Publish Date:Feb 26, 2014
Publish Date:Feb 22, 2014
Publish Date:Feb 21, 2014
Publish Date:Feb 20, 2014
Publish Date:Feb 19, 2014
Publish Date:Feb 17, 2014
Publish Date:Feb 15, 2014
Publish Date:Feb 14, 2014
Publish Date:Feb 13, 2014
Publish Date:Feb 12, 2014
Publish Date:Feb 8, 2014
Publish Date:Feb 7, 2014
Publish Date:Feb 4, 2014
Publish Date:Feb 3, 2014
Publish Date:Jan 28, 2014
Publish Date:Jan 24, 2014
Publish Date:Jan 17, 2014

EDITORIAL SPECIAL
  అసెంబ్లీలో చంద్రబాబు కాకుండా టీడీపీకి మిగిలేది ముగ్గురు ఎమ్మెల్యేలేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలకు కారణం ఆ పార్టీ ఎమ్మెల్యేల తీరే అని చెప్పాలి. గెలిచిందే 23 మంది ఎమ్మెల్యేలు అంటే.. వారిలో మెజారిటీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అసలు వారి వాయిస్ నే వినిపించట్లేదు. ఎమ్మెల్యేల వైఖరి పట్ల బాబు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. అధికారపక్షం వైసీపీ తరఫున అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే.. టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య, రామానాయుడు తప్ప మిగిలిన వారెవరూ పట్టించుకోవడం లేదు. వైసీపీ నేతలు బాబుపై వ్యక్తిగతంగా విమర్శలు చేసినా కూడా పెద్దగా స్పందించడం లేదు. గతంలో అసెంబ్లీలో ఉన్న సమయంలో కరణం బలరామ్, పయ్యావుల కేశవ్‌ వంటి వారు టీడీపీ మీద ఈగ వాలనిచ్చేవారు కాదు. వారి వాగ్ధాటికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఇబ్బందిపడే వారు. అలాంటిది ఇప్పుడు వారి గొంతు అసెంబ్లీలో అసలు వినిపించడం లేదు. అనవసరంగా వైసీపీకి టార్గెట్ అవ్వడం ఎందుకని కొందరు, టీడీపీలో ఇంకెన్ని రోజులు ఉంటామో తెలీదు ఈ మాత్రం దానికి హడావుడి ఎందుకని మరికొందరు.. సైలెంట్ గా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. వైసీపీకి టార్గెట్ అవుతామనే భయం సంగతి పక్కనబెడితే.. టీడీపీ నుంచి పది మందికి పైగా ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేతలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఎలాగూ పార్టీ మారిపోతాం కదా.. ఇప్పుడెందుకు అసెంబ్లీలో చొక్కాలు చించుకోవడం అని బీజేపీ గూటికి చేరాలనుకుంటున్న ఎమ్మెల్యేలు సైలెంట్ అవుతున్నారట.  కరణం బలరాం, పయ్యావుల కేశవ్, వల్లభనేని వంశీ బీజేపీలో చేరతారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ ముగ్గురూ నోరు విప్పడం లేదట. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నుంచి అసలు స్పందనే లేదు. బీజేపీలో చేరే వారిలో తొలి వ్యక్తి గంటానే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. సీనియర్ నేతలు గొట్టిపాటి రవి, గద్దెరామ్మోహన్, వెలగపూడి రామకృష్ణ బాబు ఎందుకు నోరెత్తడం లేదనేది మరో ప్రశ్న. సాధారణంగా గొట్టిపాటి రవి అసెంబ్లీలో మితంగా మాట్లాడతారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు, తర్వాత వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన పెద్దగా మాట్లాడలేదు. ఇక మంచి వాగ్ధాటి ఉన్న గద్దె రామ్మోహన్ కూడా ఈసారి అస్సలు మాట్లాడటం లేదు. బాబు గురించి అవహేళనగా మాట్లాడుతున్నప్పుడు కూడా గద్దె రామ్మోహన్ స్పందించడంలేదు. వెలగపూడి రామకృష్ణబాబుది కూడా ఇదే తీరు. దీంతో ఎమ్మెల్యేల తీరుపై బాబు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
  ప్రపంచ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్టుకు 300 మిలియన్ డాలర్ల రుణాల నుండి వైదొలగాలని నిర్ణయించింది.  Working Group on International Financial Institutions (WGonIFIs) మరియు అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్ట్ యొక్క బాధిత సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. ప్రజల ఉద్యమాలు, పౌర సమాజ సంస్థల వ్యతిరేకత మరియు ప్రభావిత వర్గాల వారి నుంచి తనిఖీ ప్యానెల్ కి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో బ్యాంక్ ఈ నిర్ణయానికి వచ్చింది. ఈ విషయంపై నర్మదా బచావ్ ఆందోళన్ మరియు నేషనల్ అలియన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్స్ యొక్క సీనియర్ కార్యకర్త మేధా పట్కర్ స్పందించారు. "అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్టులో పాల్గొన్న స్థూల ఉల్లంఘనలను ప్రపంచ బ్యాంక్ గ్రహించి, ఈ నిర్ణయం తీసుకోవడం మాకు సంతోషంగా ఉంది. నర్మదా మరియు టాటా ముంద్రా తరువాత, ఇది ప్రపంచ బ్యాంక్ గ్రూపుపై సాధించిన మూడవ అతిపెద్ద విజయం. నర్మదా బచావ్ ఆందోళన్ పోరాటం కారణంగా ఏర్పడిన తనిఖీ ప్యానెల్ ఈ విషయంలో కీలక పాత్ర పోషించినందుకు మేము సంతోషంగా ఉన్నాం. ప్రజల అనుమతి లేకుండా వారి ఎజెండాను ముందుకు తీసుకురావద్దని మేము ప్రభుత్వం మరియు ఆర్థిక సంస్థలను హెచ్చరిస్తున్నాం" అన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్ట్ కు 2014 లో శ్రీకారం చుట్టినప్పటి నుండి.. పర్యావరణ నిపుణులు, పౌర సమాజ సంస్థలు మరియు ఉద్యమ సంఘాలు.. పర్యావరణ చట్టాల ఉల్లంఘన, ఆర్థిక అసమర్థత, సారవంతమైన భూమిని భారీగా స్వాధీనం చేసుకోవడంపై తమ ఆవేదన వ్యక్తం చేశాయి. సారవంతమైన వ్యవసాయ భూములు తీసుకోవడం వల్ల జీవనోపాధిని కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసాయి. రాజధాని ప్రాంత రైతు సమాఖ్యకు చెందిన మల్లెల శేషగిరిరావు మాట్లాడుతూ.. "మా భూమి మరియు జీవనోపాధికి సంబంధించి అనిశ్చితితో మేము ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. ఈ పోరాటం మా జీవితంలో మరచిపోలేని ఒక ముద్ర వేసింది. ప్రపంచ బ్యాంక్ ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలగడంతో ఇప్పటికైనా రాష్ట్రం మరియు ఇతర ఫైనాన్షియర్లు అర్డంచేసుకొని.. ప్రజల ఆందోళనలను నిజాయితీ మరియు నిబద్ధతతో పరిష్కరిస్తాయని ఆశిస్తున్నాము." అన్నారు. ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (AIIB) యొక్క మరొక సహ-ఫైనాన్షియర్.. తమను తాము పారిస్-పోస్ట్ బ్యాంక్‌గా అంచనా వేస్తూ.. వాతావరణ అత్యవసర పరిస్థితులను పరిష్కరించడానికి నిబద్ధతను సూచిస్తూ, ఇప్పుడు దృష్టి సారించింది. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ వారి అధికారిక పత్రాలలో పరిశీలనలో ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్టులో కో-ఫైనాన్షియర్‌గా మాత్రమే ప్రవేశించి.. AIIB ఈ ప్రాజెక్టులో కట్టుబడి ఉండటానికి ప్రపంచ బ్యాంక్ విధానాలను ఉపయోగించింది. అయితే ఇప్పుడు ప్రపంచ బ్యాంకు వైదొలగడంతో సహ-ఫైనాన్షియర్‌గా, ఇప్పుడు AIIB యొక్క స్థితి అస్పష్టంగా ఉంది. WGonIFIs రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరవల్సినవి: 1. సిఆర్‌డిఎ ల్యాండ్ పూలింగ్ యాక్ట్‌.. 2013 కేంద్ర చట్టానికి విరుద్ధంగా ఉంది. అమరావతి క్యాపిటల్ రీజియన్‌లోని బాధిత ప్రజలందరి విషయంలో భూసేకరణ మరియు పునరావాస చట్టం, 2013 ను పూర్తిగా అమలు చేసి. అలాగే, ప్రజల నుండి అసంకల్పితంగా తీసుకున్న స్థలాలను ప్రభుత్వం తిరిగి ఇవ్వాలి.  2. వ్యవసాయం, కార్మికులు, అద్దెదారులు, భూమిలేని కుటుంబాలు, భూసేకరణ మరియు స్థానభ్రంశం ప్రక్రియ కారణంగా తీవ్రమైన ఒత్తిడి మరియు భయానికి గురైన దళితుల సామాజిక-ఆర్థిక నష్టం, భూ లావాదేవీలు అంశాలపై న్యాయ విచారణను ప్రారంభించాలి. 3. గత ఐదేళ్లలో వారి సామాజిక జీవితం చాలా వరకు దెబ్బతిన్నందున దళితులు మరియు భూ యజమానుల కోసం ప్రత్యేక పరిహార ప్యాకేజీని ప్రకటించాలి. 4. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మరియు క్యాపిటల్ రీజియన్ ప్రకటించిన తరువాత కేటాయించిన భూములను కొనుగోలు చేసిన ఇతర వ్యక్తులను ప్రాసిక్యూట్ చేయాలి. 5. డాక్యుమెంటరీ తారుమారు ద్వారా దళిత రైతులను రికార్డుల నుండి తొలగించే ప్రయత్నాలను ఆపివేసి, 2013 చట్టం ప్రకారం పరిహారం మరియు ఆర్‌అండ్‌ఆర్ ప్రయోజనాల కోసం స్వాధీనం చేసుకున్న భూమికి అసలు యజమానులుగా దళితులని పరిగణించాలి. ప్రాజెక్ట్ గురించి: జూన్ 2014 లో ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన తరువాత, కొత్తగా ఏర్పడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు హైదరాబాద్‌ను 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని నిర్ణయించుకున్నాయి. 2014 సెప్టెంబరులో, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అమరావతిని ప్రతిపాదిత రాజధాని నగరంగా ప్రకటించారు, దీనిని చాలా సంవత్సరాలు పాటు అభివృద్ధి చేయనున్నారు. 715 మిలియన్ డాలర్ల ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేయడానికి ప్రపంచ బ్యాంక్ మరియు AIIB పరిశీలనలో ఉన్నాయి. రిస్క్ అసెస్‌మెంట్‌లో కూడా, ప్రపంచ బ్యాంక్ సామాజిక మరియు పర్యావరణ ప్రభావాలను సూచిస్తూ ఈ ప్రాజెక్ట్ కి కేటగిరి A ని కేటాయించింది. కృష్ణ నది పరివాహక ప్రాంతాలలో నగరాన్ని నిర్మించడం, సారవంతమైన వ్యవసాయ భూములు మరియు అడవులను తొలగించడం, సుమారు 20 వేల కుటుంబాలను స్థానభ్రంశం చేయడం, బలవంతంగా భూములు స్వాధీనం చేసుకోవడం మరియు నగర నిర్మాణానికి కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించడం వంటి విషయాల్లో ఈ ప్రాజెక్టుపై విమర్శలు వచ్చాయి. ప్రపంచ బ్యాంకు యొక్క భద్రతా విధానాలను ఉల్లంఘించినందుకు ఈ ప్రాజెక్టుపై దర్యాప్తు చేయడానికి ప్రపంచ బ్యాంకు యొక్క తనిఖీ ప్యానెల్ కు 2017 లో బాధిత సంఘం ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ప్రక్రియలో ఉంది మరియు తనిఖీ బోర్డు నుండి దర్యాప్తు అర్హతపై సిఫారసు కోసం బ్యాంక్ బోర్డు వేచి ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్టుకు 300 మిలియన్ డాలర్ల రుణాల నుండి వైదొలగాలని నిర్ణయించింది. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణం నుంచి ప్రపంచబ్యాంకు తప్పుకోవడంపై.. అధికార వైసీపీపై టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. గతంలో అమరావతి నిర్మాణం మీద వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది. అప్పుడు ప్రపంచబ్యాంకు బృందం అమరావతిని సందర్శించి పూర్తిస్థాయిలో సంతృప్తి చెందడమే కాకుండా మరింతగా ఆర్థికంగా సహాయపడాలని నిర్ణయించింది. కానీ వైసీపీ నేతలు కొందరు రాజ‌ధాని విష‌యంలో కోర్టుల‌కు, గ్రీన్ ట్రిబ్యూన‌ల్ కి కూడా ఫిర్యాదులు చేశారు. వ‌ర‌ద‌ముప్పు, వివిధ పంట‌లు పండించే ప్రాంతం, సామాజిక‌, ప‌ర్యావ‌ర‌ణ కోణంలో జ‌రిగేన‌ష్టం వంటి అంశాల‌ను ముందుకు తీసుకొచ్చారు. అక్కడితో ఆగక ప్ర‌భుత్వం రాజ‌ధాని విష‌యంలో ప్ర‌జాభిప్రాయానికి భిన్నంగా వెళుతుందంటూ రాజ‌ధాని ప్రాంత రైతుల పేరిట కొంద‌రు 2017 మే 25 నాడు ప్ర‌పంచ‌బ్యాంక్ కి ఈమెయిల్స్ పంపి ఫిర్యాదు చేశారు. ఆ విషయాలను గుర్తుచేస్తూ టీడీపీ విమర్శిస్తోంది. ప్రతిపక్షం నుంచి అధికారంలోకీ వచ్చిన వైసీపీ ఇప్పుడు రాజధాని విషయంలో ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి.
  మహిళలు తలుచుకుంటే కుటుంబాన్నే కాదు, సమాజాన్ని కూడా చక్కదిద్దగలరని.. మహిళలు ఎందులోనూ తక్కువకాదని.. సహనంలోనైనా, సాహసించి పోరాడటంలోనైనా వారి తరువాతే ఎవరైనా అని ఎందరో మహిళలు రుజువు చేసారు. అలాంటి వారిలో 'దుర్గాబాయి దేశ్‌ముఖ్' ముందు వరుసలో ఉంటారు. ఈరోజు ఆమె జయంతి సందర్భంగా.. ఆమె సాహసాలను, ఆమె సేవలను గుర్తు చేసుకొని స్ఫూర్తి పొందుదాం. దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో.. 1909 జూలై 15 న మధ్య తరగతి కుటుంబంలో రామారావు, కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించారు. 8 ఏళ్ళ వయసులోనే ఆమెకు మేనమామ సుబ్బారావుతో వివాహమయింది. అయితే తరువాత ఆమె ఆ వివాహాన్ని వ్యతిరేకించారు. ఆమె నిర్ణయాన్ని తండ్రి, సోదరుడు కూడా అంగీకరించారు.  బాల్యం నుండి ప్రతిభాపాటవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించారు. దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్ర్య పోరాటంలో కూడా పాలుపంచుకున్నారు. ఓ వైపు చదువుకుంటేనే మరోవైపు స్వాతంత్ర్య పోరాటంలో తనవంతు పాత్ర పోషించారు. తన 12 ఏళ్ళ వయసులో ఆంగ్ల విద్యపై పోరాటం ప్రారంభించి.. రాజమండ్రిలో బాలికలకు హిందీలో విద్యను అందించడానికి బాలికా హిందీ పాఠశాలను నెలకొల్పారు. తెలుగుగడ్డ పై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఆమె విరాళాలను సేకరించి ఆయనకు అందచేశారు. తన చేతులకు ఉన్న బంగారు గాజులను సైతం విరాళంగా అందించారు. 1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా పనిచేస్తూ నెహ్రూ వద్ద టిక్కెట్ లేని కారణంగా ఆయనను అనుమతించలేదు. తన కర్తవ్య నిర్వహణకు గాను నెహ్రూ నుండి ఆమె ప్రశంసలు పొందారు. ఆ పై మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించారు. ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని అరెస్టు కూడా అయ్యారు. స్వాతంత్ర్య ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసి.. బెనారస్‌ విశ్వవిద్యాలయం నుండి మెట్రి క్యులేషన్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ (పొలిటికల్‌ సైన్స్‌), 1942లో ఎల్‌. ఎల్‌.