కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని... కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోతారంటూ ఎప్పట్నుంచో విపక్షాలు విమర్శలు చేస్తూ వస్తున్నాయి. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు... ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే ఎక్కువగా వినిపించింది. ప్రధాని మోడీ సైతం... కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారంటూ ఆరోపణలు చేశారు. విపక్షాల ఆరోపణలు ఎలాగున్నా, తొందర్లోనే కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే మాట టీఆర్ఎస్ వర్గాల్లోనూ వినిపించింది. అయితే, రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే కేటీఆర్ కు ప్రభుత్వ పగ్గాలు అప్పగిస్తే పార్టీలో తిరుగుబాటు రావొచ్చనే భయంతో కేసీఆర్ వెనకడుగు వేశారని చెబుతారు. అందుకే ముందుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టి టీఆర్ఎస్ నాయకగణమంతా కేటీఆర్ చుట్టూ తిరిగేలా చేశారని అంటారు. ఒకవిధంగా చెప్పాలంటే, అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ చక్రం తిప్పేది కేటీఆరే. టికెట్ల దగ్గర్నుంచి... మంత్రి పదవుల వరకు... అన్నింటిలోనూ కేటీఆర్ మార్క్ కనబడుతుంది. అయితే, కేటీఆర్ త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతున్నారనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది. కేసీఆర్ వారసుడుగా కేటీఆర్ ప్రభుత్వ పగ్గాలు చేపడతారనే మాట వినిపిస్తోంది. కేసీఆర్ కూడా తన పదవికి తనయుడు కేటీఆర్ కు కట్టబెట్టాలని సీరియస్  గా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ములాయం-అఖిలేష్ మాదిరిగా... పార్టీకి గౌరవాధ్యక్షుడిగా, ప్రభుత్వానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ... జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ మెల్లగా సిద్ధమవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొన్నటి ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దల నుంచి కేసీఆర్ కు ఊహించని కామెంట్స్ ఎదురైనట్లు తెలుస్తోంది. ఇక, మీ అబ్బాయిని ముఖ్యమంత్రిని చేసి, మీరు గౌరవంగా తప్పుకోండంటూ అమిత్ షా వ్యాఖ్యానించినట్లు తెలంగాణ బీజేపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. కేంద్ర నాయకత్వం కేసీఆర్ ను టార్గెట్ చేసిందని, దాంతో ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకోక తప్పదనే మాటలు వినిపిస్తున్నాయి. అందుకే కేసీఆర్ సన్నిహితులైన పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం పరిస్థితులు గందరగోళంగా ఉండటంతో... అన్నీ చక్కబడగానే... పార్టీలో ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా, యువరాజు పట్టాభిషేకం జరగడం ఖాయమని అంటున్నారు.  
ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మరిన్ని హామీల అమలు దిశగా తీర్మానాలు చేసింది. ముఖ్యంగా సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి... మరిన్ని కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికుల కోసం వైఎస్సార్ చేనేత నేస్తం పేరుతో కొత్త పథకం అమలుకు నిర్ణయం తీసుకున్నారు. మగ్గంపై ఆధారపడి జీవిస్తోన్న ప్రతీ చేనేత కుటుంబానికి ఏటా 24వేల రూపాయల ఆర్ధికసాయం అందించాలని నిర్ణయించారు. డిసెంబర్ 21నుంచి వైఎస్సార్ చేనేత నేస్తం పథకాన్ని అమలు చేయనున్నారు. అలాగే, వేట నిషేధం కాలంలో మత్స్యకారులకు 10వేలు చొప్పున ఆర్ధికసాయం చేయాలని కేబినెట్‌ తీర్మానించింది. అదేవిధంగా మత్స్యకారుల బోట్లకు లీటర్ డీజిల్‌పై 9 రూపాయల సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇక, మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనాన్ని 3వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ఏపీ మంత్రివర్గం... హోంగార్డుల రోజువారీ వేతనాన్ని 710 రూపాయలకు పెంచింది. దాంతో హోంగార్డుల నెల వేతనం 18వేల నుంచి 21వేల 300కి చేరనుంది. అదేవిధంగా బార్ అసోసియేషన్స్‌లో సభ్యత్వమున్న న్యాయవాదులకు నెలకు 5వేల రూపాయల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం జీఏడీ ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. అలాగే, వెయ్యి కోట్ల రూపాయలతో కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇక, జిల్లాల వారీగా వాటర్ గ్రిడ్స్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మంత్రివర్గం... మద్యంపై అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కిడ్నీ రోగుల కోసం ఏర్పాటు చేసిన పలాస ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నియామకానికి కేబినెట్ అనుమతి తెలిపింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులను గుర్తించి... ప్రభుత్వమే హామీగా ఉండి... రవాణా వాహనాలు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న డిస్కములకు ఊరటనిచ్చేందుకు... 4వేల 471కోట్ల రూపాయల విలువైన బాండ్లను విడుదల చేసేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
  న్యాయం చెయ్యాల్సిన నేతలే తమ ఉపాధిని కోల్పోయేలా చేయడంపై కార్మికులు మండిపడుతున్నారు. వివరాళ్లోకి వెళ్తే వరంగల్, ఖమ్మం ప్రధాన రహదారిగా మారిన హన్మకొండ హంటర్ రోడ్ లో గజం నలభై వేల రూపాయల పై మాటనే పలుకుతుంది. పాతికేళ్లుగా అక్కడ ఆర్టీసీ టైర్ రీట్రేడింగ్ సెంటర్ ఉండేది. దాదాపు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సెంటర్ లో నూట యాభై మందికి పైగా కార్మికులు పని చేసేవారు. ఆ సెంటర్ ను ఇప్పుడు మూసేసి  కార్మికులను పంపేశారు. ఇపుడు ఈ స్థలం అధికార పార్టీ ఎంపీ పసునూరి దయాకర్ సొంతచేసుకున్నారు. హన్మకొండ హంటర్ రోడ్ లో ఉండే ఆర్టీసీ టైర్ రీట్రేడింగ్ సెంట్రర్ స్థలానికి టెండర్ పెట్టి సింగిల్ బిడ్ దాఖలు చేసి ఎంపీ పసునూరి దయాకర్ దాన్ని ముప్పై మూడేళ్ళ లీజుకు దక్కించుకున్నారు. కుక్కను చంపాలంటే ముందుగా దాన్ని పిచ్చికుక్కగా ప్రచారం చేయాలన్న రాజకీయ సూత్రాన్ని అమలు చేసి ఆర్టీసీ ఆస్తులను చెరబట్టారు.  హన్మకొండ హంటర్ రోడ్ లో దాదాపు ఇరవై ఐదేళ్ల కిందట టైర్ రీట్రేడింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇది నగరానికి దూరంగా ఉండేది. అరిగిపోయిన టైర్లను తిరిగి ఉపయోగించుకునేందుకు అనుగుణంగా ఇక్కడ రీట్రేడింగ్ చేసేవారు. పరిసర ప్రాంతాలకు చెందిన ఆరు జిల్లాల్లో ఉన్న బస్సులకు చెందిన టైర్లను రిట్రేడింగ్ చేసేవారు. కాలక్రమంలో అనేక వ్యాపార సముదాయాలు ఈ ప్రాంతంలో ఏర్పాటయ్యాయి. అత్యంత ఖరీదైన ప్రాంతంగా కూడా పేరు తెచ్చుకుంది. భూముల ధరలు రానురాను ఆకాశాన్నంటాయి.ఇక్కడ ఎకరం విలువ పంతొమ్మిది కోట్ల రూపాయల పై మాటే, అంటే నాలుగు ఎకరాలు కలిపి డెబ్బై ఆరు కోట్ల రూపాయలు అన్నమాట. దాంతో ఈ భూమిపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఫలితంగా అద్భుతంగా పని చేస్తున్న దశలోనే టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను మూసేందుకు ఆర్టీసీ అధికారులు కుట్ర పన్నారు. ఇందుకు అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఈ సెంటర్ తో ఎటువంటి ఉపయోగం లేదని దీని కారణంగా ఆర్టీసీకి అపారమైన నష్టం వస్తోందని తొలుత అధికారులు ప్రచారం చేశారు. టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను మూసేశారు. ఆ తర్వాత ఈ భూములను తెగనమ్మడం తప్ప మరో మార్గం లేదని ప్రచారంలో పెట్టారు. ఇక్కడ పని చేసే కార్మికులను దశల వారీగా ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఆ తర్వాత అనూహ్యంగా అధికార పార్టీకి చెందిన ఎంపి పసునూరి దయాకర్ తెరమీదకొచ్చారు. ఈ స్థలాన్ని లీజుకు ఇచ్చేందుకు ఆర్టీసీ అధికారులు టెండర్ లు పిలిచారు. సింగిల్ బిడ్ తోనే ఏకంగా ముప్పై మూడేళ్లకు ఎంపీ దయాకర్ లీజుకు తీసుకున్నారు. మొత్తం నాలుగు ఎకరాలకు నెలకు అయిదు లక్షల రూపాయల చొప్పున ఏడాదికి అరవై లక్షల రూపాయల అద్దె ఇచ్చేలా ఈ ఏడాది జనవరిలో ఒప్పందం చేసుకున్నారు. భారీ వ్యాపార సముదాయాలు మల్టీప్లెక్స్ థియేటర్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రీట్రేడింగ్ సెంటర్ లో భవనం ఇతర యంత్రాలు ఉన్నాయి కదా ఆ భవనాన్ని కూల్చివేసి ఆ స్థలాన్ని శుభ్రం చేసేందుకు కూడా ఇటీవల టెండర్ పిలిచారు. ఈ టెండర్ కూడా పదిహేను లక్షల రూపాయలకు పసునూరి దయాకర్ దక్కటం విశేషం. టైర్ రీట్రేడింగ్ సెంటర్ ఇప్పుడు భారీ వ్యాపార సముదాయంగా మారబోతోంది. ఏకంగా మూడు మల్టీప్లెక్స్ థియేటర్ లు షాపింగ్ మాల్స్ నిర్మించేందుకు ప్రయత్నంలో ఉన్నారు.టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను తరలించవద్దని దాన్ని ఆధునీకరించి మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కార్మికులు ఉద్యమ బాట పట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతి నిధుల చుట్టూ తిరిగి టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను కాపాడాలని వేడుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల క్రియాశీల పాత్ర గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తమకు జరిగే న్యాయం ఇదేనా అంటూ ప్రశ్నించారు. రీట్రేడింగ్ సెంటర్ ను తరలించవద్దు అంటూ రోజుల తరబడి ధర్నాలు చేశారు. అగ్రిమెంట్ ల స్థాయిలో ఉండగానే రీట్రేడింగ్ సెంటర్ కనుమరుగవుతుందని అంటూ ఉద్యమం చేపట్టారు. ఏకశిలా పార్కు ఎదురుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఇతర రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు వారికి సంఘీభావం ప్రకటించాయి. అయినా పట్టించుకున్న నాథుడే లేడు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ వ్యవహారమంతా గుట్టు చప్పుడు కాకుండా జరిగి పోయింది. కానీ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. అయితే భూదందాలు కబ్జాల నేపథ్యం లేని ఎంపీ దయాకర్ ఈ టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను దక్కించుకున్నాడంటే కార్మికులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వెనుక ఎవరో ఉన్నారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన తర్వాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంది సారూ మాకు అండగా నిలవాల్సింది పోయి అన్యాయం చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. టైర్ రీట్రేడింగ్ సెంటర్ మూసివేత వెనుక రాజకీయ నాయకులు ఉన్నారంటూ తమకు తమ ఉపాధి కోల్పోనివ్వకుండా తమకు తగిన న్యాయం చేయ్యాలంటూ కార్మికులు ఆందోళన చేపట్టారు.
  పట్టు వీడని జేఏసీ మెట్టు దిగని సర్కార్ తెలంగాణా ఆర్టీసీ సమ్మె కేంద్రంగా కనిపిస్తుంది. కానీ, ఒకవేళ ఆర్టీసీ కార్మికులు కాస్త మెత్తబడి చర్చలకొస్తే సర్కార్ సానుభూతి చూపించే అవకాశం ఉందా, ఉద్యోగాలు లేవని ప్రకటించిన సీఎం కేసీఆర్ కరుణిస్తారా, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మరో మహదావకాశం ఉన్నట్టే కనిపిస్తోంది. టి.ఆర్.ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. దాంట్లో ఆయన రాసిన అంశం కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయని, సూసైడ్ ఏ సమస్యకూ పరిష్కారం కాదు అని తెలిపారు. నలభై నాలుగు శాతం ఫిట్ మెంట్ పదహారు శాతం ఐఆర్ ఇచ్చి ఆర్టీసీ గొప్పగా ఆదుకున్న ఘనత టి.ఆర్.ఎస్ ప్రభుత్వానిదే అని ఆయన లేఖ ద్వారా ఆయన గుర్తు చేశారు. రెండు వేల పధ్ధెనిమిది ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీలో తాను ఉన్నా అని, ఎక్కడా కూడా అర్టీసి సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పలేదు అని అలా చేయడమంటే పాలసీని మార్చుకోవడమే అన్నారు. ఇదంతా సాదాసీదా కామెంట్స్ అయినా కానీ పరిస్థితి చేజారిపోకముందే కార్మికులు సమ్మె విరమించాలి అని కూడా రాశారు. కార్మికులు ముందుకొస్తే పరిస్థితి అదుపు లోకి వచ్చినట్టే అని తెలుస్తుంది. అద్దె బస్సులు ప్రైవేట్ స్టేజ్ క్యారియర్ పై సీఎం తీసుకున్న నిర్ణయం సమ్మె నేపథ్యంలోనే అని గుర్తించాలని చెప్పారు కేకే. అయితే అర్టీసి కార్మికుల సమ్మె తీవ్ర తరం అవడంతో ప్రభుత్వం దీనిని ఆపాలనే ఉద్దేశంతో కెకెతో అధికారికంగా కాకపోయినా ఆర్టీసి సంఘాలతో సంప్రదింపులు జరిపి సమ్మెను విరమించేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు టీఎన్జీవోలు కూడా తాము ఆర్టీసి తరపున ప్రభుత్వంతో చర్చలు జరపటానికి సిధ్ధంగా ఉన్నామని ముందుకొచ్చారు. వారు ముందే సీఎం కె.సి.ఆర్ ను సంప్రదించామని అన్నారు. దీంతో ప్రభుత్వం ఒక మెట్టు దిగటానికి సిధ్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.
  కాళేశ్వరం బహుళార్ధక ఎత్తిపోతల ప్రాజెక్టు... లక్ష కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు... టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్... అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహా ప్రాజెక్టు... ఇప్పటికే దాదాపు లక్ష కోట్లు ఖర్చు చేశారు... ఇంకా వేల కోట్ల రూపాయల పని మిగిలే ఉంది. అయితే, ప్రాజెక్టును మాత్రం ప్రారంభించేశారు. అయితే, లక్షల కోట్ల ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పటివరకు అదనంగా ఒక్క చుక్క నీరు కూడా తెలంగాణ బీడు భూములను పారింది లేదు. ప్రాజెక్టు ట్రయల్ రన్స్ మినహా తెలంగాణ రైతాంగానికి ఇప్పటివరకు ఒరిగిందేమీ లేదు. కానీ ప్రాజెక్టు కట్టిన కాంట్రాక్టరును మాత్రం అపర కుబేరుడిని చేసింది.  ఈ ఒకే ఒక్క ప్రాజెక్టుతో మేఘా కంపెనీ తలరాతే మారిపోయింది. అవును... కాళేశ్వరం ప్రాజెక్టు... మేఘా కంపెనీకి కాసుల పంట పండించింది. కాళేశ్వరంతో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేస్తామన్న కేసీఆర్....  తెలంగాణను బంగారంగా మార్చారో లేదో తెలియదు కానీ... మేఘా కంపెనీ తలరాతను మాత్రం బంగారంగా మార్చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిన తర్వాత మేఘా కంపెనీ దేశంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో అమాంతం దూసుకొచ్చింది. ఫోర్బ్స్ జాబితాలో మొన్నటివరకు 47వ స్థానంలో ఉన్న మేఘా కంపెనీ యజమానులు... కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత ఏకంగా 8 స్థానాలు ఎగబాకి 39వ ప్లేస్ కి చేరుకున్నారు. అయితే, మేఘా కంపెనీ ఒక్కసారిగా పుంజుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టే కారణమని ఫోర్బ్స్ విశ్లేషించింది. కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిన తర్వాతే మేఘా నెట్ ప్రాఫిట్ 3వేల కోట్లు దాటిందని, అలాగే రెవెన్యూ 23శాతం వృద్ధి చెందిందని, దాంతో మేఘా ఫ్యామిలీ ఆస్తుల విలువ 6శాతం పెరిగాయని ఫోర్బ్స్ విశ్లేషించింది. ఇక, మేఘా కంపెనీ అంటే టక్కున గుర్తొచ్చేది మేఘా కృష్ణారెడ్డే. మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఎండీగా ఉన్న కృష్ణారెడ్డిపై పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే మేఘా కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు కలిసి దాదాపు 40వేల కోట్ల రూపాయలు పంచుకుని తిన్నారని ఆరోపిస్తున్నాయి. ఇరిగేషన్ నిపుణుల సైతం ప్రాజెక్టు వ్యయంలో 30శాతంపైగా అవినీతి జరిగిందని విమర్శిస్తున్నారు. దోపిడీ కోసమే రీడిజైనింగ్ పేరుతో మేఘా కంపెనీకి లక్షల కోట్ల రూపాయల విలువైన కాళేశ్వరం ప్రాజెక్టును కట్టబెట్టారంటూ మొదట్నుంచీ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తూనే ఉన్నాయి. ఫోర్బ్స్ జాబితా చూస్తుంటే అది నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ ప్రాజెక్టు చేపట్టిన తర్వాతే మేఘా కంపెనీ విలువ అమాంతం పెరిగింది. దేశ అత్యంత ధనవంతుల జాబితాలో మేఘా ఫ్యామిలీ ఏకంగా 39వ స్థానానికి ఎగబాకింది. ఇక, ఫోర్బ్స్ లిస్ట్ తర్వాతే మేఘా కంపెనీపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. దాంతో కాళేశ్వరంలో తిన్న సొమ్మంతా కక్కించాలని మేఘా వ్యతిరేక వర్గం కోరుకుంటోంది. మేఘా కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల బాగోతం బయటపడాల్సిందేనని విపక్షాలూ ఆశిస్తున్నాయి. అయితే, ఒకే ఒక్క కాళేశ్వరంతో మేఘా కంపెనీ ఫోర్బ్స్ జాబితా టాప్ 40కి వచ్చేస్తే, ఇక ఏపీ, తెలంగాణలో దక్కించుకుంటున్న, దక్కించుకోబోతున్న ప్రాజెక్టులతో వచ్చే ఏడాడే టాప్ టెన్ లోకి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు.
  ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు సెటిల్ మెంట్ మొదలు పెడుతున్నారు అని అందరికి చేరువవుతున్న విషయం. ఏ వ్యాపారమైనా సరే కప్పం కట్టాల్సిందే నని హుకుం జారీ చేశారని, వారిని బెదిరింపులతో దారిలోకి తెచ్చు కుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వ్యాపారాలూ కాంట్రాక్టులు ఇసుక ఇతరాత్ర లావాదేవీల సాధారణంగా అధికార పార్టీ ఎమ్మెల్యే లకు ఇవే ఆర్ధిక వనరులు. కానీ కొందరు ఎమ్మెల్యే లు మరీ చెలరేగిపోతున్నారు. నాలుగు నెలల్లోనే నియోజక వర్గ ప్రజలు అమ్మో అని బెదిరిపోయేలా చేస్తున్నారు. చిన్నా చితక పోస్టుల విక్రయం నుంచి కోట్ల విలువ చేసే భూముల సెంటిమెంట్ల దాక అన్ని దారులల్లో చెలరేగిపోతున్నారు. మరికొందరేమో విగ్రహావిష్కరణ నుంచి పోస్టింగ్ ల దాకా ఏదైనా తమ కనుసన్నలలోనే జరగాలి అంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఆయా ఎమ్మెల్యేల తీరు తీవ్ర చర్చ నీయాంశంగా మారింది.  పశ్చిమ గోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్యే బ్రాందీ షాపులో పని చేసే ఉద్యోగాలను కూడా అమ్ము కున్నట్టు సమాచారం. ఒక్కో ఉద్యోగానికి లక్ష రూపాయల చొప్పున వసూలు చేసినట్టు తెలుస్తోంది. విద్యుత్ శాఖలో వుండే కొన్ని పోస్టులు ఆరు లక్షల రూపాయలకు భారం పెట్టేశారు. ఇదే కాదు ఏ చిన్నపోస్టు ఉన్న ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఇంకో విచిత్రమైన విషయమేమిటంటే తాము చెప్పిన మొత్తం ఇస్తామని ఒప్పుకున్న వారిని పిలిపించుకుని అందరి సెల్ ఫోన్ లు బయటపెట్టించి వ్యవహారం సెటిల్ చేశారు.  గుంటూరు జిల్లాలో కూడా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే లు బ్రాందిషాపుల్లో పోస్టులతో సహా చిన్న చిన్న వాటిని కూడా వదలకుండా విక్రయించుకొంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక్కడ పోస్ట్ యాభై వేలకు అమ్మినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల ముఖ్య అనుచరులు ఈ పనిని చక్కదిద్దేశారు అని సమాచారం. గుంటూరు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే బిజినెస్ మెన్ తరహా రాజకీయం చేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ఉన్న ఏ వ్యాపార వర్గమైన తనతో మాట్లాడి సెటిల్ చేసుకోవాల్సిందేనన్న షరతు పెట్టారు. గ్రానైట్ క్వారీల నుంచి నియోజకవర్గస్థాయి సంతల వరకు ప్రతి వ్యాపార వర్గాన్ని పిలిచి నెలకు ఇంత అని మాట్లాడుకున్నట్లు తెలిసింది. సదరు ఎమ్మెల్యే తీరు పట్ల సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు.  గుంటూరు జిల్లా కు చెందిన ఒక ఎమ్మెల్యే విగ్రహాల పైన కూడా ప్రతాపం చూపిస్తున్నారు. తమ గ్రామం లో ఫలానా నాయకుడు విగ్రహం పలానా కూడలి లో పెడుతున్నారట కదా పెట్టేందుకు వీల్లేదు అంటూ విగ్రహ ఆవిష్కరణ కోసం కట్టిన దిమ్మెను కూడా కూల్చి వేయించినట్టు తెలిసింది. ఈ ఒత్తిడిని తట్టుకోలేక నిర్వాహకులు ఒక ప్రైవేటు స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయినా ఆ ఎమ్మెల్యే వదల్లేదు. ఆ ప్రైవేటు స్థలం యజమాని ఎవరో తెలుసుకొని ఆయన కు ఫోన్ చేసి విగ్రహం పెట్టేందుకు అనుమతించనందుకు మీ సంగతి చూస్తాను అంటూ బెదిరించినట్లు తెలిసింది.  అనంతపురం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు సెటిల్ మెంట్ ల వ్యవహారం మొదలుపెట్టినట్లు సమాచారం. ఒక ఎమ్మెల్యే ఎక్కడైనా భూ వివాదం ఉంటే అది చక్కబెట్టేస్తాను అంటూ దిగుతారు, లేకుంటే వారే తన దగ్గర కు వివాద పరిష్కారం కోసం వచ్చేలా చేస్తారు. ఇక అక్కడ కు వెళ్లాక ముందు గా ఆ స్థలం లో తనకు కొంత రాసివ్వాలి అంటూ అడుగుతున్నారని సమాచారం. ఇలా ఇప్పటికే కొన్ని స్థలా లు తమ వారి పేరు మీద రాయించుకొని ఆ తర్వాత వివాదాల సెటిల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన తన నియోజక వర్గం దాటి అనంతపురం లో కూడా ఈ మేరకు సెటిల్ మెంట్ లు చేస్తున్నారని తప్పని సరి పరిస్థితుల్లో భయంతో అతన్ని మాట వినాల్సి వస్తుంద ని కొందరు వాపోతున్నారు.  ఇదే జిల్లాలో మరో ఎమ్మెల్యే దెబ్బ కు ఇద్దరు వ్యాపారులు విపరీతమైన భయాందోళనకు గురయ్యారు అని అంటున్నారు. తన నియోజకవర్గంలో ఉన్న ఒక లాడ్జి యజమానిని పిలిచిన ఎమ్మెల్యే భారీ మొత్తం లో డబ్బు డిమాండ్ చేశారని తెలిసింది. అంత మొత్తమా అంటూ ఆ వ్యాపారి భయాందోళనకు గురయ్యారు. ఆ తరువాత కొన్ని రోజులకు సదరు వ్యాపారి చనిపోవడం వెనుక ఈ బెదిరింపు ప్రభావం కూడా ఉన్నట్టు స్థానికంగా చెప్పుకుంటున్నారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని కూడా ఇదే విధంగా బెదిరించినట్టు తెలిసింది. అతను వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్ కు అవసరమైన అనుమతులు ఇవ్వాలంటే తనకు ఇంత ఇవ్వాల్సిందే నని హుకుం జారీ చేశారు. పార్టీ కార్యక్రమాలకు విరాళా లు ఇస్తామని ఇలా వెంచర్ వేసినందుకు భారీ మొత్తంలో డబ్బు లు ఇవ్వలేమని చెప్పినా వినకుండా బెదిరింపులకు గురి చేశారని సమాచారం. ఈ ఎమ్మెల్యేల తీరు పై వారి నియోజకవర్గాలతో పాటు పార్టీ లోనూ చర్చ  కొనసాగుతోంది. మరి సీఎం జగన్ ఇప్పటికైనా జాగ్రత్త పడతారా లేదా అనేది వేచి చూడాలి.  
రాజకీయ ప్రభంజనం అనుకున్న జనసేనకు సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత నిశబ్దంగా ఉంది. ఆ పార్టీకి కీలకంగా భావించిన విశాఖపట్నం జిల్లాలో నాయకులు క్యాడర్ అత్మస్థైర్యం రోజురోజుకు తగ్గిపోతుంది. ప్రశ్నించటమె లక్ష్యంగా ఎగసిన యువశక్తి స్తబ్దతగా మారిపోయింది. భవిష్యత్ పై క్లారిటీ లేకపోవడం, అధినాయకుడి అంతరంగం అర్థం కాకపోవడంతో నాయకత్వంలో అయోమయం నెలకొంది. రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం ఏర్పడినపుడు త్రిముఖ పోటీ జరిగింది. ప్రధాన ప్రతిపక్షం టిడిపి బలహీనంగా ఉండటం, సామాజిక బలం, గట్టి పట్టు కలిగిన అభ్యర్ధులు బరిలో నిలవడంతో జిల్లాలో పీఆర్పీ నాల్గు స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. రెండు వేల పంతొమ్మిది నాటికి జనసేన పిఆర్పిని మించిన అంచనాలతో ఓటర్ల ముందుకొచ్చింది. ప్రయోగాలు కొలిక్ కి రాకుండానే ఎన్నికల బరిలో దిగి పొయింది. స్వయంగా జనసేన చీఫ్ గాజువాక నుంచి పోటీ చేశారు. సీబీఐ మాజీ అధికారి వివి లక్ష్మీ నారాయణ, ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట రామయ్య వంటి వారు జనసేన తరపున రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. అభ్యర్ధుల ఎంపిక నుంచి ఎలక్షన్ నిర్వహణ వరకు జనసేన స్వీయ తప్పిదాలు ఒకటీ రెండు కాదు ఇంతటి ప్రతికూల పరిస్థితులలోనూ ఆ పార్టీ పలు స్థానాల్లో గౌరవప్రదమైన ఓట్లను కైవసం చేసుకుంది. యలమంచిలిలో టిడిపి, విశాఖ సౌత్ జోన్ నియోజకవర్గంలో వైసీపీ ఓటమికి, విశాఖ ఉత్తరంలో మాజీ మంత్రి గంటా మెజార్టీ తగ్గటానికి జనసేనకు పోలైన ఓట్లే కారణం. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తొలిసారే జనసేన తరపున విశాఖ ఎంపిగా పోటి చేశారు మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీ నారాయణ. ఈ ఎన్నికలలో జనసేనా ఇరవై మూడు పాయింట్ మూడు సున్నా శాతం ఓట్లు దక్కించుకుంది. గాజువాక అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్ కు పరిమితమయ్యారు. వ్యక్తిగత ప్రతిష్ట, పార్టీ ఇమేజ్, కమ్యునిటి ఫ్యాక్టర్, టిడిపిలో అంతర్గత రాజకీయాలు వంటి ఎన్నో ఎన్నెన్నో అంశాలు అనుకూలించినా విజయం సాధించలేకపోయారు. ఆ క్రమంలో ఎన్నికలు సమీపించే నాటికి పార్టీలు పరిస్థితులూ అంతుపట్టకుండా అయిపోగా ఇపుడు పరిస్థితి మరి గందరగోళంగా తయారైంది. అధినాయకుడితో జిల్లా నాయకులకు సంబంధాలు దాదాపు తెగిపోయాయి. సీనియర్లకు సైతం సముచిత స్థానం, భవిష్యత్ పై భరోసా లభించని పరిస్థితి. ఈ తరుణంలో రాజకీయ మనుగడ సాగించాలంటే ఏదో ఒక మార్గం వెతుక్కోక తప్పదు అనే అభిప్రాయం నాయకులలో వ్యక్తమవుతోంది. జనం ఆదరణ పొందినప్పటికీ పార్టీ కార్యాచరణ తమ భవిష్యత్ అర్థంకాకపో నాయకులు నలిగిపోతున్నారు. రాజకీయంగా సంధికాలం గడుపుతున్నవారు, తమ భవిష్యత్తును ఇతర పార్టీలో వెతుక్కునేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల తర్వాత వివి లక్ష్మీ నారాయణ సామాజిక సేవకు పరిమితమయ్యారు. జెడి ఫౌండేషన్ తో తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పార్టీలోనే కొనసాగుతున్నప్పటికీ ఆ జెండా కింద ఎటువంటి యాక్టివిటీ చేయటంలేదు. అనకాపల్లి నుంచి పోటీ చేసి రచయితల పార్థసారథి బీజేపీలో చేరి పోయారు. కేంద్ర కార్యాలయ వ్యవహారాలలో కీలకమైన పార్థసారథి పార్టీకి రాజీనామా చేసి జిల్లా స్థాయిలో పార్టీని వీడిన తొలి నాయకుడయ్యారు. పార్థసారథి ఒక్కరే కాదు, సమీప భవిష్యత్తులో మరికొంతమంది జనసేనకు గుడ్ బై కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి బాలరాజుతో వైసిపి సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య డోలాయమానంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో వైసిపికి స్థానిక సంస్థల ఎన్నికల పెద్ద సవాల్. విశాఖ నగర పాలక సంస్థ జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించడం ప్రతిష్ఠాత్మకం ఈ నేపధ్యంలో సీనియర్ అవసరం కావాలి అంటున్నారు అధికార పార్టీకి చెందిన నేతలు. ఇప్పటికే టిడిపిని కాలిచేయడం పనిగా భారీగా వలసలు స్వాగతిస్తుంది వైసిపి. ఈ తరుణంలో జనసెనలో మిగిలిన నేతలతో ఎలా డీల్ చేస్తుందో చూడాలి ఇక.
మొన్నటి వరకు సంచలనం సృష్టించిన విషయం కరకట్ట నిర్మాణాల తొలగింపు చర్యలు .కృష్ణా కరకట్ట నిర్మాణాల తొలగింపు విషయంలో ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో కొత్త చర్చ జరుగుతోంది. కరకట్ట మీద చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ సహా వివిధ నిర్మాణాలకు గెస్ట్ హౌస్ లకు సీఆర్డీయే నోటీసులిచ్చింది. అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేశారని, వాటిని స్వచ్ఛంధంగా తొలగించాలని లేకుంటే తామే కూల్చివేతకు దిగాల్సి వస్తుందంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఆ మేరకు డెడ్ లైన్ లతో గోడలకు నోటిస్ లను అంటించి హడావుడి చేసింది. ఓ నిర్మాణంలో నది లోపలికి చొచ్చుకుని వెళ్లి నిర్మించిన ర్యాంపును కూడా సీఆర్డీయే అధికారులు తొలగించారు. దాంతో చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ సహా మిగిలిన అక్రమ నిర్మాణాలను కూడా తొలగించేస్తారనే చర్చ జోరుగా సాగింది. ప్రభుత్వం సీఆర్డీఏ అధికారులు కూడా అదే ఊపులో ఉన్నట్టు కనిపించారు. అయితే తనను వేధిస్తున్నారని తన గెస్ట్ హౌస్ నిర్మాణం అంతా పద్ధతి గానే జరిగిందని అన్ని నిబంధనలు ఉన్నాయంటు లింగమనేని రమేష్ కోర్టుకెక్కారు. ఇది కొన్ని రోజుల క్రితం జరిగిన పరిణామం అయితే రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న పరిస్థితులను  ఏపీలో కరకట్ట కట్టడాల విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రెండు రోజుల క్రితం బీజేపీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు నేతలు చేరారు. వీరిలో చెప్పుకోదగ్గ ముఖ్యులు ఉన్న వారి సంఖ్య తక్కువే అయినా ఇటీవల కాలంలో బీజేపీలో చేరిన వారి మీద శ్రద్ధ కొద్దిగా ఎక్కువ గానే వచ్చిందని చెప్పాలి. దానికి కారణం లేకపోలేదు. తెలంగాణ టిడిపి సీనియర్ నేత దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ తెలుగుదేశాన్ని వీడి బీజేపీలో చేరారు. అలాగే ఏపీ నుంచి శనక్కాయల అరుణ కూడా పార్టీలో చేరారు. శనక్కాయల అరుణ కొంతకాలంగా టిడిపిలో యాక్టివ్ గా లేకున్నా సెడన్ గా బీజేపీలో చేరి మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చే ప్రయత్నం చేశారు. వారితో పాటే ఇంకొంతమంది కూడా చేరి పోయారు. సందట్లో సడేమియా అన్నట్టుగా కరకట్టు మీదున్న నివాసాలకు చెందిన ఇద్దరు పెద్దలు బీజేపీలో చేరి పోయారు. పాతూరి నాగభూషణం అలాగే ఎస్ఆర్ఐ రామినేని బీజేపీ తీర్థం పుచ్చుకున్న బరిలో ఉన్నారు. ఇపుడిదే ఏపీ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. కరకట్ట విఐపిలకు బిజెపి షెల్టర్ జోన్ గా మారినా, తమ నిర్మాణాలు కాపాడుకునేందుకు కర్కట్ట విఐపిలూ బిజెపిని ఆశ్రయిస్తున్నారు అనే చర్చ జరుగుతోంది. కరకట్టపై ఉన్న నివాసాలులో మాజీ ఎంపి బిజెపి సీనియర్ నేత గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ ఉంది. ప్రస్తుతం ఈ భవన నిర్మాణం కూడా అక్రమమేనని సీఆర్డీయే బాధిస్తోంది. దీనికి సంబంధించిన చర్చ ఓవైౖపు జరుగుతూనే ఉండగా మరో ఇద్దరు కరకట్ట విఐపిలూ బీజేపీ పంచన చేరడం హాట్ టాపిగ్గా మారింది. దీంతో సదరు కరకట్ట పెద్దలు తమ తమ నిర్మాణాలను కాపాడుకునేందుకే బీజేపీలో చేరారు అనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. మొన్నటి వరకూ కరకట్టపై సింగిల్ స్థానానికి పరిమితమైన బిజెపి వీఐపీల సంఖ్య ఇప్పుడు మూడుకు చేరడం పై ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఆ క్రమంలో వీరి నిర్మాణాల విషయంలో కానీ, మిగిలిన కరకట్ట నిర్మాణాల విషయంలో కానీ సర్కార్ వైఖరి ఏ విధంగా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది. కరకట్ట నిర్మాణ విషయంలో మొన్నటి వరకు చూపిన దూకుడు ఇక పై కూడా చూపుతారా లేక ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ సైలెంట్ అయిపోతారా అనేది ఆసక్తిగా మారింది. బీజేపీ విధానాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరడం లేదు. కనీసం రాజకీయ పరమైన అవసరాల వల్ల కూడా కాకుండా ఇలా తమ ఆస్తులను కాపాడుకోవడానికి కమలం బాట పట్టడం చూసి ఆ సొంత పార్టీ నేతలకు ఎనలేని కోపంతో మండిపడుతున్నారు.
  పూర్వం బలమున్నవాడిదే రాజ్యం అన్న మాట మనం విన్నం కానీ ఇప్పుడు రాచరికాలు పోయినా మాటల్లోని విషయాన్ని మాత్రం మనం కళ్లారా చూస్తున్నం. దీనికి ఉదాహరణ ఉమ్మడి ఓరుగల్లు జిల్లాని తీసుకుంటే ఇక్కడ అధికార పార్టీలో నేతల బలపరీక్షలు పెరుగుతున్నాయి. స్థానికంగా గ్రూప్ రాజకీయాలు కొత్త కానప్పటికీ తాజగా ఏర్పడిన వర్గపోరు మోతాదు మించిందని చెప్పాలి. కొందరు నాయకులు రెండు గ్రూపులుగా విడిపోతే మరికొందరు ఈ రెండు గ్రూపులతో సంబంధం లేకుండా ఏకంగా రాష్ట్ర నాయకత్వంతోనే చేరువులో కి వెళ్లారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేతలే ఇప్పుడు టీఆర్ఎస్ లోనూ చక్రం తిప్పుతున్నారు. ఇద్దరూ రాజకీయాల్లో తలపండిన నేతలే కడియం శ్రీహరి గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉంటే, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రస్తుత కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. పైకి ఇద్దరు కలిసున్నట్టే అనిపించినా అంతర్గతంగా మాత్రం ఎవరి వర్గం వారిదే గతంలో కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు కూడా వీరి మధ్య విభేదాలు తారస్థాయిలో కొనసాగేవి ఒక దశలో ఇద్దరు నేతలు నేరుగా ఎదురుపడి తిట్టుకున్న సందర్భాలున్నాయి. అయితే అదంతా గతం ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు టిఆర్ఎస్ లో ఉన్నారు. క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు. గత మంత్రి వర్గ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కడియం శ్రీహరి ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ లో చేరినప్పట్నుంచి వీరిద్దరూ ఒక్కటయ్యారని అంత అనుకున్నారు. కానీ గతంలో వారి మధ్య ఉన్న విబేధాలు అంతర్గతంగా కొనసాగుతూనే ఉన్నాయి. పైకి కనిపించినంతగా వారి మధ్య సఖ్యత లేదని టీఆర్ఎస్ వర్గాలే గుసగుసలాడుతున్నాయి.  మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివిధ హోదాల్లో ఉన్న కీలక నేతలు కూడా రెండు గ్రూపులుగా విడిపోయారు. కొందరు కడియం శ్రీహరి వర్గమైతే, మరికొందరు ఎర్రబెల్లి వర్గం కొనసాగుతున్నారు. ఈ రెండు గ్రూపులతో సంబంధం లేకుండా మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న కొంత మంది నేతలు నేరుగా అధినాయకత్వంతోనే వారు చేరువులో ఉంటున్నారు. అభివృద్ధి పనుల విషయంలో గానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో గాని ఒక నేత పాల్గొంటే ఆయనకు అనుకూలంగా ఉండే ఇతర నేతలే వాటిని ముందుండి నడుపుతున్నారు. ఇటీవల టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ముప్పై రోజుల ప్రణాళిక అమలు కార్యక్రమంలోనూ ఈ గ్రూపు రాజకీయం స్పష్టంగా కనిపించింది. మంత్రి వర్గ విస్తరణ జరిగిన తర్వాత ఈ గ్రూపు విభేధాలు ఇంకాస్త ఎక్కువయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశించిన నేతలు చాలా మంది ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరి, మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వీరంతా మంత్రి పదవి ఆశించిన వారే. సామాజిక సమీకరణాల నేపథ్యంలో కడియం శ్రీహరికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు కానీ చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు గానీ ఆ లిస్ట్ లో నుంచి కడియం శ్రీహరి పేరు మాయమైంది. అయితే కడియంకు మంత్రి పదవి రాక పోవడానికి ఎర్రబెల్లి దయాకర్ రావునే కారణమని కడియం అనుచరులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. మరోవైపు మంత్రి పదవి తప్పకుండా వస్తుందని ఊహించుకున్న దాస్యం వినయ్ భాస్కర్ కు చీఫ్ విప్ పదవితో సరిపెట్టారు. అయితే ఆశించిన వారికి మంత్రి పదవులు దక్కక పోవడంతో ఒకరి పై ఒకరు అనుచరులు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. గత ప్రభుత్వంలో వరంగల్ జిల్లాకు కీలక పదవులు కట్టబెట్టిన కేసీఆర్ ఈ సారి మాత్రం కాస్త మొండి చేయి చూపారని చెప్పాలి. గత మంత్రి వర్గంలో ఉప ముఖ్యమంత్రిగా మొదటి రాజయ్యను తీసుకున్నారు. తర్వాత ఆయన తప్పించి ఆ పదవిని కడియం శ్రీహరికి కట్టబెట్టారు. ములుగు ఎమ్మెల్యేగా ఉన్నందుకు చందూలాల్ కు మంత్రి పదవి ఇచ్చారు. భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఉన్న మధుసూదనాచారికి స్పీకర్ పదవి ఇచ్చారు. ఈ సారి ఓరుగల్లుకే రెండు మంత్రి పదవులు చీఫ్ విప్ పదవి మాత్రమే ఇచ్చారు. మొన్నటి వరకు ఒకే ఒక మంత్రి గా ఎర్రబెల్లి దయాకరావు కొనసాగారు, ఇప్పుడు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కు మంత్రి వర్గంలో అవకాశం కల్పించారు.దాస్యం వినయ్ భాస్కర్ కు చీఫ్ విప్ పదవి ఇచ్చారు. గత ప్రభుత్వంలోనే మంత్రి పదవి ఆశించి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మంత్రి పదవిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయనకంటే ముందే టిడిపి నుంచి టిఆర్ఎస్ లో చేరిన సత్యవతి రాథోడ్ కు కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. దీనిపై రెడ్యా నాయక్ కొంత అలక వహించినట్లు సమాచారం. మంత్రి పదవులు ఆశించిన వారికి అవి దక్కలేదు. అందువల్ల నామినేటెడ్ పోస్టులపై ఇప్పుడు వారి కన్ను పడింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు సీఎంకు దగ్గరగా ఉండే వ్యక్తులతో పైరవీలు చేయించుకునే పనిలో బిజీగా ఉన్నారు. మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతలు నేరుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు టచ్ లో ఉంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల్లో కొందరు కడియం శ్రీహరిని, మరికొందరు ఎర్రబెల్లి దయాకర్ రావుని నమ్ముకొని ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో ఆయన దగ్గరకు ఆశావహులు క్యూ కడుతున్నారు. ఇక ఈ పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. ఒరుగల్లుల్లో ఎవరు చక్రం తిప్పబోతున్నారో చూడాలి.
