ప్రకటనల కామెడీ!

 

 

 

ఈమధ్య కాలంలో తెలుగులో కామెడీ సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో కామెడీ సినిమాలు కూడా లేవు. టీవీ సీరియళ్ళలో కూడా కామెడీ సీరియళ్ళు కూడా తక్కువగా వున్నాయి. తెలుగు ప్రజలు హాయిగా నవ్వుకోవడానికి అవకాశాలు తక్కువగా వున్నాయి. దీన్ని అర్థం చేసుకున్న రాజకీయ పార్టీలు ప్రకటనల రూపంలో తెలుగు ప్రజలను నవ్వించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాయి.

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రాజకీయ ప్రకటనలు చూసి నవ్వడం మరచిపోయిన జనం కూడా పగలబడి నవ్వుకుంటున్నారు. ఏవేవో సమస్యల్లో వున్న జనం అక్కడే ఉన్న రాజకీయ నాయకుడుతో ‘ఆయనొస్తున్నాడు’ అని గాల్లోకి వేలు తిప్పడం, అది ఫ్యాన్ గుర్తుకు సింబాలిక్‌గా వుండటం చూసేవాళ్ళని బాగా నవ్విస్తోంది. ఆ తర్వాత వచ్చే ‘ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి.. దుమ్ము దులపండి’ అని బొంగురుగొంతు వాయిస్ ‘ఓవర్’ భలే కామెడీగా వుంటోంది.



అసలు రాష్ట్రంలో దుమ్ముకు ఫ్యానే ప్రధాన కారణం అయినప్పుడు మళ్ళీ ఫ్యాన్‌కి ఓటేసి కొరివితో తల గోక్కోవడం ఎందుకని జనం అనుకుంటున్నారు. అలాగే సమైక్య సింహం ముసుగులో వున్న కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ జై సమైక్యాంధ్య పార్టీ ఇస్తున్న ప్రకటనలు కూడా నవ్వు తెప్పించేలా వున్నాయి. ‘చెప్పు గుర్తుకే మీ ఓటు’ అని ప్రకటనలో వినిపిస్తున్నప్పుడు జనం నవ్వులే నవ్వులు. అసలు పొలిటికల్ సీన్‌లో జై సమైక్యాంధ్ర పార్టీ వుందా అనే సందేహాలు చాలామందికి వస్తున్న సమయంలో ఈ ప్రకటన ‘ఓహో ఈ పార్టీ ఒకటి వుంది కదూ’ అని గుర్తు చేస్తూ ఆ రకంగా సక్సెస్ అవుతోంది.