ఇంత కన్నా దిగజారుడుతనం ఉంటుందా?

తనను తాను తగ్గించుకునే విషయంలో జగన్ తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సొంత చెల్లెలి చీరలపై కూడా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ఆయన ప్రత్యర్థులను కూడా ఆశ్చర్య పరుస్తున్నారు. వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సొంత బాబాయ్ కుమార్తె సునీతారెడ్డిపై వైసీపీ సోషల్ మీడియా ఇష్టారీతిగా చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం అటుంచి వాటిని సమర్ధిస్తూ మాట్లాడి తన స్థాయి ఏమిటో తానే చెప్పుకున్నారు. ఆ తరువాత తల్లినీ చెల్లినీ దూరం నెట్టేసి ఈయనకు బంధుత్వాలు, అనుబంధాలూ కూడా లేవా అని జనం ముక్కున వేలేసుకునేలా చేశారు. సరే ఎవో కుటుంబ విభేదాలు, ఆస్తి తగాదాలు అనుకుంటే.. షర్మల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఆమెను టార్గెట్ చేస్తూ ఆమె వ్యక్తిత్వ హననానికి సొంత సోషల్ మీడియా పాల్పడినా పట్టించుకోకుండా జగన్ తన స్థాయిని తానే దిగజార్చుకున్నారు. ఇక ఇప్పుడు పులివెందులలో నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్  చేసిన ప్రసంగం ఒక మనిషి ఇంత దిగజారగలడా అని ఆయన ప్రత్యర్థులు సైతం ఆశ్చర్య పడేలా చేసింది. తన ప్రసంగంలో జగన్ షర్మిల కట్టుకున్న చీరను సైతం ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు.    షర్మిల పసుపు చీర కట్టుకోవడాన్ని కూడా తప్పుపడుతూ జగన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఓ లెవల్ లో విమర్శలు  వెల్లువెత్తుతున్నాయి. పసుపు చీర కట్టుకున్న షర్మిల వైఎస్ వారసురాలు కాదు అని అర్ధం వచ్చేలా జగన్ మాట్లాడడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు అవినాష్ రెడ్డిని  పక్కన పెట్టుకుని, ఆయనకు రక్షణగా నిలిచి పార్టీ టికెట్ ఇచ్చిన  జగనా వైఎస్ వారసత్వం గురించి మాట్లాడేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా షర్మిల కట్టుకున్న చీరను సైతం జగన్ తప్పుపడ్డడాన్ని, వ్యాఖ్యలు చేయడాన్ని ఆక్షేపించారు. ఇక కొందరు నెటిజనులైతే జగన్ భార్య భారతి  పసుపు చీర కట్టుకుని ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమంలో వైరల్ చేస్తూ.. భార్యపైన కూడా అలాంటి వ్యాఖ్యలు చేయగలవా జగన్ అ ంటూ సవాల్ చేస్తున్నారు.  
Publish Date: Apr 25, 2024 6:00PM

అవినాష్ పాపం చిన్న పిల్లోడంట!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాపం ఏం మాట్లాడినా నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన భాష, ఆయన మ్యానరిజమ్స్ చివరాఖరికి గాయానికి ఆయన వేసుకున్న బ్యాండ్ ఎయిడ్ ఇలా జగన్ విషయంలో ట్రోలింగ్ కు కాదేదీ అనర్హం అన్నట్లుగా నెటిజనులు ఓ రేంజ్ లో జగన్ ను ఆటాడుకుంటున్నారు.  తాజాగా జగన్  వివేకా హత్య కేసులో ప్రధాన నిందితులలో ఒకడైన అవినాష్ రెడ్డిని ‘చిన్న పిల్లోడు’ అంటూ సంబోధించి మరోసారి నెటిజనులకు అడ్డంగా దొరికి పోయారు. గురువారం (ఏప్రిల్ 24) పులివెందులలో జగన్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సభలో ఆయన అవినాష్ రెడ్డిని ‘చిన్న పిల్లోడు’ అని పేర్కొన్నారు. ఈ చిన్నపిల్లోడి జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయంటూ విమర్శలు గుప్పించారు. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుల్లో అవినాష్ రెడ్డి ఒకరు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. ఆయన బెయిలు రద్దు పిటిషన్ కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో కడప లోక్ సభ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డిని  చిన్నపిల్లోడిగా అభివర్ణిస్తూ జగన్ ఆ ఆరోపణలను తుడిచేసే ప్రయత్నం చేశారు. అవినాష్ రెడ్డి ఏ తప్పూ చేయలేదు కనుకనే ఆయనకు కడప లోక్ సభ టికెట్ ఇచ్చినట్లు చెప్పారు.  అయినా అవినాష్ రెడ్డి అమాయకత్వం గురించి జగన్ కు స్వయానా మేనమావ అయిన రవీంద్రనాథ్ రెడ్డి గతంలోనే బాహాటంగా చెప్పేశారు. వివేకా మృతదేహానికి కుట్టు వేస్తుంటే అవినాష్ రెడ్డి ఏం చేయాలో తెలియక అలా చూస్తూ నిలబడిపోయారని రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు. అదికూడా కమలాపురంలో ఓ బహిరంగ సభలో అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకునే ఆ మాట చెప్పారు.  ఇప్పుడు జగన్ కూడా అదే చెబుతున్నారు. అవినాష్ రెడ్డి చిన్న పిల్లోడు అతడికి ఏమీ తెలియదు అంటున్నారు.  వివేకా హత్య కేసులో అవినాష్  నిందితుడని అనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని సీబీఐ తేల్చి చెప్పింది. కోర్టులూ అదే చెబుతున్నాయి. అయినా జగన్ అవినాష్ రెడ్డిని రక్షించడానికి చేస్తున్న ప్రయత్నాలపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సెటైర్లు పేలుతున్నాయి.  
Publish Date: Apr 25, 2024 5:23PM

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ, అలాగే తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 13న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలుకు గడువు గురువారం (ఏప్రిల్ 24) మధ్యాహ్నం మూడుగంటలతో ముగిసింది.  ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 4, 210 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే పాతిక లోక్ సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక తెలంగాణలోని 17లోక్ సభ స్థానాలకు గాను 603 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు కూడా నామినేషన్ల గడువు ముగిసింది.  అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల నామినేషన్లను రేపు పురిశీలిస్తారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకూ గడువు ఉంది.  మే 13న పోలింగ్ జరుగుతుంది. ఫలితాలు జూన్ 4న విడుదల అవుతాయి.
Publish Date: Apr 25, 2024 5:10PM

జగన్ కు సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ? వైసీపీ మైండ్ బ్లాక్

గత ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఈ ఎన్నికలలో వైసీపీ పుట్టి ముంచేదిగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో బాబాయ్ ని హత్య చేశారంటూ విపక్షంపై ఆరోపణలు గుప్పించడం ద్వారా సానుభూతి వర్షించి జగన్ పార్టీ విజయానికి దోహదపడిన వివేహా హత్య కేసు.. ఐదేళ్లు గిర్రున తిరిగేసరికి జగన్ కు చుట్టుకుంది. హత్య కేసు నిందితులకు వత్తాసు పలుకుతున్న జగన్ పై సొంత కుటుంబీకులే విమర్శలు గుప్పిస్తుండటం, కేసు దర్యాప్తు, విచారణలో వేళ్లన్నీ వైసీపీ కడప లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి అవినాష్ రెడ్డివైపే చూపుతుండటం, ఆ అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తున్నారంటూ జగన్ పై అన్ని వర్గాల నుంచీ విమర్శలు వెల్లువెత్తుతుండటం ఎన్నికల సమయంలో   వైసీపీకి పెద్ద ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల వేళ వివేకా హత్య కేసుపై ఎవరూ మాట్లాడకూడదంటూ కడప కోర్టు నుంచి గ్యాగ్ అర్డర్ తెచ్చుకున్నారు. అయితే కడప కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీతారెడ్డి, పులివెందుల తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవిలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కేసు బుధవారం విచారణకు రావాల్సి ఉండగా ఆ బెంచ్ న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ అనడంతో విచారణ వాయిదా పడింది. కొత్త బెంచ్  ముందుకు ఆ కేసు విచారణకు రానుంది.   అయితే  వివేకా హత్య పై మాట్లాడకూడదంటూ కడప కోర్టు పేర్కొన్న జాబితాలో లేని సౌభాగ్యమ్మ సరిగ్గా జగన్ పులివెందులలో నామినేషన్ వేసే సమయానికి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో వివేకా హత్య కేసులో నిందితులకు మద్దతుగా నిలబడుతున్నావంటే సూటిగా పేర్కొని వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశారు. వాస్తవానికి ఈ సారి ఎన్నికలలో జగన్ కు తెలుగుదేశం కూటమి మాత్రమే కాదు సొంత కుటుంబం కూడా ప్రతిపక్షంగా మారింది. వివేకా హత్యకేసులో న్యాయం కోసం పోరాడుతున్న చెల్లెళ్లనే పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణిస్తూ వారు తెలుగుదేశం స్క్రిప్టు చదువుతున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ విమర్శల గుప్పిస్తోంది. అక్కడితో ఆగకుండా షర్మిల వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ ఆమెను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తోంది. ఇక ఇప్పుడు జగన్ స్వయంగా రంగంలోకి దిగి వైసీపీ సోషల్ మీడియాలో పేర్కొన్న అంశాలనే ఎన్నికల ప్రచార సభలలో ప్రస్తావిస్తున్నారు.   ఈ నేపథ్యంలోనే  వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ  జగన్ కు ఓ బహిరంగ లేఖ ద్వారా షాక్ ఇచ్చారు. ఆ లేఖ కూడా జగన్ పులివెందులలో నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలోనే విడుదల చేశారు. ఆ లేఖలో   నీ తండ్రి వైస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు నువ్వెంత మనోవేదన చెందావో వివేకా హత్య జరిగిన నాటి నుండి నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదనకు గురయ్యింది. ఇటువంటి సందర్భంలో అన్నగా చెల్లికి అండగా నిలవాల్సిన నువ్వు ఇలా వివేకా హత్యకు కారణమైన వారికి రక్షణగా నిలవడం  తగునా జగన్..? అంటూ సూటిగా ప్రశ్నించారు.  సునీత కు అండగా నిలబడిన నీ సొంత చెల్లి షర్మిలను కూడా టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న నువ్వు నోరెత్తకపోవడమేంటంటూ నిలదీశారు. సరిగ్గా జగన్ నామినేషన్ దాఖలు చేసే రోజునే జగన్  కు ఆమె  పిన్నమ్మ బహిరంగ లేఖ రాయడం వైసీపీని దిగ్భ్రమకు గురి చేసింది. ఆమె సూటిగా, సుత్తి లేకుండా చెల్లెళ్ల పట్ల జగన్ వ్యవహరిస్తున్న తీరును ఆ లేఖలో ఎండగట్టడంతో ఆ లేఖపై ఎలా స్పందించాలో తెలియక జగన్ సహా వైసీపీ నేతలకు మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి. అంతే కాకుండా జగన్ సొంత బాబాయ్ హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న, దర్యాప్తు సంస్థలు వేలెత్తి చూపుతున్న అవినాష్ రెడ్డికి రక్షణగా నిలుస్తున్న జగన్ ను తప్పుపట్టడంతో జగన్ డిఫెన్స్ లో పడ్డట్టేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా సౌభాగ్యమ్మపై కూడా షర్మిల, సునీతమ్మల వలె ఎదురుదాడికి దిగుతుందా? ఆమెపై కూడా పెయిడ్ ఆర్టిస్ట్ ముద్ర వేస్తుందా చూడాల్సి ఉంది. జగన్ అండ్ కో  మేరకు చంద్రబాబు స్క్రిప్ట్ చదివేవారి జాబితాలో ఇప్పుడు సౌభాగ్యమ్మను కూడా చేరుస్తారా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా వివేకా హత్య కేసు జగన్ కు ఈ ఎన్నికల వేళ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నదనడంలో సందేహం లేదు.  
Publish Date: Apr 25, 2024 4:19PM

బెజవాడ సెంట్రల్ బరిలో ఇండిపెండెంట్ గా జొన్నవిత్తుల

సినీ గేయ రచయత జొన్నవిత్తుల ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. సినీ రంగం నుంచి జొన్నవిత్తుల కంటే ముందు ఎందరో రాజకీయాలలోకి ప్రవేశించారు. వారిలో కొందరు తమదైన ముద్ర వేశారు. మరి కొందరు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. అయితే ఇందులో జొన్నవిత్తుల ఏ కోవలోకి వస్తారన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఈ సారి ఎన్నికలలో సినీ రంగానికి చెందిన పలువురు ఎన్నికల బరిలో నిలిచిన సంగతి విదితమే. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే హిందూపురం నుంచి  తెలుగుదేశం అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఇదే నియోజకవర్గం నుంచి రెండు సార్లు విజయం సాధించిన బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక మంత్రి రోజా వైసీపీ అభ్యర్థిగా నగరి నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి గత రెండు ఎన్నికలలో విజయం సాధించిన రోజా ఈ సారి ఎదురీదుతున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇక విషయానికి వస్తే జొన్నవిత్తుల విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు. విజయవాడ అంటేనే రాజకీయాలకు క్యాపిటల్ వంటిది. అటువంటి విజయవాడ నుంచి జొన్నవిత్తుల ఇండిపెండెంట్ గా పోటీలోకి దిగి ఏ మేరకు ప్రభావం చూపుతారని పరిశీలకులు అంటున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా బోండా ఉమామహేశ్వరరావు పోటీ చేస్తున్నారు. అలాగే వైసీపీ నుంచి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బరిలో ఉన్నారు.  వీరితో పోటీలో ఇండిపెండెంట్ గా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఏ మేరకు ప్రభావం చూపుతారన్నది కాలమే నిర్ణయిస్తుంది.  
Publish Date: Apr 25, 2024 3:30PM

EVM మళ్ళీ మళ్ళీ గెలిచింది, గెలుస్తుంది!

