మసాలా పౌడర్లలో ఇథిలీన్ ఆక్సైడ్... క్యాన్సర్ ప‌క్కా అంటున్న న్యూట్రీష‌న్లు

భారతీయ మసాలా పౌడర్లపై సింగపూర్ బ్యాన్ విధించింది. గ‌తంలోనూ అమెరికా భార‌తీయ మ‌సాలా బ్రాండ్ల‌ను మార్కెట్ నుంచి ఉప‌సంహ‌రించుకోవాల‌ని  అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ ఆదేశించింది.  నెస్లే, సెరెలాక్  ఉత్పత్తులలో అదనపు చక్కెర ఉన్నట్లు బెల్జియన్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. దేశంలోని అన్ని మసాలా తయారీ కంపెనీల నుండి నమూనాలను సేక‌రిస్తున్న‌ట్లు స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎబి రెమ శ్రీ తెలిపారు. మరో 20 రోజుల్లో ల్యాబ్ నుండి నివేదిక వస్తుంది. అనంతరం ఆయా బ్రాండ్లపై క‌ఠిన చర్యలు తీసుకుంటామ‌ని స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా తెలిపింది.   ఎవరెస్ట్, ఎండీహెచ్‌ తయారు చేసిన మసాలాలు వాడొద్దని సింగపూర్, హాంకాంగ్‌ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఆ దేశ ప్రజలకు సూచించింది. ఈ కంపెనీల‌ ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలను నిలిపి వేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే....ఎండీహెచ్ మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా మిక్స్డ్ పౌడర్, కర్రీ ఫౌడర్ మిక్స్డ్ మసాలా, ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలలో పెస్టిసైడ్, ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు గుర్తించామని హాంకాంగ్ ఆహార భద్రతా విభాగమైన 'సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ' సీఎఫ్ఎస్ చెప్పింది.  ఫెస్టిసైడ్ అవశేషాలున్న ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరం. ఇథిలీన్ ఆక్సైడ్ వంటి క్రిమిసంహారక మందుల అవశేషాలు ఉంటే హాంకాంగ్ చ‌ట్టాల ప్ర‌కారం గరిష్టంగా 50వేల డాలర్ల జరిమానా విధిస్తారు. నేరం రుజువైతే జరిమానాతో పాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. గ‌తంలోనూ అదే....2023లో ఎవరెస్ట్ సాంబార్ మసాలా, గరం మసాలాను మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ ఆదేశించింది. వాళ్ళు చెప్పిందేమిటంటే ఈ సుగంధ ద్రవ్యాలలో సాల్మొనెల్లా ఉన్నట్లు అప్పట్లో గుర్తించారట‌. ఈ బ్యాక్టీరియా వల్ల అతిసారం, కడుపు నొప్పి, జ్వరం, తల తిరగడం, వాంతులు అవుతాయి.  అలాగే నెస్లే, సెరెలాక్  ఉత్పత్తులలో అదనపు చక్కెర ఉన్నట్లు కనుగొన్నారు. శిశువులకు అంత చక్కెర ఇవ్వడం మంచిది కాదని బెల్జియన్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది.  ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్‌వర్క్ సహకారంతో ఈ రిపోర్టు రూపొందించారు.   “ప్రతి ప్రోడక్టు ఎగుమతి చేయడానికి ముందు, వాటిని స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా పరీక్షిస్తుంది.  అయితే  సింగపూర్, హాంకాంగ్‌ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ నాణ్య‌తా ప‌రీక్ష‌ల‌కు, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ నాణ్య‌తా ప‌రీక్ష‌ల‌కు, బెల్జియన్ ల్యాబ్ నివేదికల‌కు, మ‌న‌ స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా టెస్ట్‌ల‌కు తేడా ఎందుకు వ‌చ్చింది? ఇదే చ‌ర్చ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతోంది. ఇండియాలో చేసే నాణ్య‌తా ప‌రీక్ష‌ల్లో నాణ్య‌త క‌నిపించి, విదేశాల్లో జ‌రిపిన నాణ్య‌తా ప‌రీక్ష‌ల్లో నాణ్య‌త లేక‌పోవ‌డానికి కార‌ణం ఏమిట‌ని దేశ ప్ర‌జ‌లు మాట్లాడుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది.  దేశంలోని అన్ని తయారీ యూనిట్ల నుండి సుగంధ ద్రవ్యాల నమూనాలను సేకరించాలని ఫుడ్ కమిషనర్‌లను ఆదేశించింది. మసాలా దినుసుల నమూనాల సేకరణ ప్రక్రియ ఇప్ప‌ట్టికే ప్రారంభమైంది.  మూడు నాలుగు రోజుల్లో దేశంలోని అన్ని సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ల నుంచి నమూనాలను సేకరిస్తామ‌ని కేంద్ర‌ ప్రభుత్వ ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.  భారతదేశంలోనూ ఆహార పదార్థాలలో ఇథిలీన్ ఆక్సైడ్ వాడకంపై నిషేధం ఉంది.  ఒక వేళ మసాలా దినుసుల్లో హానికరమైన పదార్థాలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. తాము ఉత్ప‌త్తి చేసే ఉత్పత్తులకు, హానికరమైన అంశాలు జోడించరాదని అవగాహన కల్పించాలని వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సుగంధ ద్రవ్యాల బోర్డుకు భార‌త ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.  భారతీయ బ్రాండ్‌లకు చెందిన నాలుగు సుగంధ ద్రవ్యాలు-మిక్స్ ఉత్పత్తుల అమ్మకాలపై హాంకాంగ్ మరియు సింగపూర్ విధించిన నిషేధాన్ని పరిశీలిస్తున్నట్లు  స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎబి రెమ శ్రీ తెలిపారు. ఇథిలీన్ ఆక్సైడ్ ఆరోగ్యంపై తీవ్ర‌ ప్రభావం చూపుతుందని  ఎబి రెమ శ్రీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇథిలీన్ ఆక్సైడ్‌ను 'గ్రూప్ 1 కార్సినోజెన్'గా వర్గీకరించిందని ఆమె చెప్పారు. అంటే "ఇది మానవులలో క్యాన్సర్‌కు కారణమవుతుంది.  మానవ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కళ్ళు, చర్మం, ముక్కు, గొంతు మరియు ఊపిరితిత్తులు చికాకు కలిగించ‌డంతో పాటు మెదడు,  నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది.  దేశంలోని అన్ని మసాలా తయారీ కంపెనీల నుండి నమూనాలను తీసుకుంటామని స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎబి రెమ శ్రీ తెలిపారు. మరో 20 రోజుల్లో ల్యాబ్ నుండి నివేదిక వస్తుంది. అనంతరం ఆయా బ్రాండ్లపై చర్యలను ఖరారు చేయనున్నారు.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌
Publish Date: Apr 24, 2024 12:58PM

కుడితి తొట్టెలో బల్లి కేసీఆర్!

అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడిందట. పాపం బల్లికి బయటి వాళ్ళ భవిష్యత్తు చెప్పడం తెలుసుగానీ, తన భవిష్యత్తే తనకు తెలియదు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిస్థితి కూడా కుడితి తొట్టెలో పడ్డ బల్లి తరహాలోనే వుంది. తన అధికారం ఊడిపోయే వరకు తనకు తెలియలేదుగానీ, ఏపీ ఎన్నికలలో వైసీపీ గెలుస్తుందని ఈయనగారు జోస్యం చెబుతున్నారు. వైసీపీ గెలుస్తుందన్న సమాచారం తన దగ్గర వుందట. కేసీఆర్‌కి ఆ సమాచారం ఏ తల మాసినవాడు ఇచ్చాడో! ‘నా దగ్గర సమాచారం వుంది’, ‘సరైన సమయంలో బయటపెడతా’ లాంటి పడికట్టు పదాలు ఇక కేసీఆర్ మానుకుంటే మంచింది. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ దారుణంగా ఓడిపోవడం ఖాయమని ఏపీలో జనాలు చెబుతున్నారు. నేషనల్ మీడియా చేసిన సర్వేలో కూడా వైపీపీ పని ఖతం అని తేలిపోయింది. మరి ఫామ్ హౌస్‌లో పడుకునే కేసీఆర్‌కి అంత గొప్ప సమాచారం ఇచ్చిందెవరో! ఈయన ఒక సిద్ధాంతి.. ఈయనకి సమాచారం ఇచ్చినాయన ఒక వేదాంతి. సాధారణంగా బల్లి కుడితి తొట్టెలో పడకముందు శకునాలు చెబుతుంది. కుడితి తొట్టెలో పడిన తర్వాత శకునాలు చెప్పడాలేవీ వుండవు. కేసీఆర్ మాత్రం కుడితి తొట్టెలో పడిన తర్వాత కూడా శకునాలు  చెప్పడమే ఇక్కడ వింత. కేసీఆర్‌కి మొదటి నుంచీ ఏపీ అన్నా, చంద్రబాబు అన్నా ద్వేషం. ఏపీ సర్వనాశనం అయిపోతే కేసీఆర్ కళ్ళు చల్లగా వుంటాయి. గత ఐదేళ్ళలో జగన్‌తో కలసి తన కళ్ళను చల్లగా చేసుకున్న కేసీఆర్, మరో ఐదేళ్ళు ఆ చల్లదనాన్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు. ఇక తమరి పప్పులు ఉడకవు కేసీఆర్.. ఈ ఎన్నికల తర్వాత మీరు, జగన్ కలసి భజన చేసుకుంటూ కూర్చోవాల్సిందే.
Publish Date: Apr 24, 2024 12:14PM

