జగన్ ప్రభుత్వానికి మండలి గండం... ఇప్పటికిప్పుడు గట్టెక్కాలంటే కష్టమే...

జగన్ ప్రభుత్వాన్ని మండలి గండం వెంటాడుతోంది. 151 సీట్లతో శాసనసభలో తిరుగులేని బలాన్ని కలిగివున్న వైసీపీ సర్కారుకు ....శాసనమండలిలో మాత్రం మెజారిటీ లేదు. దాంతో, కీలక బిల్లుల ఆమోదం విషయంలో జగన్ ప్రభుత్వానికి చుక్కెదురవుతోంది. అంతేకాదు, మండలిలో ప్రతిపక్ష తెలుగుదేశం బలమే ఎక్కువగా ఉండటంతో జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాంతో, ఏకంగా మండలినే రద్దు చేస్తామంటూ హెచ్చరికలు పంపింది జగన్ సర్కారు. ఇటీవల జరిగిన శీతాకాల సమావేశాల్లో, అత్యంత ప్రతిష్టాత్మకంగా జగన్ సర్కారు ప్రవేశపెట్టిన రెండు బిల్లులకు ఆమోదించకుండా మండలి తిప్పిపంపింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు... అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ల ఏర్పాటు బిల్లులను మండలి తిప్పిపంపడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్రుగా ఉన్నారు.

ఇక, ఇఫ్పుడు, మరింత కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకోవడానికి జగన్ ప్రభుత్వం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చుతోంది. అయితే, ఇప్పుడు కూడా మండలి గండం వైసీపీ ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టం రద్దు లాంటి కీలక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అయితే, మూడు రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీ... ఈ బిల్లులను మండలిలో అడ్డుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే, ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ నెలరోజులకు పైగా పెద్దఎత్తున ఆందోళనలు, పోరాటం చేస్తున్న టీడీపీ.... జగన్ ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దాంతో, ఈ బిల్లులకు మండలిలో ఆమోదం లభించడం కష్టమే. రాజధాని మార్పునకు సంబంధించిన బిల్లును మండలిలో తెలుగుదేశం కచ్చితంగా అడ్డుకుంటుంది. ఎందుకంటే, 58మంది సభ్యులున్న ఏపీ శాసనమండలిలో అధికార వైసీపీకి కేవలం 9మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఇక, టీడీపీకి అత్యధికంగా 26మంది సభ్యులు ఉండటంతో మండలిలో ప్రతిపక్షానిదే పైచేయిగా ఉంది. అందుకే, శాసనసభలో వైసీపీ సభ్యులు.... టీడీపీని ఆడుకున్నట్లే.... మండలిలో అధికారపక్షాన్ని... తెలుగుదేశం వాళ్లు ఆటాడుకుంటున్నారు. దాంతో, మంత్రులు, ముఖ్యమంత్రి కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. 

రాజధాని మార్పు, మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టం రద్దు లాంటి బిల్లులను మండలిలో టీడీపీ అడ్డుకోవడం ఖాయం కావడంతో... వాటిని గట్టెక్కించడంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్జనభర్జనలు పడుతున్నారు. బిల్లుల ఆమోదంపై అనుసరించాల్సిన వ్యూహాలపై ఇఫ్పటికే పార్టీ పెద్దలు, మంత్రులతో చర్చించిన సీఎం జగన్... మండలి గండంపై మాత్రం తీవ్రంగా చర్చిస్తున్నారు. ఒకవేళ మండలిలో ఇబ్బందులు ఎదురైతే ఏం చేయాలన్నదానిపై దృష్టిసారించారు. అయితే, అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులపై గోప్యత పాటిస్తోన్న జగన్ ప్రభుత్వం.... మండలి గండాన్ని తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తోంది. ఒకవేళ బిల్లులను మండలి సెలెక్ట్ కమిటీకి పంపితే నెలా రెండు నెలలు సమయం పడుతుంది. అలా కాకుండా సవరణలు ప్రతిపాదిస్తూ తిరిగి శాసనసభకు పంపితే... మరోసారి తీర్మానం చేసి మండలికి పంపాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా నెల సమయం పడుతుంది. అయితే, రెండోసారి కూడా మండలి తిరస్కరిస్తే... ఆ తర్వాత శాసనసభ నిర్ణయమే ఫైనలవుతుంది. మరి, మండలి విషయంలో ఏ ఆప్షన్ ను జగన్ ప్రభుత్వం ఎంచుకుంటుందో చూడాలి.