జగన్ కొంప ముంచబోతున్న కాంగ్రెస్..!

విభజన అనంతరం ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ ఊసే లేదు.. విభజన ఎఫెక్ట్ తో ఏపీలో కాంగ్రెస్ ఉనికికే ప్రమాదం వచ్చింది.. చాలావరకు నేతలంతా కాంగ్రెస్ ని వీడి ఇతర పార్టీలలో చేరారు.. ఇక కొందరు నేతలైతే రాజకీయాలకే దూరంగా ఉంటున్నారు.. 'రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీసింది' అని విమర్శిస్తూ అప్పుడప్పుడు ఇతర పార్టీ నేతలు గుర్తు చేసుకోవడమే తప్ప, ఇంచుమించు ఏపీలో అందరూ కాంగ్రెస్ ని మర్చిపోయారు.. ఇక ఏపీలో కాంగ్రెస్ ఎప్పటికీ కోలుకోలేదు అనుకున్నారు.. కానీ కాంగ్రెస్ తిరిగి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది.. ఏపీ లో బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది.
కాంగ్రెస్ అధిష్టానం ఏపీ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది.. ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీతో కలిసి పార్టీని బలోపేతం చేయడానికి వ్యూహాలు రచిస్తోంది.. 

ఇప్పటికే పార్టీని వీడిన సీనియర్ నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.. రేపో మాపో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో సహా పలువురు నేతలు తిరిగి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. వీరి చేరిక వల్ల 'కార్యకర్తల్లో ఉత్సహం వస్తుంది.. అలానే పార్టీని వీడిన కేడర్ ఎంతో కొంత తిరిగి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉంది' అని అధిష్టానం భావిస్తోంది. ఉమెన్ చాందీ ఏపీలో ప్రతి నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి అనుకుంటున్నారు.. వచ్చే ఎన్నికల్లో సీట్లు గెలవకపోయినా ప్రతి నియోజకవర్గంలో కనీసం పదివేల ఓట్లు నుంచి 50 వేల ఓట్లు సాధించేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు.. ఒక్కో నియోజక వర్గంలో పదివేల ఓట్లు అంటే కాంగ్రెస్ పుంజుకున్నట్టే.. ఇంకేంటి కాంగ్రెస్ హ్యాపీ.. 

ఇంతవరకు బాగానే ఉంది కానీ కాంగ్రెస్ పుంజుకుంటే వైసీపీ కొంప మునిగినట్టే అంటున్నారు విశ్లేషకులు.. విభజన అనంతరం కాంగ్రెస్ ని వీడిన మెజారిటీ కేడర్ అంతా వైసీపీలో చేరింది.. ఇప్పుడు వైసీపీ బీజేపీకి దగ్గరవుతోంది.. ఇది జీర్ణించుకోలేని కొందరు కార్యకర్తలు,ఎస్సీలు, మైనార్టీలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాలని చూస్తున్నారట.. ఆ కేడర్ ఎంతో కొంత తిరిగి కాంగ్రెస్ లో చేరితే.. ప్రతి నియోజక వర్గంలో వైసీపీ ఓటు బ్యాంకు పదివేలు తగ్గితే.. వైసీపీ పరిస్థితి ఏంటి?.. అసలే గత ఎన్నికల్లో 5 వేలు లోపు మెజారిటీతో గెలిచిన స్థానాలు చాలా ఉన్నాయి.. వచ్చే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పదివేల ఓట్లు సాధిస్తే, సీఎం అవ్వాలన్న జగన్ ఆశలు మీద నీళ్లు జల్లినట్టేనా.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుంటే జగన్ కొంప మునిగేలా ఉందిగా అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.