బి పూర్తిచేసారు. న్యాయశాస్త్రం చదివిన తరువాత మద్రాసులో హైకోర్టు వద్ద సాధన ప్రారంభించారు. తరువాత ప్రఖ్యాత క్రిమినల్‌ లాయర్‌గా పేరు సంపాదించారు. స్వాతంత్ర్య పోరాటంలోనే కాదు సేవా కార్యక్రమాల్లోనూ ఆమె ముందుండేవారు. దుర్గాబాయి అనేక మహిళా సంస్థలు, సాంఘిక సంక్షేమ సంస్థలను ప్రారంభించి స్త్రీల అభ్యున్నతికి కృషిచేశారు. ఆమె ఆధ్వర్యంలో 1937లో చెన్నైలో ఆంధ్ర మహిళా సభ స్థాపించబడింది. 1937లో లిటిల్ లేడీస్ ఆఫ్ బ్రుందావన్ అనే బాల సంఘాన్ని ప్రారంభించారు. 1941లో ఆంధ్ర మహిళ పత్రికను స్థాపించి, సంపాదకత్వ బాధ్యతలను నిర్వర్తించారు. స్వాతంత్ర్యం తర్వాత.. భారత రాజ్యాంగ నిర్మాణ సభలో 1946 నుండి 1950 వరకు సభ్యురాలిగా పనిచేసిన పిమ్మట, 1952లో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా పనిచేసారు. ఆ సందర్భములో సి.డి.దేశ్‌ముఖ్తో కలిగిన పరిచయం పరిణయానికి దారి తీసింది. వీరి వివాహము 1953 జనవరి 22న జరిగింది. ఈవిడ 1953 ఆగస్టులో భారత ప్రభుత్వంచే నెలెకొల్పబడిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా, ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా పనిచేసారు. 1958లో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతిగృహ ఏర్పాటుకై పాటుపడటమేగాక రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు, వసతిగృహాలు, నర్సింగ్ హోమ్‌లు మరియు వృత్తి విద్యాకేంద్రాలు నెలకొల్పారు.  ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయికి 1971లో గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. ఆమె 1975 లో పద్మ విభూషణ్ పొందారు. దుర్గాబాయి..1981 మే 9వ తేదీన హైదరాబాదులో పరమపదించారు. అయితేనేం మరణంలేని ఓ వ్యవస్థగా ఆమె ఎప్పుడూ మనమధ్యనే చిరస్థాయిగా నిలిచి ఉంటారు. కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వారు 1998లో ఈవిడ పేరున డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ అవార్డును నెలకొల్పారు. ఈ వార్షిక అవార్డు మహిళాభ్యున్నతికి పాటుపడే స్వచ్ఛంద సంస్థకై ఉద్దేశించబడింది. ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ వారు 2006లో ఈవిడ పేరున దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్‌ను నెలకొల్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1987లో నెలకొల్పబడిన సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ 2006లో డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్‌గా నామాంతరం చెందింది.
ALSO ON TELUGUONE N E W S
'అర్జున్‌రెడ్డి'లో లిప్‌లాక్స్‌ ఉన్నాయి. సినిమా హిట్. 'గీత గోవిందం'లో లిప్ లాక్ ఉంది. అంటే... సినిమాలో చూపించలేదు గానీ, క్లైమాక్స్‌లో బ‌స్‌లో హీరోకి హీరోయిన్ లిప్‌లాక్ ఇస్తుంది. విడుదలకు ముందు బయటకొచ్చిన పైరసీ సీన్స్‌లో ఉంది. ఆ సినిమా కూడా హిట్. త్వరలో రిలీజవుతున్న 'డియర్ కామ్రేడ్'లో కూడా రష్మికతో విజయ్ దేవరకొండ లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ట్రైల‌ర్‌లో చూపించారు. 'లిప్‌లాక్స్ విజయ్ దేవరకొండకు సెంటిమెంటా? లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆయనకు ఇదే ప్రశ్న ఎదురైంది. ముద్దుల వల్ల సినిమాలు హిట్టవ్వవని విజయ్ దేవరకొండ స్పష్టం చేశాడు. మరో ఏడాదికి సినిమాల్లో ముద్దులు సాధారణం అవుతాయని అన్నాడు. డియర్ కామ్రేడ్ తరవాత క్రాంతిమాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా విడుదలవుతుందని, ఆ తర్వాత విజయ్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాని విజయ్ దేవరకొండ తెలిపాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాలనుందని, అయితే ప్రస్తుతం ఆయన చిరంజీవిగారితో చేస్తున్న సినిమా పూర్తయ్యేసరికి ఈక్వీషన్స్ ఎలా ఉంటాయో చెప్పలేమని అన్నారు.
కాన్సెప్ట్ పరంగా చాలా కొత్తగా ఉండి.. కొత్తతరం ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండడంతో కోట్లు కొల్లగొడుతున్న 'ఇస్మార్ట్ శంకర్' మెయిన్ కాన్సెప్ట్ తనదే అంటున్నారు అందాల కథానాయకుడు, 'ఆనందం' ఫేమ్ ఆకాష్. ఒక వ్యక్తి మెదడును హీరోకి మార్పిడి చేయడమనే మూల కథతో 'ఇస్మార్ట్ శంకర్' రూపొందింది. ఇదే ఇతివృత్తంతో  తెలుగు-తమిళ భాషల్లో తను తయారు చేసిన కథ, కథనాలతో తననే హీరోగా పెట్టి రాధ అనే మహిళా దర్శకురాలు ఒక సినిమా తీశారని,  ఆ సినిమా తమిళంలో ఇప్పటికే 'నాన్ యార్' పేరుతొ విడుదల కాగా, తెలుగులో  'కొత్తగా ఉన్నాడు' టైటిల్ తో త్వరలో  రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న తమకు 'ఇస్మార్ట్ శంకర్' రూపంలో షాక్ తగిలిందని ఆకాష్ పేర్కొన్నారు. ఈ విషయమై పూరి జగన్నాధ్ ను సంప్రదించాలని ప్రయత్నించామని.. కానీ ఆయన అందుబాటులోకి రాకపోవడం వలన.. తమిళ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేసి.. సత్వర పరిష్కారం కోసం ఇక్కడ మీడియాను ఆశ్రయించామని ఆకాష్ తెలిపారు. తన వాదనను వినిపించే ఆధారాలను ఆకాష్ మీడియా ముందు ఉంచారు. సమస్య సామరస్యంగా పరిష్కారం కానీ పక్షంలో లీగల్ గా ప్రొసీడ్ అయ్యేందుకు కూడా తానూ సిద్ధపడుతున్నట్లు ఆయన ప్రకటించారు!!
వెర్సాటైల్ యాక్ట‌ర్ క‌మ‌ల్ హాస‌న్ హీరో గా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `భార‌తీయుడు-2` చిత్రం రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. బ‌డ్జెట్ కార‌ణాల వ‌ల్ల కొంత కాలం గ్యాప్ తీసుకున్న ఈ సినిమా త్వ‌ల‌రో మ‌ళ్లీ ప్రారంభం కానుంద‌ని ఇటీవ‌ల కోలీవుడ్ వ‌ర్గాల నుండి స‌మాచారం అందిన విష‌యం కూడా తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ఇప్ప‌టికే కాజ‌ల్ హీరోయిన్ గా ఎంపికైంది. అలాగే మ‌రో ఇద్ద‌రు న‌టీమ‌ణుల‌ను కీల‌క‌మైన పాత్ర‌ల కోసం తీసుకున్నార‌ట‌. వారిలో బిల్ కుల్ భామ ర‌కుల్ ఒక‌రుగా తెలుస్తోంది. త్వ‌ర‌లో దీనిపై అధికారికంగా చిత్ర యూనిట్ ప్ర‌క‌టించే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌జంట్ క‌మ‌ల్ హాస‌న్ త‌మిళ్ బిగ్ బాస్ -3లో బిజీ గా ఉండ‌టం వ‌ల‌న షూటింగ్ కొంత ఆల‌స్యంగా జ‌రుగుతోంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్ పై సుభాష్ క‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ‌తంలో వ‌చ్చిన `భార‌తీయుడు` చిత్రానికి సీక్వెల్ గా రాబోతుంది.
మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం "డిస్కోరాజా`.  ఈ సినిమా షూటింగ్ నిర్విరామంగా హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణా ఏడెక‌రాల‌లో కోటి  20 ల‌క్ష‌ల రూపాయిల సెట్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమాకి ఈ సెట్ చాలా కీల‌క‌పాత్ర పోషిస్తుంది. ఈ షెడ్యూల్ లో ర‌వితేజ‌, వెన్నెల కిషోర్‌, శశిర్ ష‌ర‌మ్‌, టోనిహొప్ లపై సినిమాలో అతి కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఈ సెట్ ని డైర‌క్ట్ గా థియేట‌ర్ లో చూస్తే ప్రేక్ష‌కులు ఫీలింగ్ కొత్త గా వుంటుంద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అంటున్నారు.  ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నేల టిక్కెట్ తర్వాత ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ అధినేత రామ్ తాళ్ళూరి... రవితేజ తో నిర్మిస్తున్న రెండో చిత్రమిది. రామ్ తాళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనున్నారు. ఈ షెడ్యూల్ పూర్త‌య్యాక త‌దుప‌రి షెడ్యూల్ ని  ఆగ‌స్ట్  మెద‌టివారం  నుండి ఢిల్లి లో  చేయ‌నున్నారు.  ఈ షెడ్యూల్ లో న‌భా న‌టేష్ జాయిన్ కానుంది.  ద‌ర్శ‌కుడు వి ఐ ఆనంద్ చాలా గొప్ప విజ‌న్ తో  పూర్తి వినోదాత్మ‌క చిత్రంగా మ‌లుస్తున్నారు. త‌మ‌న్ సంగీతాన్ని స‌మకూరుస్తుండ‌గా అబ్బూరి రవి మాట‌లు రాస్తున్నారు.
 గ‌తంలో `జ‌న గ‌ణ మ‌న‌` అనే చిత్రాన్ని మ‌హేష్ బాబు హీరోగా పూరి చేయ‌బోతున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించాడు పూరి. అయితే ఆ త‌ర్వాత స్టోరి న‌చ్చ‌క‌నో, మ‌రే ఇత‌ర కార‌ణాల వ‌ల‌నో కానీ ఆ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌లేదు. ఇక ఆ త‌ర్వాత పూరి వేరే హీరోల‌తో సినిమాలు చేసినా కానీ అవి పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. దీంతో రామ్ హీరోగా `ఇస్మార్ట్ శంక‌ర్ ` చేశాడు. ఈ సినిమా క‌లెక్ష‌న్స్ ప‌రంగా బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమాతో పూరి స‌క్సెస్ ట్రాక్ లో ప‌డ్డాడు. అయితే పూరి త‌దుప‌రి సినిమా గురించి ప్ర‌జంట్ సోష‌ల్ మీడియాలో న్యూస్ ఒక‌టి వైర‌ల్ అవుతోంది. అదేమిటంటే...గ‌తంలో మ‌హేష్ తో చేయాల‌నుకున్న `జ‌న గ‌ణ మ‌న‌` సినిమాను సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట పూరి.  ఈ కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తే మాత్రం అది క్రేజీ ప్రాజెక్ట్ గా నిల‌వ‌డం ఖాయం అంటున్నారు చిత్ర ప‌రిశ్ర‌మ వారు. రెండు నెల‌లు విశ్రాంతి తీసుకుని ఆ త‌ర్వాత నెక్ట్స్ సినిమాను గురించి పూరి ప్ర‌క‌టించే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. చూద్దాం ఎలా ఉంటుందో  మ‌రి.
  ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా తెలుగు రాష్ట్రాలకు నేతలకు బీజేపీ గాలం వేస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ కోట అని ఫీలవుతున్న తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలవడంతో బీజేపీ జోష్‌లో ఉంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో ఎలాగైనా బలపడాలని అధికారంలోకి రావాలని కాషాయ దళం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో మాజీ ఎంపీ ఎంపీ గడ్డం వివేక్‌ను పార్టీలోకి ఆహ్వానించింది.  గత లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన ఆయన కూడా బీజేపీలో చేరడానికి పచ్చ జెండా ఊపారట. ఈరోజు బీజేపీ చీఫ్ అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. వివేక్‌తోపాటు ఆయన సోదరుడు, మాజీ మంత్రి వినోద్ కూడా బీజేపీలో చేరతారని సమాచారం. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసిన వివేక్ అనూహ్యంగా బాల్క సుమన్ చేతిలో ఓడారు.  అనంతర పరిణామాల్లో గులాబీ తీర్ధం పుచ్చుకున్న ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు కేసీఆర్. అయితే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సుమన్‌ చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పెద్దపల్లి టికెట్‌ తనదేనని వివేక్ భావించారు. కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి బాల్క సుమన్ పై కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకటేశ్ నేత పోటీ చేసి ఆ తర్వాత టీఅయేఎస్ లో చేరిన వెంకటేష్ కి టికట్ ఇచ్చారు.  ఆయన అలా ఇవ్వడానికి కారణం సామాజిక వర్గమే అయినా అప్పటి నుండి వివేక్ ఆ పార్టీకి దూరం అయ్యారు.  అలా కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న వివేక్, వినోద్ సోదరులు టీఆర్ఎస్‌ కి కాంగ్రెస్ కంటే కూడా బీజేపీయే సరైన ప్రత్యామ్నయం అని భావించారని అందుకే ఆహ్వానం రాగానే వీరు కాషయ కండువా కప్పుకునేందుకు సిద్దమయినట్టు చేబుతున్నరు. వివేక్ బీజేపీలో చేరితే వినోద్ కంటే భాజ‌పాకే ఎక్కువ లాభం ఉంది.  ఎందుకంటే తెలంగాణ‌లో భాజ‌పాకి సొంత మీడియా అంటూ ఇంత‌వ‌ర‌కూ ఏదీ లేదు. అధికార పార్టీకి కొన్ని మీడియా సంస్థ‌లు తమ సహాకారం అందిస్తుండగా, టీవీ 9 మాజీ సీఈవో పెట్టె కొత్త ఛానల్ బీజేపీకి సపోర్ట్ గా ఉంటుందని అనుకున్నారు. దానితో పాటు ఇప్పుడు వినోద్ రాక‌తో ఒక న్యూస్ ఛానెల్‌, ఒక ప‌త్రిక భాజ‌పాకి అండ‌గా నిలిస్తుందని చెప్పచ్చు. అండగా నిలుస్తుంది అనడం కంటే కూడా బీజేపీ చేతికి తెలంగాణాలో పాపులర్ ఛానెల్ అయిన వీ6 ఛానెల్‌తోపాటు వెలుగు పత్రిక దొరికినట్టే. ఎందుకంటే వీటిని రన్ చేసేది వివేక్ కుటుంబీకులే. ఒకప్పుడు టీఆర్ఎస్ కి మద్దతుగా వార్తలు ప్రచురించిన ఈ రెండూ ఆ తర్వత న్యూట్రల్ గా ఉంటూ వచ్చింది. తాజాగా పరిణామాలతో ఆ రెండూ ఇప్పుడు బీజేపీకి బాకా ఊదనున్నాయన్నమాట !     
  ఓ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర గవర్నర్ తో సత్సంబంధాలు కలిగి ఉండటం చూస్తుంటాం. అయితే గత ఐదేళ్ళలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా ఉన్న నరసింహన్ తో బాబు సత్సంబంధాలు కొనసాగించలేదనేది వాస్తవం. నిజానికి నరసింహన్ కాంగ్రెస్ హయాంలో గవర్నర్ గా నియమించబడ్డారు. అయితే 2014 లో బీజేపీ అధికారంలోకి వచ్చినా.. కాంగ్రెస్ నియమించిన ఎందరో గవర్నర్లు మారిపోయారు కానీ.. నరసింహన్ మాత్రం అలాగే కొనసాగారు. అది కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా కొనసాగారు. అప్పుడు బాబు బీజేపీతో దోస్తీ చేస్తున్నారు. నరసింహన్ తమకి అంత అనుకూలంగా లేరని కూడా తెలుసు. అయినా బాబు ఎందుకనో ఏపీకి కొత్త గవర్నర్ ని నియమించండని బీజేపీ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయలేదు. అదే బాబు చేసిన తప్పని కొందరి అభిప్రాయం. తరువాత బాబు బీజేపీకి దూరమయ్యారు. నరసింహన్ మాత్రం బీజేపీకి దగ్గరై గవర్నర్ గా కొనసాగుతూ వచ్చారు. బాబు, గవర్నర్ ల మధ్య దూరం కూడా.. టీడీపీని అధికారానికి దూరం చేసి, ప్రతిపక్షానికి పరిమితం చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో గవర్నర్ తో సన్నిహితంగా ఉండేవారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, బాబుకి దూరమవ్వడంలో గవర్నర్ పాత్ర ఉందని కూడా ప్రచారం జరిగింది. ఓ రకంగా గవర్నర్ బాబుని ఒంటరిని చేసారని కూడా అంటుంటారు. ఈ అంశంపై పూర్తీ విశ్లేషణ కోసం ఈ వీడియో చూడండి.
