తెలంగాణాలో వైకాపా సెల్ఫ్ గోల్

 

అన్ని పార్టీలు తెలంగాణా అంశంపై అనర్గళంగా మాట్లాడుతుంటే, తాము మాత్రం ఇంత కాలం ఈ అంశంపై మాట్లాడకుండా ఉండి రాజకీయంగా నష్టపోయామనే ఆలోచన రావడం వలననో, లేక కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్న రాయల తెలంగాణా ఆలోచన వద్దని హెచ్చరించాలనే ఆలోచనో మరి తెలియదు కానీ వైకాపా తెలంగాణా అంశంపై కాంగ్రెస్ ఒంట్టెత్తు పోకడలకు పోతోందని విమర్శిస్తూ ఒక లేఖ వ్రాసింది. అయితే అది కాస్తా ఆచితూచి జాగ్రత్తగా అడుగు వేయబోయి చివరికి పేడలో కాలు వేసినట్లయింది.

 

ఇంత కాలం తెలంగాణా అంశంపై ఏమి మాట్లాడితే ఏమవుతుందో అనే భయంతో నోరుమెదపకుండా నెట్టుకొచ్చిన వైకాపా, ఇక నేడో రేపో కాంగ్రెస్ తెలంగాణా అంశం తెల్చేసేందుకు సిద్దపడుతుంటే, ఇప్పుడు ఆఖరి నిమిషంలో లేఖ వ్రాయడంతో తెలంగాణావాదులు ఆ పార్టీపై భగ్గుమన్నారు.

 

కాంగ్రెస్ యంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ “క్రిందటి సం. జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకొన్నాతమకి ఎటువంటి అభ్యంతరం లేదని పదిమంది ముందు చెప్పివచ్చిన వైకాపా, ఆ సంగతి మరిచిపోయి నేడు కాంగ్రెస్ ఎవరినీ సంప్రదించకుండా తెలంగాణా అంశం ఏదో ప్రైవేట్ వ్యవహారంలా చేసుకుపోతోందని విమర్శించడం ఆ పార్టీ రాజకీయ అజ్ఞానమయినా అయి ఉండాలి లేదా తెలంగాణా అడ్డుకొనేందుకు కుట్ర అయిన అయ్యి ఉండాలి. సీమంద్రాకు చెందిన మైసూరా రెడ్డి, తమ పార్టీ వ్రాసిన లేఖను ఖండించలేకపోవచ్చును. కానీ, స్వయంగా అఖిలపక్షానికి కూడా హాజరయ్యి, ‘కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకొన్నాతమకి ఎటువంటి అభ్యంతరం లేదని తెలుపుతూ’ ఆపార్టీ వ్రాసిన లేఖని తన స్వహస్తాలతో హోంమంత్రికి ఇచ్చిన తెలంగాణకు చెందిన ఆ పార్టీనేత మహేంద్ర రెడ్డి తమ పార్టీ కాంగ్రెస్ కు వ్రాసిన లేఖను ఎందుకు ఖండించట్లేదు?” అని ప్రశ్నించారు. వైకాపా ఏదో ఆశించి తెలంగాణా అంశం గురించి ప్రస్తావించబోతే అదికాస్తా చివరికి ఇలా బెడిసికొట్టింది.