ఓటమి తరువాత నెల రోజులకే వైసీపీ ఖాళీ.. సీఎం రమేష్ జోస్యం

తెలుగు రాష్ట్రాలలో రాజకీయ స్నేహం గురించి చెప్పుకోవలసి వస్తే ముందుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ గురించే చెప్పుకోవాలి. 2018లోనే అంటే నిర్దిష్ట గడువు కంటే ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. 2019లో ఏపీలో జరిగిన ఎన్నికలలో తన మిత్రుడు జగన్ విజయం కోసం తెలంగాణ నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. సరే ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని కేసీఆర్ వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టారని పరిశీలకులు అప్పట్లో విశ్లేషణలు చేశారు. హైదరాబాద్ లో స్థిరపడ్డ ఆంధ్రుల నుంచి ఇక్కడి తెలుగుదేశం పార్టీకి ఏ రకంగానూ సహకారం అందకుండా నిలువరించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారనీ, ఇందు కోసం తెలంగాణలోని ఆంధ్రులపై ఆయన సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించారనీ కూడా అప్పట్లో చెప్పుకున్నారు. సరే అది పక్కన పెడితే.. జగన్ సైతం తన మిత్రుడికి 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఇతోధిక సహకారం అందించారు. లేని సెంటిమెంటును రెచ్చగొట్టైనా మిత్రుడు కేసీఆర్ ను గట్టెక్కించాలని జగన్ ప్రయత్నించారు. ఎన్నికల రోజుకు సరిగ్గా ముందు రోజు అర్ధరాత్రి సాగర్ వద్ద ఏపీ పోలీసులతో హంగామా చేయించారు. అయితే అవేమీ ఫలించలేదు. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే బీఆర్ఎస్ పరాజయం తరువాత ఆ పార్టీ రోజు రోజుకూ బక్కచిక్కిపోతున్న పరిస్థితి. పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నుంచి కాంగ్రెస్, బీజేపీలలోకి వలసలు పెరిగిపోయాయి. పోతే పోనీ అని బీఆర్ఎస్ అధినేత డాంబికంగా చెబుతున్నప్పటికీ.. వలసల ఉధృతి చూస్తుంటే లోక్ సభ ఎన్నికల తరువాత ఆ పార్టీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయమే పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది. సిట్టింగులు, మాజీలే కాదు, ద్వితీయ శ్రేణి నేతలూ, చివరాఖరికి పార్టీ క్యాడరూ కూడా కారు దిగిపోవడానికి తహతహలాడుతున్న పరిస్థితి తెలంగాణలో కనిపిస్తోంది.  ఇదే విషయాన్ని బీజేపీ నేత, ఆ పార్టీ అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి సీఎం రమేష్ ఎత్తి చూపుతూ.. ఏపీలో జగన్  ఓటమి తరువాత వైసీపీకీ అదే గతి పడుతుందన్నారు. అంతే కాదు బీఆర్ఎస్ కంటే వేగంగా వైసీపీయే ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. ఒక చానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీఎం రమేష్ జగన్ అధికారం కోల్పోయిన తరువాత కనీసం నెల రోులు కూడా ఆ పార్టీ మనుగడ సాగించ లేదనీ, చాలా వేగంగా జారుడుబండ మీద నుంచి జారినట్లు ఆ పార్టీ నుంచి నేతలు జారిపోతారని రమేష్ అన్నారు. కనీసం బీఆర్ఎస్ నేతలు వలసల విషయంలో కొంత సమయం తీసుకున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం అంత టైమ్ జగన్ కు ఇవ్వరన్నారు.    నిజమే.. పేరుకే ఎమ్మెల్యే సొంత నియోజకవర్గంలో మాత్రం పెత్తనమంతా వాలంటీర్లదే. ఆ పరిస్థితుల్లో ఎన్నో అవమానాలకు గురైన ఎమ్మెల్యేలకు జగన్ పట్ల విధేయత, విశ్వసనీయత ఉండే అవకాశం లేదని పరిశీలకులు సైతం అంటున్నారు. ఇప్పటికే జగన్ పట్ల పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తోందనీ, ఓటమి తరువాత అది తిరుగుబాటు స్థాయికి చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదనీ అంటున్నారు. 
Publish Date: Apr 24, 2024 12:05PM

కేసీఆర్ మారడు.. మరోసారి క్లారిటీ వచ్చింది!

పుట్టుకతో వచ్చిన బుద్ధి... అంటారు చూశారా.. ఆ మాట తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి సరిగ్గా సూటవుతుంది. పదేళ్ళపాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా అహంకారపూరితమైన అధికారాన్ని చెలాయించిన కేసీఆర్‌ని, ఆయన పార్టీని నిన్నటి ఎన్నికలలో తెలంగాణ ప్రజలు ఇంటికి సాగనంపారు. దారుణమైన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, ఆత్మ విమర్శ చేసుకుని, పద్ధతులలో మార్పులు చేసుకుంటే వచ్చే ఎన్నికలలో కేసీఆర్‌కి మళ్ళీ ప్రజాదరణ లభిస్తే లభించవచ్చు. కానీ, కేసీఆర్‌గానీ, ఆయన పార్టీలోని వ్యక్తులుగానీ తమ పాత ధోరణిలోనే వున్నారు తప్ప మారే ధోరణిలో ఎంతమాత్రం లేరు. ఈ విషయం కేసీఆర్ తాజాగా ఒక ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన తీరు చూస్తూ అర్థమవుతోంది. తమను ఇంటికి పంపించి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని కేసీఆర్ అంటున్నారంటే, ఇంతకంటే అమాయకత్వం, అహంకారం మరొకటి వుంటుందా? 1989లో ఎన్టీఆర్‌ని కూడా ప్రజలు ఓడించారు. తనకు తిరుగేలేదని అప్పటి వరకూ భావిస్తూ వచ్చిన ఎన్టీఆర్ ప్రజలు ఇచ్చిన తీర్పుతో షాకయ్యారు. అయినప్పటికీ, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, తనను తాను మార్చుకున్నారు. అంతే తప్ప ప్రజలను ఏనాడూ నిందించలేదు. ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లో రాణించిన కేసీఆర్ ఎన్టీఆర్ నుంచి ఈ గుణాన్ని నేర్చుకోలేదు. పదేళ్ళ కేసీఆర్ అధికారాన్ని పీకి అవతల పారేసిన రేవంత్ రెడ్డి ఇప్పటికీ కేసీఆర్‌కి అంగుష్టమాత్రుడిగానే కనిపిస్తున్నారు. కేసీఆర్ ఇప్పటికీ తనను తాను హిమాలయాలంత ఎత్తున ఉన్నట్టుగానే ఊహించుకుంటున్నారు. తాను పదేళ్ళపాటు అద్భుతమైన పరిపాలన అందించినట్టే భావిస్తున్నారు. తాను తీసుకున్న నిర్ణయాలన్నీ చాలా గొప్పవనే భావిస్తున్నారు. మేడిగడ్డ కుంగిపోవడం చాలా చిన్న విషయంగానే భావిస్తున్నారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. తాను చాలా గొప్ప పరిపాలన అందించినట్టే ఆయన భావిస్తున్నారు.  బీఆర్ఎస్ పార్టీ క్రమంగా ఖాళీ అవుతోంది. భవిష్యత్తులో కేసీఆర్ కుటుంబం, ఆయన కుటుంబానికి విధేయంగా పడివుండేవారు తప్ప మరెవరూ ఆ పార్టీలో వుండే అవకాశాలు కనిపించడం లేదు. ఇలాంటి వాస్తవ పరిస్థితులకు భిన్నమైన విధంగా కేసీఆర్ వాదన వుంది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన నాయకులు తనకు ఫోన్ చేసి, అనవసరంగా బీఆర్ఎస్‌ని వదిలి వెళ్ళామని బాధపడుతున్నారట. కేసీఆర్ అధికారంలో వున్నప్పుడు పార్టీలో వున్న ఎమ్మెల్యేలు, ఎంపీలకే కేసీఆర్‌కి ఫోన్ చేసే సీన్ లేదు.. ఇప్పుడు బయటకి వెళ్ళిన వాళ్ళు ఫోన్ చేయడం, ఈయన మాట్లాడ్డం... బాగుందండి కల్పన. కేసీఆర్ అక్కడితో ఆగలేదు. కాంగ్రెస్ పార్టీలో వున్న 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు తనకు టచ్‌లో వున్నారట. వాళ్ళంతా బీఆర్ఎస్‌కి మద్దతు ఇస్తున్నారట, కాంగ్రెస్ నుంచి  బయటకి వచ్చి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. 
Publish Date: Apr 24, 2024 11:55AM

నెక్స్ట్ ఎవరు.. సీఎస్, డీజీపీయేనా? ఏపీ అధికారుల్లో చర్చ!

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అదే కోడ్ అమలులోకి వచ్చింది. దేశ మంతా కోడ్ అమలు అవుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అసలు ఎన్నికల కోడ్ అమలులో ఉందా అన్న అనమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. కోడ్ లెక్క చేయకుండా అధికార యంత్రాంగం అధికార పార్టీ సేవలో తరించిపోతుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందన్న విమర్శలూ వెల్లువెత్తాయి. పశ్చిమబెంగాల్ లో అయితే ఇలా కోడ్ అమలులోకి వచ్చిందో లేదో అలా ఆ రాష్ట్ర పోలీస్ చీఫ్ కు స్థాన భ్రంశమైంది. అక్కడి కంటే అడ్డగోలుగా ఇక్కడ అధికార యంత్రాంగం జగన్ ప్రభుత్వ సేవలో  తరిస్తుంటే ఎన్నికల సంఘం ఉదాశీనంగా వ్యవహరిస్తుండటంపై పలు అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.  అయితే ఆలస్యంగానైనా కేంద్ర ఎన్నికల సంఘం ఏపీపై దృష్టి సారించింది. అధికార పార్టీకి అనుకూలంగా అంటకాగుతున్న అధికారులపై వేటు వేస్తోంది. తాజాగా ఇంటలిజన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా తాతాపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.  ఎన్నికల ప్రక్రియతో సంబంధం లేని పోస్టింగ్ ఇవ్వాలని విస్పష్టంగా ఆదేశించింది.   ఎన్డీఏ కూటమి చాలా రోజుల నుంచి  రాష్ట్ర ఇన్చార్జి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్‌రెడ్డి, సీఎస్ జవహర్‌రెడ్డి, ఇంటలిజన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణా తాతా సహా.. ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్న ముగ్గురు డీఎస్పీలు, మరికొందరు పోలీసు అధికారులను, ఎన్నికల వరకూ ఆ బాధ్యతల నుంచి తప్పించాలని ఈసీకి ఫిర్యాదు చేసింది. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అయితే.. అధికారపార్టీ అడుగులకు మడుగులొత్తుతున్నట్లుగా వ్యవహరిస్తున్న అధికారుల జాబితాతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.   ముఖ్యంగా సీఎస్ జవహర్‌రెడ్డి పెన్షన్ల విషయంలో  ఈసీ ఆదేశాలు ఉల్లంఘించి జగన్ పార్టీకి మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఇక ఇంటలిజన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఫిర్యాదు చేసింది. అయితే విచిత్రంగా కీలకమైన నిర్ణయాలు తీసుకునే స్థానాల్లో ఉన్న సీఎస్ జవహర్‌రెడ్డి, ఇన్చార్జి డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డిని తొలగించకుండా..  ఇంటలిజన్స్ చీఫ్‌ను తప్పించడం ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయమే. దేశంలో ఇఫ్పటివరకూ ఇన్ చార్జ్ డీజీపీ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగిన సందర్భం లేదు. పశ్చిమ బెంగాల్ లో పూర్తి స్థాయి డీజీపీనే కోడ్ అమలులోకి వచ్చీరాగానే తప్పించిన ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇన్ చార్జ్ డీజీపీని ఇంత వరకూ ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలంటూ ఆదేశాలు ఇవ్వకపోవడంపై రాజకీయ పరిశీలకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నా ఇన్ చార్జి డీజీపీ విషయంలో  ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఎన్నికల సంఘం పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే సీఎస్ గా కాకుండా, అధికార పార్టీ నేతగా వ్యవహరిస్తున్నారంటూ జవహర్ రెడ్డిపై కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇన్ చార్జ్ డీజీపీ కంటే ముందు ఆయనపై ఎన్నికల సంఘం వేటు వేసే అవకాశం ఉందనీ, ఆ తరువాత కొత్తగా వచ్చే సీఎస్ డీజీపీ విషయంలో నిర్ణయం తీసుకుంటారన్న వాదన అధికారవర్గాల్లో వినవస్తోంది. సీఎస్, ఇన్ చార్జ్ డీజీపీల మార్పు అయితే ఖాయమని అంటున్నారు.  ఇహనో, ఇప్పుడో లేదా నేడో రేపో అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయని అంచనా వేస్తున్నారు. అది పక్కన పెడితే తాజాగా ఇద్దరు కీలక ఐపిఎస్ అధికారులపై బదిలీ వేటుతో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులలో ఆందోళన మొదలైంది.  ఇప్పటికే ఎన్డీఏ నేతల ఫిర్యాదులు ఎదుర్కొంటున్న ఈ స్థాయి అధికారులలో కంగారు మొదలైంది. అధికార పార్టీకి అనుకూలంగా ఎంతగా సేవ చేసినా ఎన్నికల సమయంలో ఈసీ కొరడా ఝుళిపించకుండా తమను అధికార పార్టీ నేతలు కానీ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కానీ కాపాడలేరన్న విషయం ఇప్పుడు వారికి అర్థమైనట్లు కనిపిస్తోంది. ఇక నుంచి తటస్థంగా ఉండాలని వారు భావించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.  ఉల్లంఘనులపై ఈసీ విడతల వారీ వేటు వెనుక కూడా ఇదే ఉద్దేశధం ఉండి ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మొత్తం మీద ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీపై ఎన్నికల సంఘం వేటు ఏపీ అధికార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తరువాత వంతు ఎవరిదో అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.  
Publish Date: Apr 24, 2024 11:54AM

గురువింద గింజ సామెతలా వైసీపీ తీరు!

