కష్టకాలంలో వైయస్సార్ కాంగ్రెస్

 

జగన్ మోహన్ రెడ్డి ఈసారి ఎలాగయినా బెయిలు మీద బయటకి వస్తాడని చాలా ఆశగా ఎదురుచూసిన అతని కుటుంబం మరియు పార్టీ నేతలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. వారు పైకి ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నపటికీ, ప్రస్తుతం పార్టీలో ఉన్న అల్లకల్లోల పరిస్థితులను చూసి వారు చాల కలవరపడుతున్నారు. రాబోయే ఎన్నికలను ఎదుర్కొనేందుకు జిల్లాల వారిగా నియోజక వర్గ ఇన్-చార్జ్ లను నియమించి సిద్దమవుదామని ఆలోచిస్తే అదే ఆ పార్టీ పాలిట శాపంగా మారింది. నెల్లూరు, వరంగల్ జిల్లాలలో పార్టీలో కుమ్ములాటలు తారస్థాయికి చేరుకొని ఏకంగా పెద్ద తలకాయలే పార్టీ వీడేట్లు చేస్తున్నాయి.

 

జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల కాకపోవడం వలన పార్టీ పై ఎటువంటి ప్రభావం లేదని, పార్టీలో అసమ్మతిని సమర్ధంగా అదుపు చేయగలమని నిరూపించే ప్రయత్నంలో నిన్నకొండ సురేఖ అనుచరులను పార్టీ నుండి బహిష్కరించారు. త్వరలో కొండా దంపతులు కూడా పార్టీ వీడే అవకాశం ఉంది.

 

అనకాపల్లిలో దాడి వీరభద్ర రావుని పార్టీలోకి ఆహ్వానించి ఆ పార్టీ కొరివితో తల గోక్కోన్నట్లయింది. ఆయన రాకను నిరసిస్తూ కొణతాల రామకృష్ణ సోదరులు పార్టీకి తాము కావాలో లేక దాడి కావాలో తేల్చుకోమని అల్టిమేటం జారిచేసారు కూడా. ఇక, పార్టీలోకి కొత్తగా వచ్చిన దాడి కోసం, పార్టీ కొణతాలను వదులుకోవడానికి సిద్దపడుతున్నట్లు సమాచారం. దానితో, ఆయనను తమ పార్టీ వైపు ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. “ఆయన ఎప్పటికయినా మా కాంగ్రెస్ పార్టీ వాడే” అని కేంద్ర మంత్రి పురందేశ్వరి పలికితే, “ఆయన మా పార్టీలోకి వస్తామంటే సాదరంగా ఆహ్వానిస్తామని” మంత్రి గంట శ్రీనివాసరావు అన్నారు.

 

ఇక కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో కూడా ఇంచుమించి ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. ముందు నుండి ఆ పార్టీలో ఉంటూ రాబోయే ఎన్నికలలో పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలు, ఇటీవల కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలో నుండి వైకాపాలోకి వచ్చిన నేతలతో పట్లు పడుతున్నారు. వారు అకస్మాత్తుగా వచ్చి తమ నోటి కాడ కూడు లాకొంటున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మరో 4-6నెలల వరకు జైలు నుండి బయటకు వచ్చే పరిస్థితులు లేకపోవడంతో పార్టీలో తమ మొర వినే నాధుడు లేదని వారందరూ ఇప్పుడు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.

 

ఇక, చంద్రబాబు పాదయత్ర సాగుతున్నంత కాలం, పోటీగా సాగుతున్న షర్మిల పాదయాత్ర గురించి మీడియాలో ఎక్కడో అక్కడ నిత్యం ప్రస్తావన ఉండేది. కానీ, చంద్రబాబు పాదయాత్ర పూర్తయిన తరువాత ఆమె పాదయాత్రను పట్టించుకొనే నాధుడే లేడు. ఆమె పాదయాత్రను మీడియా ఎలాగూ పట్టించుకోవడం లేదు, చివరికి వైకాపా శ్రేణులు, నేతలు కూడా మొహం చాటేయడం ఆశ్చర్యకరం. ప్రస్తుతం ఖమ్మంలో సాగుతున్న ఆమె పాదయాత్ర ఇంకా ఎప్పుడు పూర్తవుతుందో, దాని వల్ల పార్టీకి ఏమయినా ఫలితం ఉంటుందో లేదో కూడా అర్ధం కాని పరిస్థితి. చివరికి ఆమె పాదయాత్ర గురించి పార్టీలో నేతలు కూడా మీడియాతో మాట్లాడెందుకు ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యకరం.

 

ఒకవైపు జైల్లో జగన్ మోహన్ రెడ్డి, మరో వైపు షర్మిల, విజయమ్మలు పార్టీని ఎలాగయినా కాపాడుకోవాలని ఈ మండు వేసవి ఎండలను సైతం లక్ష్యం చేయకుండా కష్టపడుతుంటే, ఆ పార్టీ నేతలు మాత్రం చల్లగా తమ ఏసి గదులకే పరిమితమయిపోయి, మీడియాకి ఖండన ప్రకటనలు జారీ చేస్తూ హాయిగా కాలక్షేపం చేయడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. జగన్ మోహన్ రెడ్డి, మరియు అతని తండ్రి స్వర్గీయ డా.రాజశేఖర్ రెడ్డిల పై ప్రజలలో ఉన్న ఆదరణ, సానుభూతి అనే రెండు అంశాలే తమను కష్టపడకుండా గెలిపిస్తాయని వారు భావిస్తునందునే వారు తమ ఏసి గదులకి పరిమితమయిపోయినట్లుంది. ఇటువంటి పరిస్థితుల్లో త్వరలో జరుగనున్న మునిసిపల్ ఎన్నికలకు విజయమ్మే సారద్యం వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది.