ప్రాజెక్టుల కోసం ప్రపంచ బ్యాంక్ తో వైఎస్ జగన్ ప్లాన్!!

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి, ప్రాజెక్టులపై పెద్దఎత్తున చర్యలు చేపట్టింది. అయితే ఇప్పుడు సంక్షేమ పథకాల అమలుకే అప్పుల కోసం నానా తంటాలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వ సాగు నీటి ప్రాజెక్టుల కోసం అదే బాట పడుతోంది. తక్కువ వడ్డీలకు అప్పులిచ్చే వారి కోసం వేట మొదలు పెట్టింది. దానికి ప్రపంచ బ్యాంకే ఎడారిలో ఒయాసిస్సులా కనిపిస్తుంది. సాగు నీటి పథకాలను కొత్తగా చేపట్టేందుకు రుణాలివ్వటానికి ప్రపంచ బ్యాంకు నియమ నిబంధనలు అంగీకరించవు కానీ పూర్తైన ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం ద్వారా కొత్త ఆయకట్టుకు సాగు నీరు అందించేందుకు మాత్రం అప్పులు ఇస్తుంది.

అయితే రాష్ట్ర అవసరాలను ప్రపంచ బ్యాంక్ కు తెలియచేసి కొత్తగా నిర్మించబోయే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం కోసం రుణాలు ఇవ్వాల్సిందిగా ప్రపంచ బ్యాంకును అర్థించాలి అని రాష్ట్ర జలవనరుల శాఖ నిర్ణయించింది. సీమ దుర్భిక్ష నివారణ పథకానికి 33,869 కోట్లు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 15,488 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ బుధవారం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో భేటీ కానున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో గోదావరి, కృష్ణా నదులు కాలువల అభివృద్ధికి రుణమివ్వాలని సీఎం కోరనున్నట్లు తెలుస్తోంది.

అదేవిధంగా  పై రెండు కొత్త పథకాలకు అప్పులు ఇవ్వాలన్న ప్రతిపాదనలను కూడా ప్రపంచ బ్యాంకు ప్రతి నిధుల ముందు ఉంచుతారని అంటున్నారు. కానీ తన నియమ నిబంధనలకు విరుద్ధంగా కొత్త ప్రాజెక్టులకు బ్యాంకు సహకరిస్తుందా? అని ప్రభుత్వ వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. దేశీయంగా బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునే పరిమితిని రాష్ట్రం ఎప్పుడో దాటేసింది. దీంతో ప్రపంచ బ్యాంకుపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. మరి ప్రపంచ బ్యాంక్ ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.