సుద్దులు చెప్పడంలో వైసీపీ ఎప్పుడూ ముందుంటుంది. గురివింద గింజ సామెత ఆ పార్టీ చెప్పే నీతి వాక్యాలు చూస్తే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎన్నికల ముంగిట అన్ని దారులూ మూసుకుపోయిన తరువాత.. ఓటమి వాకిలి మాత్రమే తెరిచి ఉన్న తరుణంలో వైసీపీకి ముస్లిం మైనారిటీలు గుర్తుకు వచ్చారు. ఇప్పుడు వారి ఓట్లు రాబట్టుకుని గట్టెక్కే ప్రయత్నాలకు తెరతీసింది. ప్రధాని నరేంద్రమోడీ రాజస్థాన్ లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రసంగాన్ని పట్టుకుని చంద్రబాబును ముస్లింలకు బూచిగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నది.  నిజానికి వైసీపీ ఇప్పటి వరకూ అన్ని విషయాలలోనూ బీజేపీకి మద్దతుగా నిలబడింది. ఇప్పుడు మోడీనీ, ఆయనతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబును ముస్లిం వ్యతిరేకులుగా ముద్రవేయడానికి ప్రయత్నిస్తున్న వైసీపీ వివాదాస్పద ట్రిపుల్ తలాక్, సీఏఏ విషయంలో కోరకుండానే బీజేపీకి మద్దతు ఇచ్చిన విషయాన్ని కన్వీనియెంట్ గా మరిచిపోతోంది. జనాలకు ఆ విషయం గుర్తుండదని నమ్ముతోంది.  అయితే ఇక్కడ కూడా ఆ పార్టీ అధినేత తన ఎన్నికల ప్రచారంలో మోడీని కానీ, బీజేపీని కానీ పన్నెత్తు మాట అనడం లేదు. అయితే చంద్రబాబుతో బంధుత్వం ఉందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. అయితే వైసీపీ సోషల్ మీడియా మాత్రం రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారంలో  భాగంగా మోడీ ప్రసంగాన్ని వైరల్ చేస్తున్నది. ఆ ప్రసంగంలో ఆయన కాంగ్రెస్ ప్రజల ఆస్తులను ముస్లింలకు పంచాలని చూస్తోందని ఆరోపించిన సంగతి తెలిసిందే. మోడీ వ్యాఖ్యలను చంద్రబాబుకు ఆపాదిస్తూ చంద్రబాబు అధికారంలోకి వస్తే ముస్లింలకు నష్టం చేకూరుతుందంటూ ఊదరగొడుతోంది. అయితే నెటిజనులు వైసీపీ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నారు.  సీఏఏ, ట్రిపుల్ తలాక్ ల విషయంలో  వైసీపీ మోడీకి బేషరతు మద్దతు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ నెటిజనులు గురువింద గింజ సామెతను గుర్తు చేస్తున్నారు. 
Publish Date: Apr 24, 2024 10:47AM

ఏపీలో ఫ్యాన్ కు గాలాడటం లేదా?

ఏపీలో వైసీపీకి గాలాడటం లేదు. ఆ పార్టీ శ్రేణుల్లోనే వైసీపీ ఓటమి ఖాయమన్న భావన వ్యక్తం అవుతోంది. చివరాఖరికి ఐప్యాక్ తాజాగా జగన్ కు సమర్పించిన నివేదికలో కూడా అదే విషయాన్ని పేర్కొంది.  ఇంత కాలం ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న జగన్ సొంత సామాజిక వర్గం కూడా అధికార పార్టీకి దూరమైపోయింది.  దాదాపు అన్ని వర్గాలలోనూ పార్టీ పట్ల, జగన్ ప్రభుత్వం పట్ల వ్యక్తమౌతున్న వ్యతిరేకతతో ఫ్యాన్ కు గాలాడని పరిస్థితి ఏర్పడిందని వైసీపీ వర్గాలు అంటున్నాయి.  ముఖ్యంగా వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులలో అధికార పార్టీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2014 నుంచి పార్టీ కోసం కష్టనష్టాలకోర్చి పని చేసిన తమను పక్కన పెట్టేసిన జగన్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వలంటీర్లను నమ్ముకుని తమను నిర్లక్ష్యం చేశారన్న కోపం వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా పార్టీ శ్రేణులలో ఈ తీరు కనిపిస్తున్నా వాలంటీర్లు ఉండగా భయమేల? చింతేల? అనుకున్న జగన్ కు ఇప్పుడు వాలంటీర్లు కూడా మొండి చేయి చూపడానికి రెడీ అయిపోయారని పరిశీలకులు అంటున్నారు.  చంద్రబాబు ప్రకటించిన పదివేల రూపాయల హామీ, వారిని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మార్చేసిందా? ప్రభుత్వం చెప్పినట్లల్లా చేయకుండా తటస్థంగా ఉండటమే మేలన్న నిర్ణయానికి వచ్చేశారా? అంటే రాజీనామాలు చేసేది లేదని భీష్మిస్తున్న వారిని చూస్తే అదే నిజమని అనిపించకమానదు. వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖాయమని వాళ్లూ వీళ్లూ కాదు.. ఏకంగా  ఐ ప్యాక్ తేల్చేసిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఐ ప్యాక్ తన తాజా నివేదికను వైసీపీకి అందించిందని అంటున్నారు. ఆ నివేదిక తరువాత వైసీపీలో ఇంకా దింపుడు కళ్లెం ఆశ మిగిలిందని అంటున్నారు. ఎందుకంటే మహిళల్లో అత్యధిక శాతం వైసీపీ పట్లే మొగ్గు చూపుతున్నారనీ, అదే సమయంలో మిగిలిన అన్ని వర్గాలూ తెలుగుదేశం కూటమికి మద్దతు ప్రకటిస్తున్నారనీ ఐప్యాక్ పేర్కొంది. మహిళల మద్దతు ఉంటే చాలు గెలుపు తధ్యమని వైసీపీ అగ్రనాయకత్వం భావిస్తోందని  పార్టీ  వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం మొత్తం వైసీపీ పని అయిపోయిందన్న నివేదిక ఇస్తే జగన్ ఆగ్రహానికి గురౌతామన్న జంకుతోనే ఐప్యాక్ మహిళల మద్దతు అంటూ నివేదికలు ఇచ్చిందనీ, వాస్తవానికి మహిళల్లోనే జగన్ పాలన పట్ల ఆగ్రహం ఎక్కువగా కనిపిస్తోందని అంటున్నాయి. ఐప్యాక్ కంటే తామే ఎక్కువగా క్షేత్ర స్థాయిలో ఉంటామనీ, తమకు కనిపించిన ఆగ్రహం ఐప్యాక్ కు ఎందుకు కనిపించలేదో అర్ధం కావడం లేదనీ చెబుతున్నాయి. అంతే కాదు..  క్రైస్తవ సమాజంలోనూ జగన్ పట్ల వ్యతిరేకత కానవస్తోందని చెబుతున్నాయి. ఐప్యాక్ తన నివేదికలో క్రైస్తవుల ఓట్లన్నీ గంపగుత్తగా వైసీపీవైపే ఉన్నాయని పేర్కొందనీ, అయితే వాస్తవం అందుకు భిన్నంగా ఉందనీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఒక్క బీజేపీ పోటీ చేసే స్థానాలలో మాత్రమే కూటమికి ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే కూటమి వ్యతిరేక ఓట్లు గంపగుత్తగా వైసీపీ వైపు మళ్లే అవకాశం లేదనీ, ఆయా స్థానాలలో వారు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారనీ అంటున్నారు.  ఇక ముస్లిం మైనారిటీల విషయంలో వారిలో అధికార వైసీపీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ ముస్లిం మైనారిటీలంతా కూటమికే మద్దతుగా నిలిచారనీ, అయితే గత రెండు రోజులుగా సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్ లో ప్రధాని మోడీ ఏపీ పేరు ప్రస్తావిస్తూ ముస్లిం రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు వారిలో కూటమి పట్ల విముఖతకు కారణమయ్యాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.   కడప, గుంటూరు, కర్నూలు, నంద్యాల వంటి ముస్లిం ప్రభావిత నియోజకర్గాల్లో సైతం అధికారపార్టీ పట్ల స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తోంది.   బీజేపీ పోటీ చేసే నియోజకవర్గాల్లో  కూడా మైనారిటీలు వైసీపీ వైపు కాకుండా కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నారు. అయితే తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాలలో మాత్రం ముస్లింల మద్దతు కూటమి అభ్యర్థులకే ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద రాష్ట్రంలోని అన్ని వర్గాలలోనూ అధికార వైసీపీపై వ్యతిరేకత వ్యక్తమౌతోందని ఐప్యాక్ నివేదిక సహా ఇప్పటి వరకూ వెలువడిన సర్వేల ఫలితాలన్నీ తేల్చేయడంతో మానసికంగా వైసీపీ నేతలు కూడా ఓటమి తప్పదన్న నిర్ణయానికి వచ్చేశారనీ, అది వారి ప్రచార సరళిలో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: Apr 24, 2024 10:16AM

