తెలంగాణా ఇస్తే సంతోషమే, కానీ...



తెలంగాణా ఉద్యమం తీవ్రంగా సాగుతున్న సమయంలో కూడా సమైక్యాంధ్రకి అనుకూలంగా మాట్లాడిన ఒకరిద్దరు కాంగ్రెస్ తెలంగాణా నేతల్లో మంత్రి దానం నాగేందర్ కూడా ఒకరు. అయన ఇంతవరకు ఏరోజూ కూడా మిగిలిని తెలంగాణా కాంగ్రెస్ నేతలతో కలిసి ఉద్యమాల బాట పట్టలేదు కూడా. అయితే, ఇక నేడో రేపో కేంద్రం తెలంగాణాకి అనుకూలంగా ప్రకటన చేయబోతోందని బలమయిన సంకేతాలు వెలువడుతున్న ఈ తరుణంలోకూడా ఇంకా తెలంగాణాకి వ్యతిరేఖంగా మాట్లాడి మరింత మంది శత్రువులను పోగేసుకోవడం ఎందుకనుకోన్నారో మరేమో, ఆయన ఈ రోజు హైదరాబాదులో మీడియావారితో మాట్లాడుతూ “ఇంతవరకూ నేనెప్పుడూ తెలంగాణాకి వ్యతిరేఖంగా మాట్లాడలేదు. ఆవిధంగా మాట్లాడిన లాగడపాటి రాజగోపాల్ వంటి వారివల్లనే తెలంగాణా ఉద్యమాలు మరింత తీవ్రతరమయ్యాయి. అటువంటి వారిని తప్పు పట్టకుండా నన్ను వేలెత్తి చూపడం చాల తప్పు. కేంద్రం హైదరాబాదుని ఎక్కడ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించేస్తుందో అనే ఆదుర్దతో నేను హైదరాబాదుని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని కోరాను తప్ప, తెలంగాణా వద్దని గానీ, దానిని తెలంగాణాకి రాజధానిగా చేయోద్దనిగానీ నేనెన్నడూ అనలేదు. తెలంగాణా ఇస్తే నాకంటే సంతోషించేవారుండరు అని ఖచ్చితంగా చెప్పగలను. కానీ, మా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకొన్న నేను కట్టుబడి ఉంటాను. అది ప్రత్యేక తెలంగాణా అయిన సమైక్యంద్రా అయినా సరే.”