అక్రమ కట్టడాలు అంటూ బాబుపై కక్ష సాధింపు చర్యలతో జగన్....


జగన్ తన పాలన మొదలుపెట్టినప్పటి నుంచే చంద్రబాబు పై కక్ష సాధింపు చర్యలు చేపట్టే పనిలో ఉన్నట్లు అందరికి తెలిసిన విషయమే.దీని నేపధ్యంలోనే  అక్రమ కట్టడాల కూల్చివేత పై  తగిన చర్యలు తీసుకునే పనిలో పడ్డ జగన్ చంద్రబాబు కట్టడాలు అన్నింటిని కూల్చి వేశారు. ఇప్పుడు చంద్రబాబు తన పార్టీ కోసం గుంటూరు జిల్లా మంగళగిరిలోని జాతీయ రహదారి వెంబడి భారీ ఎత్తున నిర్మిస్తున్న రాష్ట్ర పార్టీ కార్యాలయానికి కూడా జగన్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇక్కడ పార్టీ ఆఫీసు కోసం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వ భూములను కేటాయించారు. నిర్మాణాలను కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు.

సీఎం హోదాలో రెండు సార్లు ఆయన ఇక్కడ నిర్మాణాలని కూడా పరిశీలించారు. అయితే వీటిపై లోతైన విచారణ చేపట్టిన జగన్ ప్రభుత్వం తాజాగా నోటీసులు ఇచ్చింది. అప్పటి సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ వాగు పోరంబోకు భూమి ప్రైవేటు రైతుల భూములను ఆక్రమించి మండలంలోని ఆత్మకూరు గ్రామం జాతీయ రహదారి వెంబడి టిడిపి కార్యాలయం భవనం నిర్మిస్తారని వైకాపా ఆరోపిస్తోంది. అనుమతులు లేని ఈ భూముల్లో పార్టీ కార్యాలయం ఎలా నిర్మిస్తారని ప్రశ్నించడంతో పాటు మూడు వందల తొంభై రెండు బై రెండు సర్వే నెంబర్ లోని ప్రభుత్వ వాగు పోరంబోకుతో పాటు ప్రైవేటు రైతులకు చెందిన భూములను ఆక్రమించి నిర్మాణం ఎలా చేపడతారని ప్రశ్నించారు. దీనికి సంబంధించి నిర్మాణాలకు ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేశారు. మంగళగిరి తహసీల్దార్ రాంప్రసాద్ నోటీసులు జారీ చేసిన ఏడు రోజుల లోపు ప్రభుత్వ భూముల్లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని లేని పక్షంలో తామే తొలగిస్తామని నోటీసులో పేర్కొన్నారు. ఈ పరిణామం ఎటు దారి తీస్తుందో చూడాలి.