  అన్నదాతా సుఖీభవ అని అన్నం తిన్న ప్రతీ ఒక్కరు మనస్పూర్తిగా అనే మాట.రెండేళ్లుగా అన్నదాతలకు రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రైతు సంక్షేమ పథకాలకూ క్రమంగా చరమగీతంపాడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న గడువు ప్రకారం రుణం చెల్లించే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పావలా వడ్డీ వడ్డీ లేని రుణం వడ్డీ రాయితీలను పూర్తిగా అటకెక్కించాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల లోపు వ్యవసాయ రుణాలకు రెండు శాతం వడ్డీ రాయితీ ఇస్తుంది. దాంతో ఏడు శాతానికే వ్యవసాయ రుణం లభిస్తుంది. ఆ రుణం గడువులోగా చెల్లిస్తే మరో మూడు శాతం వడ్డినీ రైతులకూ వెనక్కిస్తారు. అంటే నాలుగు శాతం వడ్డీకే రుణం లభిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం లక్ష రూపాయల రుణం వరకూ ఒక శాతం భారం భరించి, మూడు శాతానికే రైతులకు రుణం లభించేట్టు చేసింది. దీన్నే పావలా వడ్డీ రుణం అనేవారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న రోజులలో లక్ష రూపాయల లోపు రుణానికి ఆ పావలా వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. గడువు ప్రకారం రుణం చెల్లించిన రైతులకు వడ్డీ సొమ్మును తిరిగి ఇచ్చేవారు.  రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు రైతు రుణమాఫీ హామీ ఇచ్చిన నేపథ్యంలో స్తోమత ఉన్న రైతులు కూడా బ్యాంకు అప్పులు చెల్లించాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయారు. ఆ తర్వాత ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని నాలుగు దఫాలుగా నాలుగేళ్ల పాటు అమలుచేసింది. ఈనేపధ్యంలో మొత్తం పావలా వడ్డీ లేదా వడ్డీ లేని రుణ పథకం మొత్తం అస్తవ్యస్తమైపోయింది. ఏ రైతూ గడువు లోగా చెల్లించక పోవడంతో ఎవరికి పావలా వడ్డీ లేద వడ్డీ లేని రుణం వర్తించని పరిస్థితి ఏర్పడింది. రుణమాఫీ ద్వారా రైతు పొందిన లబ్దిలో నలభై నుంచి నలభై ఐదు శాతం వరకు గడువు దాటినందుకు అధిక వడ్డీల రూపంలో రైతు చెల్లించాల్సి వచ్చింది. ఆ తరవాత రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి డబ్బులు కేటాయించడమే మానేసింది. మొత్తం మీద ఐదేళ్లుగా ఈ పథకం అటకెక్కింది. కేంద్రం మాత్రం తన వంతు వాటాగా గడువులోగా చెల్లించిన రైతులకూ ఆర్బీఐ ద్వారా మూడు శాతం వడ్డీ రాయితీ కింద బ్యాంకు లకు నగదు జమ చేస్తూ వస్తోంది. పావలా వడ్డీ లేదా వడ్డీ లేని రుణం పథకం కింద రెండు వేల పద్నాలుగు, పదిహేను ఆర్థిక సంవత్సరం నాటి బకాయిలే రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు చెల్లించాల్సి ఉంది. మే ముప్పై ఒకటి న రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయల విడుదలకు జీవో వచ్చింది. కానీ ఆర్థిక శాఖ నయా పైసా విడుదల చేయలేదు.  రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని సర్వరోగ నివారిణిగా భావిస్తుంది. రెండు వేల పధ్ధెనిమిదిలో ఖరీఫ్, రబీ సీజన్లకు ఎకరానికి నాలుగు వేల చొప్పున ఏడాదికి ఎనిమిది వేల రూపాయల పంపిణీ చేసిన ప్రభుత్వం ఈ ఏడాది నుంచి పది వేలకు పెంచింది. ప్రతి సీజన్ కు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున డబ్బు ఇచ్చినప్పుడు ఇతర పథకాల అవసరం లేదని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే వడ్డీ లేని రుణం పథకాన్ని నిలిపివేశారు. రుణమాఫీ పథకాన్ని కూడా పక్కాగా అమలు చేయటం లేదు. మరోవైపు బ్యాంకర్లు వడ్డీ రాయితీకి కిసాన్ క్రెడిట్ కార్డులకు లింక్ పెడుతూ ప్రతిపాదనలు తయారు చేశాయి. కేవలం కేసీసీ ఉన్న రైతులకే వడ్డీ రాయితీని అమలు చేయాలని బ్యాంకులు ప్రభుత్వానికి సూచించాయి. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ఎజెండాలో దీనిని పొందుపరిచారు. మూడు శాతం వడ్డీ రాయితీని రైతుల కిస్తున్న కేంద్రం బంగారు రుణాల పేరిట అనర్హులు వడ్డి రాయితీ పొందుతున్నారని భావిస్తోంది. తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడుల్లో ఈ వ్యవహారం జరుగుతోందని కేంద్రం గుర్తించింది. దీనిని నియంత్రించేందుకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రతిపాదనలు తయారు చేసింది. అయితే రాష్ట్రంలో ముప్పై ఐదు శాతం మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు లేవు. వారందరికీ వడ్డీ రాయితీ ప్రయోజనాలూ బంగారం రుణం ప్రయోజనాలు అందవు. రైతన్నకు తోడుగా ఉంటూ 'జై కిసాన్' అని ప్రముఖ్యతను ఇస్తున్న రైతులకు రుణం అందుతుందో లేదో వేచి చూడాలి.
విశాఖ జిల్లా వైసీపీలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా మండుతోన్న మంటలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ కేంద్రంగా గొడవలు రాజుకుంటున్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసి బంపర్ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఏకంగా మంత్రి పదవినే దక్కించుకున్న అవంతి... విశాఖ జిల్లాలో ఎవర్నీ లెక్కచేయడం లేదనే మాట వినిపిస్తోంది. జిల్లాలో తానే కింగ్ అన్నట్లుగా వ్యహరిస్తున్నారని, దాంతో అందరితోనూ గొడవలు అవుతున్నాయని అంటున్నారు. మొన్నటికి మొన్న అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌తో అవంతి గొడవపడ్డారన్న వార్త... వైసీపీలో కలకలం రేపగా, తాజాగా మరో కీలక నేత, వీఎంఆర్‌డీ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్ తో ఏకంగా అందరి ముందే మాటల యుద్ధానికి దిగడం సంచలనం సృష్టిస్తోంది. గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పత్రాల పంపిణీలో మంత్రి అవంతి... వీఎంఆర్డీ చైర్మన్ ద్రోణంరాజు మధ్య మాటల యుద్ధం జరిగింది. అవంతి ప్రసంగిస్తుండగా, అదే స్టేజ్ పై ద్రోణంరాజు శ్రీనివాస్...కలెక్టర్ తో సంభాషిస్తున్నారు. అయితే, ఇబ్బందిగా ఫీలైన అవంతి... అన్నా శీనన్నా... నగరంలో పెరిగిన మీకు గ్రామీణ కష్టాలు తెలియవు... కొద్దిగా వినండన్నా అంటూ కామెంట్ చేయడంతో, ఒక్కసారి వాతావరణం వేడెక్కింది. అవంతి మాటలతో నొచ్చుకున్న ద్రోణంరాజు... తాను మాట్లాడుతున్న టైమ్ లో ఘాటుగా బదులిచ్చారు. కుగ్రామంలో పుట్టి, పట్టణంలో పెరిగిన తనకు రెండు ప్రాంతాల గురించి అవగాహన ఉందని, కానీ ఎక్కడ్నుంచో వలసొచ్చి, ఇక్కడకొచ్చి వ్యాపారాలు చేసుకునేవాళ్లకు పల్లెటూళ్ల బాధలు ఏం తెలుస్తాయంటూ అవంతికి గట్టిగా కౌంటరిచ్చారు. అంతేకాదు చిన్నాపెద్దా చూసి మాట్లాడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాంతో కంగుతిన్న అవంతి.... ద్రోణంరాజును బుజ్జగించే ప్రయత్నం చేశారు. తన మాటలను అపార్థం చేసుకున్నారంటూ సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. అయితే, ఇదంతా వందల మంది ముందు జరగడంతో వైసీపీ నేతలు షాకయ్యారు. అయితే, అవంతి వ్యవహార శైలి, విశాఖ జిల్లా వైసీపీలో గొడవలు, నేతల మధ్య కోల్డ్ వార్... జగన్ దృష్టికి వెళ్లడంతో క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న సమయంలో నేతలు ఇలా బహిరంగంగా తిట్టుకుంటే ఎలా అంటూ మందలించారట. ప్రతి ఒక్కరూ విభేదాలను పక్కనబెట్టి, పార్టీ పటిష్టతకు కలిసి పనిచేయాలని, విశాఖ కార్పొరేషన్ లో వైసీపీ జెండా ఎగిరేలా కృషి చేయాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది.
  తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే ఏకైక ఉప ఎన్నిక కావడంతో హుజూర్ నగర్ శాసన సభ నియోజకవర్గంపైనే రాజకీయ పార్టీలన్నీ దృష్టి సారించాయి. ఒక్క సీటు కోసం అధికార టీఆర్ ఎస్ పార్టీ వందల సంఖ్యలో గులాబి సైన్యాన్ని నియోజకవర్గంలో మోహరించింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజూర్ నగర్ నియోజక వర్గంలో ఆ పార్టీ మళ్లీ ఎలాగైనా విజయకేతనం ఎగురవేయాలని బైపోల్ పోరుకు సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జత కట్టిన టిడిపి తెలంగాణలో తన పూర్వ వైభవాన్ని సాధించేందుకు ఒంటరిగా పోరులో నిలబడింది. ఈ ఉప ఎన్నిక ఫలితాలతోనే త్వరలో జరగబోయే మున్సిపోల్స్ కి ఆ పార్టీ సన్నద్ధం కానుంది. ఇక ఈ సారి జరిగిన ఎంపీ ఎన్నికల్లో సారు, కారు, పదహారు అంటూ టీఆర్ ఎస్ ప్రదర్శించిన జోరుకి బ్రేక్ వేసినా బిజెపి హుజూరునగర్ బైపోల్స్ ద్వారా తన సత్తా చాటేందుకు తహతహలాడుతోంది. సిపిఎం సైతం తన ఉనికిని చాటుకునేందుకు ఒంటరిగా బరిలోకి దిగింది. అధికార టీఆర్ ఎస్ పార్టీకి సిపిఐ అధికారికంగా మద్దతు ప్రకటించింది. అలాగే ప్రతి పక్ష కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ జనసమితి పార్టీ మద్దతు ప్రకటించింది. నామినేషన్ ల పర్వం కూడా ముగియడంతో ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా పోటా పోటీగా ప్రచారాలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి.  హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ను ఓడించేందుకు అధికార టీఆర్ ఎస్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. మంత్రుల నుంచి పార్టీ ముఖ్య నేతల వరకు వందల సంఖ్యలో గులాబీ సైన్యాన్ని దించుతోందని సమాచారం. ఇటు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం టీఆర్ ఎస్ ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకులు అందరినీ ఏకతాటి పైకి తీసుకు రావడంపై ఆయన దృష్టి సారించారు. ఇందులో భాగంగా గత నెల ముప్పై న నిర్వహించిన హుజూర్ నగర్ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఐక్యతా రాగాన్ని వినిపించారు. ఈ సభలో జానారెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీ్ధర్ బాబు, దామోదర్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, బలరాం నాయక్ వంటి నాయకుల చేసిన ప్రసంగాలు హస్తం శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపాయి. పద్మావతి గెలుపు కాంగ్రెస్ పార్టీకి చారిత్రాత్మక అవసరం అని హుజూర్ నగర్ ఉప ఎన్నిక నాలుగుకోట్ల ప్రజలకు ఒక నియంతకు మధ్య జరుగుతున్నదని ఆ పార్టీ ముఖ్య నేతలు ఇచ్చిన సందేశాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక ఆడబిడ్డను ఓడించేందుకు ఇంత మంది టీఆర్ ఎస్ మంత్రులు రంగంలోకి దిగడం, ప్రజలు గమనించాలన్న వారి వ్యాఖ్యలు కూడా హుజూర్ నగర్ నియోజక వర్గంలో పురుష ఓటర్ల కంటే అధికంగా ఉన్న మహిళా ఓటర్లను ఆలోచనల్లో పడేశాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  ఇక హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ముప్పై వేల ఓట్ల మెజారిటీ రాకుంటే తాను ఏ శిక్షకైనా సిద్ధమని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన విషయం విదితమే, అయితే ఆయన మాటలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుని డిసైడ్ చేసినట్టుగా ఉన్నాయని రాజకీయ వర్గాల వారు అంటున్నారు. నియోజక వర్గ ఓటర్ల పై ఉన్న అపార అనుభవం నాన్ లోకల్ ఓట్ల క్లారిటీ ఉత్తమ్ కు కలిసి రానున్నాయి చెబుతున్నారు. అయితే టీఆర్ ఎస్ అభ్యర్థి సైది రెడ్డికి యాభై వేల ఓట్ల మెజారిటీ వస్తుందని ఆ పార్టీ ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇతర నియోజక వర్గాల్లో గత ఎన్నికల్లో టిఆర్ ఎస్ సాధించిన విజయాలే అందుకు నిదర్శనమని వారు చెబుతున్నారు. అయితే క్యాడర్ బలంగా ఉన్న టిడిపి, బిజెపి, సిపిఎం పార్టీలు అధికార టీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. హుజూర్ నగర్ లో గత ఎన్నికల్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే కారు పార్టీకీ మెజారిటీ తగ్గే అవకాశం లేకపోలేదని వారు అభిప్రాయపడుతున్నారు. అలాగే మొన్నటిదాకా ఒకరంటే ఒకరికి పడని కాంగ్రెస్ ముఖ్య నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, దామోదర్ రెడ్డిలు ఏకతాటి పైకి రావడం ఉత్తమ్ పద్మావతి గెలుపునకు హస్తం పార్టీకి కలిసొచ్చే శుభపరిణామంగా భావిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ గులాబీ జెండా ఖచ్చితంగా ఎగరాలని ఆ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ ఒక్క సీటు గెలిపించుకునేందుకు వంద కోట్లు ఖర్చు పెట్టడానికైనా టీఆర్ ఎస్ వెనుకాడడం లేదని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. శాసన సభలో ఇప్పటికే సంపూర్ణ మెజారిటీ కలిగిన టీఆర్ఎస్ కి ఈ ఒక్క స్థానంలో గెలిచే ఎమ్మెల్యేతో వచ్చే లాభం గాని, జరిగే నష్టం గానీ ఏమీ లేదు. కేవల ఉత్తమ్ కంచుకోటలో పాగా వేస్తామని తృప్తి పడడానికి కాంగ్రెస్ పార్టీ ఉనికి తగ్గిందని చాటి చెప్పడానికి గులాబీ నేతలు తహతహలాడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే అధికార పార్టీ సామదానభేద దండోపాయాలను కూడగట్టుకొని యుద్ధాన్ని తలపించేలా ఓటర్లను ఆకర్షిస్తోందని అంటున్నారు. ఇప్పటికే కులాలు, మతాల ప్రాతిపదికన ఓటర్లను విభజించి ఆయా సామాజిక వర్గాల వారీగా నియమించిన కమిటీల నాయకుల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో నామినేషన్లు భారీగా తిరస్కరణకు గురి కావడం చర్చ నీయాంశంగా మారింది. మొత్తం 76 మంది అభ్యర్థులు 119 సెట్ ల నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో 30 మంది దాకా సర్పంచ్లుండటం గమనార్హం. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎవరు నామినేషన్లు వేశారు. కాగా ఈ నెల ఒకటి న జరిగిన స్క్రూటినీలో సిపిఎం అభ్యర్థి పారుపల్లి శేఖరరావుతో సహా నలభై నాలుగు మంది అభ్యర్ధులు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 31 మంది అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు ఓకే అయ్యాయి. మొత్తమ్మీద హుజూర్ నగర్ ఉప ఎన్నికలు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్యనే తీవ్ర పోటీ నెలకొంది. ఒకవేళ కారు పార్టీ గెలిస్తే మహిళా అభ్యర్థిని పై ఇంత అధికారం మందీ మార్భలాన్ని మోహరించారని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టే అవకాశాలున్నాయి. అలాకాక హస్తం పార్టీకి విజయం దక్కితే అధికార టీఆర్ ఎస్ పై ప్రజా వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ నేతలు జోరు పెంచే యోచనలో ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మహిళా సెంటిమెంట్ గుంపులు గుంపులుగా వచ్చే టీఆర్ ఎస్ సైన్యాన్ని ఎలా ఎదుర్కొంటుందో తెలియాలంటే అక్టోబర్ ఇరవై నాలుగు వరకు వేచి చూడాల్సిందే.
  ఆ పార్టీ అధినేతకు అత్యంత విధేయుడు, పార్టీ పట్ల అంకితభావం కలిగిన నేత, అధినేత ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి నాయకుడు, ఎమ్మెల్యేగా, మంత్రిగా వ్యవహరించడమే కాకుండా పార్టీగళాన్ని ఎప్పటికప్పుడు మీడియాలో వినిపించేవారు. అలాంటి నాయకుడు మాజీ మంత్రిగా మారిన తర్వాత పార్టీ వ్యవహారాలకు దూరమైపోయారు. రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఏర్పడిన అసంతృప్తి ఆయనను దహించి వేస్తోంది. ఆయన ఉపాధ్యాయ వృత్తిని వదిలి పెట్టి టిడిపిలో చేరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి పోటీ చేశారు కొత్తపల్లి శామ్యూల్ జవహర్. నాటి ఎన్నికల్లో గెలుపొందారు కూడా అంతేకాదు నాటి సీఎం చంద్రబాబు తన మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు ఎక్సైజ్ శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. అయితే జవహర్ మంత్రి అయ్యే వరకు కొవ్వూరు నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఆయనతో ఉన్నాయి. మంత్రి పదవి వచ్చిన తర్వాత మాత్రం నియోజకవర్గంలో సమీకరణాలు మారిపోయాయి. స్థానికంగా కొందరు నేతలు జవహర్ నాయకత్వాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. ఈ వ్యవహారాన్ని తెలుగుదేశం హైకమాండ్ మొగ్గలోనే తుంచి వేయకపోవడంతో అది పెరిగి పెద్దదైంది. ఎన్నికల నాటికి ఈ వివాదం జవహర్ కు టికెట్ ఇవ్వొద్దనే వరకూ వెళ్ళింది. చంద్రబాబు దగ్గర కూడా అసంతృప్త నేతలు వెళ్ళి జవహర్ కు టికెట్ ఇవ్వొద్దని కోరారు. కానీ చివరి నిమిషంలో జవహర్ ను కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గానికి మార్చింది పార్టీ హైకమాండ్. నిజానికి ఆయన జన్మస్థలం తిరువూరు నియోజకవర్గమే అయినప్పటికీ ఆయన రాజకీయంగా ఎదిగింది మాత్రం కొవ్వూరులోనే, ఇప్పటి వరకు తిరువూరు టిడిపి ఇన్ చార్జి గా ఉన్న నల్లగట్ల స్వామి దాసు జవహర్ కు పార్టీ టికెట్ ఇవ్వడంతో అసంతృప్తికి గురయ్యారట. ఎన్నికల సమయంలో ఇద్దరూ కలిసి పని చేసినప్పటికీ జవహర్ పరాజయం పాలయ్యారు. కొవ్వూరులో పోటీ చేసిన అనిత కూడా ఓడిపోయారు.  ఇదిలా వుంటే ఎన్నికల సమయంలో డబ్బు ఖర్చు పెట్టాలనే హైకమాండ్ చెప్పడంతో అప్పులు చేసి తెచ్చిన జవహర్ ఇప్పుడు ఆ రుణం తీర్చలేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారని ఆయన అనుచరులు చెబుతున్నారు. దీంతో పాటు తనకు కొవ్వూరు లేదా తిరువూరులో ఏదో ఒక నియోజక వర్గాన్ని ముందే ఖరారు చేస్తే తాను రాబోయే ఎన్నికల నాటికి ఆ నియోజక వర్గంలో పనిచేస్తాననీ కేడర్ ను పటిష్ఠం చేసుకుంటానని ఆయన అధిష్టానం వద్ద ప్రతిపాదించారని సమాచారం. ఇంకా చాలా సమయం ఉంది కదా అని అగ్రనేతలు ఆ విషయాన్ని దాటవేశారు. ఉపాధ్యాయ వృత్తి, ఉపాధ్యాయ ఉద్యమాల గురించి వచ్చిన తనకు ఎదురైన పరిస్థితి పై జవహర్ ఆవేదన చెందారు. తన బాధను అగ్రనేతలందరి వద్ద వ్యక్తం చేసినప్పటికీ సరైన స్పందన లేకపోవడంతో పార్టీ కార్యకలాపాలకు జవహర్ దూరంగా ఉన్నారు. అటు ఆర్ధిక ఇబ్బందుల చుట్టుముట్టడం ఇటు రాజకీయంగా భవిష్యత్ కూడా కనిపించకపోవడంతో ఆయన డీలా పడ్డారు. రాజకీయాలకు దూరంగా ఏదో ఒక ప్రైవేట్ స్కూల్ లో చేరితే నెలకు యాభై వేల రూపాయల నుంచి డెబ్బై వేల వరకు వేతనం వస్తుందని జవహర్ నేరుగా సహచర నేతల వద్ద వ్యాఖ్యానించడంతో ఈ వ్యవహారం కాస్తా పార్టీ అధినేత చంద్రబాబు వరకు వెళ్లినట్టు సమాచారం. చంద్రబాబు సూచన మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు జవహర్ తో ఫోన్ లో మాట్లాడి బుజ్జగించినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ జవహర్ ఆవేదన చల్లారలేదని, ఇటీవల ఆయన ముఖ్య అనుచరులతో సమావేశమై పార్టీకి రాజీనామా చేసి ఉపాధ్యాయ వృత్తి లోకి వెళితే ఎలా ఉంటుందనే అంశంపై చర్చించినట్టు తెలిసింది. గుంటూరులో ఉన్న తన ఇంటిని కూడా అమ్మకానికి పెట్టారని, అయితే రియల్ ఎస్టేట్ ధరలు పడిపోవడంతో తక్కువ ధరకు అడుగుతున్నారని పార్టీ నేతలు వద్ద ఆయన చెప్పినట్లు తెలిసింది. చంద్రబాబుకు తానేప్పుడ్డు విధేయుడినే అని ఉద్యమాల నుంచి వచ్చిన తనను విస్మరించడం భవిష్యత్ పై భరోసా ఇవ్వకపోవడమే బాధ కలిగిస్తోందని ఆయన బాహాటం గానే చెబుతున్నారు. ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలకు దూరమైన జవహర్ తో అగ్రనేతల సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి.
  హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థినిగా చావా కిరణ్మయి ప్రచారం మొదలు పెట్టారు. అయితే ఈ ప్రచారానికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రావాలని కొందరు, అవసరం లేదని మరికొందరు అభిప్రాయపడుతు ఉండటం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో మహా కూటమి పేరుతో టిడిపి, కాంగ్రెస్, సిపిఐ, తెలంగాణ జనసమితి పార్టీలు కలిసి మహా కూటమిగా పోటీ చేశాయి. అంతేకాదు అన్ని పార్టీల నాయకులు కలిసి ప్రచారాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో చంద్రబాబు తెలంగాణలో రెండు విడతలుగా వారం రోజుల పాటు గట్టిగానే ప్రచారం నిర్వహించారు. అయితే ఖమ్మం జిల్లాలో తప్ప టీడీపీ ఎక్కడా గెలవలేకపోయింది. ఆ క్రమంలో ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు ప్రచారం కాంగ్రెస్ కు బెడిసికొట్టిందని ఆ పార్టీ నాయకులు ఓపెన్ గానే ప్రకటించారు. దాంతో ఈ సారి హుజూరునగర్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని కోసం చంద్రబాబు ప్రచారం చేస్తారా చెయ్యరా,చేస్తే ఎలా ఉంటుంది చేయకపోతే ఏమవుతుంది అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ముందస్తు ఎన్నికల్లో మహాకూటమిలో సీట్లు మాత్రమే పంచుకున్న టిడిపి ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దత్తు మాత్రమే చేసి పోటీకి దూరంగా ఉంది. దాంతో తెలంగాణలో టిడిపి ఉనికి ప్రశ్నార్ధకంగా తయారైంది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశపడ్డ టిడిపి నేతలు డీలా పడిపోయారు. ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు అధిష్ఠానం తెలంగాణ టిడిపిని పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ఆ క్రమంలో ఇప్పుడు ఏపీలో టిడిపి ఓడిపోవటంతో తెలంగాణ పై దృష్టి సారించడమే కాకుండా పార్టీకి పునఃవైభవం తెస్తానని ప్రకటిస్తున్నారు చంద్రబాబు. ప్రస్తుతం హుజూర్ నగర్ ఉప ఎన్నిక విషయానికి వస్తే బాబు ప్రచారం చేస్తే ఎఫెక్ట్ ఉంటుందంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుగా ఉన్న హుజూర్ నగర్ లో ఆంధ్రా ప్రభావం ఉంటుందన్న అభిప్రాయం ఉంది. రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకుని పోటీ చేసిన టిడిపికి ఇరవై ఐదు వేల ఓట్లు దక్కాయి. ఇక రెండు వేల పధ్ధెనిమిదిలో హుజూర్ నగర్ నుంచి పోటీ చేయాలని ప్రస్తుత అభ్యర్థిని కిరణమై భావించినప్పటికీ పొత్తుల కారణంగా సాధ్యపడలేదు. ఇప్పుడు ఆమెకు మద్దతుగా పార్టీ అధినేత ప్రచారం చేస్తే అంతో ఇంతో ప్లస్ అవుతుందని అంటున్నారు.ఇక పై టీడీపీ స్ట్రాటజీ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.
  హుజూర్ నగర్ అభ్యర్ధి ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ లో చెలరేగిన మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. టీపీసీసీ ప్రెసిడెంట్ అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మధ్య తలెత్తిన విభేదాలు, మనస్పర్ధలు ఇంకా సమిసిపోలేదు. దాంతో హుజూర్ నగర్ ప్రచారంలో రేవంత్ చప్పుడే వినిపించడం లేదు. హుజూర్ నగర్ అభ్యర్ధి ఎంపిక విషయంలో సీనియర్లంతా టార్గెట్ చేయడంతో.... రేవంత్ సైలెంట్ అయ్యారు. అదే సమయంలో తన మాటను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకుండానే, ఉత్తమ్ భార్య పద్మావతి పేరును అధిష్టానం ప్రకటించడంతో రేవంత్ అలకబూనినట్లు తెలుస్తోంది. అందుకే, రేవంత్ కనీసం హుజూర్ నగర్ వైపు కూడా చూడటం లేదంటున్నారు.  ఒకవైపు టీఆర్ఎస్, బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుంటే, మరోవైపు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్స్ మాత్రం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా రేవంత్ ఇప్పటివరకు అస్సలు హుజూర్ ప్రచారంలో పాల్గొనలేదు. అసలు ప్రచారానికి వస్తాడో రాడో కూడా తెలియదు. ఇక, ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతి కూడా హుజూర్ నగర్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దాంతో కాంగ్రెస్ ప్రచారంలో కొంత స్తబ్దత నెలకొందనే మాట గట్టిగా వినిపిస్తోంది. ఎంతకాదన్నా, రేవంత్ రెడ్డి అంటే యూత్ లో యమ క్రేజుంది. రేవంత్ మాటలను, పంచ్ డైలాగులను వినేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తారు. అంతేకాదు రేవంత్ మాటలు జనాన్ని ఆలోచింపచేసేలా ఉంటాయ్. ఎంతకాదన్నా, రేవంత్ ప్రచారం చేశాడంటే, ఎంతోకొంత ఇంపాక్ట్ ఉండకమానదు. మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన హుజూర్ నగర్ ఉపఎన్నిక క్యాంపైయిన్ లో రేవంత్ ప్రచారం చేయకపోతే, అది కాంగ్రెస్ కు మైనస్ అయ్యే ప్రమాదముంది. ఒకవైపు, టీఆర్ఎస్, బీజేపీ ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడుచుకోకుండా, పంతానికి పోకుండా, అన్ని మార్గాలను వినియోగించుకుంటూ, మండల-గ్రామ-వార్డు స్థాయిలో ప్రచారానికి, మొత్తం బలగాన్ని రంగంలోకి దింపుతుంటే, సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ మాత్రం ఆ స్థాయిలో ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ ... కేంద్ర మంత్రులను సైతం రంగంలోకి దించి ప్రచారం చేయిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం కనీసం తెలంగాణ ముఖ్యనేతలతో కూడా ప్రచారం చేయించలేకపోతుందనే మాట వినిపిస్తోంది. మరి, ఉత్తమ్ చొరవ తీసుకుని రేవంత్ లాంటి లీడర్లను స్వయంగా ప్రచారానికి ఆహ్వానిస్తే, వివాదానికి తెరపడటమే కాకుండా, అది పార్టీకి కూడా మేలంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. మరి ఉత్తమ్-రేవంత్ ల్లో ఎవరో ఒకరు చొరవ తీసుకోకపోతే హుజూర్ నగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ కు ఊహించని నష్టం జరగడం ఖాయమేనంటున్నారు కార్యకర్తలు.
  హుజూర్ నగర్ లో ఎలాగైనాసరే గులాబీ జెండా పాతి... ఉత్తమ్ కు ఝలక్ ఇవ్వాలనుకుంటోన్న టీఆర్ఎస్... ఏ ఒక్క చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. గెలుపు కోసం సర్వశక్తులనూ ఒడ్డుతోంది. ఇప్పటికే సీపీఐ మద్దతు కూడగట్టిన టీఆర్ఎస్... అదే బాటలో సీపీఎంను కూడా దాదాపు తన వైపు తిప్పుకుంది. మరోవైపు, మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ముఖ్యనేతల వరకు అందర్నీ రంగంలోకి దింపి, మండల-గ్రామ-వార్డు స్థాయిలో ప్రచారం చేయిస్తోంది. అయినా కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంత అనుకూలంగా లేవని గుర్తించిన టీఆర్ఎస్ అధిష్టానం... ఏపీ లీడర్లను కూడా రంగంలోకి దించాలని డిసైడైందట. హుజూర్ నగర్లో ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉండటం, అది కూడా కమ్మ, కాపు కులస్తులు గెలుపోటములను శాసించే స్థాయిలో ఉండటంతో వైసీపీ కమ్మ, కాపు నేతలతో కులాల వారీగా ప్రచారం చేయించాలని టీఆర్ఎస్ చూస్తోందట.  హుజూర్ న‌గ‌ర్ లో క‌మ్మ‌, కాపు ఓట‌ర్లు  ప్రభావం గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నారు. హుజూర్ న‌గ‌ర్ లో 11వేల మంది కమ్మ ఓట‌ర్లు ఉండ‌గా, కాపు ఓట‌ర్లు ఏడు వేల మందికి పైగా ఉన్నారు. అయితే, కాపుల్లో టీఆర్‌ఎస్‌పై కొంత సానుకూల‌త ఉన్నా... క‌మ్మ సామాజికవ‌ర్గం ఓట‌ర్లలో మాత్రం పూర్తి వ్యతిరేక‌త ఉన్నట్లు టీఆర్ఎస్ గుర్తించిందట. దాంతో కమ్మ నేతలను రంగంలోకి దింపి... ఆ వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇక, రెడ్డి ఓట్లు అత్యధికంగా 27వేల వరకు ఉన్నాయి. అయితే, మెజారిటీ రెడ్డి ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపొచ్చన్న అంచనాలతో, క‌మ్మ‌, కాపు ఓట‌ర్లపైనే గులాబీ పార్టీ ఎక్కువగా దృష్టి పెట్టింది. అందుకే ఏపీ కమ్మ, కాపు వైసీపీ నేతలను ప్రచారానికి పంపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరినట్లు తెలుస్తోంది. దాంతో దసరా తర్వాత, ఏపీ వైసీపీ నేతలు.... హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు మద్దతుగా ప్రచారం చేస్తారని చెబుతున్నారు. ఒకవేళ, ఏపీ వైసీపీ నేతలు... టీఆర్ఎస్ కు మద్దతుగా ప్రచారంచేస్తే అది కాంగ్రెస్ కు అడ్వాండేజ్ గా మారుతుందని అంటున్నారు. గతంలో చంద్రబాబు... తెలంగాణలో ప్రచారం చేయడాన్ని కేసీఆర్ ఆయుధంగా మలుచుకున్నట్టే... ఇప్పుడు టీకాంగ్రెస్ కూడా ఏపీ నేతల క్యాంపెయిన్ ను అస్త్రంగా మార్చుకునే అవకాశముందంటున్నారు. మరి, నిజంగానే ఏపీ వైసీపీ నేతలు... హుజూర్ నగర్లో ప్రచారం చేస్తారో లేదో చూడాలి.
  ఆంధ్రప్రదేశ్ ప్రజలను వర్షాకాలంలో కూడా విద్యుత్ కోతలు వేధిస్తున్నాయి. గ్రామాల్లో వారం రోజుల నుంచి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారు. అనేక మండలాల్లో ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు, సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ విద్యుత్ కోతలు విధిస్తున్నాయి. ఏపీలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవటంతో డిమాండ్ పెరగిపోగా విద్యుత్ కోతలు అనివార్యమయ్యాయి. ఏపీకి ప్రస్తుతం పది నుంచి పదకొండు వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంది కానీ కేవలం ఎనిమిది వేల మెగావాట్స్ మాత్రమే ప్రస్తుతం విద్యుదుత్పాదన జరుగుతోంది. వర్షాలు పడటంతో పంటల విస్తీర్ణం పెరిగింది. విద్యుత్ మోటార్లను రైతాంగం విరివిగా ఉపయోగిస్తారు. దీనివల్ల విద్యుత్ వినియోగం పెరిగిందని ట్రాన్స్ కో అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం ప్రస్తుతం ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభానికి ప్రధాన కారణంగా మారింది. సౌర, పవన, విద్యుత్ సంస్ధల నుంచి విద్యుత్ తీసుకునేందుకు ప్రభుత్వం నిరాకరించింది. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను పున సమీక్షించాలని ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం పై సౌర, పవన, విద్యుత్ సంస్థలు కోర్టుకు వెళ్లడంతో, కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది. దీంతో సౌర, పవన, విద్యుత్ సంస్థలపై ఉన్న విభేదాలతో  వివిధ కారణాల రీత్యా ప్రభుత్వం విద్యుత్ సరఫరాను తీసుకోవటం నిలిపివేసింది. దీనివల్ల ఆరు వందల మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్పడింది. ఇదే సమయంలో విద్యుత్ డిమాండ్ ను తట్టుకునేందుకు థర్మల్ స్టేషన్ల పై ఆధారపడింది. థర్మల్ విద్యుత్ ఉత్పాదన ఎక్కువగా ఉండటం వల్ల అదనంగా పది లక్షల టన్నుల బొగ్గు నిల్వలు కరిగిపోయాయి. ఫలితంగా ప్రస్తుతం బొగ్గు కొరత ఏర్పడింది. ఒడిశాలో ఉన్న బొగ్గు గనుల నుంచి కూడా సరఫరా తగ్గిపోయింది. మహారాష్ట్రలో ఎన్నికలుండటంతో ఒడిశా నుంచి బొగ్గును మహారాష్ట్రకు తరలించి అక్కడ విద్యుత్ కోతలు లేకుండా చూడాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో ఏపీకి బొగ్గు సరఫరా నిలిచిపోయాయి ఫలితంగా థర్మల్ స్టేషన్ లో విద్యుత్ ఉత్పాదన తగ్గిపోయింది. అందువల్లే విద్యుత్ కోతలు పెరిగాయి. వివిధ విద్యుత్ కంపెనీలకు బకాయిలు చెల్లించకపోవడంతో జాతీయ విద్యుత్ ఎక్స్ చేంజ్ లో ఏపీని బ్లాక్ లిస్టులో చేర్చారు. దీంతో బయటి రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు సాధ్యం కాలేదు.వెంటనే నూట ఇరవై ఐదు కోట్లు కొన్ని విద్యుత్ సంస్థలకు చెల్లించింది ఏపీ ప్రభుత్వం .దాంతో ఏపీని బ్లాక్ లిస్టు నుంచి తొలగించారు. అయితే ఇప్పటికే అక్కడ మిగులు విద్యుత్ అమ్మకాలు పూర్తి అయ్యాయి. వివిధ రాష్ట్రాలు తమ వద్ద ఉన్న మిగులు విద్యుత్ ను ఇప్పటికే వేరే రాష్ట్రాలకు విక్రయించేందుకు ఒప్పందాలు కుదుర్చుకోవడంతో విద్యుత్ కొనుగోలుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఏ రాష్ట్రం దగ్గరైనా మిగులు విద్యుత్తు ఉందేమోనని ఏపీ అధికారులు వాకబు చేస్తున్నారు. బొగ్గు లభ్యత పూర్తిగా పడిపోవడంతో విశాఖపట్నంలోని సింహాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో విద్యుత్ ఉత్పాదన డెబ్బై శాతానికి పైగా పడిపోయింది. విదేశాల నుంచి ఓడల్లో వస్తున్న బొగ్గుతో ప్రస్తుత ఒక యూనిట్ లో మాత్రం పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మరో యూనిట్ పాక్షికంగా పని చేస్తోంది. దీంతో విద్యుత్ కష్టాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు.
  వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి అరుణ్ కుమార్... జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై మొదటిసారి మీడియా ముందుకొచ్చి ఆలోచింపజేసే వ్యాఖ్యలు చేశారు. జగన్ అంటే మొదట్నుంచీ సాఫ్ట్ కార్నర్ చూపించే ఉండవల్లి... పొంచివున్న ముప్పును సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్ గానే చెప్పేశారు. చరిత్రను గుర్తుచేస్తూమరీ హెచ్చరికలు చేశారు. 51శాతం ఓట్లు... 151 సీట్లు వచ్చాయని విర్రవీగొద్దని చెప్పకనే చెప్పారు. జాతీయ పార్టీల్లో నేతలకు తమ అసంతృప్తిని, ఆవేదనను చెప్పుకోవడానికి హైకమాండ్స్ ఉంటాయన్న ఉండవల్లి... వైసీపీ ఎమ్మెల్యేలకు, నేతలకు అన్నీ జగనేనని, అందువల్ల ఎమ్మెల్యేల మనసు గెలుచుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రికి తామంటే నమ్మకముందనే విశ్వాసం ఎమ్మెల్యేల్లో కలిగించాలన్నారు. లేదంటే తిరుగుబాటు వచ్చే ప్రమాదముందని చరిత్రను తవ్వితీశారు. 1972లో పీవీ నర్సింహరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ 56శాతం ఓట్లు... 219 సీట్లు వచ్చాయని, కానీ పీవీని 9నెలల్లోనే దింపేశారని గుర్తుచేశారు. ఇక, 1984లో టీడీపీకి 54శాతం ఓట్లు... 213 సీట్లు వచ్చాయని, కానీ 9నెలల్లోనే ఎన్టీఆర్ కూడా కుర్చీ దిగాల్సి వచ్చిందనే విషయం మర్చిపోవద్దన్నారు. అయినా, ఎన్టీఆర్ మీద చంద్రబాబు తిరగబడతారని ఎవరైనా అనుకున్నారా? అన్న ఉండవల్లి... రాజకీయాల్లో ఊహించనవే జరిగే వీలుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఉండవల్లి హెచ్చరించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకపోతే ఇప్పుడు జగన్ నైనా దింపేస్తారంటూ చరిత్రను గుర్తుచేస్తూ ఉండవల్లి ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఇప్పుడున్న 151మంది ఎమ్మెల్యేల బలాన్ని చూసుకుని... ఇదే శాశ్వతమని భావించొద్దని జగన్ ను సూచించిన ఉండవల్లి.... ప్రజల్లో మంచి పేరుతోపాటు ఎమ్మెల్యేల మనసు కూడా గెలుచుకోవాలని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఎమ్మెల్యేలను పట్టించుకోకపోతే పీవీ నర్సింహరావు, ఎన్టీ రామారావుకి పట్టిన గతే జగన్ కు పడుతుందని హెచ్చరించారు.  అయితే, ఉండవల్లి నోట తిరుగుబాట మాట అనే మాటలను చూస్తుంటే, జగన్మోహన్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారనే భావించాలి. లేదంటే జగన్ పరిపాలనపై మొదటి మీడియా మీడియా సమావేశంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడమంటే మామూలు విషయం కాదు. ఏదో ఆషామాషీగా ఉండవల్లి ఈ వ్యాఖ్యలు చేయరు. తనకొచ్చిన ఫీడ్ బ్యాక్ మేరకే ఉండవల్లి రియాక్షన్ ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పదేపదే మీ ఎమ్మెల్యేలు సంతృప్తిగా ఉండాలంటూ ప్రస్తావించడం చూస్తుంటే.... మంత్రులు, ఎమ్మెల్యేలు... జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారనే భావించాలి. ఏదిఏమైనా అధికారం శాశ్వతం కాదని, ఎమ్మెల్యేలు సంతోషంగా లేకపోతే... మీ వాళ్లే మీ మీద తిరగబడతారంటూ... జగన్ కు పొంచివున్న ముప్పుపై ఉండవల్లి హెచ్చరించారు.
  తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రత్యేక స్థానముంది. ఇక్కడ రాజకీయాలు, ఎన్నికల ఫలితాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాలు గెలుచుకొని ఘన విజయం సాధించింది. అయితే  ఖమ్మం జిల్లాలో మాత్రం మొత్తం 10 అసెంబ్లీ సీట్లు ఉంటే.. టీఆర్ఎస్ కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. రాష్ట్రమంతా కారు టాప్ గేరులో దూసుకుపోతే.. ఖమ్మంలో మాత్రం ఫస్ట్ గేర్ లోనే బ్రేకులు పడ్డాయి. దీంతో కేసీఆర్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే అనూహ్యంగా లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండా ఎగిరింది. 'సారు కారు పదహారు' అంటూ లోక్ సభ పోరుకి హుషారుగా దూసుకెళ్లిన టీఆర్ఎస్ కు.. బీజేపీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో షాకిచ్చాయి. కానీ ఖమ్మంలో మాత్రం టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. దీంతో ఖమ్మం ఫలితాలు గులాబీ బాస్ కి ఎప్పటికీ అంతుబట్టని ఓ ప్రశ్నలా మిగిలిపోయాయి. ఖమ్మం జిల్లా ఫలితాలే కాదు, రాజకీయాలు కూడా కేసీఆర్ కి అంత ఈజీగా అర్థంకావట్లేదని అంటున్నారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఒక్క ఎమ్మెల్యే సీటే గెలిచినప్పటికీ.. తరువాత ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికతో బలపడింది. ఆ బలం ఎంపీ సీటు గెలవడానికి ఉపయోగపడింది. అయితే ఇప్పుడు ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ లో వర్గపోరు ఆ పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతోంది. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలలో ఎవరో ఒకరు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ తరఫున ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్.. తరువాత టీఆర్ఎస్ లో చేరి జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ సీటు ఆశించి భంగపడ్డారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో.. జిల్లాలో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసి వారి ఓటమికి కారణమయ్యారని ఆరోపణలున్నాయి. దీంతో కేసీఆర్ ఆయనకు టికెట్ ఇవ్వకుండా.. ఎన్నిక‌ల ముందు టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన నామా నాగేశ్వ‌ర‌రావుకి టికెట్ ఇచ్చారు. దీంతో పొంగులేటి టీఆర్ఎస్ ని వీడరతారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. అయితే ఆయనకు రాజ్యసభ ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇవ్వడంతో పార్టీని వీడే ఆలోచనను అప్పుడు పొంగులేటి పక్కన పెట్టారని వార్తలొచ్చాయి. మరోవైపు సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ జిల్లాలో ప‌ట్టు నిలుపుకుంటున్నారు. దశాబ్దాల రాజకీయ అనుభవం, మాజీ మంత్రి, జిల్లాలో సీనియర్ నేతగా మంచి పట్టు, తనున్న పార్టీ అధికారంలో ఉండటం.. అయితే ఇన్నున్నా తనకి ప్రస్తుతం ఏ పదవి లేకపోవడంతో తుమ్మల అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో తనకి మళ్లీ మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేస్తారనుకున్నారట. కానీ కేసీఆర్ మాత్రం.. ఖమ్మం జిల్లాలో కారు గుర్తుపై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కి మంత్రిగా అవకాశమిచ్చారు. దీంతో తుమ్మల తీవ్ర అసంతృప్తికి గురయ్యారట. మరోవైపు తుమ్మలకి కూడా రాజ్యసభ ఇస్తామని హామీ ఇచ్చినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే తుమ్మల మొదటినుండి కేంద్ర రాజకీయాలపై ఆసక్తి కనబరిచేవారు కాదు. హిందీ, ఇంగ్లీష్ మాట్లాడి మేనేజ్ చేయడం కష్టం అనేవాళ్ళు. మరి అలాంటి తుమ్మలను.. ఇప్పుడు రాజ్యసభకు పంపుతానంటే అంగీకరిస్తారా అంటే అనుమానమే. ప్రస్తుతం తుమ్మల, పొంగులేటి ఇద్దరిది ఇంచుమించు ఒకటే పరిస్థితి. జిల్లాలో పట్టుంది కానీ పదవి లేదు. ఒకవేళ భవిష్యత్తులో పదవి దక్కినా ఇద్దరిలో ఎవరో ఒక్కరికే దక్కే అవకాశముంది. దీనికితోడు జిల్లాలో వీరిద్దరి మధ్య వర్గపోరు కూడా నడుస్తుందని అంటున్నారు. పరిస్థితి చూస్తుంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు టీఆర్ఎస్ ని వీడి బీజేపీ గూటికి చేరే అవకాశముందని అంటున్నారు. తుమ్మలకు ఆయన అనుచరులు పార్టీ మారమని సూచిస్తున్నారట. ఇప్పటికే తుమ్మల సమీప బంధువు గరికపాటి రామ్మోహన్ బీజేపీలో చేరడంతో.. ఆయన ద్వారా సంప్రదింపులు జరిపి బీజేపీలో చేరే అవకాశముందని కూడా వార్తలొస్తున్నాయి. మరోవైపు పొంగులేటి అనుచరులు కూడా పార్టీ మారాలని ఆయన మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారట. దీంతో పొంగులేటి బీజేపీలో చేరే ఆలోచనలో పడ్డారట. వచ్చే ఏడాది ఏప్రిల్ లో తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆ రెండు స్థానాలకు అధికార పార్టీలో తీవ్ర పోటీ నెలకొనే అవకాశముంది. మరి ఆ పోటీలో పొంగులేటికి అవకాశం దక్కుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీంతో పొంగులేటి తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా బీజేపీలో చేరడం కరెక్ట్ అని భావిస్తున్నారట. మరి తుమ్మల, పొంగులేటి ఇద్దరిలో ఎవరో ఒకరు బీజేపీలో చేరతారో లేక ఇలాగే టీఆర్ఎస్ లో కొనసాగుతారో చూడాలి. మొత్తానికి ఖమ్మం రాజకీయాలు గులాబీ బాస్ ని తెగ కలవరపెడుతున్నాయట.

ఏపీలో  ఏం జరగబోతోంది? రాజ్యాంగ సంక్షోభం తప్పదా? 

స్థానిక సంస్థల ఎన్నిక అంశం ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం రేపుతోంది. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం.. తన పని తాను చేసుకుపోతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ స్థానిక సంస్థల ఎన్నికలకూ సహకరించేది లేదని చెబుతోంది వైసీపీ ప్రభుత్వం. రాజ్యాంగ బద్ద ఎన్నికల సంఘానికి రాష్ట్ర సర్కార్ సహకరించకపోతే  తీవ్ర పరిణామాలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో ఎన్నికల కమిషనర్, ఏపీ సర్కార్ వివాదం ఎటు వైపు దారి తీస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.  షెడ్యూల్‌ విడుదలయ్యాక ఎన్నికలను వాయిదా వేసిన సందర్భా లు మన రాష్ట్రంలో తప్ప దేశంగా ఇంతవరకు ఎక్కడా జరగలేదని చెబుతున్నారు. కరోనా కారణంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గత మార్చిలో వాయిదా వేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ  జగన్ రెడ్డి సర్కార్ కోర్టుకెళ్లినా.. ఎస్‌ఈసీ నిర్ణయాన్నే సుప్రీంకోర్టు సమర్థించింది. షెడ్యూల్‌ విడుదల చేసిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగమంతా ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుంది. ఎన్నికలు వాయిదా వేయాలన్నా, నిలిపివేయాలన్నా.. ఎస్‌ఈసీ చేతిలోనే ఉంది. రెండేళ్ల కింద పశ్చిమ బెంగాల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని ఎస్‌ఈసీకి వ్యతిరేకంగా ఆ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టు కు వెళ్లింది. అయితే రాజ్యాంగంలోని 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక ఎన్నికలు సకాలంలో జరగాల్సిందేనని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇటీవల కేరళ స్థానిక ఎన్నికల విషయంలోనూ జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.    ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ  షెడ్యూల్‌ విడుదల చేయడంతో  ఈ నెల 9వ తేదీ నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. దీంతో రాష్ట్రప్రభుత్వ యంత్రాంగమంతా ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చినట్లయింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 23న పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. అయితే జగన్ ప్రభుత్వం  ఇందుకు సహకరించే పరిస్థితి  కనిపించడం లేదు. ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దని అధికార యంత్రాంగాన్ని కూడా వారు ఆదేశించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అదే జరిగితే రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా రాజ్యాంగ సంక్షోభ పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ. కేంద్ర ఎన్నికల కమిషన్‌తో సమాన అధికారాలు కలిగి ఉంది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఎన్నికల ప్రక్రియకు సహకరించని ఉద్యోగులు, అధికారులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ చర్యలు తీసుకోవచ్చని రాజ్యాంగ  నిపుణులు చెబుతున్నారు.  ఏపీ సర్కార్ తీరుతో  రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దూకుడుగా వెళ్లే అవకాశాలే కన్పిస్తున్నాయి. గత ఏడాది ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో విఫలమయ్యారంటూ  గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేయాలని, ఓ సీఐను సస్పెండ్‌ చేయాలని అప్పట్లో ప్రభుత్వాన్ని ఎస్‌ఈసీ ఆదేశించింది. అయితే రాష్ట్రప్రభుత్వం పట్టించుకోలేదు. గుంటూరు రూరల్‌ ఎస్సీని మాత్రం  ఇటీవల బదిలీ చేశారు. దీంతో  కమిషనర్‌ నిమ్మగడ్డ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు తాజాగా లేఖ రాశారు. ఎస్‌ఈసీ ఆదేశాలను అమలు చేయాలని, ఆ అధికారులను బదిలీ చేయాలని మరోసారి గుర్తుచేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించే తీరును బట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు ఉంటాయని అంటున్నారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు కొందరు ఎస్‌ఈసీపై విమర్శలు చేశారు. . ఎన్నికలకు సహకరించబోమని కొంత మంది ఉద్యోగ నేతలు  ప్రకటించారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎస్‌ఈసీ వారిపై చర్యలు తీసుకునే అవకాశముందంటున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఉద్యోగులంతా తన పరిధిలోకి వచ్చినందున.. గీత దాటిన ఉద్యోగ సంఘాల నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఎస్‌ఈసీ పరిశీలిస్తోందని తెలుస్తోంది.   స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీకి  రాష్ట్ర యంత్రాంగం సహకరించకపోతే ఏం జరగబోతుందన్న చర్చ ఏపీలో  జోరుగా జరుగుతోంది. ఎస్‌ఈసీ తనకున్న అధికారాలను వినియోగించి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందని.. ఈ ఆదేశాలను అమలు చేయకుంటే గవర్నర్‌కు, రాష్ట్రపతికి ఎన్నికల సంఘం ఫిర్యాదు చేసే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అదే జరిగితే రాజ్యాంగ బద్ధ విధుల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైనట్లు అవుతుందని.. రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందని చెబుతున్నారు.

