72 గంటల దీక్ష.. తగ్గేదే లే..

కేసీఆర్‌ది గుండెనా.. బండరాయా? చందమామ లాంటి పిల్లలు చనిపోతుంటే కేసీఆర్‌కి కనిపించడం లేదా అంటూ ఘాటుగా విమర్శించారు షర్మిల. ఇందిరాపార్కు దగ్గర తాను చేపట్టిన దీక్షను.. 72గంటల పాటు కొనసాగిస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. షర్మిల దీక్షకు ఒక రోజు మాత్రమే అనుమతి ఇచ్చారు పోలీసులు. అలాంటిది, సడెన్‌గా దీక్షా శిబిరం నుంచి 72 గంటలు దీక్ష చేస్తానంటూ షర్మిల ప్రకటించడం కలకలం రేపుతోంది. దీనిపై పోలీసుల స్పందన రావాల్సి ఉంది. 

ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇందిరాపార్క్ దగ్గర దీక్ష చేపట్టారు షర్మిల. యువతకు న్యాయం జరగాలని, నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించే వరకు తమ దీక్షలు కొనసాగుతాయన్నారు. ఉద్యోగాలు లేక యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా.. కేసీఆర్‌లో చలనం రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం ఖాళీగా ఉందని, అసలు ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయట్లేదో కేసీఆర్ చెప్పాలన్నారు. యువతకు అండగా తాము పోరాటం చేస్తామన్నారు. షర్మిల దీక్షకు మద్దతుగా ఆమె అభిమానులు జిల్లాల్లో దీక్షలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, షర్మిల దీక్షకు బీసీ సంఘాల జాతీయ నేత ఆర్ కృష్ణయ్య, రచయిత కంచె ఐలయ్య తమ మద్దతు ప్రకటించారు.