చోటే బేటియా గుట్టల్లో నక్సలిజంపై సర్జికల్ స్ట్రైక్.... 

దేశ ప్రగతికి నక్సలిజం ఆటంకంగా మారింది. అందుకే త్వరలోనే దేశం నుంచి నక్సలిజాన్ని తుడిచిపెట్టేస్తామంటున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.  డెడ్‌బాడీలు వచ్చాకే చనిపోయిన మావోయిస్టులు ఎవరనేది తేలుతుంది! చోటే బేటియా గుట్టల్లో, నక్సలిజంపై జ‌రిగిన సర్జికల్ స్ట్రైక్ ను విజయవంతం చేసిన పోలీసు అధికారుల సాహసాన్ని అమిత్ షా అభినందించారు.  ఛత్తీస్ గఢ్ జిల్లాలో మావోయిస్టుల ఉనికి ఉంది. దీంతో వారిని లేకుండా చేయాలని రాష్ట్ర‌, కేంద్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. ఇందులో భాగంగానే వారిని అంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఈనేపథ్యంలోనే భారీ ఎన్ కౌంటర్. పోలీసులు అడవిలో జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులను దాదాపు ఏరిపారేశారు. ఎక్కడైనా ఆనవాళ్లు ఉంటే వారిని కూడా తుదముట్టిస్తున్నారు. ఇంకా పోలీసులు అడవిని గాలిస్తున్నారు. నక్సల్స్ ఆచూకీ కోసం తిరుగుతూనే ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌ చరిత్రలో అతిపెద్ద ఎన్‌కౌంటర్‌ ఇదే.  పచ్చని అడవులు రక్తంతో ఎరుపెక్కాయి. బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో  జ‌రిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 40 మంది మావోయిస్టులు హతమయ్యారు.  ఎన్‌కౌంటర్‌ ఘటనను నక్సలిజంపై సర్జికల్‌ స్ట్రైక్ గా ఛత్తీస్‌గఢ్‌ హోంమంత్రి విజయ్‌ శర్మ అభివర్ణించారు. గత ఐదేండ్లలో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇదే అతిపెద్దదిగా తెలుస్తున్నది. 2018 ఆగస్టులో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు చనిపోయారు. అదే ఏడాది మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా రేల్‌-కస్నాసుర్‌ అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో సుమారు 40 మంది మావోయిస్టులు మరణించారు. మళ్లీ 2021 నవంబర్‌లో గడ్చిరోలిలో జరిగిన యాంటీ మావోయిస్టు ఆపరేషన్‌లో భాగంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మృతిచెందారు. 2016లో 30 మంది నక్సలైట్లను గ్రేహౌండ్స్‌ బలగాలు చంపేశాయి. తాజాగా నక్సల్స్‌ ప్రభావిత బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురు కాల్పుల్లో దాదాపు 40 మంది మావోయిస్టులు మృతిచెందారు.  ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల్లో డివిజన్‌ కమిటీ సభ్యులు నలుగురు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇందులో ఒకరు తెలంగాణలోని భూపాలపల్లి జయశంకర్‌ జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన శంకర్‌రావు అలియాస్‌ మురళి అలియాస్‌ శ్రీపల్లి సుధాకర్‌ కాగా.. మరొకరు బీజాపూర్‌ జిల్లా భామర్‌గఢ్‌ ప్రాంతానికి చెందిన లలితగా గుర్తించినట్లు సమాచారం. అయితే ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టు ముఖ్య నేతలు మృతిచెందినట్లు వస్తున్న వార్తలపై ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. భూస్వా ముల బారి నుంచి గిరిజనులు, వ్యవసాయ కూలీలను రక్షించడానికి వామపక్ష తీవ్రవాదులు సాయుధ పోరాటా న్ని ప్రారంభించారు. దానికే నక్సలిజం అనే పేరు వచ్చిం ది. తదనంతర కాలంలో మావోయిస్టు పార్టీగా పేరు మారింది. భూస్వాములను అంతమొందిస్తే వ్యవసాయ కూలీలకు, నిరుపేదలకు విముక్తి లభిస్తుందన్నది మావో యిస్టుల వాదన. అయితే, వ్యవస్థలో లోపాలను సరిదిద్ద కుండా వ్యక్తులను అంతమొందించడం వల్ల ప్రయోజనం ఏమిటని మేధావుల ప్రశ్న. మావోయిజం (నక్సలి జం) వ్యాప్తి పెరిగిన కొద్దీ, భూస్వాముల వేధింపులు పెరిగిపోతున్నాయి. ఆర్థిక అసమానతలు పెరిగి పోతున్నాయి. మావోయిస్టులను అణచివేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నాయి. ఇప్పటికి వేలమంది పోలీసులు బలి అయ్యారు. ఈ ఉద్యమం పేరు చెప్పి, అటు మావోయిస్టుల్లోను, ఇటు పోలీసుల్లోనూ ప్రాణాలు కోల్పోతోంది బలహీనవర్గాల వారే. పోలీసు శాఖలో రిస్క్‌ ఉన్న ఉద్యోగాల్లో ఎక్కువ మంది బలహీనవర్గాల వారే చేరుతున్నారు. మావోయి స్టుల కాల్పుల్లో సమిధలు అవుతున్నదీ వారే. అలాగే, నక్సలైట్‌ ఉద్యమంలో చేరిన వారిలో అధికంగా బలహీన వర్గాలకు చెందినవారే ఉంటున్నారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో మరణిస్తున్నదీ ఎక్కువగా వారే.
Publish Date: Apr 17, 2024 7:35PM

ఇంకా నెల రోజులు భరించాలా? జగన్ సర్కార్ పై జనంలో ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు నెల రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. అయితే రాష్ట్ర ప్రజలు మాత్రం ఇంకా నెలరోజులా అని నిట్టూరుస్తున్నారు. ఎందుకంటే చాలా కాలంగా వారు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? జగన్ ను అధికారం నుంచి ఎప్పుడు సాగనంపుతారా అని ఎదురు చూస్తున్నారు. అందుకే ఏడాదికి ముందే ప్రభుత్వ  సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావించినప్పుడు జనం హర్షామోదాలు వ్యక్తం చేశారు. ఆ తరువాత కనీసం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటైనా ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగకపోతాయా అని ఆశపడ్డారు. సరే అవేమీ కార్యరూపం దాల్చలేదు. ఓటమి భయమో, మరో కారణమో జగన్  ముందస్తుపై ముచ్చట పడలేదు. ఇప్పుడు ఇక సమయం వచ్చేసింది. 2019లో జగన్ కు రాష్ట్రంలో ఐదేళ్లు అధికారం అప్పగిస్తూ ప్రజలు ఇచ్చిన తీర్పు గడువు ముగింపునకు వచ్చింది. 2014 ఎన్నికలలో మరోసారి అధికారంలోకి రావాలని జగన్ కలలు కంటుంటే కంటుండొచ్చు కానీ జనం మాత్రం ఆయన అధికార అహంకారాన్ని భరించలేం అన్న నిర్ణయానికి వచ్చేశారు. ఆ విషయాన్ని ఎటువంటి దాపరికం లేకుండా బాహాటంగానే చెబుతున్నారు. ఆయన సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. దీంతో ఓటమి ఖాయం అన్న నిర్ధారణకు వచ్చేసిన జగన్ తెగించేశారు. ఎటూ తప్పని ఓటమిని తప్పించుకునేందుకు ఉన్న మార్గాల అన్వేషణలో పడ్డారు.  ఆ అన్వేషణలో భాగంగానే హత్యాయత్నం అంటే సెంటిమెంటాయుధాన్ని ప్రయోగించారు. అయితే జనం మనస్సుల్లో కోడికత్తి డ్రామా సజీవంగా ఉండటంతో.. కోడికత్తి 2 అదే గులకరాయి దాడితో హత్యాయత్నం డ్రామా రక్తికట్టడం మాట అటుంచి నవ్వుల పాలైంది. జగన్ ను నవ్వుల పాలు చేసింది. సొమ్ముల కోసమే జనం జగన్ సభలకు వస్తున్నారని పోలీసుల విచారణ సాక్షిగా తేలిపోయింది.   దీంతో జగన్ ఎన్నికల గండాన్ని గట్టెక్కేందుకు ఇంకేం  చేయాలో తెలియని అయోమయంలో పడిపోయారు. 
Publish Date: Apr 17, 2024 3:55PM

రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ 

ఏపీలో రేపు (ఏప్రిల్ 18) ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది.  దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ జూన్ 1న ముగుస్తుంది. ఏప్రిల్‌ 19న తొలి దశ పోలింగ్‌ జరుగుతుంది. నాలుగో దశలో ఏపీ, తెలంగాణకు ఎన్నికలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున.. మే 13న ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సైతం మే 13న జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలను జూన్ 4వ తేదీన ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది.
Publish Date: Apr 17, 2024 3:52PM

జగనే ఎందుకు ?

ఏపీలో ఎన్నికల వేళ ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న మళ్లీ జగన్ ఎందుకు?  ఈ ప్రశ్న వేస్తున్నది విపక్షాలు కాదు. జనం. సామాన్య జనం. కొన్ని నెలల కిందట జగన్ శిబిరమే ఏపీకి జగనే ఎందుకు కావాలో వివరిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజల జ్ణాపకశక్తి చాలా తక్కువ అన్న నమ్మకంతో కావచ్చు  ధైర్యంగా వైనాట్ 175 అంటూ స్వయంగా జగన్ ఒక ప్రశ్నను సంధించి రాష్ట్రంలో 175 కు 175 స్థానాలలోనూ వైసీపీ అభ్యర్థులే గెలవాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ప్రజల జ్ణాపకశక్తిపై జగన్ కు ఉన్న నమ్మకాన్ని ఎవరూ కాదనలేరు కానీ నడుస్తున్న చరిత్ర , పడుతున్న కష్టాలు, కళ్ళ ముందు  కదులుతున్న అరాచక పాలనను జనం క్షమిస్తారనీ, పట్టించుకోరనీ ఆయన భావించడం అయితే అతి విశ్వాసం లేదా అహంభావం అయి ఉండాలి. లేదా అమాయకత్వం అయ్యి ఉండాలి. కానీ జనగ్ ను అమాయకుడని ఎవరూ భావించజాలరు. వైనాట్ 175 అన్న తన నమ్మకాన్ని నిలుపుకోవడానికి, ఆ అసాధ్యాన్ని సాధ్యం చేయడానికీ జగన్ ఎంతకైనా తెగిస్తారనడానికి బోలెడు ఉదాహరణలు ఉణ్నాయి   నిజానికి ఐదేళ్ల  జగన్  పాలనలో రాష్ట్రం అన్ని విధాల అధోగతి పాలైంది. అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాజధాని లేని రాష్ట్రంగా నవ్వుల పాలైంది. ఇంకా చెప్పాలంటే, అరాచకం రాజ్యమేలింది. ఈ అరాచక, అవినీతి పాలనను తట్టుకొనలేక   పెట్టుబడి దారులు పక్క రాష్టాలకు వెళ్లి పోతున్నారు. కొత్త పరిశ్రమలు రావడం లేదు. దీంతో రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు . యువత వలసబాట పట్టక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడింది.   అవి చాలవన్నట్లు, జగన్ రెడ్డి, కుట్ర పూరితంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడంతో రాష్ట్రం అట్టుడికి పోయింది. వేధింపులు, అరాచకాలు తప్ప జగన్ ఏలుబడిలో రాష్ట్రంలో ఇంకేం లేకుండా పోయింది. దీంతో జగన్  కి ఒక్క ఛాన్స్ ఇచ్చి తప్పు చేశామని, ప్రజలు భావించే పరిస్థితి వచ్చింది.  దీంతో వారు  చేసిన తప్పు  మళ్ళీ చేయబోమని ప్రతిజ్ఞ చేస్తున్నారు. జగన్ ను అధికారం నుంచి దింపాలన్న నిర్ణయానికి ప్రజలు వచ్చేశారు. ఆ ప్రజాభిప్రాయమే సర్వేలలో ప్రతిఫలిస్తోంది.   జగన్ రెడ్డిని ఓడించి సాగనంపడం ఒక్కటే  కాదు, చంద్రబాబును గెలిపించుకుని రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలో పరుగులెట్టేలా చేయాలన్న జనం నిశ్చయాన్ని కూడా సర్వేల ఫలితాలు చెబుతున్నాయి.  ఎన్నికలు నెల రోజుల వ్యవధిలోకి వచ్చిన తరువాత కూడా జనం ఇంకా నెలరోజులా అని భావిస్తున్నట్లుగా వారిలో ఆవేశం కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వై నాట్ 175 అన్న తన ఆశ పగటి కలేనని జగన్ కే తెలిసిపోయినట్లుంది. దీంతో  గత ఎన్నికలలో తనకు లబ్ధి చేకూర్చిన సెంటిమెంటుపై పడ్డారు. గులకరాయి దాడిని తనపై హత్యయత్నంగా చూపి సానుభూతి పొందడానికి చేసిన యత్నం నవ్వుల పాలు కావడానికి జనం కోడికత్తి దాడి డ్రామాను జనం ఇంకా మరచిపోకపోవడమేనని పరిశీలకులు అంటున్నారు.   దీంతో మళ్ళీ జగనే ..ఎందుకు కావలి?’ అని వైసీపీ రూపొందించిన ప్రచార కార్యక్రమం  అవును జగనే ఎందుకు ? వద్దే వద్దు అన్న జనవాక్యంగా మారిపోయిందని చెబుతున్నారు. 
Publish Date: Apr 17, 2024 3:01PM

ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ ... రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించిన సిఎస్ 

భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో వైభవంగా సీతారాముల కల్యాణం జరిగింది.  ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి  స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తెలుగు రాష్ట్రాల నుంచి కల్యాణం చూసేందుకు ఎత్తున భక్తులు భారీగా తరలి వచ్చారు. కల్యాణ మహోత్సవంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ అనుమతినిచ్చింది. ఎన్నికల నియమావళికి లోబడి ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రభుత్వానికి ఈసీ స్పష్టం చేసింది. సీఎం లేదా దేవదాయ శాఖ మంత్రి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడంతో పాటు కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతివ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 30న ఈసీకి లేఖ రాసింది.సీఎం రేవంత్​రెడ్డి, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడానికి అనుమతి నిరాకరించిన ఎన్నికల కమిషన్ అవసరమైతే అధికారులు సమర్పించవచ్చునని ఈనెల 4న పేర్కొంది. అయితే లైవ్​ టెలికాస్ట్​ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయరాదని ఆంక్షలు విధించింది. ఆలయం, కల్యాణ మహోత్సవం విశిష్టత, సంప్రదాయం, చరిత్రను పరిగణనలోకి తీసుకొని ప్రత్యక్ష ప్రసారానికి అనుమతివ్వాలని ఈనెల 17న ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ మరోసారి లేఖ రాశారు.సుమారు నలభై ఏళ్లుగా కుల, మత, జాతులకు అతీతంగా దేశ, విదేశాల్లోని లక్షల మంది వీక్షిస్తారని తెలిపారు. బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరారు. ఎట్టకేలకు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రభుత్వానికి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఒంటిమిట్టలో 22న సీతారాముల కల్యాణం ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్టలో కోదండరాముడి వార్షిక మహోత్సవాలు నేటి నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 22వ తేదీన రాత్రి సీతారాముల కల్యాణ మహోత్సవం జరుగుతుంది. రాములవారి కల్యాణం లక్షమంది వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఒంటిమిట్టలో 23న రథోత్సవం నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి
Publish Date: Apr 17, 2024 1:46PM

మోడీ హ్యాట్రిక్ ధీమా వెనుక ఉన్నది ప్రజాభిమానం కాదు.. విపక్షాల వైఫల్యమే!