ముఖ్యమంత్రి సీటుపై పంచాయితి! కుటుంబ సభ్యులతో  కేసీఆర్ కు తలనొప్పి? 

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో కోల్డ్ వార్ నడుస్తుందా ? పదవుల విషయంలో కేటీఆర్, కవిత ఢీ అంటే ఢీ అంటున్నారా? పాలనలో మార్పులకు సిద్దమైన కేసీఆర్ వెనక్కి తగ్గడానికి కారణం ఏంటీ? ఇవే ఇప్పుడు తెలంగాణతో పాటు టీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. పదవుల విషయంలో కేటీఆర్, కవిత మధ్య విభేదాలు తీవ్రమయ్యాయని చెబుతున్నారు. ఇద్దరిలో ఎవరూ వెనక్కి తగ్గే పరిస్థితి లేకపోవడంతో కేసీఆర్ కూడా ఏమి చేయలేకపోతున్నారని చెబుతున్నారు. అందుకే పాలనలో ప్రక్షాళనకు సిద్దమైన గులాబీ బాస్.. ఇప్పుడా ప్రయత్నాలను విరమించుకున్నారని సమాచారం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్.. కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా కూడా ఉన్నారు. కీలకమైన మున్సిపల్, కమర్షియల్, ఐటీ శాఖల మంత్రిగా ఉన్న కేటీఆర్.. పాలనలో అంతా తానే వ్యవహరిస్తున్నారనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. విదేశీ రాయబారులు, పెట్టుబడిదారులు, ఇతరత్రా ప్రముఖులు కూడా ప్రగతి భవన్ లో కేటీఆర్ తోనే సమావేశమై చర్చిస్తున్నారు. బదిలీలు, ప్రమోషన్లు, పోస్టింగులన్ని కేటీఆర్ చెప్పినట్లే సాగుతుండటంతో ఉన్నతాధికారులంతా కేసీఆర్ కంటే కేటీఆర్ కే ఎక్కువ సన్నిహితంగా ఉంటున్నారు. షాడో ముఖ్యమంత్రిగా విమర్శలు ఎదుర్కొంటున్న కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయాలని కేసీఆర్ భావించారట. అయితే తన పదవిపై క్లారిటీ ఇవ్వాలని కవిత కోరుతుండటంతో ఇంట్లో గొడవ జరుగుతుందని తెలుస్తోంది.   2014లో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు కల్వకుంట్ల కవిత. ఆ సమయంలోనే మోడీ ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరుతుందని, కవితకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని  ప్రచారం జరిగింది. కాని ఎందుకో అది జరగలేదు. 2019  ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎవరొచ్చినా కవితకు కేబినెట్ బెర్త్ ఖాయమనుకున్నారు. కాని అనూహ్యాంగా ఆమె ఎంపీగా ఓడిపోయారు. దీంతో షాకైన కవిత.. దాదాపు ఏడాది పాటు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. దీంతో కవితను రాజ్యసభకు పంపించి మళ్లీ యాక్టివ్ చేస్తారని, అవసరమైతే కేంద్ర కేబినెట్ లో చేరుస్తారని  చర్చ జరిగినా.. అది కూడా జరగలేదు. కేటీఆర్ వ్యతిరేకించడం వల్లే కవితను రాజ్యసభకు పంపలేదని టీఆర్ఎస్ లోనే చర్చ జరిగింది. కవిత కేంద్ర మంత్రి అయితే .. తర్వాత సీఎం రేసులో ఆమె తనకు పోటీగా వస్తారని భావించడం వల్లే కేటీఆర్ ఆమెకు మద్దతు ఇవ్వలేదనే ప్రచారం జరిగింది. అప్పటి నుంచి కేటీఆర్ ,కవిత మధ్య గ్యాప్ వచ్చిందంటున్నారు.               ఇటీవలే నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించింది కవిత. ఆమె ఎమ్మెల్సీగా గెలిచినప్పటి నుంచి  రాష్ట్ర మంత్రివర్గంలో చోటు ఖాయమన్న చర్చ మొదలైంది. ఇక్కడే కేసీఆర్ కుటుంబలో అసలు సమస్య వచ్చిందంటున్నారు. ఇప్పటికే కేసీఆర్ కుటుంబానికి పదవులన్ని ఇచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. జనాల్లోనూ అలాంటి చర్చే జరుగుతోంది. ఈ సమయంలో కవితను కేబినెట్ లోకి తీసుకుంటే మరిన్ని ఇబ్బందులు వస్తాయని కేసీఆర్ తో కేటీఆర్ వాదిస్తున్నారని చెబుతున్నారు. దీంతో కవితకు మంత్రివర్గంలో చోటుపై ఎటూ తేల్చుకోలేకపోతున్న కేసీఆర్.. కేబినెట్ ప్రక్షాళనకు వెనుకంజ వేస్తున్నారని భావిస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు మంత్రులను తొలగించి కొత్త వారిని తీసుకోవాలని దాదాపుగా నిర్ణయించినా.. కవిత విషయం తేలకపోవడం వల్లే మంత్రివర్గ ప్రక్షాళన విషయాన్ని కేసీఆర్ పక్కన పెట్టారని టీఆర్ఎస్ నేతలే చెబుతున్నారు. తనకు మంత్రిపదవి రాకుండా కేటీఆరే అడ్డుకుంటున్నారన్న భావనలో ఉన్న కవిత.. ఇప్పుడు ముఖ్యమంత్రి సీటుపైనా పేచీ పెడుతున్నారని చెబుతున్నారు. కేటీఆర్ కు పాలనా పగ్గాలు ఇవ్వడానికి ఆమె అంగీకరించడం లేదని తెలుస్తోంది. అందుకే మార్చిలోపు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెబుతున్నా.. అలాంటిదేమి ఉండకపోవచ్చని తెలుస్తోంది. నిఘా సంస్థలు, సర్వేల పేర్లతో కొంత కాలం కేసీఆర్ సాగదీస్తారని చెబుతున్నారు. ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సహా కమలం కీలక నేతలు.. కేటీఆర్ కు ఇప్పట్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎంత మాత్రం లేదని బల్లగుద్ది మరీ చెబుతున్నారని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. మొత్తంగా పదవుల విషయంలో కేసీఆర్ ఫ్యామిలీలో పెద్ద పంచాయతీ జరుగుతున్నట్లు కనిపిస్తోంది. మరీ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి మరీ.. 

