మీడియా తో వ్యవహరించాల్సిన తీరు పై మంత్రులకు భోదించిన జగన్.....

 

 

ఏపీలో మీడియాతో వ్యవహరించాల్సిన తీరు పై మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ కర్తవ్య బోధ చేశారు. నిన్న జరిగిన కేబినెట్ భేటీ ముగింపు దశలో మీడియా గురించి వారికి సీఎం కీలకమైన సూచనలు చేసినట్టు తెలిసింది. వైసీపీకి చంద్రబాబు ఒక్కరే శత్రువు కాదని, ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 వంటి మీడియా సంస్థలతోనూ నిరంతరం పోరాటం చేయాలని జగన్ వ్యాఖ్యానించినట్టుగా సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం జగన్ మంత్రులతో మాట్లాడిన మాటలు ఇలా ఉన్నాయి.

'అక్కడక్కడా కొన్ని ఆరోపణలు వినపడుతున్నాయని ఏదైనా ఉంటే తాను మీడియాను పిలిచి మాట్లాడతానన్నారు సీఎం. నూట యాభై మందిలో సమర్థులైన వారిని మంత్రులుగా ఎంపిక చేశానని అందరితో తనకు స్నేహపూరితమైన సంబంధాలు ఉన్నాయని, ఆయనకి ఎవరినైనా మధ్యలోనే  తొలగించాలంటే బాధగానే ఉంటుందని చెప్పుకొచ్చారు జగన్ .

మంత్రులెవ్వరూ కూడా అవినీతికి ఆస్కారం ఇవ్వొద్దని వారు ఎక్కడ ప్రలోభాలకు లొంగిపోవద్దని హెచ్చరించారు. ఇదే సందర్భంగా మీడియా నిరంతరం మన చుట్టే ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇతర మీడియా సంస్థలు మనపై నిఘా పెట్టాయని పేర్కొన్నట్లు తెలిసింది. మంత్రుల్లో ఎవరిపైనైనా ఆరోపణలు చేస్తూ మీడియాలో కథనాలు వస్తే తన పై ఒత్తిడి పెరుగుతుందని పిలిచి మాట్లాడాల్సి వస్తుందని ఆయన తెలిపారు'. ప్రతిపక్షనేత చంద్రబాబు నిరంతరం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని జగన్ విమర్శించినట్టు తెలిసింది.

ప్రతిపక్షం చేసే విమర్శలు, ఆరోపణలు మీడియాలో వస్తున్న, ప్రభుత్వ వ్యతిరేక కథనాలపై మంత్రులూ, ఎమ్మెల్యేలూ తీవ్రంగా స్పందించి గట్టి సమాధానం చెప్పాలని సూచించారు. ఇటీవల ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల వ్యవహారం వల్లే ఎండీ సురేంద్రబాబును ప్రభుత్వం బదిలీ చేసినట్లుగా ఆంధ్రజ్యోతి రాసింది. ఈ వార్తలో నిజమెంతో అబద్ధమెంతో పరిశీలించాలని సూచించారు. ఇలాంటి కథనాలు భవిష్యత్తులో పునరావృతమైతే కేసులు పెట్టి వాటి సంబంధిత శాఖల కార్యదర్శుల పై చర్యలు తీసుకోవుటకు ఏ మాత్రం వెనకాడవద్దని ఆదేశించారు. వెంటనే ఆయా మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేయండి అని సీఎం చెప్పినట్టు  సమాచారం.