విజయమ్మ వాకిట్లో అవినీతి చెట్టు

 

 

ఇటీవల విడుదలయిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రాజకీయాలలో క్షణం తీరిక ఉండని చంద్రబాబుని సైతం ఆకట్టుకొంది. ఆయన ఆ సినిమా ఇంతవరకూ చూడకపోయినా, క్యాచీగా ఉన్న ఆ సినిమా పేరుని మాత్రం బహు చక్కగా తన ప్రసంగంలో వాడుకొన్నారు. నిన్న నల్గొండ జిల్లా కోదాడ పట్టణంలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ విజయమ్మ వాకిట్లో అవినీతి చెట్టు వేస్తే అది పెరిగి పెద్ద ప్యాలెస్ అయిందని,డబ్బులు విరగకాసిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించడంతో ప్రజలు కడుపుబ్బా నవ్వుకొన్నారు. చంద్రబాబు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి చమత్కారంగా మాట్లాడుతూ "ఎవరైనా పుణ్యం కోసం, తమ కోరికలు తీరడం కోసం ఏ గుడికో, చర్చికో, మసీదుకో వెళ్లి కొబ్బరికాయలు కొట్టి దేవుడికి పూజలు చేస్తారు. గానీ, అదే జగన్ పార్టీలో చేరాలంటే మాత్రం చంచల్‌గూడ జైలుకు వెళ్లక తప్పదు. ఆ పార్టీలో చేరాలనుకొనే ఏ నాయకుడయినా తన రాజకీయ జీవితానికి ఆ జైల్లోనే ప్రారంభించకతప్పదు. అప్పుడే అతని కోరికలు తీరుతాయి,” అని చంద్రబాబు పలికినప్పుడు జనం పెద్దగా ఈలలువేసి చప్పట్లు కొడుతూ ఆయనని ప్రోత్సాహించారు. “కోటి సంతకాలు సేకరించిన మాత్రాన్న దోషి నిర్దోషిగా మారిపోడని” జగన్ను ఉద్దేశిస్తూ ఆయన అన్నప్పుడు కూడా ప్రజలు అదే రీతిలో స్పందించారు.

 

తెలంగాణా విషయంలోతెలుగుదేశం పార్టీ మళ్ళీ మాట మార్చిందని తెరాస నేతలు చంద్రబాబును తప్పుపడుతున్నపటికీ, ప్రజలు వారిని పట్టించుకోవట్లేదని చంద్రబాబు పాదయాత్రకు వస్తున్న విశేష స్పందన ఋజువు చేస్తోంది.