50 వేల కోట్ల విలువైన భూ వివాదానికి 80 ఏండ్ల చరిత్ర! 

8 దశాబ్దాలు... 12 హత్యలు.. 80 సర్వే నెంబర్ .. 867  ఎకరాల ల్యాండ్ .. 50,000 కోట్ల రూపాయలు. హైదరాబాద్ లో సంచలనం బోయినపల్లి కిడ్నాప్ కేసుకు కారణమైన న్యూహఫీజ్‌పేట భూ వివాదం చరిత్ర ఇది. హఫీజ్‌పేట్‌ సర్వే నంబర్‌ 80లోని భూమి  దశాబ్దాలుగా  వివాదాల్లో ఉంది. కోర్టు కేసులతో  కొనసాగుతూనే ఉంది.  హత్యలు-ప్రతి హత్యలతో దాదాపు డజను మందిని ఈ భూమి బలిగొన్నది. దశాబ్దాల క్రితం రూ. వేలల్లో విలువ ఉన్నప్పుడు ప్రారంభమైన వివాదం.. ఇప్పుడు ఆస్తి విలువ వేల కోట్లకు చేరుకున్నా కొలిక్కి రాలేదు.  శేరిలింగంపల్లి మండలం న్యూహఫీజ్‌పేట సర్వే నంబర్‌ 80లోని భూములపై ప్రభుత్వానికి, ప్రైవేట్‌ వ్యక్తులకు మధ్య  మొదట  వివాదం కొనసాగింది. మార్తాండ్‌నగర్‌ వెనుకవైపు, కొండాపూర్‌ అంతర్గత రహదారి మధ్యలో ఉన్న ఓ 40 నుంచి 50 ఎకరాల  భూమి తమదేనంటూ దివంగత మాజీ మంత్రి భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి గతంలో చుట్టూ ప్రహరీ నిర్మించి రేకులతో ఫెన్సింగ్‌ వేశారు. భూముల చుట్టూ వేసిన ఫెన్సింగ్‌ రేకులపై తొలుత ఏవీ ఎస్టేట్స్‌ అని బోర్డులు పెట్టారు. ఆ తరువాత కొన్నేళ్లకు ఆ బోర్డులు తొలగించి కేపీ ఎస్టేట్స్‌ అని పేరు మార్చారు. ఈ బోర్డుల ప్రకారం ప్రస్తుతం కిడ్నాపునకు గురైన కె.ప్రవీణ్‌రావు పొజిషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి బతికి ఉన్నప్పుడు ఏవీ ఎస్టేట్స్‌గా ఉన్న పేరు ఆయన చనిపోయాక కేపీ ఎస్టేట్స్‌గా మారిందని స్థానికులు అంటున్నారు.  హఫీజ్‌పేట్‌లోని 50 ఎకరాల భూమి తమదేనని మాజీ మంత్రి భూమా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భూమా కుటుంబాన్ని ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమపై ఏపీ, తెలంగాణలో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని చెబుతున్నారు. తమ భూమిని కబ్జా చేసి మైహోమ్స్‌కు లీజ్‌కు ఇచ్చారని భూమా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వివాదం జరుగుతున్న హఫీజ్‌పేట స్థలంలో తనకు 40 శాతం వాటా ఉన్నట్లు పోలీసుల విచారణలో భూమా అఖిలప్రియ  చెప్పినట్లు తెలిసింది. మిగతా భూమిలో 30 శాతం సుబ్బారెడ్డికి, మిగతా 30 శాతం ప్రవీణ్‌కు చెందుతుందని ఆమె వివరించినట్లు సమాచారం.  నిజాం రాష్ట్ర రైల్వే నిర్మాణ సమయంలో ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు ప్రాంతాల్లో ఖుర్షీద్‌ జాహీ పాయ్‌గా, చావూస్‌, నవాబ్‌ వంశీయులకు చెందిన భూములను నిజాం ప్రభుత్వం సేకరించింది. ఆ ఆస్తులకు ప్రత్యామ్నాయంగా.. హఫీజ్‌పేట్‌ సర్వేనంబర్‌ 80, హైదర్‌నగర్‌లో  భూములను కేటాయిస్తూ.. 1929లో ఏడో నిజాం మీర్‌-ఉస్మాన్‌ అలీఖాన్‌ ఫర్మాన్‌ జారీ చేశారు. జాగీర్దారీ వ్యవస్థ రద్దయ్యాక ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనిపై 1958లో పాయ్‌గా వారసుల్లో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇంకొందరు తమ వాటా భూములను గ్రేటర్‌ గోల్కొండ వారసులకు అగ్రిమెంట్‌ చేశారు. ఆ సమయంలో నిజాం ప్రభువే ఈ భూమిని కొనుగోలు చేసినట్లు ఉన్న లింక్‌ డాక్యుమెంట్‌ను జత చేశారు. అప్పటినుంచే  ఈ భూమిపై సీఎస్‌-14/1958 కేసు న్యాయస్థానంలో మొదలైంది. 1968 జూన్‌ 28న హైకోర్టు ఈ భూములపై ప్రిలిమినరీ డిక్రీని ఇచ్చింది.  అయితే ప్రిలిమినరీ డిక్రీ వచ్చాక.. హక్కుదారులెవరూ భూములను స్వాధీనం చేసుకోవడానికి ముందుకు రాలేదు. కొండలు, గుట్టలు, అడవి మాదిరిగా ఉన్న ఈ భూముల్లో అసైన్‌మెంట్‌ డీడ్‌ చేసుకునేందుకూ ఆసక్తి చూపలేదు. దాంతో. ఆ సర్వే నంబర్‌-80లోని భూములన్నీ సర్కారువేనని ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. ఈ మేరకు పలు కోర్టుల్లో అఫిడవిట్లు దాఖలు చేసింది. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో కూడా ఈ భూములన్నీ సర్కారువేనని పేర్కొంటూ వాటిని నిషేధిత జాబితాలో పెట్టింది.  పాత ముంబై జాతీయ రహదారి, కొత్త ముంబై జాతీయ రహదారికి మధ్య ఈ ప్రాంతం వారధిగా ఉండడం.. కొండాపూర్‌లో 8వ బెటాలియన్‌ ప్రత్యేక పోలీసు బెటాలియన్‌ ఏర్పాటవడంతో పాయ్‌గా, చావూస్‌ వారసులు సర్వే నంబర్‌-80లోని భూముల్లో ఎవరికి వారుగా కాలనీలు, ప్లాట్లు ఏర్పాటు చేసి, విక్రయాలు సాగించారు. అలా 1983-84లో సుభాష్‌ చంద్రబోస్‌ నగర్‌ పేరుతో వెంచర్‌ను అభివృద్ధి చేసిన కబీరుద్దీన్‌ ఖాన్‌  రూ. 15లకు గజం చొప్పున భూములను విక్రయించారు. అదే సమయంలో.. ప్రేమ్‌నగర్‌, మార్తాండనగర్‌ పేరుతో ఇస్మాయిల్‌, పాయ్‌గా కాలనీ పేరుతో పాయ్‌గా వారసులు, మరికొన్ని పేర్లతో చావూస్‌ వారసులు ప్లాట్లను విక్రయించారు. 30.31 ఎకరాలను ఓ 30 మంది వ్యక్తులు  క్లెయిమ్‌ చేస్తూ రాగా.. 116 ఎకరాలను బి.శివరామకృష్ణ, సి.కల్యాణ్‌, మరో వ్యక్తి, ముంబైకి చెందిన సైరస్‌ ఇన్వె్‌స్టమెంట్స్‌ క్లెయిమ్‌ చేస్తూ వచ్చింది. కొన్ని భూములు చేతులు మారుతూ వచ్చాయి.  కొండాపూర్‌ ప్రాంతంలో 1990 తొలినాళ్లలో శిల్పారామం రావడం.. ఆ తర్వాత హైటెక్‌సిటీ నిర్మాణానికి శంకుస్థాపన జరగడంతో ఇక్కడి భూములకు డిమాండ్‌ పెరిగింది. దీంతో కోర్టుల్లో వివాదాలకు పరిమితమైన ఈ భూమి.. హత్యలు-ప్రతి హత్యలకు వేదికగా మారింది. ఆ పార్టీ.. ఈ పార్టీ అని కాకుండా.. అధికార, ప్రతిపక్షాల నేతలు కబ్జాలకు పాల్పడ్డారు. 1989లో సాబేర్‌ చావూ్‌సను అతడి ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. సాబేర్‌ తండ్రి.. తన ప్రత్యర్థులపై బేగంబజార్‌లో బాంబుతో దాడి చేయించాడు. తుపాకీతో ఫైర్‌ చేయించారు. 1997లో రియల్టర్‌ హరిబాబు హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత మాదాపూర్‌లో అబూబకా్‌సను ప్రత్యర్థులు దారుణంగా చంపారు. ఇప్పుడు భూమా అఖిలప్రియ-ప్రవీణ్‌కుమార్‌ మధ్య వివాదంలో ఉన్న భూమిలో.. శేఖర్‌నాయుడు అనే రియల్టర్‌ను ప్రభాకర్‌రాయుడు అనే వ్యక్తి 2005లో హత్య చేయించాడు. ఆ తర్వాత ప్రభాకర్‌ రాయుడు పంజాగుట్టలో హత్యకు గురయ్యాడు. తాజాగా ప్రవీణ్‌కుమార్‌, అతడి సోదరుల కిడ్నా‌పయ్యారు. కొందరు రియల్టర్లల ఈ భూములను క్లెయిమ్‌ చేసుకోవడానికి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు. తప్పుడు కేసులతో.. సెటిల్మెంట్‌ డిక్రీలు పొంది.. వాటి ఆధారంగా మ్యుటేషన్లు చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ భూమి ప్రైవేట్‌ వ్యక్తులకు చెందినదని 2003లో సుప్రీంకోర్టు తేల్చిచెప్పడంతో వివాదం రాజుకుందంటున్నారు.   ప్రవీణ్ రావు కిడ్నాప్ తో హఫీజ్ పేట భూములు మళ్లీ తెరపైకి రావడంతో కొత్త కొత్త విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య సంచలన ఆరోపణలు చేశారు. మియాపూర్, హఫీజ్ పేటలోని వేల కోట్ల రూపాయల విలువైన భూములు రాజకీయ నేతల కబ్జాల్లో ఉన్నాయన్నారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్. సినీ నిర్మాత సీ కల్యాణ్, ఐ సుదర్శన్ రావులు ఈ భూముల కబ్జా వెనక ఉన్న పెద్దలని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రికి భూకబ్జాల్లో పాత్ర ఉందని గాదె ఇన్నయ్య ఆరోపించారు. మెదక్, మహబూబ్ నగర్ , రంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 మంది వెలమ దొరలు.. 50 వేల కోట్ల విలువైన భూములను తమ చేతుల్లో ఉంచుకున్నారని గాదె ఇన్నయ్య సంచలన ఆరోపణలు చేశారు. 

త‌ల్వార్‌తో కేక్ క‌ట్ చేసి.. క్ష‌‌మించ‌మ‌ని వేడుకున్న స్టార్ యాక్ట‌ర్‌!

  విజ‌య్ టైటిల్ రోల్ చేసిన 'మాస్ట‌ర్' మూవీలో విల‌న్ భ‌వానీ పాత్ర‌లో గొప్ప‌గా రాణించి, అంద‌రి ప్ర‌శంస‌లూ అందుకుంటున్న విజ‌య్ సేతుప‌తి తాజాగా అంద‌రికీ క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. కార‌ణ‌మేంటో తెలుసా?  బ‌ర్త్‌డే వేడుక‌లో కేక్‌ను పెద్ద త‌ల్వార్‌తో క‌ట్ చేసినందుకు! జ‌న‌వ‌రి 16 ఆయ‌న పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా త‌మిళంలో షేర్ చేసిన ఒక సుదీర్ఘ‌మైన లేఖ‌లో, తానొక బ్యాడ్ ఎగ్జాంపుల్‌ను సెట్ చేశాన‌నీ, కానీ ఫ్యూచ‌ర్‌లో జాగ్ర‌త్త‌గా ఉంటాన‌నీ ప్రామిస్ చేశాడు.  పొన్‌రామ్ డైరెక్ష‌న్‌లో చేస్తున్న సినిమా సెట్స్‌పై మూడు రోజుల ముందుగానే అత‌ను త‌న బ‌ర్త్‌డే వేడుక‌ను జ‌రుపుకున్నాడు. యూనిట్ మెంబ‌ర్స్ అత‌ని కోసం ఓ బ‌ర్త్‌డే కేక్‌ను తీసుకొచ్చారు. దానికి ఓ పెద్ద క‌త్తితో క‌ట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసింది. దాంతో పాటు కాంట్ర‌వ‌ర్సీని కూడా సృష్టించింది. పెద్ద త‌ల్వార్‌తో కేక్ క‌ట్ చేసి, యువ‌త‌కు, అభిమానుల‌కు ఏం సందేశ‌మిస్తున్నారంటూ ప‌లువురు ప్ర‌శ్నించారు. దీంతో త‌న పొర‌పాటు గ్ర‌హించిన విజ‌య్ సేతుప‌తి త‌న చ‌ర్య‌కు క్ష‌మించ‌మ‌ని కోరాడు.  "నా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విష్ చేసిన సినిమా వ్య‌క్తుల‌కూ, అభిమానుల‌కు మ‌నస్ఫూర్తిగా థాంక్స్ చెప్పుకుంటున్నా. మూడు రోజుల క్రితం నా బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్ సంద‌ర్భంగా తీసిన ఫొటో ఇప్పుడు కాంట్ర‌వ‌ర్సీ అయ్యింది. ఆ ఫొటోలో ఓ పెద్ద‌క‌త్తితో నా బ‌ర్త్‌డే కేక్‌ను  కట్ చేస్తున్నాను. నేను డైరెక్ట‌ర్‌ పొన్‌రామ్ సినిమాలో న‌టిస్తున్నా. ఆ మూవీలో ఆ క‌త్తి చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. పొన్‌రామ్‌, ఆయ‌న టీమ్‌తో నా బ‌ర్త్‌డేని సెల‌బ్రేట్ చేసుకోవ‌డం వ‌ల్ల‌, నా కేక్‌ను క‌ట్ చేయ‌డానికి ఆ క‌త్తిని ఉప‌యోగించాను. ఇది ఒక చెడు ఉదాహ‌ర‌ణ‌గా చాలామంది ఆక్షేపించారు. ఇప్ప‌ట్నుంచీ, నేను జాగ్ర‌త్త‌గా ఉంటాను. ఎవ‌రినైనా నేను హ‌ర్ట్ చేసిన‌ట్ల‌యితే, వారికి క్ష‌మాప‌ణ‌లు చెప్తున్నా, నా చ‌ర్య‌కు చింతిస్తున్నాను." అని ఆ లేఖ‌లో తెలియ‌జేశాడు విజ‌య్ సేతుప‌తి. ఈమ‌ధ్యే శ్రీ‌లంక దిగ్గ‌జ స్పిన్న‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ బ‌యోపిక్‌లో న‌టించేందుకు సిద్ధ‌ప‌డి, త‌మిళుల నుంచి వ‌చ్చిన నిర‌స‌న‌ల‌తో వెన‌క్కి త‌గ్గిన విజ‌య్ సేతుప‌తి, అప్పుడు కూడా త‌న‌ను క్ష‌మించ‌మ‌ని కోరిన విష‌యం తెలిసిందే.

ఈమె మ‌హేశ్ హీరోయిన్‌.. గుర్తు ప‌డ‌తారా?

  పూరి జ‌గ‌న్నాథ్ డిస్క‌వ‌రీగా ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది ఓ తార‌. మొద‌ట క‌న్న‌డంలో పునీత్ రాజ్‌కుమార్ స‌ర‌స‌న 'అప్పు' మూవీలో, త‌ర్వాత అదే సినిమా తెలుగు రీమేక్ 'ఇడియ‌ట్‌'లో హీరోయిన్‌గా న‌టించి, రెండు భాష‌ల్లోనూ తెరంగేట్రం సినిమాతో సెన్సేష‌న‌ల్ హీరోయిన్‌గా మారిందామె. ఆమె.. ర‌క్షిత‌. 'ఇడియ‌ట్' త‌ర్వాత మ‌హేశ్ స‌ర‌స‌న 'నిజం', వేణు జోడీగా 'పెళ్లాం ఊరెళితే', జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో 'ఆంధ్రావాలా' సినిమాల్లో న‌టించిన ఆమె 2007లో క‌న్న‌డ డైరెక్ట‌ర్ ప్రేమ్‌ను వివాహం చేసుకొని, సినిమాల‌కు దూర‌మైంది. హీరోయిన్‌గా త‌న అంద‌చందాలు, హుషారైన న‌ట‌న‌తో ల‌క్ష‌లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్న ర‌క్షిత‌, వివాహ‌మైన నాలుగేళ్ల‌కు ప్రొడ్యూస‌ర్‌గా మారి ఇప్ప‌టికే మూడు సినిమాలు నిర్మించి, ప్ర‌స్తుతం నాలుగో సినిమాని నిర్మిస్తోంది. న‌టిగా ఉన్నంత కాలం త‌న రూప లావ‌ణ్యాల‌ను చ‌క్క‌గా మెయిన్‌టైన్ చేస్తూ వ‌చ్చిన ఆమె, ప్ర‌స్తుతం బాగా బ‌రువు పెరిగిపోయింది. ముఖం కూడా చాలా మారిపోయింది. అప్ప‌టి 'ఇడియ‌ట్' హీరోయిన్ ఈమేనంటే తెలుగు ప్రేక్ష‌కులు గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోయింద‌నేది నిజం. ఈ ఏడాది సంక్రాంతిని ఆమె త‌న కుటుంబంతో త‌మ ఫామ్‌హౌస్‌లో గ‌డిపింది. అక్క‌డి గోవులు, వాటి పిల్ల‌ల‌తో ఆడుతూ గ‌డిపింది. దీనికి సంబంధించిన ప‌లు పిక్చ‌ర్స్‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది ర‌క్షిత‌. "Namma Sankranthi habba ..... this was the most fun I have had in ages ..... hope u guys have had a super day too .... happy happy Sankranthi to everyone." అంటూ వాటికి క్యాప్ష‌న్ జోడించింది. ఆవు దూడ‌ల‌తో ఆమె ఆడుతున్న ఫొటోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైర‌ల్‌గా మారాయి.

మంచు ఈవెంట్‌..‌ మ‌హేశ్ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌!

  మంచు విష్ణు భార్య విరానికా బ‌ర్త్‌డే జ‌న‌వ‌రి 15. ఈ సంద‌ర్భంగా విష్ణు ఇచ్చిన పార్టీకి మ‌హేశ్, న‌మ్ర‌త దంప‌తులు హాజ‌ర‌య్యారు. దీంతో ఆ పార్టీకి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ వ‌చ్చిన‌ట్ల‌యింది. వారితో పాటు హీరో గోపీచంద్ కూడా ఈ పార్టీకి వ‌చ్చాడు. విష్ణు, గోపి మంచి ఫ్రెండ్స్‌. త‌న భార్య బ‌ర్త్‌డేని పుర‌స్క‌రించుకొని శుక్ర‌వారం రాత్రి విష్ణు పార్టీ ఇచ్చాడు. దీనికి మ‌హేశ్ దంప‌తుల‌తో పాటు, గోపీచంద్‌నూ ఆహ్వానించాడు. విష్ణు ఆహ్వానం మేర‌కు భార్య న‌మ్ర‌త‌తో క‌లిసి ఆ బ‌ర్త్‌డే పార్టీకి అటెంట‌య్యాడు మ‌హేశ్‌. ఆ దంప‌తుల రాక‌తో విష్ణు దంప‌తులు ఖుషీ అయ్యారు. విష్ణు ఎంత సంబ‌ర‌ప‌డ్డాడంటే.. మ‌హేశ్ క‌పుల్‌తో త‌మ క‌పుల్ తీయించుకున్న ఫొటోను త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేశాడు. దాంతో పాటు, "ఈ ఫొటోలోని ఒక వ్య‌క్తి రోజు రోజుకీ యువ‌కుడిగా ఎదుగుతూ, మ‌రింత ఆందంగా క‌నిపిస్తున్నాడు. ఇది అత‌ని మంచి గుణం‌, ద‌యార్ద్ర హృద‌యంతోనే అని నేను బ‌లంగా న‌మ్ముతున్నాను." అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌కు వేల సంఖ్య‌లో లైక్స్ వ‌చ్చాయి. ఆ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇటు మ‌హేశ్ ఫ్యాన్స్‌, అటు విష్ణు ఫ్యాన్స్ ఈ పోస్ట్‌కు ఖుషీ అవుతున్నారు. ఈ ఫొటోలో మ‌హేశ్‌, న‌మ్ర‌త ఇద్ద‌రూ క్యాజువ‌ల్ లుక్స్‌లో ఆక‌ట్టుకుంటున్నారు. మ‌హేశ్ బ్లాక్ క‌ల‌ర్ నెక్ టీ షర్ట్‌, లైట్ బ్యూ జీన్స్ ధ‌రించ‌గా, విష్ణు బ్లాక్ క‌ల‌ర్ టీ ష‌ర్ట్‌, ప్యాంట్ ధ‌రించాడు.

న‌మిత పొంగ‌ల్ ముగ్గులు వైర‌ల్‌!

  త‌క్కువ సినిమాల‌తోనే ఎక్కువ పేరు తెచ్చుకొనే తార‌లు కొద్దిమందే ఉంటారు. వారిని ప్రేక్ష‌కులు అంత త్వ‌ర‌గా మ‌ర‌చిపోరు. అలాంటి తార‌ల్లో న‌మిత ఒక‌రు. ఆమె వేళ్ల‌మీద లెక్కించ‌ద‌గ్గ సినిమాల్లోనే న‌టించింది. ప్రస్తుతం ఆమెకు తెలుగులో అవ‌కాశాలు కూడా లేవు. అయినా న‌మిత వార్త‌ల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇటీవ‌ల ప్ర‌భాస్‌తో ఆమె పేరు క‌లిసి సోష‌ల్ మీడియాలో విరివిగా క‌నిపించింది. 'బిల్లా' సినిమాలో చేసే టైమ్‌లో ఆ ఇద్దరి మ‌ధ్యా బంధం పెన‌వేసుకుందంటూ వ‌దంతులు షికార్లు చేశాయి. అయితే వాటిని న‌మిత ఖండించారు.  త‌న ఫిగ‌ర్‌తోటే న‌మిత చాలామంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. మ‌ధ్య‌లో బాగా బ‌రువు పెర‌గ‌డం వ‌ల్ల హీరోయిన్ చాన్సులు త‌గ్గిపోయాయి. ఆ త‌ర్వాత త‌మిళ్ బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌ర‌చారు. ఆ షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక‌ త‌న బాయ్‌ఫ్రెండ్ వీరేంద్ర‌ను 2017లో ఆమె పెళ్లాడారు. రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన ఆమె, ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు బీజేపీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యురాలిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీకి ఆమె స్టార్ కాంపైన‌ర్‌.  కాగా సంక్రాంతి పండుగ‌ను ఆమె త‌న కుటుంబంతో జాలీగా జ‌రుపుకున్నారు. త‌మ ఇంటి ముందు స్వ‌యంగా ముగ్గులు వేసి, వాటికి రంగుల‌ద్దారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఏమైనా న‌మిత గ్లామ‌రే వేరు!

పాండ్యా బ్ర‌ద‌ర్స్ తండ్రి మృతి!

  ఇవాళ ఇండియ‌న్ క్రికెట్‌లో హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా సోద‌రులు త‌మ‌దైన ముద్ర‌వేస్తూ ముందుకు పోతున్నారు. ముఖ్యంగా ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ త‌ర‌పున బ‌రిలోకి దిగుతున్న ఈ బ్ర‌ద‌ర్స్ ఆ జ‌ట్టు నాలుగు సార్లు చాంపియ‌న్ కావ‌డంలో త‌మ వంతు పాత్ర‌ను స‌మ‌ర్థంగా పోషిస్తున్నారు. కాగా, వారి తండ్రి హిమాన్షు పాండే గుండె పోటుతో నేడు (జ‌న‌వ‌రి 16) మృతి చెందారు. దాంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కొడుకుల కోసం హిమాన్షు త‌న వ్యాపారాన్ని సైతం త్యాగం చేశారు. ఈ రోజు హార్దిక్‌, క్రునాల్ క్రికెట్‌లో కెరీర్‌ను ఆస్వాదిస్తున్నారంటే అది తండ్రి ప‌డిన క‌ష్టం ఫ‌లిత‌మే. ఈ విష‌యం ఆ బ్ర‌ద‌ర్స్ ప‌లు సంద‌ర్భాల్లో తెలియ‌జేశారు కూడా. సూర‌త్‌లో ఓ చిన్నపాటి కార్ ఫైనాన్స్ బిజినెస్ న‌డుపుతుండే హిమాన్షు, కొడుకుల కెరీర్ కోసం దాన్ని మూసేసి, అక్క‌డి కంటే మంచి క్రికెట్ ట్రైనింగ్ సౌక‌ర్యాలు ఉన్న వ‌డోద‌ర‌కు మ‌కాం మార్చారు. అక్క‌డి కిర‌ణ్ మోరే క్రికెట్ అకాడ‌మీలో క్రునాల్‌, హార్దిక్‌ల‌ను చేర్చారు. అక్క‌డే ఆ సోద‌రులు క్రికెట్‌లో శిక్ష‌ణ పొంది భార‌త క్రికెట్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించే స్థాయికి ఎదిగారు. త‌మకు మంచి కెరీర్ ఇవ్వ‌డానికి ఎన్నో క‌ష్టాలు ప‌డిన తండ్రిని కోల్పోవ‌డంతో పాండ్యా బ్ర‌ద‌ర్స్ క‌న్నీరు మున్నీర‌వుతున్నారు. హిమాన్షు పాండే మృతి వార్త తెలిసిన వెంట‌నే త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా సంతాపం తెలియ‌జేశాడు బార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. "హార్దిక్‌, క్రునాల్ వాళ్ల నాన్న మృతి చెందార‌నే వార్త విన‌గానే గుండె బ‌ద్ద‌లైంది. ఆయ‌న‌తో రెండు మూడు సార్లు మాట్లాడాను. జీవితాన్ని ఎంత‌గానో ఆస్వాదించే వ్య‌క్తిగా ఆయ‌న క‌నిపించారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌లుగుగాక‌. హార్దిక్‌, క్రునాల్ గుండె నిబ్బ‌రం చేసుకోండి." అంటూ ట్వీట్ చేశాడు.

