విద్యుత్ సంక్షోభంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహాధర్నా

 

ఈ రోజు గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ కేంద్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యుత్ కోతలకు, పెరిగిన కరెంటు చార్జీలకు నిరసనగా మహాధర్నా కార్యక్రమం చేప్పటింది. ఆ పార్టీ గౌరవాద్యక్షురాలు విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల ఇద్దరూ ఈ మహా ధర్నాలో పాల్గొని ప్రసంగించారు.

 

విజయమ్మ ప్రసంగిస్తూ “నేటి విద్యుత్ సంక్షోభానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఎంత బాధ్యత ఉందో, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడుకి కూడా అంతే బాధ్యతా ఉంది. ఇద్దరూ కూడా విద్యుత్ సంక్షోభాన్ని నివారించగలిగే అవకాశం ఉన్నపటికీ, ఒకరు ఆలోచనా రహితంగా, నిర్లక్ష్యంతో, మరొకరు స్వార్ధ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారకులయ్యారు. రాష్ట్రంలో తగినంత విద్యుత్ ఉత్పాదన లేదని తెలిసి, అందుకు అవసరమయిన ఏర్పాట్లు చేయడంలో కిరణ్ కుమార్ రెడ్డి విఫలమయ్యారు. తన హయాంలో ఎన్నడూ ఉచిత విద్యుత్ గురించి మాట్లాడని చంద్రబాబు నేడు ఊరూరు తిరుగుతూ ఉచిత విద్యుత్ ఇస్తానని భూటకపు వాగ్దానాలు చేస్తున్నాడు. ఆయన తన హయంలో కొన్ని మినీ విద్యుత్ ప్రాజెక్టులను నిబందనలకు విరుద్ధంగా ఎంవీఎస్ మూర్తి లాంటి తన వారికి కట్టబెట్టారు. మరణించిన నా భర్తను నిత్యం ఆడిపోసుకొనే చంద్రబాబు తన హయంలో జరిగిన ఈ అక్రమాలపై సీబీఐ విచారణకు సిద్దమేనా? నాడు రాజశేఖర్ రెడ్డి గారి హయం లో లేని విద్యుత్ సంక్షోభం నేడు ఎందుకు ఏర్పడింది? ప్రభుత్వాల అసమర్ధత వల్లనే కదా? మరి అటువంటప్పుడు మీరు చేసిన తప్పులకు ప్రజలను ఎందుకు శిక్షిస్తున్నారు?” అంటూ ఆమె ప్రశ్నించారు.