EDITORIAL SPECIAL
  ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ అధినేత వైస్ జగన్ బాబాయ్ వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి సంచలనం రేపుతోంది. ఆయన మరణం పలు అనుమానాలకు దారి తీస్తుంది. మొదట ఆయన తెల్లవారు జామున బాత్ రూమ్ కి వెళ్లి గుండె పోటుతో అక్కడే కుప్పకూలిపోయి చనిపోయారని వార్తలొచ్చాయి. కాసేపటికి ఆయన మృతదేహం రక్తం మడుగులో పడి ఉందని.. ఆయన తలకి, చేతులకి గాయాలు ఉన్నాయని.. ఆయన పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన మృతిపై అనుమానాలు మొదలయ్యాయి. ఆ అనుమానాలను నిజం చేస్తూ పోలీసులు కూడా వివేకాది హత్యే అని ప్రాధమికంగా నిర్దారించారు. వివేకానంద రెడ్డిది సహజ మరణం కాదని, ఆయన హత్యకు గురైనట్టు పోస్టుమార్టం నివేదికలో ప్రాథమికంగా నిర్థారణ అయిందని పోలీసులు వెల్లడించారు. ఆయన శరీరంపై ఏడు కత్తి గాయాలు ఉన్నట్లు, పదునైన ఆయుధంతో వివేకా తల, శరీరంపై దాడి చేసినట్లు వైద్యులు గుర్తించారు. పోస్టుమార్టం నివేదికను బట్టి చూస్తే వివేకా హత్యకు గురయ్యారని అర్ధమవుతోంది. అయితే ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన రక్తపు మడుగులో పడి ఉంటే.. ఆయనది సహజం మరణమని, ఆయన గుండెపోటుతో మరణించారని ఎందుకు ప్రచారం చేశారు?. అసలు తొలుత అలా ఎవరు ప్రచారం చేశారు? అలా చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది?. వివేకా సౌమ్యుడని, వివాదాలకు దూరంగా ఉంటారని పేరుంది. మరి అలాంటి వ్యక్తిని చంపాల్సిన అవసరం ఎవరికుంది?. ఆయన హత్య వెనుక రాజకీయ కోణాలు, రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? ఇలా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల వేళ ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేతకి స్వయానా బాబాయ్ అయిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడంతో.. ఆయన మృతి రాజకీయ కోణం సంతరించుకుంది. ఇప్పటికే వివేకా మృతిపై కొందరు వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిమీద ఒకరు అనుమానం వ్యక్తం చేస్తూ ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు వివేకా మృతిపై విచారణకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్ నివేదిక వస్తే కానీ వివేకా మృతి వెనుక రాజకీయ కుట్ర ఉందో, మరేదైనా కక్ష ఉందో తెలీదు.
  2019-20 సంవత్సరానికి రూ.1,82,017 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌‌ను సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన కారణంగా ఎన్ని నిధులు వస్తాయో స్పష్టంగా తెలియదన్నారు. అందుకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలోనూ పూర్తి బడ్జెట్ ప్రవేశపెడతామని వెల్లడించారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఆరవ బడ్జెట్‌ అని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజలు సహకారం అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు గుజరాత్‌, కేరళ అభివృద్ధి గురించే దేశవ్యాప్తంగా చర్చ జరిగేదని, ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధిపై చర్చ జరుగుతోందని అన్నారు. తెలంగాణ అనుసరిస్తున్న ప్రణాళిక దేశంలో చర్చకు కేంద్ర బిందువైందని చెప్పారు. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నామన్నారు. రైతుల్లో నిరాశను తొలగించామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. తెలంగాణ రైతులకు కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. 2018 డిసెంబరు 11వ తేదీలోగా తీసుకున్న రైతు రుణాలు రూ.లక్ష వరకూ మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయాభివృద్ధి కోసం రూ.20,107కోట్లు కేటాయించారు. రైతు బంధు సాయం కింద ఎకరానికి రూ.10వేలు అందిస్తుండగా, ఇందుకోసం రూ.12వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రైతు బీమా కోసం రూ.650కోట్లు కేటాయించిన కేసీఆర్‌ ప్రభుత్వం.. నీటిపారుదల శాఖకు రూ.22,500కోట్లు కేటాయించింది. తెలంగాణ బడ్జెట్‌ ముఖ్యాంశాలు: వ్యవసాయ శాఖకు రూ.20,107 కోట్లు రైతు రుణమాఫీకి రూ.6వేల కోట్లు రైతు బంధుకు రూ.12 వేల కోట్లు రైతు బీమా రూ.650 కోట్లు నీటిపారుదలశాఖకు రూ.22,500కోట్లు నిరుద్యోగ భృతికి రూ.1,810 కోట్లు ఎస్సీల అభివృద్ధికి రూ.16,581 కోట్లు ఎస్టీల అభివృద్ధికి రూ.9,827 కోట్లు మైనార్టీల సంక్షేమానికి రూ.2004 కోట్లు ఈఎన్‌టీ, దంత పరీక్షలకు రూ.5,536 కోట్లు ఆసరా పెన్షన్లకు రూ.12,067 కోట్లు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు రూ.1450 కోట్లు రూపాయికి కిలో బియ్యం పథకానికి రూ.2,744 కోట్లు దివ్యాంగుల పెన్షన్లకు రూ.12వేల కోట్లు ఎంబీసీ కార్పోరేషన్‌కు రూ.1000 కోట్లు
  ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో టీడీపీ నేతల జంపింగులే హాట్ టాపిక్ అని చెప్పాలి. ఎందుకంటే నేతలు వరుసపెట్టి టీడీపీకి గుడ్ బై చెప్తున్నారు. నేతల జంపింగులపై తాజాగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని తెలిసిన వారే పార్టీలు మారుతున్నారని ఆరోపించారు. గెలుపు గుర్రాలకే పార్టీ టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఎవరి పనితీరు ఏంటో చంద్రబాబుకు తెలుసునని చెప్పుకొచ్చారు. పార్టీలో, చంద్రబాబుతో విభేదాలు ఉంటే ఎప్పుడో వెళ్లి ఉండేవారని, ఎన్నికలకు రెండు నెలల ముందు కాదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు గాను 150 సీట్లలో గెలిచి చంద్రబాబు సీఎం అవుతారని లోకేష్ ధీమా వ్యక్తం చేసారు. నాలుగేళ్ల 10 నెలలు ప్రయాణం చేసి, ఇప్పుడు బాబు మీద విమర్శలు చేయడంలో పరమార్ధాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. నిన్న మొన్నటిదాకా జగన్ ను తిట్టి, ఇప్పుడు ఆయన దగ్గరకే వెళ్లడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. నేతలు పార్టీలు మారినా ఏమీ కాదని.. సంక్షేమం, అభివృద్ధే టీడీపీకి అండగా నిలుస్తాయని లోకేష్ స్పష్టం చేసారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని తేల్చి చెప్పారు. ఎన్నికలకు 30 రోజుల ముందు పొత్తులపై చంద్రబాబు ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారని లోకేష్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని లోకేష్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. ఏపీ ఎన్నికల బరిలో ప్రధానంగా టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ మరియు కాంగ్రెస్ దిగనున్నాయి. టీడీపీ, వైసీపీల పొత్తు అసలు ఆప్షనే లేదు. ఇక టీడీపీ, బీజేపీలు గత ఎన్నికల్లో కలిసి పనిచేసినా.. ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కాబట్టి బీజేపీతో పొత్తు ఉండే అవకాశం లేదు. జనసేన విషయానికొస్తే.. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీకి దూరంగా ఉండి టీడీపీకి మద్దతిచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని, కేవలం వామపక్షాలతో కలిసి నడుస్తామని స్పష్టం చేసారు. ఇప్పటికైతే జనసేనతో పొత్తు కూడా కష్టమే. మరి ఎన్నికల ముందు ఏదైనా అద్భుతం జరిగితే చెప్పలేం. ఇక మిగిలింది కాంగ్రెస్. మిగతా పార్టీలతో పోల్చుకుంటే ప్రస్తుతం టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువనే చెప్పాలి. ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేశాయి.. అదేవిధంగా కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేస్తున్నాయి. అయితే తెలంగాణలో వచ్చిన చేదు ఫలితాల నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్ లు ఏపీలో ఎంతవరకు కలిసి పనిచేస్తాయో కూడా ఆలోచించాలి. కొందరు టీడీపీ నేతలు కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తాం కానీ రాష్ట్రంలో మాత్రం విడిగా పోటీ చేస్తేనే టీడీపీకి లాభమని అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పుడు లోకేష్ ఏమో టీడీపీ, ఇతర పార్టీలతో పొత్తు అంటున్నారు. దీంతో అసలు టీడీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది అంటూ చర్చలు మొదలయ్యాయి. చూద్దాం మరి ఎన్నికల ముందు టీడీపీ పొత్తుల విషయంలో ఎలాంటి ట్విస్ట్ లు ఇస్తుందో.
ALSO ON TELUGUONE N E W S
  దర్శకుడిగా రాఘవ లారెన్స్ ప్రయాణం మొదలైంది తెలుగు చిత్ర పరిశ్రమలోనే. కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఆయన, 'స్టైల్' సినిమాతో దర్శకుడిగా మారారు. తర్వాత అక్కినేని నాగార్జున 'మాస్', 'డాన్'... ప్రభాస్ 'రెబల్' సినిమాలకు దర్శకత్వం వహించారు. తర్వాత పూర్తిగా తమిళ సినిమాలపై దృష్టి పెట్టారు. అక్కడ హీరోగా కొన్ని సినిమాలు చేశారు. మధ్య మధ్యలో రాఘవ లారెన్స్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన హారర్ ఫ్రాంచైజీ 'కాంచన' సినిమాలు తెలుగులో విడుదల అవుతున్నాయి. రాఘవ లారెన్స్ తెలుగు సినిమాకు దర్శకత్వం వహించి ఏడేళ్లవుతుంది. చాలా రోజుల విరామం తర్వాత మళ్లీ తెలుగు సినిమాకి దర్శకత్వం వహించాలని అనుకుంటున్నారా? అనే డౌట్ లు వస్తున్నాయి. ఎందుకంటే... 'కాంచన 3' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లో స్టైల్ సీక్వెల్ గురించి రాఘవ లారెన్స్ మాట్లాడారు. డాన్స్ బాగా చేసే హీరోలతో సీక్వెల్ తీయాలని ఉందని చెప్పారు. "డాన్స్ బాగా చేసే హీరోలు ఎవరు ఉన్నారు? అల్లు అర్జున్... రామ్ చరణ్. ఎన్టీఆర్ కూడా బాగా డాన్స్ చేస్తున్నారు. స్టైల్ సీక్వెల్ తీస్తే పెద్ద హీరోలతో తీస్తా" అని రాఘవ లారెన్స్ అన్నారు. మెగా ఫ్యామిలీ కి రాఘవ లారెన్స్ క్లోజ్ కనుక... అల్లు అర్జున్ లేదా రామ్ చరణ్ ఇద్దరిలో ఎవరో ఒకరితో 'స్టైల్' సీక్వెల్ తీసే అవకాశాలను కొట్టిపారేయలేమని తెలుగు సినిమా జనాలు అనుకుంటున్నారు. ఒకవేళ సినిమాలో ఇద్దరు ఉన్న ఆశ్చర్యపోనవసరం లేదు. 'స్టైల్'లో ప్రభుదేవా రాఘవ లారెన్స్ ఇద్దరు హీరోలు ఉన్నారు కదా!
  హమ్మయ్య.... మహేష్ బాబు అభిమానులకు ఓ టెన్షన్ తగ్గింది. 'మహర్షి' సినిమా చిత్రీకరణ ముగిసింది. నిన్న అనగా... బుధవారం సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. షూటింగ్ పూర్తయిన సందర్భంగా కుమార్తె సితార, చిత్ర బృందంతో కలిసి మహేష్ కేక్ కట్ చేశారు. తన సంతోషాన్ని పంచుకున్నారు. ఇక, 'మహర్షి' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మాత్రమే మిగిలున్నాయి. త్వరలో వాటిని పూర్తి చేసి మే 9న సినిమాను విడుదల చేయనున్నారు. నిజానికి, ఈ సినిమా ఏప్రిల్ నెలాఖరున విడుదల కావాలి. సకాలంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కావని... నిర్మాతలకు ముందుగానే అర్థం కావడంతో విడుదల వాయిదా వేశారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, అల్లరి నరేష్ హీరో స్నేహితుడి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా స్టిల్స్ ప్రేక్షకుల్ని మెప్పించాయి. అయితే... దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు మాత్రం మెప్పించలేకపోయాయి. సినిమాలో లో విడుదలైన రెండు పాటలకు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మూడో పాట 'ఎవరెస్ట్ అంచున' శుక్రవారం సాయంత్రం విడుదల కానుంది. అదెలా ఉంటుందో మరి??
  ఏం చేస్తే పబ్లిసిటీ వస్తుందనేది సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బాగా తెలుసు. ఆయనకది వెన్నతో పెట్టిన విద్య. వర్మ తీసిన సినిమాలు థియేటర్లలో ఎన్ని రోజులు ఆడతాయో... అంతకంటే ఎక్కువ రోజులు మీడియాలో వర్మ సినిమా వార్తలు వస్తాయి. ఎందుకంటే... వర్మ ఎంపికచేసుకునే కథాంశాలు అటువంటివి‌. రక్త చరిత్ర, వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్... వర్మ నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కొన్ని రోజుల క్రితం ప్రకటించిన 'కోబ్రా'తో సహా! ఈరోజు అటువంటి సినిమాను వర్మ ప్రకటించారు. సారీ సారీ... ఒక ట్వీట్ వేసి ఊరుకున్నారు. సినిమా టైటిల్... 'టైగర్ కేసీఆర్' ‌(పోస్టర్ ను బట్టి).  ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బయోపిక్ ఇది. ఈ సినిమా కాప్షన్ ఏంటో తెలుసా? 'ది అగ్రస్సివ్ గాంధీ'! తెలంగాణ వాళ్లను ఆంధ్ర ప్రజలు థర్డ్ క్లాస్ పీపుల్ గా ట్రీట్ చేయడాన్ని తట్టుకోలేని కేసీఆర్.... తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఎటువంటి పోరాటం చేశాడు? ఎలా తెలంగాణ సాధించారు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్న ట్లు వర్మ ట్విట్టర్లో పేర్కొన్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వర్మ ప్రకటించలేదు. శశి లలిత... కోబ్రా... ఇప్పుడీ టైగర్ కేసీఆర్... 'లక్ష్మీస్ ఎన్టీఆర్'  విడుదల తర్వాత తమ ప్రకటించిన సినిమాల జాబితా. వీటిలో ఏది ముందు వస్తుందో? ఏది అటక ఎక్కుతుందో?
  దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'ఆర్.ఆర్.ఆర్'. ఇందులో రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్, అహ్మదాబాద్ ఇతర ప్రదేశాల్లో హీరోల ఇంట్రడక్షన్ సీన్స్ ఇప్పటికే చిత్రీకరించారు. ఒక్క ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ కి 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. యాక్షన్ ఎపిసోడ్ తో యంగ్ టైగర్ ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. ఆల్రెడీ ఆ సీన్ చూసిన సినిమా యూనిట్ చాలా హ్యాపీగా ఉంది. సినిమాలో కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. అహ్మదాబాద్ షెడ్యూల్ జరుగుతున్న సమయంలో జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా రామ్ చరణ్ కాలికి గాయమైంది. అందువల్ల, పుణెలో జరగాల్సిన షెడ్యూల్ వాయిదా పడింది. ఈ లోపు సినిమా యూనిట్ కి మరో షాక్ తగిలింది. వ్యక్తిగత కారణాల వల్ల విదేశీ భామ డైసీ ఎడ్గార్ జోన్స్ ఈ సినిమా నుంచి తప్పుకుంది. దాంతో  ఎన్టీఆర్ కి కొత్త జోడిని వెతికే పనిలో రాజమౌళి పడ్డారు. హిందీ హీరోయిన్ శ్రద్ధాదాస్, తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన నిత్యామీనన్ తదితరుల పేర్లు వినపడుతున్నాయి. అయితే చిత్రబృందం ఎవరిని ఖరారు చేయలేదట.  రామ్ చరణ్ గాయం నయం అయ్యే లోపు.... ‌ ఎన్టీఆర్ కి జోడి ని ఎంపిక చేసి మళ్లీ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు.
  నాని క్రికెట‌ర్ గా న‌టించిన చిత్రం `జెర్సీ`. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 19 న విడుద‌ల‌వుతోంది. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై సూర్య దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. ఈ చిత్రంలోని పాట‌ల‌కు, ట్రైల‌ర్స్ కు ఇప్ప‌టికే మంచి క్రేజ్ వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా నాని ఈ రోజు మీడియాతో ముచ్చ‌టించారు. ఆ విశేషాలు... అందుకే జెర్సీ టైటిల్ పెట్టాం... జెర్సీ అంటే క్రికెట‌ర్ యూనిఫార్మ్ అని. ప్ర‌తి స్పోర్ట్స్ మేన్ వేసుకునే యూనిఫార్మ్ ని జెర్సీ అని అంటారు. కేవ‌లం క్రికెట్ స్టోరి కాబ‌ట్టి ఈ టైటిల్ పెట్టామ‌నుకోద్దు. ఇందులో జెర్సీ టైటిల్ కు బ‌ల‌మైన కార‌ణం ఉంది. సినిమా చూస్తే క‌చ్చితంగా టైటిల్ జ‌స్టిఫికేష‌న్ ఏంటో మీకు అర్థ‌మ‌వుతుంది. ట్రైల‌ర్ లో చాలా చెప్పాం... ఇది అర్జున్ స‌క్సెస్ ఫుల్ క్రికెట‌ర్ స్టోరీనా? లేక ఫ్ర‌స్టేట‌డ్ క్రికెట‌ర్ స్టోరీనా అంటే రెండూ కావ‌చ్చు, కాక‌పోవ‌చ్చు. ట్రైల‌ర్ లో ఇప్ప‌టికే చాలా స్టోరీ చెప్పేశాం. అర్జున్ ని లూస‌ర్ అన‌డం, త‌క్కువ చేసి మాట్లాడంలాంటివ‌న్నీ ఉంటాయి. వాటివ‌ల్ల ఫ్ర‌స్టేష‌న్ ఉంటుంది. ఆ ఫ్ర‌స్టేష‌న్ వ‌ల్ల అర్జున్ జీవితంలో ఏం జ‌రిగిందనేదే సినిమా స్టోరి. గ‌ల్లీ క్రికెట‌ర్ ని... నేను గ‌ల్లీలో క్రికెట్ ఆడేవాణ్ని. స్కూల్లో కూడా నేను లాస్ట్ బ్యాట్స్ మేన్ ని. కొన్ని సార్లు నా టీమ్ లో అంద‌రూ ఓడిపోతేనో, లేకుంటే ఎవ‌రికో ఒక‌రికి దెబ్బ‌లు త‌గిలితేనో నాకు ఆడే అవ‌కాశం వ‌చ్చేది. ఆ బ్యాచ్ అన్న మాట నాది. అంతే త‌ప్ప సీరియ‌స్ గా ఎప్పుడూ ఆడ‌లేదు.   చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా... నా ప్ల‌స్ లు, మైన‌స్ లు ఏంటో నాకు బాగా తెలుసు. అందుకే నా సినిమా విష‌యంలో ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను త‌ప్ప ఓవ‌ర్ కాన్ఫిడెంట్ కాదు. ప్ర‌జంట్ నేను చాలా సంతృప్తితో ఉన్నా. ఒక గొప్ప సినిమా చేసాన‌నే ఫీలింగ్ ఈ సినిమాతోనే వ‌చ్చింది. ముస‌లివాడిగా అయినా న‌టిస్తా... నేను ఎటువంటి పాత్ర‌లో అయినా న‌టించ‌డానికి సిద్ద‌మే. ముస‌లివాడిగా చేయ‌మ‌న్నా చేస్తాను. ప్రాస్త‌టిక్ మేక‌ప్ వేసుకోమ‌న్నా సిద్ధంగానే ఉన్నా. న‌టుడిగా నాది కాని వ‌య‌సులో న‌టించ‌డానికి చాలా ఇష్ట‌ప‌డ‌తాను. ఎవ‌రూ జడ్జ్ చేయ‌లేదు... ల‌క్కీగా నా సినిమాలు కొన్నిసార్లు స‌క్సెస్ కాన‌ప్పుడు కూడా నా న‌ట‌న గురించి ఎవ‌రూ ఎప్పుడూ ఒక మాట అన‌లేదు. కాక‌పోతే రెండు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసేట‌ప్పుడు నాని ఇక క‌మ‌ర్షియ‌లేనా అని అన్నారంతే.. అది కూడా పెద్ద జ‌డ్జిమెంట్ కాదులెండి. ఇక స్టార్ డ‌మ్ లాంటి వాటి మీద నాకు పెద్ద‌గా న‌మ్మ‌కం లేదు. కంటెంట్ వ‌ల్లే స్టార్ డ‌మ్ వస్తుంద‌ని న‌మ్ముతా.   అప్పుడు కొంచెం ప్రెజ‌ర్ ఫీల‌య్యా... సినిమా, సినిమాకు ఎద‌గ‌డం నాకు పెద్ద‌గా ప్రెజ‌ర్ ఏమీ లేదు. ఎంసీఏ త‌ర్వాత కొంచెం ప్రెజ‌ర్ ఫీల‌య్యాను. ప్ర‌జంట్ మాత్రం ఆ ప్రెజ‌ర్ లేదు. జెండా పై క‌పిరాజు, పైసా ఇలా కొన్ని సినిమాలు వ‌రుస‌గా ఫ్లాప్ అయ్యాయి. ఆ స‌మ‌యంలో ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం సినిమా చేసా. అది మంచి పేరు తీసుకొచ్చింది. నాకు న‌చ్చింది చేసుకుంటూ వెళ్తున్నా. వాటిని ఇగ్నోర్ చేస్తున్నా... ప్రారంభంలో సోష‌ల్ మీడియాలో నా పై ఏమైనా రాస్తే వాటిని చూసి కొంచెం ఫీల‌య్యేవాడిని. వాటిని త‌ల‌చుకొని తెగ బాధ‌ప‌డేవాడిని. పోను పోను అంతా అల‌వాటైపోయింది. పిల్ల జ‌మీందార్ సినిమా స‌మ‌యంలో నానికి చాలా త‌ల పొగ‌రు అని రాసారు. అప్పుడు చాలా ఫీల‌య్యా. అప్పుడు అంత బాధ‌ప‌డాల్సి ఉండాల్సి కాదు అని ఇప్పుడ‌నిపిస్తోంది. రాయ‌డం వాళ్ల ధ‌ర్మం, వాటిని ప‌ట్టించుకోకుండా ఇగ్నోర్ చేయ‌డం మ ధర్మం అని ఇప్పుడు అర్థ‌మైంది. బిగ్ బాస్ తో ప్ర‌పంచం ప‌రిచ‌య‌మైంది.. మ‌నం ప్ర‌పంచానికి ప‌రిచ‌యం కావ‌డం క‌న్నా, ప్ర‌పంచానికి మ‌నం ప‌రిచ‌యం కావ‌డం ప్ర‌ధానం. బిగ్ బాస్ తో  నాకు ప్ర‌పంచం ప‌రిచ‌య‌మైంది. ఇక బిగ్ బాస్ చేసేట‌ప్ప‌డు ఎక్స్ట్రా బ‌ర్దెన్ లా ఎప్పుడు ఫీల‌వ‌లేదు. కాక‌పోతే ఒక్కో ఎపిసోడ్ అక్క‌డ జ‌రుగుతున్న కొద్దీ ఇక్క‌డ సోష‌ల్ మీడియాలో దాని ర‌ఫ్లెక్ష‌న్ ఉండేది. షోల్ హీట్ పెరిగే కొద్దీ... ఇక్క‌డ సోష‌ల్ మీడియాలో హీట్ పెరిగేది. ఇది నా ఆఖ‌రి ఎపిసోడ్ అని ఎప్పుడు ట్వీట్ చేసానో, ఆ త‌ర్వాత నాని అన్నా ప్లీజ్ క‌మ్ బ్యాక్ అంటూ చాలా మంది అడిగేవారు.
  తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే 2014 ఎన్నికలు, 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం బాగా తగ్గింది. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 62.25 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. రాష్ట్రం మొత్తం మీద ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 75.61 శాతం పోలింగ్‌ నమోదైంది. అతితక్కువగా హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 39.49 శాతం నమోదైంది. సాధారణంగానే హైదరాబాద్ లో పోలింగ్ శాతం తక్కువగా ఉంటుంది. 2014 ఎన్నికల్లో 53.27 శాతం ఉండగా.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 47.29 శాతం నమోదైంది. ఇక తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కనీసం 40 శాతం కూడా నమోదు కాలేదు. అదేవిధంగా.. మల్కాజిగిరిలో 42.75 శాతం, సికింద్రాబాద్ లో 45 శాతం నమోదైంది. దీంతో ఓటర్లు మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే పోలింగ్ శాతం తగ్గిపోవడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు భారీ సంఖ్యలో హైదరాబాద్ లో నివసిస్తూ ఉంటారు. వీరిలో చాలామంది హైదరాబాద్ తో పాటు, సొంత ఊరిలో ఓటు కలిగి ఉన్నారు. ఏపీలో లోక్ సభతో పాటు అసెంబ్లీ కి కూడా ఎన్నికల జరగడంతో, చాలామంది హైదరాబాద్ నుండి తమ సొంత ఊళ్లకు వెళ్లి అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు.హైదరాబాద్ లో ఓటింగ్ శాతం తగ్గడానికి ఇది ఒక కారణంగా కనిపిస్తోంది. ఇక మరో ముఖ్య కారణం.. ఎవరికి ఓటేసి ఏం లాభం అనే అభిప్రాయం ఓటర్లలో ఏర్పడటం. అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లతో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఆ తరువాత ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ కు క్యూ కట్టారు. దీంతో అసెంబ్లీ అంతా దాదాపు గులాబీమయం అయింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ హవా కొనసాగేలా ఉంది. ఒకవేళ వేరే పార్టీ అభ్యర్థికి ఓటేస్తే.. వారు గెలిచినా టీఆర్ఎస్ గూటికి చేరే అవకాశముంది. ఈ మాత్రం దానికి ఓటేయడం ఎందుకనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద పలు కారణాల పుణ్యమా అని తెలంగాణలో పోలింగ్ శాతం తగ్గిపోయింది.
  ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ వైసీపీ అధినేత వైఎస్ జగన్.. వరుసపెట్టి పలువురు నేతలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ చేరికలు చూసి వైసీపీ శ్రేణులు ఆనందపడుతున్నారు. అయితే వారి చేరిక వల్ల వైసీపీకి కొత్తగా ఒరిగేది ఏముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే దాదాపు వారంతా గతంలో వైసీపీని వీడి, జగన్ మీద తీవ్ర విమర్శలు చేసిన వారే. గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి, తర్వాత పార్టీని వీడి.. జగన్‌ మీద విమర్శలు గుప్పించిన వారు వరుసగా ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారు. వీరిలో కొందరు ఎన్నికలకు ముందుగానే పార్టీ ఫిరాయించిన వారున్నారు. కొందరు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఫిరాయించిన వారున్నారు. గతంలో వైసీపీని వీడి తనమీద విమర్శలు చేసిన వారిని జగన్ ఏరికోరి మరి పార్టీలో చేర్పించుకుంటున్నారు. రీసెంట్ గా వైసీపీలో చేరిన దేవినేని చంద్రశేఖర్, రఘురామకృష్ణంరాజు, దాడి వీరభద్రరావు లాంటి వారు ఆ కోవలోకే వస్తారు. మంత్రి దేవినేని ఉమా సోదరుడు దేవినేని చంద్రశేఖర్.. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. జగన్ టికెట్ ఇస్తారేమో అని ఆయన ఆశపడ్డారు. కానీ ఇవ్వలేదు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో.. అనంతరం మళ్లీ ఆయన సోదరుడు ఉమాకి దగ్గరయ్యారు. ఆ సమయంలో.. ఆయన జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు మళ్లీ జగన్ పంచకు చేరారు. జగన్‌ కూడా హ్యాపీగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక రఘురామకృష్ణంరాజు అయితే గతంలో జగన్ ని నపుంసకుడు అంటూ హద్దు దాటి విమర్శలు చేశారు. తనని వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తిని కూడా జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించేశారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా అంతే. ఆయన వైసీపీకి రాజీనామా చేసినప్పుడు.. జగన్‌ వ్యక్తిత్వం పై చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కాదు. జగన్ పై విమర్శల దాడి చేసిన ఆయన చాలా కాలం పాటు ఏ పార్టీలోనూ చేరలేదు. ఈ మధ్య టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారు అంటూ వార్తలొచ్చాయి. కానీ టికెట్ విషయంలో టీడీపీ సానుకూలంగా స్పందించక పోవడంతో వెనకడుగు వేశారు. ఇక ఎన్నికల సమయం వచ్చే సరికి.. మళ్లీ వైసీపీ వైపే చూశారు. ఇలా తనను విమర్శించిన వారిని.. జగన్ పిలిచి మరీ పార్టీలో చేర్చుకోవడంతో.. ఆయనకు ఇంతకు మించిన నేతలు దొరకడం లేదా? వారి చేరికల వల్ల జగన్‌కు లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
  'రాజకీయ నాయకుల మధ్య పార్టీల సిద్ధాంతపరమైన వ్యతిరేకతే తప్ప వ్యక్తిగత వ్యతిరేకత ఉండదు. వ్యక్తిగతంగా ఒకరినొకరు దూషించుకోరు.' ఇది ఒకప్పటి మాట. ఈ తరంలో కొందరు నేతలు హద్దు దాటి వ్యక్తిగతంగా విమర్శలు చేసున్నారు. అందులో ముందువరుసలో ఉంటారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. ట్విట్టర్ వేదికగా విజయసాయి.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మీద హద్దు దాటి విమర్శలు చేస్తున్నారు. ఆయన కూడా విమర్శల పాలవుతున్నారు.   కొండవీడులో రైతు కోటయ్య మృతికి టీడీపీ, ఏపీ పోలీసులే కారణమని వైసీపీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అలాగే రైతు కులాన్ని ప్రస్తావిస్తూ జగన్ ట్వీట్ చేసారు. దీనిపై స్పందించిన లోకేష్.. జగన్ కులరాజకీయాలు చేస్తున్నారని, శవాలపై పేలాలు ఏరుకునే జగన్ మరోసారి శవరాజకీయం మొదలుపెట్టారని విమర్శించారు. అయితే ఈ విమర్శలకు విజయ సాయి ఘాటు రిప్లై ఇచ్చారు. 'లోకేష్.. మేం శవాల మీద పేలాలు ఏరుకుంటున్నాం అని ట్వీట్ పెట్టావ్. ఇంతకీ శవం ఎవరు. నువ్వా? మీ నాన్నా?' అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ పై విమర్శలు వెల్లువెత్తాయి. విమర్శలు చేయాలి గానీ.. మరీ ఇలా బ్రతికున్నవాళ్లను శవాలంటూ వారి చావుని కోరుకోవడం ఏంటని పలువురు తప్పుపట్టారు. కొందరైతే గతంలో జగన్ నంద్యాల ఉపఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబుని నడిరోడ్డు మీద ఉరి తీయాలంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అధినేత బాటలోనే మిగతా నేతలంతా నడుస్తున్నారు. మీ పార్టీ నేతలు ఎదుటి వ్యక్తుల చావుని కోరుకుంటున్నారు, మీరేం ప్రజా నాయకులు అసలు? అంటూ విమర్శిస్తున్నారు. అయినా విజయ సాయి వ్యక్తిగత విమర్శలు ఆపలేదు. తాజాగా లోకేష్ బాడీ గురించి హద్దు మీరి కామెంట్స్ చేసారు. వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ కలిసిపోయాయని టీడీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్నీ లోకేష్ ట్విట్టర్ లో వ్యంగంగా ట్వీట్ చేసారు. 'ఢిల్లీ మోడీ గారు, తెలంగాణ మోడీ కేసిఆర్ గారు, ఆంధ్రా మోడీ జగన్ గారికి కలలో కూడా చంద్రబాబు గారే గుర్తుకొస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ చక్రం తిప్పి 420 పార్టీతో జత కట్టిన కేసీఆర్ గారు తెలంగాణకే పరిమితమై చతికలపడ్డారు.' అని ట్వీట్ చేసారు. అయితే దీనికి కౌంటర్ గా విజయ సాయి లోకేష్ బాడీ గురించి కామెంట్స్ చేసారు. 'లోకేష్.. నీకు జగన్ గారిలోనూ కేసీఆర్ గారిలోనూ మోడీ గారు కనిపిస్తున్నారా? ఆంధ్ర మోడీ, తెలంగాణ మోడీ అని వ్యగంగా ట్వీట్ చేసావు. మోడీ సంగతి తర్వాత ఆలోచిద్డువులే.. ముందు నీ బాడీ, ముఖ్యంగా మైండ్ సంగతి ఆలోచించు! ఎక్కడన్నా మంచి గ్యారేజ్ లో చూపించుకో.మతిస్థిమితం లేని వాళ్ళు మంత్రిగా అనర్హులు.' అంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ పై కూడా నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. నేతలు హుందాగా విమర్శలు చేయాలి, తమపై వచ్చిన విమర్శలను హుందాగా తిప్పికొట్టాలి. అంతేకాని ఇలా బాడీ, మైండ్ గ్యారేజ్ లో చూపించుకో, మతిస్థిమితం లేదంటూ హద్దు దాటి వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడుతున్నారు. మరి విజయ సాయి ఇప్పటికైనా తన తీరు మార్చుకొని హుందాగా విమర్శలు చేస్తారో లేక ఎన్నికలు వస్తున్నాయిగా అని ఇంకాస్త డోస్ పెంచి విమర్శలు పాలవుతారో చూడాలి.
  వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ మాకు పోటీ ఇస్తుంది, కాంగ్రెస్ పోటీ చేస్తే మా పార్టీకి ఇబ్బంది అని టీడీపీ, వైసీపీ పార్టీలు అనుకునే అవకాశముందా?. అబ్బే అసలే ఛాన్సే లేదు అంటారా?. కానీ వైసీపీ ఎందుకో కాంగ్రెస్ ని చూసి ఉలిక్కిపడుతుందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రత్యేక హోదా భరోసా యాత్ర పేరుతో బస్సు యాత్రకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు నెల్లూరు జిల్లా వెంకటగిరి క్రాస్ రోడ్డు వద్ద కాంగ్రెస్‌ బస్సులను వైసీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకొని నల్లజెండాలతో నిరసన తెలిపారు. ‘కాంగ్రెస్ గో బ్యాక్’ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి భరోసాయాత్ర చేసే హక్కు లేదంటూ వైసీపీ నేతలు నినాదాలు చేశారు. భరోసా యాత్ర పేరుతో మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే కాంగ్రెస్ యాత్రను వైసీపీ నేతలు అడ్డుకోవడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. విభజన ఎఫెక్ట్ తో ఏపీలో కాంగ్రెస్ కి గట్టి దెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలవలేదు. అయితే ఏపీ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రత్యేకహోదాని ఇస్తామని కాంగ్రెస్ భరోసా ఇస్తోంది. ఇప్పటికే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఏపీ ప్రత్యేకహోదా ఫైల్ మీద పెడతామని పలుసార్లు స్పష్టం చేసింది. దీంతో ఏపీ ప్రజల్లో కాంగ్రెస్ మీద విభజన కోపం కాస్త తగ్గింది. అదీగాక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హోదా విషయంలో మొండిచెయ్యి చూపింది. దీంతో హోదా రావాలంటే కాంగ్రెస్సే మనకున్న ఏకైక మార్గం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. హోదా హామీతో కాంగ్రెస్ పట్ల ఏపీ ప్రజలు కాస్త సానుకూలంగా స్పందిస్తుండటంతో.. ప్రజల్లోకి వెళ్ళడానికి ఇదే సరైన సమయం అని భావించిన కాంగ్రెస్ ప్రత్యేక హోదా భరోసా యాత్ర చేపట్టింది. అదేవిధంగా నిన్న ఏపీ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ.. మోదీ మాట ఇచ్చి తప్పిన తిరుపతి సాక్షిగానే ఏపీకి హోదా ఇచ్చి తీరుతామని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఈరోజు బస్సు యాత్రలో మరింత ఉత్సాహంతో పాల్గొన్నారు. అయితే వైసీపీ నేతలు యాత్రని అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. ఏపీకి హోదా ఇస్తానంటున్న కాంగ్రెస్ బస్సు యాత్రని అడ్డుకోవాల్సిన అవసరం వైసీపీకి ఏమొచ్చింది? అంటే కాంగ్రెస్ వల్ల.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎంతోకొంత నష్టం జరిగే అవకాశముంది. అందుకే వైసీపీ ఉలిక్కిపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇప్పుడున్న వైసీపీ ఓటు బ్యాంకంతా ఒకప్పటి కాంగ్రెస్ ఓటు బ్యాంకే.. మరి ఇప్పుడు హోదా హామీతో కాంగ్రెస్ కాస్తోకూస్తో బలపడి ఎంతోకొంత ఓట్లు చీలిస్తే వైసీపీకి నష్టమేగా? అందుకే వైసీపీ కాంగ్రెస్ బస్సుకి బ్రేకులు వేయాలని చూస్తుందట. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కసీటైనా గెలుస్తుందో లేదో తెలీదు కానీ.. ఎన్నికలకు ముందే ఓట్లు చీలుస్తుందేమో అని వైసీపీలో భయం కలిగేలా చేసింది. చూద్దాం మరి హోదా హామీతో ఏపీలో కాంగ్రెస్ ఎంతలా బలపడుతుందో.
  ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష వైసీపీ, అధికార పార్టీ టీడీపీని ఇబ్బంది పెట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది. పోలీసుశాఖ పదోన్నతులు, చింతమనేని వీడియో, రైతు కోటయ్య మృతి.. కాదేదీ టీడీపీని విమర్శించడానికనర్హం అంటూ కొత్త కొత్త టాపిక్స్ తో టీడీపీ మీద ఆరోపణలు, విమర్శలు చేస్తుంది. తాజాగా వైసీపీ పరోక్షంగా మరో టాపిక్ తో టీడీపీని టార్గెట్ చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల మధ్య డీల్ కుదిరింది అంటూ  జగన్ కి సంబంధించిన పత్రికలో ఓ ఆర్టికల్ ప్రచురితమైంది. ముసుగులో స‌ర్దుబాటు అంటూ ఒక క‌థ‌నం ప్ర‌చురించారు. దాని సారాంశం ఏంటంటే.. సీఎం చంద్ర‌బాబు, ప‌వ‌న్ కళ్యాణ్ ల మ‌ధ్య ర‌హస్య ఒప్పందం కుదిరిపోయింద‌ట‌, సీట్ల స‌ర్దుబాటు కూడా జ‌రిగిపోయిందట‌! అంతేకాదు.. ఈ మ‌ధ్య చంద్ర‌బాబు, ప‌వ‌న్ లు ఓ ర‌హ‌స్య స్థ‌లంలో భేటీ అయ్యార‌నీ, పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌ ఈ భేటీకి ఏర్పాట్లు చేశారంటూ రాశారు. ఈ భేటీలో సీట్ల సర్దుబాటు, ఎన్నికలకు ఎలా వెళ్ళాలి వంటి అంశాలు చర్చించారట. జనసేనకు 25 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు ఇచ్చేలా డీల్ కుదిరిందట. అంతేనా ‘ఇన్నాళ్లూ తిట్టుకొని ప్రజల ముందుకు వెళ్లాం. ఇప్పుడు జనం  ముందుకు ఏ ముఖం పెట్టుకొని వెళ్లగలుగుతాం? ఇప్పటికిప్పుడు కలసి పోటీ చేస్తామంటే ప్రజలు అంగీకరించే పరిస్థితి ఉండదు. ఏం చెప్పి నమ్మించగలం?’ అని ప్రధానంగా చర్చించారంటూ రాసుకొచ్చారు. మొత్తానికి 2014 లో టీడీపీకి మద్దతిచ్చిన పవన్.. తరువాత టీడీపీకి దూరమై విమర్శలు చేసారు. ఈమధ్య చంద్రబాబుతో మళ్ళీ డీల్ కుదరడంతో విమర్శలు తగ్గించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తారు అని ఆ క‌థ‌నం సారాంశం. మరి పవన్ కళ్యాణ్ ఏమో ఎవరితో పొత్తులుండవు.. వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో మాత్రమే కలిసి పనిచేస్తాం అన్నారు. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం కమిటీ ఏర్పాటు చేసి దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు. మరోవైపు ఆయన సోదరుడు నాగబాబు యూట్యూబ్ లో చంద్రబాబుని టార్గెట్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఈ పత్రికలో వచ్చిన కథనం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.  
  అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు బాటలోనే.. కాకినాడ ఎంపీ తోట నర్సింహం కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అనారోగ్యం కారణంగా తాను రాబోయే ఎన్నికల్లో పోటీచేయడం లేదంటూ ప్రకటించిన నర్సింహం.. ఆయన భార్య వాణికి టికెట్ ఇవ్వాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు. కీలకమైన జగ్గంపేట టీడీపీ టికెట్ తన భార్యకు ఇవ్వాలని చంద్రబాబుకి విన్నవించడం ద్వారా నర్సింహం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి ఇప్పటికే టీడీపీ టికెట్ ఖరారైనట్టు సమాచారం ఉంది. ఇది తెలిసి కూడా నర్సింహం టికెట్ అడగడం పార్టీని వీడుతున్నానంటూ చెప్పుకోవడానికి కారణం కోసమేననే వాదన ఉంది. జగ్గంపేట టికెట్ ఇవ్వకపోతే.. వైసీపీలోకి వెళ్లిపోవాలని తోట నర్సింహం భావిస్తున్నట్లు సమాచారం. జగ్గంపేట టికెట్ ను వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచి, ఆ తరువాత టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రూకే టీడీపీ అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తుండగా, ఈ విషయం తెలిసి కూడా నర్సింహం ఇదే స్థానాన్ని ఆశించడం వెనుక ఆయన రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న ఆయన, కారణం చెప్పుకోవడానికే జగ్గంపేట టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2014 ఎన్నికలకు ముందు వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మంత్రిగానూ పనిచేసిన ఆయన, ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి కాకినాడ నుంచి ఎంపీగా బరిలోకి దిగి గెలిచారు. తాజాగా, చలమలశెట్టి సునీల్ టీడీపీలో చేరనుండటంతో తోట నర్సింహానికి సీటు లభించే పరిస్థితి లేదు. అందుకే ఆయన పోటీకి దూరంగా ఉండి.. టీడీపీలో తన భార్యకైనా టికెట్ లభిస్తే, పార్టీలో ఉండాలని, లేకుంటే మరో పార్టీలోకి మారాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తోట నర్సింహం వైసీపీలో చేరినా.. జగ్గంపేట టికెట్ హామీ లభించడం కష్టమేనని తెలుస్తోంది. ఎందుకంటే, ఇప్పటికే జ్యోతుల చంటిబాబు ఆ నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్తగా ఉన్నారు. జగన్ టికెట్ కూడా ఆయనకే ఖరారు చేసినట్టు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో తోట నర్సింహం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
