ప్రత్యేక హోదాపై మీ గళాన్ని వినిపించండి... ఎంపీలకు జగన్ ఆదేశాలు

 

తమ వ్యక్తిగత అభిప్రాయాలను టీవీ చర్చల్లో బయట పెడుతున్నారు కొందరు ఎంపీలు. ఒకరిద్దరు ఎంపీలు పార్టీని సంప్రదించకుండానే నేరుగా కేంద్ర మంత్రులను..ప్రధానిని కలుస్తున్నారు. ఇది సరికాదని పార్టీ ఎంపీలకు వైసిపి అధినేత సీఎం జగన్ సూచించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల పై చర్చించేందుకు వీలుగా తాడిపల్లిలోని నివాసంలో శుక్రవారం వైసీపీ ఎంపీలతో జగన్ భేటీ అయ్యారు. వైసీపీ పార్టీ జాతీయ కార్య దర్శి విజయసాయిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిలను సంప్రదించి వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాకే కేంద్ర మంత్రులను.. ప్రధానిని.. కలవాలని జగన్ సూచించారని సమాచారం. స్వతంత్రంగా వ్యవహరిస్తూ విజయసాయిరెడ్డి లేకుండా కలవడం సరికాదని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఇలా జరిగితే షోకాజ్ నోటీసు జారీ చేసేందుకు వెనుకాడడని పార్టీ ఎంపీలతో ఘాటుగా హెచ్చరించారు జగన్. 

పోలవరం రెవిన్యూ లోటు విభజన చట్టం ప్రకారం నెరవేర్చాల్సిన అంశాలు.. ప్రస్తుత స్థితి గతులను.. ఎంపీలకు ఉదాహరణగా వివరించారు. ప్రత్యేక హోదాపై వైసీపీ వాణిని వినిపించి.. ప్రతి పక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. రెవిన్యూ లోటు కింద కేంద్రం ఇవ్వాల్సిన మొత్తాన్ని గురించి పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాలన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం వెనుక బడిన ఏడు జిల్లాలకు రావలసిన నిధులను అడగాలన్నారు. కొత్త జాబితా ప్రకారం రాష్ట్రానికి 12 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఇళ్ల కోసం ఉన్న అర్హతలను సడలించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. కేంద్ర అర్హతలతో చాలా మంది పేదలకు ఇళ్లు రావటంలేదు. ఎంపీల సంఖ్యాపరంగా వైసిపి లోక్ సభలో నాలుగో అతిపెద్ద పార్టీ, ఈ బలాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలి అని ఎంపీలకు జగన్ సూచించారు.

పోలవరం ప్రాజెక్టు పై ఎంపీలకు జగన్ ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేసిన మొత్తంలో కేంద్రం ఇంకా రూ.3222 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. నిర్వాసితులకు సహాయ పునరావాసం కోసం 10,000 కోట్లు, కాంక్రీట్ నిర్మాణాల కోసం 6000 కోట్లు కేంద్రాన్ని కోరాలని సూచించారు. సరైన ప్రణాళికలు లేకుండా పోలవరం పనులు చేశారు. దీనివల్ల నాలుగు నెలలుగా పనులు చేయలేకపోయాం. వచ్చే జూన్ నాటికి కాపర్ డ్యాం పూర్తవుతుంది. స్పిల్ వే పనులు వెనువెంటనే పూర్తి చేయటం ద్వారా ప్రాజెక్టు నిర్మాణాన్ని శరవేగంగా ముందుకు తీసుకువెళ్తాం. ముంపు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడకుండా వెంటనే సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది అని జగన్ వివరించారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధాన ప్రాజెక్టును కూడా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి నిధులు మంజూరు చేసేలా కేంద్రాన్ని ఒప్పించాలని సూచించారు.

రాష్ట్ర విభజన నాటికి కాగ్ లెక్కల ప్రకారం 22,448.76 కోట్ల లోటు ఉందని తేల్చారని ఇప్పటి వరకు 3,979 కోట్లు మాత్రమే కేంద్రం చెల్లించిందని జగన్ తెలిపారు. ఇంకా 18,969 కోట్లు రావాల్సి ఉందని వివరించారు.ఈ నిధుల విడుదల అంశాన్ని పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాలని సూచించారు. వెనుకబడ్డ ఏడు జిల్లాలకు ఇప్పటి వరకు 7,500 కోట్లు ఇవ్వాల్సి ఉండగా,1050 కోట్లు మాత్రమే ఇచ్చిందని అన్నారు. మిగిలిన నిధుల కోసం గట్టిగా కోరాలని సూచించారు. ఉపాధి హామీ కింద పెండింగ్ లో ఉన్న బకాయిలు 2,246 కోట్లు రావాల్సి ఉందన్నారు. పీఎంజీఎస్ వై కింద చేపట్టే రోడ్ల నిర్మాణ దూరాన్ని 3,285 నుంచి 6,135 కిలోమీటర్ లకు పెంచాలని కోరామని, దీన్ని కూడా సమావేశాల్లో ప్రస్తావించాలని తెలిపారు.

కొత్తగా ప్రభుత్వం ఇవ్వనున్న బియ్యం కార్డ్, ఆరోగ్య శ్రీ కార్డ్, ఫీజు రీఎంబర్స్ మెంట్, పెన్షన్ కార్డులకు అర్హతలు సడలించామన్నారు. గతంలో రేషన్ కార్డు పొందాలంటే ఆదాయ పరిమితి నెలకు గ్రామీణ ప్రాంతాల్లో 5000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 6,250 రుపాయలు ఉండేదని దానిని గ్రామీణ ప్రాంతాల్లో 10,000 ,పట్టణ ప్రాంతాల్లో 12,000 లకు పెంచామని తెలిపారు. రాష్ట్రానికి కొత్తగా ఏడు మెడికల్ కాలేజీలను మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరాలన్నారు. ట్రైబల్ వర్సిటీని విజయనగరం జిల్లా సాలూరు సమీపంలో ఏర్పాటు చేసేలా కేంద్రంపై ఒత్తిడి చేయాలన్నారు. 

రాష్ట్రంలో అవినీతి రహిత పాలన కొనసాగుతోందని జగన్ తెలిపారు. వివక్షతకు తావు లేకుండా పథకాలు అమలు చేస్తున్నా టిడిపి బురద జల్లుతోందని, దీనిని బలంగా తిప్పికొట్టాలనీ సూచించారు. స్థానిక సంస్ధల ఎన్నికల తరువాత నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని సీఎం వెల్లడించారు. ప్రతి ఎమ్మెల్యేతో సహా నియోజకవర్గానికి చెందిన నలుగురైదుగురు ముఖ్య నాయకులను త్వరలోనే కలుస్తానని సీఎం చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం నిర్ణయాన్ని ఎంపీలు స్వాగతించారు. ఈ సమావేశానికి 21 మంది ఎంపీలు , రాజ్య సభ సభ్యులు హాజరయ్యారు.