధవిద్యలను ప్రదర్శిస్తారు. సిక్కులలోని యుద్ధనైపుణ్యాలను మెరుగుపరిచేందుకు సాక్షాత్తూ వారి గురువైన గోవింద్ సింగ్ ఏర్పరిచిన సంప్రదాయం ఇది. హోళీ మర్నాడే ఈ ఆచారాన్ని మొదలుపెట్టడం వెనుక ఆయన ఉద్దేశం ఏమైనప్పటికీ... పంజాబువాసులు అటు హోళీనీ, ఇటు హోళా మొహల్లాను కూడా ఘనంగా జరుపుకుంటారు. ఇంతేనా! గుజరాత్లో హోళీ సందర్భంగా ఉట్టి కొడతారు, ఒడిషాలో రాధాకృష్ణులను ఊరేగించి వారికి రంగులను అర్పిస్తారు, పశ్చిమబెంగాల్లో దీనిని డోలీ పూర్ణిమ పేరుతో ఓ సంగీతోత్సవంగా నిర్వహిస్తారు. ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతి రాష్ట్రంలోనూ హోళీకి ఒకో ప్రత్యేకత కనిపిస్తుంది. రంగుల ప్రపంచం అన్నా, ఆ ప్రపంచంలో లయబద్ధంగా జీవించడం అన్నా భారతీయులకు ఎంత ఇష్టమో హోళీ తెలియచేస్తుంటుంది. - నిర్జర.
Publish Date: Mar 24, 2024 6:30PM

ఇవి కూడా రంగుల పండుగలే!

హోళీ అంటే భారతీయులకి మాత్రమే ప్రత్యేకమైన పండుగ. ఎక్కడో ఈశాన్యంలోని మణిపూర్లో ఉన్నా, ఖండాలు దాటుకుని ఏ అమెరికాలో ఉన్నా.... హోళీనాడు రంగు చేతపట్టని భారతీయుడు ఉండదు. ఇందులో ఒకో ప్రాంతానిదీ ఒకో ప్రత్యేకత. ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకోవడం ప్రపంచంలో బహుశా మన హోళీ సందర్భంలో మాత్రమే కనిపిస్తుంది. కానీ జీవితాన్ని రంగులమయం చేసుకునే ప్రయత్నం మాత్రం చాలా దేశాల్లో ఉంది... టమాటాల పండుగ స్పెయిన్‌లోని వలెన్‌సియాన్ నగరంలో ఏటా ఈ పండుగ చేసుకుంటారు. ఆగస్టు చివరి బుధవారం  జరుపుకొనే ఈ పండుగలో ఒకరి మీద ఒకరు టమోటాలు విసురుకుంటారు. 1945 నుంచి మొదలైన ఈ పండుగ రాన్రానూ ప్రచారాన్ని అందుకుంటోంది. నిజానికి ఈ సంప్రదాయం ఎలా మొదలైందో ఎవరికీ తెలియదు. కొందరు కుర్రకారు టమాటాలతో కొట్టుకున్న గొడవ ఇలా మారిందనీ, ఓ టమాటా లారీ బోల్తా పడటంతో ఈ సంప్రదాయం మొదలైందనీ, ఊళ్లో కౌన్సిల్‌ సభ్యుల మీద కోపం వచ్చిన పౌరులు టమాటాలను విసరడంతో ఈ ఆచారానికి పునాది ఏర్పడిందనీ రకరకాల వాదనలు ఉన్నాయి. కారణం ఏదైనా ఆ రోజు సంబరం మాత్రం అంబరాన్ని అంటుతుంది. ఆ సందర్భంగా ఎవ్వరికీ ఎలాంటి గాయం జరగకుండా చాలా నియమాలనూ పాటించాల్సి ఉంటుంది. ఒకటే రంగు నెదర్లాండ్‌ రాజుగారైనా విలియం అలగ్జాండర్ పుట్టినరోజు సందర్భంగా ఆ దేశంలో జరుపుకొనే సంబరాలే ‘Koningsdag’. ఈ రోజున నెదర్లాండ్స్ యావత్తూ ఆ దేశపు రంగైన నారింజరంగుతో నిండిపోతుంది. గోడల మీద నారింజ రంగు కనిపిస్తుంది. జనమంతా నారింజరంగు బట్టలు వేసుకుని తిరుగుతారు. ఆఖరికి జుట్టుకి కూడా నారింజ రంగు వేసుకుంటారు. ద్రాక్ష ఎరుపులో మందుప్రియులందరి నోరూరేలాంటి ఓ పండుగ ఉంది. అదే స్పెయిన్‌లో జరిగే ‘హారో వైన్‌ ఫెస్టివల్‌’. ఏటా జూన్‌ 29న ఆ దేశంలోని క్రైస్తవ సన్యాసి ‘శాన్‌ పెడ్రో’ జ్ఞాపకార్థం ఈ పండుగ జరుగుతుంది. హారో అనే ఊరిలో జరిగే ఈ పండుగలో ఊరి జనమంతా ఉదయం నుంచే ద్రాక్షసారాయి నిండిన పాత్రలతో బయల్దేరతారు. దారిలో తమకు ఎదురుపడినవారందరి మీదా ఈ సారాయిని ఒంపుతూ ముందకుసాగుతారు. సాయంత్రం అయ్యేసరికి ఊరంతా ద్రాక్షమయంగా మారిపోతుందన్నమాట. ఇక ద్రాక్షసారాని ఒంపుకోవడమే కాదు... దానిని తాగడంలో కూడా బోలెడు పోటీలు జరుగుతాయి. నారింజ యుద్ధం ఇటలీలోని ఇవ్రియా అనే పట్నంలో జరిగే పండుగ ఇది. దీని మూలాలు ఎప్పుడో 13వ శతాబ్దంలో ఉన్నాయని చెబతారు. అప్పట్లో రాజవంశానికి చెందిన వ్యక్తి, ఓ పల్లెటూరి పిల్లని బలాత్కారం చేయబోయాడట. దానికి తిప్పికొట్టిన ఆ అమ్మాయి, ఏకంగా ఆ వ్యక్తి తలని నరికేసిందని చెబుతారు. అంతేకాదు! విషయం తెలుసుకున్న పౌరులంతా కలిసి రాజవంశం మీద తిరగబడ్డారట. ఆనాటి ప్రతిఘటనకు గుర్తుగా ఇవ్రియావాసులు నారింజపండ్లని ఒకరిమీద ఒకరికి విసురుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా హోళీని తలపిస్తూ రంగులతో నిండే ఇలాంటి పండుగలు చాలానే ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి మాత్రం పైన పేర్కొన్నవే!   - నిర్జర.
Publish Date: Mar 23, 2024 4:25PM

రంగుల జీవితం!

