ఆనాడు సీబీఐ కావాలన్నారు? ఇప్పుడెందుకు వేయరు? వైఎస్ జగన్ పై సోదరి సంచలన ఆరోపణలు...

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సంచలన మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై... వైఎస్ వివేకా కూతురైన సునీత సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వివేకా మర్డర్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరిన జగన్మోహన్ రెడ్డి... ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించింది. సీఎం పగ్గాలు చేపట్టి ఎనిమిది నెలలైనా ఇఫ్పటివరకు ఎందుకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేదని ప్రశ్నను సునీత లేవనెత్తారు. సిట్ అధికారులను పదేపదే మార్చడంపై అనుమానాలు వ్యక్తంచేశారు. పైగా కడపకు కొత్త ఎస్పీ వచ్చాక కేసు నత్తనడకన సాగుతోందని వైఎస్ వివేకా కుమార్తె సునీత ఆరోపించారు. ఈ కేసులో జరుగుతోన్న పరిణామాలను చూస్తుంటే అసలైన నిందితులను వదిలేసి... అమాయకులను ఇరికిస్తారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. తన లాయర్ ద్వారా హైకోర్టుకు వాదనలు వినిపించిన వైఎస్ వివేకా కుమార్తె సునీత.... 15మందిపై అనుమానాలు ఉన్నాయని తెలిపింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి... అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి.... చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి తదితర పేర్లను ప్రస్తావించింది. 

వివేకా హత్య కేసును రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థకు... లేదా సీబీఐకి అప్పగించాలని ఆయనభార్య వైఎస్ సౌభాగ్యమ్మ... అలాగే, అప్పటి ప్రతిపక్ష నేత... ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు... అప్పట్లో హైకోర్టు వ్యాజ్యాలు దాఖలు చేశారు. అయితే, అప్పటి మంత్రి ఆదినారాయణ, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిపై ఆరోపణలు రావడంతో... వాళ్లు కూడా కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. అలాగే, వైఎస్ వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి కలిసి మరో వ్యాజ్యం చేశారు.అయితే, వైఎస్ వివేకా హత్యపై దాఖలైన అన్ని పిటిషన్లను విచారించిన హైకోర్టు...కేసును  సీబీఐకి అప్పగించానికి అభ్యంతరం ఏమిటంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

అయితే, వైఎస్ వివేకా కుమార్తె సునీత లేవనెత్తిన ప్రశ్నలే ఇప్పుడు సంచలనంగా మారాయి. సొంత సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఎందుకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేదని ప్రశ్నిస్తున్నారు. అసలు దర్యాప్తు జరుగుతున్న తీరుపైనా తమకు అనుమానాలు ఉన్నాయని వైఎస్ వివేకా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించడం చూస్తుంటే విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా... కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారేమోనన్న డౌట్ రాక మానదు. మరి వైఎస్ వివేకా కేసులో అసలు నిందితులెవరో తేలతారో లేక... సునీత అనుమానిస్తున్నట్లుగా అమాయకులను ఇరికించి నిజాలను సమాధి చేస్తారో చూడాలి.