    ఇంటర్నెట్‌ గురించి అవగాహన ఉన్నవారు ‘PRACTO’ అన్నపేరు వినే ఉంటారు. మనకి దగ్గరలో ఉన్న వైద్యుల వివరాలను అందచేస్తూ, అవసరమైతే వారితో ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్‌ లేదా చికిత్సను అందించే సంస్థే practo. వైద్యుల కోసం తమ సైట్‌ను సంప్రదించే వ్యక్తుల వయసు, అవసరాల ఆధారంగా ఈ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికను చూడగానే ఇప్పటి యువత మానసిక సమస్యలతో సతమతం అయిపోతుదని తేలిపోతోంది. ఆ నివేదికలో ముఖ్య అంశాలు ఇవిగో…   - మానసిక సమస్యల కోసం వైద్యులను సంప్రదించేవారిలో 79 శాతం మంది 30 ఏళ్ల లోపువారే! - 25 నుంచి 34 వయసువారితో పోలిస్తే.... 24 ఏళ్లలోపువారే మానసిక వైద్యులని సంప్రదించడం ఆశ్చర్యం కలిగించే విషయం.   - గతంతో పోలిస్తే డిప్రెషన్, ఉద్వేగం వంటి సమస్యలతో మానసిక వైద్యులని సంప్రదించేవారి సంఖ్య ఏకంగా 62 శాతం పెరిగిందట.   - తమ మానసిక సమస్యలకు ఆన్‌లైన్ ద్వారా వైద్యుల పరిష్కారాన్ని కోరాలనుకునేవారి సంఖ్య దాదాపు నాలుగింతలు పెరిగిందట. మానసిక సమస్య అనగానే సమాజం చిన్నచూపు చూడటం వల్లే ఎక్కువమంది ఆన్‌లైన్లోనే వైద్యులను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నారు.   - ముంబై, దిల్లీ, బెంగళూరు నగరాల్లో మానసిక వైద్యులను సంప్రదించేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. అలాగని మిగతా నగరాలు కూడా ఏమంత ప్రశాంతంగా ఉన్నాయని అనుకోవడానికి లేదు. గతంతో పోలిస్తే చెన్నై, కోల్‌కతా వంటి మహానగరాల్లో కూడా మానసిక వైద్యులని ఆశ్రయించేవారి సంఖ్య గణనీయంగానే పెరిగింది.   Practo అందిస్తున్న ఈ నివేదికని పూర్తిగా నమ్మడానికి లేదు. ఎందుకంటే యువత ఎక్కువగా ఆన్‌లైన్ మీద ఆధారపడుతుంది కాబట్టి... 30 ఏళ్లలోపు వారే ఈ సౌకర్యాన్ని ఎక్కువగా వినియోగించుకునే అవకాశం ఉంది. పైగా ఒకప్పుడు మానసిక సమస్య కోసం వైద్యుడి దగ్గరకి వెళ్లడం అంటే ‘నాకేమన్నా మెంటలా!’ అని నొచ్చుకునేవారు. కానీ ఇప్పటి యువత వైద్యుల కౌన్సిలింగ్ తీసుకోవడానికి  జంకడం లేదని తృప్తిపడాలేమో కూడా! కానీ ఇప్పుడిప్పుడే జీవితంలోకి అడుగుపెడుతున్న యువత మానసిక సమస్యలతో ఎందుకు సతమతం కావాల్సి వస్తోంది అన్నదే ఆలోచించాల్సిన విషయం. పిల్లలు ఎదుగుతున్న తీరులోనూ, ఎదిగాక వారు జీవించే విధానంలోనూ ఏదో లోటు ఉందేమో విశ్లేషించి తీరాల్సిందే! - నిర్జర.  
  ఈ రోజుల్లో చాలామందిది ఒకటే బాధ! ఖర్చుపెట్టుకోవడానికి కావల్సినంత డబ్బు ఉంది. కానీ గడపడానికి సమయమే ఉండటం లేదు. ఈ మాటలు వింటున్న కొందరు పరిశోధకులకి ఓ అనుమానం వచ్చింది. మనిషి దేనివల్ల సంతోషంగా ఉంటాడు? డబ్బు వల్లా! కాలం వల్లా! ఈ విషయాన్ని తేల్చుకునేందుకు వారు ఒక ఆరు పరిశోధనలు చేశారు. ఇందులో భాగంగా 4,600 మంది అభ్యర్థుల ఆలోచనా తీరుని గమనించారు.   లక్షలకొద్దీ జీతంతో ఎక్కువసేపు ఉద్యోగం చేయడం కంటే, కాస్త తక్కువ జీతంతో తక్కువ పనిగంటలు చేస్తేనే సుఖంగా ఉన్నట్లు ఈ పరిశోధనలో వెల్లడయ్యింది. కుర్రవాళ్లు కాస్త అటూఇటూగా మొగ్గుచూపారు కానీ, వయసు మీరుతూ జీవితం తెలిసొస్తున్న కొద్దీ.... డబ్బుకంటే సమయమే ముఖ్యం అనేవారి సంఖ్యే ఎక్కువగా ఉందట. అంతేకాదు! ఇంటిపని, పెరడు పని చేసేందుకు పనివాళ్లని పెట్టుకున్నప్పుడు కూడా ఇదే తరహా సంతోషం కనిపించింది. ఆ సంతోషం తన పని వేరొకరు చేయడం వల్ల కాదు, జీవితాన్ని ఆస్వాదించే సమయం దక్కినందువల్లే అని తేల్చారు!   పైన చెప్పుకొన్న పరిశోధన జరిగి ఏడాది గడిచిపోయింది. ఇప్పుడు శాస్త్రవేత్తలకి మరో సందేహం వచ్చింది. మన డబ్బుతో వస్తువులు కొనుక్కుంటే ఎంతో కొంత తృప్తి ఉంటుంది. అదే సమయాన్ని కొనుక్కుంటే! అదేనండీ... ఆ డబ్బుతో మన పనిభారం తగ్గించుకుంటే మరింత తృప్తి ఉంటుందా! అన్న ఆలోచన వచ్చింది. వెంటనే కొంతమందికి తలా 40 డాలర్లు ఇచ్చి చూశారు. ఈ డబ్బుని మీకు తోచిన రీతిలో ఏదన్నా కొనుక్కోమని చెప్పారు. సహజంగానే చాలామంది తమకి ఇష్టమైన వస్తువులని కొనేసుకున్నారు. అతికొద్ది మంది మాత్రమే... తమకి కాలం కలిసొచ్చేలా వేరొకరి సేవల కోసం ఈ డబ్బుని వినియోగించుకున్నారు. వస్తువులని కొన్నవారితో పోలిస్తే సమయాన్ని కొనుక్కున్నవారే ఎక్కువ తృప్తి పడినట్లు తేలింది.   ఈ పరిశోధనలతో రెండు విషయాలు స్పష్టం అయిపోతున్నాయి. ఒకటి- జీవితంలో డబ్బు ఎంత అవసరమో, సమయం అంతే అవసరం. ఈ రెండింటి మధ్యా సమన్వయం లేకపోతే మనసుకి లోటు తోచడం ఖాయం. రెండు- ప్రతి పైసా కూడపెట్టాలన్న తపనకి పోకుండా, అవసరం అయినప్పుడు సేవల కోసం కూడా కాస్త డబ్బుని ఉపయోగించుకోవడం మంచిది. అలా కలిసొచ్చే కాలం మనం వదులుకునే డబ్బుకంటే విలువైనది! - నిర్జర.  