మనకిష్టమైన వాళ్ళు మన ఎదురుగా ఉంటే నిజంగానే లైఫ్ కలర్ ఫుల్ గానే  కనిపిస్తుంది. కాని కొన్ని రోజులు అయ్యాకా దాటాకా రోటీన్ లైఫ్ తో బోర్ కొడుతుంది ఎవరికైనా. పొద్దున్నే లేవటం అవే ఉరుకులు పరుగులు, అదే టైం టేబుల్. జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు ఉండే బ్రైట్నెస్ రానురాను కరువవుతుంది. అందులోనూ ఇంట్లోనే ఉండే హోం మేకర్స్ ఇంకా ఇంకా బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడూ చేసిన పనే చేస్తూ, మళ్ళీ తెల్లారిందా అనుకుంటూ వాళ్ళు పడే పాట్లు అన్ని ఇన్ని కావు. అలాంటి లైఫ్ లో కాస్త రంగులు నింపితే.....ఆనందాలు రెట్టింపయ్యి, అనురాగాలు విరబూస్తాయి, కదూ. మరి ఆ రంగుల్ని నింపటానికి ఏం చెయ్యాలంటే...... రొటీన్ లైఫ్ కి కాస్త భిన్నంగా ఉండాలంటే వీకెండ్స్ లో ఏదైనా లాంగ్ డ్రైవ్ గాని, లేదా చిన్న ట్రిప్ గాని ప్లాన్ చేసుకోవచ్చు. అలా వెళ్లివస్తే మన మూడ్ హాయిగా ఉంది నిజంగానే జీవితం రంగులమయంగా కనిపిస్తుంది. మనం రోజూ వాడే బట్టల్ని పక్కకి పెట్టి ఏదో ఒక న్యూ స్టైల్ ని మార్చాలి. రోజూ పంజాబీ డ్రెస్, సారీ వేసుకునే వాళ్ళు కాస్త డిఫెరెంట్ గా జీన్స్, కుర్తీ లాంటివి ట్రై చేస్తే మీలో వచ్చే మార్పు మీరే గమనించచ్చు. ఇంట్లో ఉండే ఫర్నిచర్ ఎప్పుడు ఒకేలా ఉంటే మజానే రాదు. అందుకే ఇంటికి కొత్త కళ రావాలంటే వాటి ప్లేస్ లు మారుస్తూ ఉండాలి.  మీ భాగస్వామి ఇంటికి వచ్చేసరికి ఒక స్వీట్ సర్ప్రైజ్ ప్లాన్ చేసుకోండి. ప్రతిరోజులా కాకుండా ఇంట్లోనే కేండేల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసుకుంటే రొటీన్ కి బిన్నంగా ఉంటుంది. మీకు సన్నిహితమైన వాళ్ళని ఇంటికి భోజనానికి పిలవండి. వాళ్ళు వచ్చారు వెళ్లారు అనేలా కాకుండా కాస్త వెరైటీగా కార్డ్స్ గేమ్ గాని, డంషరాడ్స్ లాంటి ఫన్నీ గేమ్స్ గాని ప్లాన్ చేసుకుంటే మనసు హాయిగా రంగులతో నిండిపోతుంది.  మాములుగా ఇంట్లో అందరు ఉన్నప్పుడు మీకు ఇష్టమైన సినిమా వస్తున్నా అది చూసే అవకాశం మీకు ఉండదు. పిల్లలు కార్టూన్ చూస్తామని, మిగిలిన వాళ్ళు సీరియల్స్ చూస్తామని రిమోట్ మీ చేతికి అందనీయరు. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు హాయిగా మీకిష్టమైన సినిమాని ప్లే చేసి చూడండి. మీకిష్టమైన కలర్ డ్రెస్, అది మీ పార్టనర్ కి నచ్చకపోతే మీరు వేసుకోటానికి సాహసించరు. అందుకే ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు లేదా మీ ఫ్రెండ్స్ తో బైటకి వెళ్ళినప్పుడు ఆ కలర్ డ్రెస్ వేసుకుని మీ కోరికని తీర్చుకోవచ్చు. ఇంట్లో మీకు బాగా ఇష్టమైన పెంపుడు జంతువుని పెంచుకుంటే మీకు బోర్ కొడుతోంది అనే మాటే గుర్తు రాదు. ఖాళీగా ఉన్న సమయంలో వాటితో ఆడుకుంటూ టైం ఇట్టే గడిచిపోతుంది. మీకిష్టమైన వాళ్ళ స్పెషల్ డేస్ గుర్తుపెట్టుకుని వాళ్ళకి గ్రీటింగ్ గాని, ఫ్లవర్ బొకే గాని పంపితే వాళ్ళు తిరిగి మీకు రెస్పాండ్ అయ్యే విధానం మీ లైఫ్ లో ఖచ్చితంగా కలర్స్ నింపుతుంది. మనకున్నదే చిన్న లైఫ్, అందులో మనకి దొరికే టైం కూడా చిన్నదే. ఆ టైంని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటూ, ప్రతి సారి ఏదో ఒక కొత్త కోణంలో లైఫ్ ని చూసినట్లయితే మన లైఫ్ మనకి ఎప్పటికి బోర్ కొట్టదు. అది మన కళ్ళకి ఎప్పటికీ కలర్ ఫుల్ గానే కనిపిస్తుంది.  ...కళ్యాణి     
Publish Date: Mar 23, 2024 12:04PM

బంధాన్ని పదిలంగా మార్చే సరికొత్త సిద్దాంతం.. లెట్ దెమ్!

జీవితంలో బంధాలు చాలా అపురూపమైనవి. ముఖ్యంగా జీవిత భాగస్వాముల మధ్య బంధం బలంగా ఉంటేనే జీవితం సంతోషంగా ఉంటుంది.  అయితే బంధంలో సంతోషం కంటే కలతలు, గొడవలు ఎక్కువగా ఉన్న జంటలే ఎక్కువగా ఉంటున్నాయి ఈ కాలంలో. దీనికి కారణం జీవిత భాగస్వాములు ఒకరినొకరు నియంత్రించాలని, ఒకరు చెప్పిందనే జరగాలని, ఒకరి మాటే నెగ్గాలని అనుకోవడం. దీనివల్ల ఇద్దరి జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. ఇద్దరి జీవితాలు ప్రశాంతతను కోల్పోతాయి. స్పష్టత లేకుండా తయారవుతాయి.   వీటిని పరిష్కరించి జీవితం సంతోషంగా ఉండటానికి సరికొత్త సిద్దాంతాన్ని పరిచయం చేస్తున్నారు మానవ సంబంధాల నిపుణులు.   లెట్ దెమ్ అనే ఈ సరికొత్త సిద్దాంతం వల్ల  జీవిత భాగస్వాములు ఒకరిని మరొకరు నియంత్రించాలనే ఆలోచన విడిచిపెట్టి స్వీయ నియంత్రణ పాటించడం జరుగుతుందని అంటున్నారు. అసలింతకూ ఈ లెట్ దెమ్ అనే సిద్దాంతం పాటించడం వల్ల కలిగే  ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుంటే.. గౌరవం.. స్వీయ నియంత్రణ, స్వీయ విమర్శ, స్వీయ ప్రోత్సాహం వంటివి ఎప్పుడూ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తాయి.  ఇది జీవితభాగస్వామి దృష్టిలో వ్యక్తిత్వాన్ని మరింత గొప్పగా మారుస్తాయి. ఇద్దరి మధ్య సరిహద్దులు, ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించడం వంటి విషయాలలో ఎప్పుడూ సంతృప్తికర ఫలితాలను ఇస్తాయి. అందుకే లెట్ దెమ్ సిద్దాంతాన్ని పాటించే వ్యక్తులు తమ గౌరవాన్ని పెంచుకుంటారు. ఎక్స్పెక్టేషన్స్.. లెట్ దెమ్ ను స్వీకరించడం వల్ల వ్యక్తి జీవితం నుండి అంచనాలు, ఆశించడాలు, ఇతరుల విషయంలో ఒత్తిడికి లోనుకావడం వంటివి తగ్గుతాయి. ఇది వ్యక్తిని రిలాక్స్ గా మారుస్తుంది.  భాగస్వాములు ఇద్దరూ లెట్ దెమ్ సిద్దాంతాన్ని పాటిస్తే వారిద్దరి మధ్య ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి.  ఇది ఇద్దరి మధ్య సంతృప్తికరమైన జీవితానికి దారితీస్తుంది. సరిహద్దులు.. లెట్ దెమ్ సిద్దాంతాన్ని భాగస్వాములు పాటిస్తే వారిద్దరి మధ్య ఆరోగ్యకమైన సరిహద్దులు ఏర్పరుచుకోవడానికి, వాటిని నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.  ఇది ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పాటుచేసుకోవడానికి సహరకరిస్తుంది. యాక్సెప్ట్ చేయడం.. డిమాండ్ ఉన్నప్పుడు తనకు నచ్చింది మాత్రమే జరగాలనే పట్టుదల, మొండితనం ఉంటుంది. కానీ డిమాండ్ లేకుండా స్వీయ నియంత్రణ ఉన్నప్పుడు భాగస్వామి కోణంలో ఆలోచించడం, భాగస్వామికి సంబధించిన అన్ని విషయాలను స్వీకరించడం, ఇద్దరి మధ్య అంగీకారం  మొదలైనవి సులువు అవుతాయి. కంట్రోల్.. కోపం, ద్వేషం, ఆవేశం వంటి భావోద్వేగాలు ఎక్కువైనప్పుడు చాలావరకు భాగస్వాముల మధ్య గొడవలు, అపార్థాలు వస్తుంటాయి. కానీ ఈ ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోవడం, స్వీయ నియంత్రణ, స్వీయ విమర్శ, ఆత్మ పరిశీలన మొదలైనవాటి వల్ల భావోద్వేగాలు చాలావరకు నియంత్రణలో ఉంటాయి. ఇవి నియంత్రణలో ఉంటే చాలు.. సహజంగానే ఇద్దరిమధ్య అపార్థాలు తొలగిపోతాయి.  బంధం పదిలంగా ఉంటుంది.                                       *నిశ్శబ్ద.
Publish Date: Mar 22, 2024 12:49PM

నైపుణ్యంతో నయా జీవితం!

