అందుకే ప్రత్యేక రాష్ట్రం కావాలన్నాను: జేసీ

మాజీ మంత్రి, అనంతపురం యంపీ జేసీ దివాకర రెడ్డి తాడిపత్రిలో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర విభజన జరిగినట్లయితే ముందుగా రాయలసీమ జిల్లాలకే నీటి సమస్యలు ఎదురవుతాయని తాను ముందుగానే ఊహించానని అందుకే ఆనాడు తాను రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కోరానని తెలిపారు. తను ఊహించినట్లే ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య నీళ్ళ కోసం గొడవలు పడుతున్నాయని తెలిపారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు. కృష్ణా జలాలు వృధాగా సముద్రంలో కలిసిపోయినా పరువాలేదు కానీ రాయలసీమకు మాత్రం దక్కకూడదన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ కేసీఆర్ మొండి పట్టుదల కారణంగా రాయలసీమకు తీవ్ర నష్టం కలుగుతోందని, అందువల్ల ఈ సమస్య ఇంకా ముదరక మునుపే కేంద్రం తక్షణమే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళి కలుగజేసుకోవలసిందిగా కోరాలని ఆయన కోరారు.