ఎన్నికలు వస్తె, పదే పదే ఈవిఎం ల మీద దుమ్మెత్తి పోసే వారికి కొదవలేదు. గత 40 ఏళ్లుగా అనేక అవరోధాలను అధిగమించి, భారత దేశ సాంకేతికతకు తిరుగులేదని ఓటింగు యంత్రాలు అనేక సార్లు నిరూపించుకున్నాయి. ఇప్పుడు భారత ఉన్నత న్యాయస్థానం మరోమారు ఓటింగు యంత్రాలు పట్ల పూర్తి విశ్వాసం వెలువరించింది. వూహాజనిత ఆరోపణలపై ఓటింగు యంత్రాలపని తీరును తప్పు పట్టలేమని స్పష్టం చేసింది. ఓటింగు యంత్రాలను వ్యతిరేకించే వారి వాదన మన దేశ సాంకేతికతను అవమానించేలా ఉంటుంది. ప్రపంచంలో ఫలానా దేశాల్లో వాడటం లేదు, ఫలానా దేశాలు నిషేధించాయి కనుక ఓటింగు యంత్రాలు నమ్మదగినవి కావు అని వాదిస్తారు. బుర్ర తక్కువ లేదా భారత దేశం కనుగొన్న ఓటింగు యంత్రాలను మేము ఎందుకు వాడాలి అనే బలుపుతో ఆయాదేశాలు వాడటం లేదు అని కోణంలో ఆలోచించరు.  లక్షలాది ఓటింగు యంత్రాలు గల్లంతు అయ్యాయి అనే ఆరోపణ రాజకీయ పరమైంది. ఒకవేళ ఓటింగు యంత్రాలు దొంగిలించబడ్డా... వాటితో ఏమీ చేయలేరు.  ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎంతమంది దుమ్మెత్తి పోసినా,  ఓటింగు యంత్రాలుతోనే ఎన్నికలు నిర్వహిస్తున్న భారత ఎన్నికల సంఘం త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళుతుంది. ఈవిఎంలపై దేశంలో పెద్ద ఎత్తున‌ చర్చ సాగుతోంది. ఈవిఎంల ద్వారా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  ఎన్నికల కమిషన్ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. ఈవిఎంల ద్వారా అక్రమాలకు పాల్పడే అవకాశం లేదని అంటోంది. సాంకేతిక సమస్యలపై ఈవిఎంలు మొరాయించే అవకాశం మాత్రమే ఉంది గానీ అక్రమాలకు పాల్పడే లేదా ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండదని అంటోంది.  ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు సుర‌క్షిత‌మైన‌వ‌నీ, ఇవి భారతదేశానికి గర్వకారణమని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర చెబుతున్నారు.  EVM సింగిల్ చిప్ ప్రోగ్రామ్ మాత్రమేన‌నీ, ఫ్రీక్వెన్సీ లేదనీ.. కాబట్టి హ్యాకింగ్ ప్రశ్నే లేదని తెలిపారు. వాటిని ట్యాంపరింగ్ చేయడం లేదా హ్యాక్ చేయడం సాధ్యం కాదన్నారు. భార‌త దేశం ఎంతో వేగంగా, సకాలంలో, ఖచ్చితంగా ఎన్నికల ఫలితాలను  అందించగలదో తెలుసుకోవడానికి అనేక దేశాలు ఆసక్తిగా ఉన్నాయని అన్నారు.  ఈవీఎం అనేది సింగిల్ చిప్ ప్రోగ్రామ్ అని సుశీల్‌ చంద్ర తెలిపారు. దీనిని ట్యాంపరింగ్‌ చేయలేరని, హ్యాకింగ్ ప్రశ్నే తలెత్తదని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో VVPAT ఆడిట్ ట్రయల్ కూడా ఉంటుందన్నారు. దీంతో ఈవీఎంలు ఖచ్చితమైన ఫలితాలను ఇస్తాయని వివరించారు. చాలా తక్కువ సమయంలో వేగంగా, ఖచ్చితమైన ఎన్నికల ఫలితాలు భారత్‌లో ఎలా సాధ్యం అని పలు దేశాలు ఆశ్చర్యపోతున్నాయని అన్నారు.  ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాతత, అవగాహన చాలా కీలకమని, అందువల్ల ఈవీఎంల క్రమబద్ధమైన నిల్వ, నిర్వహణ, తరలింపు కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, చెక్‌లిస్ట్ అనుసరించడం చాలా కీలకమని ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండే చెబుతున్నారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌
Publish Date: Apr 25, 2024 2:24PM

జగన్.. బ్యాండ్ ఎయిడ్ ఎప్పుడు తీస్తారు సారూ!?

ఎన్నికల అంశంగా, సానుభూతి వర్షం కురిపించేలా మారుతుందని ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలూ భావించిన రాయి దాడి సంఘటన చివరకు అధికార పార్టీ పరువును దిగజార్చడానికి మాత్రమే దోహదపడింది. రాయి దాడి సంఘటన నాటి నుంచీ ఓ వారం రోజుల పాటు రాష్ట్ర రాజకీయాలలో దాని గురించి తప్ప మరో చర్చ లేకుండా పోయింది. రాయిదాడి సంఘటనను హత్యా యత్నం అంటూ మీడియాలో వైసీపీ నేతల ప్రకటనలతో సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ కూడా ఆ దాడిని ఖండిస్తూ  ట్వీట్ చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు,  జనసేనాని పవన్ కల్యాణ్ కూడా దాడి ఘటనను ఖండిస్తూ ప్రకట చేశారు. సీఎం కార్యక్రమంలో భద్రతా వైఫల్యంపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని బాధ్యులపై చర్యకు కూడా డిమాండ్ చేశారు. సరే ఒకింత ఆలస్యమైనా సీఎం కార్యక్రమంలో భద్రతా వైఫల్యాలతో పాటు ఇతర ఫిర్యాదులను కూడా పరిగణననలోకి తీసుకున్న ఎన్నికల సంఘం రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలిస్ పై బదలీ వేటు వేసింది. అక్కడకు ఆ అంకం ముగిసినట్లుగానే భావించాలి. కానీ జగన్ లో మాత్రం ఆ దాడి నుంచి ఇంకా సానుభూతి పిండుకోవచ్చన్న దింపులు కళ్లెం ఆశ మిగిలే ఉన్నట్లుంది. అందుకే ఇప్పటికీ ఆయన నుదుటి మీద కనుబొమలను కవర్ చేసేలా బ్యాండ్ ఎయిడ్ ను అలాగే కొనసాగిస్తున్నారు. వాస్తవానికి రాయి తగిలిందని చెప్పి నుదురు పట్టుకున్న తరువాత జగన్ కు నుదుటిపై గుండ్రంగా ఒక చిన్న బ్యాండ్ ఎయిడ్ వేశారు. అయితే ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ పదుల సంఖ్యలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకున్న తరువాత ఆ బ్యాండ్ ఎయిడ్ సైజు ఒక్క సారిగా పెరిగిపోయింది. నుదుటి భాగాన్నే కాకుండా కనుబొమను కూడా వకర్ చేస్తూ పెద్ద బ్యాండ్ ఎయిడ్ ఇప్పుడు ఆయనకు సహజ కవచకుండలంగా మారిపోయి కనిపిస్తున్నది.  హత్యాయత్నం అని వైసీపీ ఎంతగా బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నించినా జనం నమ్మలేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రమే కాదు చివరాఖరికి సొంత చెల్లెలు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా జగన్ పై జరిగింది గులకరాయి దాడే అని పదే పదే చెబుతున్నారు. సరే అది పక్కన పెడితే గాయం తగిలి ఇన్ని రోజులైనా వైద్యులు ఇంకా జగన్ నుదుటిపై ఉన్న బ్యాండ్ ఎయిడ్ ను ఎందుకు తీయలేదా అని వైసీపీ శ్రేణుల్లోనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగా సానుభూతి కోసమే ఇబ్బంది అయినా బ్యాండ్ ఎయిడ్ ను అలా భరిస్తూ కొనసాగిస్తున్నారా అన్న జోకులు కూడా పేలుతున్నాయి. ఇక ఆంధ్రాలో అయితే జగన్ స్టైల్ లో నుదుటిమీద బ్యాండ్ ఎయిడ్ పెట్టుకుంటూ యూత్ ఓ లెవల్ లో  ట్రోల్ చేస్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసే దాకా జగన్ నుదుటిమీద ఆ బాండ్ ఎయిడ్ ను అలా ఓ ఆభరణంలా మెయిన్ టెయిన్ చేస్తారేమో అంటూ నెటిజనులు ఓ రేంజ్ లో ఆటాడుకుంటున్నారు.  
Publish Date: Apr 25, 2024 2:02PM

మల్కాజ్‌గిరిలో సత్తా చాటేది ఎవరు? ఓటరు ఎటు వైపు?

