Publish Date:Jan 26, 2016

EDITORIAL SPECIAL
  మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు తయారైంది హైదరాబాదీయుల పరిస్థితి. ఆర్టీసీ సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ ప్రజలకు మరో షాక్ తగిలింది. బస్సుల బంద్ తో ఇబ్బందులు పడుతున్న నగర వాసులకు క్యాబ్ డ్రైవర్లు ఝలక్ ఇచ్చారు. డిమాండ్ల సాధన కోసం ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. దాంతో ఒకవైపు తెలంగాణ బంద్... మరోవైపు క్యాబ్ డ్రైవర్ల సమ్మెతో... రాష్ట్రం మొత్తం స్తంభించనుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో 50వేలకు పైగా క్యాబ్ లు నిలిచిపోనుండటంతో నగరంలో ప్రధాన రవాణా వ్యవస్థ దాదాపు ఆగిపోనుంది. క్యాబ్ సంస్థలు పెద్దఎత్తున లీజు వాహనాలను పెంచేశాయి. దాంతో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది. దాంతో అప్పులు చెల్లించలేక క్యాబ్ డ్రైవర్లు రోడ్డునపడుతున్నారు. అందుకే, ప్రతి డ్రైవర్ కు కనీస బిజినెస్ గ్యారంటీ ఇవ్వాలంటూ ఓలా, ఊబర్ క్యాబ్ సర్వీస్ సంస్థలను కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్యాబ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని, లేదంటే తమ డిమాండ్లు పరిష్కారమయ్యేవరకు సమ్మెను ఆపేది లేదని క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ తెగేసి చెప్పింది. ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన తెలంగాణ బంద్ కు క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ మద్దతు ప్రకటించింది. ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హైదరాబాదీలకు... ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లు కూడా సమ్మె బాటపట్టడంతో... కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి. ఎందుకంటే ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా నగరవాసులు... ఎక్కువగా క్యాబ్ లనే ఆశ్రయిస్తుంటారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లాలన్నా... అక్కడ్నుంచి రావాలన్నా... క్యాబ్ లే ఆధారం. ఇక ఐటీ ఉద్యోగులు కూడా ఎక్కువగా క్యాబ్ లపైనే ఆధారపడుతుంటారు. దాంతో క్యాబ్ డ్రైవర్ల సమ్మెతో హైదరాబాద్ లో ప్రధాన రవాణా వ్యవస్థ దాదాపు స్తంభించినట్లవుతుంది. అయితే, ఆటో డ్రైవర్లు కూడా సమ్మె బాటపట్టే అవకాశముండటంతో.... కేవలం మెట్రో అండ్ ఎంఎంటీఎస్ మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.
  తెలుగుదేశానికి కృష్ణాజిల్లాలో మరో భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ టీడీపీ వీడతారనే ప్రచారం జరుగుతోంది. రెండు నెలల క్రితమే ఈ మాట వినిపించినప్పటికీ, ఈ మధ్య చంద్రబాబు పిలుపునిచ్చిన ఛలో ఆత్మకూరు ఆందోళనలో ఫుల్ యాక్టివ్ గా పాల్గొనడంతో... పార్టీ మారే ఆలోచనను దేవినేని అవినాష్ విరమించుకున్నారేమోనన్న టాక్ వినిపించింది. అయితే, దేవినేని అవినాష్ పార్టీ మారతారంటూ మళ్లీ ప్రచారం ఊపందుకుంది. తాజాగా దేవినేని అవినాష్.... టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో సమావేశమైనట్లు తెలుస్తోంది. దాంతో త్వరలోనే అవినాష్ వైసీపీలో చేరడం ఖాయమంటున్నారు. అవినాష్ తండ్రి దివంగత దేవినేని నెహ్రూకి కృష్ణాజిల్లాలో రాజకీయంగా పట్టుంది. జిల్లావ్యాప్తంగా దేవినేని కుటుంబానికి అభిమానులు, అనుచరులు ఉన్నారు. దేవినేని నెహ్రూ కుమారుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన అవినాష్ ... అతి తక్కువ సమయంలోనే యూత్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీచేసి వార్తల్లో నిలిచారు. ఇక, 2019లో గుడివాడ నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన అవినాష్.... ప్రస్తుత మంత్రి కొడాలి నానికి గట్టిపోటీనిచ్చారు. నువ్వానేనా అన్న స్థాయిలో దడ పుట్టించారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ఘోర పరాజయంతో అవినాష్ చూపు వైసీపీ వైపు మళ్లింది. అసలు ఎన్నికలకు ముందు అవినాష్ ... వైసీపీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, అనూహ్యంగా టీడీపీలో చేరారు. ఇక, కొడాలి నానికి దీటైన అభ్యర్ధిగా అవినాష్ ను భావించిన చంద్రబాబు... గుడివాడ నుంచి బరిలోకి దింపారు. అయితే, వైసీపీలో హోరుగాలిలో అవినాష్ ఓటమి పాలైనా... యూత్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.   ఇక, దేవినేని నెహ్రూ కుటుంబానికి వైఎస్ ఫ్యామిలీతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దేవినేని నెహ్రూ... ఆ తర్వాత ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. దేవినేని నెహ్రూ... వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యే కావడమే కాకుండా ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగానూ పనిచేశారు. అయితే, 1995 ఎపిసోడ్ తర్వాత కాంగ్రెస్ లో చేరి, వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు. అలాగే, వైఎస్ ఫ్యామిలీతో దేవినేని నెహ్రూ కుటుంబానికి సత్సంబంధాలు ఉండటంతో... అవినాష్ వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ దేవినేని అవినాష్... వైసీపీలో చేరితే అది టీడీపీ నష్టమేనని చెప్పాలి. ఎందుకంటే దేవినేని నెహ్రూ కుటుంబానికి కృష్ణాజిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున అనుచరులు, అభిమానులు ఉన్నారు. వాళ్లంతా అవినాష్ వెంట నడిచే అవకాశముంది.
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా తయారైంది ఏపీలో సీఎం ఆర్ఎఫ్ బాధితుల పరిస్థితి. ప్రాజెక్టుల్లో రివర్స్ టెండర్ల తో సొమ్ము ఆదా చేసినట్టు ప్రజల ఆరోగ్య విషయంలోనూ అదే చేస్తున్నట్టు కనిపిస్తుంది. పాత వారికి డబ్బులు జమ చేయకుండా కొత్త వారికి దరఖాస్తులు చూడకుండా ప్రభుత్వం వారితో ప్రాణాలతో చెలగాటమాడుతోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు దాటినా ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి నామ మాత్రం గానే బాధితులకు సొమ్ము విడుదల చేస్తోంది. ఇతర ప్రాజెక్టుల మాదిరిగా ఇక్కడ కూడా రివర్స్ పద్ధతిని పాటిస్తున్నట్లు కనబడుతుంది. గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తులను మళ్లీ తనిఖీ చేస్తున్నామంటూ కాలయాపన చేస్తోంది. దీంతో రిలీఫ్ పండ్ సెక్షన్ లో సుమారు ముప్పై మూడు వేల దరఖాస్తులు నూట యాభై కోట్ల బిల్లులు పెండింగ్ లో పడిపోయాయి. గత ప్రభుత్వం తన మన అని చూడకుండా సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎల్వోసీలోని ఉదారంగా అందించింది. కొత్త ప్రభుత్వం అంత కంటే ఎక్కువే చేస్తుందని ప్రజలు ఆశించారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి నాలుగు నెలలుగా ప్రతి రోజూ మూడు వందల నుంచి నాలుగు వందల దరఖాస్తుల సీఎంఆర్ఎఫ్ వస్తున్నాయి. అధికారులు వాటి అన్నింటినీ పక్కన పడేస్తున్నారు. జూన్ ఒకటి నుంచి అక్టోబర్ వరకు పదమూడు వేల సీఎం ఆర్ కు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. వీటి విలువ సుమారు డెబ్బై కోట్లని అంచనా. ఇవి కాకుండా టీడీపీ ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు వచ్చిన పద్దెనిమిది వేల దరఖాస్తులను కొత్త ప్రభుత్వం పెండింగ్ లో ఉంచింది. వీటి విలువ కూడా అరవై ఐదు కోట్ల పైనే ఉంటుంది. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పటి వరకు వెయ్యి దరఖాస్తులను మాత్రమే క్లియర్ చేస్తుంది.వీటిలో ఐదు వందల నుంచి ఆరు వందల దరఖాస్తులకు మాత్రమే చెక్కులు అందించింది.ఆ చెక్కులు కూడా బాధితుల అకౌంట్ లలో జమ కాలేదని తెలుస్తోంది. దరఖాస్తులను ఇంకా వాయిదాలో ఉండటంతో  బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది జిల్లాల్లో ఎమ్మెల్యేల కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. దీంతో ఎమ్మెల్యే లు సీఎం కార్యాలయం పై ఒత్తిడి తెస్తున్నారు ఫలితంగా నియోజకవర్గాని కి యాభై దరఖాస్తుల చొప్పున క్లియర్ చేసేందుకు అధికారులు ఆమోదం తెలిపారు. అయితే ఎమ్మెల్యేలు పేద ప్రజలను వదిలేసి తమ బంధువుల అనుంగు సహచరులు దరఖాస్తులు మాత్రమే నిశ్చితం చేయించుకుంటున్నారు. డబ్బుల్లేక నిధులు విడుదల చేయడం లేదా అంటే ప్రస్తుతం సుమారు ఎనభై కోట్ల నిధులు ఉన్నట్లు సమాచారం. వీటిని విడుదల చేయకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఐదు వేల మందికి ఇచ్చిన చెక్కు లను కూడా ఇప్పటి వరకు క్లియిర్ చేయకుండా ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. చెక్కులు చేతికి వచ్చిన బ్యాంకుల్లో డబ్బు లు జమ కాకపోవడం తో కొంత మంది బాధితులు ఆశలు వదిలేసుకున్నారు. ప్రస్తుత వాతావరణం చూసి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యా లు భయపడుతున్నాయి. సీఎంఆర్ఎఫ్ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియక ఆందోళన చెందుతున్నాయి. అందుకే రోగులకు లెటర్ లు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుతం చాలా ఆస్పత్రుల్లో ముప్పై నుంచి అరవై లక్షల వరకు ఎల్ వోసీలు బకాయిలున్నట్లు సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు పెట్టుకొని కొత్తగా రోగుల కు ఎల్ వోసీ నుంచి తాము అప్పులపాలు కాలేమని ప్రైవేటు ఆసుపత్రుల చేతులెత్తేస్తున్నాయి. ఇదే విషయాన్ని రోగులకు స్పష్టంగా వివరిస్తున్నాయి డబ్బులుంటే బిల్లు కట్టే వైద్యం చేయించుకోండి లేదంటే వెళ్లిపొమ్మని కటువుగా చెప్పేస్తున్నారు విధిలేక కొందరు రోగులు లక్షల్లో అప్పు లు చేసి వైద్యం చేయించుకుంటున్నారు ఇంకొంతమంది అనారోగ్యం తో యుద్ధం చేస్తున్నారు.ఇక జగర్ సర్కార్ ఏమి చేయ్యబోతోందో వేచి చూడాలి.