కేంద్రంలో వరుసగా మూడో సారి మోడీ సర్కార్ కొలువుదీరడం ఖాయమన్న విశ్వాసాన్ని బీజేపీ వ్యక్తం చేస్తున్నది. అయితే  ఆ విశ్వాసం, ధీమా ప్రజాభిమానాన్ని చూరగొనడం వల్ల వచ్చింది కాదనీ, కేవలం విపక్షాల వైఫల్యంతో వచ్చిందేననీ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. దేశంలో  సార్వత్రిక ఎన్నికల ప్రచారం హీట్ పెరిగింది. మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ హ్యాట్రిక్  విజయాల కోసం, కాంగ్రెస్ రెండు ఓటముల తరువాత ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలన్న పట్టుదలతో  చెమటోడుస్తున్నాయి. ప్రచారం తీరు, దూకుడు చూస్తే ఎవరైనా కేంద్రంలో మోడీ మరో సారి అధికారంలోకి రావడం ఖాయమనే అంటున్నారు. అయితే పరిశీలకులు, రాజకీయ పండితులు మాత్రం అదంత వీజీ కాదంటున్నారు. వరుసగా పదేళ్ల పాటు అధికారంలో ఉన్న మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి మిత్రపక్షాలను దూరం చేసుకుంది. మళ్లీ ఎన్నికల ముందు మిత్రపక్షాలతో పొత్తు కోసం వెంపర్లాడింది. ఏకపక్ష విజయం పట్ల నిజంగానే అంత ధీమా ఉంటే.. పొత్తుల కోసం ఎందుకు తహతహలాడుతుందన్న ప్రశ్న సహజంగానే అందరిలో ఉదయిస్తుంది. మరో వైపు ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్ వెనుక ర్యాలీ అయ్యే విషయంలో ముందు వెనుకలాడుతున్నాయి. దీంతో సహజంగానే ఎన్డీయే బలంగా ఉంది. ఇండియా కూటమి బలహీనంగా ఉందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది. అయితే పరిస్థితి బయటకు కనిపించేంత క్రిస్టల్ క్లియర్ గా లేదనీ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకు హ్యాట్రిక్ విజయం సునాయాసంగా దక్కే అవకాశాలు అంతగా కనిపించడం లేదనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశంలో ప్రభుత్వ వ్యతిరేకత చాపకింద నీరులా విస్తరిస్తోందంటున్నారు.  2004లో బీజేపీ భారత్ వెలిగిపోతోంది అనే నినాదంతో  ముందస్తు ఎన్నికలకు వెళ్లిన   బీజేపీకి పరాభవం ఎదురైన సంగతి గుర్తు చేస్తున్నారు. అప్పుడు ఉన్నదీ ఎన్డీయే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వమే. మిత్రధర్మాన్ని పాటించడంలో కానీ, ప్రజామోద పాలన విషయంలో కానీ మోడీ సర్కార్ కంటే వాజ్ పేయి సర్కారే బెటరనీ పరిశీలకులు చెప్పడమే కాదు. అప్పటి ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నాయకులు కూడా ఎలాంటి  సంకోచం లేకుండా చెబుతారు. అయినా అప్పటి వాజ్ పేయి  ప్రభుత్వం పై వ్యతిరేకత  కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో వాజ్ పేయి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను ఎన్నికల తరువాత పరిశీలకులు నిశ్శబ్ద విప్లవం అని అభివర్ణించారు.  ప్రస్తుతం మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంపై కూడా ప్రజా వ్యతిరేకత నిశ్శబ్ధ ఉందనీ, జనం బాహాటంగా ఆ విషయాన్ని వెల్లడించకపోయినా.. ఎన్నికలలో ఆ వ్యతిరేకత ప్రభావం కనిపించే అవకాశం ఉందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయోధ్య రామమందిర ని్మాణం,  హిందూత్వ అజెండా,  ఉమ్మడి పౌరస్మృతి వాగ్దానం, తలాక్ రద్దు, జమ్మూ కాశ్మీర్ వంటి అంశాలు తమను మరో సారి అధికార పీఠంపై కూర్చోపెడతాయన్న విశ్వాసం మోడీలో స్పష్టంగా గోచరిస్తోంది.   అయితా ఓ తాజా సర్వే భారతీయులు హిందుత్వ కంటే సర్వమత సామరస్యాన్నే కోరుకుంటున్నారనీ, రామ భక్తి సామ్రాజ్యం కంటే ప్రజాస్వామ్య భారతాన్ని ఇష్టపడుతున్నారనీ తేల్చింది. జనాభాలో దాదాపు 79శాతం మంది బీజేపీ అజెండా హిందుత్వ అయినా తాము బహు మత భారత ప్రజాస్వామ్యాన్నే కోరుకుంటున్నామని కుండ బద్దలు కొట్టేశారు. ఆ తాజా తీసుకున్న శాంపిల్స్ తక్కువే అయి ఉండొచ్చు. కానీ మెజారిటీ ప్రజల మనోభావాలను స్పష్టంగా ప్రతిఫలించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    ఈ సందర్భంగా 2004 ఎన్నికల ఫలితాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పటి ఎన్నికలలో యూపీఏ ప్రధాని అభ్యర్థిగా సోనియా అన్న నినాదంతోనే ఎన్నికలు వెళ్లంది. అప్పట్లో సోనియా విదేశీయతను బీజేపీ చాలా ప్రముఖ అంశంగా ప్రచారం చేసింది. అయినా జనం సోనియా విదేశీయత అంశాన్ని పట్టించుకోలేదు.  ఇప్పుడు అయోధ్య రామమందిర నిర్మాణాన్ని మోడీ సాధించిన ఘన విజయంగా చెప్పుకుంటూ బీజేపీ ప్రజలలోకి వెడుతోంది. అదే సమయంలో మోడీ సర్కార్ వైఫల్యాలను ప్రజలలోకి తీసుకువెళ్లడంలో కాంగ్రెస్, కూటమి  పార్టీలూ పెద్దగా సఫలం కావడం లేదు. అయినా ప్రజలలో రామ మందిర నిర్మాణం పట్ల సానుకూలత కంటే  దేశంలో పెచ్చరిల్లుతున్న విద్వేష భావనల పట్లే ఎక్కువ ఆందోళన వ్యక్తమౌతోందని పరిశీలకులు అంటున్నారు.  ఇప్పటి ఇండియా ఫ్రంట్ నేతలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ బీజేపీ వైఫల్యాలు ప్రజలలోకి తీసుకు వెళ్లడంలో విఫలం అవుతున్నారు.గత ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ యంత్రాలపై విమర్శలు వచ్చాయి. కొన్ని యంత్రాలు కనిపించకండా పోయాయనే వార్తలు వచ్చాయి. దేశంలో విలయతాండవం చేస్తున్న నిరుద్యోగ రక్కసి కారణంగా మధ్యతరగతి ప్రజలలో మోడీ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోందని, అలాగే రైతుల ఆదాయం రెట్టిపు అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్.. రైతులను దగా చేసిందన్న అభిప్రాయం కూడా బలంగా వ్యక్తం అవుతోంది. ఎలాంటి రాజకీయ మద్దతు లేకుండానే రైతులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నారు. మోడీ సర్కార్ ను నిలదీస్తున్నారు.  నిత్యావసరాల ధరలు ఆకాశానికి చేరుతున్నాయి.వీటిని అదుపు చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసింది.  ఉత్పత్తి రంగాలు కార్పొరేట్ల చేతిలోకి వెళ్లాయి.వారికి ప్రభుత్వం అండ ఉండడంతోపాటు ఆర్ధికవ్యవస్థ ను గుప్పిట్లో పెట్టుకొని ఉన్నారు.ఫ లితంగా వారు నిర్ణయించినదే ధరగా మారుతోంది. దీంతో అదుపులేకుండా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. దీనితో అన్ని వర్గాలలోనూ కేంద్రంలోని మోడీ సర్కార్ పట్ల ఏదో స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అదే సమయంలో  ఈ విషయాలపై ప్రజలలోకి బలంగా దూసుకెళ్లాల్సిన కాంగ్రెస్, దాని మిత్రపక్షాలూ ఘోరంగా విఫలమయ్యాయి.   పంజాబ్,హర్యానాలో రైతుల్లో గిట్టుబాటు బాటు ధర,రైతు చట్టాలు ఉపసంహరణ చేయకపోవడంపై అసంతృప్తి ఉంది. సీఏఏ   అమలులోకి తేవడం వల్ల పౌరసత్వం పై మైనార్టీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మేధావులు ప్రభుత్వ తీరును విమర్శ చేస్తే అర్బన్ నక్సలైట్లు గా పిలుస్తూ అరెస్టు చేయడంతో ఆయా వర్గాల్లోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది.   అయితే కేంద్రంలోని మోడీ సర్కార్ పై వ్యక్తమౌతున్న ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో కాంగ్రెస్ కూటమి, ఇతర బీజేపీయేతర పార్టీలూ విఫలం కావడం బీజేపీకి కలిసి వచ్చే అంశంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 
Publish Date: Apr 17, 2024 1:39PM

కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 5న సిరిసిల్లలో కేసీఆర్ ప్రసంగంలో చేసిన అభ్యంతర కర వ్యాఖ్యలపై బుధవారం ( ఏప్రిల్ 18) లోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. ఆయన ప్రసంగంలో చేసిన పరుష వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకే వస్తాయని ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ కార్యదర్శి అవినాష్ కుమార్ జారీ చేసిన ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఫిర్యాదు మేరకు ఈ ఎన్నికల సంఘం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది.  లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏప్రిల్ 5న సిరిసిల్లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరుష పదాలతో చేసిన కామెంట్లను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆయనకు మంగళవారం నోటీసులు జారీచేసింది. పార్టీ అధినేతగా, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, అందుకు తగిన ప్రాథమిక ఆధారాలను కమిషన్ పరిశీలించిందని ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసుకు గురువారం (ఏప్రిల్ 18) ఉదయం 11 గంటలకల్లా కమిషన్‌కు చేరేలా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పాటు సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి వాస్తవాలతో కూడిన రిపోర్టును తెప్పించుకున్న తర్వాత ఈ నోటీసు జారీ చేయాల్సి వచ్చిందని అవినాశ్ కుమార్ పేర్కొన్నారు. సిరిసిల్లలో తన ప్రసంగంలో కేసీఆర్ ప్రతిపక్ష నేతలపై కుక్కల కొడుకుల్లారా, లతుకోరులు, చవటదద్దమ్మలు వంటి పరుష పదాలను ప్రయోగించారు. అలాగే లతుకోరు ప్రభుత్వం, గొతుల్ని కోసేస్తాం, చంపేస్తాం వంటి  వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకే వస్తాయంటూ ఎన్నికల సంఘం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది.  
Publish Date: Apr 17, 2024 12:36PM

చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ లో పెరిగిన మృతుల సంఖ్య... 29 మావోయిస్టులు దుర్మరణం 

మరో పది రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఇటీవల కాలంలో ఛతీస్ గఢ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఎక్కువగా ఉండటంతో భద్రతా దళాలు జల్లెడపడుతున్నాయి. దీంతో మావోలు కూడా నిన్న పోలీస్ బేస్ క్యాంప్ పై బాంబులు విసిరారు.దీంతో భద్రతాదళాలు వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.  ఈ క్రమంలో ఛోటేబేథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మవోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. మృతుల్లో మావోయిస్టు కీలక నేత శంకర్ రావు కూడా ఉన్నాడని, ఆతని మీద రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.  ఈ ఎదురుకాల్పుల్లో బీఎస్ఎఫ్ ఇన్స్ పెక్టర్, ఇద్దరు జవానులు గాయపడినట్లు సమాచారం. ఘటనా స్థలంలో ఏకే 47 తుపాకులు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన భద్రత సిబ్బందిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.ఇదిలా ఉండగా, కాంకేర్ లోక్ సభ స్థానానికి రెండో దశలో భాగంగా ఈ నెల 26న పోలింగ్ నిర్వహించనున్నారు.
Publish Date: Apr 17, 2024 12:36PM

ముష్టి 350 కోసం జగనన్న ప్రాణాలతో ఆడుకున్నారు కదరా!

ఏవయ్యా విజయవాడ వైసీపీ నాయకులు, కార్యకర్తలూ.. మీరు మన ప్రియతమ నాయకుడు జగనన్న ప్రాణాలతో ఆడుకున్నారు కదరా! మీరు ఆ రాయి విసిరిన పిల్లోడికి కమిట్ అయిన ఆఫ్ట్రాల్ 350 రూపాయలు ఇవ్వకపోవడం వల్ల ఎంత దారుణం జరిగిందో చూశారుగా. ముందుగా ఒక పాయింట్ ఏంటంటే, ఆ రాయి విసిరిన పిల్లోడిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒలింపిక్స్.కి రికమండ్ చేయాల్సిన అవసరం వుంది. ఆ పిల్లోణ్ణి ఒలింపిక్స్.లో ఏ గురిచూసి కొట్టే పోటీలోనో ఆడిస్తే మన దేశానికి గోల్డ్ మెడల్ ఖాయంగా వస్తది. ఆ చీకట్లో, ఆ జనంలో, వాహనం మీద అంతమంది వుండగా, కరెక్ట్.గా జగనన్న ముఖానికే తగిలే విధంగా రాయి విసిరాడు చూడూ.. టాలెంటంటే వాడిదిరా. సరే, ఇక అసలు పాయింట్లోకి వెళ్తే, జగనన్న పేరు చెప్పుకుని జనాలను పీడించి బాగానే కోట్లకు కోట్లు సంపాదించుకున్నారుగా. ఆల్రెడీ ఆ పిల్లోడికి క్వార్టర్ బాటిల్ ఇచ్చారుగా, దానితోపాటు ఇంకో 350 రూపాయలు ఇస్తే మీ సొమ్మేం పోయేదిరా సచ్చినోళ్ళారా. మీరు కమిట్ అయింది ఇవ్వలేదు.. దాంతో ఆ పిల్లోడు మీ నాయకుడి మీద రివెంజ్ తీర్చుకున్నాడు.  ఆ పిల్లోడు విసిరిన రాయి కంటికి కొంచెం పైన తగిలి చిన్న గాయం అయి, జగనన్న ప్లాస్టర్ వేసుకోవడానికి అనుకూలంగా కూడా వుంది కాబట్టి సరిపోయింది. అదే రాయి జగనన్న కంటికి తగిలితే పరిస్థితి ఏంటి? జగనన్న జీవితాంతం గాజు కన్నుతోనే వుండాల్సి వచ్చేది. జీవితమంతా ఎడమవైపు ఎవరున్నారో తెలియకుండా పోయేది. సరే, కంటి విషయం వదిలేయండి, అదే రాయి జగనన్న మూతికి తగిలి వుంటే పరిస్థితి ఏంటి? ఆయన మూతి ఆంజనేయ స్వామి మూతి లాగా వాచిపోయి వుండేది. వారం రోజులపాటు బయటకి వచ్చే అవకాశం వుండేది కాదు. అసలే ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో ఇలా బ్రేక్ వస్తే బాగుంటుందా చెప్పండి. ఒకవేళ వాచిపో్యిన మూతితోనే ఆయన మాట్లాడితే వినేవాళ్ళకు, చూసేవాళ్ళకి ఎంత కామెడీగా వుండేదో తెలుసా?  సరే, మూతి కూడా వదిలేయండి. ముక్కుకు తగిలితే పరిస్థితి ఏంటి? ముక్కు పచ్చడి అయిపోయి, ముక్కు చీదుకోవడానికి కూడా అవకాశం లేకుండా పరిస్థితి తయారయ్యేది. జగనన్న ముక్కుకి బ్యాండేజ్ కట్టడం కూడా చాలా కష్టం.. అలాంటి పరిస్థితుల్లో జగనన్న ఎంత ఇబ్బంది పడేవారో మీరు అర్థం చేసుకున్నారా? సరే, ముక్కు కూడా వదిలేయండి, రాయి డైరెక్ట్.గా వెళ్ళి జగనన్న చిన్న మెదడుకు తగిలి వుంటే, ఆయన చిన్నమెదడు చిట్లిపోయి వుంటే పరిస్థితి ఎంత దారుణంగా వుండేదో తెలుసా? జగన్ జ్ఞాపకశక్తి అంతా తుడిచిపెట్టుకుని పోయి వుండేది. ఆయన ఆస్తులు ఎక్కడెక్కడ వున్నాయో కూడా మర్చిపోయి వుండేవాడు. ఎవర్నీ గుర్తుపట్టలేకపోయేవాడు. వచ్చిన కాస్తా కూస్తా తెలుగు కూడా మర్చిపోయి ఏదో వింత భాష మాట్లాడేవాడు. మన పార్టీ మహిళామణులు బాధపడుతున్నట్టు ఆ రాయి డైరెక్ట్.గా వచ్చి జగనన్నకి ‘తగలరాని చోట’ తగిలినట్టయితే పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా తయారయ్యేదో ఒక్కసారి ఊహించండి. అందువల్ల, ఈసారి ఎవరికి ఎంత కమిట్ అయితే ఇచ్చేయండి. మీరు డబ్బుకోసం కక్కుర్తి పడి జగనన్న ప్రాణాల మీదకి తీసుకురాకండి.
Publish Date: Apr 17, 2024 12:30PM

