ఎంతమందినైనా ఎదుర్కొంటా... జగన్ సంచలన వ్యాఖ్యలు

అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోపే 80శాతానికి పైగా హామీలను నెరవేర్చామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. పేదల పక్షపాతిగా వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తోన్న సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని, అందుకే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఎన్నో మంచి పనులు చేస్తున్నా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంతమంది శత్రువులు ఏకమైనా... ప్రజల ఆశీర్వాదముంటే ఎదుర్కోగల శక్తి తనకుందన్నారు.

ఇక, మత్స్యకారులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఇస్తున్న సాయాన్ని 10వేలకు పెంచామని, ఈ నిర్ణయంతో లక్షా 35వేల మత్స్యకార కుటుంబాలకు లబ్ది జరుగుతుందన్నారు. మత్స్యకారులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే 10లక్షల ఆర్ధిక సాయం అందించనున్నట్లు జగన్ ప్రకటించారు. అలాగే, మర పడవలు, ఇంజిన్లు కలిగిన తెప్పల కోసం డీజిల్‌పై రాయితీని ఆరు రూపాయల నుంచి 9కి పెంచామని, దాంతో ఒక్కో మర పడవకు నెలకు 27వేలు... ఇంజిన్ తెప్పకు 2వేల 700 లబ్ది జరగనుందని తెలిపారు. అలాగే, 9 కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో దశలవారీగా ఫిష్ ల్యాండింగ్ సదుపాయాలు కల్పిస్తామని, అలాగే మూడు కొత్త ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటుతోపాటు... మచిలీపట్నం, నిజాంపట్నం హార్బర్ల పటిష్టానికి చర్యలు తీసుకుంటామన్నారు.  గంగపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపడానికి అవసరమైన అన్ని చర్యలూ చేపడతామన్నారు.