రాజకీయాలకు బలౌతున్న ఐఏఎస్ అధికారులు

ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు. తండ్రి చేతిలో ఎత్తులు చుసిన వారు తనయుడి చేతిలో లోతులు చూస్తున్నారు. వారిద్దరూ సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఒకరినైతే మెడపట్టుకుని బయటకు గెంటేశారు. మరొకరిని కులం పేరుతో కుళ్లపొడుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరు అధికారులూ కూడా చంద్రబాబు అంటే గిట్టనివారే. ఇద్దరు అధికారులు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చూపుకు గురి అయిన వారే. ఒకరు బలయ్యారు.. మరొకరు అవుతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే ఒకరు ఎల్‌వి సుబ్రహ్మణ్యం. రెండో వారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యంకు జగన్ కేసుల్లో సహా ముద్దాయిగా ఉన్నారని ప్రాధాన్య పోస్టులు ఇవ్వలేదు. ఒక సందర్భంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పోస్టు ఇచ్చినా మళ్ళీ ఆయనను అక్కడ నుంచి తీసి అత్యంత చిన్నదైన యువజన శాఖకు మార్చారు. ఇక రమేష్ కుమార్ పరిష్తితి కూడా దాదాపుగా అంతే. చంద్రబాబు హయాంలో ఆయనకు ఏ కీలక శాఖ లభించలేదు. ఈ ఇద్దరూ వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిభకు తగిన గుర్తింపు పొందారు. ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఇద్దరూ ఆర్ధిక శాఖను నిర్వహించిన వారే. ఆర్ధిక శాఖలో ఈ ఇద్దరిదీ ప్రత్యేకమైన శైలి అని వారితో సాన్నిహిత్యం ఉన్న అధికారులు అంటారు. రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడంలో బిల్లుల చెల్లింపు తదితర విషయాలలో ఎలాంటి వివాదాలు రాకుండా చూసిన వారన్న విషయాన్ని మర్చిపోలేం అని చెప్తున్నారు. ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడం, జవాబుదారీతనం, దుబారా తగ్గించడం వంటి విషయాల్లో ఈ ఇద్దరూ అనేక చర్యలు తీసుకున్నారు.వీరికి ఇంకో పోలిక కూడా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఇద్దరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా పని చేశారు. ఈ ఇద్దరి హయాంలో తిరుమల పవిత్రత రెండింతలు పెరగడమే కాకుండా క్రమ శిక్షణ ఉండేదన్న విషయం మర్చిపోరాదు. భక్తుల సౌకర్యార్ధం ఈ ఇద్దరి హయాంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతో సీనియర్ రాజకీయ నాయకులు ట్రస్టు బోర్డు చైర్మన్లుగా ఉన్నా కూడా ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఈవోలుగా ఉన్నప్పుడు వీరు చెప్పినట్లే నడచుకునేవారన్న పేరుండేది. వృత్తి పట్ల అంతటి నిబద్ధతతో ఈ ఇద్దరు అధికారులు పని చేశారు. అత్యంత సీనియర్ అయిన ఎల్‌వి సుబ్రహ్మణ్యం ను పక్కన పెట్టి ఆయన కన్నా జూనియర్లకు చంద్రబాబునాయుడు చీఫ్ సెక్రటరీ పదవిని అప్పగించారు. అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యని విషయం మనం చూసాం. సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేటాను పక్కన పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఎల్‌వి సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఎన్నికల కమీషన్ ప్రధాన కార్యదర్శిగా నియమించాక సహ ముద్దాయిని సిఎస్ గా ఎలా నియమిస్తారని విమర్శించారు కూడా.   ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ ఎల్‌వీ ని కొనసాగించగా జగన్ ను అందరూ మెచ్చుకున్నారు కూడా. అయితే ఏమైందో ఏమూ కానీ కొద్ది కాలంలోనే ఎల్‌వి ని అత్యంత అవమానకరంగా పదవి నుంచి జగన్ తొలగించిన విధానం కూడా తెలిసిందే. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా దాదాపుగా అలానే జరిగింది. ఆయనను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించడం చంద్రబాబుకు అస్సలు ఇష్టం లేదు. చంద్రబాబు దగ్గర పని చేయడం రమేష్ కుమార్ కూ ఇష్టం లేదని అంటారు. అయితే తన కార్యదర్శిగా పని చేసిన రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నియమించాలని అప్పటి గవర్నర్ ఇ ఎస్ ఎల్ నర్సింహన్ చంద్రబాబుపై వత్తిడి తెచ్చారనీ. గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అప్పగించారనీ అంటున్నారు. రమేష్ కుమార్ పేరు బదులు వేరే అధికారి పేరు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశామని చంద్రబాబు కూడా చెప్పారు. అటువంటి రమేష్ కుమార్ ఇప్పుడు చంద్రబాబు ఏజెంటుగా జగన్ చేతిలో ముద్ర వేయించుకోవడం దురదృష్టం. ఈ ఇద్దరూ ముక్కుసూటిగా మాట్లాడే అధికారులు. ఎలాంటి మొహమాటం లేకుండా విధులు నిర్వర్తించే వారన్న పేరుంది. అలాంటి ఈ ఇద్దరూ కూడా అత్యంత ఘోరమైన అవమానాన్ని పొందారు. ఈ అవమానాలకు వీరు అర్హులు కాదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చని అధికార వర్గాలు అనుకుంటున్నారు. నాయకులు తమ స్వంత ప్రయోజనాల కోసం అఖిల భారత సర్వీసు అధికారులకు కులాలు, ప్రాంతాలు అంటగట్టడం ఏంటని కొందరు ఆవేదన చెందుతున్నారు.

ఆంధ్ర లో బీజేపీ 'పంచ్' తంత్రం...

  * దిగుమతి నాయకులు, బిజినెస్ లీడర్లు, లాబీయిస్టులు కలిసి బీ జె పి ని ఎటు నడిపిస్తారో....  * ఇంతకీ స్థానిక సమరం లో సత్తా చూపించే ట్యాలెంట్ ఆ పార్టీకి ఉన్నట్టా, లేనట్టా....  * జి వి ఎల్ ఋతుపవనాల్లాంటి వారు... ఇలావచ్చి అలా పలకరించి, అటు నుంచి ఆటే మాయమైపోతారు  * సి ఎం రమేష్ లాబీ మాస్టర్ గా ఢిల్లీ లో ప్రసిద్ధులు.. నోకియా మాదిరి ఈయన కూడా కనెక్టింగ్ పీపుల్ నినాదాన్ని బలంగా నమ్మిన వారు  * సుజనా చౌదరి... గత్యంతరం లేని పరిస్థితుల్లో అమరావతి నినాదాన్ని భుజాన వేసుకుని చందమామ కథలో విక్రమార్కుడి మాదిరి ... వై ఎస్ ఆర్ సి పి లోని బేతాళుడి తో జగడమాడుతుంటారు  * టీ జీ వెంకటేష్.. అవసరార్ధ రాజకీయాల కు కేరాఫ్ అడ్రెస్ .... రాయలసీమ అనేది ఈయనకు ట్యాగ్ లైన్ ...దురదపుట్టినప్పుడు గోక్కోవటానికి ఉపయోగపడే ఆరో వేలుగా ఆయన ఆ నినాదాన్ని బాగా వాడేస్తారు..  * అంగ వంగ కళింగ రాజ్యాలను అవలీలగా గెలిచిన చక్రవర్తి, చివరకు ఆముదాలవలస లో ఓడిపోయినట్టు, రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ , చివరకు పవన్ కళ్యాణ్ తో కలిసి స్థానిక సమరం లో బీజేపీకి కాస్తో కూస్తో ఉన్న ఇమేజ్ ని పణం గాపెట్టే సాహసానికి ఒడిగట్టారు  ఆ ఐదుగురూ ఇంతకీ ఏమి చేస్తున్నట్టు..భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్ , కాంగ్రెస్ లో నుంచి బీ జె పి లోకి షిఫ్ట్ అయిన  బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ  నారాయణ కలిసి ఈ స్థానిక సమరం లో రాష్ట్రం మొత్తం మీద కనీసం ఒక్కొక్కరికి 50 చొప్పున 250 మంది ఎం పి టి సి లు, జెడ్ పీ టి సి లను  గెలిపించుకురాగలరా అనేది చాలా పెద్ద సందేహం గా కనిపిస్తోంది. ఎందుకంటే, నిన్ననే విజన్ డాక్యుమెంట్ ని కలిసి ఆవిష్కరించిన బీ జె పి , జన సేన కంబైన్ నేతలు , చాలా పెద్ద  దృశ్యాన్నే జనం ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వై ఎస్ ఆర్ సి పి, తెలుగుదేశం పార్టీ లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు గా ప్రకటించుకున్న ఈ ఐదుగురిదీ  వాస్తవానికి తలో దారీ.. ఎవరు , ఎప్పుడు, ఎందుకు, ఎలా మాట్లాడతారో తెలీని గందర గోళం ....  జి వి ఎల్ నరసింహ రావు ది అయితే సొంత రాజ్యాంగం, పూర్తిగా పార్టీ రాష్ట్ర శాఖ తో  గానీ, లేదా బీ జె పి లో ఉన్నతెలుగుదేశం మాజీ లతో  కానీ ఈయనకు ఎలాంటి సంబంధాలు ఉండవు.  రాష్ట్రాన్ని ఎప్పుడైనా పలకరించడానికి రుతు పవనాల మాదిరి అలా చుట్టపు చూపు గా వచ్చేసి ,  ఇలా మాయమైపోయే  జి వి ఎల్ వ్యవస్థ ల గురించి రాష్ట్ర బీ జె పి లో ఎవరికీ ఎలాంటి క్లూలు ఉండవు. ఈయన దారి రహదారి. ఈయన వ్యవస్థ ఇలాఉంటే, బీ జె పి లో ఉంటూ కూడా ఇంకాతెలుగు దేశం ఎజెండా , జెండా రెండూ మోస్తున్నట్టు కనిపించే సుజనా చౌదరి ఒక్క అమరావతి అంశం మీద తప్పించి, ఇతరత్రా ఏదీ మాట్లాడటానికి ఎక్కువగాఇష్టపడరు. జీ వీ ఎల్ కు, సుజనా కూ క్షణం పడదు. ఆయన ఎడ్డెం అంటే ఈయన తెడ్డెం అనే రకం.. ఏ మాత్రం పొసగని,పొంతన లేని పరస్పర భిన్నమైన అభిప్రాయాలు గల వీరిద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం మాదిరి ఒకే పార్టీ లో ఉంటూ కూడా కామన్  ఎజెండా తో పని చేసిన దాఖలాలు ఇప్పటివరకూ అయితే లేవు.   ఇహ, సి ఎం రమేష్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయన తన బిజినెస్ వ్యవహారాలను బీ జె పి తో ముడి కట్టేసి, ఏ పార్టీ లో ప్రయాణిస్తున్నాడో కూడా మర్చే పోయి, మొన్నటికి మొన్న పరిమళ్ నత్వాని ని జగన్ మోహన్ రెడ్డి దగ్గర ప్రవేశ పెట్టడం లో కీలక పాత్ర పోషించిన  ఘనుడు. గుర్తు చేస్తే కానీ తానూ బీ జె పి లో ఉన్నాననే విషయం గుర్తుండని ఈయన కు  బీ జె పి, జన సేన కలిసి పోటీ  చేస్తున్న విషయం తెలుసో లేదో అని కూడాపార్టీ శ్రేణులు గుసగుస లాడుకుంటున్నాయి.  ఇహ వీరందరినీ సమన్వయము చేసుకుని  ముందుకెళ్తున్నట్టు భావిస్తూ , బాహ్య ప్రపంచం ముందు ఆవిష్కృతమయ్యే  వ్యక్తి మరెవరో కాదు... సాక్షాత్తూ  రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. ఈయన, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణించటానికి అంతగాసుముఖం గా లేదు...కారణమేమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి యోధులతో పోరాడిన తన రాజకీయం , చివరకు ఇలా ఏ పూట ఎక్కడ ఉంటారో కూడా తెలీని పవన్ కళ్యాణ్ పార్టీతో కలిసి పని చేయాల్సిన దుస్థితికి దిగజారటమేమిటని  తరచూ తనలో తానె కుమిలి పోతున్నట్టు సమాచారం.  ఇహ, టీ జీ వెంకటేష్ అయితే మరీను..... రాయలసీమ నినాదాన్ని తన ట్యాగ్ లైన్ గాచేసుకుని కాలక్షేపం చేసేస్తూ... ప్రస్తుతానికి బీ జె పి లో నివసిస్తూ ....ఈ స్థానిక ఎన్నికల సమరం లో తన పాత్ర ఏమిటో కూడాతెలీకుండా జీవనం వెళ్లదీస్తున్నారు. మొత్తానికి ఈ పంచ పాండవులు స్థానిక సమరం లో తమ 'పంచ్ ' పవర్ ఏమిటో ఈ నెలాఖరు లోగా చుపిస్తారేమోననే బోలెడు , ఇంకా గంపెడాశతో బీ జె పి అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

ఏపీలో వంద కోట్ల దందా.. రియల్ క్రైమ్ స్టోరీ

సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన.. ఆ రియల్ స్టోరీ టైటిల్ వచ్చేసి.. "ఓ కిడ్నాప్, వంద కోట్ల స్కాం". 'నేనే రాజు నేనే మంత్రి' మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. మీరు ఏ పార్టీకి ఓటేసినా మేమే అధికారంలో ఉంటామని. అవును.. కొందరు రాజకీయ నాయకులు.. ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తే.. ఆ పార్టీలోకి జంప్ చేస్తారు. అలాగే అధికారులు కూడా.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలని కాకాపడుతూ వారి ఆటలు సాగిస్తుంటారు. ఈ రియల్ స్టోరీ వింటే అది నిజమని మీకే అర్ధమవుతుంది. కాకినాడలోని సర్పవరంకి చెందిన ఆకుల గోవిందరాజు అనే వ్యక్తికి భోగాపురంలో వంద కోట్ల విలువైన 18 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ ఒక్క విషయం చాలదా.. మాఫియా కన్ను ఆయన మీద పడటానికి. ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్న గద్దకి కింద ఉన్న కోడిపిల్ల కనిపించినట్టు.. మాఫియా వాళ్ళకి ఎక్కడున్నా విలువైన ల్యాండ్స్ కనిపిస్తాయి కదా. అలాగే, బలగ ప్రకాష్ అనే మాఫియా లీడర్ కి.. ఆకుల గోవిందరాజుకి చెందిన ల్యాండ్ పై కన్నుపడింది. ఇంకేముంది ఏకంగా పోలీసులనే రంగంలోకి దింపాడు. ఇక పోలీసులైతే ఓ అడుగు ముందుకేసి ఏకంగా కిడ్నాప్ కే తెరలేపారు. 2017.. సెప్టెంబర్ 19 .... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. మధ్యాహ్నానికి- సాయంత్రానికి నడుమ సూర్యుడు మండిపోతున్న సమయం... అబ్బా ఏమన్నా ముహూర్తమా... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. ఇదే కిడ్నాప్ కి సరైన ముహూర్తం అనుకున్నారేమో పోలీసులు... AP 30 AB 6655 నెంబర్ గల ఇన్నోవా కార్ లో.. పోలీసులు ఆకుల గోవిందరాజు ఇంటికి వచ్చారు. కారు నెంబర్ ఫ్యాన్సీగా ఉన్నా, ఆ ఖాకీలు చేసే పని మాత్రం ఏ మాత్రం పద్దతిగా లేదు. వాళ్ళు చేసే పనేంటో ఆ చుట్టుపక్కల ఉన్నవారికి తెలియదు. కొత్త మొహాలు కావడంతో.. చుట్టుపక్కల వారు కొందరు ఆశ్చర్యంతో, కొందరు అనుమానంతో చూస్తున్నారు. వాళ్ళు అలా చూస్తుండగానే.. దొంగల రూపంలో వచ్చిన పోలీసులు.. గోవిందరాజుని ఇన్నోవాలో పడేసి.. జెట్ స్పీడ్ లో హైవే ఎక్కారు. పోలీసుల భాషలో చెప్పాలంటే దీనినే కిడ్నాప్ అంటారు. కారు హైవే మీద దూసుకెళ్తుంది. ఆ స్పీడ్ చూస్తే.. అంబులెన్స్ డ్రైవర్ కావాల్సిన వ్యక్తి ఇన్నోవా డ్రైవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. డ్రైవర్ స్టీరింగ్ పట్టుకుంటే.. మనం ఖాళీగా ఉండి ఏం చేస్తాం అనుకున్నారేమో.. మిగతా పోలీసులు గోవిందరాజు పనిపెట్టారు. కారు.. కాకినాడ నుంచి భోగాపురం చేరేవరకు.. అంటే దాదాపు నాలుగు గంటల పాటు... గోవిందరాజుని భయపెట్టారు.. బెదిరించారు.. చిత్రహింసలు పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే నరకం చూపించారు. కారు సాయంత్రం 6 గంటలకు భోగాపురం సబ్ రిజిస్టార్ ఆఫీస్ కి చేరుకుంది. ఖాకీలకు భయపడ్డాడో, కాసులకు కక్కుర్తి పడ్డాడో తెలియదు కానీ.. సబ్ రిజిస్టార్ పందిళ్లపల్లి రామకృష్ణ.. సాయంత్రం 4:30 కే రిజిస్ట్రేషన్ కాగితాలు సిద్ధం చేసి.. పదేళ్ల తర్వాత ఫారెన్ నుంచి రిటర్న్ వస్తున్న ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నట్టు.. గుమ్మం వైపు చూస్తూ పోలీసుల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో పోలీసులు గోవిందరాజుని తీసుకొని గుమ్మంలోకి అడుగు పెట్టనే పెట్టారు. గుమ్మంలో వాళ్ళ అడుగు పడిందో లేదో.. సబ్ రిజిస్టార్ మోహంలో వెలుగు వచ్చింది. గోవిందరాజు మోహంలో భయం పెరిగింది. భయంతో చూస్తుండగా ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్న మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనిపించాడు. జర్నీలో పోలీసుల చిత్రహింసలతో భయపడిపోయిన గోవిందరాజు.. బలగ ప్రకాష్ ని చూసి మరింత భయపడ్డాడు. బలగ ప్రకాష్.. పోలీసుల మాదిరి సాగదియ్యలేదు.. కమర్షియల్ సినిమాల్లో విలన్ లాగా ఒక్కటే డైలాగ్ కొట్టాడు.. "సంతకం పెడతావా? సమాధిలో పడుకుంటావా?".... ఆ ఒక్క డైలాగ్ తో గోవిందరాజు భయం చావుభయంగా మారిపోయింది. ఎదురుగా మాఫియా లీడర్.. చుట్టూ భోగాపురం సీఐ నర్సింహారావు, ఎస్సైలు తారక్, మహేష్.. హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు.. ఉన్నారు. ఎస్సైల పేర్లు తారక్, మహేష్ అని హీరోల పేర్లు ఉన్నాయి కానీ.. వాళ్ళ బిహేవియర్ మాత్రం పెద్ద విలన్ల పక్కన ఉండే చెంచా విలన్లు లాగా ఉంది. అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులే.. మాఫియా లీడర్ తో కలిసిపోయి.. చిత్రహింసలు చేసి బెదిరిస్తుంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో, వంద కోట్లు కంటే విలువైన ప్రాణం కోసం, అన్యాయం ముందు తలవంచి గోవిందరాజు సంతకం పెట్టాడు. ఆ ఒక్క సంతకంతో.. గోవిందరాజు మొహంలో తప్ప.. అక్కడున్న అందరి మొహాల్లో లక్ష్మీకళ ఉట్టిపడింది. అన్నట్టు ఇంత జరుగుతున్నా అక్కడ ఇతరులు ఎవరూ లేరా? అని మీకు అనుమానం రావొచ్చు. అక్కడ నిజంగానే ఎవరూ లేరు.. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ముహూర్తం అలాంటిది మరి. శూన్యమాసం-అమావాస్య.. బుద్ధి ఉన్నోడు ఎవడైనా రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాడా? వీళ్లంటే.. వంద కోట్ల కబ్జా ల్యాండ్ కాబట్టి.. బుద్ధిని పక్కనపెట్టి.. బెదిరించి.. రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. ఇప్పుడు అర్థమైందా వాళ్ళ శూన్యమాసం-అమావాస్య కాన్సెప్ట్ ఏంటో?!!.. ఈ కిడ్నాప్- కబ్జా వ్యవహారంపై.. సర్పవరం పోలీస్ స్టేషన్ లో 330/217 నెంబర్ తో కేస్ రిజిస్టర్ అయింది. అదేంటో.. FIR కూడా అయిన తరువాత.. చార్జిషీట్ దాఖలు చేయడానికి.. రాజమౌళి RRR చేయడానికి తీసుకునే టైం కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు సర్పవరం పోలీసులు. రెండున్నరేళ్లుగా నాన్చుతూనే ఉన్నారు. ఈ విషయం గురించి.. ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కాకినాడ పోలీసులు రిపోర్ట్ కూడా పంపారు. కానీ చార్జిషీట్ దాఖలు చేసే విషయంలో సర్పవరం సీఐ డిలే చేస్తూనే ఉన్నాడు. ఏంటి ఆ సీఐ ధైర్యం?.. భయపడితే భయపడటానికి ఆయన పోస్ట్ మ్యాన్ కాదు.. పోలీసోడు.. దానికితోడు పొలిటిషీయన్స్ సపోర్ట్ ఉన్నోడు. అవును.. ఈ వ్యవహారంలో.. బడా పొలిటిషీయన్స్ సపోర్ట్ కూడా ఉంది. అదే పోలీసుల ధైర్యం... శ్రీకాకుళం జిల్లాకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత.. అలాగే గత ప్రభుత్వ హయాంలో విప్ గా పనిచేసిన నేత.. వీరిద్దరి సాయంతో సర్పవరం పోలీస్ స్టేషన్ ని ఫుల్ గా influence చేసే ప్రయత్నం బలంగా నడుస్తుంది. అందుకే చార్జిషీట్ కి మోక్షం కలగట్లేదు. ఇంత పెద్ద కిడ్నాప్- కబ్జా జరిగితే అస్సలు చర్యలే తీసుకోకుండా ఎలా ఉన్నారని అనుకుంటున్నారేమో... అబ్బో చాలా పెద్ద చర్య తీసుకున్నారు. భోగాపురం ఇన్స్పెక్టర్ ని బదిలీ చేసారు. అదేంటి!!.. అంత జరిగితే కేవలం బదిలీనా అనుకోవద్దు.. రాజకీయ ఒత్తిళ్లు అలాంటివి మరి.. అర్థంచేసుకోవాలి... ఇంకో విషయం ఏంటంటే.. ఈ వ్యవహారం డీజీపీ ఆఫీస్ కి కూడా చేరింది. మరి ఇంకేంటి.. వెంటనే అందరి మీద చర్యలు తీసుకొని ఉంటారుగా అంటారా? అబ్బో.. మీరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాలు చూసి బాగా మోసపోయారు... అలాంటి పప్పులు ఇక్కడ ఉడకవు. వాస్తవానికైతే... CRPC 41A కింద డీజీపీ నియమించే ఓ సీనియర్ అధికారి.. విచారణ జరిపి.. తదుపరి చర్యల వరకు.. ఆ సీఐని సస్పెండ్ చేసే అవకాశముంది. కానీ ఇక్కడ అలాంటిదేం జరగలేదు. ఏదో ఫార్మాలిటీకి బదిలీతో సరిపెట్టారు. గోవిందరాజు ని బెదిరించి వంద కోట్ల విలువైన ల్యాండ్ అన్యాయంగా లాక్కున్నారు. అయినా తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. పైగా గోవిందరాజునే ఇంకా టార్చర్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లలో భాగంగా.. ప్రస్తుత సర్పవరం సీఐ మరియు అర్బన్ డీఎస్పీ.. గోవిందరాజుని పదేపదే తిప్పించుకుంటున్నారు. ఇక కాకినాడలో ఉద్యోగం వెలగపెడుతున్న.. ఇప్పటి ఓ మంత్రిగారి బావమరిది.. రంగంలోకి దిగడంతో ఈ కేసు మరింత డైల్యూట్ అయింది. అసలే భోగాపురంలో ఎయిర్ పోర్ట్ అంటున్నారు. రెక్కలున్న విమానాలు వస్తున్నాయి అంటే.. ఆటోమేటిక్ గా భూముల ధరలకు రెక్కలొస్తాయి కదా.. అందుకే పోలీసులు- పొలిటీషియన్స్ అండతో మాఫియా ఇంతలా రెచ్చిపోతుంది. అంతేకాదు.. ఈ వ్యవహారం వెనుక.. 2017 ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనిచేసిన ఓ కలెక్టర్ మరియు ఎస్పీ పాత్ర ఉన్నట్టు.. సెక్రటేరియట్ వర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. టీడీపీ పెద్దతలకాయలకు సన్నిహితులైన ఈ ఐఏఎస్, ఐపీఎస్ లు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా తమ హవా కొనసాగించడం... అందరినీ ముక్కు, మూతి ఇలా అన్నింటి మీదా వేలేసుకునేలా చేస్తుంది. ఇంతకీ ఆ ఐఏఎస్ & ఐపీఎస్ ఎవరు? * ఒకరు.. పరుల అవినీతి మీద కాంతివంతంగా దండెత్తే ఐఏఎస్... * ఇంకొకరు.. పొద్దునలేస్తే సుభాషితాలు చెప్పే పాలమీగడ లాంటి ఐపీఎస్.. ఈయనకి టెక్నాలజీ మీద గ్రిప్ బాగా ఎక్కువ. ఈ వ్యవహారంలో వీరిద్దరి పాత్ర కూడా ప్రముఖంగా ఉంది. 'వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కూలిపోతుంది' అన్నట్టు.. ఈ అవినీతి రాబందులను భయపెట్టే గాలివాన ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనుసన్నల్లో.. ఐఏఎస్, ఐపీఎస్లు, పోలీసులు, పొలిటీషియన్స్ అండతో జరిగిన ఈ అన్యాయంపై.. గోవిందరాజు కొద్ది నెలలుగా పోరాడుతూనే ఉన్నాడు. న్యాయం కోసం ఆయన ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదు. సన్నిహితుల సాయంతో న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఆ పోరాడంతో కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి అప్పుడు జరిగింది తప్పుడు రిజిస్ట్రేషన్ అని పేర్కొంటూ... భోగాపురం రిజిస్టార్ డాక్యుమెంట్ రైటర్.. 2019 అక్టోబర్ 19 తేదీన.. 164 CRPC స్టేట్మెంట్ ని.. కాకినాడ ఫస్ట్ అడిషనల్ జ్యూడిషల్ సివిల్ జడ్జ్.. ముందట ఇచ్చాడు. అంతేకాదు.. సీసీ కెమెరాలతో దొంగలని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల పుణ్యమా అని అడ్డంగా బుక్ అయ్యారు. సర్పవరం లో కిడ్నాప్ చేసి.. భోగాపురం తీసుకెళ్లిన.. నాలుగు గంటల తతంగమంతా.. పలు చోట్ల సీసీ కెమెరాలలో రికార్డు అయింది. క్షవరం అయితే కానీ ఇవరం రాదని.. సీసీ కెమెరాలు చూసి దోషులని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల సంగతి మర్చిపోయి ఇలా దొరికిపోవడం కామెడీగా ఉంది. మొత్తానికి కొద్దికొద్దిగా కదులుతున్న తీగతో.. దందా చేసి ఇన్నాళ్లు డొంకలో దాక్కున్నవారు.. ఇప్పుడిప్పుడే భయంతో వణుకుతున్నారు. ముఖ్యంగా డీజీపీకి కంప్లైంట్ వెళ్లడంతో ఐఏఎస్, ఐపీఎస్ ఒణికిపోతున్నారట. మరి ముఖ్యంగా ఆ ఐపీఎస్ అయితే.. డైపర్ వేసుకొని తిరుగుతున్నాడని టాక్... ఇప్పటికే ఆ ఐపీఎస్ గడిచిన రెండు నెలల్లో.. బలగ ప్రకాష్ టీం తో.. ఒకే హోటల్ లో 17 సార్లు సిట్టింగ్ వేశాడు. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు ఆ ఐపీఎస్ ఎంతలా వణికిపోతున్నాడో!! తప్పుని సరిదిద్దాల్సిన పోలీసులే.. ఇంత పెద్ద తప్పు చేశారు. ఈ విషయం డీజీపీ దృష్టికి కూడా వెళ్ళింది. మరి ఆయన ఈ కిడ్నాప్-కబ్జా వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?.. బాధితుడికి ఎప్పుడు న్యాయం చేస్తారు? ఆయన ఇలాగే మౌనంగా ఉంటే ప్రజలకు పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది. ఇక ఈ విషయంలో సర్కార్ కూడా అడుగు ముందుకేసి బాధితుడికి న్యాయం చేయాల్సిన అవసరముంది. అవినీతి రహిత పాలనే అందించడమే తమ లక్ష్యమని చెప్పుకునే అధికారపార్టీ.. అవినీతి-అన్యాయం చేసిన వారికి.. పరోక్షంగా అండగా ఉండటం ఎంత వరకు కరెక్ట్? గత ప్రభుత్వం మీద, అప్పుడు వారికి సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులపైనా.. ఇప్పటి అధికారపార్టీ నేతలు పదేపదే అవినీతి ఆరోపణలు చేస్తుంటారు. మరి ఈ వ్యవహారం మీద ఎందుకు నోరు మెదపడం లేదు? ఇందులో తమ పార్టీ నేతలు కూడా ఉన్నారా? లేక పార్టీ సీనియర్ నేతైన మంత్రి గారి బావమరిది ఇన్వాల్వ్ అయ్యాడని వెనకడుగు వేస్తున్నారా? ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ఈ భోగాపురం భాగోతం వెనుకున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి.. బాధితుడికి న్యాయం చేయాలి. లేదంటే ప్రభుత్వం మీద కూడా నమ్మకం పోతుంది.  

