వైయస్సార్ కాంగ్రెస్ ట్వెంటీ X ట్వెంటీ మ్యాచ్

 

కాంగ్రెస్ పార్టీ నుండి త్వరలో 9మంది శాసనసభ్యులు వెనక్కి రానున్నఈ తరుణంలో, త్వరలో వివిధ పార్టీలకి చెందిన మరో 20 మంది శాసన సభ్యులు కూడా తమ టీంలో చేరబోతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ రోజు మాచర్లలో తన కార్యాలయంలో ప్రకటించారు. ఈ కొత్త బ్యాచ్ లో అందరూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సుల కోసం ఎదురుచూస్తున్నారని, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే తమ టీంలో చేరిపోతారని ఆయన పేర్కొన్నారు.

 

 ఆ 20మంది కూడా టీంలో జేరిపోతే, వారు వదిలి వచ్చిన పార్టీలతో మ్యాచ్చ్ మొదలుపెట్టేస్తారు. బయట పార్టీలతో వారు మ్యాచ్ ఆడుకొంటే పరువలేదు గానీ, రేపు తమకి పార్టీ టికెట్ ఇవ్వలేదని జగన్ మోహన్ రెడ్డి తో మ్యాచ్ ఆడుకొంటేనే ఇబ్బంది. అయినా, మంది ఎక్కువయితే మజ్జిగ పలుచన అవుతుందని తెలుసుకోకుండా, పార్టీలోకి వస్తామని అన్నవారినందరినీ ఆహ్వానించుకుంటూపోతే, రేపు పార్టీ టికెట్స్ ఎక్కడి నుంచి తెస్తారు? ఎంత మందికి పంచుతారు? ఇదివరకు చిరంజీవి పార్టీ పెట్టినప్పుడుకూడా ఇదే తంతు జరిగి చివరికి ఆ పార్టీ ఎక్కడ తెలిందో గుర్తుంచుకొంటే, ఇక వైయస్సార్ కాంగ్రెస్ తన టీం పెంచుకొనే ప్రయత్నం చేయకపోవచ్చును. లేదంటే ఆ పార్టీలో అసలు ప్లేయర్స్ కన్నా ఎగస్ట్రా ప్లేయర్లే ఎక్కువయిపోతారు. అప్పుడు వారిలో వారే 20X20 మ్యాచ్చులు ఆడుకోవలసి వస్తుంది. అయినా, కెప్టన్ ఇంకా టీంలోకి రాక ముందే ప్లేయర్స్ సిద్దం అయిపోతున్నారు.