రాజీనామాలు చేసుకో(వచ్చు)వద్దు: దిగ్విజయ్ సింగ్

 

“తెలంగాణా అంశంపై వెనకడువేసే ప్రసక్తే లేదు. కానీ, అంటోనీ కమిటీ తన నివేదికను సమర్పించిన తరువాతనే టీ-నోట్ ను క్యాబినెట్ సమావేశంలో ప్రవేశపెడతాము. రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నసీమాంధ్ర యంపీలు రాజీనామాలు చేసుకోదలిస్తే వారిని మేము ఆపబోము,” అని మూడు రోజుల క్రితమే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ సీమాంధ్ర యంపీలతో అన్నారు. కానీ అదే దిగ్విజయ్ సింగ్ ఈరోజు “త్వరలో హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే టీ-నోట్ సిద్దం చేసి క్యాబినెట్ ముందు పెడతారని అన్నారు. ఇక సీమాంధ్ర యంపీలు రాజీనామాలు చేసుకోవచ్చని నిర్భయంగా చెప్పిన ఆయన, ఈ రోజు వారిని రాజీనామాలు చేయవద్దని కోరారు. ఇక ఒకవైపు టీ-నోట్ ప్రస్తావన తెస్తూనే దానిని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న ఏపీయన్జీవోలను తమ నిరవధిక సమ్మెవెంటనే విరమించమని ఆయన కోరారు. ఉద్యోగుల సమ్మె వలన రాష్ట్రంలో పరిపాలన స్తంభించిందని, అదేవిధంగా సీమాంధ్రలో ప్రజలు చాలా ఇబ్బంబులు పడుతున్నారని, అందువలన వెంటనే ఉద్యోగులు సమ్మె విరమించాలని ఆయన కోరారు. కేవలం దిగ్విజయ్ సింగ్ వంటి కాంగ్రెస్ నేతలు మాత్రమే ఒక అంశంపై ఈ విధంగా రెండు రకాలుగా మాట్లాడగలరేమో.