సీనియర్... జగన్ కు నచ్చని పదం అదొక్కటే!!

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరి చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఎప్పుడూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉండాల్సిందేనన్న రీతిలో సాగుతున్న జగన్... తాను రాజకీయాల్లోకి ప్రవేశించే సమయంలోనూ అదే పంథాను అనుసరించారు. ఫలితంగా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెన్నంటి నడిచిన సొంత బాబాయి వైఎస్ వివేకాందరెడ్డి అర్థాంతరంగా తన రాజకీయ ప్రస్థానాన్ని ముగించాల్సి వచ్చింది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత వివేకాకు మంత్రి పదవి దక్కినా అది మూన్నాళ్ల ముచ్చటే అయిన విషయం కూడా తెలిసిందే.

సరే... ఇప్పుడు రాజశేఖరరెడ్డి లేరు, వివేకానందరెడ్డి కూడా లేరు. అయినా కూడా జగన్ తన వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదనే చెప్పాలి. 2014 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత 2019 ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాల్సిందేనన్న భావనతో జగన్... తన పాత వైఖరినే కొనసాగించారని చెప్పక తప్పదు. తాను కేసుల్లో ఇరుక్కుని పార్టీని మూసివేయక తప్పదన్న వాదన వినిపించిన సమయంలో పార్టీకి అండగా నిలిచిన వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డిలకు మొన్నటి ఎన్నికల్లో కనీసం టికెట్లు కూడా ఇవ్వకుండా జగన్ తీసుకున్న నిర్ణయం ఈ వాదనకు నిలువెత్తు నిదర్శనమని చెప్పక తప్పదు. 

తన బాబాయి అయిన వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చిన జగన్.. మరి మేకపాటికి కనీసం రాజ్యసభ సభ్యత్వం అయినా ఇవ్వాలి కదా. అయితే సీనియర్ అన్న పదమే తనకు రుచించదు అన్న రీతిలో వ్యవహరిస్తూ ఇప్పుడు మేకపాటికి రాజ్యసభ సభ్యత్వం కూడా దక్కని రీతిలో జగన్ పావులు కదిపారు. మేకపాటి సొంత జిల్లా నెల్లూరుకు చెందిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీద మస్తాన్ రావును పార్టీలోకి ఆహ్వానించిన జగన్... ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఆఫర్ చేశారట. నెల్లూరు నుంచి బీదకు రాజ్యసభ ఇస్తే... మేకపాటికి మొండిచేయి చూపినట్టే. ఎందుకంటే.. ఒకే జిల్లా నుంచి ఇద్దరికి రాజ్యసభ సభ్యత్వాలు ఇస్తే పార్టీకి కష్టమే కదా.

ఇక నెల్లూరు జిల్లాకే చెందిన ఆనం రామనారాయణరెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినా... జగన్ ఆయనను తన కేబినెట్ లోకి తీసుకోలేదు. ఏళ్ల తరబడి అనుభవం ఉన్న ఆనంను పక్కనపెట్టిన జగన్... పాలనలో ఎంతమాత్రం అనుభవం లేని అనిల్ కుమార్ యాదవ్ కు ఛాన్సిచ్చారు. జగన్ అనుసరించిన ఈ వ్యూహంతో ఇప్పుడు ఆనం రగిలిపోతున్నారనే చెప్పాలి. ఏకంగా పార్టీని వీడేందుకు కూడా ఆయన వెనుకాడటం లేదన్న వాదన కూడా లేకపోలేదు. ఆనంను వదులుకునేందుకు కూడా సిద్ధమేనన్నట్లగా జగన్ సంకేతాలు ఇస్తున్న వైనం కూడా ఆసక్తికరమే. ఈ లెక్కన జగన్ కు సీనియర్లు అవసరం లేదన్న మాట కాస్తంత గట్టిగానే వినిపిస్తోంది. మరి జగన్ కు అవసరం లేని సీనియర్లు తమ భవిష్యత్తును ఎలా మలచుకుంటారో చూడాలి.