వైసీపీకి బిగ్‌ షాక్‌.. ఇద్ద‌రు ఐపీఎస్ ల‌పై ఈసీ బ‌దిలీ వేటు

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ వైసీపీ స‌ర్కార్ కు ఈసీ బిగ్‌ షాక్ ఇచ్చింది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఇద్ద‌రు ఐపీఎస్ అధికారుల‌పై  ఈసీ బ‌దిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజ‌నేయులు, విజ‌య‌వాడ సీపీ కాంతిరాణాను బ‌దిలీ చేస్తూ ఎన్నిక‌ల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వీరిద్ద‌రూ ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కు ఎలాంటి ఎన్నిక‌ల విధుల్లో పాల్గొన‌వ‌ద్ద‌ని,  ఎన్నిక‌ల‌కు సంబంధంలేని విధుల‌ను వీరికి అప్ప‌గించాల‌ని ఆదేశించింది. వీరి స్థానంలో ఒక్కో పోస్టుకు ముగ్గురేసి   పేర్ల‌తో కూడిన ప్యానెల్‌ను బుధ‌వారం (ఏప్రిల్ 24) మ‌ధ్యాహ్నం 3గంట‌ల లోపు పంపించాల‌ని, అధికారుల వార్షిక ప‌నితీరు నివేదిక ఆధారంగా పేర్లు సూచించాల‌ని ఈసీ స్ప‌ష్టం చేసింది. గ‌తంలోనూ ఆరుగురు అధికారుల‌పై ఈసీ బ‌దిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ ప‌లువురు ఐపీఎస్‌, ఐఏఎస్‌లు  వైసీపీకి అనుకూలంగా ప‌నిచేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల‌ను ప‌రిశీలించిన ఎన్నిక‌ల సంఘం.. ఎన్నిక‌ల కోడ్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా అధికార వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ముగ్గురు ఐఏఎస్‌లు, ఆరుగురు ఐపీఎస్‌లపై ఈసీ గతంలోనే బదిలీ వేటు వేసింది.  తాజాగా మ‌రో ఇద్ద‌రు ఐపీఎస్ అధికారుల‌పై ఈసీ బ‌దిలీ వేటువేసి వైసీపీకి షాకిచ్చింది.  ఏపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోలీస్ వ్య‌వ‌స్థ‌తో పాటు ప‌లువురు అధికారుల‌ను వైసీపీ కార్య‌క‌ర్త‌లుగా మార్చేసుకుని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఐదేళ్ల పాల‌న‌లో అభివృద్ధిని మ‌రిచి కేవ‌లం క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కే ప‌రిమిత‌మైన జ‌గ‌న్‌.. పోలీసుల‌ను అడ్డుపెట్టుకొని వైసీపీ వ్య‌తిరేకుల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డంతోపాటు ప‌లువురిని పోలీస్ స్టేష‌న్‌ల‌లో చిత్ర‌హింస‌ల‌కు గురిచేశారు. గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై గొంతెత్తిన వారిపై పోలీసులు అక్ర‌మ కేసులు బ‌నాయిస్తూ ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పై ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించారు. ఐదేళ్ల‌పాటు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అరాచ‌కాల‌ను భ‌రించిన ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రాగానే ఊపిరిపీల్చుకున్నారు. అయినా  ప‌లువురు ఐపీఎస్‌, ఐఏఎస్ అధికారులు వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు. కోడ్ ను లెక్క చేయకుండా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. దీంతో, బీజేపీ, కాంగ్రెస్‌, తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల నేత‌లు వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ప‌లువురు ఐపీఎస్‌, ఐఏఎస్ అధికారుల‌పై ఈసీకి ఫిర్యాదులు చేయ‌డంతో.. ఈసీ ఫిర్యాదుల‌పై క్షేత్ర‌స్థాయిలో నిజానిజాల‌ను నిగ్గుతేల్చుకొని ఐపీఎస్‌, ఐఏఎస్‌ల‌పై బ‌దిలీ వేటు వేసింది.   కొద్దిరోజుల క్రితం తొమ్మిదిపై బ‌దిలీ వేటు ప‌డ‌గా.. తాజాగా ఇంటెలీజెన్స్ డీజీ, విజ‌య‌వాడ సీపీల‌పై ఈసీ బ‌దిలీ వేటు వేసింది.   ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజ‌నేయులు, విజ‌య‌వాడ సీపీ కాంతిరాణాల‌పై విప‌క్ష నేత‌లు ఈసీకి అనేక సార్లు ఫిర్యాదు చేశారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బ‌స్సు యాత్ర చేప‌ట్టారు. బ‌స్సు యాత్ర విజ‌య‌వాడ‌లోని అజిత్ సింగ్ న‌గ‌ర్ ప్రాంతంకు చేరుకోగానే రాయిదాడి ఘ‌ట‌న జ‌రిగింది. ఈ దాడిలో సీఎం జ‌గ‌న్ కంటి పైభాగంలో గాయ‌మైంది. రాయిదాడి ఘ‌ట‌నకు పోలీసుల‌తోపాటు ఇంటెలిజెన్స్  విభాగం వైఫ‌ల్యం కార‌ణ‌మ‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం సీపీ కాంతిరాణా నుంచి నివేదికను అందుకుంది. జ‌గ‌న్‌పై రాయిదాడి ఘ‌ట‌న‌లో పోలీసుల వైఫ‌ల్యంతో పాటు ఇంటెలిజెన్సీ విభాగం వైఫ‌ల్యం కూడా కార‌ణ‌మ‌ని ఈసీ నిర్దార‌ణ‌కు వ‌చ్చింది. దీనికితోడు ఇంటెలిజెన్స్ డీజీ, విజ‌య‌వాడ సీపీ కాంతిరాణాలు వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు ఈసీకి ఫిర్యాదు చేశారు. చిల‌క‌లూరి పేట ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పాల్గొన్న‌ స‌భ‌లో భ‌ద్ర‌తా వైఫ‌ల్యాల‌తో పాటు, ఎక్క‌డిక‌క్క‌డ చెక్ పోస్టులు పెట్టి కార్య‌క‌ర్త‌లు స‌భా ప్రాంగ‌ణానికి చేరుకోకుండా ఇంటెలిజెన్స్ డీజీ ఇబ్బంది పెట్టార‌ని, చాలా మంది విప‌క్ష నేత‌ల అక్ర‌మ అరెస్టుల‌కు కూడా ఆయ‌నే బాధ్యులుగా ఉన్నార‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు ఈసీకి ఫిర్యాదు చేశాయి. సీఎం జ‌గ‌న్‌పై రాయిదాడి ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకున్న ఈసీ.. ప్ర‌తిప‌క్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల‌ను కూడా  ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని విచార‌ణ చేసింది. ఈ విచార‌ణ‌లో ఇంటెలిజెన్స్ డీజీ, విజ‌య‌వాడ సీపీపై ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని తేల‌డంతో వారిద్ద‌రిపై ఈసీ బ‌దిలీ వేటువేసింది.   ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సేవలో తరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిలదే తరువాతి వంతు అన్న చర్చ రాజకీయ అధికార వర్గాల్లో జోరుగా జరుగుతోంది. వారిద్దరినీ  ఆ పదవుల నుంచి పక్కకు తప్పించడం ఖాయమని అంటున్నారు. సీఎస్‌ జవహర్‌ రెడ్డి తొలినుంచీ జగన్‌ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నారనీ,  ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత కూడా ఆయన వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు రాలేదనీ చెబుతున్నారు. ముఖ్యంగా పింఛన్ల పంపిణీకి వలంటీర్లను దూరంగా ఉంచాలన్న ఈసీ ఆదేశాలను ఆసరాగా తీసుకుని.. ఉద్దేశపూర్వకంగానే పింఛన్ల పంపిణీని ఆలస్యం చేసి, ఆ పాపాన్ని విపక్షాలపై నెట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. దీనికితోడు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు సీఎస్ తీరుపై ఈసీకి ఫిర్యాదు చేశాయి. పోలీస్‌ బాస్‌ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డిపైనా బదిలీ వేటుకు ఈసీ రంగం సిద్ధమైనట్లు సమాచారం. రాజేంద్ర‌నాథ్ రెడ్డి ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన త‌రువాత‌కూడా వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం పంపించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం వారిపై నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. అక్క‌డ నుంచి  ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎస్‌, డీజీపీపై వేటు పడటం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి ఎన్నిక‌ల కోడ్ స‌మ‌యంలోనూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోసం ప‌నిచేస్తున్న ఐపీఎస్‌, ఐఏఎస్ అధికారుల‌పై ఈసీ కొరడాఝుళిపిస్తోంది. రానున్న రోజులలో మరింత మంది అధికారులపై ఈసీ చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 
Publish Date: Apr 24, 2024 7:51AM

శ్రీరాముడు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే కాదు.. బీజేపీ ఓడిపోతే శ్రీరాముడికి ఏమౌతుంది?