మల్కాజ్ గిరి పై పట్టుకోసం రాజకీయపార్టీలు హోరా హోరీగా త‌ల‌ప‌డుతున్నాయి.  ఇక్క‌డ మూడు పార్టీల మ‌ధ్య ఆసక్తికరమైన పోరు నెల‌కొంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో  దేశంలోని అన్ని రాష్ట్రాల, ప్రాంతాల ప్ర‌జ‌లు ఉంటారు. అందుకే మ‌ల్కాజ్ గిరి అంటే మినీ ఇండియాగా పేరుంది. పైగా దేశంలోని అతిపెద్ద లోక్ స‌భ సెగ్మెంట్ల‌లో కూడా మ‌ల్కాజ్ గిరి ఒక‌టి. సీఎం రేవంత్ రెడ్డి మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డి నుండే ప్రాతినిధ్యం వ‌హించారు. ఇప్పుడు  బీఆర్ ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ నేత‌లంతా ఫోక‌స్ చేస్తున్నారు. మ‌ల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థి రాగిడి ల‌క్ష్మారెడ్డి బ‌రిలో వున్నారు. ఇత‌నికి అండ‌గా మ‌ల్లారెడ్డి వున్నారు.  మ‌ల్కాజ్ గిరి ప‌రిధిలోని మేడ్చ‌ల్, మ‌ల్కాజ్ గిరిలో మ‌ల్లారెడ్డి, ఆయ‌న అల్లుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరికి భారీ అనుచ‌ర‌గ‌ణం కూడా ఉండ‌గా, గ‌తంలో మ‌ల్కాజ్ గిరి నుండి మ‌ల్లారెడ్డి ఎంపీగా కూడా ప‌నిచేశారు.  మ‌ల్కాజ్‌గిరి ఎంపీ నియోజ‌క‌వ‌ర్గంలో ఏడుగురు ఎమ్మెల్యేలు మ‌న ద‌గ్గ‌ర్నే ఉన్నారు. 200 మందికి పైగా కార్పొరేట‌ర్లు కూడా బీఆర్ఎస్ కు చెందిన వారే ఉన్నారు.  ప‌దేండ్ల నిజానికి, వంద రోజుల అబ‌ద్దానికి, మ‌రో ప‌దేండ్ల విధ్వంస కేంద్ర పాల‌న‌కి  మ‌ధ్య యుద్దం అంటూ బీఆర్ ఎస్ ప్ర‌చారం చేస్తోంది.  ఈటెల‌కు, ప‌ట్నం సునీతాకు ఇంగ్లీషు, హిందీలో మాట్లాడ‌డం రాదు. వాళ్ళు పార్ల‌మెంట్‌కు వెళ్ళి ఏం మాట్లాడ‌తారాని బీఆర్ ఎస్ నిల‌దీస్తోంది. అదే రాగిడి ల‌క్ష్మారెడ్డికి ఇంగ్లీష్, హిందీలో అద్భుతంగా మాట్లాడుతారు.. ప‌క్కా లోకల్ వ్య‌క్తి అయిన‌ అత‌ను మీ గొంతుక‌గా పార్ల‌మెంట్‌లో మాట్లాడుతారని బీఆర్ ఎస్ ప్ర‌చారం చేస్తోంది.  తెలంగాణ‌కు బీజేపీ ప్ర‌భుత్వం చేసిందేమీ లేదని చెప్పారు కేటీఆర్ ప‌దే ప‌దే చెబుతున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలకు ఎన్నో మెడిక‌ల్ కాలేజీలు ఇచ్చిన కేంద్రం, తెలంగాణకు మాత్రం గుండు సున్నా చుట్టిందని, కనీసం ఒక్క న‌వోద‌య పాఠ‌శాల కూడా ఇవ్వ‌లేదని, కొత్త‌గా ఒక్క విద్యాసంస్థ ఇవ్వ‌కుండా ప్ర‌ధాని కాల‌యాప‌న చేశారని అన్నారు.   కాంగ్రెస్ నుండి ప‌ట్నం సునీతా మ‌హేంద‌ర్‌రెడ్డి పోటీ లో ఉన్నారు. మంత్రి తుమ్మ‌ల‌కు ఇక్క‌డ ఇంచార్జ్ ఇవ్వ‌టంతో గెలుపుపై కాంగ్రెస్ న‌మ్మ‌కంగా ఉంది.  సిట్టింగ్ సీటుపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. గ‌త ఎన్నిక‌ల్లో రేవంత్ రెడ్డి గెలుపొందిన నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో మల్కాజిగిరి సీటును కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా ఈ స్థానంలో విజయం సాధించడమే కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతోంది.  అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్ల‌మెంట్ ప‌రిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెల‌వ‌క పోవడం కొంచెం మైనస్. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా, ఇక్కడి ప్రజలు మాత్రం బీఆర్ఎస్ కు జై కొట్టారు. చేవెళ్ల నుంచి అనుకున్న అభ్యర్థిని, ఎందుకో మల్కాజిగిరిలో బరిలో దింపారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌రిగిన త‌ప్పిదాలు జ‌ర‌గ‌కుండా, విజ‌య‌కేత‌నం ఎగుర‌వేయాల‌ని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. తాము గెలిస్తేనే నియోజకవర్గం అభివృద్ధి సాధ్యం అంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కూక‌ట్‌ప‌ల్లి, కుత్బుల్లాపూర్‌, మేడ్చల్‌, మ‌ల్కాజ్‌గిరి, ఉప్పల్‌, ఎల్బీన‌గ‌ర్, కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో అంత‌ర్భాగ‌మైన ఈ నియోజకవర్గాలు కీలక ప్రాంతాలు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 7 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మల్కాజిగిరి నియోజ‌క‌వ‌ర్గంలో దేశ ర‌క్షణ‌ రంగానికి చెందిన ఏయిర్ ఫోర్స్‌, ఆర్మీ స్థావరాలతో పాటు పారిశ్రామిక‌రంగం, విద్యారంగానికి సంబంధించిన ప్రతిష్టాత్మకమైన యూనిర్శిటీలకు  కేరాఫ్ అడ్రస్‌గా ఉంది.  ఈ నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు 38 ల‌క్షల ఓట‌ర్లు ఉన్నారు.     నార్త్ ఇండియా నుండి ఎక్కువ మంది నివాస‌ముంటున్న సీటు కావ‌టంతో గెలుపు ఈజీ అవుతుంద‌న్న ఆశ‌ల్లో బీజేపీ నేత‌లు ఉన్నారు. ఇటీవ‌ల గ‌జ్వేల్, హుజురాబాద్ నుండి పోటీ చేసిన ఈట‌ల రాజేంద‌ర్  బీజేపీ అభ్య‌ర్థిగా ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు.  మ‌ల్కాజిగిరి ఎంపీ స్థానాన్ని నెగ్గాలని బీజేపీ సైతం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని వ్యూహాలు రచిస్తోంది. మోదీ ప్రధానిగా హ్యాట్రిక్ కొడతారని చెబుతూ పార్లమెంట్ స్థానాలను గెలిపించాలని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రధాని న‌రేంద్ర మోదీ ఇటీవల మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో రోడ్ షో సైతం నిర్వహించారు. మోదీ ప్రజాద‌ర‌ణ క‌లిసొస్తుంద‌ని అధిష్టానం ధీమాతో ఉంది. బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ వంటి బ‌ల‌మైన అభ్యర్థి బరిలో ఉన్నారు. ఒక్కసారి కూడా మ‌ల్కాజిగిరి సీటు నెగ్గకపోవడంతో తో ఈసారి ఖ‌చ్చితంగా సాధించాలని ప‌ట్టుద‌ల‌తో ఉంది.  ఈసారి మాత్రం మోదీ మేనియాతో నెగ్గాలని ప్లాన్ చేస్తోంది. సిట్టింగ్ సీటు కోసం కాంగ్రెస్ ఫోకస్ చేస్తుండగా, కనీసం ఒక్కసారైనా మల్కాజిగిరిపై తమ జెండా ఎగరేయాలని బీఆర్ఎస్, బీజేపీ భావిస్తున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరిలో బీజేపీకి మంచి ఓట్‌ బ్యాంక్‌ ఏర్పడింది. వ్యక్తిగతంగా తనకున్న ఇమేజ్‌, పార్టీ సపోర్ట్‌.. ఈ రెండు కలిసివచ్చే అంశాలు ఉన్నట్లు ఈటెల లెక్కలు వేసుకుంటున్నారట.   తెలంగాణవాదుల్లో ఉదారవాదిగా ఉన్న ఈటల రాజేందర్ రెండు ప్రాంతాల ప్రజలు, గ్రేటర్ హైదరాబాద్‌లో కలిసిమెలిసి జీవించాలని కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 14 శాతం ఓట్లు, 8 సీట్లు సాధించడంలో కీలకమయ్యారు. ఈటల ప్రచారం నిర్వహించిన చోట్ల బీజేపీ అభ్యర్థులకు ఘననీయంగా ఓట్లు రావడం కూడా ఆయన పట్ల తెలంగాణ ప్రజల్లో ఉన్న క్రేజ్‌ను చాటుతోంది.  గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నినాదాన్ని బీజేపీ తీసుకోడానికి ముఖ్య కారణం ఈటల అని గుర్తుంచుకోవాలి. ఈ లోకసభ ఎన్నికల్లో 10 స్థానాలు గెలుచుకోవాలని, 35 శాతం ఓట్లు రాబట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.   ఇక్క‌డ పోటీ  కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉండటం, దేశ వ్యాప్తంగా బీజేపీకి ఉన్న సానుకూలత కలిసి వస్తాయన్న అభిప్రాయం ఉంది. ఈటల రాజేందర్ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సన్నిహితంగా ఉండటం కూడా ఎన్నికల్లో కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. హైదరాబాద్‌లో మరీ ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో హిందుత్వం, బీజేపీకి అడ్వాంటేజ్ అన్న భావన ఉంది.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌
Publish Date: Apr 25, 2024 11:57AM