ఏపీలో వార్ వన్ సైడే డౌటే లేదు!

ఏపీలో జనం డిసైడైపోయారు. సాధారణంగా ఏ ఎన్నికలలోనైనా సరే   చివరి నిముషం వరకూ ఎవరికి ఓటు వేయాలన్న నిర్ణయం తీసుకోకుండా వేచి చూసే తటస్థ ఓటర్లు ఉంటారు. సాధారణంగా ఎన్నికల ఫలితాలు ఆ తటస్థ ఓటర్లు మెగ్గు చూపిన పార్టీ లేదా కూటమికే సానుకూలంగా ఉంటాయి. అయితే ఆశ్చర్యకరంగా ఏపీలో ప్రస్తుతం తటస్థ ఓటర్లు అనే వారే లేకుండా పోయారు. జగన్ అరాచక, అస్తవ్యస్థ పాలన కారణంగా తటస్థ ఓటర్లు ఇప్పటికే తాము ఎటువైపు ఉండాలన్న నిర్ణయం తీసేసుకున్నారు.  దీంతో రాష్ట్రంలో పరిస్థితి ఎలక్షన్ వార్ వన్ సైడైపోయిందన్న పరిస్థితి కనిపిస్తోంది.  ఆంధ్రప్రదేశ్ లో  ఎన్నికల సమరంలో అధికార వైసీపీ చేతులెత్తేసిందా అనిపించేలా రాష్ట్రంలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికల హీట్ పీక్స్ చేరిన ఈ సమయంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి బస్సు యాత్రకు జనస్పందన అంతంత మాత్రంగా ఉండటం, అదే సమయంలో విపక్ష నేత ప్రజాగళం సభలకు జనం పోటెత్తుతుండటం చూస్తుంటే జనం మూడ్ ఏమిటన్నది అర్థమైపోతోంది. అదే సమయంలో పలు మీడియా, సర్వే సంస్థలు వెలువరించిన సర్వేలు కూడా ఏపీలో తెలుగుదేశం కూటమి సునామీ ఖాయమని చెబుతున్నాయి. ఒకటి రెండు అని కాదు.. ఇప్పటి వరకూ వెలువడిన దాదాపు అన్ని సర్వేలూ కూడా తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధిస్తుందనే అంచనా వేశాయి. ఒక సర్వేను మించి మరో సర్వే కూటమి గెలిచే స్థానాల సంఖ్య పెచ్చుగా ఉంటుందని చెబుతున్నాయి. ఇప్పటి వరకూ ఏపీ ఎన్నికలకు సంబంధించి దాదాపు పది సర్వేలు వెలువడ్డాయి. అన్ని సర్వేలూ కూడా కూటమి విజయాన్ని ఖరారు చేస్తున్న విధంగానే  ఫలితాలు వెలువరించాయి.  ఇండియా టుడే సర్వే తెలుగుదేశం కూటమి 17 లోక్ సభ స్థానాలలో  విజయకేతనం ఎగురవేస్తుందనీ, వైసీపీ ఎనిమిది స్థానాలకే పరిమితమౌతుందనీ పేర్కొంది. ఇంొడియా టుడే గతంలో రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం మరోసారి తధ్యమని పేర్కొన్న సంగతి విదితమే. అయితే రాష్ట్రంలో పరిస్థితులపై వాస్తవాన్ని గ్రహించి ప్లేటు ఫిరాయించింది. ఇక సీఎన్ఎన్ న్యూస్ నిర్వహించిన సర్వే తెలుగుదేశం కూటమి  18 లోక్ సభ స్థానాలలో విజయం సాధిస్తుందనీ, అధికార వైసీపీ కేవలం ఏడు స్థానాలకే పరిమితమౌతుందని అంచనా4 వేసింది. ఇక ఇండియా టీవీ నిర్వహించిన సర్వే కూడా ఇండియా టుడే ఫలితాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇండియా టీవీ సర్వే ప్రకారం తెలుగుదేశం కూటమి 17 లోక్ సభ స్థానాలలోనూ, అధికార వైసీసీ 8 స్థానాలలోనూ గెలిచే అవకాలున్నాయని పేర్కొంది.  న్యూస్ ఎక్స్ సర్వే అయితే తెలుగుదేశం కూటమికి 18, వైసీపీకి 7 లోక్ సభ స్థానాలలో విజయం సిద్ధిస్తుందని అంచనా వేసింది.  ఏబీపీ న్యూస్ అయితే వైసీపీ కేవలం ఐదు లోక్ సభ స్థానాలకే పరిమితమౌతుందనీ, తెలుగుదేశం కూటమి ఇరవై స్థానాలలో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ అంచనా వేసింది. జనమత్ పోల్స్ నిర్వహించిన సర్వే తెలుగుదేశం కూటమికి 17, వైసీపీకి 8 లోక్ సభ స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది.  స్కూల్ ఆఫ్ పోలటిక్స్ సర్వేలో తెలుగుదేశం కూటమికి అత్యధికంగా 23 లోక్ సభ స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని తేల్చింది. అధికార వైసీపీ కేవలం రెండు స్థానాలకే పరిమితమౌతుందని పేర్కొంది. పీపుల్స్ రైట్  సంస్థ సర్వే ఫలితం కూడా  సరిగ్గే ఇలానే  ఉంది. అధికార వైసీపీ రెండు స్థానాలకే పరిమితమౌతుందని, తెలుగుదేశం కూటమి 23 లోక్ సభ స్థానాలలో జయకేతనం ఎగురవేయడం ఖాయమని పీపుల్స్ రైట్ సర్వే పేర్కొంది.  ఇక పయనీర్ పోల్ అయితే తెలుగుదేశం 18 లోక్ సభ స్థానాలను కైవశం  చేసుకుంటుందనీ, వైసీపీ ఏడు స్థానాలకే పరిమితమౌతుందని తేల్చింది. ఇండియా న్యూస్ సర్వే కూడా ఇదే ఫలితం వెలువరించింది. ఇక జీ న్యూస్ అయితే తెలుగుదేశం కూటమికి 17, వైసీపీకి 8 లోక్ సభ స్థానాలు దక్కుతాయని పేర్కొంది.  ఇలా ఏపీ ఎన్నికల విషయంలో అధికార వైసీపీకి ఎటువంటి అవకాశం లేదని దాదాపు అన్ని సర్వేలూ తేల్చాయి.  ఈ సర్వేలన్నీ రాష్ట్రంలో ప్రజల మూడ్ ఎలా ఉందన్నది పట్టి చూపాయి. అయితే ఐదేళ్ల కిందట అద్భుత మెజారిటీతో ఘన విజయం సాధించిన వైసీనీ కేవలం ఐదేళ్లలో ఇంతటి స్థాయిలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడానికి  ఈ ఐదేళ్లలో జగన్ సర్కార్ సాగించిన ప్రజా వ్యతిరేక పాలనే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో   ఏపీలో వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది.  గురువారం (ఏప్రిల్ 18) నోటిఫికేష్ వెలువడనుంది.   గత ఐదేళ్లలో రాష్ట్రంలో ప్రజా పాలన కాకుండా పోలీసు పాలన సాగిందన్న అభిప్రాయం ప్రజలలో బలంగా వ్యక్తం అవుతోంది.   జగన్ సర్కార్ అభివృద్ధిని విస్మరించి కేవలం బటన్ నొక్కుడు ద్వారా సొమ్ముల పందేరమే పాలన అన్నట్లుగా వ్యవహరించింది. దానికి తోడు అభివృద్ధి గురించి ప్రశ్నించినా, హక్కుల కోసం గళమెత్తినా వారిపై ఉక్కుపాదం మోపింది. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోవడంతో  ప్రజలపై విపరీతంగా పన్నుల భారం మోపింది. లబ్ధి అంటూ పావలా పందేరం చేసి... రూపాయిని పన్నుల రూపంలో లాగేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పథకాల లబ్ధి దారులపై కూడా జగన్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది.  అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేయడం, ప్రజల హక్కులను కాలరాయడం వంటి చర్యల కారణంగా సమాజంలోని ఏ వర్గమూ జగన్ పాలన పట్ల సానుకూలంగా లేని పరిస్థితి నెలకొంది. దానినే సర్వేలన్నీ ఎత్తి చూపాయి.   ఐదేళ్ల పాల‌న‌లో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌క్ష‌పూరిత‌ పాల‌న సాగించారని, రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలు కూడా కనిపించడం లేదనీ, జగన్ పాలనలో సమాజంలోకి ఏ ఒక్క వర్గమూ కూడా సంతోషంగా లేదనీ ఈ సర్వే ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. జగన్ అస్తవ్యస్త, అరాచక పాలన పట్ల ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నార‌నీ, అన్ని వ‌ర్గాల వారూ ఏకతాటిపైకి వ‌స్తూ వైసీపీ ప్ర‌భుత్వానికి గ‌ట్టి గుణ‌పాఠం చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని సర్వేల ఫలితాలు నిర్ద్వంద్వంగా సూచిస్తున్నాయి. అందుకు ప్రత్యక్ష నిదర్శనం  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర‌కు ప్ర‌జాద‌ర‌ణ క‌రువైంది. వైసీపీ కార్య‌క‌ర్త‌లు సైతం బ‌స్సు యాత్ర‌లో పాల్గొనేందుకు ఆస‌క్తి చూప‌డం లేదు.  వీటన్నిటినీ బట్టి చూస్తే రానున్న రోజులలో అంటే పోలింగ్ సమయం దగ్గరపడేకొద్దీ వైసీపీ గ్రాఫ్ మరింత దిగజారడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: Apr 17, 2024 12:01PM

