దారిలోకొస్తే సరి...లేదంటే వేటే... మండలిపై మూడ్రోజుల వ్యూహం

ఎందుకీ మండలి అంటూ శాసనసభా వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలతో కౌన్సిల్ రద్దు దాదాపు ఖాయమని అంతా భావిస్తున్నారు. అయితే, మండలి కొనసాగాలో వద్దో సోమవారం చర్చించి నిర్ణయం తీసుకుందామంటూ మూడ్రోజులు గ్యాప్ తీసుకోవడం వెనుక వైసీపీ వ్యూహం ఉందంటున్నారు. ఈ మూడు రోజుల్లో పరిణామాలు తమకు అనుకూలంగా మారితే మండలి యథాతథంగా కొనసాగుతుందని, ఒకవేళ అదే పరిస్థితి కంటిన్యూ అయితే మాత్రం కౌన్సిల్ కొనసాగే అవకాశమే ఉండదని వైసీపీ వర్గాలు అంటున్నాయి. బుధవారమే నిరవధిక వాయిదా పడాల్సిన అసెంబ్లీని గురువారం కూడా కొనసాగించి, ఆ తర్వాత మూడ్రోజులు విరామమిచ్చి... సోమ, మంగళవారాల్లోనూ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం వెనుక ఉద్దేశం ఇదేనని చెబుతున్నారు. ఈ మూడ్రోజుల్లో మండలి వాతావరణాన్ని పరిశీలిస్తారని, సానుకూల పరిస్థితులు కనిపిస్తే కౌన్సిల్ సేఫ్ గా ఉంటుందని, లేకపోతే మాత్రం రద్దు దిశగా అడుగులు చేస్తారని అంటున్నారు.

ముఖ్యంగా మండలిలో విపక్ష సభ్యులను తమవైపు లాక్కునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. అయితే, ఒకరిద్దరు మినహా ఎవరూ అధికార పార్టీ వైపు మొగ్గుచూపలేదు. దాంతో, ఈ మూడ్రోజుల గ్యాప్ లో మెజారిటీకి అవసరమైన సభ్యులను తనవైపు మళ్లించుకునేందుకు ప్రయత్నించాలని భావిస్తోంది. ఒకవేళ, ఈ వ్యూహం ఫలించకపోతే... సోమవారం శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానాన్ని ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. ఆ వెంటనే ఉభయ సభలను ప్రోరోగ్ చేసి మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై ఆర్డినెన్సులు జారీ చేసి తన పంతం నెగ్గించుకోవాలని సీఎం జగన్ ఆలోచనగా వైసీపీ నేతలు 

శాసనసభ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన... ఇంగ్లీషు మీడియం, ఎస్సీ ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల బిల్లులను మండలి తిరస్కరించినప్పుడే... మండలి రద్దు ఆలోచనకు బీజంపడింది. అప్పుడే మండలిని రద్దు చేసేద్దామంటూ సీఎం జగన్... మంత్రులతో వ్యాఖ్యానించారు. ఇక, ఇప్పుడు మూడు రాజధానుల బిల్లు విషయంలోనూ చుక్కెదురు కావడంతో మండలిని రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇప్పటికే, మంత్రులు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు, సలహాదారులు, అడ్వకేట్‌ జనరల్‌, న్యాయనిఫుణులతో చర్చించిన జగన్మోహన్ రెడ్డి.... అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. తమకెలాంటి అభ్యంతరం లేదంటూ అందరి నుంచీ సమాధానం రావడంతోనే... ఈ మండలి ఎందుకంటూ శాసనసభలో జగన్ బాంబు పేల్చారని అంటున్నారు. 

మొత్తానికి, ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటూ, సర్కారు పెద్దల కంట్లో నలుసులా మారిన శాసన మండలి రద్దుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, మండలిని ఉంచుకోవడం... తుంచుకోవడం... పూర్తిగా రాష్ట్రం ఇష్టమైనా.... అసెంబ్లీ తీర్మానం చేయగానే రద్దయిపోదు... తుది నిర్ణయం కేంద్రం చేతిలో ఉంటుంది... రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించాక... రాష్ట్రపతి సంతకం చేస్తేనే మండలి రద్దవుతుంది. అయితే, ఈ ప్రక్రియ ఎప్పటిలాగా పూర్తవుతుందో కచ్చితంగా చెప్పలేం... ఏడాది పట్టొచ్చు... లేక ఏడాదిన్నర... రెండేళ్లు కూడా పట్టొచ్చు... కేంద్రం ఎంత వేగంగా స్పందిస్తే అంత త్వరగా రద్దు జరుగుతుంది.