అలీ ఎక్కడ? కనిపించడేం?

జగమెరిగిన కమేడియన్ అలీ..  ఎలాగైనా సరే చట్టసభకు వెళ్లాలని తహతహలాడారు. అన్ని పార్టీలూ తిరిగి, అన్ని చర్చలూ జరిపి.. తనకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకునేది ఒక్క వైసీపీ మాత్రమేనని నమ్మి గత ఎన్నికల ముందు ఆయన జగన్ ను నమ్ముకుని ఫ్యాన్ పార్టీ గూటికి చేరారు. ఆ క్రమంలో ఆయన సినీ పరిశ్రమలో  పవన్ కల్యాణ్ వంటి మిత్రుడిని దూరం చేసుకోవడానికి కూడా వెనుకాడలేదు. జనసేనానితో రాజకీయ ప్రవేశంపై అలీ చర్చించారు. అలీ జనసేన గూటికి చేరడం ఖాయమని కూడా అప్పట్లో అంతా భావించారు. కానీ అక్కుంబుక్కుం అంటూ అలీ జగన్ పంచన చేరాడు. దీనిపై మనవాళ్లనుకున్న వారు, మన నుంచి సహాయం పొందిన వారూ కూడా మోసం చేశారని పవన్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు కూడా. అయితే అప్పట్లో అలీ పవన్ మాటలకు చాలా ఘాటుగా రిటార్డ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ గారూ!  మీ నుంచి నేనేం సహాయం పొందానో చెప్పాలి? డబ్బులిచ్చారా? పోనీ సినిమాల్లో వేషాలిచ్చారా? అని ప్రశ్నించి, తాను స్వయంకృషితో ఎదిగాననీ, ఎవరి నుంచీ సహాయం పొందలేదనీ చెప్పుకున్నారు అలీ. సరే అందతా వేరే విషయం. అలీ జగన్ గూటికి చేరారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న అలీకి 2019 ఎన్నికలలో పోటీకి అవకాశం ఇవ్వకుండా చేయిచ్చారు జగన్. అయితే మంచి పదవి ఇస్తానంటూ ఐదేళ్ల పాటు అలీని ఆశల పల్లకీలో ఊరేగించారు. మధ్యలో ఒకటి రెండు సార్లు జగన్ అలీని తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని మరీ పదవిపై హామీని పునరుద్ఘాటించారు. ఆ రెండు సందర్భాలలోనూ సినీ పరిశ్రమ విషయంలో పంచాయతీ జరుగుతున్న సమయమే కావడం విశేషం.  సరే చివరికి ఆలీ ఆశించినంత పెద్ద పదవి కాకపోయినా.. కంటి తుడుపు చర్యగా ఓ సలహాదారు పదవి ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు జగన్. అయితే 2024 ఎన్నికలలో   అలీ పోటీ షూర్ అంటూ వైసీపీ నుంచి పలు లీకులు వచ్చాయి. ఆయన పోటీ చేసే నియోజకవర్గం కూడా తెరమీదకు వచ్చింది. తీరా జగన్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించాకా చూస్తే అలీ మళ్లీ కాట్రవల్లీయే అయిపోయారు.  ఇప్పటికి తత్వం బోధపడిందో ఏమో.. అలీ రాజకీయ యవనికపై ఎక్కడా కనిపించడం లేదు. వైసీపీ తరఫున ప్రచారంలో పాల్గొనడం లేదు.  ఈ మధ్యే ఓ టీవీ చానల్ లో ఆయన నిర్వహించే అలీతో సరదాగా అన్న కార్యక్రమంలో నటుడు శివాజీని ఇంటర్వ్యూ చేశారు. ఆ సందర్భంగా శివాజీ అలీకి రాజకీయాల జోలికి మాత్రం పోకు. ఒక వేళ పోయినా ఎన్నికలలో పోటీ మాత్రం చేయకు అంటూ ఓ సలహా పారేశారు. చూస్తుంటే అలీ ఆ సలహాను తుచ తప్పకుండా పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. 
Publish Date: Apr 25, 2024 11:11AM

కూటమికే యువత జై!