ALSO ON TELUGUONE N E W S
  తెలుగు నటీనటుల సంఘం 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' (మా)లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అధ్యక్షుడు సీనియర్ నరేశ్, ఆయన మద్దతుదారులు ఒక వర్గంగా, ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్, ఆయన మద్దతుదారులు ఇంకో వర్గంగా చీలిపోయారు. అధ్యక్షుడు నరేశ్‌ ప్రమేయం లేకుండా.. రాజశేఖర్, 'మా'కు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన భార్య జీవిత ఆదివారం 'మా' సమావేశాన్ని నిర్వహించడం వివాదాన్ని మరింత పెంచింది. వారం రోజుల క్రితం ఈ మీటింగ్ పెడుతున్నట్లు 'మా' సభ్యులకు జీవితా రాజశేఖర్ సమాచారం ఇవ్వడంతో, దీనిపై 'మా' సభ్యులు మాణిక్ రావ్, కుమారస్వామి కోర్టుకెళ్లారు. వాదనల అనంతరం.. ఆదివారం జరిపే సమావేశాన్ని 'జనరల్ బాడీ మీటింగ్'గా వ్యవహించవద్దని రాజశేఖర్‌కు కోర్టు సూచించినట్లు మాణిక్ తరపు న్యాయవాది తెలిపారు.  ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎన్నికల్లో సీనియర్ నరేశ్ ప్యానెల్ నుంచి నరేశ్, రాజశేఖర్, జీవిత వంటివాళ్లు గెలిచారు. నరేశ్ అధ్యక్షుడిగా, జీవిత ప్రధాన కార్యదర్శిగా, రాజశేఖర్ ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అయితే కార్యవర్గ సభ్యులుగా శివాజీరాజా ప్యానెల్‌కు చెందినవాళ్లు ఎక్కువమంది గెలిచారు. మార్చి 22న 'మా' కొత్త కార్యవర్గ ప్రమాణం చేస్తున్నప్పుడే ఒకే ప్యానల్‌లో ఉన్న నరేశ్, రాజశేఖర్ మధ్య విభేదాలు ఉన్నట్లు చూచాయగా బయటపడ్డాయి. నరేశ్ 'నేను' అంటూ పదే పదే ప్రస్తావిస్తూ.. అదంతా తన గెలుపుగా చెప్తుండటంతో, రాజశేఖర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా సభ్యులతో ఏమాత్రం చర్చించకుండా, కొన్ని సంక్షేమ కార్యక్రమాల్ని నరేశ్ సొంతంగా ప్రకటించడం కూడా చాలామందికి అసంతృప్తి కలిగించింది. అలా మార్చి 22నే 'మా'లో లుకలుకలు ఉన్నాయనే విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. 'మా' బాధ్యతలు చేపట్టాక ఏదో ఒక మంచి పనిచేసి చూపించాలని జీవిత, రాజశేఖర్ భావిస్తూ వస్తున్నారు. అయితే తనకున్న బిజీ షెడ్యూల్ వల్లనో, మరో కారణం చేతనో 'మా'కు నరేశ్ ఎక్కువ సమయం కేటాయించడం లేదనే ఆరోపణలు కొంతమంది సభ్యుల నుంచి వినిపిస్తున్నాయి. 'మా' మూలనిధిని పెంచకుండా, ఉన్నదాన్నే ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. కొద్ది రోజుల క్రితమే ఈ విషయాల గురించి తోటి సభ్యులతో జీవిత, రాజశేఖర్ చర్చించి, కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అయితే దానిపై నరేశ్ కోర్టుకెళ్లడంతో, ఆ నిర్ణయాల్ని అమలు చేయొద్దంటూ కోర్టు స్టే ఇచ్చింది.  దాంతో ఆదివారం ఒక 'ఫ్రెండ్లీ మీటింగ్'ను రాజశేఖర్ దంపతులు ఏర్పాటుచేశారు. దీని కోసం కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నారు కూడా. తమ ముందున్న సమస్యల విషయంలో 'మా' సభ్యుల అభిప్రాయాలు తెలుసుకొనే అవకాశం ఇవ్వమని కోరగా కోర్టు దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి అనుగుణంగా 'మా' సాధారణ సమావేశాన్ని ఏర్పాటుచేశామని, దానికి రావాల్సిందిగా సభ్యులకు జీవిత, రాజశేఖర్ సమాచారం పంపించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు మీటింగ్ జరిగింది. దీనికి మీడియాను అనుమతించలేదు. అయితే సమావేశం నుంచి మధ్యలో బయటకు వచ్చిన నటుడు పృథ్వీ చెప్పిన దాని ప్రకారం చూస్తే.. నరేశ్, రాజశేఖర్ రెండు వర్గాలుగా విడిపోయి వాడివేడిగా వాదోపవాదాలు చేసుకున్నారు. ఒక వర్గంపై మరో వర్గం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు.  'మా' ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయిన ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ 'మా' తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం జీవితా రాజశేఖర్ వర్గం నిర్వహించిన సమావేశాన్ని దౌర్భాగ్యకరమైన సమావేశమని దుయ్యబట్టారు. 'మా' ఈసీ పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. "నేను ఈసీ మెంబర్‌గా గెలిచానని ఆనందపడాలో, అనవసరంగా వచ్చానని బాధపడాలో అర్థం కావట్లేదు" అని ఆయన వాపోయారు. కొత్త బాడీ ఏర్పడి 8 నెలలు గడిచిపోయాయనీ, 'మా' కార్యవర్గంలోని ప్రతి ఒక్కరూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాగా ఫీలవుతున్నాడనీ ఆయన విమర్శించారు. "అర్జెంట్ మీటింగ్ అంటే.. నేను తిరుపతి నుంచి వచ్చాను. మీటింగ్ జరిగే తీరు చూస్తే.. దౌర్భాగ్యం అనిపించింది" అని ఆయన చెప్పారు. 400 సినిమాలకు మాటలు రాసిన తమ గురువు పరుచూరి గోపాలకృష్ణగారిని కూడా మాట్లాడనివ్వలేదనీ, ఆయన కళ్లెంట నీళ్లుపెట్టుకొని బయటకు వెళ్లడం ఫస్ట్ టైం చూశాననీ పృథ్వీ విచారం వ్యక్తం చేశారు. 'మా' కార్యవర్గాన్ని రద్దుచేసి, మళ్లీ ఎన్నికలు జరిపించడం ఒక్కటే ప్రస్తుతం సమస్యకు పరిష్కారంగా కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
  జనసేనాని పవన్ కల్యాణ్ మళ్లీ కెమెరా ముందు నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఆయన సినీ అభిమానుల్ని ఆనందడోలికల్లో ముంచెత్తుతోంది. మరోవైపు జనసైనికుల్లో తికమకను కలిగిస్తోంది. అవును. 2018 జనవరిలో వచ్చిన 'అజ్ఞాతవాసి' మూవీ తర్వాత పవన్ కల్యాణ్.. సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి పూర్తిస్థాయిలో రాజకీయాలకు అంకితమయ్యారు. ఈ ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తన పార్టీ జనసేనను పోటీలో నిలిపారు. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ముందు ఆయన పార్టీ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది.  