రైతు భరోసా పథకం పేరు మార్పు... బీజేపీ హెచ్చరికలతో జగన్ కీలక నిర్ణయం

 

ఆంధ్రప్రదేశ్ లో రైతు భరోసా పథకం ప్రారంభమైంది. నెల్లూరు జిల్లా కాకుటూరులో సీఎం జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించగా... మిగతా ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు... రైతు భరోసా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కాకుటూరులో రైతు భరోసా చెక్కులను సీఎం జగన్ స్వయంగా అన్నదాతలకు అందజేశారు. అయితే, రైతు భరోసా పథకం ప్రారంభానికి ముందే, రైతులకు మరో శుభవార్త చెప్పిన జగన్మోహన్ రెడ్డి... ప్రతి ఏటా రైతులకిచ్చే పెట్టుబడి సాయాన్ని 12వేల 500 నుంచి 13వేల 500 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, రైతు సంఘాల కోరిక మేరకు, రైతు భరోసా కింద ఇచ్చే మొత్తాన్ని... ఏడాదిలో మూడు విడతులుగా అందజేయనున్నారు. మేలో 7వేల 500... రబీలో 4వేలు... సంక్రాంతికి 2వేలు... అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే, వైఎస్సార్ రైతు భరోసా పథకం పేరును మార్చారు. రైతు భరోసా కింద ఇస్తోన్న పెట్టుబడి సాయంలో 6వేల రూపాయలను కేంద్రమే ఇస్తుండటంతో... ఈ పథకానికి వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ సమ్మాన్ యోజనగా నామకరణం చేశారు. బీజేపీ నుంచి విమర్శలు రాకూడదనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.