రేపే రైతు భరోసా... 5వేల 510 కోట్లు విడుదల... 3 విడతలుగా మార్చే ఆలోచన.!

 

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న రైతు భరోసా పథకం రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభంకానుంది. రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని ప్రధాని మోడీని... జగన్ స్వయంగా ఢిల్లీ వెళ్లి ఆహ్వానించినప్పటికీ, పీఎంవో నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే... రేపు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నారు. నెల్లూరు జిల్లా కాకుటూరులో ఈ పథకాన్ని ప్రారంభించి రైతులకు స్వయంగా రైతు భరోసా చెక్కులు అందజేస్తారు. రైతుల ఖాతాల్లో రైతు భరోసా పథకం డబ్బులు జమ చేయడం కోసం 5వేల 500కోట్ల రూపాయలను ఆర్ధికశాఖ విడుదల చేసింది. 

రైతు భరోసా పథకం ప్రారంభిస్తున్న నేపథ్యంలో అగ్రికల్చర్ మిషన్ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, రబీ సాగు కార్యాచరణపై రైతు సంఘాలతో చర్చించారు. అయితే, వర్షాలు ఆలస్యంగా కురిసినందున పంటలు దెబ్బతిన్నాయని, దాంతో ఖరీఫ్ స్థాయిలో సాగు లేదని, ఈ సందర్భంగా రైతు సంఘాల ప్రతినిధులు ... సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, రైతు భరోసా కింద ఇచ్చే సొమ్మును ఒకేసారి ఇచ్చే బదులు... రెండు మూడు విడతలుగా ఇస్తే బాగుంటుందని, మే నెలలో ఒకసారి, కోత సమయంలో మరోసారి, అలాగే రబీ అవసరాల కోసం ఇంకోసారి ఇవ్వాలని రైతు సంఘాల ప్రతినిధులు కోరినట్లు తెలుస్తోంది.