175 అసెంబ్లీ సీట్లకు గాను కేవలం ఒకే ఒక్క సీటును దక్కించుకొంది. పవన్ కల్యాణ్ స్వయంగా రెండు సీట్లు.. భీమవరం, గాజువాకలో.. పోటీచేయగా, రెండు చోట్లా జనం ఆయనను ఓడించారు. ఇది నిజంగా ఆయనకూ, ఆయనను నమ్ముకొని జనసేనలో భాగమైనవారికీ షాక్ కలిగించింది. క్షేత్ర స్థాయిలో కేడర్‌ను బలోపేతం చెయ్యకపోవడం, ఒక వ్యూహం ప్రకారం ఎన్నికల ప్రచారం నిర్వహించకపోవడం వల్లే.. ఆయనా, ఆయన పార్టీ పరాభవాన్ని ఎదుర్కొన్నాయనేది ఎన్నికల పరిశీలకులు చైప్పిన మాట. క్రియాశీల రాజకీయాల్లో ఉన్నవాళ్లు నిత్యం జనంతో అనుసంధానమై, వాళ్ల కష్టాల్నీ, వాళ్ల సమస్యల్నీ తమవిగా చేసుకొని, వాళ్ల తరపున నిత్యం గొంతు వినిపిస్తేనే.. ప్రజలు కూడా వాళ్లకు మద్దతుగా నిలుస్తారు. అడపాదడపా, తమకు వీలైనప్పుడు మాత్రమే ప్రజా సమస్యలపై గళమెత్తి, కేవలం విమర్శలకే పరిమితమైతే.. ప్రజలు ఆ నాయకుల పక్షాన నిలవరు. ఎన్నికల్లో ప్రజా తీర్పు వచ్చిన తర్వాతే ఈ విషయం ఆయనకు బాగా అవగతమైంది. అందుకే ఎన్నికల్లో ఓటమి షాక్ నుంచి చాలా త్వరగానే తేరుకున్న ఆయన, జనసేన.. ప్రజల కోసం పనిచేస్తుందనీ, రాజకీయాల నుంచి తను తప్పుకొనే ప్రసక్తే లేదనీ తేల్చి చెప్పారు. అప్పటి నుంచీ ప్రజల సమస్యలమై మరింత ఎక్కువగా మాట్లాడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారనే ప్రచారం కొంత కాలం నుంచే నడుస్తోంది. అదే జరిగితే, 'జనసేన' పరిస్థితి ఏమిటనే ప్రశ్న అప్పట్నుంచే ఉత్పన్నమవుతూ వస్తోంది. 'జనసేన'కు పవన్ తప్ప మరో ఆధారం లేదు. ఆయన నిలిస్తేనే 'జనసేన' పార్టీ ఉంటుందనేది స్పష్టం. అలాంటప్పుడు ఆయన మళ్లీ సినిమాల్లోకి వస్తే, రాజకీయంగా 'జనసేన'కు నష్టం కలుగుతుందని ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకుడికి ఇమేజ్ కూడా ముఖ్యమే. నేరుగా రాజకీయాల్లోకి వెళ్లిన వాళ్ల స్థితి వేరు, సినిమాలు ఇచ్చిన మాస్ ఇమేజ్‌తో రాజకీయాల్లోకి వెళ్లడం వేరు. గతంలో తమిళనాడులో ఎమ్జీఆర్, జయలలిత, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్.. సినిమాలు తెచ్చిన ఇమేజ్‌తో ముఖ్యమంత్రులుగా ఎదిగారు. ఎమ్జీఆర్, జయలలిత.. ముఖ్యమంత్రులయ్యాక సినిమాలకు స్వస్తి చెప్పగా, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన తర్వాత విడుదలైన 'శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర' సినిమా బాక్సాఫీస్ రికార్డుల్ని బద్దలు కొట్టింది. ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయాక ఎన్టీఆర్ 'బ్రహ్మర్షి విశ్వామిత్ర', 'సమ్రాట్ అశోక', 'మేజర్ చంద్రకాంత్', 'శ్రీనాథ కవిసార్వభౌముడు' సినిమాలు చేశారు. తన ఇమేజ్‌ను కాపాడుకున్నారు. అంతెందుకు.. పవన్‌కు స్వయానా అన్న మెగాస్టార్ చిరంజీవి సైతం 'ప్రజా రాజ్యం' పార్టీని పెట్టి, రాజకీయాలకు విరామమిచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఆయన 'ప్రజా రాజ్యం' పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేశారు. తర్వాత కాంగ్రెస్ జమానాలో ఒకటిన్నర సంవత్సరం పైగా కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. కొన్నాళ్ల క్రితం నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ, మళ్లీ ముఖానికి రంగేసుకొని 2017లో 'ఖైదీ నంబర్ 150'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి నీరాజనాలు అందుకున్నారు. అంటే.. రాజకీయాల్లో లభించని ఆదరణను నటునిగా ఆయన తిరిగి పొందారు. ఇక ఇటీవల వచ్చిన 'సైరా.. నరసింహారెడ్డి' సినిమాలోనూ ఆయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనే నిర్ణయంపై పవర్‌స్టార్‌గా ఆయనను అభిమానించే ప్రేక్షకులు స్వాగతిస్తున్నారు. గతంలో ఆయనకు పవర్ స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన 'ఖుషి' సినిమాను నిర్మించిన శ్రీ సూర్యా మూవీస్ అధినేత ఎ.ఎం. రత్నం.. పవన్ రీ ఎంట్రీ మూవీని నిర్మించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక తన కెరీర్‌లో 'గమ్యం', 'వేదం', 'కృష్ణం వందే జగద్గురుం', 'కంచె', 'గౌతమిపుత్ర శాతకర్ణి' వంటి చక్కని సినిమాల్ని రూపొందించిన క్రిష్.. ఆ మూవీని డైరెక్ట్ చేస్తాడని చెబుతున్నారు. అయితే ఈ ఏడాది ఆరంభంలో బాలకృష్ణతో తీసి రెండు భాగాల ఎన్టీఆర్ బయోపిక్.. 'యన్.టి.ఆర్: కథానాయకుడు', 'యన్.టి.ఆర్: మహానాయకుడు' సినిమాలు రెండూ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో.. క్రిష్ డైరెక్షన్ విషయంలో పవన్ ఫ్యాన్స్ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  ఏదేమైనా క్రిష్ డైరెక్షన్‌లో చేసే మూవీతో పాటు వెంటవెంటనే మరో రెండు సినిమాలు చెయ్యడానికీ పవన్ కల్యాణ్ సుముఖంగా ఉన్నారనేది ఆయన కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న మాట. రెండేళ్ల విరామంతో మళ్లీ కెమెరా ముందుకు రానున్న పవన్‌కు ప్రేక్షకులు ఎలాంటి స్వగతాన్ని పలుకుతారో చూడాలి.
  దాసరి నారాయణరావు కీర్తి కిరీటంలో మకుటాయమైన మణుల్లో 'గోరింటాకు' సినిమా ఒకటి. కఠిన హృదయాల్ని కూడా ద్రవింపజేసే కథకు, శోభన్‌బాబు, సుజాత అద్వితీయ నటన తోడై, 'గోరింటాకు'ను మరపురాని చిత్రాల్లో ఒకటిగా నిలిపింది. అక్టోబర్ 19తో ఆ సినిమా విడుదలై సరిగ్గా నలభై ఏళ్లు. అంటే 1979లో ఆ తేదీన విడుదలైంది. అప్పటి సుప్రసిద్ధ రచయిత్రుల్లో ఒకరైన కె. రామలక్ష్మి అందించిన కథను దాసరి సెల్యులాయిడ్‌పైకి తీసుకొచ్చిన తీరు అమోఘం. ఉదాత్త హృదయం కలిగిన ఇద్దరు యువతీ యువకులు ఒకరినొకరు ప్రేమించి కూడా, ఆ విషయాన్ని వ్యక్తం చేసుకోకపోవడం వల్ల ఎలాంటి అనర్థాలు జరిగాయి, వాళ్ల జీవితాలు ఏ తీరానికి చేరాయనే కథకు, 'గోరింటాకు' స్వభావాన్ని అద్ది ఈ చిత్రాన్ని దాసరి నారాయణరావు రూపొందించారు. గోరింటాకు ఎదుటివాళ్ల చేతుల్ని పండించి తాను రాలిపోతుంది. అలాంటి స్వభావాన్ని ఈ కథలో స్వప్న చూపిస్తుంది. చిన్నతనంలోనే తాగుబోతు తండ్రి దాష్టీకాల్ని తట్టుకోలేక ఇల్లు విడిచి, ధర్మసత్రంలో ఉంటూ అష్టకష్టాలు పడుతున్న రామును స్వప్న ఆశ్రయం కలిపిస్తుంది. అతడికి చేదొడు వాదోడుగా ఉంటూ, అతడు మెడిసిన్ పూర్తి చేయడానికి తోడ్పడుతుంది. ఈ క్రమంలో ఇద్దరినొకరు ఆరాధించుకుంటారు. కానీ ఇది తెలియని స్వప్న తండ్రి ఆమెకు ఒక పెద్దింటి సంబంధాన్ని చూస్తాడు. రాము కూడా దానికి ఆమోదముద్ర వేయడంతో మనసు చంపుకొని ఆనంద్‌ను పెళ్లాడుతుంది స్వప్న. కానీ అతడింటికి వెళ్లినరోజే, అతడికి అదివరకే పెళ్లయ్యిందనీ, ఒక కూతురు కూడా ఉందనీ తెలిసి హతాశురాలవుతుంది. ఆ మొదటి భార్యకు అన్యాయం జరగకూడదని ఆమె పక్షాన నిలిచి, వాళ్లిద్దర్నీ కలిపి,  ఆనంద్ కట్టిన తాళి తెంపి, పుట్టింటికి వచ్చేస్తుంది. ఈలోగా విరిగిన మనసుతో ఉన్న రాముకు పొరుగునే ఉన్న పద్మ అనే మానసిక స్థితి సరిగాలేని యువతి పరిచయమవుతుంది. పెళ్లిరోజే, ఆమె చేసుకోబోయిన వరుడు కారు ప్రమాదంలో చనిపోవడంతో ఆమె డిప్రెషన్‌కు గురవుతుంది. ఆమెను మామూలు మనిషిని చేయడమే కాకుండా, ఆమెకు మనసిచ్చి, జీవితాన్ని కూడా పంచుకోవాలనుకుంటాడు రాము. అదే సమయంలో రాము రాసిన డైరీని స్వప్న తండ్రి, స్వప్న ఇద్దరూ చదివి, అతడి మనసేమిటో తెలుసుకుంటారు. స్వప్న ప్రేమ కొత్త చిగుళ్లు వేస్తుంది. క్లాస్‌మేట్ ద్వారా స్వప్న తనను ప్రేమించిందనే సంగతి రాముకూ తెలుస్తుంది. స్వప్నకు జీవితాన్ని ప్రసాదించాల్సిందిగా రాము అర్థిస్తాడు స్వప్న తండ్రి. పద్మకు విషయం వెల్లడించి, ఆమె సూచనతో స్వప్నతో పెళ్లికి సిద్ధపడతాడు రాము. కానీ రాము, పద్మల ఉదంతం తెలుసుకున్న స్వప్న, తన ప్రేమను త్యాగంచేసి, వాళ్లిద్దర్నీ ఒకటిచేస్తుంది. సినిమాలో ఎన్ని సందర్భాల్లో మన కళ్లళ్లో నీళ్లు తిరుగుతాయో! సినిమా పూర్తయ్యేసరికి మన హృదయం బరువెక్కిపోతుంది. స్వప్న పాత్రకు న్యాయం జరిగివుంటే బాగుండుననిపిస్తుంది. కథ నడిచేది రాము ప్రాత్ర చుట్టూ అయినా, స్వప్న పాత్ర దానికంటే బలమైనది. సొంత వ్యక్తిత్వం ఉన్న స్త్రీగా, తాళికట్టిన భర్త చేసిన మోసాన్ని ప్రశ్నించి, ఆ తాళిని తెంచి, తనలాగే మోసపోయిన అతని మొదటి భార్యకు న్యాయం చేసిన ధీరోదాత్తురాలిగా, తను మనసిచ్చిన వాడిని మరో యువతి కోరుకుతున్నదని తెలిసి, ఆ ఇద్దర్నీ కలపడమే న్యాయమని భావించిన త్యాగశీలిగా స్వప్న పాత్రలో సుజాత నటన అపూర్వం. ఆమె హావభావాలు, ఆమె బాడీ లాంగ్వేజ్, ఆమె పలికే మాటలతో మనం ఆమెకు దాసోహమైపోతాం. చిన్నతనం నుంచే కష్టాల కడలిలో పెరిగి, స్వప్న ఇచ్చిన ఆశ్రయంతో మెడిసిన్ పూర్తిచేసి, డాక్టర్‌గా మారి, స్వప్నపై ప్రేమను వెల్లడించలేక, ఆమె మరొకర్ని మనువాడుతుంటే, మౌనంగా బాధపడి, మానసిక స్థైర్యం లోపించిన మరో యువతిని బాగుచేసి, ఆమెకు తోడుగా నిలవాలని నిర్ణయించుకొనే ఉదాత్తుడు రాము పాత్రలో శోభన్‌బాబూ గొప్పగా రాణించారు. సెకండాఫ్‌లో వచ్చే సెకండ్ హీరోయిన్ పద్మ పాత్రలో వక్కలంక పద్మ ఫర్వాలేదనిపిస్తుంది. ఈ సినిమాలో శోభన్‌బాబు తల్లిగా మహానటి సావిత్రి నటించారు. అందంతో, తనకే సాధ్యమైన గొప్ప నటనతో మన హృదయాల్లో చిరస్థాయి స్థానం పొందిన మహానటిని ఆ పాత్రలో అలా చూడాల్సి రావడం బాధనిపిస్తుంది. అప్పటికే శారీరకంగా ఆమె దుర్బలురాలైనట్లు ఆమె రూపం తెలియజేస్తుంది. తాగుబోతు భర్తతో నానా అగచాట్లూ పడే స్త్రీగా ఆమ పాత్ర కంటతడి పెట్టిస్తుంది. ఆమె భర్తగా జె.వి. రమణమూర్తి తన పాత్రకు తగ్గ నటన చూపించి, ఆ పాత్రపై మనకు అసహ్యం కలిగేలా చేశారు. స్వప్న తండ్రిగా ప్రభాకరరెడ్డి ఉన్నత స్థాయి నటన కనపరిచారు. సినిమాలో రిలీఫ్ పాయింట్ అనదగ్గ పాత్రలు చలం, రమాప్రభ జోడీది. ఆ ఇద్దరూ తెరపై కనిపించిన ప్రతిసారీ మన ముఖాలపై నవ్వులు పూస్తాయి. ఈ సినిమాలో రాము చిన్నతనం సన్నివేశాలన్నింటినీ డైరెక్టర్ దాసరి బ్లాక్ అండ్ వైట్‌లో చిత్రీకరించడం గమనార్హం. చిన్నప్పటి రాముగా సాయికుమార్ తమ్ముడు, 'బొమ్మాళీ' రవిశంకర్ కనిపించి మెప్పించాడు. రాము పెద్దవాడయ్యాక కలర్ మూవీ మొదలవుతుంది. సినిమాలో అత్యంత పాపులర్ సాంగ్ అయిన టైటిల్ సాంగ్ 'గోరింట పూచింది కొమ్మా లేకుండా'ను బ్లాక్ అండ్ వైట్‌లో సావిత్రిపైనే దర్శకుడు చిత్రీకరించాడు. ఆ పాటను రాసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి. దానితో పాటు 'ఎలా ఎలా దాచావు అలవికాని అనురాగం' పాటనూ ఆయనే రచించారు. 'పాడితే శిలలైనా కరగాలి', 'చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివీ', 'యేటంటావ్ యేటంటావ్' పాటల్ని ఆత్రేయ రాస్తే, 'కొమ్మ కొమ్మకో సన్నాయి' పాటను వేటూరి రచించారు. 'ఇలాగ వచ్చి అలాగ తెచ్చి' పాటను రాసింది శ్రీ శ్రీ. పాటలన్నీ సూపర్ హిట్టే. కె.వి. మహదేవన్ స్వరాలు కూర్చిన ఈ పాటలన్నీ జనాల నాలుకలపై నర్తించినవే. అప్పటికే అభిరుచి కలిగిన నిర్మాతగా యువ చిత్ర అధినేత కె. మురారికి మంచి పేరు ఉంది. 'గోరింటాకు' సినిమా నిర్మాతగా ఆయనకూ, దర్శకుడిగా దాసరికీ ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన ఈ మూవీ థియేటర్లలో రజతోత్సవం జరుపుకుంది.
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'దర్బార్'. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాలో రజనీకి జోడీగా నయనతార నటిస్తున్నారు. నయనతారతో పాటు 'దర్బార్'లో మరో హీరోయిన్ కూడా ఉన్నారు. తెలుగులో 'జెంటిల్‌మన్', 'నిన్ను కోరి' సినిమాల్లో నానికి జోడీగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'జై లవ కుశ'లో ఒక హీరోయిన్‌గా నటించిన నివేదా థామస్. రజనీకి కుమార్తెగా నటిస్తున్నారామె. నయనతార, నివేదా థామస్ కాకుండా సినిమాలో మరో హీరోయిన్ ఉన్నారు. ఆమె పేరు షమత అంచన్. హిందీలో ఆశుతోష్ గోవారికర్ షో 'ఎవరెస్ట్', కామెడీ డ్రామా 'బిన్ కుచ్ కాహే'లో నటించింది. 'దర్బార్'లో రజనీతో పాటు ఉండే ఓ పాత్ర చేసింది. ముంబైలో 40 రోజుల పటు షూటింగ్ చేసింది. అయితే తన క్యారెక్టర్ ఏంటనేది షమత అంచన్ బయటకు చెప్పడం లేదు. చాలా సంవత్సరాల తరవాత రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్న చిత్రమిది. సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
'నేల టికెట్'తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి రవితేజ పరిచయం చేసిన హీరోయిన్ మాళవికా శర్మ. తెలుగులో తొలి సినిమా ప్లాప్ కావడంతో ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మకు మరో అవకాశం ఏదీ రాలేదు. ఏడాది తర్వాత మాళవికా శర్మకు మరో అవకాశం వచ్చింది. ఆమెకు యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ ఛాన్స్ ఇచ్చాడు. 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' తర్వాత రామ్ దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోంది. తమిళ క్రైమ్ థ్రిల్లర్ 'తడమ్'కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవికా శర్మ ఒక హీరోయిన్. 'చిత్రలహరి' ఫేమ్ నివేదా పేతురాజ్ మరో హీరోయిన్. ఆల్మోస్ట్ స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. దర్శకుడు కిషోర్ తిరుమల లొకేషన్స్ ఫైనలైజ్ చేసే పనుల్లో ఉన్నారట. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్ పెదనాన్న స్రవంతి రవికిశోర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' విజయం తర్వాత రామ్ నటిస్తున్న చిత్రమిది. అది మాస్ సినిమా అయితే... ఇది కొంచెం క్లాస్ టచ్ ఉన్న సినిమా.
  ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్ధన్, కలెక్టర్ దివ్య దేవరాజన్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఛైర్మన్ సంచలన కామెంట్లు చేశారు. జిల్లాలో ప్రజా ప్రతినిధులకు ‌ఎలాంటి పనులూ కావడం లేదని, దీనికి‌ కలెక్టర్ దివ్యదేవరాజన్ కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఆమెపై తిరుగుబాటు చేయాలని జెడ్పీటీసీలకు ఛైర్మన్ పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది. ప్రజాప్రతినిధులకు ఎలాంటి అధికారాలూ ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు జెడ్పీ ఛైర్మన్. జిల్లా పాలన మొత్తం, కలెక్టర్ కనుసన్నల్లో నడుస్తోందన్నారు. కనీసం పట్టా పాస్ ఇప్పించలేకపోతున్నామని వాపోయారు. పనులు చేయలేని పదవులు మాకెందుకన్న జనార్ధన్, ప్రజాప్రతినిధుల అధికారాలపై కలెక్టర్ పెత్తనమేంటని మండిపడ్డారు. కనీసం, విరాసత్, పట్టాపాస్ ఇవ్వడాన్నీ కలెక్టర్ పట్టించుకోవడంలేదని వాగ్భాణాలు సంధించారు. కలెక్టర్‌పై తిరుగుబాటు చేయాలని జెడ్పీ ఛైర్మన్‌ ఏకంగా పిలుపునిచ్చారు. అయితే భయపడేది లేదంటోన్న కలెక్టరమ్మ దేనికైరా రెడీ అంటున్నారు. దాంతో ఆదిలాబాద్‌లో కలెక్టర్‌ వర్సెస్ జడ్పీ చైర్మన్‌ కోల్డ్‌ వార్, రోజురోజుకు ముదురుతున్నట్టు కనిపిస్తోంది. కలెక్టర్ దివ్య దేవరాజన్ ఏజెన్సీ చట్టాలను‌ తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. ఇది జెడ్పీ ఛైర్మన్ కు నచ్చడం‌ లేదట. అదే ఇద్దరి మధ్య గొడవకు కారణమైందట. ఆదివాసీల భూములను, ఒక సామాజికవర్గ నేతలు ఆక్రమించారన్న ఆరోపణలున్నాయి. రికార్డులన్నీ ఆదివాసీల పేరిట ఉన్నా, నిబంధనలకు విరుద్ధంగా ఒక సామాజికవర్గానికి‌ పట్టాలు కట్టబెట్టడానికి ప్రయత్నించారని, విపక్షాల నుంచీ విమర్శలున్నాయి. అయితే, చట్ట ప్రకారం నడుచుకోవాలని, నిబంధనల్ని పక్కాగా అమలు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఇదే జెడ్పీ ఛైర్మన్‌కు నచ్చక, ఎదురుదాడికి దిగుతున్నారన్న ప్రచారం సాగుతోంది. అదేవిధంగా ఏజెన్సీ సర్టిఫికెట్ల జారీ విషయంలో కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారన్నది జడ్పీ ఛైర్మన్‌ అభ్యంతరం. ఇటీవల నియమాకాలు జరిగిన ఫారెస్ట్ అండ్ జూనియర్‌ పంచాయితీ సెక్రటరీ ఉద్యోగాలను అర్హులైనవారికి వచ్చేలా ‌కలెక్టర్  చర్యలు తీసుకున్నారు. దాంతో భోగస్ ఏజెన్సీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు దక్కించుకోవాలనుకున్న వారి ఆశలు గల్లంతయ్యాయి. చట్టాలు అమలు చేయడం, ఏజెన్సీ సర్టిఫికెట్ల విషయంలో నిబంధనలు పాటించడమే కలెక్టర్‌ తప్పయినట్టుగా వీరంతా చిత్రీకరిస్తున్నారు. దీనివల్ల అక్రమార్కులకు అడ్డుకట్ట పడిందట. అయితే ఎవరికి ఉద్యోగాలు, ఏజెన్సీ సర్టిపికెట్లు దక్కలేదో వారి కోసం కలెక్టర్‌పై విమర్శలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆదిలాబాద్ అట్టుడికిన సమయంలో పాలనా వ్యవహారాలను చక్కదిద్దారని మంచి గుర్తింపు తెచ్చుకున్న కలెక్టర్‌పై, అనవసరమైన కామెంట్లు చేస్తున్నారని జనం మాట్లాడుకుంటున్నారు. చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న కలెక్టర్‌పై... జడ్పీ ఛైర్మన్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు చేస్తున్న అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఈసడించుకుంటున్నారు. రహస్య అజెండాతోనే ఛైర్మన్, ఆయన బృందం బహిరంగ వ్యాఖ్యలు చేస్తోందని, విపక్ష నేతలు మండిపడుతున్నారు. చట్టం ప్రకారం నడుచుకుంటున్న కలెక్టర్‌ను అభినందించాల్సిందిపోయి, తమకు అనుకూలంగా నడుచుకోవడం లేదన్న అక్కసుతో నేతలు విమర్శలు చేస్తున్నారని, ప్రతిపక్ష నాయకులు ఫైరవుతున్నారు. అవినీతి, అక్రమాలకు మడుగులొత్తాలని భావించడం సరికాదంటున్నారు. ఎవరేమనుకున్నా, ఎన్ని విమర్శలు ఎదురైనా, కలెక్టర్‌ చట్టం ప్రకారమే నడుచుకోవాలని, ఎవరికీ బెదరాల్సిన అవసరంలేదని ప్రజాస్వామ్యవాదులంటున్నారు.
  ఒకవైపు ఆర్టీసీ సమ్మె, ఇంకోవైపు కేసీఆర్‌ సభ వర్షార్పణం కావడంతో, టెన్షన్‌ పట్టుకున్న టీఆర్ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డికి, మరో ఇద్దరు తెగ టెన్షన్‌ పెడుతున్నారు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు ప్రధాన పోటీ కాంగ్రెస్ నుంచే అయినప్పటికీ... ఓట్ల చీలికతో బీజేపీ, టీడీపీ కూడా ఎంతోకొంత టెన్షన్ పెడుతున్నాయి. అయితే, ప్రధాన పార్టీలే కాకుండా, ఇండిపెండెంట్లు కూడా టీఆర్ఎస్ అభ్యర్ధి గుండెల్లో గుబులురేపుతున్నారు. అసలు, వారిద్దరూ అసలు పోటీ కాకపోయినా, వారి గుర్తులు మాత్రం తెగ టెన్షన్ పెట్టిస్తున్నాయి. రోడ్ రోలర్, ట్రాక్టర్... ఈ రెండు గుర్తులూ దాదాపు టీఆర్ఎస్ సింబల్ కారును పోలి ఉంటాయి. ఈ రెండు గుర్తులే ఇప్పుడు టీఆర్ఎస్‌ను తెగ టెన్షన్‌ పెడుతున్నాయి. హుజూర్‌ నగర్‌లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తులు కేటాయింది ఎన్నికల సంఘం. అదీ కూడా జాబితాలో టీఆర్ఎస్‌ కారు గుర్తు తర్వాత అవే ఉండటం, అధికారపక్ష అభ్యర్థిలో మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు వల్ల నష్టపోయామని, నిరక్షరాస్యులు, వృద్ధులు పొరపడి ట్రక్కు గుర్తుకు ఓటేయడంతో... పదివేల ఓట్లు పడ్డాయని, అందువల్లే టీఆర్ఎస్ ఓడిపోయిందని  అంటున్నారు. ఇప్పుడు హుజూర్ ‌నగర్‌ బైపోరులోనూ టీఆర్ఎస్‌ అభ్యర్థికి అలాంటి దిగులే పట్టుకుందట. హుజూర్ ‌నగర్‌ బైపోల్ బరిలో మొత్తం 28మంది అభ్యర్థులున్నారు. ఇందులో అధికార టీఆర్ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డికి, నాలుగో నెంబర్‌ అలాట్ చేశారు. ఆయన తరువాత ఐదో నంబర్‌లో రైతుబిడ్డ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అజ్మీర మహేశ్‌ కి... ట్రాక్టర్‌ నడిపే రైతు సింబల్‌ను... అలాగే ఆరో నంబరులో రిపబ్లిక్‌ సేన తరఫున పోటీ చేస్తున్న నిలిచిన వంగపల్లి కిరణ్‌కు రోడ్డురోలర్‌ గుర్తును కేటాయించింది ఎలక్షన్‌ కమిషన్. ఈ రెండు గుర్తులూ కారు గుర్తుకు దగ్గరి పోలికలతో ఉండటంతో, తమకు పడాల్సిన ఓట్లు ఇతరులకు పడతాయేమోనని టెన్షన్‌ పడుతున్నారు గులాబీ నేతలు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కారును పోలిన ఆటోరిక్షా, లారీ చిహ్నాలు ఎవరికీ ఇవ్వవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ ను కోరింది. అయితే ఇప్పుడు ఆ గుర్తులను అయితే ఈసీ కేటాయించలేదు. కానీ తాజాగా హుజూర్ నగర్ లో కారును పోలిన రోడ్ రోలర్, ట్రాక్టర్ గుర్తులు మాత్రం ఇద్దరు స్వతంత్రులు దక్కించుకున్నారు. దీంతో అధికారపక్షాన్ని గుర్తుల భయం వెంటాడుతోంది. ఇక గతంలోనూ టీడీపీ ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంది. సైకిల్ ను పోలిన బైక్ గుర్తు, ఆ పార్టీని దెబ్బతీసింది. చాలా కష్టపడి ఈసీతో ఫైట్ చేసి బైక్ గుర్తును ఎన్నికల్లో నిషేధించింది టీడీపీ. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా తన కారు గుర్తు పోలిన గుర్తులపై పోరాటం మొదలెట్టింది. మొన్నటి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కీలక స్థానాల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది. పాలేరు..నకిరేకల్, భువనగిరి ఎంపీ స్థానాల్లో ఓటమి చవిచూసింది. మళ్లీ ట్రాక్టర్, రోడ్‌ రోలర్‌ గుర్తుల రూపంలో బిక్కుబిక్కుమంటున్నాడు టీఆర్ఎస్‌ అభ్యర్థి. అయితే, గతంలో జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా జనంలో అవేర్‌నెస్‌ తెచ్చేందుకు, గుర్తులపై అవగాహన కల్పిస్తున్నారు టీఆర్ఎస్‌ నేతలు. కారుకు రోడ్ రోలర్, ట్రాక్టర్ గుర్తులకు తేడాలను చూపిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు, హుజూర్ నగర్ లో ఇంటింటికి  వెళ్లి ఓటర్లకు వివరిస్తున్నారు. ప్రతీ ఓటూ అత్యంత కీలకంగా మారిన హుజూర్ నగర్ ఉపపోరులో... మరి, రోడ్ రోలర్, ట్రాక్టర్ గుర్తులు... టీఆర్ఎస్ ను ఏ మేరకు దెబ్బతీస్తాయో చూడాలి.
వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమంపై ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఏపీ బయటా... ఆరోగ్యశ్రీ చికిత్సలకు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ ఒకటి నుంచి ఏపీలోనే కాకుండా... హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరుల్లో కూడా ఆరోగ్యశ్రీ చికిత్సలకు అనుమతిస్తూ సీఎం జగన్మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 150 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తింపజేయనున్నారు. అలాగే, పశ్చిమగోదావరిలో 2వేల వ్యాధులకు... మిగతా జిల్లాల్లో 1200 వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తూ పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఇక, డెంగ్యూ, సీజనల్ వ్యాధులకు కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక, కిడ్నీ రోగులకు ఇస్తున్నట్లే.... తలసేమియా, హీమోఫీలియో, ఎనీమియా పేషెంట్స్‌కు కూడా నెలకు 10వేల రూపాయల పెన్షన్‌ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా, తీవ్ర వ్యాధులుంటే ప్రతి నెలా పెన్షన్ ఇవ్వాలని, అలాగే ఆపరేషన్స్ తర్వాత కోలుకునేంతవరకు ఆర్ధికసాయం అందించాలని నిర్ణయించారు. వీళ్లందరికీ నెలకు 5వేలు లేదా రోజుకి 225 రూపాయల చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నారు. అదేవిధంగా 5వేల రూపాయల పెన్షన్ కేటగిరిలోకి పక్షవాతం, కండరాల క్షీణతలాంటి మరో నాలుగు వ్యాధులను చేర్చారు. వైద్యారోగ్యశాఖలో మొత్తం ఖాళీలను భర్తీ చేస్తామన్న సీఎం జగన్‌.... హాస్పిటల్ శానిటేషన్ సిబ్బంది జీతాలను 16వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, కొత్తగా 108, 104 వాహనాలను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక, ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించడంతోపాటు, ప్రతి నియోజకవర్గంలో ప్రసూతి కేంద్రం ఏర్పాటు.... కమ్యూనిటీ, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు దిశానిర్దేశం చేశారు. డిసెంబర్ 21నుంచి ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేస్తామని తెలిపిన వైఎస్ జగన్‌.... కంటి వెలుగు మాదిరిగానే ప్రజలందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే, గిరిజన, మారుమూల ప్రాంతాల్లోనూ బైక్స్ ద్వారా వైద్యసేవలు అందిచేందుకు చర్యలు చేపడతామన్నారు. మొత్తంగా ఆరు సూత్రాల అజెండాతో రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌‌గా మార్చేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ‎ఆదేశించారు.
హుజూర్‌నగర్‌ బైపోల్‌ క్యాంపైన్ క్లైమాక్స్‌కి చేరింది. ప్రధాన పార్టీల అభ్యర్ధులంతా నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ర్యాలీలు, ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా నువ్వానేనా అంటూ తలపడుతోన్న కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు హుజూర్‌నగర్‌ ఉపపోరు బరిలో నిలిచిన బీజేపీ, టీడీపీ సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాల నినాదంతో బరిలోకి దిగిన అధికార టీఆర్‌ఎస్‌ ఈసారి ఎలాగైనాసరే హుజూర్‌నగర్‌లో గులాబీ జెండా ఎగరేయాలన్న లక్ష్యంతో వ్యూహాలు రచిస్తుండగా... మూడుసార్లు ఈ స్థానాన్ని గెలుచుకున్న కాంగ్రెస్‌ మరోసారి విజయం సాధించి సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇక, నియోజవర్గమంతా తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి సైదిరెడ్డి... తనకు ఒక్క అవకాశం ఇస్తే.... హుజూర్‌ నగర్‌ ను అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలను కోరుతున్నారు. అక్టోబర్ 21న జరగనున్న పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, ఎక్కడా ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరగకుండా ప్రత్యేక పరిశీలకుడు భాస్కరన్‌ టీమ్‌ డేగకన్నుతో కాపలా కాస్తోంది. అయితే... అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారోనన్న ఉత్కంఠ నెలకొంది. దాంతో హుజూర్‌నగర్‌ ఫలితం కోసం యావత్‌ రాష్ట్రం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
'సైరా' తో మెగాస్టార్ ఘన విజయం సాధించిన తరువాత మెగా హీరో పలువురు అగ్రనేతలతో భేటీ అవుతున్నారు.దీనిపై మెగాస్టార్ ఎటువైపు అడుగులు ఎటు వేయబోతున్నారనే అనుమానాలు జోరందుకుంటున్నాయి.కానీ మెగాస్టార్ మాత్రం పెదవి విప్పడం లేదు. చిరంజీవి వరుస భేటీలు ఇప్పుడు చర్చ నీయాంశంగా మారాయి. ఆయన ఈ వరుస సమావేశాలు ఎందుకు జరుపుతున్నారని చర్చ మొదలైంది.మొన్న గవర్నర్ తమిల శ్రీతో భేటీ, నిన్న జగన్ తో ఫ్యామిలీ లంచ్ మీటింగ్, వెంకయ్యనాయుడుతో మర్యాదపూర్వక సమావేశం, రేపు అమిత్ షా, మోదీని కలవబోతున్న మెగా హీరో పై పలు అనుమానాలు వెల్లడవుతున్నాయి. మళ్ళీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతారా లేక సైరా ప్రమోషన్ కోసమే ఈ మీటింగుల అనే విషయం ఆసక్తికరంగా మారింది. చిరంజీవి ఇటీవలే తెలంగాణ గవర్నర్ తమిల శాయిని కలిశారు. ఆ తర్వాత అమరావతి వెళ్లి సతీసమేతంగా ఏపీ సీఎం జగన్ ని కలిశారు. గంటపాటు లంచ్ మీటింగ్ జరిగింది. అయితే ఈ మీటింగ్ లో ఏమి చర్చించారనేది హాట్ టాపిక్ గా మారింది.కేవలం మర్యాదపూర్వక భేటీ ఏ అని రాజకీయాలు చర్చించలేదని బయటకి చెప్పారు. కానీ లోపల సమావేశాల్లో చాలా చర్చించారు అనే అనుమానాలు మాత్రం రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. జగన్ తో మీటింగ్ అలా ముగిసిన వెంటనే చిరంజీవి ఢిల్లీకి పయనమైయ్యారు.ఉపరాష్ట్రపతి వెంక్యనాయుడిని కలిసి ఆయనకు సైరా సినిమాను చూపించారు. రేపో మాపో ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాను కూడా కలవబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మీటింగ్ నేపథ్యంలో కొత్త కొత్త వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.బీజేపీ వైపు చూపు పడింది అనే ప్రచారం ఊపందుకుంది. ఏపీలో బీజేపీకి క్రౌడ్ పుల్లర్ కావాలి. బీజేపీకి సరైన లీడర్ దొరకడం లేదు. దీంతో చిరంజీవిని లాగాలని ఎప్పట్నుంచో బీజేపీ ప్రయత్నిస్తోందని అంటున్నారు. అమిత్ షా భేటీ తర్వాత చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై క్లారిటీ వస్తుందని న్యూస్ వైరల్ అవుతోంది. అయితే చిరంజీవి వస్తే బీజేపీ, వైసీపీ కూడా రాజ్యసభ సీటు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయని తెలుస్తోంది. కానీ చిరు మనసులో ఏముందో పార్టీలు మాత్రం పసిగట్టలేకపోతున్నాయి. అయితే చిరూ సన్నిహితుల్లో మాత్రం వేరే వర్షన్ వినిపిస్తున్నారు. సైరా సినిమా ముందు నుంచే చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదని ఆయన ఇక రాజకీయాల వైపు వెళ్లారని అంటున్నాయి. కేవలం సినిమా ప్రమోషన్ కోసమే నేతలను కలుస్తున్నారని వీరు చెబుతున్నారు. ఈ వరుస భేటీలు వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని వివరిస్తున్నాయి. మరోవైపు చిరంజీవి వరుస సినిమాలతో బిజీ కాబోతున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో సినిమాకు ఇప్పటికే ప్రారభించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇలా వరుస సినిమాలతో చిరంజీవి బిజీ కాబోతున్నారని, ఎలాంటి పరిస్థితుల్లో రాజకీయాల వైపు రారనేది ఆయన సన్నిహితుల మాట.మరి చిరంజీవీ మనసులో ఏముందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాలి.
    ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది పోలవరం ప్రోజెక్టు వ్యవహారం. నిర్మాణ పనులు మొదలై ఇప్పటికి పద్నాలుగు ఏళ్లు గడిచాయి, అయినా నేటికీ అసంపూర్తిగానే మిగిలింది. ఆర్ధిక సాంకేతిక కారణాల సంగతెలా ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి వల్ల పోలవరం పనులు నత్త నడకన సాగుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో తెలుగు దేశం ప్రభుత్వం ఏర్పడింది, ఈ తరుణంలో పోలవరం పనులను కొలిక్కి తెచ్చేందుకు టిడిపి ప్రయత్నం చేసింది. అప్పటికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తూనే ఉన్నాయి. అవన్నీ తట్టుకొని దాదాపు డెబ్బై శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేసింది కదా అనుకుంటున్న సమయంలోనే ఎన్నికలొచ్చాయి.టిడిపి ఓడిపోయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చింది పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఒక్కసారిగా బ్రేక్ పడింది. పైపెచ్చు ప్రాజెక్టు పనుల్లో అనేక అక్రమాలు జరిగే భారీగా అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు గుప్పించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. పోలవరం విషయంలో తామేదో గొప్పలు సాధించినట్టు అధికారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గొప్పలు పోతున్నారు కానీ, ప్రజల్లో మాత్రం అనేక సందేహాలు తలెత్తాయి. ప్రాజెక్టు పనులు తిరిగి ఎప్పుడు మొదలవుతాయో అనేది సస్పెన్స్ గా మారింది రాష్ట్ర ప్రభుత్వం పనులు చేపడుతుందా లేక కేంద్రానికి వదిలేస్తుందో అన్న సంశయం అటు అధికారవర్గాల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ చోటుచేసుకుంది. ఇదంతా ఒకెత్తయితే కేంద్రం మాత్రం పోలవరం పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నివేదికలు రప్పించుకుంటూనే మరో పక్క బీజెపీ రాష్ట్ర నేతల ద్వారా కూడా సమాచారం రాబడుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ సర్కారు పోలవరంలో అనేక అక్రమా లు జరిగాయంటూ రివర్స్ టెండరింగ్ కు వెళ్ళింది. దీనికి తోడు వర్షాకాలం కావడంతో పనులను ఆపేస్తున్నామని మళ్లీ నవంబర్ లోనే తిరిగి నిర్మాణం మొదలవుతుందని ప్రభుత్వ పెద్దలు చెప్పుకొచ్చారు కానీ, ఎక్కడా ఆశాజనకంగా లేదు. ప్రస్తుత పరిణామాలను గమనిస్తుంటే పోలవరం ప్రాజెక్ట్ పనులు ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదని ప్రతి పక్ష నేతలు వాదిస్తున్నారు. ఈ నేపధ్యంలో కొంతకాలంగా బీజేపీ నేతలు చేపడుతున్న పోలవరం యాత్రలు ఆసక్తికరంగా మారాయి. ఆగస్టులో బిజెపి ఎంపీ జీవిఎల్ నరసింహరావు పోలవరాన్ని సందర్శించారు. సంబంధిత అధికారులతో కాంట్రాక్టు ఏజెన్సీలతో సమావేశమై ప్రాజెక్టు స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలవరం పర్యటనకు సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పార్టీ అధిష్ఠానానికి పంపించారు. ఈ నెలలో బిజెపి రాష్ట్ర బృందం మరోసారి పోలవరం యాత్రను చేపట్టింది. కొవ్వూరు నుంచి బయలుదేరి వెళ్లిన ఈ బృందంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సహా ఇతర ముఖ్య నేతలు కూడా ఉన్నారు. వీరంతా పోలవరం ప్రాజెక్టును సందర్శించి పలు వివరాలు సేకరించారు, ఇటీవల ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్ర షెకావత్ ను కలిసి ఒక నివేదిక అందజేశారు. ఈ నివేదికలో పోలవరం పనులు ఎంత వరకు వచ్చాయి, ఎప్పటి నుంచి పనులు నిలిపివేశారు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరి వంటి పలు అంశాలను ఈ నివేదికలో వారు పొందుపరిచారట. ఆ నివేదికనే అప్పటికప్పుడు అధ్యయనం చేసిన కేంద్ర మంత్రి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్ ఇవ్వాలంటూ రాష్ట్ర సర్కారుకు తాఖీదులు పంపారు. తాజా పరిస్థితులలో ఈ నెల ఇరవైయ్యవ తేదీ తరువాత పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం నిర్వహించాలని కూడా కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చిందట. ఇదిలా ఉంటే బిజెపి నేతలు పోలవరం టూర్ చేపట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వరసపెట్టి కమలనాథులు ఎందుకు పోలవరం యాత్ర చేస్తున్నారు, దీని వెనకున్న మర్మం ఏంటి, అనే ప్రశ్నలు అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి. ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుందో అని అటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటు టిడిపి వర్గాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు మాకి ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తయితే చాలని ప్రజలు, ముఖ్యంగా రైతాంగం బలంగా కోరుకుంటోంది. పోలవరం ప్రాజెక్ట్ పనులు మళ్లీ ఎప్పుడు ఊపందుకుంటాడేయో.  
2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అద్భుతాలు సృష్టించకపోయినా, ఎంతోకొంత ప్రభావం చూపుతుందని భావించారంతా. కానీ, జనసేన ఊహించని ఫలితాలు మూట గట్టుకొని చతికిల పడింది. ముఖ్యంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడంతో.. జనసైనికులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరోవైపు, ఫ్యాన్ గాలి బలంగా వీచినా, అధినేత పవన్ ఓడిపోయినా.. రాపాక వరప్రసాద్ మాత్రం రాజోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. జనసేన తరపున ఎన్నికైన తొలి ఎమ్మెల్యేగా జనసైనికుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే రాపాక చర్యలు మాత్రం అటు జనసేనానిని, ఇటు జనసైనికుల్ని కలవరపెడుతున్నాయి. జనసేన తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో.. అధినేత పవన్ తర్వాత రాపాకపైనే అందరి దృష్టి ఉంటుంది. కావున ఆయన జనసేన గొంతుని అసెంబ్లీలో బలంగా వినిపించడమే కాకుండా.. బయటకుండా తన చర్యలతో పార్టీకి లాభం చేకుర్చాలి. అయితే కొన్ని విషయాల్లో మాత్రం.. ఆయన చర్యలతో అధికార పార్టీ వైసీపీకి లాభం చేకూరుతోంది. దీంతో జనసేనాని మరియు జనసైనికులు తలలు పట్టుకుంటున్నారు. ఆ మధ్య బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాపాక మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ దేవుడంటూ ఆకాశానికి ఎత్తేసారు. కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే.. కోరని కోర్కెలు కూడా తీర్చే దేవుడు  జగనన్న అని అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ మాటలు విని అధికార పార్టీలో ఉత్సాహం పెరిగితే.. జనసైనికులు మాత్రం తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే తాజాగా రాపాక చేసిన మరో పని కూడా జనసేన పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ.10వేల చొప్పున ఇచ్చేందుకు 'వైఎస్ఆర్ వాహనమిత్ర' పేరుతో జగన్ సర్కార్ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకాన్ని జగన్ ఇటీవల ఏలూరులో ప్రారంభించారు. అయితే తాజాగా ఈ పథకానికి సంబంధించి రాజోలులో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పినిపే విశ్వరూప్‌తో కలసి రాపాక పాల్గొన్నారు. అంతేకాదు మంత్రితో కలిసి జగన్ ఫోటోకి పాలాభిషేకం చేశారు. ఈ ఘటన రాజీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా జనసైనికుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ పాలాభిషేకం ఎపిసోడ్ తో రాపాక వైసీపీలో చేరబోతున్నారన్న ప్రచారం కూడా మొదలైంది. అయితే రాపాక మాత్రం అబ్బే అలాంటిదేం లేదని ఖండించారు. నిజానికి రాపాక వైసీపీలో చేరుతారనే ప్రచారం ఎన్నికల ఫలితాల తరువాత నుంచే మొదలైంది. అయితే రాపాక మాత్రం ఆ ప్రచారాన్ని ఖండించారు. తాను వైసీపీలో చేరితే తన నెంబర్.. 152 అవుతుందని, అదే జనసేనలో ఉంటే తను నెంబర్ 1 గా ఉంటానని లాజిక్ చెప్పారు. ఆ తర్వాత ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం కాస్త తగ్గినా.. ఆయన చర్యలు మాత్రం ప్రచారానికి ఊపిరి పోస్తున్నాయి.  విపక్ష పార్టీ ఎమ్మెల్యేగా.. అధికార పార్టీ చేస్తున్న పనులను ప్రశంసించడంలో తప్పులేదు. కానీ మరీ అధికార పార్టీ కార్యకర్తలాగా.. సీఎంని దేవుడుతో పోల్చడం, సీఎం ఫోటోకి పాలాభిషేకం చేయడమే అసలు సమస్య. ఆయన చర్యలతో అటు జనసేనాని, ఇటు జనసైనికులు తలలు పట్టుకునేలా చేస్తున్నారు. మరి రాపాక ఇకనైనా తన తీరు మార్చుకుంటారో లేక కండువానే మార్చుకొని షాకిస్తారో చూడాలి.
  అనంతపురం జిల్లాలో వాల్మీకి కులస్తులు మిగతా జిల్లాలతో పోలిస్తే కొంచెం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి మంత్రి కాల్వ శ్రీనివాసులు, జడ్పీ మాజీ ఛైర్మన్ పూల నాగరాజు ఈ సామాజికవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ పనులు చేసిపెట్టేవారు. అంతే కాకుండా వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని సైతం గట్టిగా డిమాండ్ చేశారు. నాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన సయోధ్య లేకపోవడంతో అది సాధ్యపడలేదు. దీంతో ఆగ్రహించిన వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు గత ఎన్నికల్లో గంపగుత్తుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు. వాల్మీకి కులస్తుడైనప్పటికీ మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు రాయదుర్గంలో ఓటమి పాలవడం, జడ్పీ మాజీ చైర్మన్ పూల నాగరాజు గుమ్మగట్ట మండలంలో ఐదు వేలకు పైగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. అంతేకాదు జేసీ కుటుంబాన్ని కాదని ఒక సామాన్య అధికారైన తలారి రంగయ్యను అనంతపురం ఎంపీగా గెలిపించారంటే బోయ కులస్థుల ఓటు పవర్ ఏ పరిధిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో కుల రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన నేతల ఒక గ్రూప్ గా అదే పార్టీలోని బలహీన వర్గాలకు చెందిన నేతలు మరో గ్రూపుగా విడిపోయారు. జగన్ క్యాబినెట్ లో పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు మంత్రిగా అవకాశం లభించటంతో అధికారం రుచి చూడాలని ఆశించిన అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు అసంతృప్తికి గురయ్యారు. మంత్రికి అండగా అనంతపురం పార్లమెంటు సభ్యులు రంగయ్య నిలవడంతో వార్ వన్ సైడ్ కాకుండా ఆయన అడ్డు తగులుతున్నారని రెడ్డి సామాజికవర్గ నేతలు భావిస్తున్నారు. వాల్మీకి సామాజిక వర్గం అధికంగా ఉండే అనంతపురం పార్లమెంటు పరిధిలో తమను ఎదగనీయకుండా కొందరు ఎమ్మెల్యేలు చక్రం తిప్పుతారంటూ ఎంపి రంగయ్య వద్ద బోయలు వాపోతున్నట్టు వినిపిస్తుంది.దీంతో గత మూడు నెలలుగా తమ ఆవేదనను దిగమింగుతూ వచ్చిన ఎంపి రంగయ్య వాల్మీకి జయంతి వేడుకల సందర్భంగా అధికార పక్షంలో కొంత మందిని ఓ ఆటాడుకున్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు గుమ్మనూరు జయరాం, శంకరనారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రా రెడ్డి జిల్లా కలెక్టర్ ముందే సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. చంపేవాడు చచ్చేవాడు బోయవాడు, బోయవాడికి బోయవాడికి మధ్య గొడవెందుకు, ఎవడైతే బోయలను ఉసిగొల్పుతాడో వాడి తల తీస్తే తన్నుకు చేయవలసిన అవసరం రాదు అంటూ అనంత ఎంపీ తలారి రంగయ్య వ్యాఖ్యానించారు. సౌమ్యుడిగా పేరొందిన రంగయ్య నోటి నుంచి తూటాల్లాంటి మాటలు రావటంతో సభలో ఉన్నవారంత నిర్ఘాంతపోయారు.  ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రంగయ్య వ్యాఖ్యలపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలోనే ఇలాంటి మాటలు అన్నారంటే ఎంపీలు ఎంతటి ఆవేదన గూడుకట్టుకుని ఉందో అర్థం చేసుకోవాలని ఆయన వర్గీయులు వాదిస్తున్నారు. స్వపక్షంలోనే మరో సామాజిక వర్గం వారు మాత్రం ఈ అంశంపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే బోయలను ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నదే. ఈ తరుణంలో రంగయ్య మాట్లాడుతూ ఈ డిమాండ్ నెరవేర్చటానికి సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆయన మాటలకు మంత్రి శంకరనారాయణ చీఫ్ విప్ కాపురామచంద్రరెడ్డి వంత పాడారు. మరో మంత్రి జయరాం మాట్లాడుతూ బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాల్మీకి సామాజికవర్గ పెద్దలు కూడా ఇదే పాట పాడారు. రాయలసీమలో ఉన్న యాభై రెండు అసెంబ్లీ స్థానాల్లో నలభై తొమ్మిది స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించామని ఎస్టీ జాబితాలో కనుక తమను చేర్చకపోతే ప్రస్తుత అధికార పక్షాన్ని కూడా సత్తా చూపిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
  తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉద్యోగ సంఘాల జేఏసీ లో చిచ్చుపెట్టినట్లు కన్పిస్తోంది. నిన్న మొన్నటి వరకు కలిసి అడుగులు వేసిన ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ఇప్పుడు తలో దారిన నడిచేందుకు సిద్ధమవుతున్నారట. టీఎన్జీవో కార్యవర్గ సమావేశంలో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా తీర్మానం చేసిన తర్వాత జేఏసీ లోని కొన్ని సంఘాలు మద్దతుపై పునరాలోచనలో పడ్డాయని సమాచారం.  నిజానికి ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించడంతో సమ్మెకు మద్దతు తెలపాలంటూ ఇతర ఉద్యోగ సంఘాల మీద ఒత్తిడి పెరిగింది. రాష్ట్ర సంఘాల నాయకత్వం మీద ఆయా సంఘాల కింది స్థాయి ఉద్యోగులు ఒత్తిడి పెంచారు. ఈ నేపధ్యంలో టీఎన్జీవోల రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జిల్లా సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతివ్వాలని నేతలంతా ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరిని టీఎన్జీవోలు తప్పు పట్టారు. టీ.ఆర్.ఎస్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు ఎలాంటి మేలు చేయలేదని మండిపడ్డారు. తాము సైతం ఉద్యమించడానికి ఇదే సరైన సమయమని ఆర్టీసీ సమ్మెను అవసరమైతే సకల ఉద్యోగుల సమ్మెగా మార్చాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఇదే విషయాన్ని సమావేశానంతరం టీఎన్జీవో అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ప్రకటించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.  ఇంత వరకు బాగానే ఉంది.. అయితే గత రెండు రోజులుగా ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం వాయిదా పడుతోంది. ఎవరికి వారుగా ఉద్యోగ సంఘాలు సమావేశాలు పెట్టుకొని తీర్మానాలు చేసుకున్నారు కానీ, జెఎసి సమావేశం మాత్రం పదేపదే వాయిదా పడటంతో అందులో నేతల మధ్య అంతర్గత విభేదాలు బయట పడుతున్నాయి. ఆర్టీసి ఉద్యోగులకు మద్దతు తెలపడం సకల ఉద్యోగుల సమ్మెకు సిద్ధమంటూ రవీందర్ రెడ్డి ప్రకటించడంతో జేఏసీ లోని మరో సంఘం టీజీవోలు పునరాలోచనలో పడినట్లు తెలుస్తుంది. ఆ సంఘానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గౌరవాధ్యక్షుడిగా ఉండటం వల్లే వారు ఆలోచనలో పడ్డారని ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఆ సంఘానికి చెందిన ఓ ముఖ్య నేత గచ్చిబౌలిలో నిబంధలకు విరుద్ధంగా భవన నిర్మాణం చేస్తున్నారని అది కూడా ఓ కారణమని చెప్తున్నారు. ఈ పరిస్థితుల వల్లే టీజీవోలు గత రెండ్రోజులుగా ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం జరగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  మరోవైపు టీజీవోల వ్యవహారంపై టీఎన్జీవోలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మె తరువాత వ్యవహరించిన తీరుతో ఇప్పటికే కొంత అప్రతిష్ట పాలయ్యామని, ఉద్యోగుల్లో సైతం సంఘం పట్ల విశ్వాసం కోల్పోకుండా ఉండాలంటే వారికి మద్దతు ఇవ్వాల్సిందేనని టీఎన్జీఓలు నిర్ణయించారు. ఇక తమ సమస్యల మీద పోరాటానికి కూడా ఇదే సరైన సమయమని టీఎన్జీవోలు భావిస్తున్నారు. అందుకే మొదట సీఎస్ ను కలిసి వినతి పత్రం ఇచ్చి ఆ తర్వాత ఫలితం లేకపోతే సమ్మెకు వెళ్లడానికి సిద్ధం కావాలని కార్యవర్గ సమావేశంలో నేతలు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యం లోనే ఆ సంఘం అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి సకల ఉద్యోగుల సమ్మెకు సమాయత్తం అవుతున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. అయితే ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే విషయంలో టీజీవో లు గ్రూప్-1 అధికార సంఘం కొంత గందరగోళంలో ఉన్నట్టు ఉద్యోగ జేఏసీలో చర్చ జరుగుతోంది. ఇక టీఎన్జీఓలు మాత్రం ఈ పరిణామాన్ని ముందే అంచనా వేశారట, టీజీవోలు కలిసి రాకపోయినా సమ్మెకు సిధ్ధం కావాలని తమ కేంద్ర నాయకత్వాన్ని టీఎన్జీఓలు గట్టిగా కోరుతున్నట్టు తెలుస్తోంది. ఒక లక్షా ఎనభై వేల సభ్యత్వంతో రాష్ట్రంలో తమదే అతిపెద్ద ఉద్యోగ సంఘంగా ఉందని కేవలం ఐదు వేల మంది ఉన్న టీజీవోల మాట విని ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించవద్దని టీఎన్జీఓ జిల్లాల బాధ్యులు డిమాండ్ చేస్తున్నారట. ఆ సంఘాలు జేఏసీ నుంచి బయటకు వెళ్లినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతున్నారట. ఉపాధ్యాయులు నాలుగో తరగతి ఉద్యోగులు సహా కలిసి వచ్చే అన్ని సంఘాలతో సమ్మెకు వెళ్లాలని గట్టిగా కోరుతున్నారట. అన్ని జిల్లాల నాయకుల నుంచి ఒకే అభిప్రాయం వ్యక్తమవడంతో టీఎన్జీఓ కేంద్ర నాయకత్వం కూడా అందుకు సన్నద్ధం అయినట్లు ఆ సంఘం నాయకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఉద్యోగ జేఏసీ సమావేశానికి అడ్డంకులు సృష్టించిన టీజీఓలు సీఎస్ తో సమావేశానికి హాజరయ్యారు. వివిధ ఉద్యోగ సంఘాలు తమ కార్యవర్గ సమావేశాల్లో చేసిన తీర్మానాలతో వినతి పత్రాన్ని తయారు చేసి నేతలంతా కలిసి సిఎస్ కు అందజేశారు. తర్వాత మీడియా సమావేశంలో ఉద్యోగ జేఏసీ ఛైర్మన్ టీఎన్జీఓ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు సిద్దమని ప్రకటించారు. ఇక టీజీఓ అధ్యక్షురాలు మమత మాత్రం ఆ స్థాయిలో మాట్లాడక పోవడం వారి వైఖరిని తెలియజేస్తోందన్న వాదనలు ఉద్యోగుల్లో వినిపిస్తున్నాయి. ఏదేమైనా హుజూర్ నగర్ ఉప ఎన్నికల తర్వాత సీఎం మాట ఇచ్చినట్టుగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే టీజీఓలు కలిసొచ్చినా, రాకపోయినా తాము మాత్రం సమ్మెకు వెళ్లాలని టీఎన్జీఓలు డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది.
Sugarcane Juice has the weight losing properties says experts. Sugarcane juice is low in calories and contains loads of fiber. In addition, this drink does not have cholesterol thus promoting weight loss. Watch our video to know more...  https://www.youtube.com/watch?v=8G6vs33OFyU  
  కొవ్వు పదార్ధాలున్న ఆహారాన్ని అధికంగా తీసుకోవడం ద్వారా శరీరం బరువు పెరిగిపోవడం, బాగా లావెక్కడం, రక్తపోటు, షుగర్, గుండెపోటు లాంటి వ్యాధులు వస్తాయని అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ చాలామంది కొవ్వు బాగా వున్న పదార్ధాలను చాలా ఇష్టంగా తింటూ వుంటారు. అలాంటివాళ్ళకు మరో హెచ్చరిక... కొవ్వు అధికంగా ఉన్న పదార్ధాలను ఎక్కువగా తినడం వల్ల పైన పేర్కొన్న సమస్యలు మాత్రమే కాదు... పిచ్చి కూడా ఎక్కే ప్రమాదం వుందట. ఈ విషయం లుసియానా విశ్వవిద్యాలయంలో తాజాగా జరిగిన అధ్యయనంలో తేలింది. లుసియానా యూనివర్సిటీ పరిశోధకులు బయోలాజికల్ సైకియారిటి అనే జర్నల్లో తమ పరిశోధన ఫలితాలను వెల్లడించారు. కొవ్వు పదార్థాలను పరిమితికి మించి తినేవారి ప్రవర్తనలో విపరీత ధోరణులు ఏర్పడతాయని, అయినప్పటికీ తమ ఆహారాన్ని మార్చుకోని పక్షంలో మానసిక సమస్యలు వేగం పుంజుకుని, ఒత్తిడి బాగా పెరుగుతుందని చెబుతున్నారు. తద్వారా మానసిక సంబంధమైన సమస్యలు పెరిగిపోయి చివరికి పిచ్చికి దారితీసే ప్రమాదం వుందని సదరు పరిశోధకులు అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.