ఒక్కో మనిషిలో ఒకో విధమైన ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత కాస్తా మనిషిని కూడా ప్రత్యేకంగా ఉంచుతుంది. అయితే దాన్ని మనిషి తన జీవితం కోసం ఎలా ఉపయోగించుకుంటాడు అనేదాని మీద మనిషి జీవితం ఎంత బాగా ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎన్నో రంగాలు. అన్ని రంగాలలో కూడా ఇంత ప్రతిభ ఉన్న వాళ్ళకే అవకాశాలు. ఇందులో వింత ఏముంది?? ప్రతిభ ఉన్నవాళ్లకే కదా అవకాశాలు అని అందరికీ అనిపిస్తుంది కానీ ప్రతిభ ఉన్నా అందులో నైపుణ్యం లేకపోతే అందరి మధ్యన నిలబడి గెలవడం కష్టమే.  తేడా ఏంటి? ప్రతిభకు, నైపుణ్యతకు తేడా ఏంటి?? అని ప్రశ్నించుకున్నప్పుడు రెండూ ఒకటే అనిపిస్తాయి చాలామందికి. అయితే రెండింటికీ మధ్య ఒక సన్నని గీతను చూస్తాయి అవకాశాలు ఇచ్చే అధికార పీఠాలు. అంటే ప్రతిభలో కూడా తక్కువ ఎక్కువలను ప్రమాణికాలు ఉంటాయనమాట. మరైతే అవేంటి?? ఈ ఎక్కువ తక్కువల వృత్తం నుండి బయటకొచ్చి అవకాశాలు పొందటం ఎలా అంటే ప్రతిభకు పదునుపెట్టడమే. అలా పదును తెలినప్పుడే నైపుణ్యాలు మరొకరిని ఆకర్షిస్తాయి. నిజాయితీ! చేసే పనిని ఎంత నిజాయితీగా చేస్తున్నామన్నది మొదటి సూత్రం. ప్రతి చోట ఈ నిజాయితీని చూస్తారు. అంతేకానీ నిర్లక్ష్యపు ఆలోచనలతో చేసేపనిని అంత సీరియస్ గా తీసుకోకపోతే ఎంత ప్రతిభ ఉన్నవాడిని అయినా మూడురోజుల ముచ్చటగా పరికించి చూసి నాలుగవ రోజున బయటకు వెళ్లమంటూ తలుపులు తెరిచేస్తారు. కాబట్టి ప్రతిభ ఉన్నవాడు నిజాయితీ అనే గుణాన్ని తప్పనిసరిగా కలిగి ఉండాలి. వేగం! నీకు ఎంత బాగా పని చేయడం వచ్చు అనేది మంచి విషయమే, అయితే ఆ బాగా రావడంతో బాగా చేయడంలో వేగం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ కాలంలో టైమ్ సేవ్ చేయగలిగే నేర్పు ఉంటే వేతనం ఎక్కువ ఇచ్చి అయినా అవకాశం ఇస్తారు. తరువాత తమ నుండి ఎప్పటికీ దూరం చేసుకోరు.  అందుకే మహాభారతంలో కూడా "సాధనాత్ సాధ్యతే సర్వం" అని ఉంది. అంటే సాధన చేస్తూ ఉంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. వచ్చిన పనిని పదే పదే చేస్తూ ఉంటే అందులో వేగం అందుకోవడం కష్టమైన పని ఏమీ కాదు. క్రమశిక్షణ! క్రమశిక్షణ పాటించే వాళ్ళు అన్నివిధాలుగా మిగిలిన వారికంటే మెరుగ్గా ఉంటారు అనేది ఒప్పుకోవలసిన నిజం. సమయానికి తగు సేవలు అందించే వాళ్లంటే అధికారులకు ప్రత్యేక ఆసక్తి కూడా. పని చేసే చోటుకు చేరుకోవడం నుండి, అప్పగించిన పనిని పూర్తి చేసే వరకు సమర్థవంతంగా ఉండాలి కోరుకుంటారు.  ఇంటి సమస్యలు, మానసిక ఒత్తిడులు, వ్యక్తిగత సమస్యలను పనిలోకి జొప్పించి, అసహనంతో, అసంబద్ధంగా నిర్లక్ష్యంగా ఉండేవాళ్లంటే డబ్బులిచ్చి పనిచేయించుకునే ఎవరు మాత్రం ఆసక్తి చూపిస్తారు?? అప్ డేట్ అవ్వాలి! నిజంగా ఇది చాలా ముఖ్యమైనది. ప్రతిభ ఉంటే సరిపోదు. ప్రస్తుత వేగవంతమైన ప్రపంచంలో ఆ ప్రతిభ తాలూకూ రంగంలో కలుగుతున్న మార్పులను తెలుసుకోవాలి. ఆ మార్పులకు తగ్గట్టు ప్రతిభను అందులో వేగాన్ని, విభిన్నత్వాన్ని పెంపోందించుకోవాలి. ప్రస్తుతం విభిన్నత్వం కూడా ఒక పరిగణించాల్సిన అంశమే. ఎప్పుడైతే చేసేపనిలో కొత్తదనం, ఆకర్షణ కనబడతాయో అప్పుడు అందరూ ఆసక్తి చూపుతారు. అవకాశాలు బోలెడు! భారతదేశంలో నిరుద్యోగులు ఎక్కువ. అయితే వాళ్ళందరూ ఎందుకు నిరుద్యోగులుగా ఉన్నారు అంటే, చదువుకుని ప్రభుత్వ రంగాలలోనే ఉద్యోగం సాధించాలని ఎంతో విలువైన వయసు కాలాన్ని కేవలం ప్రయత్నాలలోనే గడిపేస్తుండటం వల్ల. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించకూడదు అనేది ఇక్కడి మాటల్లోని అర్థం కాదు. అది తప్ప వేరే ఇంకేమీ లేవని అనుకోవడం తప్పు అని చెప్పడం ఇక్కడి ఉద్దేశ్యం.  అవకాశాల కోసం వెతుకులాడటం, పాకులాడటం కంటే అవకాశాలను సృష్టించడం తెలిస్తే ఇక జీవితంలో గొప్ప దశ ప్రారంభమైనట్టే.  ముఖ్యంగా మనిషి తనలో ఉన్న ప్రత్యేకతను ఎంత మెరుగుపెట్టుకుంటూ వెళ్తే అంత నైపుణ్యం ఆ వ్యక్తిలో చేరుతుంది. ఆ నైపుణ్యాల ఫలితమే కొత్త జీవితానికి నాంది. ◆ వెంకటేష్ పువ్వాడ.
Publish Date: Mar 21, 2024 4:30PM

అదృష్టం- దురదృష్టం

అదృష్టం, దురదృష్టం అన్న మాటలను తరచూ వాడేస్తూ ఉంటాం. కానీ ఇంత చిన్న జీవితంలో ఏది అదృష్టమో, ఏది కాదో ఎలా చెప్పగలం. అందుకే మన పని మనం చేసుకుపోవడం, దాని ఫలితం తలకిందులైనప్పుడు కుంగిపోకుండా సాగిపోవడం విచక్షణ ఉన్న మనిషి లక్షణం. కావాలంటే ఈ చిన్న కథను చదివి చూడండి. దాదాపు వందేళ్ల క్రితం మాట ఇది. స్కాట్లాండులో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబ పెద్ద పేరు క్లార్క్. కుటుంబం అంటే అందులో ఓ నలుగురో, ఐదుగురో ఉంటారనుకునేరు. క్లార్క్‌, అతని భార్యా... వారి తొమ్మిదిమంది పిల్లలు. ఆ తొమ్మిదిమంది పిల్లలతో బతుకు బండిని లాగడం భార్యాభర్తలకు చాలా కష్టంగా ఉండేది. అందుకని మంచి అవకాశాల కోసం అమెరికాకు చేరుకోవాలనుకున్నారు. మరి విదేశంలో స్థిరపడాలంటే మాటలా! అందుకోసం తగిన గుర్తింపు పత్రాలు, అనుమతి పత్రాలూ కావాలి. అన్నింటికీ మించి కుటుంబంలోని పదకొండు మందీ ప్రయాణించేందుకు టికెట్లు కొనుగోలు చేసుకోవాలి. వీటి కోసం భార్యాభర్తలు తెగ కష్టపడేవారు. వాళ్ల కాళ్లూ వీళ్ల కాళ్లూ పట్టుకుని కావల్సిన పత్రాలను సంపాదించారు. రాత్రింబగళ్లూ పనిచేసి టికెట్లకు అవసరమైన డబ్బుని సంపాదించారు. తిండీతిప్పలూ మానేసి ఏళ్లకి ఏళ్లు కష్టపడితే కానీ ఇదంతా సాధ్యం కాలేదు. చివరికి ఫలానా రోజున అమెరికాకి ప్రయాణం అవ్వబోతున్నామన్న తీపి కబురుని తన కుటుంబానికి వినిపించాడు క్లార్క్‌. ఈ వార్త విన్న కుటుంబం సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయింది. కానీ... మరో వారం రోజుల్లో ప్రయాణం ఉందనగా ఆ కుటుంబంలో అందరికంటే చిన్నపిల్లవాడిని కుక్క కరిచింది. వారుండే చోట ర్యాబిస్‌ మందు ఇంకా అందుబాటులో లేకపోవడంతో గాయానికి కుట్లు మాత్రమే వేసి వదిలేశాడు ప్రభుత్వ వైద్యుడు. పైగా అప్పటి నిబంధనల ప్రకారం, ర్యాబిస్ ప్రబలకుండా ఉండేందుకు మరో రెండువారాల పాటు ఆ కుటుంబం ఎక్కడికీ కదలడానికి వీల్లేదంటూ ఆజ్ఞలు జారీచేశాడు. ఇంకేముంది! ఆ కుటుంబం బిక్కుబిక్కుమంటూ ఇంట్లోనే ఉండిపోయింది. తమ టికెట్లని తిరిగి అమ్ముకునే అవకాశం కూడా లేకపోయింది. ఇంటిల్లపాదీ ఆ పిల్లవాడిని తిట్టుకుంటూ ఉండిపోయారు. ఈ రెండువారాల్లో ఆ పిల్లవాడికి కానీ, అతని నుంచి కుటుంబానికి కానీ ర్యాబిస్‌ అయితే సోకలేదు. కానీ నౌక, ఆ నౌకతో పాటు తమ టికెట్టు డబ్బులు తీరం దాటి వెళ్లిపోయాయి.రెండువారాలు గడిచాయి.... ఇంటిల్లపాదీ చిన్నబోయిన మొహోలతో ఊళ్లోకి వచ్చారు. కానీ తనకి ఎదురొచ్చిన ప్రతిఒక్కరూ శుభాకాంక్షలు చెప్పడం చూసి ఆశ్చర్యపోయాడు క్లార్క్‌. తమని వెక్కిరించేందుకే వారలా చేస్తున్నారని మొదట అనుకున్నాడు. కానీ అసలు విషయం తెలిసేసరికి అతని ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయాయి. తాము ఎక్కుదామనుకున్న నౌక నడిసముద్రంలో మునిగిపోయిందనీ... అందులో దిగువ తరగతుల్లో ప్రయాణిస్తున్నవారు చాలామంది చనిపోయారనీ తెలిసింది. ఆ నౌక మరేదో కాదు... 1,500 మంది ప్రాణాలను బలిగొన్న టైటానిక్‌! ఇప్పుడు కార్ల్క్ దురదృష్టం కాస్తా అదృష్టంగా మారిపోయింది. క్లార్క్ పరుగుపరుగున వెళ్లి తన చిన్న కొడుకుని కావలించుకుని ఏడ్చేశాడు. తన కుటుంబం యావత్తునీ కాపాడావంటూ ముద్దులతో ముంచెత్తాడు. పాశ్చాత్య దేశాలలో క్లార్క్‌ కథ విస్తృత ప్రచారంలో ఉంది. ఇది నిజమా అబద్ధమా అని చెప్పేవారెవ్వరూ లేరు. కానీ ఇలా జరిగే అవకాశాన్ని మాత్రం ఎవ్వరూ కొట్టిపారేయలేరు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండటం, సజీవంగా ఉండటాన్ని మించిన అదృష్టం ఉందన్న విషయాన్ని ఎవరు మాత్రం నిరాకరించగలరు! - నిర్జర.
Publish Date: Mar 20, 2024 5:30PM

మాటలొస్తే చాలు రాజ్యం నీదే!

మనిషిని ఆకట్టుకునేది మాట! మనిషి వ్యక్తిత్వాన్ని సుస్పష్టం చేసేది మాట! మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దేది మాట! ఇట్లా మాట మనిషిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. అయితే అదే మాట తూటా లాగా ఇతరులను గాయపరుస్తుంది! ఆవేశంలో బయటకు వచ్చేమాట ఆయుధం కన్నా పదునైనది. అందుకే కోపం, ఆవేశం ఉన్నపుడు మౌనంగా ఉండటం ఎంతో ఉత్తమం. చాలామంది కొన్ని సార్లు ఎంతో ఆత్మీయులు, మరెంతో కావలసినవాళ్ళ దగ్గర ఏదైనా చిన్న తగాదా వచ్చినప్పుడు ఆవేశంలో ఏదో ఒకటి అనేస్తారు, ఆవేశం కాస్తా చల్లారిపోయాక తాము ఏమి మాట్లాడాము అనేది మరోసారి విశ్లేషించుకున్నాక అప్పుడు తెలుస్తుంది ఎంత అవివేకమైన పని చేశామో అని. కానీ అప్పుడు ఆ తప్పును తిరిగి ఒప్పుకున్నా, అవతల మనిషి మనసుకు అయిన గాయం అంత తొందరగా మానిపోదు. బహుశా కొందరిని ఆ మాటల తాలూకూ గుర్తులు జీవింతాంతం వెంటాడి మీకు దూరంగా ఉండేలా నిర్ణయం తీసుకునేందుకు ప్రేరేపించవవచ్చు కూడా. మాట మనిషికి ఆభరణం! నిజంగా నిజమే! మనిషి మాట్లాడే మాట ఆ మనిషి ఏంటి అనేది తెలుపుతుంది. ఆవేశం, కోపం, అసహనం చిరాకు ఇలాంటివన్నీ దరిదాపులకు రానివ్వకుండా మాట్లాడగలగడం కొందరికే సాధ్యమని అనుకుంటారు కానీ ప్రయత్నిస్తే ఎవరైనా వీటిని సాదించగలరు. ఎన్నో కంపెనీలు ఈ రకమైన క్వాలిటీస్ ఉన్న అభ్యర్గులకె ఉద్యోగాలు ఇవ్వడం గమనిస్తూనే ఉన్నాం కూడా.  మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి కేవలం ఉద్యోగ సంస్థలలో పనిచేసేవాళ్లకు మాత్రమే కాదు, జీవిత ప్రయాణంలో ప్రతి మనిషి ఉత్తమంగా ఉండేందుకు కూడా అవసరం.  మనం ప్రతిరోజు ఎన్నో పనుల దృష్ట్యా కొత్త వాళ్ళతో మాట్లాడాల్సి రావచ్చు, కొందరిని కాంప్రమైజ్ చేయాల్సి రావచ్చు, అందరి దగ్గరా ఓకేవిధంగా మాట్లాడలేం కదా! అన్ని తెలుసుకుని అడుగేసేవాడు ఉత్తముడని పెద్దల మాట. కాబట్టే మాట్లాడటం అనేది కూడా ఒక కళ అన్నారు. మాటకు మెరుగులు దిద్దేది మనిషి ముఖంలో సన్నని చిరునవ్వు. నవ్వుతూ పలకరించడం అవతలి వ్యక్తిని పర్ఫెక్ట్ గా రిసీవ్ చేసుకోవడమే. అయితే ఇది అన్ని చోట్లా, అన్ని వేళలా పనికిరాదు.  సందర్భాలు, సంఘటనలు, అవతలి వ్యక్తి మూడ్ ని బట్టి మాట్లాడాలి. చాలామంది చేసే పని ఏమిటంటే తమ మూడ్ ని బట్టి మాట్లాడుతుంటారు కానీ అది వంద శాతం తప్పు. మన మూడ్స్ ను ఇతరుల మీద చూపించకూడదు. మాటలో వినయం ఉండాలి. ఎదుటివారు చిన్న వాళ్ళు అయినా పెద్దవాళ్ళు అయినా గౌరవించి మాట్లాడాలి. పిచ్చిపిచ్చిగా దిక్కులు చూస్తూ, గట్టిగా నవ్వుతూ ఎప్పుడూ మాట్లాడకూడదు. సన్నని నవ్వుతో, మాట్లాడేటప్పుడు విషయాన్ని వీలైనంత వరకు సాగతీయకుండా తొందరగా ముగించాలి. ముఖ్యంగా కొత్తవాళ్ళ దగ్గర ఎప్పుడూ పిచ్చాపాటి కబుర్లు చెప్పకూడదు. మరొకరిని తక్కువ చేసి మాట్లాడటం ఎంత తప్పో, అనవసరంగా పనిపెట్టుకుని పొగడటం కూడా అంతే తప్పు.  పార్టీలలో తింటూ తాగుతూ మాట్లాడుకోవడం కామన్. అయితే నోట్లో ఏదైనా ఆహారపదార్థం ఉన్నపుడు, లేదా ఏదైనా తాగుతూ నోట్లో ఉన్నపుడు మాట్లాడకూడదు. దీనివల్ల నోట్లో లాలాజలం ఎదుటివారి మీద పడే అవకాశాలు ఉంటాయి. నోరు కాళీ చేసుకున్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. అలాగే పూర్తిగా పళ్ళు ఇకిలించి నవ్వుతూ మాట్లాడకూడదు. సన్నని నవ్వుతో మాట్లాడాలి. అలాగని మరీ చిన్న గొంతుతో మాట్లాడటం వల్ల ఎదుటివారు కాస్త అర్థం చేసుకోవడానికి ఇబ్బంది కావచ్చు. కాబట్టి స్పష్టంగా, మధ్యస్థ గొంతుతో, చెప్పాలనుకునే విషయాన్ని చెప్పాలి. హుందాగా ఉండాలి. అడ్డదిడ్డంగా, వంకర్లు తిరిగిపోతూ మాట్లాడకూడదు. మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తిని మాత్రమే చూస్తూ మాట్లాడాలి. అపుడపుడు తల అటు ఇటు కదిలించినా పర్లేదు కానీ అసలు ఎదుటి వ్యక్తికంటే చుట్టూ పరిసరాలను గమనించుకుంటూ ఉండటానికి ఎక్కువ సమయం కేటాయించకూడదు. అలా చేస్తే ఎదుటి వాళ్ళను అవమానించినట్టు అవుతుంది. ఏదేమైనా మాట్లాడటం కూడా ఒక కళ. దాన్ని ఆచరణలో పెట్టేవాళ్లు నలుగురిని తమవైపు చాలా సులువుగా ఆకట్టుకోగలరు. ◆ వెంకటేష్ పువ్వాడ  
Publish Date: Mar 19, 2024 11:30AM

ఎదుటివారిలో ఈ గుణాన్ని గుర్తిస్తున్నారా?

జీవితం చాలా విలువైనది. చాలా అందమైనది. ఇటువంటి విలువైన నీ జీవితం పట్ల సమాజానికి మంచి సదభిప్రాయం వుండాలి. మనం మన వ్యక్తిగత విషయాల పట్ల ఎదుటివారి దృష్టిలో విలువలు సంపాదించాలి. జీవితంలో కష్టసుఖాలు లాభనష్టాలు అల్లుకుపోయి వుంటాయి. వాటిని అందుకుని తీరకతప్పదు. మన జీవితంలో వచ్చిన కష్టనష్టాలకు గల కారణాలను వాస్తవాలను గ్రహించాలి. మనకు వచ్చిన కష్టనష్టాలకు ఇతరులు బాధ్యులు అని వారిని నిందించకూడదు. వారే నీ కష్టాలకు బాధ్యులు అని నీవు వారి పట్ల అంచనా వేయకూడదు. ఒకప్పుడు ఒక వ్యక్తి చాలా సంపన్నుడు. అతనికి చాలా డబ్బు వుండేది. ఆ డబ్బంతా ఏమి చేయాలో అతనికి తోచక తన స్నేహితుడిని ఈ డబ్బంతా ఏమి చేయాలో తెలియడం లేదు. ఏదైనా సలహా ఇవ్వమని కోరతాడు. అప్పుడు ఆ స్నేహితుడు ఒక సలహా ఇస్తాడు. నాకు తెలిసిన ఒక వ్యక్తి కష్టాలలో వున్నాడు. అతనికి నీవు డబ్బులు ఇస్తే అతను తన కష్టాలు తీరిన తరువాత వడ్డీతో సహా నీ డబ్బులు నీకు ఇస్తాడు. నీకు నీ డబ్బు ఇంకా రెట్టింపు అవుతుంది. తరువాత రాబోయే తరాలకు కూడా నీ డబ్బు ఉపయోగపడుతుంది. అని సలహా ఇచ్చి నీవు కూడా ఆలోచించు నేను చెప్పిన సలహా సరి అయినది అని అనిపిస్తేనే నీవు ఈ పని చేయి అని చెబుతాడు.  స్నేహితుడు చెప్పిన సలహా సరైనది అని తన మనసుకు తోచింది. స్నేహితుడు చెప్పినట్లుగా అతను కష్టాల్లో వున్న ఆ వ్యక్తికి డబ్బును ఇచ్చాడు. కొన్ని రోజుల తరువాత స్నేహితుడు చెప్పినట్లుగా ఆ వ్యక్తి ఇతనికి వడ్డీతో సహా డబ్బులను తెచ్చి ఇచ్చాడు. స్నేహితుడు చెప్పినట్లుగా అతనికి డబ్బు రెట్టింపు అయ్యింది. అపుడు అతను స్నేహితుడిని మెచ్చుకుంటాడు. కొన్ని రోజుల తరువాత ఇతనికి బిజినెస్ చేయాలని అనిపించింది. అపుడు మరల స్నేహితుడి సలహాను కోరతాడు. అప్పుడు స్నేహితుడు రొయ్యల బిజినెస్ పెట్టమని సలహా ఇస్తాడు. కొన్ని రోజులు ఆ రొయ్యల బిజినెస్ మంచిలాభం వచ్చింది. ఇలా లాభం రావడానికి కారణం తన స్నేహితుడే అని అతడిని బాగా అభినందించాడు.  తరువాత కొన్ని రోజులకి, ఆ రొయ్యల బిజినెస్ కి సరైన సదుపాయం లేక నష్టం వచ్చింది. ఆ స్నేహితుడు వల్ల అతను చాలా లాభాలు పొందాడు. కానీ నష్టం వచ్చేటప్పటికీ, నా స్నేహితుడు వలన నేను ఈ రొయ్యల బిజినెస్ పెట్టాను. దీనికి కారణం నా స్నేహితుడే అని అతడిని నిందిస్తాడు, అవమానపరుస్తాడు. అప్పుడు ఆ స్నేహితుడు తనకు లాభాలు వచ్చినప్పుడు మెచ్చుకున్నాడు. తనకు నష్టం వచ్చినప్పుడు మరల నన్ను నిందిస్తున్నాడు. ఎప్పుడూ ఈ వ్యక్తికి సలహా ఇవ్వకూడదు. ఇతను డబ్బుకు విలువ ఇస్తున్నాడు. మనిషికి మనిషిగా విలువను ఇవ్వడంలేదు. అని తన మనస్సులో అనుకుని అతని నుండి దూరంగా వెళ్ళిపోయాడు.  ఇప్పుడు అతనికి సలహాలు ఇచ్చే వ్యక్తులు లేరు. నేను నిందించడం వల్లే నా స్నేహితుడు నా నుండి వెళ్ళిపోయాడు అని బాధపడి అతనిలో వున్న చెడు అభిప్రాయాలను తొలగించుకుని మనిషిగా మానవతా విలువలను పెంచుకున్నాడు. ఎప్పుడైనా మనం ఎవరి సలహా అయినా తీసుకున్నప్పుడు ఆ మనిషి చేసిన సహాయాన్ని మరిచిపోకూడదు. అలాగే ఆ మనిషి వలనే నీకు కష్టం వచ్చింది అంటే అందుకు నీవే బాధ్యుడవు. అతని వల్ల పొందిన లాభాన్ని గ్రహించాలి. అతని వల్ల వచ్చిన కష్టాన్ని నిందించకూడదు, మీలోని ఆలోచనా విధానాన్ని గ్రహించాలి, దాన్ని సరిచేసుకోవాలి.  ఎదుటివారు చెప్పారు కదా అని మీరు ఆలోచించకుండా, సరైన నిర్ణయం తీసుకోకుండా వారు చెప్పినట్లుగానే చేసి, అందువల్ల ఏదైనా కష్టం వస్తే వారే బాధ్యులు అని ఎలా నిందించగలరు? మీరే ఆలోచించండి..... మనం మనిషిగా మానవత్వపు విలువలను సంపాదించాలంటే మొదట మనం ఎదుటివారిలో వున్న మంచిని గ్రహించాలి.                                          ◆నిశ్శబ్ద.
Publish Date: Mar 18, 2024 7:30PM

ముందు చూపు కావాలి

ఒకానొక సర్వే ప్రకారం విదేశాల్లో ప్రజలు ముఖ్యంగా వృద్ధులు తమ జీవితకాల చివర్లో పిల్లలకు తమ పాత ఇంటిని ఇచ్చి పరమపదిస్తున్నారని, మన భారతదేశంలో మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతుంది. ఒక వ్యక్తి తన జీవితంలో మొదట పెళ్లి కాగానే సేవింగ్స్ మొదలు పెడతాడు, పిల్లలు అవ్వగానే వారి చదువు, ఖర్చులు గట్రా ఆర్థిక విషయాలలో మునిగిపోయి సేవింగ్స్ ను పిల్లల కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. ఇంతా చేసాక పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ పెళ్లి కోసం మళ్ళీ ఖర్చులు అంటారు. ఇవన్నీ అయ్యాక ఓ సొంతింటి గూర్చి ఆలోచిస్తున్నారు. నిజానికి అప్పటికి ఆ వ్యక్తి వయసు అక్షరాలా అయిదు పదులు దాటిపోయి ఆరు పదులకు చేరువగా ఉంటుంది. మిగిలిన జీవితాన్ని ఓ సొంత ఇంట్లో సెటిల్ అయిపోయి మనుమళ్లను, మనుమరాళ్లను చూసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇదంతా కాస్త కలిగిన కుటుంబాలలో మాత్రమే. మరి మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాల్లో సీన్ ఇలాగేమి ఉండదు.  సంపాదన మొదలైన నాటి నుండి ప్రతి రూపాయిని లెక్క గట్టి ఖర్చు చేస్తున్నా మిగులు మాత్రం శూన్యం అనే చెప్పాలి. ఎందుకంటే చదువుతోనే అన్ని సాధ్యం అని నమ్ముతారు కానీ చదువు కూడా జీవితంలో భాగం అని అనుకోరు మనవాళ్ళు. అక్కడే వచ్చింది సమస్య అంతా. చదువు తప్ప ఏమీ తెలియని వాళ్ళు ఎలాంటి ఇతర పనులలో చేరలేక తల్లిదండ్రులకు భారంగా మిగులుతున్న యువతకు మన దేశంలో కొరత లేదని చెప్పవచ్చు.  బాల కార్మిక వ్యవస్థ నేరం కానీ, ఒక వయసు వచ్చాక పని చేయడం అనేది ఎప్పటికి నేరం కాదు. చాలామంది పనిచేస్తూ చదువుకోవడం అనేది ఒక వయసు పిల్లలకు ఆటంకం అని, వారు తమ లక్ష్యాలను చేరుకోలేరని అనుకుంటూ వుంటారు కానీ అలా పనిచేయడమే వారిని లక్ష్యం వైపుకు వెళ్లేలా చేయగలిగే ఉత్ప్రేరకాలు అని తెలుసుకోరు. విదేశాల్లో స్కూల్ విద్య పూర్తయ్యి కాలేజి విద్య మొదలవ్వగానే తమ పాకెట్ మని కోసం సొంతంగా పనిచేస్తూ చదువుకునేవాళ్ళు 90% మంది ఉంటారు. మనదేశంలో కూడా ఇలా పనిచేస్తూ చదువు సాగించినవారు గొప్ప స్థానంలో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. పిల్లలు పుట్టగానే  జీవితమంతా వారికసమే కష్టపడి సంపాదిస్తూ, అంతా పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చుపెడుతూ, పిల్లలు పెద్దయ్యి, తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయ్యే సమయానికి వాళ్లకు మిగిలేది కేవలం నెరిసిన జుట్టు, జీవితానుభవం మాత్రమే. ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు వృద్ధులయ్యాక పిల్లల చేత గెంటివేయబడటానికి కారణం 90% ఆర్థిక భారం తగ్గుతుందనే అనే విషయం మరచిపోకూడదు. అలాగే పిల్లలు తల్లిదండ్రులను ఉద్దరిస్తారనే ఆలోచనతో సర్వస్వం వాళ్ళ మీద ఆధారపడకూడదు.  అందుకే పెద్దవాళ్లకు ఒక పద్దు కావాలి. అదేనండి సంపాదన, ఖర్చు, పొదుపు వంటి విషయాల్లో తమకు కాసింత ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. అలాగే పిల్లలకు కూసా సంపాదించడం ఎలాగో నేర్పించాలి. చదువు అనేది సంపాదన కోసం అని భ్రమ పడటం మొదట మనేయాలి. ఎందుకంటే గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు ఎలాంటి పెద్ద చదువులు లేకుండానే జీవితాన్ని మొదలుపెట్టిన విషయం ఎవరూ మరచిపోకూడదు.  ఏ ప్రభుత్వ ఉద్యోగస్తులకో రిటైర్ అయ్యాక పెన్షన్ లు వస్తుంటాయి. మిగిలినవాళ్ళం ఎలా?? అనే సందేహం అసలు అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఎన్నో ఇన్సూరెన్స్ కంపెనీలు 60 ఏళ్ళు దాటిన వారికి పెన్షన్ వచ్చేలా ఎన్నో పాలసీలు అందుబాటులో ఉంచుతున్నాయి. సంపాదన ఉన్నపుడు వాటిలో తమకు కాసింత సేవింగ్స్ చేసుకుని, వృద్ధులయ్యాక నెలకు తగిన గౌరవ ప్రధమైన పెన్షన్  తీసుకుంటూ సంతోషంగా వృద్ధాప్యాన్ని కూడా గడిపేయచ్చు.  జీవితంలో చివరికి వచ్చాక బాధపడటం కంటే ముందు జాగ్రత్త ఎంతో అవసరం కదా! దీన్ని జాగ్రత్త అనడం కంటే తమ జీవితానికి తాము భరోసా ఇచ్చుకోవడం అంటే ఇంకా బాగుంటుంది. నిజమేగా మరి! ◆వెంకటేష్ పువ్వాడ
Publish Date: Mar 16, 2024 6:30PM

మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే మూడు విషయాలు!

