వారికే మళ్ళి పదవులు... వైసిపి నేతలలో పెరుగుతున్న అసంతృప్తి!!

 

 

గత మేలో జరిగిన ఎపి అసెంబ్లీ ఎన్నికలలో 151  సీట్లతో ఘన విజయం సాధించిన వైసిపి జగన్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఐతే ఎన్నికల సమయం లో కొన్ని చోట్ల ఒక్కో అసెంబ్లీ సీటుకు ఒక్కరి కంటే ఎక్కువ మంది నాయకులు పోటీ పడటంతో వారిలో ఒకరికి ఎమ్మెల్యే సిటు ఇచ్చి మిగిలిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు.ఇది ఇలా ఉంటె జగన్ తన మంత్రి వర్గ ఏర్పాటు సందర్బంగా సామజిక సమీకరణాల నేపథ్యంలో అన్ని వర్గాలకు న్యాయం చేసే ప్రక్రియలో కొంత మంది సీనియర్లకు మంత్రి వర్గం లో స్థానం కల్పించలేక పోయారు. ఇప్పటికే ఈ కేటగిరిలో ఉన్న రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. జెయింట్ కిల్లర్ ఆళ్ల రామకృష్ణ రెడ్డికి సీఆర్డీఏ చైర్మన్ పదవి ఖాయమని తెలుస్తోంది.  అలాగే మిగిలిన సీనియర్లలో ముఖ్యులైన భూమన కరుణాకర్ రెడ్డి, అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్ రెడ్డి వంటి నేతలకు త్వరలో నామినేటెడ్ పదవులు ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. కానీ ఇక్కడ వచ్చిన చిక్కేమిటంటే వీళ్లంతా కూడా ఆల్రెడీ ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు. వీరికే మళ్ళి నామినేటెడ్ పోస్టులు ఇస్తూ పొతే ఈ నాయకులు ఎమ్మెల్యేలు అయ్యేందుకు సహకరించిన ముఖ్య నాయకులు తమ పరిస్థితేమిటని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే ఐన చెవిరెడ్డి కి తుడా చైర్మన్, టీటీడీ బోర్డు మెంబర్ పదవులు ఇవ్వటం జరిగింది. ఏదేమైనా జగన్ మాట తప్పడని తమకు న్యాయం చేస్తాడని  కొంత మంది నాయకులు సీఎం పై భరోసా తో ఉన్నట్లు సమాచారం. ఐతే మరి కొంత మంది నాయకులు మాత్రం ఇలా నామినేటెడ్  పదవులన్నీ ఎమ్మెల్యేలకిస్తూపోతే, ఇక పార్టీ కష్ట కాలంలో అండగా నిలబడిన మా పరిస్థితేమిటి, మాకు జగన్ ఇచ్చిన హామీల మాటేమిటని  అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ఇటువంటి నేతలందరికీ ఏ విధంగా న్యాయం చేస్తారో చూడాలి.