వైసీపీ కమ్మని రాజకీయం... "విభజించి పాలించు" అనే ఫార్ములాతో ముందుకుపోతున్న జగన్

 

కృష్ణాజిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తెలుగుదేశానికి పట్టుగా ఉన్న కమ్మ సామాజికవర్గ నేతల్లో విజయవంతంగా చీలిక తీసుకురాగలిగింది వైసీపీ నాయకత్వం. పార్టీ ఆవిర్భావ దశ నుండి కృష్ణా జిల్లా కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం వెంటే నడుస్తోంది. చంద్రబాబుపై వ్యతిరేకతతో ఒకరిద్దరు నేతలు టీడీపీకి దూరం అయ్యారు. ఈ జిల్లాలో కమ్మ సామాజిక వర్గం అండ లేకుండా రాజకీయాలు చేయడం ఇబ్బందికరం అనే విషయాన్ని గ్రహించిన వైసిపి అధినేత ఆ వర్గంలో చీలిక తీసుకురావడంలో విజయం సాధించారు. అది కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఇసుక దీక్ష చేస్తున్న సమయంలోనే ఇద్దరు ముఖ్య నేతలు.. చంద్రబాబును, ఆయన తనయుడు లోకేష్ ను.. ఎడాపెడా విమర్శిస్తూ పార్టీని వీడడం టిడిపి పరిస్థితికి అద్దం పడుతుందని  కామెంట్స్ వినిపిస్తున్నాయి.

గత ఎన్నికల్లో విజయవాడ లోక్ సభ సీటుకు టీడీపీ అభ్యర్థి కేశినేని నాని మీద మరో కమ్మ సామాజికవర్గ నేత పీవీపీని నిలిపి విజయం సాధించలేకపోయింది వైసిపి. ముఖ్యంగా పశ్చిమ కృష్ణాలో బలంగా ఉన్న దేవినేని ఉమాను బలహీనపరిచే లక్ష్యంతో దేవినేని కుటుంబాల్లోనే చీలిక తీసుకొచ్చారు. ఒకనాడు జిల్లా రాజకీయాలను శాసించిన దేవినేని నెహ్రూ తనయుడు అవినాష్ పచ్చకండువ తీసేసి వైసీపీ కండువా కప్పుకున్నారు. 40 ఏళ్ళుగా తమ కుటుంబంతో ఉన్న కార్యకర్తలంతా వైసిపిలోకి వచ్చేస్తారని  ప్రకటించారు అవినాష్. మరోవైపు గన్నవరం ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చాలా రోజుల దాగుడుమూతల తర్వాత వైసీపీలో చేరుతున్నట్లు స్పష్టంగా ప్రకటించారు. తన నియోజక వర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమేనని చెప్పారు వంశీ.

వైసీపీకి కూడా కృష్ణా జిల్లాలో కొడాలి నాని , వసంత కృష్ణ ప్రసాద్ వంటి ముఖ్యనేతలున్నారు. గతంలో వీళ్లిద్దరూ కూడా తెలుగుదేశం వారే. గుడివాడ నుంచి ఎన్నికై మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కొడాలి నాని మీద పోటీ చేసి ఓడిన దేవినేని అవినాష్.. టిడిపిలో పని చేసే వారికి గుర్తింపు లేదని ప్రకటించి బయటికెళ్లిపోయారు. ఒక రకంగా అవినాష్ వెళ్లిపోవటం దేవినేని ఉమకు నైతిక ఓటమి. అదే సమయంలో వంశీ, అవినాష్ నిష్క్రమణ తెలుగుదేశానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే అధికారం కోల్పోయి నాయకుల ఆర్థిక పునాదులు కదులుతున్న వేళ.. ఒక్కొక్కరుగా పార్టీని వీడడం తెలుగు దేశం నాయకత్వంలో ఆందోళన కలిగిస్తోంది. వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న వైసీపీ నాయకత్వం కృష్ణా జిల్లాలో కమ్మ సామాజికవర్గంలోనే చీలిక తీసుకు వచ్చి టీడీపీని నిర్వీర్యం చేయటానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబు దీక్ష చేస్తున్న రోజునే వంశీ అవినాష్ లతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయించింది. మొత్తం మ్మీద కృష్ణా జిల్లాలో కమ్మ వర్సెస్ కమ్మ రాజకీయాలు ఊపందుకుంటున్నాయి.