జగన్ సభలకు కి‘రాయి’జనాలే.. రాయిదాడి సొమ్ము ఎగ్గొట్టినందుకే!

జగన్ మనమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజాదరణ కరవైందని ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రోడ్ షోలకు జనం ముఖం చాటేస్తున్న దృశ్యాలు  మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ యాత్ర సందర్భంగా ఆయన చేస్తున్న ప్రసంగాలు వినేందుకు కిరాయి ఇచ్చి మరీ రప్పించుకున్న జనం కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదు. పదులు, వందల సంఖ్యలో  బస్సులలో ఇతర ప్రాంతాల నుంచి తరలించిన జనం కూడా జగన్ ప్రసంగం మొదలు కాగానే సభా ప్రాంగణాన్ని ఖాళీ చేసి బస్సుల వద్దకు వెళ్లి పోతున్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  ఈ నేపథ్యంలోనే  బెజవాడలో సీఎం జగన్‌పై జరిగిన గులకరాయి దాడిపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. జగన్ పై చంద్రబాబు చేసిన హత్యాయత్నంగా ఈ దాడిని అభివర్ణించడానికి వైసీపీ నేల విడిచి సాము చేసింది. స్వయంగా జగన్ కూడా ఈ దాడి వెనుక ఉన్నది చంద్రబాబేనని ఆరోపణలు గుప్పించారు.  ఒక ముఖ్యమంత్రిపై దాడి కావడంతో ముందువెనుకలు ఆలోచించకుండా  ప్రధాని మోదీ నుంచి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు రాజకీయ పార్టీల నాయకులు, చివరాఖరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సైతం ఖండించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రకటించి దాడికి పాల్పడిన వారిని పట్టిచ్చిన వారికి రెండు లక్షల రివార్డు కూడా ప్రకటించేశారు.  అలా ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే  పోలీసులు దాడికి సంబంధించి ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణ సందర్భంగా ఆ యువకులు వెల్లడించిన వాస్తవాలు బయటకు పొక్కటంతో  జగన్ సభలకు డబ్బులిచ్చినా, మందు పోసినా జనాలు రావడం లేదన్న సంగతి బట్టబయలైంది.  జగన్ పర్యటనకు వస్తే 350 రూపాయలడబ్బు, మందుబాటిల్ ఇస్తామని తీసుకువచ్చారనీ, తీరా వచ్చిన తరువాత క్వార్టర్ మందుబాటిల్ చేతిలో పఃపెట్టి  డబ్బులు ఎగ్గొట్టారనీ, దాంతో  కోపం వచ్చి  జగన్‌పై రాయి వేశాననీ దాడికి పల్పడిన వ్యక్తి పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఈ దాడికి ఏ రాజకీయపార్టీతోనూ సంబంధం లేదని  పోలీసులు చెబుతున్నారు. అదే సమయంలో జగన్ సభలకు వస్తున్న జనం మొత్తం కిరాయి జనమేనని ఈ దాడి ఘటనతో తేలిపోయిందని పరిశీలకులు పోలీసుల విచారణలో తెలిన అంశాలను ఉటంకిస్తూ విశ్లేషిస్తున్నారు.  అదలా ఉంటే జగన్ పై దాడికి పాల్పడ్డారంటూ ఐదుగురు యువకులను పోలీసులు   పోలీసుస్టేషన్‌కు తీసుకురావడంపై  అక్కడి బడుగువర్గా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దాడితో సంబంధం లేని తమ పిల్లలను అన్యాయంగా తీసుకువచ్చారంటూ వడ్డెర కుల స్తులంతా పోలీసుస్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. 200రూపాయలిచ్చి తమను జగన్ మీటింగుకు తీసుకువెళ్లి, ఆ డబ్బులు కూడా ఇవ్వలేదని.. పోలీసులు అదుపులోకి తీసుకున్న సతీష్ అనే యువకుడి తల్లి మీడియా ముందు  చెప్పిన మాటల వీడియో  సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది, వైసీపీ పరువు, జగన్ పరువును రోడ్డు కీడ్చింది.  సింగ్‌నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అనే యువకుడే. ఫుట్‌పాత్ కోసం వేసే టైల్ రాయిని సీఎంపైకి విసిరి గాయపరిచాడన్నది పోలీసులు ఆరోపణ.  అతనితోపాటు ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే  పోలీసుల తీరుకు నిరసనగా డాబా సెంటర్‌లో వడ్డెర కులస్తులు భారీ సంఖ్యలో రాస్తారోకో చేయడం సంచలనం సృష్టించింది. మొత్తం మీద జగన్ పై గులకరాయి దాడి ఘటన జగన్ సభలకు డబ్బులు, మద్యం ఆశచూపి జనాలను తరలించడమే కాకుండా, వచ్చిన వారికి చెప్పిన విధంగా డబ్బులు ఇవ్వకుండా వైసీపీ మోసం చేస్తోందని బట్టబయలైంది.   గత ఎన్నికల్లో కోడికత్తి.. బాబాయ్‌పై గొడ్డలిపోటు సానుభూతి దారిలోనే.. రాయిదాడిని భూతద్దంలో చూపి, దానిని జగన్‌పై హత్యాయత్నంగా మలచి, ఓట్లు ఒలుచుకోవాలన్న వైసీపీ వ్యూహంబెడిసి కొట్టింది.  
Publish Date: Apr 17, 2024 11:25AM