వైసీపీ గెలుపు ఆశలు రోజు రోజుకూ ఆవిరైపోతున్నాయి. బటన్ నొక్కి పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును పంచడం మాత్రమే పాలన అనుకుని ఐదేళ్లుగా అదే చేస్తూ వచ్చిన జగన్ సర్కార్ కు యువత షాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును ఎన్నికలలో ఓట్ల కోసం ఉచిత పందేరం చేసే హక్కు, అధికారం జగన్ కు ఎక్కడిదని యువత నిలదీస్తున్నారు. ఉపాధి, ఉద్యోగ కల్పన గురించి పట్టించుకోకుండా.. అధికార పగ్గాలు అందుకున్న క్షణం నుంచీ మరో సారి అధికారం కోసం ఉచిత పందేరాలే శరణ్యం అంటూ సాగిన జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలోనూ అధమ స్థానానికి చేరిన వైనాన్ని యువత గుర్తించారు. ఉద్యోగం, ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు వలస వెళ్లాల్సిన అవసరం మాకేంటి అంటూ జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు ఢోకా ఉండదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే మా మద్దతు తెలుగుదేశం కూటమికే నంటూ జై కొడుతున్నారు.  మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తేనే  రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయన్న నమ్మకం ఉందంటున్నది ఏపీ యువత.   మరీ ముఖ్యంగా తాజాగా నమోదైన కొత్త ఓటర్లయితే.. ఐదేళ్ల పాలనలో జరిగిన అవకతవకలు చాలు. ఇక అనుభవజ్ణుడైన చంద్రబాబుకే మా మద్దతు అంటున్నారు. ఇలా ఈ సారి ఎన్నికలలో తొలి సారి ఓటు వేయడానికి తమ ఓటు నమోదు చేయించుకున్న వారి సంఖ్య కోటీ పదిలక్షల పైనేనన్నది ఓ అంచనా.   గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు, అనేక కంపెనీలు ఏపీకి తరలివచ్చాయి. దానికోసం ఆయన  ఎంతో కృషి చేశారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన సందర్భంలో ఆయన కోసం దేశ విదేశాల్లోని తెలుగు వారంతా కదిలిన వైనాన్ని చూపుతూ ఆయన విధానాలు వేలాది, లక్షలాది మందికి ఐటీలో ఉన్నతోద్యోగాలు వచ్చేలా చేశాయని చెబుతున్నారు. ఇక విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన హయంలో విశాఖ, విజయవాడ, మంగళగిరి, కర్నూలు, అనంతపురం వంటి ప్రాంతాల్లో జాతీయ-అంతర్జాతీయ పరిశ్రమలు, స్టార్టప్ కంపెనీలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ఫలితంగా ఉత్తరాంధ్ర-కోస్తా నిరుద్యోగ యువకులకు, బయట రాష్ట్రాలకు వెళ్లే పని లేకుండా పోయిందని చెబుతున్నారు.   అయితే  వైసీపీ  అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ విధానాల కారణంగా చంద్రబాబు హయాంలో వచ్చిన కంపెనీలన్నీ ఒక్కొక్కటిగా పక్క రాష్ట్రాలకు తరలిపోయిన సంగతిని యువత ప్రముఖంగా ప్రస్తావిస్తూ తమ మద్దతు చంద్రబాబుకే. తెలుగుదేశం కూటమికే అని నిర్ద్వంద్వంగా చెబుతున్నారు.    
Publish Date: Apr 25, 2024 10:41AM

ఖ‌మ్మం లోక్ సభ అభ్య‌ర్థిగా పొంగులేటి వియ్యంకుడు.. కాంగ్రెస్ వ్యూహం ఫ‌లిస్తుందా?

ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ అభ్య‌ర్థిపై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. రామ స‌హాయం ర‌ఘురామిరెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్  హ‌వా కొన‌సాగింది. లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ ఖ‌మ్మంలో విజ‌యం సాధించేలా పార్టీ అధిష్టానం అభ్య‌ర్థి ఎంపిక‌లో పెద్ద క‌స‌ర‌త్తే చేసింది. ఈ క్ర‌మంలో ప‌లువురు పేర్ల‌ను అధిష్టానం ప‌రిశీలించింది. అనేక రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని చివ‌ర‌కు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి వియ్యంకుడు రామ స‌హాయం ర‌ఘురామిరెడ్డికి అధిష్టానం టికెట్ ఇచ్చింది. త‌ద్వారా పార్ల‌మెంట్ ప‌రిధిలోని రెండు బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాల ఓట‌ర్ల‌ను ఒకే గొడుగు కింద‌కు తీసుకొచ్చేలా కాంగ్రెస్ వ్యూహం రచించిందని జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.    తెలంగాణ‌లో మొత్తం 17లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఈ ఎన్నిక‌ల్లో 12 నుంచి 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగుర‌వేయాల‌ని పార్టీ అధిష్టానం ప‌ట్టుద‌ల‌తో ఉంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో అభ్య‌ర్థుల విజ‌యంకోసం కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు విస్తృత ప్ర‌చారం చేస్తున్నారు. అయితే  ఖ‌మ్మం, క‌రీంన‌గ‌ర్‌, హైద‌రాబాద్ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల ఎంపిక‌పై అధిష్టానం త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డింది. గురువారంతో నామినేష‌న్ల గ‌డువు ముగుస్తుండ‌టంతో బుధ‌వారం రాత్రి  మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌రిలో నిలిచే అభ్య‌ర్థుల పేర్ల‌ను ప్ర‌క‌టించింది. ఖమ్మం  లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచల రాజేందర్ రావు, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మహ్మద్ వలీవుల్లా సమీర్ పేర్లను అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. ముఖ్యంగా ఖ‌మ్మం లోక్ సభ నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థి ఎంపిక‌పై కాంగ్రెస్ అధిష్టానం భారీ  క‌స‌ర‌త్తే చేసింది. ఈ క్ర‌మంలో ప‌లువురి పేర్లు ప‌రిశీలించింది. జిల్లాలోని పార్టీ ముఖ్య‌నేత‌ల నుంచి అభిప్రాయాలు సేక‌రించిన అధిష్టానం.. మెజార్టీ అభిప్రాయాల మేర‌కు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి వియ్యంకుడు రామ స‌హాయం ర‌ఘురాంరెడ్డి పేరు ఖరారుచేసింది. ఖ‌మ్మం పార్ల‌మెంట్ సీటును త‌మ అనుచ‌రుల‌కే ద‌క్కేలా జిల్లాలోని ముగ్గురు మంత్రులు పోటీ ప‌డ్డారు. అయితే, సామాజిక వ‌ర్గాల వారీగా లెక్క‌ల‌ను బేరీజు వేసుకొని అధిష్టానం చివ‌రికి  పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి వియ్యంకుడు ర‌ఘురామిరెడ్డి పేరును అధిష్టానం  ఖరారు చేసి అధికారికంగా ప్ర‌క‌టించింది. రామ స‌హాయం రఘురామి రెడ్డికి రాజకీయ పలుకుబడి గట్టిగానే ఉంది. ఆర్థికంగానూ బ‌ల‌మైన వ్య‌క్తి. గ‌తంలో మహబూబాబాద్ లోక్‌సభ స్థానానికి రఘురామి రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి నాలుగుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆయ‌నకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డేకాక‌..  సినీ హీరో విక్టరీ వెంకటేశ్ కూడా   వియ్యంకుడే. హీరో వెంక‌టేశ్ కుమార్తె అశ్రిత‌ను ఆయ‌న పెద్ద కుమారుడు వినాయ‌క్ రెడ్డి వివాహం చేసుకోగా.. మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కుమార్తె స్వ‌ప్నిరెడ్డిని ఆయ‌న చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి వివాహం చేసుకున్నాడు. అయితే  ఖ‌మ్మం లోక్‌స‌భ‌ సిట్టింగ్ ఎంపీగా బీఆర్ ఎస్‌ నేత నామా నాగేశ్వ‌ర‌రావు ఉన్నారు. మ‌రోసారి బీఆర్ ఎస్ అధిష్టానం ఆయ‌న‌కే టికెట్ ఇచ్చింది. నామా నాగేశ్వ‌ర‌రావు క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌. రాష్ట్రంలో ప‌దిహేడు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ అధిష్టానం తొలుత ప్ర‌క‌టించిన 14 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ క‌మ్మ సామాజిక వ‌ర్గానికి  అవ‌కాశం ద‌క్క‌లేదు. దీంతో, ఖ‌మ్మం నుంచి అవ‌కాశం ద‌క్కుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, కాంగ్రెస్  అధిష్టానం మాత్రం రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తికే  టికెట్‌ కేటాయించింది. రామ‌స‌హాయంకు టికెట్ కేటాయించ‌డం వెనుక కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు జిల్లా రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.  ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్ర‌ధాన పార్టీలు క‌మ్మ సామాజిక వ‌ర్గం వ్య‌క్తికే టికెట్ కేటాయిస్తూ వ‌స్తున్నాయి. బీఆర్ ఎస్ పార్టీ అధిష్టానం అదే విధానాన్ని కొన‌సాగిస్తూ నామా నాగేశ్వ‌ర‌రావునే మ‌రోసారి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దింపింది. ఖ‌మ్మంలో  తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల‌కు బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం అభిమానులు కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో వారు నామావైపు మొగ్గుచూపే అవ‌కాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో నామాకు గ‌ట్టిపోటీ ఇచ్చేలా మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావును బ‌రిలోకి దింపాల‌ని  కాంగ్రెస్ అధిష్టానం ఒక దశలో భావించింది.  అయితే స్థానికేతరుడు అన్న అభ్యంతరాలు స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి వ్య‌క్తి కావడంతో  అధిష్టానం మండ‌వ పేరును ప‌క్క‌న పెట్టింది. నామాను ఢీకొట్టేందుకు కమ్మ సామాజిక వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో బ‌ల‌మైన నేత లేక‌పోవ‌టంతో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి   వియ్యంకుడు అయిన రామ స‌హాయం ర‌ఘురామిరెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఫైన‌ల్ చేసింది. రామ స‌హాయంకు విక్ట‌రీ వెంక‌టేశ్ కుటుంబంతో బంధుత్వం ఉండ‌టంతో ఖ‌మ్మం పార్ల‌మెంట్ ప‌రిధిలో రెండు బ‌ల‌మైన‌ సామాజిక  వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉంటుంద‌ని అధిష్ఠానం భావించినట్లు కనిపిస్తోంది.   కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం ఏమేర‌కు ఫ‌లిస్తుందో వేచి చూడాల్సిందే.
Publish Date: Apr 25, 2024 10:14AM