శ్రీరాముడి పేరు చెప్పి బిజెపి రాజకీయాలు చేస్తోందని.. శ్రీరాముడు బీజేపీ ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ కాదు..ఆయన అందరివాడు..బిజెపి ఓడిపోయిన శ్రీరాముడికి ఏం కాదు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్  చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీ మోసం పార్ట్-1 న‌డిచింది.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మోసం పార్ట్-2 సీక్వెల్ న‌డుస్తోంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. పంద్రాగస్టు లోగా రుణ‌మాఫీ చేస్తామ‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం మ‌రోసారి మోసానికి య‌త్నిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు.  చేవెళ్ల ఎంపీ అభ్య‌ర్థి కాసాని జ్ఞానేశ్వ‌ర్ నామినేష‌న్ కార్య‌క్ర‌మంలో కేటీఆర్ పాల్గొన్నారు. 93 కులాల‌ను ఐక్యం చేసిన బాహుబ‌లి కాసాని జ్ఞానేశ్వ‌ర్‌. ఒక బ‌ల‌మైన నాయ‌కుడు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు గొంతుకై నిల‌బ‌డ్డాడు. అలాంటి కాసానిని గెలిపించాలి అని కేటీఆర్ ఈ సంద‌ర్భంగా కోరారు. ర్యాలీలో ఆయ‌న  మాట్లాడుతూ..బిజెపి , కాంగ్రెస్ పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు. రాముడి పేరు చెప్పి ఓట్లు దండుకోవడమే బిజెపికి తెలుసనీ.. మ‌తం పేరుతో రాజ‌కీయం చేస్తున్న బిజెపికి తగిన బుద్ది చెప్పాలని కేటీఆర్ ఈ సంద‌ర్భంగా పిలుపునిచ్చారు. పదే పదే బండి సంజయ్ మోడీ దేవుడంటూ చెప్పుకొస్తాడు..అసలు మోడీ దేవుడు ఎలా అవుతాడు. సిలిండ‌ర్ ధ‌ర పెంచినందుకు అవుతాడా.. ? పెట్రోల్ , డీజిల్ ధరలు పెంచినందుకు అవుతాడా..? నిత్యా అవసర ధరలు పెంచినందుకు అవుతాడా.? తెలంగాణ కు ఎలాంటి హోదాలు ఇవ్వనందుకు అవుతాడా..? ఎలా అవుతాడని కేటీఆర్ ప్రశ్నించారు.  10 ఏళ్లలో కేంద్రంలోని బిజెపి తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమి లేదని కేటీఆర్ అన్నారు.  ఏమ‌న్న అంటే జైశ్రీరాం త‌ప్ప ఇంకోటి లేదు. తెలంగాణ‌కు ఒక్క కాలేజీ, పాఠ‌శాల ఇవ్వ‌లేదు. గుడికి పైస‌లు ఇవ్వ‌లేదు. ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వ‌లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే కాంగ్రెస్ పార్టీపై  కూడా కేటీఆర్ నిప్పులు చెరిగారు.    చేవెళ్ల పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి హేమాహేమీలు త‌ల‌ప‌డుతున్నారు. కాంగ్రెస్ నుంచి ప్ర‌స్తుత ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, బీఆరెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వ‌ర్ ముదిరాజ్‌ బరిలో ఉన్నారు. వీరిలో విశ్వేశ్వ‌ర్ రెడ్డి, జ్ఞానేశ్వ‌ర్ స్థానికులు. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిపై బీఆరెస్ అభ్య‌ర్థిగా రంజిత్ రెడ్డి గెలుపొందారు. ఓట‌మి త‌రువాత విశ్వేశ్వ‌ర్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో రంజిత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. రెండోసారి విజ‌యం సాధించి త‌న అదృష్టాన్ని ప‌రిశీలించుకోవాల‌ని రంజిత్ రెడ్డి ఉన్నారు. త‌న‌కు ఉన్న వ్య‌క్తిగ‌త ప‌రిచ‌యాల‌తో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం ప్రారంభించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రంజిత్ రెడ్డి గెలుపుకోసం వ్యూహ‌ర‌చ‌న చేశారనే అభిప్రాయాలు ఉన్నాయి. కేంద్రంలో న‌రేంద్ర మోదీ స్వ‌చ్ఛ‌మైన పాల‌న‌ను చూసి త‌న‌ను గెలిపించాల‌ని విశ్వేశ్వ‌ర్ రెడ్డి ఓట‌ర్ల‌ను కోరుతున్నారు. ఇక బీఆరెస్ అభ్య‌ర్థి విష‌యానికి వ‌స్తే ఆయ‌న ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. కేసీఆర్‌, కేటీఆర్ అండ‌తో చేవెళ్ళ‌లో భారీ మెజార్టీతో గెలుస్తాన‌ని కాసాని చెబుతున్నారు. త‌ను లోక‌ల్ అభ్య‌ర్థి అని ఆయ‌న చెబుతున్నారు. గ‌తంలో ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ప‌రిష‌త్ చైర్మన్‌గా జిల్లాలో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు పెద్ద‌పీట వేశారు కాసాని. ఎమ్మెల్సీగా జిల్లాకు సేవ చేశారు. ఇవ‌న్ని త‌న‌కు ప్ల‌స్ అవుతాయ‌నే కాసానికి ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. బీఆర్ ఎస్ హ్యాట్రిక్ కొట్ట‌డం ఖాయ‌మంటున్నారు కాసాని. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్నో పరిశ్ర‌మ‌ల్ని బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం తెచ్చింది. చేవెళ్ల‌ను పెద్ద పారిశ్రామిక కేంద్రంగా త‌యారు చేసే ప్ర‌య‌త్నం కేసీఆర్ చేశారు.  షాబాద్‌లో వెల్‌స్ప‌న్ ఫ్యాక్ట‌రీ తెచ్చుకున్నాం. కైటెక్స్ ప‌రిశ్ర‌మ తెచ్చుకున్నాం. చంద‌న్‌వెల్లిలో అమెజాన్, ఈస్ట‌ర్ కంపెనీలు ఏర్పాటు చేసుకున్నాం. సీతారాంపూర్‌లో ఎల‌క్ట్రానిక్ వెహిక‌ల్స్ కంపెనీ ఏర్పాటు చేసుకున్నాం. విక‌రాబాద్, చేవెళ్ల, తాండూరు, ప‌రిగి నియోజ‌క‌వ‌ర్గాల‌కు నీళ్లు తేవ‌డానికి పాల‌మూరు ఎత్తిపోత‌ల పెట్టుకున్నాం. ఉద్ధండ‌పూర్ రిజ‌ర్వాయ‌ర్ మ‌న కోస‌మే నిర్మించుకున్నామ‌ని చెబుతున్న బీఆర్ నేత కాసాని గెలుపుపై ధీమాగా వున్నారు.
Publish Date: Apr 23, 2024 7:21PM

పేద, మధ్యతరగతి వారికి హెచ్చరిక!