జ్యోతిషం నేర్చుకున్న కేసీఆర్

పదేళ్ళపాటు ఇష్టారాజ్యంగా నడిపించిన అధికారం పోయింది. బాత్రూమ్‌లో జారిపడ్డట్టు ఆడిన నాటకం పుణ్యమా అని ఇప్పుడు ఫామ్‌హౌస్‌లో బోలెడంత రెస్టు దొరుకుతోంది. ఫామ్‌హౌస్‌లో సాధారణంగా సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం వేళలోనే వుంటాయి. అధికారంలో వున్నా, లేకపోయినా పార్టీ నాయకులెవరైనా పిలిస్తే ఫామ్ హౌస్‌కి వెళ్ళాలి తప్ప వాళ్ళంతట వాళ్ళు వెళ్ళే అవకాశం లేదు. దాంతో పింక్ దొరకి పగలంతా ఖాళీనే. ఈ ఖాళీని సద్వినియోగం చేసుకుంటూ కేసీఆర్ జ్యోతిషం నేర్చుకున్నట్టు అనిపిస్తోంది. తన జ్యోతిష ప్రవేశాన్ని, పరిజ్ఞానాన్ని పదునుపెట్టుకునే ప్రాక్టీసులో భాగంగా కేసీఆర్ భవిష్యత్తును ఊహించి చెబుతున్నారు.  కేసీఆర్ ఊహిస్తున్న దాని ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో వున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంవత్సరం కూడా వుండే పరిస్థితి కనిపించడం లేదట. ఆయనకి అలా ఎందుకు అనిపిస్తోందో మాత్రం ఈ సిద్ధాంతి చెప్పడం లేదు. అదేవిధంగా ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 2 పార్లమెంటు స్థానాల కంటే ఎక్కువ వచ్చే అవకాశం కనిపించడం లేదట. దేశంలో జరుగుతున్న సర్వేలన్నీ ఈసారి టీఆర్‌ఎస్‌కి రెండు పార్లమెంట్ స్థానాలు వచ్చేది కూడా డౌటేనని కోడై కూస్తుంటే, ఈ సిద్ధాంతి మాత్రం కాంగ్రెస్‌కి రెండు స్థానాలకు మించి రావని భవిష్యత్తు వాణి వినిపిస్తున్నారు. మొన్నటి ఎన్నికలలో కేసీఆర్ని తిప్పతిప్పి కొట్టి అధికార పీఠం నుంచి కిందకి లాగిన రేవంత్ రెడ్డి ఒక లిల్లీపుట్ అంట. ఈయన మాత్రం పెద్ద ఆజానుబాహుడైనట్టు. ప్రజలు ప్రలోభాలకు లొంగిపోయి కాంగ్రెస్‌కి ఓటు వేసి గెలిపించారట. ఇప్పుడు తప్పు తెలుసుకుని బాధపడుతున్నారట.  నిన్న హైదరాబాద్ శివార్లలోని సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కేసీఆర్ మాట్లాడిన తీరు చూస్తుంటే ‘చింత చచ్చినా పులుపు చావలేదు’ అనే సామెత కనిపెట్టిన వాడికి పొర్లు దండాలు పెట్టాలన్నంత గౌరవం ఏర్పడుతుంది. ఎందుకంటే, ఆ సామెతకి నిలువెత్తు నిదర్శనంగా ఆ సభలో కేసీఆర్ మరోసారి కనిపించారు. కేసీఆర్ మాటల్లో అదే అహంకారం, అవే అబద్ధాలు, అవే తిట్లు, శాపనార్థాలు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదట.. అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలట. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు.. దుర్మార్గమైన పాలన చేశారు కాబట్టే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ప్రజలు భావిస్తే ఎన్నికల సందర్భంలో ఎలాగూ బుద్ధి చెబుతారు. అప్పటిదాకా అన్నీ మూసుకుని రెస్టు తీసుకోకుండా కేసీఆర్‌కి ఈ జ్యోతిషాలు, తిట్టు, శాపనార్థాలు ఎందుకంట?  
Publish Date: Apr 17, 2024 11:19AM

ప్రభుత్వ సలహాదారులకూ ఎన్నికల కోడ్

జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఇకపై మీడియా ముందుకు వచ్చి ఇష్టారీతిగా ప్రసంగాలు గుప్పించేయడానికి వీల్లేదు. అలా చేస్తే ఆయనపైనా ఎన్నికల సంఘం వేటు వేస్తుంది. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో విస్పష్టంగా పేర్కొంది. ఏపీలో ప్రభుత్వ సలహాదారులపై భారీ స్థాయిలో ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సలహాదారులకు కూడా కోడ్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.  ప్రభుత్వ జీతభత్యాలు పొందుతున్న ప్రభుత్వ సలహాదారులు పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించేందుకు ఎంత మాత్రం కుదరదని కుండబద్దలు కొట్టింది. ఏపీలో  40 మంది ప్రభుత్వ సలహాదారులకూ కోడ్ వర్తిస్తుందని పేర్కొంటూ.. ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ సలహాదారులుగా వారికి నిర్దేశించిన విధులను వదిలేసి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.   మంత్రులకు వర్తించినట్లే వీరికి కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందనీ, దానిని ఉల్లంఘిస్తూ కఠిన చర్యలు తప్పవనీ హెచ్చరించింది.      
Publish Date: Apr 17, 2024 10:01AM