దస్తగిరిని కాపాడు దేవుడా!

గురువారం నాడు పులివెందులలో జగన్మోహన్‌రెడ్డి నామినేషన్ వేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి పేరిట ఈనెల 22వ తేదీన ఆయన మరో బాబాయ్ వైఎస్ మనోహర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. గురువారం నాడు జగన్ స్వయంగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా లోకల్‌గా వున్న వైసీపీ కార్యకర్తలు మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు పులివెందులకు వచ్చే అవకాశం వుంది. వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఇల్లు మరెక్కడో లేదు.. జగన్ ఇంటికి కూత వేటు దూరంలోనే వుంటుంది. గురువారం నాడు జగన్ నామినేషన్ సందర్భంగా దస్తగిరి ఇంటి మీదకి వైసీపీ కార్యకర్తలు ఆవేశంతో దాడి చేసి లేపేసే ప్రమాదం వుందనే అనుమానాలు వున్నాయి. అందుకే దస్తగిరికి బుధ, గురువారాల్లో భద్రత పెంచారు. ప్రస్తుతం 3 ప్లస్ 3, 4 ప్లస్ 4 భద్రత నుంచి 4 ప్లస్ 4, 10 ప్లస్ 10 స్థాయికి భద్రతను పెంచారు. ఇదిలా వుంటే వైసీపీ కారకర్తల బారి నుంచి దస్తగిరిని కాపాడు దేవుడా అని దస్తగిరి కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నారు. ఇదిలా వుంటే, మరోవైపు దస్తగిరి కూడా ర్యాలీగా వెళ్ళి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రేపు నామినేషన్ దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జై భీమ్ భారత్ పార్టీ తరఫున దస్తగిరి బరిలోకి దిగుతున్నారు. జగన్ నామినేషన్ వేసినప్పుడే తాను కూడా నామినేషన్ వేస్తానని, తనకు అధికారులు అడ్డుపడుతున్నారని దస్తగిరి అంటున్నారు. అధికారులు అడ్డుకున్నా తాను గురువారం నాడు నామినేషన్ వేయడం ఖాయమని ఆయన అంటున్నారు. తాను నిర్వహించే ర్యాలీలోకి వైసీపీ కార్యకర్తలు ప్రవేశించి దాడి చేసే అవకాశం వుందని దస్తగిరి అనుమానిస్తున్నారు.
Publish Date: Apr 24, 2024 7:21PM

చావగొడుతున్న భార్య.. చెరువులోకి దిగిన భర్త!

ఇది యావత్ భర్తలు సానుభూతిని వ్యక్తం చేయాల్సిన ఘటన. ఇలాంటి పరిస్థితి తమకూ రాకూడదని ప్రార్థించాల్సిన ఘటన. భర్త భార్యని కొడితే వార్త కాదు.. భార్య భర్తని కొడితే వార్త. అలాంటి వార్త వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్‌లోని కొంపల్లె ప్రాంతానికి చెందిన నగేష్ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం పెళ్ళయింది. (చాలామంది భార్యలు ఆమెని సంప్రదించి, భర్తని కొట్టడం ఎలా అనే పాఠాలు నేర్చుకునే ప్రమాదం వుంది కాబట్టి, సదరు భార్య పేరు గానీ, ఆమె వివరాలు గానీ ఇవ్వడం లేదు.. ఇది భర్తలకు మావంతుగా మేం అందిస్తున్న సహకారం). వీళ్ళ దాంపత్యానికి గుర్తుగా ఇద్దరో ముగ్గురో పిల్లలు కూడా వున్నారు. పిల్లలు పుట్టేవరకూ బాగానే వుందిగానీ, ఆ తర్వాత ఏం తేడా వచ్చిందో ఏమో, సదరు నగేష్ భార్య భర్తని చావబాదడం ప్రారంభించింది. తనకు ఎప్పుడు కోపమొస్తే అప్పుడు భర్తకి బడితపూజ చేసేది. చేతికి ఏది దొరికితే దానితో చావబాదే పెళ్ళాం ధాటికి తట్టుకోలేక, ఇక జీవించి వృధా అని నగేష్ ఏం చేశాడంటే, తన ఇంటికి దగ్గర్లోనే వున్న చెరువులోకి దిగాడు. ఇది గమనించిన వారు, పెద్దగా అరిచి నగేష్‌ని ఆపారు. చెరువులో ఎందుకు దూకావని అడిగితే, నగేష్ తన కష్టాన్నీ చెప్పుకుని బాధపడ్డాడు.  తన భార్య తనను ప్రతిరోజూ టైమ్ టేబుల్ తప్పకుండా కొడుతుందని, అప్పుడప్పుడు వాతలు కూడా పెడుతుందని చెప్పుకొచ్చి భోరుమన్నాడు. తన మాటలు జనం నమ్ముతారో లేదోనని చొక్కా విప్పి మరీ తన ఒంటి మీద వున్న వాతలు చూపించాడు. తన పిల్లలని తన దగ్గరకి రానివ్వదని, తన పిల్లల కోసం  ఐస్‌క్రీమ్ కొని తీసుకెళ్తే, తన భార్య దాన్ని పిల్లలకు పెట్టకుండా తానే తినేస్తుందని చెప్పి లబోదిబోమన్నాడు. భార్య టార్చర్ భరించలేక తాను అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళడం కూడా మానుకుంటానని చెప్పాడు. అలాంటి సందర్భాల్లో తన పిల్లలు డాడీ ఎక్కడకి వెళ్ళాడమ్మా అని తన పిల్లలు అడిగితే, తన భార్య చచ్చిపోయాడు అని కూల్‌గా చెబుతుందని చెప్పి నగేష్ బావురుమన్నాడు. తన భార్య నుంచి తనకు విడాకులు కావాలని వేడుకున్నాడు. విడాకులు ఇప్పించకపోతే చచ్చిపోతానని చెప్పాడు. దాంతో స్థానికులు అతనికి నచ్చజెప్పారు. తాడు వేసి అతన్ని  చెరువులోంచి పైకి లాగాడు. పరిస్థితులు మెల్లగా చక్కబడతాయిలే అని అతనికి చెప్పి ఇంటికి పంపించారు. నగేష్ ఇంటికి వెళ్ళాడు. మరి పరిస్థితులు చక్కబడతాయో... భార్య చేతిలో ఇంకో రౌండ్ కోటా పడుతుందో ఆ పైవాడికే తెలియాలి.
Publish Date: Apr 24, 2024 6:29PM