క‌విత‌, ష‌ర్మిలా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?

తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్‌లో పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్‌ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.  సామాజిక కోణంలో తమకు అవకాశం దక్కుతుందని పలువురు సీనియర్లు భావిస్తుండగా, ఇప్పటివరకు పార్టీ తరఫున రాజ్యసభ పదవులు దక్కని వర్గాల వారూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవితను ఈసారి పార్టీ తరఫున రాజ్యసభకు పంపిస్తార‌నే ప్ర‌చారం విస్తృతంగా జరుగుతోంది. అయితే సి.ఎం. కేసీఆర్ ఆలోచ‌నే ఎలా వుందో ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. కెటిఆర్ సి.ఎం. అవుతారా? క‌వితా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?  అయితే హ‌రిష్‌రావు ఈ ప‌రిణామాల‌పై ఎలా స్పందిస్తారు? అనే అంశంపై టిఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్‌ తన తరఫున ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రయత్నాలకు నమ్మకమైన వారి కోసం అన్వేషిస్తున్నారు.  రాజ్యసభ సీటు భర్తీ సామాజిక కోణంలోనే ఉంటుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు భావిస్తున్నారు. ఏపీ కోటాలో పదవీ విరమణ చేస్తున్న టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు వయసు రీత్యా ఈసారి అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. రెడ్లకు అవకాశం లభిస్తే, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, మాజీీ స్పీకర్‌ కె.ఆర్‌.సురే్‌షరెడ్డి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి మధ్య పోటీ ఉంటుందని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మండవ వెంకటేశ్వరావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని అంటున్నారు. బీసీలకు అవకాశం ఇస్తే సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య పేర్లు పరిశీలిస్తారని చెబుతున్నారు. ఎస్సీ కోటాలో భర్తీ చేయాలని భావిస్తే కడియం శ్రీహరి, మాజీ ఎంపీ మంద జగన్నాథం పేర్లు పరిశీలిస్తారని అంటున్నారు. ఎస్సీల్లోనే మాలలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే, టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ గాదరి బాలమల్లు, ఎస్టీ అయితే సీతారాంనాయక్‌ పేరు ఉండొచ్చని అంటున్నారు. అనూహ్యంగా ఒక పారిశ్రామికవేత్తను టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభకు పంపాలని అనుకుంటే హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి పేరు పరిశీలించవచ్చని చెబుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ స్థానాలు ఎవరికీ కేటాయించాలని ఇన్నాళ్లు చర్చించిన అధికార పార్టీ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారి జాబితా సిద్ధమైనట్టు సమాచారం.  కీలకమైన పదవులు కావడంతో పార్టీ నమ్ముకున్నోళ్లు.. తమకు అండగా నిలబడిన వ్యక్తులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది.  మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి - సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీమంత్రి - ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితా ఫైనలైనట్టు తెలుస్తోంది.  షర్మిల ఆపద సమయంలో జ‌గ‌న్‌కు తోడుగా నిలిచారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేశారు. కష్టకాలంలో పార్టీకి షర్మిల పెద్ద దిక్కుగా నిలిచారు. తన సొంత మీడియా సాక్షి ప్రారంభించినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ తో ఉన్నారు. సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ గా కొనసాగుతూనే జగన్ కు రాజకీయాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత సజ్జలను పార్టీలోకి ఆహ్వానించి పెద్ద పదవే ఇచ్చారు. విజయ సాయిరెడ్డి తర్వాత జగన్ కు అత్యంత నమ్మకస్తుడు సజ్జలనే. ఆయన పార్టీలో జగన్ రాజకీయ సలహాదారుడిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో పని చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ తన తోడు ఉండడంతో ఆయనను రాజ్యసభకు జగన్ పంపించనున్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. గతంలో ప్రకాశం ఎంపీగా సుబ్బారెడ్డి పని చేశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సుబ్బారెడ్డి పోటీ చేయలేదు. అప్పుడు ఆయన పదవులు ఆశించకపోవడంతో ఇప్పుడు రాజ్యసభకు పంపించాలని నిర్ణయానికి వచ్చారు. పార్టీలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపితే న్యాయం జరుగుతుందనే భావనలో జగన్ ఉన్నారంట. అనూహ్యంగా రాజ్యసభకు పంపే జాబితాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి ఉండడం గమనార్హం. అనంతపురము జిల్లాకు చెందిన రఘువీరారెడ్డికి పిలిచి మరి రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. యాదవ సామాజికి వర్గానికి చెందిన రఘువీరారెడ్డి జగన్ తండ్రి వైఎస్సార్ తో మంచి అనుబంధం ఉంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే మరొకరిని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిగా పని చేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారంట.  కృష్ణాజిల్లా యాదవ సామాజిక వర్గానికి చెందిన చలమేశ్వర్ సేవలను వినియోగించుకునేలా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందంట. ఎందుకంటే తరచూ జగన్ న్యాయస్థానాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నారు. చలమేశ్వర్ సేవలు వినియోగించుకుంటే జగన్ సేఫ్ గా ఉండడంతో పాటు న్యాయ కోవిదుడికి గౌరవంగా రాజ్యసభను ఇద్దామనే ఆలోచనలో ఉన్నారంట.

అధికారంలో ఉంటే ఒకలా... ప్రతిపక్షంలో ఉంటే మరోలా... వైజాగ్ ఎపిసోడ్ నీతి ఏంటి?

రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా, అనామకులుగా మారిపోయారు. దశాబ్దాల తరబడి రాజ్యాన్ని ఏలినవారు, ఇప్పుడు సైడైపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఉద్దండుల పరిస్థితి ఇప్పుడలాగే కనిపిస్తోంది. ఎంతోమంది ముఖ్యనేతలు తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మళ్లీ వాళ్లకు మంచి రోజులు వస్తాయని మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ ఊహించని రాజకీయ మార్పులు జరగడంతో ఓడలు బళ్లు... బళ్లు ఓడలయ్యాయి.  అయితే, అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలా ఉంటే మరోలా వ్యవహరించడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. విపక్ష నేతగా ఉన్న సందర్భాల్లో నేతలు వ్యవహరించే తీరు ఒక్కోసారి సాధారణ ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది. నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ క్రితం విపక్ష నేతగా ఉన్నారు. అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా కోసం పట్టుదలతో ఉన్నారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు వైజాగ్ పర్యటనకు వెళ్లారు. అప్పటికే అక్కడ సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరుగుతోంది. ఆ నేపథ్యంలో క్యాండిల్ ర్యాలీకి అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. అయినా కూడా జగన్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి నగరంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక, ఇప్పడు ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. అందులో భాగంగా చంద్రబాబు చేపట్టిన వైజాగ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందులో పోలీసులను తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అయితే, ఇలాంటి సమయంలో విపక్ష నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా పోలీసు వలయాన్ని ఛేదించుకోవాలని తాము అనుకున్నది చేయాలని చూస్తుంటారు. పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తుంటారు. చంద్రబాబు వైజాగ్ టూర్లోనూ అదే జరిగిందనే మాట వినిపిస్తోంది. నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. కాకపోతే...ఆ ప్రయత్నాలు సమాజంలో ఉద్రిక్తతలు పెంచేవిగా మాత్రం ఉండకూడదంటున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్న నాయకులు ప్రజాస్వామ్యంలో విపక్షాలకు ఉండే ప్రాధాన్యాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. అధికారపక్షం, విపక్షం....రెండూ ప్రజాస్వామ్యానికి రెండు చక్రాల్లాంటివని, ఏ ఒక్కటి సరిగా లేకున్నా ప్రజాస్వామ్యం కుంటుపడుతుందని గుర్తుచేస్తున్నారు.

రాజీవ్ గాంధీ మరణించాక ఆ సీక్రెట్ బయటపెట్టిన వాజపేయి!!

అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు హద్దు మీరి విమర్శలు చేసుకోవడమే తప్ప.. విలువైన రాజకీయాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజుల్లో. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నేతల మీద కక్ష తీచుకోవాలన్న ధోరణే తప్ప.. ప్రజల కోసం ఒకరి సూచనలను ఒకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేసేవారు ఎక్కడున్నారు?. ఈతరం రాజకీయ నాయకులు ముందుతరం వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ- వాజపేయి మధ్య జరిగిన ఓ సంఘటన తెలిస్తే.. ఈ తరం రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటారు. అది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయం. అప్పుడు వాజపేయి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారి మధ్య జరిగిన ఓ అపురూప సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  " సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట ".. ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.." ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి "మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం.. ఏర్పాట్లు చూడండి" అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు అటల్జీ ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి. " సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా?" నసిగాడు కార్యదర్శి వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ "నిక్షేపంగా" అన్నారు. ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ, అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు. "సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి?" అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా.. అదీ ఆయన మాటల్లోనే.. "1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా.1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది. డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు. ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా రమ్మని ఫోన్ లో కోరారు. కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ.. 'అటల్ జీ.. ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి' అని చెప్పారు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే. నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే" అని వాజపేయి అన్నారు. అది విలువలతో కూడిన రాజకీయమంటే. రాజీవ్ గాంధీ, వాజపేయి రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేశారు. వారిని చూసి ఈ తరం రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలి. పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అధికార-ప్రతిపక్ష పార్టీల నాయకులు.. రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం.. ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు..!

ఆత్మవిశ్వాసాన్ని పెంచే చిట్కా

మనిషి సాధించే విజయాలలో ఆత్మవిశ్వాసానిదే ముఖ్య పాత్ర. ఆ ఆత్మవిశ్వాసమే లేకపోతే, ఎంత ప్రతిభ ఉన్న ఫలితం గుండుసున్నాగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలన్నా, తోటివారిని దాటుకుని దూసుకుపోవాలన్నా ఆత్మవిశ్వాసమే కీలకమంటూ వ్యక్తిత్వ వికాస నిపుణులంతా తెగ ఊదరగొట్టేస్తుంటారు. అయితే అతి సులభంగా ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరిచే చిట్కా ఒకదాన్ని పరిశోధకులు రూపొందించారు.   ఆత్మవిశ్వాసాన్ని కొలిచారు జపానులోని క్యోటో నగరానికి చెందిన పరిశోధకులు ఓ ప్రయోగాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా వారు ఓ 17 మంది అభ్యర్ధులను ఎన్నుకొన్నారు. వీరితో చిన్నా చితకా పనులు చేయిస్తూ, ఆ సమయంలో వారి మెదడు పనితీరుని పరీక్షించారు. Decoded Neurofeedback అనే ఈ పరీక్ష ద్వారా వారు అభ్యర్థి మెదడులో ఆత్మవిశ్వాసపు స్థాయి ఏ తీరున ఉందో గమనించారు.   బహుమతులు అందించారు అభ్యర్థులు కొన్ని పనులు చేసేటప్పుడు వారిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్నట్లు గమనించారు. అలాంటి సమయంలో వారికి కొన్ని బహుమతులు అందించారు. పరిశోధకులు తమకు బహుమతులు ఎందుకు ఇస్తున్నారో అభ్యర్థులకు తెలియలేదు. కానీ వారి మెదడు మాత్రం ఆ ప్రతిఫలం పట్ల మంచి ఉత్తేజాన్ని పొందింది. అలా అభ్యర్ధికి తెలియకుండానే అతనిలో ఆత్మవిశ్వాసపు స్థాయిని పెంచే ప్రయత్నం చేశారన్నమాట. ఆత్మవిశ్వాసపు స్థాయి హెచ్చుగా ఉన్నప్పుడల్లా వారికి ఏవో ఒక పారితోషికాన్ని అందచేయడం వల్ల... ఆత్మవిశ్వాసం బలపడినట్లు గ్రహించారు.   పెంచాలన్నా – తగ్గించాలన్నా ఇదే పద్ధతిని వ్యతిరేక దిశలో చేస్తే కనుక ఆత్మవిశ్వాసాన్ని తగ్గించవచ్చునని అంటున్నారు పరిశోధకులు. అంటే మన మెదడులో ఆత్మవిశ్వాసం ఉండే స్థాయిని బట్టి, మనకి అందే ప్రతిఫలాలు దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయన్నమాట. ఈ పద్ధతిని ఉపయోగించి మున్ముందు మానసిక శాస్త్రవేత్తలు ఆత్మన్యూనతతో బాధపడేవారికి కొత్త జీవితాన్ని అందించవచ్చునని అంటున్నారు. డిప్రెషన్, అల్జీమర్స్ వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడేవారికి కనుక ఈ తరహా చికిత్సని అందిస్తే... వారి జీవన విధానం మెరుగవుతుందని ఆశిస్తున్నారు.   ఈ పరిశోధన కేవలం నిపుణులకే పరిమితం అయినా, దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు లేకపోలేదు. ఆత్మన్యూనతతో బాధపడే వ్యక్తులకు వారి చిన్నచిన్న విజయాలలో తోడుగా నిలబడి ప్రోత్సాహాన్ని అందించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పాదుకునే అవకాశం ఉంది. అలాగే బెరుకుగా, భయంగా ఉండే చిన్నపిల్లలకి ఏవో ఒక ప్రోత్సాహకాలు అందిస్తూ వారు ఏ లక్ష్యాన్నైనా సాధించగలరనే నమ్మకాన్ని కలిగించగలిగితే...  వారి జీవితానికి ఓ భరోసాని అందించినవారమవుతాం.  - నిర్జర.

కాలాన్ని జయించే ‘POSEC Method’

  ప్రపంచంలో ఎవరికైనా రోజుకి 24 గంటలే ఉంటాయి. కానీ ఆ 24 గంటలని ఎవరు ఎలా ఉపయోగించుకుంటారు అనేదాని మీద వారి జీవితాలు ఆధారపడి ఉంటాయి. అందుకే 20వ శతాబ్దంలో ‘Time Management’కి చాలా ప్రాధాన్యతని ఇస్తున్నారు. వాటికోసం రకరకాల వ్యూహాలూ ప్రచారంలో ఉన్నాయి. అలాంటి ఒక పద్ధతే ‘POSEC Method’.   1943లో Maslow అనే ఆయన Hierarchy of needs అనే సిద్ధాంతాన్ని రూపొందించారు. ఒక మనిషి సంతోషంగా ఉండేందుకు ఎలాంటి అవసరాలు తీరాలో ఇందులో పేర్కొన్నారు. దీని ఆధారంగానే ‘POSEC Method’ని రూపొందించారు. మన అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఈ పద్ధతిలో సూచించే ప్రయత్నం చేశారు.    అవేమిటంటే... Prioritize – మీ జీవితంలో అతిముఖ్యమైన లక్ష్యాలు ఏమిటి. వాటిని సాధించేందుకు ఏం చేయాలి. వాటి కోసం ఎంత సమయం కేటాయించాలి అన్న విషయాలన్నీ ఈ Prioritize కోవలోకి వస్తాయి.   Organize – జీవితం స్థిరంగా ఉండేందుకు ఎలాంటి పరిస్థితులు అవసరం అన్న అంశాలు ఈ విభాగంలోకి వస్తాయి. ఉదాహరణకు కుటుంబం, ఉద్యోగం, ఆరోగ్యం... లాంటి అంశాలన్నమాట.   Streamline – చేసే ప్రతి పనీ మనకి ఇష్టం లేకపోవచ్చు. కానీ జీవితం సాఫీగా సాగిపోవాలంటే వాటిని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. సమయానికి బండిని సర్వీస్‌ చేయించుకోవడం దగ్గర నుంచీ, బీమా ప్రీమియం చెల్లించడం వరకు మన చుట్టూ ఉంటే పరిస్థితులను సక్రమంగా ఉంచుకోవడం వల్ల సమయం, శ్రమా రెండూ ఆదా అవుతాయి.   Economize – కొన్ని పనుల వల్ల ఉపయోగం ఉండదు. అవి అత్యవసరమూ కాదు. కానీ ఇవి లేకపోతే జీవితం మరీ బోర్‌ కొట్టేయవచ్చు. స్నేహితులతో పార్టీ చేసుకోవడం, బంధువులు ఇంటికి వెళ్లడం, సినిమా చూడటం... లాంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి.   Contribute – పక్కవారికి ఏదో సాయం కావాలి! తోటి మనిషిగా ఆ బాధ్యతలో పాలు పంచుకోవడం మన కర్తవ్యం. వీధిలో జనం అంతా కలిసి రోడ్డుని శుభ్రం చేసుకుంటున్నారు! పౌరుడిగా పాల్గోవడం మన ధర్మం. ఎన్నికలు జరుగుతున్నాయి. పౌరుడిగా ఓటు వేసేందుకు లైనులో నిలబడటం మన బాధ్యత. ఇవన్నీ చేయాలని ఎవరూ అనరు. ఇలాంటి పనులు చేయడం వల్ల మనకి సమయం, శ్రమ వృధాగానే తోచవచ్చు. కానీ వీటి ఫలితం భవిష్యత్తులో కనిపించి తీరుతుంది. సమాజాన్ని ముందుకు నడిపించడంలో, మనం అశ్రద్ధ చేయలేదన్న తృప్తిని అందిస్తుంది. ఇలాంటి పనులన్నీ Contribute విభాగంలోకి వస్తాయి.   ఇవండీ ‘POSEC Method’ లక్షణాలు. మన జీవితంలో పనులన్నింటినీ ఈ దృక్పథంతో చూస్తే... వేటికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఎంత సమయం కేటాయించాలి అన్న స్పష్టత ఏర్పడుతుంది.  - నిర్జర.

దేశంలో సంక్రాంతి – ఒకోచోట ఒకోలా!