ఆటోన‌గ‌ర్ స్థ‌లాల‌కు ప‌ట్టాలు రిజిస్ట్రేష‌న్ చేయిస్తాం.. కేశినేని చిన్ని

ఆటోన‌గ‌ర్ అనుబంధ సంఘాల‌తో ఆత్మీయ స‌మావేశం  ముఖ్యఅతిధిగా పాల్గొన్న కేశినేని శివ‌నాథ్  చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ఐలా ఏర్పాటు   జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తీసుకువ‌చ్చిన జీవో నెంబ‌ర్ 5,6 వ‌ల్ల ఆటోన‌గ‌ర్ ఆటోమొబైల్ కార్మికులు, య‌జ‌మానులు చాలా అయోమ‌యానికి గురై తీవ్ర అవ‌స్థ‌లు ప‌డ్డారు. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ఈ జీవో వ‌ల్ల కార్మికులు ఉపాధి కోల్పోతారు. కార్మికుల‌కి, ఆటోన‌గ‌ర్ మ‌నుగ‌డికి ప్ర‌మాదక‌ర‌మైన ఈ జీవోను చంద్ర‌బాబు గారు అధికారంలోకి రాగానే ర‌ద్దు చేయ‌టం జ‌రుగుతుంద‌ని బిజెపి, జ‌న‌సేన బ‌ల‌ప‌రిచిన టిడిపి విజ‌య‌వాడ ఎంపి అభ్య‌ర్ధి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) చెప్పారు.  తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలోని ఎన్.ఎ.సి క‌ళ్యాణ‌మండ‌పంలో మంగ‌ళ‌వారం ఆటోన‌గ‌ర్ అనుబంధ సంఘాల స‌భ్యుల‌తో ఆత్మీయ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి ముఖ్యఅతిధిగా కేశినేని శివ‌నాథ్ , జిల్లా అధ్య‌క్షులు నెట్టెం ర‌ఘురామ్, ఎమ్మెల్యే అభ్య‌ర్ది గ‌ద్దె రామ్మోహ‌న్ తో క‌లిసి  పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భంగా కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ 1966లో ఏర్పాటైన ఆటోన‌గ‌ర్ అభివృద్ది  తెలుగుదేశం ప్ర‌భుత్వంలోనే జ‌రిగింద‌న్నారు. చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ఆటోన‌గ‌ర్ లో ఐలా ఏర్పాటు చేయ‌టం జ‌రిగింద‌న్నారు. ఐలా ఏర్పాటు చేయ‌టం వ‌ల్ల ఆటోన‌గ‌ర్ స‌మ‌స్య‌ల‌తో పాటు, ఆటోమొబైల్ కార్మికుల స‌మ‌స్య‌లు కూడా ప‌రిష్కారం అయ్యాయ‌న్నారు. ఆటోన‌గ‌ర్ లో ఐలా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌టానికి జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నాడు. అందుకే ఇంత‌వ‌ర‌కు ఐలా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేదు. నిర్వ‌హిస్తే టిడిపి ప్యానెల్ నెగ్గుతుంద‌ని జ‌గ‌న్ తెలుసే...ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేద‌ని మండిప‌డ్డారు. ఎన్డీయే ప్ర‌భుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయ‌క‌త్వంలో ఐలా ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు.  2014-19 మ‌ధ్య కాలంలో ఆటోన‌గ‌ర్ లో ఆటోమొబైల్, ట్రాన్స్ ఫోర్ట్ రంగం చాలా అభివృద్ది సాధించింది.అప్పుడు మెకానిక్స్ దగ్గ‌ర నుంచి టింక‌రింగ్, పెయింటింగ్ అంద‌రికి ప‌నులు వుండేవి. ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. అధికారంలోకి రాగానే ఆటోన‌గ‌ర్ కి పూర్వ వైభ‌వం తీసుకువ‌చ్చేందుకు కృషి చేస్తాను. కాల‌నుగుణంగా ఆటోమొబైల్ కార్మికులు నైపుణ్యం పెంపొందించుకునేందుకు వీలుగా సిల్క్ డెవ‌ల‌ప్మెంట్ సెంట‌ర్స్ ఏర్పాటు చేయిస్తాన‌ని చెప్పారు.  అలాగే ఆటోన‌గ‌ర్ ఏర్ప‌డి 58 సంవ‌త్స‌రాలు అవుతున్నా...ఇప్ప‌టి వ‌ర‌కు తాగునీటి స‌మ‌స్య ప‌రిష్కారం కాలేదు. ఇక్క‌డ వాట‌ర్ క‌ట్టినా..క‌నెక్ష‌న్స్ ఇచ్చే విష‌యంలో జాప్యం చేస్తున్నారు. అలాగే ఆటోన‌గ‌ర్ లో ప్ర‌ధాన స‌మ‌స్య అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్య‌వ‌స్థ స‌రిగా లేదు. దీంతో చిన్నపాటి వ‌ర్షం ప‌డినా ఆటోన‌గ‌ర్ మునిగిపోతుంది. అలాగే గుంట తిప్ప డ్రైయిన్ స‌మ‌స్య ప్ర‌ధానం గా వుంది. ఈ స‌మ‌స్య‌ల‌తో పాటు బందురు రోడ్డు, ఏలూరు రోడ్డు కు క‌నెక్టివిటి ఏర్పిచే సాల్వెంట్ రోడ్డు ఆక్ర‌మ‌ణ‌కు గురైంది. ఈ స‌మ‌స్య‌ల‌న్నీ గ‌ద్దె రామ్మోహ‌న్, నెట్టం ర‌ఘురామ్‌, బోడె ప్ర‌సాద్ ల‌తో క‌లిసి చంద్ర‌బాబు  దృష్టి తీసుకువెళ్లి పరిష్కరించేంత వ‌ర‌కు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర జ‌రిగిన‌ప్పుడే తెలుగుదేశం జాతీయ పార్టీ ప్ర‌ధాన  కార్య‌ద‌ర్శి లోకేష్ ను ఆటోన‌గ‌ర్ తీసుకురావ‌టానికి ప్ర‌య‌త్నించాను. అయితే ఆ రోజు ఆదివారం కావ‌టం వ‌ల్ల సాధ్య‌ప‌డ‌లేద‌న్నారు. పాత ప‌ద్దతుల్లో న‌డుస్తున్న ఆటోన‌గ‌ర్ ను అప్ గ్రేడెష‌న్ చేసే విష‌యం లోకేష్ తో మాట్లాడి..ఏ విధంగా ఆటోన‌గ‌ర్ ను అప్ గ్రేడేష‌న్ చేయాలో ప్ర‌ణాళిక సిద్దం చేసిన‌ట్లు తెలిపారు. ఆటోన‌గ‌ర్ లో ఆటో మొబైల్ వ్యాపారం చేసిన త‌న‌కి...ఇక్క‌డి స‌మ‌స్య‌లు బాగా తెలుసు అన్నారు. కేంద్రం లోనే కాదు రాష్ట్రంలో కూడా ఎన్డీయే ప్ర‌భుత్వం అధికారంలోకి రాబోతుంది. కేంద్రంలో మోదీ ప్ర‌ధాన‌మంత్రిగా , రాష్ట్రంలో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా పద‌వీ స్వీకారం చేస్తార‌ని తెలిపారు.  ఈ కార్య‌క్ర‌మంలో టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర అధ్య‌క్షుడు గొట్టుముక్క‌ల ర‌ఘురామ‌రాజు, మోటార్ కార్పెంట‌ర్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు వి.ల‌క్ష్మీనారాయ‌ణ గారు, ఆటోన‌గ‌ర్ మెకానిక్ యూనియ‌ర్ కార్య‌ద‌ర్శి ద‌స్త‌గిరి, పెయింట్ అసోసియేష‌న్ కార్య‌ద‌ర్శి వీరాచారి, ఎపి లారీ అసోసియేష‌న్ అధ్యక్షులు వై.వి. ఈశ్వ‌ర‌రావు, అమ‌రావ‌తి కారు అసోసియేష‌న్ అధ్యక్షులు దివాక‌ర్, ఐలా అధ్య‌క్షులు దుర్గ‌ప్ర‌సాద్, శాస‌న‌మండలి మాజీ చైర్మ‌న్ ష‌రీష్,  ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షుడు నెట్టెం రఘురామ్,  తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే అభ్య‌ర్ధి గ‌ద్దె రామ్మోహ‌న్, పెన‌మ‌లూరు ఎమ్మెల్యే అభ్య‌ర్ధి బోడే ప్ర‌సాద్, తెలుగుదేశం నాయ‌కులు బొప్ప‌న భ‌వ‌కుమార్, ఎమ్.ఎస్.బేగ్, చెన్నుపాటి వ‌జీర్,  జ‌న‌సేన ఎన్టీఆర్ జిల్లా స‌మ‌న్వ‌య క‌ర్త అమ్మిశెట్టి వాసు, మాజీ మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్, బిజెపి తూర్పు నియోజ‌క‌వ‌ర్గ క‌న్వీన‌ర్ పోతంశెట్టి నాగేశ్వ‌ర‌రావు, త‌దిత‌రులు పాల్గొన్నారు.
Publish Date: Apr 17, 2024 7:57AM