  స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చి పాతికేళ్లు కూడా నిండి ఉండదు. కానీ వచ్చీరాగానే అవి మన జీవితాలని ఆక్రమించేసుకున్నాయి. దానికి తోడు ఇంటర్నెట్ కూడా చవకగా మారిపోవడంతో... చేతిలో ఓ స్మార్ట్ఫోన్ ఉంటే చాలు, ప్రపంచం మనల్ని వెలివేసినా ఫర్వాలేదు అనే ధైర్యం మనది. కానీ అదే స్మార్ట్ ఫోన్ కొంపలు ముంచుతోంది. కంటిజబ్బులు, నిద్రలేమిలాంటి సమస్యలని తెచ్చిపెడుతోంది. అసలు స్మార్ట్ఫోన్ పక్కన ఉంటే మన మెదడు కూడా సరిగా పనిచేయదంటూ ఓ పరిశోధన వెలుగులోకి వచ్చింది. అదేమిటో మీరే చూడండి...   టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు, మన మెదడు మీద స్మార్ట్ఫోన్ పనితీరుని విశ్లేషించాలనుకున్నారు. అందుకోసం వారు ఓ 800 మంది ఫోన్ వాడకందారులను పిలిపించారు. వీరిని ఓ కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి కొన్ని చిన్న చిన్న సమస్యలకు జవాబులను అందించమని చెప్పారు. అప్పటికప్పుడు కాస్త మెదడుని పెడితే... ఎవరైనా సులువుగా జవాబు చెప్పగలిగే ప్రశ్నలే అవన్నీ!   అభ్యర్థుల స్మార్ట్ఫోన్ పక్కగదిలో ఉండటమో, టేబుల్ మీదే ఉండటమో, జేబులోనే ఉండటమో బట్టి వారు జవాబులని ఇచ్చే సామర్థ్యంలో తేడా ఉందేమో గమనించారు. ఈ పరిశీలనలో ఖచ్చితమైన తేడాలు కనిపించాయి. పక్కగదిలో ఫోన్ పెట్టేసినవారు ఇతరులకంటే చక్కగా జవాబులు రాశారట. ఫోన్ అభ్యర్థికి ఎంత దగ్గరగా ఉంటే, సమస్య మీద అతని ఏకాగ్రత అంతగా బలహీనపడినట్లు గ్రహించారు. ఫోన్ సైలెంటులో ఉందా, తిరగేసి ఉందా లాంటి పరిస్థితులతో సంబంధం లేకుండా ఈ ఫలితాలు కనిపించాయి.   ఈ ప్రయోగానికి పొడిగింపుగా మరో సందర్భాన్ని సృష్టించారు పరిశోధకులు. ఈసారి అభ్యర్థులను- ‘ఫోన్తో మీ అనుబంధం ఎలా ఉంటుంది?’ అని ప్రశ్నించారు. కొందరు అభ్యర్థులు ‘అబ్బే మేము ఫోన్ లేకుండా నిమిషం కూడా బతకలేము,’ అని చెప్పారు. మరికొందరు ‘ఫోన్ కేవలం అవసరం కోసమే! అదే మా సర్వస్వం కాదు. దానికి పెద్దగా సమయాన్ని కేటాయించం,’ అని తేల్చారు. వీళ్లందరి మీదా పైన పేర్కొన్ని ప్రయోగాన్నే అమలుచేశారు. ఎవరైతే ఫోన్ లేకుండా గడపలేమని అన్నారో... వారు కంప్యూటర్లో కనిపించిని చిన్నిపాటి సమస్యలకి కూడా జవాబుని అందించలేకపోయారట.   ఏతావాతా తేలిందేమిటంటే, ఫోన్ దగ్గరలో ఉంటే చాలు- ఏదన్నా కాల్ వస్తుందేమో, వాట్సప్ మెసేజి వచ్చిందేమో, చార్జింగ్ ఉదో లేదో, భార్యకి కాల్ చేయాలి కదా, ఆన్లైన్లో డబ్బులు పంపించాలిగా లాంటి సవాలక్ష సందేశాలు మనసుని గిలిపెడుతూ ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా పనిచేసుకోవాలి అని మనసుని బలవంతపెట్టిన కొద్దీ మన ఏకాగ్రత మరింతగా చెదిరిపోతుంది. ఫలితం! మన అవసరం కోసం కనిపెట్టిన స్మార్ట్ఫోన్, జీవితాలను కమ్ముకుని ఉంటోంది. - నిర్జర.          
  ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో సీఎం చంద్రబాబు పోలవరం, సీఆర్డీఏ మీద సమీక్ష నిర్వహించడం, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడాన్ని ఎన్నికల కమిషన్ తప్పుపట్టింది. దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతల మీద నిర్వహించాల్సిన హోం శాఖ సమీక్షను చంద్రబాబు రద్దు చేశారు. పోలింగ్ తర్వాత మళ్లీ పాలనా పరమైన వ్యవహారాలపై దృష్టి పెడతానని చంద్రబాబు తెలిపారు. పోలవరం మీద, రాష్ట్రంలో తాగునీటి అంశం మీద చంద్రబాబు సమీక్ష నిరవహించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించడంపై పలువురు అభ్యంతరం తెలిపారు. తాజాగా ఈసీ కూడా సమీక్షలు, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించరాదని స్పష్టం చేసింది.
  టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఈనెల 22న రాష్ట్ర రాజధాని అమరావతిలో తమ పార్టీకి చెందిన 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 25 మంది ఎంపీ అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. తాజాగా టీడీపీ అభ్యర్థులతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు.. పోలింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు చంద్రబాబుకు ఎన్నికల సంఘం తీరుపై ఫిర్యాదులు చేశారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, ఈసీపై తమ పోరాటం ఆ అవకతవకలపైనే అని స్పష్టం చేశారు. అలాగే అమరావతిలో జరిగే సమావేశానికి పార్టీ అభ్యర్థులందరూ హాజరుకావాలని చంద్రబాబు ప్రత్యేకంగా కోరారు.
  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. ముఖ్యంగా రాఫెల్ డీల్ విషయంలో ప్రధాని మోదీ.. అంబానీకి లబ్ది చేకూరేలా వ్యవహరించారంటూ రాహుల్ పదేపదే చెప్తుంటారు. అయితే ఒకవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ అంబానీపై విమర్శలు చేస్తుంటే.. ఆయన సోదరుడు ముకేశ్ అంబానీ మాత్రం ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి తన మద్దతు తెలిపి ఆశ్చర్యం కలిగిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో దక్షిణ ముంబై నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిలింద్ దేవరా ఒక వీడియోని ట్వీట్ చేశారు. ఈ వీడియోలో చిరు వ్యాపారుల నుంచి పారిశ్రామికవేత్తలు వరకు మిలింద్ దేవరాకు తమ మద్దతు తెలియజేశారు. మిలింద్ దేవరా ట్వీట్ చేసిన వీడియోలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ, కోటక్ మహీంద్ర గ్రూప్ యజమాని ఉదయ్ కోటక్ కూడా తమ మద్దతు తెలియజేశారు. వీడియో ట్వీట్ చేస్తూ మిలింద్ దేవరా దక్షిణ ముంబై అంటే బిజినెస్ అని రాశారు. దాంతో పాటే ప్రజలు నన్ను గెలిపిస్తే యువకులకు ఉద్యోగావకాశాలు తెస్తాను. యువతకు ఉద్యోగాలివ్వడం నా మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ఈ వీడియోలో ముకేష్ అంబానీ మాట్లాడుతూ.. దక్షిణ ముంబైకి మిలింద్ దేవరా సరైన వ్యక్తి అన్నారు. అతను పదేళ్లుగా ఇక్కడి నుంచి ఎంపీగా ఉన్నాడని అంబానీ చెప్పారు. మిలింద్ కు అనేక అంశాలపై మంచి అవగాహన ఉందని నేను నమ్ముతున్నాను.. అతను యువతకు ఉద్యోగావకాశాలు చూపగలడు అని అన్నారు. ముకేష్ అంబానీ, మిలింద్ దేవరా కుటుంబాల మధ్య చాలా కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి. బహుశా ఇదే కారణంగా ముకేష్ అతని ప్రచార వీడియోలో కనిపించి ఉండొచ్చని తెలుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.