సంక్రాంతి తెలుగువారికి ముఖ్యమైన పండుగ అన్న విషయం తెలిసిందే! మన పక్కనే ఉన్న తమిళనాడులో కూడా పొంగల్‌ పేరుతో దీనిని ఘనంగా జరుపుకుంటారనే విషయమూ చాలామందికి తెలుసు. కానీ దేశంలోని అనేక రాష్ట్రాలలో దీనిని వేర్వేరు పేర్లతో ఘనంగా చేసుకుంటారు. వాటిలో కొన్ని...   పౌష్‌ సంక్రాంతి (పశ్చిమబెంగాల్) - పుష్య మాసంలో వస్తుంది కాబట్టి బెంగాలీయులు ఈ పండుగను పౌష్‌ సంక్రాంతి అని పిలుచుకుంటారు. వీరి పంటలు కూడా ఇప్పుడే ఇళ్లకు చేరుకుంటాయి. అలా ఇంటికి చేరిన కొత్త బియ్యానికి, ఖర్జూరపు బెల్లాన్ని కలిపి రకరకాల పిండివంటలు చేసుకుంటారు. మూడురోజులపాటు జరుపుకొనే ఈ పండుగ రోజుల్లో వీరు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఇక మకరసంక్రాంతి రోజునే గంగావతరణ జరిగిందని ఓ నమ్మకం. అది జరిగింది కోల్‌కతాకు సమీపంలో ఉన్న గంగాసాగర్ అనే ప్రాంతంలో కాబట్టి, అక్కడ ఉన్న గంగానదిలో స్నానామాచరించేందుకు లక్షలమంది తరలివెళ్తారు.   పంజాబ్‌ (మాఘి) – తెలుగువారు భోగి జరుపుకొనే రోజునే పంజాబీయులు లోరి అనే పండుగ చేసుకుంటారు. ఈ రోజున విశాలమైన మైదానాలలో మంటలు వేసుకుని దాని చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ భాంగ్రా అనే సంప్రదాయ నృత్యం చేస్తారు. దీనికి అనుగుణమైన భాంగ్రా పాటలు పాడుతూ, డోలు వాయిస్తూ సాగే కోలాహలం చూసి తీరాల్సిందే! ఇక లోరి మర్నాడు ‘మాఘి’ పేరుతో పండుగ చేసుకుంటారు. పంజాబీల కాలమానం ప్రకారం మాఘి, మాఘమాసంలోని తొలిరోజు. మాఘినాడు పాలు, చెరుకురసంతో ఖీర్‌ చేసుకుంటారు.   ఘుఘుటి (ఉత్తరాఖండ్‌) – ఉత్తరాఖండ్‌లోని కుమావ్‌ వంటి ప్రాంతాలలో సంక్రాంతిని భలే చిత్రంగా జరుపుకొంటారు. ఈ రోజుని వారు ఉత్తరాయణంలో మొదటి రోజుగా భావిస్తారు. చలికాలంలో వలస వెళ్లిపోయిన పక్షులన్నీ ఈ రోజు తిరిగివస్తాయని నమ్ముతారు. బహుశా పూర్వీకుల ఆత్మలకు ప్రతిరూపాలన్న నమ్మకం అనో ఏమో నల్లకాకులను కూడా ఈ రోజు స్వాగతిస్తారు. వాటి కోసం వెతికి మరీ రకరకాల తీపిపదార్థాలను అందిస్తారు. అందుకనే ఈ పండుగకు ‘కాలా కవ్వా’ (నల్లకాకి) అన్న పేరు కూడా ఉంది.   సుగ్గి (కర్ణాటక) – కన్నడ భాషలో సుగ్గి అంటే పంట లేదా విందు అన్న అర్థం వస్తుంది. ఈ రోజున కన్నడిగులు కొత్తబట్టలు, పూజాపునస్కారాలతో పండుగన ఘనంగా చేసుకుంటారు. దీనికి తోడుగా అక్కడ ఓ చిత్రమైన సంప్రదాయం కూడా కొనసాగుతూ వస్తోంది. ఎల్లు బిరోదు పేరుతో నువ్వుల ఉండలను ఇచ్చిపుచ్చుకుంటారు. కర్ణాటకలోని స్త్రీలు ఈ నువ్వుల ఉండలతో పాటుగా, అరటిపళ్లు, చెరుకుగడలు, పసుపుకుంకుమలను ముత్తయిదువలకు పంచుతారు.   మాఘ బిహు (అసోం) – అసోంలో సంక్రాంతి కూడా చాలా చిత్రంగా సాగుతుంది. సంక్రాంతి ముందురోజున వెదురు, ఎండుగడ్డి వంటివాటితో గుడిసెలను నిర్మించుకుంటారు. ఆ రోజంతా ఈ పాకలలో ఆడుతూపాడుతూ గడిపేస్తారు. మర్నాడు ఉదయం వీటిని తగలబెట్టేస్తారు. మన గోదావరి జిల్లాలలో కనిపించే కోడిపందాలు, ఎడ్లపందాల వంటి ఆటలు అసోంలో కూడా జరుగుతాయి. కొబ్బరి, నువ్వులతో రకరకాల పిండిపదార్థాలను చేసుకుంటారు.   పైన చెప్పుకొన్న రాష్ట్రాలే కాదు! బీహార్‌, హర్యానా, గుజరాత్‌, హిమాచల్ ప్రదేశ్‌... ఇలా ప్రతి రాష్ట్రంలోనూ సంక్రాంతి ఏదో ఒక పేరున విభిన్నంగా జరుగుతూనే ఉంటుంది. దేశం ఒక్కటే అయినా అందులోని ప్రతి ప్రాంతానికీ తనదైన సంప్రదాయం ఉందన్న విషయాన్ని రుజువు చేస్తుంటుంది.   - నిర్జర.

తెలుగు రాష్ట్రాలలో వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు హెల్త్ వర్కర్లకు అస్వస్థత 

ప్రధాని మోడీ ప్రారంభించిన వ్యాక్సినేషన్ ప్రోగ్రాం రెండు తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతోంది. అయితే వ్యాక్సినేషన్ తో సైడ్ ఎఫెక్ట్ లు త‌ప్ప‌వని అందరు భావించినప్పటికీ అది అబ‌ద్ధ‌మ‌ని రుజువు అయ్యింది. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారంతా క్షేమంగానే ఉన్నారు. ఏపీలోని విజ‌య‌వాడ‌లో వ్యాక్సిన్ తీసుకున్న రాధ అనే హెల్త్ వ‌ర్క‌ర్ స్వల్ప అస్వ‌స్థ‌కు గురైన‌ప్ప‌టికీ.. ఆమె ఈరోజు ఉద‌యం నుండి ఏమీ తిన‌క‌పోవ‌టంతో పాటు వ్యాక్సిన్ అంటే ఉన్న భ‌యంతోనే ఆమెకు క‌ళ్లు తిరిగిన‌ట్లు వైద్యులు తేల్చారు. ఆమె ప్రస్తుతం సుర‌క్షితంగా ఉన్నారు.   మరోపక్క తెలంగాణాలో వ్యాక్సినేషన్ ప్రోగ్రాం సజావుగా సాగుతోంది. అయితే సంగారెడ్డి జిల్లాలోని ఇందిరానగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్‌ అస్వస్థతకు గురయ్యారు. వ్యాక్సిన్‌ తీసుకున్న ఏఎన్‌ఎం సంగీతకు స్వల్ప అస్వస్థత కలిగింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే తనకు తల తిప్పుతుందని ఆమె వైద్యులకు తెలిపింది. ఆ తర్వాత ఆమె వాంతులు చేసుకోవడంతో వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. అయితే, కొన్ని ల‌క్ష‌ల్లో ఒక‌రికి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లు కనపడతాయని… భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదంటున్నారు వైద్యులు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామ‌ని వైద్యులు తెలిపారు.

ఎమ్మెల్యే ఆర్థర్‌ వర్సెస్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి.. ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాతో డీల్!!

కర్నూలు జిల్లా నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ నేతల ఆధిపత్య పోరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఎమ్మెల్యే ఆర్థర్‌ కు, వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి మధ్య అస్సలు పడదనేది బహిరంగ రహస్యం. తనపై పెత్తనం చేయాలని చూస్తున్నారని సిద్ధార్థరెడ్డిపై ఆర్థర్‌ ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే నియోజకవర్గంలో ఒకటి చోటుచేసుకుంది. రేషన్‌ షాపుల నుంచి ఇంటింటికీ బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం వాహనాలు సమకూర్చిన సంగతి తెలిసిందే. అయితే, లబ్ధిదారుల ఎంపిక విషయంలో సిద్ధార్థరెడ్డి కలుగజేసుకోవడంతో ఎమ్మెల్యే ఆర్థర్‌ తీవ్ర అసంతృప్తికి గురయ్యారని, చివరికి అధికారులే కల్పించుకొని వివాదానికి తెరదించారని తెలుస్తోంది.   నందికొట్కూరు నియోజకవర్గానికి అధికారులు 61 వాహనాలు కేటాయించారు. లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయింది. అయితే, తుది నిర్ణయం తీసుకునే సమయంలో పాములపాడు మినహా మిగిలిన మండలాల్లో సిద్ధార్థరెడ్డి సూచించిన జాబితానే ఫైనల్‌ చేయాలని అధికారులపై ఒత్తిడి వచ్చిందట. దీంతో ఎమ్మెల్యే ఆర్థర్‌.. పార్టీ జిల్లా ఇంఛార్జ్‌, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారట. ఎమ్మెల్యే అయిన తనను ఒక్క మండలానికే పరిమితం చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతేకాదు, అప్పటికే ఫైనల్‌ అయిన జాబితాను పక్కన పెడితే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతానని అధికారులకు ఫోన్‌ చేసి హెచ్చరించారట. దీంతో లబ్ధిదారుల ఎంపిక నిలిచిపోయింది. ఇక చేసేదేమీ లేక అధికారులు 'ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములా'ను తెరపైకి తీసుకొచ్చారట. పాములపాడు మండలం ఎమ్మెల్యేకు, పగిడ్యాల మండలం సిద్ధార్థరెడ్డికి ఇచ్చే విధంగా ఒప్పించారట. మిగిలిన మండలాలలతోపాటు నందికొట్కూరు అర్బన్‌, రూరల్‌ పరిధిలో ఇద్దరికీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తామని అధికారులు ప్రతిపాదన సిద్ధం చేశారట. అంటే సగం మంది లబ్ధిదారులను ఎమ్మెల్యే ఎంపిక చేస్తే.. మిగిలిన సగం మందిని సిద్ధార్థరెడ్డి ఎంపిక చేసేలా డీల్ కుదిర్చారన్నమాట. ఈ డీల్ కి ఇరువురు నేతలు ఒప్పుకోవడంతో వివాదానికి తెరపడిందని సమాచారం.

వెనక్కి తగ్గిన వాట్సాప్!!

ప్రైవసీ పాలసీపై వాట్సాప్ వెనక్కి తగ్గింది. ఇటీవల తీసుకొచ్చిన ఈ పాలసీపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తం కావడం.. సిగ్నల్, టెలిగ్రామ్‌ వంటి యాప్స్ కు ఆదరణ పెరుగుతుండడంతో వాట్సాప్ వెనక్కి తగ్గింది. ప్రైవసీ పాలసీ ఆప్‌డేట్‌ ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. నిజానికి వచ్చే ఫిబ్రవరి 8 నుంచే ఈ కొత్త విధానం అమల్లోకి రావాల్సి ఉండగా, తాజా నిర్ణయంతో ఇది మూడు నెలలు వెనక్కి జరిగింది. కొత్త పాలసీపై ప్రజల్లోకి తప్పుడు సమాచారం వెళ్లడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వాట్సాప్ తెలిపింది. పాలసీపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ఈ మూడు నెలలను ఉపయోగించుకుంటామని తెలిపింది. కొత్త విధానాన్ని యూజర్లు అర్థం చేసుకున్న తర్వాతే దానిని అమల్లోకి తీసుకొస్తామని స్పష్టం చేసింది.   ప్రైవసీ పాలసీలో భాగంగా యూజర్ల వ్యక్తిగత సమాచారం, ఐపీ అడ్రస్‌ లను ఫేస్‌బుక్‌‌ తో పంచుకుంటామని, ఇందుకు అంగీకరిస్తేనే అకౌంట్ కొనసాగుతుందని ఇటీవల వాట్సాప్ ప్రకటించింది. అయితే, వ్యక్తిగత గోపత్యకు భంగం కలగనుందన్న ఉద్దేశంతో చాలా మంది యూజర్లు వాట్సాప్‌ ను డిలీట్‌ చేసి టెలిగ్రాం, సిగ్నల్‌ యాప్స్‌కి మారారు. దీంతో కాస్త వెనక్కి తగ్గిన వాట్సాప్.. కేవలం బిజినెస్ అకౌంట్స్ కు మాత్రమే ఇది వర్తిస్తుందని వివరణ ఇచ్చింది. అయినప్పటికీ విమర్శలు తగ్గకపోవడంతో ఈ విధానాన్ని వాయిదా వేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు వాట్సాప్‌ తన బ్లాగ్‌లో "మీరు.. మీ కుటంబ సభ్యులు, స్నేహితులతో పంచుకునే సమాచారం ఏదైనా రహస్యంగానే ఉంటుంది. మీ వ్యక్తిగత సంభాషణని వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ చదవదు. మీరు పంపే లోకేషన్‌లని చూడదు. మీరు ఎవరికి కాల్‌ చేశారు, ఎవరికి మెసేజ్‌ చేస్తున్నారనే విషయాలను కూడా మేం గమనించం. ఈ అప్‌డేట్‌ వల్ల ఏదీ మారడం లేదు. బిజినెస్‌ ఫీచర్స్‌ని మరింత మెరుగ్గా అందించడం కోసం మాత్రమే ఈ అప్‌డేట్‌ ని తీసుకొచ్చాం." అని తెలిపింది.

ఈ సింపుల్ యోగ ముద్రలతో ఎన్నో రోగాలు అరికట్టవచ్చు...

  మానవ శరీరం లో ఉన్న ప్రతీ అవయవం చాల గొప్పది.. ఏది సరిగా పని చేయకపోయినా దాని ప్రభావం పూర్తిగా శరీరం పై పడుతుంది. కానీ ఒక్క అవయవం తో  మనం మానసిక స్థితిని, భౌతిక స్థితిని , ఆధ్యాత్మిక స్థితిని కూడా పొందవచ్చని మీకు తెలుసా..  అది ఎలా అంటారా మనం చేతులతో ఎన్నో పనులు చేస్తుంటాం కానీ వాటితో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో, మనకు తెలియదు. చేతి వేళ్ళని కొన్ని భంగిమలలో పెట్టె ప్రక్రియని ముద్ర అంటారు. మరి ఆ ముద్రలలో రకాలు వాటి వాళ్ళ మనకి కలిగే ప్రయోజనాలు అవి ఎలా వేయాలో చూద్దాం.. 1.జ్ఞాన ముద్ర: ఈ జ్ఞాన ముద్ర వేయడం వల్ల మనలో ఉన్న క్రియేటివిటీ పెరుగుతుంది , నాలెడ్జి కూడా ఇంప్రూవ్ అవుతుంది ,ఇంకా మన జ్యపకశక్తిని కూడా పెంచుతుంది. ఇంకా ఈరోజుల్లో చాల మంది నిద్రలేమి తో బాధపడుతున్నారు. ఈ ముద్ర వేయడం వల్ల నిద్ర కూడా బాగా పడుతుంది. మరి ఈ ముద్ర వేయడం ఎలా అంటారా చాల సులభం. మనం బొటన వేలుని చూపుడు వేలుతో కలిపి ఉంచి మిగిలిన మూడు వెళ్ళాను నిటారుగా నిలపడమే ఈ జ్ఞాన ముద్ర. ఇది మనం ఎపుడైనా వేయవచ్చు నిల్చున్నపుడు , కూర్చున్నపుడు , నిద్రపోయేటప్పుడు ఇలా ఎప్పుడైనా వేయవచ్చు 2.సూన్య ముద్ర: ఈ ముద్ర ని ఎలా వేయాలంటే మన మధ్య వేలుని బొటన వేలు తో ఒత్తి ఉంచి మిగిలిన వేళ్ళను నిటారుగా నిలబెట్టాలి ,ఇలా రోజుకి కనీసం నలభై నిమిషాలైనా చేస్తే మన శరీరంలో ఉన్న dullness అనేది లేకుండా పోతుంది ,చెవి నొప్పి లాంటి సమస్యలేమైనా ఉన్న కూడా వెంటనే ఉపశమనం పొందవచ్చు ఇంకా మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళకి ఈ ముద్ర  బాగా  ఉపయోగపడుతుంది 3.ప్రాణ ముద్ర: ఈ ముద్ర ఎలా వేయాలంటే మన ఉంగరపు వేలుని ,చిటికెన వేలుని బొటనవేలికి టచ్ చేసి మిగిలిన రెండు వేళ్ళను నిటారుగా నిలబెట్టి ఉంచడమే ఈ ప్రాణ ముద్ర ,ఇది ఎప్పుడు ఐన వేయవచ్చు. ఇది వేయడం వల్ల మనలో ఉన్న రోగ నిరోధక శక్తి పెరుగుతుంది , ఇంకా బద్దకాన్ని నివారిస్తుంది, ఇంకా మానసికంగా , శారీరకంగా దృఢం గ ఉండేలా చేస్తుంది ,ఇంకా మన కంటిచూపు మందగించడాన్ని మెరుగుపరుస్తుంది ,ఈ ముద్ర వేయడం వల్ల మనిషి చాల ఆక్టివ్ గ ఉంచేలా చేస్తుంది 4.ధ్యాన ముద్ర: ఇది ఎలా చేయాలంటే మన రెండు చేతుల్ని అరచేతులు పైకి వచ్చేలా మన ఒడిలో పెట్టుకుని రెండు బొటన వేళ్ళు మాత్రమే టచ్ అయేలా ఉంచాలి. దీన్ని కదలకుండా నిటారుగా కూర్చుని శ్వాస మీద ధ్యాస ఉంచి ఎంతసేపైనా చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది చిరాకు,డిప్రెషన్, స్ట్రెస్ లాంటి వాటినుండి చాల రిలీఫ్ ఉంటుంది. ఇది చాల పవర్ఫుల్ ముద్ర 5.బుద్ది ముద్ర: ఇది కూడా చాల ముఖ్యమైన ముద్ర మన చేతి బొటన వేలుని చిటికెన వేలితో కలిపి ఉంచి మిగిలిన మూడు వేళ్ళను నిటారుగా ఉంచడమే ఈ  బుద్ధి ముద్ర ఈ ముద్ర వేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా , మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవడానికి ఇది  బాగా ఉపయోగపడుతుంది. మానసిక ప్రశాంతతని కోరుకునే ప్రతి ఒక్కరు  ఈ ముద్ర లు తప్పక  కంటిన్యూ చేయండి. 6.సూర్య ముద్ర: మన చేతి ఉంగరం వేలు ని బొటన వేలు కింద మడిచి పెట్టి మిగిలిన వేళ్ళను నిటారుగా నిలబెట్టి ఉంచడమే ఈ సూర్య ముద్ర ఈ సూర్య ముద్ర వల్ల చాల ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గాలి అనుకున్నవాళ్ళు ఈ ముద్ర చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. 7.ఆపాన ముద్ర: మన చేతి మధ్య వేలుని , ఉంగరం వేలుని బొటన వేలుతో కలిపి ఉంచి మిగిలిన వేళ్ళను నిటారుగా ఉంచడమే ఈ ఆపాన ముద్ర ఈ ముద్ర వేయడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఇంకా మన శరీరంలోని  వ్యర్ధ పదార్ధాలను బయటికి పంపిస్తుంది. 8.గణేష్ ముద్ర: మన రెండు చేతులను సగం పిడికిలి బిగించి ,రెండు చేతులను కలిపి బిగించి , మన ఛాతి భాగానికి పెట్టి నిటారుగా కూర్చుని ఈ ముద్ర వేయాలి. ఈ ముద్ర వేయడం వల్ల మన శరీర దారుఢ్యం చక్కగా ఉంచడానికి , మన కండరాల తీరు పని చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. 9.వాయు ముద్ర: మన చేతిలో చూపుడు వేలుని మధ్యకి మడిచి బొటనవేలితో అదిమిపెట్టి మిగిలిన మూడు వేళ్ళను నిటారుగా ఉంచడమే వాయు ముద్ర ఈ ముద్ర ని వేయడం వల్ల మన శరీరం లో ఉన్న చేదు గాలి బయటికి వచ్చి మన కి ఉన్న నొప్పులను తగ్గిస్తుంది. అంతేకాదు విపరీతమైన కీళ్ల, కండరాల నొప్పులను రాకుండా చేస్తుంది, ఇంకా మనం చిరాగ్గా అనిపించినపుడు కూడా ఈ ముద్ర వేస్తె ప్రశాంతంగా ఉంటాం.. https://www.youtube.com/watch?v=BFMHOO_XUE8  

మాంసాహారంతో గుండె సమస్యలు!  

ముక్క లేనిదే ముద్ద దిగదు.. కొందరికి రోజూ ఉంటే, కొందరికి  వారానికి  ఒక్కసారైనా నాన్ వెజ్ లేనిదే ఆ వారం గడవదు. సండే వచ్చిందా పిల్లలకి పెద్దలకి పండగే. సండే వస్తే నాన్ వెజ్ ఉండాలి. పుట్టినరోజు పార్టీకి నాన్ వెజ్ ఉండాలి. పండగ వచ్చిందా నాన్ వెజ్ ఉండాల్సిందే. ఇంకొన్ని చోట్ల ఆయా సంప్రదాయాలు అలవాట్లని బట్టి నాన్ వెజ్ తప్పనిసరిగా వండుకుంటారు. ఇలా ప్రతి సారీ అవకాశం దొరికినప్పుడల్లా ఈదేవి, ఎగిరేవి, పాకేవి అనే తేడా లేకుండా.. పిట్ట మాంసం, జింక మాంసం, పంది మాంసం, కుందేలు మాంసం ఇలా దొరికిందల్లా మీ పొట్టలోకి తోసేస్తే కొవ్వుపెరిగి గుండెలో కొలెస్ట్రాల్ చేరి, రక్తనాళాలు మూసుకు పోయి స్టెంట్లు వేసుకోడం ఒకబాధ. అసలు గుండె నొప్పి వచ్చినట్టు కూడా తెలియకుండా మనిషిని తీసుకుపోయే హృద్రోగ సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముక్కకోసం కాస్త కక్కుర్తి పడ్డారో గుండె లో సమస్యలు ఖాయమని నిపుణులు హెచ్చ్రరిస్తున్నారు.   మాంసాహారము తినే వారిలో కార్డియో వాస్క్యులర్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కార్డియో వాస్క్యులర్  సమస్యలతోపాటు చనిపోయే అవకాశం ఉందని కార్డియో సర్జన్లు హెచ్చరిస్తున్నారు. అయితే చేపలు కొంత ప్రమాదం తక్కువే అని పేర్కొన్నారు .  మాంసాహారము తింటున్న వారిపై ఇటీవల జరిపిన పరిశోధనలో చికెన్ ఇతర మాంస పదార్ధాల వల్ల కార్డియో వాస్క్యులర్ వ్యాధులు వచ్చే అవకావం ఉందని సాచురేటెడ్ ఫాట్స్  ఉంటాయని కార్డియో సమస్యకు దారితీస్తాయని హృద్రోగనిపుణులు తెలిపారు. న్యూయార్క్ కు చెందిన కర్నాల్  విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనలో ఈ విషయం బయట పడిందని తెలిపారు.

యాంటీ స్నోరింగ్ డివైజ్ తో గురకకు చెక్        

ఎన్ని మందులు వాడినా, చికిత్స తీసుకున్నా గురక మిమ్మల్ని వదలడం లేదా? గుర్రు గుర్రు అంటూ చేసే చిత్ర విచిత్ర విన్యాసాలు ఎందరినో  కుటుంబ సభ్యుసభ్యులకు సైతం దూరం చేసిన సందర్భాలు, గురకవల్ల విడిపోయిన కుటుంబాలు ఉన్నాయంటే ఆశ్చర్యం లేదు. అంతే కాదు సుదీర్ఘ ప్రయాణంలో సైతం మనలని ఇబ్బంది పెట్టే గురకకు పలు అనారోగ్య కారణాలు ఉన్నాయి. ఒకటి ఊబకాయం, హృద్రోగ సమస్య, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారిని గురక పెద్ద సమస్యని వైద్యులు పేర్కొన్నారు. అయితే ఒక చిన్న డివైజ్ తో గురకకు నియంత్రించవచ్చని దాంతో మీరు మీ కుటుంబసభ్యులు, జీవిత భాగస్వామి సైతం ప్రశాంతంగ నిద్రపోవచ్చని నిపుణులు అంటున్నారు. దీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న గురక సమస్యతో బాధ పడుతున్న మిలియన్ల ప్రజలకు ఎట్టకేలకు ముక్తి ప్రసాదించినట్లు అయింది. ముక్కులోని గాలిమార్గం బ్లాక్ కాకుండా నియంత్రిస్తుంది. దీనివల్ల శ్వాస సులభంగా తీసుకోవచ్చు.  స్లీప్ క్వైట్ వల్ల  శ్వాస తీస్కోడమే కాదు గురక చాలా తక్కువగా వస్తుంది నిద్రలోకి జారుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఇక దీనిని ఉపయోగించడం సులభమని అంటున్నారు. దీనిని సైలెన్స్ రింగ్ అని  కూడా అంటారు. రింగ్ చాలా సులభం ప్రభావవంతమైనదని అంటున్నారు. ముక్కులో దీనిని సులభంగా అమర్చవచ్చు. దీని ద్వారా వచ్చే  మాగ్నెటిక్ టిప్స్  వాటిని యధా స్థానంలో ఉంచుతుంది. అనేక పరిశోధనలు చేసిన తరువాతే దీనిని  మార్కెట్లోకి తెచ్చినట్లు ఉత్పత్తి దారులు తెలిపారు. స్లీప్ క్వైట్  ఏ వయస్సుల వారైనావాడచ్చు. వాడిన కొద్దిసేపటికే మీముక్కుకు ఏమైందో గమనిస్తారు. స్లీప్ క్వైట్ వల్ల శరీరం, మెదడు ప్రశాంతంగా నిద్రపోతుంది. అనారోగ్యం తగ్గినట్లు కనిపిస్తుంది. ఊపిరితిత్తులలోకి ఆక్సిజన్ ఎక్కువగా తీసుకోడం వల్ల  ఎక్కువసేపు నిద్రపోగలరు. 100% శాతం రక్షణకల్పిస్తుంది. ఇందులో ఎటువంటి మత్తుమందు లేదు. స్లీప్ క్వైట్ వల్ల ఎటువంటి బ్యాక్టీరియా రాదు. నీటిలో ముంచడం తోనే పరిశుభ్రం చేసుకుని మరలావాడచ్చు. అయితే దీనిని స్టెరిలైజ్ చేసిన ప్లాస్టిక్ కేసులో భద్రంగా ఉంచితే చాలని ఉత్పత్తిదారులు సూచించారు.
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.