షర్మిల టెంపర్.. తెలంగాణలో మంటల్..

గాడిదలు కాస్తున్నారా? ఏం చేస్తున్నారు ఇంతసేపు? ఈ మాటలన్నది మరెవరో కాదు వైఎస్ షర్మిల. ఆమెతో ఈ మాటలు పడింది కూడా ఎవరో మామూలు మనిషి కాదు ఇందిరా శోభన్. ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన నేత. గతంలో హస్తం పార్టీ అధికార ప్రతినిధి. ఫైర్ బ్రాండ్ లీడర్‌గా, కాంగ్రెస్ మౌత్ స్పీకర్‌గా సీఎం కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడేవారు ఇందిరా శోభన్. అప్పట్లో పులిలా గాండ్రించిన ఇందిరా శోభన్.. ఇప్పుడు షర్మిల ముందు పిల్లిలా మారిపోయారు. మౌనంగా మాటలు పడుతున్నారు.

నిరుద్యోగ సమస్యపై ఇందిరాపార్కు దగ్గర షర్మిల చేపట్టిన దీక్షలో జరిగిందీ అవమానకర ఘటన. షర్మిలను చూసేందుకు వేదికపైకి అభిమానులు వస్తుండగా.. వారిని కట్టడి చేయడంలో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై మండిపడ్డారు షర్మిల. సిబ్బందిని పిలిచి వారిని గట్టిగా మందలించారు. వేదికపైకి "ఎవరొచ్చినా నీకుంది.." అంటూ తన సెక్యూరిటీ స్టాఫ్‌కు వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో హడావుడిగా అక్కడికి వచ్చారు ఇందిరా శోభన్. ఆమె వల్లనే సెక్యూరిటీ వైఫల్యమని భావించిన షర్మిల.. వేదికపైనే ఇందిరాపై నోరు పారేసుకున్నారు. "ఏం చేస్తున్నారు మరి ఇంతసేపు.. గాడిదలు కాస్తున్నారా?" అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. విసుగ్గా ముఖం పెట్టి.. రుసరుసగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

వేదికపై అందరి ముందే ఇందిరా శోభన్‌తో అంత నిష్ఠూరంగా మాట్లాడటం.. చేతిలో మైకు ఉందనే సోయి కూడా లేకుండా గాడిదలు కాస్తున్నారా? అంటూ చీప్‌గా తీసిపారేయడం షర్మిల అహంకారానికి నిదర్శనం అంటున్నారు తెలంగాణ వాదులు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు హవా కొనసాగించిన ఇందిరా శోభన్‌కు ఎంత ఖర్మ పట్టిందంటూ ఆమెపై సానుభూతితో పాటు సెటైర్లూ వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో షర్మిల దూషించిన వీడియాలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇది తెలంగాణ అత్మాభిమానానికి జరిగిన అవమానమంటూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది.

వైఎస్సార్ మంచోడే.. జగనే మహా మొండి. ఎంపీ పదవి కోసం తండ్రినే టార్చర్ చేశాడు. బాబాయ్‌పైనా చేయి చేసుకున్నాడు. వైసీపీ నేతలను చీప్‌గా చూస్తాడు. ఇంటికొస్తే టీ, బిస్కెట్లు కూడా ఇవ్వడు. కనీసం మంచి కుర్చీ కూడా వేయరు. ఇలా వైఎస్ జగన్‌పై అనేక విమర్శలు ఉన్నాయి. ఆయన సోదరి వైఎస్ షర్మిలలోనూ అలాంటి అహంకారమే కొట్టొచ్చినట్టు కనబడుతోందని అంటున్నారు. రాజన్న రాజ్యమంటూ ఇటీవలే పార్టీ పెట్టిన షర్మిల.. పలువురు పాత కాపులను పార్టీలో చేర్చుకున్నారు. అందులో, తెలంగాణ వైసీపీకి చెందిన కీలకనేత కొండ రాఘవరెడ్డి ప్రముఖుడు. ఒకవిధంగా చెప్పాలంటే కొత్త పార్టీలో షర్మిల తర్వాత దాదాపు నెంబర్ 2 పొజిషన్ ఆయనది. అలాంటి రాఘవరెడ్డిని ఇటీవల జరిగిన మీటింగ్‌లో ఓ ప్లాస్టిక్ కుర్చీలో కూర్చోబెట్టి ఘోరంగా అవమానించారు.

షర్మిల.. దర్జాగా ఖరీదైన సోఫాలో ఆసీనురాలై.. ఆ పక్కనే ఓ పనికిరాని ప్లాస్టిక్ ఛైర్‌లో రాఘవరెడ్డిని కూర్చోబెట్టి తెలంగాణ నాయకుడిని ఇన్‌సల్ట్ చేశారంటూ అప్పట్లో చర్చ జరిగింది. అది సద్దుమనిగేలోగా.. తాజాగా మరో తెలంగాణ ఫైర్ బ్రాండ్ లేడీ ఇందిరా శోభన్‌ను అందరిముందే.. అందరికీ వినిపించేలా.. గాడిదలు కాస్తున్నారా? అంటూ మైకులో అరవడం కచ్చితంగా షర్మిల షార్ట్ టెంపర్‌కు నిదర్శనమని తెలంగాణవాదులు తెగ ట్రోల్ చేస్తున్నారు. 

ఇది కేవలం ఇందిరా శోభన్‌కో, కొండా రాఘవరెడ్డికో జరిగిన అవమానం కాదని.. యావత్ తెలంగాణ జాతిని షర్మిల కించపరిచిందని సోషల్ మీడియాలో ఏకిపడేస్తున్నారు. అన్నలానే చెల్లికి సైతం నాయకులంటే చిన్నచూపని.. తామే సుపీరియర్ అనే టెంపర్ వారిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని మండిపడుతున్నారు. ఏ అత్మాభిమానం కోసమైతే తెలంగాణ సాధించుకున్నామో.. అదే ఆత్మాభిమానం వైఎస్ కుటుంబం ముందు తాకట్టు పెట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చూపించిన ఫైర్.. షర్మిల ముందు చల్లారిపోయిందా? అంటూ ఇందిరా శోభన్‌ను ప్రశ్నిస్తున్నారు. గాడిదలు కాస్తున్నారా? అంటూ హేళన చేసిన షర్మిలకు తగిన బుద్ది చెప్పాల్సిందేనంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ నడుస్తోంది.