ఇది పేద, మధ్య తరగతి జనానికి హెచ్చరిక. ఆ మాటకొస్తే ఓ మోస్తరు ధనవంతులు.. చిన్నసైజు కోటీశ్వరులకు కూడా హెచ్చరికే. ఇక్కడ పేర్కొన్న వర్గాలకు చెందిన వారు ఈ వారం పది రోజులపాటు రాజకీయ నాయకులకు సంబంధించిన అఫిడవిట్లను వివరాలను చూడటం మానేస్తే మంచిది. ఎందుకంటే, రాజకీయ నాయకుల నేరాల చిట్టా చూసి మనసు బాధపడుతుందని కాదు.. వాళ్ళకున్న ఆస్తులను చూసి గుండెలు అవిసిపోతాయి కాబట్టి. ముఖ్యంగా నెల జీతంతో జీవితాలను నెట్టుకొచ్చే వారి హృదయాలు ఎవరో పిడికిలితో పిండేసినట్టు తల్లడిల్లిపోతాయి కనుక. దేశంలో చాలామంది జనం నెలకు 20 వేలు సంపాదించాలంటే అడ్డమైన గడ్డి కరవాల్సి వస్తోంది. అలాంటి రాజకీయ నాయకులకు ఈ ఆస్తులేంటండి బాబు.. గతంలో నాయకుల ఆస్తుల వివరాలు రెండు కోట్లు, మూడుకోట్లు అని చదివి అమ్మో అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడో... వందల కోట్లు, వేల కోట్లు.. పేర్లెందుగానీ, ఒక మనిషికి ఐదువేల కోట్లు, ఆరువేల కోట్లు ఆస్తుంలేంటండీ బాబు! కొంతమంది నాయకులు పెద్దలు సంపాదించిన వందలు, వేల కోట్లకు తాము సంపాదించిన మరిన్ని కోట్లు కలుపుతున్నారు. కొంతమంది సొంతగానే వేలకు వేల కోట్లు సంపాదిస్తున్నారు. స్థిరాస్తుల వివరాల్లో చూపించే అంకెలు కేవలం రిజిస్ట్రేషన్ వాల్యూ మాత్రమే. రిజిస్ట్రేషన్ వాల్యూతో లెక్కేస్తేనే అంతేసి వాల్యూ వుంటున్నాయంటే, ఆయా స్థిరాస్తుల అసలు విలువ ఎంత వుంటుందో ఊహించాలంటే భయం వేస్తుంది.  ఈ వందలు, వేల కోట్ల ఆస్తుల గురించి చూసి ఇన్‌స్పిరేషన్ పొంది బడుగు జీవులు కూడా అన్ని కోట్లు సంపాదించే ఛాన్స్ సినిమాల్లో తప్ప నిజ జీవితంలో ఎలాగూ సాధ్యం కాదు. కాకపోతే ఆ ఆస్తులను చూసి మానసికంగా క్రుంగిపోవడం మాత్రం ఖాయం. అందరూ మనుషులమే కదా.. వాళ్ళకున్న ప్రత్యేకత ఏంటి? మనలో వున్న లోపం ఏంటి అని బాధపడి అల్లాడిపోవడం తథ్యం. అంచేత ఆ ఆస్తుల వివరాలను చూసి మనసు పాడు చేసుకోకుండా వుంటే మంచిది కదా!
Publish Date: Apr 23, 2024 6:43PM

ఖమ్మం లోక్ సభ అభ్యర్థిగా పొంగులేటి వియ్యంకుడి నామినేషన్

ఖమ్మం లోక్ సభ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ కర్ర విరగాకుండా, పాము చావకుండా అన్నట్లు వ్యవహరించిందా? ఈ సీటు తన తమ్ముడికే ఇవ్వాలంటూ మంత్రి పొంగులేటి.. కాదు తన భార్యకే  అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టుబట్టడంతో కాంగ్రెస్ హైకమాండ్ అనూహ్యంగా మూడో వ్యక్తిని తెరమీదకు తీసుకువచ్చిందా? అంటే ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా అధికారికంగా ఇంకా ప్రకటించకుండానే  మంగళవారం ( ఏప్రిల్ 23) రామ సహాయం రఘురాంరెడ్డి నామినేషన్ దాఖలు చేయడాన్ని బట్టి ఔననే భావించాల్సి వస్తున్నది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఖమ్మం బరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రామ సహాయం రఘురాంరెడ్డి స్వయంగా మంత్రి పొంగులేటి వియ్యంకుడు కావడం గమనార్హం. ఇక చివరి నిముషం వరకూ ఈ నియోజకవర్గ అభ్యర్థి రేసులో పొంగులేని సోదరుడు ప్రసాద్ రెడ్డి, భట్టి విక్రమార్క సతీమణి నందిని రేసులో నిలిచారు. ఈ పంచాయతీ హైకమాండ్ వరకూ కూడా వెళ్లింది. ఇరువురి మధ్యా రాజీ కోసం కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగి ఇరువురికీ నచ్చచెప్పారు. అయితే ఎవరికి వారు తమ వారికే టికెట్ ఇవ్వాలంటూ పట్టబట్టడంతో మధ్యే మార్గంగా రామ సహాయం రఘురాంరెడ్డికి ఖమ్మం లోక్ సభ టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు చెబుతున్నారు. రామ సహాయం రఘురాంరెడ్డి సామాన్యుడేం కాదు. ఆయన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారే. ఆయన తండ్రి  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు  రామసహాయం సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డి పలు మార్లు  ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు, పేరు ఉంది. వయోభారం కారణంగా ఇటీవలి కాలంలో ఆయన రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించడం లేదు. ఆయన కుమారుడికే ఇప్పుడు కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ స్థానాన్ని కేటాయించింది. ఇటు పొంగులేటి, అటు భట్టి నొచ్చుకోకుండా కాంగ్రెస్ మధ్యేమార్గంగా రఘురాం రెడ్డిని తెరమీదకు తీసుకువచ్చింది. రామసహాయం రఘురాంరెడ్డికి రాజకీయ, సినీ రంగాలతో మంచి అనుబంధం ఉంది.   హీరో వెంకటేష్ కుమార్తె అశ్రితను ఆయన పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి పెళ్లి చేసుకోగా.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె స్వప్నిరెడ్డిని ఆయన చిన్నకుమారుడు అర్జున్ రెడ్డి వివాహం చేసుకున్నారు. అలా ఇటు వెంకటేష్ కి, అటు పొంగులేటికి రఘురాంరెడ్డి వియ్యంకుడు అయ్యారు. అటువంటి రఘురాంరెడ్డిని ఖమ్మం అభ్యర్థిగా ఖరారు చేయడం ద్వారా పార్టీలో ఎటువంటి అసమ్మతి, అసంతృప్తి తలెత్తకుండా కాంగ్రెస్ హైకమాండ్ అన్ని జాగ్రత్తలూ తీసుకున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలంగాణ కాంగ్రెస్ లో గతంలో ఎన్నడూ కనిపించని ఐక్యత కనిపిస్తోంది. ఆ ఐక్యత ఖమ్మం సీటు కారణంగా చెడకుండా ఉండేలా కాంగ్రెస్ హైకమాండ్ అన్ని  జాగ్రత్తలూ తీసుకుంటోందని ఖమ్మం సీటు విషయంలో వ్యవహరించిన తీరును బట్టి అర్ధం అవుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ వెనుక పొంగులేటి , భట్టి విక్రమార్కల కృషి ఎంతో ఉంది. జిల్లాలో ఇద్దరూ ప్రముఖ నేతలే కావడంతో ఇరువురికీ ఇబ్బంది లేకుండా ఖమ్మం లోక్ సభ అభ్యర్థి ఎంపిక జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఉండగా పెండింగ్ లో ఉన్న కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు కూడా పార్టీ హైకమాండ్ అభ్యర్థులను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ అభ్యర్థిగా సమీర్ ఉల్లాలను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఇహనో ఇప్పుడో అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన రావడానికి ముందే ఖమ్మం నుంచి రామసహాయం రఘురాం రెడ్డి, కరీంనగర్ నుంచి వెలిచార రాజేందర్ రావులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం మీద నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజుల గుడువు ఉండగానే ఎలాంటి ఇబ్బందులూ లేకుండా కాంగ్రెస్ రాష్ట్రంలోని 17 లోక్ సభ స్ధానాలకూ అభ్యర్థులను ఖరారు చేసినట్లైంది. 
Publish Date: Apr 23, 2024 6:25PM

ఏపీలో పొత్తు ధర్మాన్ని పాటించని బీజేపీ!

ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ పాపం ఎంత వుందో, బీజేపీ పాపం కూడా అంతే వుంది. కాంగ్రెస్ పార్టీ అడ్డదిడ్డంగా, అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే, బీజేపీ దానికి మద్దతు ఇచ్చింది. సరే, జరిగిందేదో జరిగిపోయింది, మీరు పార్లమెంటు సాక్షిగా చేసిన ప్రత్యేకహోదా హామీని అయినా నెరవేర్చండయ్యా బాబూ అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఎంత మొత్తుకున్నా బీజేపీ ప్రభుత్వం కరుణించలేదు. ఆ కారణంతోనే బీజేపీ, టీడీపీ మధ్య దూరం పెరిగింది. చివరికి స్నేహం ముగిసింది. కేంద్రంలో మూడోసారి మోడీ ప్రభుత్వం రావాలన్న ధ్యేయంతో వున్న బీజేపీ ఈసారి అనేక ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఏపీలో తెలుగుదేశం, జనసేనలతో పొత్తుకు స్నేహహస్తం చాచింది. మొత్తానికి పొత్తు కుదిరింది. మూడు పార్టీలతో కూటమి ఏర్పడింది. బీజేపీ తన స్థాయికి మించిన విధంగా స్థానాలను పొందింది. బీజేపీతో పొత్తు ధర్మాన్ని పాటిస్తూ తెలుగుదేశం పార్టీ తనకు పట్టున్న అనేక స్థానాలను బీజేపీకి అప్పగించింది.  ఎన్నికల ప్రచారం సందర్భంగా కావచ్చు, అనేక రాజకీయ అంశాల పరంగా కావచ్చు టీడీపీ, జనసేన పాటిస్తున్న పొత్తు ధర్మాన్ని బీజేపీ పాటించడం లేదన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం, జనసేనతో బీజేపీ పొత్తు కుదుర్చుకున్నప్పటికీ, కూటమిది పై చేయి అయితే కూటమితే, వైసీపీది పై చేయి అయితే వైసీపీతో ప్రయాణం చేస్తే ఓ పనైపోతుంది బాబూ అన్న ధోరణిలోనే బీజేపీ వుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కూటమితో వున్నప్పటికీ బీజేపీకీ, వైసీపీకి లోపాయకారీగా ‘ఏదో’ వుందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.  400 వందల సీట్లతో విజయం సాధించాలని కలలు కంటున్న బీజేపీకి, ఈసారి అధికారం దక్కుతుందా లేదా అనే భయం కూడా వుంది. అందుకే అవకాశం వున్న ఏ పార్టీనీ దూరం చేసుకునే ఉద్దేశంలో లేదు. అందుకే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అన్నట్టుగా టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని, వైసీపీతో సీక్రెట్ స్నేహం నడుపుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే, జగన్‌కి గాయం అయిందన్న వార్త ఇలా బయటకి వచ్చిందో లేదో, ఎక్కడో ఢిల్లీలో వున్న ప్రధాని మోడి తల్లడిల్లిపోయి తన రియాక్షన్‌ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇలాంటి నాటకాలు ఆడటంలో జగన్ సిద్దహస్తుడని ఆల్రెడీ గత ఎన్నికల సందర్భంగా ప్రూవ్ అయింది. అలాంటి సంఘటనే మరోసారి జరిగినప్పుడు ఆచితూచి స్పందించాల్సిన బాధ్యత ప్రధాని స్థాయిలో వున్న వ్యక్తికి వుండాలి కాదా. అలాంటిదేమీ పాటించకుండా జగన్ మీద ప్రేమ కురిపించేశారు.  ఈ విషయంలో కొంతమంది బీజేపీ నాయకులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంలో వివరణ ఇస్తున్నారు. జగన్ మీద నిజంగానే హత్యాయత్నం జరిగిందని ప్రధానమంత్రి భావించారని, అందుకే అంత స్పీడుగా స్పందించారని, ఆ తర్వాత ఇదంతా ఒక డ్రామా అని అర్థం చేసుకుని లైట్ తీసుకున్నారని చెబుతున్నారు. ఇదే నిజమైతే, జగన్ ఆడిన డ్రామాని తెలుగుదేశం, జనసేన వర్గాలు నాన్ స్టాప్‌గా విమర్శిస్తూ వస్తున్నాయి. బీజేపీ నుంచి అలాంటి విమర్శలేవీ లేవు. జగన్ ఆడింది డ్రామా అని తెలిసినా, ఇది డ్రామా అని ఒక్క బీజేపీ నాయకుడి నోటి నుంచి రాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కూటమిలో వున్న మూడు పార్టీలు ఒకే మాట మీద వుండటం అనేది పొత్తు ధర్మం. కానీ బీజేపీ ఆ ధర్మాన్ని విస్మరించింది. ‘ధర్మం’ గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పే బీజేపీ పొత్తు ధర్మాన్ని ఎందుకు విస్మరిస్తోందో!
Publish Date: Apr 23, 2024 5:49PM

కడప కోర్టు తీర్పుపై సుప్రీంకు బీటెక్ రవి

ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్య కేసుపై ఎవరూ మాట్లాడొద్దంటూ కడప కోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ పులివెందుల తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి హైకోర్టును ఇశ్రయించారు. ఈ మేరకు బీటెక్ రవి తరఫు న్యాయవాది ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19కి, పత్రికా స్వేచ్ఛకు, భావప్రకటనా స్వేచ్ఛకు భగం వాటిల్లేలా ఉన్నాయని బీటెక్ రవి తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు బుధవారం (ఏప్రిల్ 24)న విచారణ జరపనున్నట్లు తెలిపింది.  అవినాష్ రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్ లో వివేకాహత్యకు సంబంధించి తనపై కేసులు ఉన్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే వైఎస్ వివేకా కుమార్తె సునీత కూడా సీబీఐ చార్జిషీట్ ఆధారంగా అవినాష్ రెడ్డిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. చార్జిషీట్ లోని అంశాలను కూడా ప్రస్తావించకుండా కడప కోర్టు గాగ్ ఆర్డర్ ఇవ్వడంపై న్యాయనిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తారు. కడప కోర్టు ఉత్తర్వులపై సునీత కూడా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఏ నిర్ణయం తీసకోనున్నదన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది.  
Publish Date: Apr 23, 2024 5:33PM

ఇంతకీ తమ్మినేని చదువు కున్నారా?.. చదువు కొన్నారా? ఎన్నికల అఫిడవిట్ లో ఆయన చెప్పిందేమిటి?

రాజకీయాల్లో రాణించడానికి చదువు అవసరం లేదు. పంచాయతీ  బోర్డు మెంబెర్ మొదలు ప్రధాని పదవి వరకు, ఏ పదవికి విధ్యార్హతలు అక్కరలేదు. ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేయవచ్చును. ప్రజలు గెలిపిస్తే చాలు,  ఎమ్మెల్ల్యే, ఎంపీ , మంత్రి,  ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి  ఏదైనా కావచ్చును. ఏ పదవికీ చదవు సంధ్యలు అవసరం లేదు, డిగ్రీలు అక్కరలేదు. అయినా,  రాజకీయ నాయకుల విధ్యార్హతలు, డిగ్రీలు తరచూ వివాదం అవుతూనే ఉంటాయి.  ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీలపై వివాదం నడిచిన సంగతి తెలిసిందే. మోదీ విద్యార్హతలు, డిగ్రీలకు సంబంధించిన సమాచారం కోసం సమాచార హక్కు చట్టం కింద తెలుసుకునేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్  చేసిన ప్రయత్నాలు ఫలిచలేదు.   అలాగే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ..మరి కొందరు ముఖ్య నేతలకు సంబందించిన  డిగ్రీ  విషయంలోనూ వివాదాలు, విచారణలు జరిగాయి. జరుగుతున్నాయి. ఇప్పడు ఆ జాబితాలో  ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని  సీతారం పేరు కూడా చేరింది.  ఆయన డిగ్రీ చదువు కోలేదనీ, చదువు కొన్నారనీ తెలుగుదేశం గతంలో ఆరోపించింది.  సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ కూడా చేసింది. అదలా ఉంచితే ఇప్పుడు స్వయంగా తమ్మినేని సీతారాం తాను డిగ్రీ చదువు కోలేదని అంగీకరించారు. అంగీకరించడమంటే మౌఖికంగా చెప్పడం కాదు.. ఆముదాలవలస వైసీపీ అభ్యర్థిగా పోటీకి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఆ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో ఆయన విద్యార్హతకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. తమ్మినేని ఎన్నికల అఫిడవిట్ లో డిగ్రీ డిస్ కంటిన్యూ అని ఉంది. మరి డిగ్రీ పూర్తి కాకుండా తమ్మినేని లా ఎలా చేశారు.    తాను డిగ్రీ పూర్తి చేశానని చెప్పి హైదరాబాద్ లో ఓ లా కాలేజీలో అడ్మిషన్ పొందారు. డిగ్రీ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. గత ఏడాది ఈ అంశంపై పెద్ద దుమారం కూడా రేగింది. అదలా ఉండగానే ఇప్పుడు ఆయన తన ఎన్నికల అఫిడవిట్ లో  డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని స్పీకర్ నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ పెట్టి లా కోర్సులో చేరారని గత కొంత కాలం కిందట తెలుగుదేశం బయట పెట్టింది.  దీనిపై కిమ్మనని తమ్మినేని ఇప్పుడు తాను డిగ్రీ పూర్తి చేయలేదంటూ ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇక ఇప్పుడు ఆయనకు లా కాలేజీలో అడ్మిషన్ ఎలా లభించింది. ఆయన నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ సమర్పించి ఉంటే చట్టపరంగా చర్యలకు రెడీ అవ్వాల్సిందే అని పరిశీలకులు అంటున్నారు. 
Publish Date: Apr 23, 2024 4:13PM