కేసీఆర్ బస్సు యాతన ప్రారంభం

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ ప్రచారంలోకి దిగారు. బుధవారం నాడు తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమైంది. తెలంగాణ భవన్‌లో వున్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, మహిళల హారతులు అందుకుని, కార్యకర్తల బాణాసంచా హడావిడి మధ్య కేసీఆర్ బస్సు ఎక్కారు. బుధవారం నుంచి మే 10 వరకు కేసీఆర్ బస్సు యాత్ర జరుగుతుంది. మిర్యాలగూడలో మొదటి సభ, సిద్దిపేటలో చివరి సభ జరుగుతాయి. రాష్ట్రమంతా తిరగాలని కేసీఆర్‌కి విజ్ఞప్తులు వస్తున్నప్పటికీ సమయం తక్కువగా వుండటం, ఎండ బాగా వుండటం వల్ల కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే తిరగాలని కేసీఆర్ భావించారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ చేపట్టిన ఈ బస్సు యాత్రను.. బస్సు యాత్ర అనడం కంటే ‘బస్సు యాతన’ అనడం బెస్టు. ఎందుకంటే, పార్లమెంట్ ఎన్నికలలో తమ పార్టీ పదికి పైగానే స్థానాలు గెలుస్తుందని బీఆర్ఎస్ నేతలు బిల్డప్పుగా చెబుతున్నప్పటికీ, ఒక్క మెదక్ స్థానంలో తప్ప ఎక్కడా గెలిచే అవకాశాలు లేవని ఏరకంగా చూసిన క్రిస్టల్  క్లియర్‌గా అర్థమవుతోంది. మెదక్ విషయంలో రేవంత్ రెడ్డి ఏదైనా మ్యాజిక్ చేస్తే  ఆ స్థానం కూడా బీఆర్ఎస్‌కి దక్కనట్టే. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఈ వయసులో పదిహేను రోజులపాటు బస్సు యాత్ర చేసి యాతన పడటం అవసరమా అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కేసీఆర్ ఇప్పుడు చేపట్టిన బస్సు యాత్ర అయిపోయిన పెళ్ళికి సన్నాయి ఊదినట్టుగా వుందని భావిస్తున్నారు.
Publish Date: Apr 24, 2024 6:04PM

మళ్ళీ ‘టీఆర్ఎస్’గా మార్చాలా? ఎల్లెళ్ళవయ్యా!

కేసీఆర్ తన పార్టీ పేరును ఏ దుర్ముహూర్తంలో ‘టీఆర్ఎస్’ నుంచి ‘బీఆర్ఎస్’ అని మార్చాడో అప్పటి నుంచి ఆయన కుటుంబాన్ని, ఆయన పార్టీని దరిద్రం బబుల్ గమ్ అతుక్కున్నట్టు అతుక్కుంది. ఆ దరిద్రం పుణ్యమా అని అటు అధికారం పోయింది. ఇటు ముద్దుల కూతురు తీహార్ జైల్లో పడింది. పదేళ్ళ కేసీఆర్ హయాంలో జరిగిన కుంభకోణాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. ఇంకా ముందు ముందు ఇంకెంత బ్యాండ్ పడనుందో ఆ భగవంతుడికే తెలియాలి. తెలంగాణ ప్రజల్లో వున్న సెంటిమెంట్‌ని అడ్డం పెట్టుకుని, ఆంధ్ర ప్రజలను తిట్టిపోసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ నుంచి ‘భారత రాష్ట్ర సమితి’ అని మార్చడమే మామూలు విషయం కాదు.. పార్టీ పేరు బీఆర్ఎస్ అని మార్చిన సమయంలో పింక్ పిల్లకాయలంతా కేసీఆర్ ప్రధానమంత్రి కాబోతున్నారని కలలు కన్నారు. కేసీఆర్ కూడా ఆ ఊహల్లో ఊరేగారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పేరుతో హడావిడి చేశారు. ఇంతకాలం తాము తిట్టిపోసిన ఆంధ్రప్రదేశ్‌లో కూడా బిఆర్ఎస్ బ్రాంచ్ ఓపెన్ చేశారంటే వీళ్ళ తెంపరితనానికి, నిస్సిగ్గు వైఖరికి ఇంతకంటే వేరే ఉదాహరణ వుంటుందా? శరీరంలో వున్న సిగ్గుని చివరి బొట్టు వరకూ బయటకి కక్కేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ శాఖ ప్రారంభించాలన్న ఆలోచన రాదు. 2023 ఎన్నికల తర్వాత కేసీఆర్ కొంతకాలం ముఖ్యమంత్రిగా వుంటారు. ఆ తర్వాత 2024 పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో వున్న ఎంపీ సీట్లన్నీ గెలుచుకుని, ఏకంగా మోడీని పక్కకి నెట్టేసి కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారు... అప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుని తెలంగాణ ప్రజల్ని ఉద్ధరిస్తారు... ఇదీ బీఆర్ఎస్ వర్గాలు ఆరోజుల్లో కన్న పగటి కల. రేవంత్ రెడ్డి పుణ్యమా అని ఆ కల కల్లగా మారిపోయింది. అప్పటి నుంచి బీఆర్ఎస్ వర్గాల్లో ‘పార్టీ పేరు మారిన తర్వాతే మనం మటాష్ అయిపోవడం ప్రారంభమైంది’ అనే అంతర్మథనం మొదలైంది. పార్టీ పేరు మార్చడం తప్పే అని చాలామంది పార్టీ నాయకులు కేసీఆర్ తిడతాడేమో అనే భయం కూడా లేకుండా బాహాటంగానే చెప్పారు. మరికొంతమంది అయితే, త్వరలో మా పార్టీ పేరు టీఆర్ఎస్‌గా మారబోతోంది అని ప్రకటించేశారు కూడా. పార్టీ వర్గాల ఆకాంక్షలను అర్థం చేసుకోవడంతోపాటు తన మనసులో కూడా వున్న ‘బీఆర్ఎస్’ ప్రభావం ప్రేరేపించడంతో కేసీఆర్ ఎన్నికల సంఘాన్ని సంప్రదించారని తెలుస్తోంది. ఒక్కసారి పార్టీ పేరుని మార్చుకున్న తర్వాత పాత పేరును ఎన్నికల కమిషన్ ఐదేళ్ళపాటు ఫ్రీజ్ చేస్తుంది. ఐదేళ్ళపాటు ఆ పేరుని ఎవరికీ కేటాయించదు. మీరు మళ్ళీ మాకు టీఆర్ఎస్ పేరు కావాలంటే ఎలా సార్? ఇంత చిన్న లాజిక్ మీరు ఎలా మిస్సయ్యారు సార్... అనే అర్థం వచ్చేలా ఎన్నికల సంఘం అధికారుల నుంచి రియాక్షన్ వచ్చిందట. దాంతో బీఆర్ఎస్ అనే పేరును టీఆర్ఎస్‌గా మార్చాలనే ప్రయత్నాలు మానేశారట. ఇప్పటికిలా సర్దుకుపోయి పేరు మార్పు సంగతి ఐదేళ్ళ తర్వాత ఆలోచిద్దామని డిసైడ్ అయ్యారట.
Publish Date: Apr 24, 2024 4:39PM