మనిషి జీవితంలో బలాలు, అవకాశాలు, భయాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వాటి గురించి తెలుసుకుంటే... బలాలు మనిషి జీవితంలో బలాలు మాత్రమే కాదు. బలహీనతలు కూడా ఉంటాయి. అయితే నేటి కాలంలో మనుషులు తమలో ఉన్న బలాలను పక్కన పెట్టి తమలో ఉన్న చిన్న బలహీనతల్ని కూడా భూతద్దంలో చూస్తారు. ఫలితంగా తమలో చాలా పెద్ద లోటుపాట్లు ఉన్నాయని అవి తమ జీవితాన్నే కుదిపేస్తున్నాయనే ధోరణిలోకి వెళ్ళిపోతారు. స్నేహితులను, బంధువులను, ఆత్మీయులను కలిసినప్పుడు తమ గురించి తాము ఓపెన్ గా మాట్లాడుకోగలిగే చనువు ఉంటే గనుక అలాంటి సందర్భంలో  సహజంగా చాలామంది తమలో చాలా బలహీనతలు ఉన్నాయని అంటూంటారు. కానీ అందరూ గ్రహించని ముఖ్య విషయం ఏమిటంటే… అందులో అధికశాతం ఊహించుకున్నవే.  ఇక్కడ బలహీనతలంటే మొహమాటం, ఇన్ఫీరియార్టీ కాంప్లెక్స్, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఆందోళన.. లాంటి వైఖరులన్నమాట. ఉదాహరణకి చెప్పుకుంటే తను చదివే కోర్సు పూర్తయిపోగానే తరువాత ఏది ఎంపిక చేసుకోవాలనే నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల కొందరు చాలా బాధపడిపోతారు. అలాంటి పరిస్థితిలో వారి మనసులో ఉండే భావం ఎలాంటిదంటే ఒకరి మీద ఆధారపడాల్సి వస్తోందే అనే బాధ, నాకు నేను ఎలా నిర్ణయం తీసుకోవాలి నాకు తెలియనప్పుడు అనే సంఘర్షణ ఒక విద్యార్థిలో ఏర్పడటం తన బలహీనతగా భావిస్తాడు. అయితే ఇదేమీ పెద్ద సమస్య కాదు. కొద్దిపాటి అవగాహన పెంచుకుంటే, తెలుసుకుంటే అన్నీ సాధ్యమవుతాయి. మనిషిలో ఉండే బలహీనతలు ఎప్పటికీ బలహీనతలుగా ఉండిపోవు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే ఆ బలహీనతలు క్రమంగా అధిగమించవచ్చు. అవకాశాలు అవకాశాల గురించి చాలామందికి అవగాహన సరిగా ఉండదు. తమ ముందున్నవి అవకాశాలే కాదు అన్నంత నిర్లక్ష్యంగా, అవగాహనా లోపంతో ఉంటారు చాలామంది.  చదువుకునే విద్యార్థుల నుంచి, ఉద్యోగాలు చేసే వారి వరకు తాము ముందుకు పోవడానికి గల అవకాశాలను గుర్తించడం అరుదు. చదువుకునే విద్యార్ధినీ విద్యార్థులు, తాము బాగా చదువుకుంటే భవిష్యత్తులో ఏమి సాధించగలరో, తమ కుటుంబ గౌరవ ప్రతిష్ఠలు ఎలా పెంచగలరో గుర్తించాలి. చదువు పూర్తి చేస్తే తండ్రి వ్యాపారంలో చేరవచ్చు. విదేశాల్లో ఉన్న బంధువులు స్పాన్సర్ చేయవచ్చు. ఇక్కడే ఉద్యోగంలో చేరి కుటుంబాన్ని ఆదుకోవచ్చు... ఇలా తమ జీవితానికి ఉన్న మార్గాలను అనుసరించి ఆలోచించాలి. నిజానికి ఈనాటి యువతరానికి ఇవన్నీ తెలియకకాదు. అన్నీ తెలుసు. కానీ బద్ధకం, నిర్లక్ష్యవైఖరి, చెడు అలవాట్లు అడ్డుపడుతున్నాయి.  భయాలు  మనిషి పతనానికి మూలకారణం భయం. ఒక పని ప్రారంభించే ముందు విజయం సాధించగలమా లేదా అనే చిన్న భయం ఉండవచ్చు. దాంతో మధ్యలో సమస్యలు రావచ్చు. విజయమార్గంలో వైఫల్యాలు ఉంటాయి తప్పదు. విజయం అనేది ప్రయాణం తప్ప, గమ్యం కాదని గుర్తించాలి. అర్థం లేని భయాలు, భీతులు మన విజయానికి ఆటంకం కాకుండా ధైర్యం తెచ్చుకోవాలి. “నేను మాట్లాడలేను, నావల్లకాదు" వంటి మాటలకు ముగింపు చెప్పాలి.మాట్లాడటం అందరికీ వస్తుంది. అలాంటప్పుడు ఎందుకు మాట్లాడలేను?? విషయం గురించి కొంచెం అవగాహన పెంచుకుంటే ఆ అవగాహన ఉన్న విషయాన్ని మాట్లాడటమే క్షదా చేయాల్సింది. అలాంటప్పుడు మాట్లాడలేమనే భయం ఎందుకు?? ఇలాంటి ప్రశ్నను తమకు తాము వేసుకోవాలి. అలా వేసుకుంటే ఒకానొక ప్రేరణ ఎవరిలో వారికి కలుగుతుంది.  కాబట్టి మనిషి జీవితంలో బలహీనతలు, అవకాశాలు, భయాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వాటిని సరైన విధంగా డీల్ చేయడం నేర్చుకోవాలి.                                ◆నిశ్శబ్ద.
Publish Date: Mar 15, 2024 1:30PM

కాన్ఫిడెన్స్‌ పెరగాలా... నిటారుగా కూర్చోండి చాలు!

ఆత్మవిశ్వాసం పెరగడానికి చాలా చిట్కాలే వినిపిస్తూ ఉంటాయి. వినడానికి అవన్నీ బాగానే ఉంటాయి కానీ, పాటించడం దగ్గరకి వచ్చేసరికి తాతలు దిగి వస్తారు. దాంతో చిట్కాలన్నింటినీ మూటగట్టి... ఉసూరుమంటూ పనిచేసుకుపోతాం. కానీ ఇప్పుడు మనం వినబోయే చిట్కా పాటించడానికి తేలికే కాదు, దీంతో అద్భుతాలు జరుగుతాయని అంటున్నారు పరిశోధకులు. కొంతమందిని చూడండి... వాళ్లు నిటారుగా నడుస్తారు, కూర్చున్నా కూడా నిటారుగానే కూర్చుంటారు. వాళ్లని చూసి- ‘అబ్బో వీళ్ల మీద వీళ్లకి ఎంత నమ్మకమో’ అన్న ఫీలింగ్‌ తెలియకుండానే కలుగుతుంది. నిటారుగా కూర్చుంటే ఎవరిలో అయినా ఆత్మవిశ్వాసం పెరుగుతుందా! అనే అనుమానం వచ్చింది అమెరికాలో కొంతమంది పరిశోధకులకి. దాంతో వాళ్లు ఓ ప్రయోగం చేసి చూశారు.ఈ ప్రయోగంలో భాగంగా 71 మందిని ఎన్నుకొన్నారు. ‘ఒక ఉద్యోగం చేసేందుకు మీలో ఉన్న మూడు పాజిటివ్‌ లక్షణాలు, మూడు నెగెటివ్‌ లక్షణాలు ఒక పేపరు మీద రాయండి,’ అని అడిగారు. అయితే ఇలా రాసే సమయంలో ఓ సగం మంది నిటారుగా కూర్చుని రాయాలనీ, మిగతావాళ్లు చేరగిలబడి రాయాలనీ సూచించారు. నిటారుగా కూర్చుని రాసినవాళ్లు తమలో ఉన్న పాజిటివ్‌ లక్షణాలను చాలా బాగా ప్రజెంట్‌ చేయగలిగారు. అదే సమయంలో నెగెటివ్‌ లక్షణాలు అసలు పెద్ద విషయమే కాదన్న అభిప్రాయం కలిగేలా రాసుకొచ్చారు. ఇక చేరగిలబడి కూర్చున్నవారి పద్ధతి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. తమలో ఉన్న పాజిటివ్ లక్షణాలను కూడా చాలా సాధారణంగా రాసుకొచ్చారు. ఇక నెగెటివ్‌ లక్షణాలను గొప్ప సమస్యలుగా చిత్రీకరించారు. విచిత్రం ఏమిటంటే... నిటారుగా కూర్చున్నప్పుడు తమ కాన్ఫిడెన్స్‌లో మార్పు వచ్చిన విషయం వాళ్లకి కూడా తెలియలేదు. కానీ వాళ్ల చేతల్లో మాత్రం గొప్ప మార్పు కనిపించింది. అదండీ విషయం! ఈ చిన్న చిట్కా కనుక పాటిస్తే... పరీక్షలు రాయడం దగ్గర నుంచి ఇంటర్వ్యూలో జవాబులు చెప్పడం వరకూ ఎలాంటి సందర్భంలో అయినా మనలో కాన్ఫిడెన్స్‌ రెట్టింపు అవుతుందని భరోసా ఇస్తున్నారు పరిశోధకులు. నిటారుగా కూర్చోవడం, నడవడం వల్ల... మన ఆలోచనల్లో స్పష్టత వస్తుందనీ, అదే కాన్ఫిడెన్సుకి దారితీస్తుందనీ చెబుతున్నారు. - నిర్జర.
Publish Date: Mar 14, 2024 10:30PM

