కరోనా కంటే డేంజర్ వైరస్ కనిపెట్టిన చంద్రబాబు...

ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. కరోనా కల్లోలంతో చైనా అల్లకల్లోలమవుతోంది. కరోనా కారణంగా ఇప్పటికే ఏడెనిమిది వందల మంది మరణించగా, వేలాది మంది వైరస్ బారినపడ్డారు. అయితే, ఆంధ్రప్రదేశ్ లో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఒక్కటి వైరస్ కాదు... రెండు వైరస్ లు గడగడలాడిస్తున్నాయి. ఈ వైరస్ లు జనాన్ని కంటే ఎక్కువగా రాజకీయ పార్టీలను వణికిస్తున్నాయి. ఇంతకీ ఈ వైరస్ లను కనిపెట్టింది... సృష్టించింది కూడా పొలిటికల్ పార్టీలే. అంతేకాదు, ఈ వైరస్ లు కరోనా కంటే డేంజర్ అంటున్నాయి. అధికార వైసీపీ.... ఎల్లో వైరస్ ను కనిపెడితే... ప్రతిపక్ష నేత చంద్రబాబు...  వైసీపీ వైరస్ ను సృష్టించారు. ఇంతకీ ఈ వైరస్ లు ఏంటో ఇఫ్పటికే మీకు అర్ధమై ఉంటుంది. అదేనండీ పొలిటికల్ వైరస్ లు. కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంటే... ఈ వైసీపీ వైరస్ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలను పట్టిపీడిస్తోందని జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు చంద్రబాబు.

కరోనా... చైనాను అతలాకుతలం చేస్తుంటే.... దానిని మించిన వైసీపీ వైరస్ ఎనిమిది నెలలుగా ఏపీని చెల్లాచెదురు చేస్తోందని బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వైరస్ పేరెత్తితేనే పెట్టుబడిదారులు భయపడి పారిపోతున్నారని విమర్శలు గుప్పించారు. వైసీపీ వైరస్ దెబ్బకు కంపెనీలన్నీ ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లిపోతున్నాయని అన్నారు. ఏడెనిమిది నెలలుగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుందని మండిపడ్డారు.

అయితే, చంద్రబాబు విమర్శలకు వైసీపీ నేతలు రివర్స్ కౌంటరిస్తున్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కన్నా ఎల్లో వైరస్ మరింత ప్రమాదకరమని సెటైర్లు వేస్తున్నారు. చైనాలో కరోనా కల్లోలం సృష్టిస్తుంటే... ఆంధ్రప్రదేశ్ ను ఎల్లో వైరస్ పట్టి పీడిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రపంచానికి కరోనా వైరస్ పడితే, ఏపీకి చంద్రబాబు వైరస్ వేధిస్తుందని విమర్శిస్తున్నారు. మొత్తానికి, ఏపీలో కొత్త వైరస్ లను సృష్టించిన టీడీపీ, వైసీపీలు... కరోనా పేరుతో కొత్త తరహాలో వైరస్ యుద్ధం చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కొత్త వైరస్... మీరు కారణమంటే మీరు కారణమంటూ బాబు, జగన్ ఆరోపణలు...