  అసెంబ్లీలో నియమించనున్న కమిటీలను ఈరోజు ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించాల్సి ఉంది. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీకి సభ్యులను జగన్ నియమించినా ఛైర్మన్‌ ను మాత్రం ప్రతిపక్షం నుండి నియమించాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో  పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) ఛైర్మన్ పదవిపై టీడీపీలో పోటీ మొదలయ్యింది. ఈ పదవి ఎవరికి కట్టబెట్టాలనే అంశంపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని సమాచారం.  ప్రతిపక్షానికి దక్కే వాటిలో ఇది కీలక పదవి కావడంతో టీడీపీ అధినేత అన్ని రకాలుగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నారని అంటున్నారు. పీఏసీ ఛైర్మన్ అంటే మంత్రి పదవికి దాదాపు సమానం ఏపీలో ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ ఉంటుంది. ప్రాజెక్టుల్లో అవినీతి, భూకేటాయింపులు, ఉద్యోగ నియామకాలు ఇలా అన్ని అంశాల్లో ప్రశ్నించే హక్కు ఉంటుంది. అందుకే కేబినెట్ హోదా ఉండే ఈ పదవి కోసం టీడీపీలో పోటీ ఉందని అంటున్నారు.  ఇంతటి కీలకమైన పదవి కావడంతో టీడీపీ సీనియర్ నేతలు సైతం ఈ పదవి కోసం పోటీపడుతున్నారు. పీఏసీ ఛైర్మన్ పదవి రేసులో నలుగురైదుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయట. మాజీమంత్రి అచ్చెన్నాయుడు,  సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, సీనియర్ ఎమ్మెల్యే కరణం బలరామ్, సీనియర్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.  అయితే అధినేత చంద్రబాబు ఎటువైపు మొగ్గు చూపుతారో అన్నది ఆసక్తిగా మారింది. తొలుత తెలుగుఎసం అధిఅకారంలోకి రాగానే వైసీపీ ప్రతిపక్షంలో ఉండి ఈ పదవిని, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రరెడ్డికి ఇచ్చింది, ఆయన పార్టీ ఫిరాయించి తెలుగుదేశంలో చేరాక ప్రస్తుత ఆర్ధిక మంత్రి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పీఏసీ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన ఈ పదవిని అడ్డం పెట్టుకుని టీడీపీ ప్రభుత్వాన్ని చాలా సార్లు కానర్ చేయడానికి చూసారు. అందుకే ఈసారి కూడా కాస్త పదునైన నేతకి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు,
  ఏపీ రాజధాని అమరావతికి  ప్రపంచ బ్యాంకు రుణం నిలిపివేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఏపీ రాజధాని నిర్మాణానికి 300 మిలియన్ డాలర్ల రుణ ప్రతిపాదన విరమించుకున్నట్టు వరల్డ్ బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది. అయితే అలా ఎందుకు ఆపామో ప్రకటించక ముందే ఈ విషయం మీద రాజకీయంగా దుమారం రేగి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రపంచ బ్యాంకు రుణం విషయంలో వెనక్కు తగ్గిందని టీడీపీ ఆరోపించింది.  మరోపక్క గత ప్రభుత్వ తీరువలన విసిగిపోయి నందువలనే ప్రపంచ  బ్యాంకు ఋణం ఇవ్వడం లేదని వైసీపీ కౌంటరిచ్చింది. అయితే ఎన్ని రాజకీయ ఆరోపణలు చేసుకున్నా ప్రపంచ బ్యాంక్ సహకారం లేకుండా అమరావతి నిర్మించడం దాదాపు అసాధ్యం, అందుకే ఈ విషయం మీద ఏపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులని వివరణ కోరింది. దీనిపై స్పందించిన ప్రపంచ బ్యాంకు కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో అంతగా ఆసక్తి చూపలేదని, కేంద్ర ప్రభుత్వం సూచనతోనే అమరావతికి ఆర్థికసాయాన్ని ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది.  అమరావతి సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన రుణ ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకుందని అందుకే తాము తప్పుకున్నామని తెలిపింది. అయితే రుణ సాయం చేయలేకపోయినప్పటికీ ఏపీలో ఆరోగ్యం, వ్యవసాయం, విద్యుత్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగాల్లో ఒక బిలియన్ డాలర్ల రుణ సాయం యధావిధిగా కొనసాగుతోందని పేర్కొంది. వినూత్నమైన ఆలోచనలతో అభివృద్ధికి శ్రీకారం చుట్టారని స్వయం సహాయక బృందాలు వంటి సరికొత్త ఆలోచనతో దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఏపీ కితాబిచ్చిన్న వరల్డ్ బ్యాంక్ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరితే తప్పకుండా సాయం చేస్తామని స్పష్టత ఇచ్చింది.   అయితే కేంద్రం వ్యవహరిచిన తీరు మీద విమర్శలు వస్తున్నాయి. ఏపీతో తమకు అవసరం లేదు కాబట్టే  సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన రుణ ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కానీ బీజేపీవాదుల వాదన మరోలా ఉంది, అదేంటంటే ప్రపంచ బ్యాంక్ ఇన్స్పెక్షన్ చేసి నిధులు ఇస్తామని అన్నదని అలంటి సంప్రదాయాన్ని అలవాటు చేస్తే అన్ని చోట్ల అలాగే ఇన్స్పెక్షన్ లు చేస్తారని అందుకే వద్ద్దని కేంద్రం పేర్కొందని అంటున్నారు. అయితే ఎటువంటి అవినీతికి పాల్పడకుండా ప్రపంచ బ్యాంకు ఋణం ద్వారా కట్టే ప్రాజెక్ట్ లు కడుతున్నట్టు అయితే, ఈ బ్యాంక్ ఇన్స్పెక్షన్ లకి భయపడాల్సింది ఏముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీని మీద కేంద్రం సమాధానం ఏమని చెబుతుందో ? వేచి చూడాలి. 
  కర్నూలు జిల్లాలో కీలక నియోజకవర్గం గా పేరొందిన ఆళ్లగడ్డలో రాజకీయాలు పలు కీలక మలుపులు తిరుగుతున్నట్టు చెబుతున్నారు. తల్లి మరణంతో వైసీపీ నుంచి ఏకగ్రీవంగా విజయం సాధించి ఆ తర్వాత పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరి తండ్రి మరణంతో మంత్రి పదవి దక్కించుకున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఈ స్థానం నుండి ఓడిపోయారు. గంగుల ప్రభాకర్ రెడ్డి కుమారుడు గంగుల బిజేంద్ర రెడ్డి చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు.  ఆమె మాత్రమే కాక ఆమె సోదరుడు కూడా నంద్యాల నుండి పోటీ చేసి ఓడిపోవటంతో వారింట ముసలం పుట్టినట్టు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఎన్నికల ముందే ఆమె మేనమామ ఎస్వీ మోహన్ రెడ్డి పార్టీ వీడి వైసీపీలో చేరిపోయారు. అలాగే సొంత బాబాయ్ గా భావించే సుబ్బారెడ్డి కూడా తనకు ప్రాధాన్యత తగ్గించిన క్రమంలో వారి కుటుంబానికి దూరం అయ్యారు. భూమా అఖిలప్రియ భార్గవ్ అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్నాక భూమా కుటుంబంలో చీలిక వచ్చినట్టు సమాచారం.  అఖిలప్రియ భర్త అన్నీ తానై వ్యవహరించడం కూడా భూమా వర్గీయులను దూరంగా జరగడానికి కారణమైందని అంటున్నారు. మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు కూతురిని వివాహం చేసుకున్న భార్గవ్ ఆ తర్వాత అఖిల ప్రియతో ప్రేమలో పడి ఆమెకి విడాకులు ఇచ్చి మరీ అఖిల ప్రియను పెళ్లి చేసుకున్నారనే ప్రచారం ఉంది. ఆ విషయం పక్కన పెట్టినా ఆమెను వివాహం చేసుకున్న నాటి నుండే మంత్రి భర్తగా ఆయన తన మార్క్ చూపించే ప్రయత్నం చేశారు.  అధికారిక పర్యటనలు మొదలు పార్టీ పర్యటనల దాకా అఖిల్ వెన్నంటే ఉండేవారు. ఇదే భూమా వర్గీయులకి కోపం తెప్పించిందట. భూమా తర్వాత భూమ వారసుడిగా జగత్ విఖ్యాత్ రెడ్డిని తెరమీదకు తేవాలని భూమా వర్గం భావిస్తోంది, కానీ అఖిలప్రియ భర్త హోదాలో భార్గవ్ తానే భూమా వారసుడిననేలా ప్రవర్తిస్తుండడంతో అఖిలప్రియకు బదులుగా భూమా వర్గాన్ని లీడ్ చేసేందుకు విఖ్యాత్ రెడ్డిని, అలాగే వీరికి సోదరుడు వరసయ్యే కిషోర్ రెడ్డిని తెరపైకి వచ్చారు.  ఇప్పటికే వైసీపీలో గంగుల వర్గం ఉంది కాబట్టి, కిషోర్ రెడ్డి బీజేపీలో చేరి భూమా లీగసీని నిలబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీంతో అఖిలప్రియకు ఇప్పుడు ఆమె సోదరుడు కిషోర్ కుమారే పోటీ అని భూమా వర్గం భావిస్తుందట. విఖ్యత్ రెడ్డి ప్రస్తుతం చదువుకుంటున్నాడు, ఆయన లైన్ లోకి వచ్చే దాకా కిషోర్ రెడ్డిని నిలబెట్టాలని చూస్తున్నారని అంటున్నారు.    
  ఐటీ శాఖలో రూ. 25 వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ గత ఏడాది సెప్టెంబర్ లో అప్పుడు ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు మీదా ఐటీ శాఖామంత్రిగా ఉన్న ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్‌ మీద హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అవినీతిపై సీబీఐ, ఈడీ విచారణ కోరుతూ మాజీ న్యాయమూర్తి శ్రావణ్‌ కుమార్‌ అప్పట్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. గత టర్మ్ లో ఏపీఎన్‌ఆర్టీ చైర్మన్‌ గా ఉన్న వేమూరి రవికుమార్‌, మాజీ ఐటీ శాఖమంత్రి పల్లె రఘునాధరెడ్డిలకి కూడా ఈ అవినీతి కుంభకోణంలో హస్తం ఉందని ఆయన ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.  దొంగ ఎంవోయూలతో వేల ఎకరాల భూమిని ధారదత్తం చేశారని, దీని ద్వారా లబ్ది పొంది భారీ ఎత్తున ఆస్తులను పెంచుకున్నారని అప్పట్లో పిటిషనర్ పేర్కొన్నారు. కనీస అర్హత కూడా లేని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని నాలుగేళ్లుగా కార్యకలపాలు చేపట్టలేదని పిటిషన్‌లో వెల్లడించారు. ఐటీ కంపెనీల పేరుతో జరిగిన క్విడ్‌ ప్రోకోపై సీబీఐ, ఈడీ విచారణ జరపాలని ఆయన హైకోర్టును కోరారు. అయితే ఈ విషయం మీద పూర్తి వివరాలతో అంటే ఆరోపణలు చేస్తున్న కంపెనీల పూర్తి వివరాలతో మళ్ళీ రమ్మని కోర్టు పేర్కొనడంతో అసలు ఆర్టీఏ ద్వారా సమాచారం కోరినా తనకు ఆ వివరాలు ఇవ్వడం లేదని పిటిషనర్‌ హైకోర్టుకు విన్నవించుకుని కేసు ఉపసంహరించుకున్నారు.  ఈ విషయం మామూలు వార్తలాగా వచ్చి వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు పరిస్థితి అంతామారిపోయి జగన్ సీఎం కావడంతో లోకేష్ అవినీతిని జగన్ సర్కార్ టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఈ మధ్యనే పార్టీ మారి కాషాయం కండువా కప్పుకున్న ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ హైలైట్ చేశారు. లోకేష్‌ మంత్రిగా వ్యవహరించిన ఐటీశాఖలో భారీగా ఎత్తున అవినీతి జరిగిందనే విషయం మీద విచారణ చేపట్టమని కోరేందుకు రెండు మూడు రోజులలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుస్తానని ఆయన చెప్పారు.  కేంద్రంతో కూడా మాట్లాడి సీబీఐ విచారణ జరమని ఫిర్యాదు చేస్తానని ఆయన అన్నారు. లోకేష్‌ తో కలిసి పనిచేయడం ఇష్టం లేకనే టీడీపీకి రాజీనామా చేశానని చెప్పిన ఆయన లోకేష్‌ కారణంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలయిందని అన్నారు. ఇక త్వరలో పార్టీ ఖాళీ కాబోతుందని అది కూడా లోకేష్ కారణంగానే జోస్యం చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే గత ప్రభుత్వ అవినీతి కోసం భూతద్దం వేసుకుని మరీ వెతుకున్న జగన్ కి ఊతం ఇచ్చినట్టు అవుతుంది.  వెదకబోయే తీగ కాలికి తగిలినట్టు జగన్ కి లోకేష్ అవినీతి కేసు దొరికిందని అంటున్నారు విశ్లేషకులు. నిజంగా అవినీతి జరిగిందా ? లేదా అనేది పక్కన పెడితే ఈ విషయం మళ్ళీ హైలైట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ యంత్రాంగం, బీజేపీ కలిస్తే లోకేష్ ని అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తమకి ఎదురుతిరిగిన వారికి షా-మోడీలు ఎంత వరకూ చుక్కలు చూపిస్తారో లాలూ వంటి వారి విషయంలో చూశాం కదా.  
  అనగనగా ఓ కుర్రవాడు. అతనికి ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా సంపాదించాలని తెగ కోరికగా ఉండేది. తన దాహాన్ని తీర్చేందుకు తగిన గురువు ఎక్కడ దొరుకుతారా అని, ఎదురుచూస్తూ ఉండేవాడు. ఇక ఎలాగైనా సరే... ఓ గొప్ప గురువు దగ్గరకి వెళ్లి అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించాలని బయల్దేరాడు. కుర్రవాడు అలా బయల్దేరాడో లేదో... అతని ఊరి చివరే ఒక పెద్దాయన కనిపించాడు. వెంటనే ఆయన దగ్గరకి వెళ్లి ‘నేను ఓ గొప్ప గురువు దగ్గర శిష్యరికం చేయాలనుకుంటున్నాను. మీ దృష్టిలో అలాంటి గురువు ఎవరన్నా ఉంటే చెప్పగలరా!’ అని అడిగాడు. ‘ఓ దానిదేం భాగ్యం! నాకు తెలిసిన కొందరి పేర్లు చెబుతాను. వారి శిష్యరికంలో నీకు తృప్తి లభిస్తుందేమో చూద్దాం,’ అంటూ కొన్ని పేర్లు చెప్పాడు. పెద్దాయన చెప్పిన మాటలను అనుసరించి కుర్రవాడు ఆయా గురువులను వెతుక్కుంటూ బయల్దేరాడు. కానీ అదేం విచిత్రమో! ఎవ్వరి దగ్గరా తనకి తృప్తి లభించలేదు. అతని జ్ఞాన తృష్ణ చల్లారలేదు. అలా ఒకరి తర్వాత ఒకరిని వెతుక్కుంటూ, గాలిపటంలా దేశమంతా తిరుగుతూ తన యాత్రలను సాగించాడు. ఎక్కడా అతనికి తగిన బోధ లభించలేదు. అలా ఒకటి కాదు రెండు కాదు పదేళ్లు గడిచిపోయాయి. అతనిప్పుడు కుర్రవాడు కాదు, యువకుడు! చివరికి నిరాశగా కాళ్లీడ్చుకుంటూ తన ఊరివైపు బయల్దేరాడు. యువకుడు ఊళ్లోకి అడుగుపెడుతుండానే అతనికి ఒకప్పుడు తారసపడిన పెద్దాయన కనిపించాడు. కానీ ఎందుకనో ఆ పెద్దాయన మొహం చూడగానే ఆయన గొప్ప జ్ఞానిలా తోచాడు. ఆయన దగ్గరకి వెళ్లి మాట్లాడుతున్నకొద్దీ... తను ఇన్నాళ్లుగా వెతుకుతున్న గురువు ఆయనే అనిపించింది. ‘నేను పదేళ్ల క్రితం గురువుని వెతుక్కుంటూ మీ దగ్గరకి వచ్చినప్పుడే... మీరు నన్ను శిష్యుడిగా ఎందుకు స్వీకరించలేదు! నా జీవితంలో పదేళ్లు వెతుకులాటలో వృధా కాకుండా ఉండేవి కదా!’ అంటూ నిష్టూరమాడాడు యువకుడు. యువకుని మాటలకు పెద్దాయన చిరునవ్వులు చిందిస్తూ.... ‘నువ్వు పదేళ్ల క్రితం చూసినప్పటికీ, ఇప్పటికీ నేను పెద్దగా మారలేదు. మారింది నువ్వే! ప్రపంచమంతా తిరుగుతూ తిరుగుతూ నువ్వు అన్ని రకాల వ్యక్తులనూ చూశావు. ఏ మనిషి ఎలాంటివారు అని బేరీజు వేయగలిగే విలువైన నైపుణ్యాన్ని సాధించగలిగావు. ఆ నైపుణ్యంతోనే ఇప్పుడు నన్ను గుర్తించగలిగావు. అందుకే ఈ పదేళ్లు వృధా కానేకాదు. ఏ విషయం మీదైనా ఆసక్తి ఉంటే సరిపోదు. దాన్ని నెరవేర్చుకోగలిగే నైపుణ్యం కూడా సాధించాలి. అప్పుడే నీ లక్ష్యాన్ని సాధించగలిగే అర్హత ఏర్పడుతుంది,’ అంటూ యువకుడిని తన శిష్యునిగా స్వీకరించాడు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.
  ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ నానారకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను వేరొకరికి చెప్పుకుంటే చాలు, సగం తీరిపోతాయని వారి నమ్మకం. ఆఖరికి వైద్యుడి దగ్గరకు వెళ్లిన రోగి కూడా, తన మనసులో ఉన్న బాధని వైద్యునితో చెప్పుకునే అవకాశం వస్తే... సగం రోగం నుంచి ఉపశమనం పొందినంతగా తృప్తి చెందుతాడు. కానీ ఇతరుల బాధని పట్టించుకునే నాథుడు ఎవడు! అంత తీరికా, ఓపికా ఈ ప్రపంచంలో ఎవరికి ఉన్నాయి. అందుకనే అందరూ మాట్లాడటానికి ఇచ్చిన ప్రాముఖ్యతని, వినడానికి ఇవ్వడం లేదు. ఇతరుల మనసుని గెలవాలన్నా, సామాజిక సంబంధాలను మెరుగుపరుచుకోవాలన్నా... వినడం అనే కళలో ఆరితేరాలంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. అందుకోసం వారు కొన్ని చిట్కాలను కూడా అందిస్తున్నారు. అవేమిటంటే...     తగిన వాతావరణాన్ని కల్పించండి చాలామంది ఇళ్లలోకి వెళ్లినప్పుడు... వాళ్లు ఒకపక్క మనతో మాట్లాడుతూనే ఉంటారు, మరో పక్క టీవీనో దినపత్రికో చూస్తూనే ఉంటారు. ఇలాంటి సందర్భాలు చాలా చికాకుని కలిగిస్తాయి. ఒక వ్యక్తి చెప్పే మాటలని వినాలీ అంటే దానికి తగిన వాతావరణాన్ని సృష్టించాలి. రణగొణధ్వనుల మధ్యా, టీవీ శబ్దాల మధ్యా, నలుగురూ మెసిలే చోటా సంభాషణ సీదాసాదాగా సాగిపోతుందే కానీ మనసులో ఉన్న మాటలు నిస్సంకోచంగా వెల్లడి కావు.     శరీర భాష వినడం అంటే శూన్యంలో చూస్తూ ఉండిపోవడం కాదు. మాట్లాడే వ్యక్తికి మీరు ఆసక్తిగా వింటున్నారన్న భావన కలగాలి. అతని కళ్లలోకి సూటిగా చూస్తూ ఉండటం. మధ్యమధ్యలో తలని ఆడిస్తూ ఉంటడం, మెడని కాస్త ముందుకి వంచడం... వంటి సంకేతాల ద్వారా మీరు అవతలి వ్యక్తిని ఆలకిస్తున్నారన్న భావనని కల్పించగలగాలి.     ప్రోత్సహించండి మీ వైపు నుంచి ఎలాంటి స్పందనా లేకపోతే అవతలివారు మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడరు. కాబట్టి మధ్యమధ్యలో వారి నుంచి మరింత సమాచారాన్నీ, మరింత స్పష్టతనీ రాబట్టేందుకు ప్రయత్నించండి. అవునా, అలాగా, నిజమే వంటి పదాలను వాడటం ద్వారా ‘నీ ఉద్దేశం ఏమిటి?’, ‘నువ్వేం చేద్దామని అనుకుంటున్నావు?’ వంటి ప్రశ్నల ద్వారా అవతలి వ్యక్తి తన మనసులో ఉన్న భావాలను పూర్తిగా వెల్లడించేందుకు అవకాశాన్ని ఇవ్వండి.   అడ్డుకోవద్దు ఇతరులు చెబుతున్న విషయం మీద మనకు విరుద్ధమైన అభిప్రాయాలు ఉండవచ్చు. అవతలి మనిషి చెప్పే విషయం మీద మనకే ఎక్కువ అవగాహన, తెలివి ఉన్నాయి అనిపించడమూ సహజమే! కానీ ఎదుటివారికి తన మనసులోని మాటని పూర్తిగా చెప్పే అవకాశాన్ని కల్పించాలి. అలా కాకుండా చీటికీమాటికీ అడ్డుకోవడం వల్ల మీకు అతని అభిప్రాయాల పట్ల ఏమాత్రం గౌరవం లేదన్న విషయం తేలిపోతుంది. ‘వినడం’ అన్న స్థానంలో ‘వాదన’ చోటుచేసుకుంటుంది.   కేవలం వినండి ఎదుటి వ్యక్తి మాటలను వింటూనే, మనం వాటి గురించి అప్పటికప్పుడు ఏదో ఒక అభిప్రాయానికి వచ్చేస్తూ ఉంటాము. అంటే వినడమూ, విశ్లేషణా ఏకకాలంలో జరిగిపోతూ ఉంటాయి. కొంతసేపటి తరువాత మనం ఏర్పరుచుకున్న అభిప్రాయానికి అనుగుణంగానే అతని పట్ల మన దృక్పథమూ మారిపోతుంది. ఇది నిజంగా తొందరపాటే అవుతుంది. అందుకే ముందు కాస్త స్థిమితంగా అవతలి వ్యక్తి చెప్పే మాటలన్నీ వినాలి, ఆ తరువాత వాటిని విశ్లేషించుకుకోవాలి, చివరికి ఒకటికి రెండుసార్లు ఆలోచించి అతను చెప్పిన విషయం మీద ఒక అవగాహనకు రావాలి.   అన్నింటికీ మించి ఎదుటి వ్యక్తికి కూడా మనలాగే భిన్నమైన వ్యక్తిత్వం, విభిన్నమైన అభిప్రాయాలు ఉండే అర్హత ఉందని భావించిననాడు... ఒక సాటి మనిషిగా అతని విలువని గుర్తించినప్పుడు, అతని మాటలను కూడా శ్రద్ధగా ఆలకించాలని అనిపిస్తుంది. మన ఆలోచనే గొప్ప, మన వ్యక్తిత్వమే ఉన్నతం అనుకునే అహంకారంలో ఎవ్వరి మాటలూ వినిపించవు. వినిపించినా మనసులోకి చేరవు.   - నిర్జర.
ఒక ఊరిలో జనమంతా కలిసి తమకి ఇష్టమైన దేవుని శిల్పాన్ని ప్రతిష్టించాలనుకున్నారు. అందుకోసం చుట్టుపక్కల అంతా వాకబు చేసి ఒక శిల్పిని రప్పించారు. శిల్పి వచ్చీరాగానే తన పనిని ప్రారంభించాడు. శిల్పం కోసం సరైన శిలను ఎన్నకున్నాడు. ఊరి ప్రజల అభీష్టాన్నీ అనుసరించి వారి ఇష్టదైవాన్ని ఆ శిల్పంలో తొలవడం మొదలుపెట్టాడు. రోజులు గడిచాయి. రోజులు వారాలుగా మారాయి. వారాలు కాస్తా రెండు నెలలయ్యాయి. శిల్పి చెక్కుతున్న శిల్పం తుదిరూపుకి చేరుకుంది. కానీ మనసులో ఏం తోచిందో ఏమో కానీ, ఒక రోజున ఆ శిల్పాన్ని కాస్తా పక్కనపెట్టేశాడు శిల్పి. విగ్రహాన్ని చెక్కే పనిని మళ్లీ మొదటినుంచి మొదలుపెట్టాడు. ఒక రోజు శిల్పిని వెతుక్కుంటూ అతని స్నేహితుడు వచ్చాడు. దీక్షగా విగ్రహాన్ని చెక్కుతూ కూర్చున్న శిల్పిని చూశాడు. ఆ పక్కనే పడేసి ఉన్న విగ్రహమూ అతనికి కనిపించింది. ‘‘ఆ విగ్రహం ఇంచుమించుగా పూర్తయిపోయింది కదా! మళ్లీ రెండో విగ్రహాన్ని చెక్కుతున్నావేంటి’’ అంటూ వాకబు చేశాడు స్నేహితుడు. ‘‘ఆ విగ్రహం సరిగా రాలేదు’’ అంటూ బదులిచ్చి తన పనిలో నిమగ్నం అయిపోయాడు శిల్పి. ఆ మాటలకు స్నేహితుడు శిల్పం దగ్గరకి వెళ్లి పరీక్షగా చూశాడు. ఎంతగా చూసినా అతనికి ఎలాంటి లోపమూ కనిపించలేదు. ‘‘అదేంటి శిల్పం అద్భుతంగా వచ్చింది కదా! నేను చూసిన గొప్ప శిల్పాలలో ఇది ఒకటని ఖచ్చితంగా చెప్పగలను,’’ అన్నాడు స్నేహితుడు. శిల్పి చిరునవ్వుతో ‘‘ఒక్కసారి ఆ శిల్పం కళ్లని పరీక్షగా చూడు. అవి సరిగ్గా కుదరలేదు,’’ అని చెప్పాడు. స్నేహితుడు మరోసారి ఆ శిల్పాన్ని పరీక్షగా చూస్తే ఆ మాట నిజమేననిపించింది. కానీ అంత చక్కటి శిల్పాన్ని పక్కన పెట్టడాన్ని అతని మనసు ఇంకా ఒప్పుకోలేదు. ‘‘ఆ శిల్పాన్ని ఎక్కడ ఉంచుతున్నారు!’’ అని అడిగాడు స్నేహితుడు. ‘‘ఈ ఊరి దేవాలయంలో, పది అడుగుల ఎత్తైన పీఠం మీద,’’ బదులిచ్చాడు శిల్పి. ‘‘నీకేమన్నా మతి పోయిందా! పది అడుగుల ఎత్తైన పీఠం మీద, మరో పది అడుగుల ఎత్తున్న ఈ విగ్రహంలోని కళ్లలో చిన్నపాటి లోపం ఎవరికి కనిపిస్తుంది. పైగా కాస్త రంగు పూశావంటే ఆ ఉన్న కాస్త లోపమూ ఎవ్వరికీ తెలియనే తెలియదు. దాని కోసం రెండు నెలలుగా పడ్డ కష్టాన్ని వృధా చేసుకుంటావా! ఈ పల్లెటూరి బైతుల కోసం ఇంత కష్టం అవసరమా!’’ అంటూ దులిపేశాడు స్నేహితుడు. శిల్పి చిరునవ్వుతో- ‘‘ఈ విగ్రహంలో లోపం ఎవ్వరికీ, ఎప్పటికీ తెలియకపోవచ్చు. కానీ నాకు తెలుసు కదా! ఒక లోపంతో ఉన్న శిల్పాన్ని చెక్కానన్న విషయం నా మనసులో నిలిచిపోతుంది. అది జీవితాంతం నా వృత్తి మీద ఒక మచ్చగానే మిగిలిపోతుంది. ఇక కష్టాన్ని వృధా చేసుకోవడం అంటావా... అది నా దృష్టిలో పనితీరుని మరింతగా మెరుగుపరుచుకోవడమే! మనం చేసే పనికి ఎంత ధర వస్తోంది? ఎవరి కోసం పనిచేస్తున్నాం? అన్న విషయం ఎప్పుడూ ముఖ్యం కాదు. మనసుకి తృప్తి కలిగించేలా పనిని పూర్తిచేశామా లేదా అన్నదే ముఖ్యం. ఆ తృప్తి కోసం పడే తపన మన పనిని మరింతగా మెరుగుపరుస్తుంది. అదే చివరివరకూ నిలుస్తుంది,’’ అంటూ చెప్పుకొచ్చాడు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.
  తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ షాకిచ్చారు. రెండు రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన కొత్త మున్సిపల్ చట్టం-2019 బిల్లుకు గవర్నర్ బ్రేక్ వేశారు. ఈ నెల 19న కొత్త మున్సిపల్ చట్టాన్ని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం సభ దీనికి ఆమోదం పలికింది. అయితే ఈ బిల్లులోని కొన్ని అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన గవర్నర్, కొన్ని సవరణలు చేయాలని సూచించారు. ఎన్నికల సంఘం అధికారాలను ప్రభుత్వం ఆధీనపరుచుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్లులో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. దీంతో గవర్నర్ సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం బిల్లులో కొన్ని సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. అసెంబ్లీ నిరవధిక వాయిదా పడటంతో ప్రభుత్వం బిల్లుపై ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్టు సమాచారం. తాజా ఆర్డినెన్స్‌ను గవర్నర్ కేంద్రానికి పంపించనున్నారు. కేంద్రం ఆమోదం పొందితే ఈ బిల్లు అమలులోకి రానుంది.
  సభా కార్యక్రమాలకు నిత్యం అడ్డుపడుతున్నారన్న కారణంతో.. ఈ ఉదయం ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చెయ్య చౌదరిలను ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకూ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా బయటకు తరలిస్తున్న చిత్రాలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన లోకేష్, "వారెవా.. ప్రజల పక్షాన నిలిస్తే..  రాజన్న రాజ్యంలో నాయకుల పరిస్థితి ఇదీ.. !" అని వ్యాఖ్యానించారు.  
  తాను ఎక్కడ ఉన్నా ఏపీ అభివృద్దిని కాంక్షిస్తానని.. తాను తెలిసో, తెలియకో తప్పులు చేసి ఉంటే క్షమించాలని గవర్నర్ నరసింహన్ అన్నారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన వీడ్కోలు సభలో నరసింహన్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఏపీ ప్రజలను తానెప్పటికీ మర్చిపోలేనన్నారు. ఏపీ ప్రజల్ని వదిలి వెళుతున్నందుకు తనకు బాధగా ఉందన్నారు. ఏపీతో తనకు అవినాభావ సంబంధం ఉందన్న నరసింహన్.. 1951లో విజయవాడలోనే తనకు అక్షరాభ్యాసం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు. పాలన అద్భుతంగా ఉందని కొనియాడారు. జగన్ ను తన కుమారుడిగా భావిస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీలో జగన్ అనుసరిస్తున్న తీరు బాగుందని, చివరి వరకు ఇదే పంథా అనుసరించాలని కోరారు. కొన్ని సందర్భాల్లో మితిమీరి జోక్యం చేసుకున్నందుకు జగన్ తనను క్షమించాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే అలా చేయాల్సి వచ్చిందని నరసింహన్ వివరించారు. ఈ కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ.. తమను వీడి వెళుతున్నందుకు బాధగా ఉన్నప్పటికీ, పక్కనే ఉన్నారన్న సంతోషం కూడా ఉందన్నారు. నరసింహన్ తో తనకు పదేళ్ల పరిచయం ఉందన్నారు. గవర్నర్ నరసింహన్ నాన్నగారిలా తనకు అనేక సలహాలు ఇచ్చారని.. తాను సీఎం అయ్యాక కూడా ముందుండి నడిపించారన్నారు. మరికొంతకాలం ఆయన గవర్నర్ గా కొనసాగి ఉంటే బాగుండేదన్న భావనను జగన్ వ్యక్తం చేశారు. పెద్దాయన స్థానంలో నరసింహన్ ను తన మనసులో ఉంచుకుంటానని జగన్ వ్యాఖ్యానించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.