డబ్బు లోకానికి వైద్యం!

ఈ ప్రపంచంలో మనిషి బతకడానికి డబ్బు ఎంతో అవసరం. ఒకప్పటి కాలంలో మనిషి జీవితానికి ఇప్పటి మనిషి జీవితానికి తేడా గమనిస్తే కాలానుక్రమంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. వాటిలో కొన్ని ప్రాధాన్యతలు పెరిగాయి. మరికొన్ని తగ్గిపోయాయి. అలాంటి వాటిలో ప్రథమ స్థానంలో ఉండేది డబ్బు. ఒకప్పుడు డబ్బు మనిషి అవసరం. అంతకు ముందు కాలంలో డబ్బు అనేది అంతగా అవసరం లేకుండా ఉండేది. అన్నీ వస్తుమార్పిడి ద్వారా జరిగిపోయేవి. ఆ తరువాత కొన్నిటి విలువ పెరుగుతూ  ఉన్నప్పుడు, చాలా వస్తువులు అరుదుగా మారిపోయినప్పుడు వాటిని డబ్బుకు అమ్మడం ఆ డబ్బుతో అవసరం అయిన వేరేవి కనుక్కోవడం చేసేవారు. ఆ డబ్బును క్రమంగా పొదుపు చేయడం మొదలుపెట్టాకా వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతుండగా డబ్బు ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది. అలా మొదలైన డబ్బు ప్రస్థానం నేడు డబ్బే లోకంగా బతుకుతున్న మనుషులను తయారుచేసింది. డబ్బుకు లోకం దాసోహం అన్నా, డబ్బెవరికి చేదు అన్నా అదంతా డబ్బును మనుషులు చూస్తున్న కోణం ఆధారంగా చెప్పిందే. అసలు ఎందుకింత ప్రాధాన్యత! మనుషులు కరెన్సీ కాగితాలలో తమ జీవితాలను మెరుగ్గా చూసుకోవడం మొదలుపెట్టాకా ఆ కాగితాల హవా పెరిగిపోయింది. క్రమంగా మనిషి కష్టాన్ని కూడా ఆ కాగితాలు శాసించే స్థాయికి చేరాయి. ఫలితంగా  శ్రమదోపిడి వ్యవస్థ అంతకంతకూ పెరుగుతూ పోయింది. ఇక ప్రస్తుతం గురించి చెబితే కాగితాల వల్లనే మర్యాద, గౌరవం కూడా పొందుతున్న వాళ్ళు, ఆ డబ్బు వల్లనే గౌరవం, మర్యాద ఇస్తున్నవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఫలితంగా డబ్బు చుట్టూ లోకం తిరుగుతూ ఉంది,  చేస్తున్న తప్పులు? మనుషులు ఒక తప్పుకు అలవాటు పడిపోయారు. అదేంటంటే మనిషిలో ఆలోచనను విజ్ఞానాన్ని పెంపొందించే విద్యను ఆదాయవనరుగా మార్చడం ఒకటైతే, ఆ చదువుతోనే డబ్బు సంపాదన సాధ్యం అనుకునే ఆలోచన కూడా మరొకటి. నిజానికి పెరుగుతున్న అభివృద్ధి దృష్ట్యా మనిషి ఎన్నో రకాల రంగాలలో ఎన్నో విధాలైన శిక్షణలు తీసుకోవడం వల్ల ఆయా రంగాలలో అవకాశాలు పొందగలుగుతున్నారు. అయితే ఎటు తిరిగి దాన్ని వృత్తిగా కాకుండా మనిషి జీవితాలకూ, ముఖ్యంగా మానసిక బంధాలను కూడా డబ్బుతో పోల్చి చూడటం మాత్రం ఎంతో దారుణమైన విషయం. ఇప్పటి కాలంలో అక్క, చెల్లి, తమ్ముడు, అమ్మ, నాన్న  ఇలాంటి రక్తసంబంధాలు కూడా డబ్బు ముందు వెలసిపోతున్నాయంటే అది డబ్బు తప్పు కాదు మనిషి తప్పు అని అందరికీ తెలుసు.  మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి అని చెప్పే కొందరు కూడా ఆ డబ్బు ఉన్నపుడు ఒకలా అది లేనప్పుడు మరొకలా ఉండటం చూస్తే నవ్వొస్తుంది కూడా. సుమతీ శతకకర్త బద్దెన అంటాడు…. సిరి దా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరి దా బోయిన బోవును కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!! సిరి అంటే డబ్బు. ఆ లక్ష్మీదేవి స్వరూపంగా చూస్తాం. ఆ డబ్బు కొబ్బరికాయలో నీళ్లు వచ్చి చేరినట్టు ఎంతో నిశ్శబ్దంగా వస్తుంది. ఆ తరువాత ఏనుగు వెలగపండు నోట్లో వేసుకుని లోపలి గుజ్జు ఎలా మాయం చేస్తుందో అలాగే డబ్బు కూడా వెళ్ళిపోతుంది.  డబ్బు వచ్చేవరకు ఎవరికీ ఎలాంటి ఆర్భాటాలు ఉండవు. కానీ ఆ డబ్బు చప్పుడు అవ్వగానే బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టే అవుతుంది పరిస్థితి. ఆ తరువాత డబ్బు అయిపోయాక కాళీ వెలగపండులా ఏమిలేకుండా అయిపోతుంది పరిస్థితి. మరి అలా వచ్చి మనిషిని వ్యామోహాలకు లోను చేసి ఆ తరువాత విసిరేసినట్టు చేసే డబ్బుకు మనుషులు ఇంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరమా?? అని ఆలోచిస్తే తమ పిల్లలకు డబ్బే లోకం కాదు ఈ లోకం ఎంతో ఉంది అని అనుభవపూర్వకంగా తెలియజేప్తు ఉంటే కుటుంబాలు బాగుంటాయి. డబ్బుకు కూడా విలువ ఇచ్చినట్టే.  నిజం!! డబ్బును ఆశించడం తప్పు కాదు కానీ, దాన్ని ఎలా వాడాలో అలా వాడుకున్న వాడికి ఆ డబ్బు కూడా  తన పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తూ ఉంటుంది. ◆ వెంకటేష్ పువ్వాడ.
Publish Date: Mar 13, 2024 8:30PM