బాబూ నీ డ్రామాలిక ఆపు... బెంజ్ సర్కిల్ రగడపై కౌంటర్...

 

బెజవాడ బెంజ్‌ సర్కిల్‌ రగడపై... మంత్రులు, వైసీపీ నేతలు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించి ...అమాయకుల ప్రాణాలను బలిగొనాలని చంద్రబాబు చూస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. జేఏసీ ముసుగులో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే.... ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

బెంజ్ సర్కిల్ గొడవ తర్వాత పలువురు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు వరుసపెట్టి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ హోంమంత్రి సుచరిత... శవ రాజకీయాలు చేస్తూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రైతులకు ఎలాంటి అన్యాయం జరగదన్న హోంమంత్రి సుచరిత.... భూములను అభివృద్ధి చేసి అప్పగిస్తామన్నారు. ఇక, చంద్రబాబు పేరు చెబితేనే విరుచుకుపడే మంత్రి కొడాలి నాని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించి అమాయకుల ప్రాణాలను బలిగొనాలని చంద్రబాబు చూస్తున్నారని అన్నారు. పోలీస్ కాల్పులకు దారి తీసే పరిస్థితులను కల్పించే ప్రయత్నాలు చేస్తున్నందున చంద్రబాబును అదుపులో పెట్టాలని పోలీసులకు సూచించారు.

చంద్రబాబు రోజుకో డ్రామా ఆడుతున్నారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. దేశంలోనే చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు.... ఇప్పుడు 29 గ్రామాలకే పరిమితమయ్యారని కన్నబాబు ఎద్దేవా చేశారు. జేఏసీ ముసుగులో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ.... ప్రభుత్వంపై బురద జల్లే పని చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. తన బినామీ ఆస్తులను కాపాడుకోవడానికే చంద్రబాబు పోరాటం చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి విమర్శించారు. జేఏసీ ముసుగులో అరాచకాలకు పాల్పడుతూ... హత్య రాజకీయాలు చేయాలని చంద్రబాబు చూస్తున్నారంటూ వెల్లంపల్లి తీవ్ర ఆరోపనలు చేశారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినైనా పోలీసులు అదుపులోకి తీసుకుంటారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నారని అంబటి మండిపడ్డారు. తమది రైతుపక్షపాత ప్రభుత్వమన్న అంబటి... అమరావతి రైతులకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు.